Reviewing AP Inter 2nd Year Telugu Study Material Grammar సంక్షిప్తీకరణలు can help students prepare confidently for exams.
AP Intermediate 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణలు
సంక్షిప్తీకరణం : ఇచ్చిన గద్యభాగాన్ని, బాగా అర్థం చేసుకొని, దానిలోని సారాంశాన్ని, ఇచ్చిన గద్యంలో మూడోవంతుకు కుదించి రాయడాన్ని “సంక్షిప్తీకరణ” అంటారు. భాషా నైపుణ్యాలను పెంచే అంశములలో, “సంక్షిప్తీకరణ” కూడా ఒకటి. భావాన్ని వెల్లడించడంలో, అనవసరమైన మాటలకు చోటు లేకుండా, చెప్పవలసిన ముఖ్యమైన విషయాన్ని సూటిగా చెప్పడానికి, ఈ “సంక్షిప్తీకరణ” సాయపడుతుంది.
తక్కువ సమయంలో, మొత్తం అంశము యొక్క సారాంశాన్ని, చెప్పే నైపుణ్యం, దీనివల్ల లభిస్తుంది. సంక్షిప్తీకరణ చేసేటపుడు, విద్యార్థులు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి.
- సంక్షిప్తీకరణ స్పష్టంగా ఉండాలి.
- ఇచ్చిన గద్యములో కొన్ని పదాలను విడిచిపెట్టి, మిగిలిన పదాలను రాయడం, ‘సంక్షిప్తీకరణ’ కాదు.
- వ్యర్థ పదాలనూ, పునరుక్తులనూ (తిరిగి తిరిగి చెప్పినదానినే చెప్పడం “పునరుక్తి” విడిచిపెట్టాలి.
- ఆలంకారిక పదాలనూ, కొటేషన్లనూ తొలగించాలి.
- విపరీత గణాంకాలకు చోటు లేకుండా చూడాలి.
- కీలకమైన పదాలను, దృష్టిలో పెట్టుకొని, ఇచ్చిన గద్యంలోని సారాంశాన్ని మాత్రమే రాయాలి.
- వాస్తవ సమాచారాన్ని మాత్రమే రాయాలి.
- విద్యార్థులు తమ సొంత భావాలను, ప్రవేశపెట్టరాదు.
- మీరు సంక్షిప్తీకరణ చేసిన సారాంశానికి తగిన ఒక మంచి శీర్షికను, (Heading) ముందుగా రాయాలి.
ఉదాహరణ :
గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణగానూ ప్రసిద్ధిగాంచిన వ్యక్తి డొక్కా సీతమ్మ. ఈమె తూర్పు గోదావరిజిల్లా, రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో క్రీ.శ. 1841 లో జన్మించింది. ఈమె తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. ఆ రోజుల్లో స్త్రీ విద్యకు అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈమె చదువుకోలేదు. గోదావరీ పరివాహక ప్రాంతంలోని లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న పంతులు అనే ధనవంతునితో సీతమ్మకు వివాహమైంది. జోగన్న, సీతమ్మ గార్లది అన్యోన్య దాంపత్యం. శుచి, శుభ్రతలతో పాటు ఆప్యాయతాదరణలకు వారిల్లు పెట్టింది పేరు. ఎవరు ఏ వేళలో వచ్చి భోజన మడిగినా లేదనకుండా వండి వడ్డించిన అన్నపూర్ణ ఆమె. సీతమ్మ కేవలం అన్నదానమే కాదు, ఎన్నో పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు చేయూత నందించిన వితరణశీలి. డొక్కా సీతమ్మ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశంలోనే కాక ఇంగ్లాండు దేశం వరకూ వ్యాపించాయి.
![]()
దీనికి సంక్షిప్తీకరణ :
శీర్షిక : “అన్నదాత డొక్కా సీతమ్మ”
“సీతమ్మ, తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట గ్రామంలో జన్మించింది. లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న అనే ధనవంతునితో, సీతమ్మకు పెండ్లి జరిగింది. ఎవరు, ఏ వేళలో వచ్చినా, లేదనకుండా, ఈమె వండి, వడ్డించేది. ఈమె ఎన్నో శుభకార్యాలకు సాయపడింది. నిత్యాన్నదాతగా డొక్కా సీతమ్మ ఖ్యాతి, ఇంగ్లండు వరకూ వ్యాపించింది.
అభ్యాసం
I. సంక్షిప్తీకరణలు
ప్రశ్న 1.
మాగంటి అన్నపూర్ణమ్మ :
రామస్వామి, పిచ్చమ్మ దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా చాటపఱ్ఱు గ్రామంలో జన్మించిన అన్నపూర్ణాదేవి స్వగ్రామంలోను, గుంటూరు మిషను స్కూలులోను, కలకత్తా బ్రహ్మసమాజం బాలికల పాఠశాలలోను చదువుకున్నారు. బెంగాలీ భాష నేర్చుకున్న అన్నపూర్ణమ్మ బెంగాలీ నుండి తెలుగులోనికి కొన్ని అనువాదాలు చేశారు. ఆమె 17వ యేట వ్రాసిన ‘సీతారామ’ అనే పుస్తకం విద్యార్థులకు పాఠ్యపుస్తకమయ్యింది. 1920లో మాగంటి బాపినీడుతో అన్నపూర్ణాదేవికి వివాహం అయ్యింది. దేశభక్తి, త్యాగనిరతి కలిగిన అన్నపూర్ణాదేవి భర్తతో అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినా తిరస్కరించింది.
1921లో మహాత్మాగాంధీజీ తెలుగు జిల్లాలలో పర్యటనకు వచ్చినపుడు తన ఒంటిమీద ఉన్న బంగారు ఆభరణాలన్నీ తీసి ఖద్దరు నిధి కోసం సమర్పించింది. ఏలూరులో మోహన్‌దాస్ ఖద్దరు పరిశ్రమను స్థాపించింది. 1923లో బాపినీడు విదేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చాడు. ముంబై రేవులో ఆయన దిగగానే ఆయన వెంట తెచ్చిన విలువైన వస్త్రాలన్నీ సముద్రంలో పారవేయించి ఖద్దరు వస్త్రాలు కట్టించింది. అనారోగ్య కారణాలతో చిన్నవయసులోనే మరణించిన అన్నపూర్ణాదేవికి గాంధీజీ నివాళులు అర్పించారు. 1933లో మాగంటి బాపినీడు ఆమె స్మృతిగా “అన్నపూర్ణాదేవి లేఖలు, అనే పుస్తకాన్ని ప్రచురించాడు.
జవాబు:
దేశభక్తి, త్యాగనిరతి కలిగిన అన్నపూర్ణాదేవి, గాంధీజీకి తన బంగారు ఆభరణాలన్నీ ఖద్దరు నిధి కోసం సమర్పించడమే కాక ఏలూరులో ఖద్దరు పరిశ్రమను స్థాపించారు. విదేశాలు వెళ్ళి వచ్చిన తన భర్త తన వెంట తెచ్చుకున్న విలువైన వస్త్రాలను సముద్రంలో పారవేయించి ఖద్దరు వస్త్రాలు కట్టించింది. అనారోగ్య కారణాలతో చిన్న వయసులోనే మరణించిన అన్నపూర్ణాదేవికి గాంధీజీ నివాళులు అర్పించారు.
ప్రశ్న 2.
హేతువాది త్రిపురనేని రామస్వామి చౌదరి :
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి శిష్యుడైన త్రిపురనేని రామస్వామి చౌదరి పై చదువుల కోసం లండను వెళ్ళి వచ్చారు. బందరులో న్యాయవాద వృత్తి చేపట్టారు. హేతువాద ప్రచారకునిగా సంఘ సేవలోనూ, సూత పురాణం లాంటి గ్రంథాల రచన ద్వారా సాహిత్యసేవలోనూ చురుకుగా పాల్గొన్నారు. రాజకీయాలలో ప్రవేశించి 1925లో తెనాలి పురపాలక సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సమాజంలో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలను ప్రశ్నించడమే కాకుండా, “శంబూక వధ”, “ఖూనీ” అనే నాటకాలు వ్రాసి ఊరూరా హేతువాద ప్రచారం చేశారు.
దేశభక్తుడైన త్రిపురనేని వ్రాసిన “వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ దెల్పుడీ” అనే గేయం ఉప్పు సత్యాగ్రహ సమయంలో గొప్పప్రభావాన్ని చూపింది. ప్రతి విషయాన్నీ ప్రశ్నించి, తర్కించి, సత్యాన్ని అన్వేషించాలన్న తపన ఉన్న రామస్వామి “వివాహవిధి” అన్న రచన ద్వారా పెండ్లి మంత్రాలను తెలుగులోనికి అనువాదం చేశారు. తానే పౌరోహిత్యం వహించి వివాహాలు జరిపించారు.
జవాబు:
ప్రతి విషయాన్నీ ప్రశ్నించి, తర్కించి, సత్యాన్ని అన్వేషించే త్రిపురనేని సంఘసేవలో, సాహిత్య సేవలో, రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. సమాజంలో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలను తన రచనల ద్వారా ప్రశ్నించి, హేతువాద ప్రచారం చేశారు. “వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ దెల్పుడీ” అంటూ తన దేశభక్తిని చాటారు.
ప్రశ్న 3.
అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు :
తన గాంధర్వగానంతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 1922లో జన్మించారు. కృష్ణాజిల్లా టేకుపల్లి వీరి స్వగ్రామం. తండ్రి సూరయ్యగారు తరంగాలు పాడుతుంటే బాలుడైన ఘంటసాల మైమరిచి వింటూ చక్కగా అభినయించేవాడు. వెంకటేశ్వరరావు ఆట, పాట చూచి ముచ్చటపడిన చల్లపల్లి జమీందారిణి బంగారు ఉంగరం బహూకరించింది. సంగీతం మీద మక్కువతో దానిని అమ్మి ఒంటరిగా విజయనగరం చేరాడు ఘంటసాల.
అక్కడ పగలు వారాలబ్బాయిగా, రాత్రి మధుకరమెత్తుకుంటూ పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఆదిభట్లవారు, ద్వారంవారు వంటి విద్వాంసుల ఆశీస్సులందుకున్నాడు. “క్విట్ ఇండియా” ఉద్యమంలో పాల్గొని ఆలీపూర్ కేంద్రకారాగారంలో 18 నెలల జైలుశిక్ష అనుభవించాడు. చలన చిత్రాలకు వేలాది పాటలు పాడి, 125 చలన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల వెంకటేశ్వరరావుగారిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
జవాబు:
తన గంధర్వ గానంతో శ్రోతల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. సంగీతం మీద మక్కువతో విజయనగరం చేరి వారాలు చెప్పుకుంటూ, మధురక మెత్తుకుంటూ సంగీతం నేర్చుకొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలలు జైలుశిక్ష అనుభవించారు. సంగీతాన్ని తండ్రి నుండి వారసత్వంగా అందిపుచ్చుకున్న ఘంటసాలను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
![]()
ప్రశ్న 4.
కట్టమంచి రామలింగారెడ్డి :
కట్టమంచి రామలింగారెడ్డిగారికి ఐదవయేట అక్షరాభ్యాసం అయ్యింది. మునుస్వామిగారి వద్ద బాలరామాయణం, అమరం చదువుకున్నాడు. ఉన్నతపాఠశాలలో చదివేటప్పుడు కుప్పనయ్యగారు వీరికి తెలుగు పండితుడు. తరగతిగదిలో ఇంగ్లీషు మాటలు మాట్లాడకుండా అందరూ తెలుగు మాట్లాడే విధంగా ఆయన కట్టడి చేసేవారు. ఆయనవద్ద నేర్చిన “నలోపాఖ్యానం” రెడ్డిగారి మీద అమిత ప్రభావం చూపింది. ఆయనే తనకు భాషాభిక్ష పెట్టారని కట్టమంచివారు పలుమార్లు ప్రకటించుకున్నారు.
ఆంగ్లాన్ని మంచినీళ్ళ ప్రాయంగా మాట్లాడే రెడ్డిగారు తెలుగుపద్యాలను కర్ణపేయంగా చదివేవారు. రెడ్డిగారికి గురుభక్తి ఎక్కువ. ఆయన ఉపన్యాసాలలో వారిని పేరుపేరునా తలచుకుని వారి గుణగణాలను కీర్తించేవారు. కళాశాలస్థాయిలో రెడ్డిగారిని తెలుగు సాహిత్యంలో ప్రోత్సహించినవారు సమర్థ రంగయ్యశెట్టిగారు. కళాశాల విద్యార్థిగా, మంచి వక్తగా రామలింగారెడ్డి రాణించారు.
జవాబు:
మంచి వక్తగా రాణించిన రామలింగారెడ్డి గారికి గురుభక్తి ఎక్కువ. బాల్యంలోనే బాలరామాయణం, అమరం చదివిన వీరు ఆంగ్లాన్ని మంచినీళ్ళ ప్రాయంగా, తెలుగు పద్యాలను కర్ణపేయంగా చదివేవారు. తనకు భాషా భిక్ష గురువులను, తన ఉపన్యాస వేదికలపై తలచుకుని వారి గుణగణాలను కీర్తించేవారు.
ప్రశ్న 5.
విశాఖపట్టణపు సాగరతీరం :
కుమారస్వామి పేరుమీద ఏర్పడిన విశాఖరేవుపట్టణం 1000 సంవత్సరాలు పైబడి ఉనికిలో ఉంది. మధ్యయుగాలలో ఈ సహజ నౌకాశ్రయం ప్రభ కోల్పోయింది. వలస పాలకుల కాలంలో తిరిగి ప్రాభవంలోనికి వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆధునిక హంగులద్దుకుని నేడు ప్రపంచస్థాయి నౌకాశ్రయాల వరుసలో ఠీవిగా నిలబడింది. నేడు విశాఖపట్టణం హిందూస్థాన్ నౌకానిర్మాణ సంస్థ, ఉక్కు కర్మాగారం, ప్రసిద్ధ చమురు సంస్థలు మొదలైన వాటితో పెద్దపారిశ్రామిక వాడగా తయారయ్యింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఎ.వి.ఎన్. కళాశాల వంటి ప్రఖ్యాత విద్యాలయాలకు ఇది నెలవు. తూర్పుతీర నావికాదళ ప్రధానస్థావరమైన విశాఖ రైలు, విమాన, రహదారి, జలమార్గాలతో అనుసంధానించబడింది.
పర్యాటక కేంద్రమైన విశాఖకు అందమైన సముద్రతీరం మణిహారంలా అమరింది. ఎన్నో ఔషధ పరిశ్రమలు, సమాచార, సాంకేతిక దిగ్గజసంస్థలు విశాఖలో కొలువుదీరాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే, ఆర్థికరాజధాని విశాఖపట్టణం. విశాఖపట్టణం సమీపంలో సింహాచలం, తొట్లకొండ, కైలాసగిరి లాంటి పుణ్యక్షేత్రాలు, విహార స్థలాలు ఉన్నాయి.
జవాబు:
1000 సంవత్సరాలు పైబడి ఉనికిలో ఉన్న కుమారస్వామి పేరు మీద ఏర్పడిన విశాఖ రేవు పట్టణం ఆధునిక హంగులలో నేడు ప్రపంచస్థాయి నౌకాశ్రయాల వరుసలో ఠీవిగా నిలబడింది. నౌకా నిర్మాణం సంస్థ, ఉక్కు కర్మాగారం మొదలైన పరిశ్రమలకు, ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలకు (ఆంధ్ర యూనివర్సిటీ) నెలవు విశాఖపట్టణం. రైలు, విమాన, రహదారి, జలమార్గాలతో అనుసంధానించ బడిన పర్యాటక కేంద్రమైన విశాఖకు అందమైన సముద్రతీరం మణిహారంలా అమరింది. ఆర్థిక రాజధానియైన విశాఖ సమీపంలో సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలు, విహార స్థలాలు ఉన్నాయి.