Reviewing AP Inter 1st Year Telugu Study Material Grammar స్థూల అవగాహన can help students prepare confidently for exams.
AP Intermediate 1st Year Telugu Grammar స్థూల అవగాహన
1. ప్రపంచ తెలుగు మహాసభలు
1956లో భారతదేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటికీ 1974 ఉగాది నాటికి గాని తెలుగు భాషకు ఉషస్సు రాలేదు. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు, విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు కృష్ణార్జునులలాగా పనిచేసి రాష్ట్రస్థాయిలో తెలుగును అధికార భాషగా ప్రకటించారు. తొలి అధికారభాషా సంఘాన్ని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి అధ్యక్షతన ఏర్పరిచారు. తెలుగును పరిపాలనా భాషగా తాలుకాస్థాయిలో ప్రవేశపెట్టారు. 1975 ఏప్రిల్ 12 నుండి 18 వరకు హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి ఖండాంతరాలలో నివసిస్తున్న తెలుగు వారందరినీ ఏకం చేసే బృహత్తర ప్రయత్నాన్ని విజయవంతం చేశారు. ఈ సభలలోనే శ్రీ శంకరంబాడి సుందరాచారి రాసిన “మా తెలుగుతల్లికి మల్లెపూదండ” గేయం రాష్ట్ర గేయం అయింది. అంతర్జాతీయ తెలుగు సంస్థ (విదేశాలలో స్థిరపడిన తెలుగు వారికి మాతృభాష నేర్పడానికి) ఏర్పడింది. శ్రీ కొండపల్లి శేషగిరిరావు కుంచె నుండి జాలువారిన తెలుగుతల్లి చిత్రం ఆవిష్కరించబడింది. మరలా తెలుగు భాష అభివృద్ధి పట్ల ఇంతటి చిత్తశుద్ధి, ఆచరణాత్మక కృషి శ్రీ నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాకే సాధ్యమైంది.
ప్రశ్నలు-జవాబులు :
ప్రశ్న1.
భాషాభివృద్ధికి కృష్ణార్జునులుగా పనిచేసిన వారెవరు ?
జవాబు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు.
ప్రశ్న 2.
తెలుగు అధికారభాషా సంఘం మొదటి అధ్యక్షులు ఎవరు ?
జవాబు.
శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు.
ప్రశ్న 3.
ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు ఏ సంవత్సరంలో జరిగాయి ?
జవాబు
1975 ఏప్రిల్ 12 నుండి 18 వరకు హైదరాబాదు మహానగరంలో అత్యంత వైభవంగా ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి.
ప్రశ్న 4.
శంకరంబాడి సుందరాచారి వ్రాసిన గేయం ఏది ?
జవాబు.
మా తెలుగుతల్లికి మల్లెపూదండ
ప్రశ్న 5.
తెలుగుతల్లి చిత్రాన్ని రూపొందించిన చిత్రకారుడు ఎవరు ?
జవాబు.
శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారు.
2. లేపాక్షి
శిల్పం, చిత్రలేఖనం, వాస్తు వైవిధ్యం ఒక్కచోట కుప్ప పోసినట్లుగా ఉండే అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షి లేపాక్షి. సంప్రదాయ భారతీయ చిత్రకళ ఇక్కడ సహజమైన రంగులతో అందంగా ఒదిగి కనులవిందు చేస్తుంది. కూర్మశైలమనే చిన్న కొండపై సాధారణ శక సంవత్సరం 1533లో విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయల కోశాధికారి విరూపన్న అతని సోదరుడు వీరన్నతో కలిసి ఈ గుడిని నిర్మించాడు. వీరభద్రునికి అంకితమైన ఈ లేపాక్షి దేవాలయం సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నంది మహారాజసం ఒలకబోస్తూ జీవకళతో నిలిచి ఉంది. ఇక్కడ నాట్యమండపం, కళ్యాణ మండపం, లతా మండపం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ కళా జగత్తును సృష్టించే క్రమంలో విరూపన్న ఖజానాకు చేర్చవలసిన ధనాన్ని కూడా ఖర్చు చేసి రాజ దండనకు గురయ్యాడు. విజయనగర వాస్తు నిర్మాణ పద్ధతికి తలమానికంగా నిలిచే ఈ దేవాలయంలో ఊర్వశి శిల్పంతో పాటు చూడదగిన ఎన్నో శిల్పాలు, కుడ్య చిత్రాలు ఉన్నాయి.
ప్రశ్నలు-జవాబులు :
ప్రశ్న 1.
అచ్యుత దేవరాయల కోశాధికారి ఎవరు ?
జవాబు.
అచ్యుత దేవరాయల కోశాధికారి విరూపన్న.
ప్రశ్న 2.
ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందీశ్వరుని విగ్రహం ఎక్కడ ఉంది ?
జవాబు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందీశ్వరుని విగ్రహం లేపాక్షి దేవాలయ సమీపంలో ఉంది.
ప్రశ్న 3.
లేపాక్షి దేవాలయం ఏ కొండపై నిర్మించారు ?
జవాబు.
లేపాక్షి దేవాలయం కూర్మ శైలము అనే చిన్న కొండపై నిర్మించారు.
ప్రశ్న 4.
లేపాక్షి గుడి ఎవరికి అంకితం చేయబడింది ?
జవాబు.
లేపాక్షి గుడి వీరభద్రునికి అంకితం చేయబడింది.
ప్రశ్న 5.
లేపాక్షి దేవాలయం ఏ సామ్రాజ్య శిల్పకళా, వాస్తు నిర్మాణ పద్ధతికి తలమానికంగా ఉంది ?
జవాబు.
లేపాక్షి దేవాలయం విజయనగర వాస్తు నిర్మాణ పద్ధతికి తలమానికంగా ఉంది.
![]()
3. వీరగున్నమ్మ
శ్రీకాకుళం జిల్లా మందస సంస్థాన గ్రామమైన గుడారి రాజమణిపురంలో 1914లో పుట్టిన గున్నమ్మకి చిన్నప్పుడే కన్నవారు దూరమయ్యారు. పది సంవత్సరాల వయస్సులో మాధవయ్యతో వివాహమయ్యింది. గున్నమ్మ మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె భర్త మరణించాడు. బ్రిటిష్ వారి అండతో మందస జమిందారు రైతులను పీడించి అధిక పన్నులు వసూలు చేసేవాడు. ఈ దోపిడీని ఎదురించాలని సాసుమాను గున్నమ్మ రైతులలో చైతన్యం తీసుకువచ్చారు. జమీందారు జగన్నాథరాజుకి వ్యతిరేకంగా సాసుమాను గున్నమ్మ నాయకత్వంలో అడవిని కొట్టించి కట్టెలను ఎడ్ల బండ్లపై రైతులు ఇళ్లకు తరలించారు. ఈ చర్య అటు జమీందారును ఇటు బ్రిటిష్ వారిని కలవరపరిచింది. 1940 ఏప్రిల్ ఒకటవ తేదీన రాజమణిపురంపై పోలీసులు, సంస్థానం భటులు దాడి చేశారు. ఈ పోరాటంలో ఇరవై మంది రైతులు, నలుగురు పోలీసులతో పాటు, గర్భవతిగా ఉన్న గున్నమ్మ కూడా వీరమరణం పొందింది. అప్పటికి ఆమె వయసు ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే. స్వాతంత్ర్యం వచ్చాక గున్నమ్మ త్యాగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గుడారి రాజమణిపురం గ్రామం పేరును వీరగున్నమ్మపురంగా మార్చింది.
ప్రశ్నలు-జవాబులు :
ప్రశ్న 1.
గుడారి రాజమణిపురం పేరును రాష్ట్ర ప్రభుత్వం ఏమని మార్చింది ?
జవాబు.
వీరగున్నమ్మపురంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.
ప్రశ్న 2.
మందస పోరాటం ఎప్పుడు జరిగింది ?
జవాబు.
మందస పోరాటం 1940 ఏప్రిల్ 1న జరిగింది.
ప్రశ్న 3.
మందస పోరాటం నడిపిన వీరనారి ఎవరు ?
జవాబు.
మందస పోరాటం నడిపిన వీరనారి సాసుమాను గున్నమ్మ.
ప్రశ్న 4.
మందస పోరాటం నాటి జమీందారు ఎవరు ?
జవాబు.
మందస పోరాటం నాటి జమీందారు జగన్నాథరాజు.
ప్రశ్న 5.
మందసలో జమీందారును, బ్రిటిష్ వారిని కలవరపరిచిన విషయం ఏమిటి?
జవాబు.
గున్నమ్మ నాయకత్వంలో అడవిని కొట్టించి కట్టెలను ఎడ్ల బండ్లపై రైతులు ఇళ్ళకు తరలించారు. ఈ చర్య జమీందారును, బ్రిటీష్ వారిని కలవరపరిచింది.
4. వందనాశివ
మనదేశం జీవ వైవిధ్యానికే కాదు వివిధ రకాల ఆహార ధాన్యాలకు కూడా పెట్టింది పేరు. విష రసాయనాలతో జరుగుతున్న వ్యవసాయం, బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యంపై వందనాశివ గొంతెత్తారు. దేశీయమైన సేంద్రియ వ్యవసాయానికి ఊతమిచ్చి, జీవ వైవిధ్య రక్షణకు 1984లో ఆమె ఉద్యమించారు. దేశమంతా తిరిగి మూడు వేల రకాల వరి వంగడాలను సేకరించారు. అరవై ధాన్యపు బ్యాంకుల నేర్పరిచి వాటిని భద్రపరిచారు. 1952లో డెహ్రాడూన్లో పుట్టిన ఈమె కెనడాలో పి. హెచ్. పూర్తి చేశారు. 33 సంవత్సరాల వయస్సులోనే “డూన్ లోయ”లో జరుగుతున్న అక్రమ గనుల తవ్వకం గురించి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. చిప్కో ఉద్యమం నుండి స్ఫూర్తి పొంది పర్వతాలనూ కాపాడాలని ఉద్యమం ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో “లాభాల కోసం బహుళ జాతి కంపెనీలు ప్రోత్సహిస్తున్న రసాయన సేద్యం కలిగించే నష్టాలు” అనే అంశంపై మాట్లాడి కొత్త ఆలోచనలకు తెర తీశారు. నవధాన్య ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి శాస్త్రవేత్తలను, మేధావులను ఆకర్షించారు. పోర్బ్స్ పత్రిక “ప్రపంచ స్థాయిలో ప్రభావితం చేయగల ఏడుగురు మహిళలలో ఒకరి” గానూ, టైమ్ మాగజైన్ “ఎన్విరాన్మెంట్ హీరో” గానూ ఈమెను ప్రకటించాయి.
ప్రశ్నలు-జవాబులు :
ప్రశ్న 1.
వందనాశివ నడిపిన ఉద్యమం ఏది ?
జవాబు.
వందనాశివ నడిపిన ఉద్యమం జీవ వైవిధ్య రక్షణ.
ప్రశ్న 2.
నవధాన్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఉద్యమం ఏది ?
జవాబు.
నవధాన్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఉద్యమం చిప్కో ఉద్యమం.
ప్రశ్న 3.
ఏ లోయలో జరుగుతున్న అక్రమ గనుల తవ్వకం గురించి వందనాశివ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు ?
జవాబు.
డూన్ లోయలో జరుగుతున్న అక్రమ గనుల తవ్వకం గురించి వందనాశివ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు.
ప్రశ్న 4.
“ఎన్విరాన్మెంట్ హీరో” గా వందనాశివని ప్రకటించిన పత్రిక/మాగజైన్ ఏది?
జవాబు.
పోర్బ్స్ పత్రిక, టైమ్ మాగజైన్
ప్రశ్న 5.
1984లో వందనాశివ ఉద్యమాన్ని ఎందుకు చేశారు ?
జవాబు.
దేశీయమైన సేంద్రియ వ్యవసాయానికి ఊతమిచ్చి, జీవ వైవిధ్య రక్షణకు 1984లో ఉద్యమం చేశారు.
![]()
5. సాంఘిక మాధ్యమం
కాలపరిణామ క్రమంలో ఆధునిక సాంకేతికత అన్ని రంగాలలోనూ అనివార్యమయింది. గత కొద్దికాలంగా విద్యారంగంలో కూడా దీని వాడకం విస్తృతమయింది. ఇ-మెయిల్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలైన యాప్ల వినియోగంతో సమాజంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. సాంఘిక మాధ్యమం రెండువైపులా పదునున్న కత్తి వంటింది. ముఖ్యంగా విద్యార్థులు సద్వినియోగపరచుకుంటే ఎంత మంచి జరుగుతుందో, దుర్వినియోగపరిస్తే అంతే స్థాయిలో చెడు జరుగుతుంది. శాస్త్రసంబంధ సందేహాల నివృత్తికి, అరుదుగా లభించే పుస్తకాలను పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ (పి.డి.ఎఫ్) లో ఒకరి నుంచి మరొకరికి పంపించుకునేందుకు, ఖాండాంతరాలలో ఉన్న బంధువులతో వీడియోకాల్లో మాట్లాడేందుకు, సమాచారాన్ని త్వరితగతిన ఇతరులకు పంపించుకునేందుకు సాంఘిక మాధ్యమాలు ఎంతగానో దోహదపడతాయి. అసత్యాలను వ్యాప్తి చేయడం, వీడియోగేమ్లు ఆడుతూ కాలాన్ని వ్యర్థం చేయడం, యూట్యూబ్ వీడియోలు చూస్తూ చదువును పక్కన పెట్టడం, అనవసర సంభాషణలతో విలువైన సమయాన్ని వృధా చేయడం వంటివి దుర్వినియోగాలు.
ప్రశ్నలు-జవాబులు :
ప్రశ్న 1.
గత కొద్దికాలంగా దేని వాడకం అనివార్యమైంది ?
జవాబు.
గత కొద్దికాలంగా ఆధునిక సాంకేతిక వాడకం అనివార్యమైంది.
ప్రశ్న 2.
రెండువైపులా పదునైన కత్తివంటిది ఏది ?
జవాబు.
రెండువైపులా పదునైన కత్తి సాంఘిక మాద్యమం.
ప్రశ్న 3.
పి.డి.ఎఫ్. పూర్తి రూపాన్ని రాయండి.
జవాబు.
పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ (పి.డి.ఎఫ్).
ప్రశ్న 4.
ఏమి చూస్తూ చదువును పక్కన పెడుతున్నారు ?
జవాబు.
యూట్యూబ్ వీడియోలు చూస్తూ చదువును పక్కన పెడుతున్నారు.
ప్రశ్న 5.
వేటిని ఆడుతూ కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ?
జవాబు.
వీడియోగేమ్లు ఆడుతూ అనవసర సంభాషణలతో విలువైన కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
అదనపు అభ్యసన ప్రశ్నలు
1. మన తెలుగు
తెలుగు భాషకు ఆంధ్రభాష, తెనుగు భాష అనే పేర్లు కూడా ఉన్నాయి. మన తెలుగు కవులు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని తెలుగును ప్రస్తుతించారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి మన తెలుగును ‘సుందర తెలుంగు’ అని కొనియాడారు. క్రీ.శ. 15వ శతాబ్దపు ఇటలీ యాత్రికుడు నికోలో డి కాంటే తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని ప్రశంసించాడు. తెలుగు అజంత భాష. కాబట్టి నాద సౌష్ఠవం కలిగి, సంగీతానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా వేనోళ్ళ ప్రస్తుతించబడిన మధురమైన మన తెలుగు భాషను పరభాషా ప్రభావాలతో మనవారే చిన్న చూపు చూడడం చాలా దురదృష్టకర విషయం. తెలుగు భాషను రక్షించుకొని దానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడం తెలుగువారందరి ప్రథమ కర్తవ్యం.
ప్రశ్నలు-జవాబులు :
ప్రశ్న 1.
నికోలో డి కాంటే ఎవరు ?
జవాబు.
నికోలో డి కాంటే క్రీ.శ. 15వ శతాబ్దపు ఇటలీ యాత్రికుడు.
ప్రశ్న 2.
తెలుగు భాషకు గల ఇతర పేర్లేవి ?
జవాబు.
తెలుగు భాషకు ఆంధ్రభాష, తెనుగు భాష అనే పేర్లు కూడా ఉన్నాయి.
ప్రశ్న 3.
తెలుగు భాషను నికోలో డి కాంటే ఏమని కీర్తించారు ?
జవాబు.
తెలుగును నికోలో డి కాంటే, “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని కీర్తించారు.
ప్రశ్న 4.
‘సుందర తెలుంగు’ అని తెలుగును ఎవరు ప్రశంసించారు ?
జవాబు.
‘సుందర తెలుంగు’ అని తెలుగును, తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి ప్రశంసించారు.
ప్రశ్న 5.
తెలుగువారి ప్రథమ కర్తవ్యం ఏమిటి ?
జవాబు.
తెలుగును రక్షించుకొని దానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడం తెలుగు వారందరి ప్రథమ కర్తవ్యం.
2. సావిత్రిబాయి ఫూలే
ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని ప్రగాఢంగా నమ్మిన మహిళ సావిత్రిబాయి ఫూలే. ఈమె సామాజికంగా వెనుకబడిన వర్ణాల, నిమ్న వర్ణాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావ్ ఫూలే భార్య. భర్తతో కలసి ఈమె 1848 జనవరి 1న పూనేలో దేశంలోనే మొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించారు. కులవ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. శూద్రుల, దళితుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. ఈమె మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831, జనవరి 3న జన్మించారు. సావిత్రీబాయి 1948లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా ప్రకటించింది.
ప్రశ్నలు-జవాబులు :
ప్రశ్న 1.
సావిత్రిబాయి ఫూలే ఎప్పుడు జన్మించారు ?
జవాబు.
సావిత్రిబాయి ఫూలే 1831 జనవరి 3న జన్మించారు.
ప్రశ్న 2.
సావిత్రిబాయి ఫూలే భర్త పేరేమిటి ?
జవాబు.
సావిత్రిబాయి ఫూలే భర్త పేరు ‘జ్యోతిరావ్ ఫూలే”.
ప్రశ్న 3.
సావిత్రిబాయి ఫూలే జన్మదిన ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా ప్రకటించింది.
ప్రశ్న 4.
మనదేశంలో మొదటి బాలికల పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది ?
జవాబు.
మనదేశంలో మొదటి బాలిక పాఠశాల, 1848 జనవరి 1న, పూనేలో ప్రారంభమైనది.
ప్రశ్న 5.
స్త్రీ విముక్తి ఎలా సాధ్యపడుతుందని సావిత్రిబాయి ఫూలే భావించారు ?
జవాబు.
ఆధునిక విద్య ద్వారానే, స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని సావిత్రిబాయి ఫూలే భావించారు.
![]()
3. అవయవ దానము
ప్రాణాలను కాపాడేందుకు లేదా పరిశోధనల నిమిత్తం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి శరీర భాగాలను అమరుస్తారు. బ్రతికి ఉన్నవారి నుంచి కొన్ని శరీర భాగాలను తీయడం ఒక పద్ధతి. చనిపోయినవారి నుంచి కొన్ని శరీర భాగాలను వెలికితీసి మరొకరికి అమర్చడం ఇంకో పద్ధతి. అవయవ దానం ప్రక్రియ కుటుంబ సభ్యుల ఆమోదంతో పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ప్రపంచంలో తొలిసారిగా 1954లో అవయవదానం చేసిన దాత ‘రొనాల్డ్ లీ హెరిక్’ అతి వృద్ధ అవయవ దాతగా స్కాట్లాండ్ దేశానికి చెందిన 107 సంవత్సరాల మహిళ తన కంటిలోని కార్నియాను దానం చేయడం ద్వారా చరిత్రలో నిలిచారు. అవయవ దానాన్ని వ్యాపారంగా నిర్వహించడం చట్టప్రకారం నేరం. ఆగష్టు 13వ తేదీని అవయవదాన దినోత్సవంగా ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు-జవాబులు :
ప్రశ్న 1.
ప్రపంచంలో తొలి అవయవ దాత ఎవరు ?
జవాబు.
ప్రపంచంలో తొలి అవయవ దాత “రొనాల్డ్ లీ హెరిక్”.
ప్రశ్న 2.
అవయవ దానానికి ఎవరి అనుమతి తప్పనిసరి ?
జవాబు.
అవయవ దానానికి కుటుంబ సభ్యుల ఆమోదం తప్పనిసరి.
ప్రశ్న 3.
అతి వృద్ధ అవయవ దాత ఏ దేశానికి చెందినవారు ? వారి వయస్సు ఎంత ?
జవాబు.
అతి వృద్ధ అవయవ దాత స్కాట్లాండ్ దేశానికి చెందిన మహిళ. వారి వయస్సు 107 సంవత్సరాలు.
ప్రశ్న 4.
అవయవ దానాన్ని ఏ విధంగా నిర్వహించరాదు ?
జవాబు.
అవయవ దానాన్ని వ్యాపారంగా నిర్వహించరాదు.
ప్రశ్న 5.
ఏ రోజును అవయవదాన దినంగా ప్రకటించారు ?
జవాబు.
ఆగష్టు 13వ తేదీని, అవయవదాన దినోత్సవంగా ప్రకటించారు.
4. శంకరంబాడి సుందరాచారి
తెలుగు ప్రజల రాష్ట్ర గీతంగా ప్రసిద్ధి చెందిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అనే గేయాన్ని రచించి, తెలుగు తల్లి వైభవాన్ని కీర్తించినవారు శంకరంబాడి సుందరాచారి. కమలమ్మ, రాజగోపాలాచారి దంపతులకు ప్రథమ సంతానంగా శంకరంబాడి తిరుపతిలో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత అనేక రకాల ఉద్యోగాలు చేశారు. బాల్యం నుంచే కవిత్వం పట్ల ఆసక్తి పెంచుకున్న సుందరాచారి అనేక కావ్యాలు, వచన రచనలు, పల్లెపదాలు, నాటకాలు రచించారు. హెచ్.ఎం. రెడ్డిగారి ‘దీనబంధు’ చిత్రం కోసం శంకరంబాడి ‘మా తెలుగు తల్లికి’ అనే గీతాన్ని రాశారు. అయితే దీన్ని ఆ చిత్రంలో వినియోగించలేదు. 1975లో హైదరా బాదులో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మా తెలుగు తల్లికి’ అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించింది. ఆ సభలో టంగుటూరి సూర్యకుమారి లండను నుండి వచ్చి ఈ గీతాన్ని ఆలపించారు. ఈ గేయ రచనకుగాను రాష్ట్ర ప్రభుత్వం శంకరంబాడి జీవించినంత కాలం నెలకు రెండు వందల యాభై రూపాయల గౌరవవేతనాన్ని మంజూరు చేసింది. 1957లోనే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం శంకరంబాడికి ‘ప్రసన్న కవి’ అని బిరుదునిచ్చి సత్కరించింది.
ప్రశ్నలు-జవాబులు :
ప్రశ్న 1.
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని మొదటగా ఎవరు ఆలపించారు ?
జవాబు.
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని మొదటగా ‘టంగుటూరి సూర్యకుమారి’ గారు ఆలపించారు.
ప్రశ్న 2.
శంకరంబాడి తల్లిదండ్రుల పేర్లేమి ?
జవాబు.
శంకరంబాడి తల్లిదండ్రుల పేర్లు కమలమ్మ, రాజగోపాలాచారి.
ప్రశ్న 3.
శంకరంబాడి గల బిరుదు ఏమిటి ?
జవాబు.
శంకరం బాడికి ‘ప్రసన్న కవి’ అనే బిరుదును శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము వారు ఇచ్చారు.
ప్రశ్న 4.
మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి ?
జవాబు.
మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు, 1975లో హైదరాబాదులో జరిగాయి.
ప్రశ్న 5.
శంకరంబాడి సుందరాచారి రచించిన ప్రసిద్ధ గేయమేది ?
జవాబు.
శంకరంబాడి సుందరాచారి, “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనే ప్రసిద్ధ గేయాన్ని రచించారు.