Regular practice with AP Inter 1st Year Telugu Study Material పద్యభాగం 1st Poem భీముని గర్వభంగం Questions and Answers Summary helps students stay prepared for examinations.
AP Inter 1st Year Telugu భీముని గర్వభంగం Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
హనుమంతుడు భీమునికి తెలిపిన నాలుగు యుగ ధర్మాలను వివరించండి.
జవాబు:
కాలం ఒకే రీతిగా ఉండదు. పలు విధాలుగా మార్పు చెందుతూ వేరు వేరు స్థితిగతులలో ఉంటుంది. ఆ కారణం చేత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. వీటి పరిమితుల సంఖ్యలు భిన్నమైనవి. అట్లే ఆయా యుగాలలోని చేతనాచేతనాలు వేరు వేరు రీతులు కలిగి ప్రవర్తిల్లుతాయి.
కృతయుగంలో చేయటమే కాని చేయవలసినటువంటిది లేదు. ధర్మం నాలుగు పాదాలలో వర్తిస్తుంది. విష్ణుదేవుడు ఆ యుగంలో తెల్లటిరంగు కలవాడై ప్రజలను కాపాడుతూ వెలుగొందుతుంటాడు. ఆ కృతయుగం శాశ్వత రూపమైన కొత్త ధర్మంతో కూడి ఉంటుంది. ఈ యుగంలోదర్గుణ విజృంభణ ఉండదు. చెడు ఉద్దేశ్యాలు ఆరోపించబడవు. శత్రువులపై పగ తీర్చుకొనటానికి మంత్ర తంత్ర కర్మలు జరుగవు.
ఇంకా త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలతో ప్రవర్తిల్లుతుంది. అందులో జనులు ఎల్లప్పుడూ నిజం చెప్పటం అనే నిష్ఠతో ఉంటారు. యజ్ఞాలు, తపస్సు, దానం మొదలైన పుణ్య కార్యాలను చేయటంలో ప్రజలు ఆసక్తి కలవారౌతారు. ఈ త్రేతాయుగంలో పూజనీయుడైన విష్ణుదేవుడు ఎర్రటి రంగు కలవాడై ప్రజలను కాపాడుతాడు.
ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాల నడుస్తుంది. వేలు నాలుగు తెరగులుగా ప్రవర్తిల్లుతాయి. వేదాలలోను, శాస్త్రాలలోను ప్రతిపాదిం చబడిన భావాల చేత నడుపబడి ధర్మ కామాలు విలసిల్లుతాయి. ఆ ద్వాపర యుగంలో ప్రజలు నిజాన్ని మాట్లాడడం తప్పుతారు. అంతరింద్రియ నిహా ఇం కోల్పోతారు. కోరికల యెడ ఆసక్తి కలవారై పెక్కు యజ్ఞాలు నిర్వహిస్తారు. ఆ యుగంలో విష్ణుదేవుడు నీలవర్ణుడై జగత్తును కాపాడుతాడు.
కలియుగంలో ధర్మం శక్తి తగ్గి ఒకే చరణాన నడుస్తుంది. అప్పుడు విష్ణుదేవుడు పసుపురంగు కలవాడై ప్రపంచాన్ని కాపాడుతాడు.
ప్రశ్న 2.
భీముని గర్వభంగ వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
ఇంద్రుని వజ్రాయుధ ధ్వని వంటి భీముని శంఖధ్వనికి దిక్కులు మార్మోగాయి. దగ్గరలోని గుహలో ఉన్న హనుమంతుని చెవులకు ఆ ధ్వని సోకగానే, అది తన సోదరుని శంఖ ధ్వనిగా పోల్చుకున్నాడు. ఆనందిస్తూనే మనసులో ఒక ఊహ ప్రబలింది. భీముని మార్గానికి పెద్ద చెట్లు, తీగలు అడ్డం వేసి త్రోవలో పడుకున్నాడు. అటుగా వచ్చిన భీమసేనుడు ఒక శిలపై పడుకొని ఉన్న కాంతి వృద్ధకోతిని చూశాడు. యోగ నిద్రలో ఉన్నట్టున్న గోలాంగూలాన్ని (హనుమంతుడు) భీముడు మేల్కొలిపే ఉద్దేశంతో పెద్దగా సింహనాదం చేశాడు.
మెల్లగా కళ్ళు తెరచిన హనుమంతుడు “వయోభారంతో అలసి నిద్రిస్తున్న నా నిద్ర చెడగొట్టావు. అంత గర్వమా నీకు ? భూతదయ లేకుండా దుర్బల జంతువులను ఎందుకు భయపెడుతున్నావు ?” అని అన్నాడు.
భీమసేనుడు గర్వంతో నేను క్షత్రియ శ్రేష్ఠుడిని, అమిత బలశాలిని, వాయుదేవుని వరప్రభావంతో జన్మించాను. దారి పోతే నిన్ను, ఈ పర్వతాన్ని లంఘించి హనుమంతుని వలె వెళతానన్నాడు. తాను హనుమంతుడంతటి బలవంతుడనని అన్నాడు. భీముని మాటలకు నవ్విన హనుమంతుడు నీవు వెళ్ళాలనుకుంటే నా తోకను అవతలకు తోసి వెళ్ళు అన్నాడు.
అంతేకదా ! అనుకున్న భీముడు, తన సర్వ శక్తిని ఉపయోగించి, కూడా ఆ తోకను కదల్చలేక ముచ్చెమటలతో కూలి పోయాడు. పౌరుషం, గర్వం నేల కలిసి సిగ్గుతో తలదించుకున్నాడు. ఎదురుగా ఉన్నది సామాన్యవానరం కాదని గుర్తించి అతడెవరో చెప్పమని ప్రాధేయపడగా, హనుమంతుడు తన నిజ స్వరూపంలో సోదరునికి కనిపించాడు. సముద్రాన్ని లంఘించినప్పటి రూపాన్ని చూపమని కోరగా నాటి తన రూపాన్ని చూపాడు. భీమునికి ఎన్నో నీతులు తెలిపి ఆశీర్వదించాడు.
II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భీముని శంఖారావం విన్న హనుమంతుడు ఏమి చేశాడు ?
జవాబు:
భీముని శంఖారావం విన్న హనుమంతుడు ఉలిక్కిపడ్డాడు. వెంటనే మేల్కొని ఇది నా సోదరుని శంఖారావమే అని సంతోషంతో హనుమ రోమాంచ పులకిత దేహుడైనాడు. అంత భీముడు ముందుకు సాగిపోవటానికి వీలులేకుండా హనుమంతుడు దారికి అటూ ఇటూ అడ్డంగా గొప్ప గొప్ప చెట్లను పెల్లగించి పడవేశాడు. ఇరుకై ఉన్న కాలిబాటకు అడ్డంగా హనుమ శయనించి తన తోకను వినోదంగా ఇటూ అటూ కదిలిస్తూ ఉన్నాడు.
ప్రశ్న 2.
భీముడు తన గొప్పతనాన్ని ఎలా చెప్పుకున్నాడు ?
జవాబు:
భీముడు “నేను క్షత్రియులలో శ్రేష్ఠుడిని, మహావీరుని సుప్రసిద్ధుడిని. పాండురాజు కుమారుడను. వాయుదేవుని వరప్రభావంతో కుంతికి జన్మించిన వాడిని. భూ ప్రజలు నన్ను భీముడు అనే పేరుతో పిలుస్తారు” – అని చెప్పుకున్నాడు.
ప్రశ్న 3.
హనుమంతుని నిజస్వరూపాన్ని చూసిన భీముడు ఏమన్నాడు ?
జవాబు:
భీముని కోరికపై హనుమంతుడు తన నిజ స్వరూపాన్ని చూపాడు. అంత భీముడు హనుమంతుని నిజ స్వరూపాన్ని చూసి “ఓహో ! ఎంత భయానకమైనది ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. నీ శరీరం యొక్క నిడివి భూమ్యాకాశాల మధ్యన రోదసినంతటినీ ఆక్రమించిందే ! ఈ నీ నిజ స్వరూపాన్ని దయచేసి, ఉపసంహరించవలసింది” – అని భీముడు కోరాడు.
![]()
ప్రశ్న 4.
హనుమంతుడు భీమునికి తెలిపిన చతుర్విధ ఉపాయాలు తెలపండి.
జవాబు:
ఏ కర్తవ్యాన్ని నెరవేర్చటంలోనైనా బుద్ధిమంతులు తగిన సమయాన్ని తగిన స్థలాన్ని తెలిసికొని సాహసాన్ని వదలి సామదాన భేద దండోపాయాలను ఏ విధంగా ప్రయోగించతగునో అట్లాగే ప్రయోగించి విజయాన్ని సాధిస్తారు. అని హనుమంతుడు భీమునికి చతుర్విధ ఉపాయాలను తెల్పాడు.
ప్రశ్న 5.
నన్నయ గురించి రాయండి.
జవాబు:
నన్నయ 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రాన్ని పాలించే రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఈయనకు ఆదికవి, వాగను (శబ్ద) శాసనుడను బిరుదులు కలవు.
నన్నయ భారతం కాకుండా “ఆంధ్ర శబ్ద చింతామణి” అనే తెలుగు భాషా వ్యాకరణాన్ని సంస్కృతంలో రచించాడని ప్రతీతి. ఇవి కాక “చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణ సారం, రాఘవాభ్యుదయం” అనే గ్రంథాలు రచించాడని చెబుతారు. అయితే ఇవి అలభ్యాలు. తాను నిత్య సత్య వచనుడనని చెప్పుకున్న ధీశాలి నన్నయ.
III. ఏక వాక్య / పద రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భీముని గర్వభంగం పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది ?
జవాబు:
భీముని గర్వభంగం పాఠ్యాంశం ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం, తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడింది.
ప్రశ్న 2.
భీముని గర్వభంగం పాఠ్యాంశ రచయిత ఎవరు ?
జవాబు:
గర్వభంగం పాఠ్యాంశ రచయిత నన్నయ.
ప్రశ్న 3.
భీముడు పుష్పాల కోసం ఎక్కడికి వెళ్ళాడు ?
జవాబు:
గంధమాదన పర్వత సానువుల్లోకి భీముడు పుష్పాల కోసం వెళ్ళాడు.
ప్రశ్న 4.
దేవతలు దేనికి సంతృప్తులవుతారు ?
జవాబు:
దేవతలు ఆరాధనకు సంతృప్తులవుతారు.
ప్రశ్న 5.
హనుమంతుడు రణరంగంలో ఎక్కడ ఉండి యుద్ధాన్ని చూస్తానన్నాడు ?
జవాబు:
హనుమంతుడు రణరంగంలో అర్జునుని రథ ధ్వజం పై నుండి యుద్ధాన్ని చూస్తానన్నాడు.
![]()
ప్రశ్న 6.
హనుమంతుడు భీమునికి మారువేషంలో ఎలా కనిపించాడు ?
జవాబు:
హనుమంతుడు భీమునికి మారువేషంలో ముసలికోతి రూపాన కనిపించాడు.
IV. సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
క్షత్రియప్రవరుండ విఖ్యాతబలుఁడఁ, బాండుతనయుండ
జవాబు:
పరిచయము : ఈ వాక్యము నన్నయ రచించిన మహాభారతం – అరణ్యపర్వం- తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడిన “భీముని గర్వభంగం” అను పాఠం లోనిది.
సందర్భము : హనుమంతుడు భీముణ్ని నీవెవ్వరువని అడుగగా, తనను గురించి భీముడు చెప్పుచున్న సందర్భం.
భావము : నేను క్షత్రియ శ్రుష్ఠుడను, మహా బలసంపన్నుడను పాండురాజు కుమారుడను అని భావం.
వ్యాఖ్య : సౌగంధిక పుష్పాల కొరకు భీముడు గంధమాదన సానువుల్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక ముసలికోతి దారికి అడ్డంగా ఉంది. నువ్వు తప్పుకో నేను వెళ్ళాల్సిన పని ఉంది అని భీముడు పలుకగా నువ్వు ఎవరో చెప్పు అని ముసలికోతి (హనుమంతుడు) అన్నది.
ప్రశ్న 2.
మహానాదంబిది మనఃప్రియంబయ్యె
జవాబు:
పరిచయము : ఈ వాక్యము నన్నయ రచించిన మహాభారతం – అరణ్యపర్వం – తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడిన “భీముని గర్వభంగం” అను పాఠం లోనిది.
సందర్భము : భీముడు శంఖానాదం విన్న హనుమంతుడు సంతోషిస్తూ తనలో అనుకున్న సందర్భం.
భావము : ఇది గొప్ప ధ్వని. మనస్సు సంతోషంతో కూడుకొనియున్నది.
వ్యాఖ్య : భీముడు సౌగంధిక పుష్పాల కొరకు గంధమాదన పర్వత సానువుల్లోకి వెళ్ళెను. ఆ అరణ్యం నర సంచారం లేనిది. ఆనందంతో భీముడు గొప్పగా శంఖానాదం చేశాడు. అది విన్న హనుమంతుని మనస్సు సంతోషంతో నిండిపోయింది.
ప్రశ్న 3.
ఇంతయుం గపినాథ ! నీకిది యేమి పెద్ద ?
జవాబు:
పరిచయము : ఈ వాక్యము నన్నయ రచించిన మహాభారతం – అరణ్యపర్వం – తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడిన “భీముని గర్వభంగం” అను పాఠం లోనిది.
సందర్భము : భీముడు హనుమంతునితో పల్కిన సందర్భం.
భావము : కపులలో శ్రేష్ఠుడవైన ఓ హనుమా ! అసహాయశూరుడవై మా శత్రువులను సంహరించడం నీకేమి పెద్ద ఘనకార్యం కాదు.
వ్యాఖ్య : హనుమంతుడు భీమునితో పల్కిన పల్కులివి. భీమా ! మీ శత్రువులను యుద్ధంలో సంహరించడం ఏమంత ఘనకార్యం కాదు అని విశ్లేషిస్తూ పల్కాడు.
ప్రశ్న 4.
సిద్ధుండవో గంధర్వుండవో ! దేవవరుండవో నా కెఱింగింపు
జవాబు:
పరిచయము : ఈ వాక్యము నన్నయ రచించిన మహాభారతం – అరణ్యపర్వం- తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడిన “భీముని గర్వభంగం” అను పాఠంలోనిది.
సందర్భము : దారికి అడ్డంగా ఉన్న ముసలికోతి యొక్క తోకను తీయలేక భీముడు ఆశ్చర్యపోతూ మహానుభావా ! మీరెవరో నాకు చెప్పండి అని ముసలికోతితో (హనుమంతుని) పల్కిన సందర్భము.
భావము : సిద్ధులకు చెందిన వేల్పవో ! గంధర్వుడైన వేల్పవో ! దేవతలలో శ్రేష్ఠుడివో ! నాకు జెప్పుము.
వ్యాఖ్య : భీముడు సౌగంధిక పుష్పాలకై గంధమాదన పర్వతం సానువుల్లోకి వెళ్ళెను. అక్కడ ఒక ముసలికోతి యొక్క తోక అడ్డంగా దారిలో పడియుంది. దారి తప్పుకో అని భీముడు పల్కగా నేను ముసలివాణ్ని నీవే ఆ తోకను తీసి ప్రక్కన బెట్టి వెళ్ళుము అని ముసలికోతి (హనుమంతుడు) పల్కగా వెంటనే ఆ తోకను కదిలించలేకపోయాడు భీముడు. అప్పుడు మహానుభావా ! నీవెవరో తను నాకు చెప్పుము అని భీముడు ప్రార్థించాడు.
![]()
ప్రశ్న 5.
శుక్లవర్ణుఁడై ప్రజలఁ గాచుచు వెలుంగు
జవాబు:
పరిచయము : ఈ వాక్యము నన్నయ రచించిన మహాభారతం – అరణ్యపర్వం – తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడిన “భీముని గర్వభంగం” అను పాఠంలోనిది.
సందర్భము : హనుమంతుడు కృతయుగ లక్షణాలను, ధర్మాలను వివరిస్తూ భీమునితో చెప్పిన సందర్భం.
భావము : విష్ణువు తెల్లని రంగుతో ఉండి ప్రజలను రక్షిస్తూంటాడు.
వ్యాఖ్య : కృతయుగంలో చేయటమే గాని, చేయవలసినటువంటిది లేదు. ధర్మం నాలుగు పాదాలలో వర్తిస్తుంది. విష్ణుదేవుడు ఆ యుగంలో తెల్లటి రంగు కలవాడై ప్రజలను కాపాడుతూ వెలుగొందుతుంటాడు.
V. సంధులు
క్రింది పదాలను విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి.
1. కనకాద్రి
జవాబు:
కనక + అద్రి – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : సంస్కృతమున అ,ఇ,ఉ,ఋ, ఇ అను అచ్చులకు సవర్ణములైన అచ్చులు పరంబులగునపుడు క్రమంగా వాని దీర్ఘమేకాదేశంబగును.
2. పరమాప్తులు
జవాబు:
పరమ + ఆప్తులు – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : సంస్కృతమున అ, ఇ, ఉ, ఋ, ఇ అను అచ్చులకు సవర్ణములైన అచ్చులు పరంబులగునపుడు క్రమంగా వాని దీర్ఘమేకాదేశంబగును.
3. ప్రజలఁగాచుచు
జవాబు:
ప్రజలన్ + కాచుచు – సరళాదేశ సంధి.
సూత్రము : ద్రుత ప్రకృతికము మీది పరుషాలకు సరళములగు.
4. కృతార్థుడు
జవాబు:
కృత + అర్థుడు – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : సంస్కృతమున అ, ఇ, ఉ, ఋ, ఇ అను అచ్చులకు సవర్ణములైన అచ్చులు పరంబులగునపుడు క్రమంగా వాని దీర్ఘమేకాదేశంబగును.
5. కార్యార్థి
జవాబు:
కార్య + అర్థి – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : సంస్కృతమున అ,ఇ,ఉ,ఋ, ఇ అను అచ్చులకు సవర్ణములైన అచ్చులు పరంబులగునపుడు క్రమంగా వాని దీర్ఘమేకాదేశంబగును.
6. అత్యంత
జవాబు:
అతి + అంత యణాదేశ సంధి యగా
సూత్రము : సంస్కృతమున ఇ-ఉ-ఋలకు అసవర్ణములైన అచ్చులు పరంబులగునపుడు క్రమంగా య-వ-రలు ఏకాదేశమగును.
7. సీతాన్వేషణ
జవాబు:
సీత + అన్వేషణ – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : సంస్కృతమున అ,ఇ, ఉ, ఋ, ఇ అను అచ్చులకు సవర్ణములైన అచ్చులు పరంబులగునపుడు క్రమంగా వాని దీర్ఘమేకాదేశంబగును.
8. నీకెల్లవారు
జవాబు:
నీకు + ఎల్లవారు – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
![]()
9. లంకేశ్వరుడు
జవాబు:
లంకా + ఈశ్వరుడు – గుణసంధి
సూత్రము : సంస్కృతమున అకారమునకు ఇ-ఉ-ఋలను అచ్చులు పరంబు లగునపుడు క్రమంగా ఏ-ఓ-అర్ లనునవి ఏకాదేశమగును.
VI. సమాసములు
1. శంఖధ్వానము
జవాబు:
శంఖము యొక్క ధ్వానము – షష్ఠీ తత్పురుష సమాసము
2. మహావృక్షము
జవాబు:
గొప్పదైన వృక్షము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
3. వనవాసి
జవాబు:
వన మందు వాసి – సప్తమీ తత్పురుష సమాసము
4. శతయోజనాలు
జవాబు:
నూరు సంఖ్య గల యోజనాలు – ద్విగు సమాసము
5. వృకోదరుడు
జవాబు:
వృకము వంటి ఉదరము కలవాడు – బహువ్రీహి సమాసము
6. నిర్దయుడు
జవాబు:
దయలేనివాడు – బహువ్రీహి సమాసము
7. స్పోటనరవం
జవాబు:
స్ఫోటనము వంటి రవము ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము
8. కపినాథుడు
జవాబు:
కపులకు నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసము
9. యక్షరాక్షసులు
జవాబు:
యక్షులును, రాక్షసులును – ద్వంద్వ సమాసము
10. రాజశాసనం
జవాబు:
రాజు యొక్క శాసనం – షష్ఠీ తత్పురుష సమాసము
11. అలఘుడు
జవాబు:
లఘువు కానివాడు – బహువ్రీహి సమాసము
![]()
12. సీతాన్వేషణ
జవాబు:
సీత కొఱకు అన్వేషణ – చతుర్థీ తత్పురుష సమాసము
13. భక్తిసాధ్యులు
జవాబు:
భక్తి చేత సాధ్యులు – తృతీయా తత్పురుష సమాసము
14. సేతుబంధనం
జవాబు:
సేతువు యొక్క బంధనం – షష్ఠీ తత్పురుష సమాసము
VII. కఠిన పదాలకు అర్థాలు
- హృష్టతనురుహుడు = సంతోషంతో వెంట్రుకలు నిక్కబొడిచిన వాడు
- లాంగూలము = తోక
- విద్యుత్పుంజం = మెరుపు తీగల సముదాయం
- పింగాక్షుడు = గోరోజనవర్ణం గల కన్నులు కలవాడు
- కాపురుషుడు = అల్పమానవుడు
- కెలసంబు = సేవ
- పుచ్ఛము = తోక
భీముని గర్వభంగం Summary in Telugu
కవి కాలాదులు
పాఠ్యభాగము : భీముని గర్వభంగం
గ్రహింపబడిన గ్రంథం : మహాభారతం – అరణ్యపర్వం 3వ ఆశ్వాసం నుండి గ్రహింపబడినది.
కవి : నన్నయ
కాలము : 11వ శతాబ్దము
నివాసము : రాజమహేంద్రవరము
బిరుదులు : ఆదికవి, వాగను (శబ్ద) శాసనుడు
ఆస్థానం : రాజరాజనరేంద్రుని ఆస్థానము
రచనలు :
- ఆంధ్ర మహాభారతం (ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వంలో 141వ పద్యం వరకు)
- ఆంధ్ర శబ్ద చింతామణి
- చాముండికా విలాసము (చౌడేశ్వరీ విలాసము)
- లక్షణసారము (ఛందస్సు)
- ఇంద్ర విజయము
- రాఘవాభ్యుదయము
విశిష్టత : అవిరళ జపహోమ తత్పరుడు, సంహితా భ్యాసుడు, నిత్య సత్యవ్రతుడు. తన భారతం ధర్మతత్త్వజ్ఞులకు ధర్మశాస్త్రంగా, వేదాంత విదులకు వేదాంతంగా ఇట్లా ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి అట్లాగే కనిపిస్తుందని చెప్పాడు.
పాఠ్యభాగ నేపథ్యం
ఉగ్రశ్రవసుడనువాడు సూతుడు. ఇతడు రోమహర్షిణి పుత్రుడు. వైశంపాయనుని వలన పుణ్యకథలను నేర్చుకొని శౌనకాది మహర్షులకు చెప్పాడు.
పాండవులు మాయాజూదంలో ఓడిపోయారు. జూద నియమం ప్రకారం 12 సం||రాలు అరణ్యవాసం మరియు ఒక సం సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఆ నియమం ప్రకారం పాండవులు ద్రౌపదితో కలసి అరణ్యాలకు వెళ్ళారు. హిమాలయాల లోని నరనారాయణుల తపోస్థానమైన బదరీవనం చేరుకొని కొంతకాలం గడిపారు. ఒకనాడు ద్రౌపదీ భీములు సమీపంలోనున్న గంధమాదన పర్వత సానువుల్లో విహరించారు.
వారు విహరిస్తున్న సమయంలో వేయిరేకులు కల్గిన ఒక తామరపువ్వు గాలి తాకిడికి వచ్చి ద్రౌపదీ భీముల ముందు పడింది. పరిమళభరితమైన ఆ పుష్పాన్ని చూచిన ద్రౌపది సంబరపడి, ఆ పుష్పం కావాలని భీముణ్ని ప్రేమతో అడిగింది. వెంటనే ఆ పుష్పం వచ్చిన దిక్కుకు బయలుదేరి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోనున్న ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. తన దారికి అడ్డంగా వచ్చిన ఏనుగుల్ని, సింహాల్ని విసరివైచాడు. అడ్డు వచ్చిన చెట్లను పీకి పారేశాడు. ఆ తర్వాత తన దారికి అడ్డంగా నున్న ముసలికోతితో తోక తియ్యమని ఆదేశించాడు. ప్రస్తుత పాఠ్యాంశము ముసలి కోతి (హనుమంతుడు)కి భీమునికి మధ్య జరిగిన సంభాషణ ఇది.
పాఠ్యభాగ సారాంశం
భీముడు చేసిన ఆ శంఖధ్వని దేవేంద్రుని పిడుగు యొక్క ధ్వని వలె భయానకమై దిగ్దిగంతరాలు. ఆకాశం క్రమ్మింది. అంతట ఆ పర్వతంలోని ఒక గుహలో శయనించి ఉన్న హనుమంతుడు అనే కోతి వేగంగా ఆ శంఖనాదం విని ఉలిక్కిపడ్డాడు. చక్కగా మేల్కొని “ఇది గొప్ప నాదం. మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తున్నది. ఇది నా సోదరుని శంఖారావమే” అని తలచాడు.
అంత భీముడు ముందుకు సాగిపోవటానికి వీలు లేకుండా హనుమంతుడు దారికి అటూ ఇటూ అడ్డంగా గొప్ప గొప్ప చెట్లని పెల్లగించి పడవేశాడు. ఇరుకై ఉన్న కాలిబాటకు అడ్డంగా హనుమ శయనించి తన తోకను వినోదంగా ఇటూ అటూ కదిలిస్తూ మాయ నిద్రలో మునిగిపోయాడు. యోగనిద్రలోనున్న ముసలికోతిని (హనుమంతుణ్ని) మేల్కొల్పే నెపంతో భయంకరంగా సింహనాదం చేశాడు.
ఆ సింహనాదం విని ఆంజనేయుడు మెల్లమెల్లగా నిద్రవీడి మేల్కొన్నాడు. ఆవులింతల వలన ఏర్పడిన నీటిచేత తడిసి కదిలే కన్నులు కలవాడై, భీముణ్ని నిర్లక్ష్యంగా చూచి ఈ విధంగా పలికాడు. ముసలితనంతోను మరియు అలసట చెంది నిద్రిస్తున్న నన్ను లేపావు. ఇది న్యాయమేనా? నీవు జనసంచారం లేని ఈ అడవికి ఎందుకు వచ్చావు ? అంత భీముడు “నేను ఇపుడొక పని మీద వెళ్ళుతున్నాను. నాకు దారి విడువుము” – అని పల్కగా
వెంటనే (హనుమంతుడు) ముసలికోతి తన తోకను తీసి పక్కన పెట్టి వెళ్ళుమని చెప్పాడు.
భీముడు తన ఎడమచేతితో ఆంజనేయుని తోకను కదుపలేకపోయినాడు. తర్వాత రెట్టింపు ఉత్సాహంతో తన బలాన్నంతా ఉపయోగించి రెండు చేతులు అమర్చి తోకను కదిలించ చూచాడు. ఆ తోకను కదల్చలేకపోయాడు. అతని దేహమంతా చెమట నీటి చేత తడిసిపోయింది. అప్పుడతడు అల్ప మానవుని వలె గర్వం వీడి విచారిస్తూ సిగ్గుతో తలవంచుకొని నిలిచాడు.
ఆ ముసలి కోతిని చూచి భీముఁడు మీరెవరో మహానుభావుల వలె ఉన్నారు. మీరెవరో దయచేసి నాకు చెప్పండి అని ప్రార్థించాడు. వెంటనే హనుమంతుడు తన నిజస్వరూపాన్ని చూపి, హిత వాక్యాలను బోధించి, సౌగంధిక పుష్పాలు దొరికే ప్రదేశానికి దారి చూపి భీముణ్ని పంపాడు.
నీతి : ఎంతటి గొప్ప వ్యక్తికైనా గర్వము పనికిరాదు. ఆ గర్వం ఉంటే పతనుడవుతాడు.
![]()
పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు
1వ పద్యం :
ఆ శంఖరవంబు మహేం
ద్రాశనినిర్దోష భీమమై దిక్కులు నా
కాశంబు నిండె ; నంత గు
హాశయుఁడై యున్న హనుమయను కపిపెలుచన్
ప్రతిపదార్థం :
ఆ-శంఖ, రవంబు = ఆ శంఖము నుండి వెలువడిన ధ్వని
మహా + ఇంద్ర + అశని = మహేంద్రాశని = దేవేంద్రుని పిడుగు యొక్క
నిర్దోష = పెద్ద ధ్వని వలె
భీమము + ఐ = భీమమై = భయానకమై
దిక్కులున్ = దిక్కులు
ఆకాశంబు = గగనం
నిండెన్ = నిండింది
అంత = అటు పిమ్మట
గుహాశయుడు+ఐ+ఉన్న = గుహాశయుడైయున్న = కొండగుహలో శయనించియున్న
హనుమ + అను = హనుమయను = హనుమంతుడనే
కపి = వానరుడు
పెలుచన్ = వేగంగా
తాత్పర్యం : భీముడు చేసిన ఆ శంఖ ధ్వని దేవేంద్రుని పిడుగు యొక్క ధ్వని వలె భయానకమై దిగ్దిగంతరాలు. ఆకాశం క్రమ్మింది. అంతట ఆ పర్వతంలోని ఒక గుహలో శయనించి ఉన్న హనుమంతుడు అనే కోతి వేగంగా
2వ పద్యం :
దానివిని బెదరిలేచి “మ
హానాదం బిది మనః ప్రియంబయ్యె ; మదీ
యానుజు శంఖధ్వానము
దానగు” నని యెఱిఁగి హృష్టతనురుహుఁడగుచున్
ప్రతిపదార్థం:
దాని, విని = ఆ భీముని శంఖ ధ్వని విని
బెదరి = తల్లడిల్లి ; (ఉలిక్కిపడి)
లేచి = మేల్కొని
మహానాదంబు + ఇది = మహానాదంబిది = ఇది గొప్ప శబ్దం
మనస్+ప్రియంబు+అయ్యే = మనః ప్రియంబయ్యె = మనసుకు ప్రీతి కొలిపింది
మదీయ + అనుజు = మదీయానుజు = నా తమ్ముని యొక్క
శంఖ ధ్వానము = శంఖము యొక్క ధ్వని
తాన్ + అగు = తానగు = అది నా తమ్ముడి యొక్క శంఖ ధ్వనియే
అని + ఎఱిగి = అనియెఱిగి = అని తెలిసికొని
హృష్ట = సంతోషం చేత
తనురుహుడు + అగుచున్ = తనురుహుఁడగుచున్ = నిక్కపొడిచిన వెంట్రుకలు కలవాడవుతూ
తాత్పర్యం : ఆ శంఖనాదం విని హనుమంతుడు ఉలిక్కిపడ్డాడు. చక్కగా మేల్కొన్నాడు. “ఇది గొప్ప నాదం. మనస్సుకు ప్రీతిని కలిగిస్తున్నది. ఇది నా సోదరుని శంఖారావమే” అని సంతోషంతో హనుమ రోమాంచ పులకిత దేహుడైనాడు.
3 వచనం :
భీమునకు మార్గ నిరోధంబుగా మహా వృక్షంబు లురులం ద్రోచి యేకాయన
పథంబున కడ్డంబుగా శయనించి లాంగూల లీలాచాలనంబుఁ జేసిన,
ప్రతిపదార్థం :
భీమునకు = భీముడికి
మార్గ నిరోధంబుగా = దారికి అడ్డంగా
మహా వృక్షంబులు = పెద్ద పెద్ద చెట్లు
ఉరులన్ + త్రోచి = ఉరులంద్రోచి = అడ్డుపడేటట్లు చేసి
ఏక + అయిన = ఏకాయన = ఒకరు నడవటానికి వీలై ఉన్న (ఇరుకైన)
పథంబునకు = కాలిబాటకు
అడ్డంబుగా = అవరోధంబుగా
శయనించి = పడుకొని
లాంగూల = తోకను
లీలా = వినోదంగా
చాలనంబున్ + చేసిన = చాలనంబుఁజేసిన = అటూ ఇటూ త్రిప్పుతూ కదిలిస్తూ ఉండగా
తాత్పర్యం : అంత భీముడు ముందుకు సాగిపోవటానికి వీలు లేకుండా హనుమంతుడు దారికి అటూ ఇటూ అడ్డంగా గొప్ప గొప్ప చెట్లను పెల్లగించి పడవేశాడు. ఇరుకై ఉన్న కాలిబాటకు అడ్డంగా హనుమ శయనించి తన తోకను వినోదంగా ఇటూ అటూ కదిలిస్తూ ఉండి.
![]()
4వ పద్యం :
కం|| | గోలాంగూలోత్తములాం
గూలస్ఫోటన రవంబు ఘోరంబై వా
చాలతఁ జేసి నశేషమృ
గాలి భయం బంద గిరి గుహాంతర మురలవ్
ప్రతిపదార్థం:
గోలాంగూల + ఉత్తమ = గోలాంగూలోత్తమ = కోతులలో శ్రేష్ఠుడైన వాని యొక్క
లాంగూల = తోకను
స్ఫోటన = అటూ ఇటూ వేగంగా కదిపేటటువంటి
రవంబు = ధ్వని
ఘోరంబు + ఐ = ఘోరంబై = భయానమై
అశేషమృగ + ఆలి = అశేషమృగాలి = సమస్త జంతువులును
భయంబు + అంద = భయంబంద = భయపడగా
గిరి = కొండ యొక్క
గుహా + అంతరము + ఉరులన్ = గుహాంతరమురులన్ = గుహల మధ్య భాగాలు సంచలించగా
వాచాలతన్ + చేసెన్ = వాచాలతఁజేసెన్ = అంతటా ప్రతిధ్వనించింది.
తాత్పర్యం : కోతులలో శ్రేష్ఠుడైన వాడి తోకను కదిలించే ధ్వని భయానకమై ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. కొండ గుహల మధ్య భాగాలు సంచలించాయి. సమస్త జంతువులు భయపడ్డాయి.
5 వచనం :
అయ్య పూర్వ ధ్వని విని భీముండు విస్మితుండై చని కదళీ షండ మధ్యంబున
నొక్క విశాల శిలాతలంబు పయి శయనించినవాని.
ప్రతిపదార్థం :
ఆ + అపూర్వ = అయ్యపూర్వ = అంతకు ముందు ఎప్పుడూ వినిపించనట్టి
ధ్వని = ఆ నాదం
విని = ఆలకించి
భీముండు = భీముడు
విస్మితుండు + ఐ = విస్మితుండై = ఆశ్చర్యపడి
చని = వెళ్ళి
కదళీ-షండ-మధ్యంబునన్ = అరటి తోపుల మధ్య
ఒక్క-విశాల-శిలా-తలంబుపయి = ఒక నిడివి అయిన పెద్ద బండరాతి మీద
శయనించిన వాని = పవ్వళించి ఉన్నవాడిని
తాత్పర్యం : ముందెన్నడూ వినని ఆ ధ్వనిని విని భీముడు ఆశ్చర్యం చెందాడు. అతడు అరటి తోపుల మధ్య ఒక నిడుపైన రాతిబండ మీద పవళించినవాడిని (హనుమను సమీపించాడు)
6వ పద్యం :
సీ|| హ్రస్వపీన గ్రీవు, నచలితాయత హను
నతి చపల స్వభావాభిరాముఁ
దను మధ్య కటి చక్రు, దహన కణాకార
తామ్రోష్టు, నతి కృశదశనకరజుఁ
బృథుల విద్యుత్పుం జపింగాక్షు, నుత్తుంగ
దృఢవక్షు, నా జాను దీర్ఘ బాహు
నూర్ధ్వలాంగూల మత్యున్నత ధ్వజలీలఁ
గ్రాలుచు నుండ నేకాంత యోగ
ఆ|| నిద్రనున్న ధర్మ నిర్మలు హనుమంతుఁ
జూచి పాండురాజ సుతుఁడు వాని
నిద్రఁ జెఱుపఁగడఁగి నిజసత్త్వమేర్పడ
సింహనాద మొప్పఁజేసెడాసి,
ప్రతిపదార్థం :
హ్రస్వగ్రీవున్ = పొట్టిది (బలిసినది అయిన కంఠ భాగం కలవాడిని)
అచలిత + ఆయత-హనున్ = అచలితాయతహనున్ = కదలని పొడుగాటి మీది దవడ కలవాడిని “అతి చపల స్వభావాభిరామున్”
అతి = మిక్కిలి
చపల = చంచలమైన
స్వభావ + అభిరామున్ = స్వభావాభిరామున్ = స్వభావం చేత అందగించినవాడిని
తను మధ్య కటి చక్రు = సన్నని నడుముతో కూడిన గుండ్రని మొలకలవాడిని
దహన – కణ + ఆకార
దహన – కణాకార = అగ్గిరవ్వవలె
తామ్ర + ఓష్ఠున్ = తామ్రోష్ఠున్ = ఎర్రనైన పెదవులు కలవాడిని
“అతి కృశ దశన కరజున్”
అతి = మిక్కిలి
కృశ = సన్ననైన
దశన = దంతాలు
కరజున్ = గోళ్ళు కలవాడిని
“పృథుల విద్యుత్పుంజ పింగాక్షు”
పృథుల = నిడివి అయిన
విద్యుత్ + పుంజ = విద్యుత్పుంజ = మెరుపు తీగల సముదాయం వంటి
పింగ + అక్షున్ = పింగాక్షన్ = గోరోజన వర్ణం కల కన్నులు కలవాడిని
“ఉత్తుంగ దృఢ వక్షున్”
ఉత్తుంగ = ఎత్తయినటువంటి
దృఢ = బలిష్ఠమైన
వక్షున్ = ఱొమ్ము కలవాడిని
“ఆజాను దీర్ఘ బాహున్”
ఆజాను = మోకాళ్ళ వరకు వ్యాపించిన
దీర్ఘ = పొడవైన
బాహున్ = చేతులు కలవాడిని
ఊర్ధ్వలాంగూలము = ఎత్తుగా నిక్కబొడిచిన తోక
అతి + ఉన్నత = అత్యున్నత = మిక్కిలి ఎత్తుగా ఉన్న
ధ్వజలీలన్ = జెండా వలె
క్రాలుచున్ + ఉండన్ = క్రాలుచునుండన్ = ప్రకాశిస్తుండగా
“ఏకాంత యోగ నిద్ర నున్న”
ఏక + అంత = ఏకాంత = తదేక ధ్యాన యోగమనే
నిద్రన్ + ఉన్న = నిద్రనున్న = గాఢమైన నిద్రలో ఉన్న
ధర్మ – నిర్మలు = ధర్మం చేత స్వచ్ఛమైన వాడిని
హనుమంతున్ = ఆంజనేయుడిని
చూచి = దర్శించి
పాండురాజు సుతుడు = పాండురాజు యొక్క పుత్రుడైన భీముడు
వాని నిద్రన్ = అతని నిద్రను
చెఱుపన్ + కడగి = చెఱుపఁగడఁగి = పోగొట్టటానికి పూని
డాసి = సమీపించి
నిజ-సత్త్వము + ఏర్పడ = నిజ – సత్త్వమేర్పడ = తన బలం తెలిసేటట్లుగా
సింహనాదము = సింహగర్జన వంటి పెద్ద ధ్వని
ఒప్పన్ = ఒప్పేటట్లు
చేసె = చేశాడు
తాత్పర్యం : పొట్టిగా బలిష్ఠంగా ఉన్న కంఠభాగం కలవాడిని, కదలనటువంటి పొడుగైన దవడ కలవాడిని, బొత్తిగా నిలకడలేని స్వభావం కలిగి ఉండడం చేత ముచ్చటగొలిపే వాడిని, సన్నటి నడుముతోడి గుండ్రని మొలకలవాడిని, నిప్పుకణం వలె ఎర్రనైన పెదవులు కలవాడిని, మిక్కిలి కృశించిన దంతాలు గోళ్ళు కలవాడిని, నిడివి అయి, మెరుపు తీగల దొంతర వలె గోరోజన వర్ణంతో భాసించే కన్నులు కలవాడిని, గాఢమైన ధ్యాన యోగనిద్రలో ఉన్నవాడిని, ధర్మం చేత నిర్మలమైన వ్యక్తిత్వం కలవాడిని, హనుమంతుడిని పాండురాజు పుత్రుడైన భీముడు చూసి అతని నిద్రను చెడగొట్టటానికి పూనుకొని, దగ్గరకు చేరి తన బలం వ్యక్తమయ్యేటట్లు గొప్పగా సింహనాదం చేశాడు.
![]()
7 వచనం :
హనుమంతుఁడును మెల్లమెల్లన మేల్కని జృంభ సంభృత జలార్ధ సంచల
విలోచనుండగుచు ననాదరంబున నాతనిం జూచి యిట్లనియె.
ప్రతిపదార్థం :
హనుమంతుఁడును = ఆంజనేయుడు
మెల్లమెల్లన = మెల్లమెల్లగా
మేల్కని = నిద్ర వీడి తెలివిని తెచ్చుకొని
“జృంభ, సంభృత, జలార్ధ సంచల విలోచనుండగుచున్”
జంభ సంభృత = ఆవులింతల చేత ఏర్పడిన
జల + ఆర్ద్ర – సంచల = జలార్ధ సంచల = నీటి చేత తడిసి,
విలోచనుండు + అగుచున్ = విలోచనుండగుచున్ = కదలేటటువంటి కన్నులు కలవాడు ఔతూ
న + ఆదరంబునన్ = నాదరంబునన్ = నిరాదరంతో లెక్క సేయక
ఆతనిన్ + చూచి = అతనింజూచి = వాడిని చూచి (ఆ భీముడిని చూచి)
ఇట్లు + అనియె = ఇట్లనియె = ఈ విధంగా చెప్పాడు.
తాత్పర్యం : (ఆ సింహనాదాన్ని విని) ఆంజనేయుడు మెల్లమెల్లగా నిద్ర వీడి మేలుకొన్నాడు. ఆవులింతల వలన ఏర్పడిన నీటి చేత తడిసి కదిలే కన్నులు కలవాడై, భీముడిని నిర్లక్ష్యంగా చూచి ఈ విధంగా పలికాడు.
విశేషం : నిద్ర నుండి మేల్కొనేటప్పుడు ఆవులింతలు ఏర్పడటం, కన్నుల నీరు క్రమ్మటం, కోతి కాబట్టి కదిలే కన్నులు కలిగి ఉండటం సహజం. ఈ వర్ణన “స్వభావోక్తి” అలంకారం.
8వ పద్యం :
తే॥ అతిజరారోగ భరమున నలసి యొలసి
యొదిఁగి సుఖనిద్రమై నిట్టులున్న వానిఁ
గడుమదంబున నేమియుఁగరుణ లేక
యేల బోధించి తయ్య ! నీ వెఱిఁగి యెఱిఁగి
ప్రతిపదార్థం :
“అతి జరారోగ భరమునన్”
అతి = మిక్కుటమైన
జరా = ముసలితనం యొక్కయు
రోగ వ్యాధుల యొక్కయు
భరమునన్ = బరువు త
అలసి + ఒలసి = అలసియొలసి = డస్సి ; (క్షీణించి)
ఒదిగి = అణిగి
సుఖ నిద్రమైన = గాఢనిద్రలో
ఇట్టులు + ఉన్నవానిన్ = ఇట్టులున్నవానిన్ = ఈ విధంగా ఉన్నవాడిని
కడు = మిక్కుటమైన
కాండ
మదంబునన్ = గర్వంతో
ఏమియున్+కరుణ-లేక = ఏమియుఁగరుణ-లేక = ఏ మాత్రమూ జాలి లేకుండా
నీవు = నీవు
ఎఱిఁగి + ఎఱిఁగి = ఎఱిఁగియెఱిఁగి = పూర్తిగా తెలిసిన వాడినై
ఏల = ఎందుకు
బోధించితి + అయ్య = బోధించితయ్య = నిద్ర మేల్కొల్పినావయ్యా !
తాత్పర్యం : మిక్కుటమైన ముసలితనం యొక్క, వ్యాధుల యొక్క బరువు వలన బడలి, అలసట చెంది అణిగి ఒక మూలకు ఒదిగి నిద్రిస్తున్నాను కదా ! ఇంచుకైనా జాలి లేకుండా నీవు మిక్కిలి గర్వంతో, తెలిసి తెలిసి ఎందుకు నా నిద్ర పాడుచేసి, మేలుకొలిపావయా ?
9 వచనం :
తిర్యగ్జాతులు ధర్మువెఱుంగవు గాక; సర్వభూతదయా స్వరూపంబైన ధర్ము వెఱింగెడు వారు మనుష్యులకారె ! యిట్టి మనుష్య జన్మంబు వడసి వృద్ధోపసేవ సేయవు గాకేమి ధర్ము వెఱుంగక నిర్దయుండవై మాబోఁటి పేద మృగంబులకు భయంబుగ గర్జిలితి ; వీవెవ్వండవు ? మనుష్య గోచరంబు గాని యివ్వనంబున కేల వచ్చితి ?. సిద్ధ గతిలేని వారి కిట వోవనశక్యం ; బమృత కల్పంబులైన యీ ఫలమూలంబు లుపయోగించి క్రమ్మఱుము ; నీయందు బద్ధ స్నేహుండఁ గాన సెప్పితి ; నా పలుకులు చేకొను” మనిన భీముండిట్లనియె.
ప్రతిపదార్థం :
తిర్యక్ + జాతులు = తిర్యగ్జాతులు = జంతువుల తెగలు
ధర్మువు + ఎఱుంగవు = ధర్మువెఱుంగవు = ధర్మాన్ని తెలియజాలవు
కాక = కాని
“సర్వభూతదయా స్వరూపంబైన”
సర్వ = సమస్తమైన
భూత = ప్రాణుల యందు
దయా – స్వరూపంబు + ఐన = దయా-స్వరూపంబైన = కరుణతో కూడిన
ధర్మువు + ఎఱింగెడువారు = ధర్మువెఱింగెడువారు = ధర్మాన్ని తెలిసినవారు
మనుష్యులు+అ+కారె = మనుష్యులకారె = మనుషులే కదా !
ఇట్టి = ఇటువంటి
మనుష్య = మనుష్యుని
జన్మంబు + పడసి = జన్మంబువడసి = పుట్టుకను పొంది
వృద్ధ + ఉపసేవ = వృద్ధోపసేవ = నీవు పెద్దలకు శుశ్రూష
చేయవు + కాక + ఏమి = చేయవుగాకేమి = చేయలేదా ఏమి ?
ధర్మువు + ఎఱుంగక = ధర్మువెఱుంగక = ఎటువంటి ధర్మాన్ని తెలియక
నిర్ + దయుండవు + ఐ = నిర్దయుండవై = దయలేనివాడివై
మాబోటి = మా వంటి
మృగంబులకు = అల్ప జంతువులకు
భయంబుగ = భీతి కల్గేటట్లు
గర్జిలితివి = పెద్ద కేక పెట్టావు
ఈవు + ఎవ్వండవు = ఈ వెవ్వండవు = నీవు ఎవ్వరివి ?
మనుష్య-గోచరంబు+కాని = మనుష్య-గోచరంబుఁగాని = మనుష్యులకు కన్పించనటువంటి
ఈ+వనంబునకు = ఇవ్వనంబునకు = ఈ అడవిలోనికి
ఏల-వచ్చితి ? = ఎందుకు వచ్చావు ?
సిద్ధ-గతి-లేనివారికి = అతిలోక శక్తుల వలన కలిగిన నడకలేని వారికి
ఇట + పోవన్ = ఇటవోవన్ = ఇక్కడ చరించటానికి
న + శక్యంబు = అశక్యంబు = సాధ్యం కాదు
అమృత – కల్పంబులు + ఐన = అమృత-కల్పంబులైన = అమృతంతో సమానాలైన
ఈ-ఫల-మూలంబులు = ఈ పళ్ళు, వేళ్ళు
ఉపయోగించి = ఆరగించి
క్రమ్మఱుము = మరలిపొమ్ము
నీ + అందు = నీ యందు = నీ యెడ
బద్ధ – స్నేహుండన్ + కాన = బద్ద స్నేహుండఁగాన = అనుసంధించబడిన నెయ్యం కలవాడిని కాబట్టి
బుద్ధి + చెప్పితి = బుద్ధి సెప్పితి = హితవును ఉపదేశించాను
నా పలుకులు = నా మాటలు
చేకొనుము = స్వీకరించుము (అనగా నేను చెప్పిన ప్రకారము చేయుము)
అనిన = అని పలుకగా
భీముండు = పాండురాజు కుమారుడైన భీముడు
ఇట్లు + అనియె = ఇట్లనియె = ఈ విధంగా చెప్పాడు
తాత్పర్యం : జంతువులకు ధర్మం తెలియదు కాని, సకల జీవుల యెడ దయ కలిగి ఉండటం అనే ధర్మం తెలిసిన వారు మనుష్యులు మాత్రమే కదా ! అటువంటి మనుష్య జన్మ లభించిన నీవు పెద్దలను ఉపాసించి మంచీ చెడూ తెలిసికోలేదా ఏమి? ధర్మం తెలిసికొనక జాలి లేని వాడివై మాబోటి అల్ప జంతువులు దద్దరిల్లేటట్లు ఎందుకు గర్జించావు ? నీవు ఎవరివి ? మనుష్యులు మసలని ఈ అడవికి ఎందుకు వచ్చావు ? అతిలోకమైన శక్తులు గల మనుష్యులు తప్ప ఈ అడవిలో మరి ఎవ్వరూ తిరుగలేరు. అమృతంతో సమానమైనవి ఈ పండ్లు. వేళ్ళు. వీటిని ఆరగించి మరలిపొమ్ము. నీ యందు నాకు మిక్కుటమైన నెయ్యం ఏర్పడింది కాబట్టి నీకు ఈ అని చెప్పగా హితవు చెప్పుతున్నాను. నేను చెప్పిన మాటల ప్రకారం చేయుము భీముడు ఈ విధంగా మారు పలికాడు.
![]()
10వ పద్యం :
తే॥ | క్షత్రియ ప్రవరుండ విఖ్యాతబలుఁడం
బాండు తనయుండ గొంతి గర్భంబు నందు
వాయు వరమునఁ బుట్టిన వాఁడ ; నన్ను
భీముఁడండ్రు భూ జనులు కపి ప్రభుండ !
ప్రతిపదార్థం:
కపి ప్రభుండ ! = కోతులలో నేత అయినవాడా !
క్షత్రియ ప్రవరుండ = క్షత్రియులలో శ్రేష్ఠుడిని
విఖ్యాత, బలుఁడన్ = బలం కలవాడిగా సుప్రసిద్ధుడిని
పాండు – తనయుండ = పాండురాజు కొడుకును
గొంతి-గర్భంబు నందు = కుంతీ దేవి కడుపున
వాయు-వరమునన్ = వాయుదేవుని వరాన
పుట్టినవాఁడ! = జన్మించిన వాడిని
భూజనులు = భూలోకంలోని ప్రజలు
నన్ను = నన్ను
భీముఁడు + అండ్రు = భీముఁడండ్రు = భీముడు అనే పేరుతో పిలుస్తారు.
తాత్పర్యం : కోతులకు నేత అయిన వాడా ! నేను క్షత్రియులలో శ్రేష్ఠుడిని, మహావీరుని సుప్రసిద్ధుడిని. పాండురాజ కుమారుడను. వాయుదేవుని వర ప్రభావంతో కుంతికి జన్మించినవాడిని. భూ ప్రజలు నన్ను భీముడు అనే పేరుతో పిలుస్తారు.
11 వచనం :
ఏ నిక్కడఁ గార్యార్థినై పోయెద; నాకుందెరువి; మ్మీనినాఁడు దొల్లి శత యోజన విస్తారంబయిన సముద్రంబు లంఘించి లంకకుం బోయిన హనుమంతునట్ల నిన్ను నీ పర్వతంబు లంఘించి పోదు ననిన హనుమంతుండతండేమి కారణంబున సముద్రలంఘనంబుఁజేసె ? నెఱుంగు దేనిం జెప్పు’ మనిన వానికి భీముండిట్లనియె.
ప్రతిపదార్థం :
ఏను = నేను
ఇక్కడన్ = ఇప్పుడు
కార్య + అర్థిని + ఐ = కార్యార్థినై = ఒకానొక ప్రయోజనాన్ని ఉద్దేశించిన వాడనై
పోయెద = వెళ్తున్నాను
నాకున్ + తెరువు + ఇమ్ము = నాకుందెరువిమ్ము = నాకు దారి ఇమ్ము
ఈని, నాఁడు = ఇవ్వని వేళ
తొల్లి = పూర్వం
శతయోజన = నూరామడల మేర
విస్తారంబు + అయిన = విస్తారంబయిన = వైశాల్యం కలిగిన
సముద్రంబు = సాగరాన్ని
లంఘించి = దాటి
లంకకున్ + పోయిన = లంకకుంబోయిన = లంకకు వెళ్ళిన
హనుమంతున్ + అట్ల = హనుమంతునట్ల = ఆంజనేయుని వలె
నిన్నున్ = నిన్ను
ఈ పర్వతంబు = ఈ కొండను
లంఘించి = దూకి
దాటి-పోదున్ = వెళ్ళగలను
హనుమంతుడు = ఆంజనేయుడు
అతండు = ఆ హనుమంతుడు
ఏమి కారణంబున = ఏ హేతువు చేత
సముద్రలంఘనంబున్ = సముద్రాన్ని దూకి దాటటం
చేసెన్ = చేశాడు ?
ఎఱుంగుదు + పని = ఎఱుంగుదేని = తెలిసినట్లయితే
చెప్పుము = చెప్పవలసింది
అనిన = అని చెప్పగా
వానికి = ఆ హనుమకు
భీముండు = భీముడు
ఇట్లు + అనియె = ఇట్లనియె = ఈ విధంగా చెప్పాడు
తాత్పర్యం : నేను ఇపుడొక పని మీద వెళ్ళుతున్నాను. నాకు దారి విడువుము. నీవు నాకు దారి విడువకపోతే, అలనాడు నూరామడ నూరామడల మేర విస్తారమైన కడలిని దూకి దాటి లంకకు వెళ్ళిన ఆంజనేయుడి వలె నేను నిన్ను ఈ కొండను అవలీలగా దూకి దాటి పోగలను అని చెప్పగా భీముడితో “ఏ కారణాన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడో నీకు తెలిస్తే తెలియజేయుము” – అనగా అతడికి భీముడు ఈ విధంగా చెప్పాడు.
12వ పద్యం :
కం ॥ అలఘుండిక్ష్వాకుమహా
కులవీరుఁడు రాఘవుండు గురువచనంబున్
సలుప వనవాసియై తన
లలనం గోల్పడియె నట్టె లంకేశ్వరు చేన్.
ప్రతిపదార్థం:
అలఘుండు = గొప్పవాడు (తేలిక కానివాడు)
ఇక్ష్వాకు, మహా, కుల, వీరుడు = ఇక్ష్వాకు మహారాజు యొక్క గొప్ప వంశంలోని శూరుడు
రాఘవుండు = రఘు వంశంలో జన్మించిన శ్రీరాముడు
గురువచనంబున్ = తండ్రిమాటను
సలుప = ఆచరించటానికి
వన-వాసి+ఐ = వన-వాసియై = అరణ్యంలో నివసించినవాడై
తన-లలనన్ = తన కాంతను (తన భార్యను)
లంకా + ఈశ్వరుచేన్ = లంకేశ్వరుచేన్ = లంకకు ప్రభువైన రావణుని చేత
కోల్పడియెన్ + అట్టె = కోల్పడియెనట్టె = పోగొట్టుకొన్నాడు కదా !
తాత్పర్యం : గొప్ప ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహాపురుషుడున్నూ రఘు మహారాజు వంశానికి చెందిన వాడున్నూ అయిన శ్రీరాముడు పితృ వాక్య పరిపాలనకై అరణ్యంలో నివసించి, తన భార్య అయిన సీతాదేవిని లంకకు అధిపతి అయిన రావణుని చేత పోగొట్టుకున్నాడు కదా !
13వ పద్యం :
కం॥ సీతాన్వేషణపరులై,
నీతిఁ గపిప్రవరు లరిగి నిరతంబుగ సం
పాతి యను పక్షిచేతమ
హీతనయ సువార్త లెల్ల
ప్రతిపదార్థం:
సీతా + అన్వేషణ = సీతాన్వేషణ = సీతను వెదకుట
పరులు + ఐ = పరులై = అట్టివారలై
నీతిన్ = మంచి ప్రవర్తనతో
కపి, ప్రవరులు = కోతుల నాయకులు
అరిగి = వెళ్ళి
నిరతంబుగ = స్థిరంగా
సంపాతి + అను = సంపాతియను = సంపాతి అనే పేరు కల పక్షి వలన
మహీ + తనయ = భూ పుత్రిక అయిన సీత యొక్క
సువార్తలు = క్షేమ సమాచారాలు
ఎల్లన్ = అన్నియు
ఎఱిగి = తెలిసి
కడంకన్ = పూనికతో
తాత్పర్యం: సీతను వెదకే ప్రయత్నంలో నీతి గల వానర నాయకులు ఆసక్తితో సాగిపోతూ సంపాతి అనే పక్షి సీత యోగక్షేమాలను గురించి చెప్పగా తెలిసికొని, పట్టుదలతో
![]()
14వ పద్యం :
కం॥ వారలు వారిధి గడవఁగ
నేరక తా రున్న యెడ ననిలసత్త్వమునన్
వారిధి లంఘించె మహా
వీరుఁడు హనుమంతుఁ డనఁగ విందుఁ గపీంద్రా !
ప్రతిపదార్థం :
కపి + ఇంద్రా = కపీంద్రా ! = వానరులలో శ్రేష్ఠుడివైనవాడా !
వారలు = వారు (ఆ కపి ప్రవరులు)
వారిధి = సముద్రాన్ని
కడవఁగనేరక = దాటలేక
తారు + ఉన్న + ఎడ = తారున్నయెడ = తాము ఉన్నప్పుడు
అనిల సత్త్వమునన్ = వాయువు యొక్క శక్తితో
మహావీరుఁడు = గొప్ప వీరుడు
హనుమంతుఁడు = ఆంజనేయుఁడు
వారిధి = సముద్రాన్ని
లంఘించె = దాటాడు
అనఁ గ = అని చెప్పగా
విందున్ = వింటుంటాను
తాత్పర్యం : కోతులలో శ్రేష్ఠుడివైన వాడా ! ఆ కోతుల నేతలు సముద్రాన్ని దాటలేక వారందరూ నిర్వేదంతో నిలిచి పోయినప్పుడు హనుమంతుఁడు వాయుదేవుని శక్తి వంటి శక్తితో సముద్రాన్ని లంఘించాడని వింటాను.
15 వచనం :
ఏను హనుమంతునంతియ బలపరాక్రమంబులు గలవాఁడ ; నా
పౌరుషంబుఁ జూపుదునే ? యనిన నవ్యక్త హాసముఖుం డగుచు “నన్నా ! యేను
ముదిసిన వాఁడ లేవ నోపం ; బోయెదవేని నా తోకం బాయంద్రోచిపొమ్మనిన
మెచ్చక తన వామకరంబున నెత్తంబోయి వశంబుగాక !
ప్రతిపదార్థం:
ఏను = నేను
హనుమంతును + అంతియ = హనుమంతునంతియ = ఆంజనేయుని అంత
బల-పరాక్రమంబులున్ + కలవాఁడ = బల పరాక్రమంబులుఁ గలవాఁడ = శక్తి శౌర్యాలు కలవాడిని
నా-పౌరుషంబున్ = నా పరాక్రమాన్ని
చూపుదును + ఏ = చూపుదునే = చూపాలా ?
అనినన్ = అని చెప్పగా
అవ్యక్త-హాస-ముఖుండు + + అగుచున్ = అవ్యక్త హాసముఖుండగుచున్ = పైకి కనిపించని నవ్వు ముఖంలో కలవాడౌతూ
అన్నా! = సోదరా !
ఏను = నేను
ముదిసినవాఁడ = ముసలివాడిని
లేవన్ + ఓపన్ = లేవనోపన్ = లేవలేను
పోయెదవు + ఏని = పోయెదవేని = వెళ్ళదల్చుకుంటే
నా తోఁకన్ = నా తోకను
పాయన్ + త్రోచి = పాయంద్రోచి = అవతలికి (ప్రక్కకు) నెట్టి
పొము = వెళ్ళుము
అనిన = అని చెప్పగా
మెచ్చక = లెక్కసేయక
తన, వామ, కరంబునన్ = తన యెడమ చేత్తో
ఎత్తన్ + పోయి = ఎత్తంబోయి = ఎత్తటానికి ప్రయత్నించి
వశంబున్ + కాక
వశంబుగాక = శక్యం కాక
తాత్పర్యం: నేను హనుమంతునితో సమానమైన శక్తి శౌర్యాలు కలవాడిని, నా పరాక్రమాన్ని ప్రదర్శించమంటావా ? అని భీముడు పలుకగా హనుమంతుడు చిరునవ్వును తన ముఖంలో పైకి కనిపించకుండా అణచుకొని, “అన్నా ! నేను ముసలివాడిని కదా ! లేవలేను. నీవు ముందుకే పోదలిస్తే దయచేసి నా తోకను కొద్దిగా అవతలికి నెట్టి వెళ్ళుము” – అని చెప్పగా భీముడు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తన ఎడమచేతితో తోకను నెట్టబోయి శక్యం కాక.
16వ పద్యం :
ఏపున రెండు చేతులను నిమ్ముగఁ బట్టి యమర్చి యెత్తఁగా
నోపక మొగ్గతిల్లఁబడి యుద్గతఘర్మజలార్ధదేహుఁడై
కాపురుషుండుఁ బోలె నిజగర్వము దక్కి యడంగి యుండెఁజిం
తాపరుఁడై వృకోదరుఁడు దద్దయులజ్జ నధోముఖంబుతోన్,
ప్రతిపదార్థం :
ఏపున = ఉత్సాహంతో
రెండు చేతులను = రెండు చేతులతో
ఇమ్ముగన్ + పట్టి = ఇమ్ముగఁబట్టి = బాగుగా పట్టుకుని
అమర్చి = అనుసంధించి
ఎత్తఁగాన్ + ఓపక = ఎత్తఁగానోపక = ఎత్తలేక
మొగ్గతిల్లన్ + పడి = మొగ్గతిల్లబడి = మొగ్గ వాలినట్లు వెల్లకిలబడి
ఉద్గత – ఘర్మ, జల + ఆర్ద్ర దేహుఁడు + ఐ = ఉద్గత ఘర్మజలార్ధ దేహుఁడై = వెలువడిన చెమట నీటితో తడిసిన శరీరం కలవాడై
కాపురుషుండున్ + పోలె = కాపురుషుండుఁబోలె = అల్పమానవునివలె
నిజ = తన యొక్క
గర్వము + తక్కి = గర్వము దక్కి = తన మదాన్ని వీడి
వృక + ఉదరుఁడు = వృకోదరుడు = భీముఁడు (తోడేలు పొట్ట వంటి కడుపు కలవాడు)
చింతాపరుఁడు + ఐ = చింతాపరుఁడై = దుఃఖించినవాఁడై
తద్దయు = మిక్కుటమైన
లజ్జన్ = సిగ్గుతో
అధస్ + ముఖంబుతోన్ = అధోముఖంబుతోన్ = క్రిందకు వాల్చిన ముఖంతో
అడంగి = అడకువతో
ఉండెన్ = ఉండినాడు
తాత్పర్యం : (భీముఁడు ఎడమ చేతితో ఆంజనేయుని తోకను కదుప లేక అటు తర్వాత) ఉత్సాహంతో తన బలాన్నంతా ఉపయోగించి రెండు చేతులు అమర్చి తోకను కదిలించ జూచాడు. కాని, ఆ తోకను కదల్చలేకపోయాడు. అతఁడి దేహమంతా చెమట నీటి చేత తడిసిపోయింది. అప్పుడతడు అల్పమానవుని వలె గర్వం వీడి విచారిస్తూ సిగ్గుతో తలవంచుకొని నిలిచాడు.
17 వచనం :
ఇట్ల క్కపివరు లాంగూలంబుఁ గదల్ప నోపక భీముండు కృతప్రణాముం
డయి ‘ని న్నెఱుంగక నా పలికిన దురుక్తంబులు సహింపవలయు; నీవు కపిరూప
ధరుండవైన సిద్ధుండవో, గంధర్వుండవో; దేవవరుండవో నా కెఱింగింపు మనిన
హనుమంతుండు భీముం జూచి నగుచు ‘నేను గేసరిక్షేత్రంబున వాయుభట్టారకునకుం
బుట్టిన వాఁడ; నీ చెప్పిన హనుమంతుండ; నీవు నా యనుజుండవు; దొల్లి
రఘుకులేశ్వరం డయిన రామ దేవుండు రావణుం డను రాక్షసుచేత నపహృతభార్యుండై
సుగ్రీవాది వానరుల నసంఖ్యాతసంఖ్యలవారిం దనకు సహాయులం జేసికొని
సేతుబంధనంబున సముద్రంబు లంఘించి సమరంబున రావణు వధియించి యందు
నా కెలసంబునకు మెచ్చి.
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా
ఆ + కపివరు = అక్కపివరు = కోతులలో శ్రేష్ఠుడైన ఆతని
లాంగూలంబున్ = తోకను
కదల్పన్ + ఓపక = కదల్పనోపక = కదల్చలేక
భీముండు = భీముడు
కృత-ప్రణాముండు+అయి = కృత ప్రణాముండయి = నమస్కరించినటువంటివాడై
నిన్ను + ఎఱుంగక = నిన్నెఱుంగక = నిన్ను గురించి తెలియక
నా పలికిన = నేను మాట్లాడిన
దుర్ + ఉక్తంబులు = దురుక్తంబులు = చెడ్డమాటలు
సహింపవలయు = ఓర్చుకోవాలి
నీవు = నీవు
కపి, రూప, ధరుండవు+ఐన = కపిరూపధరుండవైన = కోతి ఆకారాన్ని ధరించిన
సిద్ధుండవు + ఓ = సిద్ధుండవో = సిద్ధులకు చెందిన వేల్పవో
గంధర్వుడు ఓ = గంధర్వుండవో = గంధర్వుడివైన వేల్పవో
దేవ వరుండవు + ఓ = దేవవరుండవో = దేవతల శ్రేష్ఠుడివో
నాకు + ఎఱింగింపుము = నాకెఱింగింపుము = నాకు తెలియజెప్పుము
అనిన = అని అడుగగా
హనుమంతుండు = హనుమంతుడు
భీమున్ + చూచి = భీముంజూచి = భీముణ్ని చూచి
నగుచున్ = నవ్వుతూ
ఏను = నేను
కేసరి క్షేత్రంబును = కేసరి అనే వాడి భార్య అయిన అంజనాదేవికి (క్షేత్రము = ఆడది/భార్య)
వాయు భట్టారకునకున్ = పూజ్యుడైన వాయుదేవునకు
పుట్టినవాఁడు + అ = పుట్టినవాఁడ = జన్మించినవాడిని
నీ చెప్పిన = నీవు చెప్పినట్టి
హనుమంతుండన్ = హనుమంతుడిని
ఈవు = నీవు
నా + అనుజుండవు = నాయనుజుండవు = నాకు తమ్ముడివి
తొల్లి = పూర్వకాలాన
రఘు, కుల+ఈశ్వరుండు+అయిన = రఘుకులేశ్వరుండయిన = రఘు వంశానికి ప్రభువైన
రామ, దేవుండు = దేవుడైన శ్రీరాముడు
రావణుండు + అను = రావణుండను = రావణుడను పేరు గల
రాక్షసుచేతన్ = రాక్షసుని చేత
అపహృత, భార్యుండు+ఐ = అపహృతభార్యుండై = అపహరించబడిన భార్య కలవాడై
సుగ్రీవ + ఆది = సుగ్రీవాది = సుగ్రీవుడు మొదలైన
వానరులన్ = కోతులను
న+సంఖ్యాత, సంఖ్యల, వారిన్
అసంఖ్యాత సంఖ్యలవారిన్ = లెక్క పెట్టలేనంతమంది వానరులను
తనకు = తనకు
సహాయులన్ +చేసికొని సహాయులంజేసికొని = తోడుపడే వారినిగా చేసికొని
సేతుబంధనంబున = వారధి కట్టటం చేత
సముద్రంబు = కడలిని
లంఘించి = దాటి
సమరంబున = యుద్ధమందు
రావణు = రావణునిని
వధియించి = సంహరించి
అందు = ఆ యుద్ధంలో
నాకెలసంబునకు = నా సేవకు
మెచ్చి = సగౌరవంగా పొగడి
తాత్పర్యం : ఈ విధంగా ఆ కపివరుని తోకను కదల్చలేక, భీముఁడు అతనికి నమస్కరించి ఇట్లా నివేదించాడు. “నిన్ను తెలియక నేను మాట్లాడిన చెడ్డ పలుకులు క్షమించ ప్రార్థన. నీవు కోతి ఆకృతి తాల్చిన సిద్ధుడవో ! గంధర్వుడివో ! దేవశ్రేష్ఠుడివో! దయచేసి నాకు తెలుపుము” అంత హనుమంతుడు భీముణ్ని చూచి నవ్వుతూ “నేను కేసరి భార్య అయిన అంజనాదేవికి, పూజ్యుడైన వాయుదేవుని వరం వలన జన్మించిన వాడిని”. ఇంతకు ముందు నీవు పేర్కొనిన హనుమంతుడిని నేనే ! నీవు నా తమ్ముడివే! పూర్వకాలాన రఘు వంశంలో జన్మించిన ప్రభువు శ్రీరామదేవుడు రావణుడనే రాక్షసుడు తన భార్యను అపహరించగా, సుగ్రీవుడు మొదలైన లెక్కకు మించిన సంఖ్య గల వానరుల తోడ్పాటుతో వారధి కట్టి సముద్రాన్ని దాటి యుద్ధంలో రావణుని సంహరించి అందు నా సేవకు మెచ్చి (తరువాతి పద్యంతో అన్వయము)
![]()
18వ పద్యం :
మ॥ ‘నరసురస్తుత్యమై యెంతకాలంబు నా కీర్తి నిలుచు
నిరతంబుగా నంత కాలమున్ నీవు నిత్యుండ వగుచుఁ
బరఁగు’ మని వరముఁ దగ దయంజేసి ప్రభుఁ డుర్వి యెల్ల
సరిఁ బదునొక్కండు వేలయేం డ్లేలి చనియెఁ దా దివికి.’
ప్రతిపదార్థం:
నర, సుర, స్తుత్యము +ఐ = నరసురస్తుత్యమై = మనుష్యుల చేతను, దేవతల చేతను, పొగడబడినటువంటిదై
ఎంత కాలంబు = ఎంత సమయం
నా, కీర్తి = నా యశము
నిలుచు = నిలిచి ఉంటుందో
అంతకాలమున్ = అంత సమయం
నీవు = నీవు
నిరతంబుగాన్ = ఎడతెగకుండా
నిత్యుండవు + అగుచున్ = నిత్యుండవగుచున్ = చిరంజీవివి అవుతూ
పరఁగుము = శోభిల్లుము
అని = అని చెప్పి
వరమున్ = అనుగ్రహాన్ని
తగన్ = ఒప్పునట్లుగా
దయన్ + చేసి = దయంజేసి = దయతో ఇచ్చి
ప్రభుఁడు = శ్రీరామచంద్ర ప్రభువు
ఉర్విన్ + ఎల్ల = ఉర్వియెల్ల = భూమి అంతటిని
సరిన్-పదునొక్కండు-వేల ఏండ్లు = సమంగా పదకొండు వేల సంవత్సరాలు
ఏలి = పరిపాలించి
తాన్ = తాను
దివికి = స్వర్గానికి
చనియెన్ = వెళ్ళాడు.
తాత్పర్యం: నరుల చేత, దేవతల చేత నా కీర్తి ఎంతకాలం శ్లాఘించబడుతుందో అంతకాలం నీవు చిరంజీవివై భూమి మీద వర్ధిల్లుమని శ్రీరామచంద్ర ప్రభువు నాకు వరాన్ని అనుగ్రహించి, తాను పదకొండు వేల యేళ్ళు భూమిని పరిపాలించి స్వర్గాన్ని అలంకరించాడు.
విశేషం : వృత్త లక్షణం. మధ్యాక్కర వృత్తంలోని ప్రతి చరణంలోనూ వరుసగా రెండు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం, రెండు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం ఉంటాయి. అయిదవ గణం యొక్క మొదటి అక్షరంతో యతిమైత్రి, ప్రాస నియమం
పాటించబడుతుంది.
19 వచనం :
అనిన విని భీముండు వాని నప్పుడు హనుమంతుం గా వెలుగి సంతసిల్లి
వెండియు నమస్కరించి ‘భవద్దర్శనంబునం గృతార్థుండ నయితి’ నని యిట్లనియె.
ప్రతిపదార్థం:
అనిన = అని చెప్పగా
విని = ఆలకించి
భీముండు = భీమసేనుఁడు
వానిన్ = ఆ వానరుడిని
అప్పుడు = అపుడు
హనుమంతున్+కాన్+ఎఱింగి = హనుమంతుంగా నెఱింగి = హనుమంతుడిగా తెలిసికొని
సంతసిల్లి = సంతోషాన్ని పొంది
వెండియు = మళ్ళీ
నమస్కరించి = వందనం చేసి
భవత్+దర్శనంబునన్ = భవద్దర్శనంబునన్ = నిన్ను సందర్శించటం వలన
కృత+అర్జుండను = కృతార్థుండను = ధన్యుణ్ని
అయితిని = అయినాను
అని = అని పలికి
ఇట్లు + అనియె = ఇట్లనియె = ఈ విధంగా చెప్పాడు
తాత్పర్యం : అని చెప్పగా ఆలకించి, భీముడు ఆ వానరమే హనుమంతుడు అని తెలిసికొని, సంతోషాన్ని పొంది, అతడికి మళ్ళీ వందనం ఆచరించి, “నిన్ను చూడడం చేత ధన్యుణ్ని అయినాను” అని చెప్పి ఇట్లా పలికాడు.
20వ పద్యం :
‘బలిముఖుండ! దయయుఁ గలవేని దొల్లి య
ర్ణవము గడచి చనిననాఁటి నీదు
రూపుఁ జూడ వలతుఁ, జూపు నా’ కనవుడు
వాని కిట్టు లనియె వానరుండు
ప్రతిపదార్థం :
బలిముఖుండు+అ = బలిముఖుండ! = వానరుడవైన ఓ ఆంజనేయా !
దయయున్+కలవు + ఏని = దయయుఁ గలవేని = నీవు నా మీద దయ ఉన్న వాడివి అయితే
తొల్లి = పూర్వం
అర్ణవము = సముద్రాన్ని
కడచి = దాటి
చనిన = వెళ్ళిన
నాఁటి = ఆనాటి
నీదు రూపున్ = ని ఆకృతిని
చూడవలతున్ = చూడకోరుతాను
నాకున్ + చూపు = నాకుంజూపు = నాకు చూపించవలసింది
అనవుడు = అని పలుకగా
వానరుండు = హనుమంతుడు
వానికి = భీమునికి
ఇట్టులు + అనియె = ఇట్టులనియె = ఈ విధంగా చెప్పాడు
తాత్పర్యం : “వానరునిగా కన్పిస్తున్న ఓ ఆంజనేయా ! నా మీద నీకు దయ ఉన్నట్లయితే, దయచేసి అలనాడు నీవు సముద్రాన్ని దాటిన చూపించుము.” అని అడుగగా, ఆ వానరుడు భీమునికి ఇట్లా బదులు పల్కాడు.
21వ పద్యం :
కం॥ ‘అక్కాలంబున రూపం,
బిక్కాలమునందుఁ జూప నెట్లగుఁ ; గాలం
బొక్క విధంబున నుండక
పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్థన్.
ప్రతిపదార్థం :
ఆ + కాలంబున = అక్కాలంబున = ఆ సమయంలోని
రూపంబు = ఆకారం
ఈ + కాలమునందున్ = ఇక్కాలమునందున్ = ఈ సమయంలో
చూపన్ = ప్రదర్శించడం
ఎట్లు + అగున్ = ఎట్లగున్ = ఏ రీతిగా వీలవుతుంది ?
కాలంబు = కాలము
ఒక్క విధంబునన్ = ఒకే రీతిగా
ఉండక = ఉండక (అంటే మారుతూ)
పెక్కు ప్రకారంబులన్ = పలురీతులుగా
భిన్న + అవస్థన్ = భిన్నావస్థన్ = వేరు వేరు స్థితిగతులలో
ఉండు = ఉంటుంది
తాత్పర్యం : సముద్రాన్ని దాటే సమయంలోని ఆ ఆకారం ఈ సమయంలో ప్రదర్శించటం ఏ విధంగా వీలవుతుంది ? కాలం ఒకే రీతిగా ఉండదు. పలు విధాలుగా మార్పు చెందుతూ వేరు వేరు స్థితిగతులలో ఉంటుంది.
22 వచనం :
దానం జేసి కృత త్రేతా ద్వాపర కలియుగంబుల సంఖ్యలు వేఱు వేఱయై,
యందుల చరాచర భూతంబులు భిన్నప్రకారంబులై వర్తిల్లు’ ననిన ‘నయ్యై యుగంబుల
యాచార ప్రవర్తనంబులు నా కేర్పడం జెప్పు’ మనిన భీమునకు హనుమంతుం డిట్లనియె.
ప్రతిపదార్థం:
దానన్ + చేసి = దానంజేసి = ఆ కారణం చేత
“కృత త్రేతా ద్వాపర, కలియుగంబుల సంఖ్యలు”
కృత = కృతయుగం యొక్క
త్రేతా = త్రేతాయుగం యొక్క
ద్వాపర = ద్వాపరయుగం యొక్క
కలియుగంబుల = కలియుగం యొక్క
సంఖ్యలు = పరిమాణ సంఖ్యలు
వేఱు – వేఱు + ఐ = వేఱు – వేఱై = భిన్న భిన్నాలుగా
అందుల = ఆయా యుగాలలోని
చర + అచర – భూతంబులు = చరాచర-భూతంబులు = కదలనీ, కదిలేటి అనగా చేతనాచేతన పదార్థాలన్నీ
భిన్న – ప్రకారంబులు + ఐ = భిన్న – ప్రకారంబులై = వేరు వేరు పద్ధతులు కలవియై
వర్ధిల్లున్ = కొనసాగుతాయి
అనినన్ = అని చెప్పగా
అయ్యై = ఆయా
యుగంబుల = యుగాలలోని
ఆచార, ప్రవర్తనంబులు = అనుష్ఠానాలు, నడవడుల సంప్రదాయాలు
నాకున్ = నాకు
ఏర్పడన్ + చెప్పుము = ఏర్పడం జెప్పుము = విశదంగా తెలియజేయవలసింది
అనిన = అని అడుగగా
హనుమంతుడు = ఆంజనేయుడు
భీమునకు = భీమునకు
ఇట్లు+అనియె = ఇట్లనియె = ఈ విధంగా తెలిపాడు
తాత్పర్యం : ఆ కారణం చేత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం – వీటి పరిమితుల సంఖ్యలు భిన్నమైనవి. అట్లే ఆయా యుగాలలోని చేతనా చేతనాలు వేరు వేరు రీతులు కలిగి ప్రవర్తిల్లుతాయి. అని ఆంజనేయుడు బదులు పలుకగా భీముడు “ఆయా యుగాలలోని నడవడికల సంప్రదాయాలు, అనుష్ఠానాలు నాకు వివరించి చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత హనుమంతుడు భీమునికి ఇట్లా చెప్పాడు.
![]()
23వ పద్యం :
తే॥ | ‘కృతమ కాని కర్తవ్యంబు గృతయుగంబు
నందు లేదు; చతుష్పాద మగుచు ధర్మ
మనఘ ! వర్తిల్లు; నచ్యుతుం డయ్యుగమున
శుక్లవర్ణుఁడై ప్రజలఁ గాచుచు వెలుంగు.
ప్రతిపదార్థం :
కృతమ + అ, కాని = కృతమకాని = చేయబడినదే కాని
కర్తవ్యంబు = చేయవలసినది
కృతయుగంబున + అందు = కృతయుగంబునందు = కృతయుగంలో
లేదు = లేదు
అనఘ ! = ఓ పాప రహితుడివైన వాడా !
ధర్మము = ధర్మువు
చతుః +పాదము+అగుచు = చతుష్పాదమగుచు = నాలుగు పాదాలు కలిగినటువంటిది అవుతూ
వర్తిల్లున్ = జరుగుతుంది
ఆ + యుగము = అయ్యుగమున = ఆ యుగంలో
అచ్యుతుండు = విష్ణుదేవుడు
శుక్లవర్ణుఁడు + ఐ = శుక్లవర్ణుఁడై = తెల్లటి రంగు కలవాడై
ప్రజలన్ = ప్రజలను
కాచుచు = సంరక్షిస్తూ
వెలుంగు = ప్రకాశిస్తాడు
తాత్పర్యం : పాప రహితుడివైన ఓ భీమసేనా ! కృతయుగంలో చేయటమే గాని చేయవలసినటువంటిది లేదు. ధర్మం నాలుగు పాదాలలో వర్తిస్తుంది. విష్ణుదేవుడు యుగంలో తెల్లటిరంగు కలవాడై ప్రజలను కాపాడుతూ వెలుగొందుతుంటాడు.
విశేషం : కృతయుగంలో నిర్వహించవలసిన కర్తవ్యాలను నూటికి నూరుపాళ్ళు అందరూ నిర్వహిస్తారు. కాబట్టి చేయబడనటువంటి కర్తవ్యమే ఆ యుగాన ఉండదని చెప్పబడింది. అందుచేత ధర్మం నాలుగు పాదాలతో వర్తిల్లుతుంది. నాలుగు పాదాలంటే నూటికి నూరుపాళ్ళు. అంటే 1 లో నాల్గవ వంతు. నేటి పరిభాషలో 1/4 = 25%.
24వచనం :
అది సనాతనధర్మసనాథం; బందుల బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రు
లేకవేదక్రియాయోగ్యులై యకామ ఫలసంయోగంబునఁ బుణ్యలోకంబులు వడయుదు;
రందు నసూయాభిచార దర్పపైశున విగ్రహక్రోధమదమత్సర భయ సంతాప వ్యాధి
ప్రజాక్షయేంద్రియక్షయంబులు లేవు; మఱియుఁ ద్రేతాయుగంబునందుఁ ద్రిపాదంబై
ధర్మువు వర్తిల్లు; నందు జనులు నిత్యసత్యవ్రతశీలురై యజ్ఞతపో దానాది క్రియల
వర్తింతు; రందు రక్తవర్ణుండయి విష్ణుభట్టారకుండు ప్రజారక్షణంబుఁ జేయు.
ప్రతిపదార్థం :
అది = ఆ కృతయుగం
సనాతన-ధర్మ-సనాథంబు = శాశ్వతమైన ధర్మంతో గూడి ఉండి నటువంటి
అందుల = ఆ యుగంలో
బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు = బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు
ఏక-వేద, క్రియా-యోగ్యులు+ఐ = ఏకవేద క్రియా యోగ్యులై = ఒకే విధమైన వేదం నిర్దేశించిన కార్యాలను చేయడానికి తగిన అర్హత కలవారై
న+కామ, ఫల, సంయోగం = అకామ ఫల సంయోగంబునన్ = కోరుకోకుండా సంక్రమించే ఫలాల చేత కూడుకొనే వారు అవటం చేత
పుణ్య-లోకంబులు = ఉత్తమగతులు
పడయుదురు = పొందగలరు
అందున్ = ఆ కృతయుగంలో
అసూయ + అభిచార = అసూయాభిచార = మంచి గుణాలతో దోషాలను ఆరోపించటం, శత్రువులపై ద్వేషంతో చేసే మంత్ర కర్మలు
దర్ప = డాంబికత్వం
పైశువ = లోభం
విగ్రహ = కలహం
క్రోధ = కోపం
మద = గర్వం
మత్సర = ఓర్వలేమితనం
భయ = వెరపు
సంతాప = దుఃఖం
వ్యాధి = రోగం
ప్రజాక్షయ+ఇంద్రియ-క్షయంబులు = ప్రజాక్షయేంద్రియక్షయంబులు = జన నాశనం, ఇంద్రియ శక్తుల వినాశనాలు
లేవు = ఉండవు
మఱియున్ = ఇంకను
త్రేతాయుగంబున + అందున్ = త్రేతాయుగంబునందున్ = త్రేతాయుగాన
ధర్మువు = ధర్మం
త్రి-పాదంబు+ఐ = త్రిపాదంబై = మూడు పాదాలు కలదై
వర్తిల్లున్ = మనగలదు (వర్తిల్లుతుంది)
అందు = ఆ త్రేతాయుగంలో
జనులు = ప్రజలు
నిత్య, సత్య, వ్రత, శీలురు + ఐ = నిత్య సత్య వ్రతశీలురై = ఎల్లప్పుడూ నిజం చెప్పటంలో నిష్ఠకలవారై
యజ్ఞ-తపస్+దాన+ఆది-క్రియలన్ = యజ్ఞ తపోదానాది క్రియలన్ = యజ్ఞాలు, తపస్సు, దానాలు చేయటం మొదలైన కార్యాలలో
వర్తింతురు = ప్రవర్తిస్తూ ఉంటారు
అందు = ఆ త్రేతాయుగంలో
రక్త-వర్ణుండు+అయి = రక్తవర్ణుండయి = ఎర్రటి రంగు కలవాడై
విష్ణుభట్టారకుండు = పూజ్యుడైన విష్ణుదేవుడు
ప్రజా-రక్షణంబున్+చేయు = ప్రజా రక్షణంబుఁజేయు = జనులను కాపాడతాడు
తాత్పర్యం : ఆ కృతయుగం శాశ్వత రూపమైన ధర్మంతో కూడి ఉంటుంది. అందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒకే విధమైన వేదం ఆదేశించే కార్యాలను ఆచరించే యోగ్యత కలవారై ఉంటారు. వారికి కోరికలు లేకుండగానే సంక్రమించే ఫలాల వలన ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఆ యుగంలో దుర్గణ విజృంభణ ఉండదు. మంచి గుణాలకు చెడు ఉద్దేశ్యాలు ఆరోపించబడవు. శత్రువులపై పగ తీర్చుకొనటానికి మంత్ర తంత్ర కర్మలు జరుగవు. డాబు, పిసినిగొట్టుతనం, కలహ స్వభావం, కోపం, గర్వం, ఓర్వలేనితనం, వెఱపు, దుఃఖం, రోగం, ప్రజానాశనం, ఇంద్రియపటుత్వం తగ్గటం ఉండవు. ఇంకా త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలతో ప్రవర్తిల్లుతుంది. అందులో జనులు ఎల్లప్పుడూ నిజం చెప్పటం అనే నిష్ఠతో ఉంటారు. యజ్ఞాలు, తపస్సు, దానం మొదలైన పుణ్య కార్యాలను చేయటంలో ప్రజలు ఆసక్తి కలవారౌతారు. ఆ త్రేతాయుగంలో పూజనీయుడైన విష్ణుదేవుడు ఎర్రటి రంగు కలవాడై ప్రజలను కాపాడుతాడు.
25వ పద్యం :
తే॥ | ద్వాపరంబున రెండు పాదములఁ జేసి
గు నడుచు ధర్మువు వేదముల్ నాల్గుదెఱఁగు
లై ప్రవర్తిల్లు వేదశాస్త్రార్థ చోది
తంబులై ధర్మకామముల్ ధరణిఁ బరఁగు
ప్రతిపదార్థం:
ద్వాపరంబున = ద్వాపరయుగంలో
ధర్మువు = ధర్మం
రెండు పాదములన్ +చేసి = రెండు పాదములఁజేసి = రెండు పాదాలతో
నడుచు = వర్తిల్లుతుంది
వేదముల్ = వేదాలు
నాల్గు, తెఱఁగులు + ఐ = నాల్గుతెఱఁగులై = నాలుగు తీరులై
ప్రవర్తిల్లు = నడుస్తాయి
వేద శాస్త్ర+అర్థ-చోదితంబులు +ఐ = వేదశాస్త్రార్థ చోదితంబులై = వేదాల యొక్క శాస్త్రాల యొక్క పరమార్థం చేత నడుపబడినవై
ధర్మ-కామముల్ = ధర్మము, కామము
ధరణిన్ = భూమిపై
పరుగు = విలసిల్లుతాయి
తాత్పర్యం : ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాల నడుస్తుంది. వేదాలు నాలుగు తెరగులుగా ప్రవర్తిల్లుతాయి. వేదాలలోను, శాస్త్రాలలోను ప్రతిపాదించబడిన భావాల చేత నడుపబడి ధర్మకామాలు విలసిల్లుతాయి.
26వ పద్యం :
తే ॥ సత్యశమహీను లగుదురు జనులు గామ
కాములై చేయుదురు బహుక్రతువు లోలి;
నందుఁ దైలోక్యవందితుం డచ్యుతుండు
కృష్ణవర్ణుఁడై జగము రక్షించు మఱియు.
ప్రతిపదార్థం :
జనులు = ప్రజలు
సత్య, శమ-హీనులు + అగుదురు = సత్యశమహీనులగుదురు = నిజము పలకటమున్నూ, మనస్సు మొదలగు అంతరింద్రియాల నిగ్రహమున్నూ లేనివారవుతారు.
కామ-కాములు+ఐ = కామకాములై = కోరికలను కోరేవారై
బహు, క్రతువులు = పెక్కు యాగాలు
చేయుదురు = చేస్తారు
అందున్ = ఆ ద్వాపరయుగంలో
త్రైలోక్య, వందితుండు = మూడు లోకాల చేత నమస్కరించబడేవాడు
అచ్యుతుండు = విష్ణువు (శ్రీకృష్ణుడు)
కృష్ణవర్ణుడు+ఐ = కృష్ణవర్ణుడై = నల్లటి రంగు కలవాడై (నీలవర్ణం కలవాడై)
జగము = లోకాన్ని
రక్షించు = కాపాడుతాడు
మరియు = ఇంకను (తరువాతి పద్యంతో అన్వయం)
తాత్పర్యం : ప్రజలు నిజము మాట్లాడడమూ, మనస్సు మొదలగు అంతరింద్రియాల నిగ్రహమును లేనివారై మిక్కిలి కోరికలతో పెక్కు యాగాలు చేస్తారు. అప్పుడు ద్వాపరయుగంలో విష్ణువు నల్లటి విషువు నలటి రంగు కలవాడె లోకాన్ని కాపాడుతాడు.
![]()
27వ పద్యం :
క కలియుగమునందు ధర్మము
బలమఱి వర్తిల్లు నేకపాదంబున; నం
దలఘుఁడు కృష్ణుఁడు జగతీ
కలవాడై లోకాన్ని కాపాడుతాడు.
వలయము రక్షించుఁ బీతవర్ణుం డగుచున్.
ప్రతిపదార్థం:
కలియుగమున +అందు = కలియుగమునందు = కలియుగంలో
ధర్మము = ధర్మువు
బలము + అఱి = బలమఱి = శక్తి నశించి
ఏకపాదమునన్ = ఒకే చరణంతో
వర్తిల్లున్ = నశిస్తుంది
అందు = ఆ కలియుగంలో
న + లఘుఁడు = అలఘుఁడు = తేలిక గాని వాడు అనగా గొప్పవాడు
కృష్ణుఁడు = విష్ణుదేవుఁడు
పీత-వర్ణుండు+అగుచున్ = పీతవర్ణుడగుచున్ = పసుపు రంగు కలవాడై
జగతీ-వలయము = సృష్టి మండలాన్ని
రక్షించున్ = కాపాడుతాడు
తాత్పర్యం : ఆ కలియుగంలో ధర్మం శక్తి తగ్గి ఒకే చరణాన నడుస్తుంది. అప్పుడు విష్ణుదేవుఁడు పసుపురంగు కలవాడై ప్రపంచాన్ని కాపాడుతాడు.
28 వచనం :
అందుల జనులు తమోగుణ యుక్తులై కామక్రోధాది దోషవశంబునం
దమ్మెఱుంగక యధర్మవర్తు లగుదు, రందుఁ జేసిన తపోదానాది కర్మంబులు
స్వల్పంబులయ్యును బహుఫలంబు లగు’ నని యుగవర్తన ప్రకారంబులఁ జెప్పి, ‘నీ
కిష్టావాప్తి యయ్యెడు, నరుగు’ మనిన భీముం డిట్లనియె.
ప్రతిపదార్థం :
అందుల జనులు = ఆ కలియుగంలోని ప్రజలు
తమస్+గుణ = తమోగుణ = తమోగుణం
యుక్తులు + ఐ = యుక్తులై = కలవారై
కామ-క్రోధ+ఆది-దోషవశంబునన్ = కామ క్రోధాది దోషవశంబునన్ = కోరికలు, కోపం హెచ్చు అవటం మొదలగు ఆరు విధాలైన తప్పుల మూలాన (అరిషడ్వర్గాలనే దోషాలకు వశులై ఉండటం వలన)
తమ్ము + ఎఱుంగక = తమ్మెఱుంగక = తమను తాము తెలిసికొనక
న + ధర్మ-వర్తులు = అధర్మవర్తులు = అధర్మానికి లోబడినవారు
అగుదురు = అవుతారు
అందున్ = ఆ కలియుగంలో
చేసిన = ఆచరించిన
తపస్ + దాన ఆది – కర్మంబులు = తపోదానాది కర్మంబులు = తపస్సు, త్యాగబుద్ధితో ఇతరులకు ఉపకారం చేయటం మొదలైన పనులు
స్వల్పంబులు+అయ్యును = స్వల్పంబులయ్యును = తక్కువ అయినప్పటికీ
బహు ఫలంబులు = హెచ్చు ఫలితాలను ఇచ్చేటటువంటివి
అగున్ = కాగలవు
అని = ఈ ప్రకారంగా
యుగ, వర్తన, ప్రకారంబులన్ = యుగాలు నడిచే రీతులను
చెప్పి నీకు+ఇష్ట+అవాప్తి = నీకు అభిమతం చేకూరటం
అయ్యెడున్ = అవుతుంది
అరుగుము = వెళ్ళుము
భీముండు = భీముడు
ఇట్లు + అనియె = ఇట్లనియె = ఈ విధంగా చెప్పాడు
తాత్పర్యం : “ఆ కలియుగంలోని జనులు కోరికలు, కోపం మొదలైన ఆరు దుర్గుణాలను (అరిషడ్వర్గాలను) పెంచుకొని, తమను తాము తెలిసికొనలేని ఆవేశం కలిగి అధర్మమార్గంలో వర్తిల్లుతారు. కాని, ఆ కలియుగంలో చేసిన తపం, దానం మొదలైన సత్కార్యాలు స్వల్పమైన వైనా హెచ్చు ఫలాలను ఇస్తాయి’ హనుమంతుడు ఆయా యుగాలు ప్రవర్తించే తీరు తెన్నులు తెలియజెప్పి “నీ అభీష్టం నెరవేరుతుంది వెళ్ళు”మని పలుకగా భీముడు ఇట్లా అన్నాడు.
విశేషం: ఇందులో తమోగుణ ప్రస్తావన ఉంది. సత్త్వము – రజస్సు – తమము అను మూడు గుణాలు. ఈ జగత్తు త్రిగుణ సమ్మేళనంగా అభివర్ణితం. వీటికి శక్తులు అని కూడా నామాంతరం ఉంది. భగవద్గీతలో సత్త్వరజస్తమోగుణాలను గురించిన సవిస్తరమైన వివరణ ఉంది. స్థూలంగా సత్త్వం అంటే మంచితనం. అహింసాదాన ధర్మ దయా నిగ్రహ ప్రవృత్తి. రాజసం అంటే తీవ్రత, ఆటోపం, బలం మొదలైన గుణాల ఉత్కర్ష. తామసం అంటే దుర్జనత్వం. హింసా క్రౌర్య ఆజ్ఞానాల విజృంభణం అని చెప్పవచ్చును.
ఇంతటితో భీమునకు హనుమంతుడు చతుర్యుగా చార వర్తనాలను తెల్పెను.
![]()
29వ పద్యం :
కం॥ ‘నీ నాఁటి తనువుఁ జూచియ
కాని యవశ్యంబు పోవఁ; గావునఁ గపినా
థా ! నాకుఁ జూపు’ మనవుడు
వానికిఁ దనరూపుఁ జూపె వానరుఁ డంతన్.
ప్రతిపదార్థం :
నీ, నాటి, తనువున్ = నీ యొక్క అలనాటి దేహాన్ని అంటే ( నీవు అలనాడు సముద్రాన్ని లంఘించినప్పటి నీ దేహాన్ని)
చూచియ-కాని = దర్శించిన తరువాతే కాని;
అవశ్యంబు, పోవన్ = నిశ్చయంగా వెళ్ళను
కావునన్ = కాబట్టి
కపినాథా ! = ఓ వానర శ్రేష్ఠుడా !
నాకున్+చూపుము = నాకుఁజూపుము = నాకు ప్రదర్శించుము గ (అలనాటి నీ నిజ స్వరూపాన్ని)
అనవుడు = అని చెప్పగా
వానరుఁడు = హనుమంతుడు
అంతన్ = అంతట
వానికిన్ = ఆ భీమునికి
అని చెప్పగా భీముడు
తన రూపున్ = తన ఆకారాన్ని
చూపెన్ = చూపించాడు
తాత్పర్యం : “ఓ వానర శ్రేష్ఠుడా ! నీవు పూర్వకాలాన ఆనాడు సముద్రాన్ని లంఘించిన నాటి నీ నిజ స్వరూపాన్ని చూడనిదే నేను నిశ్చయంగా ఇక్కడి నుండి కదిలి వెళ్ళను. కాబట్టి నీవు దయచేసి నాకు నీ నిజ స్వరూపాన్ని చూపించవలసింది” – అని భీముడు ప్రార్థించాడు. అంత హనుమంతుడు భీమునికి తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు.
30వ పద్యం :
చం|| అతులితమై ద్వితీయ కనకాద్రి యొకో యిది నా నిజాంగ మూ
ర్జితముగఁ బెంచి పుచ్ఛమునఁ జేసి దిగంతము లందుచున్న యు
న్నతుఁ గపినాథుఁ జూచి కురునందనుఁ డఫ్టు నిమీలితాక్షుఁ డై
మతి నతివిస్మితుం డగుచు మారుతి కిట్లనియెన్ భయంబునన్.
ప్రతిపదార్థం :
ఇది = ఈ స్వరూపము
అతులితము + ఐ = అతులితమై = సాటిలేనటువంటిదై
ద్వితీయ = రెండవ
కనక+అద్రి+ఒకో! = కనకాద్రియొకో = బంగారు కొండ అగునా ? (రెండవ మేరు పర్వతమా !)
నాన్ = ఇది అన్నట్లుగా
నిజ + అంగము = నిజాంగము = తన శరీరం
ఊర్జితముగన్ = ఎక్కువగా
పెంచి = పెరిగేటట్లుగా చేసి
పుచ్ఛమునన్ + చేసి = పుచ్చమునఁజేసి = తోకతో
దిక్ + అంతములు = దిగంతములు = దిక్కుల చివరి కొసలు
అందుచున్న = తాకుచున్న
ఉన్నతున్ = ఎత్తయినవాడిని
కపినాథున్ = వానరులలో శ్రేష్ఠుడైనవాడిని
చూచి = చూచి
కురునందనుఁడు = కురువంశంలో పుట్టిన భీముడు
అప్డు = అపుడు
నిమీలిత + అక్షుడు + ఐ = నిమీలితాక్షుడై మతిన్ = మూతలు పడిన కన్నులు కలవాడై
మతిన్ = మనస్సులో
అతి విస్మితుండు+అగుచున్ = అతితుడగుచున్ = మిక్కిలి ఆశ్చర్యం చెందినవాడె
భయంబునన్ = భయంతో
మారుతికి = హనుమంతునితో
ఇట్లు+అనియెన్ = ఇట్లనియెన్ = ఈ రీతిగా అన్నాడు
తాత్పర్యం : సాటి లేనటువంటి ఈ రూపం రెండవ అయిన మేరు పర్వతమా! అనిపించేటట్లుగా తన శరీరాన్ని పెద్దగా పెంచి, తోకతో దెసల కొసలు తాకుతున్న హనుమంతుడి ఎత్తయిన నిజ స్వరూపాన్ని చూచి, కురువంశ కుమారుడైన భీముడు కన్నులు మూసికొని, మనస్సులో మిగుల ఆశ్చర్యపడుతూ భయంతో మారుతికి ఇట్లా విన్నవించుకున్నాడు.
31వ పద్యం :
కం ॥ ‘అతిభీషణ మిది యత్య
ద్భుత మోహెూ ! చాలు; భూనభోమధ్యవ్యా ర
పిత మయ్యె భవద్దేహా
యతత్వ ముపసంహరింపు’ మనవుడుఁ గపియున్.
ప్రతిపదార్థం:
అతి-భీషణము+ఇది = అతిభీషణమిది = ఇది మిక్కిలి భయం (వెఱపు) కొలిపేటటు వంటిది)
అతి + అద్భుతము = అత్యద్భుతము = మిక్కిలి ఆశ్చర్యం గొలిపేటటువంటిది
ఓహో ! = ఎంత ఆశ్చర్యకరం
చాలు = ఇక అవసరం లేదు
భూ-నభస్-మధ్య = భూనభోమధ్య = భూమికి, ఆకాశానికి మధ్య స్థలంలో
వ్యాపితము + అయ్యె = వ్యాపితమయ్యే = అంతా విస్తరించింది
భవత్+దేహ +ఆయతత్వము = భవద్దేహాయతత్వము = నీ శరీరం యొక్క నిడివి
ఉపసంహరింపుము = ఇక విరమించుము
అనవుడు = అని చెప్పగా
కపియున్ = ఆంజనేయుడున్నా; (తర్వాతి పద్యంతో అన్వయము)
తాత్పర్యం: భూమికి, ఆకాశానికి మధ్య అంతా నీ శరీరం విస్తరించి ఉన్నది. మిక్కిలి భయం ఆశ్చర్యం కలిగించేటటువంటి నీ రూపం విడిచి విరమించుము అని చెప్పగా ఆంజనేయుడూ,
32వ పద్యం :
తన యెప్పటి రూపముఁ జే
కొని ‘దీనికి నినుమడుం గగుం బ్రతిబలముం
-గనినప్పుడు నా రూపం
బనుపమముగ ననిన హనుమ కనిలజుఁ డనియెన్.
ప్రతిపదార్థం :
తన+ఎప్పటి రూపమున్ = తన యెప్పటి రూపమున్ = తనకు ఎప్పుడూ ఉండే ఆకృతిని
చేకొని = స్వీకరించి
దీనికిన్ = నీవు ఇప్పుడు చూచినటువంటి నా ఆకారానికి
నా రూపంబు = నా ఆకారం
ప్రతి బలమున్ = శత్రు సేనలను
కనినప్పుడు = చూచినప్పుడు
అనుపమముగన్ = పోలికలేనట్లుగా
ఇనుమడంగు + అగున్ = ఇనుమడంగగున్ = రెండు రెట్లు హెచ్చు కాగలదు.
అనిన = అని చెప్పగా
హనుమకు = ఆంజనేయునితో
అనిలజుఁ డు = వాయు పుత్రుడైన భీముడు
అనియెన్ = చెప్పాడు.
తాత్పర్యం: హనుమంతుడు తాను ఎప్పుడూ ధరించే ఆకారాన్ని తిరిగి పొందాడు. “శత్రు బలాన్ని చూచినపుడు నా ఆకారం నీవు చూసిన దానికి రెండింతలు పెరుగుతుంది. ఆ ఆకారానికి పోలికే లేదు సుమా ! అని చెప్పాడు. అంత భీముడు ఆంజనేయునికి ఇట్లా బదులు పలికాడు.
33వ పద్యం :
ఉ ॥ ‘ఉన్నతిఁ బూని నీవు బలియుం డగు రావణు నశ్రమంబునం
బన్నుగఁ జంపనోపు పటుబాహుబలాఢ్యుండ విట్టియున్నతున్
నిన్ను సహాయుఁగా బడసి నిర్మలనీతిపరుండు రాఘవుం
డన్నరభోజనాన్వయుల నాజి వధించుట యేమి చోద్యమే ?’
ప్రతిపదార్థం:
ఉన్నతిన్ + పూని = ఉన్నతిఁబూని = గొప్పతనం వహించి
నీవు = నీవు
బలియుండు + అగు = బలియుండగు = బలం కలిగినట్టివాడైన
రావణున్ = రావణుని
బల + ఆఢ్యుఁడవు = బలాఢ్యుఁడవు = సమర్థవంతమైన భుజ పరాక్రమం కలవాడివి
ఇట్టి + ఉన్నతున్ = ఇట్టియున్నతున్ = ఇటువంటి గొప్పవాడివి
నిన్ను = నిన్ను
సహాయున్ + కాన్ = సహాయుఁగాన్ = తోడుపడే వాడివిగా
పడసి = పొంది
నిర్మల = స్వచ్ఛమైన
నీతిపరుండు = స్వచ్ఛమైన నీతి కలవాడు
రాఘవుండు = శ్రీరాముడు
ఆ + నర = అన్నర = మనుష్యులను
భోజన + అన్వయులన్ = భోజనాన్వయులన్ = మనుష్యులను ఆహారంగా తినేటటువంటి రాక్షస వంశీయులను
ఆజిన్ = యుద్ధంలో
వధించుట = చంపటం
ఏమి చోద్యమే ? = ఏమి వింత ?
తాత్పర్యం : “నీవు గొప్పవాడివి, నీవు పూనుకొని అంతటి బలవంతుడైన ఆ రావణుని సైతం సులువుగా యుద్ధంలో సంహరించకలిగినవాడివి. అట్టి గొప్ప పరాక్రమం కల నిన్ను సహాయునిగా గొని రఘువంశంలో జన్మించిన శ్రీరామ చంద్రుడు నరమాంస భక్షకులైన రాక్షసులను యుద్ధంలో చంపటం ఏమంత వింత కాదు.”
![]()
34 వచనం :
అనిన వాని కతి ప్రీతిమంతుండై హనుమంతు డిట్లనియె ‘నయ్యా ! నీవు
సౌగంధిక సరోవరంబునకుం బోయెద వే నందు సాహసంబు సేయవలవ; దది
యక్షరాక్షసరక్షితంబై దేవతోపభోగయోగ్యంబై యుండు; దేవతలు బలిహెూమ
నమస్కారంబులఁజేసి భక్తిసాధ్యులు గాని సాహసక్రియాసాధ్యులు గారు; నీవు నిజధర్మ
నిష్ఠితుండవై పరమధర్మంబు లెఱుంగునది; యెందేని హీనబుద్ధులు విమోహింతు రట్టి
ధర్మాధర్మ విభాగంబు లెఱుంగు విద్వాంసుల నుపాసించి శుభాచారుండవు గావలయు;
నాచారంబున ధర్మంబు పుట్టు; ధర్మంబువలన వేద ప్రతిష్ఠ యగుః వేదంబులం జేసి
యజ్ఞంబులు ప్రవర్తిల్లు; నట్టి యజ్ఞంబు వలన దేవతలు తృప్తులగుదురు.
ప్రతిపదార్థం:
అనిన = అని చెప్పగా
వానికి = అతనికి అనగా భీముని పట్ల
అతి = మిక్కిలి
ప్రీతిమంతుండు+ఐ = ప్రీతిమంతుండై = ప్రేమ కలవాడై
హనుమంతుడు = ఆంజనేయుడు
ఇట్లు = ఈ విధంగా, ఇట్లా
అనియెన్ = చెప్పాడు
అయ్యా ! = నాయనా !
నీవు = నీవు
సౌగంధిక సరోవరంబునకున్ = సౌగంధికములు అనేటటువంటి తామర పువ్వులు చూచే సరస్సుకు
పోయెదవు + ఏని = పోయెడవేని = వెళ్ళినట్లయితే
అందు = అందులో
సాహసంబు + చేయ = సాహసంబుసేయ = తొందరపడి పరాక్రమాన్ని
వలవదు = ప్రదర్శించవద్దు
అది = ఆ సరస్సు
యక్ష = యక్షుల చేతను
రాక్షస = రాక్షసుల చేతను
రక్షితంబు + ఐ = రక్షితంబై = కాపాడబడునటువంటిదై
దేవతా+ఉపభోగ యోగ్యంబు + ఐ = దేవతోపభోగ యోగ్యంబై = వేల్పుల చేత అనుభవించ తగినది అయి
ఉండు = ఉంటుంది.
దేవతలు = వేల్పులు
బలి-హెూమ-నమస్కారంబులన్ + చేసి = నైవేద్యాల చేత, అగ్నిలో వేల్చటం చేత వందనాలు చేయటం ద్వారా
భక్తి, సాధ్యులు-కాని = ఆరాధనా భావంతో వశమయ్యేటటు వంటి వారే కాని
సాహస క్రియా = తొందరపాటుతో కూడిన
సాధ్యులు కారు = వశమయ్యే వారు కారు
నీవు = నీవు
నిజ-ధర్మనిష్ఠితుండవు+ఐ = నిజధర్మనిష్ఠితుండవై = నీవు ఆచరించవలసిన ధర్మమందు దీక్ష కలవాడివై
పరమధర్మంబులు = ధర్మాల్లో కెల్ల ఉత్తమములైన ధర్మాలను
ఎఱుంగునది = తెలిసికొనేది
ఎందేని = అటువంటి ఉత్తమములైన ధర్మాలను తెలిసి కొనటంలో
హీన-బుద్ధులు = అల్ప బుద్ధులు (సరియైన తెలివి తేటలు లేనివారు)
విమోహింతురు = భ్రమకు లోను అవుతారో
అట్టి = అటువంటి
ధర్మ + అధర్మ-విభాగంబులు = ధర్మాధర్మ విభాగంబులు = ధర్మాధర్మ విచక్షణలను
ఎఱుంగు = తెలిసినట్టి
విద్వాంసులను = పండితులను
ఉపాసించి = ఆరాధించి
శుభ + ఆచారుండవు + కావలయున్ = శుభాచారుండవుగావలయున్ = మంచి ప్రవర్తన కలవాడివి కావాలి
ఆచారంబున = ప్రవర్తన వలన అనగా మహానుభావులు పలువురు ఆచరించేటటువంటి తీరు తెన్నులలో వర్తించటం వలన
ధర్మంబు = ధర్మం
పుట్టు = ఉద్భవిస్తుంది
ధర్మంబు వలన = ధర్మం వలన
వేద-ప్రతిష్ట + అగు = వేదప్రతిష్టయగు = వేదాల యొక్క స్థిరమైన ఉనికి ఏర్పడుతుంది
వేదంబులన్ చేసి = వేదంబులంజేసి = వేదాల చేత
యజ్ఞంబులు = క్రతువులు
ప్రవర్తిల్లున్ = జరుగుతాయి
అట్టి = అటువంటి
యజ్ఞంబు వలన = వేదాల చేత ప్రతిపాదించబడిన క్రతువులు జరగటం వలన
దేవతలు = వేల్పులు
తృప్తులు = తృప్తి చెందినవారు
అగుదురు = అవుతారు
తాత్పర్యం : అని భీముడు పలుకగా అతని యెద మిక్కిలి ప్రేమతో హనుమంతుడు ఇట్లా చెప్పాడు. “నాయనా ! నీవు సౌగంధికాలు అనే పేరు కల నూరు రేకుల బంగారు తామర పువ్వులు గల కొలనుకు పోయినట్లయితే, అక్కడ తొందరపడి నీ శౌర్యం ప్రదర్శించటానికి పూనుకొనవద్దు. ఆ సరోవరాన్ని యక్షులు, రాక్షసులు కాపాడుతుంటారు. అది దేవతలు అనుభవించేటటువంటిది. దేవతల ఆరాధనకు లొంగుతారు. బలులు, హెూమాలు, నమస్కారాల వలన సంతృప్తి చెందుతారు. వారు భక్తి భావం చేత ప్రసన్నులౌతారు గాని, శౌర్య పరాక్రమాల చేత సాధించతగినవారు కారు. నీవు నీ ధర్మాన్ని ఆచరించటంలో దీక్ష పూనుము. పరమధర్మాన్ని తెలిసికొనుము. సరి అయిన తెలివితేటలు లేనివారు ఎక్కడ పొరపడతారో అట్టి ధర్మా ధర్మ విచక్షణను పండితులను ఆశ్రయించి తెలిసికొనుము. ఆ విధంగా నీవు సరైన ప్రవర్తన అలవరచు కొనుము. మహాత్ముల యొక్క ప్రవర్తన పలువురి చేత అనుసరించబడినదై ఉత్తమమగు ఆచారం అవుతుంది. అటువంటి ఆచారం నుండి ధర్మం జన్మిస్తుంది. ధర్మం వలన వేదం పాదుకొంటుంది. వేదాల వలన యజ్ఞాలు జరుగుతాయి. అటువంటి యజ్ఞాలు జరగటం చేత దేవతలు తృప్తి చెందుతారు.
35వ పద్యం :
ఆ ॥ కార్యసిద్ధిపొంటెఁ గాలంబు దేశంబు
నెఱిఁగి బుద్ధిమంతు లెల్లప్రొద్దు
సాహసంబు విడిచి సామాద్యుపాయప్ర
యుక్తి చేయుదురు యథోచితముగ.
ప్రతిపదార్థం:
బుద్ధిమంతులు = తెలివి కలవారు
ఎల్లప్రొద్దు = ఎల్లప్పుడూ
కార్య-సిద్ధి-పొంటెన్ = కార్యం జయప్రదం అవటానికి
కాలంబు = తగిన కాలాన్ని
దేశంబున్ = తగిన స్థలాన్ని
ఎఱిఁగి = తెలిసికొని
సాహసంబు విడిచి = తొందరపాటును విడిచిపెట్టి
సామ+ఆది+ఉపాయ-ప్రయుక్తి = సామాద్యుపాయ ప్రయుక్తి = సామం మొదలైన ఉపాయాలను ఉపయోగించి
యథా + ఉచితముగ = యథోచితముగ = ఆయా సమయాలకు (ఆయా స్థలాలకు తగినట్లుగా)
చేయుదురు = చేస్తారు (ఆచరిస్తారు)
తాత్పర్యం : ఏ కర్తవ్యాన్ని నెరవేర్చటంలోనైనా బుద్ధిమంతులు తగిన సమయాన్ని తగిన స్థలాన్ని తెలిసికొని సాహసాన్ని వదలి సామదాన భేద దండోపాయాలను ఏ విధంగా ప్రయోగించతగునో అట్లాగే ప్రయోగించి విజయాన్ని సాధిస్తారు.
విశేషం : విజయ సాధనకు ప్రాచీనులు పేర్కొన్న నాలుగు ఉపాయాలు
- సామం = మంచితనం ఉపయోగించటం
- దానం = ధనం ఇవ్వటం
- భేదం = శత్రువులలో చీలికలు ఏర్పరచటం
- దండం = పరాక్రమం చూసి శత్రువులను శిక్షించటం
చతుర్విధ ఉపాయాలను ప్రయోగించటంలో మొదటిది సామం. చిట్ట చివరిది దండం అని మరువకూడదు.
36 వచనం :
మఱియు సర్వకార్యంబులు మంత్రమూలంబులు గావున విద్వాంసులై
ప్రబుద్ధులైనవారలతో మంత్రంబుఁ జేయునది; బాలకులయు నధికశ్రీదర్పితులయు
లుబ్ధులయు లఘుజనంబులయుఁ దోడ మంత్రంబు సేయవలదు.
ప్రతిపదార్ధం:
మఱియు = ఇంకను
సర్వ-కార్యంబులు = అన్ని పనులు
మంత్ర మూలంబులు = ఆలోచనే ఆధారంగా కలవి
కావున = కాబట్టి
విద్వాంసులు + ఐ = విద్వాంసులై = పండితులై
ప్రబుద్ధులు = ఐనవారలతో (గొప్ప తెలివి తేటలు కలవారితో)
మంత్రంబున్+చేయునది = మంత్రంబుఁజేయునది = ఆలోచించాలి
బాలకులయున్ = చిన్నపిల్లతో
అధిక శ్రీ దర్పితులయు = అమితమైన ధనం చేత గర్వించే వారలతో
లుబ్దులయు = పిసినిగొట్టులతో
లఘు జనంబులయున్ + తోడ = లఘుంజనంబులయుఁదోడ = నీచులు అయిన వారితో
మంత్రంబు+చేయవలదు = మంత్రంబు సేయవలదు ఆలోచించటం కూడదు
కాబట్టి
తాత్పర్యం : ఇంకను అన్ని పనులు నెరవేరటానికి ఆలోచన అవస పండితులై గొప్ప తెలివి తేటలు కలవారితో ఆలోచన చేయాలి. బాలకులతో, ఎక్కువ సంపదతో విర్రవీగేవారితో, పిసినిగొట్టులతో, నీచులతో ఆలోచన చేయకూడదు.
![]()
37వ పద్యం :
తే ॥ జనులు నిగ్రహానుగ్రహశక్తుఁ డైన
రాజు శాసనమునఁ జేసి రమణతోడ
నోలిఁ దమ తమ మర్యాద లొక్కనాఁడుఁ
దప్ప నోడుదు రిమ్మహీతలమునందు
ప్రతిపదార్థం :
జనులు = ప్రజలు
నిగ్రహ+అనుగ్రహ-శక్తుఁడు+ఐన = నిగ్రహానుగ్రహశక్తుఁడైన = దండించటానికి, దయ చూపటానికి సామర్థ్యం కల
రాజు-శాసనమునన్ +చేసి = రాజు శాసనమునఁజేసి = ప్రభువు యొక్క ఆజ్ఞ చేత
రమణతోడన్ = సంతోషంతో
ఓలిన్ = వరుసగా
ఒక్క నాఁడున్ = ఒక రోజు కూడా
ఈ-మహీ-తలమున+అందు = ఇమ్మహీతలమునందు = ఈ భూలోకంలో
తమ-తమ-మర్యాదలు = తమ తమ మర్యాదలు = తమ తమ విధులు
తప్పన్ = అతిక్రమించటానికి
డుదు = భీతిల్లుతారు.
తాత్పర్యం : దండించటానికి, దయచూపటానికి శక్తి గల రాజు యొక్క శాసనం వలన ప్రజలు నిరంతరం సంతోషిస్తూ, భూతలం మీద ఒకనాడు కూడా తమ తమ విధులను తప్పటానికి వెనుకాడుతారు.
38 వచనం :
నీవు నిగ్రహానుగ్రహ సమర్థుండవు గావున నీ కెల్లవారును వశ్యు లగుదురు;
నిన్నుఁ జూచుటంజేసి నా నయనంబులు సఫలంబయ్యె; నీకెద్ది యిష్టంబు దానిం జేసెద.
ప్రతిపదార్థం :
నీవు = నీవు
నిగ్రహ+అనుగ్రహ = నిగ్రహానుగ్రహ = దండించటానికి, దయ చూపటానికి కాని
సమర్థుండవు = శక్తి కలవాడివి
కావున = కాబట్టి
ఎల్లవారును = అందరున్నూ
వశ్యులు + అగుదురు = వశ్యులగుదురు = లోబడినవారవుతారు
నిన్నున్+చూచుటన్+చేసి = నిన్నుఁ జూచుటం జేసి = నిన్ను చూడటం చేత
నా నయనంబులు = నా కళ్ళు
సఫలంబు + అయ్యె = సఫలంబయ్యె = ఫలంతో కూడినవి అయినాయి. (ధన్యమైనాయి)
నీకున్ + ఎద్ది = నీకెద్ది = నీకు ఏది
ఇష్టంబు = ప్రీతి కలిగించేదో
దానిన్ = దానిని
చేసెద = చేస్తాను
తాత్పర్యం : నీవు దయ జూపగలవు. దండించగలవు. ఈ రెండు శక్తులు నీకున్నాయి. అందుచేత అందరూ నీకు లోబడి ఉంటారు. నిన్ను చూడటం చేత నా కన్నులు సార్థకములైనాయి. నీకు ఏది ఇష్టమో చెప్పుము. నేను దానినే చేస్తాను.
39వ పద్యం :
మత్త॥ మీకు నెగ్గొనరించి యున్న యమిత్రులన్ హతబుద్ధులం
జీకురాజు తనూజులం గురుసింహ ! నీకుఁ బ్రియంబుగా
నేకమాత్రన పోరిలో వధియించి నాగపురంబు నా
నాకులాద్రి శిలావలీ గహనంబు సేయుదు’ నావుడున్.
ప్రతిపదార్థం :
మీకున్ = మీకు
ఎగ్గు = అపకారం
ఒనరించి-ఉన్న = చేసి ఉన్న
అమిత్రులన్ = శత్రువులను
హతబుద్దులన్ = చెడిన తెలివితేటలు కలవారిని;
చీకు రాజు తనూజులన్ = గ్రుడ్డి ప్రభువు అయిన ధృతరాష్ట్రుని కొడుకులను
కురుసింహ = కురువంశ మందలి వారిలో సింహం వంటివాడా!
నీకున్ = నీకు
ప్రియంబుగాన్ = సంతోషంగా
ఏకమాత్రాన = ఒంటరిగా
పోరిలో = యుద్ధంలో
వధియించి = సంహరించి
నాగపురంబు = హస్తినాపురిని
నానా-కుల+అద్రి = నానాకులాద్రి = పెక్కు కులపర్వతాల యొక్క
శిలా+ఆవలీగహనంబు + చేయుదున్ = శిలావలీ గహనంబు సేయుదున్ = రాళ్ళ సముదాయంతో నిండి, ప్రవేశించ వీలుకాని దానినిగా చేయగలను
నావుడున్ = అని చెప్పగా
తాత్పర్యం : కురువంశంలో సింహం వంటివాడివైన “ఓ భీమా ! మీకు కీడు చేసిన శత్రువులను చెడిపోయిన తెలివితేటలు కలవారిని, గ్రుడ్డి ప్రభువు కొడుకులను నీకు సంతోషం కలిగేటట్లుగా నేను ఒక్కడినే అసహాయశూరుడినై యుద్ధంలో సంహరించి హస్తినాపురాన్ని పెక్కు కులపర్వతాలలోని రాళ్ళ రప్పలతో కప్పి చొర రాని అడవిగా మార్చి చేయగలను” – అని ఆంజనేయుడు చెప్పగా భీముడు (ఈ విధంగా చెప్పాడు) తర్వాతి పద్యంతో అన్వయము.
40వ పద్యం :
మత్తః॥ ‘ఇంతయుం గపినాథ ! నీ కిది యేమి పెద్ద ? మహాహవా
భ్యంతరంబున నుద్ధతప్రతిపక్ష వీరుల నేమ ని
ర్జింతు; మెవ్వరు మాకు మీ దయఁజేసి మార్కొను నంత య
త్యంతవీరులు లేరు భూవిదితప్రతాపబలోన్నతిన్.’
ప్రతిపదార్థం:
కపి-నాథ ! = వానరులలో శ్రేష్ఠుడవైనవాడా !
ఇంతయున్ = ఇది అంతా అంటే అసహాయశూరుడవై ఒంటిగా మా శత్రువులను అందరినీ యుద్ధంలో సంహరించటం
నీకు = నీకు
ఇది + ఏమి – పెద్ద = ఇది యేమి పెద్ద ? = ఇది ఏమంత ఘనకార్యం ?
మహా + ఆహవ + అభి + అంతరంబునన్ = మహాహహభ్యంతరంబునన్ = గొప్పదైన పోరులో
ఉద్ధత = గర్వించిన
ప్రతిపక్ష-వీరులన్ = శత్రు శూరులను
ఏము + అ – ఏమ = మేమే
నిర్జితము = జయించగలం
మీ దయన్ + చేసి = మీదయఁజేసి = మీ దయ వలన
భూ = భూమండలమంతటికీ
విదిత = తేటతెల్లమైన
ప్రతాప = పరాక్రమంతో
బల + ఉన్నతిన్ = బలోన్నతిన్ = పరాక్రమంతో కూడిన గొప్పతనంతో
మార్కొను + అంత = మార్కొనంత = (మమ్ము) ఎదిరించగలిగేటంతటి
అతి+అంత-వీరులు = అత్యంత వీరులు = మిగుల గొప్పవారైన శత్రువీరులు
మాకు = పాండవులమైన మాకు
ఎవ్వరు = ఎవ్వరూ
లేరు = లేరు (మీ దయ వలన మా పరాక్రమ శక్తులకు మించిన ప్రతి వీరులెవ్వరూ ఈ భూమండ లంలో లేరని భావం)
తాత్పర్యం : వానరులలో శ్రేష్ఠుడివైన వాడా ! నీవు ఒక్కడివే అసహాయుడిపై మా శత్రువులను అందరినీ యుద్ధంలో సంహరించగలవు. ఇది నీకు ఒక ఘనకార్యమా! గర్వించిన శత్రు వీరులను మేమే యుద్ధంలో జయించగలం. మీ దయ వలన ఈ భూలోకంలో తేటతెల్లమైన పరాక్రమం గల మేము జయించలేని గొప్పవీరులు ఎవ్వరూ లేరు.
విశేషం : ఈ వృత్తంలో (39, 40 ప పద్యాలు) పాదానికి 18 అక్షరాలు ప్రతి పాదంలోనూ ర-స-జ-జ-భ- ర అవే గ అవే గణాలు వరుసగా ఉంటాయి. ఉంటాయి. 11వ అక్షరం యతిమైత్రి. ప్రాస నియమం ఉంది.
![]()
41 వచనం :
అనిన విని భీమసేనునకు హనుమంతుం డిట్లనియె ‘నన్ను రణాంత
రంబునం దలంచునది: నీ యందు సౌహృదంబున నాహవంబులో నతిరథుండైన
యర్జును రథధ్వజంబునం దుండి మీ బలపరాక్రమంబులం జూతు’ నని భీముం
గౌఁగిలించుకొని, వానికి సౌగంధిక సరోవర మార్గంబుఁజూపి, హనుమంతుం
డంతర్హితుండైనఁ, దదాలింగన విగతశ్రముండును విపులజవ శక్తి యుక్తుండును నై
భీమసేనుండు.
ప్రతిపదార్థం :
అనిన విని = అని చెప్పగా ఆలకించి
భీమసేనునకు = భీముడికి
హనుమంతుండు = ఆంజనేయుడు
ఇట్లు + అనియె = ఈ విధంగా చెప్పాడు
నన్ను = నన్ను
రణ+అంతరంబునన్ = రణాంతరంబునన్ = యుద్ధం మధ్యలో
తలంచునది = స్మరించవలసింది
నీ+అందు-నీయందు = నీయందలి
సౌహృదంబునన్ = స్నేహం చొప్పు న
ఆహవంబులోన్ = యుద్ధంలో
అతిరథుండు + ఐన = అతిరథుండైన = రథికులలో శ్రేష్ఠుడైన
అర్జును రథ ధ్వజంబున + అందు + ఉండి = అర్జునురథధ్వజంబునందుండి = అర్జునుని యొక్క రథ జెండాపై ఉండి
మీ-బల-పరాక్రమంబులన్ + చూతును = మీ బలపరాక్రమంబులంజూతును = మీ బల పౌరుషాలను చూస్తాను
అని = అని చెప్పి
భీమున్ = భీముణ్ని
కౌఁగిలించుకొని = ఆలింగనం చేసికొని
వానికి = అతడికి (ఆ భీమునికి)
సౌగంధిక – సరోవర – మార్గంబున్ + చూపి = సౌగంధిక సరోవర మార్గంబుఁజూపి = సౌగంధికాలు అనే వేయి రేకుల బంగారు తామర పువ్వులు పూచేటటువంటి కొలనుకు దారిని చూపి;
హనుమంతుడు = ఆంజనేయుడు
అంతః + హితుండు + ఐనన్ = అంతర్హితుండైనన్ = కనిపించకుండా మాయం కాగా
తత్ + ఆలింగన = తదాలింగన = అతడి అనగా ఆంజనేయుని యొక్క
విగత శ్రముండును = కౌగిలింత చేత పోగొట్టబడిన శ్రమ
విపుల = అధికమైన
జవశక్తి = బలం కలవాడున్నూ
యుక్తుండునున్ + ఐ = యుక్తుండునునై = అవుతూ
భీమసేనుండు = భీముడు (తర్వాతి పద్యంతో అన్వయము)
తాత్పర్యం : అని చెప్పిన ఆలకించి భీమునికి హనుమంతుడు యిట్లా చెప్పాడు. “నన్ను యుద్ధంలో సంస్మరింపుము. నీమీద నెయ్యంతో నేను మహావీరుడైన అర్జునుని రథంపై ఉండే జెండాపై ఉండి, యుద్ధంలో మీ బలాన్ని, మీ శౌర్యాలను తిలకిస్తాను” — అని భీముణ్ని కౌగిలించుకుని అతనికి సౌగంధికాలు అనే వేయిరేకుల బంగారు తామరపువ్వులు పూచేటటువంటి కొలనుకు దారి చూపి, హనుమంతుడు మాయమయ్యాడు. అంతట భీముడు హనుమంతుని చేత కౌగిలించుకొనబడటం వలన, పోయిన శ్రమ కలవాడై నూతనోత్సాహంతో కొంగొత్త జవ సత్వాలతో ఒప్పారాడు.