Reviewing AP Inter 2nd Year Telugu Study Material గద్యభాగం 1st Lesson రంగాజమ్మ Questions and Answers Summary can help students prepare confidently for exams.
AP Inter 2nd Year Telugu రంగాజమ్మ Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కవయిత్రి రంగాజమ్మ ఘనతను వివరించండి.
జవాబు:
పరిచయం : ఈ ప్రశ్న ఆండ్ర శేషగిరిరావు గారు రచించిన ‘ఆంధ్ర విదుషీమణులు’ అనే గ్రంథం నుండి గ్రహించబడిన ‘రంగాజమ్మ’ పాఠ్యాంశంలోనిది. తంజావూరిని పరిపాలించిన విజయరాఘవ నాయకుని ఆస్థానంలో గొప్ప రచయిత్రిగా రంగాజమ్మ పేరుగాంచింది. ఆమె బహుముఖ ప్రజ్ఞావంతురాలు. అసామాన్య ప్రజ్ఞావంతురాలు : ఆమె తల్లిదండ్రులు మంగమాంబ, వెంకటాద్రి. విజయరాఘవుని ఆస్థానంలోని అనేక మంది విద్వాంసుల మధ్య వెలిగే నాయకమణిలా పసుపులేటి రంగాజమ్మ కనిపించేది. తనకు మన్నారుగుడిలో వెలసిన రాజగోపాలస్వామి వల్లనే కవిత్వం అబ్బిందని ప్రకటించింది.
ఆమెకి పోటీ వచ్చేవారు లేరు. పాండిత్యంలో సరితూగే వారే లేరు. వంద మంది గొప్ప పండితులకు ఒకేసారి సమాధానాలు ఇవ్వగలిగేది. ఆ పండితులు చుట్టూ చేరి చిత్ర విచిత్ర సమస్యలను, చమత్కార ప్రశ్నలను సంధించగా మధ్యలో కూర్చున్న రంగాజమ్మ వందమందికి వంద విధాలుగా పద్యాలు పూరించి స్వహస్తాలతో పత్రికలు రాసి ఇచ్చేది. దీనినే ‘శతలేఖినీ విద్య’ అని పిలుస్తారు.
అష్టభాషలు అసాధారణ ప్రావీణ్యం : రంగాజమ్మది విమర్శకులు కూడా మెచ్చుకునే విలక్షణ వైదుష్యం. తెలుగువారు గర్వించదగిన విదుషీమణి. ఆమె సంస్కృతం, ప్రాకృతం, పైశాచి, మగధి, శౌరసేని, చూళిక, అపభ్రంశం, ఆంధ్రం అనే 8 భాషలలో కవిత్వం చెప్పేది. పదకవిత్వాన్ని అల్లేది. రాజనీతి, జ్యోతిశ్శాస్త్రం, వ్యాకరణం, తర్కం, మీమాంస, ఆగమశాస్త్ర పరిజ్ఞానం మొదలైన విషయాలలో సంపూర్ణమైన అవగాహన ఉంది.
విజయరాఘవుని ఆస్థానంలో అంత మంది కవిసింహాల మధ్య కామధేనువు లాగా కవిత్వ క్షీరాన్ని వర్షిస్తున్న రంగాజమ్మను చూచి, గొప్ప ఆనందంతో విజయరాఘవ నాయకుడు పెండ్లాడాడు. విజయరాఘవుని మిగిలిన భార్యలతో పాటూ, పట్టమహీషి రాజగోపాలాంబిక కూడా ‘రంగాజమ్మ’ వైదుష్యాన్ని, మాటను గౌరవించేవారు.
రంగాజమ్మ – రచనలు : ఆమె రామాయణ, భాగవత, భారత సంగ్రహాలు వ్రాసింది గానీ అవి దొరకలేదు. మన్నారుదాస విలాసం, ఉషా పరిణయం, మన్నారుదాస విలాస యక్షగానం మొదలైన రచనలు చేసింది. యక్షగానాలలో మొదటిసారి ఎఱుకలసాని పాత్రని ప్రవేశపెట్టింది.
కనకాభిషేకం : కనకాభిషేకం (బంగారంతో అభిషేకం) అనేది ‘సాహిత్య ప్రపంచంలో జరిగే అత్యున్నతమైన గౌరవం. తెలుగు కవయిత్రులలో ‘మన్నారుదాస విలాసం’ రచన పూర్తయ్యాక మొదటిసారిగా విజయరాఘవ నాయకుడు, రంగాజమ్మకు కనకాభిషేకం చేశాడు.
ముగింపు : తన రచనలతో రంగాజమ్మ పండితులను, పామరులను రంజింప చేసింది. తేటతెలుగుతో పాటూ, అవసరమైన చోట సంస్కృత భాషని ఉపయోగించింది. ఆంధ్ర మహిళా లోకం యొక్క గౌరవాన్ని శాశ్వతం చేసిన కళానిధి రంగాజమ్మ.
![]()
ప్రశ్న 2.
రంగాజమ్మ రచనల గురించి వివరించండి.
జవాబు:
పరిచయం : ఈ ప్రశ్న ఆండ్ర శేషగిరిరావు గారు రచించిన ‘ఆంధ్ర విదుషీ మణులు’ అనే గ్రంథం నుండి గ్రహించబడిన ‘రంగాజమ్మ’ పాఠ్యాంశంలోనిది. తంజావూరిని పరిపాలించిన విజయరాఘవ నాయకుని ఆస్థానంలో గొప్ప రచయిత్రిగా రంగాజమ్మ పేరుగాంచింది. ఆమె బహుముఖ ప్రజ్ఞావంతురాలు. రంగాజమ్మ రచనలు : రంగాజమ్మకి అష్టభాషలలో ప్రవేశం ఉంది. ఆమె రామాయణ, భాగవత, భారత సంగ్రహాలు వ్రాసింది గానీ అవి దొరకడం లేదు.
ఆమె రచనలలో ముఖ్యమైనవి.
- మన్నారుదాస విలాస ప్రబంధం
- ఉషా పరిణయం
- మన్నారుదాస విలాస యక్షగానం
1. మన్నారుదాస విలాస ప్రబంధం : ‘మన్నారుదాస విలాస ప్రబంధం’ తంజావూరు నాయక రాజుల కాలంలో వెలువడిన ఒక విశిష్టమైన సాహిత్య గ్రంథం. దీనిని రాజగురువు, శతక్రతు శ్రీనివాస తాతాచార్యుల ఆశీస్సులతో రంగాజమ్మ రచించింది. ‘మన్నారుదాస విలాసం’లో నాయకుడు, సాక్షాత్తు రంగాజమ్మ భర్త. తంజావూరు ప్రభువు విజయ రాఘవుడే. ఇది ఒక ప్రబంధం. గొప్ప వర్ణనలతో సాగుతుంది.
ఇందులో ప్రధానమైన అంశాలు :
- విజయరాఘవునికి మన్నారుగుడిలోని రాజగోపాల స్వామిపై గల అచంచలమైన భక్తి, విశ్వాసం.
- ఆ స్వామికి ఆయన చేసిన వివిధ కైంకర్యాలు.
- మన్నారుస్వామి గుడిలో ప్రతియేడూ వైభవంగా జరిగే ఫాల్గుణ మాసం -తిరునాళ్ళు
- విజయ రాఘవునికి కాంతిమతి అనే కన్యతో వివాహం కావడం.
- అష్టభాషా (ఎనిమిది భాషలు) కౌశలం.
విజయరాఘవ నాయకుని వైభవం, శృంగార లీలలు, రాజ్య వైభవం కూడా ఉన్నాయి. విజయరాఘవ నాయకుని వ్యక్తిత్వాన్ని, కళాపోషణను ఈ కావ్యం ప్రతిబింబిస్తుంది.
2. ఉషాపరిణయం : రంగాజమ్మ తన భర్త విజయరాఘవ నాయకుని కోరిక మేరకు ఉష – అనిరుద్ధుల ప్రణయగాథను వ్రాసింది. ఉష, బాణాసురుని కుమార్తె. అనిరుద్ధుడు శ్రీకృష్ణుని మనుమడు. ఇది వారిద్దరి వివాహగాథ. ఇందులో రంగాజమ్మ చేసిన వర్ణనలు, పాత్ర చిత్రణ అద్భుతంగా సాగాయి.
ఉష చిన్నతనంలో ఆడిన ఆటలు :
- బొమ్మల పెండ్లిళ్ళు
- గుజ్జనగూళ్ళు
- వెన్నెల రాత్రులలో దాగిలి మూతలు
- బంతులాట
- గుజగుజ తేకులు
- వనభోజనాలు
- జల విహారం
- జాఱుడు పీటలు
- చదరంగం
రంగాజమ్మ ఉదహరించిన నవ్వులు : మొలక నవ్వు, చిఱునవ్వు, పకపక నవ్వు, కలకల నవ్వు చిత్రలేఖ పాత్ర – నైపుణ్యం : ఉష చెలికత్తె అయిన చిత్రలేఖ కలలో చూసిన దృశ్యాలను తెల్లవారిన తర్వాత బొమ్మలుగా వేయగల నైపుణ్యం కలిగిన దానిగా రంగాజమ్మ వర్ణించింది. అలాగే చిత్రలేఖ, అనిరుద్ధుణ్ణి ద్వారకా పట్టణం నుండి అపహరించి తెచ్చిన ఘట్టాన్ని ఎంతో మనోహరంగా వర్ణించింది. హనుమంతుడు సంజీవని తెచ్చినట్లు, గరుత్మంతుడు అమృతం తీసుకొచ్చినట్లు, భగీరథుడు గంగని నేలమీదకి తెచ్చినట్లు, కృష్ణుడు పారిజాతాన్ని, భీముడు సౌగంధికా పుష్పాన్ని తెచ్చినట్లు, చిత్రలేఖ అనిరుద్ధుణ్ణి అపహరించి, తెచ్చిందని వర్ణించింది.
3. మన్నారుదాస విలాస యక్షగానం : మన్నారుదాస విలాస యక్షగానం రంగాజమ్మ చివరి రచన. ఇందులో కూడా నాయకుడు విజయరాఘవుడే. యక్షగానం ఒక జానపద కళారూపం. ఇందులో సంగీతం, నాట్యం, అభినయంతో కలబోసిన వీధి నాటకం యక్షగానం. రంగాజమ్మ యక్షగానాలలో పాత్రోచిత భాషను ప్రవేశపెట్టింది. విజయ రాఘవుని సంభాషణలు రసవంతంగా ఉంటాయి. సంభాషణలకు హాస్యాన్ని జోడించింది. సమాజంలోని వివిధ వర్గాల, ప్రజల మాటలను యక్షగానంలో ఉపయోగించింది. సామాన్య ప్రజలు కూడా ఆ సంభాషణలను ఆస్వాదించే వారు. ఉదాహరణకు ఇద్దరు జ్యోతిష్యుల మధ్య జరిగిన సంభాషణను చూద్దాం.
మంచనభట్టు : జోశ్యులూ ! నీవు పోచన సోమయాజులు గారింట, మొగపిల్లవాడు పుట్టునని ప్రశ్న చెప్పి యేకాక్షర ప్రయోగం చేయించుకు వస్తివట! భైరవ జోశ్యులూ : భట్టూ ! నీవు బుచ్చావధాని కొడుకు బచ్చిగాడు పదహారోయేట పల్లకీ యెుక్కునని జాతకం వ్రాస్తివే ! అతడిదిగో బిచ్చమెత్తుకు తిరుగుతున్నాడే! మంచనభట్టు : జోశ్యులూ ! నేను ఫలభాగం వ్రాసిన దిక్కున పదివేల మంది పల్లకీ పదస్తులైనారు. ఒక్కడు తప్పి ఉన్నాడు. నీకేమి తెలుసు పోరా ! ఇలా సంభాషణలు సహజంగా సాగుతాయి.
ముగింపు : రంగాజమ్మ రచనలు పండిత, పామరులను ఆకట్టుకున్నాయి. ఆంధ్రదేశానికి బయట ద్రవిడదేశంలో తెలుగు సాహిత్య కేతనం ఎగుర వేసిన ధీమణి రంగాజమ్మ.
II. సంక్లిప్తరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రంగాజమ్మకు జరిగిన కనకాభిషేకాన్ని వివరించండి.
జవాబు:
విజయరాఘవ నాయకుడి ఆస్థానంలో ప్రసిద్ధ కవయిత్రి రంగాజమ్మ. ఆమె విదుషీమణి. గొప్ప పండితురాలు. ఆమెకు జరిగిన కనకాభిషేకం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపురూపమైన ఘట్టం. అసాధారణ పాండిత్యం, కవితా చాతుర్యం కలిగిన కవయిత్రి. కనకాభిషేకం అనేది సాహిత్యలోకంలో ఒక కవికి జరిగే సర్వోన్నతమైన సత్కారం. తెలుగు కవులలో శ్రీనాథునికి, మల్లినాథ సూరికి, కొలచెలమ పెద్దభట్టుకు జరిగింది. తెలుగు కవయిత్రులలో మొదటిగా రఘునాథరాయల కొలువులోని సంస్కృత కవయిత్రి మధురవాణికి జరిగింది.
తెలుగు కవయిత్రులలో మన్నారుదాస విలాసం అనే రచన పూర్తయిన తరువాత, విజయ రాఘవ నాయకుడు రంగాజమ్మకు కనకాభిషేకం చేశాడు. ఇది తలమానికమైన గొప్ప సత్కారం. రంగాజమ్మకు సన్మానం పూర్తయ్యాక ఆ సభకు విచ్చేసిన పండితుల సమూహానికి అభిషేకం చేసిన బంగారాన్ని పంచి పెట్టేశారు. అలా గొప్ప కీర్తిగలిగిన, రంగాజమ్మకి కనకస్నానం ముగిశాక, ఆ నాణేములు అన్నీ సరస్వతీ పుత్రులైన కవి పండితులకు దక్కాయి. స్నానం చేసిన నీళ్ళు ఎంత గొప్పవైనా తిరిగి గ్రహించరు. కానీ రంగాజమ్మ ఎనిమిది భాషలలో పండితురాలు. పదకవిత్వంలో ప్రవీణురాలు. అనేక శాస్త్రాలలో నైపుణ్యం సంపాదించిన విదుషీమణి కనుక, ఆమెకు కనకస్నానం జరిగాక, పండితులు ఆ బంగారాన్ని తీసుకుని మురిసిపోయారు. రంగాజమ్మకి జరిగిన కనకాభిషేకం అపురూపం, అసామాన్యం.
![]()
ప్రశ్న 2.
మన్నారుదాస విలాస ప్రబంధం గురించి వ్రాయండి.
జవాబు:
మన్నారుదాస విలాస ప్రబంధం తంజావూరు నాయక రాజుల కాలంలో వెలువడిన ఒక విశిష్టమైన సాహిత్య గ్రంథం. దీనిని రాజగురువు, శతక్రతు శ్రీనివాస తాతాచార్యుల ఆశీస్సులతో రంగాజమ్మ రచించింది.
‘మన్నారుదాస విలాసం’లో నాయకుడు, సాక్షాత్తు రంగాజమ్మ భర్త, తంజావూరు ప్రభువు విజయ రాఘవుడే. ఇది ఒక ప్రబంధం. గొప్ప వర్ణనలతో సాగుతుంది.
ఇందులో ప్రధానమైన అంశాలు :
- విజయరాఘవునికి మన్నారుగుడిలోని రాజగోపాల స్వామిపై గల అచంచలమైన భక్తి, విశ్వాసం.
- ఆ స్వామికి ఆయన చేసిన వివిధ కైంకర్యాలు.
- మన్నారుస్వామి గుడిలో ప్రతియేడూ వైభవంగా జరిగే ఫాల్గుణ మాసం తిరునాళ్ళు.
- విజయ రాఘవునికి కాంతిమతి అనే కన్యతో వివాహం కావడం.
- అష్టభాషా (8 భాషలు) కౌశలం.
విజయరాఘవ నాయకుని వైభవం, శృంగార లీలలు, రాజ్య వైభవం కూడా ఉన్నాయి. విజయ రాఘవనాయకుని వ్యక్తిత్వాన్ని, కళాపోషణను ఈ కావ్యం ప్రతిబింబిస్తుంది.
ప్రశ్న3.
ఉషాపరిణయం ప్రబంధం గురించి వ్రాయండి.
జవాబు:
రంగాజమ్మ తన భర్త విజయరాఘవ నాయకుని కోరిక మేరకు ఉష అనిరుద్ధుల ప్రణయగాథను వ్రాసింది. ఉష బాణాసురుని కుమార్తె. అనిరుద్ధుడు శ్రీకృష్ణుని మనుమడు. ఇది వారిద్దరి వివాహగాథ. ఇందులో రంగాజమ్మ చేసిన వర్ణనలు, పాత్ర చిత్రణ అద్భుతంగా సాగాయి.
ఉష చిన్నతనంలో ఆడిన ఆటలు :
- బొమ్మల పెండ్లిళ్ళు
- గుజ్జనగూళ్ళు
- వెన్నెల రాత్రులలో దాగిలి మూతలు
- బంతులాట
- గుజగుజ తేకులు
- వనభోజనాలు
- జల విహారాలు
- జాఱుడు పీటలు
- చదరంగం
రంగాజమ్మ ఉదహరించిన నవ్వులు :
మొలక నవ్వు, చిఱునవ్వు, పకపక నవ్వు, కలకల నవ్వు
చిత్రలేఖ పాత్ర – నైపుణ్యం : ఉష చెలికత్తె అయిన చిత్రలేఖ కలలో చూసిన దృశ్యాలను తెల్లవారిన తర్వాత బొమ్మలుగా వేయగల నైపుణ్యం కలిగిన దానిగా రంగాజమ్మ వర్ణించింది.
అలాగే చిత్రలేఖ, అనిరుద్ధుణ్ణి ద్వారకా పట్టణం నుండి అపహరించి తెచ్చిన ఘట్టాన్ని ఎంతో మనోహరంగా వర్ణించింది. హనుమంతుడు సంజీవని తెచ్చినట్లు, గరుత్మంతుడు అమృతం తీసుకొచ్చినట్లు, భగీరథుడు గంగని నేలమీదకి తెచ్చినట్లు, కృష్ణుడు పారిజాతాన్ని, భీముడు సౌగంధికా పుష్పాన్ని తెచ్చినట్లు చిత్రలేఖ అనిరుద్ధుణ్ణి అపహరించి, తెచ్చిందని వర్ణించింది.
ప్రశ్న 4.
మన్నారుదాస విలాస యక్షగానం గురించి వ్రాయండి.
జవాబు:
మన్నారుదాస విలాస యక్షగానం రంగాజమ్మ చివరి రచన. ఇందులో కూడా నాయకుడు విజయరాఘవుడే. యక్షగానం ఒక జానపద కళారూపం. ఇందులో సంగీతం, నాట్యం, అభినయంతో కలబోసిన వీధి నాటకం యక్షగానం.
రంగాజమ్మ యక్షగానాలలో పాత్రోచిత భాషను ప్రవేశపెట్టింది. విజయ రాఘవుని సంభాషణలు రసవంతంగా ఉంటాయి. సంభాషణలకు హాస్యాన్ని జోడించింది. సమాజంలోని వివిధ వర్గాల, ప్రజల మాటలను యక్షగానంలో ఉపయోగించింది. సామాన్య ప్రజలు కూడా ఆ సంభాషణలను ఆస్వాదించే వారు. ఉదాహరణకు ఇద్దరు జ్యోతిష్యుల మధ్య జరిగిన సంభాషణను చూద్దాం. మంచనభట్టు : జోశ్యులూ ! నీవు పోచన సోమయాజులు గారింట, మొగపిల్లవాడు పుట్టునని ప్రశ్న చెప్పి యేకాక్షర ప్రయోగం చేయించుకు వస్తివట!
భైరవ జోశ్యులు : భట్టూ ! నీవు బుచ్చావధాని కొడుకు బచ్చిగాడు పదహారోయేట పల్లకీ యెక్కునని జాతకం వ్రాస్తివే ! అతడిదిగో బిచ్చమెత్తుకు తిరుగుతున్నాడే! మంచనభట్టు : జోశ్యులూ ! నేను ఫలభాగం వ్రాసిన దిక్కున పదివేల మంది పల్లకీ పదస్తులైనారు. ఒక్కడు తప్పి ఉన్నాడు. నీకేమి తెలుసు పోరా ! ఇలా సంభాషణలు సహజంగా సాగుతాయి.
ప్రశ్న 5.
ఎఱుకసాని పాత్రను రంగాజమ్మ వర్ణించిన తీరును వివరించండి.
జవాబు:
యక్షగానాలలో ఎఱుకత పాత్రను మొదటిగా రంగాజమ్మగారే ప్రవేశపెట్టారు. రంగాజమ్మ, ఎఱుకలసానిని చాలా సహజసిద్ధంగా, స్వభావోక్తిగా మన కంటి ముందు నిలిపింది. ఎఱుకలసాని ఆణిముత్యాలు పొదిగిన చెవికమ్మలు ధరించింది. పచ్చ’ కర్పూరపు శోభను మించే కస్తూరిని బొట్టుగా పెట్టుకుంది. ఆమె చేతిలో చక్కని బెత్తం ఉంది. సంపంగి మాలలు చుట్టిన ఆమె తల కొప్పు జారుతోంది.
ఆమె ఎదపైన వజ్రాల దండలు, ముత్యాల సరులు మెరుస్తున్నాయి. ఆమె నడుముకు కనకాంబరం పూలదండను ఒడ్డాణంగా కట్టింది. నెమలి పింఛాలతో తళుకులీనుతున్న చక్కని తట్ట పట్టుకుని రాజవీధిలో నడుస్తూ వెళ్తాందని రంగాజమ్మ వర్ణించింది. రంగాజమ్మ ఎఱుకలసాని పాత్రను ప్రవేశపెట్టాక అన్ని యక్షగానాలలో ఆ పాత్ర తప్పని సరయ్యింది. రంగాజమ్మ ఎఱుకలసానిని ‘శాకునికకోకిలాలప’ అని కీర్తించింది.
![]()
III. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మన్నారు గుడి పుణ్యక్షేత్రానికి మరో పేరు ఏమిటి ?
జవాబు:
మన్నారు గుడి పుణ్యక్షేత్రానికి ‘దక్షిణ ద్వారక’ అనే పేరు ఉంది.
ప్రశ్న 2.
విజయరాఘవ నాయకుని సభాభవనం పేరేమిటి ?
జవాబు:
విజయరాఘవ నాయకుని సభాభవనం పేరు విజయరాఘవ విలాసం.
ప్రశ్న3.
శతలేఖనీ విద్యలో ప్రవీణురాలెవరు ?
జవాబు:
రంగాజమ్మ శతలేఖిని విద్యలో ప్రావీణ్యురాలు.
ప్రశ్న 4.
రంగాజమ్మకు కనకాభిషేకం చేసినదెవరు ?
జవాబు:
రంగాజమ్మకు విజయరాఘవ నాయకుడు కనకాభిషేకం చేశాడు.
ప్రశ్న5.
యక్షగానాలలో రంగాజమ్మ ప్రవేశపెట్టిన కొత్త పాత్ర ఏది ?
జవాబు:
రంగాజమ్మ ‘ఎఱుకలసాని’ పాత్రను కొత్తగా యక్షగానాలలో ప్రవేశపెట్టింది.
ప్రశ్న6.
రంగాజమ్మకు మరో పేరు ఏమిటి ?
జవాబు:
రంగాజమ్మకు మరో పేరు ‘రంగాజి’.
![]()
ప్రశ్న 7.
రంగాజమ్మ తొలి రచన పేరు ఏమిటి ?
జవాబు:
రంగాజమ్మ తొలి రచన మన్నారుదాస విలాస ప్రబంధం.
ప్రశ్న8.
రంగాజమ్మ తల్లిదండ్రుల పేర్లు తెలపండి.
జవాబు:
రంగాజమ్మ తల్లిదండ్రులు మంగమాంబ, వెంకటాద్రి.
రంగాజమ్మ Summary in Telugu
రచయిత పరిచయం
పాఠ్యభాగం : రంగాజమ్మ
గ్రహించబడిన గ్రంథం : ఆంధ్రవిదుషీమణులు
పాఠ్యభాగ రచయిత : ఆండ్ర శేషగిరిరావు
పుట్టిన తేది : 10-9-1903
జన్మస్థలము : పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు తాలూకా ‘ముక్కామల’ గ్రామం.
తల్లిదండ్రులు : అచ్చమ్మ, రామయ్య
విద్యాభ్యాసం-వివరాలు: ముక్కామల గ్రామంలోను, రాజమహేంద్రవరం లోనూ చదివి, తర్వాత విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యా లయంలో బి. ఎ మొదటి జట్టు విద్యార్థిగా ఉత్తీర్ణు లయ్యారు.
సాహిత్యసేవ : 1933లో ‘ఆంధ్రభూమి’ అనే పత్రికను స్థాపించి 10 సం॥రాల పాటు నిరాఘాటంగా సాహిత్యసేవ చేశారు.
నడిపిన పత్రికలు : ఆరోగ్యసుధ, ఆంధ్రకీర్తి
పత్రికా సహసంపాదకునిగా : గృహలక్ష్మి, ప్రజామిత్ర, ఆనందవాణి అనే మరో మూడు పత్రికలకు సహసంపాదకులుగా వ్యవహరించారు.
రచనల జాబితా :
- ఆంధ్ర రమణీమణులు
- ఆంధ్ర రాజభక్తులు
- ఆంధ్ర విదుషీమణులు
- ఆంధ్ర వీరయువకులు
- ఆంధ్ర సారస్వత వ్యాసావళి
- ఆంధ్ర కవుల అద్భుత మహిమల కథలు
- ఆంధ్ర బాలల వికట కవితా వినోదిని
ఆహార విజ్ఞాన రచనలు :
- కాయకూరలు
- దుంపకూరలు
- ఫలజాతులు
- ఆవుపాలు
- ఆకుకూరలు
ప్రత్యేకతలు : ఆయన రచనలలో ఒకటైన ఆంధ్ర రాజభక్తులు బరంపురం విశ్వవిద్యాలయంలోను, ఆంధ్ర రమణీమణులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను పాఠ్యగ్రంథాలుగా విద్యార్థులను అలరించాయి.
సాహితీ గుర్తింపు : శేషగిరిరావుగారి ‘తిక్కన నవ్వులు’, ‘మహారాష్ట్ర పాలకుల వాఙ్మయ సేవ’ అనే రచనలు విమర్శకులచే కొనియాడబడినాయి.
మరణం : వీరు 22-03-2001న కీర్తిశేషులయ్యారు. జీవించినంత కాలం ఆంధ్రవాఙ్మయ సేవలో తరించారు.
పాఠ్యభాగ నేపథ్యం
విజయనగర సామ్రాజ్య ఉత్థాన, పతనాలు రెండూ తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగాన్ని, ఆపై క్షీణదశను మిగిల్చాయి. చారిత్రక తళ్ళికోట యుద్ధానంతరం దక్షిణాది అరాజకత్వంలో చిక్కుకోగా, కళాపోషణ కరువైన ఆ క్లిష్ట సమయంలో తమిళనాడులోని తంజావూరు, మధురనాయక రాజ్యాలు తెలుగు సాహిత్యానికి వెన్నుదన్నుగా నిలిచాయి. ముఖ్యంగా తంజావూరు పాలకులు తెలుగు కవిత్వానికి పునర్వైభవం కల్పిస్తూ ఆదరణ అందించారు.
విజయరాఘవ నాయకుని పాలనాకాలంలో తంజావూరు కళావైభవం శిఖరాగ్రానికి చేరుకోగా, ఆయన కొలువులో సుప్రసిద్ధ కవయిత్రి రంగాజమ్మ తన అద్భుత ప్రతిభతో విరాజిల్లారు. అష్టభాషా కోవిదురాలైన రంగాజమ్మ బహుముఖ ప్రజ్ఞా పాటవాలను, ఆమె కవితా మాధుర్యాన్ని పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగం నేపథ్యం.
![]()
పాఠ్యభాగ ఉద్దేశ్యం
రంగాజమ్మ అసాధారణమైన పాండిత్యం, విమర్శకులు సైతం ప్రశంసించే స్థాయికి చేరుకుంది. ఆమె ప్రత్యేక వ్యక్తిత్వం, అద్భుతమైన తెలివితేటలు నేటితరానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. తెలుగు వారందరూ గర్వించదగ్గ విదుషీమణి అయిన రంగాజమ్మ, ఇతర ప్రాంతాలలో (ద్రవిడదేశం) సైతం తెలుగుసాహిత్య జెండాను రెపరెపలాడించిన ధీమణి. అటువంటి గొప్ప కవయిత్రి గురించి విద్యార్థులు తెలుసుకొని, ఆమె అకుంఠిత దీక్షను ఆదర్శంగా తీసుకోవాలన్నదే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
కఠిన పదాలకు అర్థాలు
50వ పేజి :
జలాలు = నీళ్ళు
అలరారు = ప్రకాశించు
సస్యశ్యామలం = పచ్చదనం
గోత్రం = వంశాన్ని తెలిపే సంకేతం
మైలు = 8 ఫర్లాంగులు, అరక్రోసు దూరం
క్షేత్రం = తీర్ధం,పుణ్యస్థలం
జీవరేఖ = ప్రాణరేఖ
శతాబ్ది = వంద సంవత్సరాలు
వృద్ధి = పెరుగుదల
దానధర్మాలు = పుణ్యకర్మలు
వైభవము = సంపద, గొప్పతనం
పెండేరము = కాలికి వేసే ఆభరణం
ధ్వజం = జెండా, పతాకం
వైతాళికులు = మేల్కొలిపేవారు
పేరోగలం = సభ, ఆస్థానం
నిత్య౦ = రోజూ
పట్టపురాణి = రాజపత్ని, మహిషి, దేవి
అసామాన్య = అసాధారణ
ప్రజ్ఞ = తెలివితేటలు
దయ = జాలి
అబ్బడం = లభించడం
దైవం = దేవత
52వ పేజి :
పాండిత్యం = జ్ఞానం
సమకాలికులు = ఒకే కాలంలోనివారు
నిండుగా = ఎక్కువగా
స్వహస్తాలు = వారి చేతులు
పత్రికలు = లేఖలు
శతం = నూరు
‘అష్టభాషలు = ఎనిమిది భాషలు
ప్రవీణురాలు = ప్రావీణ్యం (నేర్పు) కలిగిన స్త్రీ
మీమాంస = ప్రమాణాలచే నిజం గ్రహించడం జ్ఞానకాండ
తర్కం = ఊహ, కారణం, ఒక శాస్త్రం
ఆగమశాస్త్రం = వేదాలను ఆధారం చేసుకొని జ్ఞాన నిరూపణ చేసే పద్ధతి
కౌశలం = నైపుణ్యం
కామధేనువు = గోవు, కోరిన కోర్కెలు తీర్చే ఆవు
ఆనందం = సంతోషం
విలాసం = నివాసం
పత్నులు = భార్యలు
మన్నన = పొగడ్త, మెచ్చుకోలు
చనువు = అనురాగం, అధికారం
గతి = దిక్కు, మార్గం
అలభ్యం = దొరకనివి
శతక్రతు = వంద యజ్ఞాలు చేసినవారు
సాహితీభోజుడు = సాహిత్యాన్ని పోషించేవాడు
పురాణ పారీణుడు = పురాణాలలో నేర్పరి, పురాణ జ్ఞానం ఉన్నవాడు
సంగీతవేది = సంగీతంలో విద్వాంసుడు
భారతీదేవి = సరస్వతీదేవి
కైంకర్యాలు = భగవంతునికి భక్తులు చేసే సేవ
తిరునాళ్ళు = తీర్థం, ఉత్సవాలు
కనకాభిషేకం = బంగారంతో అభిషేకం
సర్వోన్నత = మిక్కిలి గొప్పదైన
సత్కారం = సన్మానం
కొలువు = సభ
తలమానికం = శ్రేష్ఠమైనది, అలంకారం కోసం తలపై పెట్టుకొనే రత్నం
గోష్ఠి = సభ
ఘన = గొప్ప
యశస్సు = కీర్తి
కనకం = బంగారం
![]()
53వ పేజి :
ప్రబంధం = ఒక సాహిత్య ప్రక్రియ
గుజ్జనగూళ్ళు = బాలికలు ఆడుకునే ఆట
వివాహం = పెళ్లి
దాగిలిమూతలు = దాగుడుమూతలు
గుజగుజ తేకులు = కప్పగంతుల ఆట, అచ్చంగాయలు
జాఱుడు పీటలు = జలక్రీడలలో ఉపయోగించే సాధనం
జలవిహారాలు = నీటిలో ప్రయాణం
దృశ్యాలు = సన్నివేశాలు
చెలికత్తె = మిత్రురాలు, సేవకురాలు
అపహరించడం = దొంగలించడం
ఘట్టం = సన్నివేశం, సందర్భం
మనోహరం = మనస్సుకు ఆహ్లాదంగా
1. సీ. వాయుతనూజుండు వాయువేగంబున
సంజీవనిం దెచ్చు చందమునను
వినతాతనూజుండు వేడుక మీరంగ
నమృతంబుఁ దెచ్చిన యందమునను
నల్ల భగీరథుం డాత్మ నుప్పొంగుచు
నమరనదిం దెచ్చు నట్టి లీలఁ
జెలువంబు వెలయంగ శ్రీరాజమన్నారు
పారిజాతముఁదెచ్చు భావమునను
తే.గీ. సత్యవతిని భీష్ముడు దెచ్చు సరవి మెఱయఁ
గుండలము లుదంకుడు దెచ్చు కూర్మి నెరయ
నమర సౌగంధికంబుల ననిలజుండు
దెచ్చు కైవడి ననిరుద్ధు దెచ్చె వేగ.
ప్రతిపదార్థము :
వాయుతనూజుండు = వాయుపుత్రుడైన హనుమంతుడు
వాయువేగంబున = గాలివేగంతో
సంజీవనిన్ = సంజీవని పర్వతాన్ని
తెచ్చుచందమునన్ = తీసుకువచ్చిన విధంగా
వినతా తనూజుండు = వినత కుమారుడు (గరుత్మంతుడు)
వేడుక మీరంగన్ = మిక్కిలి ఉత్సాహంతో
అమృతంబు = అమృతాన్ని
తెచ్చిన యందమునను = తెచ్చిన అందమైన రీతిలో
నల్ల (నల) = ఆ
భగీరథుడు = భగీరథుండు
ఆత్మ ఉప్పొంగుచు = ఉప్పొంగే మనస్సుతో
అమరనదిన్ = ఆకాశగంగను
తెచ్చునట్టి లీలన్ = తీసుకొచ్చినట్లు
శ్రీరాజమన్నారు = శ్రీకృష్ణుడు
పారిజాతమునన్ = పారిజాత వృక్షాన్ని
తెచ్చుభావమునను = తెచ్చిన పద్ధతిలో
భీష్ముడు = భీష్ముడు
సత్యవతిని = సత్యవతిని (విచిత్ర వీర్యుని కోసం)
తెచ్చుసరవి = తెచ్చిన పద్దతితో
ఉదంకుడు = ఉదంకుడు అనే శిష్యుడు
కుండలములు = దివ్యమైన కుండలాలను
తెచ్చు కూర్మినెరయన్ = ప్రీతిగా తెచ్చినట్లు
అనిలజుండు = భీముడు
అమర = దేవలోకానికి చెందిన
సౌగంధికంబుల = సౌగంధికా పుష్పాలను
తెచ్చుకైవడి = తెచ్చిన విధంగా
అనిరుద్ధున్ = అనిరుద్ధుడిని
తెచ్చెవేగన్ = (చిత్రలేఖ) అతివేగంగా తీసుకొని వచ్చింది.
ఈ పద్యంలో ఉష చెలికత్తె అయిన చిత్రలేఖ, ద్వారకానగరం నుండి శ్రీకృష్ణుని మనమడైన అనిరుద్ధుణ్ణి అపహరించి తెచ్చిన సందర్భాన్ని మనోహరంగా వర్ణించింది.
తాత్పర్యము : హనుమంతుడు వాయువేగంతో సంజీవని పర్వతాన్ని తెచ్చినట్లు, మిక్కిలి ఉత్సాహంతో గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చినట్లు, భగీరథుడు గంగను భూమికి తెచ్చినట్లు, శ్రీకృష్ణుడు పారిజాతవృక్షాన్ని తెచ్చినట్లు, భీష్ముడు విచిత్రవీర్యుని కోసం సత్యవతిని తీసుకువచ్చినట్లు, ఉదంకుడు గురుదక్షిణగా కుండలాలు తెచ్చినట్లు, భీముడు ద్రౌపది కోసం సౌగంధిక పుష్పాలు తెచ్చినట్లు, చిత్రలేఖ అనిరుద్ధుణ్ణి వాయువేగంతో, పరాక్రమంతో, చాకచాక్యంగా తీసుకువచ్చింది.
యక్షగానం = ఒక జానపద కళారూపం, వీధి నాటకం
అభినయం = నటన
హాస్యం = నవ్వు
మచ్చుకు = ఉదాహరణగా
జ్యోతిష్యులు = భూత, భవిష్యత్తులను చెప్పేవారు
ప్రశ్న = ఒక రకమైన జ్యోతిష్యం
జాతకం = జాతకచక్రం
బిచ్చము = తిరిపెం, పిడికిలితో యాచించడం
పల్లకీ = మనుష్యులు మోసే వాహనం, అందలం
![]()
54వ పేజి :
ఫలభాగం = ప్రయోజనం
ముత్తైదువ = సుమంగళి
వక్క = పోక చెక్క (తాంబూలంలో వేసుకునేది)
గానుగపిండి = తెలగపిండి (వేరుశనగపిప్పి)
కడమవారు = మిగిలినవారు
శాకునిక = పక్షుల వేటగాడు
ఆణిముత్యాలు = రత్నాలు
పచ్చకర్పూరం = అబ్దసారము
వజ్రాల పేరులు = వజ్రాల దండలు
కస్తూరి = మృగమదం (సువాసన ద్రవ్యం)
శోభ = కాంతి
బెత్తము = కర్ర, చువ్వ, సజ్జన కోల
కొప్పు = జడ
తార్కాణం = ఉదాహరణ, దృష్టాంతం
వడ్డాణం = నడుముకి పెట్టుకునే ఆభరణం
పామరులు = సామాన్యులు (చదువు లేనివారు)
కళానిధి = కళలకు నిలయం
విద్వాంసులు = పండితులు
మాలలు = దండలు, సరులు