Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 5th Lesson శతక సుధ Textbook Questions and Answers.
శతక సుధ TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana
చదువండి – ఆలోచించి చెప్పండి.
యాదగిరీశుని వేడుకొంటూ తిరువాయిపాటి వేంకట కవి రచించిన కింది పద్యాన్ని చదువండి.
వాదము చేయఁగా నరులు వాక్య పరుండని యెగ్గు చేతురున్
మోదముతో భుజించునెడ ముందుగఁ బిల్తురు తిండిపోతుగా,
ఏదియుఁ బల్కకున్నయెడ నీతఁడు మూగని యెంచుచుంద్రుగా,
నీ దయగల్గఁగా సుఖము నేర్పును యాదగిరీంద్ర మ్రొక్కెదన్.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఈ పద్యం ఏ శతకం లోనిది ? కవి ఎవరు ?
జవాబు.
ఈ పద్యం శ్రీయాదగిరీంద్ర శతకం లోనిది. కవి తిరువాయిపాటి వేంకటకవి.
ప్రశ్న 2.
ఈ పద్యాన్ని చదివినప్పుడు మీరేం గ్రహించారు ?
జవాబు.
ప్రజలు ప్రతి విషయానికీ ఎదుటి వారిని విమర్శిస్తూనే ఉంటారు. జనుల మెప్పుపొందడం తేలికకాదు అని ఈ పద్యాన్ని చదివి గ్రహించాను.
ప్రశ్న 3.
కవులు శతక పద్యాలు ఎందుకు రాస్తారు ?
జవాబు.
ప్రశ్న 4.
ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సమాజంలోని మంచి చెడ్డలు తెలియజెప్పడానికి, ప్రజలకు మంచి నడవడి అలవర్చడానికి కవులు శతక పద్యాలు రాస్తారు.
ఈ పద్యంలోని మకుటం ఏమిటి ?
జవాబు.
“యాదగిరీంద్ర” అనేది ఈ పద్యంలోని మకుటం
ప్రశ్న 5.
మీకు తెలిసిన కొన్ని శతకాల మకుటాలను చెప్పండి.
జవాబు.
యాదగిరీంద్ర !
విశ్వదాభిరామ వినురవేమ |
సుమతీ !
దాశరథీ కరుణాపయోనిధీ,
శ్రీ కాళహస్తీశ్వరా !
కుమారా !
కుమారీ !
నరసింహ ! దురిత దూర మొదలైనవి.
ఆలోచించండి- చెప్పండి (TextBook Page No. 47)
ప్రశ్న 1.
కవి ఉద్దేశంలో నిజమైన సుఖం అంటే ఏమిటి ? ‘వివేకధనం’గా కవి వేటిని పేర్కొన్నాడు ?
జవాబు.
పేదలకు సమృద్ధిగా అన్నము, వస్త్రాలు దానం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలు మాట్లాడకూడదు. ఇతరులతో తగవులు పెట్టుకోకూడదు. హద్దు మీరి ప్రవర్తించరాదు. అందరితో స్నేహంగా ఉండాలి. ఇవే తెలుసుకోవలసిన విషయాలు. ఇవన్నీ తెలుసుకోవడమే వివేకధనం అని కవి పేర్కొన్నాడు.
ఆలోచించండి- చెప్పండి (TextBook Page No. 48)
ప్రశ్న 1.
ఎట్లాంటి చదువు వ్యర్థమని మీరనుకొంటున్నారు. ఎందుకు ?
జవాబు.
ప్రశ్న 2.
మంచికూర ఎంత కమ్మగా నలభీమ పాకంగా చేసినా అందులో చాలినంత ఉప్పు వేయకపోతే రుచిగా ఉండదు. అలాగే ఎంత గొప్ప చదువులు చదివినా ఆ చదువులోని సారం గ్రహించలేకపోతే అటువంటి చదువు వ్యర్థం అని అనుకుంటున్నాను. సత్సంపదలు అంటే ఏవి ?
జవాబు.
మంచివారితో స్నేహం, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, మోక్షాన్ని పొందడం – ఇవీ సత్సంపదలు.
ప్రశ్న 3.
డబ్బు కూడబెట్టి దానధర్మం చేయనివాడిని తేనెటీగతో ఎందుకు పోల్చారు ?
జవాబు. తేనెటీగ పువ్వు పువ్వుకూ తిరిగి తేనెను తెచ్చి పట్టులో దాచి పెడుతుంది. అది తాగదు. చివరికి బాటసారులు ఆ తేనెను పిండుకుంటారు. అలాగే పిసినారి దానధర్మాలు చేయకుండా డబ్బు దాచిపెట్టి తాను అనుభవించకుండా కష్టపడతాడు. చివరికి ఆ దాచిన డబ్బు రాజులపాలో దొంగలపాలో అవుతుంది. అందుచేత దానధర్మం చేయనివాడిని తేనెటీగతో పోల్చారు.
ఆలోచించండి- చెప్పండి (TextBook Page No. 49)
ప్రశ్న 1.
మంచిమార్గంలో నడిచే ఆలోచనలు కలుగకపోవటానికి కారణాలేవి ?
జవాబు.
మానవుడు అంతంలేని కోరికలతో ఇష్టాలను పెంచుకుంటూ కొత్త కొత్త వాటికోసం ఆశపడుతూనే ఉంటాడు. అవి తీర్చుకోడానికి మంచి చెడు తెలుసుకోలేని అమాయకుడై ఉక్కిరిబిక్కిరైపోతూ చెడుదారులలో తిరుగుతుంటాడు. అందుకనే మంచి మార్గంలో నడిచే ఆలోచన చెయ్యడానికి కూడా అతడికి తీరిక దొరకదు.
ప్రశ్న 2.
“చెప్పుట చేయుటేకమై” నడవటమంటే ఏమిటి ?
జవాబు.
మనం ఏమి ఆలోచిస్తున్నామో అదే ఇతరులకు చెప్పాలి. ఇతరులకు మనమేమి చెప్పామో అదే ఆచరించాలి. ఆలోచనచేసే మనస్సు, చెప్పే మాట, చేసే పని ఈ మూడూ ఒకటిగా ఉండాలి. దీనినే త్రికరణ శుద్ధిగా ఉండటం అంటారు. చెప్పుట చేయుట ఏకమై నడవడమంటే ఇదే.
ప్రశ్న 3.
కవి చెప్పిన పుణ్యపు పనులేవి ?
జవాబు.
ఆకలితో, దప్పికతో బాధపడేవారికి కొంచెం అన్నము గాని, కూరగాని, నీరుగాని ఇచ్చి వారి బాధను తీర్చాలి. అలాచేస్తే ఎన్నో పుణ్యాలు చేసినంత ఫలితం లభిస్తుంది. ఇతరులకు మేలు కలిగే పని చేసినందుకు, ప్రియమైన పనిచేసినందుకు దేవుడు మెచ్చుకుంటాడు.
ఇవి చేయండి
విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.
2. శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి చర్చించండి.
జవాబు.
శతక పద్యాలలో కవులు వారి సమకాలికమైన సమాజంలోని ఆచారాలు, అలవాట్లు, నీతి నియమాలు, కట్టుబాట్లు మొదలైన వాటిని వివరిస్తారు. ఏది మంచి, ఏది చెడు అని తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారు. అందుచేత శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి అని చెప్పవచ్చు.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. పాఠంలోని పద్యాల ఆధారంగా కింద తెలిపిన పదాలతో వేటిని పోల్చినారో రాయండి.
అ) ఉప్పు : _________________
జవాబు. రసజ్ఞతను
ఆ) వేదాలు : _________________
జవాబు. వివేకధనాన్ని
ఇ) సుడిగుండాలు : _________________
జవాబు. కోరికలను
2. కరీంనగర్ జిల్లా వేములవాడ కవి మామిడిపల్లి సాంబశివశర్మ రాసిన కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.
పరువు లేకున్న జగతి సంబరము లేదు
సంబరము లేక అన్నమే సైపబోదు
అన్నమే లేక యున్న సోయగము సున్న
సోయగము లేక యున్న మెచ్చుదురె జనులు.
అ. అందంగా ఉండాలంటే ఇది అవసరం
ఎ) నగలు
బి) రంగు
సి) అన్నం
డి) వస్త్రాలు
జవాబు.
సి) అన్నం
ఆ. పరువు అంటే అర్థం
ఎ) ధనం
బి) గౌరవం
సి) పండుగ
డి) ప్రాణం
జవాబు.
బి) గౌరవం
ఇ. సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది ఏది ?
ఎ) అన్నం
బి) చదువు
సి) ప్రార్థన
డి) భక్తి
జవాబు.
ఎ) అన్నం
ఈ. జనులు మెచ్చుకొనటానికి ఒక కారణం
ఎ) దుర్మార్గం
బి) కోపం
సి) ద్వేషం
డి) సోయగం
జవాబు.
డి) సోయగం
ఉ. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసినది
ఎ) పరువు
బి) సంబరం
సి) అన్నం
డి) పైవన్నీ
జవాబు.
ఎ) పరువు
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. “తుచ్ఛ సౌఖ్య సంపాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు” అని భాస్కరకవి ఎందుకు చెప్పి ఉంటాడు?
జవాబు.
ఎవరైనా మంచి ప్రవర్తన గలవారినే ఇష్టపడతారు. అబద్ధాలాడేవారిని, అన్యాయంగా ఒకరి సొమ్ము కాజేసే వారిని సమాజం హర్షించదు. అందరితో తగవులు పెట్టుకొని అబద్ధాలాడి అన్యాయాలు చేసి నీచమైన సుఖాలు పొందవలసిన పనిలేదు. అందువల్ల మంచి మార్గంలో నడిచి పది మందితో మంచి అనిపించుకోవాలని భాస్కర కవి చెప్పాడు.
ఆ. వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలేవి ?
జవాబు.
వివేకి అయినవాడు తనకు ఉన్న దానిలో నుండి కొంతైనా అనాథలకు, పేదలకు సాయం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలాడకూడదు. అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు. అమర్యాదగా ప్రవర్తించ కూడదు. అందరితోనూ స్నేహంగా మెలగాలి. పైన చెప్పిన లక్షణాలన్నింటిని వేదాలుగా భావించాలి. ఇవే వివేకులకు ఉండవలసిన లక్షణాలు.
ఇ. పెంపునదల్లివై …. అనే పద్యంలోని అంతరార్థాన్ని మీరేమని గ్రహించారు ?
జవాబు.
భగవంతుడు సర్వ సమర్థుడు. ఆయన శరణు జొచ్చిన వారి పోషణ, రక్షణ మొదలైన అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటాడు. మానసిక శారీరకమైన అన్ని జబ్బులను దూరంచేసి తన భక్తులను ఆరోగ్యంగా ఉంచుతాడు. పాపాలంటనీకుండా మంచిదారిలో నడిపిస్తాడు. శాశ్వతమైన మోక్ష పదాన్ని అనుగ్రహిస్తాడు. అని “పెంపున తల్లివై’ అనే పద్యం ద్వారా తెలుస్తుంది.
ఈ. “కోరికలకు బానిసై ఉక్కిరి బిక్కిరి కావడం కంటె విశిష్టమార్గాన్ని వెతుక్కోవటం మంచిది” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు.
కోరికలు మనిషి మనుగడకు ఆటంకాలు. కోరికలు ఒకసారి మొదలైతే ఒకటి తీర్చుకుంటే మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. మనిషి ఆ కోరికల సాగరంలో కొట్టుకుపోతూ ఉక్కిరిబిక్కిరై పోతాడు. వాటిని సాధించుకోడానికి అక్రమ మార్గాలు వెతుక్కుంటాడు. అనేక కష్టనష్టాలకు గురి అవుతాడు. అందుకే విశిష్ట మార్గాన్ని వెతుక్కోవటం మంచిది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ. శతక కవులు ఈ విధమైన పద్యాలను ఎందుకు రాసి ఉంటారో కారణాలు రాయండి.
జవాబు.
1. పరిచయం : వేమన, బద్దెన, పోతన, భాస్కర కవి, మారద వెంకయ్య, భక్త రామదాసు, శేషప్పకవి … ఇలా ఎందరో శతక కవులు మన సాహిత్యంలో కనబడతారు.
2. నిశిత పరిశీలన : శతక కవులు తమ కాలంలో తమ చుట్టూ ఉండే పరిసరాలు, సమాజం, మనుషులు, వారి ప్రవర్తన, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, ధనవంతుల అత్యాచారాలు, పేదవారి అగచాట్లు మొదలైన విషయాలను జాగ్రత్తగా పరిశీలించేవారు. వాటిని గమనిస్తూ వారి మనసుల్లో కలిగే భావాలను పద్యరూపంలో పెట్టి శతకాలుగా రాసి ఉంటారు.
3. సమాజాన్ని సంస్కరించాలనే తహతహ : కొన్ని భక్తి శతకాలు, కొన్ని నీతి శతకాలు మనకు లభిస్తున్నాయి. ఏ శతకమైనా పైన చెప్పిన అంశాలను ప్రజలకు వివరించడం, వాటిలోని మంచిచెడులను గుర్తింపజేయడం, మంచిమార్గంలో నడిచేందుకు స్ఫూర్తినివ్వడం, లక్ష్యంగా పెట్టుకొని శతక కవులు ఈవిధమైన పద్యాలు రాసి ఉండవచ్చు. ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుకొని పోకుండా ఉండడానికి, సమాజం చెడుమార్గంలో వెళుతూ ఉంటే సరైన మార్గంలో పెట్టడానికి శతకాలు రాసి ఉంటారు.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) పాఠశాలలో పిల్లలకు నిర్వహించే పద్యాల పోటీలో పిల్లలందరు పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను రాయండి. (ప్రకటనలో పోటీ నిర్వహణ తేదీ, స్థలం, సమయం మొదలైన వివరాలుండాలి)
ప్రకటన
పద్య పఠనం పోటీలు
ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అంతర పాఠశాలలతో పద్య పఠనం పోటీలు నిర్వహించబడతాయి. పోటీ ఆగష్టు 13వ తేదీన జరుగుతుంది. పోటీలో గెలిచినవారికి ఆగష్టు 15న జరిగే జెండా వందనం ఉత్సవంలో బహుమతులు అందించబడతాయి.
నిబంధనలు :
పద్యాలు రాగయుక్తంగా పాడాలి.
తప్పులు లేకుండా పాడాలి.
స్పష్టమైన ఉచ్చారణతో పాడాలి.
నిర్ణయం న్యాయ నిర్ణేతలదే.
ఆసక్తిగల విద్యార్థులు ఆగష్టు 5వ తేదీ నాటికి తమ పేర్లు నమోదు చేయించుకోగలరు.
వేదిక :
ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల, వరంగల్.
నిర్వహణ తేదీ : XX,XX.XXXX
సమయం ఉదయం 10 గంటల నుంచి
ఇట్లు
కార్యదర్శి,
ఎస్. ఆర్. ఎమ్. పాఠశాల
వరంగల్.
V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాలలోని సమానార్ధక పదాలను గుర్తించి, గీత గీయండి.
అ) ఇతరుల దోషాలు ఎంచేవాళ్ళు తమ తాము తెలుసుకోరు.
జవాబు.
దోషాలు = తప్పులు
ఆ) తేనెతెట్టు నుండి తేనెను సేకరిస్తారు. ఆ మధువు తీయగా ఉంటుంది.
జవాబు.
తేనె = మధువు
2. కింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : సహృదయత గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
జవాబు.
సహృదయత = మంచి మనసు
అ) పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్నిస్తుంది.
జవాబు.
పరిమళం = సువాసన
ఆ) సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది.
జవాబు.
మైత్రి = స్నేహం
3. కింద ఇవ్వబడిన పదాలలో ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.
జవాబు.
ప్రకృతి | వికృతి |
గుణం | గొనం |
దోషం | దోసం |
సుఖం | సుకం |
పుణ్యెం | పున్నెం |
అగ్ని | అగ్గి |
వైద్యుడు | వెజ్జు |
ధర్మం | దమ్మం |
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) దశేంద్రియ = _________ + _________ + _________
జవాబు.
దశ + ఇంద్రియ – గుణసంధి
ఆ) లక్షాధికారి = _________ + _________ + _________
జవాబు.
= లక్ష + అధికారి – సవర్ణదీర్ఘ సంధి
ఇ) పట్టెడన్నము = _________ + _________ + _________
జవాబు.
= పట్టెడు + అన్నము – ఉత్వ సంధి
ఈ) రాతికంటు = _________ + _________ + _________
జవాబు.
= రాతికి + అంటు – ఇత్వ సంధి
ఉ) చాలకున్న = _________ + _________ + _________
జవాబు.
చాలక + ఉన్న – అత్వసంధి
2. కింది విగ్రహవాక్యాలకు సమాసపదాలు రాసి, సమాసం పేరు రాయండి.
జవాబు.
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) ఆకలిదప్పులు – ఆకలియు, దప్పియు – ద్వంద్వ సమాసం
ఆ) అన్నవస్త్రాలు – అన్నము, వస్త్రము – ద్వంద్వ సమాసం
ఇ) దశేంద్రియాలు – దశ సంఖ్య గల ఇంద్రియములు – ద్విగు సమాసం
ఈ) నాలుగు వేదాలు – నాలుగైన వేదాలు – ద్విగు సమాసం
ఛందస్సు – లఘువు, గురువు
కింది వానిని చదివి తెలుసుకోండి.
పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు.
అ) “లఘువు” – ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘ల’ అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “” (నిలువుగీత). లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.
ఆ) “గురువు” – రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘గ’ అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “U”. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.
3. కింది పదాలకు గురులఘువులు గుర్తించండి.
జవాబు.
గణాలు
గణం అంటే మాత్రల అక్షరాల సముదాయం. అంటే గురు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.
1. ఏక (ఒకే) అక్షర గణాలు. ఆ ఒకే అక్షరం లఘువు అయితే ” అనీ, గురువు అయితే ‘U’ అనీ గుర్తు ఉంటుంది.
2. రెండు అక్షరాల గణాలు.
3. మూడు అక్షరాల గణాలు.
కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు చూడండి.
4. కింద పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేయండి.
అ) బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛ సౌఖ్యసం
జవాబు.
సూచన : ఇందులో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఉత్పలమాల పద్యపాదము –
ఆ) పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా
జవాబు.
సూచన : ఇందులో న, జ, భ, జ, జ, జ, ర ‘అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది చంపకమాల పద్య పాదం. ‘పొ’ కి, ‘పు’ కి యతి స్థానం.
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని
కింది తరగతుల్లో ఇచ్చిన శతక పద్యాల ఆధారంగా ఆ శతకాల పేర్లు, వాటిని రాసిన కవుల పేర్లు సేకరించి, పట్టిక తయారుచేసి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
శతకం పేరు | కవి పేరు |
1. వేమన శతకం | వేమన |
2. సుమతీ శతకం | బద్దెన |
3. శ్రీకాళహస్తీశ్వర శతకం | ధూర్జటి |
4. వృషాధిప శతకము | పాల్కురికి సోమన |
5. దాశరథీ శతకం | కంచర్ల గోపన్న |
6. సుభాషిత త్రిశతి | ఏనుగు లక్ష్మణకవి |
7. భాస్కర శతకం | మారద వెంకయ్య |
8. నారాయణ శతకం | పోతన |
9. కుమార శతకము | పక్కి అప్పల నర్సయ్య |
10. చిత్తశతకం | శ్రీపతి భాస్కరకవి |
11. కాళికాంబ శతకం | శ్రీ పోతులూరి వీరబ్రహ్మం |
12. తెలుగుబాల | జంధ్యాల పాపయ్యశాస్త్రి |
ఇ) ముగింపు :
జంధ్యాల పాపయ్యశాస్త్రి
ఈ విధంగా వివిధ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా నేను వివిధ శతక కర్తలు, వారి పద్యాల గొప్పదనం తెలుసుకొన్నాను. అంత పురాతన కాలంలో, సాంఘిక రుగ్మతలు రూపు మాపటానికి కలాన్ని ఎన్నుకొని కృషి చేసిన ఆ మహనీయులు ఎంతో అభినందనీయులు.
TS 8th Class Telugu 5th Lesson Important Questions శతక సుధ
ప్రశ్న 1.
అంతరార్థం తెలుసుకోని చదువు వృథా అనడానికి భాస్కర శతక కర్త ఏ ఉదాహరణ చెప్పారు ?
జవాబు.
భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా! అని భాస్కర శతక కర్త అన్నాడు.
ప్రశ్న 2.
“ఇతరులు గౌరవించనంత మాత్రాన తాను చేస్తున్న మంచి పనిని, వృత్తిని తక్కువగా అనుకోనక్కర్లేదు”. ఉదాహరణలతో రామసింహకవి ఎట్లా సమర్థించాడు ?
జవాబు.
మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవీ పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దు స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు. మనిషిని వెలివేసినా, అతని విద్యకు లోటేమిరాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికీపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు అని పండిత రామసింహకవి చెప్పాడు.
ప్రశ్న 3.
శతక పద్యాలలోని విలువలు విద్యార్థులను తీర్చి దిద్దుతాయి” ఎట్లాగో వివరించండి.
(లేదా)
శతక పద్యాలలో ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు కదా! వాటిని విద్యార్థులు తెలుసుకోవటం వల్ల భవిష్యత్తులో సమాజం చాలా బాగుంటుంది. ఎట్లాగో వివరించండి.
(లేదా)
“శతక సుధ” పాఠం ద్వారా మీరు తెలుసుకున్న మంచి విషయాలు ఏమిటి?
(లేదా)
సమాజం యొక్క మేలుకోసం శతక పద్యాలు ఏ విధంగా తోడ్పడుతాయి?
జవాబు.
సమాజహితాన్ని కోరి శతక కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెల్పుతూ, మానవుడిలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. సమాజంలోని ఆచారాలు, నీతిని వివరించుటే లక్ష్యంగా నీతి, భక్తి శతకాలను రచించారు. సమాజహితమే వీరి లక్ష్యం. సత్యం, దయ, శాంతం, భక్తి, ధ్యానం, మంచి మనసు, ధర్మం, ధైర్యం లాంటి గుణాలు నాకు ఇచ్చి నీ భక్తుడుగా ఉండే సుఖం ఇవ్వమని భక్తుల లక్షణాలు తెలిపారు.
పేదవారికి దానం, నీచ సుఖాలకి అబద్ధాలాడకుండుట, వాదనకు దిగకుండుట, హద్దు మీరి ప్రవర్తించకుండా సఖ్యంగా ఉండటం వివేకుల ధనం అని తెల్పారు. శాశ్వత సంపదలు ఇచ్చేది భగవంతుడు. దానం చేయకుండా దాస్తే పోయేముందు తీసుకెళ్ళడు. చివరికి బాటసారుల పాలౌతుంది. ఇతరులు గౌరవించనంతమాత్రాన వృత్తి ఘనతకు భంగం కలుగదు. భగవంతుని భక్తులను సేవించుట భగవంతుని సేవయే అని, మంచిదారిలో నడిచే ఆలోచన కల్గించేది భగవంతుడే అని తెలియచేశారు.
శతక పద్యాలలో ఇటువంటి ఎన్నో మంచి విషయాలు విద్యార్థులు తెలుసుకోవటం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో మంచివారుగా ఉండటమే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పడగలరు. ఇట్లాంటి మంచి నీతులు తెల్పే శతక పద్యాలు విద్యార్థులు చదవటం ఎంతో అవసరం. ఈ నీతులు విద్యార్థులను మంచివారుగా తీర్చి దిద్దుతాయనుటలో అతిశయోక్తి లేదు.
ప్రశ్న 4.
“చెడ్డ వారితో ఉన్నంత మాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవు” శతక సుధ పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు.
- మొగలి పువ్వు మూలాలు బురదలో ఉన్నా పువ్వు ప్రాధాన్యత తగ్గదు.
- పశువుల దోషాలు పాలకు అంటుకోవు.
- వైద్యుడిచ్చే మందులకు అతని కులంతో సంబంధమేమీ ఉండదు.
- కప్పల దోషాల వల్ల ముత్యాల వన్నె తగ్గదు.
- ఎద్దుల స్వరూపం ఎట్లా ఉన్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు.
- మనిషిని వెలివేసినా అతని విద్యకు లోటురాదు.
- అపవిత్ర దోషాలు అగ్నికి అంటవు.
- చందనం మలినమైనంత మాత్రాన దాని సువాసనలు ఎక్కడికీపోవు.
- రాయికి అంటిన బెల్లం తీపి కొంచెంకూడా తగ్గదు.
- ఇతరులు గౌరవించనంత మాత్రాన వృత్తి ఘనతకు ఏ భంగం కలుగదు.
దీనిని బట్టి చెడ్డవారితో ఉన్నంతమాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవని చెప్పవచ్చు.
ప్రశ్న 5.
శతక సుధ పాఠంలో నీవు చదివిన పద్యాల్లో నీకు బాగా నచ్చిన వాక్యం గురించి మీ చెల్లికి లేఖ రాయండి.
ది. XX.XX.XXXX,
ఖమ్మం.
ప్రియమైన చెల్లి దేవికకు!
నీవు బాగా చదువుకుంటున్నావని తలుస్తాను. నేనిక్కడ హాస్టల్లో బాగానే చదువుకుంటున్నాను. ఈమధ్యే మా తెలుగు మాస్టారు ‘శతక సుధ’ పాఠం చెప్పారు. అందులో ఎన్నో చక్కని విషయాలు చెప్పారు. అందులోని ప్రతి పద్యమూ మన జీవితాలకు ఉపయోగపడేదే.
అందులో పండిత రామసింహకవి రాసిన విశ్వకర్మ శతకం నుండి ‘మొదట కర్దమముంటే మొగలి పుష్పముకేమి’ అనే పద్యం నాకు బాగా నచ్చింది.
బురద ఉన్నా మొగలిపువ్వు వాసన తగ్గదు. అపవిత్ర దోషాలతో అగ్నిదేవునికి వచ్చిన చిక్కులేదు. ఇలా ఎన్నో ఉదాహరణలతో మనం చేసే మంచి పనిని ఒకరు గుర్తించకపోయినా నష్టం లేదు అని చెప్పారు. ఒకరి మెప్పుకోసం కాక మన పనిని మనం ఇష్టంతో చేయాలని దీనర్థం.
నీవు కూడా నీ పుస్తకంలోని శతక పద్యాలు చదువు. నీకిష్టమైన పద్యం గూర్చి రాయి. అమ్మనీ, నాన్ననీ అడిగానని చెప్పు.
నీ అక్క
కె. రాజ్యలక్ష్మి
చిరునామా :
కొప్పురావూరి దేవిక
C/o. రమేష్
పుణ్యపురం
వైరా మండలం
ఖమ్మం జిల్లా
పర్యాయపదాలు:
- కృప = దయ, కరుణ
- చిత్తము = మతి, మనస్సు
- కరము = మిక్కిలి, అధికము
- మా = రమ, లక్ష్మీదేవి
- తుచ్ఛము = నీచము, అల్పము
- ఉప్పు = లవణం, రుచి
- మెయి = మేను, శరీరం
- విత్తము = ధనము, డబ్బు
- పుష్పము = పూవు, కుసుమము
- పరిమళము = సుగంధము, సువాసన
- కలుషము = దోషము, పాపము
నానార్థాలు:
- కరము = మిక్కిలి, చేయి, ఏనుగుతొండం, పన్ను
- మర్యాద = గౌరవము, హద్దు
- పెంపు =అభివృద్ధి, పెద్దచేయుట
- కృషి = వ్యవసాయము, కష్టము
ప్రకృతులు – వికృతులు:
- మర్యాద – మరియాద
- శుద్ధి – సుద్ది
- స్థిరము – తిరము
- భృంగారము – బంగారము
- కులము – కొలము
- విద్య – విద్దె
వ్యుత్పత్త్యర్థాలు:
- ఆంజనేయుడు = అంజనీదేవి కుమారుడు (హనుమంతుడు)
- దాశరథి = దశరథుని యొక్క కుమారుడు (శ్రీరాముడు)
- పయోనిధి = నీటికి నిలయమైనది (సముద్రము)
- భాస్కరుడు = వెలుగునిచ్చు కిరణములు కలవాడు (సూర్యుడు)
సంధులు:
- సతతాచారము = సతత + ఆచారము
- లక్షాధికారి = లక్ష + అధికారి
- సాధు జనానురంజన = సాధుజన + అనురంజన = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. - ప్రేమటంచు = ప్రేమము + అటంచు = ఉత్వ సంధి
- వెజ్జువై = వెజ్జువు + ఐ = ఉత్వ సంధి
- సంపదలీయ = సంపదలు + ఈయ = ఉత్వ సంధి
- తేడెవ్వడు = తేడు + ఎవ్వడు = ఉత్వ సంధి
- విత్తమార్జన = విత్తము + ఆర్జన = ఉత్వ సంధి
- లవణమన్నము = లవణము + అన్నము
- మరుగైన = మరుగు + అయిన = ఉత్వ సంధి
- కర్దమముంటే = కర్దమము + ఉంటే = ఉత్వ సంధి
- ఎట్లున్న = ఎట్లు + ఉన్న = ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది. - కాకుండ = కాక + ఉండ = అత్వ సంధి
- నేర్చునటయ్యా = నేర్చునట + అయ్యా = అత్వ సంధి
- ఒందకుండ = ఒందక + ఉండ = అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. - తల్లివై = తల్లివి + ఐ = ఇత్వ సంధి
- జుంటీగ = జుంటి + ఈగ = ఇత్వ సంధి
- రాతికంటు = రాతికి + అంటు = ఇత్వ సంధి
- ఇట్టివౌ = ఇట్టివి + ఔ = ఇత్వ సంధి
సూత్రం : ఏమి మొదలైన పదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు
1. మ॥ సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్
ధృతియున్ ధర్మము సర్వజీవ హితముం దూరంబు గాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణా !
ప్రతిపదార్థం:
మానాథా = లక్ష్మీదేవికి భర్త అయిన వాడా
నారాయణా = ఓ విష్ణుమూర్తీ!
సతత = ఎల్లప్పుడు
ఆచారము = పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడం
సూనృతంబు = మంచి మాట
కృపయున్ = దయ
సత్యంబునున్ = నిజము మాట్లాడుట
శీలమున్ = మంచి స్వభావము
నతి = వినయంగా ఉండటము
శాంతత్వము = ఓర్పుతో ఉండటము
చిత్తశుద్ధి కరమున్ = మనస్సు నిర్మలంగా ఉండటము
అధి+ఆత్మయున్ ధ్యానమున్
ధ్యానమున్ = స్మరణ
ధృతియున్ = ఇంద్రియ నిగ్రహము
ధర్మము = ధర్మ ప్రవర్తనము
మిక్కిలిగా దేవుని మీద భక్తి
సర్వజీవ = ప్రాణులన్నింటికి
హితమున్ దూరంబు = మేలు కోరుట
గాకుండా = ఇవేవి వదిలి పెట్టకుండా
మీ చేరువన్ = మీ సమీపంలో
సమ్మతికిన్ = మీకిష్టమగునట్లుగా
నివాస = నివసించుట అనే
సుఖమున్ = సౌఖ్యమును (ప్రసాదించుము)
తాత్పర్యం :
లక్ష్మీదేవి భర్త అయిన ఓ నారాయణుడా! ప్రియవచనం, దయ, సత్యం, మంచి స్వభావం, మిక్కిలి శాంతం, నిర్మలమైన మనస్సు, భగవద్భక్తి, ధ్యానం, ధైర్యం, ధర్మాలను సదా ఆచరిస్తూ, సర్వప్రాణుల మేలు కోరేవాడిగా, మీ సన్నిధిలో మీ కిష్టమైన వాడిగా ఉండే సుఖాన్ని దయచేయి (ఇవ్వుమని అర్థం)
2. ఉ॥ బీదల కన్నవస్త్రములు పేర్మి నొసంగుము, తుచ్ఛ సౌఖ్యసం
పాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు, మ
ర్యాద నతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టి వౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిది నమ్ము, చిత్తమా!
ప్రతిపదార్థం:
చిత్తము + ఆ = ఓ మనసా !
బీదలకున్ = పేదవారికి
అన్న వస్త్రములు = కూడును, గుడ్డయు (గ్రాసవాసములు)
పేర్మిన్ = ప్రేమతో, అధికముగా
ఒసంగుము = ఇమ్ము, దానము చేయుము
తుచ్ఛ = నీచమైన, అల్పమైన
సౌఖ్య = సుఖముల యొక్క
సంపాదనకున్ + ఐ = గడనకై, ఆర్జనమునకై
అబద్ధములన్ = అసత్యములను, కల్లలను
పల్కకు = మాటలాడకుము, చెప్పకుము
వాదములు = వాగ్వాదములు, తగవులు
ఆడ = చేయుటకు, నడపుటకు
పోకు = వెళ్ళకుము
మర్యాదన్ = నీతి పద్ధతిని, హద్దును
అతిక్రమింపకు = మీఱకుము
పరస్పర = అన్యోన్యమైన
మైత్రిన్ = స్నేహముతో
మెలంగుము = నడచుకొనుము
వేదములు = ఆగమములు
ఇట్టి+అవి+ఔన్ = ఇటువంటివే యగును
అంచున్ = అని
ఎరుంగుము = తెలిసికొనుము
ఇది = ఇద్ది (ఈ పద్ధతి, ఈ గుణము)
వివేక = మంచి చెడులను తెలిసికొను తెలివి కలవారి యొక్క
ధనంబు = సంపద
నమ్ము = విశ్వసింపుము
తాత్పర్యం :
ఓ చిత్తమా! పేదవారికి అన్నదానం, వస్త్రదానం అధికంగా చేయి. నీచమైన సుఖాలకోసం అబద్ధాలాడకు. అనవసరంగా ఎవరితోను వాదనకు దిగకు. హద్దుమీరి ప్రవర్తించకు. అందరితో సఖ్యంగా ఉండు. ఈ సూత్రాలనే వేదాలుగా భావించు. వివేకులకు ఈ లక్షణాలే సంపదగా భాసిల్లుతాయి.
3. చ|| చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
ప్రతిపదార్థం:
భాస్కరా ! = ఓ సూర్యదేవా !
చదువు + అది = విద్య అనునది
ఎంత = ఏ కొలది
కల్గినన్ = ఉన్నప్పటికిని
ఇంచుక = కొంచెము
రసజ్ఞత = రసికత
చాలక + ఉన్నన్ = సరిపడక పోయినచో
ఆ చదువు = ఆ గొప్ప చదువు
నిరర్థకంబు = ప్రయోజనం లేనిది (అవుతుంది)
గుణసంయుతులు = సుగుణములతో కూడినవారు (సుగుణవంతులు)
ఎవ్వరున్ = ఎవరైనను
ఎచ్చటన్ = ఎక్కడ కూడా
మెచ్చరు = మెచ్చుకోరు
పదనుగన్ = అన్నీ కుదిరేటట్లు చక్కగా
మంచి కూరన్ = మంచికూరను, ఇష్టమైన కూరను
నలపాకము = నలమహారాజు వంటవలె
చేసినన్ + ఐనన్ = వండినప్పటికిని
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = ఇష్టమును కలిగించే (రుచిని కలిగించే)
ఉప్పులేక = ఉప్పు లేకపోయినచో
రుచి = రుచి
పుట్టగన్ + నేర్చున్ ఆట + అయ్య = కలుగుతుందా ? (కలుగదని భావం)
తాత్పర్యం :
భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా!
4. ఉ॥ పెంపునదల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నిపా
రింపను వెజ్జువై, కృపగుఱించి పరంబు దిరంబుగాగ స
త్సంపద లీయ నీవెగతి దాశరథీ! కరుణా పయోనిధీ!
ప్రతిపదార్థం:
దాశరథీ! = దశరథుని కుమారుడవైన శ్రీరామా!
కరుణా = దయకు
పయోనిధీ = సముద్రం వంటి వాడా
పెంపునన్ = పిల్లలను పెంచడంలో
తల్లివి + ఐ = తల్లి వంటి దానివై
కలుషబృంద = పాపాల సమూహంతో
సమాగమము = కలయిక
ఒందకుండా = కలుగకుండా
రక్షింపను = కాపాడే విషయంలో
తండ్రివి + ఐ = తండ్రి వంటి వాడవై
మెయి = శరీరంలో
వసించు = ఉన్న
దశ + ఇంద్రియ = పది ఇంద్రియములకు సంబంధించిన
రోగముల్ = జబ్బులను
నివారింపను = తొలగించుటకు
వెజ్జువు + ఐ = వైద్యుని వంటి వాడివై
కృప గురించి = దయతో
పరంబు = మోక్షము
తిరంబు + కాగ = శాశ్వతమగునట్లుగా
సత్ సంపదలు = సత్యమైన మోక్ష సంపదలు
ఈయన్ = ఇచ్చుట
నీవు + ఎ = నీవు మాత్రమే
గతి = ఆధారము
తాత్పర్యం :
దయా సముద్రుడవైన రామా! పెంపకంలో తల్లివి. చెడుదారిన నడువకుండా కాపాడే తండ్రివి. ఇంద్రియ (జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ) రోగాలను తొలగించే వైద్యుడివి. మోక్షం స్థిరమయ్యేటట్లుగా దయతో మేలైన సంపదలు ఇవ్వడానికి నీవే దిక్కు.
5. సీ॥ తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగఁబోడు
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటె కాని,
కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల పెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తే॥ తుదకు దొంగల కిత్తురో ? దొరలకవునొ ?
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
ప్రతిపదార్థం:
భూషణ వికాస! = ఆభరణములతో ప్రకాశించువాడా!
శ్రీ ధర్మ పుర నివాసా = ధర్మపురంలో నివసించే స్వామీ
దుష్ట సంహార! = దుర్మార్గులను సంహరించేవాడా
దురితదూర! = పాపములను పోగొట్టే వాడా
నరసింహ = నరసింహ స్వామీ
ఎవ్వడు = ఎవరూ కూడా
తల్లి గర్భము నుండి = తల్లి కడుపు నుండి పుట్టేటప్పుడు
ధనము తేడు = డబ్బు తీసుకురాడు
వెళ్ళి పోయెడినాడు. = మరణించే సమయంలో
వెంటరాదు = తనతో పాటు రాదు
లక్ష అధికారి + ఐన = లక్షలకు అధిపతి అయినప్పటికీ
లవణము + అన్నము + ఎ = ఉప్పు అన్నము తప్ప
మెరుగు = మెరిసిపోయె
బంగారము = బంగారాన్ని
మ్రింగన్ + పోడు = తినలేడు
విత్తము = డబ్బు
ఆర్జన చేసి = సంపాదించి
విర్రవీగుట + ఎ + కాని = అహంకరించడమే తప్ప
కూడన్ + పెట్టిన = పోగు చేసిన
సొమ్మున్ = సంపదను
కుడువన్ + పోడు = అనుభవించబోడు
పొందుగా = చక్కగా
మరుగు + ఐన = రహస్యంగా ఉన్న
భూమిలోపల = భూమిలో
పెట్టి = పాతిపెట్టి
దాన ధర్మము లేక = దానము ధర్మము లేకుండా
దాచి దాచి = ఎంతో కాలం దాచిపెట్టి
తుదకు = చివరికి
దొంగలకు + ఇత్తురో? = దొంగల పాలు చేస్తారో ?
దొరలకు + అవునో? = రాజుల పాలవుతుందో ?
తేనెజుంటి + ఈగలు = తేనెటీగలు
తెరువరులకు = బాటసారులకు
తేనె = తేనెను
ఇయ్యవు + ఆ = ఇవ్వడం లేదా
తాత్పర్యం :
శ్రీ ధర్మపురి నివాసుడా! ఆభరణాలచేత ప్రకాశించేవాడా! పాపాలను దూరం చేసేవాడా! దుర్మార్గులను పారదోలేవాడా! ఓ నరసింహా! తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవ్వడూ ధనాన్ని వెంట తీసుకొనిరాడు. పోయేటప్పుడు వెంటతీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైనా ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోడమే కానీ, తాను కూడబెట్టిన సొమ్మును తినడు. అలాంటిదాన్ని దానం, ధర్మం చేయకుండా భూమిలో పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకొన్నట్టు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగలపాలో, రాజులపాలో చేస్తాడు.
6. సీ॥ మొదట కర్దమముంటె మొగిలిపుష్పముకేమి ?
పశువుల దోషముల్ పాలకేమి ?
అరయ వైద్యుని కులం బౌషధంబునకేమి ?
కప్పదోషము మౌక్తికములకేమి ?
వృషభంబు లెట్లున్న కృషికర్మమునకేమి ?
వెలియైన వాని సద్విద్యకేమి ?
అపవిత్ర దోషంబు లగ్నిహెూత్రునకేమి ?
గుణదోషములవల్ల కులముకేమి ?
మలినమై చందనము పరిమళము జెడున
రాతికంటు గుడము మధురంబు జెడున
వినయములు జెడ మావృత్తి ఘనత జెడున
విశ్వ పాలన ధర్మ ! శ్రీ విశ్వ కర్మ!
ప్రతిపదార్థం:
విశ్వపాలన ధర్మ! = ప్రపంచాన్ని రక్షించుటయే ధర్మముగా కలవాడా!
శ్రీవిశ్వకర్మ! = ప్రపంచాన్ని సృష్టించిన వాడా!
మొదట = వేళ్ళ దగ్గర
కర్దమము + ఉంటే = బురద ఉంటే
మొగిలిపుష్పముకు + ఏమి = మొగలిపువ్వు తప్పేమిటి
పశువుల దోషముల్ = జంతువులు తప్పులు
పాలకు + ఏమి = పాలకెందుకుంటాయి
అరయ = ఆలోచించినట్లయితే
వైద్యుని కులంబు = వైద్యుని యొక్క కులముతో
ఔషధంబునకు = మందుకు
ఏమి = పనేముంది
కప్పదోషము = కప్పల వలన దోషం జరిగితే
మౌక్తికములకు + ఏమి = ముత్యాల గొప్పదనం తగ్గుతుందా ?
కృషి కర్మమునకు = వ్యవసాయమునకు
వృషభంబులు = ఎద్దులు
ఎట్లు + ఉన్నన్ +ఏమి = ఎలా ఉంటే ఏమిటి ?
వెలి + ఐన = సమాజమునకుదూరమైనప్పటికీ
వాని = అతడి
సత్ + విద్యకు +ఏమి= విద్యాభ్యాసానికి అడ్డేమిటి
అగ్నిహోత్రునకు = అగ్నిదేవునకు
అపవిత్రదోషంబులు + ఏమి = పాపమెందుకు అంటుతుంది
కులముకు = వంశానికి
గుణ దోషముల వల్ల ఏమి = పాపపుణ్యాలతో సంబంధం ఏముంది ?
మలినమై చందనము = మురికి పట్టినంత మాత్రాన
పరిమళము = గంధము యొక్క సువాసన
చెడును + అ = చెడిపోతుందా ?
రాతికి + అంటు = గుండ్రాయికి అంటుకున్న
గుడము = బెల్లము యొక్క
మధురంబు = తియ్యదనము
చెడును + అ = తగ్గిపోతుందా ?
వినయములు చెడన్ = గౌరవము లోపించినంత మాత్రాన
మా వృత్తి = మా పని యొక్క
ఘనత = గొప్పదనము
చెడును + అ = పాడైపోతుందా ?
తాత్పర్యం :
శ్రీ విశ్వకర్మా! విశ్వాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడా! మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవి పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దుల స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బందిరాదు. మనిషిని వెలివేసినా, అతని విద్యకు లోటేమిరాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికిపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు.
7. ఉ॥ లెక్కకురాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్
ముక్కువలన్ సృజించుచు సమాయకుడై సుడులన్ పదేపదే
యుక్కిరి బిక్కిరై తిరుగుచుండునుగాని, విశిష్ట మార్గముల్
ద్రొక్కు తలంపులేశము కుదుర్కొననీయడె? వేంకటేశ్వరా!
ప్రతిపదార్థం:
వేంకట + ఈశ్వరా! = పాపాలను పోగొట్టే దైవమా!
మానవుండు = మానవుడు
లెక్కకు రాని = అనంతమైన
కోరికల రీతులలో = కోరికల సమూహంలో
పడి = చిక్కుకు పోయి
ఇటుల్ = ఈ విధముగా
మక్కువలన్ = కోరికలను
సృజించుచూ = ఇంకా ఇంకా పెంచుకుంటూ
అమాయకుడై = తెలివిలేనివాడై
పదే పదే = మాటి మాటికి
సుడులన్ = కోరికల సుడిగుండాలలో
ఉక్కిరి బిక్కిరి + ఐ= ఊపిరాడకుండా
తిరుగుచు + ఉండును + కాని = తిరుగుతుంటాడే తప్ప
విశిష్ట మార్గముల్ = మంచి దారులలో
త్రొక్కు = నడిచే
తలంపు = ఆలోచన
లేశ్యము = కొంచెమైన
కుదుర్కొననీయడు + ఎ ? = స్థిరపడనివ్వడు కదా ?
తాత్పర్యం : ఓ వేంకటేశ్వరా! మనిషి అధికమైన కోరికలకు బానిసై అమాయకత్వంతో వివిధ అనుబంధాలను సృష్టించుకుంటూ సుడిగుండాలలో పడి, ఉక్కిరిబిక్కిరై తిరుగుతుంటాడే గాని మంచి దారిలో నడిచే ఆలోచన కలిగేటట్లుగా చేయడం లేదు కదా!
8. ఉ|| ఆకలిదప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
శాకమొ, నీరమో యిడి, ప్రశాంతుల జేసిన సర్వపుణ్యముల్
చేకురు, నీవుమెచ్చెదవు, శ్రేయము, ప్రేయమటంచు నెంతయున్
బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా!
ప్రతిపదార్థం:
ఖల భంజన! = దుష్టులను శిక్షించే వాడా
సాధుజన = మంచివారిని
అనురంజన! = సంతోషపెట్టేవాడా
బావ+ ఆంజనేయ! = బాకవరంలో వెలసిన ఆంజనేయ స్వామీ!
ఆకలిదప్పులన్ = ఆకలితోనూ, దాహంతోనూ
వనటన్ = బాధను
అందినవారికి = పొందినవారికి
పట్టెడు అన్నము + ఓ = గుప్పెడు ఆహారమో
శాకము + ఓ = కూర
నీరము + ఓ = మంచినీరో
ఇడి = ఇచ్చి
ప్రశాంతుల = శాంతి పొందిన వారిగా
చేసినన్ = చేసినట్లయితే
సర్వపుణ్యముల్ = అన్ని పుణ్యములు
చేకురు = కలుగును
ఎంతయున్ = మిక్కిలి
శ్రేయము = మేలు కలిగించేది.
ప్రేమయు = ఇష్టాన్ని కలిగించేది
అటంచు = అంటూ
నీవు = దేవుడవైన నీవు
మెచ్చెదవు = మెచ్చుకుంటావు
తాత్పర్యం : పాపులను నశింపజేసేవాడ! సాధుజనులను ఆనందింపజేసేవాడ! బాకవరంలో వెలసిన ఓ ఆంజనేయా! ఆకలిదప్పులతో అలమటించే వారికి పట్టెడన్నంగాని, శాకంగాని, నీళ్ళుగాని ఇచ్చి వారిని శాంతపరిస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయి. ఆ విధంగా భక్తులు చేస్తే, అది వారికి మేలయినదని, ప్రియమైనదని నీవు మెచ్చుకుంటావు.
పాఠ్యభాగ ఉద్దేశం
ప్రశ్న.
శతకసుధ పాఠ్యభాగం ఉద్దేశం తెల్పండి.
జ
శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారుజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం
పాఠ్యభాగ వివరాలు
ప్రశ్న.
శతక ప్రక్రియను గురించి వివరించండి.
జవాబు.
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది. కాని నూటెనిమిది పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదంగాని, పాదంగాని లేక రెండు పాదాలుగాని అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటమంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్రభావాన్ని కల్గివుంటుంది.
ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వేంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు.
కవి పరిచయం
ప్రశ్న 1.
నారాయణ శతక కర్తను గురించి తెల్పండి.
జవాబు.
నారాయణ శతకం : ‘నారాయణా!’ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని పోతన రాశాడు. ఇతడు వరంగల్లు జిల్లా బమ్మెర వాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగినీదండకం, వీరభద్ర విజయం రాశాడు.
ప్రశ్న 2.
చిత్త శతకం రచించిన కవిని గురించి రాయండి.
జవాబు.
చిత్త శతకం : శ్రీపతి భాస్కర కవి ‘చిత్తమా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం.
ప్రశ్న 3.
భాస్కర శతకం రాసిన కవిని పరిచయం చేయండి.
జవాబు.
భాస్కర శతకం : మారద వెంకయ్య ‘భాస్కరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోను మొదటి, రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి, తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత.
ప్రశ్న 4.
దాశరథీ శతక కర్తను పరిచయం చేయండి.
జవాబు.
దాశరథీ శతకం : కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. ‘దాశరథీ కరుణాపయోనిధీ!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు రాశాడు.
ప్రశ్న 5.
నరసింహ శతకం రచించిన కవిని గురించి వివరించండి.
జవాబు.
నరసింహ శతకం : ఈ శతక కర్త కాకుత్థ్సం శేషప్పకవి. కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవాడు. “దుష్టసంహార నరసింహ దురితదూర!” అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహ స్వామికి అంకితం చేశాడు. ఈయన నరహరి, నృకేసరీ శతకాలు, ధర్మపురీరామాయణం మొదలగు
రచనలు చేశాడు.
ప్రశ్న 6.
పండిత రామ సింహ కవిని పరిచయం చేయండి.
జవాబు.
విశ్వకర్మ శతకం : ‘విశ్వపాలన ధర్మ! శ్రీ విశ్వకర్మ!’ అనే మకుటంతో పండిత రామసింహకవి ‘విశ్వకర్మ’ శతకాన్ని రాశాడు. ఈయన కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలంలోని పూర్వపు రాఘవపట్నం వాసి. ఈయన ఆశుకవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు.
ప్రశ్న 7.
శ్రీవేంకటేశ్వర శతక కర్తను గురించి రాయండి.
జవాబు.
శ్రీవేంకటేశ్వర శతకం : నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ‘వేంకటేశ్వరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతీ సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన ‘విద్వత్ కవి’గా ప్రసిద్ధి పొందాడు.
ప్రశ్న 8.
శ్రీ బాకవరాంజనేయ శతకం రచించిన కవిని గురించి తెల్పండి.
జవాబు.
శ్రీ బాకవరాంజనేయ శతకం : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నివాసియైన వేంకటరావు పంతులు, తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామిపై “బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా! అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు.
ప్రవేశిక
ప్రశ్న
శతక ప్రక్రియ గురించి వివరించండి.
జవాబు.
విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో శతకం ఒకటి. మేలిముత్యాల్లాంటి శతక పద్యాలనుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా చదువుకుందాం. నైతిక విలువలను పెంపొందించుకుందాం.
కఠిన పదాలకు అర్ధాలు
- సూనృతం = మంచిమాట
- శీలము = స్వభావం
- నతి = వినయం
- ధృతి = ధైర్యం
- తుచ్ఛం = నీచము
- మెయి = శరీరం
- తిరము = శాశ్వత
- గతి = దిక్కు ఆధారం
- లవణము = ఉపు
- వితం = ధనం
- కుడువన్ = తినుటకు, అనుభవించుటకు
- మరుగు = రహస్యము
- తెరువరి = బాటసారి
- రీతి = విధం
- మక్కువ = ఇష్టం, కోరిక
- దురిత = పాపం
- విర్రవీగు = అహంకారంతో ఉండు
- గుడము = బెల్లం
- మౌక్తికం = ముత్యం
- కృషి = వ్యవసాయం, ప్రయత్న
- వెలివేయు = సమాజానికి దూరంగా ఉండు
- లేశ్యము = కొంచెమ
- వనట = బాధ
- చేకురు = చేకూరును, కల్గును
- ప్రియము = ఇష్టాన్ని కల్గించేది
నేనివి చేయగలనా ?