Regular practice with AP Inter 1st Year Telugu Study Material పద్యభాగం 3rd Poem మంచి ముత్యాలు Questions and Answers Summary helps students stay prepared for examinations.
AP Inter 1st Year Telugu మంచి ముత్యాలు Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘మంచి ముత్యాలు’ పాఠ్యభాగ సారాంశాన్ని తెలపండి.
జవాబు:
నీరు త్రాగే గుఱ్ఱాన్నీ, కొవ్వుతో చెలరేగుతున్న మదపుటేనుగునూ, ఎద వట్టిన గోవు వద్ద నున్న ఆబోతునూ, విద్యా విహీనుడైన నీచబుద్ధి కలవానిని చేరకూడదు.
భార్యతో ఏనాడూ తగవులాడరాదు. ఆమెలో లేని దోషం ఉన్నదని ఏనాడూ ఆరోపించకూడదు. ఏ యింటిలో స్త్రీ దుఃఖంతో కన్నీరు కార్చవలసి వస్తుందో ఆ యింటిలో సంపద ఉండదు.
పాముకి విషం శిరస్సులోని నోట్లో మాత్రమే ఉంటుంది. తేలుకి తోక చివర మాత్రమే ఉంటుంది. దుష్టునికి శరీరమంతా విషం ఉంటుంది.
మానవుడు తనకిష్టమైన మంచి పనిని చేసేటప్పుడు ఒక నీచుడు ఆ పనిలోని మంచిని గ్రహించలేక, కాదంటే, వాని మాటల కోసం ఆ పనిని ఆపాలని అనుకోడు. చక్కని భోజనం చేసే సమయంలో ఆహారపదార్థాల మీద ఈగ వాలినంత మాత్రాన, ఆ వంటకాన్ని మానవుడు తినకుండా ఉండడం నేర్పరితనం అవుతుందా ! కాదు గద!
ఎంత గొప్ప కార్యాన్నైనా తీర్చిదిద్దడానికి, దృఢమైన బలంతో ఎదిగిన ఒక వ్యక్తి చాలు. అసంఖ్యాకులైన కౌరవులు గోగ్రహణం చేస్తే, అర్జునుడొక్కడే గోవులను వాళ్ళ వశం కానివ్వకుండా వారి బలమైన సైన్యాన్ని అనేక బాణాలతో ధ్వంసం చేసి విజయాన్ని సాధించలేదా ?
నీ స్థాయికి తగని నీచులతో కలిసి మెలిసి తిరిగితే లోకం నిన్ను గౌరవహీనుని గానే చూస్తుంది. ఎలాగంటే తాటిచెట్టు క్రింద నిలబడి పాలు తాగితే, కల్లు తాగావని లోకం నిందిస్తుంది.
నీటితో నిండియున్న నదులు గంభీరంగా నిలచి పారుతున్నాయి. చిన్న సెలయేళ్ళు పైకి పొర్లుతూ వేగంగా ప్రవహిస్తున్నాయి. చెడు గుణములు కలవారు మాటలాడి నంతటి తొందరగా మంచి గుణములు కలవారు మాట్లాడరు. బుద్ధిహీనుడైనవాడు ఎన్ని విద్యలు నేర్చినా, అతడి అల్పత్వంతో పోయి గొప్పవాడవుతాడా ? ఎక్కడైన పరిమళ ద్రవ్యాల మూటను గాడిద మోసినంత మాత్రాన గొప్పది అవుతుందా ?
నిందించినా, ప్రశంసించినా, సంపదలు వచ్చినా, తొలగిపోయినా, మరణమిప్పుడే వచ్చినా, కల్పాంతమందు వచ్చినా ధీరులైనవారు న్యాయమార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు పెట్టరు.
మోక్ష సంపదలనే భూషణాలతో ప్రకాశించే వాడా ! దుష్టులను సంహరించినవాడా! పాపాలను నశింప చేసేవాడా ! ధర్మపురిలో నివసించు ఓ నరసింహా! పుట్టేటప్పుడు ధనమెవ్వరూ తీసుకొనిరారు. పోయేటప్పుడు తన వెంటరాదు. ఎంత గొప్ప ధనికుడైనా ఉప్పుతో కూడిన అన్నమే తింటాడు కాని, బంగారు ముద్దలు మ్రింగలేడు. డబ్బు గడించి పొగరుబోతుతనాన్ని పెంచుకోవటమే గాని, ఆ సొమ్ములు అనుభవానికి రాదు. కూడబెట్టిన సొమ్ము దొంగల పాలవుతుందో, దొరల పాలవుతుందో తెలియదు. తేనెటీగలు తేనెను కూడబెట్టి బాటసారులకిస్తున్నాయి కదా !
ప్రశ్న 2.
శతక ప్రక్రియ విశిష్టతను తెలపండి.
జవాబు:
తెనుగు సాహిత్యంలో ప్రత్యేకత కలిగినది శతక రచన. ఇది పండితులు, పామరులు, బాలురు, వృద్ధులందరినీ రంజింప చేసే శక్తివంతమైన ప్రక్రియ. ప్రసిద్ధ కవుల నుంచి ఎందరో మహామహులు శతక రచన చేసి తరించిన వారే. అందుకే తెలుగులో వేలాదిగా శతకాలున్నాయి. శతకాలు కథా ప్రధానాలు కవు. వర్ణనా ప్రధానాలు కావు. వీటిని ముక్తకాలు అంటారు. ఏ పద్యానికదే స్వతంత్రంగా ఉంటాయి కనుక ముక్తకాలు అని అంటారు. సులభ శైలిలో ఉంటాయి. కవి ఆత్మానుభవం ఈ శతకాలలో వ్యక్తమవుతుంది.
ఈ శతక పద్యాలు 100 కాని 108 కాని ఉండాలి. శతకంలో ప్రతి పద్యంలో ఒకే విధమైన “మకుటం” ఉండాలి. ఈ మకుటం ఒక పదం గాని, ఒక వాక్యం గాని లేదా రెండు పాదాలు గాని వ్రాయవచ్చును.
II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సుమతి శతక కర్త తెలిపిన నీతిని రాయండి.
జవాబు:
నీరు త్రాగే గుఱ్ఱాన్నీ, బలిసియున్న మదపుటేనుగును, ఎద వట్టిన గోవు వద్ద నున్న ఆబోతును, విద్యలేని నీచబుద్ధి కలవాడితో స్నేహము చేయరాదు. చేరరాదు. భార్యతో ఏనాడూ తగవులాడరాదు. ఆమెలో దోషం లేదని తెలిసి కూడా దోషాన్ని ఆపాదించకూడదు. ఏ ఇంటిలో స్త్రీ దుఃఖంతో కన్నీరు కార్చవలసి వస్తుందో ఆ యింటిలో సంపదలుండవు.
పాముకి విషం శిరస్సులోను, తేలుకు తోకలోను ఉంటుంది. కాని దుష్టునికి శరీరమంతా ఉంటుంది.
ప్రశ్న 2.
భాస్కర శతక కర్త బోధలను తెలపండి.
జవాబు:
మానవుడు తనకిష్టమైన మంచి పనిని చేసేటప్పుడు ఒక నీచుడు ఆ పనిలోని మంచిని గ్రహించలేక కాదంటే వాని మాటల కోసం ఆ పనిని ఆపాలని అనుకోడు. చక్కని భోజనం చేసే సమయంలో ఆహారపదార్థాల మీద ఈగ వాలినంత మాత్రాన, ఆ వంటకాన్ని మానవుడు తినకుండా ఉండడం నేర్పరితన మవ్వదు.
ఎంత గొప్ప కార్యాన్నైనా తీర్చిదిద్దడానికి, దృఢమైన బలంతో ఎదిగిన ఒక వ్యక్తి చాలు. అసంఖ్యాకులైన కౌరవులు గోగ్రహణం చేస్తే, అర్జునుడొక్కడే గోవులను వాళ్ళ వశం కానివ్వకుండా వారి బలమైన సైన్యాన్ని అనేక బాణాలతో ధ్వంసం చేసి విజయాన్ని సాధించలేదా ?
ప్రశ్న 3.
వేమన పద్యాల సారాన్ని తెలపండి.
జవాబు:
నీ స్థాయికి తగని నీచులతో కలసిమెలసి తిరిగితే లోకం నిన్ను గౌరవ హీనునిగానే చూస్తుంది. ఎలాగంటే తాటిచెట్టు క్రింద నిలబడి పాలు తాగితే, కల్లు తాగావని లోకం నిందిస్తుంది.
నీటితో నిండియున్న నదులు గంభీరంగా నిలిచిపారుతున్నాయి. చిన్న సెలయేళ్ళు పైకి పొర్లుతూ, వేగంగా ప్రవహిస్తున్నాయి. చెడు గుణములు కలవారు మాటలాడి నంతటి తొందరగా మంచి గుణములు కలవారు మాట్లాడరు.
బుద్ధిహీనుడైనవాడు ఎన్ని విద్యలు నేర్చినా, అతడి అల్పత్వంతో పోయి గొప్పవాడవుతాడా ? ఎక్కడైన పరిమళ ద్రవ్యాల మూటను గాడిదమోసినంత మాత్రాన గొప్పది అవుతుందా ?
ప్రశ్న 4.
ఏనుగు లక్ష్మణకవి సుభాషిత సారాన్ని రాయండి.
జవాబు:
నిందించినా, ప్రశంసించినా, సంపదలు వచ్చినా, తొలగిపోయిన, మరణ మిప్పుడే వచ్చినా, కల్పాంతమందు వచ్చినా ధీరులైన వారు న్యాయమార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు పెట్టరు.
![]()
ప్రశ్న 5.
శేషప్ప కవి తెలిపిన హితోక్తులను రాయండి.
జవాబు:
- పుట్టేటప్పుడు ధనమెవ్వరూ తీసుకొనిరారు.
- పోయేటప్పుడు సంపదలు తన వెంటరావు.
- ఎంత గొప్ప ధనికుడైనా ఉప్పుతో కూడిన అన్నమే తింటాడు గాని, బంగారు ముద్దలను మ్రింగడు.
- ధనమును పొంది పొగరుబోతుతనాన్ని పెంచుకోవడమే కాని, ఆ సొమ్ము అనుభవానికి రాదు.
- కూడబెట్టిన సొమ్ము దొంగల పాలవుతుందో, దొరల పాలవుతుందో తెలియదు.
- తేనెటీగలు తేనెను కూడబెట్టి బాటసారులకిస్తున్నాయి.
III. ఏక వాక్య పద రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సుమతీ శతకాన్ని రచించింది ఎవరు ?
జవాబు:
సుమతీ శతకాన్ని రచించింది బద్దెన
ప్రశ్న 2.
భాస్కర శతక కర్త ఎవరు ?
జవాబు:
భాస్కర శతక కర్త మారద వెంకయ్య
ప్రశ్న 3.
దుర్యోధనాదులను ఎదుర్కొన్న ఒక్కడెవరు ?
జవాబు:
అర్జునుడు
ప్రశ్న 4.
మనిషికి విషం ఎక్కడుంటుంది ?
జవాబు:
మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది.
ప్రశ్న 5.
చనిపోయినప్పుడు వెంటరానిదేది ?
జవాబు:
చనిపోయినప్పుడు వెంట రానిది సంపద.
ప్రశ్న 6.
తేనెటీగల కష్టం ఎవరికి స్వంతమవుతుంది ?
జవాబు:
బాటసారులకు
IV. సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁడు
జవాబు:
పరిచయము : మారద వెంకయ్య రచించిన భాస్కర శతకము నుండి గ్రహింప
బడిన ‘మంచి ముత్యాలు’ అను పాఠంలోనిది.
సందర్భము : ఉత్తర గోగ్రహణం చేసిన కౌరవులను, అర్జునుడు ఒక్కడే వారందరిని జయించాడని చెప్తూ కవి పల్కిన సందర్భము.
భావము : దృఢ చిత్తం కలవాడు ఒక్కడే చాలు. ఎంతటి పనినైనా నెరవేర్చ గలడని భావము.
వ్యాఖ్య : దుర్యోధనాదులు గొప్ప సైన్యంతో విరాటుని ఆవుల మందని తోలుకు పోతుంటే అర్జునుడు ఒక్కడే వారిని జయించి ఆవులమందని తిరిగి తెచ్చాడు. అంటే వీరుడు, ధీరుడు అయినవాడు దృఢచిత్తంతో ఏ పనినైనా సాధించగలరని వివరించాడు.
ప్రశ్న 2.
తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ
జవాబు:
పరిచయము : ఈ వాక్యము వేమన రచించిన వేమన శతకము నుండి గ్రహింపబడిన ‘మంచి ముత్యాలు’ అను పాఠంలోనిది.
సందర్భము : గౌరవంలేని నీచునితో స్నేహం చేయరాదని విశ్లేషిస్తూ వేమన పల్కిన సందర్భము.
భావము : తాటిచెట్టు క్రింద నిలబడి పాలు తాగితే లోకం కల్లు త్రాగాడనే చెప్పుకుంటారు.
వ్యాఖ్య : మహాపురుషులు అల్పులతో స్నేహం చేయరాదని వివరిస్తూ, తాటి చెట్టు క్రింద నిలబడి పాలు త్రాగినా కల్లు త్రాగాడనే లోకం అంటుంది. కనుక అల్పులతో స్నేహం మంచిది కాదని విశ్లేషింపబడింది.
ప్రశ్న 3.
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
జవాబు:
పరిచయము : ఈ వాక్యము వేమన రచించిన వేమన శతకము నుండి గ్రహింపబడిన ‘మంచి ముత్యాలు’ అను పాఠంలోనిది.
సందర్భము : నీచుడు ప్రవర్తించినట్లు సత్పురుషుడు తన ఉనికిని పోగొట్టుకోడని వివరిస్తూ వేమన పల్కిన సందర్భము.
భావము : నీచుడు పల్కిన విధంగా సత్పురుషులు మాట్లాడరు.
వ్యాఖ్య : నీచుడు ఎప్పుడూ దుర్మార్గాలను చేస్తూంటాడు. కాని సత్పురుషులు ఆ విధంగా మాట్లాడక గౌరవప్రదంగా ప్రవర్తిస్తారని విశ్లేషింపబడింది.
![]()
ప్రశ్న 4.
తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు !
జవాబు:
పరిచయము : ఈ వాక్యము శేషప్ప రచించిన “నరసింహ శతకము” నుండి గ్రహింపబడిన ‘మంచి ముత్యాలు’ అను పాఠంలోనిది.
సందర్భము : దానధర్మాలు చేయని పిసినిగొట్టు కూడపెట్టిన సొమ్ము దొంగలపాలో లేదా దొరలపాలవుతుందని విశ్లేషిస్తూ కవి పల్కిన సందర్భము.
భావము : కష్టపడి తేనెటీగలు సంపాదించిన తేనె బాటసారుల పాలవుతుంది.
వ్యాఖ్య : కష్టపడి తేనెటీగలు సంపాదించిన తేనె బాటసారుల పాలవుతుంది. అదేవిధంగా పిసినిగొట్టు కూడబెట్టిన సొమ్ము దొంగల పాలవుతుంది లేదా దొరల పాలవుతుంది. కనుక ధనాన్ని సంపాదించాలి. సంపాదించిన సొమ్మును దానధర్మాల్ని చేస్తూ తాను అనుభవించాలని వ్యాఖ్య.
V. సంధులు
1. కన్నీరొలికిన
జవాబు:
కన్నీరు + ఒలికిన – ఉత్త్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
2. ధీరోత్తములు
జవాబు:
ధీర + ఉత్తములు – గుణసంధి
సూత్రము : సంస్కృతమున అకారమునకు అసవర్ణములైన ఇ-ఉ-ఋ లు పరంబులగునపుడు క్రమంగా ఏ-ఓ-అర్ అనునవి ఏకాదేశమగును.
3. యుగాంతం
జవాబు:
యుగ + అంతం – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : సంస్కృతమున అ,ఇ,ఉ,ఋ, ఇ లను అచ్చులకు సవర్ణములైన అచ్చులు పరంబులగునపుడు క్రమంగా వాని దీర్ఘము ఏకాదేశమగును.
4. దొంగలకిత్తురో
జవాబు:
దొంగలకు + ఇత్తురో – ఉత్త్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
5. బలోన్నతుడు
జవాబు:
బల + ఉన్నతుడు – గుణసంధి
సూత్రము : సంస్కృతమున అకారమునకు అసవర్ణములైన ఇ-ఉ-ఋలు పరంబులగునపుడు క్రమంగా ఏ-ఓ-అర్ అనునవి ఏకాదేశమగును.
6. నిలువెల్ల
జవాబు:
నిలువు + ఎల్ల – ఉత్త్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
VI. సమాసములు
1. ధేనుకోటులు
జవాబు:
దేనువు యొక్క కోటలు – షష్ఠీ తత్పురుష సమాసము
2. కలకంఠకంఠి
జవాబు:
కలకంఠము (కోకిల) వంటి కంఠము కలది – బహువ్రీహి సమాసము
3. నిండునదులు
జవాబు:
నిండైన నదులు విశేషణ పూర్వపద కర్మధారయము
![]()
4. దానధర్మములు
జవాబు:
దానములును, ధర్మములును – ద్వంద్వ సమాసము
VII. కఠిన పదాలకు అర్థాలు
- మొదవు = ఆవు
- కులకాంత = భార్య
- ఖలుడు = దుర్మార్గుడు (మానవుడు)
- తెరువరులు = బాటసారులు
- వదరుపోతు = ఊరక మాట్లాడేవారు
మంచి ముత్యాలు Summary in Telugu
కవి కాలాదులు
1 నుండి 3 పద్యాలు:
పాఠ్యభాగము : మంచి ముత్యాలు
గ్రహింపబడిన గ్రంథం : సుమతీ శతకము
కవి : బద్దెన భూపాలుడు
కాలము : 13వ శతాబ్దము
బిరుదు : కావ్య చతుర్ముఖుడు
రచనలు : నీతిశాస్త్ర ముక్తావళి, సుమతీ శతకము
విశిష్టత : భద్ర భూపాలుడు, బద్ధి భూపతి, బద్ధి నృపాలుడు, బద్ది నరేంద్రుడు మొదలగు 19 బిరుదు పేర్లతో కవి తన్ను చెప్పుకున్నాడు. ఇతని శైలి చక్కగా ఉంటుంది. తిక్కన, నన్నెచోడు రచనా శిల్పముంది
4, 5 పద్యాలు :
పాఠ్యభాగము : మంచి ముత్యాలు
గ్రహింపబడిన గ్రంథం : భాస్కర శతకము
కవి : మారద వెంకయ్య
కాలము : 16వ శతాబ్దము
రచన : భాస్కర శతకము
విశిష్టత : మారన వెంకయ్య, మారవి కవి అనే నామాంత రాలు కలవు. అరసవిల్లి శ్రీసూర్య నారాయణ స్వామి భక్తుడు. ఈయన ప్రతి పద్యంలో మొదటి పాదాలలో ఒక సత్యం చెప్పి, దానిని సమర్థించ టానికి కడపటి పాదాలలో ఒక దృష్టాంతం చెప్పాడు.
6, 7, 8 పద్యాలు :
పాఠ్యభాగము : మంచి ముత్యాలు
గ్రహింపబడిన గ్రంథం : వేమన శతకము
కవి : వేమన
కాలము : 17వ శతాబ్దము
విశిష్టత : వేమన కవిత్వం మనోహరమైనది. ఈతడు ఆటవెలది ప్రియుడు. యౌవనంలో ఆటవెలది ప్రియుడై గడిపి, విరాగియై సర్వసంగ పరిత్యాగియై వేదాంత బోధ చేసేటప్పుడు “ఆటవెలది” ప్రియుడే అయినాడు. భావ పునరావృత్తి, వైరుధ్యం ఇతని కవితలో ఉంటుంది.
వేమన మూఢులకు, కొంచెం జ్ఞాన వంతులకు అభ్యాస స్థితిలో ఉన్న జ్ఞానికి, సంపూర్ణ సిద్ధునకు అందరికీ ఉపయోగపడే ధర్మాలను ఉపదేశించాడు. వేమనకు ఒక జాతిపై గాని, కులముపై గాని, ఒక ఆచారంపై గాని, ధర్మంపై గాని ద్వేషం లేదు. మానవులందరూ ఆత్మజ్ఞానులై, అద్వైత సిద్ధి పొందాలని, తరించాలని అతని కోరిక.
![]()
9వ పద్యము :
పాఠ్యభాగము : మంచి ముత్యాలు
గ్రహింపబడిన గ్రంథం : భర్తృహరి సుభాషిత రత్నావళి
కవి : ఏనుగు లక్ష్మణకవి
కాలము : 18వ శతాబ్దము
రచనలు : 1. రామేశ్వర మాహాత్మ్యము 2. జాహ్నవీ మాహాత్మ్యము 3. రామవిలాసము 4. సంస్కృత సూర్య శతకము 5. విశ్వేశ్వరోదాహరణము 6. కొన్ని దండకాలు, స్తుతులు 7. సుభాషిత రత్నావళి
సమకాలికుడు : కూచి మంచి తిమ్మనకవి
విశిష్టత : ఈయన పండిత కుటుంబానికి చెందినవాడు. తిమ్మకవి పేరమాంబల పుత్రుడు. వీరు పెద్దాపుర సంస్థాన ప్రభువులైన వత్సవాయ గజపతుల ఆస్థాన కవులు. కవి పూర్వీకుల అసలు ఇంటి పేరు పైడిపాటి వారట. వీరి పూర్వులలో జంపాలా మాత్యుడనే ఆయన వత్సవాయ ప్రభువు నుంచి ఏనుగును బహుమానంగా తీసుకున్నాడట. అప్పటి నుంచి వీరి ఇంటి పేరు ఏనుగు వారుగా మారినట్లు తెలుస్తున్నది. ఈ రచనలలో ‘సుభాషిత రత్నావళి’ చివరిదని పండిత అభిప్రాయం. ఈ గ్రంథంలో ఈయన కవిత్వ శైలి నిగ్గుదేరి మనోహరంగా ఉంది.
10వ పద్యము :
పాఠ్యభాగము : మంచి ముత్యాలు
గ్రహింపబడిన గ్రంథం : నరసింహ శతకము
కవి : జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి చెందిన శేషప్ప కవి. వీరి అసలు పేరు ధర్మపురి శేషాచల కవి.
స్వస్థలం : ధర్మపురి
కాలము : 18వ శతాబ్దము
రచనలు : 1. ధర్మపురి రామాయణము 2. నరసింహ శతకము 3. నరహరి శతకము (ధర్మపురీ నృకేసరీ శతకము)
విశిష్టత : ఇతని రచన సలక్షణంగా నిరాడంబరంగా సుందరంగా ఉంటుంది. ధర్మపురిలోని నృసింహ స్వామిపైన చెప్పిన శతకం. “భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర” అనే మకుటంతో ఉంది. శైలి మృదు మధురం. భాష అంతగా లక్షణోపేతమైనది కాదు.
శతకము : కావ్య ప్రక్రియలలో ఒకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియల ననుసరించే తెలుగు శతక రచన మొదలైనట్లు కొందరి అభిప్రాయమున్నా, ఈ ప్రక్రియ తెలుగులో స్వతంత్రమైనదై విశిష్ట మర్యాదను పొందినది.
స్వర్గబంధము లేనిదీ కావ్యము. దీనిని భామహుడు అని బద్ధ కావ్యంగా పేర్కొన్నాడు. శతకములను అసర్గబంధములుగా, ఉపకావ్యములుగా విద్యానాథుడు భావించాడు. కాని శతకాన్ని ఒక ప్రత్యేక ప్రక్రియగా “శతేన శతకం ప్రోక్తమ్” అని శ్లోక సంఖ్యలననుసరిస్తూ అమృతానంద యోగి తన అలంకార సార సంగ్రహంలో స్పష్టం చేశాడు.
విన్నకోట పెద్దన శతక లక్షణం చెబుతూ “శతకమున నొప్పుమరి పద్య శతము గూడ” అన్నాడు. కావ్యాలంకార చూడామణిలో శతక ప్రక్రియను గూర్చిన చర్చ ఉంది.
- నూరుకాని, నూట ఎనిమిది కాని పద్యాలుండటం.
- మకుటంగానూ, నిర్మకుటంగానూ పద్యాలుండటం.
- ఒకే రకమైన పద్యాలైనా, భిన్నమైన పద్యాలైనా 100 నుంచి 108 వరకు ఉండటం.
- వీర, శృంగార, కరుణ, హాస్యాది రసాలలో ఏదైనా ఒక రసాన్ని పోషిస్తూ రచించటం.
- విషయం ఏ పద్యానికాపద్యమే పరిమితంగానూ, లేదా సూత్రబద్ధంగానూ ఉండటం శతక లక్షణాలు.
ఆంధ్ర శతక వాఙ్మయం 12వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు క్రమ పరిణామంలో పరిపుష్టిని పొంది ఒక శాఖగా స్థిరత్వాన్ని కూర్చుకొన్నది. ఆంధ్ర, శతక సాహిత్య వికాసరీతులను పరిశీలించి వర్గీకరిస్తే వీనిలో భక్తి, నీతి, శృంగార, వైరాగ్య, అధిక్షేప, తత్త్వ, చారిత్రక, కథాత్మక, శాస్త్ర, సంకీర్ణ, సంకలన ప్రహేళికాది వివిధ వస్తుకమైనవే కాక, అనూదితములు కూడా ఉన్నాయి.
తెలుగులో భాస్కర, కాళహస్తీశ్వర, కుమారీ, సుమతి, వేమన, కృష్ణ, ప్రసన్న రాఘవ, తాడిమళ్ళ రాజగోపాల, నరసింహ శతకాలు ప్రసిద్ధాలు. భర్తృహరి సుభాషిత త్రిశతి తెలుగులో నీతి, శృంగార, వైరాగ్య శతకాలుగా ప్రసిద్ధికెక్కింది.
పాఠ్యభాగ సారాంశం
నీరు త్రాగే గుఱ్ఱాన్నీ, కొవ్వుతో చెలరేగుతున్న మదపుటేనుగునూ, ఎద వట్టిన గోవు వద్ద నున్న ఆబోతునూ, విద్యా విహీనుడైన నీచబుద్ధి కలవానిని చేరకూడదు.
భార్యతో ఏనాడూ తగవులాడరాదు. ఆమెలో లేని దోషం ఉన్నదని ఏనాడూ ఆరోపించకూడదు. ఏ యింటిలో స్త్రీ దుఃఖంతో కన్నీరు కార్చవలసి వస్తుందో ఆ యింటిలో సంపద ఉండదు.
పాముకి విషం శిరస్సులోని నోట్లో మాత్రమే ఉంటుంది. తేలుకి తోక చివర మాత్రమే ఉంటుంది. దుష్టునికి శరీరమంతా విషం ఉంటుంది.
మానవుడు తనకిష్టమైన మంచి పనిని చేసేటప్పుడు ఒక నీచుడు ఆ పనిలోని మంచిని గ్రహించలేక, కాదంటే, వాని మాటల కోసం ఆ పనిని ఆపాలని అనుకోడు. చక్కని భోజనం చేసే సమయంలో ఆహారపదార్థాల మీద ఈగ వాలినంత మాత్రాన, ఆ వంటకాన్ని మానవుడు తినకుండా ఉండడం నేర్పరితనం అవుతుందా ! కాదు గద!
ఎంత గొప్ప కార్యాన్నైనా తీర్చిదిద్దడానికి, దృఢమైన బలంతో ఎదిగిన ఒక వ్యక్తి చాలు. అసంఖ్యాకులైన కౌరవులు గోగ్రహణం చేస్తే, అర్జునుడొక్కడే ఆ గోవులను వాళ్ళ వశం కానివ్వకుండా వారి బలమైన సైన్యాన్ని అనేక బాణాలతో ధ్వంసం చేసి విజయాన్ని సాధించలేదా ?
నీ స్థాయికి తగని నీచులతో కలిసి మెలిసి తిరిగితే లోకం నిన్ను గౌరవహీనుని గానే చూస్తుంది. ఎలాగంటే తాటిచెట్టు క్రింద నిలబడి పాలు తాగితే, కల్లు తాగావని లోకం నిందిస్తుంది.
నీటితో నిండియున్న నదులు గంభీరంగా నిలిచి పారుతున్నాయి. చిన్న సెలయేళ్ళు పైకి పొర్లుతూ వేగంగా ప్రవహిస్తున్నాయి. చెడు గుణములు కలవారు మాటలాడి నంతటి. తొందరగా మంచి గుణములు కలవారు మాట్లాడరు.
బుద్ధిహీనుడైనవాడు ఎన్ని విద్యలు నేర్చినా, అతడి అల్పత్వంతో పోయి గొప్పవాడవుతాడా ? ఎక్కడైన పరిమళ ద్రవ్యాల మూటను గాడిద మోసినంత మాత్రాన గొప్పది అవుతుందా ?
నిందించినా, ప్రశంసించినా, సంపదలు వచ్చినా, తొలగిపోయినా, మరణమిప్పుడే వచ్చినా, కల్పాంతమందు వచ్చినా ధీరులైనవారు. న్యాయమార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు పెట్టరు.
మోక్ష సంపదలనే భూషణాలతో ప్రకాశించే వాడా ! దుష్టులను సంహరించిన వాడా! పాపాలను నశింప చేసేవాడా ! ధర్మపురిలో నివసించు ఓ నరసింహా! పుట్టేటప్పుడు ధనమెవ్వరూ తీసుకొనిరారు. పోయేటప్పుడు తన వెంటరాదు. ఎంత గొప్ప ధనికుడైనా ఉప్పుతో కూడిన అన్నమే తింటాడు కాని, బంగారు ముద్దలు మ్రింగలేడు. డబ్బు గడించి పొగరుబోతుతనాన్ని పెంచుకోవటమే గాని, ఆ సొమ్ములు అనుభవానికి రాదు. కూడబెట్టిన సొమ్ము దొంగల పాలవుతుందో, దొరల పాలవుతుందో తెలియదు. తేనెటీగలు తేనెను కూడబెట్టి బాటసారులకిస్తున్నాయి కదా !
![]()
పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు
1వ పద్యం :
కం॥ ఉదకముఁ ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యీ నీచుకడకు జనకుర సుమతీ !
ప్రతిపదార్థం:
సుమతీ = మంచి బుద్ధి కలవాడా !
ఉదకమున్ = నీటిని
త్రావెడు = త్రాగుతున్న
హయమును = గుఱ్ఱాన్నీ
మదమునన్ = క్రొవ్వుతో
ఉప్పొంగుచున్ + ఉండు = ఉప్పొంగుచుండు = విజృంభిస్తున్న
మత్త + ఇభంబున్ = మత్తేభంబున్ = మదపుటేనుగునూ
మొదవుకడన్ = (ఎద వోయిన) గోవు వద్ద
ఉన్న = నిలిచిన
వృషభమున్
చదువని = విద్య నేర్వని
ఆ నీచున్ = ఆ కారణం చేత నీచబుద్ధి కలవానిని
చేరన్ + చనకుర = చేరఁజనకుర = సమీపించటానికి పోవద్దయ్యా
తాత్పర్యం : సుమతీ ! నీరు త్రాగే గుఱ్ఱాన్నీ, కొవ్వుతో చెలరేగుతున్న మదపుటేనుగునూ, ఎదవట్టిన గోవు వద్ద నున్న ఆబోతునూ, విద్యాహీనుడైన కారణం చేత నీచబుద్ధి కలవానినీ చేరవద్దు.
2వ పద్యం :
కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠ కంఠి కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ !
ప్రతిపదార్థం :
సుమతీ ! = మంచి బుద్ధి కలవాడా !
కులకాంత తోడన్ = భార్యతో
ఎప్పుడున్ = ఏనాడు
కలహింపకు = జగడమాడవద్దు (తగవులాడకూడదు)
వట్టి తప్పు = లేని దోషం
ఘటియింపకుమీ = అంటగట్టకు సుమా !
కలకంఠ కంఠి = స్త్రీ యొక్క
కన్ను + నీరు = కన్నీరు = కన్నీళ్ళు
ఒలికినన్ = రాలిన పక్షంలో
ఇంటన్ = ఆ యింటిలో
సిరి = లక్ష్మీదేవి; (సంపద)
ఉండన్ + ఒల్లదు = ఉండనొల్లదు = నివసించటానికి ఇష్టపడదు
తాత్పర్యం : సుమతీ ! భార్యతో ఏనాడూ జగడమాడవద్దు. ఆమెలో లేని దోషం ఉన్నదని ఎన్నడూ ఆరోపించవద్దు. ఏ యింటిలో స్త్రీ దుఃఖంతో కన్నీరు కార్చవలసి వస్తుందో ఆ యింటిలో సంపద ఉండదు.
విశేషం: కలకంఠం అంటే కోకిల. అవ్యక్తమధుర స్వరం కలది అని అర్థం. దాని స్వరం వంటి స్వరం కలది కలకంఠ కంఠి. కంఠం మధురంగా ఎప్పుడుంటుంది? సంతోషంగా ఉన్నప్పుడు. సంతోషం ఎప్పుడుంటుంది ? ప్రేమ ఉన్నప్పుడు. అట్టి ఆమెకు కన్నీరు వచ్చిందంటే, అవన్నీ పోవటానికి దారి ఏర్పడిందన్నమాట.
3వ పద్యం :
కం॥ తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁకనుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
ప్రతిపదార్థం:
సుమతీ = మంచిబుద్ధి కలవాడా !
విషము = గరళము
ఫణికిని = పడగ గల పాముకు
తలన్ = శిరస్సు భాగమైన నోటిలో
ఉండున్ = ఉంటుంది
వృశ్చికమునకున్ = తేలుకు
వెలయన్ + కాన్ = వెలయంగాన్ = స్పష్టమయ్యేటట్లుగా
తోకన్ = తోకలో
ఉండున్ = ఉంటుంది
ఖలునకున్ = దుష్టునికి (నీచునికి)
తల-తోక+అనక = తల తోకయనక = శిరస్సు, పుచ్ఛం అనే భేదం లేకుండా
నిలువు + ఎల్లన్ = నిలువెల్లన్ = ఆకృతీ రూపం శరీరం అంతటా
విషము = విషముంటుంది
కదరా ! = కదయ్యా !
తాత్పర్యం : సుమతీ ! విషం పాముకి శిరస్సులోని నోట్లో మాత్రమే ఉంటుంది. తేలుకి తోక చివర మాత్రమే ఉంటుంది. దుష్టునికి నోట్లోనూ తోక చివరా అనే హద్దు లేకుండా శరీరం అంతటా విషం ఉంటుంది.
విశేషము : విషం అంటే ప్రాణం తీస్తుంది. పాముకు నోట్లోను, తేలుకు తోక చివర మాత్రమే ఉంటుంది. కాని నీచునికి (దుర్మార్గుడు) శరీరమంతా ఉంటుంది. దుర్మార్గుడు చేసే ఆలోచనలు కాని, చేసే పనులు కాని సమాజానికి అపకారం కల్గిస్తాడు. కనుక వీనికి దూరంగా ఉండటమే శ్రేయస్కరము.
![]()
4వ పద్యం :
ఉ ॥ మానవుఁడాత్మకిష్టమగు మంచి ప్రయోజన మాచరించుచో
గానక యల్పుడొక్కఁ డది గాదని పల్కిన వాని పలుకై
మానఁగజూడఁ డా పని సమంచిత భోజనవేళ నీఁగ కా
లూనిన వంటకంబు దినకుండఁగ నేర్పగునోటు భాస్కరా
ప్రతిపదార్థం :
భాస్కరా = ఓ సూర్యుడా !
మానవుడు = మనుష్యుడు
ఆత్మకున్ + ఇష్టము + అగు = ఆత్మకిష్టమగు = తన మనస్సునకు నచ్చిన
మంచి ప్రయోజనము = సత్కార్యం
ఆచరించుచోన్ = చేసే సమయంలో
కానక = ఆ పనిలోని మంచిని గ్రహించక
అల్పుడు + ఒక్కడు = అల్పుడొక్కడు = ఒక నీచుడు
అదికాదు + అని = అదికాదని = అది తగదని
పల్కినన్ = పలికితే
వాని పల్కుకు + ఐ = వాని పల్కుకై = వాని మాట కోసం
ఆ పని = ఆ కార్యాన్ని
మానగన్ + చూడడు మానఁగఁజూడఁడు = మానివేయాలని అనుకోడు
సమంచిత భోజనవేళన్ = చక్కగా భోజనం చేసే సమయంలో
ఈఁగకాలు + ఊనినన్ = ఈఁగకాలూనినన్ = ఈగ కాలు మోపినట్లయితే
వంటకంబున్ = ఆ ఆహార పదార్థాన్ని
తినక + ఉండగన్ = తినకుండగన్ = తినకుండ ఉండడం
నేర్పు + అగునోటు = నేర్పగునోటు = నేర్పరితనం అవుతుందా ?
తాత్పర్యం : భాస్కరా ! మానవుడు తన కిష్టమైన మంచి పనిని చేసేటప్పుడు ఒక నీచుడు ఆ పనిలోని మంచిని గ్రహించలేక, కాదంటే వాని మాటల కోసం ఆ పనిని ఆపాలని అనుకోడు. చక్కని భోజనం చేసే సమయంలో ఆహారపదార్థాల మీద ఈగ వాలినంత మాత్రాన, ఆ వంటకాన్ని మానవుడు తినకుండా ఉండడం నేర్పరితనం అవుతుందా ? కాదు గదా !
5వ పద్యం :
ఉ ॥ ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ
జక్క నొనర్పఁ గౌరవు లసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జిక్కఁగ నీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవడంగఁ జేసి తుద ముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా
ప్రతిపదార్థం :
భాస్కరా ! = ఓ సూర్యుడా !
ఎంతటి కార్యము + ఐనన్ = ఎంతటి కార్యమైనన్ = ఎంతటి గొప్ప పని అయినా
చక్కన + ఒనర్పన్ = చక్కనొనర్పన్ = బాగుగా చేయడానికి
బల + ఉన్నతుడు = బలోన్నతుడు = చలింపని బలం చేత గొప్పవాడు
తాన్ + ఒక్కడె చాలున్ = తానొక్కడెచాలున్ = తానొక్కడే సమర్థుడు
అసంఖ్యులు కౌరవులు = లెక్కించరాని దుర్యోధనాది కౌరవులు
పట్టిన = పట్టుకొన్న
ధేనుకోటులన్ = ఆలమందలను
ఒక్క కిరీటి = అర్జునొక్కడే
చిక్కగన్ + ఈక = చిక్కగనీక = వారి వంశం కానీయకుండ
అనేక శిలీముఖంబులన్ = ఆ పెక్కు బాణాలతో
తత్ + ప్రబల సేనన్ = తత్ప్రబలసేనన్ = ఆ కౌరవుల గొప్ప సైన్యాన్ని
మొక్క+పడంగన్+చేసి = మొక్కవడంగఁజేసి = భంగపరిచి
తుదముట్టఁడె = నాశనం చెయ్యలేదా !
తాత్పర్యం : భాస్కరా ! ఎంత గొప్ప కార్యాన్నైనా తీర్చిదిద్దడానికి, దృఢమైన బలంతో ఎదిగిన ఒక వ్యక్తి చాలు. అసంఖ్యాకులైన కౌరవులు గోగ్రహణం చేస్తే, అర్జునుడొక్కడే ఆ గోవులను వాళ్ళ వశం కానివ్వకుండా వారి బలమైన సైన్యాన్ని అనేక బాణాలతో ధ్వంసం చేసి విజయాన్ని సాధించలేదా ?
విశేషం : బలవంతుడైన వాడొక్కడే ఎంత కార్యాన్నైనా చక్క పెట్టగలడు. బలహీనులు అసంఖ్యాకంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. అంటే గణం కాదు. గుణమే ప్రధానమని కవి చాటుతున్నాడు.
6వ పద్యం :
ఆ ॥ కాని వానితోడ కలసి మెలగుచున్న
కాని వానిగానె కాంతురవని
తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రతిపదార్థం :
విశ్వద + అభిరామ ! = విశ్వదాభిరామ = ప్రపంచానికి ఇష్టమైనవాడా !
వేమ = వేమనా !
వినుర = వినుము
కానివానితోడన్ = చెడ్డవానితో
కలసిమెలగుచు+ఉన్నన్ = కలసిమెలగుచున్నన్ = కూడి మాడి ఉంటే
కాని వాని + కానె = కాని వాని గానె = ఎందుకు పనికిరాని వాడుగనే
అవని = భూమిలో
కాంతురు = చూస్తారు
తాటిక్రింద = తాటిచెట్టు క్రింద
పాలు = పాలను
త్రాగిన+చందము+ఔ = త్రాగిన చందమౌ = తాగిన విధంగా
తాత్పర్యం : వేమనా ! నీ స్థాయికి తగని నీచుతో కలిసి మెలిసి తిరిగితే నీ గుణం మంచిదైనా లోకంలో నీ గౌరవం నశిస్తుంది. ఎలాగంటే తాటిచెట్టు కింద కూర్చొని పాలు తాగినా కల్లు తాగావనే లోకులు భావిస్తారు.
![]()
7వ పద్యం :
ఆ ॥ నిండు నదులు పాఱు నిలచి గంభీరమై
వెర్రి వాగు పాఱు వేగ పొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రతిపదార్థం :
విశ్వద + అభిరామా ! = విశ్వదాభిరామా ! = ప్రపంచానికి ఇష్టమైనవాడా !
వేమా = వేమనా !
వినుము = వినవలసింది
నిండు నదులు = నదులు నిండు నీటితో
నిలచి = నిలచి
గంభీరము + ఐ = గంభీరమై = బలంగా
పారు = పారుచుండును
వెఱవాగు = చిన్న చిన్న కాలువలు
వేగ = తొందరగా
పొర్లి = పైకి పొర్లి
పారు = పారుచుండును
అల్పుడు = చెడు గుణములు కలవాడు
ఆడురీతి = మాటలాడు విధంగా
అధికుండు = మంచి గుణములు కలవాడు
ఆడునా = మాటలాడునా ?
తాత్పర్యం : ఓ వేమా ! నీటితో నిండియున్న నదులు గంభీరంగా నిలచి పారుచుండును. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగంగా ప్రవహించుచుండును. చెడు గుణములు కలవారు మాటలాడినంతటి తొందరగా మంచి గుణములు కలవారు మాట్లాడరు.
8వ పద్యం :
ఆ ॥ హీనుడెన్ని విద్య లిలను నేర్చినగాని
ఘనుడు కాడు హీన జనుడె కాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రతిపదార్థం :
విశ్వద + అభిరామా ! = విశ్వదాభిరామా ! = ప్రపంచానికి ఇష్టమైన వాడా !
వేమ ! = వేమా !
వినుము = వినవలసినది
హీనుడు = బుద్దిహీనుడు
ఎన్ని విద్యలు = అనేకములైన విద్యలను
ఇలన్ = ఈ భూమిపైన
నేరినన్ + కాని = అభ్యసించినప్పటికి
ఘనుడున్ + కాడు = ఘనుడుగాడు = గొప్పవాడు కాదు
హీనుజనుడె కాని = అల్పత్వం పోయి గొప్పవాడవుతాడా ?
పరిమళములన్ = సుగంధ ద్రవ్యాలను
గార్దభము = గాడిద
మోయ = మూటలు మోస్తే
ఘనము + ఔనె = ఘనమౌనె = గొప్పది అవుతుందా !
తాత్పర్యం : బుద్దిహీనుడైనవాడు ఎన్ని విద్యలు నేర్చినా అతడి అల్పత్వం పోయి గొప్పవాడవుతాడా ? ఎక్కడైనా పరిమళ ద్రవ్యాల మూటలు మోసే గాడిద ప్రశస్థమైన జంతువుగా మారుతుందా ? అని అంటున్నాడు వేమన.
విశేషాంశం : “విశ్వదాభిరామ ! వినుర వేమ !” ఈ మకుటంలో అనేక అర్థాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
విశ్వద = ఈ పేరు గల వేశ్యకి ;
అభిరామ = ఇష్టుడు అనే అర్థం చెబుతున్నారు.
విశ్వదుడు = సమస్తాన్ని ఇచ్చేవాడు. భగవంతుడు అతనికి ;
అభిరామ = ఇష్టుడైన ;
వేమా = వేమనా ! వినుర ! = వినవయ్యా ! ఈ అర్థాన్ని రాళ్ళపల్లి వారు చెప్పారు.
ఇదే భావాన్ని “Listen o vemana Dear to the Lord of all” అని అంగ్లంలో బ్రౌన్ చెప్పాడు.
9వ పద్యం :
నీతిప్రౌఢవిహారులైన నిపుణుల్ నిందింపనీ మెచ్చనీ
ఖ్యాతింజెందిన సంపదల్ నిలువనీ గాఢంబుగా సాగనీ
ఘాతం బప్పుడ పొందనీ నియతిమైఁ గానీ యుగాంతంబునన్
నీతిశ్లాఘ్యపదంబు దప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్
ప్రతిపదార్థం:
నీతి = న్యాయము నందు
ప్రౌఢ, విహారులు + ఐన = ప్రౌఢ విహారులైన = ప్రౌఢమైన సంచారము కలవారైన (అనగా నీతిశాస్త్రము నందు మంచి ప్రావీణ్యము గలవారైన)
నిపుణుల్ = సమర్థులు
నిందింపనీ = నిందింతురు గాక
మెచ్చనీ = మెత్తురుగాక
ఖ్యాతిన్ + చెందిన = ఖ్యాతింజెందిన = ప్రసిద్ధి పొందిన
సంపదల్ = సంపదలు
నిలువనీ = నిలుచుగాక
గాఢంబుగా = యథేచ్ఛగా
సాగనీ = సాగిపోవును గాక
ఘాతంబు = మరణమును
అప్పుడు + అ = అప్పుడ = అప్పుడే
పొందనీ = పొందుగాక
నియతిమైన్ = భాగ్యము వలన
యుగ + అంతమునన్ = యుగాంతమునన్ = యుగాంతమున
కానీ = కానిమ్ము
ధీర+ఉత్తముల్ = ధీరోత్తముల్ = ఉత్తములైన ధీరులు
నిత్యంబు = ఎల్లప్పుడు
నీతి = నీతి చేత
శ్లాఘ్య = కొనియాడదగిన
పదంబు = మార్గమును
తప్పరు కదా = దాటరు కదా !
తాత్పర్యం: నిందించినా, ప్రశంసించినా, సంపదలు వచ్చినా, తొలగిపోయినా, మరణమిప్పుడే వచ్చినా, కల్పాంత మందు వచ్చినా ధీరులైన వారు న్యాయమార్గాన్ని దాటి ఒక అడుగైనా ముందుకు పెట్టరు.
![]()
10వ పద్యం :
సీ॥ | తల్లి గర్భమునుండి ధనముఁ దేఁడెవ్వఁడు
వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని,
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు
విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె గాని
కూడఁబెట్టిన సొమ్ముఁ గుడువఁబోడు
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక దాఁచి దాఁచి
తే॥ తుదకు దొంగల కిత్తురో ? దొరల కవునొ ?
తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు !
భూషణవికాస ! శ్రీధర్మపుర నివాస !
దుష్టసంహార ! నరసింహ! దురితదూర!
ప్రతిపదార్థం :
భూషణవికాసా = భూషణాలతో ప్రకాశించేవాడా !
దుష్టసంహారా = దుష్టులను సంహరించినవాడా !
దురితదూర ! = పాపములను నశింప చేయువాడా !
శ్రీధర్మపుర నివాస ! = ధర్మపురిలో నివసించు
నరసింహ = ఓ నరసింహస్వామీ !
ఎవ్వఁడు = ఎవ్వరైనా
తల్లి గర్భము నుండి = పుట్టేటప్పుడు
ధనమున్ = సంపదను
తేఁడు = తీసుకొనిరాడు
లక్ష + అధికారి + ఐన = లక్షాధికారైన = ఎంత గొప్ప ధనికుడైనా
లవణము + అన్నము + ఎ – కాని
లవణ మన్నమెకాని = ఉప్పన్నమే కాని (తింటాడు కాని)
మెఱుఁగు బంగారంబు = ప్రకాశించే బంగారాన్ని
మ్రింగన్ + పోఁడు = మ్రింగఁబోఁడు = మింగడు కదా !
విత్తము + ఆర్జన చేసి = విత్తమార్జన చేసి = ధనాన్ని గడించి
విఱ్ఱవీగుటె గాని = పొగరుబోతు తనాన్ని పెంచుకోవటమే అవుతుంది.
పొందుగా = స్థిరంగా
మఱుగు + ఐన = మఱుగైన = రహస్యంగా
భూమిలోపలన్ + పెట్టి = భూమిలోపలఁబెట్టి = భూమిలో దాచిపెట్టి
దాన ధర్మము లేక = దాన ధర్మాలు చేయక
దాచి దాచి = రహస్యంగా దాచితే
తుదకు = చివరకు
దొంగలకు + ఇత్తురు + ఓ = దొంగలకిత్తురో = దొంగల పాలవుతాయో
దొరలకు అవును + ఒ = దొరలకవునొ = దొరల పాలవుతాయె
తేనె = తేనె
జుంటి + ఈగలు = జుంటీగలు = తేనెటీగలు
తెరువరులకు = బాటసారులకు
ఇయ్యవా = ఇయ్యటం లేదా ?
తాత్పర్యం : సంపదలనే భూషణాలతో ప్రకాశించే వాడా ! దుష్టులను సంహరించిన వాడా ! పాపాలను నశింప చేసేవాడా ! ధర్మపురిలో నివసించు నరసింహా! పుట్టెటప్పుడు ధనమెవ్వరూ తీసుకొనిరారు. చనిపోయేనాడు ఏదీ తన వెంటరాదు. ఎంత గొప్ప ధనికుడైన ఉప్పన్నమే తింటాడు గాని బంగారు ముద్దలు మ్రింగలేడు. డబ్బు గడించి పొగరుబోతుతనాన్ని పెంచుకోవటమే గాని, ఆ సొమ్ములు అనుభవానికి రాదు. కూడబెట్టిన సొమ్ము దొంగలపాలౌతుందో, దొరల పాలౌవుతుందో తెలియదు. తేనెటీగలు తుట్టెల్లో తేనెని కూడబెట్టి బాటసారులకిస్తున్నాయి కదా ! అదే విధంగా దాచిన సొమ్ము కూడా అంతే.