Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 3rd Lesson బండారి బసవన్న Textbook Questions and Answers.
బండారి బసవన్న TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana
చదువండి ఆలోచించి చెప్పండి.
గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.
ప్రశ్నలు
ప్రశ్న 1.
కంచర్ల గోపన్న ఎవరు ?
జవాబు.
కంచర్ల గోపన్న గోలకొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా పాలనాకాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉండేవాడు. గోపన్న గొప్ప శ్రీరామభక్తుడు.
ప్రశ్న 2.
అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జవాబు.
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం మోపబడింది.
ప్రశ్న3.
గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు ?
జవాబు.
గోపన్న తన కీర్తనలతో శ్రీరాముని వేడుకున్నాడు. కరుణించిన శ్రీరాముడు గోపన్న ఇవ్వవలసిన సొమ్ము తానే చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.
ప్రశ్న 4.
గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?
జవాబు.
గోపన్న వంటి భక్తులకు మనదేశం పెట్టింది పేరు. అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని మీద భక్తితో సుమారు ముప్పై మూడువేల సంకీర్తనలు రాశాడు. దైవాన్ని తప్ప మానవులను స్తుతించను, వారిపై కీర్తనలు రాయను అన్నందుకు ఘోరశిక్షలను అనుభవించాడు. క్షేత్రయ్య మొవ్వ వేణుగోపాలస్వామి భక్తుడు. మధురభక్తితో పదాలు రచించి ఆ దేవుని కీర్తించాడు. తరిగొండ వెంగమాంబ, అక్క మహాదేవి రచయిత్రులు కూడ భగవంతునిపై కీర్తనలు, వచనాలు రాశారు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.24)
ప్రశ్న 1.
‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
సురతరువు పాలసముద్రం నుండి పుట్టి దేవలోకంలో ఉన్న గొప్ప వృక్షము. కనకాచలం దేవలోకంలో ఉన్న బంగారపుకొండ. పార్వతీదేవి నివాసం చాలా ఎత్తైనది. సురధేనువు పాలసముద్రం నుండి పుట్టి బ్రహ్మర్షి వసిష్ఠుని ఆశ్రమంలో పూజలందుకుంటున్న కామధేనువు. చింతామణి పాలసముద్రం నుంచి పుట్టింది. కోరిన కోరికలు తీర్చే రత్నం. ఇలా ఇవన్నీ చాలా గొప్పవి. వాటిని తుచ్ఛమైన వాటితో పోల్చరాదు. అలాగే శివభక్తులు చాలా గొప్పవారు. ఆ భక్తిలో మునిగినవారు అల్పమైన కోరికలకు లొంగరు అని చెప్పటం కవి ఉద్దేశం.
ప్రశ్న 2.
‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ?
జవాబు.
పగతుడు అంటే శత్రువు. శత్రువు మనపైన దాడిచేయటానికి కారణం రాజ్యం మీదనో, భూమి మీదనో, ధనం మీదనో ఆశ కలిగి ఉండటం. అటువంటి శత్రువు కూడా శివభక్తి కలిగి ఉన్నప్పుడు ఇతరుల ధనాన్ని కోరడు. అటువంటిది శివభక్తి వ్రతంగా బ్రతికే బసవన్న రాజు ధనాన్ని కోరడు అని కవి బసవని భక్తిని గురించి వర్ణించాడు అని నా అభిప్రాయం.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.25)
ప్రశ్న 1.
‘శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ?
జవాబు.
హంస శ్రేష్ఠమైన పక్షి. మానస సరోవరంలో విహరిస్తుంది. చిలుక పలుకు నేర్చి రామనామం జపించే ఉత్తమమైన పక్షి. అల్పమైన పండ్లను కోరదు. మామిడిపండ్లు మాత్రమే తింటుంది. చకోరం వెన్నెలపక్షి. చంద్ర కిరణాలతో అమృతాన్ని ఆస్వాదిస్తుందే తప్ప మంచుతుంపర్లు పీల్చదు. తుమ్మెద… పూలలో రాణియైన తామర పువ్వులోని సుగంధాన్ని పీలుస్తూ తిరుగుతుంది. ప్రబ్బలి పూల జోలికి పోదు. శివభక్తులు కూడ అల్పులను ఆశ్రయించరు. వారు గొప్పవారు అని చెప్పడానికే కవి అలా పోల్చాడు.
ప్రశ్న 2.
“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ?
జవాబు.
ఈ సమస్త ప్రపంచము ఈశ్వరుని ప్రసాదమే. మనం నాది నాది అని భ్రమ పడుతున్నాం. మనది అనేది ఏదైనా శివుడిచ్చినదే. జంగం దేవరలు సాక్షాత్తు శివుని అవతారం. కాబట్టి వారికి మనమిచ్చేది ఏదైనా మనసొంతంకాదు. వారి సొమ్మే వారికిస్తున్నాము అని కవి వివరించాడు.
ఇవి చేయండి
విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
I. “అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుచేసి తినే సింహం గడ్డిమేయదు. పాలసముద్రంలో హాయిగా విహరించే హంస నీటిమడుగులలో నీరు తాగదు. దోరమామిడిపళ్ళ రుచి మరిగిన చిలుక బూరుగు చెట్టుపైన కాసే దూదికాయలను తినదు. స్వచ్ఛమైన పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోర పక్షి చీకట్లను ఆరగించదు. విరిసిన పద్మాలలో సుగంధాన్ని పీల్చి ఆనందించే తుమ్మెద బబ్బిలి పూలవాసన కోరదు. దేవతల ఏనుగు యొక్క సంతానము పందిపాలను తాగటానికి ఇష్టపడదు. అలాగే అచంచల భక్తి పారవశ్యం కల్గినవాళ్ళు ధనాశకు లోనుకారు.
2. ద్విపదను రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.
అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జవాబు.
“మా యర్థ మొప్పించి పొమ్ము.”
ఈ పాదం రాజు బిజ్జలుడు దండనాయకుడైన బసవన్నతో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.
ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?
జవాబు.
“విరిదమ్మి వాసన విహరించు తేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరుల”
ఈ పాదములు దండనాయకుడైన బసవన్న రాజైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.
ఇ) సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా ?
ప్రశ్న : ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు అన్నారు ? ఎవరితో అన్నారు ?
(లేదా)
“మృగపతి యెద్దెస మేయునే పుల్లు” ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు ఎవరితో అన్నారు ?
జవాబు.
ఈ పాదం మంత్రి, దండనాయకుడు ఐన బసవన్న ప్రభువైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.
2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !
అ) ఖరము అంటే _________
జవాబు.
గాడిద
ఆ) కూడు అంటే _________
జవాబు.
తిండి
ఇ) గంగిగోవు పాలను _________ తో పోల్చాడు.
జవాబు.
భక్తి
ఈ) ఈ పద్యాన్ని _________ రాశాడు.
జవాబు.
వేమన
ఉ) ఈ పద్యం _________ శతకంలోనిది.
జవాబు.
వేమన
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) బండారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జవాబు.
బండారి బసవన్న గురించి పాల్కురికి సోమనాథుడు గొప్పగా రాశాడు. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. జంగమ దేవరలను సాక్షాత్తు పరమశివునిగా భావించి పూజిస్తాడు. ఈ జగమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు. అందుకే ఈశ్వరుడు మనకిచ్చినదానిని శివభక్తులకు సమర్పించటంలో తప్పులేదంటాడు. పరులధనానికి ఎప్పుడూ ఆశించడు. సత్యధర్మవ్రతుడు కనుక రాజుముందైనా సరే నిర్భయంగా మాట్లాడగలడు. ఎంతటి రాజోద్యోగులైనా అతడిని తప్పు పట్టాలంటే భయపడతారు. బసవన్న తన ఉద్యోగ విధులను, గృహధర్మాలను, శివారాధనను క్రమం తప్పకుండా సమర్థవంతంగా నిర్వహించేవాడు.
ఆ) బండారి బవసన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు?
జవాబు.
బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు. ఎందుకంటే అతడు తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించాడు. అన్నింటిని మించి గొప్ప శివభక్తుడు.
అలాగే మనం మనసులో కల్మషం లేకుండా ఉండాలి. సత్యం మాట్లాడాలి. ధర్మాన్ని ఆచరించాలి. ఏ తప్పు చేయకూడదు. ఎవరికీ కీడు చెయ్యాలని ప్రయత్నించకూడదు. అలా మంచి ప్రవర్తన కలవారిలో ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం నిర్భయంగా మాట్లాడగలం.
ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో భక్తుడిని వేటితో పోల్చారు ? పరధనాన్ని వేటితో పోల్చారు ?
జవాబు.
భక్తుడు ఎప్పుడూ పరధనాన్ని ఆశించడు. ఎందుకంటే పరుల సొమ్ము పామువంటిది. నీచమైనది. కష్టపడి సంపాదించుకున్నదే మన సొంతం అని భక్తుడు నమ్ముతాడు. శివభక్తుడు మానవులలో ఉత్తమమైనవాడు. ఆ భక్తి అతనికి కల్పతరువు, కామధేనువు, మేరుపర్వతం, చింతామణి వంటిది. ఇవి ఉన్నవాడికి ఏది కోరితే అది లభిస్తుంది. అలాగే శివభక్తి కలవాడు పరధనాన్ని కోరడమంటే సింహం గడ్డి మేసినట్లు. అందుచేత శివభక్తుడు పరధనాన్ని ఆశించడు.
ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో శివభక్తుణ్ణి వేటితో పోల్చారు ?
జవాబు.
సింహం గడ్డిమేయడానికి ఇష్టపడదు. మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తినదు. పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోరపక్షి చీకటిని ఆస్వాదించదు. తామరపూల వాసన పీల్చే తుమ్మెద ఉమ్మెత్త పూల దగ్గరకి పోదు. ఏనుగుపిల్ల పంది దగ్గర పాలు తాగదు. అలాగే పాలసముద్రంలో విహరించే హంస కుంటలలో నీరు తాగదు అని కవి వర్ణించాడు. ఉత్తమమైనవారు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. అల్పమైన వాటికి ఆశపడరు అని కవి ఉద్దేశం.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి.
(లేదా)
బండారి బసవన్న పాఠం ఆధారంగా శివభక్తుల గుణగణాలు రాయండి.
(లేదా)
బసవన్న భక్తితత్పరత గురించి రాయండి.
జవాబు.
పాల్కురికి సోమనాథుడు బండారి బసవన్న ద్వారా భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు.
బసవన్న భక్తి : బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలతో పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. అందుకే అతనిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నది. ఎవ్వరితోనైనా నిర్భయంగా మాట్లాడగలిగేవాడు. అందరూ అతడిని గౌరవించేవారు.
భక్తుని లక్షణాలు : బసవని వ్యక్తిత్వం తెలుసుకున్న తరువాత భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో మనకు అర్థమౌతుంది. భక్తునికుండవలసిన ప్రధాన లక్షణం స్వచ్ఛమైన మనసు. నిర్మలమైన మనసుతో భగవంతుని ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. భక్తుడైనవాడు దేవుని మాత్రమే గాక ఆయన భక్తులను కూడ దేవునితో సమంగా భావించాలి. వారిని ఆదరించి వారి కోరికలు నెరవేర్చాలి. భక్తులు కోరినదిచ్చేటప్పుడు మనదేదో వారికి దానం చేస్తున్నామన్న అహంకారం ఉండకూడదు. వారి సొమ్ము వారికిస్తున్నామన్న భావనతో దానం చేయాలి. భక్తుడు ఇతరుల సొమ్మును ఆశించకూడదు. సత్యవ్రతం కలిగి ఉండాలి. ఆడినమాట తప్పకూడదు. ఇలా నడుచుకొనేవాడు నిజమైన భక్తుడు.
IV. సృజనాత్మకత/ ప్రశంస
1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.
బండారి బసవన్న … కోశాగారంలోని సొమ్మును జంగందేవరకు దానం చేశాడని అధికారులు బిజ్జల మహారాజుకు నివేదించారు. రాజు అతనిని దండించాలని సైనికులను పిలుచుకురమ్మని పంపించాడు.
V. పదజాల వినియోగం:
1. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.
అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.
జవాబు.
పాలసముద్రం
ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
జవాబు.
సింహం
ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.
జవాబు.
రాజులు
2. కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.
ప్రకృతి | వికృతి |
అ) ఆశ్చర్యం | ఎ) బత్తి |
ఆ) భక్తి | బి) దెస |
ఇ) దిశ | సి) పుడమి |
ఈ) పృథ్వి | డి) అచ్చెరువు |
జవాబు.
ప్రకృతి | వికృతి |
అ) ఆశ్చర్యం | డి) అచ్చెరువు |
ఆ) భక్తి | ఎ) బత్తి |
ఇ) దిశ | బి) దెస |
ఈ) పృథ్వి | సి) పుడమి |
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పట్టికను పూరించండి.
జవాబు.
సంధి పదం | విడదీసి రాయండి. | సంధి పేరు |
ఉదా : క్షీరాబ్ధి | క్షీర + అబ్ది | సవర్ణదీర్ఘ సంధి |
1. కనకాచలం | కనక + అచలం | సవర్ణదీర్ఘ సంధి |
2. నాకొక | నాకు + ఒక | ఉత్వసంధి |
3. కాదేని | కాదు + ఏని | ఉత్వసంధి |
4. అతనికిచ్చెను | అతనికి + ఇచ్చెను | ఇకారసంధి |
5. పుట్టినిల్లు | పుట్టిన + ಇಲ್ಲು | అత్వసంధి |
6. ఏమిటిది | ఏమిటి + ఇది | ఇత్వ సంధి |
7. నాయనమ్మ | నాయన + అమ్మ | అత్వసంధి |
8. పుడమీశ | పుడమి + ఈశ | ఇత్వ సంధి |
గుణసంధి:
2. కింది పదాలను విడదీయండి.
ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగ + ఉదకం (అ + ఉ = ఓ)
ఉదా : దేవర్షి = దేవ + ఋషి
(అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి
(అ + ఋ = అర్)
పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.”
‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ (ే)
అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’.
”అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ (ో)
‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.
3. కింది పదాలను కలిపి, సంధి ఏర్పడిన విధానాన్ని తెలుపండి.
జవాబు.
ఉదా : మహా + ఇంద్రుడు = మహేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
అ) దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
ఆ) గణ + ఈశుడు = గణేశుడు (అ + ఈ = ఏ) (ే)
ఇ) నర + ఉత్తముడు = నరోత్తముడు (అ + ఉ = ఓ) (ో)
ఈ) నవ + ఉదయం = నవోదయం (అ + ఉ = ఓ) (ో)
ఉ) బ్రహ్మ + ఋషి = బ్రహ్మర్షి (అ + ఋ = అర్) (ర్షి)
భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని
ప్రశ్న 1.
ఈ బసవని వంటి పరమ భక్తులలో ఒకరి కథను సేకరించి, మీ సొంతమాటల్లో రాసి దాన్ని తరగతిలో చెప్పండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : “మహా శివభక్తుడు – చిఱుతొండ నంబి”
2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకం ద్వారా
ఆ) నివేదిక :
విషయ వివరణ:
చిఱుతొండ నంబి మహా శివభక్తుడు. అతని భార్య తిరువెంగనాచి కూడా మహా శివభక్తురాలు. వారికి లేక లేక కలిగిన ముద్దుల సంతానమే సిరియాళుడు. ఈ దంపతులిరువురు ప్రతిరోజు స్నానం – పూజ ముగించుకొన్న పిమ్మట, మడితో వంట వండి, ఒకరిద్దరు అతిథులకు భోజనం పెట్టిన పిమ్మట తాము భుజించే సాంప్రదాయం గలవారు. వీరి కుమారుడు సిరియాళుడు కూడా తల్లిదండ్రుల మాట జవదాటని వాడై, మహా శివభక్తి గలవాడై, దిన దిన ప్రవర్ధమానంగా అనేక విద్యలనభ్యసిస్తూ పెరుగుతున్నాడు.
ఈ దంపతులిద్దర్నీ పరీక్షించాలనే ఉద్దేశంతో శివుడు, పార్వతి ఇద్దరూ వృద్ధ దంపతుల రూపంలో చిఱుతొండ నంబి ఇంటికి వచ్చారు. వారి రాకకు ఎంతో ఆనందించిన చిఱుతొండ నంబి దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణులను సాదరంగా ఆహ్వానించి, వారికి శాకాహార భోజనం వండి, తినడానికి పిలిచారు. అప్పుడు ఆ కపట బ్రాహ్మణుడు మాకు నరమాంసం లేనిదే గొంతులోకి ముద్ద దిగదని చెప్పగా విని చిఱుతొండ నంబి దంపతుల గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. మనిషి మాంసం ఎలా తేగలమని బెంగతో వారు చింతాక్రాంతులై ఉండగా తనను చంపి వండమని వారి పుత్రుడు సిరియాళుడు కోరాడు.
ఎంతో దుఃఖభరితమైన మనసుతో వారు తమ పుత్రుణ్ణి చంపి వండడానికి సిద్ధపడ్డారు. అప్పుడు శివుడు, సిరియాళుని వద్దకు వెళ్ళి నీ తల్లిదండ్రులు నిన్ను చంపి వండుతారు, ఇల్లు వదలి పారిపొమ్మనగా సిరియాళుడు తిరస్కరించి, శివపూజకు నా దేహం అర్పించుటకంటే భాగ్యమేమున్నదని పలికాడు. చివరకు అతణ్ణి చంపి వృద్ధ బ్రాహ్మణులకు వండి పెట్టారు. నీ కుమారుడు సిరియాళుడు లేనిదే నేను భుజింపనని శివుడనగా, చిఱుతొండ నంబి దుఃఖించుచుండగా ‘చిఱుతొండా ! ఒక్కసారి సిరియాళా అని పిలువు’ అని శివుడు అనగానే చిఱుతొండడు ‘సిరియాళా’ అని పిలువగానే శివ వర ప్రభావంతో సిరియాళుడు బ్రతికి వచ్చాడు.
ఇ) ముగింపు :
శివుని పూజకోసం, అతిథి దేవుళ్లను సంతృప్తి పరచడం కోసం కన్న కొడుకునే చంపిన తల్లిదండ్రులను చూచి వారి మూఢ భక్తికి ఆశ్చర్యం వేసింది. చివరికి సిరియాళుడు బ్రతికి రావడం మాత్రం నాకు చాలా ఆనందం
కలిగించింది.
TS 8th Class Telugu 3rd Lesson Important Questions బండారి బసవన్న
ప్రశ్న 1.
బండారి బసవన్న పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
బండారి బసవన్న గొప్ప శివభక్తుడని నిరూపించండి.
జవాబు.
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిచి ధనాగారం నుండి తీసిన ధనం మాకు అప్పగించి మీరిక వెళ్ళవచ్చు. ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనం ఆశించనని ప్రతిజ్ఞ చేశారుకదా! అని అన్నాడు. బసవన్న “శివభక్తి అనే కల్పవృక్షం, శంకరునిపై భక్తి అనే బంగారు (మేరు పర్వతం నా అధీనంలో ఉండగా ఇతరుల ధనాన్ని ఆశిస్తానా” అని అన్నాడు.
హంస మడుగు నీటిని త్రాగనట్లే, మామిడి పండ్లు తినే చిలుక బూరుగ చెట్టు పండ్ల వైపు కన్నెత్తి చూడనట్లే, చకోరపక్షి చీకటిని ఆస్వాదించనట్లే, ఏనుగుపిల్ల పందిపాలు త్రాగదని తెలియదా! శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేంపని? మీ ధనంకోసం నేను చేయిచాపను. నేను న్యాయం తప్పను. మీకు నామీద నమ్మకం లేకపోతే మీ సొమ్ము లెక్కచూసుకోండి అని బసవన్న పలికాడు.
ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి, తాళాలు తీయించి, మూతలు తెరిపించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెలనిండా బంగారు నాణేలు (మాడలు) ఉన్నాయి. తళతళలాడుతున్న ఆ నాణేలను లెక్కించిచూడగా, లెక్కకన్నా ఎక్కువగానే ఉన్నాయి. నిజాయితీపరుడైన బసవన్న ఏ రాజద్రోహం చేయలేదని బిజ్జలుడు గ్రహించాడు. శివుని భక్తివల్ల తీసిన ధనమంతా మరల ధనాగారంలోకే రావటంతో బసవన్న పరమ శివభక్తుడు అని చెప్పవచ్చును.
ప్రశ్న2.
బండారి బసవన్న రాజద్రోహం చేయలేదని ఎలా చెప్పగలవు ?
(లేదా)
బసవన్న నిజాయితీ ఎటువంటిది ?
జవాబు.
బసవన్న తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించిన గొప్ప భక్తుడు. మనసులో కల్మషం లేకుండా సత్యం పల్కుతూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ఆత్మవిశ్వాసంతో ఎవరికీ కీడు చేయకుండా, ఉ న్న విషయం నిర్భయంగా మాట్లాడేవాడు. ప్రపంచమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు.
అందుకే ఈశ్వరుడు మనకిచ్చిన దానిని శివభక్తులకు సమర్పించడంలో తప్పులేదంటాడు బసవన్న. తన ఉద్యోగ విధులను, గృహధర్మాన్ని, శివారాధనను క్రమం తప్పకుండా నిజాయితీగా ఆచరించే బసవన్న రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే బిజ్జలుడు ఆ సొమ్ము ఉన్న పెట్టెలను తెచ్చి తెరిపించగా అందులో మాడలు అందులోనే తళతళలాడుతూ ఉన్నాయి. సొమ్ము అంతా లెక్కకు సరిపోయింది కనుక రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు.
ప్రశ్న3.
మీ పాఠం ఆధారంగా “భక్తి” అంటే మీరేమనుకుంటున్నారో రాయండి.
(లేదా)
బండారు బసవన్న పాఠం ఆధారంగా “భక్తి” భావన గురించి రాయండి.
జవాబు.
బండారి బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలు చేయటమే కాకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. ఆత్మవిశ్వాసం, నిర్భయత్వంగల ఇతడిని అందరూ గౌరవించేవారు. భక్తులకుండాల్సిన లక్షణాలన్నీ బసవన్నలో ఉన్నాయి. స్వచ్ఛమైన మనసు, దైవభక్తులను దైవస్వరూపులుగా భావించుట, వారిని ఆదరించి వారి కోర్కెలు తీర్చుట, అహంకారం లేకుండా మనవద్ద ఉన్న వారి సొమ్ము వారికిస్తున్నామనే భావనతో సంతోషంగా దానం చేయటం, పరుల సొమ్ము ఆశించకుండా సత్యవ్రతం కల్గి, ఆడినమాట తప్పకుండా నడుచుకొనేవాడే నిజమైన భక్తుడు అని బసవన్నను చూస్తే తెలుస్తుంది.
సంభాషణ
రాజు : భటులారా ! బసవన్న దండనాయకుని వెంటనే పిలుచుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (భటులు బసవన్నతో కలిసి ప్రవేశం)
రాజు : దండనాయకా ! నీవు ధనాగారంలోని సొమ్ము దానం చేశావని అభియోగం. దీనికి నీ సమాధానమేమి?
బస : ప్రభూ ! మీ సొమ్ము నేను తాకలేదు. ఇది అబద్ధం.
రాజు : మా అధికారులు కళ్ళతో చూసిన నిజం నాకు చెప్పారు. వెంటనే మా సొమ్ము మాకప్పగించు. నువ్వు పదవి నుండి తప్పుకో.
బస : నేను అపరాధం చెయ్యలేదు.
రాజు : నీ మాటలు భయం కలిగిస్తున్నాయి. మా ధనం మా కప్పగించి వెంటనే వెళ్ళిపో. పరధనానికి ఆశించను అని ప్రతిజ్ఞ చేసి ఇలా మా ధనం కాజేయవచ్చునా ?
బస : (చిరునవ్వుతో) కామధేనువు, కల్పవృక్షము, మేరుపర్వతము, చింతామణి వంటి శక్తివంతమైన ఈశ్వరభక్తి నా దగ్గర ఉండగా నా కంటె ధనవంతుడెవరు ? నీ సొమ్ము నేనాశిస్తానా ? సింహం గడ్డిమేస్తుందా ? పాలసముద్రంలో తిరిగే హంస నీటిగుంటలలో తిరుగుతుందా? మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తింటుందా ? వెన్నెల తాగే చకోర పక్షి చీకటిని కోరుతుందా ? తామరపూల సుగంధాన్ని పీల్చే తుమ్మెద ప్రబ్బలి పూలజోలికి వెళుతుందా ? ఏనుగుపిల్ల పంది పాలు తాగుతుందా ? జంగం దేవరలకు దాసుడను. డబ్బు నాకొకలెక్కా? మీ డబ్బు కోసం నేనెప్పుడూ చెయ్యి జాపను. ఆడిన మాట తప్పేవాడిని కాను. ఈశ్వర ప్రసాదితమైన సొమ్ము ఈశ్వరభక్తునికే ఇచ్చాను. నమ్మకపోతే లెక్కలు చూసుకో.
రాజు : ఖజానాలో ధనం పెట్టెలు తీసుకురండి. (భటులు తెస్తారు) తెరవండి. (తెరిచారు) ఏమి ఆశ్చర్యం ! ఉండవలసిన సొమ్ము కంటె ఎంతో ఎక్కువ సొమ్మున్నది ! మమ్మల్ని మన్నించు బసవన్నా ! నీ భక్తి తెలుసుకున్నాము.
పర్యాయపదాలు:
- బాస =ఒట్టు, ప్రతిజ్ఞ, వాగ్దానం
- ధనం = అర్థం, డబ్బు
- జననాథుడు = ప్రజాపతి, రాజు, పుడమీశుడు
- హరుడు = శివుడు, పరమేశుడు, సోమార్థ ధరుడు
- చూతము = రసాలము, ఆమ్రము, మామిడి
- తమి = తామర, కమలం, పద్మం
- సురధేనువు = కామధేనువు, సురభి
- పగతుడు = శత్రువు, విరోధి, అరి
- కనకము = బంగారము, కాంచనము
- తేటి = తుమ్మెద, బంభరం
నానార్థాలు:
- అర్థము = డబ్బు, ప్రయోజనము, పదానిక చెప్పే భావం
- దెస = దిక్కు, విధము
- మృగము = జింక, జంతువు
ప్రకృతి – వికృతులు:
- ప్రకృతి – వికృతి
- భాష – బాస
- భక్తి – బత్తి
- మృగం – మెకము
- హంస – అంచ
సంధులు:
- మాయర్థము = మా + అర్థము = యడాగమసంధి
- బాసయండ్రు = బాస + అండ్రు = యడాగమసంధి
- మంత్రియని = మంత్రి + అని = యడాగమసంధి
- చింతామణియుండ = = చింతామణి + ఉండ = యడాగమసంధి
- సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం ఔతుంది.
- రాకామల = రాకా + అమల = సవర్ణదీర్ఘ సంధి
- కామారి = కామ + అరి = సవర్ణదీర్ఘ సంధి
- సోమార్థధరుడు = సోమ + అర్థధరుడు = సవర్ణదీర్ఘసంధి
- ప్రహసితాస్యుడు = ప్రహసి + ఆస్యుడు = సవర్ణదీర్ఘ సంధి
- సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
- అరమొప్పించి = అర్థము + ఒప్పించి = ఉత్వ సంధి
- తప్పేమి = తప్పు + ఏమి = ఉత్వసంధి
- ఎట్లొకో = ఎట్లు + ఒకో = ఉత్వసంధి
- అరుదగు = అరుదు + అగు ఉత్వసంధి
- మాడలుప్పొంగుచు = మాడలు + = ఉత్వసంధి
- సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి ఔతుంది.
- పాడుచేసితివి = పాడు + చేసితివి = గసడదవాదేశ సంధి
- ఫలంబులు సుంబించు = ఫలంబులు + చుంబించ = గసడదవాదేశసంధి
- పండ్లు గగ్గోనునె = పండ్లు + కన్గొనునే = గసడదవాదేశ సంధి
- ఆకాంక్ష సేయునే = ఆకాంక్ష + చేయునే = గసడదవాదేశసంధి
- చను సీక = చను + చీక = గసడదవాదేశసంధి
- లెక్కలు సూడు = లెక్కలు + చూడు గసడదవాదేశ సంధి
- సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
సమాసాలు:
- సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
- సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
- పరధనము – పరుల యొక్క ధనం – షష్ఠీ తత్పురుష సమాసం
- జననాథుడు – జనములకు నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసం
- మృగపతి – మృగములకు పతి – షష్ఠీ తత్పురుష సమాసం
- కామారి – కాముని యొక్క అరి (శత్రువు) – షష్ఠీ తత్పురుష సమాసం
- సోమార్థధరుడు – సోమార్థుని ధరించినవాడు – ద్వితీయాతత్పురుష సమాసం
- ప్రహసితాస్యుడు – ప్రహసితమైన ఆస్యము కలవాడు. – బహువ్రీహి సమాసం
- బసవన దండనాయకుడు – బసవన అనే పేరుగల దండనాయకుడు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
- చూత ఫలంబులు – చూతము అనే పేరు గల ఫలములు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
- హరుభక్తి – హరుని యందు భక్తి – సప్తమీ తత్పురుష సమాసం
పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు
I. ప్రతిపదార్థాలు – భావాలు:
బండారి బసవన దండనాయకుని
రప్పించి “మాయర్ద మొప్పించి పొమ్ము
దప్పేమి ? సాలుఁ బ్రధాని తనంబు
‘దండింప రా’ దను తలఁపున నిట్లు
బండార మంతయుఁ బాడు సేసితివి
పరధనం బపహరింపని బాస యండ్రు
పరధనం బెట్లొకో బసవ ! కైకొంటి
వేయు మాటలు నేల వెఱతుము నీకు
మాయర్థ మొప్పించి నీయంత నుండు”
మనవుడుఁ గించి త్ప్రహసితాస్యుఁడగుచు
జననాథునకు బసవన మంత్రి యనియె
“బరమేశు భక్తియన్ సురతరువుండ
హరుభక్తియన్ కనకాచలంబుండ
గామారి భక్తి చింతామణి యుండ
సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ
బగుతుఁడాసించునే పరధనంబునకు
మృగపతి యెద్దె మేయునే పుల్లు ?
ప్రతిపదార్థం :
బండారి బసవన్న= బండారి బసవన్న అనే పేరుగల సేనాపతిని
దండనాయకుని = సేనాపతిని
రప్పించి = పిలిపించి
మా + యర్థము = మా సొమ్మును
ఒప్పించి = అప్పగించి
పొమ్ము = వెళ్ళు
తప్పు + ఏమి = అలా చేయడంలో తప్పులేదు.
ప్రధానితనంబు = మీ మంత్రిత్వము
చాలున్ = ఇకపై మాకు అక్కరలేదు.
దండింపరాదు = నన్నెవరూ శిక్షించరులే
అనుతలపునన్ = అనే ఆలోచనతో
బండారము + అంతయు = ధనాగారమంతా
పాడు చేసితివి = నాశనం చేశావు
పరధనంబు = ఇతరుల సొమ్మును
అపహరింపని = దొంగిలించనని
బాసయండ్రు = ప్రతిజ్ఞ చేశావు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
బెట్లోకొ = ఎట్లు
బసవా = ఓ బసవా !
కైకొంటి = తీసుకున్నావు.
వేయి మాటలు = వేలకొలది మాటలు
ఏల = ఎందుకు ?
మా అర్ధము = మా సంపద
ఒప్పించి = అప్పగించి
నీయంత నుండు = నీవు వెళ్ళు
అనవుడు = అని పలుకగా
కించిత్ = కొద్దిపాటి
ప్రవసిత = నవ్వబడిన
ఆస్యుడు = ముఖము కలవాడు
అగుచు = అయి
జననాథునకు = రాజుకు
బసవనమంత్రి = బసవ మంత్రి
అనియె = ఇట్లు పలికాడు
పరమేశు = శంకరునిపై
భక్తియన్ = భక్తి అనే
సురతరువు + ఉండ = కల్పవృక్షము ఉండగా
హరుభక్తియన్ = పరమేశ్వరుని యందు భక్తి అనే
కనక = బంగారుమయమైన
అచలము + ఉండ = కొండ ఉండగా
కామ + అరి = మన్మథుని వైరి అయిన శివుని యందు
భక్తి = భక్తి అనే
చింతామణి ఉండ = చింతామణి ఉండగా
సోమార్ధధరు = చంద్రుని శిరసున ధరించిన శివుని యందు
భక్తి = భక్తి
సురధేనువు ఉండ = కామధేనువు ఉండగా
పగతుడు = భక్తుడు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
ఆశించునే = ఆశిస్తాడా ?
మృగపతి = సింహం
ఎద్దె = ఎప్పుడైనా
పుల్లు = గడ్డిని
మేయునే = మేస్తుందా ?
భావం :
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. “మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా! మరి ఎట్లా దొంగిలించావు ? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగు తున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు” అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో ‘పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు -పర్వతం) నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా ?
II.
క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగం ?
జూత ఫలంబులు సుంబించు చిలుక
బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గల్గినునె ?
రాకామల జ్యోత్స్నఁ ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ
విరిదమ్మి వాసన విహరించుతేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరులు ?
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ
యెఱపంది చను సీక ? నెఱుఁగవు గాక
యరుదగు లింగ సదర్థుల యిండ్ల
వరవుడ నా కొక సరకెయర్థంబు
పుడమీశ ! మీధనంబునకుఁ జేస్వాప
నొడయల కిచ్చితి నొడయలధనము
పాదిగదఱిఁగిన భక్తుండఁగాను
గాదేని ముడుపు లెక్కలు సూడు” మనుచు
దట్టుఁడు బసవన దండనాయఁకుఁడు
పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ
నచ్చెరువై లెక్క కగ్గలంబున్న
ప్రతిపదార్థం :
క్షీర + అబ్ధిలోపల = పాలసముద్రంలో
క్రీడించు హంస = విహరించే హంస
పడియల = నీటి మడుగులలోని
నీరు + త్రావంగన్ = నీళ్ళు తాగడానికి
కోర్టును + ఏ = ఇష్టపడుతుందా ?
చూతఫలంబులు = మామిడిపళ్ళను
చుంబించు = ముద్దాడే (తినేటువంటి)
చిలుక = రామ చిలుక
బ్రాతి = ఏ విధంగానైనా
బూరుగ మ్రాని = బూరుగ చెట్టు యొక్క
పండ్లు = పళ్ళు
కన్గొనునె = చూస్తుందా ?
రాకా+అమంజ్యోత్స్నన్ = పున్నమినాటి స్వచ్ఛమైన వెన్నెలను
త్రావు = తాగుతుండే
చకోరము = వెన్నెల పక్షి
చీకటి = చీకటిని
త్రావన్ = తాగడానికి
ఆకాంక్ష+చేయును+ఏ = కోరుతుందా ?
విరి+తమ్మి వాసన = విరిసిన కమలం యొక్క సువాసనలో
విహరించు తేటి = తిరుగాడే తుమ్మెద
పరిగొని = పక్కకు తిరిగి
బబ్బిలి విరులన్ = ప్రబ్బలి పూలను
సుడియును + ఏ = చుట్టుకుంటూ తిరుగుతుందా?
అల దిక్+గజ +ఇంద్రంబు = ఆ దిగ్గజము యొక్క
కొదమ = పిల్ల
ఎఱపందిచను+చీక = పంది దగ్గర పాలు తాగడానికి
ఎఱుగును + ఏ = ఇష్టపడుతుందా ?
పుడమి + ఈశ = ఓ రాజా!
ఎఱుగవు + కాక = నీకు తెలియదేమో !
అరుదు + అగు = విశిష్టులైన
లింగ = లింగధారులైన
సదర్థుల + ఇండ్ల = గొప్ప జంగమదేవరల ఇళ్ళలో
వరవుడ = దాసుడను
అర్థము = ధనము
నాకున్+ఒక సరకు+ఎ = లెక్కలోనిదా ?
మీ ధనంబునకు = మీ డబ్బు కోసం
చేయి + చాపన్ = అడగన
ఒడయలకున్+ఇచ్చితిన్ = దేవరలకే ఇచ్చాను
పాదిగ + తఱిగిన = స్థిరత్వం తప్పిన
భక్తుండన్ + కాను = భక్తుణ్ణి కాను
కాదు + ఏని = కాదనుకుంటే (నీవు నమ్మకుంటే)
ముడుపు లెక్కలు = ధనము యొక్క లెక్కలు
చూడు = చూడుము
అనుచు = అంటూ
దండ నాయకుడు = దండ నాయకుడు
పెట్టెలు = పెట్టెల్ని
ముందటన్ = ఎదుట
పెట్టి = ఉంచి
తాళములు = తాళాలను
పుచ్చుచుచూడ = తెరచి చూడగానే
అచ్చెరువు = ఆశ్చర్యం
జూడ = కలుగునట్లుగా
మాడలు = బంగారు నాణేలు
లెక్క తగ్గలంబున్న = లెక్కకు తగినట్లుగా
ఉప్పొంగుచున్ = ఉప్పొంగినాయి
భావం :
పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా ? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా ? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూలకోసం పరుగులు తీస్తుందా ? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా ? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి ? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు ?
స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని ? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో” అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముంగటే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడు తున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.
పాఠం ఉద్దేశం
ప్రశ్న.
బండారి బసవన్న పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి “నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను” అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉ న్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.
బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ప్రశ్న.
ద్విపద ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం ద్విపద. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని “ద్విపద కావ్యం” అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన ‘బసవపురాణం’ తృతీయాశ్వాసంలోనిది.
కవి పరిచయం
ప్రశ్న.
పాల్కురికి సోమనాథకవి పరిచయం రాయండి.
జవాబు.
దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తి (పాలకురికి) పాల్కురికి సోమన జన్మస్థలం. బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలయినవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలయిన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యధేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో ‘మణి ప్రవాళ శైలి’ని వాడిన తొలికవి.
ప్రవేశిక
ప్రశ్న.
బండారి బసవన్న పాఠ్యభాగం సందర్భం తెల్పండి.
జవాబు.
సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలుడుగనే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కఠిన పదాలకు అర్ధాలు
దండ నాయకుడు = సేనాధిపతి మంత్రిత్వము
ప్రధానితనము = దొంగిలించు, కాజేయు
దండించు = ధనం
అపహరించు =
= కయి = చేయి
గైకొను = తీసుకొను
కించిత్ = కొంచెం
ఆస్యము = ముఖము
ప్రహసితం = నవ్వు
జననాథుడు = రాజు
సురతరువు = దేవతావృక్షం, కల్పవృక్షం
కామారి = కామ + అరి = మన్మథుని శత్రువైన శివుడు
సోముడు = చంద్రుడు
పుల్లు = గడ్డి
మృగపతి = మృగరాజు = సింహం
పడియ = నీటి మడుగు
చూతం = మామిడి
తమ్మి = తామర
తేటి = తుమ్మెద
మ్రాను = చెట్టు
వరవుడు = దాస్యము
ఒడయల ధనము = దేవరల సొమ్ము
పాదిగా తఱిగిన = కుదురు తప్పిన, స్థిరత్వం లేని
దట్టుడు = సమర్థుడు
మాడలు = బంగారు నాణేలు
అగ్గలము = అధికము
కొదమ = పిల్ల
చకోరము = వెన్నెల పక్షి
నేనివి చేయగలనా ?