TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 9th Lesson జీవనభాష్యం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 9th Lesson Questions and Answers Telangana జీవనభాష్యం

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 87)

పరులకోసం పాటుపడని
నరునిబతుకు దేనికని ?
మూగనేలకు నీరందివ్వని
వాగుపరుగు దేనికని ?
జల్లుకు నిలవని ఎండకు ఆగని
చిల్లులగొడుగు దేనికని ?
పదపదమంటూ పదములేగాని
కదలని అడుగు దేనికని ?
– సినారె

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరుల కోసం పాటుపడటం అంటే ఏమిటి ?
జవాబు:
పాటుపడటం అంటే కష్టపడడం, పనిచేయడం. ఎవరైనా తమ గురించి, తమ కుటుంబం గురించి, తమ వాళ్ళ గురించి పాటుపడడం సహజం. పరులు అంటే ఇతరులు. అంటే మనకు సంబంధం లేనివాళ్ళు. వాళ్ళ గురించి కష్టపడడం గొప్పవారి లక్షణం. ఇతరులకు ఉపకారం చేయడానికి దేనినీ లెక్క చేయకూడదు. అంటే సమాజం కోసం కష్టపడాలి. సమాజ అభివృద్ధి కోసం
పాటు పడాలని కవి సందేశం.

ప్రశ్న 2.
కవి ప్రశ్నల్లోని ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
ప్రతిదానికీ ఒక ఉపయోగం ఉంటుంది. కొన్ని ఖచ్చితంగా కొన్ని పనులకు ఉపయోగపడాలి. ఆయా పనులకు ఉపయోగపడనపుడు అవి ఉన్నా లేక పోయినా ఒకటే అని కవిగారి ఉద్దేశం.

  1. సమాజం కోసం పాటుపడని మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే.
  2. చేలకు నీరివ్వని ఏరు వలన ప్రయోజనం లేదు.
  3. ఎండా, వానలనుండి కాపాడలేని గొడుగు వృథా.
  4. మాటలే తప్ప కదలని అడుగులు వలన ఏమీ సాధించలేము.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 3.
దీనిని రాసిందెవరు ?
జవాబు:
ఈ కవితను డా॥ సి. నారాయణరెడ్డి గారు (సినారె) రచించారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 89)

ప్రశ్న 1.
‘మనసుకు మబ్బుముసరడం’ అనడంలో ఆంతర్యంమేమిటి?
జవాబు:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ప్రశ్న 2.
‘జంకని అడుగులు కదిలితే అది దారవుతుం’దనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు ?
జవాబు:
లోకం భయపెడుతుంది. ఆ మాటలకు జంకకుండా, అడుగులు ముందుకు వేస్తే, అనగా భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తే నీకు విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురూ అనుసరించేందుకు ఒక దారిగా మారుతుందని దీని అర్థం. నేను కూడా ఇది సరైనదేనని సమర్థిస్తాను.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 90)

ప్రశ్న 1.
మనిషి మృగము ఒకటేనా ? కాదా ? చర్చించండి .
జవాబు:
మనిషీ, మృగమూ ఒక్కటికానేకాదు. మనిషికి ఆలోచనాశక్తి వుంది. భావాలను తెలుపగలిగే భాష ఉంది. కానీ మృగానికి ఆలోచనాశక్తీ, భావాలను తెలిపే భాష లేవు. కనుక మనిషి మృగమూ ఒకటికాదు. ఆలోచనాశక్తి నశించి మానవత్వం మరిచిపోతే మనిషినే మృగం అనవచ్చు.

ప్రశ్న 2.
హిమగిరి శిరసు మాడటం అంటే మీకేమర్థమయింది ?
జవాబు:
హిమాలయ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనది. అయినా దాని నెత్తిని కూడా సూర్యుడు తన వేడి కిరణాలతో మాడుస్తాడు. అంత ఎత్తు ఉన్నా హిమగిరికీ సూర్యుని తాపం తప్పలేదు కదా ! ఎండవేడికి అది కరిగి ఏఱుగా, అనగా నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషైనా అతని గర్వం, సమస్యలకు వేడెక్కి నీరుగా కారిపోవలసిందే అని నాకు అర్థమయింది.

ప్రశ్న 3.
‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుం’దనడాన్ని మీరు సమర్థిస్తారా ? ఎట్లా?
జవాబు:
త్యాగం అంటే మనకున్నది ఇతరులకు ఇవ్వడం. స్వార్థం చూసుకోకుండా ఇవ్వడం. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడం. మనకోసం ఎవరైనా ఏదైనా త్యాగం చేస్తే మనం వారిని జీవితాంతం మరచిపోలేము.

అలాగే తమకున్న డబ్బుతో గుడి, బడి, ఆసుపత్రి, అన్నదాన సత్రము మొదలైనవి కట్టిస్తే వారి పేరును సమాజం గుర్తు పెట్టుకొంటుంది. ఉదాహరణకు రంగయ్యగారు బడి కట్టిస్తే, దానిని రంగయ్య బడి అంటాం. బిర్లా టెంపుల్ మొదలైనవి. అంటే అవి ఉన్నంతకాలం వారి పేరు కూడా ఉంటుంది. అందుకే ఇది సమర్థించతగినది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది అంశాన్ని గురించి చర్చించండి.

అ) ‘జీవనభాష్యం’ అనే శీర్షిక ఈ గజల్కు ఎలా సరి పోయిందో చెప్పండి..
జవాబు:
ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనే పేరు తగినదిగా ఉంది. ఎందుకంటే ఈ పాఠ్యభాగంలో మానవుడు తన జీవితంలో ఎప్పుడు గౌరవం పొందుతాడు. ఎలా జీవించాలి అనే విషయాలను లోతుగా పరిశీలించి కవి మనకు అందించారు. మానవ జీవిత పరమార్థాన్ని ఈ చిన్న గజల్ ద్వారా అందించడం జరిగింది.

మానవుడు దుఃఖాలన్నింటిని సమర్థవంతంగా తట్టుకుంటూ, కష్టాలను సాహసంతో ఎదుర్కొంటూ ఉండాలని, తనంతట తాను ఉన్నతంగా ఎదుగుతూ, తోటి వారి కోసం పాటుపడుతూ జీవించాలనే జీవిత సత్యం ఇందులో ఉంది. అందువల్ల ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనేపేరు తగినదిగా చెప్పవచ్చు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 2.
పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి. రాయండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం 1

ప్రశ్న 3.
క్రింది అపరిచిత గేయ పాదాలను చదువండి.

భీతి లేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో
తనివి తీర జనులకెల్ల జ్ఞానసుధలు దొరుకునో
అడ్డుగోడ లేని సమసమాజమెచట నుండునో
హృదంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో
ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము
లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా !

గేయం చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) ‘శిరమునెత్తి నిలుచునో’ అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
భీతి లేకుండా (భయం) ఉంటే మనిషి తలఎత్తుకొని నిలబడతాడని అర్థమైంది.

ఆ) జ్ఞానసుధలు ఎట్లా ఉండాలని గేయంలో ఉన్నది ?
జవాబు:
జ్ఞానసుధలతో తృప్తి కలగాలి. అంటే జ్ఞానతృష్ణ తీరాలి.

ఇ) సమసమాజం ఎట్లా ఏర్పడుతుంది ?
జవాబు:
సమసమాజం అడ్డుగోడలు లేకుండా ఏర్పడుతుంది.

ఈ) సత్యం విలసిల్లడం అంటే ఏమిటి ?
జవాబు:
మనస్సులో నుండి వచ్చే నిజమే విలసిల్లుతుంది.

ఉ) ‘స్వర్గసీమ’ అనడంలో అంతరార్థం ఏమిటి ?
జవాబు:
స్వర్గసీమలో భయం ఉండదు. తృప్తి కలిగించే జ్ఞానం దొరుకుతుంది. కుల, మతాలు, ధనిక, పేద అనే అడ్డుగోడలుండవు. నిజమైన మాట, ఆలోచన, ప్రవర్తన ఉంటుంది. పూర్తిగా స్వతంత్రం ఉంటుంది. అటువంటి ప్రదేశం కావాలి కనుక స్వర్గసీమ అన్నారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచిపనులు చేయాలి?’
జవాబు:

  1. దశదానాలు, షోడశమహాదానాలు చేయాలి.
  2. గ్రామంలో దేవాలయము కట్టించాలి.
  3. పేద బ్రాహ్మణుడికి పెళ్ళి చేయించాలి.
  4. ఒక కవి రాసిన కావ్యాన్ని అంకితం తీసుకోవాలి.
  5. గ్రామంలో అందరికీ త్రాగేందుకు నీటి కోసం చెరువు తవ్వించాలి.
  6. ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలి. పైన చెప్పినవి అన్నీ “సప్త సంతానములు” అనే వాటిలోని మంచి పనులు.

ఇవిగాక పాఠశాలలూ, కళాశాలలూ ఏర్పాటు చేయించడం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, చదువులు చెప్పించడం, పేదవారికి వైద్య ఖర్చులు భరించడం, గ్రామాలకు మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించడం, దైవపూజలు చేయించడం, పేదల కోసం పెళ్ళి ఖర్చులు భరించడం, మంగళసూత్రాలు దానం చేయడం వంటి మంచి పనులు చేస్తే వారి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది.

ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు ‘సినారె’ ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు?
జవాబు:
జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా సినారె విద్యార్థులకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. విద్యార్థులు చదువులో ఒక్కోసారి వెనుకబడతారు. చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కష్టాలను ఓర్పుతో సహించాలి.

అవాంతరాలను అధిగమించాలి. అప్పుడే విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రగతి పథంలో పయనించ గలుగుతారు. ఉత్తమ ఫలితాలను పొంద గలుగుతారు. తమకు డబ్బులేదని, చదువు సరిగా రావడం లేదని నిరాశపడవద్దని, అధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడ కుండా ధైర్యంతో ముందుకు వెళ్ళాలనే ఉపదేశాన్ని నారాయణరెడ్డి గారు విద్యార్థులకు అందించారని భావిస్తున్నాను.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ఇ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని ‘సినారె’ ఎందుకు అని ఉంటాడు ?
జవాబు:
“జీవన భాష్యం” అనే పాఠ్యభాగంలో మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని నారాయణ రెడ్డి గారు ఉపదేశించారు. సమాజంలో మానవులంతా కలిసిమెలిసి జీవించాలి. పరస్పర సహకారాన్ని పొందాలి. వర్గ వైషమ్యాలను విడనాడాలి. కులమతాల అడ్డు గోడలను తొలగించుకోవాలి. ఒకరినొకరు గౌరవించు కోవాలి. ఆపదల్లో ఉన్న తోటివారిని ఆదుకోవాలి.

అప్పుడే సమాజంలోని వారందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారని, అటువంటి ప్రశాంతతో కూడిన గ్రామీణ వాతావరణం రావాలని కవి కోరుతున్నారు. పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచు కోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించ గలుగుతారని, అలాంటి మనుషులంతా ఏకమైతేనే చల్లని ఊరు ఏర్పడుతుందని కవి భావించాడు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాల్లో జవాబు వ్రాయండి.

అ) ‘జీవనభాష్యం’ అందించే సందేశాన్ని వివరించండి.
జవాబు:
జీవనభాష్యం ద్వారా ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడనీ మరియు వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రకృతిలో ఇటువంటి పరోపకార గుణం గల ఎన్నో విషయాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేగాకుండా పరోపకార గుణం గల నదులు, మేఘాలు, వృక్షాలు మనకు ఎంతో సహకారం అందిస్తాయి. జీవనభాష్యం ద్వారా చింతలు, బాధలు, ఆందోళనలు అనేవి మనసును కుంగదీసినపుడు అవి కన్నీరు రూపంలో బయటకు వస్తాయి.

ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచినపుడే మనకు విజయం చేకూరుతుంది. అదే విధంగా బీడు భూమిలో ఏ పంటలూ పండవని నిరాశపడకుండా అదే నేలను కష్టపడి దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

సాటి మనుషుల పట్ల ప్రేమ ఆప్యాయత, సంబంధాలు కలిగి ఉండాలని నేర్పుతుంది జీవనభాష్యం. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుందని కవి భావన.

అలాగే “కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం” ఒకదాని తరువాత మానవ జీవితంలో పరిపాటి అని తెలుస్తుంది. ఏమి ఆలోచించకుండా మబ్బు వర్షాన్ని ఇస్తుంది. నదులు నీటిని అందిస్తాయి. అలాగే రైతు మనందరి కోసం రేయింబవళ్ళు కష్టపడి మనకు ఆహారాన్ని అందించి “అన్నదాత” గా మారాడు.

అటువంటి రైతు చేసే గొప్ప పని, నిస్వార్థ త్యాగం మనం మరచిపోరాదు. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందే పనులు చేసి, నిజమైన విలువ, గుర్తింపు పొందాలని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. అప్పుడే మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందని జీవనభాష్యం మనకు సందేశం ఇస్తుంది.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) “జీవన భాష్యం” గజల్లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:

1) మంచు కరిగితే నీరవుతుంది.
2) మంచి నడకనడిస్తే దారవుతుంది.
3) వర్షం కురిస్తే పంట పైరవుతుంది.
4) మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది.
5) నదులు పారితే అది ఏరవుతుంది.
6) త్యాగధనులుంటే పేరవుతుంది.

(లేదా)

ఆ) ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకొంటున్నారో ప్రశ్నలు వ్రాయండి.
జవాబు:

  1. మీ రచనలలో మీకు బాగా నచ్చిన కావ్యం ఏది ?
  2. ‘ప్రపంచ పదులు’ దీన్ని మీరు ఎలా సృష్టించారు ?
  3. మీ సినీగేయాలలో మీకు నచ్చిన గేయం ఏది ?
  4. మిమ్ములను కవిత్వం వైపు నడిపించినది ఎవరు ?
  5. మీ రచనలకు ప్రేరణనందించిన అంశాలు ఏవి ?
  6. మధ్యతరగతి మందహాసంలోని ప్రధానమైన అంశం ఏమిటి ?
  7. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలకు, మీరిచ్చే సందేశం ఏమిటి ?
  8. విద్యార్థులు మానసిక వత్తిడి నుండి ఎలా బయట పడగలుగుతారు ?
  9. నేటి యువ రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమి ?
  10. ప్రస్తుతం మీరు ఎందుకు సినిమా పాటలు రాయడం లేదు ?

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) మబ్బు: మేఘం, చీకటి, అజ్ఞానము, అంబుదం, జలదం
ఆ) గుండె : హృదయము, మనస్సు, ధైర్యము, ఎద, ఎడద
ఇ) శిరసు : తల, శిఖరము, సీనాగ్రము, ప్రధానము, మస్తకం

2. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) వ్యాప్తి : తెలంగాణా సంగీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం దేశం అంతట వ్యాప్తి చేసింది.
ఆ) జంకని అడుగులు: గుండె బలం కలవాడు జంకని అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాడు.
ఇ) ఎడారి దిబ్బలు : ప్రయోజనంలేని ఎడారి దిబ్బలపై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు.
ఈ) చెరగని త్యాగం : పరోపకార పరాయణులు చెరగని త్యాగగుణం కలవారుగా ఉంటారు.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

వ్యాకరణాంశాలు

1. క్రింది పదాలను కలిపి, సంధిని గుర్తించి వ్రాయండి.

అ) నీరు + అవుతుంది – నీరవుతుంది – ఉకార సంధి
ఆ) ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన – ఉకార సంధి
ఇ) పేరు + అవుతుంది = పేరవుతుంది – ఉకార సంధి

2. క్రింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి, విగ్రహ వాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.

అ) ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు.
జవాబు:
ఎడారి దిబ్బలు – ఎడారి యొక్క దిబ్బలు (షష్ఠీ తత్పురుష సమాసం)

ఆ) ఇసుకగుండెలు పగిలితే అది పైరవుతుంది.
జవాబు:
ఇసుకగుండెలు – ఇసుక అనెడి గుండెలు (రూపక సమాసం)

3. క్రింది వాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి.

అ) నీకు వంద వందనాలు
జవాబు:
పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంటవెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరు సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’ వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది. కావున ఇది ఛేకానుప్రాసాలంకారం.

ఛేకానుప్రాసాలంకారం : హల్లుల జంట, అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.

ఆ) తెలుగు జాతికి అభ్యుదయం
నవ భారతికే నవోదయం
జవాబు:
పై గేయంనందు ప్రాసపదాలు అంత్యములో ఉన్నాయి కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారం.

ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్
జవాబు:
ఇది వృత్త్యానుప్రాసాలంకారం. పదం మధ్యలో జ అనే అక్షరం పలుమార్లు వచ్చింది. కాబట్టి ఇది వృత్త్యానుప్రాసాలంకారం.

ఈ) అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.
జవాబు:
ఇది రూపకాలంకారం
అజ్ఞానము – ఉపమేయం
అంధకారం – ఉపమానం

ఇక్కడ ఉపమేయమైన అజ్ఞానమునందు ఉపమానమైన అంధకార ధర్మం ఆరోపించబడింది. కావున ఇది రూపకాలంకారం.

ప్రాజెక్టు పని

డా|| సి. నారాయణ రెడ్డి రాసిన ఏవైనా రెండు గేయాలు/ గజల్లను సేకరించండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
కొన్ని (సినారె) గేయాలు :

1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం”

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”

3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది. ఎ.సి గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”

నివేదిక

డా॥ సి. నారాయణరెడ్డి గారు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ కవులుగా కీర్తి పొందారు. వీరి గేయాలు భావస్ఫోరకంగా ఉంటాయి. తేటతెలుగు పదాలతో అలరారుతుంటాయి. అంత్యప్రాసలు పాటలకు మరింత అందాన్ని ఇస్తాయి. చిన్న పదాలతో విస్తృతమైన భావాన్ని గేయాల ద్వారా అందించడం నారాయణరెడ్డి గారి ప్రత్యేకత.

సన్నివేశానికి అనుగుణంగా పదాలను గేయంలో చూపించడం నారాయణరెడ్డి గారికే చెల్లుతుంది. జాతీయాలను, తెలుగు నుడికారాలను చక్కగా చెప్పగల విశిష్ట కవి. పదలాలిత్యం, అంతకుమించిన గుణాత్మకశైలి గేయాలకు వన్నె చేకూరుస్తాయి. అందుకే తరాలు మారినా తెలుగువాడి మదిలో నారాయణరెడ్డి గారి గేయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. గేయరచనలో వీరు చూపిన దారి అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.

విశేషాంశాలు

ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డిగారి రచనలు

1) ఆధునికాంధ్ర కవిత్వము

  • సంప్రదాయములు
  • ప్రయోగములు

2) ‘విశ్వంభర’ – (జ్ఞానపీఠ అవార్డు వచ్చిన కావ్యం)
3) నాగార్జున సాగరం
4) కర్పూర వసంతరాయలు
5) మధ్యతరగతి మందహాసం
6) ప్రపంచపదులు

7) విశ్వనాథనాయకుడు
8) నారాయణరెడ్డి గేయాలు
9) దివ్వెల మువ్వలు
10) అజంతా సుందరి
11) రామప్ప
12) నవ్వని పువ్వు
13) వెన్నెలవాడ
14) ఋతుచిత్రం
15) స్వప్నభంగం
16) విశ్వగీతి

17) జలపాతం
18) సినీగేయాలు
19) జాతిరత్నం
20) తరతరాల వెలుగు (గేయ రూపకాలు)
21) అక్షరాల గవాక్షాలు
22) మంటలు – మానవుడు
23) ఉదయం నా హృదయం
24) మార్పు నా తీర్పు
25) ఇంటి పేరు చైతన్యం

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

26) రెక్కలు
27) నడక నా తల్లి
28) కాలం అంచుమీద
29) కవిత నా చిరునామా
30) కలం సాక్షిగా
31) భూమిక, మట్టీ – మనిషి (దీర్ఘ కావ్యాలు)
32) తెలుగు గజళ్ళు
33) వ్యాసవాహిని, సమీక్షణం
34) పాశ్చాత్యదేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్యం)
35) పాటలో ఏముంది – నా మాటలో ఏముంది (సినిమా పాటల విశ్లేషణ)

సూక్తి : మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు. ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది.

అర్థాలు – భావాలు

I

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది
వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం !
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

అర్థాలు

నేస్తం = స్నేహితుడా !
మబ్బుకు = మేఘానికి
మనసే = హృదయమే
కరిగితే = కరిగినట్లయితే
అది = ఆ మేఘం
నీరు + అవుతుంది = నీరుగా మారుతుంది
ముసిరితే = ముసిరినట్లయితే
కన్నీరు + అవుతుంది = కన్నీళ్ళుగా అవుతుంది
వంకలు డొంకలు = వంకలు, సందులు
కలవనీ = కలిసిపోవని
జడిపించకు = భయపెట్టకు
నేస్తం = మిత్రమా
జంకని = భయపడని
అడుగులు = అడుగులు
కదిలితే = కదిలినట్లయితే
అది = ఆ నడిచిన ప్రదేశం
దారి + అవుతుంది = మార్గం అవుతుంది

భావం:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది.

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

II

ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
మనిషీ మృగమూ ఒకటనీ అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి “సినారె”
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

అర్థాలు

ఎడారి దిబ్బలు = బీడుగా ఉన్న ప్రాంతాలు
దున్నితే = దున్నినట్లయితే
ఫలము = ప్రయోజనం
ఏముంది + అనకు = ఏముంటుందని అనవద్దు
ఇసుక గుండెలు = ఇసుకతో ఉన్న హృదయాలు
పగిలితే = పగిలినట్లయితే
అది = ఆ భూమి
పైరు + అవుతుంది = పంటలు పండుతుంది
మనిషి = మానవుడు
మృగము = మృగము
ఒకటని = ఒక్కటే అని
అనుకుంటే = భావిస్తే
వ్యర్థం = అనవసరము
మనుషులు = మానవులు
పదుగురు = అనేకమంది
కూడితే = కలిసినట్లయితే
ఒక ఊరవుతుంది = ఒక గ్రామం అవుతుంది
ఎంతటి ఎత్తులకు = ఎంతటి ఎత్తుకైనా
ఎదిగినా = ఎదిగినప్పటికీ
ఉంటుంది = ఉండును
పరీక్ష = పరీక్ష
హిమగిరి = హిమాలయ
శిరసే = శిఖరమే
మాడితే = ఎండితే
ఏ + అవుతుంది = నది అవుతుంది
బిరుదులు = పురస్కారాలు
పొందే = పొందేటటువంటి
వ్యాప్తికే = కీర్తికే
చెరగని = చెదిరిపోని
విలువేమి = విలువ ఏమిటి ?
సినారె = సి. నారాయణరెడ్డి
త్యాగం = త్యాగము
ఒక పేరు + అవుతుంది = ఒక పేరుగా నిలుస్తుంది

భావం
బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా, ఇక నాకు ఏ కష్టాలూ, బాధలు రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే ! అలాగే ఎంతటి మనిషైనా గర్వం నీరు కారిపోవలసిందే.

మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.

పాఠం ఉద్దేశం

మనిషి దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతటతాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి. నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం “ఆరవ సంపుటిలోని తెలుగు గజళ్ళు” లోనిది.

కవి పరిచయం

కవి పేరు : డా॥ సింగిరెడ్డి నారాయణరెడ్డి (సి.నా.రె)
జన్మస్థలం : రాజన్న సిరిసిల్లాజిల్లా హనుమాజీ పేట గ్రామం.
దేనినుండి గ్రహింపబడినది : నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని ‘తెలుగు గజళ్ళు’ నుండి.
జననం : 1931, జులై 29

కవి విశేషాలు : ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, సినీగేయ రచయిత
ఇతర రచనలు : నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మంద హాసం, విశ్వంభర, ప్రపంచపదులు మొదలైనవి. నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినీ గేయాలు, గజల్స్ రచించారు.

ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయ ములు – ప్రయోగములు, వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం.
బిరుదులు : పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు.
పురస్కారాలు : ‘విశ్వంభర’ కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం.

ఉద్యోగ నిర్వహణ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో ఆచార్యులుగా, అధికార భాషాసంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ,
తెలుగు విశ్వ విద్యాలయానికీ ఉపకులపతి, రాజ్యసభ సభ్యులు.

సారస్వత సేవ : ఆంధ్ర సారస్వత (వైస్ ఛాన్స్లర్) సేవలు అందించారు.
కవితాశైలి : శబ్దశక్తి, అర్థయుక్తి సినారె కలానికీ, గళానికీ ఉన్న ప్రత్యేకత. వీరి రచన సరళంగాను, మనోహరంగాను ఉంటుంది.
మరణం : 2017, జూన్ 12

TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

ప్రవేశిక

ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితోపాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – గజల్

ఈ పాఠం ‘గజల్’ ప్రక్రియకు చెందినది. గజల్లో పల్లవిని “మత్లా” అని, చివరి చరణాన్ని “మక్తా” అని, కవి నామముద్రను “తఖల్లుస్” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.

పాఠ్యభాగ సారాంశం

నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులుమబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కాని ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలూ చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషులు పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరుచుకోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

ఎంత సామర్థ్యమున్నా, అధికారం, సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలూ బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తిముందు ఎవరైనా తలవంచ వలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే ! అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరుకారిపోవలసిందే.

మనపేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్ఠాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైనవిలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికివచ్చే గొప్పపని, చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుంది.

Leave a Comment