Telangana SCERT 6th Class Telugu Guide Telangana 11th Lessonపల్లెటూరి పిల్లగాడా! Textbook Questions and Answers.
పల్లెటూరి పిల్లగాడా! TS 6th Class Telugu 11th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.
పై బొమ్మలో సైకిలు యజమాని, బాల కార్మికుడు ఉన్నారు.
ప్రశ్న 2.
పిల్లవాడు ఏం చేస్తున్నాడు ?
జవాబు.
పిల్లవాడు సైకిల్ ట్యూబు బాగుచేస్తున్నాడు.
ప్రశ్న 3.
ఆ పిల్లవాడిని చూస్తే మీకేమనిపిస్తున్నది ?
జవాబు.
ఆ పిల్లవానిని చూస్తే అయ్యో పాపం అని అనిపిస్తుంది.
ప్రశ్న 4.
ఇట్లాంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు ?
జవాబు.
ఇట్లాంటి వాళ్ళ జీవితాలు నిరాశతో, బాధతో ఉంటాయి.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
“పాలబుగ్గల జీతగాడు” అంటే నీకు ఏమని అర్థం అయింది ?
జవాబు.
పాలబుగ్గల జీతగాడంటే పాలుగారే బుగ్గలతో ఉన్న వాడని అర్థమయింది. అంత చిన్న వయసులోనే పనికి కుదిరాడని అర్థమయింది.
ప్రశ్న 2.
“దొడ్డికీవే దొరవైపోయావా” అని కవి పిల్లవాడిని ఎందుకు అన్నాడు ?
జవాబు.
పాలబుగ్గల జీతగాడు చిన్న వయస్సున్న వాడైనప్పటికి పశువుల దొడ్డి బాగోగులు తానే చూసుకోవలసి వచ్చింది. అందుకే కవి అలా అన్నాడు.
ప్రశ్న 3.
“చేతికర్రే తోడయ్యిందా?” అనడంలో అర్థం ఏమిటి ?
జవాబు.
చేతికర్రే తోడయ్యిందా అని అనడంలో ఇంత చిన్న వయస్సులో పశువుకాపరివి అయ్యావా అన్న అర్థం, స్నేహితులుండాల్సిన వయసులో కర్రతో స్నేహం చేయాల్సి వచ్చిందని అర్థం.
ప్రశ్న 4.
పంటచేనుకు కాపు ఉంటాడు కదా! పంటకు కాపు అవసరం ఏమిటి ?
జవాబు.
పంట చేనుకు కాపు ఉంటాడు. పంటలను పశువులు, పిట్టలు తినకుండా, పంటను ఇతరులు దొంగిలించకుండా ఉంటాడు.
ప్రశ్న 5.
“జీతగాని జీవితం వెలుగు లేనిది” అని కవి అన్నాడు కదా! అదెట్లాగో చెప్పండి ?
జవాబు.
జీతగాని జీతం నిజంగా వెలుగులేనిదే! ఎందుకంటే అతడి నెల జీతం కుంచెడు ధాన్యం. వాటిలో కూడా కొన్ని తాలుగింజలు, మరికొన్ని కల్తీ ఒడ్లు, కడుపునిండా తినడానికి సరిపోదు. అందుకే అలా వెలుగులేని జీవితం అన్నాడు.
ఇవి చేయండి
1. విని, అర్ధం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
పాటను విన్నారు కదా! ఈ పాటను రాగంతో పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.
ప్రశ్న 2.
పల్లెటూరి పిల్లగాని బాధలు ఎట్లున్నాయో చెప్పండి.
జవాబు.
లేత వయసులోనే దొరల వద్ద బానిస బతుకు బతుకుతున్న దుర్భర జీవితం పల్లెటూరి పిల్లగానిది. ఆ పల్లెటూరి పిల్లగాడికి వేసుకోవటానికి బట్ట లేవు. తొడుక్కోవటానికి చెప్పులు లేవు. పశువుల కొట్టం వాడి నివాసం. దొరగారి తిట్టు వాడికి బహుమానాలు, పచ్చికారం ముద్దలు వాడికి ఆహారం. పాలికాపుల అదిరింపులు బెదిరింపులు. చదువుకునే అదృష్టం కూడా లేదు. ఇంతకన్నా బాధ లేముంటాయి.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
1. కింది పదాలను చదవండి. తారుమారుగా ఉన్న పదాలను సరిచేసి రాస్తే పాఠంలోని ఒక భాగం అవుతుంది. సరిచేసి రాయండి.
అ. కంచె దుంకి మాటిమాటికి పాడుచేసాయా పంటచేలు మాయదారి ఆవుదూడలు కొట్టాడా పాలికాపు నిన్నే జీతగాడ ఓ పాలబుగ్గల.
జవాబు.
మాటిమాటికి కంచె దుంకి పంట చేలు పాడుచేశాయా
మాయదారి ఆవుదూడలు
పాలెకాపు నిన్నె కొట్టాడా
ఓ పాలబుగ్గల జీతగాడా
ఆ. వొంపులోకి తరలేగుంపు కూరుచున్నవు
గుండు గుండుమీద దొరవైపోయావా
దొడ్డికీవే ఓ పాలబుగ్గల జీతగాడ!
నడ్డగించేవా దొంగగొడ్ల
జవాబు.
గుంపు తరలే వొంపులోకి
కూరుచున్నవు గుండుమీద
దొడ్డికీవే దొరవైపోయావా ఓ పాలబుగ్గల జీతగాడ
దొంగగొడ్ల నడ్డగించేవా ?
2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
మదునయ్య చేపల వ్యాపారి. పాలేరు రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు. పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలను పడతాడు. ఇందుకోసం ఒరిస్సా రాష్ట్రంలోని బరంపూర్కు పోయి ఆరోతరగతి చదివే గంగయ్య అనే బాలుడి తల్లిదండ్రులతోటి మాట్లాడి పదివేలకు అతడిని పనికి కుదుర్చుకున్నాడు. గంగయ్యను తనవెంట తీసుకొని పాలేరు వచ్చాడు. గంగయ్య రోజూ నీటి ఒడ్డున కూర్చొని వలను చూస్తూ ఉండేవాడు. ఒక్కోసారి రాత్రికూడా అక్కడే పండుకునేవాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మదునయ్యను శిక్షించారు. గంగయ్యను బడిలో చేర్పించి అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.
(అ) మదునయ్య ఎవరు ? ఏం చేసేవాడు ?
జవాబు.
మదునయ్య చేపల వ్యాపారి. అతడు పాలేరు. చెరువులో చేపలు పట్టి అమ్ముతాడు.
(ఆ) గంగయ్య ఎవరు ? పాలేరుకు ఎందుకు వచ్చాడు ?
జవాబు.
గంగయ్య బరంపురం గ్రామవాసి. పేదరికం వల్ల అమ్ముడుపోయి ‘పాలేరు’కు వచ్చాడు.
(ఇ) గంగయ్య పనిలో చేరడం వల్ల ఏమేం కోల్పోయాడు?
జవాబు.
గంగయ్య పనిలో చేరడం వలన చదువును, ఆనందాన్ని, ఆటలను, స్వేచ్ఛను కోల్పోయాడు.
(ఈ) బాలల హక్కులలో గంగయ్య ఏ హక్కులకు దూరమయ్యాడు ?
జవాబు.
బాలల హక్కుల్లో గంగయ్య చదువుకునే హక్కును కోల్పోయాడు.
(ఉ) మదునయ్యను ఎందుకు శిక్షించారు? ఇట్లా చేయడం సరైందేనా ?
జవాబు.
మదునయ్యను శిక్షించటానికి కారణం బాలకార్మికుని పనిలోకి తీసుకోవటం. ఇట్లా చేయడం సరైందే.
(ఊ) గంగయ్య తల్లిదండ్రులు చేసిన పని సరైందేనా ? ఎందుకు ?
జవాబు.
గంగయ్య తల్లిదండ్రులు చేసిన పని సరైనది కాదు. ఎందుకంటే గంగయ్యకు చదువులు నేర్పించకుండా పసితనంలోనే బాల కార్మికునిగా మార్చటం తప్పు.
3. కింది వాక్యాలను చదివి తప్పో, ఒప్పో గుర్తించండి. కారణం రాయండి.
(అ) చదువుకోవడం అందరి హక్కు,
జవాబు.
కారణం : చదువు సంస్కారాన్నిస్తుంది. జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. (ఒప్పు)
(ఆ) బాలికలు కూడా బాలురతో పాటు సమానంగా చదవడం. (ఒప్పు)
జవాబు.
కారణం : బాలురతో సమంగా బాలికలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది.
(ఇ) బాలబాలికలకు సమాన హక్కులు ఉంటాయి. (ఒప్పు)
జవాబు.
కారణం : బాలబాలికలకు సమాన హక్కులుంటాయి. అది రాజ్యాంగం ఇచ్చిన వరం.
(ఈ) బాలబాలికలను భయపెట్టడం, కొట్టడం, తిట్టడం. (తప్పు)
జవాబు.
కారణం : బాలబాలికలలో మంచి మాటలతో మార్పు తేవాలిగాని కొట్టడం చట్టవిరుద్ధం.
(ఉ) తల్లిదండ్రులు తమ పిల్లలను పనిలో పెట్టడం. (తప్పు)
జవాబు.
కారణం : తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి జ్ఞానవంతులను చేయాలిగాని పనిలో పెట్టరాదు.
(ఊ) పిల్లలు మంచి ఆహారం పొందడం. (ఒప్పు)
జవాబు.
కారణం : పిల్లలు మంచిగా ఎదగాలంటే మంచి ఆహారం అవసరం.
(ఎ) తెలియనివాటిని, రానివాటిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం, నేర్చుకోవడం. (ఒప్పు)
జవాబు.
కారణం తెలియని వాటిని, రానివాటిని ఉపాధ్యాయులనుండి అడిగి తెలుసుకోవటం వలన విషయ అవగాహనకు వీలౌతుంది.
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) “సగము ఖాళీ, చల్లగాలి” అని కవి ఏ సందర్భంలో అన్నాడు ? ఎందుకు ?
జవాబు.
సగము ఖాళీ, చల్లగాలి అని కవి పల్లెటూరి పిల్లగాని వేషధారణను వర్ణిస్తూ అన్నాడు. వాడు చాలీచాలని చిరిగిపోయిన వస్త్రాన్ని మొలకు చుట్టుకున్నాడు. అదంతా చిరుగులతో ఉండటంతో చల్లగా అతని శరీరాన్ని తాకుతున్నదని అతని బీదరికాన్ని వర్ణించాడు.
(ఆ) పశువుల కాపరి వలె బాల్యాన్ని కోల్పోతున్నవారు ఇంకెవరెవరు ఉండవచ్చు?
జవాబు.
పశువుల కాపరుల వలె బాల్యాన్ని కోల్పోతున్నవారు బాలకార్మికులు. వారిలో హెూటళ్ళలో, కార్ఖానాలలో, పరిశ్రమలలో, వివిధమార్కెట్లలో పనిచేసే వారు ఉన్నారు. వీరితో పాటుగా ఇండ్లలో పనిచేసే వారు కూడా తమ బాల్య జీవితాన్ని కోల్పోతున్నారు.
(ఇ) బడిలోని తోటి పిల్లలను చూసిన పసుల కాసే పిల్లవాడు ఎందుకు బాధపడ్డాడో కారణాలు ఊహించి రాయండి.
జవాబు.
బడిలోని తోటి పిల్లలను చూసిన పసుల కాసే పిల్లవాడు చదువుకునే అదృష్టం వారికిలా తనకు కలుగలేదే అని బాధపడ్డాడు. మనసులో చదువుకోవాలని ఉన్నా పరిస్థితులకు తాను బానిస అయినందుకు బాధపడ్డాడు. బడిలో పిల్లల వలే మంచిబట్టలు ధరించనందుకు బాధపడ్డాడు. హాయిగా బడి పిల్లలతో కలిసి ఆడుకోనందుకు బాధపడ్డాడు.
(ఈ) సుద్దాల హనుమంతు గురించి రాయండి.
జవాబు.
పల్లెటూరి పిల్లగాడా గేయ రచయిత సుద్దాల హనుమంతు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామస్తుడు. 1910లో జన్మించాడు. ఆర్యసమాజ కార్యకర్తగా, ఆంధ్రమహాసభ కార్యవర్గ సభ్యుడిగా, ప్రజాకవిగా, కళాకారుడిగా తెలంగాణ విమోచనోద్యమ సాహిత్యంలో విశిష్టస్థానాన్ని సంపాదించాడు. చైతన్యవంతమైన గీతాలు, బుర్రకథలు, గొల్లసుద్దులు, పిట్టలదొర, యక్షగానం మొదలగు కళారూపాలను ధరించటం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. సుద్దాల హనుమంతు అనారోగ్యం కారణాలతో అక్టోబరు 10, 1982లో మరణించాడు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
(అ) పల్లెటూరి పిల్లగాడు, పశువుల కాపరి లాంటి వాళ్ళ జీవితాలు చదువుకుంటేనే బాగుపడుతాయి? దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
కవి సుద్దాల హనుమంతు ‘పల్లెటూరి పిల్లగాడా! గేయంలో బాలకార్మికులు పడే బాధలు కళ్ళకు కట్టినట్లు చూపారు. వీటికి కారణం బడికి పోలేకపోవడమే.
చదువుకోవడం వల్ల బుద్ధి వికసిస్తుంది. మంచీ చెడూ తెలుస్తుంది. నలుగురితో ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తుంది. పల్లెటూరి పిల్లగాడికి యజమాని జీతం సరిగా కొలవలేదు. చదువుకోవడం వల్ల అలాంటి మోసాలు తెలుసుకోవచ్చు. మోసపోకుండా ఉండవచ్చు. పల్లెటూరి పిల్లగాడు చదువుకోకపోవడం వల్లే సరైన బట్టలు లేక, చెప్పులులేక, అడవుల్లో తిరుగుతూ, పశువులు కాయవలసి వచ్చింది.
చదువుకుంటే మంచి ఉద్యోగం చేయవచ్చు. చక్కని బట్ట, తిండి, గూడు సంపాదించుకోవచ్చు. చిన్నతనంలోనే శ్రమకు గురైతే, ఎదుగుతున్నకొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. బాల్యం చదువుకోవడానికి. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండి చదువుకోవడం వల్ల, తమ ఈడు పిల్లలతో ఆడుకుంటూ, చదువుకుంటూ ఎదగడం వల్ల శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటాయి.
IV. సృజనాత్మకత/ప్రశంస
ప్రశ్న 1.
పాఠం ఆధారంగా పిల్లగాని జీవితాన్ని “ఆత్మకథ”గా రాయండి.
జవాబు.
నేను పల్లెటూరి పిల్లగాడిని. నిన్న మొన్నటివరకు చిన్న పిల్లవానిగా తిరిగాను. పసి వయసులో పనిచేయాల్సిన దుస్థితి నాకు కల్గింది. చిరిగిపోయిన దుస్తులు కట్టుకొని చేతిలో కర్రను పట్టుకొని పశువులను కాసే మొనగాడిని కావాల్సి వచ్చింది. ఏం చెప్పను, పశువులను అడవికి తోలుకుపోయి గుండుమీద కూర్చుంటాను. చిన్న వయసులోనే బండ చాకిరి చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
పాలికాపు పశువులు పంట చేలో మేశాయని కొట్టకమానడు. అమ్మా నాన్నా పేదవాళ్ళు! పాపం వాళ్ళు ఏం చేస్తారు. జీతగానిగా దొరకు నన్నప్పగించారు. నా నెల జీతం కుంచెడు వడ్లు. అవి కూడా సరిగా ఇవ్వడు దొర. అందులో తాలు వడ్లు, పొట్టు, కల్తీ వడ్లు, చాలీచాలని తిండితో నా బాధలు ఏమని చెప్పను. నా యీడు పిల్లలు బడికి పుస్తకాలతో వెళ్తుంటే నా మనసు అటే లాగేది. నా జీవితానికి వెలుగులేదని బాధపడ్డాను. నేను ఓ బాల కార్మికుడిని. నాలాంటి వారిని ఆదుకునే మంచిరోజులు రావాలి. నాలాంటి బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి.
2. కింది బొమ్మను చూడండి. పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి సంభాషణలు రాయండి.
జవాబు.
బడిపిల్లోడు : హలో జాని! ఏంటీ ఇక్కడ కూర్చున్నావ్.
జీతగాడు జాని : ఆ! ఏవుంది! మా దొర బర్రెలు కాపలా కాస్తున్నా!
బడిపిల్లోడు : బర్రెలు కాయడమేమిటి ? రా బడికి వెళ్లాం! చదువుకుందాం!
జీతగాడు : మా నాయన కొడతాడు! చదువుకోవడానికి పోతే, పైసలు ఎక్కడినుండి వస్తాయి. ఈ బర్రెలు కాయడమే హాయిగా ఉంది. బర్రెలు కాస్తే జీతమిస్తరు.
బడిపిల్లోడు : చాలా తప్పు చేస్తున్నావు! చదువుకుంటే చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు! పెద్దయినాక, ఇంతకన్నా మంచి ఉద్యోగం చేయవచ్చు.
జీతగాడు : నాకూ చదువుకోవాలనే ఉంది. ఆ చదువులు, గిదువులు నాకు అర్థం అవుతాయా ?
బడిపిల్లోడు : టీచర్లు పాఠాలు అర్థమయేలా చెబుతారు! మొదట్లో అర్థం కాకపోయినా, త్వరగానే నేర్చుకోవచ్చు.
జీతగాడు : అయితే! సరే! రేపటి నుండి నేనూ చదువుకుంటా!
V. పదజాల వినియోగం :
1. కింది వాక్యాల్లోని గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి.
(అ) మా అన్నయ్య బాగా చదివి సర్కారు కొలువు సంపాదించాడు.
(ఆ) పెందలాడే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటింది.
(ఇ) మా ఊరు పక్కనే ఏరు పారుతున్నది.
(ఈ) నీ ముఖం ఏంటి అట్లా వెలవెలబోయింది ? ఏదైనా బాధ ఉన్నదా ?
2. కింది పట్టికలో ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.
(అ) పసులు ( గ ) క. అడవి
(ఆ) అంబ ( ఘ ) ఖ. గ్రాసం
(ఇ) అటవి ( క ) గ. పశువులు
(ఈ) గాసం ( ఖ ) ఘ. అమ్మ
ప్రకృతి – వికృతి
పశువులు – పసులు
అంబ – అమ్మ
అటవి – అడవి
గ్రాసం – గాసం
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పదాలను విడదీసి రాయండి.
ఉదా : నాయనమ్మ = నాయన + అమ్మ
(అ) నిజాశ్రమంబు
(ఆ) పోయితివయ్యా
(ఇ) నిజమూహింప
(ఈ) వలయమందు
(ఉ) ముఖారవిందం
జవాబు.
(అ) నిజాశ్రమంబు = నిజ + ఆశ్రమంబు
(ఆ) పోయితివయ్యా = పోయితివి + అయ్యా
(ఇ) నిజమూహింప = నిజము + ఊహింప
(ఈ) వలయమందు = వలయము + అందు
(ఉ) ముఖారవిందం = ముఖ + అరవింద
2. కింది విడదీసిన పదాలను కలిపి రాయండి.
(అ) నిన్ను + అడుగ = నిన్నడుగ
(ఆ) ఇడుమకు + ఓరి = ఇడుమకోర్చి
(ఇ) ఇప్పుడు + ఏమిటి = ఇప్పుడేమిటి
(ఈ) ఎవ్వరు + ఏమనిన = ఎవ్వరేమనిన
(ఉ) నిమిషము + ఏని = నిముషమేని
3. కింది గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలను రాసి, సమాసము పేరు రాయండి.
(అ) మనిషి జీవితంలో వెలుగునీడల వలె కష్టసుఖాలు వచ్చిపోతుంటాయి.
(ఆ) భూమ్యాకాశాలు ఎప్పుడూ కలవవు.
(ఇ) ధర్మాధర్మాలు ఆలోచించి పనిచేయాలి.
(ఈ) శాంత్యహింసలు భారతీయ ధర్మానికి మూలస్తంభాలు.
(ఉ) సూర్యచంద్రులు లోకానికి వెలుగునిస్తారు.
(ఊ) జీవితంలో పైకి రావాలంటే నీతినిజాయితీలు చాలా ముఖ్యం.
(ఋ) జాతరకు చిన్నపెద్దలు అందరూ తరలిపోతారు.
వెలుగునీడల | వెలుగుయును, నీడయును | ద్వంద్వ సమాసం |
భూమ్యాకాశాలు | భూమియును, ఆకాశమును | ద్వంద్వ సమాసం |
ధర్మాధర్మాలు | ధర్మమును, అధర్మమును | ద్వంద్వ సమాసం |
శాంత్యహింసలు | శాంతియును, అహింసయును | ద్వంద్వ సమాసం |
సూర్యచంద్రులు | సూర్యుడును, చంద్రుడును | ద్వంద్వ సమాసం |
నీతినిజాయితీలు | నీతియును, నిజాయితీయును | ద్వంద్వ సమాసం |
చిన్నపెద్దలు | చిన్నయును, పెద్దయును | ద్వంద్వ సమాసం |
ప్రాజెక్టు పని:
1. మీ ప్రాంతంలో బడికిపోకుండా ఉండే పిల్లల్ని కలవండి. వారెందుకు బడికి రావడంలేదో, బడి గురించి, చదువు గురించి వారేమనుకుంటున్నారో రాయండి.
1. ప్రాజెక్టు శీర్షిక : మా ప్రాంతంలో బడికి పోకుండా ఉండే పిల్లల్ని కలవడం. వారు ఎందుకు బడికి రావడంలేదో, బడి గురించి, చదువు గురించి వారేమనుకుంటున్నారో రాయడం.
2. సమాచార సేకరణ : (అ) సమాచారం సేకరించిన తేది : XXX (ఆ) సమాచార వనరు : పరిసరాలు
3. సేకరించిన విధానం : మా పరిసరాలలో ఉన్న బడికి వెళ్ళని పిల్లలను కలిసి మాట్లాడడం ద్వారా సమాచారం సేకరించాను.
4. నివేదిక : మా ప్రాంతంలో బడికి పోని పిల్లలు చాలా మందే ఉన్నారు. వారందరూ చాల పేదవారు. చదువుకోవాలనే ఆశతో ఉన్నవారే! మా యింటికి దగ్గరలో శంకరన్న ఉన్నాడు. వాడు మా వీధిలో వారికందరకు పాలు, కూరగాయలు, ఇంటి పనిలో సహాయంచేస్తూ బాల కార్మికునిగా ఉండిపోయాడు. అతని వయస్సు 7 సం॥లే! చదువును గురించి వాడిని అడిగితే నాకూ చదువుకోవాలనుంది కాని చదువుకు వెళ్తే నాస్తా ఎట్లా దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది. ఎవ్వరు పెడతారు అని అంటాడు. పాపం ఇలాంటి వారికోసం ప్రభుత్వం శరణాలయాలను కట్టించి వారిలోని ఆశను నెరవేర్చాలి.
బతుకు పోరు వారిని చదువులకు దూరం చేస్తోంది. పేదరికం వారిని బాల కార్మికులుగా తయారుచేస్తున్నదని అర్థమయింది. అలాంటి వారిలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు కనిపిస్తుంది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు, సంక్షేమ గృహాలు, అనాధ శరణాలయాలు, ఆశ్రమాలు వారికి ఆదరణనిస్తున్నాయని కొందరు చదువులపట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. చదువంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాని బీదరికం వారి ఆశలను దూరం చేస్తుందని వారితో మాట్లాడటం వలన తెలుసుకున్నాను.
5. ముగింపు : పేదరికంలో ఉన్న పిల్లలు బాలకార్మికులుగా ఉండడం వల్ల చదువుకు దూరమైపోతున్నారు. వారిలోచదువు కోవాలనే ఆశ ఉన్నగాని చదువుకోలేక పోతున్నారని అర్థం చేసుకున్నాను.
TS 6th Class Telugu 11th Lesson Important Questions పల్లెటూరి పిల్లగాడా!
ప్రశ్న 1.
బాలజీతగాని దుఃఖానికి కవి ఊహించిన కారణాలు ఏవి ?
జవాబు.
పల్లెటూరి పిల్లగాడా గేయం సుద్దాల హనుమంతు రాశారు. కవి బాల జీతగాని దుఃఖానికి పలు కారణాలను ఊహించాడు. అందులో ముఖ్యమైంది ఆకలి. దొర భార్య బాలజీతగానికి పెందలాడే సద్ది పెట్టనందుకు బాధపడ్డాడు. ఆకలితో అలమటిస్తూ దొర చెప్పిన పని చేయలేక బాధపడ్డాడు. పశువులు పదేపదే పంట చేలలోకి వెళ్తుంటే పాలికాపు కొట్టినందుకు బాధపడ్డాడు. దొర తనకు నెల నెలా జీతం తగ్గించి ఇవ్వడం వల్ల తాలు తప్పల ధాన్యాన్ని కొలచినందుకు బాధపడ్డాడు. పల్లెటూరి పిల్లగాడు తన తోటి పిల్లలతో కలిసి బడికి వెళ్ళి చదువుకోలేక పోయినందుకు చాలా బాధపడ్డాడు.
ప్రశ్న 2.
బాలజీతగాని పాలెకాపు ఎందుకు కొట్టాడో వివరించండి.
జవాబు.
బాలజీతగాడు చాలీచాలని చిరిగిన వస్త్రాన్ని కట్టుకొని తాటి మట్టలతో చేసిన చెప్పులతో చేత కర్ర పట్టుకొని పశు వులను మేతకు తోలుకెళ్ళాడు. ఆ సమయాన ఆ పశువులలోని దొంగ గొడ్లు పంట చేలల్లోకి పోతుండేవి. పంట చేలను పిల్లగాడి దొంగ గొడ్లు పాడుచేశాయని, పాలికాపు జీతగాడిని కొట్టేవాడు. పాపం అందరికీ అలుసు బాల జీతగాడే కదా !
ప్రశ్న 3.
‘పల్లెటూరి పిల్లగాడా’ గేయ సారాంశాన్ని రాయండి.
జవాబు.
కవి సుద్దాల హనుమంతు బాలకార్మికుల ఆవేదనను ‘పల్లెటూరి పిల్లగాడా’ గేయంలో వివరించారు. చాలా చిన్న వయసులోనే చాలీచాలని చింపులంగి, గోనెచింపు కొప్పెర, తాటి జెగ్గల కాలిజోడుతో పశువులను మేపటానికి అడవికి ఒంటరిగా వెళ్ళే పరిస్థితి పల్లెటూరి పిల్లగాడిది. పశువులను కాస్తూ, ఒంటరిగా కొండ రాయి మీద కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటాడు.
ఆకలికి తట్టుకోలేక అలసిపోతుంటాడు. అడవిలో కందిరీగలు, ఇతర పురుగులు కుడుతూ ఉంటే బాధపడుతూ ఉంటాడు. పశువులు పంట చేలు పాడుచేస్తే, పాలికాపు కొట్టే దెబ్బలకు ఏడుస్తూ ఉంటాడు. దొర జీతంగా ఇవ్వాల్సిన ఒడ్లు సరిగా కొలచి ఇవ్వకపోయినా, తాలు గింజలు, కల్తీ గ్రాసం కలిపి ఇచ్చినా బాధపడడం తప్ప ఏమీ చేయలేడు. తన ఈడు పిల్లలందరూ చక్కగా బడిలో చదువుకుంటూ ఉంటే, తన జీవితంలో వెలుగులేదని బాధపడుతూ ఉంటాడు.
అర్థాలు:
- కొలువు = ఉద్యోగము/ఆస్థానము
- మొనగాడు = నేర్పరితనం కలవాడు
- పసులు = పశువులు
- చింపులంగి = చిరిగిపోయిన బట్ట
- దొడ్డి = పశువుల కొట్టం
- అడలుట = బాధపడుట
- కల్తీ గ్రాసం = కల్తీ ఆహారం
- వెలవెలబోవు = తెల్లబోవు
- తాటి జెగ్గల కాలిజోళ్ళు = తాటి మట్టలతో చేసిన చెప్పులు
- కుంచం = ధాన్యాన్ని కొలిచే సాధనం
పర్యాయపదాలు
- పల్లె – గ్రామము, జనపదం
- అడవి – వనము, అరణ్యము
- ఆకు – పత్రము, దళము
- నేల – ధరణి, భూమి
- గాలి – వాయువు, పవనము
- కళ్ళు – నయనములు, నేత్రములు
- చేతులు – కరములు, హస్తములు
నానార్థాలు
- పాలు – అమృతము – క్షీరము, భాగము
- పని – కారణము, ప్రయోజనము
- పశువు – బలిమృగము, నాలుగుకాళ్ళ జంతువు
- పాదము – అడుగు, పద్యపాదము, కాలు
- ఆశ – కోరిక, దిక్కు
- కాలము – సమయము, నలుపు
1. గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించండి.
1. భారతదేశాన్ని బ్రిటీష్ దొరలు పరిపాలించారు.
(A) సేవకుడు
(B) బానిస
(C) అధికారి
(D) పనివాడు
జవాబు.
(C) అధికారి
2. పసివయస్సు పిల్లలు ఆటలాడుకుంటారు.
(A) చిన్న వయస్సు
(B) పెద్ద వయస్సు
(C) ముసలి వయస్సు
(D) పాలు
జవాబు.
(A) చిన్న వయస్సు
3. ఆకలితో బిడ్డ అడలుతున్నాడు.
(A) బాధపడుతున్నాడు.
(B) కోపంగా ఉన్నాడు
(C) పాడుతున్నాడు
(D) ఏడుస్తున్నాడు
జవాబు.
(A) బాధపడుతున్నాడు.
4. కుంచం పదానికి అర్థం రాయండి.
(A) కొలుత
(B) ధాన్యం కొలుచు సాధనం
(C) భూమిని కొలుచునది
(D) బరువును కొలుచునది
జవాబు.
(B) ధాన్యం కొలుచు సాధనం
5. ‘పసులు’ అంటే అర్థం.
(A) పసుపు
(B) పశువులు
(C) పస్తులు
(D) ఆకలి
జవాబు.
(B) పశువులు
6. పశువుల కాపర్లు తలపై కొప్పెరలు పెట్టుకుంటారు.
(A) గొంగడి
(B) బొట్టు
(C) పిలక
(D) మూట
జవాబు.
(A) గొంగడి
పర్యాయపదాలు
II. కింది వాటికి పర్యాయపదాలు గుర్తించండి.
7. ‘తల్లి’ కి పర్యాయపదం రాయండి.
(A) అమ్మ, మాత
(B) నాన్న, తండ్రి
(C) చెల్లి, కుమార్తె
(D) అన్న, కుమారుడు
జవాబు.
(A) అమ్మ, మాత
8. క్షీరము, దుగ్ధములకు పర్యాయపదం రాయండి.
(A) పాలు
(B) నీరు
(C) నిప్పు
(D) గాలి
జవాబు.
(A) పాలు
9. మనసు, ఎద పర్యాయపదం రాయండి.
(A) శరీరం
(B) తనువు
(C) నీరు
(D) హృదయం
జవాబు.
(D) హృదయం
III. కింది వాటికి నానార్థాలు రాయండి.
10. క్షీరము, భాగము అనే అర్థాలిచ్చే నానార్థ పదం రాయండి.
(A) పాలు
(B) నీరు
(C) సముద్రం
(D) ఏదీకాదు
జవాబు.
(A) పాలు
11. మా ఊరు మంచిది. నానార్థాలు రాయండి.
(A) గ్రామము, ఊటవచ్చు
(B) పాలు, పెరుగు
(C) పెరుగు, మజ్జిగ
(D) జలము, నీరు
జవాబు.
(A) గ్రామము, ఊటవచ్చు
12. నేత్రము, బండి చక్రము అనే నానార్థాలు ఇచ్చే పదం.
(A) ముక్కు
(B) చెవి
(C) కాళ్ళు
(D) కన్ను
జవాబు.
(D) కన్ను
IV ప్రకృతి – వికృతులు
13. ‘విద్య’ వికృతి పదాన్ని రాయండి.
(A) విద్దె
(B) చదువు
(C) సంపద
(D) లాభం
జవాబు.
(A) విద్దె
14. ‘పశువు’ వికృతి పదం రాయండి.
(A) గేదె
(B) ఆవు
(C) ఎద్దు
(D) పసరము
జవాబు.
(D) పసరము
15. ‘అంబ’ వికృతి పదం రాయండి.
(A) తల్లి
(B) అమ్మ
(C) అక్క
(D) చెల్లి
జవాబు.
(B) అమ్మ
V. వ్యాకరణం
16. నీకు + ఏమైనా – కలిపి రాస్తే
(A) నీకేమైనా
(B) నీకామైన
(C) నీకొరకు ఏమైనా
(D) నీతో ఏమైనా
జవాబు.
(A) నీకేమైనా
17. జీవితమంతా – విడదీస్తే
(A) జీవిత + అంతా
(B) జీవిత + మంతా
(C) జీవితము + అంతా
(D) అంతా + జీవితం
జవాబు.
(C) జీవితము + అంతా
18. రామయ్య – విడదీస్తే
(A) రాము + అయ్య
(B) రామ + అయ్య
(C) రామయ్య + అయ్య
(D) రామ + మయ్య
జవాబు.
(B) రామ + అయ్య
19. మేన + అత్త = ……………
(A) మేనయత్త
(B) మేనాఅత్త
(C) మేనఅత్త
(D) మేనత్త
జవాబు.
(D) మేనత్త
20. మంచిచెడులు – విగ్రహ వాక్యం
(A) మంచియొక్క చెడులు
(B) మంచిలో చెడు
(C) మంచిదైన చెడు
(D) మంచి మరియు చెడు
జవాబు.
(D) మంచి మరియు చెడు
21. రాముడు మరియు లక్ష్మణుడు – విగ్రహ వాక్యంగా మారిస్తే
(A) రామునిలక్ష్మణుడు
(B) రామలక్ష్మణులు
(C) అన్నదమ్ములు
(D) రామయ్యలక్ష్మయ్య
జవాబు.
(B) రామలక్ష్మణులు
22. ‘ఏడుకొండలు’ – విగ్రహ వాక్యం
(A) ఏడుసంఖ్య గల కొండలు
(B) ఏడు మరియు కొండలు
(C) తిరుపతి
(D) కొండల సంఖ్య ఏడు
జవాబు.
(A) ఏడుసంఖ్య గల కొండలు
23. నిజం దాచవద్దు. – చెప్పవద్దు. గీతగీసిన పదానికి వ్యతిరేకపదం
(A) అనిజం
(B) అబద్ధం
(C) తప్పు
(D) నిజం
జవాబు.
(B) అబద్ధం
24. ‘వెలుగు’ – అనే పదానికి వ్యతిరేకార్థక పదం
(A) వెలుతురు
(B) కిరణం
(C) చీకటి
(D) రాత్రి
జవాబు.
(C) చీకటి
25. బాలకార్మికుల కష్టం చూస్తే దుఃఖం కల్గుతుంది. గీతగీసిన పదానికి వ్యతిరేక పదం
(A) సుఖం
(B) కష్టం
(C) సంతోషం
(D) బాధ
జవాబు.
(A) సుఖం
VI. క్రింది పేరాను చదవండి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
26. “గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని గిరిజనులు వారి ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య.” చిన్నయ భీమయ్య / చిలుకల భీమయ్య” అని స్థానికంగా వినిపించే జానపదగేయంలో చిన్నయ్య అంటే అర్జునుడు. పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముడ్ని పూజిస్తారు. భీమున్ని ప్రత్యేకంగా కొలువడానికి కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినపుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడు పెళ్ళి చేసుకొని ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్యదైవమయ్యాడు.
ప్రశ్నలు :
1. గోదావరి నదికి ఇరువైపుల ఉన్న జిల్లాలేవి ?
జవాబు.
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు.
2. స్థానికంగా వినిపించే జానపద గేయం ఏది ?
జవాబు.
చిన్నయ్య భీమయ్య / చిలుకల భీమయ్య అనే గేయం.
3. గిరిజనులు, రైతులు పూజించే దేవుళ్ళు ఎవరు ?
జవాబు.
చిన్నయ్య, పెద్దయ్య
4. పెద్దయ్య, చిన్నయ్య అంటే ఎవరు ?
జవాబు.
పెద్దయ్య అంటే ధర్మరాజు, చిన్నయ్య అంటే అర్జునుడు.
5. గిరిజనులకు భీముడు ఎందుకు ఆరాధ్య దైవమయ్యాడు ?
జవాబు.
స్థానిక గిరిజనుల అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం వల్ల.
క్రింది పద్యాన్ని చదివి ఖాళీలను పూరించండి.
27. తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
ఖాళీలు:
1. …………… తనకు రక్ష.
2. తనలో ఉండే కోపమే తనకు ……………….
3. ……………… ఉంటే అదే స్వర్గము
4. తన …………… నరకము.
5. దయయే …………………..
జవాబు.
1. తన శాంతమే తనకు రక్ష.
2. తనలో ఉండే కోపమే తనకు శత్రువు
3. సంతోషమే ఉంటే అదే స్వర్గము
4. తన దుఃఖమె నరకము.
5. దయయే చుట్టము
గేయం – అర్ధాలు
1. పల్లెటూరి పిల్లగాడ
పసులగాచే మొనగాడ
పాలుమరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ
కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో
చాలి చాలని చింపులంగి
సగము ఖాళీ చల్లగాలి
గోనెచింపు కొప్పెర పెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ
దానికి చిల్లులెన్నో లెక్కపెట్టావా
తాటిజెగ్గలా కాలిజోడు
తప్పటడుగుల నడకతీరు
బాటతో పని లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల జీతగాడ
చేతికర్రే తోడైపోయిందా
గుంపు తరలే వొంపులోకి
కూరుచున్నపు గుండుమీద
దొడ్డికివే దొరవై పోయావా ఓ పాలబుగ్గల జీతగాడ
దొంగ గొడ్ల నడ్డగించేవా
కాలువై కన్నీరుగార
కండ్లపై రెండు చేతులాడ
వెక్కివెక్కి ఏడ్చుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ
ఎవ్వరేమన్నారో చెప్పేవా
అర్థాలు :
పసులు = పశువులు
మొనగాడ = నేర్పరితనం గలవాడ
కొలువుకుదిరి = పనికి కుదిరి
పాలబుగ్గల జీతగాడా = లేతవయస్సులోని జీతగాడా
చింపులంగి = చిరిగిపోయిన బట్ట
గోనెచింపు కొప్పెర = చిరిగిన గోనెసంచిని టోపీగా ధరించి
తాటిజగ్గ = తాటి మట్ట
గుండుమీద = రాతిబండమీద
దొడ్డికి = పశువుల కొట్టంకు
కన్నీరుగార = కళ్ళవెంట నీరుకారుతుండగ
2. పెందలాడ అమ్మనీకు
పెట్టలేదా సద్దికూడు
ఆకలిగొని అడలుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ
అడవి తిరిగి అలిసి పోయావా
ఆకుతేల్లు కందిరీగలు
అడవిలో గల కీటకాదులు
నీకేమైన కాటువేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ
నిజము దాచక నాతో చెప్పేవా
మాయదారి ఆవుదూడలు
మాటిమాటికి కంచె దుంకీ
పంట చేలూ పాడుచేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ
పాలికాపు నిన్నే కొట్టాడా
నీకు జీతం నెలకు కుంచం
తాలు వరిపిడి కల్తీగాసం
కొలవగా పేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడ
తలుచుకుంటే దుఃఖ మొచ్చిందా
పాఠశాల ముందు చేరి
తోటి బాలుర తొంగి చూసి
ఏటికోయీ వెలవెల బోతావు ఓ పాలబుగ్గల జీతగాడ
వెలుగులేని జీవితమంటావా
అర్థాలు :
పెందలాడ = ఉదయాన్నే
అడలుట = బాధపడుట
ఆకుతేల్లు = తెల్లతేళ్ళు
కాటువేశాయా = కుట్టాయా
మాటిమాటికి = తరచుగా
పాలికాపు = పంట చేలకు కాపు కాసేవాడు
కుంచం = ధాన్యాన్ని కొలిచే పనిముట్టు
కల్తిగాసం = కల్తీ ఆహారం
ఏటికోయి = ఎందుకోయి
వెలవెలబోవు = తెల్లబోవు
వెలుగులేని = సంతోషం లేని
అ పాఠం ఉద్దేశం:
గ్రామాల్లోని కొంతమంది బీదపిల్లలు బడికి పోకుండా పశువులను కాస్తున్నారు. కూలి పనులకు పోతున్నారు. ఎండలో, వానలో తిరుగుతూ బాధలు పడుతున్నారు. అర్ధాకలితో జీవిస్తున్నారు. వారు పడే కష్టాలను, కన్నీళ్ళను మనకు తెలియజేస్తూ అటువంటి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనల్ని రేకెత్తింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం ‘పాట’ అనే ప్రక్రియకు సంబంధించినది. ఒక పల్లవి, కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శతజయంతి సందర్భంగా ప్రచురించిన “పల్లెటూరి పిల్లగాడా” అనే పాటల సంకలనం లోనిది.
కవి పరిచయం
కవి : సుద్దాల హనుమంతు
కాలం : 6-6-1910, 10-10-1982.
జన్మస్థలం : పాలడుగు గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా.
రచనలు : చైతన్యగీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టలదొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు.
విశేషాలు : సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి.
ప్రవేశిక
పల్లెల్లో నివసించే కొందరు బీదపిల్లలు సరైన తిండిలేక, బడికి పోకుండా పశువులను కాస్తున్నారు. అడవుల్లో తిరుగుతూ, అడవి జంతువులతో, కీటకాలతో అపాయాలను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని జీతం తీసుకుంటూ యజమానుల వేధింపులను భరిస్తున్నారు. బడికి పోయే తమ ఈడు పిల్లలను చూస్తూ ఎంతో బాధకు లోనౌతున్నారు. అటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఈ పాఠంలో చూద్దాం.
పాఠ్యసారాంశం
ఓ పల్లెటూరి పిల్లగాడా! నిన్నగాక మొన్న పాలు తాగుతూ, చిన్నపిల్లాడిలా తిరుగుతూ కనిపించేవాడివి. అప్పుడే పశువులను కాయడంలో మొనగాడివైపోయావా ? పాలుగారే బుగ్గలతో చిన్న వయసులో జీతానికి పనిచేయవలసిన దుస్థితి నీకు ఎందుకు వచ్చిందో కదా!
నీ ఒంటికి చాలీచాలని చినిగిఓయిన అంగి చల్లని గాలినుండి నిన్ను కాపాడటం లేదు కదా! అందుకే గోనెసంచిని కొప్పెరగా వేసుకున్నావా!? మరి దానికున్న రంధ్రాలు ఎన్నో చూశావా ? అది కూడా నిన్ను కాపాడటం లేదు కదా! తాటిమట్టలను చెప్పులుగా చేసుకున్నావు. కాని అవి నిన్ను సరిగా నడువనీయడం లేదు కదా! దాంతో నీకు తొవ్వ అవసరం లేకుండా నీ చేతికర్రే నీకు సహాయంగా ఉన్నది కదా!
మందలు పోయే వంపులోఉన్న బండరాయి మీద కూర్చుంటావు. దొంగతనంగా జొరబడే పశువులను నీ దొడ్డిలో రాకుండా ఆపుతావు. నీ దొడ్డికి నీవే దొరవు అయ్యావా? ఇంత లేతవయసులో ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నావో కదా! నిన్ను ఎవరైనా ఏమన్న మాటలతో బాధించారా ? కాలువల్లాగా నీ కండ్ల నుంచి కారే కన్నీళ్ళను నీ చేతులతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఎందుకు ఏడుస్తున్నావు ? నీ కష్టాలు, యజమాని పెట్టే బాధలు గుర్తుకొస్తున్నాయా? పొద్దున అమ్మ నీకు సద్ది అన్నం పెట్టలేదా ? అడవిలో తిరిగి తిరిగి ఆకలితో అలసిపోయావా ? అడవిలో ఆకుతినే పురుగులో, కందిరీగలో లేదా ఇతర కీటకాలో నిన్నేమైన కుట్టాయా ? నిజమేంటో నాకు చెప్పవా ?
మాయదారి ఆవుదూడలు మాటిమాటికి కంచెపై నుండి దుంకి వేరే వాళ్ళ పంటపొలాలను పాడుచేశాయా ? అది చూసిన ఆ కావలి మనిషి నిన్ను కొట్టాడా ? నీకు నెలకు జీతం కుంచెడు వడ్లు. నీకు కొలిచిన జీతం వడ్లలో తాలువడ్లు, పొట్టు, కల్తీవడ్లు ఉన్నాయా ? అవి కొలిస్తే సేరు తక్కువగా ఉన్నాయా ? అది తలుచుకొని ఏడుస్తున్నావా ? బడి ముందర నిలబడి, బడిలో చదివే నీ ఈడు పిల్లలను చూసి, ముఖాన్ని ముడుచుకున్నావు. బడికి పోలేని నీ బతుకును తలుచుకుంటూ ఏడుస్తున్నావా ? జీవితంలో వెలుగు లేదని బాధపడుతున్నావా ?
నేనివి చేయగలనా ?
- పాటను రాగంతో, అభినయంతో పాడగలను. అవును/ కాదు
- అపరిచిత పేరాను చదివి జవాబులు రాయగలను. అవును / కాదు
- ‘పిల్లల జీవితాలు చదువుకుంటేనే బాగుపడతాయి’ అనే అంశాన్ని సమర్థిస్తూ రాయగలను. అవును / కాదు
- పల్లెటూరి పిల్లగాని జీవితాన్ని ఆత్మకథగా రాయగలను. అవును / కాదు