TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం సుందరకాండ Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

సుందర కాండం

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ 1
హనుమంతుడు దేవతలకు నమస్కరించి, శరీరాన్ని పెంచి, పాదాలను దట్టించి ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. సముద్రం కోరికపై, లోన ఉన్న మైనాక పర్వతం పైకి లేచి తనపై విశ్రాంతి తీసుకోమన్నది. ఆగడానికి సమయం లేదని హనుమంతుడు ముందుకు సాగిపోయాడు. సురస అనే నాగమాత హనుమంతుడిని ఆశీర్వదించింది. అడ్డువచ్చిన సింహికను హనుమంతుడు చీల్చివేశాడు. ఏ మాత్రం అలసట లేకుండా హనుమంతుడు లంకకు చేరాడు.

రాత్రిపూటలో శరీరాన్ని కుదించుకొని లంకలో ప్రవేశించగా లంకిణి అతణ్ణి చూచింది. హనుమంతుడిని బలంగా కొట్టింది. హనుమంతుని దెబ్బకు లంకిణి కూలబడిపోయింది. బ్రహ్మ చెప్పిన ప్రకారం లంకకు కీడుమూడిందని లంకిణి పలికింది. హనుమంతుడు ప్రాకారం పై నుంచి దూకి మొదట ఎడమ పాదం మోపాడు. అక్కడ లంకా వైభవాన్ని దర్శించాడు. అన్ని భవనాలూ వెదికాడు. ఎక్కడా సీతజాడ లేదు. రావణుని అంతఃపురంలో మండోదరిని చూశాడు. మొదట సీత అని భ్రాంతి పడినా, తరువాత కాదని తెలుసుకున్నాడు. నిరుత్సాహపడకుండా వెతికాడు. ఎక్కడా సీత కనిపించకపోయేసరికి ప్రాయోపవేశంతో ప్రాణాలు వీడాలనుకున్నాడు. కానీ బ్రతికివుంటేనే ఎప్పటికైనా దేన్నైనా సాధించవచ్చునని నిశ్చయించుకున్నాడు.

అశోకవనంలో ప్రవేశించాడు. శింశుపావృక్షంపైకి ఎక్కాడు. అక్కడ మలిన వస్త్రాలు ధరించి రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న సీతను చూచాడు. తెల్లవారగానే రావణుడు అశోకవనానికి వచ్చాడు. సీతను నయానా భయానా మనసు మార్చే ప్రయత్నం చేశాడు. సీత అతడి ప్రలోభాలకు లొంగలేదు. రావణుడు రెండు నెలలు గడువిచ్చాడు. రాక్షస స్త్రీలు సీతను చంపుతామని బెదిరించారు. విభీషణుని కూతురైన త్రిజట తనకు వచ్చిన కలను గూర్చి చెప్పింది.

హంసల పల్లకిలో రామలక్ష్మణులు కూర్చున్నారని, సముద్రం మధ్య తెల్లని పర్వతంపై సీత కూర్చున్నదని, రావణుడు నేలపై పడివున్నాడని ఆమె తన కలలో కనబడిన దృశ్యాలను చెప్పింది. సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టుపై ఉన్న హనుమంతుడు రామకథను వర్ణించాడు. సీత అతడిని చూచి ఆశ్చర్యపడింది. హనుమంతుడు చెట్టు దిగివచ్చి తాను శ్రీరామ దూతను అన్నాడు. సీత ఇది రావణుని మాయ అని అనుమానించింది.

హనుమంతుడు ఆమె కోరికపై రాముని స్వరూపాన్ని వర్ణించి శ్రీరామ ముద్రికను సమర్పించాడు. సీత తనను రాక్షస చెర నుండి తప్పించమని రామునికి చెప్పమన్నది. హనుమంతుడు ఆమెను తన వీపుపై మోసుకెళ్లడానికి సిద్ధపడ్డాడు. పరపురుషుని తాకదు కాబట్టి సీత యిందుకు నిరాకరించింది. హనుమంతుడు ఆనవాలును అడగగా దివ్య చూడామణిని సీత అతడికి ఇచ్చింది. హనుమంతుడు అశోకవనాన్ని నాశనం చేశాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

రావణుడు పంపిన రాక్షసులను కూడా మట్టుపెట్టాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుణ్ణి బంధించాడు. తాను రామదూతనని రావణునికి హనుమంతుడు చెప్పాడు. విభీషణుడు దూతను చంపడం భావ్యం కాదనగా, రావణుడు అతడి. తోకకు నిప్పు అంటించమన్నాడు. హనుమంతుడు లంకను తగలబెట్టి, తన తోకను సముద్రంలో చల్లార్చుకున్నాడు. సీతకు నమస్కరించి, తిరుగు ప్రయాణం ప్రారంభించాడు.

విజయోత్సాహంతో మహేంద్రగిరి శిఖరం చేరాడు. సీతమ్మను కనుగొంటినని ప్రకటించాడు. రావణుని చంపి సీతను తీసుకొని వద్దామని అంగదుడు అనగా, రాముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి మనం ఆ పని చేయగూడదని జాంబవంతుడు పలికాడు. మధువనంలో తేనెతాగి అందరూ ఆనందించారు. హనుమంతుడు శ్రీరామునికి నమస్కరించి ‘కనుగొంటి సీతమ్మను” అన్నాడు. సీత ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించాడు. తన అన్వేషణ వృత్తాంతాన్ని వివరించాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమమని, బాధల్లో నిరుత్సాహపడకూడదని నిరూపించి హనుమంతుడు ఎలా ఆదర్శప్రాయు
జవాబు:
లంకలోని రావణుని అంతఃపురంలోకి వెళ్ళి ఎంత వెదికినా హనుమంతునికి సీత జాడ తెలియలేదు. ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు. సీత జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు. సీత కనబడలేదని చెపితే శ్రీరాముడు జీవించడు. అతను లేక లక్ష్మణుడుండడు. వీరి మరణవార్త విని భరత శత్రుఘ్నులుండరు. పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య, సుమిత్ర, కైకేయీ తనువులు చాలిస్తారు.

ప్రియ మిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బ్రతకడు. దానితో రుమ, తార, అంగదులు మిగలరు. ఇది చూసి వానరజాతి ఈ లోకాన్ని వీడుతుంది. కాని తర్కించి చూస్తే ఆత్మహత్యకన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమమనిపించింది. చచ్చి సాధించేదేమిటి ? బతికితే సుఖాలను, శుభాలను పొందవచ్చు. బతికి ఉన్న వాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ రకంగా సీత జాడ మొదట కనిపెట్టలేక నిరుత్సాహపడినా, ధైర్యం తెచ్చుకున్నాడు. ఆత్మహత్య వల్ల ప్రయోజనం లేదని నిరూపించి, నేటికీ మనకు ఆదర్శప్రాయునిగా నిలిచాడు హనుమంతుడు.

ప్రశ్న 2.
లంకా దహన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు లంకలో సీతను దర్శించి రాముని ఉంగరమిచ్చి ఆమె చూడామణిని ఆనవాలుగా గ్రహించాడు. రావణుని బలం ఎంతో తెలుసుకుందా మనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాక్షస స్త్రీలు రావణునికి ఈ విషయం చెప్పారు. రావణుడు పంపిన ఎనభైవేల మంది రాక్షసులను మట్టుపెట్టాడు. జంబుమాలిని, ఏడుగురు మంత్రి కుమారులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారుని చంపాడు.

చివరికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుని బంధించి రావణుని ముందుంచాడు. అక్కడ హనుమంతుడు రాముని పరాక్రమం వెల్లడించాడు. రావణుడు కోపంతో హనుమంతుని తోకకు నిప్పంటించమన్నాడు. హనుమంతుడు మండుతున్న తోకతో లంక అంతా నిప్పు ముట్టించాడు. లంకలో హహాకారాలు చెలరేగినాయి. సముద్రంలో తోకను చల్లార్చుకొని ఆకాశానికెగిరి తిరుగు ప్రయాణమైనాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 3.
హనుమ సముద్రలంఘనం చేసిన విధానం వివరించండి.
జవాబు:
మహాబలవంతుడైన హనుమ, సముద్రం దాటడానికి ముందు దేవతలు అందరికీ నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్దగా గర్జించాడు. చేతులు నడుముపై పెట్టాడు. అంగదాది వీరులతో తాను రామబాణంలా లంకకు వెడతానన్నాడు.

సముద్రంపై నుండి వెడుతున్న హనుమంతుడికి సాయం చేద్దామని సముద్రుడు అనుకున్నాడు. రామకార్యం మీద వెడుతున్న హనుమకు శ్రమ కలుగకూడదని, సముద్రంలోని మైనాకుణ్ణి సముద్రుడు బయటకు రమ్మన్నాడు. మైనాకుడి శిఖరాలపై హనుమ కొంచెం విశ్రాంతి తీసుకొంటాడని సముద్రుడు అనుకున్నాడు.

మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు తనకు అడ్డు వస్తున్నాడని హనుమ అనుకొని, తన వక్షంతో అతడిని గెంటివేశాడు. మైనాకుడు మానవరూపంతో పర్వత శిఖరంపై నిలబడి, సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ సంతోషించాడు. తనకు సమయం లేదని, చేతితో మైనాకుణ్ణి హనుమ తాకి వెళ్ళాడు.

తరువాత హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాత వచ్చి, హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని, అతడిని ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి హనుమను మ్రింగాలని చూసింది. కాని హనుమంతుడు గోళ్ళతో సింహికను చీల్చివేశాడు.

ఇలా హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడు.

ప్రశ్న 4.
సీతాదేవిని హనుమంతుడు తొలిసారి సందర్శించి నపుడు అతడు పొందిన ఆనందాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీతను వెతుకుతూ, రావణుడి అంతః పురంలోకి వెళ్ళాడు. అక్కడ గొప్ప అందంతో ఉన్న రావణుడి భార్య మండోదరిని చూసి, సీత అని భ్రాంతిపడ్డాడు. తాను సీతను చూశానని హనుమ ఆనందంతో గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పు అనుకున్నాడు.

తరువాత హనుమ ఆశోకవనం అంతా, సీత కోసం వెతికాడు. శింశుపా వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు క్రింద మాసిన బట్టలు కట్టుకొన్న ఒక స్త్రీని హనుమ చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె దీనావస్థలో ఉంది. ఆమె సీతయే అని, హనుమ అనుకున్నాడు.

అతడు ఆమె ధరించిన ఆభరణాలు చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయాయి. దానితో ఆమె సీతయే అని హనుమంతుడు గట్టిగా నిశ్చయించాడు. సీతాదేవిని చూడగానే హనుమంతుడి కళ్ళ నుండి ఆనందబాష్పాలు జారాయి. శ్రీరాముడిని మనస్సులో స్మరించుకొని, హనుమంతుడు నమస్కరించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 5.
త్రిజటా స్వప్నం గురించి రాయండి.
జవాబు:
‘త్రిజట’ విభీషణుని కూతురు. రావణుడు సీతను అశోకవనంలో ఉంచి, రాక్షస స్త్రీలను ఆమెకు కాపలాగ పెట్టాడు. వారిలో ‘త్రిజట’ కూడా ఉంది. రావణుని భర్తగా అంగీకరించడానికి సీతను ఒప్పించమని రావణుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు. రాక్షస స్త్రీలు సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. లేకపోతే చంపుతామని వారు సీతను బెదిరించారు. సీత ఎంతో ఏడ్చింది.

అంతవరకూ నిద్రపోతున్న త్రిజట లేచి తనకు కల వచ్చిందని అక్కడున్న రాక్షస స్త్రీలకు చెప్పింది. కలలో వేయి హంసల పల్లకిపై రామలక్ష్మణులు కనబడ్డారని, సీత తెల్లని పర్వతం మీద కూర్చుందనీ వారికి చెప్పింది. రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, ఒక నల్లని స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణంవైపు ఈడ్చుకువెడుతోందని కూడా చెప్పింది. రావణుడు పందిమీద దక్షిణ దిశగా వెళ్ళడం తాను కలలో చూశానని, లంకానగరం చిన్నాభిన్నం కావడం తాను చూశానని త్రిజట తోటి రాక్షస స్త్రీలకు చెప్పింది.

తనకు కలలో విమానం కనబడింది కాబట్టి సీత కోరిక సిద్ధిస్తుందనీ, రావణుడికి వినాశం, రాముడికి జయం కలుగుతుందనీ త్రిజట చెప్పింది. త్రిజట ఉత్తమురాలు.

ప్రశ్న 6.
లంక దహనానికి అసలు కారకులెవరు ? ఎలా ? విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీత జాడను తెలుసుకున్నాక, రావణుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలను కున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు పంపిన రాక్షస వీరులను అందరినీ హనుమ చంపాడు. చివరకు ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించి, రావణుడి వద్దకు తీసుకు వెళ్ళాడు.

రావణుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతులలో దండింపవచ్చునని విభీషణుడు అన్న రావణునికి చెప్పాడు.

హనుమంతుడి తోకకు నిప్పు అంటించి, లంక అంతా తిప్పమని రాక్షసులకు రావణుడు చెప్పాడు. వారు బట్టలు హనుమంతుడి తోకకు చుట్టారు. దానిని నూనెతో తడిపారు. హనుమ తోకకు నిప్పు అంటించి, వారు లంక అంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుడి భవనం తప్ప, లంకనంతా కాల్చాడు. ఈ విధంగా రాముడు సీతను చూసి రమ్మని హనుమంతుడిని పంపితే, హనుమ లంకను కాల్చి వచ్చాడు.

దీనినిబట్టి లంకను కాల్చడానికి అసలు కారకుడు రావణుడు అని మనకు తెలుస్తుంది. హనుమంతుడు రాముడి పరాక్రమాన్ని గుర్తుచేసి, సీతను రాముడి వద్దకు పంపమని రావణుడికి చెప్పడానికే వెళ్ళాడు. కాని రావణుడు, తెలివి తక్కువగా హనుమ తోకకు నిప్పు పెట్టించాడు. కాబట్టి లంకా దహనానికి రావణుడే అసలు కారకుడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 7.
సీత, హనుమంతుడుల మధ్య శింశుపా వృక్షం కింద జరిగిన సంభాషణా సారాంశాన్ని రాయండి. (June 2018)
జవాబు:
హనుమంతుడు అశోకవనంలో సీతను చూచాడు. తన మాటల ద్వారా తాను రామదూతనని సీతకు నమ్మకం కలిగించాడు. సీత కోరికపై హనుమ, రాముని రూపగుణాలను వర్ణించి చెప్పాడు. తాను తెచ్చిన రామముద్రికను హనుమ సీతకు ఇచ్చాడు. రామ ముద్రికను చూసి సీత ఆనందభరితురాలయ్యింది. సీత తన దీనావస్థను హనుమంతునికి చెప్పింది. రాముణ్ణి త్వరగా లంకను తీసుకువచ్చి తనను రాక్షసుల చెరనుండి విడిపించమని సీత హనుమంతుని కోరింది.

హనుమంతుడు సీతను తన వీపుమీద కూర్చోమన్నాడు. అలా చేస్తే వెంటనే సీతను రాముని వద్దకు తీసుకొని వెళ్ళగలనన్నాడు. కాని సీతమ్మ అందుకు నిరాకరించింది. సీత తాను పరపురుషుని తాకనని చెప్పింది. అప్పుడు హనుమ సీతను రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని అడిగాడు. సీత తన చూడామణిని హనుమకు ఇచ్చింది.

సీతను వెంటనే రాముని వద్దకు తీసుకొని వెళ్ళి సీతారాములకు ఆనందం కలిగించాలని హనుమ భావించాడని, రాముని క్షేమవార్తను చెప్పి సీత ప్రాణాలను నిలబెట్టాడని వారి సంభాషణ వల్ల తెలుస్తుంది.

సీతమ్మ తనకు వెంటనే చెర నుండి విముక్తి కలగాలని కోరుకోలేదు. ఆమెకు తన పాతివ్రత్యం ముఖ్యం. రాముడే వచ్చి రావణుని చంపి తనను తీసుకొని వెళ్ళాలని ఆమె చెప్పింది. హనుమంతుడు సీతను దొంగతనంగా తీసుకొని వెళ్ళడం, రామునకు అపకీర్తికరమని సీత అభిప్రాయపడింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 8.
హనుమంతుని వ్యక్తిత్వాన్ని గురించి రాయండి. (June 2017)
జవాబు:
రామాయణములో రాముని తర్వాత నాకు నచ్చిన పాత్ర ‘ఆంజనేయుడు’. హనుమంతుని వ్యక్తిత్వము, చాలా గొప్పది.

హనుమంతుని వ్యక్తిత్వము :
హనుమంతుడు గొప్ప బలశాలి. ధైర్యసాహసాలు గలవాడు. ఇతడు పసితనంలోనే సూర్యుణ్ణి చూసి పండు అనుకొని ఆకాశానికి ఎగిరిన మహాబలశాలి. హనుమంతుడు, స్వామిభక్తి పరాయణుడు. ఇతడు సుగ్రీవునికి నమ్మిన బంటు మంత్రి. ఇతడు రామసుగ్రీవులకు స్నేహం కలిపిన ప్రజ్ఞాశాలి. ఇతడు శ్రీరామునికి మహాభక్తుడు. వీరాగ్రణి.

మహాబలశాలి :
ఇతడు నూరుయోజనాల సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీత జాడను తెలిసికొని వచ్చాడు. లంకలో ఎందరో రాక్షస వీరులను చంపి సభలో రావణుని హెచ్చరించి, లంకను కాల్చి వచ్చాడు. సీతకు రాముని ఉంగరాన్ని ఇచ్చి, ఆమె ఇచ్చిన చూడామణిని తెచ్చి రామునకు అందించాడు.

హనుమంతుడు, సముద్రంపై వారధిని నిర్మింపజేసి, రాముడిని తన భుజాలపై కూర్చుండపెట్టుకొని, లంకా నగరానికి వానరసేనతో చేరాడు. యుద్ధంలో హనుమంతుడు ఎందరో రాక్షసవీరులను సంహరించాడు. లంకిణిని సంహరించాడు.

సంజీవి పర్వతాన్ని తెచ్చి, లక్ష్మణుని బ్రతికించాడు. హనుమంతుడు తన పరాక్రమంతో, బలంతో శత్రువయిన రావణుని ప్రశంసలను సైతం పొందాడు. రాముడు హనుమంతుని సహాయాన్ని మెచ్చి, ఆలింగనం చేసికొన్నాడు.

హనుమంతుడు మహావీరుడు, మహాభక్తుడు, స్వామికార్య ధురంధరుడు. ఇతడు సీతమ్మ మెప్పును పొందిన రామదూత ఆంజనేయుడు. శ్రీరాముని హృదయాన్ని చూరగొన్న భక్తాగ్రేసరుడు. కాబట్టి రామాయణంలో నాకు నచ్చిన పాత్ర హనుమంతుడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 9.
హనుమంతుడు సీతను ఎలా గుర్తుపట్టాడు ? వివరించండి.
(లేదా)
లంకలో ప్రవేశించిన హనుమంతుడు సీతను గుర్తించిన విధానమును తెలుపండి. (May 2022)
జవాబు:
సీతకోసం రాక్షస భవనాలన్నీ వెతికాడు. రావణుని అంతఃపురం కూడా వెతికాడు. మహాసౌందర్యవతి అయిన మండోదరిని సీత అని భ్రమించాడు. కాని, అంతలోనే ఆమె సీతకాదని నిర్ణయించుకొన్నాడు.

తర్వాత అశోకవనంలోకి వెళ్ళాడు. అణువణువు వెతికాడు. శింశుపావృక్షం ఎక్కాడు. దాని కింద ఒక స్త్రీ మలిన వస్త్రాలతో ఉంది. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. రాముని ఎడబాసిన సీత ఉండవలసిన స్థితిలో ఉంది.

అందుకే ఆమెను సీతగా గుర్తించాడు. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయేయి. ఋష్యమూక పర్వతం వద్ద చూచిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించలేదు. కచ్చితంగా ఆమెను సీతగా నిర్ధారించుకొన్నాడు. రావణాసురుడు వచ్చి, సీతను భయపెట్టి వెళ్ళాడు. సీతాదేవికి వినబడేలా రామకథాగానం చేశాడు. సీత నాలుగు వైపులా చూసింది. దానితో ఆమెను సీతగా పూర్తిగా నిర్ధారించుకొన్నాడు.

మొదట సీతాదేవి బాహ్య పరిస్థితులను గమనించాడు. తర్వాత ఆమె స్థితిని గుర్తించాడు. ఆమె మనసుకు నచ్చే రామ కథను విన్పించి, ఆమె ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని గమనించాడు. ఆ విధంగా సీతను గుర్తించాడు.

ప్రశ్న 10.
హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతాదేవికి నివేదించిన విధం చెప్పండి.
జవాబు:
శ్రీరాముడు పద్మముల వంటి కన్నులు కలవాడు. చక్కని దేహ సౌందర్యము, గుణసంపద కలవాడు. తేజస్సులో రాముడు -సూర్యుడి వంటివాడు. ఓర్పులో భూదేవి వంటివాడు. బుద్ధిలో బృహస్పతి. కీర్తిలో దేవేంద్రుని వంటివాడు.

రాముడు శరణు అన్నవారిని రక్షిస్తాడు. శత్రువులను సంహరిస్తాడు. రాజవిద్యాకుశలుడు. సర్వ విద్యా పండితుడు. వినయము గలవాడు. యజుర్వేదమందు, ధనుర్వేదమందు పండితుడు. విశాలమైన భుజములు, పొడవైన భుజములు, శంఖం వంటి కంఠము, శుభప్రదమైన ముఖము కలవాడు. దుందుభి వంటి కంఠస్వరము కలవాడు. శ్రీరాముడు సకల ఐశ్వర్య సంపన్నుడు.

శ్రీరాముడు సత్యము మాట్లాడుటయందు, ధర్మాచరణము నందు ఆసక్తి కలవాడు. పాత్రులకు దానము చేస్తాడు. అందరితో ప్రియముగా మాట్లాడుతాడు. శ్రీరాముడు మేఘమువలె శ్యామల వర్ణము గలవాడు.

శ్రీరాముడు దశరథుని పెద్ద కుమారుడు. శ్రీరాముడు చంద్రుడివలె చక్కని ముఖము కలవాడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. ధర్మ రక్షకుడు. అరివీరభయంకరుడు అని హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతకు చెప్పాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 11.
హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూసి మాట్లాడిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్ద ధ్వని చేస్తూ, చేతులను నడుం మీద ఉంచి, తోకను విదల్చాడు. సీతను చూసి వస్తానని, అంతరిక్షంలోకి ఎగిరాడు. హనుమ సముద్రంపై వెడుతుండగా, సముద్రుడు హనుమకు సాయం చేద్దామని తనలో దాగిన మైనాకుణ్ణి పైకి రమ్మన్నాడు. హనుమ ఆ గిరిశిఖరాలపై విశ్రాంతి తీసికొంటాడని సాగరుడు అనుకున్నాడు. పైకి లేచిన మైనాకుణ్ణి చూసి, తనకు అడ్డంగా ఉన్నాడని, హనుమ తన వక్షఃస్థలంతో నెట్టివేశాడు. మైనాకుడు మనిషి రూపంలో గిరి శిఖరంపై నిలిచి, సముద్రుడి కోరికను హనుమకు తెలిపాడు. హనుమ తనకు మధ్యలో ఆగడం కుదరదని, మైనాకుని చేతితో తాకి ముందుకు సాగాడు.

హనుమను పరీక్షించాలని ‘సురస’ అనే నాగమాత యత్నించి హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది. ‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగాలని చూసి, తానే హనుమ చేతిలో మరణించింది. హనుమ లంకను చూశాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకొని, లంకలో ప్రవేశించాడు. లంకాధిదేవత (లంకిణి) లంకలోకి వెళ్ళడానికి హనుమంతుడిని అడ్డగించింది. హనుమ లంకను చూసి వస్తానన్నాడు. లంకిణి హనుమను అరచేతితో కొట్టింది. హనుమ లంకిణిని ఒక్క దెబ్బ వేశాడు. లంకిణి కూలిపోయింది. వానరుడు వచ్చి లంకిణిని జయించినపుడు రాక్షసులకు కీడు కల్గుతుందని బ్రహ్మ చెప్పాడని హనుమకు లంకిణి చెప్పింది. హనుమను లంకలోకి వెళ్ళమంది.

హనుమ ప్రాకారం నుండి లంకలోకి దూకాడు. లంకలో ఎడమపాదం పెట్టాడు. హనుమ లంకలో రాక్షస భవనాలన్నీ వెదికాడు. రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు. తరువాత ఆమె సీత కాదని నిశ్చయించాడు. చివరకు సీత చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. హనుమ తాను కూడా మరణిద్దాం అనుకున్నాడు. చివరకు బతికి ఉంటే శుభాలు పొందవచ్చుననుకున్నాడు.

హనుమ అశోకవనంలోకి వెళ్ళాడు. హనుమ ఆ వనంలో శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె సీత అయి ఉంటుందని నిశ్చయించాడు. హనుమ చెట్టుమీదే ఉన్నాడు. తెల్లవారుతోంది. రావణుడు వచ్చి, సీత మనస్సును మార్చబోయాడు. సీత లొంగలేదు. రావణుడు సీతకు రెండు నెలలు గడువు ఇచ్చి, సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలకు చెప్పాడు. రావణుడు వెళ్ళిపోయాక, రాక్షస స్త్రీలు, సీత మనస్సును మార్చడానికి యత్నించారు. సీత రాముడిని విడిచి ఉండలేక చనిపోదామనుకుంది.

విభీషణుడి కూతురు త్రిజట నిద్ర నుండి లేచింది. త్రిజట తనకు కల వచ్చిందనీ ఆ కలలో వేయి హంసల పల్లకిలో రాముడూ, తెల్లని పర్వతంపై సీత కనబడ్డారని, రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, లంక ఛిన్నాభిన్నం అయ్యిందనీ, రాముడికి జయం కల్గుతుందనీ చెప్పింది.

సీతకు శుభశకునాలు కనబడ్డాయి. హనుమంతుడు రామకథను గానం చేశాడు. సీత చెట్టు మీద హనుమను చూసి ఆశ్చర్యపడింది. హనుమ చెట్టుదిగి, ఆ స్త్రీని “నీ వెవరవు ?’ నీవు సీతవైతే నీకు శుభం అవుతుంది” అన్నాడు. తన పేరు సీత అని, ఆ స్త్రీ చెప్పింది. హనుమ తాను శ్రీరామ దూతనని చెప్పాడు. హనుమను చూసి సీత మొదట రాక్షసుడు అనుకుంది. రామదూతవయితే రాముణ్ణి గురించి చెప్పు అన్నది. హనుమ రాముని రూపాన్ని వర్ణించాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీతకు గుర్తుగా ఇచ్చాడు.

రాముణ్ణి త్వరగా లంకకు తీసుకురమ్మని హనుమకు సీతమ్మ చెప్పింది. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకు వెడతాననీ, తన వీపుపై కూర్చోమనీ, హనుమ ఆమెకు చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. తాను పరపురుషుడిని తాకననీ, రాముడు రావణుని చంపి తనను తీసుకువెళ్ళడం ధర్మం అనీ చెప్పింది. హనుమంతుడు రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని సీతను అడిగాడు. సీత కాకాసురుని కథ చెప్పింది. ఆమె తన దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది. ఈ విధంగా హనుమ లంకలో సీతను కలిసి వెళ్ళాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 12.
హనుమ లంకను కాల్చి వచ్చి, సీత జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి. (లేదా) సీతాన్వేషణ వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్యకార్యం పూర్తి అయ్యింది. రావణుడి శక్తిసామర్థ్యాలు హనుమ తెలుసుకుందామనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోక వన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు, రావణునకు చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్ళను చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని, ఏడుగురు మంత్రి పుత్రులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారుణ్ణి కూడా హనుమ చంపాడు. చివరకు రావణుడు తన కుమారుణ్ణి ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వల్పకాలమే పని చేసింది.

రాక్షసులు హనుమను రావణుని ముందు ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని రావణుడికి చెప్పి, రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదని రావణుని తమ్ముడు విభీషణుడు చెప్పడంతో, రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పమన్నాడు. రాక్షసులు హనుమ తోకకు బట్టలు చుట్టి, నూనెతో తడిపి, నిప్పు ముట్టించి లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్పించి, మిగిలిన లంకంతా తగులబెట్టాడు.

తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీతామాత ఆ మంటలలో కాలిపోయిందేమో అని, సందేహించాడు. తన తోకను కాల్చని అగ్ని, సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీత వద్దకు తిరిగి వెళ్ళి ఆమెకు నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు.

హనుమ ‘అరిష్టం’ అనే పర్వతాన్నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరికి చేరుతూ మహానాదం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వనిని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడని వానరులకు చెప్పాడు.

హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. ‘చూశాను సీతమ్మను’ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి, రావణుని చంపి సీతను తీసుకొనివచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు, అది సరికాదన్నాడు. రామసుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రామునికి ముందు విషయం తెలుపుదాం అన్నాడు.

దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు, వానరుల చేతిలో దెబ్బతిని, ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు అదంతా శుభసూచకంగా భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల దగ్గరకు వెళ్ళారు. హనుమ, రాముడికి నమస్కరించి ‘చూశాను సీతమ్మను’ అని చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడికి గుర్తుగా ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని రామునకు వివరించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 13.
అశోకవనంలో హనుమ – సీతల (సీతా హనుమల) సంభాషణను విశ్లేషిస్తూ, వారి స్వభావాలను రాయండి.
జవాబు:
సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు. రామ ముద్రికను అతడు సీతకు సమర్పించాడు. రామ ముద్రికను చూసి పతివ్రతయైన సీత పరమానందభరితురాలు అయ్యింది. సీత తన దీనావస్థను హనుమకు వివరించింది. రాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి, తనను రాక్షసుల చెర నుండి విడిపించుమని సీత హనుమంతునికి చెప్పింది.

తన వీపు మీద కూర్చుంటే వెంటనే సీతను రాముని వద్దకు తీసుకొని వెళ్ళగలనని హనుమంతుడు సీతకు చెప్పాడు. కానీ సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది. తాను పరపురుషుని తాకనని సీత చెప్పింది. రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని హనుమ అడిగితే, సీత తన చూడామణిని హనుమకు ఇచ్చింది.

సీతాహనుమల సంభాషణను బట్టి, సీతమ్మను వెంటనే తీసుకొని వెళ్ళి, సీతారాములకు ఆనందం కలిగించాలని హనుమ తలంచాడనీ, అతడు స్వామికార్య ధురంధరుడనీ తెలుస్తోంది.

సీతాహనుమల సంభాషణను బట్టి, సీత తనకు వెంటనే చెర నుండి విముక్తి కలగడం ప్రధానం కాదని భావించింది. పాతివ్రత్యం కాపాడుకోవడం ఆమెకు ముఖ్యమని తెలుస్తోంది. దొంగతనంగా హనుమంతుడు సీతను తీసుకువెడితే అది రాముడికి అపకీర్తి అని భావించింది. రావణుని యుద్ధంలో చంపి తనను రాముడు తీసుకొని వెడితే అది రామునికి కీర్తిని కలిగిస్తుందని సీత అభిప్రాయపడింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 14.
హనుమంతుడు సముద్రం దాటేటపుడు ఎదురైన ఆటంకాలేవి ? వాటినెలా అధిగమించాడు ?
జవాబు:
హనుమంతుడు సముద్రంపై మహావేగంగా సాగిపోతున్నాడు. అతనికి సముద్రుడు ఆతిథ్యం ఇవ్వాలనుకొన్నాడు. మైనాక పర్వతాన్ని పంపాడు. మైనాక పర్వతం హనుమంతుని దారికి అడ్డంగా నిలబడ్డాడు. హనుమంతుడది ఆటంకంగా భావించాడు. దానిని తన గుండెతో గట్టిగా కొట్టాడు. మైనాకుని ప్రార్థనతో చేతితో తాకి వెళ్ళిపోయేడు.

ఇది హనుమంతునిపై అభిమానంతో కలిగిన ఆటంకం. దానిని మర్యాదపూర్వకమైన మాటలతో, చేతలతో అధిగమించాడు.

‘సురస’ అనే నాగమాత హనుమంతుని పరీక్షించడానికి ఆటంకం కల్పించింది. తన సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని ఉపయోగించి, ఆ ఆటంకాన్ని కూడా హనుమ అధిగమించాడు. ఆమె మెప్పును పొందాడు.

‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగేయాలనుకొంది. తన గోళ్ళతో ఆమెను చీల్చి చంపాడు హనుమ. తన తెలివితో, బలంతో ‘లంకిణి’ ని కూడా జయించాడు.

ఈ విధంగా హనుమంతుడు తన వినయం, తెలివి, బలాలతో ఎక్కడ ఏది అవసరమో అక్కడ దానిని ఉపయోగించాడు. సముద్రాన్ని అధిగమించాడు.

ప్రశ్న 15.
లంకాదహనానికి కారకులెవరు ? విశ్లేషించండి.
జవాబు:
సీతాదేవి దర్శనంతో హనుమంతుడికి చాలా ఆనందం కల్గింది. అశోకవనం ధ్వంసం చేశాడు.. రాక్షసులు బంధించారు. రావణుడు హనుమను చంపమన్నాడు. అది తగదన్నాడు విభీషణుడు. హనుమంతుని తోకకు నిప్పుపెట్టి లంకంతా తిప్పమని రావణుడు ఆజ్ఞాపించాడు. నూనెలో తడిపిన బట్టలు హనుమంతుని తోకకు చుట్టపెట్టారు రాక్షసులు. ఆ తోకకు నిప్పు పెట్టారు. లంకా నగర వీధులలో తిప్పుతున్నారు. ఒక్కసారిగా హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప మొత్తం లంకంతా కాల్చాడు.

రావణుడు ఆజ్ఞాపించాడు. రాక్షసులు ఆచరించారు. అందుకే లంక తగలబడింది. లంక తగలబడడానికి కారణం అజ్ఞానంతో కూడిన రావణుని ఆజ్ఞ. మూర్ఖత్వంగా దానిని అమలుపరిచిన రాక్షసులు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 16.
మధువన ధ్వంసం గురించి చెప్పినపుడు అది శుభసూచకంగా సుగ్రీవుడెందుకు భావించాడు ? విశ్లేషించండి.
జవాబు:
సాధారణంగా కోతులకు ఆనందం కలిగినా, కోపం వచ్చినా వనాలను ధ్వంసం చేస్తాయి. విపరీతంగా అల్లరి చేస్తాయి. లంకలో సీతాదేవి కనిపించిన ఆనందంతో హనుమ అశోకవనం ధ్వంసం చేశాడు. తన తోకకు నిప్పు పెట్టారనే కోపంతో లంకను తగులబెట్టాడు. సీతాదేవి జాడ దొరికిన ఆనందంతో హనుమ వచ్చాడు. మధువనంలోకి వానరులు ప్రవేశించారు. తేనెలు త్రాగారు. మధువనం ధ్వంసం చేశారు. దధిముఖుడు అడ్డు వచ్చాడు. అతను సుగ్రీవుని మేనమామ అని వారికి తెలుసు. అయినా కొట్టారు. అంటే విజయోన్మాదంలో ఉన్నారు. అది గ్రహించాడు కనుకనే సుగ్రీవుడు ఆనందించాడు.

పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగు పెట్టాడు. వానరులంతా చుట్టూ చేరారు. పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు. “చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి. అంగదుడు “ఓ వీరులారా ! సీతాదేవి జాడ తెలిసిన తరువాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరికి వెళ్ళడం సబబుకాదు. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకొని శ్రీరాముని వద్దకు వెళుదా”మని అన్నాడు. జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు. శ్రీరామసుగ్రీవులు సీతను చూసి రమ్మన్నారేకాని తీసుకురమ్మనలేదు. పైగా రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. దానికి భంగం కలగనీయగూడదన్నాడు. అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టిన వారెవరు ?
జవాబు:
మహేంద్రగిరి శిఖరం మీద హనుమంతుడు అడుగుపెట్టాడు.

2. హనుమంతుడు ఏమని ప్రకటించాడు ?
జవాబు:
హనుమంతుడు “చూశాను సీతమ్మ”ను అని ప్రకటించాడు.

3. అంగదుడు ఏమన్నాడు?
జవాబు:
సీతాదేవి జాడ తెలిసిన తరువాత ఆమె లేకుండా శ్రీరాముని వద్దకు వెళ్ళవద్దని, రావణుణ్ణి చంపి సీతను తీసుకొని రాముని వద్దకు వెళదామని అతడు అన్నాడు.

4. జాంబవంతుడు ఎవరి మాటలను ఖండించినాడు ?
జవాబు:
జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు.

5. శ్రీరాముడు ఏమని ప్రతిజ్ఞ చేసినాడు ?
జవాబు:
రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసినాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 2.
క్రింది పేరాను చదవండి. కింది మాటలకు ఒక వాక్యంలో వివరణ వ్రాయండి.

“వేకువ జామయ్యింది వేదఘోషలు వినబడుతున్నాయి. నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు. సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు. రావణుని తేజస్సును చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు. సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయానా సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కాని ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది. శ్రీరాముని నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదని హెచ్చరించింది. రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలలు గడువు విధించాడు. ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వేకువజాము
జవాబు:
అంటే తెల్లవారుజాము అనగా ప్రభాత సమయములో అని భావము.

2. ఆశ్చర్యచకితుడు
జవాబు:
అనగా ఆశ్చర్యముతో కలతపడ్డాడు. అని భావము

3. నయానా భయానా
జవాబు:
‘నయానా’ అంటే అందంగా, నేర్పుగా మాట్లాడడం, భయానా అంటే భయపెట్టి బెదరించడం.

4. ప్రలోభాలు
జవాబు:
అంటే పేరాసలు అని అర్థము అంటే పెద్దగా ఆశలు పెట్టుట అని భావము.

5. తేల్చి చెప్పింది
జవాబు:
అంటే స్పష్టం చేసి చెప్పింది అని భావం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 3.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. తోకతోపాటు ఆయన కోపం కూడా చల్లారింది. తాను తప్పు చేశాననుకున్నాడు. కోపం ఎంతో అనర్థదాయకమనుకున్నాడు. లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు. వచ్చిన పనిని చేజేతులా పాడుచేసుకొన్నందుకు తనను తాను నిందించుకున్నాడు. కాని ఎక్కడో చిన్న ఆశ. తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా ? అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు లంకను కాల్చడానికి తన శరీరంలో దేనిని ఉపయోగించుకున్నాడు ?
జవాబు:
తోక

2. చారణుల ద్వార తెలుసుకొని చాలా సంతోషించాడు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది ?
జవాబు:
సంతసించాడు

3. ఎవరికి కోపం వచ్చింది ?
జవాబు:
హనుమంతునకు

4. అగ్నిదేవుడు ఎవరిని బాధపెట్టాడు ?
జవాబు:
పూజ్యులను

5. సీతాదేవి కాలిపోయి ఉంటుందని హనుమంతుడు పూర్తిగా నమ్మాడా ?
జవాబు:
లేదు

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“సముద్రంపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలచాడు. తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం. ఆ ఇక్ష్వాకు తిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళు తున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు. అతడు బంగారు శిఖరాల మీద హనుమంతుడు ఒకింత సేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఎవరి పని మీద వెళ్తున్నాడు?
జవాబు:
హనుమంతుడు శ్రీరాముని పని మీద వెళుతున్నాడు.

2. సాగరుని అభిప్రాయం ఏమిటి?
జవాబు:
తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం.

3. మైనాకుడు ఎవరు?
జవాబు:
మైనాకుడు హిమవంతుని కుమారుడు. అతడు దేవేంద్రుని భయంతో సముద్రంలో దాగియున్నాడు.

4. పై పేరా ఆధారంగా ఇక్ష్వాకు వంశస్థులైన వారి పేర్లను తెలపండి.
జవాబు:
పై పేరా ప్రకారంగా ఇక్ష్వాకు వంశరాజులు 1) సగరుడు 2) శ్రీరాముడు.

5. పై పేరాకు ఒక శీర్షిక పెట్టండి.
జవాబు:
‘హనుమంతునకు సాగరుని ఆతిథ్యము’ అన్నది ఈ పేరాకు తగిన శీర్షిక.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

ప్రశ్న 5.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మథనపడ్డాడు. రామకథా గానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు. సీతాదేవి అన్నివైపులా చూచింది. చెట్టు మీదున్న హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యానికి లోనైంది. హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. “అమ్మా! నీవెవరు? ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక ! దయతో విషయాలు చెప్పుమని ప్రార్థించాడు. తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి – తన వృత్తాంతమంతా వివరించింది. హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. హనుమంతుడు ఎందుకు మథనపడ్డాడు ?
జవాబు:
ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతను ఎలా కాపాడుకోవాలో తెలియక హనుమంతుడు మథనపడ్డాడు.

2. హనుమంతునికి తోచిన మార్గం ఏమిటి ?
జవాబు:
రామకథా గానమే సరైన మార్గమని హనుమంతునికి తోచింది.

3. హనుమంతుడు సీతమ్మతో ఏమన్నాడు ?
జవాబు:
“అమ్మా! నీవెవరు? సీతాదేవివి అయితే నీకు శుభం కల్గుగాక” !

4. హనుమంతుడు సీతకు తనను ఎలా పరిచయం చేసుకున్నాడు ?
జవాబు:
హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని సీతకు పరిచయం చేసుకొన్నాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం సుందరకాండ

5. ఈ కథ రామాయణంలో ఏ కాండం లోనిది ?
జవాబు:
ఈ కథ సుందరకాండం లోనిది. (సీత, హనుమంతుడు మాట్లాడుకున్న కథ సుందరకాండం లోనిది.)

Leave a Comment