These TS 10th Class Telugu Important Questions 7th Lesson శతక మధురిమ will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 7th Lesson Important Questions శతక మధురిమ
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘శతక మధురిమ’ పాఠం నుండి మీరు గ్రహించిన నీతులను వ్రాయండి.
జవాబు:
- ఈశ్వరార్చనకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు, భక్తియోగం ప్రధానం.
- సంపద లేకపోయినా, గురుపాదభక్తి, దానగుణం, శాస్త్రశ్రవణం, సత్యవచనం, మనస్సులో మంచితనం ఉంటే పండితుడు శోభిస్తాడు.
- హరిదాసులను నిందించరాదు. భిక్షం పెట్టేవారికి అడ్డుపడరాదు. సత్పురుషలను వంచించరాదు. దేవాగ్రహారాలు అపహరించరాదు. వార్షికాలు చెడగొట్టరాదు.
- త్యాగదీక్ష చేపట్టి, భూ ప్రజల దైన్యాన్ని పోగొట్టి, అందరి ప్రజల బ్రతుకులో ఉత్సాహాన్ని పెంచి, దేశం గొప్ప తనాన్ని పెంచేవాడే గొప్పవాడు.
- మిత్రుడు పుస్తకంలా బోధిస్తాడు. ధనంలా కార్య సాధనకు సాయం చేస్తాడు. కత్తిలా శత్రువులను సంహరిస్తాడు. నిండుమనస్సై సుఖం ఇస్తాడు.
ప్రశ్న 2.
కవి ఈ భూమిపై నరరూప రాక్షసుడని ఏ లక్షణాలు కలవారిని అన్నాడు ?
జవాబు:
ఈ అవనిపై కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కులగర్వం తోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరసలను పాటించని వాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటి వాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు. ఇతరులకు సహాయం చేయని వాడు, స్వార్థపరుడు, పరులను బాధలకు గురిచేసేవాడిని ఈ భూమి పై ఉన్న నరరూప రాక్షసుడని కవి అన్నాడు.
ప్రశ్న 3.
సత్రాలు కట్టించడం వలన ప్రయోజనాలేమిటి?
జవాబు:
దూరప్రాంతం నుండి దేవాలయాలకు వస్తారు. వారికి వసతి కల్పించడానికి, భోజనాలకు సత్రాలు కట్టించాలి. దానివల్ల యాత్రికులకు డబ్బు ఖర్చు తగ్గుతుంది. పేదవారికి, అనాథలకు సత్రాలలో ఆశ్రయం కల్పించ వచ్చు. దీనివలన వారికి ఆసరా దొరుకుతుంది. సమాజంలో దొంగతనాలు, దోపిడీలు తగ్గుతాయి. ఫలానా గ్రామంలో మనవారెవరూ లేరు అనే భావన ఉండదు. తెలియని ప్రాంతంలో కూడా భద్రత ఉంటుంది. యాత్రికులు నిశ్చింతగా తీర్థయాత్రలు చేయవచ్చును.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)
ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘శతకపద్యాలు మంచి ప్రవర్తనకు మార్గదర్శకాలు’ మీ పాఠ్యాంశం ఆధారంగా నిరూపించండి.
జవాబు:
మేము చదివిన శతక మధురిమ పద్యాలలో మానవులు మంచిగా నడవడానికి నేర్చుకోవలసిన ఎన్నో సజ్జన లక్షణాలను గూర్చి చెప్పారు. అందువల్ల శతకపద్యాలు, మంచి ప్రవర్తనకు మార్గాన్ని చూపిస్తాయి. అవి మంచి ప్రవర్తనకు మార్గదర్శకాలు. మేము ఈ క్రింది సజ్జన లక్షణాలను గూర్చి శతకపద్యాలలో నేర్చుకున్నాము.
- గురువుగారి పాదాలకు నమస్కరించాలి.
- కలలో కూడా సత్యమే పలకాలి.
- హరిభక్తులను నిందించకూడదు.
- సజ్జనులను మోసగించరాదు.
- దేవుని అగ్రహారములు లాక్కోరాదు.
- మిత్రులను సంపాదించుకోవాలి.
- దేశమాత గౌరవాన్ని పెంచాలి.
- త్యాగగుణంతో దీన జనులను రక్షించాలి.
- కులగర్వం పనికిరాదు.
- పేదల కొంపలు కూలగొట్టరాదు.
- లంచాలు తీసికోరాదు.
- చెడు ప్రవర్తన చేయకూడదు.
- తల్లిదండ్రులను ఇంటి నుండి గెంటరాదు.
- వరుస – వావి కలిగి, ప్రవర్తించాలి.
- భిక్ష పెట్టేవారికి అడ్డుపడకూడదు.
పై పద్యాలు చదివి, అందులో చెప్పిన పై మంచి గుణాలు అలవాటు చేసికొంటే, అవే మన మంచి ప్రవర్తనకు మార్గాన్ని చూపిస్తాయి అని తప్పక చెప్పగలను.
ప్రశ్న 2.
శతక మధురిమ నుండి గ్రహించిన మంచి లక్షణాలను తెల్పండి.
జవాబు:
- కలలో కూడా అసత్యం పలుకరాదు.
- మాయమాటలతో పరులసొమ్ము అపహరింపరాదు.
- కులగర్వంతో పేదల కొంపలు ఆర్పరాదు.
- లంచాలకు వెల పెంచరాదు.
- చెడుప్రవర్తనలు విడిచిపెట్టాలి.
- వరుస-వావి కలిగి, నడుచుకోవాలి.
- కన్నవారిని గౌరవించాలి.
- మిత్రులను సంపాదించాలి.
- దేశమాత గౌరవాన్ని పెంచాలి.
- హరిదాసులను గౌరవించాలి.
- భిక్షం పెట్టేవారికి అడ్డుపెట్టకూడదు.
- మంచివారిని మోసం చెయ్యరాదు.
- దేవుడిమాన్యాలు అపహరించరాదు.
- రాజులను ఆశ్రయించరాదు.
- దైవపూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు ఉండాలి.
ప్రశ్న 3.
శతక పద్యాల్లోని నీతులు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతాయని సమర్థిస్తూ రాయండి. (June ’16)
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు వివిధ అంశాలపై చక్కని పద్యాలను రచించారు. సమాజంలో నైతిక విలువల్ని పెంచడానికి ప్రయత్నించారు. శతకపద్యాలు జనాన్ని జాగృతం చేస్తాయి.
శతక కవులు తమ అనుభవ సారాన్ని మధించి తేటతెలుగు పద్యాలను రచించారు. వేమన వంటి ప్రజా కవులు ప్రజల్లోని మూఢనమ్మకాలను తొలగించారు.
కొంతమంది శతక కవులు సంఘసంస్కరణోద్యమాన్ని ఆయుధంగా చేసుకున్నారు. మారద వెంకయ్య వంటి శతక కవులు చక్కని దృష్టాంతాలతో శతక పద్యాలను రచించారు. తెలుగుబాల, సుమతీశతక పద్యాలు పిల్లలలో నీతి ప్రవర్తనను కల్గించాయి. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం వంటి శతకాలు ప్రజల్లో భక్తితత్పరతను కల్గించాయి.
రాజుల దురహంకారాన్ని ధూర్జటి కళ్ళకు కట్టినట్లుగా శతక పద్యాల్లో చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు సమకాలీన రుగ్మతలను తేటతెల్లం చేశారు. ప్రజల కళ్ళు తెరిపించారు. సమాజంలో విద్యార్థుల పాత్ర తిరుగులేనిది. విద్యార్థులు నవసమాజ నిర్మాతలని ఎందరో మహాకవులు చెప్పారు. విద్యార్థులు ప్రాథమిక దశనుండి వినయ విధేయతలు కలిగియుండాలి. గురువుల పట్ల శ్రద్ధా సక్తులు కలిగియుండాలి.
విద్యార్థులు తోటివారితో స్నేహభావంతో ఉండాలి. చదువుపట్ల ఆసక్తి కలిగి ఉండాలి. చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. దేశభక్తిని కలిగి ఉండాలి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి, మంచి మాటలతో సమాజంలో గౌరవాన్ని పొందాలి. క్రమశిక్షణతో కూడిన జీవనసరళిని అలవరచు కోవాలి.
విద్యార్థులు కొన్ని దురలవాట్లను కూడా దూరం చేసు కోవాలి. తిరస్కారంగా మాట్లాడడం, ఇతరులపై చాడీలు చెప్పడం, ఎదిరించి మాట్లడం, క్రమశిక్షణ లేకపోవటం, ఉపాధ్యాయులతోను, తోటి విద్యార్థుల తోను గొడవలు పడడం మొదలైన దుర్గుణాలను దూరం చేసుకోవాలి. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇతరులకు ఆదర్శంగా మెలగాలి.
ప్రశ్న 4.
నరరూప రాక్షసుల వలన నష్టమేమిటి ? వివరించండి.
జవాబు:
నరరూప రాక్షసులు కలలో కూడా నిజం చెప్పరు. దాని వల్ల మోసాలు, అబద్ధాలు పెరిగిపోతాయి. నేరం చేసే లక్షణం అలవాటవుతుంది. ఇతరుల సొమ్ములు అపహరిస్తారు. దానివలన దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోతాయి. నరరూప రాక్షసులకు కుల గర్వం ఎక్కువ ఉండడం వలన సమాజంలో కుల ఘర్షణలు పెరిగిపోతాయి. వారు చెడు ప్రవర్తనతో ఉంటారు. కనుక వారితో స్నేహం చేసే వారు కూడా చెడిపోతారు.
దీనివలన సమాజం మొత్తం పాడయిపోతుంది. ఎవరికీ ఎవరి మీదా నమ్మకం ఉండదు. గౌరవం ఉండదు. తెలివితేటలు వృద్ధి అవ్వవు. విద్యను ఎవరూ ఆర్జించరు. శాంతి ఉండదు. భద్రత ఉండదు. అందుచేత నరరూప రాక్షసులను మంచి మార్గంలోకి మంచి మాటలతో మళ్ళించాలి.
ప్రశ్న 5.
‘మారుతున్న నేటి పరిస్థితుల్లో శతక పద్యాల అవసరం ఎంతైనా ఉన్నదని ‘శతక మధురిమ’ పాఠాన్ని ఆధారంగా చేసుకొని రాయండి. (Mar. ’18)
జవాబు:
సమాజంలో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటుచేసు కుంటున్నాయి. ప్రజల ఆలోచనా విధానంలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి సమాజం ఏర్పడాలంటే శతకపద్యాల అవసరం ఎంతైనా ఉన్నది.
- రాజాశ్రయం అనవసరమన్న ధూర్జటి పద్యం చదివి, ఇతరులను ఆశ్రయించకుండా హాయిగా స్వేచ్చగా బ్రతకవచ్చు.
- గురుభక్తి, దాతృత్వం, సత్యభాషణం, మంచితనం కలవాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.
- నరసింహ శతకంలో పద్యం చదివి మంచి లక్షణాలు అలవరచుకోవచ్చు. మంచివారిని మోసం చేయకుండా, దేవమాన్యాలు ఆక్రమించ కుండా ఉండవచ్చు.
- విశ్వనాథేశ్వర శతకంలో చెప్పిన పద్యం గ్రహించి మనం దేశభక్తిని పెంచుకోవచ్చు. త్యాగబుద్ధితో ప్రజల దైన్యస్థితిని తొలగించవచ్చు.
- శ్రీలొంకరామేశ్వర శతకంలోని పద్యం ద్వారా మిత్రుని మంచి లక్షణాలు గ్రహించవచ్చు.
- వేణుగోపాల శతకంలోని పద్యం చదివితే మానవరూపంలో ఉన్న రాక్షస లక్షణాలు కలవారిని దూరంగా ఉంచవచ్చు.
- సర్వేశ్వర శతకం, దాశరథి శతకం పద్యాలు చదవడం వల్ల దైవభక్తి పెంపొందుతుంది.
PAPER – II : PART – A
I. అవగాహన – ప్రతిస్పందన
అపరిచిత పద్యాలు (5 మార్కులు)
ప్రశ్న 1.
క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
పుస్తకముల నీవు పూవు వోలెను జూడు
చింపబోకు మురికి చేయబోకు
పరుల పుస్తకముల నేరువు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ తెలుగు బిడ్డ !
ప్రశ్నలు – జవాబులు
1. పై పద్యంలో వేటి ప్రస్తావన ఉంది ?
జవాబు:
పుస్తకాలు
2. పుస్తకాలను ఎలా జాగ్రత్త పరచాలి ?
జవాబు:
చింపకూడదు, మురికి చేయకూడదు.
3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది ?
జవాబు:
తెలుగు బిడ్డను.
4. ఇతరుల పుస్తకాలను తిరిగి ఇచ్చే నియమమేమిటి?
జవాబు:
వేగంగా ఇవ్వాలి.
5. పై పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
పుస్తకం.
ప్రశ్న 2.
క్రింది పద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కమలములు నీటబాసిన
కమలాప్తునా రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రుల శత్రులగుట తథ్యము సుమతీ !
ప్రశ్నలు – సమాధానములు
1. కమలములకు, సూర్యునికి గల సంబంధమేమి ?
జవాబు:
కమలములు నీటిలో నుండి బయటకు వస్తే సూర్యుని కాంతి తాకి వాడిపోతాయి.
2. ‘కమలిన భంగిన్’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
వాడిపోయిన విధంగా అని అర్థము.
3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదం ఏది ?
జవాబు:
‘తమ తమ నెలవులు దప్పిన’ అనే మూడో పాదం.
4. మిత్రులు శత్రువులెందుకవుతారు ?
జవాబు:
తమ తమ స్థానాలు కోల్పోతే మిత్రులు శత్రువులు అవుతారు.
5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది సుమతీ శతకంలోని పద్యం.
ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
మృగము మృగమనుచును మృగమును దూషింత్రు
మృగము కన్న చెడ్డ మూర్ఖుడగును
మృగము కున్న గుణము మూర్ఖున కేదయా
విశ్వదాభిరామ! వినురవేమ!
ప్రశ్నలు – సమాధానములు
1. మృగము అనగా అర్థము ఏమిటి ?
జవాబు:
పశువు
2. మృగం కన్నా చెడ్డవాడు ఎవరు ?
జవాబు:
మూర్ఖుడు
3. దేని గుణం గొప్పది ?
జవాబు:
మూర్ఖుని గుణం కన్నా మృగం గుణం గొప్పది
4. ఈ పద్యంలోని మకుటమేది ?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ
5. విశ్వదాభిరామ ఈ పదంలోని రెండు పదాలేవి ?
జవాబు:
విశ్వద, అభిరామ.
ప్రశ్న 4.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
ధరణి ధేనువుఁ బిదుకంగఁ దలఁచితేని
జనుల బోషింపు మధిప! వత్సముల మాడ్కి
జనులు పోషింపబడుచుండ జగతి కల్ప
లత తెఱంగున సకల ఫలంబు లొసఁగు.
ప్రశ్నలు – సమాధానములు
1. అధివులు ఎవరిని పోషించాలి ?
జవాబు:
అధిపులు, జనులను పోషించాలి.
2. జగతి ఏమి యొసంగును ?
జవాబు:
జగతి సకల ఫలము లొసగును.
3. ధరణి దేనితో పోల్చబడినది ?
జవాబు:
ధరణి దేనువుతో పోల్చబడినది
4. ‘భూమి’ అనే అర్థాన్ని సూచించే పదం ఏది ?
జవాబు:
‘భూమి’ అనే అర్థాన్ని సూచించే పదం ధరణి.
5. పై పద్యమునకు శీర్షిక నిర్ణయింపుము.
జవాబు:
ఈ పద్యమునకు శీర్షిక ‘రాజ్యపాలన’.
ప్రశ్న 5.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రునిగనుగొని పొగడగ,
పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతీ!
ప్రశ్నలు – సమాధానములు
1. పుత్రుడు జన్మించినపుడు తండ్రికి ఏమి కలుగదు ?
జవాబు:
పుత్రోత్సాహము
2. పుత్రోత్సాహము ఎవరికి కలుగుతుంది ?
జవాబు:
తండ్రికి కలుగుతుంది.
3. పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుంది ?
జవాబు:
జనులు ఆపుత్రుడుని పొగిడినపుడు
4. ‘కనుగొని’ అనగా ?
జవాబు:
‘కనుగొని’ అనగా తెలుసుకొని అని అర్థం
5. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.
ప్రశ్న 6.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
కనఁగ సొమ్ములెన్నొ కనకంబదొక్కటె
పసుల వన్నెలెన్నొ పాలొకటియె
పుష్పజాతులెన్నొ పూజ యొక్కటె సుమీ !
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు – సమాధానములు
1. సొమ్ములలో ఏది ప్రత్యేకత కలిగినది ?
జవాబు:
కనకం (బంగారం)
2. ‘పశుల’ అనగా ?
జవాబు:
పశువులు అని అర్థం.
3. పూల జాతులు ఎన్ని ఉన్నా ఏది ఒకటి ?
జవాబు:
పూజ ఒక్కటే
4. ఈ పద్యానికి మకుటమేమి ?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ
5. ‘కనకం’ అనగా అర్థమేమి ?
జవాబు:
కనకం అనగా బంగారం అని అర్థం.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)
ప్రశ్న 1.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖ క్రికెట్ క్రీడా కారుడు ఎం. ఎస్. ధోనీ వస్తున్నాడు. అతనిని ఇంటర్వూ చేయడానికి ప్రశ్నావళి తయారుచేయండి.
జవాబు:
ప్రశ్నావళి:
- మహాశయా ! స్వాగతం, మీరు క్రికెట్ ఏ వయస్సులో ప్రారంభించారు ?
- మీకు క్రికెట్ ఆటను నేర్పించిన గురువుగారు ఎవరు ?
- మీరు పాఠశాల వయస్సులో ఆడిన మొదటి పెద్ద క్రికెట్ పోటీ ఏది ?
- మీరు ఏ వయస్సులో రంజీట్రోఫీలో ఆడారు ? ఎప్పుడు ఇండియా టీములో చేరారు ?
- మీరు ఏ ట్రోఫీలో మొదట శతకాన్ని (సెంచరీ) కొట్టారు ?
- మీరు ఏ అంతర్జాతీయ పోటీలో మొదటి శతకాన్ని కొట్టారు ?
- మీకు 5 రోజుల క్రికెట్ ఇష్టమా ? లేక 50 ఓవర్ల వన్డే ఇష్టమా ? చెప్పండి.
- క్రికెట్ నేర్చుకోడానికి మాకు మీరిచ్చే సలహా ఏమిటి ?
- ప్రపంచకప్పును భారత్ ఎన్నిసార్లు సాధించింది ?
- క్రికెట్ పోటీలో నెగ్గడంలో కెప్టెన్ ప్రతిభ ఎంత ఉంటుంది ?
- మీరు మెచ్చిన ప్రపంచ క్రికెట్ వీరుడెవరు ?
- మీకు నచ్చిన భారత్ ప్రస్తుత క్రికెట్ వీరుడు ఎవరు ?
ప్రశ్న 2.
స్వచ్ఛభారత్ సమావేశం మీ గ్రామంలో జరిగింది. దాని నివేదిక తయారు చేయండి.
జవాబు:
నివేదిక
మా గ్రామంలో ది. 8-3-18న స్వచ్ఛభారత్ సమావేశం జరిగింది. మా గ్రామ సర్పంచి గారు అధ్యక్షత వహించారు. మండలాభివృద్ధి అధికారి, మండల విద్యాశాఖాధికారి, స్వచ్ఛభారత్ టీమ్సు, గ్రామస్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గ్రామంలో ఎక్కడా చెత్తా చెదారం ఉండ కూడదని వక్తలు చెప్పారు. బహిరంగ మల, మూత్ర విసర్జనలు చేయకూడదన్నారు. చెరువులు కలుషితం కాకుండా కాపాడుకోవాలని చెప్పారు. ప్లాస్టిక్ వాడ కూడదన్నారు.
అందరిచేతా స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు.
ప్రశ్న 3.
శతకపద్యాల గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
శతకం
సాహిత్యం రెండు రకాలు. ఒకటి పద్యం, రెండు గద్యం. పద్యం అంటే ఒక క్రమమైన తూగు, లయ కలది. గద్యం అంటే వచనం. దీనికి శ్రుతిలయలతో పని లేదు. పద్యానికి ఛందో నియమాలు కూడా ఉంటాయి.
పద్యం సులువుగా నోటికి వస్తుంది. పద్యంలో నీతులు, సూక్తులు, లోకానుభవాలు ఉంటాయి. వంద కాని అంతకంటే ఎక్కువ కాని, పద్యాలను రాస్తే దానిని శతకం అంటారు. శతకానికి మకుటం ప్రధానం. మకుటం అంటే కిరీటం అని అర్థం. రాజుకు కిరీటం ఎటువంటిదో శతకానికి మకుటం అటువంటిది. అన్ని పద్యాలలోనూ చివరి పదం కాని, పాదం కానీ, రెండు పాదాలు కానీ మకుటంగా ఉంటాయి.
‘సుమతీ, భాస్కరా’ వంటి శతకాలలో చివరిపదం మకుటం. ‘వేమన’ శతకంలో చివరిపాదం మకుటం. ‘భర్తృహరి సుభాషిత త్రిశతి’ని తెలుగులోకి కొందరు కవులు అనువదించారు. వాటికి మకుటం ఉండదు.
ప్రశ్న 4.
శతకాలు చదవడం గురించి సంభాషణలు రాయండి.
జవాబు:
సుశాంత్ : నువ్వేం చదువుతున్నావు ?
కీర్తన : 6వ తరగతి అంకుల్.
సుశాంత్ : తెలుగులో ఒక పద్యం చెప్పు.
కీర్తన : అల్పుడెపుడు పల్కునాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ.
సుశాంత్ : దీని అర్థం తెలుసా ?
కీర్త : తెలుసు
సుశాంత్ : ఈ పద్యాన్ని ఏమంటారో తెలుసా ?
కీర్తన : తెలియదు అంకుల్.
సుశాంత్ : శతకపద్యం అంటారు. శతకపద్యాలు చదువుకుంటే చాలా మంచిది.
కీర్తన : అంకుల్, మా తెలుగు సార్ కూడా పద్యాలు చాలా బాగా చెబుతారు. రోజూ ఒక పద్యమైనా చదవాలని మాకు రోజు చెబుతారు.
సుశాంత్ : వెరీ గుడ్, బాగా చదువుకో !
ప్రశ్న 5.
ఒక శతక కవిని అభినందిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:
శత శతకకర్త అయిన శతకరాజును ఘనంగా సన్మానించి సమర్పించు.
అభినందన పత్రం
శతక రాజా ! శత శతకాల కర్తా ! శతాధిక వందనాలు. మీరు రచించిన శతకపద్యాలు ఆణి ముత్యాలు. ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదించిన విజ్ఞానగనులు. తెలుగులోని తీపినంతా రంగరించి రచించిన మీ తెలివికి మా వందనాలు. అభివందనాలు. అందుకోండి మీ అభిమానుల ఆత్మీయ అక్షర మాలికను.
ఇట్లు
తెలుగు సాహితీ సదస్సు.
ప్రశ్న 6.
సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలడం” అనే అంశంపై కరపత్రం తయారుచేయండి.
జవాబు:
మూఢ నమ్మకాలను పారద్రోలండి
మిత్రులారా ! అనాదిగా మనదేశంలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. దెయ్యాలు, చేతబడులు, శకునాలు వంటి వాటిని మనము నమ్ముతూ వస్తున్నాము. ఒకనాడు భర్త చనిపోయిన స్త్రీ సహ గమనం చేసేది. తర్వాత ఆమె అలంకారాలు, నుదుట బొట్టు, నెత్తిన జుట్టు తీసివేశారు. ఆమెకు తిరిగి పెండ్లి చేసే ప్రయత్నం చేసేవారు కారు.
ఎందరో సంఘసంస్కర్తలు రాజా రామమోహన రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మన కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహాత్ములు ఈ మూఢనమ్మకాలను తరిమి కొట్టడానికి ఎంతో కృషిచేసి విజయం సాధించారు.
నేటికీ, చేతబడి చేసిందని ఒక గ్రామంలో ఒక స్త్రీని చంపారు. పూజలు చేస్తే పిల్లలు పుడతారని బాబాలను ఆశ్రయిస్తున్నారు. బాబాలు ఇచ్చే విబూదితో ఏదో జరుగుతుందని నమ్ముతున్నారు. ఇవన్నీ వట్టి మూఢనమ్మకాలు. మంత్ర తంత్రాలకు చింతకాయలు రాలవు. దెయ్యాలు లేవు. చేతబడులు లేవు. ఈ మూఢ నమ్మకాలను తరిమి తరిమి కొట్టండి.
ముఖ్యంగా మన బాలబాలికలు అభ్యుదయ దృష్టితో ముందుకు సాగాలి. ‘కష్టేఫలీ’ అని గుర్తించి శ్రమ చేస్తేనే ఫలితం. మనమంతా మూఢనమ్మకాలను పారద్రోలడానికి కంకణం కట్టుకుందాం. సరేనా ?
ఇట్లు
తేది : 10-8-2018.
పట్టణ బాలబాలికల సంఘం,
ఆదిలాబాద్.
ప్రశ్న 7.
శతక పద్యాలను చదవమని ప్రోత్సహిస్తూ కరపత్రం రాయండి.
జవాబు:
శతకాలు చదవండి – నీతిగా జీవించండి
మనకు కష్టం కలిగినా, బాధ కలిగినా, ఆనందం కలిగినా, అనుకోనిది ఎదురైనా వెంటనే గుర్తు వచ్చేది శతక పద్యం. మనిషిని మనిషిగా చేసేది చదువు, మహా మనీషిగా చేసేది శతకపద్య పఠనం, జాతికి నీతిని నేర్పేది శతకం, జీవన విధానాన్ని సవరించేది శతకం.
కనీసం ఒక్క శతకం అయినా పిల్లల నోటికి రావాలి. ఆ శతకాన్ని పదే పదే స్మరించాలి. పాఠశాల విద్యలో శతక పద్యాలకు ప్రముఖ స్థానం కల్పించాలి. పిల్లలు అందరూ శతకపద్యాలు చదివేలా ప్రోత్స హించండి. భావిభారతాన్ని నీతివంతం చేయండి.
ఇట్లు
శతక పద్య సదస్సు,
కరీంనగర్.
ప్రశ్న 8.
‘శతక మధురిమ’ పాఠం ఆధారంగా మనిషి అలవరుచు కోవలసిన మంచి లక్షణాలు వివరిస్తూ ఒక కవిత. రాయండి.
జవాబు:
మనీషి
భక్తికి కావాలి సత్యం, దయ, ఏకాగ్రతలు
ముక్తికి కావాలి ప్రకృతిపై విశ్వాస సమగ్రతలు
పండితునికి కావాలి గురువుపై భక్తి వినయాలు
దేవునికి కావాలి మంచి మనసు ప్రవర్తనలు
మనిషికి కావాలి దాతృత్వం అందరిలో ఏర్పడాలి సహోదర భావం.
ప్రశ్న 9.
తెలుగు పద్యాలు చదవమని నినాదాలు రాయండి.
జవాబు:
మన తెలుగు పద్యాలు – భాషకు ఆనంద నృత్యాలు
నోరారా చదవండి పద్యం – ఊరూరా పంచండి విద్య
చక్కని తెలుగు పద్యం – సరస్వతీ దేవికి నైవేద్యం
భాషకు సంపద పద్యం – మనిషికి మాటకు హృద్యం
కవులకు పద్యం ప్రాణం – చెవులకు హృద్యం పద్యగానం
పద్యాలలోని నీతులు – ప్రగతికి బాటలు.
ప్రశ్న 10.
నీకు నచ్చిన శతక కవిని గురించి మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:
నల్గొండ,
XXXXX.
ప్రియమైన మిత్రునకు,
నీ మిత్రుడు వ్రాయునది ముందుగా నీకు శుభాకాంక్షలు ముఖ్యముగా వ్రాయునది మన తెలుగు భాషలో ఎంతో మంచి శతకకవులు ఉన్నారు. వారిలో నాకు బాగా నచ్చిన శతకకవి వేమన. వేమన రచించిన శతక పద్యాలు ఆబాలగోపాలం అలరిస్తాయి. చిన్న చిన్న పదాలతో విపులమైన అర్ధాన్ని చొప్పించిన నేర్పరి వేమన. సామాజిక దృక్పథం, సంఘ సంస్కరణ మొదలైన భావాలు వేమన పద్యాల్లో కనిపిస్తాయి. వేమన ప్రజాకవిగా గుర్తింపు పొందారు. అందుకే వేమన నాకు బాగా నచ్చారు. నీకు నచ్చిన శతకకవిని గురించి వివరంగా నాకు లేఖను వ్రాయుము.
ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
XXXXXX.
చిరునామా :
పి. ఆనంద్,
10వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మధిర, ఖమ్మం జిల్లా.
ప్రశ్న 11.
శతక కవి మీ పాఠశాలకు వచ్చినప్పుడు మీరు ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారో ప్రశ్నావళిని తయారు చేయండి.
జవాబు:
శతక కవి మా పాఠశాలకు వచ్చినప్పుడు ఆయన గురించి తెలుసుకునేందుకు నేను అడిగే ప్రశ్నావళి జాబితా:
- గురువుగారికి నమస్కారం. మీకు రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది ?
- ఎవరి ప్రేరణతో రాయడం మొదలు పెట్టారు ?
- ఇప్పటివరకు రాసిన పుస్తకాలు ఎన్ని ?
- మీరు అందుకున్న అవార్డులు, సత్కారాలు ఏమిటి ?
- మీరు రాసిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏమిటి ?
- శతక పద్యాలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?
- తెలుగు భాషాభివృద్ధికి జరగాల్సిన కృషి ఏవిధంగా ఉండాలి ?
- మీరు రాసిన పద్యాల్లో మా కోసం ఒకటి వినిపించ గలరా ?
- నేటి యువ కవులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
- మేం కూడా పద్యాలు రాయాలంటే సాధన ఎలా చేయాలో చెప్పండి ?
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు
- నీళ్ళువదలు : బ్యాంకు దివాళా తీయడంతో, మా డిపాజిట్టు సొమ్ముకు నీళ్ళు వదులుకున్నాము.
- అనిదంపూర్వము: మోడీ ప్రధాని కావడంతో, భారత దేశానికి (పూర్వమందులేని) అనిదం పూర్వమైన విఖ్యాతి వచ్చింది.
- కొంపముంచు : గ్రామంలో సారా దుకాణం తెరిచి, ప్రభుత్వం మా ప్రజల కొంప ముంచింది.
- వరుసవావి : వరుసవావి లేకుండా, అందరితో వేళాకోళాలు పనికిరావు.
- ముచ్చటాడు : విద్యార్థులు కాలాన్ని ముచ్చట లాడుతూ గడపరాదు.
- కొంపలార్పు : దుర్మార్గులు పేదల కొంపలార్పడానికి సైతం వెనుకంజవేయరు.
2. పర్యాయపదాలు
పుష్పము = ప్రసూనము, కుసుమము, సుమము
సత్యము = నిజము, నిక్కము, తథ్యము, యదార్థము
దానము = త్యాగము, వర్ణనము, ఈగి, సమర్పణ
పుస్తకం = కబ్బము, కావ్యము, గ్రంథము, పొత్తము
బుధుడు = అర్కబంధువు, సమదర్శి, సర్వజ్ఞుడు, దశబలుడు
రాక్షసులు = అసురులు, దైత్యులు, దనుజులు, దానవులు
కత్తి = ఖడ్గము, అసి, రిష్టి, కృపాణము
కీర్తి = యశస్సు, భగము, పేరు, సమజ్ఞ
పుడమి = భూమి, ధరణి, అవని, వసుధ, ధర
జనని = తల్లి, అంబ, అమ్మ, మాత
బాంధవుడు = బంధువు, చుట్టం, విందు
గురువు = ఆచార్యుడు, ఒజ్జ, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు
దురితము = పాపం, కిల్బిషం, అఘం
బాణము = అమ్ము, తూపు, మార్గణం, ఆశుగం
కేలు = చేయి, హస్తం, పాణి
రాజు = ప్రభువు, భూపాలుడు, ఏలిక
3. వ్యుత్పత్త్యర్థాలు
సర్వజ్ఞుడు = సర్వమును తెలిసినవాడు (శివుడు)
శ్రీకాళహస్తీశ్వరా ! = సాలెపురుగు, పాము, ఏనుగులకు ముక్తిని ప్రసాదించిన ఈశ్వరుడు
దాశరథి = దశరథుని యొక్క పుత్రుడు (శ్రీరాముడు)
దురితదూరుడు = పాపాలను పోగొట్టేవాడు (నరసింహ స్వామి)
విశ్వనాథుడు = ప్రపంచమునకు భర్త (శివుడు)
4. నానార్థాలు
కనకం = బంగారం, ఉమ్మెత్త, సంపెంగ
జీవన = బ్రతుకు, నీళ్ళు, గాలి, ప్రాణం
పణం = పందెం, కూలి, వెల, ధనం
పేరు = నామధేయం, కీర్తి, అధికం, హారం
బుధుడు = పండితుడు, బుధగ్రహం, బుద్ధిమంతుడు
మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
వర్షము = వాన, సంవత్సరం, దేశం
సిరి = సంపద, లక్ష్మి
భీముడు = ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు
కులం = వంశం, జాతి, శరీరం, ఇల్లు
శ్రీ = లక్ష్మి, సరస్వతి, పార్వతి, విషము
గుణము = దారం, వింటినారి, దయ, విద్య
వీధి = త్రోవ, వాడ, పంక్తి
రాజు = ప్రభువు, క్షత్రియుడు, చంద్రుడు, ఇంద్రుడు
5. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
ఆధారం – ఆదరువు
స్తంభము – కంబం
కావ్యం – కబ్బం
హృదయం – ఎద, ఎడద, డెందం
చరిత్ర – చరిత
ప్రయాణం – పయనం
భుజము – బుజము
మృత్యువు – మిత్తి
భూమి – బూమి
యజ్ఞం – జన్నం
భిక్ష – బికిరము
శక్తి – సత్తి
పుస్తకము – పొత్తము
గుణము – గొనము
స్థిరము – తిరము
తపస్వి – తపసి
రూపము – రూపు
ఆశ – ఆస
కృష్ణుడు – కన్నయ్య
సత్యము – సత్తు
పుష్పము – పూవు
భక్తి – బత్తి
శ్రీ – సిరి
రాక్షసుడు – రక్కసుడు
హస్తి – అత్తి
PAPER – II : PART – B
1. సంధులు
ఎ. తెలుగు సంధులు
1. అకారసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా :
ముచ్చటాడు = ముచ్చట + ఆడు
2. ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమగునపుడు సంధియగు.
ఉదా :
వేరౌన = వేరు + ఔన
పుష్పంబెన = పుష్పంబు + ఎన్న
పుష్పమది = పుష్పము + అది
3. జత్త్వ సంధి
సూత్రం : క,చ,ట,త,ప లకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శ,ష,స,లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.
ఉదా :
మద్వేల్పు = మత్ + వేల్పు
భాస్వద్భక్తి = భాస్వత్ + భక్తి
4. త్రిక సంధి
సూత్రం : త్రికము మీది సంయుక్త హల్లునకు, ద్విత్వంబు బహుళంబుగానగు.
ఉదా :
మద్వేల్పు = మత్ + వేల్పు
అవ్వాడు = ఆ + వాడు
5. పుంప్వాదేశ సంధి
సూత్రం : కర్మధారయ సమాసాల్లో “ము” వర్ణకానికి బదులు “పుంపులు” ఆదేశంగా వస్తాయి.
ఉదా :
కనక కంబపు గుళ్ళు = కనకకంబము + గుళ్ళు
బి. సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునపుడు వాని దీర్ఘములు ఏకాదేశ మగును.
ఉదా :
భవదీయార్చన = భవదీయ + అర్చన
శీతామృత = శీత + అమృత
వర్షాశనము = వర్ష + అశనము
సకలా పేశము = సకల + ఆపేశము
2. గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ,ఓ,అర్లు ఏకాదేశమగును.
ఉదా :
విశ్వనాథేశ్వరా = విశ్వనాథ + ఈశ్వర
రామేశ్వర = రామ + ఈశ్వర
సర్వేశ్వరా = సర్వ + ఈశ్వర
సమోత్సవ = సమ + ఉత్సవ
సత్యోక్తి = సత్య + ఉక్తి
3. ఉకార సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి యగు.
ఉదా :
పుష్పంబెన్న = పుష్పంబు + ఎన్న
ఊరూరం = ఊరు + ఊరం
జనులెల్లన్ = జనులు + ఎల్లన్
కొంపలార్చు = కొంపలు + ఆర్చు
వేరౌన = వేరు + ఔన
దైవమిక = దైవము + ఇక
4. శ్చుత్వసంధి
సూత్రం : స-కార త వర్గములకు, శ-కార చ వర్గము పరమగునపుడు శ-కార, చ-వర్గములు వచ్చును.
ఉదా :
ఉజ్జ్వల = ఉత్ + జ్వల
సజ్జనుడు = సత్ + జనుడు
5. వృద్ధి సంధి
సూత్రం : అకారమునకు ఏ, ఐలు పరమగునపుడు “ఐ”కారమును, ఓ, ఔలు పరమగునపుడు “ఔ” కారమును ఏకాదేశమగును.
ఉదా :
సిరిలేకైన = సిరిలేక + ఐన
6. విసర్గ సంధి
సూత్రం : హ్రస్వ అకారం మీది విసర్గకు ‘అవర్ణం’గాని, వర్గ తృతీయ, చతుర్థ పంచమాక్షరాలుగాని, హ-య-వ-ర-ల అనే అక్షరాలు గాని పరం అయితే విసర్గకు లోపం వచ్చి దానికి ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది.
ఉదా :
పయోనిధి = పయః + నిధి
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు
స్వచ్ఛవాఃపూరము – స్వచ్ఛమైన వాఃపూరము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
సన్మనోహర సౌజన్యం – సన్మోహరమైన సౌజన్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
మత్తవేదండము – మత్తదైన వేదండము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
త్యాగమయదీక్ష – త్యాగమయమైన దీక్ష – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
దైన్యస్థితి – దైన్యమైన స్థితి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
సకల గ్రంథములు – సకలములైన గ్రంథములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
శీతామృతము – శీతమైన అమృతము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
సత్యోక్తి – సత్యమైన ఉక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
తృతీయ పుష్పము – తృతీయమైన పుష్పము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
భూషణవికాస – భూషణముచేత వికాస – తృతీయా తత్పురుష సమాసము
అనింద – నింద కానిది – నఞ తత్పురుష సమాసము
దేవాగ్రహారములు – దేవుని యొక్క అగ్రహారములు – షష్ఠీ తత్పురుష సమాసము
పయోనిథి – పయస్సుకు నిథి – షష్ఠీ తత్పురుష సమాసము
మద్వేల్పు – మా యొక్క వేల్పు – షష్ఠీ తత్పురుష సమాసము
దేశజననీ ప్రాశస్త్యము – దేశ జనని యొక్క ప్రాశస్త్యము – షష్ఠీ తత్పురుష సమాసము
కృపనిధి – కృపకు నిధి – – షష్ఠీ తత్పురుష సమాసము
భుజతాండవము – భుజముల యొక్క తాండవము – షష్ఠీ తత్పురుష సమాసము
గురుపాదానతి – గురువులకు పాదానతి – షష్ఠీ తత్పురుష సమాసము
ఆర్తజనబాంధవుడు – ఆర్తజనులకు బాంధవుడు – షష్ఠీ తత్పురుష సమాసము
కార్యసాధనము – కార్యము యొక్క సాధనము – షష్ఠీ తత్పురుష సమాసము
కులగర్వము – కులము యొక్క గర్వము – షష్ఠీ తత్పురుష సమాసము
నీతివాచస్పతి – నీతియందు వాచస్పతి – సప్తమీ తత్పురుష సమాసం
భండన భీముడు – భండనమునందు భీముడు – సప్తమీ తత్పురుష సమాసం
3. వాక్య పరిజ్ఞానం
అ) క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా వ్రాయండి.
ప్రశ్న 1.
నేను గుంటూరు వచ్చాను. శారదానికేతనంలో చేరాను.
జవాబు:
నేను గుంటూరు వచ్చి శారదానికేతనంలో చేరాను.
ప్రశ్న 2.
రవి బాగా చదివాడు. రవి పరీక్ష వ్రాశాడు.
జవాబు:
రవి బాగా చదివి పరీక్ష వ్రాసాడు.
ప్రశ్న 3.
గోపాల్ బాగా చదువుతాడు. గోపాల్ తొమ్మిదింటికే నిద్రపోతాడు.
జవాబు:
గోపాల్ బాగా చదివి తొమ్మిదింటికే నిద్రపోతాడు.
ప్రశ్న 4.
గీత బాగా నృత్యం నేర్చుకొంది. గీత బాగా నృత్యం చేసింది.
జవాబు:
గీత బాగా నృత్యం నేర్చుకొని, చేసింది.
ప్రశ్న 5.
మంచి రచనలను వ్రాయండి. మంచి మెప్పు పొందండి.
జవాబు:
మంచి రచనలను వ్రాసి మెప్పు పొందండి.
ఆ) క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగాను, కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగాను రాయండి.
ప్రశ్న 1.
దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారయ్యింది. (కర్తరి వాక్యం)
జవాబు:
దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారుచేయబడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 2.
బూర్గులవారు మంచినిర్ణయాలు తీసుకున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
బూర్గుల వారిచే మంచి నిర్ణయాలు తీసుకొనబడ్డాయి. (కర్మణి వాక్యం)
ప్రశ్న 3.
వారి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బుర పరచింది. (కర్తరి వాక్యం)
జవాబు:
వారి న్యాయవాద పటిమ ఇతరులచే అబ్బుర పరచ బడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 4.
రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచ బడ్డాయి. (కర్తరి వాక్యం)
జవాబు:
రేఖామాత్రంగా నా భావాలను ఇక్కడ పొందుపరిచాను. (కర్మణి వాక్యం)
ఇ) క్రింది పరోక్ష కథనాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చి రాయండి.
ప్రశ్న 1.
‘నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను’ అని అమ్మతో అన్నాను.
జవాబు:
తాను నేటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాడు.
ప్రశ్న 2.
నీకివ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు.
జవాబు:
అతనికివ్వాల్సింది ఏమీలేదని నాతో అన్నాడు.
ప్రశ్న 3.
సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
జవాబు:
‘సుందరకాండ చదువుము’ అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
ప్రశ్న 4.
వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికి వెళ్ళాడు” అని.
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని.
ప్రశ్న 5.
“ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని అందరు అనుకుంటున్నారు.
జవాబు:
ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరు అను కుంటున్నారు.