TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 7th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

TS 10th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శతక మధురిమ

చదవండి – ఆలోచించి చెప్పండి. (T.B. P.No. 66)

నల్లగొంగడిదెచ్చి చల్లనద్దినగాని
మల్లెపూల విధంబు తెల్లఁబడునె

వేపాకు పసరెంతసేపు గాచిన గాని
తేనెతో సమముగ తియ్యఁబడునె

వెల్లిపాయలు దెచ్చి వే గంధమునఁ గూర్చ
పరిమళించునె మొల్ల విరులవలెను

కుక్కతోకకు రాతిగుండు గట్టిన గాని
వంకబోయిన కొన చక్కనగునె

కొంటెలను సజ్జనులతోను గూర్చితేమి
ఆత్మపరిశుద్ధులై భక్తులౌదురెట్లు
చక్రధర ! ధర్మపురిధామ ! సార్వభౌమ !
నరహరీ ! భక్తజనకల్ప ! నాగతల్ప !

– నరహరి శతకము, కాకుత్థ్సం శేషప్పకవి

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యం ఎవరు రాశారు ? ఏ శతకంలో ఉన్నది ?
జవాబు:
కాకుత్థ్సం శేషప్పకవి. నరహరి శతకములోనిది.

ప్రశ్న 2.
ఈ పద్యం ద్వారా మీరేమి గ్రహించారు ?
జవాబు:
చెడ్డవారిని సజ్జనులుగా మార్చుట కష్టమని గ్రహించాను.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
ఇట్లాంటి పద్యాలు మీకింకా ఏమి తెలుసు ?
జవాబు:

  1. గంగిగోవుపాలు గరిటెడైనచాలు ….. వినుర వేమ ||
  2. గాజుం బూస యనర్ఘ రత్నమగునా …….. పార్వతీ వల్లభా |

ఈ పద్యాలు చదివాను.

ప్రశ్న 4.
వీటిని ఎందుకు నేర్చుకోవాలి ?
జవాబు:
ఇటువంటి మంచి మంచి పద్యాలు నేర్చుకోవడం వలన నీతులు తెలుస్తాయి. మానవ స్వభావాలు అంచనా వేయవచ్చు. మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది. చక్కగా మాట్లాడడం తెలుస్తుంది. ఏ సమస్యనైనా పరిష్కరించుకోగల నేర్పు వస్తుంది. జీవితంలో జరిగే సంఘటనలను ముందుగానే ఊహించవచ్చు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 69)

ప్రశ్న 1.
దైవాన్ని పూజించే విధానాలు ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు:
సత్యం, దయ, విశిష్టమైన ఏకాగ్రత (భక్తియోగ విధానం) ఈ విధానాల ద్వారా దైవాన్ని పూజించాలి ఎందుకంటే ఇవి మనిషికి అత్యంత అవసరం.

ప్రశ్న 2.
ప్రజలు రాజులను ఆశ్రయించ వచ్చునా ? ఎందుకు ?
జవాబు:
ఆశ్రయించరాదు. తినడానికి భిక్షం పెడతారు. నివాసానికి గుహలున్నాయి. వస్త్రాలు వీథుల్లో దొరుకు తాయి. తాగడానికి నదుల్లో చల్లని నీరు దొరుకుతుంది. తపస్సు చేసే మునులను రక్షించటానికి శ్రీకాళ హస్తీశ్వరుడు ఉన్నాడు. ఇంకా ఎందుకు రాజులను ఆశ్రయించాలి (ఆశ్రయించరాదు).

ప్రశ్న 3.
సిరిలేకున్నా పండితుడు ఏయే గుణాలవల్ల శోభిస్తాడు ?
జవాబు:
తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు. సత్యవ్రతుడైనవాడు. భుజబలంతో విజయా లను పొందేవాడు. మనస్సునిండా మంచితనం కల వాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 70)

ప్రశ్న 1.
రాముని గొప్పదనాన్ని ఏ విధంగా చాటిచెప్పవచ్చు?.
జవాబు:
దశరథుని కుమారుడు, దయాసముద్రుడైన శ్రీరాముడు యుద్ధరంగంలో శత్రుభయంకరుడని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువని, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండముల నుపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండనం చూపి, కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండల మంతా వినబడేటట్లు చాటి చెప్పవచ్చు.

ప్రశ్న 2.
సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు ఏమిటి ?
జవాబు:
విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే, భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతినిచ్చినట్లే, దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షాశనం’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) రాకుండా చేయకుంటే చాలు. తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
మోసం ఎందుకు చేయకూడదు ?
జవాబు:
అనేక దుర్గుణాల్లో మోసం ఒకటి. మోసం ఎన్నడూ, ఎవరికీ చేయకూడదు. దీనివల్ల విశ్వాసం కోల్పోతారు. మానవీయ సంబంధాలు దెబ్బతింటాయి. గౌరవం అంతరించిపోతుంది. మానసిక స్పర్థలు కలుగుతాయి. అందువల్ల మోసం అనేది చేయకుండా ఉండాలి.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 71)

ప్రశ్న 1.
కవి దృష్టిలో నిజమైన ఘనుడెవరు ?
జవాబు:
స్వార్ధం లేనివాడు, త్యాగంతో కూడిన దీక్షను పూని జను లందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.

ప్రశ్న 2.
మిత్రుని సహాయం ఎన్ని విధాలుగా ఉంటుంది ?
జవాబు:
మిత్రుని సహాయం చాలా రకాలుగా ఉంటుంది. మంచి పుస్తకంలాగా మంచిని బోధిస్తాడు. కార్యసాధనంలో సంపదలా సహాయపడతాడు. స్వాధీనమైన కత్తిలాగ శత్రుసంహారం చేసేవాడు. రక్షించే మనసులాగ సౌఖ్యాలను ఇచ్చేవాడు నిజమైన మిత్రుడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
నరరూప రాక్షసులంటే ఎవరు ?
జవాబు:
కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించే వాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరుసలను పాటించని వాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నది. పాఠంలోని శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడుతాయని భావిస్తున్నారా ? ఎందుకు ? చర్చించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో శతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. వందల సంవత్సరాల నుండి శతకాలు మానవులలో నైతికతను, సద్గుణాలను, మానవీయ విలువలను, భక్తితత్త్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతున్నాయి. పూర్వపు విద్యావిధానంతో ప్రతి ఒక్క విద్యార్థి శతక పద్యాలను కంఠస్థం చేసేవారు.

శతక పద్యాలు రాని విద్యార్థి ఉండేవాడు కాదు. నేడు అన్ని రంగాలలో మార్పులు వచ్చినట్లే భాషను నేర్చుకొనే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అందువల్ల కొందరు మాత్రమే శతకాలు చదువుతున్నారు. అయితే కాలం ఎంత మారినా నేటి సమాజానికి కూడా శతకాలు చదవడం ముఖ్యావసరం అని చెప్పవచ్చు.

ప్రస్తుత పాఠంలోని సర్వేశ్వర శతక పద్యం ద్వారా దేవుని అనుగ్రహం పొందాలంటే కోట్లాది రూపాయలు అవసరం లేదని సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు ఉంటే చాలని తెలుసుకున్నాం. దీని వల్ల నేడు భక్తి పేర జరుగుతున్న వృథా ఖర్చులను తగ్గించు కునే అవకాశం కల్గుతుంది.

కాళహస్తీశ్వర శతకం రాజుల నాశ్రయించవద్దని తెలిపింది. ఇప్పుడు రాజులు లేనప్పటికీ వారి స్థానంలో వచ్చిన ఎమ్.ఎల్.ఏలు, ఎమ్.పి.ల దగ్గరికి చేరకూడదని గ్రహించవచ్చు.

లోకంలో సంపద లేకపోయినా గురువులకు నమస్కరించడం, సత్యం పలకడం, దానం చేయటం అనే గుణాల వల్ల పండితుడు ప్రకాశిస్తాడు అని చెప్పటం వల్ల డబ్బు కంటే సత్యం, దానం, గురువందనం గొప్పవని మల్ల భూపాలీయ శతకం వల్ల తెలుస్తున్నది. దాశరథీ శతకం వలన శ్రీ రాముని వైభవాన్ని తెలుసు కున్నాం. నృసింహ శతకం ద్వారా ఏయే పనులు చేయకూడదో గ్రహించవచ్చు.

అందులో చెప్పిన విషయాలు నేటి సమాజంలో కూడా జరుగుతున్నవే. విశ్వనాథేశ్వర శతకం గొప్పవారు కావాలంటే త్యాగం చెయ్యాలని చెప్పుటయేగాక విద్యార్థులు కూడా దేశం కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తున్నది.

లొంకరామేశ్వర శతకం మిత్రుడు పుస్తకం లాంటి వాడని తెలిపి ఈ నాటికి కూడా స్నేహితుల విలువను మనకు గుర్తుకు తెస్తుంది. ఇక వేణుగోపాల శతకంలో చెప్పిన విషయాలు నేడు కూడా జరుగుతున్నా వాటిని చేయకుండా ఉండటానికి ప్రతివిద్యార్థి ప్రయత్నించాలి.

ప్రశ్న 2.
కింది భావమున్న పద్య పాదాలను పాఠంలో గుర్తించండి.

అ) మిత్రుడు యుద్ధరంగంలో కత్తివలె ఉపయోగపడుతాడు.
జవాబు:
7వ పద్యం – పొత్తంబై కడునేర్పుతో ………. స్వాయత్తంబైన కృపాణమై యరుల నాహరించు మిత్రుండు

ఆ) రాముని మించిన దైవం లేడని చాటుతాను.
జవాబు:
4వ పద్యం – భండన భీమ ….. రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ కరుణాపయోనిథీ” ||

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
విద్వాన్ కలువకుంట కృష్ణమాచార్య రాసిన కింది పద్యాన్ని చదువండి. భావాన్ని సొంతమాటల్లో రాయండి.

పద్యానికి తగిన శీర్షికను పెట్టండి.
అనుభవమ్మున నేర్చిన యట్టి చదువు
తండ్రివలె కాపునిచ్చును తాను ముందు
పడిన కష్టాలచే గుణపాఠమయ్యి
తగిన ప్రేరణ – కాపాడు తల్లివోలె

భావం : అనుభవముతో నేర్చుకొన్న చదువు తండ్రిలాగా -రక్షించును. ముందు పడిన కష్టాలు, గుణ పాఠాలుగా పొంది తగిన ప్రేరణను ఇస్తుంది. అమ్మలాగా చదువు కాపాడుతుంది అని అర్థం.
శీర్షిక : “చదువు గొప్పతనం”, “చదువు వల్ల ప్రయోజనం”.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి?
(లేదా)
కీర్తివంతుని లక్షణాలను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
త్యాగం గుణం కల్గి జనులందరి దీనస్థితిని రూపు మాపి, అందరికి సుఖమయమైన, ఆనందకర జీవిత సుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు. ఈ పై లక్షణాలన్ని అపూర్వ కీర్తిమంతునికి ఉండాలని నా అభిప్రాయం.

ఆ) త్యాగి లక్షణాలెట్లా ఉంటాయి ?
(లేదా)
త్యాగి లక్షణాలను వివరించండి.
జవాబు:
నిజమైన త్యాగి తన సర్వస్వాన్ని ధారపోయటానికి కూడా ఇష్టపడతాడు. అడిగితే కాదనకుండా ఇస్తాడు. తనకిష్టమైనా సరే తృణప్రాయంగా భావించి ఇస్తాడు. ఇది చాలా గొప్ప విషయం.

  1. అతడు తన ప్రాణాలు కూడా లెక్కచేయడు.
  2. గొప్ప కోసం చూడడు.
  3. కీర్తి ప్రతిష్ఠలను కూడా లెక్కచేయడు.
  4. తన సర్వసాన్ని ఇచ్చివేస్తాడు. ఇవి త్యాగి లక్షణాలు.
    ఉదా : కర్ణుడు, బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి మొదలగువారు.

ఇ) మిత్రుడు పుస్తకంవలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలరు ?
జవాబు:
మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. మంచి స్నేహితుని మించిన పుస్తకం లేదు. పుస్తకం అంటే విజ్ఞానం. ఒక విషయం తెలుసుకోవాలంటే పుస్తకంలో చూసుకొంటాం లేదా స్నేహితులను అడుగుతాం. పుస్తకం మనకు కథల రూపంలో మంచి మంచి నీతులను చెబుతుంది. జీవితంలో ఉపయోగించే ఎన్నో మంచి విషయాలను చక్కటి పదాలతో చెబుతుంది.

అలాగే స్నేహితుడు కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. తప్పు చేస్తుంటే చేయవద్దు అంటాడు. మనకు వినసొంపైన మాటలతో మంచిని చెబుతాడు. కష్టకాలంలో తోడుగా నిలబడతాడు. తప్పుచేస్తే పరిహారం కూడా చెబుతాడు. అందుకే స్నేహితుడు మంచి పుస్తకం వలె మంచి మార్గం చూపిస్తాడు అంటారు.

ఈ) పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా ! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు?
జవాబు:
ఏకాగ్రత అవసరం. శ్రద్ధ చాలా అవసరం. ఉత్సుకత, కార్యదీక్ష కూడా అవసరం “శ్రద్ధయా వర్థతే విద్య”. విద్యార్థికి అలసత్వం పనికిరాదు. “అలసతకూడదు ఇంచుక అధ్యయనంబున, బోధనంబునన్” అని ఒక ప్రసిద్ధ కవి అన్నాడు. వినయం, విధేయత, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. పట్టుదల సాధించాలనే తపన ఉండాలి. వీటితోపాటుగా శారీరక, మానసిక దృఢత్వం ఎంతో అవసరం.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి.
(లేదా)
శతక పద్యాల్లోని నీతులు జగతికి మార్గదర్శకాలు ఎలా అవుతాయో విశ్లేషించండి.
జవాబు:
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో చాలా ఉపయోగ పడతాయి. ఎలాగంటే ……. సర్వేశ్వర శతకంలోని ‘భవదీయార్చన……….` అనే పద్యంలో దేవుని పూజించడానికి సత్యం, దయ, ఏకాగ్రత అనే లక్షణాలు ఉండాలన్నారు.

సత్యం మాట్లాడే లక్షణం అలవాటైతే మోసంచేసే ఆలోచన రాదు. అందుచేత గౌరవం పెరుగుతుంది. దయ కలిగి ఉంటే, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేస్తాము. దాని వలన సమాజంలో స్నేహభావం పెరుగు తుంది. కక్షలు కార్పణ్యాలూ ఉండవు.

ఏకాగ్రత కలిగి ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఏ విషయమైనా అర్థమవుతుంది. తెలివి పెరుగుతుంది. తెలివైన సమాజం సంపదలను అభివృద్ధి చేస్తుంది. దరిద్రం ఉండదు. కరవుకాటకాలు ఉండవు.

శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ‘ఊరూరం జనులెల్ల ……….’ అనే పద్యంలో చక్కటి నీతులు ఉన్నాయి. అవి అర్థం చేసుకొంటే ‘నేను, నావాళ్ళు’ అనే స్వార్థం పోతుంది. సంపాదన మాత్రమే జీవితం కాదని తెలుస్తుంది. భగవంతునిపైన నమ్మకం పెరుగుతుంది. ఉత్తమమైన సంస్కారం కలుగుతుంది.

‘సిరిలేకైన విభూషితుండె’ అనే పద్యంలో గురువులను గౌరవించాలని చెప్పారు. ఈ రోజులలో గురువులంటే గౌరవం తగ్గుతోంది. దానగుణం కావాలన్నారు. దానగుణం ఉంటే దొంగతనాలు, దోపిడీలు ఉండవు. మంచి విషయాలను వినాలన్నారు. మంచి విషయాలను వింటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచిపనులు చేస్తాం. మంచి సమాజం ఏర్పడుతుంది. మనసులో సౌజన్యం ఉండాలన్నారు. మనసులో సౌజన్యం ఉంటే ఎవ్వరిపైనా కోపం, ద్వేషం ఉండవు. అందరూ నావాళ్ళే అనే భావం కలుగుతుంది. గొడవలకు అవకాశం లేదు. అందుచేత శతక పద్యాలలో చెప్పిన నీతుల వలన అనేక ప్రయోజనాలున్నాయి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఈ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:
వరంగల్,
9.6.2018.
ప్రియమైన మిత్రునకు,
ఉభయకుశలోపరి. నేను 10వ తరగతి చదువు చున్నాను. మన 10వ తరగతిలోని 7వ పాఠం “శతక మధురిమ” చాలా బాగుంది. ఈ పాఠంలో మంచి గుణాలు, ఉండకూడని గుణాలు మా పంతులుగారి ద్వారా తెలుసుకున్నాను. వాటిని ఇక్కడ రాస్తున్నాను.

అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు :

  1. పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఉండాలి. ఇవి లేని పూజ వ్యర్ధం.
  2. రాజులను ఆశ్రయించరాదు. అది నరకంతో సమానం.
  3. శ్రద్ధ, దానగుణం గల సత్యవ్రతుడు సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు.
  4. మిత్రుడు మంచి పుస్తకంలాగా, ధనంలాగా, సహాయపడతాడు నిండు మనస్సుతో సుఖాన్ని ఇస్తాడు.

అలవర్చుకోకూడని గుణాలు :

  1. విష్ణు భక్తులను నిందించరాదు.
  2. భిక్షం ఇచ్చేవారిని ఆపకూడదు.
  3. సజ్జనులను మోసం చేయరాదు.
  4. దేవతామాన్యములను ఆక్రమించరాదు.
  5. అసత్యాన్ని పలకరాదు.
  6. మాయమాటలు చెప్పరాదు. లంచాలకు విలువ ఇవ్వరాదు. చెడు ప్రవర్తనతో తిరగరాదు.
    మీ పాఠంలో నీవు తెలుసుకున్న విషయాలు తెలియపరచగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,
X X X X X.

చిరునామా :

యం. యుగంధర్,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాసర,
ఆదిలాబాద్ (జిల్లా.)

(లేదా)

ఆ) ఏదైనా ఒక పద్యభావం ఆధారంగా నీతికథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
6వ పద్య భావం ఆధారంగా నీతి కథ

త్యాగం : అన్ని సద్గుణాల్లోను ‘త్యాగం’ ఎంతో గొప్పది. ఇది మానవుడికి అజరామరమైన కీర్తిని సంపాదించిపెడుతుంది. మనం కన్న సంతానం కన్నా, మనం సంపాదించిన ధనం కన్నా, మనం చేసిన మంచి పనుల కన్నా, శాశ్వతత్వాన్ని సమకూర్చి పెట్టేది త్యాగం ఒక్కటే! అందుకనే “నకర్మణా నప్రజయా ధనేన, త్యాగేనైకేన అమృతత్వమానసు” అని వేదం ఘోషిస్తుంది. దానం – త్యాగం ఈ రెండూ దగ్గర లక్షణాలు కలవిగానే కనిపించినా రెండింటిలో చాలా తేడా ఉంది. తన దగ్గరవున్న దానిలో ఇతరు లకు ఇవ్వడం దానం.

తనకు మిక్కిలి అవసరమైనదని తెలిసికూడా, దానిని లెక్కపెట్ట కుండా ఇతరు లకు ఇచ్చేయడం త్యాగం. భారతీయ సంస్కృతి ఈ త్యాగానికి పెద్దపీట వేసింది. త్యాగధనుల్ని ప్రాతః స్మరణీయులుగా భావించి నిత్యం ఆరాధించింది. అలాంటి త్యాగానికి సంబంధించిన ఎన్నో కథల్లో భాగవతంలోని ‘రంతిదేవుని” చరిత్ర వినదగ్గది. రంతిదేవుడు గొప్ప మహారాజు. తన దగ్గర వున్న సంపదనంతా ప్రజలకు దానం చేశాడు.

చివరకు ఏమీలేని నిర్ధన స్థితిలో భార్యాబిడ్డలతో మిగిలి పోయాడు. తినడానికి, తాగడానికి ఏమీ లభించని పరిస్థితిలో 48 రోజులు గడిపాడు. అప్పుడు ఆయన ముందు ఆకస్మాత్తుగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. నకనకలాడే భార్యాబిడ్డలతో ఆ ఆహారాన్ని తీసుకోడానికి సిద్ధపడ్డాడు.

అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘అయ్యా ! ఆకలితో బాధ పడుతున్నాను. నాకేమైనా పెట్టండి’ అని దీనంగా అడిగాడు. రంతిదేవుడు ఆ పరిస్థితిలో కూడా అతడికి సగభాగం యిచ్చేశాడు. ఆ తరువాత మరొక అతిథి వచ్చాడు. అతడికి తన దగ్గరవున్న సగభాగం యిచ్చాడు.

వరుసగా వచ్చి అడిగే ఆర్తులతో ఆహారం అయిపోయింది. చివరకు పానీయం మాత్రమే మిగిలింది. కనీసం ఆ నీరైనా తాగి ఆకలిని తీర్చుకుందామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమ యంలోనే ఓ దాహార్తుడు వచ్చి మంచినీరు యివ్వమని కోరాడు. రంతిదేవుడు ఎంతో ఆప్యాయతతో “అన్నా ! కష్టాలు ఎవరికైనా వస్తాయి.

రా అన్నా. ఈ నీరు త్రాగు” అని తనవద్ద మిగిలివున్న మధుర పానీయాలను కూడా యిచ్చివేశాడు. ఇదీ అసలైన త్యాగం. త్యాగం చేసిన మహానుభావుడు రంతి దేవుడు. అతని త్యాగానికి అంతటి విలువ ఉంది.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) భాసిల్లు = ప్రకాశించు
జవాబు:
వినయ విధేయలతో విద్యార్థులు భాసిల్లాలి.

ఆ) ఉద్బోధించు = మేలుకొల్పుట, రగుల్చు
జవాబు:
యువకులకు వివేకానందస్వామి ఉద్బోధించాడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ఇ) దైన్యస్థితి = దారిద్ర్యం చేత కలుగు దురవస్థ, దీనత్వం
జవాబు:
కుచేలుడు దైన్యస్థితిలో జీవనం సాగించాడు.

ఈ) నరరూప రాక్షసుడు = మనుష్య రూపంలోని రాక్షసుడు
జవాబు:
నేడు సమాజంలో నరరూప రాక్షసులు ఎక్కువగా ఉన్నారు.

ప్రశ్న 2.
క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి. రాయండి.

అ) అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది.
జవాబు:
ఏనుగు, గజము, కరి, నాగము.

ఆ) స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద.
జవాబు:
స్నేహితులు, మిత్రులు, నెచ్చెలులు.

ఇ) రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు.
జవాబు:
కృపాణం, కత్తి, అసి.

ఈ) బంగారం అంటే అందరికీ ఇష్టం. అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు.
జవాబు:
కనకం, బంగారం, స్వర్ణం, పసిడి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
క్రింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి. వేరు చేసి రాయండి.

అ) తూరుపు దెస ఎర్రబడింది. దక్షిణ దిశవైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను.
జవాబు:
దిశ (ప్రకృతి) – దెస (వికృతి)

ఆ) సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది.
జవాబు:
సముద్రం (ప్రకృతి) – సంద్రం (వికృతి)

ఇ) రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం. రాజు మనసును పసిగట్టడం కష్టం.
జవాబు:
రాజు (ప్రకృతి) – రాయడు (వికృతి)

వ్యాకరణాంశాలు

1. క్రింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి, విడదీసి సంధుల పేర్లు రాయండి.

అ) సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు.
జవాబు:
బుద్ధిమంత + ఆలు = బుద్ధిమంతురాలు
– రుగాగమ సంధి

ఆ) అచ్చోట ఆ గులాబి మొక్కకు ఎన్ని పూలు పూచినాయో !
జవాబు:
ఆ + చోట = అచ్చోట = త్రిక సంధి

ఇ) రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు.
జవాబు:
దివ్య + ఔషధం = దివ్యౌషధం = వృద్ధి సంధి

ఈ) ఎవరెస్టు నధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు.
జవాబు:
సాహసవంత + ఆలు = సాహసవంతురాలు – రుగాగమ సంధి

ఉ) సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం.
జవాబు:
సమ + ఐక్యత = సమైక్యత = వృద్ధి సంధి

ఊ) విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు.
జవాబు:
ఏ + కాలము = ఎక్కాలం = త్రిక సంధి

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

2. క్రింది పద్యపాదానికి గణవిభజన చేసి, గురు లఘువులను గుర్తించి, ఏ పద్యపాదమో తెలుపండి. (T.S) June ’16 ; Mar. ’16

అ) భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 11

ఇది ఉత్పలమాల పద్యపాదము.

  1. ప్రతి పాదంలోను నాలుగు పాదాలుంటాయి.
  2. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వచ్చాయి.
  3. యతి 1 – 10వ అక్షరం (భ – బా)
  4. ప్రాస నియమం కలదు (౦డ)

ఆటవెలది

క్రింది పద్యపాదాలను గమనించండి.

అ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 12
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 13

ఆ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 15
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 14

ఇ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 16
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 17

ఈ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 19
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 18

  1. పై పద్యంలో 4 పాదాలున్నాయి.
  2. ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
  3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
  4. 2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
  5. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి చెల్లింది.
    (బ్ర – బ, వ – వ, జే – జె, మా – మా)
  6. ప్రాసనియమం పాటించలేదు.

ఇట్లాంటి లక్షణాలున్న పద్యాన్ని ‘ఆటవెలది’ పద్యం అని అంటారు.
సూర్యగణాలు : నగణం (| | |), హగణం – U |

ఇంద్రగణాలు :
నల (| | |), నగ (| | | U) సల (| | UI), భ (U | |) ర (U | U), త (U U |) లు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

క్రింది పద్యపాదాన్ని గణవిభజన చేసి ఏ పద్య పాదమో గుర్తించండి.

ఆ)
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 20
1 సూర్యగణము + 2 ఇంద్రగణాలు + 2 సూర్యగణాలు ఉన్న పద్యంను తేటగీతి పద్యం అంటారు.

ప్రాజెక్టు పని

6 నుండి 10 వ తరగతి వరకు చదువుకొన్న శతకాల పేర్లు, శతక కవుల వివరాలు కింది పట్టికలో రాసి ప్రదర్శించండి. వాటిలో ఎన్ని పద్యాలు మీరు కంఠస్థం చేశారో తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 21

విశేషాంశాలు

  1. శతకం శతకం అనగా ముక్తకం. ముక్తకం స్వతంత్ర భావంతో ఉంటుంది. ఏ పద్యానికి ఆ పద్యం ప్రత్యేక భావాన్ని ప్రకటించడానికి అనువుగా ఉంటుంది. శతకం మకుట నియమం కలిగి ఉంటుంది. సంఖ్యా నియమం కల్గి ఉంటుంది. శతకాల్లో సమకాలీన సామాజికాంశాల విమర్శ సాధారణంగా కనిపించే లక్షణం. ఇది విద్యార్థులను ఆకట్టుకుంటుంది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని విమర్శనాత్మకంగా చూస్తుంది.
  2. బృహస్పతి దేవతల గురువు. అంగీరసుడి కొడుకు. ఉతధ్యుడు, సంవర్తనుడు ఇతడి సోదరులు. బృహస్పతి భార్య తార. ఇతనికి శంయుడు అనే కొడుకున్నాడు. శుక్రనీతి, కణికనీతి లాగా బృహస్పతి నీతిసూత్రాలు ప్రసిద్ధి చెందాయి.
  3. శైవ కవిత్రయం నన్నె చోడుడు, మల్లిఖార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన. ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు.
  4. శైవ పండిత త్రయం శ్రీపతి పండితుడు, మల్లిఖార్జున పండితారాధ్యుడు. శివలెంక మంచన. ఈ ముగ్గురిని శైవ పండిత త్రయం అంటారు.
  5. చింతామణి కోరిన కోర్కెలను తీర్చే మణి. నాగరాజు శిరస్సు నుంచి ఈ మణిని పొందవచ్చని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.
  6. భాగీరథి గంగ, భగీరథుని ప్రయత్నం చేత భూమి మీదకు తీసుకురాబడినది. అందువల్ల భాగీరథి అయ్యింది.
  7. జాహ్నవి సగరులకు ఉత్తమ లోకాలు కల్గించడానికి భగీరథుడు తెచ్చిన గంగ జహ్నుమహర్షి యాగాన్ని పాడుచేసింది. జహ్నుమహర్షి కోపించి ఆ గంగను త్రాగివేసాడు. భగీరథుని కోరిక మేరకు (అభ్యర్థన వల్ల) తిరిగి ఎంగిలి కాకుండా తన చెవుల ద్వారా విడిచి పెడతాడు. కాబట్టి జహ్నుమహర్షి చేత త్రాగి విడువబడినది కాబట్టి దానికి జాహ్నవి అనే పేరు వచ్చింది.
  8. అంతరింద్రియాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాల్గింటిని అంతరింద్రియాలు అంటారు.
  9. బాహ్య ఇంద్రియాలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం ఈ ఐదింటిని బాహ్య ఇంద్రియాలు అంటారు.

సూక్తి : తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ, గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్నిస్తుంది.

ప్రతిపదార్థ తాత్పర్యాలు

I.

1. మ.
భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెం
డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమో
త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో
గవిధానం బవి లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా.

కవి పరిచయం
ఈ పద్యము యధావాక్కుల అన్నమయ్యచే రచింపబడిన సర్వేశ్వర శతకము నుండి గ్రహింపబడినది.

ప్రతిపదార్థము (June 2017)

సర్వ + ఈశ్వరా = లోకాలన్నిటికీ ప్రభువైన ఓ ఈశ్వరా!
భవదీయ + ఆర్చన = నీ పూజ
చేయుచో = చేసేటప్పుడు
ప్రథమ పుష్పంబు + ఎన్నన్ = మొదటి పుష్పం
సత్యంబు = సత్యం
రెండవ పుష్పం = రెండవ పుష్పం
దయాగుణం = కారుణ్యమనే గుణం (దయ)
తృతీయ పుష్పము +
అది = మూడో పుష్పం
అతి = మిక్కిలి
విశిష్ట = విశిష్టమైన
ఏకనిష్టా = ఏకాగ్రతతో
సమోత్సవ సంపత్తి = సమానమైనది
అది = ఆ విధంగా మూడు పువ్వులు సమర్పించడం
భాస్వద్భక్తిసంయుక్తి విధానం = భక్తియోగ విధానం
అవి = ఈ మూడు పుష్పాలు
లేని = లేని
పూజలను = పూజలను
మదిన్ = మనస్సులో
గైకోవు = అంగీకరించవు కదా ! (అంగీకరించవు అని అర్థం)

తాత్పర్యము ఓ సర్వేశ్వరా ! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా !

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

2. శా.
ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో
చీరానీకము వీథులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ వోపవో
చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యము ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి గ్రహింపబడినది.

ప్రతిపదార్థము

శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరా !
ఊరూరన్ = ప్రతి గ్రామములోనూ
జనులు + ఎల్లన్ = ప్రజలందరూ
భిక్షము + ఇడరో = అడిగితే భిక్షము పెట్టరా ?
ఉండన్ = నివసించడానికి
గుహల్ = గుహలు
కల్గవో చీరానీకము = లేవా ?
(చీర + అనీకము) = వస్త్రముల గుంపు
వీథులన్ = వీధులలో (అంగళ్ళలో)
దొరకదో = దొరకవా ?
శీతామృత స్వచ్ఛవాః పూరంబు ; శీత = చల్లని
అమృత = అమృతము వంటి తియ్యని
స్వచ్ఛ = నిర్మలమైన
వాఃపూరంబు = జలప్రవాహము
ఏఱులన్ = సెలయేళ్ళలో పాఱదో
(పాఱదు + ఓ) = ప్రవహించడం లేదా ?
తపసులన్ = తపశ్శాలులను
బ్రోవంగన్ = రక్షించడానికి
నీవు = నీవు
ఓపవో (ఓపవు + ఓ) = సమర్థుడవు కాదా ?
జనుల్ = ప్రజలు
రాజులన్ = రాజులను
చేరన్ = సమీపించడానికి
పోవుదురు + ఏల = ఎందుకు పోతారో !

తాత్పర్యము
శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి అడిగితే ఎవరయినా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతంవంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడటానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.

3. మ.
సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్
స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా ! నీతివాచస్పతీ !

కవి పరిచయం
ఈ పద్యము ఎలకూచి బాలసరస్వతీచే రచింపబడినది.

ప్రతిపదార్థము

సురభిమల్లా = ఓ “సురభిమల్ల” భూపాలుడా !
నీతివాచస్పతీ = నీతిశాస్త్రమునందు దేవతల గురువైన బృహస్పతి వంటివాడా !
ఔదలన్ = శిరస్సునందు
గురుపాదానతి
(గురుపాద + ఆనతి)
గురుపాద = గురువుగారి పాదాలకు
ఆనతి = మ్రొక్కుటయు (నమస్కరించడము)
కేలన్ = చేతియందు
ఈగి = దానగుణమునూ
చెవులందున్ = చెవులయందు
విన్కి = శాస్త్ర శ్రవణమునూ (శాస్త్రములు వినుటయూ)
వక్త్రంబునన్ స్థిరసత్యోక్తి ; = ముఖమునందు
స్థిర = స్థిరమైన
సత్యోక్తి (సత్య + ఉక్తి) = సత్యమైన వాక్కునూ
భుజంబులన్ = భుజములందు
విజయమున్ = విజయమునూ
చిత్తంబునన్ = మనస్సు నందు సన్మనోహర సౌజన్యము ;
సత్ = చక్కని
మనోహర = ఇంపైన
సౌజన్యము = మంచితనమునూ
కల్గినన్ = కల్గి ఉన్నట్లయితే
బుధుండు = పండితుడు
సిరి = ఐశ్వర్య౦
లేకైనన్
(లేక + ఐనన్) = లేకుండా ఉన్నా (లేకపోయినా)
విభూషితుండె ;
(విభూషితుండు + ఎ) = అలంకరింపబడినవాడే
అయి = అయి
భాసిల్లున్ = ప్రకాశిస్తాడు

తాత్పర్యము
నీతిలో బృహస్పతి అంతటి వాడవయిన ఓ సురభిమల్లా ! తలవంచి గురువు పాదాలకు నమస్కరించే వాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైనవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనస్సునిండా మంచితనం కలవాడయిన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

II

4. ఉ.
భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
దాండ దడాండదాండ నినదంబులజాండము నిండ మత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ ! కరుణా పయోనిధీ !!

కవి పరిచయం
ఈ పద్యము కంచర్ల గోపన్నచే రచింపబడిన దాశరథి శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము

దాశరథీ = దశరథుని కుమారా !
కరుణాపయోనిథీ = దయాసముద్రునివైన ఓ రామా !
భండన భీముడు = నీవు యుద్ధరంగంలో శత్రు భయంకరునివని
ఆర్తజన = దుఃఖాలు పొందేవారి పాలిట
బాంధవుడు = బంధువువని
ఉజ్వల = కాంతిమంతమైన
తూణ = అమ్ములపొది
బాణ = బాణాలు
కోదండ = కోదండములు
కళాప్రచండ = ఉపయోగించే నేర్పులో ప్రచండమైన
భుజతాండవ = భుజతాండవం చూపి
కీర్తికి = కీర్తిపొందిన
రామమూర్తికిన్ = శ్రీరామచంద్రునకు
రెండవసాటి దైవము = సాటివచ్చే మరియొక దైవం
ఇకన్ = ఇంక
లేడనుచున్ = లేరని
గడగట్టి = స్తంభము నాటి
భేరికా = ఢంకా యొక్క
దాండడ, డాండ, డాండ = డాం డాం డాం అనే
నినదంబులు = ధ్వనులు
అజాండము = బ్రహ్మండం
నిండన్ = వ్యాపించే విధంగా
మత్త = మదించిన
వేదండమునెక్కి = ఏనుగునెక్కి
చాటెదను = చాటుతాను

తాత్పర్యము
దశరథుని కుమారా ! దయాసముద్రునివైన ఓ శ్రీరామా ! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువు, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండమును కలిగి ప్రచండ భుజతాండవంతో, ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ, భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను !

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

5. సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ
సకల గ్రంథమ్ములు చదివినట్లు
భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ
జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలుఁ
నింపుగా బహుమాన మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలు
గనకకంబపుగుళ్ళు గట్టినట్లు

తే.గీ. ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలు
బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణవికాస! శ్రీధర్మపురి నివాస !
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

కవి పరిచయం
ఈ పద్యం కాకుత్థ్సం శేషప్ప కవిచే రచింపబడిన నరసింహ శతకం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము

భూషణవికాస = అలంకారాల చేత శోభిల్లేవాడా !
శ్రీ ధర్మపుర నివాస = ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా !
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా !
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహా = నరసింహా
హరిదాసులను = విష్ణుభక్తులను
నిందలాడకుండిన + చాలు = నిందించకుండా ఉంటే చాలు
సకల గ్రంథాలను = అనేక గ్రంథాలను
చదివినట్లు = చదివినట్లే
భిక్షము + ఇయ్యంగ = భిక్షమిచ్చేవారిని
తప్పింపకుండినచాలు = ఆపకుంటేచాలు
చేముట్టిదానము = అది దానము
చేసినట్లే = చేసినట్లే
మించి = అతిసయించి, ఉప్పొంగి
సజ్జనుల = సజ్జనులను
వంచింపకుండిన = మోసం చేయకుండా ఉంటే
చాలు = చాలు
ఇంపుగా = చక్కగా
చాలు = చాలు
బహుమానమిచ్చినట్లు = బహుమతినిచ్చినట్లే
దేవ = దేవతా
అగ్రహారముల్ = మాన్యములను
తీయకుండిన = ఆక్రమించకుండా ఉంటే
చాలు = చాలు
కనకకంబపు = అది ధ్వజస్తంభంతో కూడిన
గుళ్ళు + కట్టినట్లు = గుళ్ళు కట్టించినట్లే
ఒకరి = ఇంకొకరి
వర్షాశనము = వర్షాసనం (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని)
మంచుకున్న = పాడు చేయకుండునట్లైతే
చాలు = చేయకుంటేచాలు
పేరు = తన పేరుతో
కీర్తిగ = కీర్తితో
సత్రముల్ = సత్రాలు
పెట్టినట్లు = కట్టించినట్లే అవుతుంది

తాత్పర్యము
అలంకారాల చేత శోభిల్లేవాడా ! ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను పోగొట్టేవాడా! నరసింహా ! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే చాలు, అనేక గ్రంథాలను చదివినట్లే. భిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతినిచ్చినట్లే. దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే చాలు, అది బంగారు ధ్వజ స్తంభంతో కూడిన గుడికట్టించినట్లే. ఇంకొకరి ‘వర్షా శనాన్ని’ (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) ముంచకుంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

III

6. మ.
ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా
జన ధైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ
వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యము గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మచే రచింపబడిన విశ్వనాథేశ్వర శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము

విశ్వనాథేశ్వరా ! = విశ్వనాథేశ్వరా !
వేడు = ఎవడు
త్యాగమయ = త్యాగంతో కూడిన
దీక్షన్ + పూని = దీక్షను పూని
సర్వంసహాజన = జనులందరి
దైన్యస్థితి + పోనడంచి = దీనస్థితిని రూపుమాపి
సకల = అందరికి (సమస్తమైన, అన్ని)
ఆశాపేశ = కోరికలతో అలంకరింపబడిన
ఆనంద = ఆనందకర
జీవన సంరంభము = జీవిత సుఖాన్ని
పెంచి = పెంచి
దేశ జననీ = మాతృదేశపు
ప్రాశస్త్యమున్ = గొప్పతనాన్ని
పంచునో = ఎవరయితే విశదపరుస్తారో
అవ్వాడు (అ+వాడు) = అటువంటివాడే
అనిందపూర్వ = నిందించుటకు వీలులేని
ఘనుడు + అగున్ = గొప్పవారవుతారు
యశస్వి + ఆతడగు = అపూర్వమైన కీర్తిమంతులవుతారు

తాత్పర్యము
విశ్వనాథేశ్వరా! త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి, అందరికి సుకుమారమైన, ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులు అవుతారు.

7. శా.
పొత్తంబై కడునేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు, సం
విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా
యంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో
చ్చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా !

కవి పరిచయం
ఈ పద్యం నంబి శ్రీధరరావుగారిచే రచింప బడిన శ్రీలొంక రామేశ్వర శతకము నుండి గ్రహించ బడినది.

ప్రతిపదార్థము (Mar. ’17)

శ్రీలొంకరామేశ్వరా ! = ఓ లొంకరామేశ్వరా !
మిత్రుండు = మిత్రుడైనవాడు
పొత్తంబు + ఐ = పుస్తకం మాదిరిగా
కడున్ = మిక్కిలి
నేర్పుతో = నేర్పుతో
హితమున్ = మంచిని
ఉద్బోధించు = బోధిస్తాడు
ఒక = ఒకానొక
కార్య = కార్య
సాధనమునన్ = సఫలతలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
కార్య = కార్య
సాధనమునన్ = సఫలతతో
వెల్గొందు = విలువైన
సంవిత్తంబు + ఐ = ధనం వలె
వెల్గొందు = ఉపకరిస్తాడు
అరులన్ = శత్రు నాశనంలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
స్వాయత్తంబు + ఐన = స్వాధీనమైన
కృపాణము + ఐ = కత్తి వలె
ప్రోచు = రక్షించెడు
తగన్ = తగినవిధంగా
ఆహారించు = సహాయపడతాడు
ప్రోచిత్తంబు + ఐ = నిండు మనస్సై
సుఖమిచ్చు = సుఖాన్నిస్తాడు.

తాత్పర్యము
ఓ లొంకరామేశ్వరా ! మిత్రుడైనవాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు. శత్రు నాశనంలో స్వాధీనమైన కత్తివలె సహాయపడుతాడు. నిండు మనస్సై సుఖాన్నిస్తాడు.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

8. సీ. కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు (June 2018)
మాయమాటల సొమ్ము దీయువాడు
కులగర్వమున పేద కొంపలార్చెడివాడు
లంచంబులకు వెల బెంచువాడు
చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు
వరుసవానికి నీళ్ళు వదులువాడు
ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు
కన్నవారల గెంటుచున్నవాడు

గీ. పుడమిలో నరరూపుడై పుట్టియున్న
రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర
కృపనిధీ ధరనాగరకుంటపారి
వేణుగోపాలకృష్ణ మద్వేల్పు శౌరి

కవి పరిచయం
ఈ పద్యము గడిగె భీమ కవిచే రచింప బడిన వేణుగోపాల శతకము నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్దము

“కృపనిధీ = దయకు నిధివంటివాడా !
రామచంద్ర = ఓ శ్రీ రామచంద్రా !
ధర నాగరకుంటపౌరి = నాగరకుంటపురమునందు కొలువైన వాడా !
వేణుగోపాలకృష్ణ = ఓ వేణుగోపాలకృష్ణా
మత్ + వేల్పు = నా దైవమా !
శౌరి ! = శ్రీ కృష్ణా !
కలన్ + ఐన = కలలో కూడా
సత్యంబున్ = సత్యాన్ని
పలుకన్ + = పలకడానికి
ఒల్లనివాడు = ఇష్టపడనివాడు
మాయమాటలు = మాయమాటలు చెప్పి
సొమ్మున్ = ఇతరుల సొమ్మును
తీయువాడు = అపహరించేవాడు
కులగర్వమున = కుల గర్వంతోటి
పేద = పేదవాండ్ల
కొంపల్ = ఇండ్లను
ఆర్చెడివాడు = నాశనం చేసేవాడు
లంచంబులకు = లంచాలకు
వెలన్ = విలువను
పెంచువాడు = పెంచేవాడు
చెడు ప్రవర్తనలందు = చెడు ప్రవర్తనతో
చెలగితిరుగువాడు = తిరిగేవాడు
వరుసవావికి = వావివరుసలను
నీళ్ళు వదలువాడు = పాటించనివాడు
ముచ్చటన్ + ఆడుచూ = నవ్వుతూ ముచ్చటాడుతూనే
కొంప = ఎదుటివాడిని
ముంచ = నాశనం
చూచెడివాడు = చేయాలనుకునేవాడు
కన్నవారల = తల్లిదండ్రులను
గెంటువాడు = ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు
పుడమిలో = ఈ భూమిమీద
నరరూపుడై = మానవరూపంలో ఉన్న
పుట్టియున్న = పుట్టినట్టి
రాక్షసుడుగాక = రాక్షసుడుగాని
(వేరు + ఔన) వేరౌన = వేరొకరు గారు కదా !

తాత్పర్యము
దయకు నిధివంటివాడా ! శ్రీ రామచంద్రా ! నాగరకుంట పురమునందు కొలువైనవాడా! ఓ వేణు గోపాల- కృష్ణా ! నా దైవమా ! శ్రీ కృష్ణా ! కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్మును అపహరించేవాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావి వరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు. తల్లి తండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమిమీద మానవరూపంలో ఉన్న రాక్షసుడే.

పాఠం ఉద్దేశం

సమాజహితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషిచేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకాలలోని పద్యాలను ‘ముక్తకాలు’ అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి. ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి.

కవుల పరిచయం

1. కవి : యథావాక్కుల అన్నమయ్య
కాలం : 13వ శతాబ్దం
శైలి : ధారాళమైనది
శతకం పేరు : సర్వేశ్వర శతకం.
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 1

2. కవి : ధూర్జటి
కాలం : 16వ శతాబ్దం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 2
ఇతర అంశాలు :
శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యమనే గ్రంథం రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరు. రాజుల ఆస్థానంలో ఉండి కూడా “రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయం” అని చెప్పిన ధీశాలి.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

3. కవి : ఎలకూచి బాలసరస్వతి
కాలం : 17వ శతాబ్దం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 3
ఇతర అంశాలు : నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవ రాయల ఆస్థానకవి.

రచనలు :

  1. తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యం “రాఘవ యాదవ పాండ వీయం” ను రాశాడు.
  2. భర్తృహరి సంస్కృతంలో రాసిన “సుభాషిత త్రిశతి”ని తెలుగులో అనువదించిన తొలికవి.

విశేషాంశం : ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా, ధారాళంగా ఉంటుంది.

4. కవి : కంచెర్ల గోపన్న
కాలం : 17వ శతాబ్దం
జన్మస్థలం : ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి
రచన : దాశరథి శతకం
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 4
ఇతర అంశాలు : భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. శ్రీరాముని పేర దాశరథి శతకాన్ని రాసాడు. ఎన్నో కీర్తనలు రచించాడు. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో
జాలువారాయి.

5. కవి : కాకుత్సం శేషప్ప కవి
కాలం : 18వ శతాబ్దం
జన్మస్థలం : జగిత్యాల జిల్లా, ధర్మపురి నివాసి
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 5
శతకం : నరహరి శతకంతోపాటు, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం (యక్షగానం) రాశాడు.
ఇతర అంశాలు : ఇతని రచనల్లో భక్తి తత్పరతతోపాటు తాత్త్వికచింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను పాడుకుంటారు.

6. కవి : గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
కాలం : 1934 – 2011
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లా, పోతారెడ్డి పేట
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 6
(1934-2011)
ఇతర అంశాలు : 300 పైగా అష్టావధానాలు చేసాడు. హిందోళ రాగంలో ఈయన పద్యపఠన విన్యాసం ప్రత్యేకమైనది.
బిరుదులు : అవధాని శశాంక, ఆశు కవితాకేసరి.
ఇతర రచనలు : కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీస్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము మొదలైనవి.

7. కవి : నంబి శ్రీధరరావు
కాలం : 1934 – 2000
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లా, భీమ్ గల్ (వేముగల్లు) నివాసి
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 7
(1934-2000)
రచన : శ్రీలొంక రామేశ్వర శతకం
ఇతర రచనలు : శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీమన్నింబగిరి నరసింహశతకం
బిరుద : కవిరాజ

8. కవి : గడిగె భీమకవి
జననం : 14.1.1920
మరణం : 3.4.2010
TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ 8
(14-01-1920
03-04-2010)
రచన : వేణుగోపాల శతకం
జన్మస్థలం : రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, నాగరకుంట గ్రామం
ఇతర విషయాలు : వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం.

TS 10th Class Telugu Guide 7th Lesson శతక మధురిమ

ప్రవేశిక

మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి ? ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి ? స్నేహితులు ఎట్లా ఉంటారు ? భగవంతుని గుణగణాలు, భక్తులతో ఎట్లా ఉండాలి ? కీర్తిమంతులు ఎవరు? మనుషుల్లోని రాక్షసగుణాలు ఏవి ? అని తెలుపుతూ వివిధ శతకకర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకోండి. వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోండి. ఆచరించే ప్రయత్నం చేయండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత
    గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ శతకం

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘శతకం’ ఒకటి. ఇందులో వంద పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో వందకు పైగా పద్యాలు ఉంటాయి. శతకాల్లో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలు ఉంటాయి. ఏ పద్యానికాపద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. శతకాలు నీతి, ధర్మం, సత్యం, భక్తి, వైరాగ్యం మొదలైన విషయాలను బోధిస్తాయి. సుమతీ శతకం, వేమన శతకం మొదలైనవి శతక గ్రంథాలుగా పేర్కొనవచ్చు.

Leave a Comment