Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి Textbook Questions and Answers.
TS Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి భావనల గురించి వివరించండి. వాటి మధ్య తారతమ్యాలు ఏవి ?
జవాబు.
ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధితో పోల్చితే సముచితమైన భావన. ఒక దేశంలో జాతీయోత్పత్తి వల్ల సంభవించిన పెరుగుదలను ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. అంటే దేశంలో నాణ్యమైన వనరుల పెరుగుదలకు, దేశంలో వనరుల పరిమాణం పెరగడంతోపాటు లేదా సాంకేతికత వృద్ధి చెందడంతోపాటు లేదా దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంలోనూ వస్తువుల, సేవల ఉత్పత్తుల పెరుగుదలను సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి అనేది ఒక దేశంలోని స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదలను అంచనా వేస్తుంది.
మైఖేల్ పి. తొడారో ఉద్దేశం ప్రకారం “ఆర్థిక వృద్ధి అనేది ఒక స్థిరమైన ప్రక్రియ. ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్ధ్యం నియతకాలంలో పెరుగుతుంది. దీనివల్ల జాతీయ ఉత్పత్తిలో, ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది”. సైమన్ కంజ్నెట్స్ ప్రకారం “ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. ఇందులో వాస్తవ జాతీయ ఆదాయంలో మొత్తం జనాభాలో, వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంటుంది.”
ఆర్థిక వృద్ధి ప్రధానాంశాలు :
పైన పేర్కొన్న నిర్వచనాలను బట్టి ఆర్థిక వృద్ధికి చెందిన ప్రధానాంశాలు కింద ఇవ్వడమైంది.
- ఆర్థిక వృద్ధి అనేది జనాభా పెరుగుదల రేటు కంటే వాస్తవిక జాతీయ ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంటేనే సాధ్యమవుతుంది.
- ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి సామర్ధ్యంలో ఎక్కువ స్థాయి పెరుగుదల నమోదు అయినప్పుడు ఆర్థికవృద్ధి ఉంటుంది.
ఒకదేశ ప్రగతి, అది ధనిక లేదా పేద దేశమైన, ఆర్థిక వృద్ధికి సంబంధించిన నాలుగు కారకాల మీద ఆధారపడి ఉంటుంది.
ఎ) ఆర్థిక వ్యవస్థ పొదుపు రేటు,
బి) మూలధన ఉత్పత్తి నిష్పత్తి,
సి) శ్రామిక శక్తి వృద్ధి రేటు,
డి) సాంకేతిక విజ్ఞానంలో మార్పులు మరియు నవకల్పనలు.
ఆర్థిక వృద్ధి అనేది దేశ వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను, తలసరి ఉత్పత్తిలో పెరుగుదలను తెలియచేస్తుంది. ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వృద్ధి రేటుతో సమానంగా జనాభా వృద్ధి రేటు పెరిగినట్లయితే వాస్తవిక తలసరి ఆదాయంలో మార్పేమి ఉండదు. అంటే మొత్తం ఉత్పత్తి పెరిగినప్పటికీ ప్రజల జీవన ప్రయాణ స్థాయిలో పెరుగుదల సంభవించకపోవచ్చు.
ఆర్థికాభివృద్ధి భావన :
ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధి కంటే విస్తృతమైన భావన. ఒక దేశంలో వచ్చే సాంఘిక, ఆర్ధిక, వ్యవస్థాపరమైన, ప్రగతిశీలమైన మార్పులను ఆర్థికాభివృద్ధి సూచిస్తుంది. సాధారణంగా తలసరి ఆదాయం ఎక్కువగా ఉండడాన్ని ఆర్థికాభివృద్ధికి సూచికగా భావిస్తారు. ఆర్థిక వృద్ధితో ఆర్థికాభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది.
ఆర్థికాభివృద్ధి వల్ల దేశ సామాజిక, ఆర్థిక నిర్మితల పురోగతి ఉంటుంది. ఎక్కడైతే ప్రజల జీవన ప్రమాణ స్థాయితో మార్పు ఉంటుందో అక్కడ సరైన వృద్ధి సాధించబడుతుంది. ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికి అవసరం, ఆర్థికాభివృద్ధి నిర్ణయాత్మకమైంది.
మైఖేల్ పి. తొడారో ప్రకారం ఆర్థికాభివృద్ధి బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ. సామాజిక నిర్మాణంలో, ప్రజామోదమైన వైఖరులు, జాతీయ సంస్థలలో చెప్పుకోదగిన మార్పులు ఈ ప్రక్రియలో భాగం. అంతేగాకుండా త్వరితగతిన ఆదాయ పెరుగుదల అసమానతల తగ్గుదల, సాపేక్ష పేదరిక నిర్మూలన ప్రక్రియలు ఉంటాయి.
ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిల మధ్య తారతమ్యాలు :
కిండల్ బర్గర్ ప్రకారం ఆర్థికవృద్ధి అనేది అధిక ఉత్పత్తిని సూచించగా, ఆర్థికాభివృద్ధి అనేది అధిక ఉత్పత్తితోబాటు అందుకు దోహదపడే సాంకేతిక, సంస్థాపూర్వక మార్పులను సూచిస్తుంది.
ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిల మధ్య గల బేధాలు:
ఆర్థిక వృద్ధి | ఆర్థికాభివృద్ధి |
1. ఆర్థిక వృద్ధి వస్తుసేవల’ పెరుగుదలను అంటే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది. | 1. ఆర్థికాభివృద్ధి దేశంలో ఆర్థిక వృద్ధితో పాటుగా వ్యవస్థాపూర్వక, సంస్థాగత, సాంఘిక, ఆర్థిక మార్పులను సూచిస్తుంది. |
2. ఆర్థిక వృద్ధి అనేది ఏకోన్ముఖమైన ప్రక్రియ. | 2. ఆర్థికాభివృద్ధి అనేది బహుపార్శ్వ (ముఖ) ప్రక్రియ. |
3. ఆర్థిక వృద్ధి ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మకమైన మార్పులనే సూచిస్తుంది. | 3. ఆర్థికాభివృద్ధి పరిమాణాత్మక మార్పులతో పాటు, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. |
4. ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. | 4. ప్రభుత్వ జోక్యం లేకుంటే ఆర్థికాభివృద్ధిని సాధించలేం. ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దానిని పెంచి అభివృద్ధిని సాధించాలంటే ప్రభుత్వం చురుకైన పాత్రను పోషించాలి. |
5. ఆర్థిక వృద్ధి వేగంగా సంభవించేటప్పుడు అధిక సాంకేతిక మార్పులు ఉంటాయి. | 5. అధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావడం. |
6. సాంప్రదాయ అర్థశాస్త్ర నేపథ్యంలో ఆర్థిక వృద్ధి అనేది ఒక కీలక అంశం. ఈ దృక్పథం ప్రకారం వృద్ధిపై, పురోగతిపై మనం దృష్టి సారిస్తే దానంతట అదే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. దీనినే కింది స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు చేరే దృక్పథం (tricke down | approach) అంటారు. | 6. ఆధునిక అర్థశాస్త్ర సాహిత్యంలో ఆర్థికాభివృద్ధి అనేది ముఖ్యమైన అంశం. మనం పేదరికంపై దృష్టి సారిస్తే ఆర్థిక వృద్ధి దానంతటదే సాధ్యమవుతుంది. |
7. ఆర్థిక వృద్ధి పరిధి సంకుచితమైంది. ఎందుకంటే తలసరి ఆదాయ స్థాయిలోని మార్పుతో మాత్రమే ఆర్థిక వృద్ధికి సంబంధం ఉంది. | 7. ఆర్థికాభివృద్ధి పరిధి విస్తృతమైంది. తలసరి ఆదాయ పెరుగుదలనే గాకుండా ఆర్థిక వ్యవస్థలో ధనాత్మక మార్పులను, ప్రజల జీవన వ్యవహారాలలో మెరుగుదలను సూచిస్తుంది. |
8. ఆర్థిక వృద్ధి స్వల్ప కాలానికి సంబంధించిన అంశం. సాధారణంగా సంవత్సర ఆధారంగా దీనిని తెలుపుతారు. | 8. ఆర్థికాభివృద్ధి అనేది దీర్ఘ కాలానికి సంబంధిం చిన అంశం. 20 నుంచి 25 సంవత్సరాలలో సంస్థాగత మార్పులను తెలుపుతుంది. |
9. ఆర్థిక వృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలకు
సంబంధించింది. |
9. ఆర్థికాభివృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. |
10. సామాజిక మార్పు అనేది ఆర్థిక వృద్ధితో సాధ్యం కావచ్చు లేదా కాకపోవచ్చు. | 10. సామాజిక మార్పు అనేది ఆర్థికాభివృద్ధిలో తప్పనిసరి. అర్హతకు తగిన ఉద్యోగ అవకాశాలు, ఆహార ధాన్యాల లభ్యత, మంచి ఆరోగ్యం, విద్య, ప్రజల జీవన నైపుణ్యాల మార్పు అనేవి ఆర్థికాభివృద్ధి వల్ల సాధ్యమవుతాయి. |
11. ఆర్థిక వృద్ధిని ఆదాయ స్థాయిలతో అంచనా వేస్తారు. సాధారణంగా సంఖ్యాపరంగా సంవత్సరాల వారీగా ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేస్తారు. | 11. ఆర్థికాభివృద్ధిలో పేదరికం తగ్గింపు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల వంటి అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. |
ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను వివరించండి.
జవాబు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధి ముఖ్య లక్ష్యాలను క్రింద వివరించవచ్చు. అవి :
1. అధిక వృద్ధి రేటు (High Rate of Growth) :
స్థూల దేశీయోత్పత్తి సగటు వార్షిక వృద్ధి రేటు 1980 వరకు 3.73 శాతంగా ఉండేది. అదే కాలంలో దేశంలో సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు 2.5 శాతం ఉంది. దీనివల్ల తలసరి ఆదాయంలో వృద్ధి రేటు 1 శాతం దరిదాపులోనే ఉండేది. అయితే ఆరవ పంచవర్ష ప్రణాళికా కాలం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగిన స్థాయిలో మార్పు చెందడం మొదలైంది. ఆరవ, ఏడవ, ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికల్లో వృద్ధి రేటు వరుసగా 5.4 శాతం, 5.8 శాతం, 6.8 శాతంగా నమోదు అయింది.
1997లో ప్రారంభమయిన 9వ ప్రణాళిక వార్షిక వృద్ధి రేటు లక్ష్యాన్ని 7 శాతంగా నిర్దేశించుకోగా, సాధించిన స్థూల దేశీయోత్పత్తి సగటు వృద్ధి రేటు 5.35 శాతంగా ఉంది. తర్వాత సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థ 9 శాతం అధిక వృద్ధి రేటును సాధించింది. సాపేక్షికంగా దీనిని అధిక వృద్ధి రేటుగా మనం భావిస్తే, 21వ శతాబ్దపు మొదటి దశాబ్దంలో చైనా 10 శాతం వృద్ధి రేటును సాధించింది. 12వ ప్రణాళిక (2012-17) లో 7.9 శాతం సగటు వృద్ధి రేటు లక్ష్యంగా ఉంది, 2014-15 నుండి 2018-19 వరకు స్థూల దేశీయ ఉత్పత్తి 7.5 శాతం చొప్పున పెరిగింది.
2. ఆర్థిక స్వావలంబన (Economic Self-Reliance) :
ఆర్థిక స్వావలంబన ఒక ముఖ్య లక్ష్యంగా ఉంది. అయితే స్వావలంబనకు, స్వయం సమృద్ధి (self-sufficiency)కి మధ్య స్పష్టత అవసరం. స్వయంసమృద్ధి అంటే ఒకదేశం తనకు అవసరమైన అన్ని వస్తుసేవలను ఇతర దేశాలపై ఆధారపడకుండా తానే ఉత్పత్తి చేస్తుంది. ఈ దేశం దిగుమతులను చేసుకోదు.
అదే స్వావలంబన అంటే ఒక దేశం తనకు అవసరమైన వాటిని కొనడానికి సరిపడే మిగులును సృష్టించుకుంటుంది. అయితే ఒక దేశం తాను చేసుకొనే దిగుమతులకు చెల్లింపులు చేయడం ద్వారా స్వావలంబనను సాధించే ప్రయత్నం చేస్తుంది. స్వయం పోషకత్వం అంటే తన కాళ్లపై తాను నిలబడాలి. భారతదేశ విషయానికి వస్తే విదేశీ సహాయం (foreign aid) పైన సాధ్యమైనంత వరకు తక్కువ ఆధారపడాలి.
ప్రణాళికల ఆరంభంలో స్వదేశీ అవసరాల కోసం భారతదేశం అమెరికా నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే సత్వర పారిశ్రామిక, అభివృద్ధి కోసం విదేశాల నుంచి మూలధన వస్తువులైన భారీ యంత్రాలు, సాంకేతికతను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
మన దేశంలో మౌళిక వసతులైన రోడ్లు, రైల్వేలు, ఇంధనం అభివృద్ధి కోసం పెట్టుబడి రేటును పెంచడానికి విదేశీ సహాయం మీద ఆధారపడ్డాం. విదేశీ రంగం పై అధికంగా ఆధారపడడం ఆర్థిక వలస విధానానికి దారితీస్తుంది. ఈ విషయంలో 3వ ప్రణాళిక నుండి స్వయం పోషకత్వం సాధించే లక్ష్యాన్ని ప్రణాళికావేత్తలు పొందుపర్చారు.
3. సామాజిక న్యాయం (Social Justice) :
దేశంలోని ఆదాయ, సంపదలు సమాజంలోని వివిధ వర్గాల మధ్య సమానంగా పంపిణీ జరగాలన్నదే సామాజిక న్యాయం. భారతదేశంలో అధిక సంఖ్యలో ప్రజలు పేదలు కాగా, కొద్దిమంది మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. సమాజంలో పేద, బలహీన వర్గాల వారిపై శ్రద్ధ వహించి ఆర్థిక, సామాజిక న్యాయం అందించడం అనేది ఆర్థికాభివృద్ధి మరొక లక్ష్యం. పంచవర్ష ప్రణాళికలు భారత దేశంలో నాలుగు సామాజిక న్యాయ అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది.
అవి :
- దేశ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామిక సూత్రాలు అమలు చేయడం.
- సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
- ఆర్థిక శక్తి కేంద్రీకరణ ప్రక్రియను సమాప్తం చేసి శక్తి వికేంద్రీకరణను సాధించడం.
- వెనుకబడిన, అణగారిన వర్గాల వారి పరిస్థితులను మెరుగు పరచడానికి ప్రయత్నాలు.
4. ఆధునికీకరణ (Modernisation) :
ఆధునికీకరణ లక్ష్యం దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో మార్పులు తీసుకురావడం. ఇందులో భాగంగా ఉన్నత శాస్త్రీయ ఉత్పత్తి పద్ధతులను అనుసరించడం, పురాతన వెనుకబడిన పద్ధతులను మార్చడం, గ్రామీణ వ్యవస్థలో, సంస్థలలో మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ మార్పుల లక్ష్యం జాతీయ ఆదాయంలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా పెంచడం, ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, నానావిధమైన పరిశ్రమలను స్థాపించడం. అదేవిధంగా మన దేశ పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయి.
అంతేగాక ఆధునికీకరణ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అవసరమయ్యే బాంకింగ్, బ్యాంకేతర సేవల విస్తరణకు తోడ్పుడుతుంది. భూ సంస్కరణల అమలుతో పాటుగా వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరణ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అధునికీకరణ పెరగడానికి ముఖ్య కారణం సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం అద్భుతంగా వృద్ధి చెందడమే.
5. ఆర్థిక స్థిరత్వం (Economic Stability) :
దేశంలో ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణోద్యోగిత వృద్ధి ఉన్నప్పుడు ఆర్థిక స్థిరత్వం సాధ్యం అవుతుంది. రెండవ ప్రణాళిక తర్వాత మన దేశంలో ధరల పెరుగుదల చాలా కాలం వరకు కొనసాగింది. దీనిని అదుపులో పెట్టి ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ప్రణాళికావేత్తలు ప్రయత్నించారు. ఈ దిశలో పురోగతి సంతృప్తికరంగా ఉంది. అందువల్ల, సామాజిక న్యాయంతో కూడిన ద్రవ్యోల్బణ రహిత స్వయం పోషకత్వ వృద్ధిని సాధించడం ఆర్థికాభివృద్ధి విస్తృత లక్ష్యం అని చెప్పవచ్చు.
6. సుస్థిర అభివృద్ధి :
“సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల అవసరాల విషయంలో రాజీ లేకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం” అని బ్రుండ్రెండ్ రిపోర్ట్ (Brundtland Report) నిర్వచించింది. సుస్థిర అభివృద్ధి అంటే అభివృద్ధి నిర్విరామంగా కొనసాగడం (keep going).
భవిష్యత్తు తరాలు నష్టపోకుండా పర్యావరణ, మానవ, భౌతిక మూలధనం నిల్వలను పరిరక్షించుతూ, పెంపొందించుతూ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే సుస్థిర అభివృద్ధి లక్ష్యం. పర్యావరణ క్షీణత పైన ఉన్న ఆర్థికాభివృద్ధి నష్ట ప్రభావాలను ఆర్థిక, పర్యావరణ విధానాలను, పర్యావరణ పెట్టుబడులను వివేకంతో ఎంపిక చేసుకోవడం వల్ల తగ్గించవచ్చు. విధానాలను, పెట్టుబడులను ఎంపిక చేసేటప్పుడు అవిరోధ ఆర్థికాభివృద్ధితో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి.
7. సమ్మిళిత వృద్ధి (Inclusive Growth) :
ఆర్ధిక వృద్ధి గమనాన్ని (pace), తీరును సమ్మిళిత వృద్ధి తెలుపుతుంది. ఈ భావననే ప్రపంచ బాంకు ఇప్పుడు సుస్థిర సమ్మిళిత వృద్ధి అని అంటుంది. సమ్మిళిత వృద్ధిలో వృద్ధి ఫలాలు జనాభాలో దిగువ వర్గాలకు అందడంతో పాటుగా మానసికేతర అంశాలు ఉంటాయి. వృద్ధి ఫలాలు అన్ని వర్గాల వారికి సమాన స్థాయిలో పంపిణీ కానందున, ఆర్థికాభివృద్ధి వ్యూహంగా ఈ సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యత పెరిగింది.
ఆర్థిక వృద్ధి క్రమంలో ప్రతిఫలాలు పంపిణీ చేయకుండా గతంలో విస్మరించబడిన వర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడం సమ్మిళిత వృద్ధి లక్ష్యం. మొత్తం ఆదాయంలో అతి తక్కువ వాటా కల్గి ఉన్న విస్మరించబడిన అట్టడుగు వర్గాల ప్రజలను వృద్ధి ప్రక్రియలో చేర్చే ప్రక్రియగా సమ్మిళిత భావనను చూడాలి.
ప్రశ్న 3.
ఆర్థికాభివృద్ధి సూచికలను పరిశీలించండి.
జవాబు.
ఆర్థికాభివృద్ధి సూచికలు : ఆర్థికాభివృద్ధి సూచికలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి :
1. నిజ జాతీయాదాయం :
ఆర్థికాభివృద్ధిని కొలిచే పద్ధతులలో ఒకటి దీర్ఘ కాలంలో ఆర్థిక వ్యవస్థలో నిజ జాతీయాదాయంలోని పెరుగుదలను పరిగణించడం. నిజ జాతీయాదాయం ఎక్కువగా ఉంటే ఆర్థికాభివృద్ధి స్థాయి ఎక్కువగా ఉన్నట్లు, అట్లాగే నిజ జాతీయాదాయం తక్కువగా ఉంటే ఆర్థికాభివృద్ధి స్థాయి తక్కువగా ఉన్నట్లు. కింది కారణాల వల్ల ఈ సూచిక సంతృప్తికరమైంది కాదు :
- నిజ జాతీయాదాయాన్ని కొలిచేటప్పుడు ధరల మార్పులను పరిగణనలోకి తీసుకోరాదు. అయితే ధరలలో తేడాలు తప్పనిసరిగా ఉంటాయి. జాతీయాదాయంలోని స్వల్పకాలిక పెరుగుదల ఆర్థికాభివృద్ధిగా పరిగణింపబడదు.
- జనాభా వృద్ధిలోని మార్పులను పరిగణనలోకి తీసుకోలేదు. నిజ జాతీయాదాయం పెరిగినా, జనాభా పెరుగుదల వేగంగా ఉంటే ఆర్థికాభివృద్ధి ఉండకపోవడమే కాక అది తగ్గుతుంది.
- సమాజంలోని సామాజిక వ్యయాన్ని ఇది తెలియచేయదు.
- ఆర్థిక వ్యవస్థలోని ఆదాయ పంపిణీని గూర్చి ఏమీ ఇది తెల్పదు.
- స్థూల జాతీయోత్పత్తిని కొలవడంలో భావనల పరంగా కొన్ని సమస్యలున్నాయి.
2. తలసరి స్థూల జాతీయోత్పత్తి :
ఏ దేశంలోనైనా తలసరి నిజ ఆదాయంలోని పెరుగుదల ఆ దేశంలోని ఆర్థిక వృద్ధి రేటులోని పెరుగుదలను సూచిస్తుందే తప్ప ఆర్థికాభివృద్ధిని మాత్రం కాదు. ఆర్థికాభివృద్ధి అంటే తలసరి నిజ ఆదాయంలోని పెరుగుదలతో పాటుగా అనేక రంగాలలో మార్పులు కూడా ఉంటాయి. ఈ పద్ధతిలో కొన్ని పరిమితులు ఉన్నాయి.
అవి :
- నిజ తలసరి ఆదాయం పెరిగినా, ఇది ప్రజల నిజ జీవన ప్రమాణాల స్థాయిని పెంపొందించకపోవచ్చు.
- తలసరి నిజ స్థూల జాతీయోత్పత్తి పెరిగినా, ఆదాయ పంపిణీలో అధిక అసమానత్వం ఉంటే ప్రజల పేదవారిగానే ఉంటారు.
- తలసరి నిజ స్థూల జాతీయోత్పత్తికి చెందిన అంతర్జాతీయ పోలికలు నిర్ధిష్టంగా ఉండవు. ఎందుకంటే నామమాత్ర మారకం రేట్లు (nominal exchange rates) వివిధ కరెన్సీల సాపేక్ష కొనుగోలు శక్తిని ప్రతిబింబించవు.
- కనీస అవసరాలకు చెందిన సమస్యలను పరిగణించడంలో తలసరి నిజ స్థూల జాతీయోత్పత్తి విఫలమయింది. కనీస అవసరాలను అందించితే జీవన ప్రమాణాలలో ఏర్పడే పెరుగుదలను తలసరి స్థూల జాతీయోత్పత్తిలోని పెరుగుదలతో కొలవలేము.
3. సంక్షేమం :
ఆర్థికాభివృద్ధికి మరొక సూచిక ఆర్థిక శ్రేయస్సు. వ్యక్తుల వస్తు సేవల వినియోగంలోని పెరుగుదలనే ఆర్థికాభివృద్ధి ప్రక్రియగా పరిగణిస్తాం. ఈ సూచిక పై కూడా పరిమితులు ఉన్నాయి. కొన్ని పరిమితులు కింద ఇవ్వబడ్డాయి :
- వ్యక్తుల సంక్షేమ సూచికలను తయారు చేసేటప్పుడు వివిధ వ్యక్తుల వినియోగానికి ఒకే విధంగా భారితాలను ఇవ్వడం సరికాదు.
- మొత్తం ఉత్పత్తి సమ్మేళనం (composition), మదింపు (valuation) విషయంలో జాగ్రత్తను వహించడం అవసరం.
- సంక్షేమం దృష్ట్యా, కేవలం ఏమి ఉత్పత్తి చేయబడిందో మాత్రమే కాక, అది ఏ విధంగా ఉత్పత్తి చేయబడిందో చూడాలి. నిజ జాతీయోత్పత్తి పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ నిజ వ్యయాలు (real costs), సామాజిక వ్యయాలను (social costs) కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
- సమత్వ(equitable) మరియు సమర్థనీయ (justifiable) జాతీయ ఆదాయ పంపిణీ లేనంతవరకు ఆర్థిక శ్రేయస్సు పెరిగినా ఆర్థికాభివృద్ధికి దారి తీయదు.
4. సామాజిక సూచికలు లేదా ప్రాథమిక అవసరాలు :
కొంతమంది ఆర్థికవేత్తలు ఆర్థికాభివృద్ధిని సామాజిక సూచికలు ద్వారా కొలిచే ప్రయత్నం చేసారు. అభివృద్ధికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను సామాజిక సూచికలుగా పరిగణిస్తాం. పేదవాళ్ళ ప్రాథమిక మానవ అవసరాలను తీర్చడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడంలో ప్రాథమిక అవసరాల దృష్టి ఉంటుంది.
స్థూల జాతీయోత్పత్తి, తలసరి స్థూల జాతీయోత్పత్తి వ్యూహానికి బదులుగా ఆరోగ్యం, విద్య, ఆహారం, నీరు, పారిశుద్ధ్యం, గృహ వసతి మొదలైన ప్రాథమిక అవసరాలను ప్రత్యక్షంగా అందించడం వల్ల తక్కువ ద్రవ్య వనరులతోనే పేదరికాన్ని స్వల్ప కాలంలోనే ప్రభావితం చేయవచ్చు. ప్రాథమిక అవసరాలను అందించడం వల్ల విద్యావంతులు మరియు ఆరోగ్యవంతులైన ప్రజల రూపంలో మానవాభివృద్ధి ద్వారా ప్రజల ఉత్పాదక శక్తి, ఆదాయం పెరుగుతాయి.
5. భౌతిక జీవన ప్రమాణ సూచిక (Physical Quality of Life Index – PQLI) :
దీనిని 1979లో యమ్.డి. మోరిస్ రూపొందించాడు. 23 దేశాలకు సంబంధించి ఇతడు ఉమ్మడి భౌతిక జీవన ప్రమాణ సూచికను తులనాత్మక అధ్యాయానికి రూపొందించాడు. ఆర్థికాభివృద్ధి గణనలో ఉపయోగించే ఆదాయేతర సూచిక భౌతిక జీవన ప్రమాణ సూచిక. ఎందుకంటే భౌతిక జీవన ప్రమాణాన్ని సూచికగా ఉపయోగించింది. ఈ పద్ధతి ఆర్థికాభివృద్ధిని కొలవడానికి మూడు ప్రమాణాలను ఆధారంగా తీసుకుంటుంది.
అవి :
- ఆయుః ప్రమాణం,
- శిశు మరణాల రేటు,
- ప్రాథమిక అక్షరాస్యత.
ప్రజలు అత్యంత ప్రాథమిక అవసరాలను పొందడంలో పనితీరును ఈ సూచిక కొలుస్తుంది. ఆరోగ్యం, విద్య, తాగు నీరు, ఆహారం, పారిశుద్ధ్యం లాంటి ప్రాథమిక అవసరాలకు ఈ సూచిక ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది.
భౌతిక జీవన ప్రమాణ సూచికలో కొన్ని పరిమితులున్నాయి. అవి :
- ప్రాథమిక అవసరాలకు సంబంధించి భౌతిక జీవన ప్రమాణ సూచిక పరిమితమైన కొలమానం అని మోరిస్ అంగీకరించాడు.
- ఆర్థిక, సామాజిక వ్యవస్థ నిర్మితిలో వస్తున్న మార్పులను ఇది వివరించదు.
- ఇది మొత్తం శ్రేయస్సును కొలవదు.
- భౌతిక జీవన ప్రమాణ సూచికలోని మూడు అంశాలకు సమాన భారితాలను ఇవ్వడం జరిగింది.
6. మానవ అభివృద్ధి సూచిక (Human Development Index) :
మానవ అభివృద్ధి సూచికను మహబూబ్-ఉల్- హక్ అభివృద్ధి చేయగా, 1990 సంవత్సరంలో ఐక్య రాజ్య సమితి అభివృద్ధి పథకం తయారుచేసిన తన మొదటి మానవ అభివృద్ధి రిపోర్ట్లో మానవ అభివృద్ధి సూచికను చేర్చింది. ఒక దేశ సామాజిక, ఆర్థిక కోణాలలో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సాధనం మానవ అభివృద్ధి సూచిక. ఈ సూచికను నిర్మించడానికి కింది సూచికలు కావాలి :
- పుట్టుక సమయంలో ఆయుఃప్రమాణం.
- విద్య – వయోజన అక్షరాస్యత, విద్యా సంస్థలలో సమ్మిళిత స్థూల నమోదు నిష్పత్తి.
- డాలర్ల రూపంలో కొనుగోలు శక్తి సమానత ఆధారంగా తలసరి నిజ స్థూల దేశీయోత్పత్తి.
7. లింగ సంబంధ అభివృద్ధి సూచిక (Gender related Development Index – GDI) :
1995 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా రెండు లింగ సూచికలను ప్రవేశ పెట్టింది. అవి : లింగ సంబంధిత అభివృద్ధి సూచిక, లింగ సాధికార కొలమానం. మానవ అభివృద్ధి సూచిక మాదిరిగానే ఇది కూడా జనాభా సగటు విజయాలను కొలిచే ఒక ఉమ్మడి సూచిక. ఇది మానవ అభివృద్ధిలోని మూడు ప్రాథమిక అంశాల విజయాల స్థాయిలను లింగ అసమానతలతో సర్దుబాటు చేస్తారు. మానవ అభివృద్ధి సూచికలోని అంశాలనే ఇది పరిగణనలోనికి తీసుకుంటుంది.
8. సామాజిక ప్రగతి సూచిక (Social Progress Index – SPI) :
ఒక దేశం తమ పౌరుల సామాజిక, పర్యావరణ అవసరాలను తీర్చడానికి అందించే సేవలను సామాజిక ప్రగతి సూచిక కొలుస్తుంది. కనీస మానవ అవసరాలు, సంక్షేమానికి వేసే పునాదులు, వారి అభివృద్ధికి ఉన్న అవకాశం మొదలైనటువంటి అంశాలకు చెందిన 54 సూచికలను తీసుకుని వివిధ దేశాల సాపేక్ష పనితీరును తెలపడం జరుగుతుంది.
ఈ సూచికకు అమర్త్య సేన్, డగ్లస్ నార్త్, జోసెఫ్ స్టిగ్లిట్ల రచనలు ఆధారం. సామాజిక ప్రగతి సూచిక ఆర్థిక కారకాల స్థానంలో సామాజిక, పర్యావరణ పరిరక్షణ సాధన ద్వారా సమాజ సంక్షేమాన్ని అంచనా వేస్తుంది. సంక్షేమం (ఆరోగ్యం, ఆవాసం, పరిశుభ్రత), సమానత్వం, సమ్మిళిత వృద్ధి, సుస్థిరత, వ్యక్తిగత స్వతంత్రం, రక్షణలు సామాజిక, పర్యావరణ కారకాలలోని భాగాలు.
9. బహు పార్శ్వ పేదరిక సూచిక (Multi-Dimensional Poverty Index – MPI) :
అత్యంత అణగారిన వర్గాలు కోల్పోయిన అంశాలను విశదీకరించడానికి బహుపార్శ్వ పేదరిక సూచికను 2010లో ప్రవేశపెట్టారు. అంటే ఒకే సమయంలో బహు కారకాలను కోల్పోయిన కుటుంబాల అధ్యయనానికి ఈ సూచిక అవసరం. భారిత సూచికల (weighted indicators)లో ఎవరైతే కనీసం 33 శాతం కోల్పోతారో వారిని బహుపార్శ్వ పేదలుగా భావిస్తారు. సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాల (Millennium development goals) తో బహుముఖ కోణ పేదరిక సూచిక దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. ఈ సూచికలో గల 10 అంశాలను కింద ఇవ్వనైనది.
- కొన్ని ఆస్తులు కలిగి ఉండటం
- పోషకాహారం
- శిశు మరణాల రేటు
- త్రాగు నీరు అందుబాటు
- పారిశుద్ధ్యం కల్పించడం
- భద్రతాపరమైన గృహ సౌకర్యం కల్పించడం
- విద్యుత్ సౌకర్యం కల్పించడం
- మెరుగైన వంట నూనెను అందుబాటులో ఉంచడం
- సంవత్సరాల చదువు (years of schooling)
- పాఠశాలలో బాలల నమోదు
10. ఆర్థిక వృద్ధి :
ఆర్థిక వృద్ధి వార్షిక స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, తలసరి స్థూల దేశీయోత్పత్తి లేదా తలసరి స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదలను కొలుస్తుంది.
11. స్థూల జాతీయ సంతోష సూచిక :
భూటాన్ లాంటి దేశాలు వాటి అభివృద్ధిని స్థూల జాతీయ సంతోష సూచికతో కొలుస్తున్నాయి. అందుకే అభివృద్ధిని కొలిచే ప్రస్తుత పద్ధతిలో మార్పును తీసుకురావల్సిన అవసరం ఉంది.
ప్రశ్న 4.
ఆర్థికాభివృద్ధిని నిరోధించే కారకాలను వివరించండి.
జవాబు.
అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉండే కారకాలను కింది విధంగా విభజించవచ్చు. అవి :
- సహజ వనరుల కొరత
- అల్ప మానవ మూలధన వృద్ధి
- తక్కువ స్థాయి అవస్థాపనా సదుపాయాలు
- పేదరిక విషవలయం.
సహజ వనరుల కొరత :
సారవంతమైన నేల వంటి వనరులు అంత్య దశలో ఉంటే ఆదేశ ఆర్థిక వృద్ధి పరిమితంగా ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని అన్ని రకాల వనరులు కలిసి పెంచుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక జనాభా ఉంటుంది.
ఎ) వనరులను వినియోగించలేకపోవడం:
చాలా పేద దేశాలలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కాని వాటిని చాలా దేశాలు వినియోగించుకోవడం లేదు. దీనికి గల కారణం ఆ దేశాలలో పరిశోధన, అభివృద్ధి తక్కువగా ఉండడం, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండడం, మూలధన కల్పన తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల సహజ వనరులును సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించలేకపోతున్నాయి.
బి) వనరుల నిర్వహణలో అసమర్థత :
వెనుకబడిన దేశాలు ఉత్పాదక సామర్థ్యం మరియు ఆర్థిక వనరుల కేటాయింపు సామర్థ్యాన్ని కలిగి ఉండవు. ఈ దేశాలలో రాజకీయ కారణాలతో ఉత్పాదక సామర్థ్యాన్ని సరియైన స్థాయిలో వినియోగించుకోవడం లేదు.
అల్ప మానవ మూలధన వృద్ధి రేటు :
అభివృద్ధి చెందుతున్న దేశాల బడ్జెట్ లో విద్యకి, ఆరోగ్యానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. అవి :
- అభివృద్ధి చెందిన దేశాలు దిగుమతి చేసుకొనే వ్యవసాయ ఉత్పత్తులపై విధించే ఆంక్షల వల్ల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం
- జాతీయాదాయంలో ఎక్కువ మొత్తం ప్రపంచ బాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్పులు తీర్చడానికి వినియోగించడం
- రుణాల రీషెడ్యూలుకు సంబంధించింది. ఈ దేశాలలోని ఆర్థిక సంస్థలు మిత వ్యయ చర్యలను ప్రకటించడం జరుగుతుంది.
విద్యకు తక్కువ నిధులు కేటాయించడం వల్ల చాలా మందికి చదవటం రాకపోవడం, రాయడం తెలియకపోవడం, కనీస గణిత అవగాహన లేకపోవడం, ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వాడలేకపోవడం జరుగుతుంది. మానవ మూలధనం నిరుపయోగంగా ఉంటుంది.
అవస్థాపనా సదుపాయాల కొరత :
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉండే అప్పులు, తత్సంబంధ మిత వ్యయ చర్యల కారణంగా ఈ దేశాల్లో అవస్థాపనా సౌకర్యాల కల్పన అనేది క్లిష్టతరంగా మారింది. రవాణా టెలికమ్యూనికేషన్ల అభివృద్ధి అనేవి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే రెండు కీలక రంగాలు. వీటితో పాటుగా రోడ్లు, బ్రిడ్జిలు, ఓడరేవులు, రైల్వేలు అభివృద్ధి వస్తువులను సమయానుకూలంగా చేరవేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కాని ఈ సౌకర్యాల కొరత వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది.
పేదరిక విషవలయం (Vicious Circle of Poverty) :
1950 సంవత్సరం నుంచి ప్రధానంగా వెనుకబడిన దేశాలు పేదరికపు విషవలయాల్లో చిక్కుకొని వేగవంతమైన అభివృద్ధిని సాధించలేక పోతున్నాయి. పేదరికమనేది మానసిక ఒత్తిడితో పాటు నైతికంగా కూడా మనిషిని దిగజారుస్తుంది. దీని ఫలితంగా మూలధన కొరతను ఎదుర్కోవడం వల్ల తక్కువ ఉత్పాదకత కల్పించబడుతుంది. తక్కువ ఉత్పాదకతకు కారణం తక్కువ ఆదాయం. పేదరిక విషవలయాల ఛాయా చిత్రాన్ని ప్రక్క పటంలో చూపించవచ్చు.
5. అల్ప మూలధన సమీకరణ రేటు :
అల్పాభివృద్ధి చెందిన దేశాలలోని ప్రజలు బీదవాళ్ళేగాక, ఎక్కువ మంది నిరక్షరాస్యులు, నైపుణ్యం లేనివారు, పురాతన యంత్రాలను మరియు ఉత్పత్తి పద్ధతులను వాడుతుంటారు. ప్రజల ఉపాంత ఉత్పాదక శక్తి బాగా తక్కువ కాబట్టి అల్ప నిజాదాయం, అల్ప పొదుపు, అల్ప పెట్టుబడి, అల్ప మూలధన సమీకరణ రేటు ఉంటాయి. కొద్ది స్థాయిలో ప్రజలు పొదుపు చేయగలిగినా దానిని కరెన్సీ రూపంలోనే దాచిపెట్టుకోవడం గాని, బంగారం మొదలగు వాటిని కొనుగోలు చేయడానికి గాని వాడడం జరుగుతుంది.
6. సామాజిక, సాంస్కృతిక అవరోధాలు :
సామాజిక సంస్థలు, వాటి దృక్పథాలు, సంప్రదాయ నమ్మకాలు మరియు విలువలు, దృఢమైన వృత్తుల విభజన, పొదుపు చేయడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి ప్రజల ఉద్దేశాలు, సామాజిక విధులకు చేసే వ్యయం, బందుప్రీతి, అసమర్ధ మరియు చెడు పరిపాలన, లంచగొండితనము, విద్య విషయంలో సామాజిక దృక్పథం, శారీరక శ్రమ విషయంలో ప్రతికూలాభిప్రాయం, ప్రాచీన మతాలు, తీరికకు అధిక విలువనివ్వడం, ఖర్మ సిద్ధాంతాన్ని గ్రుడ్డిగా పాటించడం మొదలగునవి ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా లేవు.
7. వ్యవసాయ అవరోధం :
అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధికం ప్రధానంగా వ్యవసాయాధార దేశాలు. వీటి స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎక్కువ వాటా వ్యవసాయ ఉత్పత్తిదే. అట్లాగే ఎగుమతుల విలువలో అధికం వ్యవసాయ వస్తువుల నుంచే వస్తుంది. వ్యవసాయ రంగం అధిక ఉద్యోగితను కూడా సృష్టిస్తుంది. అందుబాటులో ఉన్న సాంకేతికతను రైతులు ఉపయోగించడం, ఉత్పత్తికి, పెట్టుబడికి ప్రోత్సాహకాలు, ఉత్పాదకాల లభ్యత మరియు వాటి ధరలు, నీటి పారుదల సౌకర్యాల ఏర్పాటు, వాతావరణం, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మొదలగు అంశాలకు సంబంధించి అవరోధాలున్నాయి.
8. విదేశీ మారక ద్రవ్య అవరోధం :
అల్పాభివృద్ధి చెందిన దేశాల ఎగుమతులు బాగా పెరిగినా, ఇతర రంగాలను ఉపేక్షించి ఎగుమతుల రంగాన్ని అభివృద్ధి చేసినందువల్ల, ఇది అభివృద్ధికి ఎక్కువగా తోడ్పడలేదు. ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడితే మన వస్తువులకున్న డిమాండ్, వాటికున్న ధరలపై అంతర్జాతీయ ఒడుదుడుకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ప్రశ్న 5.
ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే కారకాలను వివరించండి.
జవాబు.
ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ప్రధానంగా రెండు రకాలు కారకాలు ప్రభావితం చేస్తాయి. అవి :
- ఆర్థికపరమైన కారకాలు.
- ఆర్థికేతర కారకాలు.
ఆర్థికపరమైన కారకాలు :
ఆర్థికాభివృద్ధిలో ఆర్థికపరమైన కారకాల పాత్ర నిర్ణయాత్మకమైంది. నిర్ణీత కాలంలో ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందా? లేదా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందా? అనే వాటిని ఆ దేశంలో ఉన్న మూలధన నిల్వ మరియు దాని విలువ ప్రధానంగా నిర్ణయిస్తాయి. జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు, విదేశీ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ స్వభావం మొదలైన కారకాలు కూడా ఆర్థికాభివృద్ధిలో ప్రధానమైనవే.
1. మూలధన కల్పన :
అర్థశాస్త్ర విశ్లేషణలో ఉత్పత్తి స్థాయిని పెంచడంలో మూలధన కల్పన పాత్ర కీలకమైంది. విశ్వ వ్యాప్తంగా వివిధ దేశాలు వచ్చిన ఆదాయంలో పొదుపుల ద్వారా గాని విదేశీ పెట్టుబడుల ద్వారా గానీ వృద్ధిని సాధించడం జరిగింది.
2. సహజ వనరులు :
ఒక దేశ ఆర్థికాభివృద్ధిని నిర్ధారించు ప్రధాన కారకం ఆ దేశంలో లభ్యమయ్యే సహజ వనరులు. భూమి, భూసారం, అటవీ సంపద, మంచి నదీ వ్యవస్థ, చమురు వనరులు, మంచి వాతావరణం, జీవావరణ వ్యవస్థ మొదలైనవి సహజ వనరులలోనికి వస్తాయి. ఆర్థికపరమైన వృద్ధికి విస్తారమైన వనరుల లభ్యత అనేది ఆవశ్యకమైంది.
3. వ్యవసాయ రంగం :
ఆర్థికాభివృద్దిలో భూమి యాజమాన్యంతో పాటుగా వ్యవసాయం చేసే పద్ధతి అనేది ముఖ్యమైన పాత్రని నిర్వహిస్తుంది. భూసంస్కరణలు, వ్యవసాయంలో ఆధునికీకరణ, సాంకేతికపరమైన మార్పులు ఆర్థిక రంగంలో వేగవంతమైన వ్యవసాయ వృద్ధికి దోహదపడతాయి.
4. మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులు (Marketable surplus) :
ఉత్పాదకతను పెంచే క్రమంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం అనేది ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన ప్రక్రియ. కానీ మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులును పెంచడం’ అనేది దానికంటే ముఖ్యమైనది. గ్రామీణ జనాభా తమ మనుగడకు కావాల్సిన ఉత్పత్తి కంటే ఎక్కువగా లభించగల వ్యవసాయోత్పత్తిని మార్కెట్లో విక్రయంకాగల వ్యవసాయ మిగులు అంటారు. కాని వ్యవసాయ రంగ పురోగతిని మార్కెట్లో విక్రయం చేసిన వ్యవసాయ మిగులు ద్వారా సూచిస్తారు.
5. పారిశ్రామిక నిర్మాణం :
భారీ, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు వాటి సాపేక్షిక ప్రాధాన్యతను వాటిలో ఉపయోగించే సాంకేతిక స్థాయిని కోరుకుంటాయి. అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చెందుతున్న దేశాలలో వినియోగించడంవల్ల ఆధునికీకరణ ఏర్పడి వ్యవస్థ నిర్మితిలో మార్పు వస్తుంది. ఫలితంగా అధిక ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది.
6. వ్యవస్థాపరమైన మార్పులు :
సంస్థలలో, సాంఘిక దృక్పథాలలో, ప్రేరేపణలలో విప్లవాత్మక మార్పుల ద్వారా సంప్రదాయ వ్యవసాయక సమాజం నుంచి ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు మారడాన్ని వ్యవస్థాపరమైన మార్పులంటాం. ఈ మార్పుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడం, శ్రామిక ఉత్పాదకత పెరగడం, మూలధన రాశి పెరగడం, నూతన వనరులను ఉపయోగించడం, సాంకేతిక మెరుగుదల జరుగుతాయి.
7. వ్యవస్థాపన :
వృద్ధి ప్రక్రియకు సంబంధించి ఇదొక ముఖ్యమైన అంశం. ఆర్థిక కార్యకలాపాలలో ఉత్పత్తి కారకాలను అభిలషణీయంగా ఉపయోగించడానికి సంబంధించినదే వ్యవస్థాపన. ఉద్యమదారుడు వ్యవస్థాపకుడు నిర్వహించే విధులను నిర్వర్తిస్తూ, వ్యాపారంలోని నష్టభయాన్ని, అనిశ్చితలను ఎదుర్కొంటున్నాడు. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యమిత్వ చర్యలు లేవు. అందువల్ల వెనుకబడిన దేశాలు ఉద్యమిత్వాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాలి. దీనికొరకు అవసరమైన సామాజిక, ఆర్థిక, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయడం అవసరం.
8. సాంకేతిక ప్రగతి :
నూతన పరిశోధన లేదా నవకల్పనల మూలంగా ఉత్పత్తి పద్ధతులలో మార్పులు రావడమే సాంకేతిక మార్పులు. సాంకేతిక మార్పుల వల్ల శ్రమ, మూలధనం, ఇతర ఉత్పత్తి కారకాల ఉత్పాదకత పెరుగుతుంది. ఘంపీటర్, కుజ్నెట్ ఆర్థిక వృద్ధిలో నవకల్పనను అతి ముఖ్యమైన సాంకేతిక కారకంగా పరిగణించారు. పరిశోధన మరియు అభివృద్ధి పైన జాతీయ ఆదాయంలో ఎక్కువ శాతాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.
9. శ్రమ విభజన :
ప్రత్యేకీకరణ, శ్రమ విభజన వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. అంతేకాక పెద్ద తరహా ఉత్పత్తి ఆదాలు ఏర్పడి, ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుదలకు తోడ్పడతాయి. ఆడమ్ స్మిత్ ఆర్థికాభివృద్ధిలో శ్రమ విభజనకు అధిక ప్రాముఖ్యత నిచ్చాడు. శ్రమ విభజన మార్కెటు పరిమాణం పైన ఆధారపడుతుంది. పెద్ద తరహా ఉత్పత్తి ఉన్నప్పుడు ప్రత్యేకీకరణ, శ్రమ విభజన అధికమవుతాయి. ఆధునిక రవాణా, కమ్యూనికేషన్స్ సాధనాలను ఏర్పాటు చేయడం వల్ల మార్కెటును విస్తృతం చేసి తద్వారా అల్పాభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.
10. విదేశీ వర్తకం :
సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మూలధన పరికరాలలోనూ, పారిశ్రామిక ఉత్పత్తులలోనూ స్వావలంబనను సాధించే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులకు బదులుగా పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు ఉండే స్థాయికి పరిశ్రమల అభివృద్ధిని బాగా పెంచాలి. భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలలో స్థూల ఆర్థిక అంతర్ సంబంధాలకు ప్రాధాన్యత ఉంది. ఈ దేశ సమస్యలకు పరిష్కారం కేవలం విదేశీ వర్తక రంగం ద్వారా ఉండదు.
11. ఆర్థిక వ్యవస్థ :
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, ఆ దేశ చారిత్రక ఏర్పాటు అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఒక దేశ ఆర్థిక వృద్ధిలో స్వేచ్ఛా వాణిజ్య విధానం అమలులో ఉన్న కాలంలో ఏ విధమైన ఆటంకాలు ఏర్పడ లేదు. అయితే మారిన నేటి కాల పరిస్థితులలో ఇదే అభివృద్ధి వ్యూహంతో ఒక దేశం వృద్ధి చెందటం కష్టతరం.
b) ఆర్థికేతర కారకాలు :
అభివృద్ధిలో ఆర్థికేతర కారకాలు కూడా ఆర్థిక కారకాలతో సమ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయనేది స్పష్టం. ఆర్థికాభివృద్ధి ప్రక్రియను ఇవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
1. మానవ వనరులు :
ఆర్థికాభివృద్ధిలో మానవ వనరులు అనేవి ముఖ్యమైన కారకాలు. ఉత్పత్తి కోసం మానవులు శ్రామికులుగా పని చేయడం జరుగుతుంది. ఒక దేశ శ్రామికులలో సామర్థ్యం, నైపుణ్యం అధికంగా ఉంటే ఆ దేశం యొక్క వృద్ధి అధికంగా ఉంటుంది. నిరక్షరాస్యుల, అవివేకుల, నైపుణ్యం లేనివారి, వ్యాధిగ్రస్తుల, మూఢ విశ్వాసం గలవారి ఉత్పాదకత సహజంగానే తక్కువ.
ఒక దేశ అభివృద్ధికి వీరి తోడ్పాటు అధికంగా ఉండదు. మానవ వనరులు నిరుపయోగంగా ఉన్నా లేదా శ్రామిక నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నా ఇది ఆ దేశానికి భారంగా ఉంటుంది. శ్రామిక శక్తి సామర్థ్యం లేదా ఉత్పాదకత ఆరోగ్యం, విద్య, సామాజిక సేవలపైన ఆధారపడుతుంది. మానవుడు ఉత్పత్తి ప్రక్రియలో నూతన మార్గాలు అవలంబించడం జరిగి దానివల్ల ఆ దేశ ఉత్పాదకత పెరుగుతుంది.
ఉద్యమదారులు ప్రవేశపెట్టే నవకల్పనలను ఘంపీటర్ అనే ఆర్ధిక శాస్త్రవేత్త బాగా మెచ్చుకొని, పెట్టుబడి దారీ విధాన అభివృద్ధికి ఈ ఉద్యమదారులు ఎంతో దోహదం చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ నైపుణ్యాన్ని సంతరించుకున్నందువల్ల, దీనిని ఇంకా మెరుగుపర్చడానికి పరిశోధన మరియు అభివృద్ధికి ఇంకా ఎక్కువ శ్రద్ధ అవసరం. ఉదాహరణకు, ఆధునిక కాలంలో ఇంటర్నెట్ (అంతర్జాలం) అనే గొప్ప నవకల్పన సమాచార, సాంకేతిక రంగంలో పెను మార్పులకు దారి తీసింది.
2. రాజకీయ, పరిపాలన సంబంధ కారకాలు :
ఆధునిక ఆర్థిక వృద్ధికి రాజకీయ, పరిపాలన సంబంధ కారకాలు కూడా సహాయపడ్డాయి. బ్రిటన్, జర్మనీ, యుఎస్, జపాన్, ఫ్రాన్స్ దేశాలలోని ఆర్థిక వృద్ధికి ముఖ్య కారణాలు వాటి రాజకీయ పటిష్టమైన పాలనలే. ఇటలీలో రాజకీయ అస్థిరత వల్ల, అవినీతి, బలహీన పరిపాలన వల్ల పై దేశాల స్థాయిలో వృద్ధి రాలేదు.
అభివృద్ధి చెందిన దేశాలలో శాంతి, రక్షణ స్థిరత్వం అనేవి ఉద్యమిత్వ అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా, సరియైన ద్రవ్య, కోశ విధానాలను అమలు చేసే అవకాశాన్ని ఏర్పర్చాయి. వెనుకబడిన దేశాలలో బలహీన పరిపాలన, రాజకీయ వ్యవస్థ ఆర్థికాభివృద్ధికి పెద్ద ఆటంకం. ఆర్థికాభివృద్ధిని అవినీతి లేని, పటిష్టమైన పరిపాలన, స్థిర రాజకీయ పరిస్థితులు ఉత్తేజపర్చుతాయి.
3. సామాజిక కారకాలు :
సామాజిక దృక్పథాలు, విలువలు, సంస్థలు కూడా ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. వాస్తవ మానవ ప్రవర్తనకు కారణంగా ఉండే నమ్మకాలు, విలువలనే దృక్పథాలు అంటాం. ప్రత్యేక లక్ష్యాలకు సంబంధించి మానవ ప్రవర్తనా ఉద్దేశాలను విలువలు తెలుపుతాయి. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో శీఘ్ర ఆర్థికాభివృద్ధికి విలువల ఆధునీకీకరణను అనుసరించాలని గున్నార్ మిర్థాల్ అన్నాడు.
అవి ఏవంటే ఆలోచనలో, చర్యలలో హేతుబద్ధత ఉండటం. అంటే ఉత్పాదకతను పెంచడానికి, జీవన స్థాయిలను పెంచడానికి, సామాజికార్థిక సమానత్వాన్ని సాధించడానికి ఉద్దేశపూర్వకంగానే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం, ఆధునిక సాంకేతికతను వాడడం.
విలువల ఆధునీకరణ వల్ల దృక్పథాలలో మార్పులు ఏర్పడి ఇవి ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి. అయితే ఉద్యమిత్వం లేనట్లయితే ఈ రంగాల అభివృద్ధి సాధ్యం కాదు. గున్నార్ మిర్డాల్ ప్రకారం అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యమిత్వం లేకపోవడానికి కారణం ఉద్యమిత్వానికి సంబంధించి సరియైన దృక్పథం కలిగిన వ్యక్తులు కొరతగా ఉండటమే. దృక్పథాలకు సంబంధించి విలువల ఆధునీకరణ ఆర్థికాభివృద్ధి సాధన లక్ష్యంతో ఉద్యమిత్వాన్ని వృద్ధి చేయాలి.
ప్రశ్న 6.
అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను చర్చించండి.
జవాబు.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో మూలధన వనరుల పెరుగుదల, శ్రామికుల సామర్థ్యంలో వృద్ధి, అన్ని రంగాలలోని ఉత్పత్తులలో నాణ్యతా నిర్వహణ, రవాణా సమాచార రంగాలలో సౌకర్యాల అభివృద్ధి, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలలో వృద్ధి, పట్టణీకరణ, జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల, విద్య మరియు ఆయుఃప్రమాణ స్థాయిలలో అభివృద్ధి, అధిక విశ్రాంతి సమయం, అధికంగా వినోద కార్యక్రమాలు, మానసిక జ్ఞాన విస్తరణ మొదలైన లక్షణాలు ఉంటాయి. ఈ దేశాల్లో ఆర్థికాభివృద్ధి పేదరిక వలయాన్ని ఛేదించి స్వయం పోషకత్వాన్ని సాధిస్తుంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల ముఖ్య లక్షణాలు కింది విధంగా ఉంటాయి.
1. సేవలు మరియు పారిశ్రామిక రంగాల ప్రాధాన్యత :
ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామిక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. ఉత్పతి వనరులను అన్నింటిని ఉపయోగించడానికి జాతీయాదాయాన్ని గరిష్టం చేయడానికి, నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడానికి ఈ దేశాలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
రంగాల వాటాలను చూస్తే స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయేతర రంగాలైన పరిశ్రమలు, సేవల పాత్ర అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, 2014లో ఇంగ్లండ్లో 79.6 శాతం వరకు స్థూల దేశీయోత్పత్తి సేవల రంగం నుంచి, 19.8 శాతం పరిశ్రమల నుంచి, 0.6 శాతం వ్యవసాయం నుంచి సమకూర్చబడింది. ఇదే విధంగా ఉద్యోగిత విషయానికొస్తే, 2011లో యు.కె.లో వ్యవసాయ రంగం నుంచి కేవలం 1 శాతం ఉద్యోగిత ఏర్పడితే, ఇది భారతదేశ వ్యవసాయ రంగంలో 47 శాతంగా ఉంది.
2. అధిక స్థాయిలో మూలధన కల్పన :
ఈ అభివృద్ధి చెందిన దేశాలలో స్థూల మూలధన సమీకరణ అధికంగా ఉంటుంది. బాగా అభివృద్ధి చెందిన మూలధన మార్కెట్లు, అధిక స్థాయిలో పొదుపులు, విస్తృత వ్యాపార అవకాశాలు, నవకల్పనలను బాగా ప్రవేశపెట్టే ఉద్యమిత్వం ఈ దేశాలలో మూలధన సమీకరణ అధికంగా ఉండటానికి దారితీసాయి. అధిక రేటులో స్థూల మూలధన సమీకరణ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.
స్థూల మూలధన కల్పన (GDP లో శాతం):
దేశం | 1990 | 2018 |
అమెరికా | 18 | 21 |
యు.కె. | 20 | 17 |
జర్మనీ | 24 | 22 |
జపాన్ | 33 | 24 |
చైనా | 35 | 44 |
3. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను, నైపుణ్యాలను ఉపయోగించడం :
అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ఆధునిక ఉత్పత్తి పద్ధతులు, నైపుణ్యాలు ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ దేశాలలో నూతన మరియు అభివృద్ధి పరిచిన పద్ధతులను వినియోగించడం ద్వారా భౌతిక మానవ వనరులను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ దేశాలు ఉత్పత్తి పద్ధతులను మెరుగుపర్చడానికి, నూతనమైన ఉత్పత్తి పద్ధతులను అభివృద్ధి చేయడానికి శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి.
ముఖ్యమైన ప్రశ్న ఫలితంగా అధిక నాణ్యత గల వస్తువులను, సేవలను అతి తక్కువ వ్యయానికి ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. 2015లో స్విట్జర్లాండ్ తన స్థూల దేశీయోత్పత్తిలో 3.37 శాతాన్ని పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు చేస్తే, భారతదేశపు వ్యయం 0.62 శాతం మాత్రమే.
పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు:
దేశం | 2017 సంవత్సరానికి ఆర్ & డి పై ఖర్చు (శాతాలలో) |
యు.ఎన్.ఎ | 2.80 |
యు.కె | 1.67 |
స్విట్జర్లాండ్ | 3.37 (2015) |
జర్మనీ | 3.04 |
జపాన్ | 3.20 |
భారతదేశం | 0.62 (2015) |
చైనా | 2.13 |
4. తక్కువ జనాభా వృద్ధి :
అభివృద్ధి చెందిన దేశాలు యు.ఎస్.ఏ., యు.కె., పశ్చిమ యూరోపియన్ దేశాల వంటి వాటిల్లో అల్ప జననాల రేటు, అల్ప మరణాల రేట్ల కారణంగా తక్కువ జనాభా వృద్ధి నమోదవుతుంది. మెరుగైన ఆరోగ్య పరిస్థితులు, అధిక స్థాయి విద్య, ప్రజల వినియోగంలో అధిక స్థాయి తక్కువ జనాభా వృద్ధికి దారితీసాయి. ఈ దేశాలలో ఆయుః ప్రమాణం కూడా చాలా అధికంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా సగటు వార్షిక వృద్ధి రేటు 0.7 శాతమయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది 2 శాతంగా ఉంది.
అభివృద్ధి చెందిన దేశాలలో ఆయుఃప్రమాణం పుట్టుక సమయంలో సగటున 75 సంవత్సరాలు. ఫలితంగా ఈ దేశాల ప్రజల జీవన ప్రమాణ స్థాయి మరింత పెరిగి వీరు ఈ దేశాల అతివేగవంతమైన పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఐక్యంగా పనిచేస్తారు. దీనికి అదనంగా ఇక్కడి సమాజం, దాని నిర్మాణం, విలువలు వేగవంతమైన పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడేవిగా ఉంటాయి. ఇక్కడ కార్మికులకు గౌరవం ఉంటుంది.
5. అధిక తలసరి స్థూల జాతీయాదాయం (కొనుగోలు శక్తి సమానత) :
అభివృద్ధి చెందిన దేశాల ముఖ్య లక్షణాలలో అధిక తలసరి జాతీయాదాయం ఉండటం ఒకటి.
మార్కెట్ ధరల దృష్ట్యా తలసరి స్థూల జాతీయాదాయం డాలర్లలో (కొనుగోలు శక్తి సమానత), 2018:
దేశం | తలసరి స్థూల జాతీయాదాయం |
యు.ఎస్.ఎ. | 63,690 |
యు.కె | 45,350 |
స్విట్జర్లాండ్ | 68,820 |
జర్మనీ | 54,560 |
జపాన్ | 44,380 |
చైనా | 18,170 |
భారతదేశం | 7,680 |
పట్టిక ప్రకారం 2018 సంవత్సరానికి గాను తలసరి స్థూల జాతీయాదాయం యు.ఎస్.ఎ.కి 63, 690 డాలర్లు, యు.కె. కి 45,350 డాలర్లు, స్విట్జర్లాండ్కి 68,820 డాలర్లు, భారతదేశానికి 7,680 డాలర్లు ఉండటాన్ని బట్టి అభివృద్ధి చెందిన దేశాలలో అధిక తలసరి స్థూల జాతీయాదాయం ఉంది.
ఒక వస్తువు సముదాయాన్ని కొనుగోలు చేయడానికి ఒక కరెన్సీలో ఎంత వ్యయమవుతుందో, అదే వస్తువు సముదాయాన్ని ఇంకొక విదేశీ కరెన్సీలో కోనుగోలు చేసేందుకు అయ్యే వ్యయంతో తులనాత్మక పరిశీలన చేసి ఆయా కరెన్సీల కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి స్థూల జాతీయాదాయాన్ని అంచనా వేయడం ద్వారా వివిధ దేశాలను సాపేక్షికంగా పరిశీలిస్తాం. కొనుగోలు శక్తి సమానత (Purchasing power parity) ఆధారంగా 2018లో యు.ఎస్.ఎ.లో సగటు తలసరి స్థూల జాతీయాదాయం ఇండియాలోని దానికంటే 8.3 రెట్లు ఎక్కువ.
ప్రశ్న 7.
భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను విమర్శనాత్మకంగా విశ్లేషించండి.
జవాబు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు :
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి సాధారణంగాను, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రత్యేకంగాను కింది లక్షణాలుంటాయి :
1. అల్ప తలసరి ఆదాయం :
అల్ప తలసరి స్థూల జాతీయోత్పత్తి బీదరికాన్ని ప్రతిబింబించుతుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను పరిశీలించడానికి సాపేక్ష పేదరికానికి బదులుగా నిరపేక్ష పేదరికమే చాలా ముఖ్యం. నిరపేక్ష పేదరికాన్ని కేవలం అల్ప ఆదాయంతో మాత్రమే కాకుండా పోషకాహార లోపం, అనారోగ్యం, వస్త్ర మరియు గృహ సౌకర్యాలు సరిగా లేకపోవడం, విద్య లేకపోవడం అను అంశాలతో కూడా కొలుస్తాం.
కైర్న్ క్రాస్ (Cairncross) ప్రకారం “అల్పాభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెందిన మురికివాడలు”. 1995-96 సంవత్సరంలో భారతదేశ తలసరి నికర జాతీయోత్పత్తి రూ.9,300. 2012-13 సంవత్సరానికి ఇది రూ.22,000.
ప్రపంచ దేశాలతో పోల్చితే తక్కువ విలువలలో ఇదొకటి. 133 దేశాలలో భారతదేశ స్థానం 110. 2018లో కొనుగోలు శక్తి సమానత ఆధారంగా భారతీయుని తలసరి స్థూల జాతీయాదాయం $ 7680. ఇదే సంవత్సరంలో యు.ఎస్.ఏ. లోని సగటు తలసరి స్థూల జాతీయాదాయం భారతదేశంలోని దానికి 8.3 రెట్లుగా ఉంది.
ఉదాహరణకు రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం 2011-12 సంవత్సరంలో భారతదేశంలో 29.5 శాతం ప్రజలు పేదరిక రేఖకు దిగువన ఉండి, కనీస పోషకాహారాన్ని కూడా తీసుకోలేక పోతున్నారు. జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉండటంవల్ల శ్రామిక సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది.
2. వ్యవసాయ రంగ ప్రాధాన్యత :
అభివృద్ధి చెందుతున్న దేశాలలో 2/3వ వంతు లేదా అంతకు మించి ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం ఎక్కువగా అనుత్పాదకంగా ఉంటుంది. ఇటువంటి దేశాలు ప్రధానంగా ముడి సరుకులను, ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో ప్రత్యేకీకరణను కలిగి ఉంటాయి. అల్పాభివృద్ధి చెందిన దేశం ప్రాథమిక రంగ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. అయితే ద్వితీయ రంగం, సేవల రంగం రెండూ వెనకబడి (అల్పాభివృద్ధి చెంది) ఉంటాయి.
భారతదేశంలో 2017లో 42.7 శాతం శ్రామికులు వ్యవసాయంలో నిమగ్నమయినారు. అదే విధంగా 2019-20లో స్థూల జోడించబడిన విలువ (Gross Value Added) లో 16.5 శాతం వ్యవసాయం నుంచి రావడం జరిగింది (Economic Survey, 2019-20). నీటి పారుదలకు ముఖ్య ఆధారం వర్షాలే. వ్యవసాయ రంగంలో సంప్రదాయ సాంకేతికతను వాడుతుంటారు. అయితే ఆధునికీకరణ నెమ్మదిగా జరుగుతుంది.
3. మూలధన లోటు :
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మరొక లక్షణం మూలధన పరికరాలు సరిపడే పరిమాణంలో లేకపోవడం. అభివృద్ధి చెందుతున్న దేశాలు “మూలధన బీద లేక అల్ప పొదుపు మరియు అల్ప పెట్టుబడి” ఆర్థిక వ్యవస్థలుగా ఉంటున్నాయి. తక్కువ ఆదాయ స్థాయి తక్కువ పొదుపుకు దారి తీస్తుంది.
దీని కారణంగా తక్కువ మూలధన కల్పన ఏర్పడుతుంది. మూలధన లోటు కారణంగా శ్రామికులు, సహజ వనరులు లాంటి ఇతర వనరులు నిరుపయోగంగా ఉంటాయి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక, 2019 ప్రకారం 2017-18లో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల దేశీయ పొదుపు రేటు 30.1 శాతంగా ఉంటే, స్థూల దేశీయ పెట్టుబడి రేటు 32.3 శాతంగా ఉంది.
4. సాంకేతికంగా వెనుకబడి ఉండటం :
పురాతన పద్దతులను విసర్జించే ప్రక్రియకు, ఆధునిక పద్ధతులను అనుసరించడంలోను మూలధన కొరత అడ్డంకిగా ఉంది. నిరక్షరాస్యత, నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తి లేకపోవడం అనేవి వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలలో ఆధునిక పద్ధతులు విస్తరించడానికి గొప్ప అవరోధాలుగా ఉన్నాయి. ఆర్థిక వెనుకబాటుతనానికి సాంకేతిక వెనుకబాటుతనం కారణంగా ఉండటమే కాకుండా, దాని ఫలితంగా కూడా ఉంది. భారతదేశంలో అల్పఉత్పాదకత సాంకేతిక వెనుకబాటుతన పర్యవసానమే.
5. తక్కువ అవస్థాపనా సదుపాయాలు :
బ్యాంకింగ్, విద్య, ప్రజా ఆరోగ్యం, తాగునీరు, మురుగు నీటి పారుదల, సాగునీరు, ఎద్యుత్, రవాణా, సమాచారం మొదలైనవి అవస్థాపనా సదుపాయాల కిందకి వస్తాయి. ఒక దేశ వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల అభివృద్ధికి ఈ సౌకర్యాలు అతి ముఖ్యమైనవి. పై సదుపాయాలన్నీ భారతదేశంలో ఆశించిన స్థాయిలో లేవు.
6. జనాభా లక్షణాలు :
అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా సగటు వార్షిక వృద్ధిరేటు 2 శాతం ఉంటే, అభివృద్ధి చెందిన దేశాలలో ఇది సుమారుగా 0.7 శాతంగా ఉంది. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జనాభా శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపుగా 40 ఉంటే ఇది అభివృద్ధి చెందిన దేశాలలో 20 నుంచి 25 శాతం ఉంది.
అభివృద్ధి చెందిన దేశాలలో పుట్టుక సమయంలో సగటు ఆయుఃప్రమాణం సుమారుగా 51 సంవత్సరాలయితే అభివృద్ధి చెందిన దేశాలలో ఆయుః ప్రమాణం 75 సంవత్సరాలుగా ఉంది. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయుఃప్రమాణం 68.5 సంవత్సరాలు. 2019 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రకారం 2018లో భారతదేశంలో ఆయుఃప్రమాణం 69.4 సంవత్సరాలుగా ఉంది.
భారతదేశంలో 2006లో చదరపు కిలోమీటరుకు జనాభా సాంద్రత 373 అయితే, యు.ఎస్. ఏ లో ఇది 33 గాను, చైనాలో 141 గాను ఉంది. మనదేశంలో 2010లో 1000 జననాలకు సంవత్సరంలోపు వయస్సున్న శిశు మరణాల రేటు 44గా ఉంది. ఇది వైద్య సదుపాయాల కొరతను, అల్పస్థాయి పోషకాహారాన్ని. దైన్య పారిశుద్ధ్య సదుపాయాలను చూపిస్తుంది.
భారతదేశంలో జనాభా చాలా అధికంగా ఉంది. 2014లో జనాభా 129.5 కోట్లు. మన జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం సంవత్సరానికి 1.64 శాతం చొప్పున పెరుగుదలను కలిగి ఉంది. 1971 నుంచి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ జననాల రేటు అశించిన స్థాయిలో తగ్గకపోవడం, మరణాల రేటు బాగా తగ్గడం జరిగింది. అధిక మొత్తంలో జనాభా వృద్ధి పెరగడం వల్ల వనరుల పై మరింత ఒత్తిడి పెరుగుతుంది.
7. అధిక నిరక్షరాస్యత రేటు :
భౌతిక మూలధనమేగాక ప్రజలు పొందిన జ్ఞానం, శిక్షణ కూడా మూలధనంలో భాగమే. విచారించాల్సిన విషయం ఏమంటే, ఆయుఃప్రమాణం, వయోజన అక్షరాస్యత, విద్యా సంస్థలలో సమ్మిళిత నమోదు నిష్పత్తి యు.ఎస్. డాలర్ల రూపంలో తలసరి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి అంశాల ఆధారంగా నిర్మితమయ్యే మానవ అభివృద్ధి సూచికకు సంబంధించి HDI, 2019 రిపోర్టు ప్రకారం 2018లో భారతదేశం 129వ స్థానాన్ని పొందడం.
భారతదేశంలో నిరక్షరాస్యత రేటు 1951 నుంచి గణనీయంగా తగ్గింది. పురుషులతో పోల్చితే మహిళలలో ఈ రేటు అధికంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అక్షరాస్యత రేటు, పురుషుల అక్షరాస్యత రేటు, స్త్రీల అక్షరాస్యత రేటు (శాతం) వరుసగా 74.0, 82.14, 65.5గా ఉన్నాయి.
8. ద్వంద ఆర్థిక వ్యవస్థ :
అభివృద్ధి చెందిన పారిశ్రామిక వ్యవస్థ, దేశీయ వెనుకబడిన వ్యవసాయ వ్యవస్థ ఈ రెండూ ఉన్నప్పుడు కూడా ద్వైవిద్యం (dualism) ఉంటుంది. పారిశ్రామిక రంగం మూలధన సాంద్రత పద్ధతులను ఉపయోగించి వివిధ రకాల మూలధన వస్తువులను, అనశ్వర వినియోగ వస్తువులను తయారు చేస్తుంది. గ్రామీణ రంగం పురాతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయక వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. విత్త ద్వైవిద్యాన్ని కూడా చూడవచ్చు.
ఇది ఋణాలపై చాలా అధిక వడ్డీ రేట్లు ఉండే అసంఘటిత ద్రవ్య మార్కెటును, తక్కువ వడ్డీ రేట్లు మరియు అధిక పరపతి సౌకర్యాలుండే సంఘటిత ద్రవ్య మార్కెటును తెలుపుతుంది. ద్వంద ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరమైన ఆర్థిక ప్రగతికి అనుకూలం కాదు. ద్వితీయ రంగంలోను, సేవల రంగంలోను, వృద్ధిని ప్రాథమిక రంగం నిషేదిస్తుంది.
9. అల్పాభివృద్ధి చెందిన సహజ వనరులు :
సాంకేతికతలో, సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలో తగినటువంటి మార్పులు చేసి సహజ వనరుల కొరత సమస్యను అధిగమించడంలో అల్పాభివృద్ధి చెందిన దేశాలు విజయవంతం కాలేదు. సహజ వనరులు అల్పాభివృద్ధి చెందాయి (నిరుపయోగంగా ఉండటం, అల్ప వినియోగం చేయడం, దుర్వినియోగం చేయడం). దీనికి కారణాలు సహజ వనరులు అందుబాటులో లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, మూలధన లభ్యత లేకపోవడం, మార్కెటు చిన్నదిగా ఉండటం అని చెప్పవచ్చు.
10. ఉద్యమిత్వం కొరతగా ఉండటం :
అల్పాభివృద్ధి చెందిన దేశాల మరొక లక్షణం ఉద్యమిత్వ సామర్థ్యం కొరతగా ఉండటం. సామాజిక వ్యవస్థ సృజనాత్మక బుద్ధులను ఉపయోగించుకొనే అవకాశాలను కల్పించకపోవడం వల్ల, ఉద్యమిత్వం అభివృద్ధి చెందదు. మార్కెటు పరిమాణం చిన్నదిగా ఉండటం, మూలధన కొరత, అవస్థాపన సౌకర్యాల కొరత, సాంకేతిక వెనుకబాటుతనం, ప్రైవేటు ఆస్తి ఉండకపోవడం, ఒప్పందాలు చేసుకొనే స్వేచ్ఛ ఉండకపోవడం, శాంతి భద్రతల సమస్య అనే అంశాలు అన్నీ సాహస చర్యలకు, అరంభయత్నాలకు ప్రతిబంధకాలుగా ఉంటాయి.
11. నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత:
భారతదేశంలో నిరుద్యోగిత సంస్థాగతమైనది, ఎందుకంటే మూలధన కొరతే దీనికి కారణం. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో అల్ప ఉద్యోగిత లేదా ప్రచ్ఛన్న లేదా దాగిన నిరుద్యోగిత ముఖ్యమైన లక్షణం. భారతీయ వ్యవసాయ రంగంలో వాస్తవంగా అవసరమైన శ్రామికుల సంఖ్య కంటే మించి చాలా అధిక సంఖ్యలో శ్రామికులు పని చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో శ్రామికుని ఉపాంత ఉత్పత్తి అతి స్వల్పంగా లేదా శూన్యంగా లేదా ఋణాత్మకంగా ఉండొచ్చు.
భారతదేశంలో 11వ ప్రణాళిక (2007-12) నాటికి నిరుద్యోగుల సంఖ్య 37 మిలియన్లుగా ఉంటే, ఈ ప్రణాళికా కాలంలో అదనంగా కొత్తగా 45 మిలియన్ల మంది శ్రామిక మార్కెట్లోకి ప్రవేశిస్తారని అంచనా వేయడం జరిగింది. 2017-18లో నిరుద్యోగిత 6.1 శాతానికి చేరింది.
12. సామాజిక సంస్థలు :
అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక సంస్థలు ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా లేవు. భారతదేశంలోని సమాజం వివిధ కులాలు, ఉప కులాలుగా విభజించబడి ఉండటం వల్ల సమాజంలో ఘర్షణలు ఏర్పడ్డాయి. వైజ్ఞానిక దృక్పథాల పెరుగుదలకు మత, సాంఘిక నమ్మకాలు, ఆచార వ్యవహారాలు ఆటంకాలుగా ఉన్నాయి. ప్రజలు సాంప్రదాయాలను వదులుటకు ఇష్టపడరు, మూఢ విశ్వాసాలను కలిగి ఉండటంతో పాటుగా, ఆచారాలకు, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు.
13. విదేశీ వర్తక ప్రాధాన్యత :
ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతుల పైన అధికంగా ఆధారపడటం వల్ల ఇతర రంగాలను ఉపేక్షించడం, అంతర్జాతీయ ఒడుదుడుకులకు లోనవడం రూపంలో గంభీర పర్యవసనాలు ఆర్థిక వ్యవస్థలలో ఏర్పడతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు విదేశీ వ్యాపార చెల్లింపుల శేష సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఇటీవల దిగుమతుల వ్యయం అతివేగంగా పెరగడం వల్ల, ఎగుమతుల స్తబ్ధత వల్ల వర్తక శేషం చెప్పుకోదగ్గ స్థాయిలో దిగజారింది. 2018-19లో ఇది US$ (-)180.3 బిలియన్లుగా ఉంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఆర్థికాభివృద్ధిని నిర్వచించి, దానికి సంబంధించిన ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు.
ఆర్థిక వృద్ధి భావన:
ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధితో పోల్చితే సముచితమైన భావన. ఒక దేశంలో జాతీయోత్పత్తి వల్ల సంభవించిన పెరుగుదలను ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. అంటే దేశంలో నాణ్యమైన వనరుల పెరుగుదలకు దేశంలో వనరుల పరిమాణం పెరగడంతోపాటు లేదా సాంకేతికత వృద్ధి చెందడంతో పాటు లేదా దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంలోనూ వస్తువుల, సేవల ఉత్పత్తుల పెరుగుదలను సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి అనేది ఒక దేశంలోని స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదలను అంచనా వేస్తుంది.
మైఖేల్ పి. తొడారో ఉద్దేశం ప్రకారం “ఆర్థిక వృద్ధి అనేది ఒక స్థిరమైన ప్రక్రియ. ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్ధ్యం. నియత కాలంలో పెరుగుతుంది. దీనివల్ల జాతీయ ఉత్పత్తిలో, ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది.” సైమన్ కుజ్నెట్స్ ప్రకారం “ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. ఇందులో వాస్తవ జాతీయ ఆదాయంలో, మొత్తం జనాభాలో, వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంటుంది.”
ఆర్థిక వృద్ధి ప్రధానాంశాలు :
పైన పేర్కొన్న నిర్వచనాలను బట్టి ఆర్థిక వృద్ధికి చెందిన ప్రధానాంశాలు కింద ఇవ్వడమైంది :
- ఆర్థిక వృద్ధి అనేది జనాభా పెరుగుదల రేటు కంటే వాస్తవిక జాతీయ ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంటేనే సాధ్యమవుతుంది.
- ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి సామర్ధ్యంలో ఎక్కువ స్థాయి పెరుగుదల నమోదు అయినప్పుడు ఆర్థిక వృద్ధి ఉంటుంది.
ఒక దేశ ప్రగతి, అది ధనిక లేదా పేద దేశమైనా, ఆర్థిక వృద్ధికి సంబంధించిన నాలుగు కారకాల మీద ఆధారపడి ఉంటుంది.
ఎ) ఆర్థిక వ్యవస్థ పొదుపు రేటు.
బి) మూలధన ఉత్పత్తి నిష్పత్తి.
సి) శ్రామిక శక్తి వృద్ధి రేటు.
డి) సాంకేతిక విజ్ఞానంలో మార్పులు మరియు నవకల్పనలు.
ఆర్థిక వృద్ధి అనేది దేశ వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను, తలసరి ఉత్పత్తిలో పెరుగుదలను తెలియచేస్తుంది. ఒకదేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వృద్ధి రేటుతో సమానంగా జనాభా వృద్ధి రేటు పెరిగినట్లయితే వాస్తవిక తలసరి ఆదాయంలో మార్పేమి ఉండదు. అంటే మొత్తం ఉత్పత్తి పెరిగినప్పటికీ ప్రజల జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల సంభవించకపోవచ్చు.
ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధిలో నిర్మాణాత్మక మార్పులను వివరించండి.
జవాబు.
ఆర్థికాభివృద్ధిలో నిర్మాణాత్మక మార్పులు : ఆర్థికాభివృద్ధి దేశంలోని వివిధ రంగాల్లో వచ్చే నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది. వృత్తిపరమైన నిర్మాణంలో మార్పులు వస్తాయి. ఆర్థికాభివృద్ధి వల్ల ప్రాథమిక రంగంలో (వ్యవసాయం, చేపలు పట్టడం మొదలగునవి) శ్రామిక శక్తి వాటా తగ్గి, ద్వితీయ (పరిశ్రమ, గనులు, మొదలగునవి) రంగంలో కార్మిక శక్తి వాటా పెరుగుతుంది. అదే విధంగా సేవా రంగంలో కార్మిక వాటా పెరుగుతుంది. నిర్మాణాత్మక మార్పులను కింది విధంగా చూడవచ్చు.
- జాతీయ ఉత్పత్తి నిర్మాణంలో (structure) మార్పులు సంభవిస్తాయి. జాతీయ ఉత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా పడిపోయి ద్వితీయ, తృతీయ రంగాల వాటాలు క్రమంగా పెరుగుతాయి.
- పారిశ్రామిక ఉత్పత్తి నిర్మాణంలో మార్పులు సంభవిస్తాయి. మూలధన వస్తువుల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటుగా వినియోగ వస్తూత్పత్తిలో పెరుగుదల ఉంటుంది.
- విదేశీ వాణిజ్యంలో మార్పులు వస్తాయి. ఎగుమతులలో ప్రాథమిక రంగ వస్తువుల వాటా తగ్గి, దిగుమతులలో మూలధన వస్తువుల వాటా పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి ఏర్పడుతుంటే తయారీ (manufactured), తుది వస్తువుల, సేవల ఎగుమతులు పెరుగుతాయి. ఇదే పరిస్థితిలో వినియోగ వస్తువుల దిగుమతులలో తగ్గుదల ఏర్పడుతుంది. ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో అభివృద్ధ చెందుతున్న దేశాలు ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో పాల్గొంటూ, వ్యవసాయ ఎగుమతులకే ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అట్లాగే తక్కువ స్థాయిలో వినియోగ వస్తువులను దిగుమతి చేసుకొంటున్నాయి. అయితే దీనిని ఇంతకు ముందున్న ధోరణికి విరుద్ధంగా పరిగణించరాదు.
- సాంకేతిక నిర్మాణంలో మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో ఆధునిక, అభివృద్ధి చెందిన సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తారు.
- సామాజిక, సంస్థాపరమైన రంగాలలో మార్పులు సంభవిస్తాయి. ఆర్థికాభివృద్ధి ద్వారా ప్రజల ఆత్మగౌరవం పెరగటంతో పాటుగా ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల ఉంటుంది.
ప్రశ్న 3.
ఆర్థికాభివృద్ధి, ఆర్థికవృద్ధిల మధ్య తారతమ్యాలను తెలియజేయండి.
జవాబు.
ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిల మధ్య గల తారతమ్యాలు :
కిండర్ బర్గర్ ప్రకారం ఆర్థికవృద్ధి అనేది అధిక ఉత్పత్తిని సూచించగా, ఆర్థికాభివృద్ధి అనేది అధిక ఉత్పత్తితో బాటు అందుకు దోహదపడే సాంకేతిక సంస్థాపూర్వక మార్పులను సూచిస్తుంది.
ఆర్థిక వృద్ధి | ఆర్థికాభివృద్ధి |
1. ఆర్థిక వృద్ధి వస్తుసేవల’ పెరుగుదలను అంటే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది. | 1. ఆర్థికాభివృద్ధి దేశంలో ఆర్థిక వృద్ధితో పాటుగా వ్యవస్థాపూర్వక, సంస్థాగత, సాంఘిక, ఆర్థిక మార్పులను సూచిస్తుంది. |
2. ఆర్థిక వృద్ధి అనేది ఏకోన్ముఖమైన ప్రక్రియ. | 2. ఆర్థికాభివృద్ధి అనేది బహుపార్శ్వ (ముఖ) ప్రక్రియ. |
3. ఆర్థిక వృద్ధి ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మకమైన మార్పులనే సూచిస్తుంది. | 3. ఆర్థికాభివృద్ధి పరిమాణాత్మక మార్పులతో పాటు, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. |
4. ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. | 4. ప్రభుత్వ జోక్యం లేకుంటే ఆర్థికాభివృద్ధిని సాధించలేం. ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దానిని పెంచి అభివృద్ధిని సాధించాలంటే ప్రభుత్వం చురుకైన పాత్రను పోషించాలి. |
5. ఆర్థిక వృద్ధి వేగంగా సంభవించేటప్పుడు అధిక సాంకేతిక మార్పులు ఉంటాయి. | 5. అధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావడం. |
6. సాంప్రదాయ అర్థశాస్త్ర నేపథ్యంలో ఆర్థిక వృద్ధి అనేది ఒక కీలక అంశం. ఈ దృక్పథం ప్రకారం వృద్ధిపై, పురోగతిపై మనం దృష్టి సారిస్తే దానంతట అదే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. దీనినే కింది స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు చేరే దృక్పథం (tricke down | approach) అంటారు. | 6. ఆధునిక అర్థశాస్త్ర సాహిత్యంలో ఆర్థికాభివృద్ధి అనేది ముఖ్యమైన అంశం. మనం పేదరికంపై దృష్టి సారిస్తే ఆర్థిక వృద్ధి దానంతటదే సాధ్యమవుతుంది. |
7. ఆర్థిక వృద్ధి పరిధి సంకుచితమైంది. ఎందుకంటే తలసరి ఆదాయ స్థాయిలోని మార్పుతో మాత్రమే ఆర్థిక వృద్ధికి సంబంధం ఉంది. | 7. ఆర్థికాభివృద్ధి పరిధి విస్తృతమైంది. తలసరి ఆదాయ పెరుగుదలనే గాకుండా ఆర్థిక వ్యవస్థలో ధనాత్మక మార్పులను, ప్రజల జీవన వ్యవహారాలలో మెరుగుదలను సూచిస్తుంది. |
8. ఆర్థిక వృద్ధి స్వల్ప కాలానికి సంబంధించిన అంశం. సాధారణంగా సంవత్సర ఆధారంగా దీనిని తెలుపుతారు. | 8. ఆర్థికాభివృద్ధి అనేది దీర్ఘ కాలానికి సంబంధిం చిన అంశం. 20 నుంచి 25 సంవత్సరాలలో సంస్థాగత మార్పులను తెలుపుతుంది. |
9. ఆర్థిక వృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలకు
సంబంధించింది. |
9. ఆర్థికాభివృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. |
10. సామాజిక మార్పు అనేది ఆర్థిక వృద్ధితో సాధ్యం కావచ్చు లేదా కాకపోవచ్చు. | 10. సామాజిక మార్పు అనేది ఆర్థికాభివృద్ధిలో తప్పనిసరి. అర్హతకు తగిన ఉద్యోగ అవకాశాలు, ఆహార ధాన్యాల లభ్యత, మంచి ఆరోగ్యం, విద్య, ప్రజల జీవన నైపుణ్యాల మార్పు అనేవి ఆర్థికాభివృద్ధి వల్ల సాధ్యమవుతాయి. |
11. ఆర్థిక వృద్ధిని ఆదాయ స్థాయిలతో అంచనా వేస్తారు. సాధారణంగా సంఖ్యాపరంగా సంవత్సరాల వారీగా ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేస్తారు. | 11. ఆర్థికాభివృద్ధిలో పేదరికం తగ్గింపు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల వంటి అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. |
ప్రశ్న 4.
అభివృద్ధిని ప్రోత్సహించే ఆర్థిక కారకాలను వివరించండి.
జవాబు.
ఆర్థికపరమైన కారకాలు :
ఆర్థికాభివృద్ధిలో ఆర్థికపరమైన కారకాల పాత్ర నిర్ణయాత్మకమైంది. నిర్ణీత కాలంలో ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందా ? లేదా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందా ? అనే వాటిని ఆ దేశంలో ఉన్న మూలధన నిల్వ మరియు దాని విలువ ప్రధానంగా నిర్ణయిస్తాయి. జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు, విదేశీ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ స్వభావం మొదలైన కాలు కూడా ఆర్థికాభివృద్ధిలో ప్రధానమైనవే.
1. మూలధన కల్పన :
అర్థశాస్త్ర విశ్లేషణలో ఉత్పత్తి స్థాయిని పెంచడంలో మూలధన కల్పన పాత్ర కీలకమైంది. విశ్వ వ్యాప్తంగా వివిధ దేశాలు వచ్చిన ఆదాయంలో పొదుపుల ద్వారా గాని విదేశీ పెట్టుబడుల ద్వారా గానీ వృద్ధిని సాధించడం జరిగింది.
2. సహజ వనరులు :
ఒక దేశ ఆర్థికాభివృద్ధిని నిర్ధారించు ప్రధాన కారకం ఆ దేశంలో లభ్యమయ్యే సహజ వనరులు. భూమి, భూసారం, అటవీ సంపద, మంచి నదీ వ్యవస్థ, చమురు వనరులు, మంచి వాతావరణం, జీవావరణ వ్యవస్థ మొదలైనవి సహజ వనరులలోనికి వస్తాయి. ఆర్థికపరమైన వృద్ధికి విస్తారమైన వనరుల లభ్యత అనేది ఆవశ్యకమైంది.
3. వ్యవసాయ రంగం :
ఆర్థికాభివృద్ధిలో భూమి యాజమాన్యంతో పాటుగా వ్యవసాయం చేసే పద్ధతి అనేది ముఖ్యమైన పాత్రని నిర్వహిస్తుంది. భూసంస్కరణలు, వ్యవసాయంలో ఆధునికీకరణ, సాంకేతికపరమైన మార్పులు ఆర్థిక రంగంలో వేగవంతమైన వ్యవసాయ వృద్ధికి దోహదపడతాయి.
4. మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులు (Marketable surplus) :
ఉత్పాదకతను పెంచే క్రమంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం అనేది ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన ప్రక్రియ. కానీ మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులును పెంచడం అనేది దానికంటే ముఖ్యమైనది. గ్రామీణ జనాభా తమ మనుగడకు కావాల్సిన ఉత్పత్తి కంటే ఎక్కువగా లభించగల వ్యవసాయోత్పత్తిని మార్కెట్లో విక్రయంకాగల వ్యవసాయ మిగులు అంటారు. కాని వ్యవసాయ రంగ పురోగతిని మార్కెట్లో విక్రయం చేసిన వ్యవసాయ మిగులు ద్వారా సూచిస్తారు.
5. పారిశ్రామిక నిర్మాణం :
భారీ, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు వాటి సాపేక్షిక ప్రాధాన్యతను వాటిలో ఉపయోగించే సాంకేతిక స్థాయిని కోరుకుంటాయి. అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చెందుతున్న దేశాలలో వినియోగించడంవల్ల ఆధునికీకరణ ఏర్పడి వ్యవస్థ నిర్మితిలో మార్పు వస్తుంది. ఫలితంగా అధిక ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది.
6. వ్యవస్థాపరమైన మార్పులు :
సంస్థలలో, సాంఘిక దృక్పథాలలో, ప్రేరేపణలలో విప్లవాత్మక మార్పుల ద్వారా సంప్రదాయ వ్యవసాయక సమాజం నుంచి ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు మారడాన్ని వ్యవస్థాపరమైన మార్పులంటాం. ఈ మార్పుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడం, శ్రామిక ఉత్పాదకత పెరగడం, మూలధన రాశి పెరగడం, నూతన వనరులను ఉపయోగించడం, సాంకేతిక మెరుగుదల జరుగుతాయి.
7. వ్యవస్థాపన :
వృద్ధి ప్రక్రియకు సంబంధించి ఇదొక ముఖ్యమైన అంశం. ఆర్థిక కార్యకలాపాలలో ఉత్పత్తి కారకాలను అభిలషణీయంగా ఉపయోగించడానికి సంబంధించినదే వ్యవస్థాపన. ఉద్యమదారుడు వ్యవస్థాపకుడు నిర్వహించే విధులను నిర్వర్తిస్తూ, వ్యాపారంలోని నష్టభయాన్ని, అనిశ్చితలను ఎదుర్కొంటున్నాడు. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యమిత్వ చర్యలు లేవు. అందువల్ల వెనుకబడిన దేశాలు ఉద్యమిత్వాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాలి. దీనికొరకు అవసరమైన సామాజిక, ఆర్థిక, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయడం అవసరం.
8. సాంకేతిక ప్రగతి :
నూతన పరిశోధన లేదా నవకల్పనల మూలంగా ఉత్పత్తి పద్ధతులలో మార్పులు రావడమే సాంకేతిక మార్పులు. సాంకేతిక మార్పుల వల్ల శ్రమ, మూలధనం, ఇతర ఉత్పత్తి కారకాల ఉత్పాదకత పెరుగుతుంది. ఘంపీటర్, కుజ్నెట్ ఆర్థిక వృద్ధిలో నవకల్పనను అతి ముఖ్యమైన సాంకేతిక కారకంగా పరిగణించారు. పరిశోధన మరియు అభివృద్ధి పైన జాతీయ ఆదాయంలో ఎక్కువ శాతాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం’ ఉంది.
9. శ్రమ విభజన :
ప్రత్యేకీకరణ, శ్రమ విభజన వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. అంతేకాక పెద్ద తరహా ఉత్పత్తి ఆదాలు ఏర్పడి, ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుదలకు తోడ్పడతాయి. ఆడమ్ స్మిత్ ఆర్థికాభివృద్ధిలో శ్రమ విభజనకు అధిక ప్రాముఖ్యత నిచ్చాడు. శ్రమ విభజన మార్కెటు పరిమాణం పైన ఆధారపడుతుంది. పెద్ద తరహా ఉత్పత్తి ఉన్నప్పుడు ప్రత్యేకీకరణ, శ్రమ విభజన అధికమవుతాయి. ఆధునిక రవాణా, కమ్యూనికేషన్స్ సాధనాలను ఏర్పాటు చేయడం వల్ల మార్కెటును విస్తృతం చేసి తద్వారా అల్పాభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.
10. విదేశీ వర్తకం :
సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మూలధన పరికరాలలోనూ, పారిశ్రామిక ఉత్పత్తులలోనూ స్వావలంబనను సాధించే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులకు బదులుగా పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు ఉండే స్థాయికి పరిశ్రమల అభివృద్ధిని బాగా పెంచాలి. భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలలో స్థూల ఆర్థిక అంతర్ సంబంధాలకు ప్రాధాన్యత ఉంది. ఈ దేశ సమస్యలకు పరిష్కారం కేవలం విదేశీ వర్తక రంగం ద్వారా ఉండదు.
11. ఆర్ధిక వ్యవస్థ :
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, ఆ దేశ చారిత్రక ఏర్పాటు అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఒక దేశ ఆర్థికవృద్ధిలో స్వేచ్ఛా వాణిజ్య విధానం అమలులో ఉన్న కాలంలో ఏ విధమైన ఆటంకాలు ఏర్పడ లేదు. అయితే మారిన నేటి కాల పరిస్థితులలో ఇదే అభివృద్ధి వ్యూహంతో ఒక దేశం వృద్ధి చెందటం కష్టతరం.
ప్రశ్న 5.
అభివృద్ధిని ప్రోత్సహించే ఆర్థికేతర కారకాలను వివరించండి.
జవాబు
ఆర్థికేతర కారకాలు :
అభివృద్ధిలో ఆర్థికేతర కారకాలు కూడా ఆర్థిక కారకాలతో సమ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయనేది స్పష్టం. ఆర్థికాభివృద్ధి ప్రక్రియను ఇవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
a) మానవ వనరులు :
ఆర్థికాభివృద్ధిలో మానవ వనరులు అనేవి ముఖ్యమైన కారకాలు. ఉత్పత్తి కోసం మానవులు శ్రామికులుగా పని చేయడం జరుగుతుంది. ఒక దేశ శ్రామికులలో సామర్థ్యం, నైపుణ్యం అధికంగా ఉంటే ఆ దేశం యొక్క వృద్ధి అధికంగా ఉంటుంది. నిరక్షరాస్యుల, అవివేకుల, నైపుణ్యం లేనివారి, వ్యాధిగ్రస్తుల, మూఢ విశ్వాసం గలవారి ఉత్పాదకత సహజంగానే తక్కువ. ఒక దేశ అభివృద్ధికి వీరి తోడ్పాటు అధికంగా ఉండదు.
మానవ వనరులు నిరుపయోగంగా ఉన్నా లేదా శ్రామిక నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నా ఇది ఆ దేశానికి భారంగా ఉంటుంది. శ్రామిక శక్తి సామర్థ్యం లేదా ఉత్పాదకత ఆరోగ్యం, విద్య, సామాజిక సేవలపైన ఆధారపడుతుంది. మానవుడు ఉత్పత్తి ప్రక్రియలో నూతన మార్గాలు అవలంబించడం జరిగి దానివల్ల ఆ దేశ ఉత్పాదకత పెరుగుతుంది.
ఉద్యమదారులు ప్రవేశపెట్టే నవకల్పనలను ఘంపీటర్ అనే ఆర్ధిక శాస్త్రవేత్త బాగా మెచ్చుకొని, పెట్టుబడి దారీ విధాన అభివృద్ధికి ఈ ఉద్యమదారులు ఎంతో దోహదం చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ నైపుణ్యాన్ని సంతరించుకున్నందువల్ల, దీనిని ఇంకా మెరుగుపర్చడానికి పరిశోధన మరియు అభివృద్ధికి ఇంకా ఎక్కువ శ్రద్ధ అవసరం. ఉదాహరణకు, ఆధునిక కాలంలో ఇంటర్నెట్ (అంతర్జాలం) అనే గొప్ప నవకల్పన సమాచార, సాంకేతిక రంగంలో పెను మార్పులకు దారి తీసింది.
b) రాజకీయ, పరిపాలన సంబంధ కారకాలు :
ఆధునిక ఆర్థిక వృద్ధికి రాజకీయ, పరిపాలన సంబంధ కారకాలు కూడా సహాయపడ్డాయి. బ్రిటన్, జర్మనీ, యుఎస్, జపాన్, ఫ్రాన్స్ దేశాలలోని ఆర్థిక వృద్ధికి ముఖ్య కారణాలు వాటి రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన పాలనలే. ఇటలీలో రాజకీయ అస్థిరత వల్ల, అవినీతి, బలహీన పరిపాలన వల్ల పై దేశాల స్థాయిలో వృద్ధి రాలేదు.
అభివృద్ధి చెందిన దేశాలలో శాంతి, రక్షణ స్థిరత్వం అనేవి ఉద్యమిత్వ అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా, సరియైన ద్రవ్య, కోశ విధానాలను అమలు చేసే అవకాశాన్ని ఏర్పర్చాయి. వెనుకబడిన దేశాలలో బలహీన పరిపాలన, రాజకీయ వ్యవస్థ ఆర్థికాభివృద్ధికి పెద్ద ఆటంకం. ఆర్థికాభివృద్ధిని అవినీతి లేని, పటిష్టమైన పరిపాలన, స్థిర రాజకీయ పరిస్థితులు ఉత్తేజపర్చుతాయి.
c) సామాజిక కారకాలు :
సామాజిక దృక్పథాలు, విలువలు, సంస్థలు కూడా ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. వాస్తవ మానవ ప్రవర్తనకు కారణంగా ఉండే నమ్మకాలు, విలువలనే దృక్పథాలు అంటాం. ప్రత్యేక లక్ష్యాలకు సంబంధించి మానవ ప్రవర్తనా ఉద్దేశాలను విలువలు తెలుపుతాయి. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో శీఘ్ర ఆర్థికాభివృద్ధికి విలువల ఆధునీకీకరణను అనుసరించాలని గున్నార్ మిర్దాల్ అన్నాడు. అవి ఏవంటే ఆలోచనలో, చర్యలలో హేతుబద్ధత ఉండటం.
అంటే ఉత్పాదకతను పెంచడానికి, జీవన స్థాయిలను పెంచడానికి, సామాజికార్థిక సమానత్వాన్ని సాధించడానికి ఉద్దేశపూర్వకంగానే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం,’ ఆధునిక, సాంకేతికతను వాడడం. విలువల ఆధునీకరణ వల్ల దృక్పథాలలో మార్పులు ఏర్పడి ఇవి ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.
అయితే ఉద్యమిత్వం లేనట్లయితే ఈ రంగాల అభివృద్ధి సాధ్యం కాదు. గున్నార్ మిర్డాల్ ప్రకారం అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యమిత్వం లేకపోవడానికి కారణం ఉద్యమిత్వానికి సంబంధించి సరియైన దృక్పథం కలిగిన వ్యక్తులు కొరతగా ఉండటమే. దృక్పథాలకు సంబంధించి విలువల ఆధునీకరణ ఆర్థికాభివృద్ధి సాధన లక్ష్యంతో ఉద్యమిత్వాన్ని వృద్ధి చేయాలి.
ప్రశ్న 6.
భౌతిక జీవన ప్రమాణ సూచిక (PQLI) ని చర్చించుము.
జవాబు.
భౌతిక జీవన ప్రమాణ సూచిక (Physical Quality of Life Index – PQLI) :
దీనిని 1979లో యమ్.డి. మోరిస్ రూపొందించాడు. 23 దేశాలకు సంబంధించి ఇతడు ఉమ్మడి భౌతిక జీవన ప్రమాణ సూచికను తులనాత్మక అధ్యాయానికి’ రూపొందించాడు. ఆర్థికాభివృద్ధి గణనలో ఉపయోగించే ఆదాయేతర సూచిక భౌతిక జీవన ప్రమాణ సూచిక. ఎందుకంటే భౌతిక జీవన ప్రమాణాన్ని సూచికగా ఉపయోగించింది.
ఈ పద్ధతి ఆర్థికాభివృద్ధిని కొలవడానికి మూడు ప్రమాణాలను ఆధారంగా తీసుకుంటుంది. అవి :
- ఆయుః ప్రమాణం,
- శిశు మరణాల రేటు,
- ప్రాథమిక అక్షరాస్యత.
ప్రజలు అత్యంత ప్రాథమిక అవసరాలను పొందడంలో పనితీరును ఈ సూచిక కొలుస్తుంది. ఆరోగ్యం, విద్య, తాగు నీరు, ఆహారం, పారిశుద్ధ్యం లాంటి ప్రాథమిక అవసరాలకు ఈ సూచిక ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది.
ఒక దేశ భౌతిక జీవన ప్రమాణ సూచిక విలువ పెరుగుతుండటం అనేది ఆ దేశ ప్రజల భౌతిక జీవనంలో నాణ్యత పెరిగినట్లుగా సూచిస్తుంది. అంటే ఆయుః ప్రమాణం పెరగడాన్ని, శిశు మరణాల రేటు తగ్గడాన్ని, ప్రాథమిక అక్షరాస్యత రేటు పెరగడాన్ని సూచిస్తుంది. ఒక దేశంలోని తలసరి ఆదాయంలో పెరుగుదల ఆరోగ్యం, ఆహారం, పారిశుద్ధ్యం, విద్య మొదలైన సదుపాయాల పెరుగుదలను సూచించదు. కాబట్టి తలసరి ఆదాయ సూచీకన్నా భౌతిక జీవన ప్రమాణ సూచీ మెరుగైంది. భౌతిక జీవన ప్రమాణ సూచిక జీవన ప్రమాణాన్ని ప్రత్యక్షంగా కొలవడంతో పాటుగా ఏ అంశం విషయంలో సత్వర చర్య అవసరమో తెలుపుతుంది.
పరిమితులు :
భౌతిక జీవన ప్రమాణ సూచికలో కొన్ని పరిమితులున్నాయి.
అవి :
- ప్రాథమిక అవసరాలకు సంబంధించి భౌతిక జీవన ప్రమాణ సూచిక పరిమితమైన కొలమానం అని మోరిస్ అంగీకరించాడు.
- ఆర్థిక, సామాజిక వ్యవస్థ నిర్మితిలో వస్తున్న మార్పులను ఇది వివరించదు.
- ఇది మొత్తం శ్రేయస్సును కొలవదు.
- భౌతిక జీవన ప్రమాణ సూచికలోని మూడు అంశాలకు సమాన భారితాలను ఇవ్వడం జరిగింది.
ప్రశ్న 7.
మానవ వనరుల అభివృద్ధి సూచిక (HDI) భావనను చర్చించుము. ఈ భావనను ఎలా లెక్కిస్తారు ?
జవాబు
మానవ అభివృద్ధి సూచిక (Human Development Index) :
మానవ అభివృద్ధి సూచికను మహబూబ్-ఉల్- హక్ అభివృద్ధి చేయగా, 1990 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం తయారుచేసిన తన మొదటి మానవ అభివృద్ధి రిపోర్ట్లో మానవ అభివృద్ధి సూచికను చేర్చింది. అప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం తన వార్షిక రిపోర్ట్లో మానవ అభివృద్ధిని. కొలవడాన్ని సమర్పిస్తుంది. ఆర్థికాభివృద్ధి సూచికలలో మానవ అభివృద్ధి సూచిక నూతనమైంది. ఒక దేశ సామాజిక, .ఆర్థిక కోణాలలో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సాధనం మానవ అభివృద్ధి సూచిక.
ఈ సూచికను నిర్మించడానికి కింది సూచికలు కావాలి :
- పుట్టుక సమయంలో ఆయుఃప్రమాణం.
- విద్య – వయోజన అక్షరాస్యత, విద్యా సంస్థలలో సమ్మిళిత స్థూల నమోదు నిష్పత్తి.
- డాలర్ల రూపంలో కొనుగోలు శక్తి సమానత ఆధారంగా తలసరి నిజ స్థూల దేశీయోత్పత్తి.
కింద చూపిన విధంగా ఒక్కొక్క సూచికకు స్థిర కనిష్ఠ, గరిష్ట విలువలను ఇచ్చి ప్రతి సూచికకు (indicator) సూచిక (Index) ను సృష్టించి, మానవ అభివృద్ధి సూచికలోని అంశాలకు కింది సాధారణ సూత్రం నుంచి వ్యక్తిగత సూచికలను గణించడం జరుగుతుంది. సూచికల ద్వారా మానవ అభివృద్ధి సూచికను నిర్మించడం జరుగుతుంది.
సూచిక = వాస్తవ విలువ – కనిష్ట విలువ/గరిష్ట విలువ – కనిష్ట విలువ
తరవాత, అంశాల సూచికల సాధారణ సగటు విలువనే మానవ అభివృద్ధి సూచికగా లెక్కిస్తారు. మానవ అభివృద్ధి సూచిక విలువ ‘0’ నుంచి ‘1’ వరకు ఉంటుంది. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 కంటే తక్కువగా ఉన్న దేశాలను అల్ప స్థాయిలో మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను, 0.5 నుండి 0.8 మధ్య గలవి మధ్యస్థ స్థాయిలో మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను, 0.8 కంటే అధికంగా ఉన్నవి అధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను పరిగణింపబడ్డాయి.
మానవ అభివృద్ధి రిపోర్టు 2014లో 2013 సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచికల విలువ ఆధారంగా దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరించడమైంది.
- మానవ అభివృద్ధి సూచిక విలువ 0.8, అంతకంటే అధికంగా ఉన్న దేశాలను అత్యధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
- మానవ అభివృద్ధి సూచిక విలువ 0.7 నుంచి 0.8 వరకున్న దేశాలను అధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను.
- మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 నుంచి 0.7 వరకున్న దేశాలను మధ్యస్థ మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
- మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 కంటే తక్కువగా ఉన్న దేశాలను అల్ప మానవ అభివృద్ధి, చెందిన దేశాలుగాను వర్గీకరించడమైంది.
కింది పట్టికలో భారతదేశ మానవ అభివృద్ధి సూచిక విలువలను చూపించడమైంది.
సంవత్సరం | మానవ అభివృద్ధి సూచిక విలువ |
1990 | 0.427@ |
1995 | 0.546 |
2001 | 0.472 |
2002 | 0.595 |
2007 | 0.612 |
2010 | 0.519 |
2013 | 0.586 |
2017 | 0.640@ |
2018 | 0.647 B |
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఆర్థిక వృద్ధి.
జవాబు.
ఆర్థిక వృద్ధి వస్తు సేవల పెరుగుదలను అంటే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది. ఇది పరిమాణాత్మకమైనది మరియు దీర్ఘకాలికమైన అంశం.
ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధి.
జవాబు.
ఆర్ధికాభివృద్ధి దేశంలో ఆర్థిక వృద్ధి పాటుగా వ్యవస్థాపూర్వక సంస్థాగత, సాంఘిక, ఆర్థిక మార్పులను సూచిస్తుంది. ఇది అభివృద్ధి చెందినదేశాలకు సంబంధించినది. ఈ భావన పరిమాణాత్మకం మరియు గుణాత్మకమైనది. ఇది అభివృద్ధి చెందుతున్న. దేశాలకు సంబంధించినది.
ప్రశ్న 3.
స్వావలంబన (Self Patience).
జవాబు.
ఒక దేశం తనకు అవసరం అయిన వాటిని కొనడానికి సరిపడే మిగులను సృష్టించుకుంటుంది. తనకు అవసరం అయిన వాటిని పొందటానికి అవసరం అయ్యే నిధుల కోసం ఇతర దేశాలపై ఆధారపడదు.
దిగుమతులకు చేయాల్సిన చెల్లింపు సామర్థ్యం దేశానికి ఉంటే దిగుమతులను స్వావలంబన అనుమతిస్తుంది. అయితే ఒక దేశం తాను చేసుకునే దిగుమతులకు చెల్లింపులు చేయడం ద్వారా స్వావలంబనను సాధించే ప్రయత్నం చేస్తుంది.
ప్రశ్న 4.
సుస్థిర అభివృద్ధి.
జవాబు.
సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల అవసరాల విషయంలో రాజీ లేకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం అని బ్రుండ్అండ్ రిపోర్టు నిర్వచించింది. సుస్థిర అభివృద్ధి అంటే అభివృద్ధి నిర్విరామంగా కొనసాగడం. భవిష్యత్తు తరాలు నష్ట పోకుండా పర్యావరణ, మానవ భౌతిక మూలధనం నిల్వలను పరిరక్షిస్తూ పెంపొందిస్తూ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం సుస్థిర అభివృద్ధి లక్ష్యం.
ప్రశ్న 5.
సమ్మిళిత వృద్ధి.
జవాబు.
ఆర్థికాభివృద్ధి గమనాన్ని, తీరును ఈ భావన తెలియజేస్తుంది. ఈ భావనలో వృద్ధి ఫలాలు జనాభాలో దిగువ వర్గాలకు అందటంతో పాటుగా మానసికేతర అంశాలు ఉంటాయి. వృద్ధిఫలాలు అన్ని వర్గాల వారికి సమాన స్థాయిలో పంపిణీ కానందున గతంలో విస్మరించబడిన వర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడం సమ్మిళిత వృద్ధి లక్ష్యం. మొత్తం ఆదాయంలో అతి తక్కువ వాటా కలిగి ఉన్న, విస్మరించబడిన అట్టడుగు వర్గాల ప్రజలను వృద్ధి ప్రక్రియలో చేర్చే ప్రక్రియగా సమ్మిళిత భావనను చూడాలి.
ప్రశ్న 6.
భౌతిక జీవన ప్రమాణ సూచిక.
జవాబు.
ఈ భావనను 1979వ సంవత్సరంలో M.D. మోరిస్ రూపొందించినాడు.
ఆర్థికాభివృద్ధి గణనలో ఉపయోగించే ఈ ఆదాయేతర సూచిక :
- జీవన ప్రమాణం
- శిశుమరణాలు
- అక్షరాస్యతలను వాడుతుంది.
ప్రశ్న 7.
మానవ అభివృద్ధి సూచిక,
జవాబు.
ఈ భావనను మహబూబ్-ఉల్ – హక్ అభివృద్ధి చేయగా, 1990వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం తయారు చేసిన తన మొదటి మానవ అభివృద్ధి రిపోర్ట్లో ఈ సూచికను చేర్చింది.
ఒకదేశ సామాజిక, ఆర్థిక కోణాలలో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సూచీ మానవ అభివృద్ధి సూచిక. ఈ సూచికను నిర్మించడానికి’ మూడు కారకాలు తీసుకుంటారు.
- మెరుగైన జీవనం కోసం ఆదాయం,
- విద్య,
- జీవన ప్రమాణం.
మానవ అభివృద్ధి సూచిక = వాస్తవ విలువ – కనిష్ఠ విలువ/గరిష్ఠ విలువ – కనిష్ఠ విలువ.
ప్రశ్న 8.
లింగ సంబంధిత అభివృద్ధి సూచిక (GDI).
జవాబు.
ఇది కూడా జనాభా సగటు విజయవానలు కొలిచే ఒక సమగ్ర సూచిక. దీనిలో కూడా మూడు అంశాలు పరిగణనలోనికి తీసుకుంటారు.
- రాజకీయ భాగస్వామ్యం
- ఆర్థిక భాగస్వామ్యం
- స్త్రీ పురుషులు ఆర్జించే ఆదాయాలు.
ప్రశ్న 9.
సామాజిక ప్రగతి సూచిక (SPI).
జవాబు.
ఒక దేశం తమ పౌరుల సామాజిక, పర్యావరణ అవసరాలను తీర్చడానికి అందించే సేవలను సామాజిక ప్రగతి సూచిక కొలుస్తుంది. సామాజిక ప్రగతి సూచిక ద్వారా ఆర్థిక కారకాల స్థానంలో సామాజిక, పర్యావరణ పరిరక్షణ సాధన ద్వారా సమాజ సంక్షేమాన్ని అంచనా వేస్తుంది. ఈ సూచికకు అమర్త్యసేన్, డగ్లస్వార్, జోసెఫ్ స్టిగ్లిట్జ్ రచనలు ఆధారం.
ప్రశ్న 10.
బహుపార్శ్వ పేదరిక సూచిక (MPI).
జవాబు.
అత్యంత అణగారిన వర్గాలు కోల్పోయిన అంశాలు విశదీకరించడానికి ఈ భావన ఉపయోగపడుతుంది. ఈ సూచికను 2010వ సం||లో ప్రవేశపెట్టారు. ఒకే సమయంలో బహు కారకాలను కోల్పోయిన కుటుంబాల అధ్యయనానికి ఈ సూచిక అవసరం. భారత సూచికలలో ఎవరైతే కనీసం 33 శాతం కోల్పోతారో వారిని బహుపార్శ్వ పేదలుగా భావిస్తారు. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలతో బహుముఖ కోణ పేదరిక సూచిక దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది.
ప్రశ్న 11.
సహజ వనరులు.
జవాబు.
ప్రకృతిలో లభ్యమవుతూ, జీవరాశులకు ఉపయోగపడేవే సహజ వనరులు. అవి ప్రకృతిలో ముడిరూపంలో దొరుకుతాయి. అవే శక్తి వనరులుగా కూడా ఉపయోగపడతాయి. పర్యావరణంలో లభించే ఈ సహజ వనరులు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి. పరిమితంగా లభ్యమవడం, పరిమితిని ప్రకృతి నిర్ణయిస్తుంది. జీవరసాయన మార్పు ఆధారంగా వీటి విలువ మారుతుంది.
ప్రశ్న 12.
మానవ మూలధనం.
జవాబు.
ప్రజల సమర్థతలను, నైపుణ్యాలను అభివృద్ధి పరచడం మానవ మూలధనం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో శ్రామిక శక్తికి, సాంకేతిక పరమైన నిర్వహణ పరమైన అంశాలలో శిక్షణ కల్పించాల్సి ఉంటుంది. కాని ఇది దీర్ఘకాలంలోనే సాధ్యపడుతుంది.
ప్రశ్న 13.
బీదరిక విషవలయాలు.
జవాబు.
పేదవాడు ఎల్లప్పుడూ పేదరిక విషవలయాల బంధంలో చిక్కుకుని’ ఉంటాడు. అభివృద్ధి చెందడానికి సాధనాలు అతను కలిగి లేనందున అతడు పేదవాడిగానే మిగిలిపోతాడు. ఈ భావనను నర్క్స్ అనే అర్థశాస్త్రవేత్త ప్రవేశపెట్టినాడు. వెనుకబడిన దేశాలు పేదరికపు విషవలయాల్లో చిక్కుకుని వేగవంతమైన అభివృద్ధిని సాధించలేకపోయినాయి. ఈ దేశాలలో పేదరికమే పేదరికానికి గల కారణం. ఇవి డిమాండ్ వైపు, సప్లయ్ వైపు ఉంటాయి.
ప్రశ్న 14.
మూలధన సమీకరణ.
జవాబు.
మూలధన కల్పన అంటే మూలధన నిల్వలో చేరిన నికర పనిముట్లు, భవనాలు మరియు ఇతర మధ్య రకం వస్తువులు. ఒక దేశం మూలధన నిల్వను శ్రమతో కలిపి సేవలను, వస్తువులను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తుంది. మూలధన నిల్వ పెరుగుదలను మూలధన కల్పన అంటారు.
ప్రశ్న 15.
విక్రయం కాగల వ్యవసాయ మిగులు.
జవాబు.
గ్రామీణ జనాభా మనుగడకు కావలసిన ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉన్న వ్యవసాయోత్పత్తిని మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులు అని అంటారు. వ్యవసాయ రంగం ప్రగతిని ఈ భావన సూచిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ మిగులు పైన పట్టణ పారిశ్రామిక ప్రజల మనుగడ ఆధారపడి ఉంటుంది. ఏ దేశం అయినా తగినంత అమ్మదగిన మిగులును సాధించడంలో విఫలం అయినట్లు అయితే తప్పనిసరిగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలి.
ప్రశ్న 16.
సాంఘిక కారణాలు.
జవాబు.
సాంఘిక దృక్పథాలు, విలువలు, సంస్థలు కూడా ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. గున్నార్ మిర్డాల్ ప్రకారం అల్పాభివృద్ధి చెందిన దేశాలలో శీఘ్ర ఆర్థికాభివృద్ధికి విలువల ఆధునీకరణ అవసరం. అనగా ఉత్పాదకతను పెంచడానికి, జీవన స్థాయిలను పెంచడానికి, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి ఉద్దేశ్య పూర్వకంగానే శాస్త్రీయ దృక్పధాన్ని అలవర్చుకోవడం, ఆధునిక