Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 4th Lesson ప్రణాళికలు, నీతి ఆయోగ్ Textbook Questions and Answers.
TS Inter 2nd Year Economics Study Material 4th Lesson ప్రణాళికలు, నీతి ఆయోగ్
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు ఏవి ? ఆ లక్ష్యాలను సమీక్షించండి
జవాబు.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశ సూత్రాలు సామాజిక ఆర్థిక విధాన స్థూల లక్ష్యాలను నిర్వచించాయి. పర్యవసానంగా భారత ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి ప్రణాళికా బద్ధంగా ఉండాలని నిర్ణయించి 1950 మార్చి నెలలో ప్రణాళికా సంఘాన్ని నియమించింది. ఈ విధంగా భారతదేశంలో ప్రణాళికా యుగం 1951 నుంచి ఆరంభమైంది.
పంచవర్ష ప్రణాళికల అమలు :
ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధికి భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక శ్రీకారం చుట్టింది. 1951-56లో మొదటి ప్రణాళికను 1956-61లో రెండవ ప్రణాళికను, 1961-65లో మూడవ ప్రణాళికను అమలు. చేయడమైంది. పాకిస్తాన్తో వైషమ్యాలు, బహిర్గత సంక్షోభాల కారణంగా 1966-67, 1967-68; 1968-69 సంవత్సరాలకు గాను వార్షిక ప్రణాళికలు (annual plans) రూపొందించబడ్డాయి.
కొందరు ఈ విరామ కాలాన్ని ప్రణాళికా విరామంగా (plan holiday) తెలియజేసారు. 1969లో తిరిగి ప్రణాళికలు ప్రారంభమై 1969-74 మధ్య కాలంలో నాలుగవ ప్రణాళిక అమలు చేయబడింది. అయితే 5వ ప్రణాళిక కాలం (1974-79) పూర్తి కాకుండా కేంద్రంలో రాజకీయ మార్పు వల్ల 1978-83 సంవత్సరాలకు జనతా ప్రభుత్వం 6వ ప్రణాళికను ప్రవేశపెట్టింది. 1980లో తిరిగి రాజకీయ మార్పుల కారణంగా 1980-85 సంవత్సరాలకు గాను 6వ ప్రణాళిక అమలు చేయబడింది.
1985-90 సంవత్సరాలకు 7వ ప్రణాళిక అమలు చేయబడినా, 1990లో 8వ ప్రణాళిక అమలు కాలేదు. తిరిగి రెండు వార్షిక ప్రణాళికల తరువాత 1992-97 కాలానికి 8వ పంచవర్ష ప్రణాళిక, 1997-2002 సంవత్సరాలకు 9వ ప్రణాళిక, 2002-07 సంవత్సరాలకు 10వ ప్రణాళిక, 2007-12 సంవత్సరాలకు 11వ ప్రణాళిక మరియు 2012-17 సంవత్సరాలకు 12వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడినవి. అంటే ఇప్పటికి 12 పంచవర్ష ప్రణాళికలు మన దేశంలో అమలు చేయబడ్డాయి.
పంచవర్ష ప్రణాళికల ప్రధాన లక్ష్యాలు :
ఇప్పటి వరకు అమలు చేసిన వివిధ ప్రణాళికల లక్ష్యాలు భిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని సాంఘిక, ఆర్థిక లక్ష్యాలు అన్ని ప్రణాళికలలోనూ పునఃప్రస్తావించబడ్డాయి.
వీటిలో ముఖ్యమైనవి :
- ఆర్థిక వృద్ధి
- స్వావలంబన
- సంతులిత ప్రాంతీయాభివృద్ధి
- ఉపాధి అవకాశాల విస్తరణ
- ఆదాయ వ్యత్యాసాల తొలగింపు
- పేదరిక నిర్మూలన
- ఆధునికీకరణ
- సమ్మిళిత – సుస్థిర వృద్ధి.
12వ పంచవర్ష ప్రణాళికలో కూడా సమ్మిళిత ఆర్థిక వృద్ధి ముఖ్య లక్ష్యంగా ఉంది. ఈ ప్రణాళిక స్థూల జాతీయోత్పత్తిలో సాలీనా 8 శాతం పెరుగుదల లక్ష్యంగా నిర్ణయించింది. వివిధ ప్రణాళికలలో ప్రాధాన్యతలు వివిధ రకాలుగా నిర్ణయించబడ్డాయి.
మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయానికి, రెండవ ప్రణాళిక పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇస్తే ఆరవ ప్రణాళిక నిరుద్యోగ నిర్మూలన, ఏడవ ప్రణాళిక అధిక వృద్ధి రేటుకు ప్రాధాన్యతలను కల్పించాయి. 10వ పంచవర్ష ప్రణాళిక రోడ్లు, అవస్థాపనా సౌకర్యాల విస్తరణకు ప్రాధాన్యతను ఇస్తే, 11, 12 ప్రణాళికలు అధిక స్థాయిలో సమ్మిళిత-సుస్థిర వృద్ధిని (inclusive and sustainable growth) ప్రాధాన్యతగా గుర్తించాయి.
భారతదేశంలో ఇంతవరకు పూర్తిగా అమలు చేసిన 11 పంచవర్ష ప్రణాళికల (1951-2012) ప్రధాన లక్ష్యాలను కింది పట్టికలో సంక్షిప్తంగా పొందుపరచడమైంది.
వివిధ ప్రణాళికల ప్రధాన లక్ష్యాలు (1951-2012):
ప్రణాళికలు | ప్రణాళికా కాలం | ప్రధాన లక్ష్యాలు |
1 | 1951 – 56 | వ్యవసాయం, నీటిపారుదల అభివృద్ధి |
2 | 1956 – 61 | భారీ తరహా పరిశ్రమల అభివృద్ధి |
3 | 1961 – 66 | ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి |
4 | 1969 – 74 | సుస్థిర వృద్ధి, ఆర్థిక స్వావలంబన, గరీబీ హఠావో |
5 | 1974 – 79 | పేదరిక నిర్మూలన, స్వావలంబన |
6 | 1980 – 85 | ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలన |
7 | 1985 – 90 | ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల |
8 | 1992 – 97 | మానవ వనరుల అభివృద్ధి |
9 | 1997 – 2002 | సమానత్వం, సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక వృద్ధి |
10 | 2002 – 2007 | సమానత్వం, సామాజిక న్యాయం, నాణ్యమైన మానవ వనరులను పెంచడం సమ్మిళిత వృద్ధి |
11 | 2007 – 2012 | సమ్మిళిత వృద్ధి |
12 | 2012 – 2017 | సత్వర, సుస్థిర, మరింత సమ్మిళిత వృద్ధి |
వివిధ ప్రణాళికలలో విధుల కేటాయింపు సమీక్షిస్తే, వ్యవసాయం, నీటి పారుదల మొదటి ప్రణాళికలో అత్యధికంగా 31 శాతం కేటాయించబడి క్రమంగా 18-24 శాతం మధ్య ఇతర ప్రణాళికలలో కేటాయించబడింది. విద్యుత్ రంగానికి 7-11 ప్రణాళికల మధ్య 20 శాతం వరకు నిధుల కేటాయింపు జరిగింది. పారిశ్రామిక రంగానికి అత్యధికంగా 24 శాతం నిధులు రెండవ ప్రణాళికలో కేటాయించబడి, ఆరవ ప్రణాళికలో 26 శాతానికి పెరిగి తదుపరి తగ్గుతూ వస్తున్నాయి.
రవాణా, కమ్యూనికేషన్ల రంగాలకు కేటాయింపులు మొదటి మూడు ప్రణాళికలలో 25 నుంచి 28 శాతం వరకు ఉండగా, ఏడవ ప్రణాళికలో 19 శాతానికి తగ్గి, 10వ ప్రణాళికలో 21 శాతానికి పెరిగాయి. మొత్తం ప్రణాళికా కాలంలో రవాణా, కమ్యూనికేషన్ రంగాలకు 18-27 శాతం మధ్య వనరుల కేటాయింపు జరిగింది. సామాజిక సేవా రంగానికి 22 శాతం నిధులు మొదటి ప్రణాళికలో కేటాయించబడి క్రమంగా 7వ ప్రణాళిక వరకు కేటాయింపు శాతం తగ్గుతూ వచ్చింది.
అయితే, ఈ రంగానికి 8వ ప్రణాళికలోని 22 శాతం కేటాయింపులు 11వ ప్రణాళిక నాటికి 35.5శాతానికి పెరిగింది. సామాజిక సంక్షేమానికి 8వ ప్రణాళికలోని 22 శాతం కేటాయింపులు 11వ ప్రణాళిక నాటికి 35.5 శాతానికి పెరిగింది. సామాజిక సంక్షేమానికి 8వ ప్రణాళిక నుంచి 11వ ప్రణాళిక వరకు నిధుల కేటాయింపు క్రమంగా పెరుగుతూ వచ్చింది.
ప్రశ్న 2.
భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికల అమలు తీరును వివరించండి. జవాబు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికల అమలు తీరును క్రింది విధంగా వివరించవచ్చు.
జవాబు.
1. ఆర్థిక వృద్ధి (Economic Growth) :
స్వాతంత్ర్యానికి పూర్వం 20వ శతాబ్దం మొదటి అర్థభాగంలో జాతీయాదాయంలో పెరుగుదల అతిస్వల్పంగా ఉండి తలసరి ఆదాయంలో పెరుగుదల ఇంచుమించు స్తబ్ధంగా ఉండేవి. 20వ శతాబ్దం రెండవ అర్థ భాగంలో ప్రణాళికల అమలుతో స్థూల జాతీయోత్పత్తి, స్థూల తలసరి ఉత్పత్తులు నిలకడ వృద్ధిని సాధించాయి.
2. ఆర్థిక స్వావలంబన (Economic Self-Reliance) :
నాలగవ పంచవర్ష ప్రణాళిక (1969-74) స్థిరత్వంతో కూడిన వృద్ధి, ‘స్వావలంబన సాధనలో పురోగమనం’ అనే రెండూ ప్రధాన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అయిదవ ప్రణాళిక నుంచి ప్రధాన రంగాలలో, ఉత్పత్తి కార్యకలాపాల్లో స్వావలంబన సాధించడానికి ప్రపంచంలోని 115 అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక్క భారతదేశమే స్వావలంబనతో కూడిన వృద్ధిని చెప్పుకోదగ్గ స్థాయిలో సాధించడం చిన్న విషయం కాదు.
ఆహార రంగంలో దిగుమతులపై ఆధారపడటం తగ్గి స్వయం సమృద్ధిని సాధించింది. ఇనుము, ఉక్కు, యంత్ర నిర్మాణం, భారీ ఇంజనీరింగ్ వంటి పరిశ్రమల స్థాపన ద్వారా మూలధన పరికరాల ఉత్పత్తిలో స్వాలంబన విషయంలో ఈ రెండు అంశాలను ప్రగతి పరమైన అంశాలుగా చెప్పవచ్చు.
3. సంతులిత ప్రాంతీయ అభివృద్ధి (Balanced Regional Development) :
ప్రణాళికా కాలంలో ప్రాంతీయ అసమానతలు ఒక ముఖ్యమైన సవాలుగా గుర్తించబడ్డాయి. ప్రాంతీయ అసమానతలను అధిగమించడానికి ప్రణాళికా సంఘం కింది సూచనలను చేసింది.
(a) కేంద్రం నుంచి రాష్ట్రాలకు విత్త వనరుల బదిలీ ప్రక్రియలో వెనుకబాటుతనాన్ని ఒక ముఖ్య కారకంగా గుర్తించడం.
(b) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయడం.
(c) వెనకబడిన ప్రాంతాలలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే చర్యలను చేపట్టడం.
4. ఉపాధి అవకాశాల పెంపు (Enhancement of Employment opportunities) :
భారతదేశంలో నిరుద్యోగం ఒక ప్రత్యేక రూపంలో ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఋతుపరమైన నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అధికం, పట్టణ ప్రాంతాలలో కూడా అసంఘటిత రంగంలో నిరుద్యోగిత ఎక్కువగానే ఉంది. విద్యావంతులలో కూడా నిరుద్యోగిత పెరుగుతున్నది.
NSSO 68వ రౌండ్ సమాచారం ప్రకారం 2011-12 సంవత్సరాల మధ్య సాధారణ ప్రధాన స్థాయి ప్రకారం 2.7 శాతం, వారాంతపు స్థాయి ప్రకారం 3.7 శాతం, ప్రస్తుత రోజూవారీ స్థాయి ప్రకారం 5.6 శాతంగా ఉంది. ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు వివిధ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అమలుచేస్తున్న, ‘నిరుద్యోగిత’ ఒక సమస్యగానే మిగిలింది.
5. ఆదాయ అసమానతలను తగ్గించడం (Reduction in Income Inequalities) :
ప్రణాళికా కాలంలో భారతదేశంలో ఆదాయ పంపిణీ అగ్రశ్రేణిలో ఉన్న 20 శాతం ప్రజానీకానికే అనుకూలంగా ఉంది. 1990వ దశకంలో ఉన్నత వర్గాలు, అట్టడుగు వర్గాల మధ్య ఆదాయ వ్యత్యాసాలు 5 రెట్లుగా ఉన్నట్లు గుర్తించారు. 2013 ప్రపంచ అభివృద్ధి సూచికల ప్రకారం భారతదేశపు స్థూల జాతీయోత్పత్తిలో 1/6వ వంతు 100 మంది సంపన్నవంతుల చేతిలో ఉన్నట్లు తెలియజేయబడుతుంది. ప్రణాళికా కాలంలో ఆదాయ అసమానతలు తొలగిపోలేదు.
6. పేదరిక నిర్మూలన (Elimination of Poverty) :
ప్రణాళికల ద్వారా పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి నిత్యావసర ఆహార వస్తువులు, కిరోసిన్ వంటి ఇతర వస్తువులను సబ్సిడీ ద్వారా గ్రామీణ, పట్టణ పేద ప్రజలకు అందజేయడం, ఆదాయాలను పెంచడానికి ఉపాధి కార్యక్రమాలను అమలుచేయడం, ఉచిత విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణంవంటి సౌకర్యాలను కల్పించడం వంటివి ప్రభుత్వ కార్యక్రమాలలో ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
7. ఆధునికీకరణ (Modernisation) :
సంస్థాగతమైన వ్యవస్థాపూర్వక మార్పులను ప్రవేశపెట్టడం ఆధునికీకరణగా చెప్పవచ్చు. ప్రణాళికా కాలంలో వివిధ రంగాలలో ఉత్పాదకతలను పెంపొందించడానికి శాస్త్రసాంకేతిక విజ్ఞానానికి, హేతుబద్ధ నిర్వహణకు ప్రాధాన్యత కల్పించడమైనది. మూడవ పంచవర్ష ప్రణాళికలో నూతన వ్యవసాయ వ్యూహం హరిత విప్లవంగా ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి హరిత విప్లవం ఎంతో దోహదపడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవడానికి ఏడవ ప్రణాళిక ఎంతో కృషి జరుగుతోంది.
8. సమ్మిళిత, సుస్థిర వృద్ధి (Inclusive and Sustainability of Growth) :
స్థూల ఆర్థిక అంశాలలో సంతృప్తికరమైన ప్రగతి సాధించినా, సంస్కరణల కాలంలో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, గ్రామీణ-పట్టణ వ్యత్యాసాలు, ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు అంతగా తగ్గలేదు. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు స్వల్పంగా ఉండి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని 11వ ప్రణాళికలో ‘సమ్మిళిత మరియు సుస్థిర వృద్ధి లక్ష్యానికి ప్రాధాన్యత ఇవ్వడమైంది. సమ్మిళిత వృద్ధి అనేది ఒక విస్తృత భావన. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు ఇందులో అంతర్భాగాలు.
- వ్యవసాయ రంగంలో వృద్ధి,
- ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన
- ప్రాంతీయ అసమానతల తగ్గింపు,
- న్యాయబద్ధమైన వృద్ధి మొదలైన అంశాలు భారతదేశ సమ్మిళిత వృద్ధిలో ప్రధాన భాగాలుగా ఉన్నాయి.
ప్రశ్న 3.
పంచవర్ష ప్రణాళికల కాలంలో సాధించిన ఆర్థిక వృద్ధిని వివరించండి.
జవాబు.
పంచవర్ష ప్రణాళికలలో నిర్దేశించిన ప్రధాన లక్ష్యాల ఆధారంగా స్వతంత్ర భారతదేశంలో ప్రణాళికా కాలంలో సాధించిన ఆర్థిక ప్రగతిని క్రింది విధంగా సమీక్షించవచ్చు.
ఆర్థిక వృద్ధి (Economic Growth) : స్వాతంత్ర్యానికి పూర్వం 20వ శతాబ్దం మొదటి అర్థ భాగంలో జాతీయాదాయంలో పెరుగుదల అతి స్వల్పంగా ఉండి తలసరి ఆదాయంలో పెరుగుదల ఇంచుమించు స్తబ్ధంగా (near stagnation) ఉండేది. 20వ శతాబ్దం రెండవ అర్థ భాగంలో ప్రణాళికల అమలలో స్థూల జాతీయోత్పత్తి, స్థూల తలసరి ఉత్పత్తుల నిలకడ వృద్ధిని (steady growth) సాధించాయి.
ప్రణాళికా కాలంలో జాతీయాదాయంలో పెరుగుదల సగటున సాలీనా 1 శాతం నమోదు కాబడింది. వ్యవసాయ రంగ వృద్ధి రేటు 0.3 శాతం కాగా పారిశ్రామిక రంగ వృద్ధి రేటు కేవలం 2 శాతంగా నమోదయ్యింది. ప్రణాళికా కాలంలో తలసరి ఆదాయంలో వార్షిక పెరుగుదల 0.2 శాతం. 1900-01 నుంచి 1946-47 సంవత్సరాల మధ్య అవిభాజ్య భారతదేశంలో 1938-39 స్థిరమైన ధరలలో జాతీయాదాయంలో పెరుగుదల 11 శాతంగా లెక్కించబడింది.
ఒక అధ్యయనం ప్రకారం 1950-51 నుంచి 2004-05 మధ్య కాలంలో స్థిరమైన ధరలలో స్థూల జాతీయోత్పత్తి 1,000 శాతం, తలసరి జాతీయోత్పత్తి 250 శాతం పెరిగాయి. ఈ వివరాల నేపథ్యంలో 1951-2017 మధ్య పంచవర్ష ప్రణాళికల కాలంలో ఆర్థిక వృద్ధి పనితీరును క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
పంచవర్ష ప్రణాళికలలో వృద్ధి పనితీరు (1993-94 ధరలలో):
(నికర జాతీయోత్పత్తిలో వార్షిక పెరుగుదల (శాతంలో) ఉత్పత్తి కారకాల ధరలలో):
ప్రణాళిక | నిర్దేశిత వృద్ధి రేటు | వాస్తవ వృద్ధి రేటు |
1. మొదటి ప్రణాళిక (1951 – 56) | 2.1 | 3.6 |
2. రెండవ ప్రణాళిక (1956 – 61) | 4.5 | 4.1 |
3. మూడవ ప్రణాళిక (1961 – 66) | 5.6 | 2.8 |
4. నాలుగవ ప్రణాళిక (1969 – 74) | 5.7 | 3.3 |
5. అయిదవ ప్రణాళిక (1974 – 79) | 4.4 | 4.8 |
6. ఆరవ ప్రణాళిక (1980 – 85) | 5.2 | 5.7 |
7. ఏడవ ప్రణాళిక (1985 – 90) | 5.0 | 6.0 |
8. ఎనిమిదవ ప్రణాళిక (1992 – 97) | 5.6 | 6.8 |
9. తొమ్మిదవ ప్రణాళిక (1997 – 2002) | 6.5 | 5.4 |
10. పదవ ప్రణాళిక (2002 – 2007) | 8.0 | 7.5 |
11. పదకొండవ ప్రణాళిక (2007 – 2012) | 9.0 | 8.3 |
12. పన్నెండవ ప్రణాళిక (2012 – 2017) | 8.0 |
ప్రణాళికా కాలంలో సాధించిన వృద్ధిరేట్ల ధోరణులు, స్థూల జాతీయోత్పత్తిలో (GDP) వివిధ రంగాల వాటాలలో వచ్చిన మార్పులను సంక్షిప్తంగా క్రింద వివరించడమైనది.
- మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 11వ ప్రణాళికా కాలం వరకు వృద్ధిరేటు సగటున 4.5 శాతంగా లెక్కించారు. ఇది వాస్తవంగా గణనీయమైన ప్రగతిగా చెప్పవచ్చు.
- స్వాతంత్ర్యానికి ముందు కాలంలో వ్యవసాయ రంగంలో వార్షిక వృద్ధిరేటు కేవలం 0.3 శాతం మాత్రమే కాని, ప్రణాళిక కాలంలో వృద్ధిరేటు సగటున సంవత్సరానికి 2 నుంచి 3 శాతం చొప్పున పెరుగుతూ ఉంది.
- ప్రణాళికా కాలంలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధించబడింది. 6-8 శాతంగా నమోదు అయిన పారిశ్రామిక వృద్ధిరేటు స్వాతంత్ర్యానికి ముందు ఉన్న పారిశ్రామిక వృద్ధిరేటుతో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు అధికంగా ఉంది.
- వృద్ధిరేటు ధోరణి మొదటి మూడు దశాబ్దాల ప్రణాళికా కాలంలో స్వల్పంగా 3.5 శాతం మాత్రమే ఉండేది. కాని 1981-2013 సంవత్సరాల మధ్య సాలీనా 5.9 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది.
- 1980 తరువాత వృద్ధిరేటులో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. కొంత కాలం పాటు ఈ వృద్ధిరేటును ప్రణాళికా సంఘం అంతగా గమనించలేదు. 2000 సంవత్సరం నుంచి పెరిగిన ఈ వృద్ధిరేటును గుర్తించారు. చాలామంది ఆర్థిక నిపుణుల అభిప్రాయంలో 1980 ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ పనితీరులో సంస్థాగత మార్పులు (structural break) చోటు చేసుకున్నాయి.
- గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ (Ministry of statistics and programme imple- mentation) వివరాల ప్రకారం భారతదేశంలో 2016-19 సంవత్సరంలో 2011-12 ధరల ననుసరించి వ్యవసాయం, (అనుబంధ కార్యక్రమాలు), పరిశ్రమలు, సేవారంగం వాటాలు వరుసగా స్థూల జాతీయోత్పత్తిలో 14.39, 31.46, 54,15 శాతాలుగా ఉన్నాయి.
- స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతూ, 2013-2014 నాటికి 13.9 శాతానికి దిగజారింది. భారత వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకొని వ్యవసాయ కార్యకలాపాలకు విరామం (crop holiday) ప్రకటించడంతో పాటు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆహార భద్రత దృష్ట్యా ఈ పరిణామం ఆందోళనను కలిగిస్తుంది.
- భారత్లో స్థూల దేశీయోత్పత్తికి అత్యధిక వాటాను సమకూర్చే సేవా రంగం ఎంతో ప్రధానమైనది. 2018-19 సంవత్సరంలో 2011-12 ధరలననుసరించి సేవారంగం సమకూర్చిన స్థూల జోడింపబడిన విలువలో (GVA) 54.15 శాతం. ఈ పెరుగుదల అభివృద్ధిలో మనం సాధించిన ప్రగతికి వ్యవస్థాపూర్వకమైన పరివర్తనకు సంకేతం (structural trans- formation). అయితే, ఈ పెరుగుదల సుస్థిరంగా (sustainable) కొంతకాలం పాటు కొనసాగవలసి ఉంది. అభివృద్ధి జీవన ప్రమాణాలను పెంచి, సామాన్య ప్రజల స్థితిగతులను మెరుగుపరుస్తుంది.
ప్రశ్న 4.
ప్రాంతీయ అసమానతలకు గల కారణాలను, వాటిని తగ్గించడానికి అవసరమైన చర్యలను సూచించండి.
జవాబు.
భారతదేశంలో ప్రాంతీయ అసమానతలకు గల కారణాలు :
జాతీయ సమైక్యతకు, ఆర్థిక వృద్ధికి, సర్వతోముఖ అభివృద్ధికి ప్రాంతీయ అసమానతలు ప్రతిబంధకాలు. వెనుకబడిన రాష్ట్రాలు లేదా ప్రాంతాలు అసంతృప్తితో ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి ఏకపక్ష స్వభావాన్ని కలిగి ఉంటుంది.
చారిత్రాత్మకంగా బ్రిటిష్ పాలన మన దేశంలో కొన్ని ప్రాంతాలు వెనకబడటానికి ఒక కారణం. కలకత్తా, బొంబాయి, మద్రాస్ నగరాలు ప్రెసిడెన్సీ నగరాలుగా ఎన్నో పరిశ్రమలను, అవస్థాపనా సౌకర్యాలను ఆకర్షించగలిగాయి. బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన భూమి శిస్తు విధానం గ్రామీణ ప్రజలను పేదరికంలోకి నెట్టింది.
ఆర్థికాభివృద్ధిని భూమి, భూసారం, నదులు, పర్వతాలు వంటి భౌగోళిక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ రోజుకు కూడా ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలలోని కొండ, పర్వత ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో వ్యవసాయ కార్యకలాపాలు, పారిశ్రామిక ఉత్పత్తులు తక్కువగా ఉంటాయి.
అభివృద్ధి చెందిన ప్రాంతాలు, రాష్ట్రాలలో లాభాల స్థాయి అధికంగా ఉండటంవల్ల ప్రైవేటు రంగంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించగలుగుతాయి. ప్రాంతీయ అసమానతలకు సహజ వనరుల లభ్యత ప్రధాన కారణం. కొన్ని ప్రాంతాలు నాణ్యమైన, అవసరమైనన్ని సహజ వనరులను కలిగి ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధిచెంది అభివృద్ధిపరమైన ప్రభావాలను ఏర్పాటు చేసుకోగలుగుతాయి. రవాణా సౌకర్యాలు, టెలీకమ్యూనికేషన్లు, విద్యుచ్ఛక్తి, నీటిపారుదల వసతులు వంటి అవస్థాపనా సౌకర్యాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాలు అత్యధిక రేటులో అభివృద్ధిని సాధించగలుగుతాయి.
ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి సూచనలు :
- వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులను పెంచడం ద్వారా అభివృద్ధిని సాధించి పేదరిక భారాన్ని తగ్గించవచ్చు. ఇందుకోసం ప్రైవేట్ పెట్టుబడులు వెనకబడిన ప్రాంతాలకు తరలించాలి. ఈ పెట్టుబడులను తరలించడానికి కేంద్ర, రాష్ట్రాలు, ప్రభుత్వాలు వెనకబడిన ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యంగల శ్రామికులను అభివృద్ధి పరచాలి.
- ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలు ఆరోగ్య, విద్య, శిక్షణా సౌకర్యాలు ఇతర భౌతిక అవస్థాపన సౌకర్యాల కల్పనపై దృష్టిని కేంద్రీకరించాలి.
- వెనుకబడిన రాష్ట్రాలు జనాభా పెరుగుదలను తగ్గించడానికి విధానాలను రూపొందించాలి. ఆర్థిక వృద్ధి పెరుగుదలకు జనాభాను అదుపుచేయడం అవసరమని గుర్తించాలి.
- చాలా వెనుకబడిన రాష్ట్రాలలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడానికి ఈ రాష్ట్రాలు పరపతి సౌకర్యాలు, నీటి పారుదలపై పెట్టుబడులు పెంచడం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో లాభసాటి ధరలను కల్పించడంవంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు ఉద్యానవన పంటలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలువంటి పంటలను ఆహార ధాన్యాలతోపాటు ఉత్పత్తి చేయాలి.
- వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన అసమానతలను తగ్గించడానికి సాంకేతిక విజ్ఞానం ఎంతో సహాయ పడుతుంది. వెనకబడిన ప్రాంతాల అవసరాలను తీర్చేవిధంగా సాంకేతిక విజ్ఞానాన్ని రూపొందించాలి.
- వెనకబడిన ప్రాంతాలలో పేదరికాన్ని తగ్గించడానికి ఉద్యోగ అవకాశాలు విస్తరించబడాలి. ఈ సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకం (NREGA)లో పనిదినాలను పెంచవలసిన అవసరం ఉంది. ఈ పెరుగుదల ముఖ్యంగా బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకు, ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే గిరిజనులకు ఎంతో ప్రయోజనము చేకూరుస్తుంది.
- వెనుకబడిన ప్రాంతాలలో సామాజిక రంగం కేటాయింపులు పెంచడం, దాని పనితీరును మెరుగుపరచడం అవసరం. విద్య, ఆరోగ్య రంగాలలో అధిక పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి, మానవ నైపుణ్యతను మెరుగుపరుస్తాయి.
- అభివృద్ధి ప్రక్రియలో వెనకబడిన రాష్ట్రాలలో ఎస్.సి., ఎస్.టి., విస్మరించబడిన వర్గాలకు భాగస్వామ్యాన్ని కల్పించాలి.
- వెనుకబడిన ప్రాంతాలలో పాలనా విధానం సమర్థవంతంగా ఉండి పారదర్శక స్వభావాన్ని కలిగి ఉండాలి. అభివృద్ధి ప్రక్రియలో పంచాయితీరాజ్ సంస్థలకు వికేంద్రీకరణ ద్వారా నిధులు, విధులు, అధికారాలు బదిలీచేయాలి.
- పన్ను రాయితీలు, సబ్సిడీలు, నిర్వహణపరమైన శిక్షణ, పర్యవేక్షణ ద్వారా వెనుకబడిన ప్రాంతాలలో లభించే వనరులను వినియోగిస్తూ కుటీర, కుటుంబ, చిన్నతరహా పరిశ్రమలను అభివృద్ధి పరచాలి.
ఆర్థికాభివృద్ధి ఫలాలు అన్ని రాష్ట్రాలకు అందుతున్నాయి. అనే భావన జాతీయ సమైక్యతకు ఎంతో దోహదపడుతుంది. ఇందుకుగాను ప్రాంతీయ అసమానతలను తగ్గించడం భారతదేశంలో తప్పనిసరి.
ప్రశ్న 5.
నీతి ఆయోగ్ స్వభావం, లక్ష్యాలు మరియు నిర్మాణంలను విశ్లేషించుము.
జవాబు.
భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ (నీతి ఆయోగ్) (National Institution for Transforming India – NITI Aayog) :
ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ సంస్థను భారతదేశ కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2015 నాడు స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో, ప్రధాన సంస్థలతో, నిపుణులతో, మేధావులతో విస్తృతంగా చర్చించి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అకస్మాత్తుగా ప్రభుత్వ మార్పిడి వల్ల స్థాపించబడలేదు. ఎనిమిదవ ప్రణాళికా డాక్యుమెంట్లో ఆర్థిక విధానాలపై ఏర్పాటు చేసిన కమిటీ (2011-12) ప్రణాళికా సంఘంలో మార్పులను సూచించాయి.
డా॥ మన్మోహన్ సింగ్ 2014 వ సంవత్సరంలో ప్రధానమంత్రిగా తన చివరి ప్రసంగంలో ప్రణాళికా సంఘాన్ని ఉద్దేశిస్తూ మారుతున్న పరిస్థితులలో ప్రణాళికా సంఘంలో కూడా మార్పులు అవసరమని సూచించాడు. పర్యవసానంగా విమర్శనాత్మక, దిశాత్మక (directional), వ్యూహాత్మక మౌళిక సలహాలను (strategical inputs) ఆర్థిక ప్రక్రియకు అందించడానికి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు.
భారత్లో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం ద్వారా సహకార సమాఖ్యగా (co-operative federation) వ్యవహరించడంపై నీతి ఆయోగ్ తన దృష్టిని కేంద్రీకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఏకపక్షంగా నిర్ణయాలను నిర్దేశించకుండా చూస్తుంది.
నీతి ఆయోగ్ వివిధ అంశాలపై విధానాలను సూచిస్తుంది. అమలు చేయడం మాత్రం ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. గతంలోని ప్రణాళిక సంఘం మాదిరిగా కేంద్ర నిధులను రాష్ట్రాలకు కేటాయించే అధికారం దీనికి లేదు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు అవసరమైన నిధులను సమకూరుస్తుంది.
‘నీతి’ స్వభావం (Nature of NITI) :
- కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సలహాలను, సూచనలను ప్రణాళికా సంఘం అందచేసేది. కానీ, నీతి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సిసలైన (genuine), నిరంతర భాగస్వామ్యం (continuing partnership) ఏర్పాటు చేయబడుతుంది.
- వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసే ‘మేధో కేంద్రం’గా (think-tank) నీతిని రూపొందించే ప్రయత్నం జరుగుతోంది.
- రాష్ట్రాల ఆర్థిక శక్తి పటిష్ఠమైన దేశ నిర్మాణానికి సహాయ పడుతుందన్న భావనను నీతి తెలియజేస్తుంది. ఈ దృష్టిలో సహకార సమాఖ్య వ్యవస్థను (co-operative fedaralism) భారతదేశంలో ప్రోత్సహించడానికి, బలపరచడానికి, రూపొందించడానికి నీతి సంస్థ తోడ్పడుతుంది.
- గ్రామస్థాయి ప్రణాళికలను ఉన్నత స్థాయి ప్రణాళికలతో అనుసంధానం చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని నీతి అభివృద్ధి చేస్తుంది.
- సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థిక ప్రక్రియల ద్వారా ప్రయోజనాలు పొందడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది.
- ఒప్పందాల ద్వారా పరిజ్ఞానాన్ని, నవ కల్పనలను, వ్యవస్థాపక మద్దతును (entrepreneurial support) ఈ సంస్థ కల్పిస్తుంది.
- ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రంగాల మధ్య ప్రభుత్వ శాఖల మధ్య పరిష్కార వేదికగా నీతి పనిచేస్తుంది.
- ఉత్పాదక సామర్థ్య నిర్మాణాన్ని (capacity building) సృష్టించడానికి, పెంపొందించడానికి (upgradation) వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించి (monitor) నిర్వహిస్తుంది.
నీతి లక్ష్యాలు :
మొదటి నుంచి ఆఖరి దశ వరకు సహాయకారిగా ఉన్న ప్రభుత్వ పాత్రను మార్చి రాష్ట్రాలు పటిష్టంగా ఉండేందుకు దోహదపడే రీతిలో ప్రభుత్వ పనితీరును మార్చడం.
- వ్యవసాయదారులకు ప్రయోజనం కలుగచేసే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార భద్రతను సమ్మిళితం చేయడం.
- ప్రపంచ సమస్యలకు సంబంధించిన చర్చలలో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా (active player) రూపొందించడం.
- ఆర్థికంగా ఉత్తేజితమైన మధ్య తరగతి (vibrant middle class) ప్రజలను ఉత్పత్తి ప్రక్రియలో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం.
- శాస్త్రీయ, మేధోపరమైన వ్యవస్థాపక శక్తులతో కూడిన మానవ మూలధనాన్ని (intellectual human capital) పెంపొందించడం.
- అభివృద్ధి ప్రక్రియలో విదేశాల్లో స్థిరపడిన భారతీయులను (non-resident Indians) భాగస్వామ్యులను చేయడం.
- పెరుగుతున్న పట్టణ ప్రాంతాలను ఆవాసయోగ్యంగా రూపొందించడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక, పరిజ్ఞాన ఉపయోగితను మెరుగుపరచడం.
- సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సుపరిపాలనను ప్రోత్సహించడం.
నీతి వ్యవస్థ నిర్మాణం (Organisational Structure of NITI) :
కార్యాచరణ, సరళీకరణలతో కూడిన విజ్ఞాన కేంద్రంగా నిపుణులతో ఈ వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది.
I. నీతి నిర్వహణ : ఇది కింది వారితో కూడి ఉంటుంది.
- అధ్యక్షులు : దేశ ప్రధానమంత్రి
- ఉపాధ్యక్షులు : ప్రధానమంత్రిచే నియమించబడే వ్యక్తి
- సభ్యులు : 1. పూర్తి కాలపు సభ్యులు, 2. పూర్తి కాలం కాని సభ్యులు : దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి రొటేషన్ ప్రాతిపదికపై ఇద్దరు సభ్యులు.
- ఎక్స్ అఫిషియో సభ్యులు: కేంద్ర మంత్రిమండలి నుంచి నలుగురికి మించకుండా ప్రధానమంత్రిచే నియమించబడే వ్యక్తులు.
- ముఖ్య కార్య నిర్వహణ అధికారులు : భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నిర్దిష్ట కాల వ్యవధి కోసం ప్రధాన మంత్రిచే నియమించబడే వ్యక్తులు.
రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర మంత్రుల సన్నిహిత సహకారంతో సంప్రదింపుల ద్వారా సమన్వయంతో నీతి (NITI) పని చేస్తుంది.
II. గవర్నింగ్ కౌన్సిల్(Governing Council):
గవర్నింగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రాంతాల గవర్నర్లు ఉంటారు.
III. ప్రాంతీయ మండళ్ళు (Regional Councils) :
ప్రాంతీయ మండళ్ళు, ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ప్రాంతాల నిర్దిష్ట సమస్యలను, అంశాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాయి. ప్రాంతీయ మండలికి నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. ఈ మండళ్ళు వ్యూహాలను రూపొందించి అమలు చేస్తాయి. సంబంధిత మండలిలో ఏదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మండలికి సారధ్యం వహిస్తాడు. కేంద్రమంత్రులు, నిపుణులు, విద్యావేత్తలు మండలిలో సభ్యులుగా ఉంటారు.
ప్రశ్న 6.
భారతదేశంలో గ్రామీణ – పట్టణ వైవిధ్యాలకు కారణాలు (Rural Urban Divide in India) ఏవి ? వాటి నివారణా చర్యలు వివరించుము.
జవాబు. గామీణ, పట్టణ వైవిధ్యాలకు కారకాలు (Causes for the Rural, Urban Divide) : భారతదేశంలో గ్రామీణ, పట్టణ వైవిధ్యాలు చరిత్ర ప్రారంభం నుంచి ఉన్నాయి. అయితే, ఈ వైవిధ్యాలు అభివృద్ధి ప్రక్రియలో తీవ్ర స్థాయికి చేరి సవాళ్ళుగా మారుతున్నాయి. ఈ వైవిధ్యాలను ఈ కింద తెలిపిన ప్రజలు కారణాల ద్వారా తెలియచేయవచ్చు.
(ఎ) సహజమైన వ్యత్యాసాలు :
సహజ వనరులు, నీరు, మంచి వాతావరణం ఉన్న ప్రదేశాలలో పట్టణాలు, నగరాలు విస్తరించినట్లు చరిత్ర తెలియజేస్తుంది. ఈ చారిత్రక వెసులుబాటు అవస్థాపనా సౌకర్యాల పెరుగుదలకు సహాయపడింది. క్రమంగా పరిశ్రమలు, వాణిజ్యం, విద్య, ఆరోగ్య సౌకర్యాలు విస్తరించి పట్టణాల పెరుగుదలకు అనువైన పరిస్థితులను కల్పించింది. ఈ అంశాలే గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను పెంపొందించాయి.
(బి) ఆర్థికేతర కారకాలు :
సంప్రదాయాలు, విలువలు, ఉమ్మడి కుటుంబాలు, ప్రజల దృక్పథాలు సామాజిక ఆర్థిక గమనశీలతకు దోహదపడతాయి. గ్రామాలలో సామాజిక ఆంక్షలు, కుల విధానం, వేదాంత ధోరణి, న్యూనతా భావనలు గమనశీలతను, నవకల్పనలను అంతగా ప్రోత్సహించవు.
అదే పట్టణాలలో జన సాంద్రత ఎక్కువగా ఉండి భిన్న రూపాలలో వ్యక్తులు పోటీ స్ఫూర్తితో అనుబంధాలకు అతీతంగా జీవిస్తారు. ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ ద్వారా విస్తృతమైన మార్కెట్లలో తమ ఉత్పత్తులకు డిమాండ్ను పొందగలుగుతారు. ఈ అంశాలన్నీ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి.
(సి) ప్రభుత్వ విధానాలు :
అభివృద్ధి విధానాలలో ప్రభుత్వం పట్టణ ప్రయోజనాలకు మొగ్గు చూపడం కూడా వ్యత్యాసాలకు కారణం. నగరాలు, పట్టణాలలో అవస్థాపనా సౌకర్యాలు మెరుగు పడటానికి ప్రభుత్వం అధిక పెట్టుబడులను కేటాయిస్తుంది. పట్టణ ప్రజలకు అనుకూలంగా ఉన్న కొన్ని ప్రభుత్వ విధానాలు గ్రామాలలో రైతుల ఆదాయాలపై ప్రభావాన్ని చూపుతాయి.
ప్రభుత్వాలు అధిక సంఖ్యలో ఉన్న గ్రామీణ ప్రజల కంటే అధిక సంఖ్యలో ఉన్న పట్టణ ప్రజల సమస్యల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తాయి. పట్టణాలలో విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి సేవలపై కూడా ప్రభుత్వాలు ఎక్కువ మొత్తాలను ఖర్చు చేసి గ్రామాలను నిర్లక్ష్యం చేస్తాయి.
(డి) ఇతర అంశాలు :
నిరక్షరాస్యత, అధిక సంఖ్యలో శిశు మరణాలు, రక్త హీనతగల మహిళలు, శిశువులు ఎక్కువగా ఉండటం, రవాణా, వార్తా సౌకర్యాల కొరత, అల్ప ఆదాయాలు, అనిశ్చిత ఉపాధి దినాలు (uncertain wage employment days), తాగు నీరు, వైద్య సౌకర్యాల కొరత లాంటి సమస్యలతో భారతదేశంలోని గ్రామీణ ప్రజలు సతమతమవుతున్నారు. పట్టణాలలోని పేద ప్రజలు తమకంటే మెరుగైన జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు అధిక శాతం గ్రామీణ ప్రజలు భావిస్తారు.
నివారణా చర్యలు :
ఈ కింద పేర్కొన్న నివారణ చర్యలు కూడా గ్రామీణాభివృద్ధికి సహాయపడుతూ గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజల వలసలను తగ్గిస్తాయి.
- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ యువతకు వృత్తి, సేవా రంగాలకు ఉపయోగపడే శిక్షణను కల్పించాలి. రాజస్థాన్, అస్సాం వంటి రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన ఈ విధమైన శిక్షణా కార్యక్రమాలు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వగలిగాయి.
- చిన్న, సన్నకారు వ్యవసాయదారులకు పరపతి సౌకర్యాలను పెంచి వడ్డీ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల ప్రాబల్యాన్ని తగ్గించడం, పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలను కల్పించడం.
- అవకాశం ఉన్నంత వరకు గ్రామీణ అవస్థాపనా రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిని పెంచే కృషిని ప్రోత్సహించడం.
- గ్రామ ప్రాంతాలలో యువతకు నాణ్యమైన విద్య, శిక్షణ, నిపుణతలను కల్పించడం ద్వారా స్వయం ఉపాధిని పెంపొందించడం. స్థూల జాతీయోత్పత్తిలో కేవలం రెండు శాతం మాత్రమే భారతదేశంలో ఆరోగ్య, వైద్య రంగాలకు కేటాయించడం ఆ రంగాలను నిర్వీర్యం చేయడమే (దురదృష్టకరం.
- గ్రామీణ ప్రాంతాలలో ప్రజారోగ్య వ్యవస్థ సమర్థవంతంగా లేకపోవడం వల్ల అది ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయింది. మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు, గ్రామీణ ప్రాంతాలలో ఉత్పాదకత, సామాజిక భద్రతను తప్పనిసరిగా పెంచుతాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
నీతి ఆయోగ్పై లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు.
ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ సంస్థ (భారతదేశం పరివర్తన కోసం జాతీయ సంస్థ (National Institu- tion for Transforming India NITI Aayog)ను భారత ప్రభుత్వం జనవరి 1, 2015వ తేదీన స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వాలలో, ప్రధాన సంస్థలతో, నిపుణులతో, మేధావులతో విస్తృతంగా చర్చించి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
నీతి ఆయోగ్ విధులు (Functions of NITI Aayog) :
- సహకార, పోటీ సమాఖ్యగా (co-operative and competitive federalism) భారతదేశం పరివర్తన చెందడానికి నీతి కృషి చేస్తుంది. ఆర్థికాభివృద్ధితో పాటు ప్రాధాన్యతలకు, వ్యూహాలకు సంబంధించిన జాతీయ ఎజెండాను దేశ ప్రధానికి, ముఖ్యమంత్రులకు అందజేస్తుంది.
- కింది నుంచి పై స్థాయి వరకు ఒక వికేంద్రీకృత ప్రణాళికా నమూనాను (bottom-up model) ప్రవేశపెడుతుంది. జాతీయ, రాష్ట్రాల కోసం దూరదృష్టి (vision), ఊహాత్మక ప్రణాళికలను తయారు చేస్తుంది.
- కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలకు సహాయ పడేందుకు నిపుణులతో వాటి పరిధి, సంబంధిత ప్రణాళికలను వ్యూహాత్మక విధానాలను (domain strategies) రూపొందిస్తుంది. పరిశోధనాపరమైన మంచి ఫలితాలను ఇవ్వగలిగిన విధానాలకు సంబంధించిన విజ్ఞానాన్ని సేకరించి విస్తృతంగా కేంద్ర, రాష్ట్ర కూడలిగా ప్రభుత్వాలకు అందజేస్తుంది. సూక్ష్మంగా చెప్పాలంటే, విజ్ఞానం, నవకల్పనల కేంద్ర బిందువుగా (knowledge and innovation hub) నీతి వ్యవహరిస్తుంది.
- సత్వర ఆర్థికాభివృద్ధి కోసం సమగ్ర, సంపూర్ణ పద్ధతులను (integraXed and holistic approach) ఈ సంస్థ ప్రవేశ పెడుతుంది. అంతర్రాష్ట్ర వివాదాలను లేదా వివిధ రంగాల మధ్య వివాదాలను నీతి పరిష్కరిస్తుంది.
- ప్రపంచ స్థాయిలో అందుబాటులో ఉన్న నైపుణ్యాలను, వనరులను ప్రయోజనకరంగా వినియోగించడానికి సమన్వయ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. విధాన నిర్ణయాలు, కార్యక్రమాలు, నిపుణతలు, పాలనా వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సంస్థ సలహాదారుగా పనిచేస్తుంది.
- సాంకేతిక విజ్ఞానాల ప్రమాణాలను (technology upgradation), ఉత్పాదక శక్తుల నిర్మాణాలను (capacity building) అదనంగా పెంపొందించడానికి సహాయపడుతుంది.
- ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి ప్రభావాలను (impact) సమీక్షిస్తుంది.
ప్రశ్న 2.
ప్రణాళిక అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు.
ప్రణాళిక భావన :
మానవ ప్రవర్తనలో ప్రణాళిక అంతర్భాగం. ప్రతి దేశం తనదైన సరళిలో ప్రణాళికలను అమలుపరుస్తుంది. నిర్ణీత లక్ష్యంతో నిర్దిష్టంగా వ్యవహరించడమే ప్రణాళిక. ఆర్థిక ప్రణాళికను వివిధ ఆర్థిక వేత్తలు భిన్న రకాలుగా నిర్వచించారు. కాని, అన్ని నిర్వచనాలలో ఒక ఏకీకృత భావన ఇమిడి ఉంది. ‘నిర్ణీత కాలవ్యవధిలో నిర్ధిష్ట ప్రమాణాలను, లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక వ్యవస్థను దేశంలోని ఒక కేంద్రీయ వ్యవస్థ నియంత్రించడమే ఆర్థిక ప్రణాళిక’.
తొడారో మహాశయుని ఉద్దేశంలో ఆర్థిక ప్రణాళిక అంటే ముందుగా నిర్ణయించబడిన లక్ష్యాలను సాధించడానికి బుద్ధిపూర్వకంగా ఒక దేశం లేదా ప్రాంతంలోని ప్రధాన ఆర్థికాంశాలను కొంతకాలంపాటు వినియోగం, పెట్టుబడి, పొదుపు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన వాటిని ప్రభుత్వం ప్రభావితం చేయడం, నిర్వహించడం, నియంత్రించడం ప్రభుత్వపరమైన ఈ ప్రభావాలు, సూచనలు, నియంత్రణలకు చెందిన భావనలే సంక్షిప్తంగా ఆర్థిక ప్రణాళికల సారాంశం.
ప్రణాళిక (Plan) :
ప్రణాళికీకరణకు (Planning) ప్రధానమైన తేడా ఉంది. ప్రణాళిక ఒక పత్రం; ఆర్థిక కార్యకలాపాలను నిర్దేశించే నమూనా. ప్రణాళికీకరణలో ప్రణాళికలతోపాటు లక్ష్యసాధన దిశలో జరిగే కృషి ఉంటుంది. నిర్ణీత కాలపరిమితిలో ఎంపిక చేయబడిన లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలు మొత్తం ఆర్థిక వ్యవస్థకు వర్తిస్తాయి.
వివిధ రంగాలలో పెట్టుబడికోసం సేకరించిన ఆర్థిక వనరులు ప్రణాళికలో సూచించిన విధంగా కేటాయింపు జరుగుతుంది. జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్దేశించబడిన లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలు ఉత్పత్తి పంపిణీలను నిర్దేశిస్తాయి.
ప్రశ్న 3.
సంతులిత ప్రాంతీయాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించండి.
జవాబు.
సంతులిత ప్రాంతీయాభివృద్ధి అనగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతూ అన్ని ప్రాంతాలలో వనరుల లభ్యత ఒకే విధంగా ఉండవు. కాబట్టి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. లభ్యమయ్యే వనరులను అభిలషణీయంగా ఉపయోగించకొనుటయే సంతులిత ప్రాంతీయాభివృద్ధి. దీనికోసం ప్రభుత్వం తీసుకొనే చర్యలు.
- వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక వనరులు బదిలీచేయడం.
- వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రభుత్వం పరిశ్రమలను స్థాపించుట.
- వెనుకబడిన ప్రాంతాలకు, జిల్లాలకు అదనపు విత్త సదుపాయాల కల్పన.
- వెనుకబడిన ప్రాంతాల్లో కావలసిన అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం.
- పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రోత్సహించడం.
- వెనుకబడిన ప్రాంతంలో పారిశ్రామిక క్షేత్రాలు ఏర్పాటు.
- కొండ, గిరిజన ప్రాంతాలకోసం ప్రత్యేక పథకాలు.
- చిన్నతరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సహకాలు.
- వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధి కోశపరమైన ప్రోత్సహకాలు ఇవ్వడం అనగా సబ్సిడీలు, పన్ను రాయితీలు మొదలగునవి.
ప్రశ్న 4.
ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన వివిధ భావనలను తెలియజేయండి.
జవాబు.
నిర్ణీత కాల వ్యవధిలో నిర్దిష్ట ప్రమాణాలను, లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక వ్యవస్థను దేశంలోని ఒక కేంద్రీయ వ్యవస్థ నియంత్రించడమే ఆర్థిక ప్రణాళిక.
1. పెట్టుబడిదారీ విధానంలో ప్రణాళిక :
సప్లయ్, డిమాండ్ రూపంలో ఉన్న మార్కెట్ శక్తులు, ఉత్పత్తి సంస్థలు స్వేచ్ఛ వినియోగదారుల ఎంపికలు పెట్టుబడిదారీ విధానానికి చోదక శక్తిగా పనిచేస్తాయి. లాభార్జన, స్వలాభాపేక్ష ఈ విధానాన్ని నడిపిస్తాయి. అందుకే భావనపరంగా పెట్టుబడిదారీ విధానానికి, ప్రణాళికలకు పొత్తు కుదరదు. ఈ విధానంలో ప్రభుత్వం ప్రధాన సౌకర్యాలను కల్పించే శాంతి భద్రతలను పరిరక్షించి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది.
2. ఎశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక :
ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి ఉంటాయి. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఒక మంచి ఉదాహరణ. ఈ విధానంలో కేంద్ర ప్రణాళికా వ్యవస్థ ఆర్థిక ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ విధానంలో ప్రైవేటు రంగానికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను ప్రభుత్వం చేకూరుస్తుంది. అయితే ప్రణాళికా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు రంగాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం నియంత్రణచేసి క్రమబద్ధీకరిస్తుంది.
3. సామ్యవాద వ్యవస్థలో ప్రణాళిక :
ఈ విధానంలో ఆర్థిక ప్రణాళికలు తప్పనిసరి. కేంద్రీయ ప్రణాళికా వ్యవస్థ ఆర్థిక వనరులను సమీకరించి దేశ ప్రయోజనాల దృష్టితో వివిధ రంగాలకు వనరులను కేటాయిస్తుంది. సామ్యవాద వ్యవస్థ ఆర్థిక ప్రణాళికలను యథాతథంగా అమలుచేస్తుంది.
4. ప్రజాస్వామిక ప్రణాళిక (Democratic Planning), అధీకృత ప్రణాళిక (Authoritarian) :
ప్రజాస్వామ్య ప్రణాళికలో ప్రభుత్వం ఉత్పత్తి సాధనాలన్నింటినీ నియంత్రణ చేయదు. ప్రజాభిప్రాయ పరిగణనలోకి తీసుకొని అధిక శాతం ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రణాళికా లక్ష్యాలు నిర్దేశించబడతాయి. ఈ విధానంలో ఆర్థిక వ్యవస్థలో కొంతమేరకు స్వేచ్ఛ ఉంటుంది. 1990 సంవత్సరం తరువాత కొంత కాలంపాటు ఆనాటి రష్యాలో (USSR) అధీకృత ప్రణాళికా విధానం అమలు చేయబడింది.
5. కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళికలు (Centralised and Decentralised Planning) :
కేంద్రీకృత ప్రణాళిక ఇంతకు ముందు తెలియజేసినట్లు రష్యాలో ఉండేది. ఇది సామ్యవాద వ్యవస్థలో అమలుచేసే ప్రణాళిక. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో వికేంద్రీకృత ప్రణాళిక అమలులో ఉంటుంది. పరిపాలనా సంబంధమైన వివిధ యూనిట్లకు, కేంద్రీయ ప్రణాళికా వ్యవస్థకు మధ్య సమన్వయంతో వికేంద్రీకృత ప్రణాళిక పనిచేస్తుంది. మన దేశంలో ప్రణాళికా విధానం వికేంద్రీకృత రూపంలో ఉంది.
6. పై నుంచి, కింది నుంచి రూపొందించే ప్రణాళిక (Planning of Above and Below) :
ఈ విధానం పైనుంచి లేదా కింది నుంచి రూపొందించబడిన ప్రణాళికలను కలిగి ఉంటుంది. స్థానిక పరిస్థితుల, అవసరాల ఆధారంగా ప్రోత్సాహకరమైన ప్రణాళికలు కింద నుంచి ప్రణాళికల రూపంలో ఉంటాయి. ప్రజలు ప్రాంతీయ స్థాయిలో ప్రణాళికలను రూపొందిస్తారు. ప్రాంతీయ ప్రణాళికలను సమన్వయంచేసి జాతీయ ప్రణాళికలను తయారుచేసే విధానం కింది నుంచి సిద్ధం చేసిన ప్రణాళికల విధానంలో ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య లక్ష్యాలకు అనుగుణంగా వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తయారుచేసిన ప్రణాళికా విధానం.
7. దీర్ఘదర్శి ప్రణాళిక, వార్షిక ప్రణాళిక (Perspective Planning and Annual Planning) :
దీర్ఘదర్శి ప్రణాళిక 15 నుంచి 20 సంవత్సరాల కాలపరిమితితో ముందుచూపును కలిగి ఉంటుంది. దీర్ఘకాలంలో సాధించవలసిన లక్ష్యాలను ఈ ప్రణాళిక సూచిస్తుంది. దీర్ఘదర్శి ప్రణాళిక 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన స్వల్పకాల ప్రణాళికలుగా విభజించబడుతుంది. స్వల్పకాలిక ప్రణాళిక తిరిగి వార్షిక ప్రణాళికలుగా విడదీయ బడుతుంది. ఆచరణలో నిజానికి వార్షిక ప్రణాళికను దృష్టిలో ఉంచుకొంటారు. వార్షిక ప్రణాళిక ఆర్థిక కార్యకలాపాల సూచికగా గుర్తించబడుతుంది.
అదనపు ప్రశ్న:
ప్రశ్న 5.
భారతదేశంలో ప్రణాళికలలో సాధించిన విజయాలు మరియు వైఫల్యాలను వివరించుము.
జవాబు.
ఆర్థిక ప్రణాళిక అంటే ముందుగా నిర్ణయించిన లక్ష్యాలను సాధించడానికి బుద్ధిపూర్వకంగా ఒక దేశం లేదా ఒక ప్రాంతంలోని ప్రధాన ఆర్థికాంశాలను కొంతకాలం పాటు ప్రభుత్వం ప్రభావితం చేయడం, నిర్వహించడం, నియంత్రించడంను ఆర్థిక ప్రణాళిక అని అంటారు.
ప్రణాళికలు సాధించిన విజయాలు, వైఫల్యాలు :
1. విజయాలు :
- నికర దేశీయ ఉత్పత్తి (Net Domestic Product), పొదుపు, పెట్టుబడులు, తలసరి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంది.
- భారతదేశం అన్ని మౌళిక, మూలధన వస్తు పరిశ్రమలలో, వినియోగ వస్తు పరిశ్రమలలో స్వయం సమృద్ధిని సాధించింది.
- ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఆహార భద్రతను కల్పిస్తుంది.
- పారిశ్రామిక రంగంలో చెప్పుకోదగిన వస్తు వైవిధ్యత సాధ్యమైంది.
- ప్రణాళికా కాలంలో అవస్థాపనా సౌకర్యాలు, రవాణా, నీటి పారుదల టెలికమ్యూనికేషన్ రంగాల విస్తరణ జరిగింది.
- విద్యా రంగంలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా, శాస్త్ర, సాంకేతిక రంగంలో శిక్షణ పొందిన మానవ వనరులలో చెప్పుకోదగ్గ వృద్ధి చోటు చేసుకొంది. ప్రపంచ దేశాలలో సమాచార, సాంకేతిక రంగాలలో (information technology) అంతరిక్ష పరిశోధనలో ఒక ప్రధాన దేశంగా భారతదేశానికి ఒక గుర్తింపు వచ్చింది.
2. వైఫల్యాలు :
- గ్రామీణ ప్రాంతాలలో పేదరిక భారం (incidence of poverty) సాపేక్షికంగా అధికంగా ఉంది.
- నిరుద్యోగిత పెరుగుతున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికానికి ప్రధాన కారణం నిరుద్యోగిత అనవచ్చు.
- ఆదాయ అసమానతలు తగ్గలేదు. ఆర్థిక సంస్కరణల అమలు కాలంలో అసమానతలు మరింత పెరుగుతున్నాయి.
- భూసంస్కరణలు ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడం వల్ల భూయాజమాన్యంలో అసమానతలు (unequal land ownership) తొలగిపోలేదు.
- ప్రాంతీయ అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
సంతులిత ప్రాంతీయాభివృద్ధి.
జవాబు.
అన్ని ప్రాంతాలను ఒకే స్థాయిలో అభివృద్ధిచేయడం. ఒక్కో ప్రాంతం ఒక్కో కారణంగా అభివృద్ధిచెందగా, అదే విధంగా వెనుకబడి ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాలు ఎదుర్కొనే సమస్యలు అధ్యయనం చేసే ప్రత్యేకమైన పథకాలను అమలుపరచవలసి ఉంటుంది. అభివృద్ధి ఫలితాలు దేశ ప్రజలందరికి అందజేయడానికి, శ్రామిక శక్తి, సహజ వనరులను సంపూర్ణంగా వినియోగించు కోవడానికి ప్రాంతీయ అసమానతలు తొలగించి అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధిచెందేలా చేయడం.
ప్రశ్న 2.
సమ్మిళిత వృద్ధి (Iriclusive growth).
జవాబు.
ఈ భావనలో వృద్ధి ఫలాలు జనాభాలో దిగువ వర్గాలకు అందడంతో పాటుగా మానసికేతర అంశాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ప్రతిఫలాలు పంపిణీ చేయకుండా గతంలో విస్మరించబడిన వర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడం సమ్మిళిత వృద్ధి లక్ష్యం. దీనివలన అనేక ఇతర ప్రయోజనాలు ఆర్థిక వ్యవస్థకు చేకూరుతాయి.
ప్రశ్న 3.
గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలకు గల కారణాలు.
జవాబు.
పట్టణ జనాభా పెరుగుదలకు కారణాలు :
గ్రామల నుంచి ప్రజలు పట్టణాలకు వలస పోయి స్థిరపడటానికి గల ప్రధాన కారణాలను కింద విధంగా పేర్కొనవచ్చు.
- గ్రామాలలో వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు తక్కువ. పట్టణాలలో ఉపాధి అవకాశాలు సాపేక్షంగా ఎక్కువ.
- పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి విస్తరించడంతో విద్య, నైపుణ్యాలు కలిగిన గ్రామీణ యువత పట్టణాలకు ఆకర్షితులు అవుతున్నారు.
- రవాణా, కమ్యూనికేషన్ల సౌకర్యాలతో పాటు విద్య, ఆరోగ్య సౌకర్యాలు పట్టణాలలో సుఖ జీవనానికి అవకాశం కల్పించడంతో కొందరు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు తరలిపోతున్నారు.
- పట్టణ ప్రాంతాలలో వ్యక్తిగత జీవనంలో ఇతరుల ప్రమేయం అతి స్వల్పంగా ఉంటుంది.
- పట్టణ జీవన విధానం కొందరిని ఆకర్షించడంతో వలసలు పెరుగుతున్నాయి.
ప్రశ్న 4.
ప్రజాస్వామిక ప్రణాళిక, అధీకృత ప్రణాళిక.
జవాబు.
ప్రజాస్వామిక ప్రణాళిక (Democratic Planning), అధీకృత ప్రణాళిక (Authoritarian) :
“ప్రజాస్వామ్య ప్రణాళికలో ప్రభుత్వం ఉత్పత్తి సాధనాలన్నింటినీ నియంత్రణ చేయదు. ప్రజాభిప్రాయ పరిగణనలోకి తీసుకొని అధిక శాతం ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రణాళికా లక్ష్యాలు నిర్దేశించబడతాయి.
ఈ విధానంలో ఆర్థిక వ్యవస్థలో కొంతమేరకు స్వేచ్ఛ ఉంటుంది. 1990 సంవత్సరం తరువాత కొంత కాలంపాటు ఆనాటి రష్యాలో (USSR) అధీకృత ప్రణాళికా విధానం అమలు చేయబడింది.
ప్రశ్న 5.
దీర్ఘకాలిక ప్రణాళిక, వార్షిక ప్రణాళిక.
జవాబు.
దీర్ఘదర్శి ప్రణాళిక, వార్షిక ప్రణాళిక (Perspective Planning and Annual Planning) :
దీర్ఘదర్శి ప్రణాళిక 15 నుంచి 20 సంవత్సరాల కాలపరిమితితో ముందుచూపును కలిగి ఉంటుంది. దీర్ఘకాలంలో సాధించవలసిన లక్ష్యాలను ఈ ప్రణాళిక సూచిస్తుంది.
దీర్ఘదర్శి ప్రణాళిక 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన స్వల్పకాల ప్రణాళికలుగా విభజించబడుతుంది. స్వల్పకాలిక ప్రణాళిక తిరిగి వార్షిక ప్రణాళికలుగా విడదీయబడుతుంది. ఆచరణలో నిజానికి వార్షిక ప్రణాళికను దృష్టిలో ఉంచుకొంటారు. వార్షిక ప్రణాళిక ఆర్థిక కార్యకలాపాల సూచికగా గుర్తించబడుతుంది.
ప్రశ్న 6.
భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ (NITI Aayog).
జవాబు.
ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ సంస్థ (భారతదేశం పరివర్తన కోసం జాతీయ సంస్థ (National Institu- tion for Transforming India NITI Aayog)ను భారత ప్రభుత్వం జనవరి 1, 2015వ తేదీన స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వాలలో, ప్రధాన సంస్థలతో, నిపుణులతో, మేధావులతో విస్తృతంగా చర్చించి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.