Reviewing AP Inter 2nd Year Telugu Study Material పద్యభాగం 3rd Poem పద్యరత్నాలు Questions and Answers Summary can help students prepare confidently for exams.
AP Inter 2nd Year Telugu పద్యరత్నాలు Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
“పద్య రత్నాలు” పాఠ్యభాగ సారాంశాన్ని వ్రాయండి.
జవాబు:
మనకి ఇతరులు ఏ పనిచేస్తే ఇష్టముండదో ఆ పనిని మనం ఇతరులకు చేయకుండా ఉండటమే ఉత్తమ ధర్మం. సత్యధర్మాలు రెంటినీ రక్షించే దక్షత ఉన్నవారు వాటిని రక్షించాలని, లేకుంటే అది వారికీ నష్టం కల్గిస్తుంది. వాటి పరిరక్షణకు సదాభగవంతుడు కూడా ఉంటాడు. మేలు కలిగించే అసత్యం పలకడం సత్యంతో సమానం. కీడును కలిగించే సత్యం పలకడం అసత్యంతో సమానం. అనుకూల పరిస్థితులు లేనపుడు విద్వత్తు ఉన్నవాళ్ళు సైతం మిన్నకుండవలసి ఉంటుంది. ఈ భూమ్మీద మనిషికి విద్యాజ్ఞానం మాత్రమే గుర్తింపుని, గౌరవమర్యాదలను కల్గిస్తుంది. పెద్దలను బాధ పెట్టినవారు, తల్లిదండ్రులను గౌరవించనివారు దుర్గతులు పొందుతారు.
మంత్ర ఉచ్చారణలేని సంధ్యావందనం, మౌనంగా చేయని తపస్సు, రాగంలేని గీతం.. ఇవన్నీ అనవసరమైనవి. మానవుడు తన స్వశక్తిని నమ్ముకోవాలేగాని అదృష్ట దురదృష్టాలను కాదు. మంచి గురువులు చేసే ఉపదేశం వల్ల ఎంతటి అజ్ఞానమైనా నశిస్తుంది. అన్నదానం, వస్త్రదానం, గృహదానం, భూదానం కంటే విద్యాదానం మాత్రమే ధరణీతలంపై వర్ధిల్లుతుంది. సమాజంలో నిర్భీతితో మంచి – చెడులను ప్రజా సమూహానికి తెలియజేసే పత్రికలే ప్రజాస్వామ్య సౌధానికి మూలస్తంభాల వంటివి. ప్రాచీనతను మాత్రమే అనుసరించకుండా ఆధునికతను కూడా స్వీకరించాలి. మంచికోసం మార్పును ఆహ్వానించాలి. ఓర్పు, సహనాలతో కార్యాలు సాధించాలి. సర్వశక్తులు ధారపోసి దేశాన్ని పునరుద్ధరించాలి. మన కర్తవ్యాలను మనం గుర్తెరగాలి అన్న విషయాలను విద్యార్థులు గ్రహించాలి.
II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
శ్రీనాథుని గురించి రాయండి.
జవాబు:
15వ శతాబ్దకాలంలో సాహిత్య సింహాసనం అధిష్ఠించిన కవి సార్వభౌముడు శ్రీనాథుడు. 15వ శతాబ్దానికి చెందిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. తల్లిదండ్రులు మారయ, భీమాంబ. విజయనగర ప్రభువైన ప్రౌఢ దేవరాయల ఆస్థాన పండితుడు. గౌఢ డిండిమభట్టును పాండితీ చర్చలో ఓడించి, కనకాభిషేకాన్ని పొందాడు. సీస పద్య రచనలో శ్రీనాథునిది అందెవేసిన చేయి. ఈయన మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషథం, కాశీఖండం, భీమఖండం మొదలైన రచనలు చేశాడు. అఖండ ఐశ్వర్యాన్ని అనుభవించిన శ్రీనాథుడు జీవితం చివరి దశలో అష్టకష్టాలు పడ్డాడు.
ప్రశ్న 2.
ఎవరు దుర్గతులను పొందుతారు ?
జవాబు:
అబద్ధాలాడి పూజ్యులకు బాధ కలిగించేవాడును, తల్లిదండ్రులకు ఎదురుచెప్పి మాట్లాడేవాడును, వరి పొలంలో సంతోషంగా గడ్డిమేయుచున్న ఎద్దును వెళ్ళగొట్టేవాడును, దుర్గతులను పొందుతారు.
ప్రశ్న 3.
వివిధ రకాలైన దానాలను గురించి వివరించండి.
జవాబు:
- అన్నదానం
- వస్త్రదానం
- గృహదానం
- విద్యాదానం ఇవి గొప్పవి.
ప్రశ్న 4.
దక్షులు వేనిని ఉపేక్షించరాదు ?
జవాబు:
ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం పాపం చేతను, అబద్ధం చేతనూ, దరిచేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి కలిగియూ దక్షులు వీటిని ఉపేక్ష చేయరాదు.
![]()
ప్రశ్న 5.
వ్యర్థ కార్యములు ఏవి ?
జవాబు:
మంత్రం లేని సంధ్యా వందనము, మౌనంగా చేయని తపస్సు, వేదమంత్రో చ్చారణ లేని యాగము, పదాల పోహళింపు లేని కవిత్వము, తీగలు లేని వీణ, రాగతానములు లేని పాట, మంత్రులు లేని రాజ్యము ఇవన్నీ వ్యర్థ కార్యములు.
III. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆంధ్రా మిల్టన్గా పేరుగాంచినదెవరు ?
జవాబు:
ఆంధ్రా మిల్టన్ పేరు గాంచినది చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు.
ప్రశ్న 2.
పత్రిక దేనితో సమానము ?
జవాబు:
పత్రిక పదివేల సైన్యంతోను, కోటిమంది స్నేహితులతోను సమానము.
ప్రశ్న 3.
మహాభారతంలో తిక్కన ఎన్ని పర్వాలు అనువదించాడు ?
జవాబు:
మహాభారతంలో తిక్కన 15 పర్వాలను అనువదించాడు.
ప్రశ్న 4.
గొప్పవారికి అలంకారమైనది ఏది ?
జవాబు:
గొప్పవారికి విద్యాదానమే అలంకారమైనది.
ప్రశ్న 5.
కాకులు పెద్దగా అరచినప్పుడు రాజహంస ఏమి చేయడం మంచిది ?
జవాబు:
కాకులు పెద్దగా అరచినప్పుడు రాజహంస తొలగిపోవడమే మంచిది.
ప్రశ్న 6.
“సింహాసన ద్వాత్రింశిక”లో సాలభంజికలు ఎన్ని ?
జవాబు:
సింహాసన ద్వాత్రింశికలో 32 సాలభంజికలు కలవు.
ప్రశ్న 7.
‘భోజ రాజీయం’ గ్రంథ రచయిత ఎవరు ?
జవాబు:
భోజ రాజీయం గ్రంథ రచయిత అనంతామాత్యుడు.
![]()
ప్రశ్న 8.
“శంభుదాసుడు” అనే బిరుదు ఎవరికి ఉంది ?
జవాబు:
శంభుదాసుడు అనే బిరుదు ఎఱ్ఱనకు కలదు.
ప్రశ్న 9.
శివభారతం కావ్య రచయిత ఎవరు ?
జవాబు:
శివభారతం కావ్య రచయిత గడియారం వేంకట శేషశాస్త్రి.
IV. సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
పరమ ధర్మ పథములకెల్లన్
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము తిక్కనచే రచింపబడిన శ్రీమదాంధ్ర భారతము శాంతి పర్వము నుండి గ్రహింపబడిన ‘పద్యరత్నాలు’ అను పాఠంలోనిది.
సందర్భము : ఇతరులు చేసే పనులు తనకు ఇష్టం లేనపుడు ఆ పనులు చేయకుండుట గొప్ప ధర్మమని కవి చెప్పిన సందర్భము.
భావము : అన్ని మార్గాల కన్నా గొప్ప ధర్మము. (ఇతరులు చేసిన పని తాను చేయకుండుట)
ప్రశ్న 2.
కాదు, భాగ్యదేవత యెందు కారణంబు !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కందుకూరి వీరేశలింగం పంతులుచే రచింపబడిన రాజశేఖర చరిత్ర నుండి గ్రహింపబడిన పద్యరత్నాలు అను పాఠములోనిది.
సందర్భము : మానవులు తమరు చేసిన తప్పులకు కారణము దేవతలంచు వాపోతారు. కాని తమరు చేసిన కీడుకు అదృష్ట దేవత కారణం కాదు కదా! అని వివరిస్తూ కవి పల్కిన సందర్భములోనిది.
భావము : అదృష్టదేవత కారణం కాదు కదా ! అని భావం.
ప్రశ్న 3.
దారుణంబగు రోగంబు తలగునట్లు !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుచే రచింపబడిన గయోపాఖ్యానం నుండి గ్రహింపబడిన ‘పద్య రత్నాలు’ అను పాఠంలోనిది.
సందర్భము : సద్గురులు చేసేటువంటి ఉపదేశాల వల్ల ఎంత అజ్ఞానమైనను పోతుంది. అలాగే అనుభవిజ్ఞుడైన వైద్యుడు ఇచ్చేటువంటి చిన్న మాత్ర వల్ల భయంకరమైన రోగము పోతుంది కదా ! అని వివరిస్తూ కవి పల్కిన సందర్భము.
భావము : చిన్న మాత్ర వల్ల భయంకరమైన రోగము తగ్గుతుంది కదా !
ప్రశ్న 4.
విద్యాదానమొకటి జగతి
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులచే రచింపబడిన గయోపాఖ్యానం నుండి గ్రహింపబడిన ‘పద్య రత్నాలు’ అను పాఠములోనిది.
సందర్భము : అన్ని దానాల్లో కెల్ల విద్యాదానం గొప్పదని వివరిస్తూ కవి పల్కిన సందర్భము.
భావము : జగతికి విద్యాదానమే ఆధారము.
ప్రశ్న 5.
క్రొత్త నీరు రాని కోనేరు పసరెక్కు!
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము నార్ల వెంకటేశ్వరరావు రచించిన నార్ల వారిమాట శతకము నుండి గ్రహింపబడిన ‘పద్యరత్నాలు’ అను పాఠములోనిది.
సందర్భము : గొప్పదనమంతా పాత విషయాలలో లేదు. కొత్త విషయాలు కీడును కలుగజేయవు. క్రొత్త నీరు రాకపోతే చెరువు పసరుతో కూడుకుని ఉంటుంది అని వివరిస్తూ కవి పల్కిన సందర్భము.
భావము : కొత్తనీరు రాకపోతే సరస్సులో ఉన్న నీరు పసరెక్కుతాయి అని భావము.
విశేషాంశాలు
నవీనాంధ్ర పంచకావ్యాలు :
- ఆంధ్రపురాణం – మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
- శివభారతం – గడియారం వెంకటశేష శాస్త్రి
- సౌందర నందము – పింగళి – కాటూరి కవులు
- రాణా ప్రతాపసింహ చరిత్ర – దుర్భాక రాజశేఖర శతావధాని
- బాపూజీ ఆత్మకథ – తుమ్మల సీతారామమూర్తి చౌదరి
పద్యరత్నాలు Summary in Telugu
కవి పరిచయం
1. పాఠ్యభాగము : 1, 2 పద్యాలు
గ్రహింపబడిన గ్రంథము : 1వ పద్యము – ఆంధ్ర మహాభారతము – శాంతి – పర్వము నుండి 2వ పద్యము – ఆంధ్ర మహాభారతము – ఉద్యోగ పర్వము నుండి
కవి : తిక్కన
కాలము : 13వ శతాబ్దము
బిరుదులు : కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు
తల్లిదండ్రులు : అన్నమాంబ, కొమ్మనామాత్యులు
ఆస్థానము : మనుమసిద్ధి ఆస్థానము
స్థలం : విక్రమసింహపురి (నెల్లూరు)
రచనలు : విజయసేనము, నిర్వచనోత్తర రామాయణము, ఆంధ్ర మహాభారతము (15 పర్వాలు), కవి సార్వభౌమఛందము, కృష్ణ శతకము
అంకితం : తిక్కన తాను ఆంధ్రీకరించిన భారతాన్ని ‘హరి హర నాథునికి’ అంకితం చేశాడు.
కవితా వైభవం : ఈయన కవితా శిల్పంలో, పాత్రచిత్రణలో, నాటకీయమైన సంభాషణలు నడపడంలో దిట్ట. పాత్రల ముఖంగానే కథను నడపడంలో అద్వి తీయుడు. ఈయన మంత్రి, యుద్ధనీతి విశారదుడు కావడం వల్ల ఇతని రచనలలో యుద్ధ వర్ణనలు సహజంగాను, గంభీరంగాను ఉంటాయి. అలతి’ అలతి దేశ పదాలతో అనల్పార్థాన్ని చెప్పడంలో అందె వేసిన చేయి. రసోచిత పదాలు, వృత్తాలు ప్రయోగించడంలో నిపుణుడు.
![]()
2. పాఠ్యభాగము : 3వ పద్య౦
గ్రహింపబడిన గ్రంథము: ఆంధ్ర మహాభారతము – అరణ్యపర్వ శేషము
కవి : ఎఱ్ఱన
కాలము : 14వ శతాబ్దము
బిరుదులు : శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు
ఆస్థానము : రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి.
తల్లిదండ్రులు : పోతమాంబా, సూరనార్యుల పుత్రుడు.
రచనలు : భారతం అరణ్య పర్వ శేషము, నృసింహ పురాణము, హరివంశము, రామాయణము, కవి సర్పగరుడము.
విశిష్ఠత : ఈయన ప్రతిభా పాండిత్యాలలో నన్నయ, తిక్కనలకు సమానుడై భారతారణ్య పర్వ శేషాన్నే గాక హరివంశాన్ని కూడా రచించి భారతానికి సమగ్రత కల్పించాడు. ఈయన అరణ్య పర్వ శేషాన్ని నన్నయ పేరు మీదనే తెనిగించి రాజ రాజ నరేంద్రునికే అంకితం చేశాడు. ఈ అరణ్య పర్వ శేషాన్ని నన్నయ శైలిలో ఆరంభించి, తిక్కన శైలితో ముగించాడు. అందులో ఈయన శైలి నన్నయ తిక్కనల రచనలనే రెండు మహా సముద్రాలను కలిపే జల సంధి వలె ఉంటుంది.
మధ్యాక్కరలో మూడవగణం తర్వాత లేవడి పాటించాడు. ఈయన శైలి సత్త్వశుద్ధికి నెలవు. శ్రీనాథ మహాకవి ఇతని సూక్తి వైచిత్రిని ప్రశంసించాడు. ఈయన కావ్యాలన్నింటిలో ప్రబంధ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కనుక ఈయనకు “ప్రబంధ పరమేశ్వర” బిరుదు సార్థకమైంది. ఎర్రని తండ్రి సూరనామాత్యుడు ఉభయ కవిత్వ – ప్రౌఢుడట. వీరి ఇంటి పేరు “చదలువాడ వార”ని కొందరంటున్నారు. ఇతని రామాయణంలోని పద్యాలను కూచిమంచి తిమ్మకవి లక్షణ సార సంగ్రహంలో ఉదాహరించాడు.
3. పాఠ్యభాగము : 4, 5 పద్యాలు
గ్రహింపబడిన గ్రంథము : 4వ పద్యము కాశీఖండము నుండి 5వ పద్యము భీమఖండం నుండి గ్రహింపబడింది.
కవి : శ్రీనాథుడు
కాలము : 15వ శతాబ్దము
తల్లిదండ్రులు : భీమాంబ, మారయలు
ఆస్థానము :
- విజయనగర ప్రభువైన ప్రౌఢ దేవరాయల ఆస్థాన పండితుడు.
- పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి
బిరుదులు : కవి రాజు, కవి సార్వభౌముడు
ప్రతిభ : గౌడ డిండిమభట్టును పాండితీ చర్చలో ఓడించి కనకాభిషేకాన్ని పొందాడు.
రచనలు :
- మరుత్తరాట్చరిత్ర
- శాలివాహన సప్తశతి
- శృంగార నైషధము
- కాశీఖండం
- భీమ ఖండం
- పల్నాటి వీరచరిత్ర
- పండితారాధ్య చరిత్ర
- శివరాత్రి మాహాత్మ్యము
విశిష్ఠత : తెలుగు సాహిత్యంలో శ్రీనాథునికి ఒక ప్రత్యేక స్థానముంది. ఈయన మహా విద్వాంసుడు. కావ్య రచనలో ఈయన తొక్కని మార్గమే లేదు. జీవిత మంతా రసమయం చేసుకొని తన రచనలన్నింటి “లోను తన రూపాన్ని దృగ్గోచరం చేసుకున్నాడు. సంస్కృతంలో ఉన్న శ్రీహర్షుని నైషధ కావ్యాన్ని ఆంధ్రీకరించి సంస్కృత ప్రౌఢికి, తెలుగు నుడి కారాన్ని జోడించాడు. ఈయన హరవిలాస, భీమేశ్వర, కాశీఖండ కావ్యాలు శివపారమ్య బోధకు కవితా ప్రౌఢికి ఎనలేని నిధులు. ఈయన నవ్య వాఙ్మయ మార్గంలోనే గాక శైలిలో, కల్పనలలో, శబ్ద సృష్టిలో అప్రతిముడై ఆంధ్ర వాఙ్మయంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.
4. పాఠ్యభాగము: 6వ పద్యము
గ్రహింపబడిన గ్రంథము: భోజరాజీయము నుండి గ్రహింపబడింది.
కవి : అనంతామాత్యుడు
కాలము : 15వ శతాబ్దము
నివాసము : పెనమకూరు – తోట్లవల్లూరు మండలం
సమకాలికులు : శ్రీనాథుడు, పెదకోమటి వేమారెడ్డి
రచనలు : భోజరాజీయము, ఛందోదర్పణము, రసాభరణము
అంకితం : భోజరాజీయం అనే కథా కావ్యాన్ని “అహెూబిల నరసింహస్వామికి” అంకితం ఇచ్చాడు.
5. పాఠ్యభాగము : 7వ పద్యము
గ్రహింపబడిన గ్రంథము: సింహాసన ద్వాత్రింశిక
కవి : కొఱవి గోపరాజు
కాలము : 15వ శతాబ్దము
తల్లిదండ్రులు : కామాంబిక, కసవరాజు
అంకితం : ఈ కథా కావ్యాన్ని హరిహరనాథునికి అంకితం’ ఇచ్చాడు.
ప్రతిభ : సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉంది.
రచన : సింహాసన ద్వాత్రింశిక
శైలి : కవిత్వం రసవంతమై మృదు మధురంగా ఉంటుంది.
6. పాఠ్యభాగము : 8వ పద్యము
గ్రహింపబడిన గ్రంథము: రాజశేఖర చరిత్ర
కవి : కందుకూరి వీరేశలింగం పంతులు
కాలము : 19వ శతాబ్దము
బిరుదు : గద్య తిక్కన
కవితా విశిష్ఠత : తెలుగులో నవల, ప్రహసనం, కథ, వ్యాసం, స్వీయ చరిత్ర
రచనలు :
- శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధము
- రాజశేఖర చరిత్ర
- అభిజ్ఞాన శాకున్తలము
- నీతి కథా మంజరి
- రత్నావళీ మున్నగునవి.
![]()
7. పాఠ్యభాగము : 9, 10 పద్యాలు
గ్రహింపబడిన గ్రంథము: గయోపాఖ్యానము
కవి : చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు
కాలము : 19వ శతాబ్దము
బిరుదు : కళాప్రపూర్ణ
ప్రతిభ : బహుగ్రంథ కర్త, పత్రికా సంపాదకుడు, సంఘ సంస్కర్త, జాతీయవాది
రచనలు : గయోపాఖ్యానము, ప్రసన్నయాదవం, ప్రహ్లాద చరిత్ర, ద్రౌపదీ పరిణయం, అను నాటకాలు, రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, గణపతి అనే నవలలు.
8. పాఠ్యభాగము : 11, 12 పద్యాలు
గ్రహింపబడిన గ్రంథము : శతకం
కవి : నార్ల వేంకటేశ్వరరావు
కాలము : 20వ శతాబ్దము
రచనలు : నార్ల వారి మాట (శతకం) జాబాలి, సీతజోస్యం పౌరాణిక నాటకాలు.
అవార్డు : సీత జోస్యం అను రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.
ప్రతిభ : తెలుగు నాట ప్రముఖ పాత్రికేయులుగా, కథా రచయితగా, శతక కర్తగా, నాటక మరియు నాటికల కర్తగా, రాజ్యసభ సభ్యులుగా సుప్ర సిద్దులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు సంపాదకత్వం వహించారు.
9. పాఠ్యభాగము : 13, 14 పద్యాలు
గ్రహింపబడిన గ్రంథము: శివభారతం నుండి గ్రహింపబడింది.
కవి : గడియారం వెంకట శేషశాస్త్రి
కాలము : 20వ శతాబ్దము
బిరుదు : కవిసింహ
ప్రతిభ : శాసనమండలి సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా సేవలందించారు. కడప జిల్లాకు చెందిన ప్రఖ్యాత పండితులు, శతావధాని.
పాఠ్యభాగ ఉద్దేశ్యం
నేటి విద్యార్థులకు ప్రాచీన సాహిత్యం మరియు ఆధునిక సాహిత్యాలలోని నీతి పద్యాలను ఏరి కూర్చిన పద్యాలే పద్య రత్నాలు. ఇవి మానవీయ విలువలను పెంపొందించుట. తన కాళ్ళపై తాను నిలబడి పరోపకారం చేసే అలవాటు చేయుట, పెద్దలను గౌరవించుట, విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ సారాంశం
మనకి ఇతరులు ఏ పనిచేస్తే ఇష్టముండదో ఆ పనిని మనం ఇతరులకు చేయకుండా ఉండటమే ఉత్తమ ధర్మం. సత్యధర్మాలు రెంటినీ రక్షించే దక్షత ఉన్నవారు వాటిని రక్షించాలని, లేకుంటే అది వారికీ నష్టం కల్గిస్తుంది. వాటి పరిరక్షణకు సదాభగవంతుడు కూడా ఉంటాడు. మేలు కలిగించే అసత్యం పలకడం సత్యంతో సమానం. కీడును కలిగించే సత్యం పలకడం అసత్యంతో సమానం. అనుకూల పరిస్థితులు లేనపుడు విద్వత్తు ఉన్నవాళ్ళు సైతం మిన్నకుండవలసి ఉంటుంది. ఈ భూమ్మీద మనిషికి విద్యాజ్ఞానం మాత్రమే గుర్తింపుని, గౌరవమర్యాదలను కల్గిస్తుంది. పెద్దలను బాధపెట్టినవారు, తల్లిదండ్రులను గౌరవించనివారు దుర్గతులు పొందుతారు.
మంత్ర ఉచ్చారణలేని సంధ్యావందనం, మౌనంగా చేయని తపస్సు, రాగంలేని గీతం.. ఇవన్నీ అనవసరమైనవి. మానవుడు తన స్వశక్తిని నమ్ముకోవాలేగాని అదృష్ట దురదృష్టాలను కాదు. మంచి గురువులు చేసే ఉపదేశం వల్ల ఎంతటి అజ్ఞానమైనా నశిస్తుంది. అన్నదానం, వస్త్రదానం, గృహదానం, భూదానం కంటే విద్యాదానం మాత్రమే ధరణీతలంపై వర్ధిల్లుతుంది. సమాజంలో నిర్భీతితో మంచి చెడులను ప్రజా సమూహానికి తెలియజేసే పత్రికలే ప్రజాస్వామ్య సౌధానికి మూలస్తంభాల వంటివి. ప్రాచీనతను మాత్రమే అనుసరించకుండా ఆధునికతను కూడా స్వీకరించాలి. మంచికోసం మార్పును ఆహ్వానించాలి. ఓర్పు, సహనాలతో కార్యాలు సాధించాలి. సర్వశక్తులు ధారపోసి దేశాన్ని పునరుద్ధరించాలి. మన కర్తవ్యాలను మనం గుర్తెరగాలి అన్న విషయాలను విద్యార్థులు గ్రహించాలి.
పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు
1. కం. ఒరులేయవి యొనరించిన
నరవర! యప్రియము దనమనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మపథముల కెల్లన్ !
ప్రతిపదార్ధము :
నరవర ! = ఓ రాజా !
ఒరుల = ఇతరులు
ఏ + అవి + ఒనరించినన్ ఏయవి యొనరించినన్ = ఏయే పనిచేస్తే
తన మనంబునకున్ = తన మనస్సుకు
అప్రియము + అగున్ అప్రియమగున్ = అనిష్టమగునో
తాను ఒరులకున్ = తాను పరులకు
చేయక + ఉనికి చేయకునికి = చేయకుండా ఉండటం
పరమ ధర్మపథములకున్ + ఎల్లన్ పరమధర్మ పథములకెల్లన్ = శ్రేష్ఠమైన ధర్మమార్గాలన్నింటికీ
పరాయణము = ఉత్తమమైన ఆశ్రయం
తాత్పర్యము : రాజా ! ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అప్రియంగా ఉంటుందో, ఆ పనులను తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మ మార్గాలకూ ఉత్తమమైన ఆలంబనంగా ఉంది.
![]()
2.ఉ. సారపు ధర్మమున్ విమలసత్యము బాపముచేత బొంకుచే
బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులే
వ్వార లుపేక్షసేసి రది వారల చేటగు గాని ధర్మని
స్తారకమయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడిన్ !
ప్రతిపదార్థము :
సారపు ధర్మమున్ = శ్రేష్ఠమైన ధర్మాన్ని
విమల సత్యమున్ = నిర్మలమైన సత్యమును
పాపము చేతన్ = దురితం చేతనూ
బొంకు చేతన్ = అబద్ధం చేతనూ
పారమున్ + పొందన్ + లేక పారము బొందలేక = గట్టు చేరలేక
చెడన్ పాఱినది + ఐన + అవస్థన్ చెడఁబాఱినదైన యవస్థన్ = చెడటానికి సిద్ధంగా ఉన్న దుర్దశలో
దక్షులు = చక్కదిద్దటానికి సమర్థులు
ఏ + వారలు ఎవ్వారులు = ఎవరు
ఉపేక్ష + చేసిరి ఉపేక్ష సేసిరి = అశ్రద్ధ వహిస్తారో
అది = ఆ విధంగా
వారల చేటు + అగున్ వారలచేటగున్ = వారికే హాని కలిగిస్తుంది
కాని = కాని
ధర్మ నిస్తారకము + అయ్యున్ ధర్మ నిస్తారకమయ్యున్ = ధర్మమును ఉద్దరించేది గాను
సత్య శుభదాయకము + అయ్యును సత్య శుభదాయకమయ్యును = సత్యానికి మేలు కల్గించేది గాను
దైవము + ఉండెడున్ దైవముండెడున్ = దైవం ఆధారంగా ఉంటుంది.
తాత్పర్యము : ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం పాపం చేతను, అబద్ధం చేతనూ దరిచేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి కలిగియూ ఎవరు అడ్డుపడక అశ్రద్ధ వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించడానికి ముందుకు వస్తాడు.
3.ఉ. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు, త
ద్భూత భయాస్పదంబగు ప్రభూతపు సత్యము బొంకునట్లు, ప్రా
ణాతురుడైనచో, పరిణయంబున యందును పల్కుబొంకు స
త్యాతిశయంబు యండ్రు, మహితాత్మక ! ఇట్టివి ధర్మసూక్ష్మముల్
ప్రతిపదార్థము :
మహిత + ఆత్మక మహితాత్మక = గొప్ప ఆత్మ కలవాడా !
భూత – హితంబుగాన్ = జీవులకు మేలు కలిగించేటట్లుగా
పలుకు = మాట్లాడే
బొంకును = అసత్యం కూడా
సత్య ఫలంబున్ + ఇచ్చున్ సత్యఫలంబునిచ్చున్ = నిజం పలికిన ఫలితాన్నే ఇస్తుంది
తత్ + భూత – తద్భూత = ఆ జీవులకు
భయ + ఆస్పదంబు + అగు భయాస్పదంబగు = భీతికి నెలవైన
ప్రభూతము + సత్యము ప్రభూతపు సత్యము = గొప్పదైన నిజం
బొంకును అట్లు + అ బొంకునట్ల = అసత్యం వంటిదే .
ప్రాణ + ఆతురుడు + ఐనచోన్ ప్రాణాతుడైనచోన్ = ప్రాణం పోవునేమో అనే భయం కలిగినప్పుడు
పరిణయంబున + అందున్ పరిణయంబునయందున్ = పెండ్లి లోను
పల్కు = మాట్లాడే
బొంకు = అసత్య౦
సత్య + అతిశయంబు + అ సత్యాతిశయంబు = సత్యం కంటే గొప్పదే
అండ్రు = అంటారు
ధర్మ సూక్ష్మముల్ = ధర్మాన్ని ప్రస్తరించేటప్పుడు ఏర్పడే అగోచరా లైన ముఖ్యమైన చిన్న అంశాలు
ఇట్టివి = ఇటువంటివి
తాత్పర్యము : ఓ మహానుభావా ! ధర్మాన్ని ప్రస్తరిస్తే అగోచరాలైనను ముఖ్యాలైన చిన్న అంశాలుగా విడివడుతుంది. ప్రాణికోటికి మేలు జరగటానికై చెప్పబడిన అసత్యం సత్యం కంటె కూడా గొప్పది. ప్రాణికోటికి కీడు కలిగించే సత్యం అసత్యంతో సమానం. ప్రాణరక్షణకూ వివాహం జరిపించటానికీ ఆడిన అసత్యం సత్యం కంటే ఘనమైనది, ఇవి ధర్మసూక్ష్మాలు సుమా !
4. కం. సిద్ధింప పిత్సంబులు
సిద్ధించెనయేని బిదపజెడు; నన్యుని సం
వృద్ధి గనుంగొని యెవ్వని
బుద్ధి నసూయాగ్రహంబు బొందు నతనికిన్ !
ప్రతిపదార్థము :
అన్యుని సంవృద్ధిన్ + కనుంగొని అన్యుని సంవృద్ధిఁగనుంగొని = ఇతరుని అభ్యుదయాన్ని చూచి
ఏ + వని – బుద్ధిన్ ఎవ్వని – బుద్ధిన్ = ఎవని బుద్ధిని
“అసూయ + ఆగ్రహంబు” అసూయాగ్రహంబు అసూయా = అసూయ యనెడి
గ్రహంబు = దయ్యము
పొందున్ = ఆవేశించునో
అతనికిన్ = అట్టివానికి
ఈప్సితంబులు = కోరికలు
సిద్ధంపవు = ఫలింపవు
సిద్ధించెన + ఏనిన్ సిద్ధించెన యేనిన్ = మొదట సిద్ధించినను
పిదపన్ + చెడున్ పిదపఁజెడున్ = పిమ్మట చెడిపోవును
తాత్పర్యము : ఇతరుల అభివృద్ధిని చూచినంతనే ఎవరి బుద్ధిని అసూయ అనెడి గ్రహము ఆవేశించునో, అట్టివాని కోరికలు సిద్ధింపనే సిద్ధింపవు. ఒకవేళ సిద్ధించినను పిదప చెడిపోవును.
5. తే.గీ. నికటముననుండి శ్రుతి పుట నిష్ఠురముగ
నడరి కాకులు తాము బిట్టరచినప్పు
డుదధి రాయంచ యూరకయుంట లెస్స
సైపరాకున్న నెందేని జనుట యొప్పు !
ప్రతిపదార్ధము :
నికటమునన్ + ఉండి నికటమున నుండి = దగ్గరగా ఉండి
శ్రుతి పుట నిష్టురముగన్ = కర్ణ కఠోరముగ
అడరి = అతిశయించి
కాకులు = కాకులు
బిట్టు = వేగముగా
పెద్ద + అఱచిన + అప్పుడు పెద్దఱచినప్పుడు = పెద్దగా అరచినప్పుడు
రాయంచ = రాజహంస
ఉడిగి = తగ్గి (మానుకుని)
ఊరక + ఉంట ఊరక యుంట = ఊరకుండుట
లెస్స = మంచిది
సైపరాకున్నన్ = సహింపజాలని యెడల
ఎందేనిన్ = ఎచ్చటికైనను
చనుట = వెడలుట
ఒప్పు = తగును
తాత్పర్యము : కాకి మూక చుట్టును చేరి కర్ణకఠోరముగా మాటి మాటికి అరచు చున్నప్పుడు రాజహంస ఏమియు పలుకకుండ ఊరకుండుట మంచిది. సహింప జాలని యెడల ఆ చోటును వీడి మరెచ్చటికైనను వెడలుట తగును.
![]()
6. ఉ. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చు నతండు తండ్రికిం
దల్లికి మాఱు పల్కెడు నతండును నాఁకొని వచ్చి యొడ్ల చే
నుల్ల మెలర్ప మేయఁ జనుచున్న వృషంబు నదల్చు నాతఁడున్
ద్రెల్లెడునట్టి దుర్గతులఁ ద్రెళ్లుదు నేనిటురాక తక్కినన్
ప్రతిపదార్థము:
ఏన్ + ఇటురాక – తక్కినన్ ఏనిటురాక తక్కినన్ = చెప్పిన విధంగా నేను నీ దగ్గరకు రాకపోతే
ప్రల్లదము + ఆడి ప్రల్లదమాడి = అబద్ధాలాడి
పెద్దలకు = పూజ్యులకు
బాధ + ఒనర్చున్ బాధయొనర్చున్ = బాధపెట్టే
అతండు = ఆతడు
తండ్రికిన్ + తల్లికిన్ తండ్రికిందల్లికిన్ = తల్లిదండ్రలకు
మాఱుపల్కెడున్ = ఎదురు తిరిగి మాట్లాడే
అతండును = ఆతడు
ఆకొనివచ్చి = ఆకలితో వచ్చి
ఒడ్ల చేన్ = వరి చేనును
ఉల్లము + ఎలర్పన్ ఉల్లమెలర్పన్ = హృదయానందంతో
మేయన్. + చనుచున్న మేయఁజనుచున్న = గడ్డి మేస్తున్నటువంటి
వృషంబున్ = ఎద్దును
అదల్చున్ = వెళ్ళగొట్టే పని
అతడున్ = అతడు
తెల్లెడునట్టి = వెళ్ళేటువంటి
దుర్గతులన్ = వివిధములైన నరకాలకు
త్రెళ్ళెదును = వెడతాను
తాత్పర్యము : అబద్ధాలాడి పూజ్యులకు బాధ కలిగించేవాడును, తల్లిదండ్రులకు ఎదురు జెప్పి మాట్లాడేవాడును, వరిపొలంలో సంతోషంగా గడ్డి మేయుచున్న ఎద్దును వెళ్ళగొట్టేవాడును ఏయే నరకాలకు వెడతారో, నేను చెప్పిన విధంగా ఇక్కడకు రాకపోతే ఆయా నరకాలకు వెడతాను. అనగా ఆడినమాట తప్పను అని ఆవు పులితో పల్కెను.
7. ఉ. మంత్రములేని సంధ్యయును మౌనములేని తపంబు వేదవి
తంత్రములేని యాగముఁ బదజ్ఞతలేని కవిత్వమున్ సదా
తంత్రులులేని వీణయును తానము రాగములేని గీతమున్
మంత్రులులేని రాజ్యము సమానము లిన్నియు వ్యర్థకార్యముల్!
ప్రతిపదార్థము :
మంత్రములేని = మంత్ర పఠనము లేని
సంధ్యయును = సంధ్యావందనము
మౌనములేని = మౌనంగా లేకుండా చేసే
తపంబు = తపసు
వేదవిత్తంత్రములేని = వేదమంత్రోచ్చారణలేని
యాగమున్ = యాగము
పదజ్ఞతలేని = పదాల పోహళింపులేని
కవిత్వమున్ = కవిత్వము
సదా = ఎల్లప్పుడు
తంత్రులు లేని = తీగలు లేని
వీణయును = వీణ
తానము రాగములేని = రాగతాళములు లేని
గీతమున్ = పాట
మంత్రులు లేని = రాజ్యాంగబద్ధంగా మంత్రులు లేని
రాజ్యము = రాజ్యము
ఇన్నియు = ఇవి అన్నియును
వ్యర్థకార్యముల్ సమానము = ఎందుకు పనికిరాని వాటితో సమానము
తాత్పర్యము : మంత్రం లేని సంధ్యావందనము, మౌనంగా చేయని తపస్సు వేదమంత్రోచ్చారణ లేని యాగము, పదాల పోహళింపులేని కవిత్వము, తీగలు లేని వీణ, రాగ తానములు లేని పాట, మంత్రులు లేని రాజ్యము ఇవన్నియు పనికిరాని వానితో సమానములు.
8. తే.గీ. ప్రజలు తమ దోషముననె విపత్తులొంది
నిలుపు దురదృష్ట దేవతలను తప్పు,
ధరణి, తమ కీడు మేళ్ళకు తామెకాని కాదు,
భాగ్యదేవతయెందు కారణంబు
ప్రతిపదార్థము :
ప్రజలు = మానవులు
తమ దోషముననె = తమ తప్పుల వల్ల
విపత్తులు + ఒంది విపత్తులొంది = ఆపదలను పొంది
దురదృష్ట = దురదృష్టము
దేవతలను = దేవతలయందు
తప్పు నిలుపు = దోషముంచుతారు
ధరణి = భూమిపైన
తమ కీడు మేళ్ళకు = తమకు కల్గిన కీడులకు
తామోకాని = వారే కారణము కాని
భాగ్యదేవత + ఎందు భాగ్యదేవతయెందు = అదృష్టదేవత యందు
కారణముకాదు = కారణం కాదుగదా !
తాత్పర్యము : మానవులు తమరు చేసిన తప్పులకు కారణము దేవతలంచు వాపోతారు. కాని తమరు చేసిన కీడుకు అదృష్టదేవత కారణం కాదు కదా !
9. తే.గీ. సద్గురులు సేయు నుపదేశసారములను
నెంత యజ్ఞానమైనను నిట్టెపోవు
మంచి వైద్యుడిచ్చెడి చిన్నిమాత్ర చేత
దారుణంబగు రోగంబు తలగునట్లు!
ప్రతిపదార్థము:
సద్గురులు + చేయు సద్గురులు సేయు = మంచి గురువులు చేసెడి
ఉపదేశ సారములను = హితోపవాక్యాలు
ఎంత + అజ్ఞానము + ఐనను ఎంతయజ్ఞానమైనను = ఎంతటి అజ్ఞానమైనా
నిట్టెపోవు = తేలికగా పోతాయి
మంచి వైద్యుడు + ఇచ్చెడి మంచి వైద్యుడిచ్చెడి = అనుభవిజ్ఞుడైన వైద్యుడు ఇచ్చేటటువంటి
చిన్న మాత్ర చేత = చిన్న మాత్ర చేత
దారుణంబగు = భయంకరమైన
రోగంబు = రోగము
తలగును + అట్లు తలగునట్లు = నశించిపోవును
తాత్పర్యము: సద్గురులు చేసేటువంటి ఉపదేశాల పల్ల ఎంత అజ్ఞానమైనను పోతుంది. ఎలాగంటే అనుభవజ్ఞుడైన వైద్యుడు ఇచ్చేటువంటి చిన్న మాత్ర వల్ల భయంకరమైన రోగము పోతుంది కదా !
![]()
10. సీ. అన్నదానము గొప్పదనవచ్చునేగాని
అన్నంబు జాములో నరిగిపోవు
వస్త్రదానము గూడ భవ్యదానమెగాని వస్త్రమేడాదిలో పాతదగును
గృహదానమొకటి యుత్కృష్ట దానమెగాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు
భూమిదానము మహాపుణ్య దానమెగాని భూమి యన్యుల జేరిపోవవచ్చు
తే.గీ. అరిగిపోక యించుకయేని చిరిగిపోక
కూలిపోవక యన్యుల పాలుగాక
నిత్యమయి, వినిర్మలమయి, నిశ్చలమయి
యొప్పుచుండు విద్యాదాన మొకటి జగతి!
ప్రతిపదార్థము :
అన్నదానము = చేసేటువంటి అన్నదానము
గొప్పది + అనవచ్చునే గాని గొప్పదనవచ్చునే గాని = గొప్పది అని చెప్పవచ్చును కాని
వస్త్రదానము = చేసేటువంటి వస్త్రదానము
భవ్యదానమెగాని =గొప్పది అని చెప్పవచ్చును కాని
వస్త్రము = బట్ట
ఏడాదిలో పాతది + అగును ఏడాదిలో పాతదగును = సంవత్సరానికి పాతదే అవుతుంది
గృహదానము + ఒకటి గృహదానమొకటి = గృహాన్ని దానం చేస్తే
ఉత్కృష్టదానమెగాని = గొప్పదే కాని
కొంప = ఇల్లు
కొన్ని + ఏండ్లలోన్ కొన్నేండ్లలో = కొంతకాలానికే
కూలిపోవు = కూలిపోతుంది
భూమిదానము = భూమిని దానం చేయుట
మహాపుణ్యదానమె గాని = గొప్ప పుణ్యము వస్తుంది కాని
భూమి = దానం చేసినటువంటి భూమి
అన్యులన్ + చేరిపోవచ్చున్ అన్యుల జేరిపోవవచ్చున్ = ఇతరుల కధీనమైపోతుంది
అరిగిపోక = అరిగిపోనటువంటి
ఇంచుక + ఏని ఇంచుకయే = కొంచెమైనను
చిరిగిపోక = చినిగిపోనటువంటి
కూలిపోవక = కూలి పోనటువంటి
అన్యుల పాలుగాక = ఇతరులకు అధీనము కానటువంటి
నిత్యమయి = శాశ్వతమై
వినిర్మలమై = నిర్మింపబడినటువంటి
నిశ్చలమయి = కదలికలేనటువంటి
జగతిన్ = ప్రపంచంలో
విద్యాదానము + ఒకటి విద్యాదానమొకటి = విద్యాదానమనునది
ఒప్పుచుండు = ప్రకాశిస్తుంది
తాత్పర్యము : గొప్పదైన అన్నదానం చేస్తే క్షణంలో అరిగిపోతుంది. గొప్పదైన వస్త్రదానం చేస్తే ఏడాదిలో చిరిగిపోతుంది. గృహదానం చేస్తే కొంతకాలానికి కూలి పోతుంది. భూమి దానం చేస్తే మరొకరి సొంతమైపోతుంది. అరిగి పోనటువంటిది, చిరిగిపోనటువంటిది, ఇతరులకు చిక్కనిది, శాశ్వతమైనది విద్యాదానమొక్కటే ప్రకాశిస్తుంది.
11. ఆ.వె. పత్రికొక్కటున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
ప్రజకు రక్షలేదు పత్రిక లేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట
ప్రతిపదార్థము:
పత్రిక + ఒక్కటి + ఉన్న పత్రికొక్కటున్న = ఒక్క పత్రిక ఉంటే
పదివేల సైన్యము = పదివేలమంది సైన్యంతో సమానము
పత్రిక + ఒక్కటి + ఉన్న పత్రికొక్కటున్న = ఒక్క పత్రిక ఉంటే
మిత్రకోటి = కోటిమంది మిత్రులతో సమానము
పత్రిక లేకున్న = పత్రిక లేకపోతే
ప్రజకు రక్ష లేదు = మానవులకు రక్షణ లేదు
నార్ల వారి మాట = నార్లవారి మాట
వాస్తవమ్ము = నిజము
తాత్పర్యము : ఒక్క పత్రిక ఉంటే పదివేల సైన్యంతో సమానం మరియు కోటిమంది స్నేహితులతో సమానము. కాని పత్రిక లేకపోతే మానవులకు రక్షణ లేదు. కనుక నార్ల వారు చెప్పెడి మాట నిజము.
12. ఆ.వె. ప్రాతలోనె లేదు ప్రాశస్త్యమంతయు
క్రొత్తయెల్ల హాని కూర్పబోదు
క్రొత్తనీరు రాని కోనేరు పసరెక్కు
వాస్తవమ్ము నార్లవారి మాట
ప్రతిపదార్థము :
ప్రాశస్త్యము + అంతయు ప్రాశస్త్యమంతయు = గొప్ప ధనమంతయు
ప్రాతలోనె లేదు = పాత విషయములందు లేదు
క్రొత్త + ఎల్లన్ క్రొత్తయెల్లన్ = కొత్త విషయాలు
హాని = కీడు
కూర్పున్ + పోదు కూర్పుబోదు = కలుగదు
క్రొత్తనీరు రాని = కొత్త నీరు రాకపోతే
కొనేరు = సరస్సు
పసరు + ఎక్కు పసరెక్కు = పసరు కలిగి ఉంటుంది.
నార్ల వారి మాట = నార్లవారు చెప్పెడి మాట
వాస్తవమ్ము = నిజము
తాత్పర్యము : గొప్పదనమంతా పాత విషయాలలో లేదు. కొత్త విషయాలు కీడును కలుగచేయవు. క్రొత్త నీరు రాకపోతే చెరువు పసరుతో కూడుకుని ఉంటుంది. నార్ల వారు చెప్పెడిమాట నిజము.
![]()
13. మ. అలతం జెందకు, తొందరం బడకు పుత్రా! చీకటుల్ వోయెవె
న్నెల రాదా? కసుగాయ పండవలెగానీ బల్మి బండింతువా?
యిలకుం గంగనుదెచ్చు కచ్చెఱుగవా ? యీ యేటిలో నెన్ని ము
న్కలతోనో నెఱయీతకాడగుట యన్నా ! యోపికన్ జూపుమీ.
ప్రతిపదార్థము :
అలతన్ + చెందకు అలతంజెందకు = బాధపడకు
తొందరన్ + పడకు తొందరంబడకు = తొందరపాటు వద్దు
పుత్రా = ఓ బిడ్డా!
చీకటుల్ + పోయె చీకటులోవోయె = చీకట్లు పోయి
వెన్నెల రాదా ? = వెన్నెల వస్తుంది కదా !
కసుగాయ = లేతకాయ
పండవలెగానీ = సహజంగా పండాలి గాని
బల్మిన్ + పండింతువా ? బల్మిబండింతువా = బలవంతంగా పండించలేము కదా !
ఇలకున్ = భూమి పైకి
గంగనున్ + తెచ్చు గంగనుదెచ్చు = గంగను తీసికొని వచ్చిన విధంగా
క్రచ్చు + ఎఱుగవా ? క్రచ్చెఱుగవా ? = కోరికను గ్రహించలేదా ?
ఈ + ఏటిలోన్ ఈయేటిలోన్ = ఈ నదిలో
ఎన్ని మున్కలతోనో = ఎన్నోసార్లు మున్కలు వేయగా
నెఱ + ఈతకాడు + అగుట నెఱయీతకాడగుట = గజ ఈతగాడగుట
అన్నా ! = అన్నా !
ఓపికన్ + చూపుమీ యోపికన్ + జూపుమీ = ఓపిక అవసరము
తాత్పర్యము : అన్నా ! బాధపడకూడదు. తొందరపడకూడదు. కుమారా ! చీకట్లుపోయి వెన్నెల వస్తోంది కదా ! లేతకాయలు సహజంగా పండాలే కాని బలవంతంగా పండించలేము. భూమి పైకి కోరికతో గంగను తెచ్చిన రీతి ఎఱుగవా? నదిలో ఎన్నిసార్లో మున్కలు వేస్తానే కాని గజయీతకాడు కాలేడు. కనుక ఓపిక అవసరం.
14. తే.గీ. చెదరిపోయిన యంగముల్ కుదురు పఱచి,
సడలువాఱిన తంతువుల్ చక్కఁ దీర్చి,
యనుగతశ్రుతి భువన మోహనముగాఁ గ
హాయిఁ బలికింప లెమ్ము జాతీయ వీణ
ప్రతిపదార్థము :
చెదరిపోయిన + అంగముల్ చెదరిపోయిన యంగముల్ = చెల్లా చెదురైన అవయవాలు
కుదరు పఱచి = స్థిరపడేటట్లు చేసి
సడలు వాటిన = చెడిపోయిన
తంతువుల్ = తీగెలను
చక్క + తీర్చి చక్కఁదీర్చి = సరిచేసి
అనుగతశ్రుతి = అనుసరింపబడిన శ్రుతి
భువనమోహముగాఁగ = మనోహరంగా
జాతీయవీణ = జాతీయవీణను
హాయిన్ + పలికింప = ఆనందంగా పలికింప
లెమ్ము = సిద్ధపడు
తాత్పర్యము : చెల్లా చెదురైన అవయవాలను సరిచేసినట్లును, చెడిపోయిన తీగెలను సరిచేసినట్లును, అనుసరింపబడిన శ్రుతి మనోహరంగా జాతీయ వీణను ఆనందంగా పలికించుటకు సిద్ధపడాలి.