Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download అపరిచిత గద్యాలు Questions and Answers.
TS 8th Class Telugu అపరిచిత గద్యాలు
ఈ క్రింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజాన్ని పరిపాలించిన రాజులలో అగ్రగణ్యులు. వీరి ఆస్థానంలో అష్టదిగ్గజములనే పేరుతో ఎనిమిది మంది కవి పండితులుండేవారు. వారిలో అల్లసాని పెద్దన మొదటివాడు. వీరు ‘మనుచరిత్ర’ అను ప్రబంధమును రాశారు. శ్రీకృష్ణదేవరాయలు తాను స్వయంగా కవి, ఆయన ‘ఆముక్త మాల్యద’ అను ప్రబంధాన్ని రాశాడు. దీనికే ‘విష్ణుచిత్తీయము’ అను నామాంతరం కలదు. ‘వికటకవి’ అని పేరుగాంచిన తెనాలి రామకృష్ణుడు తెలుగు నుడికారము వెల్లివిరియునట్లు ‘పాండురంగ మాహాత్మ్యము’ అను గ్రంథాన్ని రాసాడు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
వికటకవి ఎవరు?
జవాబు.
వికటకవి తెనాలి రామకృష్ణుడు.
ప్రశ్న 2.
పెద్దన రాసిన ప్రబంధమేది?
జవాబు.
పెద్దన ‘మనుచరిత్ర’ అను ప్రబంధమును రాశాడు.
ప్రశ్న 3.
ఆముక్తమాల్యదకు గల మరియెక పేరేది?
జవాబు.
ఆముక్తమాల్యదకు ‘విష్ణుచిత్తీయము’ అని మరొక పేరు కలదు.
ప్రశ్న 4.
అష్టదిగ్గజములు ఎవరి ఆస్థానములో వెలుగొందారు?
జవాబు.
అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో వెలుగొందారు.
ప్రశ్న 5.
తెనాలి రామకృష్ణుడు రాసిన గ్రంథమేది?
జవాబు.
తెనాలి రామకృష్ణుడు ‘పాండురంగ మాహాత్మ్యము’ అను గ్రంథాన్ని రాశాడు.
2. 1929 జనవరి 15న జార్జియాలోని అట్లాంటాలో మార్టిన్ లూథర్ కింగ్ జన్మించాడు. అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ జాతీయుల నాయకుడితడు. మహాత్మాగాంధీ ఉపన్యాసం విని, ఉత్తేజితుడై తన నల్ల జాతీయుల విముక్తి కోసం పోరాటం సాగించాడు. మహాత్ముని పుస్తకాలను కొన్నాడు. 1951 లో బోస్టన్ యూనివర్శిటీలో డాక్టరేటు పేరు నమోదు చేసుకొని 1955లో డాక్టరేట్ను సంపాదించాడు. 1963లో ఆఫ్రికన్ అమెరికన్లతో శాంతియాత్రను కొనసాగించాడు. తన 35 వ ఏట అనగా 1964లో నోబెల్ శాంతి బహుమతిని పొందాడు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడు జన్మించాడు?
జవాబు.
1929 జనవరి 15న జన్మించాడు.
ప్రశ్న 2.
కింగ్ ఎవరి పుస్తకాలు కొన్నాడు?
జవాబు.
మహాత్ముని పుస్తకాలు కొన్నాడు.
ప్రశ్న 3.
నోబెల్ శాంతి బహుమతిని ఎపుడు పొందాడు?
జవాబు.
తన 35వ ఏట 1964లో పొందాడు.
ప్రశ్న 4.
కింగ్ ఏ జాతీయుల నాయకుడు?
జవాబు.
అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ జాతీయుల నాయకుడు.
ప్రశ్న 5.
నల్ల జాతీయుల విముక్తి కోసం పోరాడడానికి కింగ్కు ప్రేరణ ఏది?
జవాబు.
మహాత్మాగాంధీ ఉపన్యాసం.
3. కవిత్వానికి లేని కొత్త సమస్య ఒకటి ఇప్పుడు తలెత్తింది. కవిత్వానికి ఛందస్సు అవసరమా ? అనవసరమా ? ఛందస్సు అంటే ఇక్కడ గణ, యతిప్రాసలతో నిబద్ధమైన పద్య నియమావళి. అప్పకవీయమూ తదితర గ్రంథాలలో వున్నది. నన్నయ మొదలుకొని తిరుపతి వేంకట కవుల వరకు పండిత కవులు అనుసరించినది. భావ కవులు గేయ ఛందస్సులను అనుసరించినా, ఈ పద్య ఛందస్సులను తిరస్కరించలేదు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
ఛందస్సు అనగా నేమి?
జవాబు.
గణ, యతిప్రాసలతో నిబద్ధమైన పద్య నియమావళినే ‘ఛందస్సు’ అని అంటారు.
ప్రశ్న 2.
గేయ ఛందస్సులను అనుసరించినవారు ఎవరు?
జవాబు.
భావ కవులు గేయ ఛందస్సులను అనుసరించారు.
ప్రశ్న 3.
ఇప్పుడు తలెత్తిన సమస్య ఏది?
జవాబు.
ఇప్పుడు కవిత్వానికి ఛందస్సు అవసరమా ? అనవసరమా ? అనే సమస్య తలెత్తింది.
ప్రశ్న 4.
భావ కవులు వేనిని తిరస్కరించలేదు?
జవాబు.
భావ కవులు పద్య ఛందస్సులను తిరస్కరించలేదు.
ప్రశ్న 5.
ఈ పేరాలోని జంటకవులు ఎవరు ?
జవాబు.
తిరుపతి వేంకట కవులు.
4. సమాజంలో మతం అంతర్భాగం. మన సమాజంలో ఎన్నో మతాలున్నాయి. ఏ మతమైనా అందరికి ప్రయోజనాన్ని చేకూర్చే సిద్ధాంతాలనే కలిగి ఉంటుంది. ఇతరులు మతం కంటే తమ మతం గొప్పదని చెప్పుకొనేవారు అవివేకులు. వారు తమ స్వార్థానికే ఇతర మతాలను దూషించుటకు ప్రయత్నిస్తారు. సర్వమతాలను సమానంగా భావించి మంచిని స్వీకరించువారే ఉత్తములు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
సమాజంలో అంతర్భాగమైనదేది ?
జవాబు.
మతం
ప్రశ్న 2.
ప్రతి మతంలోని ప్రధాన సిద్ధాంతమేమి ?
జవాబు.
అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చడమే ప్రధాన సిద్ధాంతం.
ప్రశ్న 3.
ఎవరు అవివేకులు ?
జవాబు.
ఇతరుల మతం కంటే తమ మతం గొప్పదని చెప్పుకొనువారు అవివేకులు.
ప్రశ్న 4.
ఉత్తములు ఎవరు ?
జవాబు.
సర్వ మతాలను సమానంగా భావించి మంచిని స్వీకరించు వారే ఉత్తములు.
ప్రశ్న 5.
స్వార్థపరులు ఏం చేస్తారు ?
జవాబు.
ఇతర మతాలను దూషిస్తారు.
5. వీరేశలింగం పంతులు గారు ఆంధ్రభాషకు చేసిన సేవ ఎనలేనిది. పంతులుగారికి పూర్వము నవలా రచనలేదు. వారు రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తెలుగులో ప్రసిద్ధి గాంచినది. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞానశాకుంతలము’ను పంతులుగారు తెలుగున కనువదించారు. ఆంధ్ర కవుల చరిత్ర, స్వీయచరిత్ర మొదలగు క్రొత్త పోకడలను తెలుగు భాషలో వెలువరించారు. వారు కవిగా సంపాదించిన కీర్తి కంటే సంఘసంస్కర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు. వితంతు వివాహములను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ‘హితకారిణి’ సమాజమును స్థాపించి దాని ద్వారా అనాథ స్త్రీ ఉద్ధరణకు పాటుపడ్డారు.
ప్రశ్న 1.
తెలుగు భాషలో మొదటి నవల ఏది ?
జవాబు.
తెలుగు భాషలో మొదటి నవల ‘రాజశేఖర చరిత్ర’.
ప్రశ్న 2.
హితకారిణి సమాజ స్థాపన ఉద్దేశ్యమేమి ?
జవాబు.
హితకారిణి సమాజ స్థాపన ఉద్దేశ్యం అనాథ స్త్రీల ఉద్ధరణ.
ప్రశ్న 3.
వీరేశలింగం పంతులు గారు తెలుగులోనికి అనువదించిన నాటకమేది ?
జవాబు.
వీరేశలింగం పంతులు గారు ‘అభిజ్ఞాన శాకుంతలం’ అను నాటకాన్ని తెలుగులోనికి అనువదించారు.
ప్రశ్న 4.
ఆయన వేనిని ప్రోత్సహించారు ?
జవాబు.
ఆయన (కందుకూరి) వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు.
ప్రశ్న 5.
ఆయన తెలుగు భాషలో చూపిన కొత్త పోకడలకు రెండు ఉదాహరణలేవి?
జవాబు.
ఆంధ్ర కవుల చరిత్ర, స్వీయ చరిత్ర రచనలు.
6. “కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం ఈ ఐదింటిని లలితకళలంటారు. ఈ కళలలో కృష్ణదేవరాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఉండేవారు. వారు తమ తమ కళలను అద్భుత రీతిలో ప్రదర్శించి రాయల మన్ననలందుకొనేవారు. కళలు మానవుని హృదయాన్ని స్పందింపజేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయిలాగే జడుడని చెప్పవచ్చు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
లలితకళలేవి ?
జవాబు.
కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం అనేవి లలితకళలు.
ప్రశ్న 2.
కవులు రాయల మన్ననలందుకొనడానికి గల కారణమేమి ?
జవాబు.
అన్ని కళలలో రాయలకు తగినంత చొరవ ఉండటం కవులు తమ కళలను అద్భుత రీతిలో ప్రదర్శించడం రాయల మన్ననలందుకోవడానికి కారణం.
ప్రశ్న 3.
“కళలను ఆనందించలేనివారు రాయిలాగే జడుడు” అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
కళలను చూచి విని ఆనందించలేనివాడు ప్రాణంలేని పదార్థం వంటివాడని, మూర్ఖుడని అర్థం.
ప్రశ్న 4.
సంగీతం పాడేవారిని గాయకులంటారు. అలాగే చిత్రాలను వేసేవారిని ఏమంటారు ?
జవాబు.
చిత్రాలను వేసేవారిని చిత్రకారులు అంటారు.
ప్రశ్న 5.
కళలకు ఏ స్వభావం ఉన్నది ?
జవాబు.
కళలకు మానవుని స్పందింపజేసే స్వభావం ఉంది.
7.క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.
మానవుని హృదయమును మధుర భావములతో నింపునది కవిత్వము. హృదయము దయార్ధమయినప్పుడు కవిత్వ మావిర్భవించునని వాల్మీకి చెప్పెను. ధర్మార్థకామమోక్షములు సాధించుటయే కవిత్వ ప్రయోజనమని కొందరు అంటారు. సంస్కృత కవితను వెలయించి భారతీయ సంస్కృతి, ధర్మములను నిలబెట్టిన వ్యాస, వాల్మీకి, కాళిదాసాదులు నిత్యస్మరణీయులు. తెలుగులో కవిత్రయము, శ్రీనాథ, పోతనలు, అష్టదిగ్గజ కవులు సుప్రసిద్ధులు.
ప్రశ్నలు :
1. కవిత్వము ఎటువంటిది ?
2. వాల్మీకి ఏమి చెప్పెను ?
3. కవిత్వ ప్రయోజనమేమి ?
4. నిత్యస్మరణీయులు ఎవరు ?
5. పై పేరాలో సంస్కృత కవులు ఎవరు ?
8. పొదుపు మానవ జీవితానికి అత్యవసరం. పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు. పొదుపు చేయకుండా అడ్డుపడే వాటిల్లో అతి ముఖ్యమైనవి కోరికలు. కోరికలు మానవుని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి. పొదుపు అనేక విషయాలలో పాటించవచ్చు. ధనము, జలము, భాషణము మొదలగు వానిలో పొదుపు పాటించడం ద్వారా దేశాభివృద్ధిని సాధించగలము. పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయక తప్పదు. అప్పుచేయటం వలన మన వ్యక్తిత్వాన్నే కోల్పోతాము.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలేవి ?
జవాబు.
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలు ధనం, జలం, భాషణం.
ప్రశ్న 2.
పొదుపును నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు.
పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయడం జరుగుతుంది.
ప్రశ్న 3.
అప్పు చేయటం వలన మనమేమి కోల్పోతాము ?
జవాబు.
అప్పు చేయటం వలన మనం వ్యక్తిత్వాన్ని కోల్పోతాము.
ప్రశ్న 4.
కోరికలు మానవుని ఏమి చేస్తాయి ?
జవాబు.
కోరికలు మానవుని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి.
ప్రశ్న 5.
పొదుపు లేని మానవుడు ఎటువంటివాడు ?
జవాబు.
దారం తెగిన గాలిపటం వంటివాడు.
9. బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగ సంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్కపెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుద్ధప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే మనకు స్ఫురించేది బ్రౌను నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణయింది.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం ?
జవాబు.
తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఒక వ్యక్తిగా కాక ఒక పెద్ద సాహిత్య సంస్థగా పరిగణించడం భావ్యం.
ప్రశ్న 2.
బ్రౌను వేటిని సేకరించాడు ?
జవాబు.
బ్రౌను అనేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించాడు.
ప్రశ్న 3.
పండితులతో బ్రౌను చేయించిన పనులు ఏమిటి ?
జవాబు.
పండితులతో బ్రౌను శుద్ధ ప్రతులను రాయించి కొన్నింటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు.
ప్రశ్న 4.
నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు పూర్తి అయింది ?
జవాబు.
నిఘంటువు ప్రథమ ముద్రణ 1853లో పూర్తి అయింది.
ప్రశ్న 5.
బ్రౌను తెలుగు వారికి మొదట పరిచయం చేసిన దేమి ?
జవాబు.
వేమన పద్యాలు.
10. వీరభద్రారెడ్డికి అంకితంగా కాశీఖండం రచించిన శ్రీనాథుడు పోతనకు సమకాలికుడు. శ్రీనాథుడు కాశీఖండం, భీమఖండం పురాణాలను తెనిగించినా, వానిని స్వతంత్రించి ప్రబంధాలవలె తెనిగించాడు. భీమఖండం, గోదావరి తీరదేశ దివ్యవైభవ వర్ణనా గ్రంథమని చెప్పవచ్చు. కాశీఖండం ప్రౌఢాంధ్ర కవితా పరిజ్ఞానానికి చదువదగిన ప్రబంధం. “శివరాత్రి మాహాత్మ్యం” అనే గ్రంథాన్ని కూడా శ్రీనాథుడే రచించాడు. శ్రీనాథునకు ప్రౌఢకవి పాకం మీద ప్రీతి ఎక్కువ. ఆయన ‘హరవిలాసం’ రచించి అవచి తిప్పయ్య సెట్టికి అంకితమిచ్చాడు. ‘కవి సార్వభౌముడు’గా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు 15వ శతాబ్దికి చెందినవాడు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
శ్రీనాథుడు రచించిన గ్రంథాలేవి ?
జవాబు.
శ్రీనాథుడు కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మాహాత్మ్యం, హరవిలాసం మొదలైన గ్రంథాలను రచించాడు.
ప్రశ్న 2.
శ్రీనాథుడు ఎవరి సమకాలికుడు ?
జవాబు.
శ్రీనాథుడు పోతనకు సమకాలికుడు.
ప్రశ్న 3.
శ్రీనాథుడు తన ‘హరవిలాసం’ కావ్యాన్ని ఎవరికి అంకితమిచ్చాడు ?
జవాబు.
శ్రీనాథుడు తన హరవిలాస కావ్యాన్ని అవచి తిప్పయ్య సెట్టికి అంకితమిచ్చాడు.
ప్రశ్న 4.
శ్రీనాథుని బిరుదు ఏమిటి ?
జవాబు.
శ్రీనాథుని బిరుదు ‘కవి సార్వభౌముడు’.
ప్రశ్న 5.
భీమఖండం దేనిని వర్ణిస్తుంది ?
జవాబు.
గోదావరీ తీరదేశ వైభవాన్ని
11. క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.
తెలుగుభాషలో కావ్యరచన నన్నయతో మొదలయింది. తిక్కనాదులు విస్తృతం చేశారు. బమ్మెర పోతన భాగవతాన్ని తెనిగించాడు. పెద్దనాదులు ప్రబంధ రచన చేశారు. తిరుపతి వేంకట కవులు అవధాన విద్య ద్వారా వీరవిహారం చేశారు. వెయ్యేళ్ళ నుంచి నేటికీ పద్యం నిలద్రొక్కుకొని విరాజిల్లుతూ ఉంది.
ప్రశ్నలు :
1. తొలి తెలుగు కావ్యం ఎవరు రాశారు ?
2. భాగవతాన్ని తెలుగులో రాసింది ఎవరు?
3. ఎంతకాలం నుంచి పద్యం నిలచి ఉంది?
4. తిరుపతి వేంకటకవులు ఏ విద్యలో ప్రసిద్ధులు?
5. తెలుగులో కావ్య రచనను ఎవరు విస్తృతం చేశారు?
12. నేడు గ్రంథాలయాలు అనుసరిస్తున్న శాస్త్రీయ విధానాన్ని రూపొందించినవారు డా॥ ఎన్.ఆర్.రంగనాథన్ గారు. వృత్తిపరమైన వారి అనుభవంలోంచి పుట్టిందే ఈ కృషి. ఆయన భారతీయ గ్రంథాలయాలకు సరిపోయే విధంగా మూడు కార్డుల పద్దతి, చార్జింగ్ సిస్టమ్, బైండింగ్ ప్రమాణాలు లాంటి కొత్త మార్గాలను ప్రవేశపెట్టారు. ఆయన రూపొందించిన “గ్రంథాలయ సిబ్బంది విభజన ఫార్ములా” ప్రామాణికంగా ఇప్పటికీ పాటించబడుతోంది. పరిమిత వనరులతో, ఇబ్బందులతో కొనసాగే భారతీయ గ్రంథాలయాలకు రంగనాథన్ కనిపెట్టిన మార్గాలు ఎంతో ఉపయోగకరమైనవి.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
గ్రంథాలయాల విధానాన్ని రూపొందించిన వారెవరు ?
జవాబు.
గ్రంథాలయాల విధానాన్ని రూపొందించినది డా॥ ఎన్. ఆర్. రంగనాథన్.
ప్రశ్న 2.
రంగనాథన్ కృషి ఎందులోంచి పుట్టింది ?
జవాబు.
రంగనాథన్ కృషి వారి వృత్తిపరమైన అనుభవం లోంచి పుట్టింది.
ప్రశ్న 3.
ఆయన రూపొందించిన ఫార్ములా ఏది ?
జవాబు.
ఆయన రూపొందించిన ఫార్ములా “గ్రంథాలయ సిబ్బంది విభజన ఫార్ములా”.
ప్రశ్న 4.
రంగనాథన్ కనిపెట్టిన మార్గాలు వేటికి ఉపయోగకరమైనవి ?
జవాబు.
రంగనాథన్ కనిపెట్టిన మార్గాలు భారతీయ గ్రంథాలయాలకు ఉపయోగకరమైనవి.
ప్రశ్న 5.
రంగనాథన్ ప్రవేశపెట్టిన కొత్త మార్గాలేవి ?
జవాబు.
మూడు కార్డుల పద్ధతి, చార్జింగ్ సిస్టమ్, బైండింగ్ ప్రమాణాలు.
13. స్త్రీజనోద్ధరణము కూడా సంఘసేవయే. పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు. స్త్రీలు సహితము పురుషులతో బాటుగా చదువుకొన్నప్పుడే సంఘము బాగుపడును. సంఘమను బండికి స్త్రీ, పురుషులిద్దరు రెండు చక్రముల వంటివారు. అందులో ఏ చక్రము అవిటిగా నున్నను ఆ బండి నడువజాలదు. కావున రెండు చక్రములును సరిగా నడుచునట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగిపోవును.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
సంఘసేవ యనదగినదేది ?
జవాబు.
స్త్రీ జనోద్ధరణము సంఘసేవ యనదగినది.
ప్రశ్న 2.
సంఘము ఎప్పుడు బాగుపడును ?
జవాబు.
స్త్రీలు కూడా పురుషులతో పాటుగా చదువు కున్నప్పుడే సంఘము బాగుపడును.
ప్రశ్న 3.
సంఘమనే బండికి చక్రములవంటి వారెవరు ?
జవాబు.
సంఘమనే బండికి స్త్రీ, పురుషులిద్దరు చక్రములంటివారు.
ప్రశ్న 4.
బండి ఎప్పుడు చక్కగా సాగును ?
జవాబు.
రెండు చక్రములు సరిగా నడుచునప్పుడే బండి చక్కగా సాగును.
ప్రశ్న 5.
పురుషులు ఏమని చెప్పుకుంటున్నారు ?
జవాబు.
తామే విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకుంటున్నారు.
–
14. సర్దార్పటేల్ వ్యక్తిత్వం ఓర్పు, నేర్పు, పట్టుదల మొదలైన సుగుణాలతో కూడినది. ఆయనకు ప్రతి విషయంపై ఇష్టానిష్టాలుండేవి. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ విషయాన్ని గురించి సందేహములుండేవి కావు. వాటిని అమలు జరపడంలో బలప్రయోగం అవసరమైనా జంకేవాడు కాదు. ఆయన తీరిక సమయంలో వ్యవసాయం చేసేవాడు. భారతదేశ దాస్యానికి భారతీయులలో గల అనైక్యత, క్రమశిక్షణారాహిత్యం కారణమని చెప్పినాడు. పటేల్ బారిష్టర్ పట్టా పొందుటతో సర్వతోముఖ న్యాయశాస్త్రమును విస్తృతపరచుట, కార్యదీక్ష, ఐకమత్యం ద్వారా స్వాతంత్య్రం సముపార్జన కొరకు పాటుపడుట అతని ఆశయం. దేశ ప్రజల మధ్య తరతమ భేదాలు పూర్తిగా అదృశ్యమై “నవరూపకల్పన” భారత ఉపప్రధాని పటేల్ అవిరళ కృషి ఫలితం.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
పటేల్లోని సుగుణములేవి ?
జవాబు.
ఓర్పు, నేర్పు, పట్టుదల మొదలైనవి పటేల్లోని గుణాల
ప్రశ్న 2.
పటేల్గారి నిర్ణయములెట్లుండేవి ?
జవాబు.
పటేల్ గారి నిర్ణయాలు నిస్సందేహంగా ఉండేవి.
ప్రశ్న 3.
పటేల్ తీరిక సమయంలో ఏమి చేసేవాడు ?
జవాబు.
పటేల్ తీరిక సమయంలో వ్యవసాయం చేసేవాడు.
ప్రశ్న 4.
పటేల్ ఏ పదవినలంకరించెను ?
జవాబు.
పటేల్ “భారత ఉపప్రధాని” పదవిని అలంకరించెను.
ప్రశ్న 5.
స్వాతంత్ర్యం పొందాలంటే ఏమి కావాలి ?
జవాబు.
కార్యదీక్ష, ఐకమత్యం.
15. క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.
“జో అచ్యుతానంద జోజో ముకుందా ” అన్న జోలపాట ఒకనాడు పసిబిడ్డ గల ప్రతియింటా కన్న తల్లుల జిహ్వాగ్రాలపై నాట్యమాడేది. ఈ పదకర్తే క్రీ.శ. 1424 1503 మధ్యకాలంలో జీవించి 32 వేల మధుర భక్తి సంకీర్తనలతో తిరుమలేశుని గొలిచి, ఆంధ్రభారతిని స్వతస్సిద్ధమైన తెలుగుభాషా భూషలతో భూషింపజేసి, సర్వజనరంజనం చేసిన పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుడు. తెలుగులో సంకీర్తన యుగం పన్నెండవ శతాబ్దిలో కృష్ణమాచార్యుని “సింహగిరి” వచనాలతో ప్రారంభమైనప్పటికీ, అన్నమయ్య దానిని ఉన్నతోన్నతి శిఖరాల నధిరోహింపజేసి పదకవితకు యుగకర్త అయినాడు. తెలుగులో పదకవిత్రయం (అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య)లో ఆద్యుడైనాడు.
ప్రశ్నలు :
1. “జో అచ్యుతానంద ! జోజో ముకుందా ! అన్న జోలపాటను వ్రాసింది ఎవరు ?
2. తెలుగులో సంకీర్తన యుగం ఎప్పుడు ప్రారంభమైనది ?
3. పద కవిత్రయంగా వాసికెక్కిన వారెవరు ?
4. అన్నమాచార్యుడు తన సంకీర్తనలతో ఎవరిని సేవించాడు ?
5. సింహగిరి వచనాలు రాసిందెవరు ?
16. 20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతుమాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబ నియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపు నిచ్చారు. అమెరికా ప్రభుత్వ వత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్కు వలస వెళ్ళి 1916 లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రిపై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణా పరిశోధనాశాలను నెలకొల్పారు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ పేరేమి ?
జవాబు.
కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ మార్గరేట్ సాంగర్,
ప్రశ్న 2.
ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు ?
జవాబు.
ఆమె 1914లో “ఉమన్ రెబెల్” అనే వ్యాసంలో కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు.
ప్రశ్న 3.
మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళింది ?
జవాబు.
1914 నుండి 1916 మధ్య కాలంలో మార్గరేట్ సాంగర్ యూరప్ కు వలస వెళ్ళింది.
ప్రశ్న 4.
1923లో సాంగర్ దేనిని నెలకొల్పింది ?
జవాబు.
1923లో సాంగర్ కుటుంబ నియంత్రణా పరిశోధనాశాలను నెలకొల్పింది.
ప్రశ్న 5.
మార్గరెట్ సాంగర్పై వత్తిడి తెచ్చిందెవరు ?
జవాబు.
అమెరికా ప్రభుత్వం.
17. ప్రాణికి కన్ను ప్రధానమైనది. “సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్” అను సూక్తి కూడా ఆ సత్యమునే చాటుచున్నది. అందము ఆనందహేతువు. సౌందర్యమును జూచి పులకించుట చూపులేనిదే సాధ్యముగాదు. కన్నులున్న ప్రతి మానవుడు సౌందర్యమును జూచి సంతోషించుననుటయు సత్యముకాదు. ప్రకృతిలోని అందమైన వస్తువు కొన్ని కన్నులలో ప్రతిబింబించును. ఆ నేత్రములు నిలువుటద్దములు మాత్రమే. అట్లుగాక కొన్ని కన్నులు తమలో ప్రతిబింబించిన అందాన్ని అంతరంగంలో ప్రతిఫలింపజేయగలవు. అవియే నిజమైన నేత్రములు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
కన్ను ప్రాధాన్యతను తెలియజేయు సూక్తి ఏది ?
జవాబు.
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్” అనేది కన్ను ప్రాధాన్యతను తెలియజేయు సూక్తి.
ప్రశ్న 2.
సౌందర్యాన్ని చూచి సంతోషించడానికేమి కావాలి ?
జవాబు.
సౌందర్యాన్ని చూచి సంతోషించడానికి కంటిచూపు కావాలి.
ప్రశ్న 3.
నిలువుటద్దములని కవి వేటిని గూర్చి చెప్పాడు ?
జవాబు.
ప్రకృతిలోని అందాన్ని తమలో మాత్రమే ప్రతిబింబింపజేసే కన్నులు నిలువుటద్దములని కవి చెప్పాడు.
ప్రశ్న 4.
ఏవి నిజమైన నేత్రములు ?
జవాబు.
తమలో ప్రతిబింబించిన అందాన్ని అంతరంగంలో ప్రతిఫలింపజేయగలవే నిజమైన నేత్రములు.
ప్రశ్న 5.
చూపు లేకుంటే ఏది సాధ్యం కాదు ?
జవాబు.
సౌందర్యాన్ని చూసి ఆనందించ లేము.
18. వార్తను యథాతథంగా ప్రకటించడం వార్తాపత్రికలకు తొలినాళ్ళలో ఆదర్శంగా ఉంది. ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా ముద్రణలో, వ్రాయడంలో, అభిప్రాయ స్ఫురణలో భిన్నంగా వార్తను ప్రకటిస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఏ విధంగా అనే అంశాలు వార్తల్లో స్పష్టం కావాలి. అదే సమగ్ర వార్త. ఏదైనా క్రొత్త అంశాన్ని ప్రజల దృష్టికి తేవడం వార్తకున్న ప్రత్యేక లక్షణం. లభించిన సమాచారం నుండి ఒక ప్రత్యేక అంశాన్ని, అపూర్వ విషయాన్ని వెలికితేవడం, వార్త వ్రాయడం కోసం అన్వేషించడం పత్రికా రచయిత చేసే నిరంతర కృషి, ఒకే వార్తను అనేక పత్రికలు అనేక విధాలుగా ప్రచురిస్తుంటాయి. వార్తలోని ప్రత్యేకాంశం, కొత్తసంగతి, వాళ్ళ విజ్ఞానం, సంస్కారం, నైపుణ్యాల మీద ఆధారపడి ఒక్కొక్క పద్ధతిలో ముద్రింపబడుతుంది. ఇదే వార్తకు వైవిధ్యాన్ని సంపాదించి పెడుతుంది.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
ఇప్పుడు వార్తాపత్రికలు ఏమి చేస్తున్నాయి ?
జవాబు.
ఇప్పుడు వార్తాపత్రికలు వార్తను ముద్రించడంలో, వ్రాయడంలో, అభిప్రాయ ప్రకటనలో కొంత తేడాతో ప్రకటిస్తున్నాయి.
ప్రశ్న 2.
వార్తకున్న ప్రత్యేక లక్షణమేమిటి?
జవాబు.
క్రొత్త అంశాన్ని ప్రజల దృష్టికి తేవడమనేది వార్తకున్న ప్రత్యేక లక్షణం.
ప్రశ్న 3.
సమగ్రమైన వార్త లక్షణమేమిటి ?
జవాబు.
ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఏవిధంగా అనే అంశాలు స్పష్టమయ్యేట్లు ప్రకటించడం సమగ్ర వార్త లక్షణం.
ప్రశ్న 4.
వార్తకు వైవిధ్యాన్ని సంపాదించి పెట్టునవేవి ?
జవాబు.
వార్తల్లోని ప్రత్యేకాంశం, కొత్త సంగతి, వాళ్ళ విజ్ఞానం, సంస్కారం, నైపుణ్యం అనేవి వార్తకు వైవిధ్యాన్ని సంపాదించి పెడతాయి.
ప్రశ్న 5.
తొలినాళ్ళలో వార్తా పత్రికల ఆదర్శమేమిటి ?
జవాబు.
వార్తను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం.
ప్రశ్న 19.
సమాజ శ్రేయస్సు కొరకు మతము ఏర్పడినది. ప్రతి మతము ఉన్నతాశయములు కలిగియున్నది. ఏ మతము చెడును బోధించదు. ఈ మతము గొప్పది, పరమతము నీచమైనదని ప్రచారము చేయువారు విశాల హృదయము లేనివారని సంకుచిత స్వభావులని భావింపవచ్చును. స్వార్థపరులని తలంపవచ్చును. అట్టివారి మాటలను నమ్ముట మన అజ్ఞానమునకు ప్రతీకయగును.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
మతము ఎందుకు ఏర్పడినది ?
జవాబు.
మతము సమాజ శ్రేయస్సు కొరకు ఏర్పడినది.
ప్రశ్న 2.
దేన్ని మతము బోధించదు ?
జవాబు.
చెడును మతము బోధించదు.
ప్రశ్న 3.
ప్రతి మతము ఏవి కల్గియున్నది ?
జవాబు.
ప్రతి మతము ఉన్నత ఆశయములు కలిగియున్నది.
ప్రశ్న 4.
ఎవరు విశాల హృదయం లేనివారు ?
జవాబు.
ఈ మతము గొప్పది, పరమతము నీచమైనదని ప్రచారము చేయువారు విశాల హృదయము లేనివారు.
ప్రశ్న 5.
మత భేదాలను ప్రచారం చేసేవారి మాటలను నమ్మటం దేనికి గుర్తు ?
జవాబు.
మన అజ్ఞానానికి గుర్తు.
20. విద్యార్థికి క్రమశిక్షణ చాలా అవసరం. ఒక క్రమపద్ధతి ప్రకారం తన పనులన్నీ తానే చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. ఎప్పటి పని అప్పుడే చేయాలి. పనిని వాయిదా వేయకూడదు. ఆత్మనిగ్రహాన్ని అలవరచుకోవాలి. చీటికీ మాటికీ కోపం తెచ్చుకోకూడదు. తోటివారిని చూసి ఈర్ష్య పడకూడదు. అసూయ పడకూడదు. చదువులోనూ, సత్ప్రవర్తనలోనూ తోటి వారిని మించాలనే పట్టుదలతో కృషి చేయాలి. అంతేకాని వాళ్ళు నీ కంటే ముందున్నారని అసూయ పడకూడదు. నీకంటే ముందున్న వారిపట్ల అసూయ కూడనట్లే, నీకంటే వెనుకబడినవారి పట్ల చులకన భావం కూడా ఉండకూడదు. వాళ్ళకు తగిన ప్రోత్సాహమివ్వాలి.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
విద్యార్థికి ఏది అవసరం ?
జవాబు.
విద్యార్థికి క్రమశిక్షణ అవసరం.
ప్రశ్న 2.
విద్యార్థి దేన్ని అలవరచుకోవాలి ?
జవాబు.
విద్యార్థి ఆత్మనిగ్రహాన్ని అలవరచుకోవాలి.
ప్రశ్న 3.
ఏ విషయంలో పట్టుదలతో కృషి చేయాలి ?
జవాబు.
చదువులోను, సత్ప్రవర్తనలోను తోటివారిని మించాలనే పట్టుదలతో కృషి చేయాలి.
ప్రశ్న 4.
విద్యార్థికి ఎవరిపై చులకన భావం ఉండకూడదు?
జవాబు.
విద్యార్థికి తనకంటే వెనుకబడిన వారిపై చులకన భావం ఉండకూడదు.
ప్రశ్న 5.
పనులు ఎలా చేసుకోవాలి?
జవాబు.
క్రమ పద్ధతి ప్రకారం.
21. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌములచే ప్రశంసింపబడిన భాష మన తెలుగుభాష, భాషాభ్యుదయమునకు సాహిత్య సంపద జీవగర్ర. ఆదికవి నన్నయభట్టారకుని నాటి నుండి నేటి వరకు ఆంధ్రభాషా సాహిత్యము అవిచ్ఛిన్నముగా, బహుముఖములుగా రాణించింది. ముద్రణాది సౌకర్యములు ఏర్పడిన తరువాత మన తెలుగు భాషలో ప్రాచీన కావ్య పురాణాది వివిధ గ్రంథములు ప్రచురింపబడి సుప్రకాశితములయ్యాయి.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
తెలుగుభాష ఏమని ప్రశంసింపబడినది?
జవాబు.
తెలుగుభాష ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ప్రశంసింపబడింది.
ప్రశ్న 2.
ముద్రణా సౌకర్యము ఏర్పడుట ద్వారా భాషకు కల్గిన ప్రయోజనమేమి ?
జవాబు.
ముద్రణా సౌకర్యము ఏర్పడుట ద్వారా భాషకు ప్రాచీన కావ్య పురాణాది గ్రంథములు ప్రచురింపబడ్డాయి.
ప్రశ్న 3.
ఆదికవి ఎవరు?
జవాబు.
ఆదికవి నన్నయ.
ప్రశ్న 4.
భాషాభ్యుదయమునకు ఏది జీవగర్ర?
జవాబు.
భాషాభ్యుదయమునకు జీవగర్ర సాహిత్య సంపద
ప్రశ్న 5.
తెలుగు భాషను మెచ్చుకున్న రాజెవరు?
జవాబు.
సాహితీ సమరాంగణ సార్వ భౌముడు శ్రీకృష్ణ దేవరాయలు.
22. కొమర్రాజు లక్ష్మణరావు విద్యాభ్యాస కాలంలో పలుభాషలు నేర్చెను. అందువలన ఆయనకు విశాలమైన దృక్పథం ఏర్పడి అనేక పరిశోధనలకు, చర్చలకు ఉపయోగపడింది. ఇంగ్లీషు పండితుల ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించి సాంస్కృతిక పునరుజ్జీవనానికి నారు పోశారు. శాసనాలు సేకరించి, పరిశోధన చేసి, సాక్ష్యాధారాలతో చరిత్ర రచన చేశారు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగు ప్రజలందరకు అందుబాటులోకి తేవడానికి ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ రచనకు పూనుకున్నారు. ఏ విషయమైనా మొక్కుబడిగా కాకుండా దాని లోతులు చూచి అందివ్వడానికి ఆయన కృషి చేశారు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
లక్ష్మణరావుకు పలుభాషలు నేర్చుకోవడం ఎలా ఉపయోగపడింది ?
జవాబు.
లక్ష్మణరావుకు పలుభాషలు నేర్చుకోవడం అనేక పరిశోధనలకు, చర్చలకు ఉపయోగపడింది.
ప్రశ్న 2.
లక్ష్మణరావు చరిత్ర రచన ఎలా చేశారు?
జవాబు.
లక్ష్మణరావు శాసనాలు సేకరించి, పరిశోధన చేసి, సాక్ష్యాధారాలతో చరిత్ర రచన చేశారు.
ప్రశ్న 3.
తెలుగు ప్రజల కోసము ఏ రచనకు ఆయన పూనుకొన్నాడు?
జవాబు.
తెలుగు ప్రజల కోసం ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ రచనకు ఆయన పూనుకున్నాడు.
ప్రశ్న 4.
ఎవరి ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు ?
జవాబు.
ఇంగ్లీషు పండితుల ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు.
ప్రశ్న 5.
లక్ష్మణరావు స్థాపించిన సంస్థ ఏది ?
జవాబు.
శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం.
23. క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.
భాష కాలక్రమేణ మారే స్వభావం కలది. కాబట్టి ఒక భాషలో కాలక్రమేణ వర్ణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్లుగానే కూడా మారతాయి. ఒక భాషలో పదములకు గల అర్థాలతో వచ్చిన మార్పును అర్థవిపరిణామం అంటారు. ఉదాహరణకు ప్రాచీన తెలుగులో ‘లావు’ అనే పదానికి ఇప్పటి ‘స్థాల్యం’ అవిగాక, ‘బలం’ అని అర్థం. పదాల అర్థాలకు, భాషను వాడేవారి సంస్కృతి సంప్రదాయములకు సన్నిహిత సంబంధముంది. పాశ్చాత్యులకు గోధుమరొట్టె ముఖ్యాహారం కాబట్టి ఇంగ్లీషులో ‘బ్రడ్’ అనే మాట ‘రొట్టె’ అనే అర్థంలోనే గాక ‘ఆహారం’ అనే సామాన్యార్థంలో కూడా వాడబడుతుంది. నిషిద్ధ ప్రయోగం, సభ్యోక్తి అనే ప్రక్రియలవల్ల కూడా అర్థ విపరిణామం ఏర్పడుతుంది.
ప్రశ్నలు :
1. భాషా స్వభావం ఎట్టిది ?
2. అర్థ విపరిణామం అంటే ఏమిటి ?
3. అర్థ విపరిణామానికి ఉదాహరణ వ్రాయండి. అర్ధానికి, సంస్కృతి సంప్రదాయములకు సంబంధం ఉందనడానికి ఉదాహరణ వ్రాయండి.
4. అర్థ విపరిణామం ఏర్పడడానికి కారణం ఏమిటి ?
5. భాషలో వచ్చే మార్పులేమిటి ?
24. లోకంలో రానురాను మంచితనం, నిజాయితీ తగ్గిపోతున్నాయి. చెప్పే మాటకు, చేసే పనికి సంబంధం ఉండడం లేదు. మోసం, అన్యాయం, అవినీతి పెరిగిపోతున్నాయి. ఎదుటివారు బాధపడుతుంటే తాము సంతోషపడే సంస్కృతి పెచ్చు
మీరుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలే అప్పులు చేస్తుంటే మరి పిల్లలు మంచివాళ్ళెలా అవుతారన్నది జవాబు లేని ప్రశ్న కాదా ?
ప్రశ్నలు :
ప్రశ్న 1.
ఏ సంస్కృతి పెచ్చుమీరుతోంది ?
జవాబు.
ఎదుటివారు బాధపడుతుంటే తాము సంతోషపడే సంస్కృతి పెచ్చుమీరుతోంది.
ప్రశ్న 2.
జవాబు లేని ప్రశ్న ఏది ?
జవాబు.
ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలే తప్పులు చేస్తుంటే మరి పిల్లలు మంచివాళ్ళెలా అవుతారన్నది జవాబులేని ప్రశ్న.
ప్రశ్న 3.
లోకంలో ఏవి తగ్గిపోతున్నాయి ?
జవాబు.
లోకంలో మంచితనం, నిజాయితీ తగ్గిపోతున్నాయి.
ప్రశ్న 4.
వేటికి సంబంధం ఉండడం లేదు ?
జవాబు.
చెప్పేమాటకు, చేసే పనికి సంబంధం ఉండదు.
ప్రశ్న 5.
లోకంలో ఏవి పెరిగిపోతున్నాయి ?
జవాబు.
మోసం, అన్యాయం, అవినీతి.
25. దేశభాషలో పరిపాలన, విద్యాబోధన, సమాచార వినిమయం వీటి ప్రాముఖ్యం రోజురోజుకు పెరిగిపోతోంది. అన్ని రంగాలలో భాష బహుముఖంగా వినియోగంలో ఉంది. ఈనాడు భాషా ప్రయోగరంగాలు విస్తరిస్తున్నాయి. ఆయాస్థాయిలలో విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకొని భాషా పాఠ్యగ్రంథాలను రూపొందించవలసి ఉంది. భిన్నమైన శైలులు, భిన్నమైన ప్రక్రియలకు చెందిన పాఠ్యాంశాలను భాషా పాఠ్యగ్రంథాలలో చేర్చాలి. ఆధునిక వచన రచనాశైలికి విద్యార్థులకు పరిచయం చేయడం అత్యవసరం. పాఠ్యాంశాలు సమకాలీన సామాజిక దృషికి అభ్యంతరకరమైనవి కాకుండా ఉండాలి.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
దేనిని దృష్టిలో ఉంచుకొని భాషా పాఠ్యగ్రంథాలను రూపొందించాలి ?
జవాబు.
విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకొని భాషా పాఠ్యగ్రంథాలను రూపొందించవలసి ఉంది.
ప్రశ్న 2.
భాషా పాఠ్యగ్రంథాలలో పాఠ్యాంశాలు ఎలాంటివి ఉండాలి ?
జవాబు.
భిన్నమైన శైలులు, భిన్నమైన ప్రక్రియలకు చెందిన పాఠ్యాంశాలు పాఠ్యగ్రంథాల్లో ఉండాలి.
ప్రశ్న 3.
ఎటువంటి పాఠ్యాంశాలు ఉండరాదు ?
జవాబు.
పాఠ్యాంశాలు సమకాలీన సామాజిక దృష్టికి అభ్యంతరకరమైనవిగా ఉండకూడదు.
ప్రశ్న 4.
విద్యార్థులకు దేనిని పరిచయం చేయడం అత్యవసరం ?
జవాబు.
విద్యార్థులకు ఆధునిక వచన రచనాశైలిని పరిచయం చేయడం అత్యవసరం.
ప్రశ్న 5.
ప్రస్తుతం వేటికి ప్రాముఖ్యం పెరిగి పోతోంది?
జవాబు.
దేశ భాషలో పరిపాలన, విద్యాబోధన, సమాచార వినిమయం.