ఆంధ్రుడను Questions and Answers Summary Inter 1st Year Telugu

Regular practice with AP Inter 1st Year Telugu Study Material పద్యభాగం 4th Poem బాటసారి Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year Telugu ఆంధ్రుడను Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్న

ప్రశ్న 1.
‘ఆంధ్రుడను’ పాఠ్యభాగ సారాంశాన్ని తెలపండి.
జవాబు:
అనేక దేశవిదేశాలలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందిన నా భారతదేశము నాకు పాఠశాల. సంగీత సాహిత్యములనే రెండు స్తనములు కలిగిన సరస్వతీ దేవి నాకు ఉపాధ్యాయురాలు. సాందీపని అనే మహర్షి దగ్గర చదువుకున్న శ్రీకృష్ణుడు నాకు సహచర పాఠకుడు. భక్తి వైరాగ్యాలను బోధించే భాగవతము నాకు పెద్దబాలశిక్ష. నేను గంటాన్ని ధరించి, ముచ్చటైన అక్షరాలతో దశదిశలనెడి .ఫలకంపైన నా దేశపు గొప్పతనాన్ని వ్రాసుకునే ఆంధ్ర పుత్రుడను.

అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసమహర్షి మా ఆస్థాన పండితుడు. శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రుడు మా పొరుగువాడు. ముల్లోకాలలో విజయవంతుడైన భీముడు మా ఊరి వ్యాయామ వీరుడు. తన గాన వైదుష్యంతో రాళ్ళను కరిగించిన త్యాగయ్య మా ఇంటి గాయకుడు. హిమాలయాలపైకెక్కి నా దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి తెలియజేసే విధంగా పద్యాలను గొప్పగా పఠించే ఆంధ్రవీరుడను నేను.

మా దేశ శిల్పకళా నైపుణ్యాన్ని లోకాలకు తెలియజేయుటకు తాజమహలు చూపిస్తాను. మా తెలుగు కవితా మాధుర్యాన్ని ఆస్వాదించుటకు తిక్కన కావ్యాలను చూపిస్తాను. ధనుర్విద్యా పాటవాన్ని చాటడానికి గొప్పవీరుడైన అర్జునుని గురించి చెబుతాను. మా దేశ పతివ్రతల పాతివ్రత్యాన్ని చెప్పడానికి సావిత్రి చరితను పఠిస్తాను. భరతమాత ఆశ్చర్యపడే విధంగాను, ఆకాశమంతా మార్మోగుతుండగా మా ఘనతను చాటుతున్న మాట తప్పని ఆంధ్రభూపతి నేను.

అన్ని దేశాలకు అహింసా సూక్తులను బోధించగలది, దయా గుణానికి అల మేడ వంటిది నా మనస్సు. దరిద్రులకు బంగారు గుప్పిటలో దానం చేయగలది నా చెయ్యి. దిక్కులేని వారిని చూసి కన్నీరు కార్చు దయా గుణానికి నా హృదయం పుట్టినిల్లు. అందమైన అలంకారాలతో మధుర కవిత్వాన్ని పలుకుటకు నా జిహ్వ కల్పతరువు వంటిది. సంతోషమనెడి విమానము నెక్కి కీర్తి మేఘాలపైన ఏ బాధ లేకుండా అహర్నిశలు హాయిగా సంచరించే అదృష్టవంతుణ్ని నేను.

శ్రీకృష్ణ దేవరాయల ప్రతాపం మాకు దీపకళిక. రాజరాజ నరేంద్రుని గొప్ప కీర్తి ప్రతిష్ఠలు మాకు పండువెన్నెలలు. బొబ్బిలి వీరుల పరాక్రమాలు మాకు రక్షణ కవచాలు. శత్రురాజుల శిరస్సులకు అంటిన బురద, మాకు సౌందర్యాన్ని కలిగించే నుదుటి బొట్టు. గొప్ప గ్రంథాలను రచించి, ఆకాశమార్గంలో వలపుటంగడులను పెట్టి వ్యాపారం చేయగల్గిన ఆంధ్ర వర్తకుడను.

II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విత్తవంతుడను నేను అని జాషువ తెలిపిన విధం ఎలాంటిది ?
జవాబు:
నా చిత్తము అన్ని దేశాలకు అహింసా సూక్తులను బోధించగలదు. దయా గుణానికి అద్దాల మేడ లాంటిది. నా చెయ్యి నిరుపేదలకు దానం చేయగలదు. నా గుండె అనాథలను చూసి కన్నీరు కార్చు కరుణకు పుట్టినిల్లు. నా నాలుక అందమైన అలంకారాలతో మధుర కవిత్వాన్ని పలుకుటకు కల్పతరువు వంటిది. నేను సంతోషమనెడి విమానము నెక్కి కీర్తి అనెడి మేఘాలపైన ఏ బాధ లేకుండా అహర్నిశలు హాయిగా తిరిగే ఐశ్వర్యవంతుడను.

ప్రశ్న 2
జాషువా హిమాలయ శిఖరమెక్కి గానం చేస్తానని చెప్పిన విషయాలేవి ?
జవాబు:
అష్టాదశ పురాణ కర్త వ్యాసమహర్షి మా ఆస్థాన పండితుడు. శివధనుస్సును విరిచిన శ్రీరాముడు మా పొరుగువాడు. ముల్లోకాలలో విజయాలు సాధించిన భీముడు మా ఊరి వ్యాయామ వీరుడు. గాన వైదుష్యంతో రాళ్ళను కరగజేయు భక్తుడు త్యాగరాజు మా ఇంట గాయకుడు. హిమాలయ పర్వత శిఖరం పైకి ఎక్కి దేశ కీర్తిప్రతిష్ఠలను ప్రపంచానికి తెలియజేసే విధంగా పద్యాలను గొప్పగా గానం చేసే ఆంధ్ర వీరుడను నేను.

ఆంధ్రుడను Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 3.
జాషువా రచనలను తెలియజేయండి.
జవాబు:
జాషువా రచనలు గబ్బిలం, ఫిరదౌసి, స్వప్న కథ, కాందిశీకుడు, ముంతాజ్ మహాలు, నేతాజీ, బాపూజీ, ముసాఫిరులు, కాందిశీకులు, నాగార్జున సాగర్, క్రీస్తు చరిత్ర మొదలైనవి.

III. ఏక వాక్య / పద రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భక్తి వైరాగ్యాలకు నిలయమైన గ్రంథం ఏది ?
జవాబు:
భాగవతము

ప్రశ్న 2.
గాండీవి అని ఎవరిని అంటారు ?
జవాబు:
అర్జునుడు

ప్రశ్న 3.
మన ఆస్థాన పండితునిగా జాషువా ఎవరిని పేర్కొన్నారు ?
జవాబు:
వ్యాస మహర్షి

ప్రశ్న 4.
జాషువా ఎప్పుడు జన్మించారు ?
జవాబు:
28 సెప్టెంబరు 1895 న

ప్రశ్న 5.
జాషువా బిరుదులేవి ?
జవాబు:
కవికోకిల, కళాప్రపూర్ణ

ప్రశ్న 6.
శిల్ప నైపుణ్య మహిమను ఉదహరించడానికి కవి పేర్కొన్న నిర్మాణమేది ?
జవాబు:
తాజ్మహలు

ప్రశ్న 7.
శీల సంపదకు ప్రతీకగా కవి ఎవరిని పేర్కొన్నారు ?
జవాబు:
సావిత్రి

ప్రశ్న 8.
తన గాన నైపుణ్యంతో రాళ్ళను సైతం కరిగించిన భక్తుడెవరు ?
జవాబు:
త్యాగరాజు

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
మడమ ద్రిప్పని యాంధ్రవీరుడను నేను
జవాబు:
పరిచయం : ఈ వాక్యము జాషువా రచించిన “జాషువా సర్వ లభ్య రచనల సంకలనం” నుండి గ్రహింపబడిన “ఆంధ్రుడను” అనే పాఠ్యాంశములోనిది.
సందర్భము : జాషువా హిమాలయ పర్వత శిఖరంపైకెక్కి మనదేశ కీర్తి ప్రతిష్ఠలను పద్యాల రూపంలో గానం చేస్తానని చెప్పిన సందర్భము.
భావము : వెనుకాడని ఆంధ్రవీరుడను నేను.
వ్యాఖ్య : ఆంధ్ర ప్రశస్తిని కొనియాడుతూ జాషువా పల్కిన పల్కులు.

ప్రశ్న 2.
కరుణకు నా గుండె పురిటి గీము
జవాబు:
పరిచయం : ఈ వాక్యము జాషువా రచించిన “జాషువా సర్వ లభ్య రచనల సంకలనం” నుండి గ్రహింపబడిన “ఆంధ్రుడను” అనే పాఠ్యాంశములోనిది.
సందర్భము : అనాథలను చూసి కన్నీరు కార్చు కరుణకు పుట్టినిల్లు నా గుండె అని జాషువా పల్కిన సందర్భము.
భావము : నా గుండె దయాగుణానికి పుట్టినిల్లు.
వ్యాఖ్య : జాషువాకు గల దేశభక్తిని తెలియజేస్తున్నది.

ఆంధ్రుడను Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 3.
సమగ్ర ప్రతాపము దీపకళిక మాకు
జవాబు:
పరిచయం : ఈ వాక్యము జాషువా రచించిన “జాషువా సర్వ లభ్య రచనల సంకలనం” నుండి గ్రహింపబడిన “ఆంధ్రుడను” అనే పాఠ్యాంశములోనిది.
సందర్భము : శ్రీకృష్ణదేవరాయల మహోగ్ర ప్రతాపము మాకు దీపకళిక అని విశ్లేషిస్తూ జాషువా పల్కిన సందర్భము.
భావము : మహెూగ్ర ప్రతాపము మాకు దీపకళిక.
వ్యాఖ్య : శ్రీకృష్ణ దేవరాయల పరాక్రమాన్ని విశ్లేషిస్తూ జాషువా పల్కిన పల్కులు.

V. సంధులు

1. మోహనాక్షరములు
జవాబు:
మోహన + అక్షరములు – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : సంస్కృతమున అ, ఇ, ఉ, ఋ, ఇ లకు అచ్చులు సవర్ణములైన పరంబులగునపుడు క్రమంగా వాని దీర్ఘము ఏకాదేశమగును.

2. దేవర్షి
జవాబు:
దేవ + ఋషి – గుణసంధి
సూత్రము : సంస్కృతమున అకారానికి అసవర్ణములైన అచ్చులు ఇ-ఉ-ఋలు పరంబగునపుడు క్రమంగా ఏ-ఓ-అర్ అనునవి ఏకాదేశమగును.

VI. సమాసములు

1. కీర్తిమేఘములు
జవాబు:
కీర్తి అనెడి మేఘములు – రూపక సమాసము

2. భక్తివైరాగ్యములు
జవాబు:
భక్తియును, వైరాగ్యమును – ద్వంద్వ సమాసము

3. ముల్లోకములు
జవాబు:
మూడైన లోకములు – ద్విగు సమాసము

4. అద్దాలమేడ
జవాబు:
అద్దాలతో కూడిన మేడ – విశేషణ పూర్వపద కర్మధారయము

5. ధనుర్విద్యారమ
జవాబు:
ధనుర్విద్యా అనెడి రమ – రూపక సమాసము

6. శీతనగము
జవాబు:
శీతలమైన నగము – విశేషణ పూర్వపద కర్మధారయము

7. సిద్ధసాధ్యులు
జవాబు:
సిద్ధులును, సాధ్యులును – ద్వంద్వ సమాసము

8. భాషావధూటి
జవాబు:
భాష అనెడి వధూటి – రూపక సమాసము

ఆంధ్రుడను Questions and Answers Summary Inter 1st Year Telugu

9. అహింస
జవాబు:
హింస కానిది – నఞ తత్పురుష సమాసము

10. భరతఖండము
జవాబు:
భరతమను పేరుగల ఖండము – సంభావనా పూర్వపద కర్మధారయము

VII. కఠిన పదాలకు అర్థాలు

  1. వధూటి = కన్య
  2. తావలము = స్థానము
  3. గడన = సంపాదన
  4. ఈవి = దానము

ఆంధ్రుడను Summary in Telugu

కవి కాలాదులు

పాఠ్యభాగము : ఆంధ్రుడను
గ్రహింపబడిన గ్రంథం : “జాషువా సర్వ లభ్య రచనల సంకలనం” నుండి గ్రహింపబడింది.
కవి : గుర్రం జాషువా
కాలము : 20వ శతాబ్దము
తల్లిదండ్రులు : లింగమాంబ, వీరయ్య
జననం : 28 సెప్టెంబరు 1895
మరణం : 24 జూలై 1971
జన్మస్థలం : వినుకొండ
నివాస స్థలం : గుంటూరు

బిరుదులు :

  • 1933 – కవితా విశారద
  • 1936 – కవి కోకిల
  • 1947 – కవి దిగ్గజ, నవయుగ చక్రవర్తి
  • 1952 – మధుర శ్రీనాథ
  • 1964 – విశ్వకవి సమ్రాట్
  • 1970 – కళాప్రపూర్ణ
  • 1970 – పద్మ భూషణ్

పదవులు : 1964 – ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం
పొందిన గౌరవాలు : కనకాభిషేకము, గండ పెండేరం వంటి గౌరవాలు పొంది, ఆంధ్రదేశంలోను, ఇతర నగరాలలోను సత్కారాలు అందుకున్నారు.
ఉద్యోగం : 1943లో సాంగ్ పబ్లిసిటీ ఆర్గనైజర్గా మద్రాసు ప్రభుత్వంలో ఉద్యోగం చేశారు. 1956 – 1960 తర్వాత కొంతకాలం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్ణేతలుగా పనిచేశారు.

రచనలు :

  • 1922 – కుశలవోపాఖ్యానము – వచనము, చిన్నా నాయకుడు – వచనము
  • 1941 – గబ్బిలము – పద్య కావ్యము
  • 1941 – ముంతాజ్ మహలు – పద్య కావ్యము
  • 1932 – ఫిరదౌసి – పద్య కావ్యము
  • 1942 – కాందిశీకుడు – పద్య కావ్యము
  • 1937, 38, 47 – జాషువా ఖండ కావ్య సంపుటాలు
  • 1949 – స్వయంవరము – పద్య కావ్యము
  • 1948 – బాపూజీ – పద్య కావ్యము, నా కథ-పద్య కావ్యము-3 భాగాలు
  • 1946 – వీరబాయి నాటకము
  • 1923 – రుక్మిణీ కల్యాణము – నాటకము
  • 1946 – తెరచాటు – నాటకము
  • 1925 – ధ్రువ విజయము – నాటకము
  • 1920 – దావీదు చరిత్ర – నాటకము
  • 1963 ముసాఫరులు – పద్య కావ్యము
  • 1919 – మదాలస – నాటకము
  • 1921 – చిదానంద ప్రభాతము – నాటకము
  • 1948 – నేతాజీ – పద్య కావ్యము, శివాజి – పద్య కావ్యము

విశిష్టత : ఆధునిక యుగంలోని కవులలో ప్రసిద్ధులు. జాతీయాభిమాని. మానవతావాది. చీడ పట్టిన వర్ణ వ్యవస్థ సత్వరమే నిర్మూలం కావాలన్న ఆవేదన, బడుగువర్గాల బతుకులు పచ్చగా పండాలన్న ఆకాంక్ష వీరి రచనలలో ప్రధానంగా ఉన్నాయి. ఆంధ్రాభిమానం, దేశాభిమానం వీరి రచనలలో ముఖ్యంగా గోచరిస్తాయి. వీరు వివిధ ప్రక్రియల్లో రచనలు చేసినప్పటికీ ప్రధానంగా ఖండకావ్య రచయితగా ప్రశస్తి పొందారు.

ఆంధ్రుడను Questions and Answers Summary Inter 1st Year Telugu

పాఠ్యభాగ నేపద్యం

జాతీయాభిమానానికి, ఆంధ్రాభిమానానికి మకుటంలేని మహారాజు శ్రీ గుర్రం జాషువా. పురాణ కథామూర్తులను తలుస్తూ, భారతీయ శిల్ప కళా నైపుణ్యాన్ని అభినందిస్తూ, మానవత్వాన్ని ప్రస్తావిస్తూ, ఆంధ్రవీరుల పరాక్రమాలను అభివర్ణిస్తూ ఆంధ్ర ప్రశస్తిని విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ వివరించడమే ఈ పాఠ్యభాగ నేపథ్యం.

పాఠ్యభాగ సారాంశం

అనేక దేశ విదేశాలలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందిన నా భారతదేశము నాకు పాఠశాల. సంగీత సాహిత్యములనే రెండు స్తనములు కలిగిన సరస్వతీ దేవి నాకు ఉపాధ్యాయురాలు. సాందీపని అనే మహర్షి దగ్గర చదువుకున్న శ్రీకృష్ణుడు నాకు. సహచర పాఠకుడు. భక్తి వైరాగ్యాలను బోధించే భాగవతము నాకు పెద్దబాలశిక్ష. నేను గంటాన్ని ధరించి, ముచ్చటైన అక్షరాలతో దశదిశలనెడి ఫలకంపైన నా దేశపు గొప్పతనాన్ని వ్రాసుకునే ఆంధ్ర పుత్రుడను.

అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసమహర్షి మా ఆస్థాన పండితుడు. శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రుడు మా పొరుగువాడు. ముల్లోకాలలో విజయవంతుడైన భీముడు మా ఊరి వ్యాయామ వీరుడు. తన గాన వైదుష్యంతో రాళ్ళను కరిగించిన త్యాగయ్య మా ఇంటి గాయకుడు. హిమాలయాలపైకెక్కి నా దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి తెలియజేసే విధంగా పద్యాలను గొప్పగా పఠించే ఆంధ్రవీరుడను నేను.

మా దేశ శిల్పకళా నైపుణ్యాన్ని లోకాలకు తెలియజేయుటకు తాజమహలును చూపిస్తాను. మా తెలుగు కవితా మాధుర్యాన్ని ఆస్వాదించుటకు తిక్కన కావ్యాలను చూపిస్తాను. ధనుర్విద్యా పాటవాన్ని చాటడానికి గొప్పవీరుడైన అర్జునుని గురించి చెబుతాను. మా దేశ పతివ్రతల పాతివ్రత్యాన్ని చెప్పడానికి సావిత్రి చరితను పఠిస్తాను. భరతమాత ఆశ్చర్యపడే విధంగాను, ఆకాశమంతా మార్మోగుతుండగా మా ఘనతను చాటుతున్న మాట తప్పని ఆంధ్రభూపతి నేను.

అన్ని దేశాలకు అహింసా సూక్తులను బోధించగలది, దయా గుణానికి అద్దాల మేడ వంటిది నా మనస్సు. దరిద్రులకు బంగారు గుప్పిటలో దానం చేయగలది నా చెయ్యి. దిక్కులేని వారిని చూసి కన్నీరు కార్చు దయా గుణానికి నా హృదయం పుట్టినిల్లు. అందమైన అలంకారాలతో మధుర కవిత్వాన్ని పలుకుటకు నా జిహ్వ కల్పతరువు వంటిది. సంతోషమనెడి విమానము నెక్కి కీర్తి మేఘాలపైన ఏ బాధ లేకుండా అహర్నిశలు హాయిగా సంచరించే అదృష్టవంతుణ్ని నేను.

శ్రీకృష్ణ దేవరాయల ప్రతాపం మాకు దీపకళిక. రాజరాజ నరేంద్రుని గొప్ప కీర్తి ప్రతిష్ఠలు మాకు పండువెన్నెలలు. బొబ్బిలి వీరుల పరాక్రమాలు మాకు రక్షణ కవచాలు. శత్రురాజుల శిరస్సులకు అంటిన బురద, మాకు సౌందర్యాన్ని కలిగించే నుదుటి బొట్టు. గొప్ప గ్రంథాలను రచించి, ఆకాశమార్గంలో వలపుటంగడులను పెట్టి వ్యాపారం చేయగల్గిన ఆంధ్ర వర్తకుడను.

పద్యాలు – ప్రతిపదార్ధాలు – తాత్పర్యాలు

1వ పద్యం.

సీ॥ బహుదేశములను బేర్వడసి మీసము దీటు
భరతఖండంబు నా పాఠశాల
స్తనయుగంబున గానసాహిత్యములు గల్గు
భాషావధూటి నా పంతులమ్మ
సాందీపని సమక్షమందు విద్యగడించు
వనమాలి నా సహపాఠకుండు
భక్తివైరాగ్యముల తావలమైన
భాగవతంబు నా బాలశిక్ష

తే॥ గంటము ధరించి మోహనాక్షరము లెనయ
బ్రతిఫలించెడు నా మహోన్నత విభూతి
వ్రాసికొందును దశదిశాఫలకపంక్తి
గడనకెక్కిన యాంధ్రపుత్రుడను నేను

ప్రతిపదార్థం :

బహుదేశములను = అనేక దేశాలలో
పేర్వడసి = పేరు పొందిన
మీసము దీటు = పౌరుషానికి ప్రతీక అయిన
భరత ఖండంబు = భారతదేశము
నా పాఠశాల = నాకు పాఠశాల
గాన సాహిత్యములున్ + కల్గు = గానసాహిత్యములు గల్గు = సంగీత సాహిత్యములనే
స్తనయుగంబునన్ = రెండు స్తనములుగా కలిగిన
భాషావధూటి = భాషాధి దేవత అయిన సరస్వతీ దేవి
నా పంతులమ్మ = నాకు గురువు
సాందీపని సమక్షము + అందు = సాందీపని సమక్షమందు = సాందీపని అనే మహర్షి దగ్గర
విద్య గడించు = విద్యనభ్యసించిన
వనమాలి = శ్రీకృష్ణుడు
నా సహ పాఠకుండు = నా సహచర పాఠకుడు
భక్తి వైరాగ్యములన్ = భక్తి వైరాగ్యాలకు
తావలము + ఐన = తావలమైన = ఆధారమైన
భాగవతంబు = భాగవతము
నా బాలశిక్ష = నాకు పెద్ద బాలశిక్ష
గంటము ధరించి = చేతితో గంటమును పట్టుకొని
మోహన + అక్షరములు + ఎనయ = మోహనాక్షములెనయ = ముచ్చట్టే అక్షరములు ఒప్పు
దశదిశా ఫలక పంక్తిన్ = దశదిశలనెడి ఫలకం మీద
నా మహా + ఉన్నతి – విభూతి = నా మహెూన్నతి-విభూతి = నా దేశ గొప్ప శక్తిని
ప్రతిఫలించెడు = ప్రకాశించే విధంగా
గడనకెక్కిన = ఖ్యాతి గడించిన విధంగా
వ్రాసి కొందును = దిద్దుకొనే
ఆంధ్ర పుత్రుడను నేను = తెనుగుబిడ్డను

తాత్పర్యం: అనేక దేశ విదేశాలలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందిన నా భారతదేశము కు పాఠశాల. సంగీత సాహిత్యములనే రెండు స్తనములు కలిగిన సరస్వతీ దేవి పొందీవని అనే మహర్షి దగ్గర చదువుకున్న, శ్రీకృష్ణుడు సహచర భక్తి వైరాగ్యాలను బోధించే భాగవతము నాకు పెద్దబాల శిక్ష. నేను గంటాన్ని ధరించి, ముచ్చటైన అక్షరాలతో దశదిశలనెడి ఫలకంపైన నా దేశపు గొప్పదనాన్ని వ్రాసుకునే ఆంధ్ర పుత్రుడను.

ఆంధ్రుడను Questions and Answers Summary Inter 1st Year Telugu

2వ పద్యం :

సీ॥ ఘనపురాణ గ్రంథకర్త దేవర్షి వ్యా
సుండు మా యాస్థాన పండితుండు
శివధనుఃఖండనాంచిత బాహువీరుండు
భూసుతాభర్త మా పొరుగువాడు
ముల్లోక విజయంబు పుంజీభవించిన
భీముండు మాయూరి సాముకాడు
గానవైదుషి తాలుగరగు భక్తుడు త్యాగ
రాయండు మాయింటి గాయకుండు

తే॥ శీతనగశృంగసీమ నాసీనుడనయి
యద్భుతములైన బిరుదుపద్యములు సదివి
వేడ్క మ్రోయించుకొందును విజయభేరి
మడమ ద్రిప్పని యాంధ్రవీరుడను నేను

ప్రతిపదార్థం :

ఘన పురాణ గ్రంథకర్త = అష్టాదశ పురాణాలను రచించిన
దేవ + ఋషి = దేవర్షి = దేవ ఋషి అయిన
వ్యాసుండు = వ్యాస మహర్షి
మా + ఆస్థాన పండితుండు = నాయాస్థాన పండితుండు = మా ఆస్థాన పండితుడు
శివ ధనుస్ + ఖండన + అంచిత
శివధనుఃఖండనాంచిత = పవిత్రమైన శివధనస్సును విరిచిన
బాహువీరుండు = భుజ బలపరాక్రముడైన
భూసుతాభర్త = భూమికి కూతురైన సీతాదేవి భర్త
మా పొరుగువాడు = మా పొరుగువాడు
పుంజీభవించిన = ప్రోగు చేయబడిన
ముల్లోక విజయంబు = ముల్లోకాలలో విజయం సాధించిన
భీముండు = భీమసేనుడు
మా + ఊరి-సాముకాడు = మాయూరిసాముకాడు = మా ఊరి వ్యాయామ వీరుడు
గానవైదుషి = తన గాన వైదుష్యంతో
ఱాలుగరగు = ఱాలన్ + కరుగు = రాళ్ళను కరిగించిన
త్యాగరాయండు = త్యాగరాజు
మా+ఇంటి-గాయకుండు = మాయింటి గాయకుండు = మా ఇంట వెలసిన గాయకుడు
శీతనగ శృంగ సీమ = హిమాలయ పర్వత పైభాగాన
ఆసీనుడను + అయి = ఆసీనుడనయి = ఎక్కి కూర్చున్న వాడనై
అద్భుతములు + ఐన = అద్భుతములైన = ఆశ్చర్యకరములైన
బిరుదు పద్యములు + చదివి = బిరుదు పద్యములు సదివి = కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పద్యాలను చదివి
వేడ్క = ఆసక్తిగా
విజయభేరి = విజయఢంకాలను
మ్రోయించుకొందును = మ్రోగిస్తాను
మడమద్రిప్పని = వెనుతిరగని
ఆంధ్రవీరుడు+అను-నేను = ఆంధ్రవీరుడను నేను = నేను ఆంధ్రవీరుడను

తాత్పర్యం : అష్టాదశ పురాణాలను రచించిన దేవర్షియైన వ్యాసమహర్షి మా ఆస్థానపండితుడు. శివధనుస్సును విరిచిన గొప్ప వీరుడైన శ్రీరామచంద్రుడు మా పొరుగువాడు. ముల్లోకాలలో విజయం సాధించిన భీముడు మా ఊరి వ్యాయామ వీరుడు. తనగాన వైదుష్యంతో రాళ్ళను కరిగించిన త్యాగయ్య మా ఇంటి గాయకుడు. హిమాలయాలపైకెక్కి నా దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి తెలియజేసే విధంగా పద్యాలను గొప్పగా పఠించే ఆంధ్రవీరుడను నేను.

3వ పద్యం :

సీ ॥ మా శిల్పనైపుణ్య మహిమంబు ఘోషించు
తాజమహాలు నుదాహరించి
మా కవిత్వవిలాస మార్దవంబుం జిందు
ఘను తిక్కనకవిని మచ్చునకుజూపి
మా ధనుర్విద్యారమా వైఖరింజాటు
వీరుడౌ గాండీవి పేరు చెప్పి
మా సతీశీలసంపద లచ్చుగ్రుద్దించు
సావిత్రి మాంగల్య చరితమెన్ని

తే॥ భరతమాతకు గగ్గురుపాటు దోప
గగనమండలి మార్మోయ గంఠమెత్తి
పందెమొడ్డెద విశ్వప్రపంచమందు
నుడువుదప్పని యాంధ్రభూపుడను నేను

ప్రతిపదార్థం :

మా శిల్ప నైపుణ్య = మా శిల్పకళా నైపుణ్యము యొక్క
మహిమంబు = గొప్పదనాన్ని
ఘోషించు = చాటి చెప్పుటకు
తాజమహలును = తాజమహలును
ఉదాహరించి = ఉదాహరణగా చూపిస్తాను
మా కవిత్వ విలాస = మా తెలుగు కవిత్వము యొక్క సొగసులతో కూడిన
మార్దవంబున్ + చిందు = మార్దవంబుంజిందు = మాధుర్యాన్ని ప్రసరించే విధంగా (మాధుర్యాన్ని ఆస్వాదించే విధంగా)
ఘను = గొప్పవాడైన
తిక్కన కవిని = తిక్కన సోమయాజిని
మచ్చునకున్ + చూపి = మచ్చునకు జూపి = ఉదహరిస్తాను
మాధనుః + విద్యారమా = మాధనుర్విద్యారమా = ధనుర్విద్యల యొక్క సంపదను
వైఖరిన్ + చాటు = వైఖరింజాటు = రీతిని చాటడానికి
వీరుడు + ఔ = వీరుడౌ = వీరుడైన
గాండీవి = గాండీవాన్ని ధరించిన అర్జునుని
పేరు చెప్పి = పేరు చెప్తాను
మా సతీ శీల సంపదలు = మా దేశ పతివ్రతలలో,
అచ్చుగుద్దించు = గొప్పదనాన్ని వెల్లడించడానికి
సావిత్రి, మాంగల్య చరితము + ఎన్ని
సావిత్రి మాంగల్య చరితమెన్ని = సావిత్రి యొక్క పాతివ్రత్యాన్ని పఠిస్తాను
భరతమాతకున్ = భరతాంబకు
గగ్గురుపాటున్ + తోప = గగ్గురుపాటుదోప = పులకించే విధంగా
గగన మండలి మార్మోయ = ఆకాశమంతా మారుమ్రోగే విధంగా
కంఠము + ఎత్తి = కంఠమెత్తి = గొంతెత్తి
విశ్వ ప్రపంచము+అందు = విశ్వ ప్రపంచమందున = ఈ లోకంలో
పందెము + ఒడ్డెద = పందెమొద = ఘనతను చాటెద
ఉడు తప్పని = మాట తప్పని
ఆంధ్రభూపుడను నేను = ఆంధ్ర భూపతిని నేను

తాత్పర్యం : మా దేశ శిల్పకళా నైపుణ్యాన్ని లోకాలకు తెలియజేయుటకు తాజమహలును చూపిస్తాను. మా తెలుగు కవితా మాధుర్యాన్ని ఆస్వాదించుటకు తిక్కన కావ్యాలను చూపిస్తాను. ధనుర్విద్యా పాటవాన్ని చెప్పడానికి గొప్ప వీరుడైన అర్జునుని గురించి చెప్పుతాను. మా దేశ పతివ్రతల పాతివ్రత్యాన్ని చెప్పడానికి సావిత్రి చరితను పఠిస్తాను. భరతమాత ఆశ్చర్యపడే విధంగాను, ఆకాశమంతా మార్మోగు తుండగా మా ఘనతను చాటుతున్న మాట తప్పని ఆంధ్రభూపతిని నేను.

4వ పద్యం :

సీ॥ | సర్వభూముల కహింసా సూక్తి బోధించు
దయకు నాచిత్త మద్దాలమేడ
గండుపేదలకు బంగారు గుప్పిట దన్పు
నీవికి నా చేయి తావలంబు
అత్యనాథుల గాంచి యశ్రూదకము జిమ్ము
కరుణకు నా గుండె పురిటి గీము
మంజులాలంకార మకరంద ముప్పొంగు
కవితకు నాజిహ్వ కల్పతరువు

తే॥ కమ్ముకొని వచ్చు కీర్తిమేఘముల మీద
నమల సంతోషరస విమానముల నెక్కి
హాయిగా సంచరింతు నహర్నిశంబు
నిడుమలందని విత్తవంతుడను నేను

ప్రతిపదార్థం:

సర్వభూములకు = అన్ని దేశాలకు
అహింసా-సు+ఉక్తి = అహింసా సూక్తి = అహింస అనే మంచిమాటను
బోధించు = బోధించగలదు
దయకు = కరుణకు
నా చిత్తము = నా మనస్సు
అద్దాలమేడ = అద్దాలమేడ వంటిది
గండు పేదలకు = నిరుపేదలకు
బంగారు గుప్పిటన్ = బంగారు గుప్పిటలో
ఈవికి = దానమునకు
తన్పు = చేయుటకు
నా చేయి = నా యొక్క చెయ్యి
తావలంబు = స్థానము
అతి+అనాథులన్ +కాంచి = అత్యనాథులగాంచి = దిక్కులేనివారిని చూచి
అశ్రు+ఉదకమున్+చిమ్ము = అశ్రూదకము జిమ్ము = కన్నీరు కార్చుటకు
కరుణకు = దయకు
నా గుండె = నా హృదయము
పురిటిగీము = పుట్టినిల్లు
మంజుల + అలంకార = మంజులాలంకార = అందమైన అలంకారములతో
మకరందము+ఉప్పొంగు = మకరందముప్పొంగు = తేనెను పొందించగల
కవితకు = కవిత్వం పలుకుటకు
నా జిహ్వ = నా నాలుక
కల్పతరువు = కల్పతరువు వంటిది
కమ్ముకొని వచ్చు = మూసుకొని వస్తున్న
కీర్తి మేఘముల మీద = కీర్తి అనెడి మేఘాల మీద
అమల = నిర్మలమైన
సంతోష రస విమానములను + ఎక్కి
సంతోషరస విమానములనెక్కి = సంతోషమనెడి విమానము నెక్కి
అహర్నిశంబును = రాత్రింబవళ్ళును
ఇడుములు + అందని = ఇడుములందని = కష్టాలు తెలియకుండగ
హాయిగా సంచరింతును = హాయిగా సంచరించే
నేను = ఐశ్వర్యవంతుడను నేను

తాత్పర్యం: అన్ని దేశాలకు అహింసా సూక్తులను బోధించగలది, దయా గుణానికి అద్దాలమేడ వంటిది నా మనస్సు. దరిద్రులకు బంగారు గుప్పిటలో దానం చేయగలది నా చెయ్యి. దిక్కులేని వారిని చూసి కన్నీరు కార్చు దయా గుణానికి నా హృదయం పుట్టినిల్లు. అందమైన అలంకారాలతో మధుర కవిత్వాన్ని పలుకుటకు నా జిహ్వ కల్పతరువు వంటిది. సంతోషమనెడి విమానమునెక్కి కీర్తి మేఘాలపైన ఏ బాధ లేకుండా అహర్నిశలు హాయిగా సంచరించే అదృష్టవంతుణ్ని నేను.

5వ పద్యం :

సీ॥ శ్రీకృష్ణరాయ ధాత్రీనాయకుని సమ
గ్ర ప్రతాపము దీపకళిక మాకు
రాజరాజనరేంద్ర రమణీయ సద్యశః
కాండంబు పండురేయెండ మాకు
మన్నెబొబ్బిలి దండిమగల దోస్సారంబు
సహజ నిష్ఠుర కవచంబు మాకు
అరిరాజమూర్ధన్య పరిభావపంకంబు
మురువుమీతెడు చుక్కబొట్టు మాకు

తే॥ విలసితములైన యుద్ధంథములు రచించి
యుడుపథంబున వలపుటంగడులు దీర్చి
అమ్ముకొందును సిద్ధసాధ్యాంగనలకు
రాణజెలువారు నాంధ్రవర్తకుడ నేను

ప్రతిపదార్థం:

ధాత్రీ నాయకుని = భూమండలానికి అధిపతియైన
శ్రీకృష్ణ దేవరాయ = శ్రీకృష్ణ దేవరాయలు యొక్క
సమగ్ర ప్రతాపము = మహోగ్రమైన శౌర్య పరాక్రమాలు
మాకు దీప కళిక = మాకు దీపము వంటి మొగ్గ
రాజ రాజ నరేంద్ర = రాజ రాజ నరేంద్రుని
రమణీయ = మనోహరమైన
సత్ + యశః కాండంబు = సద్యశః కాండంబు = కీర్తి ప్రతిష్ఠల సమూహము
మాకు = మాకు
పండురే + ఎండ = పండురేయెండ = పండు వెన్నెలలు
దండిమ గల = రీతి కల్గిన
మన్నెబొబ్బిలి = బొబ్బిలి వీరుల యొక్క
దోః + సారంబు = దోస్సారంబు = రెండు భుజబల పరాక్రమము
సహజ = సహజమైన
నిష్ఠుర = కఠినమైన
మాకు కవచంబు = మాకు రక్షణ కవచము
అరి రాజ మూర్ధన్య = శత్రురాజుల యొక్క శిరస్సులకు
పరిభావ పంకంబు = అంటిన బురద
మురువు మీతెడు = సౌందర్యంతో ప్రకాశించిన
మాకు = మాకు
చుక్కబొట్టు = ముఖాన వెలసిన బొట్టు చుక్క
విలసితములు + ఐన = విలసితములైన = ఘనమైన
ఉత్ + గ్రంథములు = ఉద్గ్రంథములు = గొప్ప గ్రంథాలను
వలపు + అంగడులు = వలపుటంగడులు = వలపుటంగడులను
తీర్చి = దిద్ది
సిద్ధ-సాధ్య+అంగనలకు = సిద్ధ-సాధ్యాంగనలకు = సిద్ధ సాధ్యాంగనలతో
రాణ జెలువారు = వ్యాపారం చేయగలిగిన
నేను = నేను
ఆంధ్రవర్తకుడు + అ = ఆంధ్రవర్తకుడ = ఆంధ్ర వర్తకుడను

తాత్పర్యం : శ్రీకృష్ణ దేవరాయల ప్రతాపం మాకు దీపకళిక. రాజరాజ నరేంద్రుని గొప్ప కీర్తి ప్రతిష్ఠలు మాకు పండు వెన్నెలలు. బొబ్బిలి వీరుల పరాక్రమాలు మాకు రక్షణ కవచాలు. శత్రురాజుల శిరస్సులకు అంటిన బురద, మాకు సౌందర్యాన్ని కలిగించే నుదుటి బొట్టు. గొప్ప గ్రంథాలను రచించి ఆకాశ మార్గంలో వలపుటంగడులను పెట్టి వ్యాపారం చేయగల్గిన ఆంధ్ర వర్తకుడను.