Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 3rd Lesson జాతీయాదాయం, పేదరికం, నిరుద్యోగిత Textbook Questions and Answers.
TS Inter 2nd Year Economics Study Material 3rd Lesson జాతీయాదాయం, పేదరికం, నిరుద్యోగిత
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భారతదేశపు జాతీయాదాయ ధోరణులను వివరించండి.
జవాబు.
నికర జాతీయోత్పత్తి, తలసరి ఆదాయాల ధోరణులు : భారతదేశంలో వాస్తవిక ఆదాయపు వృద్ధిని ప్రణాళికా బద్ధంగా అధ్యయనం చేసినట్లయితే ఆర్థిక ప్రణాళికీకరణ నేపథ్యంలో మొదటి మూడు దశాబ్దాల కాలంలో జాతీయాదాయంలోని సాలీనా పెరుగుదల రేటు అతి తక్కువగా అంటే సాలీనా 3.5 శాతంగా ఉన్నప్పటికీ, 1980-81 నుంచి జాతీయాదాయంలోని పెరుగుదల 5.9 శాతంగా ఉండటమనేది ఆశాజనకంగా ఉందని భావించవచ్చు.
గడచిన ఆరు దశాబ్దాల కాలంలో గల జాతీయాదాయ ధోరణుల విశ్లేషణ ఈ దేశపు వృద్ధి యొక్క ప్రధాన లక్షణాలను స్పష్టంగా తెలియజేస్తుంది. అవి : క్రమరహిత వృద్ధి, హెచ్చుకాని వృద్ధి రేటులు, 1991 సంస్కరణల తదనంతరం వృద్ధి తక్కువ బలహీనత (fragile)ను కలిగి ఉంది.
భారతదేశంలో ఆర్థిక ప్రణాళికీకరణకు బీజాలు పడినప్పటి నుంచి వ్యావసాయిక ఉత్పత్తిలో క్రమరహిత వృద్ధి పారిశ్రామిక ఉత్పత్తిలో లోటుపాట్లు ఉన్నప్పటికీ, నికర జాతీయోత్పత్తిలోని పెరుగుదల మందకొడిగానైనా కొనసాగింది. కొన్ని సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనలో ఉంటూ స్తబ్దతను చవిచూసిన ఆర్థిక వ్యవస్థలో ఈ రకమైన పెరుగుదలనేది ఆహ్వానించదగిన అభివృద్ధిగా చెప్పవచ్చు.
ఏది ఏమైనప్పటికీ, ఉత్పత్తి కారకాల దృష్ట్యా తలసరి నికర జాతీయోత్పత్తి వలెనే తలసరి జాతీయాదాయంలోని ధోరణులను పరిశీలించడం వల్ల ఆర్థిక వ్యవస్థ పని తీరును కచ్చితంగా తెలియజేయవచ్చు.
పట్టిక ప్రకారం 68 సంవత్సరాలకు సంబంధించిన (1950-51 నుంచి 2017-18 వరకు) దత్తాంశం ఆధారంగా, నికర జాతీయాదాయం స్థిర ధరల దృష్యా రూ.2,69, 724 కోట్ల నుంచి రూ. 1,14,04,413 కోట్ల మేరకు పెరిగింది. అదే కాలంలో వర్తమాన ధరల దృష్యా జాతీయాదాయం రూ. 9,829 కోట్ల నుంచి రూ.1,47,10,563 కోట్ల మేరకు పెరిగింది.
1950-51 లో స్థిర ధరల దృష్యా తలసరి ఆదాయం 1950-51 లో రూ.7,513 ఉన్నదల్లా 2017-18 వ సంవత్సరం నాటికి రూ. 86,668 మేరకు పెరిగింది. వర్తమాన ధరల దృష్యా కూడా గమనించినట్లయితే అది కాలంలో రూ. 274 నుంచి రూ.1,12,835 ల మేరకు పెరిగింది.
30 సంవత్సరాల కాల వ్యవధిని (1950-51 నుంచి 1980-81 వరకు) గమనించినట్లయితే జాతీయాదాయపు (1999-2000 -100) సాలుసరి వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంది. తలసరి ఆదాయంలోని వృద్ధి రేటు కేవలం 1.4 శాతంగానే ఉంది. అదే కాలంలో వర్తమాన ధరల దృష్యా నికర జాతీయోత్పత్తి సాలుసరి వృద్ధి రేటు 9 శాతం ఉంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంది.
ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, తలసరి నికర జాతీయోత్పత్తి:
జాతీయాదాయ, తలసరి ఆదాయ వృద్ధిరేట్లు (శాతాలలో):
జాతీయాదాయం, తలసరి ఆదాయం వృద్ధి రేట్లను మూడు భాగాలుగా విభజించి చూసినట్లయితే మొదట పది సంవత్సరాల కాలంలో (1950-51 నుంచి 1960-61 వరకు) జాతీయాదాయం సగటున 4.2 శాతం మేరకు పెరిగింది. తరువాత కాలంలో తగ్గింది. సాలీనా 1960-61, 1970-71 మధ్య కాలంలో NNP వృద్ధి రేటు 3.5 శాతం మేరకు, తలసరి NNP 1.2 శాతం మేరకు తగ్గింది.
తదుపరి 10 సంవత్సరాల కాల వ్యవధిలో (1970-71 నుంచి 1980-81 వరకు) నికర జాతీయోత్పత్తిలోని పెరుగుదల రేటు 2.9 శాతం ఉంటే తలసరి NNP 0.6 శాతం మేరకు తగ్గింది. ఎనభైలలో వృద్ధి రేటుల విషయంలో చాలా ప్రస్ఫుటమైన పెరుగుదలను గమనించవచ్చు.
1999-2000 ధరల దృష్ట్యా 1980-81, 1990-91 కాలంలో నికర జాతీయోత్పత్తిలో పెరుగుదల రేటు సాలీనా 5.2 శాతం ఉంటే, తలసరి NNP సాలుసరి వృద్ధి రేటు 3 శాతం మేరకు పెరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆచార్య రాజ్ కృష్ణ సూచించిన 3 శాతం హిందూ వృద్ధి రేటు నుంచి బయటపడింది. కాబట్టి ఈ రకమైన వృద్ధి ఆరోగ్యకరమైన వృద్ధి రేటుగా చెప్పవచ్చు.
1990-91, 2000-01 మధ్య కాలంలో (1999-2000 ధరల దృష్ట్యా) నికర జాతీయోత్పత్తి సాలుసరి వృద్ధి రేటు 5.5 శాతం ఉంటే, తలసరి NNP 3.4 శాతంగా ఉంది. చివరి రెండు దశాబ్దాల కాలంలో (1980-81, 2000-01) NNP సాలుసరి వృద్ధి రేటు 5.6 శాతం అయితే, తలసరి NNP వృద్ధి రేటు 3.2 శాతంగా ఉంది. గత మూడు దశాబ్దాల జాతీయాదాయ ధోరణులను పోల్చిచూస్తే చివరి రెండు దశాబ్దాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంత మేరకు మెరుగైందని చెప్పవచ్చు.
2000 – 01, 2004 – 05 మధ్య కాలంలో (1999 – 2000 ధరల దృష్ట్యా) వృద్ధి రేటు 6.4 శాతం మేరకు పెరిగింది, తలసరి NNP లోని సాలీనా వృద్ధి రేటు 4.7 శాతం మేరకు పెరిగింది. 2004 – 05, 2013-14 మధ్య కాలంలో (2004 – 05 ధరల దృష్యా) NNP లోని వృద్ధి రేటు మరింతగా అంటే 7.3 శాతం మేరకు పెరిగింది. తలసరి ఆదాయంలోని వృద్ధి రేటు 5.8 శాతం మేరకు పెరిగింది. అంటే జాతీయాదాయంలో, తలసరి ఆదాయంలో సాపేక్షికంగా చాలా పెరుగుదల ఏర్పడిందని పై గణాంకాలు తెలియచేస్తున్నాయి. దీనిని ఆరోగ్యకరమైన అభివృద్ధిగా పరిగణించవచ్చు.
ప్రశ్న 2.
జాతీయాదాయంలో రంగాల వారీగా వాటాలను సంక్షిప్తగా పరిశీలించండి.
జవాబు.
ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను ఆ దేశపు జాతీయాదాయం అని అంటారు.
జాతీయాదాయంలో వివిధ రంగాల వాటా :
రంగాల వాటాల వారీగా జాతీయోత్పత్తి అధ్యయనం అనేది ఆర్థిక నిర్మితి స్వరూపాన్ని తెలియజేస్తుంది. జాతీయాదాయ ధోరణులు ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నాయో జాతీయాదాయపు వివిధ రంగాల వాటాల విశ్లేషణ కూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రణాళికల కాలంలో ప్రారంభమైన ఆర్థిక వృద్ధి ప్రక్రియ పర్యవసానమే పారిశ్రామిక పరమైన మూలం (industrial origin) ఆధారంగా జాతీయాదాయపు కూర్పు (composition) లోని నిర్మితిపరమైన మార్పును అర్థం చేసుకోవచ్చు.
1. ప్రాథమిక రంగపు వాటా : వ్యవసాయం, అడవులు, ఉద్యాన వనాలు, మత్స్య పరిశ్రమలను ప్రాథమిక రంగం కలిగి ఉంటుంది.
స్వాతంత్య్రానంతర కాలంలో జాతీయాదాయంలో ప్రాథమిక రంగపు వాటా గరిష్ఠంగా 1950-51 సంవత్సరంలో 57.2 శాతం ఉంటే, 2013-14 నాటికి కనిష్ఠంగా అంటే 13.9 శాతంగా ఉన్నదల్లా 2018-19 నాటికి 16.1 శాతం మేరకు పెరిగింది. జాతీయాదాయంలో ప్రాథమిక రంగం వాటా క్రమంగా తగ్గుతూ ఉన్నట్లు గమనించవచ్చు. వ్యవసాయ రంగపు ప్రతికూల వాతావరణ స్థితిగతుల, నిర్మితిపరమైన మార్పుల ఫలితమే వ్యావసాయిక రంగపు వాటాలో త్వరితగతిన సంభవించే తగ్గుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఇటీవల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకొన్నాయి. రవాణా మరియు కం, బాంకింగ్ మరియు బీమా, ఇతర సేవల రంగాలు మొదలైనవి వ్యావసాయిక రంగం కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల దేశ జాతీయాదాయంలో వివిధ రంగాల వాటాల అంచనాలు ప్రభావితం అయ్యాయి.
2. ద్వితీయ రంగం వాటా :
ద్వితీయ రంగంలో గనులు మరియు క్వారీయింగ్, వస్తు తయారీ, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మొదలైనవి ఉంటాయి. జాతీయాదాయంలో ఈ రంగం యొక్క వాటా వృద్ధి క్రమంలో మొదట పెరుగుతుంది. 1950-51వ సంవత్సరంలో 15 శాతం ఉంటే, 1980-81 నాటికి 24 శాతం మేరకు, 2018-19 నాటికి 29.6 శాతం మేరకు పెరిగింది.
3. తృతీయ రంగం వాటా :
ఈ రంగపు వాటాలో భాగంగా వ్యాపారం, రవాణా, కమ్యూనికేషన్స్, స్టోరేజి, బాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, సామాజిక, వైయక్తిక సేవలు ఉంటాయి. వీటి వాటా 1950-51 సంవత్సరంలో 25 శాతం ఉండగా, 2018-19 సంవత్సరం నాటికి 54, 3 శాతం మేరకు పెరిగింది. అంటే వాటి వాటా గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. ఇలాంటి పెరుగుదలలో రవాణా విస్తరణ ప్రత్యేకించి రోడ్డు రవాణా, కమ్యూనికేషన్లు ప్రధాన కారకాలుగా ఉన్నాయి.
పారిశ్రామికీకరణ దశ పూర్తి కాకుండానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన దేశాలైన యు.ఎస్.ఏ., కెనడా, యు.కె. లాంటి దేశాలలాగా పారిశ్రామిక పథకం ఉన్నతీకరణ వల్ల మారుతున్న జాతీయాదాయపు నిర్మితిని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవసాయాన్ని విస్మరించడమని అర్థం కాదు. కాని వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పట్ల దృష్టిని సారిస్తూ .ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికీకరణ దిశగా పయనించే విధంగా చేయాల్సి ఉంది. అంతేగాక, ఆర్థిక వ్యవస్థ సత్వర వృద్ధికిగాను పరిశ్రమలు వ్యవసాయానికి ఉత్పాదితాలను (inputs) సరఫరా చేయాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న 3.
పంచవర్ష ప్రణాళికల కాలంలో జాతీయాదాయం మరియు తలసరి ఆదాయం వృద్ధి రేట్లను చర్చించండి.
జవాబు.
జాతీయాదాయం అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువగా చెబుతారు. అలాగే ఒక దేశపు జాతీయాదాయాన్ని ఆదేశపు జనాభాతో భాగిస్తే వచ్చే దానిని తలసరి ఆదాయంగా చెబుతారు. ఈ రెండు భావనలను ఒక దేశపు ఆర్థికాభివృద్ధి రేటును కొలవటానికి ఉపయోగిస్తారు.
పంచవర్ష ప్రణాళికల కాలంలో జాతీయాదాయం, తలసరి ఆదాయాల సాలుసరి వృద్ధి రేట్లు :
పంచవర్ష ప్రణాళికల కాలంలో జాతీయాదాయం, తలసరి ఆదాయాల సాలుసరి వృద్ధి రేట్లు క్రింది విధంగా వివరించవచ్చు.
వివిధ ప్రణాళికా కాలాలలోని సాలుసరి వృద్ధి రేట్లు:
మొదటి పంచవర్ష ప్రణాళికలో (1999-2000 ధరల దృష్యా) జాతీయాదాయం సంవత్సరానికి సగటు వృద్ధి రేటు 4.4 శాతంగా ఉన్నదల్లా, రెండవ ప్రణాళికా కాలం నాటికి 3.8 శాతం మేరకు తగ్గింది. ఏది ఏమైనప్పటికీ, మూడవ ప్రణాళికా కాలంలో జాతీయాదాయంలో సాలుసరి పెరుగుదల 2.6 శాతం మేరకు తగ్గింది. ఈ పెరుగుదల రేటు జనాభా వృద్ధిని తటస్థీకరించడానికి సరిపడేదిగా ఉంటుంది. ఈ ప్రణాళికా కాలంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు 0.4 శాతంగా మాత్రమే ఉంది.
1965-66 సంవత్సరంలో ఏర్పడిన తీవ్రమైన క్షామం వల్ల వృద్ధి రేటు మందగించింది. దీని తరవాత మరొక క్షామం ఏర్పడటం వల్ల వ్యాపారంలో కూడా తిరోగమనం చోటు చేసుకోవడం వల్ల వృద్ధి రేటు మందగించింది. 1967-68 సంవత్సరం తరవాత ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదల ప్రారంభమయ్యింది.
నాల్గవ ప్రణాళిక కాలంలో (1969-74) జాతీయాదాయపు సాలుసరి వృద్ధి రేటు 3.1 శాతానికి పడిపోగా, తలసరి ఆదాయపు సాలుసరి వృద్ధి రేటు 0.8 శాతంగా ఉంది. 1972-73, 1973-74 సంవత్సరాలలో ధరలలోని పెరుగుదల, ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం అనే ప్రధాన కారణాల వల్ల నాల్గవ ప్రణాళికా కాలంలో తక్కువ వృద్ధి రేటు నమోదైంది.
ఐదవ ప్రణాళికా కాలంలో (1974-79) జాతీయాదాయంలోని సాలుసరి సగటు పెరుగుదల 4.9 శాతం ఉంటే, తలసరి ఆదాయం మాత్రం కేవలం 2.6 శాతంగా ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, 5వ ప్రణాళికా కాలంలో ఆర్థిక వ్యవస్థ పని తీరు చాలా సంతృప్తికరంగా ఉంది. 6వ ప్రణాళికా కాలంలో (1980-85) భారతదేశ జాతీయాదాయపు వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదు అయితే, తలసరి ఆదాయ వృద్ధి రేటు మాత్రం 3.1 శాతంగా ఉంది. 7వ ప్రణాళికా కాలంలో (1985 – 90) భారతదేశపు NNP సాలుసరి వృద్ధి రేటు 5.5 శాతం మేరకు పెరిగింది.
తలసరి NNP సాలుసరి వృద్ధి రేటు 3.3 శాతంగా ఉంది. కాని ఈ ప్రణాళికా కాలంలో NNP యొక్క ఆశించిన వృద్ధి రేటు 5 శాతం, తలసరి NNP యొక్క ఆశించిన వృద్ధి రేటు 3 శాతం. కాబట్టి, ఈ ప్రణాళికా కాలంలో ఆశించిన వృద్ధి రేటు కంటే వాస్తవిక వృద్ధి రేటు ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. 8వ ప్రణాళికా కాలంలో (1992-97) జాతీయాదాయంలో 6. 7 శాతం, తలసరి ఆదాయంలో 4.5 శాతం వృద్ధిని సాధించింది. ఈ రకమైన ఆరోగ్యకరమైన ధోరణిని స్థిరంగా కొనసాగే విధంగా చూడటం అవసరం. 9వ ప్రణాళికా కాలంలో (1997-2002) జాతీయాదాయంలోని వృద్ధి రేటు 5.
3 శాతం ఉంటే, తలసరి ఆదాయంలోని వృద్ధి రేటు 3.3 శాతంగా ఉంది. ఈ ప్రణాళికా కాలంలోని వృద్ధి రేట్లను 8వ ప్రణాళికా కాలంలోని వృద్ధి రేట్లతో పోల్చినప్పుడు తగ్గినట్లు గమనించవచ్చు. 10వ ప్రణాళికా కాలంలో (2002-07) జాతీయాదాయంలోని ఫెరుగుదల ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 7.8 శాతంగా ఉంటే, తలసరి ఆదాయం 6.1 శాతంగా ఉంది. 11వ ప్రణాళికా కాలంలో (2007-12) NNP లోని వృద్ధి రేటు 7.6 శాతం అయితే, తలసరి NNP లోని పెరుగుదల 6.2 శాతంగా ఉంది. ఈ ప్రణాళికా కాలంలో గత ప్రణాళికల వృద్ధి రేట్లను అధిగమించడం జరిగింది. 12వ ప్రణాళికా కాలంలో NNP లోని వృద్ధి రేటు 8 శాతంగా ఉంది.
ప్రశ్న 4.
ఆదాయ, సంపద పంపిణీలోని అసమానతలను ఏ విధంగా తగ్గించగలరో తెలియజేయండి.
జవాబు.
నివారణ చర్యలు :
భారతదేశపు పంచవర్ష ప్రణాళికల కాలాలలోని ప్రధాన లక్ష్యాల్లో ఆదాయ పంపిణీలోని అసమానతల నిర్మూలన ఒక ప్రధాన లక్ష్యంగా నిర్దేశింపబడింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రణాళికా డాక్యుమెంట్లను, విధానపరమైన తీర్మానాలను తరచి చూచినట్లయితే ఆదాయ అసమానతలను తగ్గించడానికి తీసుకొన్న పలుచర్యలను తెలుసుకొనుచున్నది.
1. భూసంస్కరణలు, వ్యావసాయిక భూపునఃపంపిణీ :
గ్రామీణ రంగంలో ముఖ్యంగా వ్యావసాయిక భూమి కేంద్రీకరణ వల్ల ఆదాయ అసమానతలు చోటు చేసుకొంటున్నాయి. జమీందారీ పద్ధతిని రద్దుచేయక ముందు పెద్ద మొత్తంలో భూమి అనుపస్థితి భూస్వాముల (absentee landlords) ఆధీనంలో ఉండటం వల్ల వ్యావసాయిక ఉత్పత్తిని అధిక మొత్తంలో భూస్వాములు తీసుకొని భూమిని సాగు చేసే సాగుదారులకు జీవనాధార స్థాయి మేరకే ఉత్పత్తిని ఇచ్చేవారు.
అందువల్ల భూస్వాముల, ఇతర మధ్యవర్తుల రద్దు, భూ కమతాలపై గరిష్ఠ పరిమితి చట్టాలను ప్రవేశపెడుతూ శాసనపరమైన చర్యలను ప్రభుత్వం తీసుకొంది.
2. ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ :
ఆదాయ అసమానతలను తగ్గించడానికి ఏకస్వామ్య సంస్థల ప్రవృత్తులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. 1969వ సంవత్సరంలో ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ చట్టాన్ని (Mo- nopolies and Restrictive Trade Practices MRTP Act) ప్రవేశపెట్టారు.
3. ఉపాధి, వేతన విధానాలు :
నాలుగవ పంచవర్ష ప్రణాళికా కాలం నాటికి కూడా ఉద్యోగ కల్పన లక్ష్యానికి అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ, నాలుగవ పంచవర్ష ప్రణాళికా ఆరంభం నుంచి గ్రామీణ తాత్కాలిక ఉపాధి పథకం (Crash Scheme for Rural Employment – CSRE), దుర్భిక్ష పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం (Drought Prone Areas Programme-DPAP).
ఇంజనీర్ల కోసం స్వయం ఉపాధి పథకాలు, నిరుద్యోగ విద్యావంతులకు ఉపాధి పథకాలు, పనికి ఆహార పథకం Food for Work Programme – FFWP మొదలైన కొన్ని ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టారు. 1978-79 సమీకృత గ్రామీణాభివృద్ధి పథకాన్ని IRDP ప్రారంభించి ఆరవ ప్రణాళికా కాలం నాటికి దేశం మొత్తంలో ఈ పథకాన్ని విస్తరింపజేశారు.
సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం National Rural Employment Programme – NREP గ్రామీణ భూమిలేని వారికి ఉపాధి హామీ పథకం Rural Landless Employment Guarantee Programme – RLEGP లాంటి పతకాలను ప్రవేశపెట్టి దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. జవహర్ రోజ్ గార్ యోజనలో NREP, RLEGP లు ఏప్రిల్ 1, 1989న సమ్మిళితమయ్యాయి.
4. సాంఘిక భద్రతా చర్యలు :
సంఘటిత రంగంలోని శ్రామికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రావిడెంట్ ఫండ్ చట్టం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ లాభాలను కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ బీమా చట్టం సాంఘిక భద్రతా చర్యల్లో చాలా ముఖ్యమైంది. దీని ద్వారా శ్రామికులకు వైద్యం, అంగ వైకల్యం, గర్భిణీ స్త్రీలకు, అనారోగ్య కాలానికి, ఉద్యోగులపై ఆధారపడి ఉన్న వారికి ప్రయోజనం చేకూరే విధంగా సాంఘిక భద్రతా చర్యలను తీసుకొని పేదరికాన్ని, ఆదాయ అసమానతల తీవ్రతను పై చట్టాల అమలు ద్వారా తగ్గు ముఖం పట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
5. కనీస అవసరాల పథకం :
ప్రణాళిక రూపకర్తలు కనీస అవసరాల పథకాన్ని అయిదవ ప్రణాళికలో ప్రవేశపెట్టి, పేదరిక నిర్మూలనతో పాటు ఆర్థిక వృద్ధిని కూడా ఆశయంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం 6వ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రభుత్వ ఏజన్సీల ద్వారా రాయితీ’ సేవలను కల్పించి పేద ప్రజల వినియోగ స్థాయిని పెంచి, గ్రామాల్లో, నగరాల్లో శ్రామికుల ఉత్పాదక సామర్థ్యం పెరిగేలా చర్యలు తీసుకొంటున్నారు.
6. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకాలు :
భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కఠోర పేదరికం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని వ్యవసాయిక శ్రామికుల, సన్నకారు, ఉపాంత రైతులు, గ్రామీణ వృత్తుల వారు, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు చాలా పేదరికంలో ఉన్నారు. వీరి ఆదాయ స్థాయిని పెంపొందింపజేయడానికి ప్రభుత్వం ఈ క్రింది మూడు రకాలైన పథకాలను చేపడుతుంది. అవి :
- గ్రామీణ పేద ప్రజల వనరుల – ఆదాయ అభివృద్ధి పథకాలు
- ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకాలు
- అనుబంధ ఉద్యోగ అవకాశాలను సృష్టించే పనుల పథకాలు
7. పన్నుల వ్యవస్థ (Taxation) :
భారతదేశంలో ఉన్న పన్నుల వ్యవస్థలో ప్రత్యక్ష పన్నులకు పురోగామి స్వభావం ఉంటుంది. ప్రత్యక్ష పన్నుల వల్ల దేశంలో కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉన్న సంపదను నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆదాయ సంపద అసమానతలను తగ్గించవచ్చు. పన్నుల వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా నల్లధనాన్ని అరికట్టి, ఆదాయ-సంపద పంపిణీలో గల తీవ్ర వైషమ్యాలను రూపుమాపవచ్చు.
ప్రశ్న 5.
భారతదేశంలో నిరుద్యోగిత భారాన్ని వివరించండి.
జవాబు.
భారతదేశంలో నిరుద్యోగిత అంచనాలు :
1951 – 2011 మధ్య కాలంలో మన దేశంలో జనాభా గణనీయమైన రేటులో అంటే సాలీనా 2.1 శాతం మేరకు పెరిగింది: పర్యవసానంగా శ్రామిక మార్కెట్లో ఉద్యోగాన్వేషణ కోసం గల ప్రజల సంఖ్య అనూహ్యంగా త్వరితగతిన పెరిగింది. కాని ఆర్థిక వృద్ధి మందకొడిగా ఉండటం వల్ల దానికి అనుగుణంగా ఉద్యోగావకాశాలు పెరగలేదు. అందువల్ల ఒక ప్రణాళికా కాలం నుంచి మరొక ప్రణాళికా కాలం నాటికి నిరుద్యోగిత పరిమాణంలో పెరుగుదల చోటు చేసుకుంది.
1993 – 94 నుంచి 2004-2005 వరకు అంటే 11 సంవత్సరాల కాల వ్యవధిని సరళీకరణ కాలంగా పరిగణిస్తారు. అయితే 1977 – 78 నుంచి 1993 – 94 వరకు అన్ని రకాలైన నిరుద్యోగితలు తగ్గుదల ధోరణి కనపరిస్తే 1993-94, 2004-05 మధ్య కాలాలలో మాత్రం దానికి వ్యతిరేకమైన ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాధారణ స్థితి నిరుద్యోగితను అనుసరించి 1977 – 78లో నిరుద్యోగిత 4.23 శాతం ఉంటే, 1993-94 నాటికి 2.56 శాతంకు తగ్గింది.
కాని 2004 – 05 నాటికి 3.06 శాతంకు పెరిగింది. 2011 – 12 లో ఈ పద్దతిని అనుసరించి నిరుద్యోగిత 2.7 శాతంగా అంచనా వేయబడింది. అత్యంత సమగ్ర నిరుద్యోగిత కొలమానం కూడా అంటే వర్తమాన రోజువారీ స్థితి (CDS) నిరుద్యోగిత రేటు 1977 – 78లో 8. 18 శాతం ఉంటే, 1993-94 నాటికి 6.03 శాతంకు తగ్గింది. కాని 2004-05 నాటికి మళ్ళీ నిరుద్యోగిత 8.28 శాతంకు పెరిగింది.
2004 – 05 తో పోల్చినప్పుడు 2011 – 12 సంవత్సరంలో CDS ప్రాతిపదికన గల నిరుద్యోగిత రేటు 6.6 శాతం అని అంచనా వేయబడింది. అంటే మళ్ళీ తగ్గుదల ధోరణి కనపరిచింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ రకమైన ధోరణిని గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, పట్టణ ప్రాంతాలలో CDS నిరుద్యోగిత రేటు 1993 – 94లో 7.43 శాతం ఉంటే, 2004 – 05 నాటికి 8.28 శాతం మేరకు అంటే చాలా కొద్దిగా మాత్రమే పెరిగింది.
ఈ పెరుగుదల రేట్లు గ్రామీణ ప్రాంతాలలో చాలా వేగవంతంగా ఉంది. 1993 – 94లో గ్రామీణ ప్రాంతాలలో 5.63 శాతం ఉంటే, 2004 – 05 నాటికి 8.28 శాతం మేరకు పెరిగింది. NSSO యొక్క 66వ రౌండులో నిరుద్యోగిత రేట్లు తగ్గినట్లు గమనించినప్పటికీ, గత కాలపు ధోరణి కంటే ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదు.
ఎందుకంటే 2004-05, 2009-10 మధ్య కాలంలో అదనపు శ్రామిక శక్తి 9.2 మిలియన్లుగా ఉంది. ఇంతకు ముందున్న కాలంలో ఈ శ్రామిక శక్తి చాలా తక్కువగా ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అన్ని నిరుద్యోగిత కొలమానాలలో ఈ రకమైన దృగ్విషయాన్ని గమనించవచ్చు.
ఆర్థిక సంస్కరణల మొదటి దశలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సాపేక్షికంగా విస్మరించబడిందని చెప్పవచ్చు. సాధారణ ప్రధాన స్థితి (UPS) అనేది సంవత్సర కాలం పాటు బహిరంగ నిరుద్యోగిత కొలమానంగా ఉంటుంది. కాని వర్తమాన రోజు వారీ స్థితి (CDS) బహిరంగ నిరుద్యోగితనే కాకుండా అల్ప ఉద్యోగితను కూడా మదింపు చేస్తుంది.
1977-78లో పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగిత రేటు 10.34 శాతం ఉంటే, అదే కాలంలో గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.70 శాతంగా ఉంది (CDS ప్రాతిపదికన). 1987-88 నాటికి గ్రామీణ నిరుద్యోగిత రేటు చెప్పుకోదగిన విధంగా అంటే 5.25 శాతంగా ఉంది. కాని పట్టణ నిరుద్యోగిత 9.36 శాతంగా ఉంది. 1993-94 తరువాత సరళీకరణ కాలంలో గ్రామీణ నిరుద్యోగిత ముఖ్యమైన ప్రశ్న
5 భారతదేశంలో నిరుద్యోగిత భారాన్ని వివరించండి.
రేటు 8. 28 శాతమయ్యింది. 1993-94 నుంచి 2004-05 వరకు గల కాల వ్యవధిలో పట్టణ నిరుద్యోగిత 8.28 శాతమయ్యింది. వ్యవస్థీకృత రంగ నిరుద్యోగిత అధిక అనుపాతం వల్ల పట్టణ ప్రాంతాలలోని అధిక నిరుద్యోగిత స్థాయిలనేవి చోటు చేసుకొంటున్నాయి. తక్కువ ఉత్పాదకత కార్యకలాపాలలో నిమగ్నమయ్యే వారు సాపేక్షికంగా కొంత మందికే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు ఉద్యోగులుగా లేదా నిరుద్యోగులుగా ఉండవలసి వస్తుంది.
గ్రామీణ ప్రాంతాలలో పురుషులలో, మహిళలలో సాధారణ స్థితి (PS + SS)ల దృష్ట్యా నిరుద్యోగిత రేట్లు వరుసగా 5.8 శాతంగా మరియు 3.8 శాతంగా ఉన్నాయి. అయితే పట్టణ ప్రాంతాలలో పురుషులలో, మహిళలలో వరుసగా 7.1 శాతంగా, 10.8 శాతంగా ఉన్నాయి అనే విషయం ద్వారా అవగతమవుతుంది.
ఒకవేళ వారపరమైన స్థితి దృష్ట్యా నిరుద్యోగిత రేట్ల పరిగణనలోకి తీసుకొన్నట్లైతే, గ్రామీణ ప్రాంతాలలో పురుషులలో, మహిళలలో ఈ నిరుద్యోగిత రేట్లు వరుసగా 8.8 శాతంగా, 7.7 శాతంగా ఉన్నాయి. అయితే పట్టణ ప్రాంతాలలో పురుషులలో ఈ నిరుద్యోగిత రేట్లు 8.8 శాతం కాగా మహిళలలో 12.8 శాతంగా ఉన్నాయి.
ప్రశ్న 6.
భారతదేశంలో పేదరికం, నిరుద్యోగితల నివారణ చర్యలను వివరించండి.
జవాబు.
పేదరిక నిర్మూలన కోసం ప్రణాళికా రూపకర్తలు 4 రకాలైన పథకాలను ప్రతిపాదించారు. అవి :
- గ్రామీణ పేద ప్రజల కోసం ఆదాయ, వనరుల అభివృద్ధి పథకాలు.
- ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకాలు.
- అనుబంధ ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన పని పథకాలు.
- పేద ప్రజల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడానికి వినియోగస్థాయిని పెంచే కనీస సదుపాయాల పథకాలు.
1. ఆదాయ, వనరుల అభివృద్ధి పథకాలు :
భారతదేశంలో పలు ఆదాయ, వనరుల అభివృద్ధి పథకాలు అమలులో ఉన్నాయి. కొన్ని పథకాలు 1970 నుంచి, మరికొన్ని పథకాలను ఇటీవల ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యమైనవి : సన్నకారు రైతుల అభివృద్ధి పథకం (SFDA), ఉపాంత రైతులు, వ్యవసాయ శ్రామికుల సంస్థ (MFAL), సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం (IRDP), లాంటి వాటిని అమలు చేయడం ద్వారా గ్రామీణ పేద ప్రజల ఆదాయ, వనరులను అభివృద్ధి చేయడానికి కృషి జరిగింది.
2. ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకాలు :
ఇందులో దుర్భిక్ష ప్రాంతాల అభివృద్ధి పథకం (DPAP), ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం (DDP), అటవీ ప్రాంతాల అభివృద్ధి పథకం (HADP) మొదలైన పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా అడవులు, పాడి మొదలైన వాటిని అభిలషణీయంగా వినియోగించుకొని పేద ప్రజల ఆదాయ స్థాయిని పెంపొందింపజేయడం ఈ ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకాల ముఖ్య ఉద్దేశం.
3. ఉపాధి కల్పన లేదా జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకం :
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Programme-NREP), గ్రామీణ భూమిలేని వారి ఉద్యోగితా హామీ పథకం (Rural Landless Employ- ment Guarantee Programme – RLEGP), పనికి ఆహార పథకం (Food for Work Programme – FWP), ప్రధానమంత్రి సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన పథకం (Prime Minister Integrated Urban Poverty Education Programme-PMIUPEP) మొదలైన పథకాల ద్వారా పేద ప్రజలకు అనుబంధ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యం.
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP) తరువాతి కాలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకం (Mahatma Gandhi National Rural Employment Generation Programme – MGNREGP) o రూపాంతరం చెందింది.
4. కనీస అవసరాల పథకాలు, ఇరవై సూత్రాల పథకం :
వీటి ద్వారా ప్రజలకు కనీస అవసరాలను కల్పించి, పేద ప్రజల వినియోగస్థాయిని పెంచి, ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశం. ప్రాథమిక విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా, రోడ్లు, విద్యుద్దీకరణ, గృహాలు, పౌష్టిక ఆహారం మొదలైన కనీస అవసరాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు కల్పించి, వారి సామర్థ్యాన్ని పెంపొందింపజేయడం ఈ పథకాల లక్ష్యం.
భారతదేశంలో ఇటీవల కాలంలో రెండు రకాలైన వ్యూహాలతో ప్రభుత్వం పేదరిక నిర్మూలన సమస్యకు ప్రయత్నిస్తుంది. అవి :
i) అధిక శ్రామిక శక్తికి ఉపాధిని కలుగజేసే విధంగా ఉత్పత్తి రంగాలను విస్తృత పరచడం.
ii) విద్య, నైపుణ్య కల్పన, ఆరోగ్య భద్రత ద్వారా పేదవారి సాధికారతను పెంచడం వల్ల, ఉత్పత్తి రంగాల్లో ప్రవేశించి, పోటీతత్త్వం ద్వారా అధిక ఆదాయాలను పొంది పేదరికం నుంచి బయటపడతారు. ఈ విధానం పేదరిక సమస్యను పరిష్కరిస్తుంది.
ప్రశ్న 7.
పేదరికంపై అభిజిత్ బెనర్జీ అభిప్రాయాలకు ఒక వ్యాఖ్యను రాయండి.
జవాబు.
అభిజిత్ వినాయక్ బెనర్జీ 1961 సంవత్సరంలో ఫిబ్రవరి 21న భారతదేశంలోని ముంబాయిలో జన్మించాడు. భారతదేశంలో పుట్టి అమెరికన్ ఆర్థికవేత్తగా ఎదిగి ఎస్తర్ డఫ్లూ మరియు మైకేల్ క్రెమేర్లతో పాటుగా ప్రపంచపు పేదరిక నిర్మూలనకుగాను క్రియాశీలకమైన, ప్రయోగాత్మకపరమైన దృక్పథాన్ని అభివృద్ధి చేసినందుకు గాను వారికి 2019వ సం||లో నోబుల్ బహుమతి గ్రహీతలుగా ప్రసిద్ధిగాంచినారు. మాసాచూస్చెట్స్ ఇనిస్టూట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లో బెనర్జీ ఆచార్యునిగా పనిచేస్తున్నాడు.
అనేక అంశాలలో విద్య, వైద్య మరియు ఆరోగ్య, ఋణ అందుబాటు మరియు నూతన సాంకేతికతల అన్వయింపులు మొదలగునవి పేదరికానికి నిజమైన కారణాలుగా ఉంటాయనే ప్రయోగాత్మక పరమైన దృక్పథాన్ని బెనర్జీ, డఫ్లూ మరియు మైకేల్ క్రెమేర్లు అన్వయించి విపులీకరించారు.
బెనర్జీ, డపూల ప్రకారం, “వాస్తవానికి కొంతమంది ప్రజలు తప్పనిసరిగా వారు చాలా కష్టించి పనిచేయగలుగుతారు. ఎందుకంటే వారు బలహీనులే గాకుండా సరిపడే ఆహారం లేకుండా (underfed) ఉంటారనేది వాస్తవం. అతి తక్కువ వ్యయంతో వారి యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే కష్టించి కనీస అవసరాలను పొందడానికి పనిచేయడం జరుగుతుంది.
కొన్ని ఇతర అత్యంత అవసరమయ్యే కొనుగోళ్ళు (గృహాల లాంటివి) మరియు ఆవశ్యకమయ్యే నిర్దిష్ట క్యాలరీల పరిమాణంను కొనుగోలు చేపట్టడానికి గాను బడ్జెట్లో పొందుపరచడంనే పేదరికానికి నిర్వచనంగా అర్థం చేసుకోవడం కొరకు గాను పేదరికానికి సంబంధించిన పేదరికపు రేఖలుగా చారిత్రాత్మకంగా పలు దేశాలలో గమనించవచ్చు”. అయితే ఈ నిర్వచనం ప్రకారం కొంతమందికి తగినంతగా తిండి లేకపోవడం వల్లనే వారిని ‘పేద’ వ్యక్తులుగా పేర్కొంటారు.
1. ఉత్పాదక ఆస్తులలో భూమి ఒక ఉత్పాదక ఆస్తిగా ఉంటుంది. ఒక దేశానికి మరొక దేశానికి గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం మేరకు ప్రజలు ఏదో కొంత భూమిని కల్గి ఉంటారు. భూమి గాకుండా గ్రామీణ ప్రాంతాలలోని కడు పేద కుటుంబాలు కొద్దిలో కొద్దిగా అనశ్వర వస్తువుల లాంటి ఉత్పాదక ఆస్తులను కల్గి ఉంటారని బెనర్జీ, డపులు అభిప్రాయపడ్డారు.
2. కటిక పేదవారు విద్యపై అతి తక్కువగా ఖర్చు చేస్తారు. వీరు విద్యపై వెచ్చించే వ్యయం సాధారణంగా మొత్తం కుటుంబ బడ్జెట్లలో దాదాపుగా 2 శాతం మేరకు మాత్రమే ఉంటుంది. పేద కుటుంబాలలో పిల్లల విద్యపై తక్కువ ఖర్చు పెట్టడానికి ప్రధాన కారణం వారు ప్రభుత్వ బడులకు లేదా ఫీజు విధించని ఇతర బడులకు పోవడం. విద్యపై ఎక్కువ వెచ్చించే పేద కుటుంబాలు గల దేశాలలో ప్రభుత్వ బడులలో ఫీజులు ఉండడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు (ముఖ్యంగా ఇండోనేషియా మరియు కొటేడి ఐవరీ ‘లాంటి దేశాలలో) అని బెనర్జీ అభిప్రాయపడ్డాడు.
3. పలు పేద కుటుంబాల వారు బహుళ వృత్తులను కలిగి ఉంటారనేది వాస్తవం అని బెనర్జీ, డఫ్లూ అభిప్రాయపడినారు. అయితే ఒక వ్యక్తి వ్యాపారంతో పాటు శ్రామికునిగా కూడా తన రెండు కార్యకలాపాలను నిర్వహించడంను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. దేశాలలో ప్రతిచోటా గానప్పటికీ, పలు ఇతర దేశాలలోని పట్టణ ప్రాంతాలలో ఏక కాలంలో బహుళ వృత్తులను కలిగి ఉండడమనేది సాధారణంగా ద్యోతకమవుతుందని బెనర్జీ, డపూలు అభిప్రాయపడినారు.
4. గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే ఈ బహుళ వృత్తుల తీరు చాలా ప్రబలంగా ఉంటుందని కూడా అభిప్రాయపడినారు. బెనర్జీ ప్రకారం పేద కుటుంబాల వారు ఆర్థికపరమైన అవకాశాలను కల్గి ఉన్నప్పటికీ ప్రత్యేకీకరణను కలిగి ఉండరు. ప్రత్యేకీకరణను కలిగి లేకపోవడం వల్ల వారు దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరంలో సగటున 18 వారాల పాటు బయట ఉన్నప్పటికీ ఈ పలు పేద కుటుంబాల వారు బయట ఉద్యోగాలు నిర్వహించడం వల్ల సంపాదనలో వారు అధిక భాగాన్ని పొందగలుగుతున్నారు.
స్వల్పకాలిక వలసల వల్ల వారు వారి ఉద్యోగానికి సంబంధించిన అంశాలను మంచిగా నేర్చుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది లేదా వారి యొక్క నిర్దిష్ట ప్రతిభలతో వారి ఉద్యోగాలను ముగించాల్సి ఉంటుంది లేదా ప్రోత్సహించబడుతుంది. అయితే వ్యవసాయేతర కార్యకలాపాలను నిర్వహించడానికి సాపేక్షికంగా పేద ప్రజలకు చాలా మట్టుకు తక్కువ నిర్దిష్టతను కలిగిన నైపుణ్యాలు అవసరమవుతాయి.
5. పేదవారికి అందుబాటులో ఉండే భౌతిక అవస్థాపనల లాంటి విద్యుచ్ఛక్తి, కుళాయి నీళ్లు, ప్రాథమిక పారిశుధ్యం (మరుగు దొడ్లకు అందుబాటులో ఉండడం లాంటివి)ల విషయంలో వివిధ దేశాల మధ్య గణనీయమైన వ్యత్యాసాలున్నాయి అని బెనర్జీ అభిప్రాయపడ్డాడు. కొన్ని కొన్ని ప్రభుత్వాలు విద్యుచ్ఛక్తి మరియు కుళాయి నీటి సౌకర్యాలనే ఈ రెండు కటిక పేదవారికి అందుబాటులో ఉండే విధంగా కృషిచేస్తున్నాయి.
సాధారణంగా గ్రామీణ పేదవారి (పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడం వల్ల అదృష్టవశాత్తూ దాదాపుగా చాలా దట్టమైన చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉండడమనేది రోగ సంబంధిత పర్యావరణం ఘోరమైనదిగా ఉంటుంది) కంటే పట్టణ ప్రాంతపు పేదవారికి విద్యుచ్ఛక్తి మరియు కుళాయి నీటి సౌకర్యాలు ఎక్కువ మేరకు అందుబాటులో ఉంటాయి.
6. పలు అల్ప ఆదాయ దేశాలలో పేద కుటుంబాల వారికి ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు, భారతదేశంలో గల పెక్కు గ్రామాలలో ఒక కిలోమీటర్ లోపు ఒక బడి ఉంది మరియు ప్రతి 10,000ల మంది ప్రజలకు ఒక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఏది ఏమైనప్పటికీ, పేదవారికి చేయూతనిచ్చే సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి నాణ్యత తక్కువ స్థాయిలో ఉండడమే గాకుండా, ఈ సౌకర్యాలు వారికి వాస్తవానికి ఏ మేరకు చేరబడుతున్నాయనేది స్పష్టంగా లేదు.
ప్రభుత్వ పాఠశాలలోని బోధనాపరమైన నాణ్యత తక్కువగా ఉండడం వల్ల, దాని యొక్క ప్రభావం నేర్చుకొనే స్థాయిలపై స్పష్టంగా ఉంటుంది. భారతదేశంలో 6-14 సంవత్సరాల మధ్యగల పిల్లలు పాఠశాలలలో 93.4 శాతం మేరకు నమోదు (అందులో 75 శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో) చేసుకున్నప్పటికీ, ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో చేపట్టబడిన సర్వే ప్రకారం.
సెకండరీ గ్రేడ్ స్థాయిలో గల 7 నుండి 14 సం॥రాల మధ్యగల పిల్లలలో 34.9 శాతం మేరకు వారు కనీసం ఒక సులభమైన ఒక పేరాగ్రాఫ్ను చదవలేని వారుగా ఉన్నారు. అంతేగాక 41.1 శాతం మేరకు వ్యవకలనం చేయలేరు మరియు 65.5 శాతం మేరకు భాగాహారం చేయలేకపోతున్నారు. అంతేగాక, ప్రభుత్వ పాఠశాలలోని 6 నుండి 8 గ్రేడ్స్లో గల పిల్లలలో 22 శాతం మేరకు పిల్లలు రెండవ గ్రేడ్కు సంబంధించిన పాఠ్య పుస్తకం కూడా చదవలేకపోతున్నారని బెనర్జీ తన అనుభావిక అధ్యయన ఫలితాల ద్వారా రూఢీకరించాడు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భారతదేశపు GDP లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల వాటాలను తెలియజేయండి.
జవాబు.
స్వాతంత్ర్య సమయంలో ప్రభుత్వ రంగం నీటి పారుదల, విద్యుచ్ఛక్తి, రైల్వేలు, కమ్యూనికేషన్లు లాంటి కొన్ని విభాగాల కార్యకలాపాలకు మాత్రమే పరిమితమై ఉండేది. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ రంగ కార్యకలాపాలు త్వరితగతిన విస్తరించాయి.
మన దేశంలో 1948, 1956లలోని మొదటి, రెండు పారిశ్రామిక తీర్మానాలు ప్రభుత్వ పరిధిని విస్తృత పరస్తూ ప్రైవేట్ రంగ కార్యకలాపాలను అతిగా నియంత్రించకుండా ఉండే విధంగా ఉంటాయి అని ధ్రువీకరిస్తూ భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ప్రాధాన్యతను ఇచ్చాయి. ఈ రెండు పారిశ్రామిక తీర్మానాలు పరిశ్రమలను వివిధ రకాలుగా విభజించి, కొన్నింటిని పూర్తిగా ప్రభుత్వ రంగానికి, మరి కొన్నింటిని ఉమ్మడి రంగానికి అంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఇక మిగిలిన అన్నింటినీ కేవలం ప్రైవేట్ రంగానికి మాత్రమే అప్పగించాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండూ కలిసి జాతీయాదాయాన్ని ఉత్పత్తి చేస్తాయి. పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరగడం వల్ల జాతీయాదాయంలో ప్రభుత్వ రంగం వాటా క్రమంగా పెరిగింది.
గత ఐదు దశాబ్దాల్లో జాతీయాదాయంలో ప్రభుత్వ రంగం వాటా నిలకడగా పెరిగినట్లు పట్టిక 3.5 ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. 1999-2000. ధరల దృష్ట్యా 1950-51లో స్థూల దేశీయోత్పత్తిలో ప్రభుత్వ రంగ వాటా 8 శాతం అయితే 2000-01 నాటికి 23.2 శాతం మేరకు పెరిగింది. అందువల్ల, జాతీయాదాయంలో ప్రభుత్వ రంగం ఐదింట ఒకటవ వంతు వాటాను కలిగి ఉంది.
స్థూల దేశీయోత్పత్తిలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల వాటా:
ఆధారాలు :
i) CSO National Accounts statistics, 2011.
ii) Various Issues of Economic Survey.
వాస్తవానికి గడిచిన అయిదు దశాబ్దాల కాలంలో భారతదేశం జాతీయాదాయంలో ప్రైవేట్ రంగం వాటా అధికంగా ఉన్నట్లు పట్టిక 3.5 ద్వారా గమనించవచ్చు. 1950-51లో జాతీయాదాయంలో ప్రైవేట్ రంగం వాటా 92 శాతం అయితే, 1990-91 నాటికి 76.4 శాతం మేరకు తగ్గింది. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తరువాత జాతీయాదాయంలో ప్రైవేట్ రంగం వాటా పెరిగింది. 2000-01 నాటికి జాతీయాదాయంలో ప్రైవేట్ రంగం వాటా 76.8 శాతం ఉంటే 2008-09 నాటికి 79.8 శాతం, 2009-10 నాటికి 78.8 శాతం మేరకు పెరిగింది.
ప్రశ్న 2.
ఆదాయ, సంపద పంపిణీలోని అసమానతలకు గల ప్రధాన కారణాలను పరిశీలించండి.
జవాబు.
భారతదేశంలోని ఎగువ 10 శాతం వేతన జీవులు దిగువనున్న 10 శాతం మంది కంటే 12 రెట్లు అధికంగా ఉన్నారు. భారతదేశంలోని 100 మంది ధనికులు అందరి నికర ఆస్తుల విలువ 2011వ సంవత్సరంలో అధికంగా ఉంటే రూ. 12,06,375 కోట్లుగా ఉంది. వారి ఆదాయం దేశ దేశీయోత్పత్తిలో 17 శాతంగా ఉంది.
1. భూ యాజమాన్యంలోని అసమానతలు :
భారతదేశంలో బ్రిటీష్ వారి కాలంలో జమీందారి పద్ధతి వల్ల వ్యావసాయిక భూములు కొంత మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండేవి. స్వాతంత్య్రానంతరం జమీందారీ పద్ధతిని రద్దు చేసినప్పటికీ, భూ యజమాన్య కేంద్రీకరణ మాత్రం అదే విధంగా ఉంది. 2010-11లోని ఇటీవల దత్తాంశం ప్రకారం మొత్తం వ్యవసాయ యోగ్యమైన కమతాలలో 67 శాతం ఉపాంత కమతాలే. కాని 22.2 శాతం విస్తీర్ణత మాత్రమే సాగులో ఉంది.
2. ప్రైవేట్ కార్పోరేట్ రంగంలో ఆస్తుల కేంద్రీకరణ :
బడా పారిశ్రామిక వేత్తల చేతుల్లో ఆర్థిక సంపద, శక్తి అధికంగా కేంద్రీకరించబడింది. కాలగమనంలో వారు పెద్ద మొత్తంలో ఆస్తులను సంపాదించుకోవడంలో సఫలీకృతులయ్యారు. బ్యాంకుల, ఇతర విత్తపరమైన సంస్థల నుంచి సులభ విత్తం అందుబాటులో ఉండటమనేది వారు ఆస్తులను సంక్రమించుకొనేందుకు చేసే ప్రయత్నాలకు దోహదపడ్డాయి. అంతేకాకుండా మార్కెట్ నుంచి ఈక్విటీ మూలధనాన్ని వారు పెంచుకోగలిగారు.
NCAER ప్రకారం పట్టణ ప్రాంతాలలోని ఆస్తుల పంపిణీ చాలా మేరకు వైషమ్యాన్ని కలిగి ఉంది. ఈ సంవత్సరంలో ఎగువన ఉన్న 10 శాతం వారు పట్టణ ప్రాంతాలలోని మొత్తం సంవదలో 46.28 శాతం మేరకు వాటాను కలిగి ఉన్నారు. కాని దిగువన ఉన్న 60 శాతం వారు మొత్తం సంపదలో కేవలం 11.67 శాతం మేరకే వాటాను కలిగి ఉన్నారు.
3. వృత్తి పరమైన శిక్షణలోని అసమానతలు :
వ్యాపారస్థులు, ఇంజనీర్లు, న్యాయమూర్తులు, డాక్టర్లు, సమాచార సాంకేతిక రంగంలోని ఉద్యోగులు, ఇతర వృత్తి నైపుణ్యతగల నిపుణుల ఆదాయాలు తరచుగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి. కాబట్టి విద్య, శిక్షణలు కూడా మనదేశంలో ఆదాయ అసమానతలు తీవ్రతరమవ్వడానికి దోహదపడుతున్నాయి.
4. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల :
1950 మధ్య కాలం నుంచి ధరలు నిరంతరంగా పెరగడం వల్ల శ్రామిక వర్గ వాస్తవిక ఆదాయం తగ్గుతుంది. కాని పారిశ్రామికవేత్తలు వ్యాపార వేత్తలు, అధిక మొత్తంలో మార్కెట్ మిగులు కలిగి ఉన్న పెద్ద వ్యవసాయదారులు ఈ ద్రవ్యోల్బణ పరమైన ప్రక్రియ వల్ల అధికంగా లబ్ధి పొందారు. భారతదేశంలో పునఃపంపిణీ ప్రభావాన్ని నియంత్రించడానికి ప్రయత్నం జరపకపోవడం వల్ల ఆదాయ అసమానతలు తీవ్రతరమవుతున్నాయి.
5. పరపతి సౌకర్యాల్లో అసమానత :
భారతదేశంలో ఆదాయ సంపద అసమానతలు, పరపతి సౌకర్యాలు అసంతులితంగా ఉండటం వల్ల అసమానతలు పెరుగుతున్నాయి అని చెప్పవచ్చు. పారిశ్రామిక సంస్థలు, వ్యాపార వేత్తలు మూలధనాన్ని చాలా సులభంగా పొందగలుగుతున్నారు. కాని వ్యవసాయదారులు, సన్నకారు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు వడ్డీ వ్యాపారస్థులపై ఆధారపడి ఉండటం వల్ల అనేక రకాలైన దోపిడీలకు గురి అవుతున్నారు.
6. పట్టణాల వైపు ప్రైవేట్ పెట్టుబడి :
ఇప్పటికీ, భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు గ్రామాల్లో జీవిస్తున్నారు. కాని సుమారుగా 70 శాతం ప్రైవేటు పెట్టుబడి పట్టణ ప్రాంతాల్లోని పరిశ్రమలకు వెళుతుంది. కాబట్టి మన దేశంలోని పెట్టుబడి “పట్టణ పక్షపాత” వైఖరి కలిగినదిగా చెప్పవచ్చు.
7. ప్రభుత్వం పాత్ర :
భారతదేశంలో ఆర్థిక పరమైన మార్పుకు అగ్రగామిగా ప్రభుత్వం తరచుగా ఉంటుందని ప్రకటించుకొన్నప్పటికీ, ప్రభుత్వ పెట్టుబడి, ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రపంచీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ విధానాలు దేశంలో ఆదాయ-సంపద అసమానతలను పెంచడానికి దోహదపడుతున్నాయి.
ప్రశ్న 3.
వివిధ నిరుద్యోగిత రకాలను పరిశీలించండి.
జవాబు.
అమలులో ఉన్న వేతన రేటు వద్ద ఒక వ్యక్తికి పని చేయాలనే కోరిక ఉన్నప్పటికి, అతనికి ఉద్యోగావకాశం లభించకపోవడాన్ని నిరుద్యోగితగా చెప్పవచ్చు.
1. నిర్మితి సంబంధిత నిరుద్యోగిత (Structural Unemployment) :
ఈ రకమైన నిరుద్యోగిత దేశపు ఆర్థిక నిర్మితితో సంబంధం కలిగినదిగా ఉంటుంది. త్వరితగతిన పెరుగుతున్న జనాభా, వారిలో గమనశీలత లేకపోవడం వల్ల శ్రామిక డిమాండ్ కంటే శ్రామిక సప్లయ్ అధికంగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత సమస్య ఏర్పడుతుంది. ఈ రకమైన నిరుద్యోగిత దీర్ఘకాలిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలోని నిరుద్యోగిత ప్రధానంగా ఈ కోవలోకి వస్తుంది.
2. అల్ప ఉద్యోగిత (Under-Employment) :
శ్రామికుల అల్ప ఉద్యోగిత అంటే వారికి పని దొరుకుతుంది, కాని వారి శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించబడవు.
3. ప్రచ్ఛన్న నిరుద్యోగిత (Disguised Unemployment) :
ఉత్పత్తి ప్రక్రియలలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది ఉంటే వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అని అంటారు. పని చేస్తున్న మొత్తం శ్రామికుల్లో కొంత మందిని తొలగించినప్పటికీ ఉత్పత్తి ఏ మాత్రం తగ్గదు. అలాంటి వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అని అంటారు.
4. బహిరంగ (Open) నిరుద్యోగిత :
శ్రామికులు ఏ పనీ లేకుండా జీవించినట్లయితే వారికి చేయడానికి ఏ పనీ దొరకనట్లయితే, వారందరు కూడా బహిరంగ నిరుద్యోగిత కోవలోకి వస్తారు. విద్యను ఆర్జించిన వారు నిరుద్యోగులుగా ఉండటం, నైపుణ్యత లేని కారణంగా శ్రామిక నిరుద్యోగిత ప్రబలడం ఈ రకమైన నిరుద్యోగిత కోవలోకి వస్తాయి.
5. విద్యాయుత నిరుద్యోగిత (Educated Unemployment) :
విద్యనార్జించి లేదా తర్ఫీదు పొంది, నైపుణ్యతను కలిగి ఉన్న వ్యక్తికి అతని అర్హతలకు అనుగుణంగా ఉద్యోగం దొరకనట్లయితే, ఆ వ్యక్తిని విద్యనార్జించిన నిరుద్యోగి అని అంటారు. ప్రత్యేకించి, భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ రకమైన నిరుద్యోగిత సమస్యగా ఉంది.
6. సంఘృష్ట నిరుద్యోగిత (Frictional) :
దేశంలోని శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మార్పు చెందే కాలంలో ఏర్పడిన నీరద్యోగితను సంఘృష్ట నిరుద్యోగిత అని అంటారు. శ్రామిక మార్కెట్లోని అసంపూర్ణతల వల్ల శ్రామికులకు ఉద్యోగ అవకాశాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది.
7. ఋతుపరమైన నిరుద్యోగిత (Seasonal) :
ఋతుగత మార్పులను అనుసరించి డిమాండ్లో చోటు చేసుకొనే మార్పు వల్ల ఈ నిరుద్యోగిత ఏర్పడుతుంది. శ్రామికులకు సంవత్సరమంతటా పని దొరకదు. సంవత్సరంలో కొన్ని కొన్ని ఋతువులలో మాత్రమే ఉద్యోగం దొరకుతుంది. సాధారణంగా వ్యావసాయిక రంగ ప్రాముఖ్యత గల దేశాలలో ఋతగత నిరుద్యోగిత అధికంగా ఉంటుంది.
8. చక్రీయ నిరుద్యోగిత (Cyclical Unemployment) :
అభివృద్ధి చెందిన దేశాలలోని వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం ఏర్పడటం వల్ల సాధారణంగా ఏర్పడే నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత అని అంటారు. అన్ని దేశాలు వ్యాపార చక్రాల చట్రంలో ఉంటాయి.
9. సాంకేతిక పరమైన నిరుద్యోగిత (Technical) :
ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతిక ప్రవేశం వల్ల శ్రామికులు తొలగించబడతారు. ఫలితంగా ఏర్పడే నిరుద్యోగితను సాంకేతికపరమైన నిరుద్యోగిత అని అంటారు.
ప్రశ్న 4.
భారతదేశంలో నిరుద్యోగితకు గల కారణాలను విశ్లేషించండి.
జవాబు.
అమలులో ఉన్న వేతన రేటు వద్ద ఒక వ్యక్తికి పని చేయాలనే కోరిక ఉన్నప్పటికి, అతనికి ఉద్యోగావకాశం లభించకపోవడాన్ని నిరుద్యోగితగా చెప్పవచ్చు.
1. ఉపాధి రహిత వృద్ధి :
భారతదేశ ప్రణాళికా కాలంలో మొదటి మూడు దశాబ్దాల కాలంలో GDP వృద్ధి రేటు తక్కువగా అంటే సాలుసరి 3.5 శాతంగా ఉంది. ఈ కాలంలో ఉద్యోగితా రేటు సాలీనా 2 శాతం మేరకు సహేతుకమైన రీతిలో పెరిగింది. కాని ఉద్యోగితా వృద్ధి రేటులో మాత్రం త్వరితగతిన తగ్గుదల నమోదైంది. సాధారణంగా ఆర్థిక వృద్ధి ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సి ఉంటుంది. కాని, భారతదేశంలోని వృద్ధి చాలా కాలం నుంచి ఉపాధి రహితంగా ఉందనేది వాస్తవం. ఎందుకంటే ఉద్యోగావకాశాలు అశించిన విధంగా పెరగడం లేదు.
2. శ్రామిక శక్తిలోని పెరగుదల :
స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి మరణాల రేటు తగ్గడం వల్ల జనాభా పరిణామ క్రమ సిద్ధాంతంలోని రెండవ దశను చేరుకొన్నాం. 1960వ దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు సగటున 2.2 శాతం, శ్రామిక శక్తి సగటున 1.9 శాతం పెరిగింది. శ్రామిక శక్తి 1983-1993 కాలంలో జనాభా పరమైన, సాంఘిక కారణాల వల్ల చాలా అధికంగా పెరిగింది. తదుపరి కాలంలో శ్రామిక శక్తి తగ్గింది.
3. ప్రతికూల సాంకేతికత:
భారతదేశంలో మూలధనం కొరతగాను, శ్రమ అధికంగాను ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ శక్తులు, సమర్థవంతంగా నిర్వహించబడితే దేశంలో శ్రమ సాంద్రత సాంకేతిక ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకోవలసి వస్తుంది. కాని పారిశ్రామిక, వ్యావసాయిక రంగాల్లో ఉత్పత్తిదారులు శ్రమకు బదులుగా స్వయంచాలక యంత్ర శక్తిని ఉపయోగించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుంది.
4. ప్రతికూలమైన విద్యా వ్యవస్థ :
భారతదేశంలో విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. వాస్తవానికి ఇప్పుడున్న విద్యా వ్యవస్థను వలస వాద కాలంలో మన దేశంలో మెకాలే ప్రవేశపెట్టాడు. గున్నార్ మిర్దాల్ ప్రకారం భారతదేశంలో విద్యా విధానం మానవ వనురులను అభివృద్ధిపరిచే విధంగా లేదని, ఇది కేవలం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో గుమస్తాలను, సాధారణ తక్కువ స్థాయి కార్యనిర్వాహకులను మాత్రమే తయారు చేస్తుంది.
నవ్య ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల ఆదాయ అసమానతలు పెరిగాయి. సాధారణంగా ఆదాయ అసమానతలు పెరగడం వల్ల పేదవారి కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఫలితంగా, వస్తుత్పత్తికి డిమాండ్ తగ్గి తిరోగమన మాంద్య పరిస్థితులు చోటు చేసుకొని నిరుద్యోగిత పెరుగుతుంది.
ప్రశ్న 5.
నిరుద్యోగిత సమస్య యొక్క పర్యవసానాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో పలు కారణాల వల్ల ఏర్పడే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని విస్తృత నిరుద్యోగిత ఒక సంక్లిష్ట సమస్య. నిరుద్యోగిత కేవలం వ్యక్తుల పైననే గాక వారి కుటుంబాలపై, దీర్ఘ కాలంలో వారు నివసిస్తున్న సమాజంపై కూడా ప్రభావాన్ని కనపరుస్తుంది. నిరుద్యోగిత వల్ల జీవనాధారం లేక పేదరికాన్ని అనుభవించడమే కాక నిరాశ, నిస్పృహలను, దుఃఖాలను కలగజేస్తుంది.
1. మానవ వనరులను కోల్పోవడం :
మానవ వనరులను కోల్పోవడంలో నిరుద్యోగిత సమస్య ప్రధాన కారణమవుతుంది. శ్రామికులు ఉద్యోగాన్వేషణలోనే వారి గరిష్ట సమయాన్ని వృధా చేస్తారు. ఇందువల్ల కొన్ని ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణానంతర స్తబ్ధత అనే సమస్యకు దారితీస్తుందని ఫెల్ప్ (Phelps) అనే ఆర్థికవేత్త అభిప్రాయపడ్డాడు.
2. పేదరికపు పెరగుదల :
వ్యక్తి యొక్క అన్ని ఆదాయ వనరులను నిరుద్యోగిత హరించి వేస్తుంది. తత్ఫలితంగా వ్యక్తి పేదవాడు అవుతాడు. కాబట్టి, నిరుద్యోగిత పేదరికాన్ని ఉత్పన్నం చేస్తుందని చెప్పవచ్చు.
3. సాంఘిక సమస్యలు :
సమాజంలో పలు సాంఘిక సమస్యలు తలెత్తడానికి నిరుద్యోగిత కారణమవుతుంది, సామాజిక భద్రత కూడా దెబ్బతింటుంది.
4. రాజకీయ అస్థిరత :
దేశంలో రాజకీయ అస్థిరత చోటు చేసుకోవడానికి నిరుద్యోగిత కారణమవుతుంది. నిరుద్యోగ వ్యక్తులు ప్రతికూల సాంఘిక అంశాలతో సులభంగా ప్రభావితమవుతారు. అలాంటి వారు ప్రజాస్వామిక విలువల పట్ల, శాంతియుతమైన సాధనాల పట్ల నమ్మకాన్ని కోల్పోతారు.
5. శ్రమ దోపిడి :
నిరుద్యోగిత స్థితిలో ఉన్నప్పుడు సాధ్యమైనంత మేరకు గరిష్టంగా శ్రామికులు దోపిడికి గురి అవుతారు. శ్రామికులకు ఎవరికైతే పని కల్పించబడుతుందో వారు తక్కువ వేతనంతో బాటు వైవిధ్యభరితమైన షరతులలో పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ భద్రత లేనందువల్ల శ్రామికులు యాజమానులకు తక్కువ వేతనంతో ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది.
6. జీవన ప్రమాణం :
నిరుద్యోగిత నెలకొని ఉన్న సమయాలలో ఉద్యోగాల కోసం పోటీ పెరగడమే కాకుండా వ్యక్తి యొక్క బేరమాడే శక్తి తగ్గుతుంది. అందువల్ల జీతాల, ప్యాకేజీల, ఆదాయాలతో ముడిపడి ఉన్న ప్రజల జీవన ప్రమాణం కూడా తగ్గుతుంది.
7. ఉద్యోగ వ్యత్యాసాలు :
ఒక వ్యక్తి దీర్ఘకాలం పాటు ఉద్యోగానికి ఆవల (బయట) ఉన్నట్లయితే మళ్ళీ ఉద్యోగాన్ని దొరక బట్టుకోవడమనేది కష్టంతో కూడుకొన్నది కావడం వల్ల శ్రామిక మార్కెట్లో ఉద్యోగ లభ్యత పరిస్థితి మరింత జటిలమవుతుంది. కొంత కాలం పాటు పనికి ఆవల ఉన్న వ్యక్తిని అతని తప్పు ఏమీ లేనప్పటికీ అతని సేవలను వినియోగించకోవడానికి యజమానులు ఎవరు కూడా సుముఖంగా ఉండరు.
8. నైపుణ్యాలు ఉపయోగితను కోల్పోవడం :
నిరుద్యోగులుగా ఉన్న కాలంలో వారు తమ నైపుణ్యాలను ఉపయోగించలేరు. నిరుద్యోగితా స్థితి చాలా కాలం పాటు కొనసాగినట్లయితే వారికున్న నైపుణ్యాలను కోల్పోవడం జరుగుతుంది.
ప్రశ్న 6.
భారతదేశంలో పేదరికానికి గల కారణాలను పరిశీలించండి.
జవాబు.
సమాజంలోని ఏ ప్రజలు అయితే తమ కనీస జీవితావసరాలను తీర్చుకోలేని స్థితిలో ఉంటారో దానిని పేదరికంగా చెప్పవచ్చు. ఏ సమాజంలోనైనా ఒక నిర్ణీత కనీస స్థాయిలో తమ జీవనాన్ని నిర్వహించుకోలేక, జీవనాధార వేతనం కూడ పొందలేక జీవితం గడుపుతున్న వారిని పేదవారుగా నమోదు చేయవచ్చు.
1. ఆర్థిక శక్తి కేంద్రీకరణ :
భారతదేశంలో ఆదాయ అసమానతలు అధికంగా ఉండటమే గాక గ్రామాల-నగరాల మధ్య గల వ్యత్యాసం అధికంగా ఉంది. 1990వ దశకం తరవాత ఆదాయ అసమానతలు క్రమంగా పెరుగుతున్నాయి. ధనవంతులు అభివృద్ధి ఫలితాల వల్ల లాభాన్ని పొందుతున్నారు, కాని పేదవారు నిరాశాపూరితంగా ఉన్నారు. అందువల్ల ఆదాయ-సంపద అసమానతలు, ఆర్థిక శక్తి కేంద్రీకరణం వల్ల ధనికులు మరింత ధనికులుగా, పేదవారు మరింత పేదవారిగా తయారవుతున్నారు.
2. సహజ వనరుల అల్ప వినియోగం :
దేశంలోని ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోవాలంటే జాతీయాదాయ వృద్ధి రేటును పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. భారతదేశంలో నదుల నీరు, అటవీ సంపద, ఖనిజ సంపదలను సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం వల్లనే 63 సంవత్సరాల ప్రణాళికా కాలం పూర్తి అయినప్పటికీ ఇంకా 19.3 శాతం ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారు.
3. అధిక జనాభా ఒత్తిడి :
భారతదేశంలో ప్రధాన సమస్య ఏమిటంటే మరణాల రేటు తగ్గి జననాల రేటు చాలా అధికంగా ఉండటం వల్ల 1951 నుంచి 2001 సంవత్సరం వరకు జనాభా సాలుసరి వృద్ధి రేటు 2.1 శాతంగా ఉంది. పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ స్థాయి తగ్గకుండా ఉండాలి అంటే ఆర్థిక వృద్ధి రేటు అంతే వేగంగా పెరగాల్సి ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహారం, గృహాలు, వైద్యం, విద్య మొదలైన కనీస సౌకర్యాలను కల్పించవల్సిన అవసరం ఉంది. జనాభా పెరుగుదల వల్ల శ్రామిక శక్తి పెరుగుతుంది.
తత్ఫలితంగా శ్రామికుల డిమాండ్ కంటే సప్లయి అధికమై దేశంలోని నిరుద్యోగం, పేదరికం అనే సమస్యలు పెరగుతున్నాయి. జనాభా వృద్ధి తలసరి జాతీయాదాయం వృద్ధి రేటు కంటే అధికంగా ఉండటం వల్ల ప్రజల తలసరి ఆదాయం తగ్గి జీవన వ్యయం తగ్గి పేదరికం పెరుగుతుంది.
4. నిరుద్యోగిత :
భారతదేశంలో అధిక శ్రామిక శక్తి ఉండటం వల్ల అందరికీ లాభదాయకమైన ఉపాధిని కల్పించడమనేది చాలా కష్టంతో కూడుకొన్న పనిగా చెప్పవచ్చు. మూలధన కొరతవల్ల పారిశ్రామికీకరణ మందకొడిగా తయారైనందువల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది. దేశంలోని మొత్తం శ్రామిక శక్తికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి సరిపడే మూలధనం లేకపోవడం వల్ల పరిశ్రమలను విస్తరించలేకపోవడం జరుగుతుంది. తత్ఫలితంగా దేశంలో నిరుద్యోగిత పెరగడం వల్ల పేదరికం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. నిరుద్యోగుల సంఖ్య పెరగడం వల్ల పేదరికం తీవ్రత కూడా పెరుగుతుంది.
5. నాసిరకం విద్య :
పేదప్రజలు తక్కువ విద్యను అభ్యసించడం వల్ల దేశాల్లో పేదరికం పెరుగుతుంది. పేదప్రజల్లో సాపేక్షిక ఆదాయం తక్కువగా ఉండటానికి విద్యాపరమైన వ్యత్యాసాలు ప్రధాన కారణంగా ఉంటాయి.
6. నిత్యావసరాల లభ్యత తక్కువగా ఉండటం :
నిత్యావసర వస్తువుల లభ్యత తక్కువగా ఉండటం కూడా భారతదేశంలో పేదరికానికి ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. నిత్యావసర వినియోగ వస్తువుల కొరత సరైన పంపిణీ విధానం లేనందువల్ల పేద ప్రజల జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది. ఎగువన ఉండే ధనికుల, అట్టడుగున ఉండే పేదవారి వినియోగ స్థాయిలలో వ్యత్యాసం అధికంగా ఉంది.
7. ద్రవ్యోల్బణం :
నిరంతర ధరల పెరుగుదల కూడా పేదరికానికి మరొక కారణం. ధరలు పెరగడం వల్ల ద్రవ్య కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఫలితంగా దిగువ సమాజంలో మధ్య తరగతి, పేద ప్రజలు మరింత పేదవారు కావడానికి దారితీస్తుంది. అందువల్ల ద్రవ్యోల్బణం వల్ల దేశంలో పేదరికం మరింతగా పెరుగుతుందని చెప్పవచ్చు.
8. తక్కువ సాంకేతికత :
భారతదేశంలోని పేదరికానికి తక్కువ స్థాయి సాంకేతికత కూడా కారణం అవుతుందని చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలలోని సాంకేతికతతో పోల్చినట్లయితే తయారీ, వ్యవసాయ రంగంలో చాలా తక్కువ స్థాయి సాంకేతికతను వాడుతున్నారు. అంతేగాక, మార్కెట్ల సామర్థ్యం, వ్యవస్థాపన, నిర్వహణ, విత్త మార్కెట్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. తక్కువ సాంకేతికత ఫలితంగా తలసరి ఉత్పాదకత తక్కువ స్థాయిలో ఉంటుంది. పర్యవసానంగా, మూలధన ఉత్పాదకత తక్కువ స్థాయిలో ఉండి తక్కువ ఫలితాలు రావడం వల్ల మనదేశంలో మూలధన సంచయనం తక్కువగా ఉంది.
9. మూలధన కొరత :
ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మూలధన సంచయనంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో చాలామంది ప్రజలు నిరక్షరాస్యులు, తక్కువ నైపుణ్యత గల వారు కావడం వల్ల పురాతన మూలధన పరికరాలను, సాంప్రదాయిక ఉత్పత్తి పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఉత్పాదకత వల్ల తక్కువ పొదుపు, తక్కువ పెట్టుబడి, తక్కువ మూలధన సంచయనాలను గమనించవచ్చు.
10. పంచవర్ష ప్రణాళికలు విఫలం చెందడం :
దేశంలో ప్రజలందరికీ కనీస జీవన స్థాయిని కల్పించడం పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం. శ్రీమతి ఇందిరా గాంధీ “గరీబీ హఠావో” నినాదం ద్వారా పేదరిక నిర్మూలనకు ఎన్నో చర్యలను తీసుకొంది. పంచవర్ష ప్రణాళికల కాలంలో సాధించిన వృద్ధి రేటు పేదరికాన్ని సమూలంగా నిర్మూలించలేకపోయింది.
11. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల అభివృద్ధి నమూనా:
ప్రజలకు అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధాన వనరుగా ఉన్న వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమలను ఈ నమూనా విస్మరించింది. ఈ నమూనా మూలధన సాంద్రత అభివృద్ధి తీరును పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఉపాధి కల్పన విషయంలో తీవ్ర భయాందోళనలకు దారితీసింది. దీని ఫలితంగా దేశంలో నిరుద్యోగిత పెరిగింది. ఈ వ్యూహానికి విస్తరణ ప్రభావం trickle down effect తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆర్థిక వ్యవస్థలో పేదరికం, నిరుద్యోగాలు పెరిగాయి.
12. సాంఘిక కారణాలు :
నిరక్షరాస్యత, అమాయకత్వం, మత, కుల, సంబంధిత ఆచారాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మొదలైన వాటన్నింటివల్ల ఆధునిక సాంకేతికతను చేపట్టకపోవడం వల్ల గమనశీలత తగ్గి, ప్రజల ఆదాయాలు పెరగవు. అందువల్ల ప్రజలు కొన్ని స్వీయ నిర్ణయాల వల్ల పేదరికంలో ఉంటారు అనే దృక్పథాన్ని పరిగణించవలసి ఉంటుంది.
ప్రశ్న 7.
పేదరిక సమస్య పర్యవసానాలను చర్చించండి.
జవాబు.
ఏ పేదరికం అయినా కూడా ఒక దేశంలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ జీవనాలపై, తీవ్రమైన ఒత్తిడులకు కారణమవుతుంది. వాస్తవానికి, ఆర్థికాభివృద్ధి ప్రారంభ దశలలో పేదరిక విషవలయాలు ఏర్పడటానికి దోహదపడింది. ఉన్నవారు, లేనివారు అనే రెండు వర్గాలుగా మొత్తం సమాజం విభజితమైనది. ఉన్నవారు మాత్రమే విలాసపు జీవితం సమకూర్చే అన్ని సౌకర్యాలను అనుభవించేవారు. అయితే లేనివారు మాత్రం పేదరిక సమస్య వల్ల కనీసం కూడు, గుడ్డ, గూడు అనే ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. ఫలితంగా, ఈ క్రింది ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నాయి.
1. అసమ అవకాశాలు :
సాధారణంగా ద్రవ్య సహాయం, వనరులు ఆధిక్యత వల్ల ఉన్నవారు అవకాశాలను మెరుగైన రీతిలో ఉపయోగించుకొంటారు. కాని పేదవారు మాత్రం కనీసం ప్రాథమిక అవసరాలను కూడా పొందలేరు. పర్యవసానంగా పేదవారు చాలా తీవ్రంగా లేమి ప్రభావానికి లోనవుతారు.
2. ఆర్థిక స్తోమత కేంద్రీకరణ :
కొద్ది మంది చేతుల్లో ఆర్థిక స్తోమత కేంద్రీకృతం కావడానికి తీవ్రమైన పేదరికం దోహదపడుతుంది. ధనికులు రాజకీయ ప్రాబల్యతను పొందడం కోసం వారి ఆర్థిక స్తోమతను ఉపయోగించుకొంటారు.
3. అసమర్థత (Inefficiency) :
పేదరికం ఉండటం వల్ల పేదవారు విద్య, ఇతర ప్రత్యేకమైన తర్ఫీదులు పొందడానికి గల అవకాశాలు మృగ్యమవుతాయి. ఒక వ్యక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి కావలసిన బౌద్ధిక జ్ఞానం, భౌతిక శక్తి ఆవశ్యకత అందరూ గుర్తించిన అంశమే. సరైన అవగాహన, నైపుణ్యతను పెంచే శిక్షణ లేకపోవడం వల్ల మొత్తం ఉత్పత్తి ప్రక్రియ అసమర్థతకు లోనవుతుంది.
4. నిరుద్యోగ సమస్య :
పేదవారికి ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటం వల్ల పేదరిక సమస్య, నిరుద్యోగిత సమస్యలు ఏర్పడటానికి దోహదపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యే క్రమంలో నిరుద్యోగిత అనేది ఆటంకంగా పరిణమిస్తుంది. ఒక దేశం అన్ని అంశాలలో పురోగతిని సాధించే నేపథ్యంలో అధిక నిరుద్యోగిత అడ్డంకిగా నిలుస్తుంది.
5. ఆదాయ అసమానతలు, అభద్రత :
ఆదాయ అసమానతలు పెరగడానికి పేదరిక సమస్య దోహదపడటమే కాకుండా అభద్రతా భావాన్ని కూడా కలగజేస్తుంది.
6. సమాజం :
పేదరిక సమస్య సమాజంలోని కొన్ని రుగ్మతలకు కారణభూతం కావచ్చు. సమాజంలో పేదరికంలో ఉన్న ప్రజలలో ఎక్కువ మంది గృహ వసతి లేనివారిగా ఉండటం వల్ల వారందరు వీధుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ఈ పేదరిక సమస్య సామాజిక అశాంతికి దారితీయడమే కాకుండా నేరాలు కూడా పెరగడానికి ఆస్కారం కావచ్చు.
7. పౌష్టిక ఆహార లోపం :
పేదరికపు అతి సామాన్య ప్రభావం పౌష్టిక ఆహార లోపం, ఈ సమస్య ప్రత్యేకించి పేదకుటుంబాల వారి పిల్లలలో కనిపిస్తుంది. పేదరికంలో నివసిస్తున్న ప్రజలకు కొనుగోలు శక్తి తక్కువైనందువల్ల పౌష్టిక ఆహారం చాలా అరుదుగా అందుబాటులో ఉంటుంది. సాధారణంగా పౌష్టిక ఆహారం అధిక ఖర్చుతో కూడుకొని ఉండటం వల్ల తక్కువ ఆదాయం గల కుటుంబాలు వాటిపై వెచ్చించడం సాధ్యపడదు. కాబట్టి, పేదవారు తక్కువ బలవర్ధకమైన ఆహారం కొనుగోలు చేస్తారు. పేదరికంలో ఉన్నవారు కొన్ని కొన్నిసార్లు చాలినంత మేరకు ఏది కూడా తినలేని విధంగా ఉండటం వల్ల పౌష్టిక ఆహార లోపంతో ఉంటారు.
8. ఆరోగ్యం :
పేదరికపు తీవ్ర ప్రభావాలు ఆరోగ్యంపై కూడా ఉంటాయి. పేదరికం వల్ల తరచుగా అనారోగ్యానికి గురి అవుతుండటం వల్ల వారి ఆయుఃప్రమాణం తగ్గడమే కాకుండా మందులపై అధిక వ్యయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. పేదవారి ఆరోగ్యకరమైన జీవన పర్యావరణ నిర్వహణకు గాను వనరులు లేకపోవడం వల్ల వారు రోగాల బారిన పడటమనేది సర్వసాధారణం.
9. విద్య :
పేదరికపు ప్రతికూల ప్రభావం విద్య మీద అధికంగా ఉంటుంది. పేదరికంలో ఉండే ఎక్కువ మంది ప్రజలు లేదా ప్రాయంలో బడికి పోలేకపోతున్నారు. పేదరికంలో ఉండే కుటుంబాలు అవసరమయ్యే బట్టలను లేదా బడికి పోవడానికి కావలసిన వాటిని వారి పిల్లలకు అందించలేకపోతున్నారు. ఇంకా కొన్ని కుటుంబాల వారు వారి పిల్లలను బడికి కూడా పంపలేక పోతున్నారు.
ప్రశ్న 8.
ప్రభుత్వంచే పరిగణనలోకి చేసుకోబడిన కొన్ని పేదరిక నిర్మూలన పథకాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలోని పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన పథకాలు:
పథకం పేరు | ప్రారంభించిన సంవత్సరం | లక్ష్యం |
1. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (CDP) | 1952 | ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి |
2. ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ (EGS) | 1972 – 73 | గ్రామీణ బలహీన వర్గాల వారికి సహాయం చేయడం |
3. ఆక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లయ్ ప్రోగ్రాం (ARWSP) | 1972 – 73 | గ్రామాలలో తాగునీరు కల్పించడం |
4. డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రాం (DPAP) | 1973 | భూగర్భ జలాల అభివృద్ధి |
5. క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ గ్రామీణ ఉపాధి కోసం ఎంప్లాయిమెంట్ (CSRE) | 1973 | గ్రామీణ ఉపాధి కో్సం |
6. మార్జినల్ ఫార్మర్స్, అగ్రికల్చర్ లేబర్ ఏజెన్సీ (MFALA) | 1973 | సాంకేతికపరమైన మరియు విత్తపరమైన సహాయం |
7. స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (SFDA) | 1974 | సాంకేతికపరమైన, విత్తపరమైన సహాయం |
8. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం (CADP) | 1974 | నీటిపారుదల ఉపయోగం. |
9. ట్వంటీ పాయింట్ ప్రోగ్రాం (TPP) | 1977 | పేదరిక నిర్మూలన |
10. డెసెర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (DDP) | 1977 | ఎడారి విస్తృతిని నియంత్రించడం |
11. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం (FWP) | 1977 | అభివృద్ధి పనుల్లో శ్రామికులకు ఆహార ధాన్యాలను వేతనాలుగా ఇవ్వడం |
12. ట్రయినింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ (TRYSEM) | 1979 | గ్రామీణ యువతకు శిక్షణా పథకం |
13. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (IRDP) | 1980 | గ్రామీణ పేదవారి సంపూర్ణ అభివృద్ధి |
14. నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ ప్రోగ్రాం (NREP) | 1980 | గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి |
15. డెవలప్మెంట్ ఆఫ్ ఉమన్ & చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాన్ (DWCRA) | 1982 | గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల, పిల్లల అభివృద్ధి |
16. రూరల్ లాండ్స్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం (RLEGP) | 1983 | భూమి లేని గ్రామీణులకు ఉపాధి కల్పన హామీ |
17. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్ యూత్ (SEEUY) | 1984 | విత్తపరమైన, సాంకేతిక పరమైన సహాయాన్ని విద్యాయుత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం కల్పించడం |
18. నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (NFRD) | 1985 | గ్రామీణాభివృద్ధికి విత్తసహాయం |
19. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం ఫర్ ద అర్బన్ పూర్ (SEPUP) | 1986 | పట్టణ పేదవారికి రాయితీని, బ్యాంకు పరపతిని కల్పించడం |
20. జవహర్ రోజ్ గార్ యోజన (JRY) | 1989 | గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన |
21. నెహ్రూ రోజ్ గార్ యోజన (NRY) | 1989 | పట్టణ ప్రాంతాలలో ఉపాధి కల్పన |
22. ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ స్కీమ్ (EAS) | 1993 | గ్రామాలలో సంవత్సరంలో 100 రోజుల ఉపాధి కల్పన |
23. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ (MPLADS) | 1993 | పార్లమెంటరీ నియోజక వర్గ అభివృద్ధికిగాను సంవత్సరానికి ఒక కోటి రూపాయలను ఆపాదించడం |
24. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (DRDA) | 1993 | గ్రామీణాభివృద్ధికి విత్తపరమైన సహాయం |
25. మహిళా సమృద్ధి యోజన (MSY) | 1993 | పోస్ట్ ఆఫీసులలో గ్రామీణ స్త్రీలలో పొదుపును ప్రోత్సహించడం |
26. ప్రైమ్ మినిస్టర్ రోజ్ గార్ యోజన (PMRY) | 1993 | విద్యావంతులకు ఉపాధి కల్పన |
27. చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ స్కీం (CLES) | 1994 | బాల కార్మికులను బడికి పంపడం |
28. ప్రైమ్ మినిస్టర్ ఇంటిగ్రేషన్ అర్బన్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రాం (PMIUPEP) | 1995 | నగర పేదరిక నిర్మూలన |
29. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ రూరల్ ఏరియా (GLISRA) | 1995 | తక్కువ ప్రీమియంతో బీమా సదుపాయం |
30. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం (NSAP) | 1995 | దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సహాయం చేయడం |
31. కస్తూర్బా గాంధీ ఎడ్యుకేషన్ స్కీమ్ (KGES) | 1997 | స్త్రీల అక్షరాస్యతను పెంచడం |
32. స్వర్ణ జయంతి గ్రామ్ సహరి రోజ్గర్ యోజన (SJGSRY) | 1997 | పట్టణాభివృద్ధిని సాధించడం |
33. రాజరాజేశ్వరి మహిళ కళ్యాణ్ యోజన (RMKY) | 1998 | స్త్రీలకు బీమా రక్షణ |
34. అన్నపూర్ణ యోజన (AY) | 1999 | పెన్షన్ పొందని వృద్ధులకు 10 కిలోల బియ్యం అందించడం |
35. సమగ్ర ఆవాస్ యోజన (SAY) | 1999 | గృహం, తాగునీరు, పరిశుభ్రత కల్పన |
36. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్ గార్ యోజన (SJGSY) | 1999 | గ్రామీణ పేదరికం, నిరుద్యోగ నిర్మూలన |
37. జవహర్ గ్రామ్ సంవృద్ధి యోజన (JGSY) | 1999 | గ్రామ అవస్థాపన కల్పన |
38. జనశ్రీ బీమా యోజన (JSBI) | 2000 | BPL ప్రజలకు బీమా |
39. ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన | 2000 | గ్రామాలలో ప్రాథమిక అవసరాలు తీర్చడం |
40. అంత్యోదయ అన్న యోజన (AAY) | 2000 | పేదవారికి ఆహార భద్రత |
41. ఆశ్రయ బీమా యోజన (ABY) | 2001 | ఉపాధి కోల్పోయిన వారికి నష్ట పరిహారం |
42. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY) | 2001 | పక్కా రోడ్ల ద్వారా గ్రామాలను కలపడం |
43. కటీహర్ మజ్దూర్ బీమా యోజన (KMBJ) | 2001 | భూ వసతి లేని వ్యవసాయ కార్మికులకు బీమా |
44. శిక్షా సయోగ్ యోజన (SSY) | 2001 | BPL పిల్లలకు విద్య |
45. సంపూర్ణ గ్రామీణ్ రోజ్గర్ యోజన (SGRY) | 2001 | ఉపాధి, ఆహార భద్రత |
46. జయప్రకాశ్ నారాయణ్ రోజ్గర్ గ్యారంటీ యోజన (JPNRGY) | 2001 | పేద జిల్లాల్లో ఉపాధి |
47. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (VAMBAY) | 2001 | పట్టణ ప్రాంతాలలోని మురికి వాడల ప్రజలకు గృహ నిర్మాణాలు |
48. సోషల్ సెక్యూరిటీ పైలెట్ స్కీమ్ (SSPS) | 2004 | అసంఘటిత రంగంలోని శ్రామికులకు బీమా పెన్షన్, వైద్య సదుపాయాలు కల్పించడం |
49. నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం (NFFWP) | 2004 | అనుబంధ వేతన ఉపాధి కల్పన |
50. వందేమాతరం స్కీమ్ (VAMS) | 2004 | గర్భిణీ స్త్రీల సంరక్షణ |
51. జననీ సురక్షా యోజన (JSY) | 2005 | తల్లుల సంరక్షణ |
52. భారత్ నిర్మాణ్ ప్రోగ్రాం (BNP) | 2005 | గ్రామీణ అవస్థాపన సౌకర్యాల కల్పన (నీటి పారుదల,నీటి సరఫరా, గృహం, రోడ్లు, టెలిఫోను, విద్యుత్ శక్తి) |
53. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్క్రీమ్ (MNREGS) | 2006 | గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి కల్పన |
ప్రశ్న 9.
పేదరికపు పలు భావనలను విశ్లేషించండి.
జవాబు.
పేదరికం అనేది ఒక సామాజిక దృగ్విషయం. సమాజంలోని ఏ ప్రజలైతే తమ కనీస జీవితావసరాలను తీర్చుకోలేని స్థితిలో ఉంటారో, దానిని పేదరికంగా నిర్వచించవచ్చు. ఏ సమాజంలోనైనా ఒక నిర్ణీత కనీస స్థాయిలో తమ జీవనాన్ని నిర్వహించుకోలేక, జీవనాధార వేతనం కూడా పొందలేక జీవితం గడుపుతున్న వారిని పేదవారుగా నమోదు చేయవచ్చు.
పేదరికం రకాలు :
1. నిరుపేక్ష పేదరికం :
దేశంలోని ప్రజల కనీస అవసరాల పరిమాణాలను ముందుగా నిర్ణయించి తరువాత మార్కెట్ ధరల ఆధారంతో వాటి విలువను అంచనా వేసి కనీస జీవనావసర వినియోగాన్ని నిర్ధారిస్తారు. కనీస భౌతిక జీవనావసరాన్ని ద్రవ్య రూపంలో లెక్కించి కనీస జీవన వినియోగ వ్యయాన్ని నిర్ధారిస్తారు. నిర్ధారించిన కనీస ఆదాయం లేదా వినియోగం కంటే తక్కువగా పొందుతున్న ప్రజలను నిరపేక్ష పేదవారు అని అంటారు.
2. సాపేక్షిక పేదరికం :
సాపేక్షిక పేదరికాన్ని లెక్కించడానికి ప్రజల ఆదాయ పంపిణీని తులనాత్మకంగా అంచనావేసి ఎగువ 5 నుంచి 10 శాతం ప్రజల జీవన స్థాయితో పోల్చి చూసి దిగువ 5 నుంచి 10 శాతం ప్రజలను సాపేక్షిక పేదవారిగా పరిగణిస్తారు. లేదా, తక్కువ ఆదాయ స్థాయి గల ప్రజలను అధిక ఆదాయం పొందే వారితో పోల్చి, తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలను సాపేక్షకంగా పేదవారిగా పరిగణిస్తారు. తక్కువ ఆదాయం గల ప్రజల జీవన ప్రమాణం అధికంగా ఉన్నప్పటికీ అధిక ఆదాయ ప్రజల జీవన ప్రమాణంతో పోల్చి వారిని సాపేక్షిక పేదవారు అని అంటారు.
3. పేదరిక వ్యత్యాసపు సూచీ (Poverty Gap Index) :
పేదరికపు గీత దిగువన గల సగటు దూరం, ఆ గీతకు అనుపాతంగా తెలియజేసే దానిని (శూన్య పేదరిక వ్యత్యాసం పొందేవరకు పేదేతర వారిని లెక్కించుకొంటూ పోతే మొత్తం జనాభా దృష్ట్యా సగటు రూపొందించబడుతుంది) పేదరిక వ్యత్యాసపు సూచీగా నిర్వచిస్తారు.
ప్రతి పేద వ్యక్తి ఆదాయం, దారిద్య్ర రేఖ సూచించే ఆదాయానికి గల వ్యత్యాసాన్ని బదిలీ చేయడం ద్వారా ప్రతి పేద వ్యక్తికి గల ఆదాయం దారిద్ర్య రేఖ సూచించే ఆదాయానికి సమానమవుతుంది. కాబట్టి నిరపేక్ష దారిద్ర్యాన్ని అధిగమించవచ్చు. ఆ విధంగా పేదరిక వ్యత్యాసం పేదరికపు వ్యాప్తిని, తీవ్రతను ప్రతిభింబింప జేస్తుంది. కింది సూత్రం ఆధారంగా పేదరికపు వ్యత్యాసపు సూచీని గణన చేయవచ్చు :
పేదరికపు వ్యత్యాసం = పేదరికపు గీత – పేదవాడి సగటు వినియోగ వ్యయం / పేదరికపు గీత
లేదా G = \(\frac{Z-Y}{Z}\)
4. మానవ పేదరిక సూచీ (HPI) :
1997లో UNDP విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక ‘మానవ పేదరిక సూచీ’ (Human Poverty Index – HPI) ని ప్రవేశ పెట్టింది. సమాజంలో పేదరికపు తీవ్రత పై సమష్టి అభిప్రాయానికి రావడం కోసం గుణాత్మక జీవనంలో వివక్షతకు సంబంధించిన వివిధ లక్షణాలన్నింటిని ఒక దగ్గర చేర్చి సంయుక్త సూచీని ఏర్పరిచారు.
2010 మానవాభివృద్ధి నివేదిక మానవ పేదరికపు సూచీ (HPI) స్థానంలో బహు పార్శ్వపు పేదరికపు సూచీ (Muli-dimen- sional Poverty Index – MPI) ని ప్రవేశపెట్టింది. బహు పార్శ్వపు పేదరికపు తలసరి లెక్క (జనాభాలో బహుపార్శ్వపు పేదరికాన్ని అనుభవిస్తున్న), బహు పార్శ్వపు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ప్రతి గృహపు వివక్షతల సగటు సంఖ్య (వారి పేదరికపు తీవ్రతల లబ్దమే MPI).
ప్రశ్న 10.
భారతదేశంలో పేదరికపు భారాన్ని సంక్షిప్తంగా పరిశీలించండి.
జవాబు.
భారతదేశంలో పేదరిక భారం (Incidence of Poverty in India) : 1970 వ దశకం ప్రారంభం నుంచి ప్రణాళికా సంఘం పేదరిక సాంద్రతకు సంబంధించిన అంచనాలను గణన చేస్తుంది. 1973-74 ధరల దృష్ట్యా దారిద్ర్య రేఖ నిర్ధారణ కోసం గ్రామీణ ప్రజలకుగాను రూ. 49.63 తలసరి నెలవారి వ్యయం, పట్టణ ప్రజలకుగాను రూ.56.64 తలసరి నెలవారి వ్యయం పొందలేని వారిని దారిద్ర్య రేఖ కింద జీవించే వారుగా నిర్వచించవచ్చు. ధరలలో వస్తున్న మార్పుల దృష్ట్యా దారిద్ర్య రేఖను కాలానుసారంగా మారుస్తున్నారు.
రంగరాజన్ ప్యానల్ సూచన మేరకు 2011-12వ సంవత్సరానికి గాను ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో నెలవారి వ్యయం రూ.972; పట్టణ ప్రాంతాలలో నెలవారి వ్యయం రూ.1,407 చేయగలుగుతారో వారు పేదరిక నిర్వచనం పరిధిలోకి రారు. అందువల్ల, రంగరాజన్ కమిటీ ప్రకారం ఐదుగురు సభ్యులు కలిగిన కుటుంబం గ్రామీణ ప్రాంతాలలో రూ.4,760; పట్టణ ప్రాంతాలలో రూ.7,035 ల మేరకు వినియోగ వ్యయం చేయువారు పేదరికం పరిధిలోకి రారు.
ఒకవేళ రోజువారి ప్రాతిపదికన గణన చేసినచో 2011-12వ సంవత్సరంనకు గాను గ్రామీణ ప్రాంతాలలో తలసరి వినియోగ వ్యయం రూ. 32 రోజు ఒక్కింటికి; పట్టణ ప్రాంతాలలో రూ. 47 రోజు ఒక్కంటికి ఉన్నచో వారు పేదరికం పరిధిలోకి రారు. 2011-12వ సంవత్సరంనకు గాను తెండూల్కర్ పద్ధతి (అంచనా) ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో రూ.816 మరియు పట్టణ ప్రాంతాలలో రూ.1,000 నెలసరి వ్యయం లేదా ఒకవేళ రోజు వారి ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకొన్నచో, గ్రామీణ ప్రాంతాలలో తలసరి వ్యయం రోజు ఒక్కంటికి రూ.27 మరియు పట్టణ ప్రాంతాలలో రూ. 33గా ఉన్నచో, వారు పేదరికం పరిధిలోకి రారు. అయితే తెండూల్కర్ కమిటి దీనిని గ్రామీణ ప్రాంతాలకు గాను రూ. 4,080గా పట్టణ ప్రాంతాలకు రూ.5,000గా నిర్ధారించింది.
1973-74లో జనాభా సగం కంటే ఎక్కువ జనాభా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నారు. నాలుగు దశాబ్దాల కాలంలో అంటే 1973-74 నుంచి 2011-12 వరకు గల పేదరికాన్ని గమనించినచో 1973-74లో 54.9 శాతం మేరకు ఉన్న పేదరికం 2011-12 నాటికి 21.92 శాతం మేరకు తగ్గింది అనే విషయం అర్థమవుతుంది. కానీ ఈ కాలంలో జనాభా గణనీయంగా పెరగడం వల్ల నిరపేక్ష పేదవారి సంఖ్య మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
జాతీయాదాయం.
జవాబు.
ఒక దేశంలో ఒక సంవత్సరకాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తుసేవ నికర విలువ. రెండు మార్లు లెక్కించకుండా నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పత్తి చేయబడిన వస్తుసేవల మొత్తం పరిమాణం.
ప్రశ్న 2.
తలసరి ఆదాయం.
జవాబు.
జాతీయాదాయమును దేశ జనాభాతో భాగిస్తే వచ్చే ఆదాయం.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశజనాభా.
ప్రశ్న 3.
నిరుద్యోగిత.
జవాబు.
అమలులో ఉన్న వేతన రేటు వద్ద ఒక వ్యక్తికి పనిచేయాలనే కోరిక ఉన్నప్పటికీ, అతనికి ఉద్యోగ అవకాశం లభ్యం కాకపోవడాన్నే నిరుద్యోగితగా చెప్పవచ్చు.
ప్రశ్న 4.
నిరంతర నిరుద్యోగిత.
జవాబు.
ఒక వ్యక్తి పనిచేయడానికి ఇష్టపడి, పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండటం. దీనిని బహిరంగ నిరుద్యోగిత అని కూడా అంటారు.
ప్రశ్న 5.
వార పరమైన స్థితి గల నిరుద్యోగిత.
జవాబు.
గత 7 రోజులలో ఒక వ్యక్తి కనీసం ఒక గంట పనిచేస్తే వారి పరమైన స్థితి ప్రకారం అతనిని ఉద్యోగిగా పరిగణిస్తారు.
ప్రశ్న 6.
నిర్మిత సంబంధిత నిరుద్యోగిత.
జవాబు.
ఇది దేశ ఆర్థిక నిర్మితతో సంబంధం కల్గి ఉంటుంది. త్వరితగతిన పెరుగుతున్న జనాభా, వారిలో గమనశీలత లేకపోవడం వల్ల శ్రామిక డిమాండ్ కంటే శ్రామిక సప్లయి అధికంగా ఉండటం వల్ల ఈ రకమైన నిరుద్యోగం ఏర్పడును. ఇది దీర్ఘ కాలికమైనది.
ప్రశ్న 7.
ఋతు సంబంధిత నిరుద్యోగిత.
జవాబు.
ఋతుగత మార్పులను అనుసరించి డిమాండ్లో చోటు చేసుకొనే మార్పు వల్ల ఈ నిరుద్యోగిత ఏర్పడుతుంది. వ్యావసాయ శ్రామికులకు సంవత్సరంలో 7 నుండి 8 మాసాల మేరకు పని దొరుకుతుంది. మిగతా సమయాలలో పని దొరకని శ్రామికులను ఋతుగత నిరుద్యోగులు అంటారు.
ప్రశ్న 8.
బహిరంగ నిరుద్యోగిత.
జవాబు.
శ్రామికులు ఏ పని లేకుండా జీవించినట్లయితే వారికి చేయడానికి ఏ పని దొరకనట్లయితే, వారందరూ కూడా బహిరంగ నిరుద్యోగిత కోవలోకి వస్తారు.
ప్రశ్న 9.
విద్యావంతుల నిరుద్యోగిత.
జవాబు.
విద్యనార్జించి లేదా తర్ఫదు పొంది, నైపుణ్యతను కల్గిన వ్యక్తికి అతని అర్హతలకు అనుగుణంగా ఉద్యోగం దొరికినట్లయితే, ఆ వ్యక్తి విద్యనార్జించిన నిరుద్యోగి అని అంటారు. మన దేశంలో ఇటువంటి నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది.
ప్రశ్న 10.
చక్రీయ నిరుద్యోగిత.
జవాబు.
అభివృద్ధి చెందిన దేశాలలోని వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం ఏర్పడటం వల్ల సాధారణంగా ఏర్పడే నిరుద్యోగతను చక్రీయ నిరుద్యోగిత అంటారు.
ప్రశ్న 11.
ప్రచ్ఛన్న నిరుద్యోగిత.
జవాబు.
ఉత్పత్తి ప్రక్రియలలో అవసరమైన శ్రామికుల కంటే ఎక్కువ మంది ఉండే వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అని అంటారు. వీరి ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది. వ్యవసాయరంగంలో ఈ రకమైన నిరుద్యోగిత ఉంటుంది.
ప్రశ్న 12.
సంఘృష్ట నిరుద్యోగిత.
జవాబు.
దేశంలోని శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మార్పుచెందే కాలంలో ఏర్పడిన నిరుద్యోగితను సంఘృష్ట నిరుద్యోగిత అంటారు. శ్రామిక మార్కెట్లోని అసంపూర్ణతల వల్ల శ్రామికులకు ఉద్యోగ అవకాశాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది.
ప్రశ్న 13.
అనుద్యోగిత.
జవాబు.
అనుద్యోగిత స్థితిలో ప్రజలు నిరుద్యోగులు కావచ్చు లేదా సంప్రదాయ 16 సంఘటిత రంగంలో పని చేస్తూండవచ్చు. లేదా ఈ రకమైన నిరుద్యోగిత అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉంటుంది.
ప్రశ్న 14.
అల్ప ఉద్యోగిత.
జవాబు.
శ్రామికుల అల్ప ఉద్యోగిత అంటే వారికి పని దొరకుతుంది. కాని వారి శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించబడవు.
ప్రశ్న 15.
సాంకేతిక పరమైన నిరుద్యోగిత.
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతికత ప్రవేశం వల్ల శ్రామికులు తొలగించబడతారు. ఫలితంగా ఏర్పడే నిరుద్యోగితను సాంకేతిక పరమైన నిరుద్యోగిత అంటారు.
ప్రశ్న 16.
దారిద్ర్యరేఖ.
జవాబు.
గ్రామీణ ప్రజలకు గాను 49.63 తలసరి నెలవారి వ్యయం పట్టణ ప్రజలకు గాను, 756.64 తలసరి నెలవారి వ్యయం పొందేలేని వారిని దారిద్య్ర రేఖ క్రింద జీవించే వారిగా నిర్వచించవచ్చు.
ప్రశ్న 17.
పేదరిక వ్యత్యాసం.
జవాబు.
పేదరికపు గీత దిగువన గల సగటు దూరం, ఆ గీతల అనుపాతంగా తెలియజేసే దానిని పేదరిక వ్యత్యాసపు సూచీగా నిర్వచిస్తారు.
ప్రశ్న 18.
నిరపేక్ష పేదరికం.
జవాబు.
దేశంలోని ప్రజల కనీస అవసరాల (ధాన్యం, పప్పులు, పాలు, వెన్న మొదలైనవి) పరిమాణాలను ముందుగా నిర్ణయించి తరువాత మార్కెట్ ధరల ఆధారంతో వాటి విలువను అంచనా వేసి కనీస జీవనావసర వినియోగాన్ని నిర్ధారిస్తారు. ఈ కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అని అంటారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, ఈ భౌతిక పరిమాణాలు గ్రామీణ ప్రాంతాలలో 2,400 తలసరి క్యాలరీలుగా, పట్టణ ప్రాంతాలలో 2,100 తలసరి క్యాలరీలుగా ఉండాల్సి ఉంది. అంతకంటే తక్కువ క్యాలరీలను వినియోగించే వారందరూ పేదరికం కిందికి వస్తారు.
ప్రశ్న 19.
సాపేక్షిక పేదరికం:
జవాబు.
సాపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి ప్రజల ఆదాయ పంపిణీని తులనాత్మకంగా అంచనా వేసి ఎగువ 5 నుంచి 10 శాతం ప్రజల జీవన స్థాయితో పోల్చి చూసి దిగువ 5 నుంచి 10 శాతం ప్రజలను సాపేక్షిక పేదవారిగా పరిగణిస్తారు. లేదా తక్కువ ఆదాయ స్థాయి గల ప్రజలను అధిక ఆదాయం పొందే వారితో పోల్చి, తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలను సాపేక్షికంగా పేదవారిగా పరిగణిస్తారు.
ప్రశ్న 20.
బహుపార్శ్వపు పేదరిక సూచీ.
జవాబు.
2010లో మానవాభివృద్ధి నివేదిక మానవ పేదరికపు సూచి స్థానంలో బహు పార్శ్యపు పేదరిక సూచీని ప్రవేశపెట్టారు. బహు పార్శ్వపు పేదరిక తలసరి లెక్క, బహు పార్శ్వపు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ప్రతి గృహపు వివక్షతల సగటు సంఖ్య తీవ్రతల లబ్ధమే. ఈ సూచి మూడు అంశాలను కల్గి ఉంటుంది.
అవి : 1. వైద్యం, విద్య, జీవన ప్రమాణాలు.