తెలుగుదనము Questions and Answers Summary Inter 2nd Year Telugu

Reviewing AP Inter 2nd Year Telugu Study Material గద్యభాగం 5th Lesson తెలుగుదనము Questions and Answers Summary can help students prepare confidently for exams.

AP Inter 2nd Year Telugu తెలుగుదనము Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలను వివరించండి.
జవాబు:
కవి పరిచయం : భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. అందులో తెలుగు సంస్కృతికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. “తెలుగు” అన్న పదం కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా, ఒక జీవన విధానానికి, మహోన్నతమైన చరిత్రకు మరియు ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రముఖ పరిశోధకులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు తన వ్యాసంలో తెలుగువారి మూలాలను, ఇతర భాషా ప్రాంతాలతో గల సంబంధాలను మరియు తెలుగుతనం యొక్క గొప్పదనాన్ని అద్భుతంగా వివరించారు. ఆంధ్రులు అన్నా, తెలుగువారు అన్నా ఒక్కరే అనే భావనతో, మన పూర్వీకులు అందించిన వారసత్వాన్ని నేటి తరానికి పరిచయం చేశారు.

పంచద్రావిడ సంస్కృతి – ఆంధ్రుల స్థానం : ప్రాచీన కాలం నుండి భారతదేశాన్ని భౌగోళికంగా, భాషాపరంగా విడదీసినప్పుడు ‘పంచద్రావిడ’ అనే పదం కనిపిస్తుంది. “ఆంధ్ర, ద్రావిడ (తమిళ), కర్నాట, మహారాష్ట్ర, గుర్జర (గుజరాతీ) భాషలు మాట్లాడే ప్రజలను పంచద్రావిడులుగా పేర్కొన్నారు. ఈ ఐదు భాషల వారి మధ్య ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలు మరియు కవితా గానాల్లో చాలా పోలికలు ఉన్నాయి.

ముఖ్యంగా రెండు వేల సంవత్సరాల క్రితం, శాతవాహనులు మరియు ఇక్ష్వాకుల పరిపాలనలో ఆంధ్రులకు మహారాష్ట్రులు మరియు గుర్జరులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఉత్తర భారతదేశంలోని ‘పంచగౌడుల’ (సారస్వత, కన్యకుబ్జ, గౌడ, ఉత్కల, మైథిల కంటే, దక్షిణాన ఉన్న పంచద్రావిడుల మధ్య సంస్కృతి పరమైన ఏకరూపత ఎక్కువగా కనిపిస్తుంది. నేటికీ ఆంధ్రులకు, తమిళులకు మరియు కన్నడిగులకు మధ్య ఉన్న విడదీయలేని సంబంధం ఈ ప్రాచీన వారసత్వానికి నిదర్శనం.

ఆంధ్రుల ఆహార సంప్రదాయం : తెలుగువారి ఆహారపు అలవాట్లు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి మరియు సంప్రదాయానికి కూడా ప్రాధాన్యతనిస్తాయి. ఆదిశంకరాచార్యుల వంటి మహనీయులు రచించిన పూజా స్తోత్రాల్లోని నైవేద్య క్రమవర్ణనను గమనిస్తే, రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఆహార పద్ధతులే నేటికీ కొనసాగుతున్నాయని అర్థమవుతుంది.

తెలుగువారి ప్రధాన భోజనంలో :
శాల్యన్నము (వరి అన్నం): ఇది మన ప్రధాన ఆహారం. నెయ్యి, పప్పు : భోజనం మొదట్లో వీటితో ప్రారంభించడం తెలుగు సంప్రదాయం. కూరలు, పచ్చళ్ళు : రకరకాల కూరగాయలు, నిల్వ పచ్చళ్ళు తెలుగువారి భోజనంలో ప్రత్యేక ఆకర్షణ.

దప్పళము : దీనినే మనం సాంబారు లేదా పులుసు అని పిలుస్తాము. పెరుగు : భోజనం ముగింపులో పెరుగు లేదా మజ్జిగ ఉండాల్సిందే. ఈ ఆహార క్రమం ప్రాచీన కాలం నుండి మార్పు లేకుండా రావడం విశేషం. ఇది మన సంస్కృతిలోని స్థిరత్వాన్ని మరియు రుచి పట్ల ఉన్న మక్కువను తెలియజేస్తుంది.

ఆహార్యం – వేషధారణ మరియు అలంకరణ :
తెలుగువారి వేషధారణ కాలక్రమేణా ఇతర సంస్కృతుల ప్రభావంతో పరిపుష్టమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రాచీన కాలంలో తెలుగువారికి ‘పైట’ వేసుకునే అలవాటు లేదు. మహారాష్ట్రులతో ఉన్న సంబంధాల కారణంగా, నాటి ఆంధ్ర రాజధాని ‘పైఠాన్’ (ప్రతిష్ఠానపురం) నుండి ఈ పైట వేసుకునే పద్ధతి వ్యాపించింది. ‘పైఠాన్’ అనే పదమే కాలక్రమేణా ‘పైట’గా మారింది.

తెలుగు స్త్రీల వేషధారణ గురించి వివరిస్తూ వేటూరి వారు – “పువ్వులను పుక్కిలించు కొప్పు, మణిమయమైన వడ్డాణము, రక్తహారము (ఎర్రని పూసల దండ), తెల్లని చీర” అని పేర్కొన్నారు. ఇది తెలుగు వనిత యొక్క సహజ సౌందర్యానికి, హుందాతనానికి నిదర్శనం. ప్రాచీన సంస్కృత కవులు సైతం ఆంధ్ర స్త్రీలను సౌందర్యవతులుగా, నృత్య గాన ప్రియులుగా మరియు అమాయక స్వభావం కలవారిగా కొనియాడారు.

తాళిబొట్టు – కమ్మల విశిష్టత : తెలుగువారి వివాహ సంప్రదాయంలో ‘మంగళసూత్రం’ లేదా ‘తాళిబొట్టు’కు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ ఆచారం ఉత్తర భారతీయులలో లేదు, వారి గృహ్యసూత్రాలలో కూడా దీని ప్రస్తావన కనిపించదు.

తాళిబొట్టు : ‘తాళి’ అంటే ‘తాడి’ అని అర్థం. పూర్వకాలంలో తాటియాకును చుట్టగా చుట్టి, దానికి పసుపు పూసి, నూలి దారంతో వధువు మెడలో వరుడు కట్టేవాడు. అందుకే దానికి ‘తాళి’ అనే పేరు వచ్చింది.

కమ్మలు : ప్రాచీన కాలంలో స్త్రీలు తాటియాకులనే చుట్టలుగా చుట్టి చెవులకు ధరించేవారు. ‘తాటాకు’ అనే పదమే సంస్కృతంలో ‘తాటంకము’గా మారింది. తెలుగులో దీనినే ‘చెవాకు’ అని కూడా అంటారు.

ఈ విధంగా తాటిచెట్టు తెలుగువారికి ‘కల్పవృక్షం’లా ఉపయోగపడింది. తాళి కట్టడం, చెవులకు కమ్మలు ధరించడం వంటి ఆచారాలు తెలుగువారి నుండే ఇతర ద్రావిడ భాషా ప్రజలకు వ్యాపించాయి.

సామాజిక వర్గాలు ఉమ్మడి లక్షణాలు : తెలుగు జాతిలో అనేక అంతర్విభాగాలు (కులవృత్తులు, వర్ణాలు) ఉన్నాయి. మాలలు, మాదిగలు, రెడ్లు, వెలమలు, కమ్మలు, కాపులు, కోమట్లు, రాజులు ఇలా అష్టాదశ వర్ణాల ప్రజలు తెలుగు గడ్డపై నివసిస్తున్నారు. వీరిలో భిన్నత్వమున్నా, కొన్ని సామాన్య ధర్మాలు అందరినీ ‘ఆంధ్రులు’గా ఏకం చేస్తున్నాయి. ఆ సామాన్య గుణాలను ఒక పద్యం ద్వారా వేటూరి వారు వివరించారు.

తెలుగుదనము Questions and Answers Summary Inter 2nd Year Telugu

పద్యం:
“ఆతిథ్య గౌరవంబును,
స్వాతంత్య్రప్రియత, స్వల్పసంతోషము, దు
ర్నీతివిహీనత, నైచ్యా
పేతత్వము నంధ్రులందు పేర్పడు గుణముల్”

ఈ పద్యం ప్రకారం ఆంధ్రుల ప్రధాన లక్షణాలు :

  1. అతిథి మర్యాద : ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం.
  2. స్వేచ్ఛాభిలాష : బానిసత్వాన్ని ఇష్టపడకుండా స్వాతంత్య్రంగా ఉండటం.
  3. తృప్తి : ఉన్నదానితో సంతృప్తి చెందడం (స్వల్ప సంతోషం).
  4. నీతిమంతులు : దుర్నీతికి దూరంగా ఉండటం.
  5. గౌరవప్రదమైన జీవనం : నీచత్వానికి ఒగ్గకుండా ఉండటం.

ముగింపు : తెలుగు సంస్కృతి కేవలం ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైంది కాదు. ఇది వేల సంవత్సరాల చరిత్రను, ఇతర సంస్కృతులతో జరిగిన సమ్మేళనాన్ని మరియు గొప్ప మానవీయ విలువలను తనలో ఇముడ్చుకుంది. మన ఆహారం, ఆహార్యం, ఆచారాల వెనుక ఉన్న అర్థాలను తెలుసుకోవడం వల్ల నేటి తరం విద్యార్థులలో తమ జాతి పట్ల గౌరవం, మమకారం పెరుగుతాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వివరించినట్లుగా, ఈ ఉన్నతమైన విలువలను కాపాడుకుంటూ, తెలుగుతనపు పరిమళాలను ప్రపంచవ్యాప్తంగా చాటడం మనందరి బాధ్యత.

ప్రశ్న 2.
తెలుగు సాహిత్య వైభవాన్ని తెలియజేయండి.
జవాబు:
పరిచయం : ఒక జాతి ఉనికి ఆ జాతి భాష మరియు సాహిత్యం మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు భాష “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. తెలుగువారి స్వరూప స్వభావాలు ఎంతటి ఉదాత్తమైనవో, వారి భాషా సాహిత్యాలు కూడా అంతటి మాధుర్యాన్ని, గాంభీర్యాన్ని కలిగి ఉన్నాయి. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు తెలుగు భాషా సౌందర్యాన్ని, సాహిత్య సృజనలోని వైవిధ్యాన్ని ఈ పాఠ్యభాగంలో అద్భుతంగా ఆవిష్కరించారు.

1. తెలుగు భాషా సౌందర్యం – ఉచ్చారణా వైశిష్ట్యం :
తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదైనప్పటికీ, మిగిలిన భాషల కంటే భిన్నమైన, సుందరమైన ఉచ్ఛారణను కలిగి ఉంది. అందుకే “తెలుగు తేట” అనే నానుడి స్థిరపడింది.

అజంత భాష : తెలుగు భాషా పదాలు ప్రాయికముగా ‘అజంతములు’ (అచ్చు అంతమున కలవి), దీనివల్ల ప్రతి పదాన్ని స్పష్టంగా, విడివిడిగా పలకడానికి వీలవుతుంది. ఇది సంగీతానికి, గానానికి ఎంతో అనువైన లక్షణం. అక్షర

సంపద : ఇతర ద్రావిడ భాషల్లో లేనన్ని అక్షరాలు తెలుగులో ఉన్నాయి. సంస్కృతంలోని వర్గయుక్కులు (మహా ప్రాణాక్షరాలు) కూడా తెలుగులో చేరడం వల్ల, ఈ భాషకు ఒక గాంభీర్యం చేకూరింది.

వేదోచ్చారణ : భారతదేశం మొత్తం మీద వేదాలను అత్యత స్పష్టంగా, శాస్త్రీయంగా ఉచ్చరించడంలో ఆంధ్రులు ప్రఖ్యాతి గాంచారు. తెలుగువారి ఆహార విహారాలు బలిష్ఠమైనవి కావడంతో వారి కంఠస్వరం దృఢంగా గంభీరంగా ఉంటుంది.

2. సాహిత్య త్రివేణి సంగమం – కవిత్రయం :
తెలుగు నేలకు గోదావరి, కృష్ణ, పినాకిని (పెన్న) నదులు ఎలాగైతే జీవనాధారములో, తెలుగు సాహిత్యానికి ‘కవిత్రయం’ (నన్నయ, తిక్కన ఎఱ్ఱన) వారు జీవనాధారము. నన్నయ : ధర్మోపాఖ్యానాల ద్వారా కథా గమనాన్ని నడిపిన ఆదికవి. తిక్కన : నాటకీయతను, మర్మ కవితలను ప్రవేశపెట్టిన కవిబ్రహ్మ. ఎఱ్ఱన : వర్ణనా సౌభాగ్యంతో ప్రబంధ పరమేశ్వరుడిగా పేరుగాంచినవాడు. ఈ ముగ్గురు కవులు ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో రసధారలను పారించి, భావి కవులకు దిశానిర్దేశం చేశారు. వీరి రచనలు నీతిబాల్యం కాకుండా, సదాచార సంపన్నంగా ఉండి నేటికీ ‘మేలుబంతి’గా నిలుస్తున్నాయి.

3. తెలుగు కవుల కావ్య సృష్టి – రస వైవిధ్యం :
తెలుగు సాహిత్యం కేవలం అనువాదాలకే పరిమితం కాలేదు. ప్రతి కవి తనదైన శైలిలో తెలుగువారి జీవన చిత్రణను కావ్యాల్లో పొందుపరిచారు.

శ్రీనాథుడు : ఆంధ్రదేశపు శివ సౌందర్యాన్ని, శయ్యా సౌభాగ్యాన్ని తన పద్యాల్లో నింపాడు. కాశీ, భీమ ఖండాల్లో ఆంధ్రదేశ వైభావాన్ని వర్ణించాడు. పోతన : భక్తి రసామృత్యాన్ని సామాన్యులకు కూడా చేరువ చేసిన సహజ కవి.

ప్రబంధ కవులు : అల్లసాని పెద్దన, నంది తిమ్మన వంటి కవులు మనోజ్ఞమైన ప్రబంధాలను సృష్టించగా, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి వంటి వారు కథా కల్పనలో విశేష ప్రతిభ కనబరిచారు.

ద్విపద సాహిత్యం : సోమన, రంగనాథుడు, గౌరన వంటి కవులు ద్విపద ఛందస్సు ద్వారా దేశి కవితా వైభావాన్ని చాటారు.

శతక సాహిత్యం : సుమతి, భాస్కర, వేణుగోపాల శతకాలు తెలుగువారికి నీతిని, చమత్కారాన్ని నేర్పాయి. వేమన పద్యాలు లోకరీతిని విమర్శనాత్మకంగా, వినోదాత్మకంగా వివరించాయి.

4. గాన వైభవం – భక్తి సంగీతం :
తెలుగువారి భక్తి జీవితానికి ముగ్గురు కవులు / వాగ్గేయకారులు ప్రాణప్రతిష్ఠ చేశారు. వారే పోతరాజు (పోతన), త్యాగరాజు, గోపరాజు (రామదాసు). త్యాగయ్య, రామదాసుల గేయాలు అమృతధారల వంటివి. వీటిలోని సంగీత సామాగ్రి తెలుగువారి హృదయాలను భక్తితో ఓలలాడిస్తుంది. ‘అరవమెత్తదనమును, సంస్కృతపు బింకమును’ మేళవించుకున్న తెలుగు భాష, సంగీతకారులకు అత్యంత ప్రియమైన భాషగా మారింది.

5. ఆంధ్రప్రదేశ్ వర్ణన – సాహిత్యంలో దేశాభిమానం :
ప్రాచీన తెలుగు కవులు తమ కావ్యాల్లో తెలుగు నేల పట్ల గల మమకారాన్ని చాటుకున్నారు. జక్కన ‘విక్రమార్క చరిత్ర’లోను, పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లోను, అజ్జరపు పేరయ ‘ఉడయనంబి విలాసం’లోను ఆంధ్రదేశ సౌభాగ్యాన్ని, ఇక్కడి ప్రజల జీవనశైలిని ఎంతో గొప్పగా వర్ణించారు.

ముగింపు :
తెలుగు సాహిత్య భాండాగారం ఎంతో సంప్నమైది. అది నన్నయ నుండి నేటి నవకవుల వరకు ఒక నిరంతర ప్రవాహంలా సాగుతోంది. సంస్కృత ప్రభావం ఉన్నప్పటికీ, తనదైన విశిష్టతను కాపాడుకుంటూ తెలుగు సాహిత్యం దేశి మరియు మార్గ రీతులను సమన్వయం చేసింది. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చెప్పినట్లుగా, ఈ సాహిత్య సంపదను, భాషా సౌందర్యాన్ని కాపాడుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత. మన పూర్వీకులు అందించిన ఈ దివ్య కావ్య సస్యాలను పండించుకుంటూ, తెలుగు సాహితీ జ్యోతిని వెలిగించడం మనందరి కర్తవ్యం.

తెలుగుదనము Questions and Answers Summary Inter 2nd Year Telugu

II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలుగువారి గుణ స్వభావాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఆంధ్రులు ఇంటికి వచ్చిన అతిధులను గౌరవిస్తారు.
  2. ఆంధ్రులు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు.
  3. ఆంధ్రులు చిన్న విషయాలను ఆనందపడే అల్ప
  4. ఆంధ్రులు నీతిమంతులు.
  5. ఆంధ్రులు మంచి బుద్ధిగలిగినవారు, ఆత్మగౌరవం కలిగినవారు.
  6. తెలుగువారు మోసపూరిత ఆలోచనలను సహించరు.
  7. ఆంధ్రులు రకరకాల విద్యలు నేర్చుకుంటారు.
  8. ఆంధ్రులకు బుద్ధిచాతుర్యం ఎక్కువ.
  9. ఆంధ్రులు స్నేహంగా, ప్రేమగా ఉంటారు.
  10. అహంకారం తక్కువ. కానీ గంభీరత్వంలో గర్వం కనిపిస్తుంది.
  11. ఆంధ్రులు రాజసం కలిగిన శరీరం కాంతితో ఉంటారు.
  12. ఆంధ్రులు శారీరకంగా, మానసికంగా బలవంతులు.

ప్రశ్న 2.
తెలుగువారు ఇష్టపడే ఆహార పదార్థాలను వివరించండి.
జవాబు:
తెలుగుదేశంలో ప్రజలు మంచి ఆహార ప్రియులు. వారు క్రొత్త బియ్యంతో వండిన అన్నం, కాయగూరలు, బొబ్బట్లు, బూరెలు, పంచదార వంటకాలను ఇష్టపడతారు. ఇంకా ఆహారంలో అల్లం, వడలు, మీగడ పెరుగులు, వాటిల్లో ఇంగువ, జీలకర్ర, మిరియాలు మరియు సువాసన గలిగిన నెయ్యిని ఇష్టపడతారు. భోజనం చేశాక తాంబూలం వేసుకుంటారు. కోనసీమ ప్రాంతంలో అరటిపండ్లు, మామిడిపండ్లు, పనసతొనలు, కలకండను ఆహారంలో భాగంగా తీసుకుంటారు.

వంకాయ, కొబ్బరికాయలను వాడతారు. బైళ్ళు వంటి రకరకాల పిండిపదార్థాలను తింటారు. కంద, పెండలం వంటి దుంపకూరలు, అమృతంతో సమానమైన పండ్లరసాలు, సన్ననిబియ్యం అన్నం, పరమాన్నం, ఊరగాయలు, పచ్చళ్ళు, ఎండ బెట్టిన వరుగులు, వడియాలను ఆరగిస్తారు.

ప్రశ్న 3.
వేటూరి ప్రభాకరశాస్త్రి గారి గురించి వ్రాయండి.
జవాబు:
వేటూరి ప్రభాకర శాస్త్రిగారు గొప్ప పరిశోధకులు. ఆయన జీవిత కాలంలో ఎన్నో గ్రంథాలను పరిష్కరించారు, ప్రచురించారు. తాళపత్ర, తామ్రపత్ర, శాసన అన్వేషణలో వందల గ్రామాలు పర్యటించారు. ఆయన ఒక్కరే వందల మంది పండితులు చేయగలిగిన పరిశోధన చేశారు.

జన్మ విశేషాలు : ప్రభాకర శాస్త్రిగారు 7-2-1888న కృష్ణాజిల్లా పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించారు. శేషమ్మ, సుందరరామశాస్త్రి వారి తల్లిదండ్రులు.

విద్యాభ్యాసం : వీరు ప్రాథమిక విద్యను పెదకళ్ళేపల్లి వీధిబడిలో మద్దూరి ‘ రామావధానుల వద్ద ప్రారంభించారు. తర్వాత చల్లపల్లిలో అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారి వద్ద, బందరులో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి వద్ద విద్యాభ్యాసం సాగించారు.

ఉద్యోగం : 1910లో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్చపరిశోధనాలయంలో ఉద్యోగిగా చేరారు. అక్కడే వివిధ హోదాలలో పనిచేస్తూ, తమ యావత్ జీవితాన్ని తెలుగు వాఙ్మయ పరిశోధనలకు ధారపోశారు.

రచనలు :

  1. 14 ఖండకావ్యాలు వ్రాశారు.
  2. సీతాఫలం, బాలభాష (బాలసాహిత్యం)
  3. తెలుగు మెఱుగులు, మీగడ తఱకలు, సింహావలోకనం (తెలుగు వ్యాస సంకలనాలు)
  4. ప్రజ్ఞాప్రభాకరం (స్వీయచరిత్ర)

పరిష్కరణలు – ప్రచురణలు : గణితసార సంగ్రహం, చాటుపద్య మణిమంజరి, తంజావూరి ఆంధ్రరాజుల చరిత్ర, ప్రబంధ రత్నావళి, ఉద్భటారాధ్య చరిత్ర, సుగ్రీవ విజయం, వేంకటేశ్వర వచనములు, సుభద్రా కళ్యాణం, అన్నమాచార్య చరిత్ర, కాటమ రాజు కథ, సకల నీతి సమ్మతం మొదలైన అపురూప గ్రంథాలను పరిష్కరించి, ప్రచురించారు. క్రీడాభిరామానికి శుద్ధ ప్రతిని పూర్తి చేశారు. అన్నమాచార్య సాహిత్యాన్ని ఉద్ధరించి ప్రచారంలోకి తెచ్చారు. వీరి కృషికి నివాళిగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి వాఙ్మయ పీఠాన్ని ఏర్పరిచి, వీరి రచనలను ముద్రిస్తున్నారు. శాస్త్రిగారు 1950 ఆగష్టు 29న తుదిశ్వాస విడిచారు.

తెలుగుదనము Questions and Answers Summary Inter 2nd Year Telugu

III. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్ర, ద్రవిడ, కర్నాట, మహారాష్ట్ర, గుర్జరులను కలిపి ఏమని పిలిచేవారు?
జవాబు:
‘పంచ ద్రావిడులు’ అని ఆంధ్ర, ద్రవిడ, కర్నాట, మహారాష్ట్ర, గుర్జరులను పిలుస్తారు.

ప్రశ్న 2.
‘పైట’ అనే పదం యొక్క మూలరూపం ఏమిటి ?
జవాబు:
పైఠాన్ అనే పదం పైటకు మూలరూపం.

ప్రశ్న 3.
తాటాకు అనే తెలుగు పదం సంస్కృతంలో ఎలా రూపాంతరం చెందింది ?
జవాబు:
తాటాకు సంస్కృతంలో తాటంకంగా రూపాంతరం చెందింది.

ప్రశ్న 4.
భారతదేశ మంతటికినీ ఆంధ్రులు ఏ విషయంలో ప్రఖ్యాతి పొందారు ?
జవాబు:
‘వేదోచ్చారణ’లో ఆంధ్రులు ప్రఖ్యాతి పొందారు. (అనగా వేదాన్ని పలకడంలో)

ప్రశ్న 5.
కవిత్రయము అంటే ఎవరు ?
జవాబు:
నన్నయ, తిక్కన, ఎఱ్ఱనలు కవిత్రయం.

ప్రశ్న 6.
తెలుగు అక్షరాలు ఎలా ఉంటాయని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు అన్నారు ?
జవాబు:
గుండ్రని ముత్యాలవలె ఉంటాయని ప్రభాకరశాస్త్రి గారు అన్నారు.

ప్రశ్న 7.
వేటూరి ప్రభాకరశాస్త్రి గారి స్వీయచరిత్ర పేరేమిటి ?
జవాబు:
వేటూరి ప్రభాకరశాస్త్రి గారి స్వీయచరిత్ర పేరు ప్రజ్ఞా ప్రభాకరం.

తెలుగుదనము Summary in Telugu

రచయిత పరిచయం

పాఠ్యాంశం పేరు : తెలుగుదనము
రచయిత: వేటూరి ప్రభాకరశాస్త్రి
పాఠ్యాంశం గ్రహించిన గ్రంథం : తెలుగు మెఱుగులు (వ్యాస సంకలనం)
జననం : 07 – 02 – 1888
జన్మస్థలము : కృష్ణాజిల్లా, పెదకళ్ళేపల్లి గ్రామం
తల్లిదండ్రులు : శేషమ్మ, సుందరరామశాస్త్రి
విద్యాభ్యాసం : ప్రాథమికవిద్యను పెదకళ్ళేపల్లి వీధిబడిలో చదివారు. తర్వాత చల్లపల్లి, బందరులో చదువుకున్నారు.
గురువుల : మద్దూరి రామావధానులు, అద్దేపల్లి సోమనాథశాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి.
ఉద్యోగం : 1910లో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయంలో ఉద్యోగిగా చేరి, వివిధ హోదాలలో పని చేశారు.
పరిశోధన : ఆయన జీవితకాలాన్ని పరిశోధనలకే ధారపోశారు. తాళపత్ర, తామ్రపత్ర, శాసన అన్వేషణలో వందల గ్రామాలు పర్యటించారు.
వేటూరి వారి పరిష్కరణలు / ప్రచురణలు :
గణితసార సంగ్రహం (1912)
చాటుపద్య మణిమంజరి (1913)
తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర (1914)
ప్రబంధ రత్నావళి (1918)
ఉద్భటారాధ్య చరిత్ర (1925)
సుగ్రీవవిజయం (1939)
వేంకటేశ్వర వచనములు (1945)
తాళ్ళపాక వారి సంకీర్తనలు (1949)
సుభద్రా కళ్యాణం (1950)
ఇవేగాక కాటమరాజు కథ, సకలనీతి సమ్మతము మొదలైనవి వీరి కృషి వలనే వెలుగుచూశాయి.

రచనలు :

  1. క్రీడాభిరామానికి శుద్ధప్రతి
  2. 14 ఖండకావ్యాలు
  3. సీతాఫలం, బాల భాష, (బాల సాహిత్యం)
  4. సింహావలోకనం, తెలుగు మెఱుగులు, మీగడ తఱకలు (వ్యాస సంకలనాలు)
  5. అన్నమాచార్య వాఙ్మయాన్ని ఉద్ధరించి ప్రచారంలోకి తెచ్చారు.

వేటూరి వారి స్వీయ చరిత్ర : ప్రజ్ఞా ప్రభాకరము. ప్రత్యేకతలు : వేటూరివారి కృషికి నివాళిగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠాన్ని ఏర్పరచి, వారి రచనలను ముద్రిస్తోంది. ప్రభాకరశాస్త్రి సోదరుడైన చంద్రశేఖర శాస్త్రి గారి కుమారుడే ప్రఖ్యాత చలనచిత్ర గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి. మరణం : 1950 ఆగష్టు 29న వీరు తుదిశ్వాస విడిచారు.

తెలుగుదనము Questions and Answers Summary Inter 2nd Year Telugu

పాఠ్యభాగ నేపథ్యం

ఆంధ్రదేశం, తెలుగుభాష మరియు మన తెలుగుతనం పట్ల అమితమైన మక్కువ కలిగిన మహనీయులలో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు అగ్రగణ్యులు. తెలుగువారికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణాలు, వారి అభిరుచులు మరియు మన సంస్కృతి యొక్క ‘లోతైన మూలాలను శాస్త్రీయంగా వివరించడంలో ఆయన సిద్ధహస్తులు. తెలుగు వారి జీవనవిధానంపై ఆయన వెలువరించిన సాధికారికమైన అభిప్రాయాల సమాహారమే ఈ ‘తెలుగుదనము’ అనే వ్యాసం.

పాఠ్యభాగ ఉద్దేశ్యం

తెలుగువారి విశిష్టమైన సంస్కృతిని, గొప్ప సంప్రదాయాలను నేటితరం విద్యార్థులకు అర్థమయ్యేలా పరిచయం చేయడమే ఈ పాఠం ప్రధాన ఉద్దేశ్యం. మనవారి ఆహారపు అలవాట్లు (ఆహారరుచులు), వేషధారణ (ఆహార్యం) మరియు తెలుగువారి సహజసిద్ధమైన స్వభావాలను వివరించడం ద్వారా విద్యార్థుల్లో తమ సొంత గుర్తింపు పట్ల అవగాహనను, గౌరవాన్ని పెంపొందించడం ఈ పాఠ్యాంశం యొక్క లక్ష్యం.

కఠిన పదాలకు అర్థాలు

82వ పేజీ:

పంచ = ఐదు
ప్రాచీనులు = పూర్వీకుల
ఆహారం = తిండి
విహారం = పర్యటనలు
మర్యాద = గౌరవం
అత్యధిక = ఎక్కువ
ఔత్తరాహులు = ఉత్తరదేశానికి చెందినవాళ్ళు
పంచ-ద్రావిడులు = 1) ఆంధ్రులు, 2) ద్రావిడులు, 3) కర్ణాటకలు , 4) మహారాష్ట్రులు, 5) గుర్జరులు
యేండు = సంవత్సరాలు
వ్యవహారము = వాడుక
తలపు = ఆలోచన

84వ పేజి:

శాల్యన్నము = వరి అన్నము
స్తోత్రములు = శ్లోకములు
నైవేద్యము = నివేదించిన వస్తువు
క్రమ = వరుస
దప్పళం = శుభకార్యాలలో, సంతర్పణంలో తయారు చేసే పులుసు
కొప్పు = జడ
వరుడు = పెళ్లికుమారుడు
నెలత = స్త్రీ
సౌందర్యవంతులు = అందం గలిగిన వాళ్ళు
నూలిబొందు = నూలుదారం
తాళి = తాడి చెట్టు ఆకు
తాటంకము = కమ్మలు, చెవాకులు
అష్టాదశ = 18

తెలుగుదనము Questions and Answers Summary Inter 2nd Year Telugu

పద్య౦:
కం. “ఆతిథ్య గౌరవంబును,
స్వాతంత్య్రప్రియత, స్వల్పసంతోషము, దు
ర్నీతివిహీనత, నైచ్యా
పేతత్వము నంధ్రులందు పేర్పడు గుణముల్”

ప్రతిపదార్థం :

ఆతిథ్య గౌరవంబును = ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం
స్వాతంత్ర్య ప్రియత = స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడటం
స్వల్ప సంతోషము = చిన్న విషయాలకే సంతృప్తి చెందడం
దుర్నీతి విహీనత = అవినీతి లేకపోవడం (నీతిగా ఉండడం)
నైచ్యాపేతత్వము = నీచమైన బుద్ధి లేకుండా ఉండటం
ఆంధ్రులందు = ఆంధ్రప్రజలలో
ఏర్పడు గుణములు = సహజంగా కనిపించే గుణాలు

తాత్పర్యము : ఆంధ్రులలో ఆతిథ్యం, స్వేచ్ఛాభిలాష, సంతృప్తి, నీతినిజాయితీ,’ ఉదాత్తత, ఆత్మగౌరవం కలిగిన వారని భావం.

85వ పేజి :

ఉ. ఓర్వరు మాయమర్మము సముజ్జ్వల ధీమహిమంబు పేర్పడన్
నేర్వరుగాక విద్దియలు, నెయ్యము తియ్యము చూచుకొంద్రు, లో
గర్వము తక్కువే, యయిన గండ్రతనమ్మునఁ గానవత్తు, రా
యుర్వపురుజ్జ్వలుల్ బలసమున్నతు లెన్నఁగ నాంధ్రపుత్రకుల్”.

ప్రతిపదార్థం:

ఆంధ్రపుత్రకుల్ = తెలుగువారు
మాయమర్మము = మోసపూరితమైన ఆలోచనలను
ఓర్వర = సహించరు
సముజ్జ్వల = మిక్కిలి ప్రకాశవంతమైన
దీమహిమంబు = బుద్ధి చాతుర్య౦
ఏర్పడన్ = కనిపించేలా
విద్దియలు = రకరకాల విద్యలు
నేర్వరుగాక = నేర్చుకుంటారు
నెయ్యము = స్నేహాన్ని
తియ్యము = మాధుర్యాన్ని (ప్రేమ)
చూచుకొంద్రు = ప్రదర్శిస్తారు (పాటిస్తారు)
లో గర్వము = అంతర్గతమైన అహంకారం
తక్కువే = చాలా తక్కువ
అయిన = అయితే
గండ్రతనమ్మున = గంభీరత్వంతో
కానవచ్చు = అది కనిపిస్తుంది
రాయుర్వపురుజ్వలుల్ = రాజసం కలిగిన శరీర కాంతితో ఉంటారు.
బలసమున్నతులు = శారీరక, మానసిక బలంలో గొప్పవారు
ఎన్నగన్ = ఆలోచించగా

తాత్పర్యము : తెలుగువారు మాయామర్మాలను, మోసాలను సహించరు.’ అద్భుతమైన బుద్ధిబలం కలిగి, సకల విద్యలను నేర్చుకోగలరు. ఇతరులతో స్నేహంగా, ప్రేమగా ఉంటారు. లోపల అహంకారం తక్కువ కానీ పౌరుషంలో గొప్ప వీరులుగా కనిపిస్తారు. రాజసం కలిగిన శరీర కాంతితో ప్రకాశిస్తూ, మహాబలవంతులుగా కీర్తింపబడతారు.

శబ్దాచారము = పదాలను పలికే పద్ధతి
తేట = నిర్మలమైన, ప్రసన్నమైన
నానుడి = వాడుకైన మాట, సామెత
బలిష్ఠములు = బలమైనవి
దృఢ = గట్టి
గంభీర = గాంభీర్యంతో కూడిన
రీతి = విధానం
ప్రఖ్యాతి = ప్రసిద్ధి
అజంతములు = అచ్చుతో ముగిసేవి
అరవం = తమిళం
బింకం = గట్టిదనం
లేబ్రాయం = లేత వయసు
పొలతి = స్త్రీ
వన్నె = సొగసు
ప్రాయికము = సామాన్యం
త్రయం = మూడు
పాఱి = ప్రవహించి
పౌష్కల్యము = సమృద్ధి
జిలిబిలి = మనోజ్ఞమైన, అవ్యక్తమైన, ఇంపైన
సుక్షేత్రం = మంచి ప్రదేశం
పరంపర = వరుస
జుగుప్స = అసహ్యం
సౌభాగ్యములు = వైభవం
మనోజ్ఞ = సుందరమైన
సారస్యములు = సరసత, రసము, సరసత్వము
శతకం = వంద పద్యాలు గలిగినది
భాండాగారములు = బొక్కసం, సంపద దాచే చోటు

తెలుగుదనము Questions and Answers Summary Inter 2nd Year Telugu

86 వ పేజి :

జీవగఱ్ఱ = ప్రాణరక్షకం
త్రిమూర్తులు = ముగ్గురు మూర్తులు
కడపటి = చివరి

పద్యం:
తే.గీ. “భామ విను శ్రీమదాంధ్రభూభాగమనెడు
తారహారంబునకు సొంపు దనరుచున్న
మధ్యమణిచందమున మహామహిమ దాల్చె
భూరివిభవంబు బెజవాడపురవరంబు.

ప్రతిపదార్థం :

భామ = ఓ సుందరీ
విను = వినుము
శ్రీమత్ + ఆంధ్ర + భూభాగము + అనెడు శ్రీమదాంధ్ర భూభాగమనెడు = సంపదలతో విరాజిల్లే ఆంధ్రదేశమనే
తార + హారంబునకు తారహారంబునకు = ముత్యాల హారానికి
సొంపు = అందాన్ని
తనరుచున్న = ఇస్తున్న
మధ్యమణి = హారం మధ్యలో ఉండే నాయకమణి
చందమున = లాగా
మహా = గొప్పదైన
మహిమన్ + దాల్చె మహిమదాల్చె = గొప్ప వైభవాన్ని పొంచి ఉంది.
భూరి + విభవంబు భూరివిభవంబు = అత్యంత ఐశ్వర్యవంతమైంది
బెజవాడ + పుర + వరంబు బెజవాడ పురవరంబు = శ్రేష్టమైన బెజవాడు నగరం

తాత్పర్యము : ఓ భామా ! విను సకల సంపదలతో విరాజిల్లే ఆంధ్రదేశం ఒక ముత్యాల హారం అనుకుంటే, ఆ హారానికి మధ్యలో ఉండే నాయకమణి (మెరిసే రత్నం) లాగా బెజవాడ నగరం ప్రకాశిస్తోంది.

సీ. క్రొత్తబియ్యము కాయగూర బొబ్బట్లు సై
దంపు బూరెలు పంచదార తొలలు
వడలు నల్లంబు మీఁగడల తియ్యని పెర్గు
కమ్మని సిరివాలు గసగసాలు
చిఱుసెన్గపప్పును తఱచు వీడ్యంబులు
కంబళ్లు నంబళ్లు కంచుకములు
ఇంగువ జిలకఱ్ఱ నెనసిన మిరియంబు
మంచివాసన నెయ్యి మాటదురుసు

తే. తఱచు రణశీల, మొప్పు గంధాక్షతములు
నంద మింపొందు శిఖలు, నొయ్యారి నడలు
కలిగి కాంతలు పురుషులు కలసి సిరుల
చెలఁగు నయ్యాంధ్రదేశంబు చెలువు గాంచె.

ప్రతిపదార్థం :

క్రొత్త బియ్యము = అప్పుడే పండిన క్రొత్త వడ్లబియ్యం
కాయగూర = రకరకాల కూరగాయలు
బొబ్బట్లు = బొబ్బట్లు
సై దంపు బూరెలు = బాగా దంచిన బియ్యపు పిండితో పైన నెయ్యి వేసి వండిన బూరెలు
పంచదార తొలలు = పంచదార పాకంలో మునిగిన తీపి పదార్థాలు
వడలు = మినప వడలు
అల్లంబు = అల్లం పచ్చడి
మీగడల తియ్యని పెరుగు = మీగడతో కూడిన కమ్మని పెరుగు
కమ్మని సిరివాలు = సువాసన కలిగిన సన్నని బియ్యం
గసగసాలు = గసగసాలతో చేసిన వంటకాలు
చిఱుసెనగపప్పును = చిన్న శనగపప్పు
తఱచు వీడ్యంబులు = ఎప్పుడూ వేసుకునే తాంబులాలు
కంబళ్లు, నంబళ్లు, కంచుకములు = వెచ్చని గొంగళ్ళు, ఒక రకమైన వస్త్రాలు, మరియు చొక్కాలు
ఇంగువ = ఇంగువ
జిలకఱ్ఱ = జీలకర్ర
నెనసిన మిరియంబు = ఇంగువ, జీలకర్ర కలిపిన మిరియాలు
మంచి వాసన నెయ్యి = మంచి సువాసన గల నెయ్యి
మాట దురుసు = మాటలో గడుపుత
తఱచు = తరుచుగా
రణశీలము = యుద్ధాల పట్ల ఆసక్తి
మొప్పు = అందమైన
గంధాక్షతములు = గంధంతో కూడిన అక్షతలు
నందమింపొందుశిఖలు = అందమైన సిగలు
నొయ్యారి నడలు = ఒయ్యారమైన నడకలు
కలిగి = కలిగిన
కాంతలు = స్త్రీలు
పురుషులు = మగవారు
కలసి = కలసి
సిరుల చెలగు = ఐశ్వర్యాలతో విరాజిల్లే
అయ్యాంధ్రదేశంబు = ఆ ఆంధ్ర దేశం
చెలువుగా౦చె = ఎంతో అందాన్ని పొందింది

తాత్పర్యము : ఆంధ్రదేశం సకల సంపదలతో, వైభవంతో అలరారుతోంది.’ ఇక్కడి ప్రజలు కొత్త బియ్యం, కాయగూరలు, బొబ్బట్లు, బూరెలు, పంచదార వంటకాలు, వడలు, అల్లం పచ్చడి మరియు మీగడ పెరుగు వంటి రుచికరమైన భోజనాన్ని ఇష్టపడతారు. వంటల్లో ఇంగువ, జీలకర్ర, మిరియాలు, సువాసన గల నెయ్యిని వాడతారు. భోజనం తర్వాత తాంబూలం వేసుకోవడం ఇక్కడి అలవాటు.

ఇక్కడి పురుషులు వీరత్వం కలిగి ఉంటారు. స్త్రీ పురుషులు గంధాక్షతలు ధరించి, చక్కని వస్త్రధారణతో అందమైన నడకలతో చూడముచ్చటగా ఉంటారు. ఇలాంటి భోగభాగ్యాలతో పౌరుషంతో కూడిన ఆంధ్రదేశం ఎంతో సౌందర్యవంతంగా ప్రకాశిస్తోంది.

తెలుగుదనము Questions and Answers Summary Inter 2nd Year Telugu

సీ. కదళీఫలంబులు ఖండశర్కరయును
పెనుపచ్చిపోకలు పనసతొనలు
మామిడిపండ్లు కమ్మని గోఘృతమ్మును
వంకాయ టెంకాయ వలుపు పప్పు
బహువిధభక్ష్యముల్ పరమాన్నమును బైళ్లు
కంద పెండలములు కాయగూర
లమృతోపమానంబు లైన రసావళుల్
శాల్యోదనము పెర్వు సకలరుచులు

తే.గీ. గలుగు నూరుఁగాయలుఁ బానకములు నప్ప
డములు వరుగులు వడియముల్ శ్రమముదీర
ననుభవించిరి వేదశాస్త్రార్థవాద
ములకు నలరుచు కోనభూస్థలమునందు”

ప్రతిపదార్థం :

కదళీఫలంబులు = అరటిపండ్లు
ఖండ శర్కరయును = కలకండ
పెను పచ్చిపోకలు = పెద్దవైన పచ్చి వక్కలు
పనసతొనలు = పనస పండులోని తొనలు
మామిడిపండ్లు = తియ్యనైన మామిడిపండ్లు
కమ్మని = కమ్మనైన
గోఘృతమును = ఆవునెయ్యి
వంకాయ, టెంకాయలు = వంకాయ, కొబ్బరి
వలుపు పప్పు = పొట్టు తీసిన పప్పు
బహువిధ = అనేక రకాల
భక్ష్యముల్ = పిండివంటలు
పరమాన్నమును = పాయసం
బైళ్లు = యాలకులు + పాలు + పంచదార + జాజికాయ కలిపి చేసే జున్ను లాంటి పదార్థం
కంద, పెండలములు = కందగడ్డలు, పెండలం గడ్డలు
కాయగూరలు = రకరకాల కాయగూరలు
అమృతోపమానంబులైన = అమృతంతో సమానమైన
రసావళుల్ = పండ్ల రసాలు
శాల్యోదనము = సన్న బియ్యపు అన్నం
పెర్వు = పెరుగు
సకలరుచులు = అన్ని రకాల రుచులు
ఊరుగాయలు = ఊరగాయ పచ్చళ్లు
పానకములు = పానకాలు
అప్పడములు = అప్పడాలు
వరుగులు = ఎండబెట్టిన వరుగులు
వడియముల్ = వడియాలు
శ్రమముదీర = అలసట తీరే విధంగా
అనుభవించారు = ఆరగించారు
వేదశాస్త్రార్థవాదములకు = వేదశాస్త్రాల చర్చలతో
అలరుచు = సంతోషిస్తూ
కోనభూస్థలమునందు = కోనసీమ ప్రాంతంలో

తాత్పర్యము : కోనసీమ ప్రాంతంలో వేదశాస్త్ర పండితులు ఎంతో వైభవంగా జీవించేవారు. వారు అరటిపండ్లు, కలకండ, పచ్చివక్కలు, పనసతొనలు, మామిడిపండ్లు, ఆవునెయ్యి, వంకాయ, కొబ్బరి వంటి సాత్విక ఆహారాన్ని తినేవారు.
ఇంకా రకరకాల పిండివంటలు, పరమాన్నం, కంద-పెండలం వంటి దుంపలు, అమృతం లాంటి నెయ్యి సన్నబియ్యపు అన్నం, కమ్మని పెరుగు వంటివి భోజనాల్లో ఉండేవి.

వీటితో పాటు రకరకాల ఊరగాయలు, పానకాలు, అప్పడాలు, వడియాలు, వరుగులను తింటూ తమ అలసటను పోగొట్టుకునేవారు, భోజనం చేస్తూనే వేదశాస్త్ర చర్చలలో మునిగితేలుతూ, ఆ కోనసీమ ప్రాంతంలో పండితులు ఎంతో సుఖంగా ఉండేవారని ఈ పద్య సారాంశం.

ఆ. “ఆంధ్రభాష యమృత మాంధ్రాక్షరంబులు
మురువులొలుకు గుండ్రముత్తియములు
ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం
బాంధ్రజాతి నీతి ననుచరించు.”

ప్రతిపదార్థం :

ఆంధ్రభాష = తెలుగు భాష
అమృతం = అమృతం వలె తియ్యనైనది
ఆంధ్రాక్షరంబులు = తెలుగు అక్షరాలు
మురువులు + ఒలుకు మురువులొలుకు = అందం చిప్పిల్లే లేదా ముచ్చట గొలిపే
గుండ్ర = గుండ్రని
ముత్తియములు = ముత్యాలు వంటివి
ఆంధ్రదేశం = తెలుగునేల
ఆయుః = ఆయుష్షును
ఆరోగ్య = ఆరోగ్యాన్ని
వర్ధకంబు = పెంపొందించేది
ఆంధ్రజాతి = తెలుగు ప్రజలు.
నీతిని = నీతిని
అనుసరించు = అనుసరిస్తారు

తాత్పర్యము : తెలుగుభాష అమృతం వంటిది. తెలుగు అక్షరాలు ముచ్చట’ గొలిపే గుండ్రని ముత్యాల వలె ఎంతో అందంగా ఉంటాయి. మన ఆంధ్రదేశం ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదించే పుణ్యభూమి. అటువంటి ఈ దేశంలో నివసించే తెలుగుజాతి ఎప్పుడూ నీతిని, ధర్మాన్ని తప్పకుండా జీవిస్తుంది.

తెలుగుదనము Questions and Answers Summary Inter 2nd Year Telugu