Telangana SCERT 6th Class Telugu Guide Telangana 7th Lesson ఉడుత సాయం Textbook Questions and Answers.
ఉడుత సాయం TS 6th Class Telugu 7th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్న 1.
బొమ్మలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు?
జవాబు.
బొమ్మలో ఒక తల్లీబిడ్డ; ఒక అబ్బాయి, ఒక కళ్ళులేని వ్యక్తి; ఒక బాలుడు-బాలిక కనిపిస్తున్నారు.
ప్రశ్న 2.
వారు ఏం చేస్తున్నారు ?
జవాబు.
తల్లికి బిడ్డ కూరలు తరగటంలో సాయం చేస్తున్నది. ఒక బాలుడు కళ్ళులేని వ్యక్తికి రోడ్డు దాటటంలో సాయం చేస్తున్నాడు. ఒక బాలుడు, బాలిక పరిసరాలు శుభ్రం చేస్తున్నారు.
ప్రశ్న 3.
వారు చేసే పనులవల్ల ఎవరికి మేలు జరుగుతుంది ?
జవాబు.
వారు చేసే పనులవల్ల వారికి, చుట్టుప్రక్కల వారికి మేలు జరుగుతుంది.
ప్రశ్న 4.
మీరు ఎవరికి, ఎప్పుడు, ఏ సందర్భంలో సహాయం చేశారు ?
జవాబు.
నేను ఒకసారి, రోడ్డు దాటుతూ కింద పడిపోయిన పిల్లవాడిని స్కూటరు కింద పడకుండా తప్పించాను. అతని పెద్దలకు అప్పగించాను.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 66)
ప్రశ్న 1.
“నిర్మల భక్తి” అంటే ఏమిటి ?
జవాబు.
నిర్మల భక్తి అంటే ఏ ఆలోచనలూ, కోరికలూ కోరకుండా దేవుని సన్నిధిని కోరుతూ పవిత్రంగా దేవుని మీద మనసు లగ్నం చేయడం, ప్రార్థించటం.
ప్రశ్న 2.
‘అడుగు దామరలు మనమున జేర్చి’ అంటే నీకేమి అర్థమైంది ?
జవాబు.
అడుగు దామరలు అంటే పాద పద్మములు. దేవుని పూజించేటప్పుడు పూలుగాని, అక్షతలుగాని దేవుని పాదాల ముందే ఉంచుతాము. అందుకే భక్తి అనగానే పాదాలే గుర్తుకొస్తాయి. అటువంటి పాదపద్మాలను మనసులో తలచుకోవటం అని అర్థం.
ప్రశ్న 3.
ఉడుత నీళ్ళలో మునిగి ఇసుకలో పొర్లాడి వేగంగా వచ్చి కట్టపై రాలుస్తున్నది కదా! అట్లా ఎందుకు చేయాలని అనుకున్నది?
జవాబు.
నీళ్ళలో తడిసిన ఒంటికి ఎక్కువ ఇసుక అంటుకుంటుంది. వారధి కట్టే రాళ్ళమీద తనకు చేతనైనంత ఇసుక పోద్దామనుకుంది ఉడుత. అందుకే తడి ఒంటికి ఇసుక అంటించుకొంది. వేగంగా అని ఎందుకన్నారంటే నిదానంగా వెళితే దారిలోనే ఇసుక రాలిపోతుందేమోనని ఉడుత అలా చేసింది.
ప్రశ్న 4.
రామలక్ష్మణుల సంభాషణ ద్వారా మీరు ఏమి గ్రహించారు ?
జవాబు.
రామలక్ష్మణుల సంభాషణ ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అవగాహన అర్థమౌతుంది. ఇద్దరూ ఒకరి అభిప్రాయంతో ఒకరు ఏకీభవిస్తారు. అన్నమాటను తమ్ముడు ఎప్పుడూ కాదనడు. తమ్ముడికి రామునిపై ఎంతో భక్తి అని అర్థమౌతుంది.
ప్రశ్న 5.
‘ఉడుతాభక్తి’ అంటే ఏమిటి ?
జవాబు.
ఉడుతకు రామునిమీద అమితమైన భక్తి. ఆ భక్తితో రాముడు చేస్తున్న గొప్పపనికి తాను కూడా సాయం చెయ్యాలని ఆశపడింది. అక్కడ గొప్పగొప్ప వానరవీరులు చెట్లు, బండలు ఎంతెంతో బరువులు మోస్తున్నారు. తాను అంతచెయ్యలేక పోయినా తన చేతనైనంత సాయం చేద్దామని నీళ్ళలో మునిగి తడి ఒంటికి ఇసుక అంటించుకొని వంతెన మీద దులిపింది. ఎంత చేశామన్నది ముఖ్యం కాదు. చేశామా లేదా అనేది ముఖ్యం. అలా శక్తికి తగినట్లు సాయంచేయడాన్ని ఉడుతాభక్తి అంటారు.
ఇవి చేయండి
I. విని అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
పాఠాన్ని (ద్విపదను) రాగ, భావయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి చేయవలసిన పని.
ప్రశ్న 2.
మీరు ఎవరికైనా సాయం చేశారా ? అప్పుడు వారు ఏవిధంగా స్పందించారు ?
జవాబు.
ఒకసారి నాన్నగారు నాకిచ్చిన వందరూపాయలు తీసుకొని పుస్తకం కొనుక్కుందామని వెళుతున్నాను. దారిలో ఒక ముసలివాడు జ్వరంతో వణికిపోతూ రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. దగ్గరలో ఉన్న మందుల షాపుకు వెళ్ళి జ్వరం బిళ్ళలూ, తినడానికి రొట్టె, తాగడానికి మంచినీళ్ళు తెచ్చి యిచ్చాను. వాళ్లింటిదగ్గర దింపాను. నాకెంతో ఆనందం అనిపించింది. ఆ తాత ఎంతో సంతోషించి చల్లగా ఉండమని దీవించాడు.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
1. కింది అర్థం గల పద్యపాదాలు మీ పాఠంలోని పద్యాలలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ పాదాలు రాయండి.
(అ) త్వరగా సేతువు నిర్మాణం కావాలి.
జవాబు.
గొబ్బున సేతువు కొనసాగవలయు
(ఆ) తన ఒంటికంటిన యిసుకను రాలుస్తున్నది.
జవాబు.
తామేను జలముల దడిపి గట్టునకు జని వేగనిసుకపై జల్లాడి తిరుగ చనుదెంచి కొండల సందున రాల్చి
(ఇ) పలు విధాల పొగడి
జవాబు.
పలుతెరంగుల జాల ప్రస్తుతి జేసి
(ఈ) భక్తితో గడ్డిపోచంత పనిచేసినా అది కొండతో సమానం.
జవాబు.
భవదంఫ్రి కమలయుగ్మమును, నెవ్వడు మదినిల్పియెసగుఁ దృణంబు నవ్వేల్పుగిరి బోలు.
2. కింది పద్యాన్ని చదివి సరైన జవాబును గుర్తించండి.
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగాఁ
అపకారికి నుపకారము
నెపమెన్నక చేయువాడె నేర్పరి సుమతీ!
(అ) అపకారి
(క) కీడుచేసేవాడు
(ఖ) మేలు చేసేవాడు
(గ) సాహసం చేసేవాడు
(ఘ) ఏదీకాదు
జవాబు.
(క) కీడుచేసేవాడు
(ఆ) పద్యం ఎవరి గురించి తెలియపరుస్తున్నది ?
(క) ఉపకారి
(ఖ) మమకారం
(గ) అపకారి
(ఘ) నేర్పరి
జవాబు.
(క) ఉపకారి
(ఇ) గొప్ప విషయం
(క) అపకారికి ఉపకారం చేయడం
(ఖ) ఉపకారికి ఉపకారం చేయడం
(గ) అపకారికి అపకారం చేయడం
(ఘ) ఏదీకాదు
జవాబు.
(క) అపకారికి ఉపకారం చేయడం
(ఈ) పద్యంలో ‘తప్పు’ అనే అర్థం వచ్చే పదం
(క) ఎన్నక
(ఖ) నెపము
(గ) విపరీతము
(ఘ) నేర్పరి
జవాబు.
(ఖ) నెపము
(ఉ) పద్యమకుటం
(క) సుమతీ
(ఖ) కుమతీ
(గ) మందమతి
(ఘ) ఏదీకాదు
జవాబు.
(క) సుమతీ
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) తొందరగా సేతువు నిర్మాణం కొనసాగాలని ఉడుత అనుకోవడంలో గల ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
సేతువు నిర్మాణం పూర్తయితే గాని రాముడు సైన్యంతో లంక చేరలేడు. లంకకు వెళ్ళకపోతే అక్కడ రావణుని చెరలో సీతమ్మ కష్టాలు తీర్చలేడు. దుర్మార్గుడైన రావణుని సంహరిస్తే తప్ప లోకాలకు వాని పీడ వదలదు. సీతను విడిపించుకొని తెచ్చుకోవాలంటే వనవాసం గడువుకూడా పూర్తైపోతోంది. గడువు పూర్తయ్యే లోపల అయోధ్య చేరకపోతే భరతుడు ప్రాణాలు వదులుతానని ప్రతిజ్ఞ చేశాడు. కనుక తొందరగా సేతువు నిర్మాణం పూర్తి కావాలని ఉడుత అనుకున్నది.
(ఆ) భక్తితో చేసే చిన్నపనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. సమర్థిస్తూ రాయండి.
జవాబు.
భక్తితో చేసిన చిన్న పనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఉడుత రాముని మీద భక్తితో తన శక్తిమేరకు సాయం చేయాలనుకుంది. వానర వీరులు చేసే పనిలో ఉడుత చేయగలిగిన పని చాలా తక్కువ. ఐనా ఉడుత నిరాశ పడకుండా సముద్రం నీటిలో మునిగి గట్టుమీద ఇసుకలో పొర్లి వంతెన మీద ఆ ఇసుక దులిపింది. ఇక్కడ ఎంత ఇసుక మోసింది అనికాదు చూడాల్సింది. ఉడుత భక్తిని గమనించాలి. శ్రీరాముడు గమనించాడు. తన వద్దకు ఉడుతను రప్పించుకొని తన కుడి చేతితో ప్రేమగా దాని వీపు మీద నిమిరాడు. ఆయన వేళ్ళ గుర్తులు దాని వీపు మీద మూడు చారలుగా ఏర్పడ్డాయి. ఇప్పటికీ అవి ముచ్చట గొలుపుతూ శాశ్వతంగా ఉండి పోయాయి.
(ఇ) రాముడు ఉడుత చేసిన సహాయాన్ని మెచ్చుకొని వీపును దువ్వాడు. అట్లాగే మీరు చేసిన సహాయాన్ని ఇతరులు మెచ్చుకొన్న సంఘటన గురించి రాయండి.
జవాబు.
మా నాన్నగారు నా పుట్టిన రోజున, నీ స్నేహితులందరినీ పిలుచుకో. పార్టీ ఇద్దువు గాని అన్నారు. నేను నాన్నగారి నడిగి అనాథాశ్రమంలోని పిల్లల్ని పిలిచి వారితో కలిసి పుట్టిన రోజు చేసుకున్నాను. వారందరికీ మిఠాయిలు, పళు కేకు పంచి పెట్టాను. ఆటలు ఆడుకున్నాము. వారందరికీ బహుమతిగా పెన్నులు, పుస్తకాలు ఇచ్చాను. వాళ్ళెంతో సంతోషించారు. నేను చేసిన ఈ పనికి నా తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, ఇరుగు పొరుగు వారు ఎంతో మెచ్చుకున్నారు. ఒక మంచి పని చేశానని నాకు గర్వమూ, ఆనందమూ కలిగాయి.
(ఈ) ఈ పాఠం ఆధారంగా గోన బుద్ధారెడ్డి కథ చెప్పిన విధానం ఎట్లా ఉన్నది ? వివరించండి.
జవాబు.
ఈ పాఠం ద్విపద ఛందస్సులో ఉన్నది. చక్కగా పాడుకోవచ్చు. ఇక కవి ఇందులో చెప్పిన కథ ఉడుత చేసిన సాయం. ఇందులో భాష భావం తేలికగా అర్థమయ్యేటట్లు తేలికైన పదాలు ఉపయోగించాడు కవి. ఉడుత చేసిన పని చదువుతుంటే ఎదురుగా జరుగుతున్నట్లే అనిపిస్తుంది. అంత స్పష్టమైన వర్ణనలు. నాకీ పాఠం ఎంతగానో నచ్చింది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
(అ) ఉడుత సాయం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి.
జవాబు.
సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానరభల్లూకాలు నలుని చేతికి రాళ్ళూ, రప్పలూ, కొండలూ తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడుత “తొందరగా సేతువు నిర్మాణం జరగాలి. అందుకోసం ఈ వీరులకు చేయూతనిస్తాను.” అంటూ శ్రీరాముని పాదపద్మాలను మనసులో నిల్పుకొన్నది. అతని ఎదురుగా, నిర్మలభక్తితో సముద్రంలో మునిగి వచ్చి యిసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి, తన ఒంటికి అంటిన యిసుకను రాలుస్తున్నది. మళ్ళీ సముద్రంలో మునిగి యిసుక నంటించుకొని వారధిపై విదిలిస్తూ ఉన్నది. భక్తితో ఉడుత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూసి, తమ్ముడు లక్ష్మణుని పిలిచి “నా పై భక్తితో ఉడుత సముద్రజలాల్లో తడిసి యిసుకనంటించుకొని రాళ్ళమధ్య విదిలిస్తున్నది.
బలవంతులైన వానరులు కొండలను, వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత ? తన శక్తి యెంత ? అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది. చూశావా?” అని అన్నాడు. అది విన్న లక్ష్మణుడు “నీ పాదాలను మనసులో నిలిపి, భక్తితో, గడ్డిపోచంత (కొంచెం) పనిచేసినా అది కొండతో సమానం. భక్తే ప్రధానం కదా!” అన్నాడు. శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడుతను తన దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. సుగ్రీవుడు ఉడుతను తెచ్చి రామునికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడుతను పలువిధాల పొగడి తన కుడిచేతితో దాని వీపుపై దువ్వాడు. ఉడుత వీపుపై మూడు రేఖలు చూడడానికి అందంగా, ఆనందకరంగా ఏర్పడ్డాయి.
IV. సృజనాత్మకత/ప్రశంస
ప్రశ్న 1.
ఈ పాఠాన్ని గేయ రూపంలో రాయండి.
జవాబు.
ఉడుత సాయం (గేయం)
చిన్ని ఉడుత చూడండి ఎంత ముద్దుగా ఉందో
వీపుమీద నల్లనైన – మూడు చారలున్నాయి
ఎక్కడివీ ఈ చారలు – కనులకింపు గొలుపుతూ
చూపు తిప్పుకోనీవు – ముచ్చటైన చారలు
రాముడిచ్చినాడమ్మా – ఉడుతకు ఈ అందాలు
మునివేళ్ళతో వీపునిమిరి తన ప్రేమను అద్దినాడు
ఎందుకంత ప్రేమంటే – దాని కథను వినండి
“రాముడు లంకను జేరగ – కోతులు వంతెన గట్టెను
పెద్ద పెద్ద బండరాళ్ళు – మోయుచున్న కోతులగని
శ్రీరాముని కార్యంలో – నేను ఏమి చెయ్యగలను ?
అని ఆలోచించి ఉడుత – శ్రీరాముని పాదాలను
భక్తితోడ మదిని దలచి సముద్రంపు నీటమునిగి
తన ఒంటిని తడుపుకొని – గట్టుమీద ఇసుకలోన
అటూ ఇటూ పొరలాడి – అంటిన ఆ ఇసుక తెచ్చి
మరల నీట మునిగింది వంతెనపై దులిపింది
అలుపులేక సొలుపులేక – మరల మరల తిరిగింది
అది చేసిన సాయానికి అది చూపిన వినయానికి
ముచ్చటపడి శ్రీరాముడు – మునివేళ్ళతో నిమిరెదాని
వీపున నల్లని చారలు – శాశ్వతముగ నిలచిపోయె
2. కింది బొమ్మను చూసి సంభాషణలు రాయండి.
జవాబు.
చీమ : ఉడుతమ్మా! రా. ఏంటిలా వచ్చావు ?
ఉడుత : ఊరికెనే నిన్నుచూసి పోదామని వచ్చాను చీమమ్మా!
చీమ : చాలా సంతోషం. ఇదిగో ఈ వేరుసెనగ పప్పులు తిను.
ఉడుత : ధన్యవాదాలు. నీ దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందా ఆహారం.
చీమ : అవును. కష్టపడి తెచ్చుకున్నదాంట్లో కొంత తిని కొంత దాచుకుంటాం.
ఉడుత : అలాగా! దాచుకోటానికి, ఉండటానికి మీరు కట్టుకున్న ఇళ్ళు ఎంత బాగున్నాయో!
చీమ : మేమంతా కలిసి ఇలా కట్టుకుంటాం. కలిసి మెలిసి ఉంటాం.
ఉడుత : మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి చీమమ్మా !
చీమ : నీవు మాత్రం తక్కువేంటి ? నీ భక్తితో రామయ్య తండ్రిని మెప్పించావు. ఆయన వేళ్ళ గుర్తులు ఇప్పటికీ మోస్తున్నావు. వాటివల్ల నీకెంత అందమొచ్చిందో.
ఉడుత : ఆట్టే పొగడకు. నాకు సిగ్గుగా ఉంటుంది. మరి నేను వెళ్ళొస్తాను.
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అర్థం వచ్చే మరో రెండు పదాలు ఉన్నాయి. ఆ పదాల కింద గీత గీయండి.
(అ) హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్టు శిఖరాన్ని పూర్ణిమ, ఆనంద్లు ఎక్కి, ఆ అద్రిపై భారత జాతీయపతాకం ఎగురవేసి, కొండంత కీర్తిని పొందారు.
(ఆ) రామాపురానికి, రంగాపురానికి మధ్యన వంతెన కట్టడంవల్ల రెండు గ్రామాల ప్రజలు ఆ వారధి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆ సేతువు పుణ్యంకొద్ది ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది.
(ఇ) ప్రజాధనం పచ్చికలా మేసినవాణ్ణి గడ్డిపోచలా భావించి, వాడికి తృణమే తిండిగా పెట్టాలి.
(ఈ) సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి. అదే వార్ధిలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వనధి నీటి నుండే ఉప్పు లభిస్తుంది.
2. ఈ కింది వాక్యాలలోని ప్రకృతి – వికృతులను గుర్తించి రాయండి.
ఉదా ॥ హనుమంతుడు రాముణ్ణి భక్తితో కొలిచాడు. ఆ బత్తి ఎన్నటికీ తరగదు. భక్తి – బత్తి
(అ) మనుషులు దవ్వుగా ఉన్నా మమతలు దూరం కాకూడదు.
జవాబు.
దూరం (ప్రకృతి) దవ్వు (వికృతి)
(ఆ) స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నావంతు సహాయం చేస్తున్నాను. మీరూ నాలాగే సాయం చెయ్యండి.
జవాబు.
సహాయం (ప్రకృతి) సాయం (వికృతి)
(ఇ) వానరాల శక్తితో పోలిస్తే ఉడుత శక్తి కొంచెమే అయినా ఆ కొంచెం సత్తువతోనే అది వారధి కట్టడంలో సాయం చేసింది.
జవాబు.
శక్తి (ప్రకృతి) – సత్తువ (వికృతి)
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. ఖాళీలను సరైన భాషాభాగాలతో పూరించి అవి ఏ భాషాభాగాలో రాయండి.
(అ) రవి పుస్తకం తెరిచి పాఠం చదివాడు. (క్రియ)
(ఆ) రాముడు సీత తో కలిసి అరణ్యానికి పోయాడు. (నామవాచకం)
(ఇ) కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు. అతడు చాలా వేగంగా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు. (సర్వనామం)
(ఈ) అయ్యో! అంతపని జరిగిందా ? (అవ్యయం)
(ఉ) పండుగరోజు విమల కొత్త బట్టలు కట్టుకున్నది. (విశేషణం)
2. కింది వాక్యాల్లో విభక్తి ప్రత్యయాలను గుర్తించి వాటికింద గీతలు గీయండి. అవి ఏ విభక్తులో బ్రాకెట్లలో రాయండి.
(అ) మౌనిక మల్లెపూలను ధరించినది. (ద్వితీయా విభక్తి)
(ఆ) రాజేందర్ అడవికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చాడు. (షష్ఠీ విభక్తి)
(ఇ) చిన్నపిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి. (తృతీయా విభక్తి)
(ఈ) కీర్తన ఇంజనీరింగ్ చదవడంకోసం బాసర వెళ్ళింది. (చతుర్థీ విభక్తి)
(ఉ) సహాయం చేయడంవల్ల రహీం కష్టాల్లోంచి గట్టెక్కాడు. (పంచమీ విభక్తి)
3. కింది పేరాలో ఉన్న విభక్తి ప్రత్యయాలను, భాషాభాగాలను గుర్తించి పట్టికలో రాయండి.
పూర్వం ఉజ్జయినీ నగరమందు విక్రమార్కుడనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించేవాడు. ఒకసారి ఆయన దేశసంచారం కొరకు బయలుదేరి అనేక ప్రాంతాలు తిరుగుతూ, కాశీపట్టణం చేరుకున్నాడు. అక్కడ పవిత్రమైన గంగానదిలో స్నానంచేసి, అక్కడి గుడిలో దేవతలను పూజించి, గుడినుంచి బయటకు వస్తుండగా చెవులకు ఇంపైన సంగీతం వినబడింది. ఆ మధురమైన సంగీతం వినవచ్చేవైపు నడిచాడు. అక్కడ ఒక తోటలో ఒక స్త్రీ, స్నేహితురాళ్ళతో కలిసి వీణను వాయిస్తూ పాట పాడుతున్నది. ఆ పాటను వింటూ రాజు చాలా ఆనందపడి ఆ స్త్రీకి రత్నాలహారాన్ని బహుమానంగా ఇచ్చారు.
ప్రత్యయము | విభక్తి పేరు | భాషాభాగ పదం | భాషాభాగం పేరు |
అందు | సప్తమీ విభక్తి | ఉజ్జయిని | నామవాచకం |
ను | ద్వితీయా విభక్తి | విక్రమార్కుడు | నామవాచకం |
కొరకు | చతుర్థీ విభక్తి | పూర్వం | అవ్యయం |
లు, డు | ప్రథమా విభక్తి | అతడు | సర్వనామం |
లో,కు | షష్ఠీ విభక్తి | ఆయన | సర్వనామం |
తో | తృతీయా విభక్తి | పవిత్రమైన | విశేషణం |
ఇంపైన | విశేషణం | ||
మధురమైన | విశేషణం | ||
అక్కడ | అవ్యయం | ||
ఉండేవాడు | క్రియ | ||
పరిపాలించు | క్రియ | ||
తిరుగుతూ | క్రియ | ||
చేరుకున్నాడు | క్రియ | ||
పూజించి | క్రియ | ||
చేసి | క్రియ | ||
వస్తుండగా | క్రియ | ||
నడిచాడు | క్రియ | ||
పాడుతున్నది | క్రియ | ||
కాశీపట్టణం | నామవాచకం | ||
గంగానది | నామవాచకం |
ప్రాజెక్టు పని:
రామాయణంలో పాత్రల పేర్లు తెలుసుకొని రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
1. ప్రాజెక్టు శీర్షిక : రామాయణంలోని పాత్రల పేర్లు తెలుసుకొని నివేదిక రాయడం.
2. సమాచార సేకరణ : (అ) సమాచారం సేకరించిన తేది : XXXX
(ఆ) సమాచార వనరు : గ్రంథాలయం
(ఇ) చదివిన పుస్తకం : వాల్మీకి రామాయణం
3. సేకరించిన విధానం: నేను మా పాఠశాల గ్రంథాలయంలో రామాయణం పుస్తకాన్ని చదివి సమాచారాన్ని సేకరించాను.
4. నివేదిక :
శ్రీరాముడు : దశరథమహారాజు, కౌసల్యల కుమారుడు. మంచిగుణములు కలవాడు, ఆపదల్లో తొణకని వాడు, ధర్మమూర్తి. ఆడినమాట తప్పనివాడు. పెద్దల యందు గౌరవం, దేవతలు, మునులయందు భక్తి కలవాడు. తనమంచి గుణాల చేత మహానీయుడుగా ఖ్యాతి పొందినవాడు.
సీత : జనక మహారాజు కుమార్తె, శ్రీరాముని అర్థాంగి. భర్తతో పాటు అరణ్యవాసం చేసింది. రావణుడు అవహరించినపుడు అశోకవనంలో భర్తనే తలచుకుంటూ గడిపింది. రాముడు రావణున్ని సంహరించి తనను తీసుకువెళ్ళాలని కోరుకుంది. అగ్ని ప్రవేశం చేసి తన పై నిందను తొలగించుకున్న ఆదర్శనారి సీత.
హనుమంతుడు : సుగ్రీవుని మంత్రి. శ్రీరామునికి, సుగ్రీవునితో మైత్రి కుదిర్చినవాడు. సీతను వెతకడానికి వెళ్ళి, సీత జాడను తెలిసికొన్నవాడు. “చూసి రమ్మంటే కాల్చివచ్చినవాడు” హనుమంతుడు. శ్రీరామునికి పరమభక్తుడు.
లక్ష్మణుడు : దశరథమహారాజు, సుమిత్రల కుమారుడు. రాముణ్ణి అన్నివేళలా అనుసరించేవాడు. అన్నదమ్ముల బంధానికి ప్రతీక రామలక్ష్మణులు. అన్నతో పాటు అడవులకు వెళ్ళాడు.
5. ముగింపు : రామాయణంలోని పాత్రల ద్వారా రాముని గొప్పదనం, సీత ఆదర్శనారి అని తెలుసుకున్నాను. రామలక్ష్మణులు అన్నదమ్ముల బంధానికి ప్రతీకలు. హనుమంతుడు స్వామి భక్తి పరాయణుడు అని తెలుసుకొన్నాను.
TS 6th Class Telugu 8th Lesson Important Questions ఉడుత సాయం
ప్రశ్న 1.
వానరులు సేతువును నిర్మించిన విధం తెల్పండి.
జవాబు.
కోతులూ, ఎలుగుబంట్లూ పెద్ద పెద్ద చెట్లనూ, బండరాళ్ళనూ మోసుకొచ్చి నలుని చేతికిస్తున్నారు. నలుడు వాటిని సముద్రం మీదికి విసురుతున్నాడు. అలా రాళ్ళను వరుసగా పేర్చుతూ వంతెన నిర్మిస్తున్నారు. ఆ మహావీరులకు తన చేతనైనంత సాయం చేయాలని ఉడుత ఆశపడింది. సముద్రం నీళ్ళలో ఒళ్ళు తడుపుకొని ఇసుకలో పొర్లాడి ఆ ఇసుకను వంతెన మీద రాల్చి ఉడుత సేతు నిర్మాణంలో సాయపడింది.
ప్రశ్న 2.
శ్రీరాముడు లక్ష్మణునితో ఏమన్నాడు?
జవాబు.
శ్రీరాముడు ఉడుత చేస్తున్న పనిని శ్రద్ధగా చూశాడు. ఆయనకు ఎంతో ముచ్చట వేసింది. తమ్ముడు లక్ష్మణుని వంక చూసి ఇలా అన్నాడు. “ఆ ఎదురుగా ఒక ఉడుత పొర్లాడుతున్నది చూడు. అది నా మీద గల గొప్ప భక్తితో తన శరీరాన్ని నీటితో తడుపుకొని గట్టుమీదికి వెళ్ళి ఇసుకలో పొర్లాడి వచ్చి కొండరాళ్ళ మధ్య ఇసుక రాలుస్తున్నది. అంత గొప్ప కపి వీరులు తరువులు, గిరులూ మోస్తుంటే తానెంత అని చిన్నబుచ్చుకోకుండా ప్రేమతో సాయం చేస్తున్నది చూశావా ?” అన్నాడు.
ప్రశ్న 3.
ఉడుత సాయం పాఠం నీకెందుకు నచ్చిందో వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.
ఖమ్మం,
తేది : XXXX.
ప్రియమైన దిలీపుకు,
నీ స్నేహితుడు కృష్ణ రాస్తున్న లేఖాంశాలు. నేను బాగానే చదువుతున్నాను. నీవెలా ఉన్నావు ? ఆరవ తరగతి పుస్తకంలో ఉడుత సాయం అనే పాఠం చదివాను. నాకెంతో నచ్చింది. ఆ పాఠం విశేషాలు నీకు వివరించాలని ఈ లేఖ రాస్తున్నాను.
ఈ పాఠం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణంలోనిది. రాముడు రావణునిపై యుద్ధానికి బయలుదేరాడు. లంక చేరాలంటే సముద్రం దాటాలిగదా! వానరులంతా కలిసి వారధి కట్టసాగారు. కోతి అనగానే మనమెంతో చులకనగా చూస్తాం. కోతులే లేకపోతే రామాయణమే లేదు కదా! అనిపించింది.
అది చూసిన ఒక ఉడుత తానుకూడా రామకార్యంలో పాలు పంచుకోవాలనుకున్నది. తన శరీరం నీటిలో తడిపి ఇసుకలో పొర్లి వంతెనమీద దులుపుతూ శ్రమ పడింది. అప్పుడు నాకనిపించింది. ఉడుతకున్నపాటి జ్ఞానం కూడా మనుషులకు లేదు కదా! అని.
ఏ పనైనా ఒకరికొకరు తోడై మూకుమ్మడిగా చేస్తే ఎంతో సులభంగా పూర్తవుతుంది కదా అనుకున్నాను. నోరులేని జంతువులకే ఇంత సంఘీభావం ఉంటే మనుష్యులమైన మనకు ఎంత ఐకమత్యముండాలి అనిపించింది. ఏమైనా ఈ పాఠం మంచి సందేశాన్నిస్తోంది. మరి ఉంటాను. సెలవు. నీ జాబు కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
ఇట్లు,
నీ స్నేహితుడు,
కృష్ణ.
చిరునామా :
కె. దిలీప్,
కేరాఫ్ శ్రీ సూర్యనారాయణ,
ఇంటి నెం.22-10-56, కోవెల వీధి,
భద్రాచలం.
అర్థాలు:
- అంఘ్రి = కాలు
- అనఘుడు = పాపము లేనివాడు
- ఉదధి = సముద్రం
- చూడ్కులు = చూపులు
- తడయక = ఆలస్యం చేయకుండా
- తృణము = గడ్డి
- త్రిరేఖలు = మూడు గీతలు
- నిర్మలం = మురికిలేని
- పొడగాంచి = రూపు చూసి
- బలీయులు = బలం కలవారు
- మేను = శరీరం, ఒళ్ళు
- వార్ధి = సముద్రం
- శక్తి = బలం
- శిల = రాయి
- సేతువు = వంతెన
ప్రకృతి – వికృతి
- దూరం – దవ్వు
- నిజము – నిక్కము
- భక్తి – బత్తి
- శక్తి – సత్తువ
- సముద్రం – సముద్రం
- సహాయం – సాయం
- స్నానం – తానం
- స్వామి – సామి
- కులము – కొలము
పర్యాయపదాలు
- ఉదధి = సముద్రం, వనధి, సాగరం, రత్నాకరం
- వనధి = వార్ధి, సముద్రం, అంబుధి
- కపి = కోతి, మర్కటం, వానరం
- జలం = నీరు, ఉదకం, సలిలం
- తృణం = గడ్డి, పచ్చిక, గరిక
- వంశం = సంతతి, గోత్రం, కులం
- గిరి = కొండ, అద్రి, పర్వతం
- ముదము = సంతోషము, ఆనందము
- తెరుగు = విధము, రీతి, పద్ధతి
- మేను = శరీరం, దేహం
- తరువు = చెట్టు, వృక్షము
- యుగ్మము = జంట, జోడు
- అడుగు = పాదము, చరణము
పదజాలం :
I. 1. పిచ్చివాని చూడ్కులు వింతగా ఉన్నాయి. గీతగీసిన పదానికి అర్థం
(A) కోరలు
(B) పనులు
(C) చూపులు
(D) బట్టలు
జవాబు.
(C) చూపులు
2. సింహము తృణము మేయదు. ‘తృణము’ అంటే
(A) తవుడు
(B) గడ్డి
(C) చేను
(D) బట్టలు
జవాబు.
(B) గడ్డి
3. బలియులతో తలపడేటప్పుడు జాగ్రత్త వహించాలి. గీతగీసిన పదానికి అర్థం
(A) శత్రువులు
(B) గొప్పవాళ్ళు
(C) రాక్షసులు
(D) బలవంతులు
జవాబు.
(D) బలవంతులు
4. పిసినారి మెతుకు విదల్చడు. ‘విదల్చడు’ పదానికి అర్థం
(A) దులపడు
(B) కాల్చడు
(C) వెతకడు
(D) తినడు
జవాబు.
(A) దులపడు
5. వనధి నీటితో ఉప్పు తయారుచేస్తారు. ‘వనధి’ అంటే
(A) వనం
(B) చెరువు
(C) సముద్రం
(D) ఉప్పు
జవాబు.
(C) సముద్రం
II. 6. చెట్టుమీది కపిని రాము వెక్కిరించాడు. ఆ మర్కటానికి కోపం వచ్చింది. ఈ వాక్యాల్లో ‘వానరం’ అనే అర్థం వచ్చే పదాలు
(A) కపి, మర్కటం
(B) చెట్టు, మర్కటం
(C) వెక్కిరించడం, కపి
(D) కోపం, కపి
జవాబు.
(A) కపి, మర్కటం
7. తరువులు ప్రాణ వాయువునిస్తాయి. వృక్షాలను రక్షించాలి. – ఈ వాక్యాల్లో తరువు, వృక్షం అనే పదాలకు అర్థం
(A) గురువు
(B) రక్ష
(C) చెట్టు
(D) ప్రాణం
జవాబు.
(C) చెట్టు
8. తమ్ములు, కమలములు – అనే పదాలకు సమానార్థక నదం
(A) సోదరులు
(B) పద్మాలు
(C) కన్నులు
(D) పూలు
జవాబు.
(B) పద్మాలు
III. 9. ఎంతో దవ్వు నుండి ప్రయాణించి ఇంత దూరం వచ్చారు. ఇందులోని ప్రకృతి – వికృతులు
(A) ఎంతో – ఇంత
(B) దూరం – దవ్వు
(C) ప్రయాణం – చేయడం
(D) వచ్చి – రావడం
జవాబు.
(B) దూరం – దవ్వు
10. ‘శక్తి’ అనే పదానికి వికృతి పదం
(A) సక్తి
(B) సగితి
(C) సత్తువ
(D) సత్యం
జవాబు.
(C) సత్తువ
11. ‘సామి’ అనే వికృతికి ప్రకృతి
(A) సామ్యం
(B) శ్యామి
(C) ఆసామి
(D) స్వామి
జవాబు.
(D) స్వామి
12. ‘సముద్రం’ అనే ప్రకృతికి వికృతి పదం
(A) సాగరం
(B) సంద్రం
(C) సంగరం
(D) సారం
జవాబు.
(B) సంద్రం
వ్యాకరణం
IV. 13. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని……………… అంటారు.
(A) సంయుక్తాక్షరం
(B) ద్విత్వాక్షరం
(C) సంక్లిష్టాక్షరం
(D) సరళాక్షరం
జవాబు.
(B) ద్విత్వాక్షరం
14. సంయుక్తాక్షరంలో
(A) రెండు వేర్వేరు హల్లులుంటాయి
(B) ఒక అచ్చు, ఒక హల్లుంటుంది
(C) ఒకే హల్లు రెండుసార్లు పలుకుతుంది
(D) మూడు హల్లులుంటాయి
జవాబు.
(A) రెండు వేర్వేరు హల్లులుంటాయి
15. నామవాచకానికి బదులుగా వాడే పదం
(A) క్రియ
(B) నామవాచకం
(C) సర్వనామం
(D) విశేషణం
జవాబు.
(C) సర్వనామం
16. లింగ, వచన, విభక్తులు లేని భాషాభాగం
(A) క్రియ
(B) విశేషణం
(C) సర్వనామం
(D) అవ్యయం
జవాబు.
(D) అవ్యయం
17. నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది
(A) అవ్యయం
(B) క్రియ
(C) విశేషణం
(D) లింగం
జవాబు.
(C) విశేషణం
18. అంఫ్రి -గీతగీచిన అక్షరంలోని ధ్వనులు
(A) అం + ఘ్ + ఇ + ర్
(B) ఘ్ + ర్ + ఇ
(C) ఘి + ర్ + ఇ
(D) ఘ + ర + ఇ
జవాబు.
(B) ఘ్ + ర్ + ఇ
19. ‘ట్ + ట్ + ఎ’ కలిస్తే ఏర్పడే అక్షరం
(A) ట్ట్
(B) ట్టి
(C) ట్టె
(D) ఎట్టి
జవాబు.
(C) ట్టె
20. ‘చేర్చి’ అనే పదంలో ‘ర్చి’ అనే అక్షరంలోని హల్లులు
(A) ర్, చ్
(B) చ్, ర్
(C) చ్, రి
(D) చి, రి
జవాబు.
(A) ర్, చ్
21. ఉన్నత – ఈ పదంలో గీతగీచిన అక్షరంలోని హల్లులు
(A) న, న
(B) న్, అ
(C) న్ + న్ + అ
(D) న్, న్
జవాబు.
(D) న్, న్
22. గ్+మ్ + అతో ఏర్పడే సంయుక్తాక్షరం
(A) గమ్
(B) గమ
(C) గ్మ
(D) గుం
జవాబు.
(C) గ్మ
23. క బ చ ట త మ య వ స ర ప భ – ఈ అక్షరాల్లోని పరుషాలు
(A) బ, మ, య, భ
(B) త, చ, ప, భ
(C) క, చ, ట, త, ప
(D) బ, భ, మ
జవాబు.
(C) క, చ, ట, త, ప
24. జగడములాడుట వలదని బతిమలాడింది.
(A) జగడము
(B) జ గ డ డు ద బ ది డి
(C) ల, వ
(D) బతిమిలాడు
జవాబు.
(B) జ గ డ డు ద బ ది డి
V. ఈ క్రింది బాలగేయాన్ని చదివి తప్పొప్పులు గుర్తించుము.
బడాయి పిల్లి లడాయి కెళ్ళి
మిడతను చంపి ఉసూరన్నది
ఎలుకను చంపి ఏనుగన్నది
సింహం తానని పొంగిన పిల్లి
కుక్కను చూసి ఒకటే పరుగు
ప్రశ్నలు:
25. బడాయి పులి లడాయి కెళ్ళింది ( తప్పు)
26. మిడతను చంపి ఉసూరన్నది ( ఒప్పు )
27. ఏనుగును చంపి ఎలుక అనుకున్నది ( తప్పు)
28. పిల్లి సింహంతానని పొంగిపోయింది ( ఒప్పు )
29. పిల్లి కుక్కను చూసి పరుగుతీసింది. ( తప్పు)
VI. ఈ క్రింది పద్యాన్ని చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
లావు గలవాని కంటెను
భావింపగ నీతి పరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ!
ప్రశ్నలు:
30. పై పద్యంలో గజమును దేనితో పోల్చారు ?
జవాబు.
లావు గలవానితో
31. పై పద్యం ప్రకారం ఎవరు బలవంతుడు ?
జవాబు.
నీతి పరుడు
32. గజమును నియంత్రించువాడిని ఏమంటారు ?
జవాబు.
మావటి వాడు
33. పై పద్యంలో మకుటమేది ?
జవాబు.
సుమతీ
34. ఈ పద్యం రాసిన కవి ఎవరు ?
జవాబు.
బద్దెన
VII. ఈ క్రింది గద్యాని చదివి అర్థవంతమైన ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
‘తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాల్లో మనుచరిత్రను మొట్టమొదట లెక్క పెడతారు. ఆంధప్రబంధ కవులలో ప్రథమ పూజ అల్లసాని పెద్దన గారికే చేస్తారు. ఆది కవులు, కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు, కవిసార్వభౌములు మొదలైన ఆజానుబాహులు ఎందరున్నా, మన సాహితీ రంగంలో ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఆంధ్రకవితా పితామహ బిరుదాంకితులు అల్లసాని పెద్దనగారే. దీనికి కారణం శ్రీకృష్ణదేవరాయల వారు అందరికన్నా పెద్దన గారికి పెద్ద పీట వేయడమే కాదు. ఆయన సహజంగా ఉన్నతుడు. దానికి కారణం ఆయనలో పూర్వకవుల శుభలక్షణాలన్నీ కేంద్రీకృతం అయ్యాయి.
ప్రశ్నలు:
1. తెలుగు పంచకావ్యాల్లో మొదటి కావ్యం ఏది ?
2. ఆంధ్ర ప్రబంధ కవులలో ప్రధముడు ఎవరు ?
3. అల్లసాని పెద్దనకు గల బిరుదు ఏమి ?
4. పెద్దన సహజంగా ఉన్నతుడు కావడానికి కారణం ఏమిటి ?
5. పెద్దన గారిని ఆదరించిన రాజు ఎవరు ?
గేయం – అర్ధాలు
నలు చేతిఁ కొసగఁ నా నలుఁ డవి పుచ్చి
తలకొని కట్ట నా తరి యొక్క యుడుత
గొబ్బున సేతువు గొనసాగవలయు
నిబ్బలియులకుఁ దోడేసి గావింతు
ననుచు శ్రీరాముని యడుగుఁ దామరలు
మనమునఁ జేర్చి యమ్మనుజేశు నెదుర
నచ్చపు భక్తితో నట వారి మునిఁగి
వచ్చి తా నిసుకలో వడిఁ బొరలాడి
తడయక చనుదెంచి తన మేని యిసుక
వడిగట్టపై రాల్చి వనధిలో మునిఁగి
తేలి గట్టున కేగి తిరుగంగఁ బొరలి
వాలిన భక్తితో వచ్చి విదుల్చె
నివ్విధంబున నుండ నినకులాధిపుఁడు
దవ్వులఁ బొడగాంచి తమ్మునిఁ జూచి
పొందుగా లక్ష్మణ పొర్లదే చూడు
ముందు నొక తరుమూషకం బెలమి
అర్థాలు :
నలు చేతికి + ఒసగ = నలుని చేతికివ్వగా
నలుడు + అవి పుచ్చి = నలుడు వాటిని వేసి
తలకొని = ప్రయత్నించి
కట్టన్ = వారధి కట్టగా
ఆతరి = ఆ సమయంలో
ఒక్క + ఉడుత = ఒక ఉడుత
గొబ్బున = తొందరగా
సేతువు = వంతెన
కొనసాగవలయు = పూర్తి కావాలి
ఈ + బలియులకు = ఈ బలవంతులైన వానరులకు
తోడ + ఏసి = తోడుగా కొంచెము వేసి
కావింతు = పనిచేస్తాను.
అనుచు = అంటూ
శ్రీరాముని = శ్రీరామచంద్రునియొక్క
అడుగు + తామరలు = పాద పద్మములను
మనమునన్ + చేర్చి = మదిలో నిలిపి
ఆ + మనుజ + ఈశు + ఎదుర = ఆ రాజు ఎదురుగా
అచ్చపు భక్తితో = నిజమైన భక్తితో
అట = అక్కడున్న
వారి మునిగివచ్చి = సముద్రంలో మునిగి బైటకొచ్చి
తాను + ఇసుకలోపడి = తాను ఆ ఇసుకలో పడుకొని
పొరలాడి = బాగా పొర్లి
తడయక = ఆలస్యం చేయకుండా
చనుదెంచి = వచ్చి
తనమేని ఇసుక = తన శరీరంపై నున్న ఇసుకను
వడిన్ = వేగంగా
కట్టపైరాల్చి = ఆనకట్టపై దులిపి
వనధిలో మునిగి = సముద్రంలో మునిగి
తేలి = పైకి లేచి
గట్టునకు + ఏగి = గట్టుమీదకొచ్చి
తిరుగంగన్ + పొరలి = మళ్ళీ పొర్లాడి
వాలిన భక్తితో = అతిశయించిన భక్తితో
వచ్చి విదుల్చె = కట్టపై కొచ్చి విదిలించింది
ఈ + విధంబునన్ + ఉండ = ఇలా జరుగుతుండగా
ఇనకులాధిపుడు = సూర్యవంశంలో గొప్పవాడైన శ్రీరాముడు
దవ్వులన్ = దూరము నుంచి
పొడగాంచి = చూసి
తమ్ముని + చూచి = తమ్ముని వంకచూసి
పొందుగా = ప్రేమగా
లక్ష్మణ = ఓ లక్ష్మణా!
చూడు = అటుచూడు
ముందర = మన ముందు
ఒక తరుమూషికంబు = ఒక చెట్టుపై నుండే ఎలుక (ఉడుత)
ఎలమి = సంతోషంగా
II. నామీఁద భక్తి యున్నతగతి బూనిఁ
తా మేను జలముల దడపి గట్టునకు
జని వేగ నిసుకపైఁ జిల్లాడి తిరుగఁ
జనుదెంచి కొండల సందున రాల్చి
కరమొప్పుచున్నది కపికులాధీశు
లురుశక్తి దరు గౌరు లొగి దెచ్చుచోట
దా నెంత యని మదిదలపక ప్రేమ
బూని సహాయమై పొదలుచున్నదియు
కనుగొంటివే యన గమలాప్త వంశ!
కనుగొంటి భవ దంఘికమల యుగ్మమును
నెవ్వడు మదినిల్పి యెసగుఁ దృణంబు
నవ్వేల్పు గిరిబోలు ననిన గాకున్నె
కావున భక్తియ కారణం బనఘ
ననవుడు ముదమంది నలినాప్తసుతుని
గనుగొని మఱి దాని గనుగొను వేడ్క,
బెనగొనుచున్నది ప్రేమ నిచ్చటికి
దెమ్మన్న వేగంబె దెచ్చి సుగ్రీవు
డమ్మహాత్ముని చేతి కందియిచ్చుటయు
బలుదెఱంగుల జాల బ్రస్తుతిజేసి
కలిత దక్షిణకరాగ్రమున దువ్వుటయు
నల యుడుతకు వెన్క నమరెఁ ద్రిరేఖ
చులుకనై చూడ్కుల సుఖకరంబుగను
అర్థాలు :
ఉన్నతిగన్ = గొప్ప మార్గమైన
నామీద భక్తి = నాయందు భక్తిని
పూని = వహించి
తాన్ = ఆ ఉడుత
మేను = తన శరీరాన్ని
జలములన్ + తడిపి = నీటితో తడుపుకొని
గట్టునకున్ + చని = గట్టుమీదికెళ్ళి
వేగన్ = తొందరగా
ఇసుకపైనా చల్లాడి = ఇసుకమీద పొర్లాడి
తిరుగన్ = మరల
చనుదెంచి = వచ్చి
కొండలసందున = బండరాళ్ళ మధ్యలో
రాల్చి = రాలుస్తూ
కరము = మిక్కిలి
ఒప్పుచున్నది = చక్కగా ఉన్నది
కపికుల+అధీశులు = వానర శ్రేష్ఠులు
ఉరు శక్తిన్ = గొప్ప ప్రయత్నముతో
తరుగిరులు = చెట్లు, కొండలు
ఒగిన్ = వరుసగా
తెచ్చుచోట = తెచ్చేచోట
తాను + ఎంత + అని = తనెంతలే అల్పప్రాణిని అని
మదిన్ + తలపక = మనసులో అనుకోకుండా
ప్రేమబూని = ఎంతో ప్రేమతో
సహాయము + ఐ = సహాయం చేస్తూ
పొదలుచున్నది = తిరుగుతున్నది
కనుగొంటివి + ఏ = చూశావా ?
అనన్ = అని రాముడనగా
కమల + ఆప్తవంశ = సూర్యవంశంలో పుట్టినవాడా!
కనుగొంటి = చూశాను
భవత్ = నీయొక్క
అంఘ్రికమల = పాదపద్మములు
యుగ్మమున్ = జంటను
ఎవ్వడు = ఎవరైతే
మదినిల్పి = మనసులో ఉంచుకొని
ఎసగన్ = ఉంటాడో
తృణంబున్ = గడ్డి పరక కూడా
ఆవేల్పుగిరిన్ = ఆ మేరు పర్వతమును
కావున = అందుచేత
భక్తి + అ = భక్తియే
కారణంబు = అన్నిటికి మూలం
కాకున్నె = కదా!
అనినన్ = అని లక్ష్మణుడనగా
ముదము + అంది = సంతోషించి
నలిన + ఆప్తసుతుని = సూర్యపుత్రుడగు సుగ్రీవుని
కనుగొని = చూసి
మరి దానిస్ = ఆ ఉడుతను
కనుగొను = చూడవలెనను
వేడ్కొ = కోరిక
పెనగొనుచున్నది = అధికమౌతున్నది
ప్రేమన్ = ప్రేమతో
ఇచ్చటికి తెమ్ము + అన్న = ఇక్కడికి తీసుకురా అనగా
సుగ్రీవుడు = వానర రాజైన సుగ్రీవుడు
తెచ్చి = ఉడుతను తెచ్చి
ఆ మహాత్ముని = ఆ శ్రీరాముని
చేతికి + అంది + ఇచ్చుటయు = చేతిలో పెట్టగా
పలుతెరగుల = అనేక విధములుగా
చాలాప్రస్తుతి చేసి = మిక్కిలిగా మెచ్చుకొని
కలిత దక్షిణకర అగ్రమున = మేలైన కుడిచేతి వేళ్ళతో
దువ్వుటయు = నిమురగానే
అల ఉడతకు = ఆ ఉడుతకు
వెన్కన్ = వీపుమీద
త్రిరేఖ = మూడు గీతలు
చూడ్కుల సుఖకరముగా = చూడడానికి అందంగా
చులకనై = తేలికగా
అమరెన్ = ఏర్పడినాయి
తాత్పర్యం:
సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానరభల్లూకాలు నలుని చేతికి రాళ్ళూ, రప్పలూ, కొండలూ తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడుత “తొందరగా సేతువు నిర్మాణం జరగాలి. అందుకోసం ఈ వీరులకు చేయూతనిస్తాను.” అంటూ శ్రీరాముని పాదపద్మాలను మనసులో నిల్పుకొన్నది. అతని ఎదురుగా, నిర్మలభక్తితో సముద్రంలో మునిగివచ్చి యిసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి, తన ఒంటికి అంటిన యిసుకను రాలుస్తున్నది. మళ్ళీ సముద్రంలో మునిగి యిసుక నంటించుకొని వారధిపై విదిలిస్తూ ఉ న్నది.
భక్తితో ఉడుత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూసి, తమ్ముడు లక్ష్మణుని పిలిచి “నాపై భక్తితో ఉడుత సముద్రజలాల్లో తడిసి యిసుకనంటించుకొని రాళ్ళమధ్య విదిలిస్తున్నది. బలవంతులైన వానరులు కొండలను, వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత ? తన భక్తి యెంత ? అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది చూశావా?” అని అన్నాడు. అది విన్న లక్ష్మణుడు “నీ పాదాలను మనసులో నిలిపి, భక్తితో, గడ్డిపోచంత (కొంచెం) పని చేసినా అది కొండతో సమానం. భక్తే ప్రధానం కదా!” అన్నాడు. శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడుతను తన దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. సుగ్రీవుడు ఉడుతను తెచ్చి రామునికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడుతను పలువిధాల పొగడి తన కుడిచేత దాని వీపుపై దువ్వాడు. ఉడుత వీణపై మూడు రేఖలు చూడటానికి అందంగా, ఆనందకరంగా ఏర్పడ్డాయి.
పాఠం నేపథ్యం/ఉద్దేశం:
రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోయాడు. సీతను తిరిగి తీసుకొని వచ్చుటకు రావణునితో రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు. అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించుమని వానర సైన్యాన్ని ఆదేశించాడు. నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట. అతనికి వానరులు రాళ్ళు, చెట్లు, గుట్టలను తెచ్చి ఇస్తున్నారు. ఆ సమయంలో ఒక ఉడుత ఎట్లా సాయం చేయబూనిందో ఈ పాఠంలో చదువుతాం. ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం. అడుగకుండనే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం ‘ద్విపద’ ప్రక్రియకు చెందినది. ద్విపదలో రెండు పాదాలుంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం “రంగనాథ రామాయణం” లోని ‘యుద్ధకాండ’ లోనిది.
కవి పరిచయం:
కవి : గోన బుద్ధారెడ్డి
కాలం : (13వ శతాబ్దం)
రచనలు : తన తండ్రిపేరిట ‘రంగనాథ రామాయణం’ యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచ భూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు.
విశేషాలు : ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులోని శైలి సరళంగా, మధురంగా
ప్రవేశిక:
పరస్పర సహాయసహకారాలు మనుషులకైనా, జంతువులకైనా అవసరం. అయితే సమాజంలో మూడు రకాల వారుంటారు. మొదటి రకం వారు అధములు. వీరు ఎవరైనా సహాయం చేయుమని కోరినా చేయరు. రెండవ రకం వారు మధ్యములు. వీరు ఎవరైనా సహాయం చేయుమని కోరితేనే సహాయం చేస్తారు. మూడవ రకం వారు ఉత్తములు. వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకుతాముగా సహాయం చేస్తారు. ఇట్లాంటి ఉత్తమ లక్షణం గలిగిన ఉడుత గురించి ఈ పాఠంలో చదువుకుందాం.
నేనివి చేయగలనా ?
- పాఠాన్ని రాగ, భావయుక్తంగా పాడగలను. అవును/ కాదు
- అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించగలను. అవును/ కాదు
- పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. అవును/ కాదు
- ఇతరుల అవసరానికి సహాయం చేయడంలో గల తృప్తిని వివరిస్తూ వ్యాసం/గేయం రాయగలను. అవును/ కాదు