Regular practice with AP Inter 1st Year Telugu Study Material పద్యభాగం 1st Poem భీముని గర్వభంగం Questions and Answers Summary helps students stay prepared for examinations.
AP Inter 1st Year Telugu మహాత్మా జ్యోతిబాఫూలే Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జోతి బాఫులే విద్యాభ్యాసం, సాంఘిక పోరాట నేపథ్యాన్ని వివరించండి.
జవాబు:
‘మహాత్మా జోతిబాఫులే’ పేరుతో ఆంగ్లభాషలో పుస్తకాన్ని రచించినవారు మహారాష్ట్రకు చెందిన ‘ధనంజయకీర్’. తెలుగులోకి ఈ గ్రంథాన్ని స్వేచ్ఛానువాదం చేసినవారు డా. బోయి విజయభారతి గారు.
విద్యాభ్యాసం : గోవిందరావు ఫులే, చిమ్నాబాయి దంపతులకు 11.4.1827న పూణేలో జోతిబాఫులే జన్మించారు. గోవిందరావు తన కుమారుడు జోతిబాను 7వ సంవత్సరంలో మరాఠీ పాఠశాలలో చేర్పించాడు. ఉపాధ్యాయులు, సహాధ్యాయులు ఆశ్చర్యపోయే స్థాయిలో జోతిబా చదువు కొనసాగింది. చదువు పట్ల ఆయనకున్న శ్రద్ధ, పట్టుదల సహాధ్యాయి సదాశివ బల్లాల్ గోవాండేకి నచ్చి స్నేహితుడయ్యాడు. ఆ చెలిమి చిరకాలం కొనసాగింది. జోతిబా, గోవాండే ఇద్దరూ చాలా చురుకైన విద్యార్థులు. మెదడుకు పదునుపెట్టే పుస్తక పఠనం అంటే వారికి ఇష్టం.
అలాంటి అదునులో వారికి మహాపురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, అమెరికా అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ జీవిత చరిత్ర పుస్తకాలు దొరికాయి. మాతృభూమిని ఉద్ధరించడం కోసం వారిద్దరూ పడిన తపన, కార్యదీక్ష ఈ స్నేహితులిద్దరినీ బాగా ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో థామస్ పెయిన్ రాసిన ‘రైట్స్ ఆఫ్ మాన్’ (మానవ హక్కులు) జాన్ స్టువర్ట్ మిల్ రచించిన ‘ఆన్ లిబర్టీ’ గ్రంథాలు జోతిబాలోని ఆలోచనా విధానంపై స్వతంత్ర భావధారను ప్రసరింపజేశాయి. “అనాదిగా నిజాలుగా చలామణి అవుతున్నవన్నీ సత్యాలు కాదు. వాటిని సహేతుకంగా చర్చించి, విపులంగా విమర్శించి, యథార్థాన్ని దర్శించాలన్న” జాన్ స్టువర్ట్ మిల్ బాటలో జోతిబా నడక ప్రారంభించాడు.
సాంఘీక పోరాట నేపథ్యం : చదువు వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల నైతిక విలువలు, నైతిక విలువల పునాదుల మీదే పటిష్టమైన సమాజం నిర్మించబడుతుందని నమ్మిన జోతిబా అట్టడుగు అణగారిన వర్గాల ప్రజలకు తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పగల ధైర్యం విద్య ద్వారానే వస్తుందని గ్రహించాడు. జోతిబాకు స్నేహమంటే ప్రాణం. ఒక బ్రాహ్మణ మిత్రుడు పిలిచిన వివాహ వేడుకకు హాజరైన జోతిబా, అక్కడ కొందరు కుల దురహంకారులచే నిందించబడి తీవ్రమైన మనోవ్యధకు గురయ్యాడు. ఆ అవమానమే ఆయన జీవిత పథాన్ని గొప్ప మలుపు తిప్పింది. శూద్రుల ఆత్మగౌరవ పోరాటం వైపు పురికొల్పింది.
సంఘాన్ని సంస్కరించనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదని గట్టిగా నమ్మిన జోతిబా 21 సంవత్సరాల వయసులో సాంఘిక పోరాట రంగంలోకి అడుగుపెట్టాడు.
![]()
ప్రశ్న 2.
జోతిబాఫులే సంఘసంస్కరణ ఉద్యమం గురించి రాయండి.
జవాబు:
‘మహాత్మా జోతిబాఫులే’ పేరుతో ఆంగ్లభాషలో పుస్తకాన్ని ధనంజయకీర్ రచించగా, దానిని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేశారు డా. బోయి విజయభారతి. భారతీయ సమాజం నుండి సంపద మాయమై పడమటి దేశాలలో పోగుపడుతున్న రోజులలో దేశమంతా మూఢాచారాలు, అరాచకం, కుయుక్తులు, కుతంత్రాలు ప్రబలి పోయాయి. సాధారణ స్త్రీలు, శూద్రులు చదువుకు దూరమయ్యారు. ఒకప్పుడు నాలుగు దిక్కులను ఏలిన జనం నోటికి నాలుగు మెతుకులు దొరికితే చాలును అనే స్థితికి దిగజారిపోయారు. జ్ఞాన చంద్రిక జాత్యహంకారమనే రాహువు చేత మింగబడిన తరుణంలో గ్రహణాన్ని విడిపించడానికి సహజంగానే ఓ వెలుగు పుడుతుంది. ఆ కాంతి మే జోతిబావులే.
చదువు వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల నైతిక విలువలు, నైతిక విలువల పునాదుల మీదే పటిష్టమైన సమాజం నిర్మించబడుతుందని నమ్మిన జోతిబా అట్టడుగు అణగారిన వర్గాల ప్రజలకు తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పగల ధైర్యం విద్య ద్వారానే వస్తుందని గ్రహించాడు.
సంస్కరణ దృక్పథంతో సమాజ గతిని మార్చేందుకు కృషి చేస్తున్న జోతిబాపై కొంతమంది దురహంకార సంప్రదాయ వాదులందరూ ఏకమై హత్యాయత్నానికి కూడా బరితెగించారు. బాలికలకు విద్య చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ అనేక అవరోధాలు కల్పించినా అకుంఠిత కార్యదీక్షాపరుడైన ఫులే ముందుగా తన భార్యకు చదువు నేర్పించి బడిలో పాఠాలు చెప్పించాడు. మొక్కవోని ధైర్యంతో సంస్కరణ యజ్ఞంలో ఆ దంపతులు తుది దాకా సమిధలై జ్వలించారు.
1848లో జోతిబా దంపతులిద్దరూ పూణేలో స్వయంగా ఒక బాలికా పాఠశాలను ఏర్పాటు చేశారు. నిమ్న జాతులకు విద్యాగంధం పూసిన మహనీయులు జోతిబా దంపతులు. దేశంలోని స్త్రీ విద్యకు తొలి తాత్త్విక భూమిక. అందించారు. సాంఘీక సంస్కరణే ధ్యేయంగా 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో సాంఘీక ఉద్యమాన్ని ప్రారంభించిన సంస్థల్లో దీనిని మొదటిదిగా చెప్పవచ్చు. అణగారిన వర్గాల బాధలను లోకానికి వెల్లడి చేయడంలో ఈ సంస్థ విశేష కృషి చేసింది.
1887లో ఇషారా (హెచ్చరిక అనే గ్రంథం ద్వారా బ్రిటిష్ పాలనలో రైతులకు ఎటువంటి సంక్షేమం జరగాలో సూచించారు. వ్యర్థమైన మాటల ద్వారా కాక నిర్మాణాత్మకమైన చేతల ద్వారా సమాజాన్ని తీర్చిదిద్దడానికి పూనుకున్న నిజమైన మహాత్ముడు జోతిబాఫులే.
II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఫులే దంపతులు బాలిక విద్య కోసం చేసిన కృషిని వివరించండి.
జవాబు:
ఆ కాలపు మరాఠీ సమాజంలో స్త్రీల పరిస్థితి దయనీయంగా ఉండేది. స్త్రీలు చెప్పులు వేసుకోకూడదు, చదువుకోకూడదు, కాస్త స్వేచ్ఛ ఇస్తే వంశగౌరవం మంటగలుస్తుంది-ఇలాంటి ఆలోచనలు ఆచరణలతో నిండిపోయింది. “రండి అందరూ చదువుకోండి. చదువు మీకు ఆనందాన్ని, విజ్ఞానాన్ని ఇస్తుంది” అని ప్రచారం చేశాడు. బాలికలను బడికి తీసుకువచ్చేవాడు. బాలికలకు విద్య చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ అనేక అవరోధాలు కల్పించారు. నిమ్న జాతుల పిల్లలకు ఒక శూద్ర స్త్రీ పాఠాలు చెప్పడాన్ని కుల దురహంకారులు సహించ లేకపోయారు. అయినా మొక్కవోని ధైర్యంతో సంస్కరణ యజ్ఞంలో ఆ దంపతులు తుది దాకా సమిధలై జ్వలించారు.
1848లో జోతిబా దంపతులిద్దరూ పూణేలో స్వయంగా ఒక బాలికా పాఠశాలను ఏర్పాటు చేశారు. నిమ్న జాతులకు విద్యాగంధం పూసిన మహనీయులు జోతిబా దంపతులు. దేశంలోని స్త్రీ విద్యకు తొలి తాత్త్విక భూమిక అందించారు. సావిత్రీబాయి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయు రాలిగా చరిత్రలో నిలిచారు. స్త్రీ విద్యా వ్యాప్తి విషయంలో ప్రశంసనీయమైన కృషి చేసిన జోతిబాను పూణే సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ కాండి ఘనంగా సన్మానించారు.
ప్రశ్న 2.
సత్యశోధక సమాజం లక్ష్యాలు గురించి రాయండి.
జవాబు:
సాంఘీక సంస్కరణే ధ్యేయంగా 1873 సెప్టెంబరు 24న సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారు. సత్యాన్ని అన్వేషించే సమాజం అని దీని అర్థం. భారతదేశంలో సాంఘీక ఉద్యమాన్ని ప్రారంభించిన సంస్థలలో దీనిని మొదటిదిగా చెప్పవచ్చు. అణగారిన వర్గాల బాధలను లోకానికి వెల్లడి చేయడంలో ఈ సంస్థ విశేష కృషి చేసింది.
లక్ష్యాలు :
- వెనుకబడిన కులాల వారికి విద్యను అందించడం.
- విదేశీ వస్తువుల వాడకం తగ్గించడం.
- స్వదేశీ వస్తువుల వాడకం పెంపొందించడం.
- పురోహిత వర్గాల ప్రాధాన్యం తగ్గించి, తక్కువ ఖర్చులతో నిరాడంబరంగా వివాహాలు జరిపించడం.
- మత సహనం కలిగి ఉండడం.
- మూఢ నమ్మకాల నిర్మూలన.
- తోటి మానవులపై సోదర భావం పెంపొందించడం.
ప్రశ్న 3.
జోతిబాఫులేకు ‘మహాత్మా’ బిరుదు ప్రదానం గురించి రాయండి.
జవాబు:
కుల రహిత సమాజం కోసం కలలుగన్న మహానుభావుడు. కుల పునాదులను కూకటి వేళ్ళతో పెకిలించేందుకు సర్వశక్తులు ధారవోసిన నిరంతర కృషీవలుడు జోతిబాకు 60 వసంతాలు నిండిన సందర్భంగా ఆయనను అత్యంత అభిమానించే ప్రజలు, అనుచరవర్గం పెద్ద ఎత్తున సన్మానం చేయాలి అని సంకల్పించారు. బొంబాయి నగరంలోని మాండ్వి ప్రాంతంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జోతిబా గురించి వక్తలు ఉత్తేజంగా మాట్లాడారు.
బడుగుజీవుల అభ్యున్నతి కోసం అణగారిన వర్గాల సముద్ధరణ కోసం అహరహం శ్రమించిన తమ ఆశాజ్యోతి జోతిబాఫులేకు ‘మహాత్మా’ అనే బిరుదు ప్రదానం చేస్తున్నామని ఆ సభా నిర్వహకులు ప్రకటించగానే, ఆ సభలో ఉన్న బరోడా మహారాజు శాయాజీరావు గైక్వాడ్ లాంటివారు తమ సమ్మతిని తెలిపారు. వేలాదిమంది ప్రజల కరతాళధ్వనుల మధ్య జోతిబా ‘మహాత్మా జోతిబాఫులే’గా ప్రకటించబడ్డారు. ఆధునిక భారతదేశ చరిత్ర ‘మహాత్మా’ బిరుదును పొందిన మొదటి భారతీయుడు జోతిబాఫులే.
ప్రశ్న 4.
డా.బి. విజయభారతి గురించి తెలియజేయండి.
జవాబు:
అనువాద రచయిత్రి తెలుగు : డా.బి. విజయభారతి
జననం (కాలం) : 1941 నుండి 26.9.2024 (మరణం)
జన్మస్థలం : రాజోలు (బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (ప్రస్తుతం)
విద్యాభ్యాసం : ఇంటర్ (పిఠాపురం మహారాజా కళాశాల, కాకినాడ), యమ్.ఎ. తెలుగు (ఉస్మానియా విశ్వవిద్యాలయం), “దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం – సాంఘిక పరిస్థితులు” పరిశోధన పత్రం.
తల్లిదండ్రులు : బోయి భీమన్న (ప్రముఖ రచయిత), నాగరత్నమ్మ.
భర్త : బొజ్జాతారకం (ప్రముఖ న్యాయవాది)
రచనలు : బాబాసాహెబ్ అంబేద్కర్, పురాణాలు, మరో చూపు, కులవ్యవస్థ, షట్చక్రవర్తులు మొ||నవి.
III. ఏక వాక్య / పద రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జోతిబాఫులే తల్లిదండ్రుల పేర్లు ఏమిటి ?
జవాబు:
జోతిబాఫులే తల్లిదండ్రుల పేర్లు గోవిందరావు ఫులే, చిమ్నాబాయి.
ప్రశ్న 2.
జోతిబా, గోవాండే ఎవరి జీవిత చరిత్రలను చదివి స్ఫూర్తి పొందారు ?
జవాబు:
జోతిబా, గోవాండే ఛత్రపతి శివాజీ మహరాజ్, అమెరికా అధ్యక్షుడు జార్జివాషింగ్టన్ జీవిత చరిత్రలను చదివి స్ఫూర్తి పొందారు.
ప్రశ్న 3.
1873లో జోతిబాఫులే ఏర్పాటు చేసిన సంఘసంస్కరణ సంస్థ పేరు ఏమిటి?
జవాబు:
1873లో జోతిబాఫులే ఏర్పాటు చేసిన సంఘసంస్కరణ సంస్థ పేరు ‘సత్య శోధక సమాజం’.
ప్రశ్న 4.
జోతిబాఫులే దంపతులు పెంచుకున్న బాలుని పేరేమిటి ?
జవాబు:
జోతిబాఫులే దంపతులు పెంచుకున్న బాలుని పేరు యశ్వంత్.
![]()
ప్రశ్న 5.
మరాఠీ వాడుక భాషలో ఫులే రాసిన ప్రసిద్ధ రచన ఏది ?
జవాబు:
మరాఠీ వాడుక భాషలో ఫులే రాసిన ప్రసిద్ధ రచన ‘గులాంగిరి’.
మహాత్మా జ్యోతిబాఫూలే Summary in Telugu
రచయిత్రి పరిచయం
పాఠ్యభాగం : మహాత్మా జోతిబాఫులే
రచయిత / రచయిత్రి మూల రచయిత (ఆంగ్లం) : ధనంజయ కీర్ (కలంపేరు)
జననం : 13.4.1913 నుండి 12.5.1984 (మరణం)
జన్మస్థలం : రత్నగిరి, మహారాష్ట్ర
స్థానిక పేరు : అనంత విఠల్ కీర్
వృత్తి : జీవిత చరిత్ర రచయిత
భాషలు : ఇంగ్లీషు, మరాఠీ
తల్లిదండ్రులు : విఠల్, దేవకి
భార్య : సుధ
రచనలు : వీర్ సావర్కర్, డా.బి.ఆర్. అంబేద్కర్, లోకమాన్య తిలక్, రాజర్షి సాహూ మహరాజ్, మహాత్మాగాంధీ మొదలైన జీవితచరిత్రలు.
బిరుదు : పద్మభూషణ్ (1971), శివాజీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (1980).
విశేషం : కీర్ రత్నగిరిలో ఒక ఆలయ నిర్మాణంలో సావర్కర్తో కలిసి పనిచేశారు.
అనువాద రచయిత్రి (తెలుగు) : డా.బి. విజయభారతి
జననం (కాలం) : 1941 నుండి 26. 9.2024 (మరణం)
జన్మస్థలం : రాజోలు (బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (ప్రస్తుతం)
విద్యాభ్యాసం : ఇంటర్ (పిఠాపురం మహారాజా కళాశాల, కాకినాడ), యమ్.ఎ. తెలుగు (ఉస్మానియా విశ్వవిద్యాలయం) “దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం- సాంఘిక పరిస్థితులు” పరిశోధన పత్రం.
ఉద్యోగం : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకురాలుగా పని చేశారు. తెలుగు అధ్యాపకురాలు, వైస్ ప్రిన్సిపాల్ (నిజామాబాద్ మహిళా కళాశాల), తెలుగు అకాడమీ రీసెర్చ్ ఆఫీసరుగా, డిప్యూటీ డైరెక్టర్గా పని చేశారు.
తల్లిదండ్రులు : బోయి భీమన్న (ప్రముఖ రచయిత), నాగరత్నమ్మ
భర్త : బొజ్జాతారకం (ప్రముఖ న్యాయవాది)
రచనలు : బాబాసాహెబ్ అంబేద్కర్, పురాణాలు, మరో చూపు, కులవ్యవస్థ, షట్చక్రవర్తులు మొ||నవి.
ప్రస్తుత పాఠ్యభాగం ‘మహాత్మా జోతిబాఫులే’, మహారాష్ట్రకు చెందిన ధనంజయకీర్ ఆంగ్లభాషలో రాయగా, దీనిని డా॥ బోయి విజయభారతి తెలుగులో స్వేచ్ఛానువాదం చేశారు.
పాఠ్యభాగ నేపథ్యం
మూఢ నమ్మకాలు పెరుగుతున్న వేళ, అజ్ఞానపు చీకట్లు చుట్టుముడుతున్న వేళలో అన్యాయం రాజ్యమేలుతున్న వేళలో కులం పేరిట మారణ హోమం జరుగుతున్న వేళలో దేశ ఆత్మగౌరవాన్ని నాశనం చేయడంలో చదువు లేకపోవడమే కారణమౌతున్న వేళలో వెనుకబడిన వర్ణాల వారి జీవితాలకు వెలుగులు పంచిన చైతన్యమూర్తి. అందరికి చదువును అందించిన ఉన్నతమైన వ్యక్తి, అసమానతలు తొలిగించి, సమానత్వమే ఆశయంగా జీవించిన మహామనిషి, అణగారిన వర్గాల బాధలను లోకానికి వెల్లడి చేయడానికి నడుం కట్టిన దీనజన బాంధవుడు, లోకంలోని మహనీయుల చేత మహాత్మునిగా కీర్తించబడిన సంఘసంస్కర్త అయిన జోతిబాఫులే జీవితంలోని విశేషాలను తెలుసుకోవడానికి ఈ పాఠ్యాంశం తోడ్పడుతుంది.
కఠిన పదాలకు అర్థాలు
51వ పేజి :
చంద్రిక = వెన్నెల
తరుణం = సమయం
గ్రహణం = స్వాధీనం చేసుకొనిన
పుంజం = గుంపు
కాలధర్మం = మరణం (వృద్ధాప్యంలో సంభవించే మరణం)
వారసత్వం = వంశపరంపరగా వచ్చిన హక్కు
అరాచకం = ఆందోళన పూరిత సంఘటనలతో, శాంతి భద్రతలు నశించిన పరిస్థితి
కుయుక్తి = మోసం
కుతంత్రం = కుట్ర
ప్రబలిపోవు = పెరిగిపోవు
ఆంక్ష = అడ్డగింత
దిగజారు = కిందకుపడు
గుడ్డిలో మెల్ల = అసలు కనిపించని గుడ్డి కన్న కొంచెం కనిపించే మెల్ల (నయం) (ఇది సామెత)
చందాన = విధంగా, అన్నట్టుగా
దఖలు = స్వాధీనం
సహాధ్యాయి = తోటి విద్యార్థి
చెలిమి = స్నేహం
చిరకాలం = చాలాకాలం
చురుకు = తెలివితేటలు
అదును = సమయం
ఉద్దరించు = రక్షించు
తపన = కార్యాన్ని సాధించాలనే ఆసక్తి
అనాది = పూర్వం
చలామణి = చెల్లుబాటు
సహేతుకం = ఒక కారణం కలిగి
విపులం = లోతుగా, అధికం
యథార్థం = సత్యం
పునాది = ఇంటి బలమునకై మొదలు త్రవ్వి పెట్టిన గోడ
అణగారిన = లోబడిన
పథం = దారి
పురికొల్పు = ప్రేరేపించు
52వ పేజి :
దయనీయం = జాలిపడదగినది
మంటగలుపు = పోగొట్టు
ఆటవిక = అడవిలో చరించునట్టి
ఆచరణ = నడత
పతనం = నాశనం
అవిద్య = చదువు (లేమి) లేకపోవుట
క్రీడాకారుడు = ఆటగాడు
హత్యాయత్నం = చంపే ఉద్దేశంతో చేసే దాడి
బరితెగించు = హద్దు మీరు
అవరోధం = అడ్డంకి
కట్టడి = నియమం
అకుంఠితము = స్థిరం
మొక్కవోని ధైర్యం = సడలని ధైర్యం, తడబాటులేని ధైర్యం
తుది = చివర
సమిధ = చితుకు
భూమిక = స్థానం
వెల్లడి = అందరికీ తెలుపు
లక్ష్యం = గురి
53వ పేజి :
పురోహితుడు = వేద వేదాంగాలు చదివి, జపతపాలు చేస్తూ, సాయం కోరి వచ్చిన వారి కోసం వైదిక కర్మకాండ చేయించేవాడు.
మూఢ = మొండి, తెలివితక్కువ
సంక్షేమం = భద్రతతో కూడిన మనుగడ
అణగారిన = లోబడిపోవు
బడుగు = పేద, బలహీన
సముద్ధరణ = పైకి తెచ్చుట
అహరహం = ప్రతిరోజు
బిరుదు = సామర్థ్య చిహ్నం
చప్పట్లు = కరతాళధ్వనులు
కాయకల్ప చికిత్స = ఒక విధమగు ఆయుర్వేద చికిత్స, ప్రాథమికమైన మార్పులతో ఒక వ్యవస్థను బాగుచేయడం
పక్షవాతం = నరాలజబ్బు, శరీరంలోని ఏదొక భాగం చైతన్యం కోల్పోవడం.
54వ పేజి :
అంకితం = కృతి (గ్రంథం) సమర్పణం (ఈయబడినది)
ఛాందసం = మూర్ఖత్వం