Regular practice with AP Inter 1st Year Telugu Study Material పద్యభాగం 4th Poem బాటసారి Questions and Answers Summary helps students stay prepared for examinations.
AP Inter 1st Year Telugu బాటసారి Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్న
ప్రశ్న 1.
బాటసారి పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
ఒక బాటసారి బ్రతుకుతెరువు కొఱకు తన తల్లి వద్దన్నా పట్టణానికి వెళ్ళాడు. ఇంటి దగ్గర నుండి బయలుదేరి మూడురోజులైనా గమ్యస్థానం చేరలేదు. దారిలో జ్వరం వచ్చినా, భయం వేసినా, గాలివానలు వచ్చినా, వరదలు వచ్చినా, చీకట్లు ముసిరినా, తప్పిపోయిన బాటసారి పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో ఊహిస్తేనే చాలా ఆందోళనగా ఉంటుంది కదా ! ఇంటి దగ్గర తల్లి పరిస్థితి తన కొడుకు ఏమయ్యాడో అని నిరీక్షణ చేస్తూ బాధపడుతోంది.
చింత చిగురువలె ఎర్రని కళ్ళల్లో గుండుసూదులు గ్రుచ్చినట్లు బాటసారి కన్నులుండగా తలనొప్పితో బాధపడుతున్నాడు. ఆ రాత్రి బాటసారి గుండె మీద పెద్దరాయి ఉన్నట్లు గుండె బరువుగా ఉంది. తల్లి పిల్చినట్లు అన్పిస్తోంది. ఏవేవో పిలుపులు పిల్చినా వినబడటం లేదు. అలా తలచుకుంటూ బాధపడుతూ తల్లడిల్లిపోయాడు. ఈ క్షణమే చివరి రోజు అనుకున్నాడు. గుడ్లగూబలు కేకలు భయంకరంగా ఉన్నాయి. వర్షం వెలిసింది. తెల్లవారుఝాము అయినట్లు కోడి కూసింది. ఆకాశంలో మెరుపు మెరిసింది. ఇదంతా తెలిసినట్లుగా తన తల్లికి కడుపులో బాధ ఎక్కువైంది.
II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
శ్రీరంగం శ్రీనివాసరావు గురించి రాయండి.
జవాబు:
శ్రీరంగం శ్రీనివాసరావు 30.4.1910న విశాఖపట్టణంలో జన్మించారు. ఈయన తన “మహాప్రస్థానాన్ని” అభ్యుదయ కవిత్వానికి ఆయువుపట్టుగా మలిచాడు. 1940 తర్వాత తెలుగు కవిత్వాన్ని ఒక దశాబ్దం పాటు ఉర్రూత లూగించిన శ్రీశ్రీ ‘ప్రభవ’ అనే కావ్యం; విశ్వరూప సందర్శనం ; మహా ప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి మొదలైన కవితా సంపుటాలు, “చరమరాత్రి” అనే కథల సంపుటి, “అనంతం” అనే పేరుతో స్వీయచరిత్ర రచించారు. సినీ రచయితగానూ పనిచేశారు. వీరి “ఖడ్గసృష్టి” కావ్యానికి 1966లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును, ఆ తర్వాత 1973 సం॥లో కేంద్రసాహిత్య అకాడమీ” అవార్డును పొందారు. 1979 సం||లో శ్రీ రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ అవార్డును, 10,000 రూపాయల బహుమానం కూడా పొందారు.
ప్రశ్న 2.
బాటసారి వ్యధను వివరించండి.
జవాబు:
బాటసారి కన్నులు ఎర్రని చింతనిప్పుల్లాగా చెలరేగితే ఆ కళ్ళల్లో గుండు సూదులు గుచ్చినట్లు తలనొప్పి విపరీతమై ఆ రాత్రి అతని గుండె మీద పెద్ద బండరాయి ఉన్నట్లు బరువై, అతని తల్లి పిల్చినట్లుగా దృశ్యం కళ్ళముందు గంతులేసింది. ఏవేవో పిలుపులు పిల్చినా చెవులకు తాకలేదు. అవే తలచుకుంటూ బాధపడుతూ, తల్లడిల్లిపోతూ ఆ బాధ విపరీతమై చలించి పోయాడు.
![]()
III. ఏక వాక/ పది రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బాటసారి ఏ కవితా సంపుటి నుండి స్వీకరించబడింది ?
జవాబు:
“మహాప్రస్థానం” కవితా సంపుటి నుండి స్వీకరించబడింది.
ప్రశ్న 2.
బాటసారి కోసం పల్లెటూరిలో పలవరించింది ఎవరు ?
జవాబు:
బాటసారి కోసం పల్లెటూరిలో పలవరించింది తన తల్లి.
ప్రశ్న 3.
కూటి కోసం కూలి కోసం పట్టణం వెళ్ళింది ఎవరు ?
జవాబు:
కూటి కోసం కూలి కోసం పట్టణం వెళ్ళింది బాటసారి.
ప్రశ్న 4.
కోడి దేనిని తెలియజేస్తూ కూత కూసింది ?
జవాబు:
కోడి తెల్లవారుఝాము అయ్యిందని కూత కూసింది.
ప్రశ్న 5.
శ్రీశ్రీ రచనలకు వచ్చిన అవార్డు ఏది ?
జవాబు:
వీరి ‘ఖడ్గసృష్టి’ కావ్యానికి 1973లో “కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1966లో “సోవియట్ ల్యాండ్ నెహ్రూ” అవార్డు లభించాయి.
ప్రశ్న 6.
శ్రీశ్రీ రచించిన కథాసంపుటి ఏది ?
జవాబు:
“చరమరాత్రి” అనే కథల సంపుటి.
![]()
ప్రశ్న 7.
శ్రీశ్రీ స్వీయచరిత్ర పేరేమిటి ?
జవాబు:
“అనంతం”
IV. సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం
జవాబు:
పరిచయము : ఈ వాక్యము శ్రీశ్రీ రచించిన “మహాప్రస్థానం” కవితా సంపుటి నుండి గ్రహింపబడిన “బాటసారి” అనే పాఠంలోనిది.
సందర్భం : బాటసారి బ్రతుకు తెరువు కొరకు పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళిన బాటసారి ఎక్కడా ఆగకుండా నడుస్తూ, ఏ దారీ తెలియక, ఎక్కడ చేరాలో తెలియని పరిస్థితులను వివరిస్తూ కవి పల్కిన సందర్భం.
భావము : దారి తప్పిపోవుట వలన బాటసారికి చాలా కష్టమైంది.
వ్యాఖ్య : బ్రతుకుతెరువుకై తల్లి వెళ్ళవద్దని చెప్పినా బాటసారి పట్టణానికి బయలుదేరాడు. దారిలో చిక్కుకుపోయాడు. ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితి కల్గిందని కవి వివరిస్తూన్నాడు.
ప్రశ్న 2.
చెవులు సోకని పిలుపులేవో
జవాబు:
పరిచయము : ఈ వాక్యము శ్రీశ్రీ రచించిన “మహాప్రస్థానం” కవితా సంపుటి నుండి గ్రహింపబడిన “బాటసారి” అనే పాఠంలోనిది.
సందర్భం : దారిలో చిక్కుకున్న బాటసారికి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిని వివరిస్తూ కవి పల్కిన సందర్భము.
భావము : ఏవేవో పిలుపులు పిలిచినా చెవులకు తాకలేదు.
వ్యాఖ్య : బాటసారి బ్రతుకుతెరువుకై పట్టణానికి బయలుదేరాడు. దారిలో నడి సముద్రంలో నావ చిక్కిన రీతిగా బాటసారి చిక్కుకుపోయాడు. ఆ పరిస్థితిని శ్రీశ్రీ కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నాడు.
ప్రశ్న 3.
పాడుకలలో పేగు కదిలింది
జవాబు:
పరిచయము : ఈ వాక్యము శ్రీశ్రీ రచించిన “మహాప్రస్థానం” కవితా సంపుటి నుండి గ్రహింపబడిన “బాటసారి” అనే పాఠంలోనిది.
సందర్భం : బాటసారి పట్టణానికి బ్రతవు తెరువుకై వెళ్ళాడు. పల్లెటూరిలో అతని తల్లికి తన బిడ్డ ఏమయ్యాడో అని బాధపడుతున్న సందర్భము.
భావము : పల్లెటూళ్ళో ఉన్న తల్లికి ఇదంతా తెలిసినట్లుగా పాడు కల వచ్చి తన కన్నపేగు కదిలింది.
వ్యాఖ్య : తల్లి వద్దన్నా బాటసారి బ్రతుకుతెరువుకై పట్టణం వెళ్ళాడు. మూడు రోజులైంది. తన బిడ్డ ఏమయ్యాడో తల్లి బాధపడుతోంది.
V. సంధులు
(సంధి విడదీసి, సంధి పేరు, సూత్రము రాయండి.)
1. పల్లెటూరు
జవాబు:
పల్లె + ఊరు – టుగాగమ సంధి
సూత్రము : కర్మధారయము నందు ఉకారాంత శబ్దాలకే కాక మిగిలన అచ్చులు అంతమందు కలవానికి టుగాగమము వస్తుంది.
2. గ్రుచ్చినట్లే
జవాబు:
గ్రుచ్చిన + అట్లే – అత్వసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళంబుగానగు
![]()
VI. సమాసములు
(విగ్రహవాక్యం రాసి సమాస నామము తెల్పుము)
1. తల్లిమాటలు
జవాబు:
తల్లి యొక్క మాటలు – షష్ఠీ తత్పురుష సమాసము
2. శిరోవేదన
జవాబు:
తలకు బాధ (నొప్పి) – షష్ఠీ తత్పురుష సమాసము
3. నడిసముద్రం
జవాబు:
సముద్ర మధ్యభాగము – ప్రథమా తత్పురుష సమాసము
4. శీతవాయువు
జవాబు:
శీతలమైన వాయువు – విశేషణ పూర్వపద కర్మధారయము
5. నల్లనిరాత్రి
జవాబు:
నల్లనైన రాత్రి – విశేషణ పూర్వపద కర్మధారయము
6. చింతనిప్పులు
జవాబు:
చింత చిగురు వంటి నిప్పులు ఉపమాన పూర్వపద కర్మధారయము
VII. కఠిన పదాలకు అర్థాలు
- తల్లడిల్లు = బాధపడు
- కెళ్ళగిల్లు = తలంక్రిందులు కావటం
- పల్లటిల్లు = చలించు
![]()
బాటసారి Summary in Telugu
కవి కాలాదులు
పాఠ్యభాగము : బాటసారి
గ్రహింపబడిన గ్రంథం : “మహాప్రస్థానం” కవితా సంపుటి నుండి గ్రహింపబడింది.
కవి : శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు)
కాలము : 20వ శతాబ్దము
జననం : 2.1.1910
మరణం : 15.6.1983
జన్మస్థలం : విజయనగరం
నివాస స్థలం : విశాఖపట్టణము
బిరుదులు : సాహిత్యాచార, మహాకవి
రచనలు : 1. ప్రభవ – ఖండకావ్యము, 1927 2. మహాప్రస్థానం – గేయసంపుటి, 1934 3. సిరిసిరిమువ్వ -శతకం, 1944 4. ఖడ్గ సృష్టి – గేయ సంపుటి 5. ప్రాస క్రీడలు – గేయ సంపుటి 6. మరో ప్రపంచం – గేయ సంపుటి, 1934 7. మూడు యాభైలు – నవల, 1925 8. పరిణయ రహస్యం – నవల, 1925 9. అమ్మా – నాటకం 10. లిమబుక్కులు – గేయం 11. కొక్కొరోకో – నాటిక 12. సుప్తాస్థికలు – నాటిక మొదలగునవి.
నిర్వహించిన పదవులు : 1969 వరకు అభ్యుదయ రచయితల సంఘానికి, ఆ తర్వాత విప్లవ రచయితల సంఘానికి అధ్యక్షులు. 1953లో M.L.C. గా ఎన్నిక.
లభించిన అవార్డులు :
- 1966 ‘ఖడ్గసృష్టి’ గేయ సంపుటికి సోవియట్ భూమి నెహ్రూ బహుమానం.
- 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానం.
- 1979లో శ్రీ రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ అవార్డును స్వీకరించారు. రూ. 10,000లు బహుమానం.
విశిష్టత : 1934 ఏప్రిల్ 12న మహాప్రస్థానం రచన 1950లో మహాప్రస్థానం పుస్తక ప్రచురణ.
పాఠ్యభాగ నేపథ్యం
మన దేశంలో నెలకొని యున్న నిరుద్యోగ సమస్య – దాని వలన సమాజంలో యువత భవిష్యత్తు దెబ్బతింటోంది. అనేక కుటుంబాలు ఆధారాలు లేక దెబ్బ తింటున్నాయి. వాటి పర్యావసానాలను విద్యార్థులకు తెలియజేసి, వాళ్ళ బాధ్యతను గుర్తింపచేయుట. వాళ్ళను జాగృతులను చేయడమే ఈ పాఠం నేపథ్యం.
పాఠ్యభాగ సారాంశం
ఒక బాటసారి బ్రతుకుతెరువు కొఱకు తన తల్లి వద్దన్నా పట్టణానికి వెళ్ళాడు. ఇంటి దగ్గర నుండి బయలుదేరి మూడురోజులైనా గమ్యస్థానం చేరలేదు. దారిలో జ్వరం వచ్చినా, భయం వేసినా, గాలివానలు వచ్చినా, వరదలు వచ్చినా, చీకట్లు ముసిరినా, తప్పిపోయిన బాటసారి పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో ఊహిస్తేనే చాలా ఆందోళనగా ఉంటుంది కదా ! ఇంటి దగ్గర తల్లి పరిస్థితి తన కొడుకు ఏమయ్యాడో అని నిరీక్షణ చేస్తూ బాధపడుతోంది.
చింత చిగురువలె ఎర్రని కళ్ళల్లో గుండుసూదులు గ్రుచ్చినట్లు బాటసారి కన్నులుండగా తలనొప్పితో బాధపడుతున్నాడు. ఆ రాత్రి బాటసారి గుండె మీద పెద్దరాయి ఉన్నట్లు గుండె బరువుగా ఉంది. తల్లి పిల్చినట్లు అన్పిస్తోంది. ఏవేవో పిలుపులు పిల్చినా వినబడటం లేదు. అలా తలచుకుంటూ బాధపడుతూ తల్లడిల్లి పోయాడు. ఈ క్షణమే చివరి రోజు అనుకున్నాడు. గుడ్లగూబల కేకలు భయంకరంగా ఉన్నాయి. వర్షం వెలిసింది. తెల్లవారుఝాము అయినట్లు కోడి కూసింది. ఆకాశంలో మెరుపు మెరిసింది. ఇదంతా తెలిసినట్లుగా తన తల్లికి కడుపులో బాధ ఎక్కువైంది.
![]()
కఠిన పదాలు – అర్థాలు – తాత్పర్యాలు
1 – 23 పంక్తులు :
కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని-
తల్లిమాటలు చెవిన పెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్క తీరుగ
నడుస్తున్నా దిక్కు తెలియక –
నడి సముద్రపు నావ రీతిగ
సంచరిస్తూ, సంచలిస్తూ,
దిగులు పడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే-
చండ చండం, తీవ్ర తీవ్రం
జ్వరం కాస్తే,
భయం వేస్తే,
ప్రలాపిస్తే –
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వరదవస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే
దారి తప్పిన బాటసారికి
ఎంత కష్టం !
కళ్ళు వాకిట నిలిపిచూచే
పల్లెటూళ్ళో తల్లి ఏమని
పలవరిస్తోందో …………………. ?
చింతనిప్పులలాగు కన్నుల
అర్థాలు :
చెవిని పెట్టక = వినకపోవుట
బాటసారి = త్రోవలో నడచువాడు (తెరువరి, పథికుడు)
తీరు = విధము
నడిసముద్రము = సముద్రం మధ్యలో
సంచరించు = తిరుగు
సంచలించు = కలవరపడుట
దిగులుపడుట = భయపడుట
దీనుడు = దర్పముడిగినవాడు – దరిద్రుడు
చండ = తీవ్రమైనది.
తీవ్రం = అధికమైన
పలవరించుట = పరిపరి విధముల తలంచుట
చింతనిప్పులలాగు = ఎర్రని చింత చిగురువలె
తాత్పర్యం : ఒక బాటసారి బ్రతుకు తెరువు కొఱకు తన తల్లి వద్దన్నా పట్టణానికి వెళ్ళాడు. ఇంటి దగ్గర నుండి బయలుదేరి మూడురోజులైనా గమ్యస్థానం చేరలేదు. దారిలో జ్వరం వచ్చినా, భయం వేసినా, గాలివానలు వచ్చినా, వరదలు వచ్చినా, చీకట్లు ముసిరినా, తప్పిపోయిన బాటసారి పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో ఊహిస్తేనే చాలా ఆందోళనగా ఉంటుంది కదా ! ఇంటి దగ్గర తల్లి పరిస్థితి తన కొడుకు ఏమయ్యాడో అని నిరీక్షణ చేస్తూ బాధపడుతోంది.
![]()
24 – 48 పంక్తులు :
చెరిగిపోసే మంట లెత్తగ,
గుండుసూదులు గ్రుచ్చినట్లే,
శిరోవేదన అతిశయించగ,
రాత్రి, నల్లని రాతి పోలిక
గుండె మీదనె కూరుచుండగ,
తల్లిపిల్చే కల్ల దృశ్యం
కళ్ళ ముందట గంతులేయగ
చెవులు సోకని పిలుపులేవో
తలుచుకుంటూ, కలతకంటూ-
తల్లడిల్లే, కెళ్ళగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం !
అతని బ్రతుకున కదే ఆఖరు !
గ్రుడ్డి చీకటిలోన గూబలు
ఘూకరించాయి
వానవెలిసీ మబ్బులో ఒక
మెరుపు మెరిసింది;
వేగుజామును తెలియజేస్తూ
కోడి కూసింది;
విడిన మబ్బుల నడుమనుండీ
వేగుజుక్కా వెక్కిరించింది;
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది !
పల్లెటూళ్ళో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది!
ప్రతిపదార్థం:
చెరగు = చేటతో బాగుచేయు (బియ్యం మొదలగు వానిని)
మంటలు + ఎత్తగ = మంటలెత్తగ = మంటలు ఎగిసిపడుట
శిరః + వేదన = శిరోవేదన = తలనొప్పి
అతిశయించు = అధికమవుట (హెచ్చు)
దృశ్యము = చిత్రము
పల్లటిల్లు = తపించు
గూబలు = గుడ్లగూబలు
ఘూకరించుట = “ఘూ” అని ధ్వని చేయునది
వేగుజాము = తెల్లవారుఝామున
కళేబరం = శరీరం
వేగుజుక్క = తెల్లవారు ఝామున ఆకాశంలో కన్పించె ఒక నక్షత్రము
శీతవాయువు = చల్లని గాలి
పేగు కదలుట = కడుపు బాధ అధికమగుట
తాత్పర్యం : చింత చిగురువలె ఎర్రని కళ్ళల్లో గుండుసూదులు గ్రుచ్చినట్లు బాటసారి కన్నులుండగా తలనొప్పితో బాధపడుతున్నాడు. ఆ రాత్రి బాటసారి గుండె మీద పెద్దరాయి ఉన్నట్లు గుండె బరువుగా ఉంది. తల్లి పిల్చినట్లు అన్పిస్తోంది. ఏవేవో పిలుపులు పిల్చినా వినబడటంలేదు. అలా తలచుకుంటూ బాధపడుతూ తల్లడిల్లి పోయాడు. ఈ క్షణమే చివరిరోజు అనుకున్నాడు. గుడ్లగూబల కేకలు భయంకరంగా ఉన్నాయి. వర్షం వెలిసింది. తెల్లవారు ఝాము అయినట్లు కోడి కూసింది. ఆకాశంలో మెరపు మెరిసింది. ఇదంతా తెలిసినట్లుగా తన తల్లికి కడుపులో బాధ ఎక్కువైంది.