Regular practice with AP Inter 1st Year Telugu Study Material గద్యభాగం 4th Lesson జానపద కళలు Questions and Answers Summary helps students stay prepared for examinations.
AP Inter 1st Year Telugu జానపద కళలు Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మిక్కిలినేని తెలిపిన ఏవైనా మూడు జానపద కళలను వివరించండి.
జవాబు:
శతాబ్దాలుగా రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపద కళలు మాత్రం ప్రజా హృదయాలలో అలాగే నిలిచి ఉన్నాయి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళలనూ, కళాకారులనూ కన్నబిడ్డలుగా చూసుకున్నారు. జానపదకళలు మన అనుభూతులకూ, మానసిక చైతన్యానికీ, విజ్ఞాన వినోదాలకూ, ఆనందోత్సాహాలకూ ప్రతీకలై నిలిచాయి. “జానపద కళలు” అను పాఠ్యభాగం మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారి “తెలుగువారి జానపద కళారూపాలు” అను గ్రంథం నుండి స్వీకరించారు.
మన తెలుగువారి జానపద కళారూపాలలో కొన్నిటి గురించి తెలుసుకుందాం.
1. హరిహరీ పదాలు : హరిహరీ నారాయణ ! ఆది నారాయణా ! కరుణించి మమ్మేలు – కమల లోచనుడ ! అనే పల్లవితో సాగే పదాలను హరిహరీ పదాలు అంటారు. ఈ కళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో విశేష ప్రచారాన్ని కలిగి ఉంది. వీటిని జంపెలని కూడా అంటారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో ప్రజాదరణ పొందిన ఈ హరిహరీ పదాలను టేకుమళ్ళ కామేశ్వరరావుగారు సేకరించి ముద్రించారు. పామరజనం పరంధాముణ్ణి సేవించడం కోసం కొందరు కవులు వీటిని రాశారు.
పూరి రామచంద్రరాజు రాసిన ‘కుశలాయక పదం’, పసగాడ సన్యాసి రాజు రాసిన “గంగా వివాహపదం” ముఖ్యమైనవి. ఇంకా కలగర్ల వెంకట కామయ్య, మంథా సుబ్బారాయశాస్త్రి, పొడుగు రామబ్రహ్మ కవి, అయ్యగారి కూర్మనాథం, నడిమింటి రామయోగి, చంద్రగిరి తాతయ్య ఇలా ఎందరో హరిహరీ పదాలను రచించి, ప్రచారంలోకి తెచ్చారు.
2. బుట్ట బొమ్మలు : ఒకప్పుడు పెండ్లి ఊరేగింపులలోను, దేవుని కల్యాణోత్సవాలలోను, పెద్ద తిరునాళ్ళలోను, జాతరలలోను ఈ బుట్ట బొమ్మల ప్రదర్శనలు తప్పనిసరిగా ఉండేవి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన కట్టా సూర్యనారాయణ ఈ బుట్ట బొమ్మల తయారీలో సిద్ధహస్తుడు. ఇతని తండ్రి మల్లయ్య 1930వ సంవత్సరంలో మైసూరులో జరిగే దసరా వేడుకలు చూడడానికి వెళ్ళి అక్కడ బుట్ట బొమ్మలాట చూసి ఆనందించి వాటి తయారీ విధానం నేర్చుకుని వచ్చాడు.
ఈ బొమ్మలు లోపలి భాగమంతా డొల్లగా ఉండి, బొమ్మ కళ్లు, నోటి దగ్గర రంధ్రాలు ఉంటాయి. ఈ బొమ్మ లోపలకు దూరి, నిలబడిన కళాకారుడు అభినయం చేస్తుంటే బొమ్మే ఆడుతున్నట్లు అనుభూతి కలుగుతుంది. వాద్యగాళ్ళతో కలిసి పదిమంది ఒక బృందంగా ఏర్పడి, బుట్ట బొమ్మల కళారూపాన్ని రక్తి కట్టిస్తారు. కానీ నేడు వీటి ప్రదర్శనకు ఆదరణ తగ్గింది.
3. గంగిరెద్దుల మేళం : పలనాటి వీరచరిత్రలో శ్రీనాథుడు గంగిరెద్దుల మేళం “గంగిరెద్దులవాడు కావర మణచి / ముకుతాడు పొడిచి……” అని ఉదహరించడాన్ని బట్టి అతి ప్రాచీన కాలం నుంచి ఈ ఆట ప్రచారంలో ఉన్నదని తెలుస్తుంది. గిత్తల్ని మచ్చిక చేసుకొని వాద్యానికి అనుగుణంగా అడుగులు వేయించడం, పరుగెత్తించడం, పడుకోబెట్టడం, అటూ ఇటూ దొర్లించడం, చిట్టి అడుగులతో నృత్యం చేయించడం, కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల ఊపించడం ఇలా ఎన్నో విద్యలు నేర్పి వీధుల్లోకి తీసుకువస్తారు. చక్కగా అలంకరిస్తారు.
గంగిరెద్దులను బసవేశ్వరునిగా పిలుస్తారు. గంగిరెద్దు మేళంలో డోలు, సన్నాయి వంటివి ఆటను రక్తి కట్టిస్తాయి. పర్వదినాల్లో, ముఖ్యంగా రైతులకు పంటలు చేతికి వచ్చే సంక్రాంతి పండుగ దినాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వీటికి ఆదరణ ఉంది.
![]()
ప్రశ్న 2.
ఉరుముల నృత్యం, హరిదాసులు గురించి వివరించండి.
జవాబు:
జానపద కళలు అతి ప్రాచీనమైనవి. ఇవి మన అనుభూతులకు, మానసిక చైతన్యానికి, విజ్ఞాన వినోదాలకు, ఆనందోత్సాహాలకు ప్రతీకలు. వాటిలో కొన్నింటిని గూర్చి తెలుసుకుందాం.
1. ఉరుముల నృత్యం : తలకు రుమాళ్ళు చుట్టుకొని, మెడలో కాసుల దండలు ధరించి, ఎర్రనీ, పచ్చనీ శాలువలు కప్పుకొని, నిలువు అంగీలు ధరించి అమ్మవారి జాతరలలో ఉరుముల నృత్యం చేస్తూ ఉంటారు. ఈ వాద్య ధ్వని ఉరుమును పోలి ఉండడం వల్ల ఈ నృత్యానికి ఉరుముల నృత్యమని పేరు వచ్చి ఉండవచ్చు. హంపీ విజయనగర రాజుల కాలంలో వీరికి మాన్యాలు ఇచ్చారు.
కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. ప్రస్తుతం కులవృత్తిని నమ్ముకుంటూ 70 కుటుంబాల దాకా అనంతపురం జిల్లాలో ఉన్నారు. వీరిని ‘ఉరుములోళ్ళు’ అని పిలుస్తారు. వీరు మాల కులానికి చెందినవారు. ఆదిమజాతుల నర్తన రూపంలో వలయాకార విన్యాసాలు చేస్తూ ఉరుములలో భయంకర శబ్దాలను సృష్టించేవారు. ఉరుముల వాద్యం ఒకేసారి ఏకధాటిగా వాయిస్తే కారుమబ్బులు ఉరుములతో పయనిస్తున్నట్లు భ్రమ కల్గుతుంది.
ఒక చేత్తో వీరణం యొక్క చర్మాన్ని ఒక వైపు పేము పుల్లతో రాస్తూ, మరోవైపు చేతి పుల్లతో వాయిస్తూ లయ విన్యాసాలు తాళయుక్తంగా సాగుతాయి. వీరి ఆరాధ్య దైవం శ్రీశైల మల్లన్న. ఆయన మహాత్మ్య గాథలను ఉరుములపై దరువులు వేస్తూ గానం చేస్తారు.
2. హరిదాసులు : కష్టజీవులైన రైతు సోదరులు పంటసిరిని ఇంటికి తెచ్చుకొని ఆనందంతో సంక్రాంతి పండుగను చేసుకుంటారు. ధనుర్మాసం నెలరోజులు హరిదాసులు ఇంటింటికీ తిరుగుతూ, భక్తి పాటలు పాడతారు. కాషాయం లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి నుదుటన తిరునామం దిద్దుకొని మెడలో తులసిమాలలు, చేతిలో చిడతలు, భుజం మీద తంబుర, తల మీద అక్షయ పాత్ర ధరించి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని “హరిలో రంగహరి”, “శ్రీమద్రమారమణ గోవిందహరి” అంటూ ప్రతి ఇంటికీ వచ్చి, వారిచ్చే బియ్యం, కానుకలు స్వీకరిస్తారు.
ఇంకా రామదాసుగారి కీర్తనలు పాడుతూ గ్రామాలలో తిరుగుతారు. ప్రతి సంవత్సరం ఏ ఊరుకు ఎవరెవరు వంతుగా వస్తారో వారు తప్ప ఇతరులు రారు. దాసరులు సాతాని వైష్ణవులు. వంశపారంపర్యంగా ఈ హరిదాసుల రూపంలో యాచన చేసి ప్రజలిచ్చే బియ్యం పుచ్చుకొని వారిని పుత్ర పౌత్రులతో వర్ధిల్లాలని దీవిస్తూ ఉంటారు. హరిదాసులు అక్షయ పాత్రల్లో బియ్యం వెయ్యడానికి పిల్లలు, పెద్దలు పోటీ పడతారు.
II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మిక్కిలినేని జీవిత విశేషాలను తెలపండి.
జవాబు:
తెలుగు రంగస్థల మరియు చలనచిత్ర నటులు, రచయిత, పరిశోధకులు, స్వాతంత్ర్య సమరయోధులు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ఈయన సౌభాగ్యమ్మ, వెంకయ్యలకు 7.7.1916 గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. ఈయన జాతీయ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ప్రజా నాట్య మండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఈయన ఒకరు. వీరి ‘నటరత్నాలు’ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు వచ్చింది.
నాటక రంగానికి, జానపద కళలకు చేసిన సేవకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ‘కళాప్రపూర్ణ’ మిక్కిలినేనిని వరించింది. ఇంకా తెలుగు వెలుగు, కళా ప్రవీణ వీరి చెంత చేరాయి. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులుగా, మద్రాస్ సెంట్రల్ లెదర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్లో బొమ్మల విభాగంలో సలహాదారుగా పని చేశారు. సినిమారంగంలో ఉండి నాటక రంగం కోసం, కళారూపాల ఉద్ధరణ కోసం నిస్వార్థంగా పాటుపడిన ఆదర్శ కళాకారుడు మిక్కిలినేని. దేశం నాకేమి ఇచ్చిందని కాక దేశానికి నేనేమిచ్చాననే స్ఫూర్తితో పని చేసిన మహెూన్నత వ్యక్తి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు.
ప్రశ్న 2.
జట్టి జాము గురించి రాయండి.
జవాబు:
‘జట్టి జాము’ పాతకాలపు తెలుగు జానపద క్రీడ. ఇది గ్రామీణ ప్రాంతాలలో వెన్నెల రాత్రుల్లో ఆడతారు. జానపద స్త్రీలు వెన్నెల రాత్రుల్లో ఆడే ఆట కాబట్టి జట్టి జాముగా మారిందని “జానపద బ్రహ్మ” మునెయ్య భావించాడు. ఈ క్రీడకు ఎలాంటి వాయిద్యాలుండవు. చేతి చరుపులు, చేతి గాజుల ధ్వనులే వారి పాటలకు వాయిద్యాలు. వీరు రెండు జట్లుగా ఉంటారు. ఒక జట్టు వారు పాటలో ఒక పాదాన్ని పాడితే రెండవ జట్టువారు వంత పాడతారు. వలయాకారంగా నిలబడి రెండు వైపుల్లో ఒకసారి కుడి పక్కకు, ఒకసారి ఎడమ పక్కకు ఆయా వైపుల ఉండే వారి అరచేతుల్ని తన చేతులతో తడుతూ, పాడుతూ ఆటను ప్రదర్శిస్తారు.
“తుమ్మెదా, నడియలో రామరామా కోదండ రామా” వంటి పల్లవులు జట్టిజాము పాటల్లో వినిపిస్తాయి. వీటిలో భక్తిరస ప్రధాన గేయాలే కాక శృంగార, పురాణ, వీరరస గేయాలు కూడా చోటు చేసుకున్నాయి. సంక్రాంతి పండుగకు గొబ్బెమ్మలు పెట్టి గొబ్బియ్యల్లో, గొబ్బియ్యలో అంటూ గుండ్రంగా తిరుగుతూ, పాట పాడుతూ, చప్పట్లు చరుస్తూ, ఒంగుతూ లేస్తూ నృత్యం చేస్తారు.
![]()
ప్రశ్న 3.
ఘటంచిందు గురించి వివరించండి.
జవాబు:
ఆదిపరాశక్తికి జాతరలు, కొలుపులు జరిపేటప్పుడు అనాదిగా ఈ ఘటం చిందు చేస్తారు. గ్రామానికి చెందిన రజకులు ఈ ఘటాన్ని ఎత్తుకుని డప్పుల మోతలకు అనుగుణంగా, లయబద్ధంగా చిందులు వేస్తారు. ఊరిలోకి అంటువ్యాధులు రాకుండా ఉండాలని, ఎటువంటి ఈతి బాధలు ఉండకూడదని కోరుతూ గ్రామం మధ్యలో తాటాకు పందిరి వేసి అందులో గ్రామదేవతను నిలుపుతారు.
పంబలవారు, సన్నాయి, డోలు, కనక తప్పెట్లతో హెూరెత్తిస్తూ ఉండగా ఘటాన్ని ఎత్తుకున్న వ్యక్తి ఉద్రేకంగా వీరంగమాడతాడు. ఈ ఘటానికి పసుపు రాసి, బొట్లు పెట్టి వేపాకు తోరణం చుడతారు. ఘటం ఇంటింటికీ తిరుగుతుంది. అందులో అందరూ మజ్జిగ, అన్నం వేసేవారు. దేవతల ప్రీతి కోసం సేకరించిన ఈ మజ్జిగ అన్నాన్ని ప్రసాదంగా వాద్యకారులు, రజకులు పంచుకు తింటారు. ఈ ఘటాన్ని మట్టితోను, కంచుతోను తయారు చేస్తారు.
III. ఏక వాక్య / పద రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
“గంగిరెద్దుల మేళం” గురించి శ్రీనాథుడు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు ?
జవాబు:
గంగిరెద్దుల మేళం గురించి శ్రీనాథుడు ‘పలనాటి వీరచరిత్ర’ గ్రంథంలో పేర్కొన్నాడు.
ప్రశ్న 2.
హరిదాసులు ప్రధానంగా ఏ పర్వదినాలలో కన్పిస్తారు ?
జవాబు:
హరిదాసులు ప్రధానంగా సంక్రాంతి పర్వదినాలలో కన్పిస్తారు.
ప్రశ్న 3.
“బుట్టబొమ్మలు” కళను ఆంధ్రదేశానికి పరిచయం చేసినవారెవరు ?
జవాబు:
బుట్ట బొమ్మలు కళను ఆంధ్ర దేశానికి పరిచయం చేసింది కట్టా మల్లయ్య.
ప్రశ్న 4.
హరిహరీ పదాలకు మారుపేరేమిటి ?
జవాబు:
హరిహరీ పదాలకు మారు పేరు జంపెనలు.
![]()
ప్రశ్న 5.
“జానపదులు” అంటే ఎవరు ?
జవాబు:
జానపదులు అంటే పల్లెటూళ్ళలో నివసించేవారు.
జానపద కళలు Summary in Telugu
రచయిత పరిచయం
పాఠ్యభాగం : జానపద కళలు
రచయిత పేరు : మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
కాలం : 07.07.1916 నుండి 22.02.2011 వరకు
తల్లిదండ్రులు : సౌభాగ్యమ్మ, వెంకయ్య
విద్యాభ్యాసం : ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను వరుసగా కృష్ణాజిల్లాలోని కోలవెన్ను, పునాదిపాడులలో చదివారు.
జన్మస్థలం : లింగాయపాలెం, గుంటూరు జిల్లా
వృత్తి : తెలుగు రంగస్థల మరియు చలనచిత్ర నటులు, రచయిత, పరిశోధకులు, స్వాతంత్ర్య సమర యోధులు
రచనలు : ఆంధ్రనాటక రంగచరిత్ర, నటరత్నాలు, తెలుగు వారి జానపద కళారూపాలు, ప్రజా పోరాటాల రంగస్థలం, ఆంధ్రుల నృత్యకళా వికాసం, తెలుగువారి చలన చిత్రకళ మొదలైనవి.
బిరుదులు, అవార్డులు : ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి ‘కళాప్రపూర్ణ’, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘తెలుగు వెలుగు’ అవార్డును, సంగీత నాటక అకాడమీ ‘కళాప్రవీణ’ బిరుదును, ‘నటరత్నాలు’ గ్రంథానికి ‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ’ అవార్డు పొందారు.
సేవ : ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులుగా, మద్రాస్ సెంట్రల్ లెదర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ బొమ్మల విభాగంలో సలహాదారుగా పనిచేశారు.
విశేషాలు : సినిమారంగంలో ఉండి నాటకరంగం కోసం, కళారూపాల ఉద్ధరణ కోసం నిస్వార్థంగా పాటు పడిన ఆదర్శ కళాకారుడు మిక్కిలినేని. “దేశం నాకేమి ఇచ్చిందని కాక దేశానికి నేనేమి ఇచ్చాన”నే స్ఫూర్తితో పనిచేసిన మహనీయుడు మిక్కిలినేని.
ప్రస్తుత పాఠ్యభాగం తెలుగు విశ్వ విద్యాలయం వారు ప్రచురించిన మిక్కిలినేని రాసిన “తెలుగువారి జానపద కళారూపాలు” అనే గ్రంథం నుండి సంగ్రహంగా రచించబడింది.
పాఠ్యభాగ నేపథ్యం
జనపదమంటే పల్లెటూరనీ, జనపదంలో నివసించేవారు జానపదులనీ, వారు పాడుకునే పాటలు గాని, ఆటలు గాని, నృత్యంగానీ జానపద కళారూపాలనీ వ్యవహారం.
శతాబ్దాలుగా రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపద కళలు మాత్రం ప్రజాహృదయాలలో అలాగే నిలిచివున్నాయి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళలనూ, కళాకారులనూ కన్న బిడ్డలుగా చూసుకున్నారు. నాటకం, సినిమా, రేడియో, టెలివిజన్ లాంటి ఆధునిక సాంకేతిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటిపట్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించేవారూ తగ్గిపోయారు.
జానపద కళలు అతిప్రాచీనమైనవి. ఇవి మానవుల అనుభూతులకూ, మానసిక చైతన్యానికీ, విజ్ఞాన వినోదాలకూ, ఆనందోత్సాహాలకూ ప్రతీకలై నిలిచాయి. అన్ని కళలకూ పునాదులై అగ్రభాగాన నిలిచాయి. అనాదరణకు గురవుతున్న మన జానపద కళలను గుర్తించి, వాటి గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
కఠిన పదాలకు అర్థాలు
76వ పేజి :
జానపదం = గ్రామం
ఉరుము = మేఘ గర్జన
కాలగర్భం = గతంలోకి కలిసిపోయినది
అంగీ = చొక్క
జాతర = ఉత్సవం
మాన్యం = పన్ను కట్టక అనుభవించునట్లు సన్మానించి ఇవ్వబడిన భూమి
ఆదిమ = మొదటిది
వలయాకారం = గుండ్రము
విన్యాసం = చక్కని ప్రదర్శన
ఏకధాటిగా = ఆపకుండా, ఎడతెరపి లేకుండా
వీరణం = చర్మవాద్య విశేషం, డబుల్ డ్రమ్, డంగురం
దరువు = తాళం, దెబ్బ
సంక్రాంతి = గమనము (సమ్యక్ క్రాంతిః గతిః)
ధనుర్మాసం = సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండే నెల
కళ్ళాపి = పేడనీళ్ళు
తరుణం = సమయం, కాలం
హరిదాసు = నృత్యగాన సహితముగా పురాణాది కథలను చెప్పేవాడు
తిరునామం = నుదట పెట్టుకొనే నిలువుబొట్టు
తంబుర = గాయకులు శ్రుతి కోసం వాయించు తీగల వాయిద్యం
![]()
78వ పేజి :
వంతు = వాటా, భాగం
దాసరి = విష్ణుభక్తుడైన శూద్రుడు (సాతాని వైష్ణవుడు)
వంశపారంపర్యం = బిడ్డ బిడ్డ తరము
యాచన = భిక్షావృత్తి
జట్టిజాము = ఆడవాళ్ళ సమయం
నిటారుగా = నిలువుగా
పార్శ్వం = ప్రక్క వైపు
భంగిమ = శైలి, రీతి
ఓరగా = కనుల కొసల గుండా
తడుతూ = తాకుతూ
పామరుడు = గ్రామాలలో నివసించేవాడు, నిరక్షరాస్యుడు
కఠినంబు కాంచితే కాపులకు తెలియదని మరుగులుంచుట
మాని మాటలుంచితిని = చదువుకున్నవారు గ్రంథాలను చదివి ఆనం దించగలరు. కానీ చదువురాని వారికి అది సాధ్యం కాదు. కనుక వారి కోసం తగిన విధంగా మాటలు రాశాను.
సంవాదం = చర్చ
చమత్కారం = హాస్యం, సరసం
ప్రేక్షకుడు = చూచేవాడు
ఉర్రూతలూగించు = అమితమైన ఆనందాన్ని కలిగించు
ప్రచారం = ఒక విషయం గురించి ఎక్కువమంది ప్రజలకు తెలియజేయడం
ఘటం = కుండ
చిందు = నృత్యం
అనాది = పూర్వం
జాడ్యం = రోగం
79వ పేజి :
హెరెత్తు = ప్రతిధ్వనించు
వీరంగమాడు = చిందులు త్రొక్కు
తోరణం = దండ
రజకుడు = చాకలివాడు
సిద్ధహస్తుడు = నేర్పరి
గంగిరెద్దు = గంటలు మొదలై వాటితో అలంకరించి, నృత్యం నేర్పిన ఎద్దు
మేళం = సన్నాయి మున్నగు వాద్యముల సమూహం, బజంత్రి
కావరం = కొవ్వు
ముకుతాడు = లొంగదీసుకోవడం
పోటు = పొడుచు
పర్వదినం = పండుగ