Telangana SCERT 6th Class Telugu Guide Telangana 8th Lesson చెరువు Textbook Questions and Answers.
చెరువు TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్న 1.
పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి?
జవాబు.
పై బొమ్మలో నది లేదా చెరువులో ప్రయాణిస్తున్న పడవ ఒడ్డున ఉన్న ఇళ్ళు, చెట్లు కన్పిస్తున్నాయి.
ప్రశ్న 2.
ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి ?
జవాబు.
ప్రజలకు చెరువుల అవసరం ఎంతో ఉంది. తాగునీటికి, ఇతర జీవిత అవసరాలైన స్నానం చేయడం, బట్టలుతకటం వంటి వాటికి, వ్యవసాయానికి చెరువుల నీరు అవసరం ఉంది. పల్లెటూరి కల్పవల్లులు చెరువులే.
ప్రశ్న 3.
ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎట్లా ఉన్నది ?
జవాబు.
ప్రస్తుతం చెరువుల పరిస్థితి దయనీయంగా ఉంది. చెరువుల బాగోగులను ఎవరూ పట్టించుకోవటం లేదు. అవి జల కాలుష్యంతో మురికి కాల్వలుగా తయారయ్యాయి.
ప్రశ్న 4.
చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి.
జవాబు.
చెరువులు పల్లెలకు ప్రాణాలు. చెరువులు సంస్కృతికి, సంప్రదాయాలకు నిలయాలు. అనేక వృత్తులకు ఆధారం. చెరువులో పెరిగే చేపలు, తాబేళ్ళు వంటి వాటికి, వాటి ఒడ్డున ఉండే చెట్లమీద పెరిగే పక్షులకు, కీటకాలకు చెరువులే ఆధారం.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
‘మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతాయి’ అనడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు.
చెరువు తనను గురించి వివరించాలనుకుంది. తన ప్రత్యేకతలను చాటాలనుకుంది. ఉదయాన్నే లేవగానే మన మనసులు ప్రశాంతంగా ఉంటాయి కదా! అప్పుడు చెపితే ఆ మాటలు మనకు చక్కగా అర్థమౌతాయి. చెరువులను చక్కగా సంరక్షించుకోండి. పల్లెలకు నీటి వనరు చెరువు అని చెప్పటం “మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతాయి” అనటంలోని ఆంతర్యం.
ప్రశ్న 2.
భూగర్భజలానికి నేను ‘శ్రీరామరక్ష’ అని చెరువు అనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు?
జవాబు.
శ్రీరామరక్ష అంటే రక్షణ, దన్ను అని అర్థం. చెరువులలోని నీరు భూమిలోనికి ఇంకి భూగర్భజలాలు నిలువ ఉండేటట్లు చేస్తాయి. కాబట్టి చెరువులు భూగర్భజలాలకు శ్రీరామరక్ష అని అంగీకరించాలి.
ప్రశ్న 3.
‘రామసక్కని’ దృశ్యం చెరువు దగ్గర ఏయే సందర్భాలలో కనిపిస్తుంది ?
జవాబు.
చెరువు దగ్గర రామసక్కని దృశ్యం చెరువులోకి అలుగు పారేటప్పుడు కన్పిస్తుంది. అలాగే వర్షం పడినప్పుడు కూడా ఈ దృశ్యం కనిపిస్తుంది.
ప్రశ్న 4.
చెరువు నీటిని శ్రమజీవుల చెమటతో పోల్చడం జరిగింది. ఎందుకు ?
జవాబు.
శ్రమ జీవులు తమ కష్టంతోనే చెరువును తవ్వి నీరు నిల్వఉండేట్లు చేశారు. అందుకే వారి కష్టం నుండి కారిన చెమటలే నా నీళ్ళు అని చెరువు చెప్పుకున్నది.
ప్రశ్న 5.
చెరువులు కాలుష్యం కాకుండా ఉండాలంటే మనమేం చేయాలి?
జవాబు.
చెరువులు కాలుష్యం కాకుండా ఉండాలంటే వాటిని దురాక్రమణ చేయకుండా కాపాడాలి. పూడికను ఎప్పటికప్పుడు తీస్తుండాలి. పొలాలలో వేస్తున్న రసాయనాలు చెరువుల్లో కలవకుండా చూడాలి. ఫ్యాక్టరీల వ్యర్థ పదార్థాలు, రసాయనాలు చెరువులో కలవకుండా జాగ్రత్త పడాలి. చెరువు ప్రక్కన మలమూత్ర విసర్జన చేయడం, గుడ్డలు ఉతకడం, పశువులను, వాహనాలను కడగడం చేయకుండా చూడాలి.
ప్రశ్న 6.
“చెరువులు తరతరాల చరిత్రకు మౌనసాక్షి” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
చెరువులు తరతరాల చరిత్రకు, సంఘటనలకు మౌనసాక్షులు. ఏనాడో కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం చెరువులు నేటికీ మౌనసాక్షులుగా నిలిచి ఉన్నాయి. మంథనిలో ‘శిలసముద్రం’ చెరువుంది. వనపర్తి రాజులు చెరువులను సముద్రాలని వ్యవహరించేవారు. ఆయా కాలాల్లోని మనుషులు చనిపోయిన, ఆ కాలం నాటి చెరువులు ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఆ కాలం నాటి సంఘటనలను నిశ్శబ్దంగా చూసాయని అర్థం.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. బడిలో ఉపన్యాసపోటీ నిర్వహిస్తున్నారు. మీరు కింది అంశాల్లో దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో దాని గురించి చెప్పండి.
(అ) చెరువులే జీవనాధారం.
జవాబు.
మా బడి ఉపన్యాసాల పోటీలలో నేను చెరువులే జీవనాధారం అన్న అంశంపై మాట్లాడాలనుకుంటున్నాను. గ్రామాలలో ప్రతి ఊరికి ఒక చెరువు తప్పక ఉంటుంది. చెరువులు సమాజానికి కల్పతరువులు. ప్రజల తాగునీటికి, సాగు నీటికి, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. పశుపక్ష్యాదులకు, దాహాన్ని తీర్చేవి చెరువులే! చెరువులు గ్రామ సౌందర్యానికి తొలిమెట్టు. పిల్లలకు వేసవిలో ఆటవిడుపు. చెరువు లేని గ్రామం చెట్టు లేని గ్రామం ఉండదు. నిలువ నీడకై తరువులు నిలువ నీటికై చెరువులు ఉండవలసిందే!
(ఆ) చెరువులను రక్షించుకోవడం మన బాధ్యత.
జవాబు.
చెరువులు గ్రామాలకు కల్పతరువులు. వాటిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. వ్యర్థ పదార్థాలతో, రసాయనాలతో చెరువులు కలుషితం కాకుండా చూసుకోవాలి. చెరువు గట్లను ఎప్పటికప్పుడు తెగిపోకుండా రక్షించుకోవాలి. త్రాగునీరు, సాగునీరు అందించటంతో పాటు పలు ప్రయోజనాలున్న చెరువులను రక్షించుకోవటం మనందరి బాధ్యతగా తీసుకోవాలి. గ్రామీణ సంస్కృతీ సంపదలను నిలబెట్టుకోవాలి.
(ఇ) చెరువులు మన సంస్కృతి కేంద్రాలు.
జవాబు.
చెరువులు మన సంస్కృతికి కేంద్రాలు. బతుకమ్మ పండుగ చెరువుతోనే ముడివడి ఉంది. గ్రామంలోని అమ్మలక్కలందరూ తల్లిగారింటికి వచ్చినట్లు చెరువు వద్దకే వస్తారు. పలురకాల పూలతో చెరువును అలంకరిస్తారు. ఆ పూలు చెరువులోని కాలుష్యాన్ని నివారిస్తాయి. ఇక వినాయక చవితి విషయం చెప్పనక్కర లేదు. వినాయక మూర్తులను చెరువులోనే కలుపుకుంటారు. వానలు కురవకపోతే చెరువు కట్టపై విరాట పర్వం చెప్పిస్తారు. కవులు, కళాకారులు, కథలు, పాటలు, పద్యాలు చెరువుపైనే రాస్తారు. చెరువును చిత్రకళాకారులు అందంగా చిత్రిస్తారు. సామాజిక సంస్కృతిలో చెరువులు ఒక భాగం అయ్యాయి.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
1. పాఠంలోని 4, 8, 14, 20 పేరాలు చదివి, వాటికి శీర్షికను పెట్టండి. ఆ పేరాలోని 4, 5 కీలకపదాలు రాయండి.
4వ పేరా శీర్షిక : ‘నీరే ప్రాణాధారం’. ఊపిరి, నీరే ప్రాణాధారం, తరువు, చెరువు, బతుకుతది, కళకళలాడేది. శ్రీరామరక్ష.
8వ పేరా శీర్షిక : ‘చెరువులు మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలు!’. కళాకారులు, గాయకులు, చైతన్యం, ముక్కున వేలేసుకొను, చిత్రకారులు, చిత్రించి, భేషనిపించుకొను, ఆటపాటలు, ఇబ్బడిముబ్బడి.
14వ పేరా శీర్షిక : ‘చెరువులు – పద బంధాలు’ సన్నబడుత, ఇబ్బంది. గుర్తు పట్టటం, తెలిసిపోతది, బయట పడింది. పుట్టుకొచ్చినవి.
20వ పేరా శీర్షిక : ‘చెరువులు మన మౌన సాక్షులు’ ఉదారంగా, ప్రత్యేక శ్రద్ధ, చెక్కుచెదరలేదు. విశాలమైన, సప్త సముద్రాలు, సంప్రదాయం.
2. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు రాయండి.
నేలపై కురిసే వర్షం నిలువచేయడానికి అనువైన చెరువులు, కుంటలు, ఆనకట్టలు లేకపోవడం వల్ల మనకు వర్షపు నీరు ఉపయోగపడకుండా వృథాగా సముద్రంలోకి పోతున్నది. చెరువుల పునర్నిర్మాణం ప్రజల మనుగడతో ముడిపడిన కీలకాంశం. ప్రకృతి ప్రసాదంగా ఉన్న నీటి వనరులను ఇప్పుడు తెలంగాణ సంపదగా గుర్తించి, వాటికి పూర్వవైభవం తెచ్చే పనిని ‘మిషన్ కాకతీయ’ పేరిట ప్రభుత్వం స్వీకరించింది. రాజుల కాలంలో తవ్వించిన చెరువులే ఇప్పటికీ తెలంగాణలో జీవనాధారం. నీటి లభ్యత కొరవడకుండా చూసుకోవడం ప్రతి తరం బాధ్యత. స్థానిక ప్రజలను నీటిని పరిరక్షించటంలో భాగస్వాములను చేయాలి. నీటికొరత ఆర్థిక వికాసాన్ని దెబ్బతీస్తుంది. చెరువులు, నదుల, భూగర్భవనరుల నుంచి మనం తోడే ప్రతి లీటరు నీటికి రెట్టింపు ప్రయోజనం కలిగేటట్లు వ్యవహరించాలి.
- వర్షం నీటిని నిలువచేయడానికి అనువైనవేవి ?
- వర్షం నీరు మనకు ఉపయోగపడకుండా పోతోంది ? ఎందుకు ?
- తెలంగాణ సంపదలుగా గుర్తింప తగినవి ఏవి ?
- ప్రభుత్వం చెరువులకు పూర్వవైభవాన్ని తేవటానికి ఆరంభించిన పథకం ఏది ?
- నీటిని పరిరక్షించటంలో ఎవరిని భాగస్వాములను చేయాలి ?
- మన ఆర్థిక వికాసాన్ని దెబ్బతీసే విషయం ఏమిటి ?
- ఎవరు త్రవ్వించిన చెరువులు ఇప్పటికీ జీవనాధారంగా ఉన్నాయి ?
- చెరువులు, నదులు, భూగర్భ జలాల వాడుకలో ఎట్లాంటి ప్రయోజనాన్ని ఆశించాలి ?
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) చెరువులు ఏ కాలంలో నిండుగా ఉంటాయి ? నిండుగా ఉండటానికి మనం ఏం చేయాలి ?
జవాబు.
చెరువులు వానాకాలంలో నిండుగా ఉంటాయి. మంచిగా వానలు కురిస్తే చెరువులు నెలలు నిండిన బాలింతరాలుగా ఉంటాయి. చెరువులు నిండుగా కళకళలాడుతూ ఉండాలంటే చెట్లను పెంచాలి. చెట్లను పెంచితే చక్కటి వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తే చెరువులు నిండుతాయి. చెరువులలో ఎప్పటికప్పుడు పూడికను తీయించాలి. చెరువు గట్లకు రక్షణ కల్పించాలి. ఆక్రమణలకు గురికాకుండా చూడాలి. ఫ్యాక్టరీ రసాయనాలు, ఎరువులు చెరువులో కలవకుండా చూడాలి. కాలుష్యం చెరువుల దరి చేరకుండా చూడాలి. గ్రామాలలోని మురుగునీరు చెరువులోకి చేరనీయకూడదు. అప్పుడే చెరువులు నిండుగా ఉండి గ్రామాలకు సౌందర్యాన్ని, సుఖసంతోషాలను, ధనధాన్యాలను ఇస్తాయి.
(ఆ) చెరువుల అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళలో వెలుగులు ఎందుకు వస్తాయి?
జవాబు.
అలుగులంటే చెరువు నీరు నిండి బయటకు పారుటకు పెట్టిన తూములు. అలా అలుగులు పారితే ప్రజలలో ఆనందం వెల్లి విరుస్తుంది. ఎందుకంటే నీటితో నిండిన చెరువులు సమాజానికి కల్పతరువులు కదా! చక్కగా అలుగుల ద్వారా నీళ్ళు ప్రవహిస్తే పంటలు వేసుకోవటానికి అనుకూల సమయం వచ్చిందని అర్థం. జలకళ సిరులను కురిపిస్తుందన్న ఆనందం. నీరే ప్రాణాధారం. చెరువుల అలుగులు పారితే నీటి కరువు తీరినట్లే. అలుగులు పారుతున్నప్పుడే గ్రామాలు రామసక్కని దృశ్యాలను అందిస్తాయి. మనం సిరిసంపదలతో తులతూగుతుంటే బంధుగణం మన వద్దకు వస్తారు. అట్లే చెరువులు నిండుగా ఉంటే కప్పలు, జలచరాలుచేరి, తామరలు వికసించి అందాన్నిస్తాయి. అందుకే అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళల్లో వెలుగులు చూస్తాము.
(ఇ) మీ ఊరి చెరువు కాలుష్యం బారిన పడకుండా ఉండడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు.
చెరువులు సమాజాలకు కల్పతరువులు. అవి కాలుష్యానికి గురైతే గ్రామాల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. చెరువులు కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే చెరువు గట్టులను జాగ్రత్తగా కాపాడాలి. వాటిని ఆక్రమణలకు గురికాకుండా చూసుకోవాలి. గ్రామంలోని మురికి నీరు చెరువులలోకి చేరకుండా ఆపాలి. ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థ రసాయనిక పదార్థాలను చెరువులలో పడేయకూడదు. ఎప్పటికికప్పుడు చెరువులలో పూడికను తొలగిస్తుండాలి. అప్పుడే చెరువులు కాలుష్యం బారిన పడకుండా ఉంచగలం.
(ఈ) చెరువుల వలన కలుగు లాభాలను రాయండి.
జవాబు.
చెరువులు సమాజానికి కల్పతరువులు. అన్ని వృత్తులు సాఫీగా సాగటానికి వనరులు. వ్యవసాయానికి ప్రధానమైన నీరు ప్రజలకు, పశుపక్ష్యాదులకు దాహాన్ని తీర్చేవి చెరువులే! నీరే ప్రాణాధారం. ఆ నీటిని అందించేవి చెరువులే. చెరువులు ఉంటే భూగర్భజలాలు అందుబాటులో ఉంటాయి. చెరువులు విహారస్థలాలు కూడా! చెరువులలో జలవిహారం కోసం పడవలను నడిపి పొట్టపోసుకుంటారు. చెరువులు నీటితో పాటు ప్రకృతి సౌందర్యాలను అందిస్తున్నాయి. వేసవి కాలంలో మత్స్యకారులకు ఆర్థిక బలాన్నిస్తున్నాయి. బహువిధ ప్రయోజనకారులు చెరువులు. వాటిని రక్షించుకుంటే సమాజాలు రక్షింపబడతాయి.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) “చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి” దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నది నిజం. చెరువులు గ్రామాలకు కల్పతరువులు. అన్ని వృత్తులు కొనసాగటానికి ఆధారాలు. ఉత్పాదక శక్తులకు ఊతాలు. వ్యవసాయానికి ప్రధానమైన వనరులు. ఆబాల వృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాలు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే వేదికలు. పరోపకారాన్ని చాటే పవిత్ర రూపాలు. మనుషులకే కాక పశుపక్ష్యాదులకు, జలచరాలకు ఆవాసాలు. సమాజంతో చెరువుల బంధం విడదీయరానిది. నిలువ నీడకై తరువులు – “నిలువ నీటికై చెరువులు” ఉండవలసిందే. మనకు నాలుగు ముద్దలు కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాలి.
వ్యవసాయం చేయాలంటే నీరుండాలి. వర్షపునీటిని నిలువవుంచుకొని వ్యవసాయానికి నీటిని అందించేవి చెరువులు. చెరువులు లేని పల్లెలను, గ్రామాలను మనం ఎక్కడాచూడం. వ్యవసాయానికి, తాగునీటికి, సకల జీవకోటికి ఆధారభూతమైనవి చెరువులు. చెరువులను చక్కగా కాపాడగలిగితే అవి మనలను కాపాడతాయి. అందుకే చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి.
(ఆ) ‘సంస్కృతితో ముడిపడ్డ జీవితం నాది’ అని చెరువు ఎందుకన్నది?
జవాబు.
చెరువు జీవితం గ్రామీణ సంస్కృతికి నిలయం. బతుకమ్మ పండుగకు చెరువు వైభోగం ఇంతింత అనరానిది. తెలంగాణ మహిళలు బతుకమ్మలతో తల్లిగారింటికి వచ్చినట్లు చెరువు వద్దకు వస్తారు. తంగేడు, గునుగు, గుమ్మడి పూలతో చెరువులను సింగారిస్తారు. ఈ పూలు నీటి కాలుష్యాన్ని నివారిస్తాయి. బతుకమ్మ చెరువులో తేలియాడుతుంటే ఉయ్యాలపై ఊగుతున్నట్లుటుంది. ఇక వినాయక చవితిని గురించి చెప్పనక్కర లేదు.
చెరువులో ఉండే తామరలు వినాయకునికి అలంకారమౌతాయి. గణపతి మూర్తులు చివరకు చెరువు ఒడికే చేరుతాయి. చెరువులకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదని కట్ట మైసమ్మను పూజిస్తారు. వానలు పడకపోతే చెరువు కట్టలపై ‘విరాట పర్వాన్ని’ చదివిస్తారు. చిత్రకారులు చెరువు పై పలు చిత్రాలు వేస్తారు. పెద్దలు భజన బృందాలు, కోలాటగుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు చెరువుకు ఆనందాన్నిస్తారు. పిల్లలకు చెరువు ఆటస్థలం. చెరువులేని గ్రామం లేదు. అందుకే తన జీవితం సమాజ సంస్కృతిలో భాగం అని చెరువు చెప్పుకొంది.
IV. సృజనాత్మకత/ప్రశంస
ప్రశ్న 1.
చెరువు యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చిన్న కవిత లేదా పాట రాయండి.
జవాబు.
చెరువును నేను చెరువును
గ్రామాలకు కల్పతరువును
పల్లెల అభివృద్ధి నా ధ్యేయం
సంస్కృతి సంప్రదాయాలకు నిలయాన్ని
జీవుల దాహార్తిని తీర్చే వలయాన్ని ||చెరు||
వ్యవసాయానికి మంచి వనరును
పర్యాటకులకు విహార స్థలాన్ని
కళాకారులకు ప్రేరణనిచ్చే
రూపం నాది నిలువ నీటికై నేనున్నాను. ||చెరు||
బతుకమ్మ పండుగ వైభోగం
గణపతి స్వామి నిమజ్జనం
కట్టమైసమ్మ పూజా విధానం
నాతోనే ఇవి సాకారం. ||చెరు||
మత్స్యకారులకు జీవన భృతిని
సహజ వనరును ఎరువును నేను
రోగాలను హరించే ఔషధాన్ని నేను ||చెరు||
ప్రశ్న 2.
పాఠం ఆధారంగా ‘చెరువు’ మాట్లాడుతున్నట్లుగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు.
గ్రామ సౌందర్యానికి ఆధారాన్ని, వ్యవసాయానికి ప్రథమ వనరును బతుకమ్మను సాగనంపి, విఘ్నేశ్వరుని ఆహ్వానం పలికే సమాజానికి కల్పతరువును. నేనెవరనుకుంటున్నారు. చెరువును. నా గురించి చెబుతాను వినండి. నేను చెరువును, గ్రామాలకు వెలుగును, అన్ని వృత్తుల వారికి ఆధారాన్ని, పిల్లలను, పెద్దలను అలరించే పర్యాటక కేంద్రాన్ని, వినోదాన్ని పంచే వేదికను, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అద్దాన్ని, కళలకు ప్రేరణను, పరోపకారం నా వృత్తి. నా మనుగడ మీకు ప్రవృత్తి కావాలని ఆశిస్తున్నాను.
మీకు తెలుసా నేను ఎందరికో జీవనాధారాన్ని, నా నీరే కాదు నాలోని మట్టి కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. నాలో ఉన్న ఒండ్రుమట్టి చాల సారవంతమైంది. అది మీ పంట పొలాలకు ఎరువు. ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది. నేను మీ సంస్కృతి సంప్రదాయాలకు పండుగలకు నిలయాన్ని. నాలో ఎన్నో జలరాశులు, జలజీవాలున్నాయి. పిల్లలకు నేనొక ఆటస్థలాన్ని. హాయ్ పిల్లలు నా దగ్గర సాహసం చేయకండి. అది మీకే ప్రమాదం. నాలో అలుగులు పారినపుడు నన్ను చూడండి. అది ఒక రామసక్కని దృశ్యం అవుతుంది. నన్ను కలుషితం చేయకండి – నన్ను ఆక్రమించి ఇళ్ళ నిర్మాణం చేయకండి. నా ఒడ్డులగు గట్టులను రక్షించండి. నేను మీకు రక్షణగా ఉంటాను…..
V. పదజాల వినియోగం
1. కింది పదాలు, వాక్యాలు చదవండి.
చెవినిల్లు గట్టుకొని, ఉర్కబోయి బోర్లపడ్డట్టు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, కుండబద్దలుకొట్టినట్లు, వండిన కుండ, గాలం వేయడం,
గుండె చెరువైంది, తామరతంపర, కన్నెర్ర.
పై వాటిలో ఉన్న తేడాలు ఏమిటి ? వాటిని ఏమంటారు?
జాతీయం: ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఉదా : చెవినిల్లుకట్టుకొని, గుండె చెరువైంది.
సామెత: సామ్యతనుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా, గూఢార్థకంగా ఉంటాయి. ఉదా : కుండబద్దలు కొట్టినట్లు; ఉర్కబోయి బోర్లపడ్డట్టు.
2. కింది వాటిలోని జాతీయాలను గుర్తించండి. వాటిని వివరించండి.
కోరిక, పండ్లుకొరుకు, కొట్టినపిండి, మొసలికన్నీరు, మాధుర్యం, తలలో నాలుక, కలుగు, పూసల్లో దారము, చెరువు, నిండుకుండవోలె, జాతర, చల్లగాలి
- మొసలి కన్నీరు : దొంగకన్నీరు. లేని బాధ నటిస్తూ ఏడవడాన్ని, బాధను చూపడాన్ని మొసలి కన్నీరు అంటారు.
- నిండుకుండ వోలె : గంభీరంగా తొణకక బెణకక ఉండే మనస్తత్వాన్ని గురించి చెప్పటానికి దీనిని ప్రయోగిస్తారు.
- పండ్లు కొరుకు : కోప భావాన్ని వివరించడానికి ఈ జాతీయాన్ని వాడతారు.
- పూసల్లో దారము : పూసలలో దారమంటే పూసలకు దారమెలా ఆధారమో అలా. ఆధారంగా నిలవాలని చెప్పటానికి ప్రయోగం చేస్తాం.
- తలలో నాలుక : అందరితో కలివిడిగా కలిసి పోవటాన్ని చెప్పటానికి ఈ పదం ఉపయోగిస్తాం.
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది పదాల్లోని సంయుక్త, ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి.
ఉదా : విద్య = వి, ద్ + య్ + అ
(A) అక్క = అ, క్ + క్ + అ
(B) ముగ్ధ = ము, గ్ + థ్ + అ
(C) మూర్ఛ = మూ, ర్ + చ్ + అ
కింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి.
(అ) ఇప్పటికైనా జాగ్రత్తపడుతారని ఆశ.
(ఆ) నీళ్ళెంత ఎక్కువగా ఉంటే తామర అంత వృద్ధి చెందుతుంది.
(ఇ) అవి ఎక్కడుంటాయో తెలియదు.
పై వాక్యాలలో ఇప్పటికైనా అనే మాటలో మొదటిపదం – ఇప్పటికి, రెండవ పదం – ఐనా
నీళ్ళెంత అనే మాటలో మొదటిపదం – నీళ్ళు , రెండవ పదం – ఎంత
ఎక్కడుంటాయో అనే మాటలు మొదటిపదం – ఎక్కడ, రెండవ పదం – ఉంటాయో
పై వాటిని ఇట్లా విడదీయవచ్చు.
ఇప్పటికైనా = ఇప్పటికి + ఐనా
నీళ్ళెంత = నీళ్ళు + ఎంత
ఎక్కడుంటాయో= ఎక్కడ + ఉంటాయో
ఇట్లా రాయడాన్ని విడదీసి రాయడం అంటారు.
2. కింది పదాలను విడదీసి రాయండి.
(అ) ప్రజలెంత = ప్రజలు + ఎంత
(ఆ) నేనెవరిని = నేను + ఎవరిని
(ఇ) రేమిటి = పోరు + ఏమిటి
(ఈ) నాకింకా = నాకు + ఇంకా
(ఉ) ఇవన్నీ = ఇవి + అన్ని
(ఊ) సోమనాద్రి = సోమన + అద్రి
ప్రాజెక్టు పని
1. వివిధ పత్రికల్లో వచ్చిన (పర్యావరణ) ప్రకృతిని వర్ణించే గేయాలు/వ్యాసం/కవితలను సేకరించండి. తరగతి గదిలో పాడి/చదివి వినిపించండి.
1. ప్రాజెక్టు శీర్షిక : వివిధ పత్రికల్లో వచ్చిన (పర్యావరణ) ప్రకృతిని వర్ణించే గేయాలు / కవితలు సేకరించడం.
2. సమాచార సేకరణ : (అ) సమాచారం సేకరించిన తేది : XXX
(ఆ) సమాచార వనరు : వివిధ దినపత్రికలు
(ఇ) చదివిన పుస్తకం : వాల్మీకి రామాయణం
3. సేకరించిన విధానం : వివిధ దినపత్రికలు చదివి పర్యావరణానికి సంబంధించిన గేయాలు సేకరించడం జరిగింది.
4. నివేదిక :
ఈ తోట మా తోట
ఇంపుల మూట
ప్రీతిరసముల ఊట
ప్రియముల బాట
చిన్ని మొక్కలు మాకు
చిన్ని తమ్ముళ్ళు
చిన్ని తీవలు మాకు
చిన్ని చెల్లెళ్ళు
నిజమైన ప్రేమతో
నీళ్ళు పోస్తాము
గాటంపు ప్రీతితో
కలుపు తీస్తాము
ఇరవైన కరుణతో
ఎరువు వేస్తాము
శ్రద్ధగా దిన దినం
వృద్ధి చేస్తాము
చిగురు వేసిననాడు
చిటి విందు మాకు
మొగ్గ తొడిగిన నాడు
మురిపెంబు మాకు
కలకల లాడిన
కలుగు వేడుక మాకు
మిలమిల మెరసిన
మోదమ్ము మాకు
చిగురాకు తెంపము
చెలిమితో మేము
ఎవరు గిల్లిన గాని
ఎవరు తెంపిన గాని
మము కొట్టినట్లుండు
మనసులో మాకు
మా చిన్ని మొక్కలు
మము చేర బిల్చు
మము జూచి పుష్పాలు
మందహాసము చేయు
5. ముగింపు : ప్రకృతిలో మొక్కలు, పక్షులు, జంతువులు ఎన్నో ఉన్నాయి. ప్రకృతిని రక్షించుకోవడం మన ధర్మం.
TS 6th Class Telugu 8th Lesson Important Questions చెరువు
అర్ధాలు
- స్పర్శ = తాకుట, స్పృశించుట
- మంగళవాయిద్యం = సన్నాయి చప్పుడు
- స్వస్తి = ముగింపు
- అంగలు = అడుగులు
- కల్పతరువు = కోరికలను తీర్చే చెట్టు
- ఊతము = ఆధారము
- ప్రేరణ = ప్రోత్సాహము
పర్యాయపదాలు
- సూర్యుడు = భానుడు, భాస్కరుడు, రవి
- బంగారము = పసిడి, పుత్తడి
- పవనము = గాలి, వాయువు
- తల్లి = మాత, అమ్మ
- ఆకాశము = గగనము, నింగి
- రైతు = కర్షకుడు, హాలికుడు
- తరువు = చెట్టు, వృక్షము
- ఊరు = పల్లె, పట్టణము
నానార్థాలు
- రాజు = చంద్రుడు, పాలకుడు
- వ్యవసాయము = సేద్యము, యత్నము
- పాలు = క్షీరము, భాగము
- ప్రకృతి = ఆకాశము, స్వభావము
- ప్రాణము = ఊపిరి, బలము
- బంగారము = కనకం, అధిక వెలగలది
ప్రకృతులు – వికృతులు
- ఆహారము – ఓగిరము
- ఆకాశము – ఆకసము
- పశువు – పసరము
- ఆధారము – ఆదరువు
- శక్తి – సత్తి
- మనిషి – మనిసి
- ప్రాణము – పానము
- నీర – నీరము
- ఆశ్చర్యము – అచ్చెరువు
1. గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించండి.
1. మత్స్యకారులు నది, సముద్ర ప్రాంతాలలో నివసిస్తుంటారు. గీతగీసిన పదానికి అర్థం రాయండి.
(A) ఎలుకలు పట్టేవారు
(B) పాములు పట్టేవారు
(C) చేపలు పట్టేవారు
(D) పక్షులు పట్టేవారు
జవాబు.
(C) చేపలు పట్టేవారు
2. ఎరుక తో ప్రవర్తించటం విజ్ఞుల లక్షణం.
(A) తెలివి
(B) అజ్ఞానం
(C) తెలియకపోవుట
(D) తెలిసీ తెలియకపోవుట
జవాబు.
(A) తెలివి
3. చెడు అలవాట్లకు త్వరగా స్వస్తి పలకాలి.
(A) ఆరంభం
(B) ముగింపు
(C) ఆధారం
(D) అజ్ఞానం
జవాబు.
(B) ముగింపు
4. చెరువు అన్ని ప్రాణుల జీవనానికి ఊతము.
(A) కర్ర
(B) ప్రాణము
(C) ఆటంకం
(D) ఆధారం
జవాబు.
(D) ఆధారం
5. పేదలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
(A) దీనమైన
(B) ఆనందమైన
(C) ఆహ్లాదమైన
(D) ఇవేవికావు
జవాబు.
(A) దీనమైన
పర్యాయపదాలు
II. గీత గీసిన వాటికి పర్యాయపదాలు గుర్తించండి.
6. ‘తనువు’ పర్యాయపదాలు.
(A) శరీరము, దేహము
(B) చెట్టు, వృక్షము
(C) గుండె, హృదయం
(D) గుండు, శిరస్సు
జవాబు.
(A) శరీరము, దేహము
7. దీపావళి పండుగ అందరూ జరుపుకుంటారు.
(A) సంబరము, జాతర
(B) సంతోషము, దుఃఖము
(C) ఈర్ష్య, అసూయ
(D) ఏదీకాదు
జవాబు.
(A) సంబరము, జాతర
8. మహిళ పర్యాయపదాలు.
(A) లక్ష్మి, శ్రీ
(B) వినని, అంబ
(C) వనిత, ఉవిద
(D) మహిమ, గౌరవం
జవాబు.
(C) వనిత, ఉవిద
9. రాజు ప్రజా పరిపాలకుడు.
(A) రాజు, రాణి
(B) ప్రభువు, భూపాలుడు
(C) రేడు, చంద్రుడు
(D) అన్నీ
జవాబు.
(B) ప్రభువు, భూపాలుడు
10. భాస్కరుడు పర్యాయపదాలు.
(A) భూమి, ధరణి
(B) నీరు, జలము
(C) మబ్బు, మేఘము
(D) సూర్యుడు, రవి
జవాబు.
(D) సూర్యుడు, రవి
నానార్థాలు
III. గీత గీసిన వాటికి నానార్థాలు రాయండి.
11. ‘ఆశ’ నానార్థాలు రాయండి.
(A) కోరిక, దిక్కు
(B) అంశ, అంశము
(C) ఆశ, నిరాశ
(D) ముక్క, భాగము
జవాబు.
(A) కోరిక, దిక్కు
12. ‘ఉదకము’ నానార్థాలు రాయండి.
(A) పువ్వు, నవ్వు
(B) కుండ, నీరు
(C) నీరు, కలువ
(D) కాలువ, నది
జవాబు.
(C) నీరు, కలువ
13. ‘పని’ నానార్థాలు
(A) పేరు, నామము
(B) నడక, నవ్వు
(C) చలనం, కదలిక
(D) కారణము, ప్రయోజనము
జవాబు.
(D) కారణము, ప్రయోజనము
14. ‘దినము’ నానార్థాలు రాయండి.
(A) చావు, పుట్టుక
(B) పగలు, రోజు
(C) దినుసు, ఆకు
(D) పని, పగటికాలము
జవాబు.
(B) పగలు, రోజు
15. ‘రాజు’ నానార్థాలు రాయండి.
(A) నక్షత్రము, చుక్క
(B) భూపాలుడు, చంద్రుడు
(C) సూర్యుడు, ఇనుడు
(D) భూమి, పుడమి
జవాబు.
(B) భూపాలుడు, చంద్రుడు
IV. కింది ప్రకృతులను వికృతులతో జతపరచండి.
నిద్ర | (B) | (A) బాస |
ఆశ | ( E) | (B) నిదుర |
చరిత్ర | (C) | (C) చరిత |
సాక్షి | (F) | (D) రాయడు |
రాజు | (D) | (E) ఆస |
విద్య | (G) | (F) సాకిరి |
భాష | (A) | (G) విద్దె |
V. వ్యాకరణం:
23. చెప్పాలని – విడదీస్తే
(A) చెప్పాల + అని
(B) చెప్పాలా + అని
(C) చెప్పాలి + అని
(D) చెప్పువాలెను + అని
జవాబు.
(C) చెప్పాలి + అని
24. ‘దేవాలయము’ పదాన్ని విడదీస్తే
(A) దేవ + అలయం
(B) దేవా + అలయం
(C) దేవి + ఆలయం
(D) దేవ + ఆలయం
జవాబు.
(D) దేవ + ఆలయం
25. పర + ఉపకారం కలిపి రాస్తే
(A) పరోపకారం
(B) పరాపకారం
(C) పరఉప్పుకారం
(D) పరాకారం
జవాబు.
(A) పరోపకారం
26. ముందు + అడుగు = ………………
(A) మందుగుండు
(B) ముందు అడుగు
(C) ముందడుగు
(D) ముందే అడుగు
జవాబు.
(C) ముందడుగు
27. ‘మేనత్త’ విడదీస్తే అందులో రెండో పదం …………………..
(A) అత్త
(B) మేన
(C) మేన, అత్త
(D) అత్త, మేన
జవాబు.
(A) అత్త
28. పూజిత మల్లె పూలను ధరించింది. గీతగీచిన ప్రత్యయం
(A) ద్వితీయా విభక్తి
(B) తృతీయా విభక్తి
(C) చతుర్థీ విభక్తి
(D) పంచమీ విభక్తి
జవాబు.
(A) ద్వితీయా విభక్తి
29. అడవికి రాజు సింహం …………….. ‘కి’ ఏ విభక్తి ప్రత్యయం ?
(A) సప్తమి
(B) పంచమి
(C) ప్రథమా
(D) షష్ఠీ
జవాబు.
(D) షష్ఠీ
30. పెద్దలతో మర్యాదగా వ్యవహరించాలి. ఈ వాక్యంలో తృతీయా విభక్తి ప్రత్యయం
(A) గా
(B) తో
(C) పె
(D) ల
జవాబు.
(B) తో
31. ఇంజనీరింగ్ చదవటం కోసం కృష్ణ అమెరికాకు వెళ్ళాడు. ఈ వాక్యంలోని చతుర్థీ విభక్తి ప్రత్యయం
(A) కు
(B) డు
(C) గ్
(D) కోసం
జవాబు.
(D) కోసం
32. దొంగతనం చేయడం …………….. పేదవాడుగా ఉండటం మేలు ఖాళీలో పూరింపదగిన ప్రత్యయం
(A) తో
(B) వలన
(C) కంటె
(D) కొరకు
జవాబు.
(C) కంటె
33. రాజు యుద్ధం చేయడానికి సైన్యం ……….. వచ్చాడు. – ఖాళీని పూరించడానికి సరిపడే ప్రత్యయం
(A) కొరకు
(B) చేత
(C) తో
(D) కూడా
జవాబు.
(C) తో
34. స్నేహితుని సహాయం వలన నా కష్టం తీరింది. ‘వలన’ ఏ విభక్తి ?
(A) పంచమీ విభక్తి
(B) షష్ఠీ విభక్తి
(C) సప్తమీ విభక్తి
(D) చతుర్థీ విభక్తి
జవాబు.
(C) సప్తమీ విభక్తి
35. వృద్ధుల ……………….. అందరూ ఆదరించాలి. సరైన విభక్తి ప్రత్యయం
(A) కు
(B) ను
(C) వలన
(D) చేత
జవాబు.
(B) ను
36. రవి బడికి వెళ్ళాడు. రవి చదువుకున్నాడు. ఈ రెండు వాక్యాలు కలిపి రాస్తే ……………….
(A) రవి బడికి వెళ్ళి చదువుకోలేదు
(B) రవి బడికి వెళ్తూ చదువుకుంటున్నాడు.
(C) రవి బడికి వెళ్ళి చదువుకున్నాడు
(D) రవి బడికి వెళ్ళి, రవి బడిలో చదువుకున్నాడు
జవాబు.
(C) రవి బడికి వెళ్ళి చదువుకున్నాడు
37. రాజు గ్రంథాలయానికి వెళ్ళి చదువుకున్నాడు. ఈ వాక్యంలోని రెండు వాక్యాలు ……………..
(A) రాజు గ్రంథాలయానికి వెళ్ళాడు. రాజు చదువుకున్నాడు.
(B) రాజు చదువుకున్నాడు. రాజు గ్రంథాలయంలో ఉన్నాడు.
(C) రాజు గ్రంథాలయం వెళ్ళాడు. అక్కడే చదువుకుంటున్నాడు.
(D) గ్రంథాలయానికి వెళ్ళాడు రాజు. అక్కడ చదవనంటున్నాడు.
జవాబు.
(A) రాజు గ్రంథాలయానికి వెళ్ళాడు. రాజు చదువుకున్నాడు.
38. సీత నిద్రలేచింది. సీత యోగాచేసింది. కలిపి రాస్తే
(A) సీత నిద్రలేచి యోగాచేసింది.
(B) సీత యోగాచేసి నిద్రలేచింది.
(C) నిద్రపట్టరాదని సీత యోగాచేసింది.
(D) సీత యోగా చేసింది.
జవాబు.
(A) సీత నిద్రలేచి యోగాచేసింది.
VI. క్రింది పద్యంచదివి, ప్రశ్నలకు సరియైన సమాధానాలు రాయండి.
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!
39. తమ తప్పులను ఎరుగని వారెవరు ?
(A) తప్పులెన్నువారు
(B) తప్పు చేయనివారు
(C) తప్పులు లేనివారు
(D) తప్పులు తెలుసుకున్నవారు
జవాబు.
(A) తప్పులెన్నువారు
40. తప్పులు ఎవరిలో ఉంటాయి ?
(A) కొందరిలో
(B) అందరిలో
(C) ఎవరో ఒకరిలో
(D) ఎవరిలో ఉండవు.
జవాబు.
(B) అందరిలో
41. ఈ పద్యానికి మకుటం ఏమిటి ?
(A) విశ్వదాభిరామ వినురవేమ
(B) సుమతీ
(C) వేమా
(D) రామా
జవాబు.
(A) విశ్వదాభిరామ వినురవేమ
42. తప్పులెన్ను జనులు ఎందరు ?
(A) 100 మంది
(B) వేయి మంది
(C) తండోపతండాలు
(D) కొందరే
జవాబు.
(C) తండోపతండాలు
43. పై పద్యం ఎవరు రాశారు ?
(A) తిక్కన
(B) బద్దెన
(C) ధూర్జటి
(D) వేమన
జవాబు.
(D) వేమన
VII. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
బతుకమ్మను పేర్చడానికి తంగేడుపూలు, బంతిపూలు, గునుగుపూలు, కనకాంబరాలు, గన్నేరు, గోరింక, సలిమల్లె, మంకెన, గులాబి, గుమ్మడి పూలు వాడతారు. తెచ్చిన పూలను పళ్ళెంలో గుండ్రంగా అంచువెంబడి గోడకట్టినట్లు పేరుస్తారు. బతుకమ్మ నిలువడానికి మధ్యలో ఆముదపు ఆకులు, గుమ్మడి, కాకర, బీర తీగ ఆకులు ముక్కలు చేసి నింపుకుంటూ, పూలను గోపురం లాగా నిలబెడతారు. మొట్టమొదటి బతుకమ్మను “ఎంగిలి పువ్వు బతుకమ్మ” అంటారు. ఆ తర్వాత వరుసగా మరో ఎనిమిది రోజులు బతుకమ్మను పేరుస్తారు. చివరి రోజు అష్టమినాడు పెద్దగా పేర్చే బతుకమ్మను “పెద్ద బతుకమ్మ” లేదా “చద్దుల బతుకమ్మ” అంటారు. బతుకమ్మ అంటే బతుకు నిచ్చే తల్లి అని అర్థం.
ప్రశ్నలు:
44. మీ పరిసరాలలో దొరికే పూల పేర్లను రాయండి.
జవాబు.
తంగేడు, బంతి, గునుగు, గులాబి, గన్నేరు, గుమ్మడి, కనకాంబరాలు.
45. పూలను ఎందులో పేరుస్తారు ?
జవాబు.
పూలను పళ్ళెంలో పేరుస్తారు.
46. మొట్టమొదటి బతుకమ్మను ఏమంటారు ?
జవాబు.
ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు.
47. అష్టమి అనగా ఎన్నవరోజు ?
జవాబు.
ఎనిమిదవ రోజు.
48. “పెద్ద బతుకమ్మ” ను ఇంకేమని అంటారు ?
జవాబు.
చద్దుల బతుకమ్మ
VIII. క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
రాజు చేతికత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
అతడేల గలుగు యావత్ప్రపంచంబు
నీతడేల గలుగు నిహము పరము.
ప్రశ్నలు:
49. రాజు చేతికత్తి దేన్ని వర్షిస్తుంది ?
జవాబు.
రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది.
50. సుధలు కురిపించునది ఏది ?
జవాబు.
సుకవి చేతి కలము సుధలు కురిపిస్తుంది.
51. యావత్ ప్రపంచాన్ని పరిపాలించునది ఎవరు ?
జవాబు.
యావత్ ప్రపంచాన్ని పరిపాలించునది రాజు.
52. ఇహము, పరము ఏలగలిగేది ఎవరు ?
జవాబు.
ఇహము, పరము ఏలగలిగేది సుకవి.
53. ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు.
“రాజు -కవి” శీర్షిక
పాఠం ఉద్దేశం:
తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోను చెరువులున్నాయి. అవి ప్రజావసరాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలు. పశుపక్షి మృగ కీటకాలకు ఆవాసాలు. వృత్తులకు ఉనికిపట్టు. అటువంటి చెరువులను మనం సంరక్షించుకొంటే అవి మనలను సంరక్షిస్తాయని తెల్పడము, తెలుగు భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలుపడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.
ప్రవేశిక:
నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును! వ్యవసాయానికి ప్రధాన వనరును! బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకునిమ్మని నాలో చేర్చుకుంటాను! మళ్ళీ రా ! వినాయకా అని జనం నా చెంతకు వినాయకులను పంపిస్తారు. పిల్లలకు వేసవిలో నేనే ఆటవిడుపును. పశుపక్ష్యాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని నేను! ఇంతకూ నేనెవరో చెప్పలేదుకదా! పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును!! నా హృదయాంతరంగ భావాన్ని చెబుతా వినండి.
నేనివి చేయగలనా ?
- చెరువు గురించి మాట్లాడగలను. అవును / కాదు
- అపరిచితమైన పేరాను చదివి ప్రశ్నలు తయారుచేయగలను. అవును / కాదు
- చెరువుల అవసరాన్ని వివరిస్తూ రాయగలను. అవును / కాదు
- ‘చెరువు’ ను ప్రశంసిస్తూ కవిత/పాట రాయగలను. అవును / కాదు