TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 14th Lesson జాతీయ ఉద్యమం – తొలిదశ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 14th Lesson జాతీయ ఉద్యమం – తొలిదశ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జాతీయోద్యమానికి దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
అనేక కారణాల ఫలితంగా భారతదేశంలో జాతీయోద్యమం వచ్చింది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ మొదలయినప్పటి నుంచి 1947లో స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఈ అరవై సంవత్సరాలను పరివర్తన కాలంగా చెప్పవచ్చు. ఈ కాలంలో జాతీయత ఉద్భవించి, అభివృద్ధి చెందడమే గాక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో కూడా దాని
ఉనికి కనిపించింది.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

1. బ్రిటీష్ సామ్రాజ్యవాదం:
జాతీయోద్యమం అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం బ్రిటీష్ సామ్రాజ్యకాంక్ష. బ్రిటీష్ వారు దాదాపు భారతదేశాన్నంతటిని తమ సార్వభౌమాధికారం కిందకి తెచ్చుకున్నారు. వీరి సామ్రాజ్యవాదం పరోక్షంగా భారతదేశాన్ని ఏకంచేసింది.

2. బ్రిటీష్ వారి ఆర్థిక దోపిడి:
బ్రిటీష్వారి పాలనలో భారతదేశంలోని అన్ని వర్గాలవారు ఆర్థిక దోపిడికి గురయ్యారు. భారతదేశ సంపద ఎందరో యూరోపియన్లు ముఖ్యంగా బ్రిటీష్ వారిచే దోపిడి చేయ్యబడింది. ఇది భారతీయులకు ఎక్కువ నష్టం చేసింది. భారతదేశంలోని హస్తకళలు, కుటీర పరిశ్రమలు మూతబడ్డాయి. వ్యవసాయం పైన విపరీతమైన ఒత్తిడి పేదరికానికి దారితీసింది. బ్రిటీష్ వారు అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల భారత వ్యవసాయం, పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఫలితంగా నిరుద్యోగిత పెరిగింది. ఫలితంగా భారతదేశం జీవనవిధాన స్థితి దిగజారిపోయింది.

3. పాశ్చాత్య విద్య:
పాశ్చాత్య విద్య భారతజాతీయోద్యమాన్ని చాలావరకు పెంచి పెద్దచేసిందని చెప్పవచ్చు. మెకాలే చేత సమర్థింపబడి, ప్రవేశపెట్టబడిన ఆంగ్లవిద్య భారతదేశంలో ఉన్నత విద్యకు వాహకంగా పనిచేసింది. 1835లో ఆంగ్లాన్ని బోధనా మాద్యమంగా చేయడం జరిగింది. అనంతరం ఇది విద్యావంతుల భాషగా మారింది. ఆంగ్లవిద్య జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించి నడిపించే నాయకులను తయారు చేసింది.

4. 19వ శతాబ్దంలో జరిగిన సాంఘిక మతసంస్కరణ ఉద్యమాలు:
19వ శతాబ్దంలో జరిగిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు జాతీయ ఉద్యమానికి ఎంతో దోహదపడ్డాయి. జాతీయ చైతన్యం మొదట రాజారామ్మోహన్యతో వచ్చిందని చెప్పవచ్చు. 19వ శతాబ్దం నాటి సంస్కర్తలు రామ్మోహన్రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనీబిసెంట్ వీరంతా ప్రాచీన భారత సంస్కృతిని పునరుద్ధరించారు. దయానంద సరస్వతి, ‘స్వరాజ్’ అనే పదాన్ని మొదటి సారిగా వాడారు. అతను హిందీని జాతీయ భాషగా ప్రకటించాడు.

5. ప్రాచీన భారత సంస్కృతి పునరుజ్జీవనం పట్ల ఆసక్తత:
ఈస్టిండియా కంపెనీ అధికారులలో ఒకరైన సర్ విలియమ్ జోన్స్ బెంగాల్ ఆసియాటిక్ సొసైటీ” ని స్థాపించాడు. ఈ సంస్థ ప్రాచీన భారతదేశచరిత్ర, పురావస్తువులపై పరిశోధన చేపట్టింది. విలియంజోన్స్, మాక్స్ ముల్లర్, మొనియర్ విలియమ్స్ ప్రయత్నాల ఫలితంగా ఘనమైన భారత చరిత్ర పునరుజ్జీవనం చేయబడింది. ఫలితంగా సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. అది జాతీయోద్యమానికి ప్రేరణ కలిగించింది.

6. రవాణా, సమాచార వ్యవస్థల అభివృద్ధి:
రవాణాసమాచార వ్యవస్థల అభివృద్ధి జాతీయోద్యమాన్ని త్వరితంగా తీవ్రతరం చేసింది. రైల్వేలు, టెలిగ్రాఫ్, తంతి, తపాలా వ్యవస్థలు, నిర్మించబడిన రోడ్లు, కాలువలు ప్రజలమధ్య ఐక్యతను పెంచాయి. మరొకవైపు ఈ వ్యవస్థలు జాతీయోద్యమాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చేయడానికి నాయకులకు ఎంతో ఉపయోగపడ్డాయి.

7. విదేశాలతో పరిచయం:
విదేశాలతో భారతీయుల పరిచయం వలన వారు ఆయా దేశాలలో జరిగిన ఉద్యమాలను, ఆర్థిక అభివృద్ధిని, వారి సమస్యలను, విభేదాలను మొదటి, రెండవ ప్రపంచయుద్ధాల వాటి ప్రభావం గురించి తెలుసుకున్నారు. 1905లో జరిగిన రష్యా – జపాన్ యుద్ధంలో రష్యా ఓటమి ఆసియావాసులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించింది.

8. వార్తాపత్రికలు:
ఆంగ్ల మరియు ప్రాంతీయ భాషలలో వెలువడిన వార్తాపత్రికలు, జాతీయ ఉద్యమాన్ని ప్రేరేపించాయి. ‘ఇండియన్ మిర్రర్’, ‘బాంబే సమాచార్’, ‘ద హిందూ పేట్రియాట్’, ‘అమృత్బజార్ పత్రిక’, ‘ద హిందూ’, ‘కేసరి’, ‘బెంగాలీ’ మొదలైన పత్రికలు అమిత ప్రభావాన్ని చూపించాయి.

9. లిట్టన్ ప్రభువు పరిపాలన:
భారతదేశంలో కరువు ఏర్పడినా పట్టించుకోకుండా విపరీత ధోరణిలో లిట్టన్ విక్టోరియా మహారాణిని భారతదేశపు సామ్రాజ్ఞిగా ప్రకటించాడు. అంతేగాక అతను ప్రవేశపెట్టిన ప్రాంతీయ భాషా పత్రికల చట్టం, పత్రికల స్వేచ్ఛను హరించివేసింది. భారతీయుల వద్ద ఆయుధాలు లేకుండా చేయడం కోసం ఆయుధ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా భారతీయులలో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.

10. ఇల్బర్ట్ బిల్లు వివాదం:
1883 లో జరిగిన ఇల్బర్టు బిల్లుపై ఆంగ్లేయులు చేసిన వివాదం భారత జాతీయోద్యమానికి ఎంతో ప్రేరణనిచ్చింది. భారతీయులను జిల్లా మాజిస్ట్రేట్లుగా నియమించడం ద్వారా జాతి అసమానతలను తొలగించడానికి ఈ బిల్లు ప్రయత్నం చేసింది. ఈ మాజిస్ట్రేట్ యూరోపియన్లు వివాదాలను కూడా చూస్తాడు. ఇటువంటి అవకాశం భారతీయులకీయడం పట్ల బ్రిటీష్ వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా వారు బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఫలితంగా బిల్లును ప్రవేశపెట్టిన రిప్పన్ బలవంతగా దానిని రద్దు చేయవలసి వచ్చింది. ఈ ఆందోళనలో బ్రిటీష్వారు గెలవడం వారు చూపిస్తున్న జాతి వివక్షత భారతీయులకొక గుణపాఠం అయ్యింది. ఫలితంగా వారు కూడా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఒక వ్యవస్థీకృత ఆందోళనను చేపట్టాలని దాని ద్వారా స్వాతంత్య్రం సాధించవలసిన ఆవశ్యకత ఉందని గుర్తించారు. ఈ బిల్లు ద్వారా బ్రిటీష్వారికి భారతీయులపై గల జాతివివక్షత కూడా తెలిసివచ్చింది. ఈ కారణాలన్నీ కూడా జాతీయోద్యమాన్ని బలోపేతం చేశాయి.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

ప్రశ్న 2.
మితవాదుల పాత్రను అంచనా వేయండి.
జవాబు.
1885-1905 మధ్య కాలాన్ని ఉదార జాతీయవాద కాలమని చెప్పవచ్చు. ఈ కాలం కాంగ్రెస్ మితవాదుల నాయకత్వంలో నడిచింది. ఈ నాయకులకు బ్రిటీష్వారి న్యాయ భావంపై పరిపాలనపై నమ్మకం ఉండేది. ఉదారవాద నాయకులలో ముఖ్యులు ఫిరోజ్ మెహతా, గోపాలకృష్ణ గోఖలే, ఉమేష్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ బెనర్జీ, దాదాబాయ్ నౌరోజీ, రస్ బహారీబోస్, బద్రుద్దీన్ త్యాబ్ది మొదలైనవారు. దాదాబాయ్ నౌరోజి, రానడే సురేంద్రనాథ్ బెనర్జీ భారతదేశంలో పెరిగిపోతున్న పేదరికంపై అవగాహన కలిగి ఉండేవారు. భారతదేశంలో ఉన్న పేదరికం యొక్క ప్రభావం బాధాకరమైన రాజకీయ పరిస్థితులపై ప్రబలంగా ఉందని దాదాబాయ్, రానడే సురేంద్రనాథ్ బెనర్జీ నమ్మేవారు. భారత జాతీయవాదం ఆర్థిక పునాదుల సిద్ధాంతాన్ని దాదాబాయ్ నౌరోజీ రూపొందించారు. భారత ఆర్థిక వ్యవస్థ భారీ హరణకు గురి అవుతుందని ఆయన గుర్తించారు. భారత వనరుల హరణ ఫలితంగా దేశం దోపిడికి గురయ్యింది. దాదాబాయ్ తన గ్రంథం “పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా”లో ‘సంపద హరణ సిద్ధాంతాన్ని’ రాజకీయ ఆర్థిక దృష్టితో చూపించారు.

భారత రాజకీయ, ఆర్థిక రంగాలలో వచ్చిన సహజ హక్కుల భావన మితవాద నాయకుల సహకారం వల్లనే వచ్చింది. దాదాబాయ్ తన ‘సంపద హరణ సిద్ధాంతం’లో బ్రిటీష్వారు భారతదేశం నుంచి విస్తారమైన సంపదను తరలిస్తున్నారని సూచించాడు. ఈ ఆర్థిక హరణ భారతదేశంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది. అధికమైన పన్నులు, పరిశ్రమల క్షయం దీని ఫలితమే.. ఈ సిద్ధాంత వివరణలో తమ స్వంత వనరుల ద్వారా తమకు తాము అభివృద్ధి చెందించుకునే సహకారాన్ని అందించమని ఆయన బ్రిటీష్ వారిని ప్రాధేయపడ్డాడు. ఇదే సమయంలో భారత వనరుల అభివృద్ధి కోసం అతనిని లండన్కు ఆహ్వానించారు.

ఉద్యమ మొదటి దశకాలంలో కాంగ్రెస్ తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి రాజ్యాంగబద్ధయుతమైన పద్ధతులనే ఎంచుకుంది. వారు ప్రార్ధన, అభ్యర్థన, నివేదన పద్ధతులను నమ్మారు. కాంగ్రెస్ అభ్యర్థన ఈ కింది విషయాలపై ఉండేది.

  • ప్రతినిధి సంస్థల ఏర్పాటు ఇండియన్ కౌన్సిల్ రద్దు
  • వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క భద్రత
  • భారతీయులను ఉన్నత పదవులలో నియమించడం
  • పౌర, సైనిక వ్యయాన్ని తగ్గించడం
  • కార్యనిర్వాహక, న్యాయశాఖలను వేరు చేయడం
  • జాతి వివక్షతను నిర్మూలించి భారతీయులకు ఉద్యోగ అవకాశాలు అధికం చేయడం.
  • ఇంగ్లండుకు సంపద చేరవేతను ఆపడం
  • ఆధునిక పరిశ్రమలను ఏర్పాటు చేయడం
  • కరువు సమయాలలో ఉపశమన చర్యలు చేపట్టడమేగాక రుణాలను ఏర్పాటు చేయడం.
  • జాతీయ విద్యావిదానాన్ని అమలు చేయడం

పై అంశాలన్నింటిని ఒక అభ్యర్ధన రూపంలో కాంగ్రెస్ బ్రిటీష్ ప్రభుత్వం ముందు ఉంచింది. కానీ దానివల్ల వచ్చిన ఫలితం ఏమీలేదు. ఏదేమైన కాంగ్రెస్ ప్రయత్నాల ఫలితంగా 1892 భారతకౌన్సిల్ చట్టం ఏర్పాటు చేయబడింది. ఈ చట్టం ప్రాంతీయ సంస్థల ఏర్పాటుకు, సభ్యులకు బడ్జెట్ పైన చర్చించడం, ప్రజోపయోగ విషయాలపై ప్రశ్నించే అధికారాన్ని కల్పించింది. అంతేగాక ఈ చట్టం యూనివర్శిటీ సెనేట్, మున్సిపాలిటీలు, జిల్లా బోర్డుల ఏర్పాటును, అభ్యుర్థులను నామినేట్ చేసే అధికారాన్ని ప్రధానం చేసింది. శాసనసభ విస్తరింపబడింది. ఈ చట్టం కాంగ్రెస్ను ఏమాత్రం సంతృప్తి పర్చలేదు. కాంగ్రెస్ తన విన్నపాలన్నింటిని ప్రభుత్వం ముందు నివేదించింది. కానీ అది సఫలం కాలేదు. అందువల్ల కాంగ్రెస్ విధానాలను ‘రాజకీయ సూచన’గా వర్ణించడం జరిగింది. ఈ విధానాన్ని అతివాద నాయకులైన లాలాలజపతి రాయ్ వంటి వారు తీవ్రంగా విమర్శించారు.

మితవాదులు తాము అనుకున్నవి సాధించడంలో విఫలమయ్యారు. కేవలం కొన్ని డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం తీర్చింది. ఫలితంగా ప్రజల ఆతృతలను, ఆకాంక్షలను తీర్చి వారిని శాంతింప జేయడంలో విఫలమయ్యింది. కానీ ప్రజలలో ప్రజాస్వామ్యం పౌరస్వేచ్ఛ పట్ల చైతన్యాన్ని తీసుకొని రావడంలో సఫలమయ్యింది. నిజానికి రెండవసారి భారత జాతీయోద్యమంలో ఈ మితవాద దశ వచ్చిందని చెప్పవచ్చు. మితవాదులు తమ విధానాలలో గొప్ప విజయాన్ని సాధించకపోయినా భారత రాజకీయాలలో నిర్ణయాత్మక మార్పులను సుసాధ్యం చేశారు.

ప్రశ్న 3.
అతివాద ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ పాత్రను వివరించండి.
జవాబు.
భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India’s unrest) గా భావిస్తారు. ఈయనకు ‘లోకమాన్య’ అనే బిరుదు కూడా ఉంది. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటి తనం ఆయనకు సహజం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు. తిలక్ 1890లో కాంగ్రెస్లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మాడు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటీషు ప్రభుత్వాన్ని, ప్రభుత్వవిధానాలను “Pray, Petition, Protest” చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు. “మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు” అని అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునే వాళ్ళ సంఘం (బెగ్గర్స్ ఇన్స్టిట్యూషన్)” అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను 3-డే తమాషాగా అభివర్ణించాడు. “స్వరాజ్యం నా జన్మహక్కు” దాన్ని నేను పొంది తీరుతాను అని గర్జించాడు. 1907లో మహారాష్ట్రలోని సూరత్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయ్యారు. అదే సమావేశంలో కాంగ్రెసు, ముస్లింలీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది. ఆయన పాశ్చాత్య విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చే విధంగా ఉందని, ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయుడికి/ భారతీయురాలికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి బోధించాలన్నది ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్లతో కలిసి “దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటి” ని స్థాపించాడు. పాత్రికేయవృత్తిలో ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు “మరాఠా (ఆంగ్ల పత్రిక)”, “కేసరి (మరాఠా పత్రిక)” లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటీషు పాలనలోని వాస్తవ పరిస్థితులు గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు. ఇతర కార్యక్రమాలు జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగార శిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాస శిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన “గీతారహస్యం” అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం. హోంరూల్ లీగ్: 1916 ఏప్రిల్లో హోంరూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్య భారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంట్ అదే సంవత్సరం సెప్టెంబర్లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన లండన్కు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు “బ్రిటిషు సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్యడమే ప్రభుత్వ విధానమని” బ్రిటీషు ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిషు ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంట్ ఆ ప్రకటనతో ఉద్యమాన్ని ఆపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారి కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920లో (ఆగస్టు 1వ తేదీ) తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావ అవుతుందని చాలామంది భయపడ్డారు.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

“గాంధీ అని ఇంకొకాయన ఉన్నాడు గానీ అబ్బే ! ‘తిలక్ ముందర ఏపాటి?” అనుకున్నారు. కానీ “నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది”, అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగాడు.

ప్రశ్న 4.
హోంరూల్ ఉద్యమంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
బ్రిటీషు సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే భారతదేశానికి స్వపరిపాలనను సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఉద్యమాన్ని హోంరూల్ ఉద్యమం అంటారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో 1916లో హోంరూల్ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి నాయకులు బాలగంగాధర్ తిలక్, అనీబిసెంట్లు. బాలగంగాధర్ తిలక్: హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించటానికి తిలక్ 1916ఏప్రియల్లో బొంబాయిలో ఒక హోంరూల్ లీగు స్థాపించాడు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యభారత్ ప్రాంతాలలో తిలక్ తన ప్రచారాన్ని సాగించాడు. తన “మరాఠా”, “కేసరి” పత్రికల ద్వారా హోం రూల్ భావాన్ని ప్రచారం చేశాడు. తిలక్ హోంరూల్ ఉద్యమ ప్రచారం ప్రజలను చైతన్యవంతుల్ని చేసి, వారిలో స్వీయపాలనాభావాన్ని పటిష్టపరిచింది.

అనీబిసెంట్: హోంరూల్ ఉద్యమం కోసం అనీబిసెంట్ 1916 సెప్టెంబర్ నెలలో మద్రాసులో ఒక హోంరూల్ లీగ్ను స్థాపించింది. మద్రాసు పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమాన్ని అక్కడ ప్రచారం చేసింది. తన “న్యూ ఇండియా”, “కామన్వీల్” అనే పత్రికల ద్వారా అనీబిసెంట్ తన ప్రచారాన్ని సాగించింది.

హోంరూల్ ఉద్యమ వ్యాప్తి: తిలక్, అనీబిసెంట్ల కృషి వలన హోంరూల్ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఈ ఉద్యమం గురించి ప్రజలకు వివరించడానికి అనేక భాషల్లో అనేక కరపత్రాలను కూడా ప్రచురించారు. హోంరూల్ను సమర్థిస్తూ అనేక నగరాల్లో, గ్రామాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హోంరూల్ ఉద్యమ కాలంలో అనీబిసెంట్ జాతీయవిద్యకు చాలా ప్రాముఖ్యం ఇచ్చింది. విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడం జాతీయ విద్య లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ఆమె మదనపల్లిలో ఒక కళాశాల నెలకొల్పింది. వారణాసిలో హిందూ విద్యాలయాన్ని నెలకొల్పడానికి కూడా ఆమె కృషి చేసింది. ప్రభుత్వ చర్యలు: 1917 నాటికి అనీబిసెంట్ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆందోళన చెంది, ఆమెను నిర్బంధించింది. ఆమె నిర్బంధాన్ని నిరసిస్తూ అనేక ప్రాంతాలలో సభలు, ప్రదర్శనలు జరిగాయి. తిలక్ దేశ ఉత్తర ప్రాంతాల్లో పర్యటించడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. దీనిని కూడా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా ఆందోళనకు తలవగ్గి, అనీబిసెంట్ను మద్రాస్ ప్రభుత్వం 1917 సెప్టెంబరు నెలలో విడుదల చేసింది. ఆమె దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను 1917లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనీబిసెంట్.

ఉద్యమవ్యాప్తికి కారణాలు: బ్రిటీష్ ప్రభుత్వం ఉద్యమ నాయకులను నిర్భందించి ఉద్యమ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. హోంరూల్ ఉద్యమ వ్యాప్తికి కొన్ని కారణాలున్నాయి.

  1. 1907 సూరత్ సమావేశంలో చీలిపోయిన కాంగ్రెస్ 1916లో సమైక్యమై సంయుక్తంగా ఉద్యమించింది.
  2. బెంగాల్ విభజన రద్దు కావటంతో వందేమాతరం ఉద్యమాన్ని నిర్వహించిన ఉద్యమకారులంతా తమ దృష్టిని హోంరూల్ ఉద్యమం వైపుకు మళ్లించి ఉద్యమానికి బలాన్ని చేకూర్చారు.
  3. మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్ ముస్లిం రాజ్యాల యెడల అవలంబించిన వైఖరి భారతదేశంలో ముస్లింలకు కోపాన్ని కలిగించింది. అందువల్ల వారు కాంగ్రెస్తో 1916లో లక్నో ఒడంబడికను కుదుర్చుకొని స్వీయ పాలనోద్యమంలో పాల్గొన్నారు.

ఉద్యమ ముగింపు: హోంరూల్ ఉద్యమ ఫలితంగా ప్రజలలో నెలకొన్న రాజకీయ చైతన్యాన్ని, బ్రిటీషుపాలన యెడల వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించటానికి 1917 ఆగస్టు 20వ తేదీన భారతరాజ్య వ్యవహారాల మంత్రి మాంటేగ్ ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ప్రకారం క్రమక్రమంగా భారతీయులకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పరచబడుతుంది. ఈ ప్రకటన తరువాత బ్రిటీషు ప్రభుత్వం అనీబిసెంట్ను విడుదల చేయగా ఆమె హోంరూల్ ఉద్యమాన్ని నిలిపివేసింది. తిలక్ ఉద్యమాన్ని మరికొన్నాళ్లు కొనసాగించాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన గురించి రాయండి.
జవాబు.
1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన భారత జాతీయోద్యమ చరిత్రలో నూతన ఒరవడిని సృష్టించింది. దీని నిర్మాణం, ఉనికి అలన్ అక్టేనియన్ హ్యుమ్ చొరవతో జరిగింది. ఇతను ఒక విశ్రాంత ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగి. భారతీయుల కోసం ఈ సంస్థ ఏర్పాటు అవసరం గురించి చెపుతూ ఏ.ఒ. హ్యూమ్ “మన చర్యల వల్ల భారతీయులలో తీవ్రంగా అభివృద్ధి చెందుతున్న అసంతృప్తిని తొలగించడానికి మన భద్రతకు ఒక సంస్థ స్థాపన అత్యవసరం” అన్నాడు. ఫలితంగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. అప్పటి భారత వైస్రాయ్ కూడా ఈ సంస్థ ఆవిర్భావంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. అతను ఈ కాంగ్రెస్ ఇంగ్లాండులో ఘనత వహించిన సామ్రాజ్ఞికి ప్రతిపక్షంగా ఉండాలనుకున్నాడు. ఈ రెండు కారణాల ఫలితంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగింది. దీని మొదటి సమావేశం బొంబాయిలో డబ్ల్యూ.సి. బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కేవలం 72 మంది సభ్యులు హాజరయ్యారు.

ప్రశ్న 2.
సూరత్ కాంగ్రెస్ సమావేశం గురించి రాయండి.
జవాబు.
మితవాదులు, అతివాదుల మధ్య బేధాభిప్రాయాలు పెరుగుతున్న సమయంలో 1907లో సూరత్ సమావేశం జరిగింది. 1905లో బెనారస్లో జరిగిన సమావేశం మితవాది అయిన గోపాలకృష్ణ గోఖలే ఆధ్వరంలో నడిచింది. 1906లో కలకత్తాలో జరిగిన సమావేశంలో అధ్యక్షపదవిని అతివాదులు పొందాలని ప్రయత్నించారు. కానీ మితవాదులు దౌత్యం చేసి దాదాబాయ్ నౌరోజీ ‘గ్రాండ్ ఓల్డ్మన్ ఆఫ్ ఇండియా’ పేరు ప్రతిపాదించడంతో అతివాదులు ఏమీ చేయలేకపోయారు. దాంతో వారు 1907లో ఆ పదవిని ఆశించారు. ఆ సమావేశంలో మితవాదులు రసి బిహారీ బోస్ పేరును ప్రతిపాదించగా అతివాదులు లజపతిరాయ్ పేరును ప్రతిపాదించారు. స్వపరిపాలన, విదేశీ వస్తుబహిష్కరణ, జాతీయ విద్యావిధానం మొదలైన వాటిని ఎజెండాలో చేర్చలేదని అతివాదులు కోపగించారు. దాంతో లజపతిరాయ్ పోటీ నుంచి తప్పుకున్నాడు. సమావేశంలో తిలక్ ప్రసంగించాలని అనుకున్నాడు. కానీ అతనికి అనుమతి ఇవ్వలేదు. దాంతో సమావేశంలో ఆందోళన, కల్లోలం ఏర్పడ్డాయి. మితవాదులు అతివాదులను సమావేశం నుంచి బహిష్కరించారు.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

ప్రశ్న 3.
1905లో జరిగిన బెంగాల్ విభజనను విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు.
అతివాద దశలో మొదటి పరిణామం, బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం. దీనినే వందేమాతరం ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అంటారు. ఈ ఉద్యమానికి కారణం బెంగాల్ విభజన. 1905లో కర్జన్ పరిపాలనా సౌలభ్యాన్ని సాకుగా చూపి బెంగాల్ను రెండుగా విభజించాడు. కానీ నిజానికి ‘విభజించు పాలించు’ అన్న సిద్ధాంతాన్ని అమలుపరుస్తూ హిందూ, ముస్లింలు అధికంగా ఉన్న తూర్పు పశ్చిమ బెంగాల్లను రెండుగా విభజించినాడు. హిందూ ముస్లింలను వేరుచేయడం ద్వారా జాతీయ ఉద్యమాన్ని దెబ్బతీయాలని భావించాడు. అతని చర్యను అతివాదులే గాక మితవాదులు కూడా విమర్శించారు.

బెంగాల్ విభజనను అధికారికంగా 1905, జులై 4న ప్రకటించారు. కానీ అమలులోకి వచ్చింది 16 అక్టోబర్ 1905న. బెంగాల్ ప్రజలు 16 అక్టోబరు సంతాపదినంగా ప్రకటించారు. ఆ రోజున ఉపవాస దీక్షలు చేశారు. కలకత్తాలో ప్రజలు అర్ధనగ్నంగా తిరిగారు. గంగలో స్నానం చేసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా రాఖీలు కట్టుకున్నారు. ఈ ఉద్యమాన్ని మొదట మితవాద నాయకులైన సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్లు నడిపించారు. అనంతరం ఇది అతివాదులు, తీవ్రవాదులు చేతిలలోకి వెళ్ళిపోయింది.

ప్రశ్న 4.
ముస్లింలీగు ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
ముస్లిం మైనారిటీలకు సంబంధించిన విషయాలను కాపాడటం కోసం ముస్లింలీగ్ స్థాపించబడింది. నిజానికి ముస్లింలపై జరుగుతున్న అణచివేత కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఏర్పడింది. ఈ సంస్థ స్థాపనకు దారితీసిన పరిస్థితులు తెలుసుకోవాలంటే ముందు హిందూ, ముస్లిం సంబంధాలు, ఆంగ్లో- ముస్లింల సంబంధాలు తెలుసుకోవాలి. 18వ శతాబ్దంలో బ్రిటీష్వారు భారతదేశంలో అధికార స్థాపన చేస్తున్న కాలంలో ముస్లింలను తమ బలీయమైన శత్రువులుగా భావించారు. ఇదే ద్వేష భావన 1857 అనంతరం కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడటం, హిందువులు దానిలో ముఖ్య భూమికను పోషించడంతో దానిని బలహీనం చేయడం కోసం ఆ ద్వేషాన్ని హిందువులపైకి మరల్చారు. కాంగ్రెస్లో నిర్లక్ష్యం చేయబడిన ముస్లింలను బ్రిటీష్వారు దగ్గరికి తీశారు. భారతదేశంలో ముస్లింల అవసరాలను బ్రిటీష్ వారు గుర్తించారు. ఇది వారిపైన ప్రేమతో ‘విభజించు, పాలించు’ అన్న వారి సిద్ధాంతాల ప్రకారం కొనసాగించారు.

కొందరు ముస్లింలు బెంగాల్ విభజనను స్వాగతించారు. ఎందుకంటే ఇది ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలను వేరు చేసింది. అందుకే వారు విభజన ఆందోళనలను వ్యతిరేకించారు. భారత జాతీయోద్యమాన్ని అణచడానికి ముస్లింలను వాడుకొన్నారు. 1906లో ముస్లింలను వేరు చేయడానికి వైస్రాయ్ మింటో బ్రిటీష్ అధికారులను నియమించి ముస్లిం ప్రతినిధి వర్గాన్ని, హిందూ ముస్లింల వేర్పాటుకు ప్రయత్నించాడు. ముస్లింల ఈ విజయంతో ఢాకా నవాబు సలీముల్లాఖాన్ 1906లో ముస్లింలీగ్ స్థాపించాడు. దీనికి ఆగాఖాన్ మొదటి అధ్యక్షుడు. బ్రిటీష్ వారికి విశ్వాసంగా ఉంటూ ముస్లింల రాజకీయ ఇతర హక్కులను కాపాడటం దీని లక్ష్యం. ఇది ఏ మాత్రం భేదభావం లేకుండా ముస్లింలు మరియు ఇతర సంఘాలతో స్నేహభావాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది. మార్లే కాంగ్రెస్కు వ్యతిరేకమైన ముస్లిం లీగును స్వాగతించాడు.

ప్రశ్న 5.
1909 మింటో – మార్లే చట్టంలోని నిబంధనలను తెలపండి.
జవాబు.
వందేమాతర ఉద్యమం బలహీనపడిన తరువాత బ్రిటీష్ ప్రభుత్వం మితవాదులను సంతృప్తి పరచడానికి 1909లో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని రాజ్యాంగ సంస్కరణల పేరుతో ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలను మింటో మార్లే సంస్కరణ అంటారు. మింటో వైశ్రాయ్ కాగా, మార్లే భారత కార్యదర్శి.

ఈ చట్టం కేంద్ర, ప్రాంతీయ శాసనసభలను విస్తృతపరచింది. కేంద్రశాసనసభ సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంచబడింది. అందులో 37 మంది అధికారిక, 23 మంది అనధికార సభ్యులు. పెద్ద ప్రాంతీయ శాసనసభ సభ్యుల సంఖ్య 50 వరకు, చిన్న శాసనసభ సభ్యుల సంఖ్య 30వరకు పెంచబడింది. కేంద్ర శాసనసభలో సభ్యులకు తీర్మానాలను ప్రతిపాదించడం ప్రశ్నలను సంధించే హక్కు ఇవ్వబడింది. బడ్జెట్పైన చర్చించే హక్కు ఇవ్వబడింది. ఈ చట్టంలోని మరొక ముఖ్య అంశం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. మింటోమార్లే చట్టాలు భారతీయులను సంతృప్తి పరచలేకపోయాయి. బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు అనే కాంగ్రెస్ డిమాండ్ విస్మరించ బడింది. అంతేకాక ముస్లింలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక నియోజకవర్గాలు హిందూ, ముస్లిం ఐక్యత మీద పెద్ద దెబ్బకొట్టాయి. ఈ విధానం సిక్కులకు క్రిస్టియన్లకు ఇతరులకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటుకు మార్గం వేసింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అరవిందోఘోష్. జవాబు. అరవిందో సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు. కవి, జాతీయవాది, యోగి మరియు గురువు. ఈయన భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈయన ఆధ్యాత్మిక విలువలతో నాయకులని ప్రభావితం చేసారు. వందేమాతరం గేయాన్ని ఆంగ్లభాషలోకి అనువాదం చేసారు. అరవిందో రాజకీయం నుంచి క్రమంగా ఆధ్యాత్మికత వైపుగా ప్రవేశించారు. పుదుచ్చేరిలో నాలుగేళ్ళ ఏకగ్రతతో యోగసాధన చేసి 1914లో ఆర్య అనే మాసపత్రికను వెలువర్చారు. దీని ద్వార తన భావాలు ప్రకటించేవారు.

ప్రశ్న 2.
సంపద హరణ సిద్ధాంతం.
జవాబు.
భారత రాజకీయ, ఆర్థిక రంగాలలో వచ్చిన సహజ హక్కుల భావన మితవాద నాయకుల సహకారం వల్లనే వచ్చింది. దాదాబాయ్ తన ‘సంపద హరణ సిద్ధాంతం’లో బ్రిటీష్వారు భారతదేశం నుంచి విస్తారమైన సంపదను తరలిస్తున్నారని సూచించాడు. ఈ ఆర్థిక హరణ భారతదేశంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది. అధికమైన పన్నులు, పరిశ్రమల క్షయం దీనిఫలితమే. ఈ సిద్ధాంత వివరణలో తమ స్వంత వనురుల ద్వారా తమకు తాము అభివృద్ధి చెందించుకునే సహకారాన్ని అందించమని ఆయన బ్రిటిష్ వారిని ప్రాధేయపడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 14 జాతీయ ఉద్యమం – తొలిదశ

ప్రశ్న 3.
అనుశీలన సమితి.
జవాబు.
1902లో బెంగాల్లో ‘అనుశీలన సమితి’ అనే రహస్య విప్లవ సంఘం ఏర్పాటు అయ్యింది. దీని వ్యవస్థాపకులలో బరీంద్రకుమార్ ఘోష్, జతీంద్రనాథ్ బెనర్జీ మరియు ప్రమోద్ మిత్తర్ ఉన్నారు. అరవింద్ ఘోష్, మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్లు (అనంతకాలంలో ఈమె సిస్టర్ నివేదితగా పేరుగాంచింది) దీనిని ప్రోత్సహించారు. బరీంద్రకుమార్ ఘోష్ ‘యుగాంతర్’ అనే విప్లవ పత్రికను నడిపి దానిలో విప్లవ భావాలను ప్రచురించాడు. బరీంద్రకుమార్ ఘోష్, భూపేంద్రనాథత్లు 1906లో తూర్పు బెంగాల్ డిప్యూటి గవర్నర్ ఫుల్లర్ను చంపే ప్రయత్నం చేశారు. కానీ అది నిష్పలమయింది. 1908లో ఖుదీరాంబోస్, ప్రఫుల్లచాకీలు జనులచేత విమర్శింపబడిన ముజఫర్పూర్ జడ్జి కింగ్స్ఫర్డ్ను చంపే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో ప్రఫుల్లచాకీ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఖుదీరాంబోసు పట్టుకొని ఉరితీశారు.

ప్రశ్న 4.
అభినవ భారతి.
జవాబు.
1897లో మహారాష్ట్రలోని పూనాలో ప్లేగువ్యాధి ప్రబలింది. బ్రిటీష్ అధికారులు రాండ్ మరియు ఐరెస్ట్లు అమానవీయ పద్ధతులలో దీని నిర్మూలన చేపట్టారు. వీరిని దామోదర చాపేకర్, బాలకృష్ణ చాపేకర్లు చంపారు. 1904లో ప్రభుత్వం చాపేకర్ సోదరులను ఉరితీసింది. ఈ కాలంలో ‘అభినవ భారత్’ అనే రహస్య సంఘం ఏర్పడింది. దీని స్థాపకులలో వినాయక దామోదర సావర్కార్, గణేష్ సావర్కార్ ఉన్నారు. గణేష్ సావర్కార్ తన రాతల ద్వారా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడని నాసిక్ జడ్జి జాక్సన్ అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు. దీనికి ప్రతీకారంగా అభినవ భారతి సభ్యుడైన అనంతలక్ష్మణ్ కార్కర్ జాక్సన్ న్ను చంపాడు. దీనినే నాసిక్ కుట్రకేసు అంటారు. ఇందులో 27 మందిని దోషులుగా తేల్చారు. ఈ కేసులో దామోదర సావర్కరు జీవితఖైదు శిక్షవేసి అండమాన్ జైలుకు పంపారు.

ప్రశ్న 5.
గదర్పార్టీ.
జవాబు.
గదర్పార్టీని భారత విప్లవకారులు అమెరికాలో స్థాపించారు. ‘గదర్’ అనగా విప్లవం. ‘గదర్’ అనే పత్రికను కూడా ప్రారంభించారు. ఈ పత్రిక ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, గురుముఖి నాలుగు భాషలలో వెలువడింది. ఈ పత్రిక భారతదేశం మరియు విదేశాలలో విప్లవ భావాలను ప్రచారం చేసింది. ఈ పార్టీ లాలాహరదయాళ్ నాయకత్వంలో నడిచింది. ఆంధ్రప్రాంతానికి చెందిన దర్శి చెంచయ్య ఈ పార్టీ సభ్యుడు. ఈ పార్టీ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఒక విప్లవాన్ని తీసుకొని రావాలని ప్రయత్నం చేసింది గానీ అది విఫలమయ్యింది. ఈ విప్లవకారులందరూ భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో తగిన గుర్తింపును పొందారు. వారి దేశభక్తి, త్యాగనిరతిని ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు.

Leave a Comment