Telangana SCERT 10th Class Telugu Guide Telangana 5th Lesson నగరగీతం Textbook Questions and Answers.
TS 10th Class Telugu 5th Lesson Questions and Answers Telangana నగరగీతం
చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 47)
చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు
సంసారం బరువెంతో సమీక్షించగలిగినవాణ్ణి
ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమి
లేకుండానే
పగలూరాత్రి ఆస్బెస్టాస్ రేకులకింద పడి ఎంత వేడెక్కినా
మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి
నరకప్రాయమైన నగర నాగరికతను నరనరానా
జీర్ణించుకున్నవాణ్ణి
రోజుకో రెండు కవితా వాక్యాల్ని రాయలేనా…
అది మనకు పెన్నుతో పెట్టిన విద్య… అఫ్ కోర్సు…
కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా
రాసిన ప్రతిదీ ఆణిముత్యం కాదని అందరికి తెలుసు
– అలిశెట్టి ప్రభాకర్
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
“చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగు తున్నప్పుడు” వాక్యం ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు:
అర్ధాంగి ఇంట్లో సరుకులన్నీ ఉన్నప్పుడు సంతోషంగా వంటావార్పులు చేస్తుంది. ఇంట్లో సరుకులు లేనప్పుడు కన్నీళ్ళతో ఖాళీ చేటనే చెరుగుతుంది. చూచేవారికి ఇంట్లో అన్నీ ఉన్నట్లు అనుకుంటారు. దీనిద్వారా సంసారాన్ని నిర్వహించడం ఎంత కష్టమో తెలుసుకోవాలని కవి సూచించాడు.
ప్రశ్న 2.
కవి నివాసం ఎట్లా ఉన్నది ?
జవాబు:
పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం లేనటు వంటి పగలూ, రాత్రి ఆస్బెస్టాస్ రేకుల షెడ్లో రచయిత నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో సకల కష్టాలను అనుభవిస్తున్నాడు.
ప్రశ్న 3.
నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకు అని ఉంటాడు ? దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
నగర నాగరికత నరకప్రాయమని కవి చెప్పాడు. ఇది యదార్థమే. నగరంలో ప్రశాంత వాతావరణం ఉండదు. కలుషితమైన వాతావరణం ఉంటుంది. శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. మానవీయ సంబంధాలు అంతగా ఉండవు. జీవితం ఉరుకులుపరుగులతో కూడి ఉంటుంది. అందువల్ల నగర నాగరికతను నరకప్రాయమని కవి చెప్పాడు.
ప్రశ్న 4.
కవితాత్మక వాక్యాలు చదివారు కదా! ఈ కవి గురించి మీకు ఏమర్థమైంది ?
జవాబు:
జీవితాన్ని నిరాశానిస్పృహలతో గడపకూడదని, సాధించాల్సిన దానిని సాధించాలని, నరకప్రాయమైన నగర నాగరికతను కూడా జీర్ణించుకోవాలనే సత్యాన్ని చెప్పినట్లుగా అర్థమవుతుంది.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 50)
ప్రశ్న 1.
పల్లెసీమల్ని కవి తల్లిఒడితో ఎందుకు పోల్చాడు ?
జవాబు:
పల్లెసీమలు ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రశాంత వాతావరణం పల్లెల్లో ఉంటుంది. మరువలేని, మరుపురాని ఆత్మీయతాను బంధాలు పల్లెల్లో ఉంటాయి. అక్కడి ప్రజలు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకుంటారు. తల్లి ఒడిలోని పిల్లవానికి ఎంత రక్షణ ఉంటుందో, పల్లెసీమలో ఉండే మనిషికి కూడా అంతటి రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో పల్లెసీమల్ని తల్లిఒడితో పోల్చాడు.
ప్రశ్న 2.
పట్టణాలను ‘ఇనప్పెట్టెలు’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
ఇనప్పెట్టెలను డబ్బు దాచుకోవడానికి వాడతారు. అవి చిన్నవిగా, ఇరుకుగా ఉంటాయి. ఇన ప్పెట్టెలో ఊపిరి పీల్చుకోడానికి కూడా గాలి రాదు. నగరాల లోని ఇళ్లలో కూడా తగినంత ఖాళీ ప్రదేశం లేక ఇరుకుగా ఉంటుంది. ఆ దృష్టితోనే కవి నగరాలను ఇనప్పెట్టెలతో పోల్చాడు.
ప్రశ్న 3.
‘నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే’ అనే వాక్యం గురించి మీకు ఏమర్థమైంది ?
జవాబు:
పఠనీయ గ్రంథంలో ఎన్నో విషయాలు చదివి తెలుసు కోవలసినవి ఉంటాయి. వాటిలో ఎంతో సమాచారం దాగి ఉంటుంది. అలాగే నగరంలో నివసించే ప్రతి మనిషికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తుల జీవన చరిత్రలు తప్పక తెలుసుకోతగ్గట్టుగా ఉంటాయి. అందుకే నగరంలో ప్రతి మనిషిని పఠనీయ గ్రంథం అని కవి చెప్పాడు.
ప్రశ్న 4.
“పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి” అని కవి ఎవరి గురించి అన్నాడు ? దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లో చదువుల పుప్పొడి రాలుతుంది. విరబూసిన పువ్వులతో పిల్లలను పోల్చాడు. పిల్లలు సుకుమార మనస్కులు. వారి నవ్వులు ఆహ్లాదంగా ఉంటాయి.
ఆలోచించండి – చెప్పండి. (T.B. P.No. 50)
ప్రశ్న 1.
“సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు!” ఇది వాస్తవమేనా ? ఎందుకు ?
జవాబు:
సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్లు కావు. ఇది వాస్తవమే. ఎందుకంటే ఒకవైపు ఖరీదైన భవంతులు పక్క పక్కనే చిన్న చిన్న పూరిపాకలు సమాంతర గీతలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యల తో, విభిన్న మనస్తత్వాలతో కనిపిస్తుంది. అనగా నగరంలో అందమైన భవనాలేకాదు, మురికివాడలు కూడా ఉంటాయని చెప్పడమే కవి ఉద్దేశ్యం.
ప్రశ్న 2.
రెండు కాళ్ళు, మూడు కాళ్ళు, నాలుగు కాళ్ళు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
రెండుకాళ్ళు అంటే కాలినడక, మూడుకాళ్ళంటే రిక్షా, నాలుగుకాళ్ళంటే కారు అని అర్థం. అనగా వారివారి ఆర్థిక స్తోమతనుబట్టి మానవులు ప్రయాణం సాగిస్తారని భావం.
ప్రశ్న 3.
“మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులు” అంటే ఏమిటి ?
జవాబు:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగుదిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.
ప్రశ్న 4.
నగరాన్ని రసాయనశాల అనీ, పద్మవ్యూహం అనీ కవి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
రసాయనశాల అంటే రసాయనద్రవ్యాలు, ఆమ్లాలు ఉన్న ప్రయోగశాల అని అర్థం. ప్రయోగశాలలో ఏవేవో తెలియని రసాయన ద్రవాలూ, ఆమ్లాలు ఉంటాయి. ఆ ద్రవాలకు వేర్వేరు చర్యలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం కూడా ఎవరికీ అర్థం కాదు. అందుకే నగరాన్ని కవి “రసాయనశాల” అన్నాడు.
ఇక పద్మవ్యూహం సంగతి. పద్మవ్యూహంలో ప్రవేశించినవాడు తిరిగి తేలికగా బయటకు రాలేడు. అక్కడే జీవనపోరాటం చేస్తూ మరణిస్తాడు.
నగరం కూడా ఇటువంటిదే, బతుకు కోసం నగరానికి వచ్చిన సామాన్యులకు ఉపాధి దొరకక పోయినా వారు ఏదో ఒక రోజున దొరుకుతుందనే ఆశతో, నగరంలోనే ఉండి దానికై ఎదురుచూస్తూ ఉంటారు. నగరంలోని సౌకర్యాలకూ, వినోద విలాసాలకూ, పైపై మెరుగులకూ వారు లొంగిపోతారు. మరోవైపు నిరుద్యోగం, అధిక ధరలు భయపెడుతున్నా నగరాన్ని విడిచి వారు వెళ్ళలేరు. వారిని కాలుష్యం కలవరపెట్టినా, వింత వింత జబ్బులు పీడిస్తున్నా, ట్రాఫికామ్లలో చిక్కుకుంటున్నా వారు నగరాన్ని విడిచి ప్రశాంతమైన తమ పల్లెలకు వెళ్ళలేరు. అందుకే కవి నగరాన్ని “పద్మవ్యూహం” అని పిలిచాడు.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
క్రింది అంశాలలో ఒకదాని గురించి చర్చించండి.
అ) మీరు ఇప్పటివరకు ఏయే నగరాలను చూశారు ? మీరు చూసిన నగరాల్లో మీకు నచ్చిన, నచ్చని అంశాలు తెలుపండి.
జవాబు:
నేను ఇప్పటి వరకు ఎన్నో నగరాలు చూశాను. వాటిలో నాకు నచ్చిన అంశాలు ఉన్నాయి, నచ్చని అంశాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ పట్టిక ద్వారా తెలియజేస్తున్నాను.
ఆ) మీ ఊరి నుండి ఎవరైనా నగరాలకు వలస వెళ్ళారా ? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ?
జవాబు:
మా ఊరు నుండి ఎంతోమంది యువతీయువకులూ, వివిధమైన చేతివృత్తులవారూ, బ్రాహ్మణులూ హైదరాబాద్ నగరానికి వలస వెళ్ళారు.
వలస వెళ్ళడానికి కారణం : మా గ్రామంలో వారికి సరైన ఉపాధి సౌకర్యాలు లేవు. విద్యా వైద్య సదుపాయాలు లేవు. ఇక్కడ వారికి ఉద్యోగాలు దొరకలేదు. అందువల్ల వారు నగరానికి వలస పోయారు. మా గ్రామంలో వ్యవసాయం వారికి గిట్టుబాటు కానందున, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, కూలిపనుల కోసం, తాపీ, వడ్రంగం వంటి వృత్తుల వారు సైతం నగరాలకు వలసవెళ్ళారు. మరికొందరు యువకులు, సినీమా పరిశ్రమలో చేరి, తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొని, నటులుగా కళాకారులుగా అభివృద్ధి చెందాలని. నగరానికి వలస వెళ్ళారు.
కొందరు యువకులు అక్కడ కూలీ పనులు చేస్తున్నారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు లఘుపరిశ్రమలు పెట్టారు. కొందరు బ్రాహ్మణులు గుళ్ళలో పూజారులుగా, పురోహితులుగా పనిచేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన చేతివృత్తులు చేసుకుంటూ అపార్ట్మెంట్ల వద్ద కాపలాదార్లుగా పనిచేస్తున్నారు.
ఇంజనీరింగ్ చదివిన యువతీ యువకులు నగరంలో శిక్షణ పొంది, చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ప్రభుత్వంలో ఉద్యోగులుగా, ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులుగా, కొందరు నిరుద్యోగులుగా ఉంటున్నారు. కొందరు వైద్యశాలల్లో నర్సులుగా పనిచేస్తున్నారు.
ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది కవితా పంక్తుల్లో దాగిన అంతరార్థాన్ని గుర్తించి రాయండి.
అ) నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే.
జవాబు:
పట్టణాల్లో నివసిస్తున్న ప్రతిమనిషి వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది. వారంతా ఏదో వృత్తిని అన్వేషిస్తూ అక్కడకు వచ్చినవారే అయి ఉంటారు. వారిలో కొందరు నిరుద్యోగులు, కొందరు చిరుద్యోగులు, కొందరు విద్యార్థులుగా, బీదవారుగా, కొందరు మధ్యతరగతి వారుగా ఉంటారు. వారు ఎన్నో రకాల సమస్యలలో చిక్కుపడి ఉంటారు. వారందరిని గూర్చి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని పై వాక్య సారాంశము.
గ్రంథం అట్ట చూసినంత మాత్రాన ఆ గ్రంథంలోని విషయం ఏమిటో తెలియదు. అలాగే నగరవాసి పై వేషభాషల్ని బట్టి అతడి చరిత్రను గ్రహించలేము. నగరవాసిని అడిగి తెలుసు కోవాలి. అతడు చదివి తెలుసుకోవలసిన పుస్తకం వంటి వాడని భావం.
ఆ) నగరం మహావృక్షంమీద ఎవరికి వారే ఏకాకి.
జవాబు:
వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకు తుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని కవి నిరసిస్తున్నాడు.
ఇ) మహానగరాల రోడ్లకు మరణం నాలుగు వైపులు.
జవాబు:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. కావున రోడ్లపై జాగ్రత్తగా వెళ్ళాలని కవి స్పష్టం చేయదలచుకున్నాడు.
ప్రశ్న 3.
క్రింది వచన కవితను చదవండి.
నా జ్ఞాపకాల్లో గూడు కట్టుకొన్న మమతల ముల్లె
మలిన మెరుగని మట్టి మనుషుల ఎదమల్లె నా పల్లె!
చుట్టూ బాంధవ్యాల పాతాళ గరిగె నా పల్లె
అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె!
తనువంతా తంగేడు పూలు పేర్చుకొన్న బతుకమ్మ
కాపురాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లెపడతి బొమ్మ
అసోయ్ దూలాల పీరీల పండుగ
అలాయ్ బలాయ్లా దసరా పండుగ
ఆటల అల్లిబిల్లి జూలా నా పల్లె!
నా పల్లెలో మా ఇళ్ళు
ఊరంతటికి ఆనందాల్ని పంచే లోగిళ్ళు!
కవిత చదివారు కదా! కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) కవితలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
మమతల ముల్లె
ఎదమల్లె నా పల్లె
పాతాళగరిగె నా పల్లె
గురిగి నా పల్లె
పేర్చుకొన్న బతుకమ్మ
పల్లెపడతి బొమ్మ
పీరీల పండుగ
దసరా పండుగ
నా పల్లె
మా ఇళ్ళు
పంచే లోగిళ్ళు !
ఆ) కవితలో కవి ఏయే పండుగలు ప్రస్తావించాడు ?
జవాబు:
బతుకమ్మ, బోనాలు, పీరీల పండుగ, అలాయ్, బలాయ్, దసరా పండుగ.
ఇ) మనుషుల నడుమ బాంధవ్యాలను కవి వేటితో పోల్చాడు ?
జవాబు:
పాతాళ గరిగె, అనుబంధాల పెరుగు గురిగితో పోల్చాడు.
ఈ) కవితకు శీర్షిక పెట్టండి. ఎందుకు ఆ శీర్షిక పెట్టారో వివరించండి.
జవాబు:
ఈ కవిత కు శీర్షిక “నా పల్లె”. ఈ వచన కవితలో అంతా చక్కని పల్లె గురించి రాసాడు. కాబట్టి “నా పల్లె” అనే శీర్షిక పెట్టాను.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అలిశెట్టి ప్రభాకర్ గురించి వ్రాయండి.
జవాబు:
కరీంనగర్ జిల్లా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీనటుల బొమ్మలను పత్రికలకు వేశాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974 లో ఆంధ్రసచిత్ర వార్తాపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన ఆయన మొదటి కవిత. ఎర్ర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం.
మంటల జెండాలు, చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభగీతం (1990), సిటీలైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళపాటు సీరియల్గా ‘సిటీలైఫ్’ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.
ఆ) ‘నగరజీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.
జవాబు:
నగరవాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్లాలి. ట్రాఫిక్ఆమ్లు ఉంటాయి. కాబట్టి ఆఫీసు వేళకు చాలా ముందుగానే వారు బయలుదేరాలి. తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది.
అలాగే కూలిపనులు చేసి జీవించే వారికి కూడా వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికీ, పోవడానికీ ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు.
ఎంత కష్టపడినా నగరజీవి చిరుసంపాదనతో వారి కోరికలు తీరవు. తిండికి, బట్టకూ, ప్రయాణాలకూ వారికి ఖర్చయిపోతుంది. అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు.
ఇ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగం ద్వారా కవి నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించాడు. నగరంలోని కష్టాలను వివరించాడు. ప్రమాదాల గురించి, అసమానతల గురించి కూడా కవి చక్కగా తెలియజేశాడు.
కవి ఇంత కఠినంగా నగర జీవన చిత్రాన్ని ఆవిష్కరించడంలో ఆంతర్యం లేకపోలేదు. ముఖ్యంగా నగర జీవన విధానంలో మార్పు రావాలని, ప్రజలమధ్య అసమానతలు తొలిగి, ఐకమత్యం వర్థిల్లాలని, మురికి వాడలులేని సుందర నగరం ఉండాలని కవి ఆకాంక్షించాడు. అందుకోసమే నగర ప్రజలను జాగృతం చేయదలిచాడు.
ఈ) నగరంలో మనిషి జీవన విధానం గురించి పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
‘నగరగీతం’ అనే పాఠ్యభాగంలో అలిశెట్టి ప్రభాకర్ నగర జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించారు. నగరంలో జీవించే ప్రజల కష్టసుఖాలను వివరించిన తీరు అద్భుతంగా ఉంది. నగర ప్రజలు ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ఇబ్బందులు పడతారు. ఇరుకైన ఇండ్లలోను, మురికివాడల్లోను జీవనం సాగిస్తారు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తికరమైన ఆనంద, విషాద గాథలు ఉంటాయి. నగర ప్రజలకు ఏనాడు విశ్రాంతి దొరకదు. సంపాదించిన ధనంతో కోరికలను తీర్చుకోలేరు. రోడ్డు ప్రమాదాలతో ప్రజలు అవస్థలుపడతారు. చిక్కు విడదీయలేని పద్మవ్యూహంలాంటి నగరంలో ప్రజల దుస్థితి హృదయ విదారకంగా ఉంటుంది.
ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ)
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి.
(లేదా)
నేడు నగర జీవితం ఎలా ఉన్నదో తెలుపండి.
(లేదా)
‘నగర జీవనం’ పాఠ్యాంశం ఆధారంగా నగరం ఎంత సంక్లిష్టంగా మారిందో వివరించండి.
జవాబు:
ప్రజలు వలసపోవటం : బ్రతుకు తెరువుకోసం, ఉపాధి కోసం ఎక్కువమంది పల్లె ప్రజలు నగరాలకు వలస పోవటం.
జనాభా పెరుగుదల : విద్యా, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు నగరాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరగటం.
రద్దీ పెరగటం : ప్రమాదాలు జరగటం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరగటం.
నీటి సమస్య : చెరువుల భూమి ఆక్రమణలకు గురియై భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి, వాడుక నీటికీ కొరత ఏర్పడటం, ఉన్న చెరువులు, బావులు అవసరాలకు చాలకపోవటం.
కాలుష్యం పెరగటం : వాహనాలు, కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవటంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరగటం.
ధరల పెరుగుదల : జనాభా పెరగటంతో వస్తువులకు గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవటం. విదేశీ సంస్కృతి ప్రభావం : భిన్న సంస్కృతులు ప్రజలు ఒక్కచోట ఉండటంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురికావటం.
సగటు మనిషి పడేపాట్లు : ఇరుకు ఇళ్ళల్లో, అధిక ధరలతో, రణగొణ ధ్వనులతో, నీటి వసతులు లేక, నిరంతరం జీవనపోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి ఎన్నో అగచాట్లు పడు తున్నాడు. క్లిష్ట సమస్యలను మానసిక సంఘర్షణతో ఎదుర్కోవటంతో నేడు నగర జీవితం నరకప్రాయంగా మారుతుంది.
ప్రశ్న 3.
క్రింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
అ) మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లు కరపత్రం రాసి ప్రదర్శించండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – పర్యావరణ స్పృహ
ఉపోద్ఘాతము :
మనము నివసించు భూమిపై మానవులే గాక గాలి, నీరు, చెట్లు, పర్వతాలు మొదలైనవి ఉంటాయి. ఈ మొత్తాన్నే వాతావరణం లేదా పర్యావరణం అంటారు. మనము ఎల్లప్పుడూ చక్కని ఆరోగ్యంతో ఉండాలంటే వీటిపై చక్కని అవగాహన కలిగి ఉండాలి. ఇట్లు అవగాహన కలిగి ఉండుటనే “పర్యావరణ స్పృహ” అని అంటారు. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మనం పీల్చేగాలి, త్రాగేనీరు, నివసించు స్థలం ఇవన్నీ కలుషితమే. రోజురోజుకీ మన ఆరోగ్యాన్ని హరిస్తూ ఆయుష్షును తగ్గిస్తున్నాయి. ఈ కాలుష్యం అనేది ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది.
1. వాయు కాలుష్యం
2. జల కాలుష్యం
3. ధ్వని కాలుష్యం
4. భూమి కాలుష్యం
1) వాయు కాలుష్యం : మనం ఎంతటి సౌకర్య వంతమైన జీవితం గడుపుతున్నా మనం ఉదయం పూట పీల్చే రెండు గంటల గాలి తప్ప మిగిలిన గాలంతా విషతుల్యమే. ఫ్యాక్టరీలు, వాహనాలు వదిలే పొగతో పాటు బొగ్గు, వంటచెరకు, చెత్తా చెదారం వంటివి కాల్చడం వలన మన ఎముకలకు, మూత్ర పిండాలకు, ఊపిరితిత్తులకు హాని జరిగి, అనేక రకాల భయంకరమైన రోగాలు వచ్చు ప్రమాదం ఉంది.
2) జలకాలుష్యం : నేడు మన భారతదేశంలోని ముఖ్యమైన 14 నదులతో పాటు అనేక ఉపనదులు, సరస్సులు, చెరువులు, తీవ్రమైన కాలుష్యానికి గురి అవుతున్నాయి. ఫ్యాక్టరీల నుండి వెలువడు మలినాలు, విషపదార్థాలు అనేకం నీటిలో కలవడం వలన జలకాలుష్యం జరుగుతున్నది. ప్రస్తుతం ప్రజలలో చాలా ఎక్కువ మంది ఈ నీటి కాలుష్యం వల్లనే బాధలు అనుభవిస్తున్నారు. దీని వలన మనకు కలరా, టైఫాయిడ్, మలేరియా మరియు డయేరియా వంటి వ్యాధులు వస్తాయి.
3) ధ్వని కాలుష్యం : ధ్వని కాలుష్యం నేడు పెద్ద పెద్ద పట్టణాలలో తీవ్రతరం అగుచున్నది. మోటారు వాహనాలు, ఫ్యాక్టరీలు, విమానాలు, రైల్వేలు, లౌడుస్పీకర్లు మొదలైనవి ధ్వని కాలుష్యానికి కారణాలు. దీని వలన మనకు చెవుడు, జ్ఞాపకశక్తి తగ్గిపోవుట, ఏకాగ్రత లోపించుట, తలనొప్పి, జీర్ణశక్తి తగ్గుట, రక్తపోటు గుండెదడ వంటి జబ్బులు వస్తాయి.
4) భూమి కాలుష్యం : ప్రాణులన్నీ భూమిపైనే నివసిస్తాయి. మనం జీవించడానికి కావలసిన ఆహారం భూమిపైనే లభిస్తుంది. అటువంటి భూమి రసాయన ఎరువుల వాడకం వల్ల నిస్సారమై పోతోంది. చెత్త, చెదారం, ప్లాస్టిక్ సంచుల వాడకం మొదలైన కారణాల వల్ల భూమి సమతౌల్యం దెబ్బతింటోంది.
కాలుష్య నివారణ మార్గాలు : వాతావరణం మనకు రక్షణ కవచం వంటిది. కాబట్టి చక్కని ఆరోగ్యం అందరికి కావలెనన్న ఈ పర్యావరణ పరిరక్షణ బాధ్యతను మనం మనందరి బాధ్యతగా గుర్తించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. వాహనాలు పొగను తగ్గించాలి.
నీరు కలుషితం కాకుండా చెరువులు, బావుల యందలి నీటిలో క్లోరిన్ వంటి క్రిమి సంహారక మందులు కలపాలి. మొక్కలు విస్తారంగా నాటి, సాధ్యమైనంత విశాల భూమిని పచ్చపచ్చగా ఉంచాలి. దంపతులైన వారు విధిగా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలి. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించాలి. ఎల్లరూ కూడ “వన రక్షణే జన రక్షణ” అన్న సూక్తిని మరువరాదు. “వృక్షో రక్షతి రక్షితః” “చెట్లు పెంచితే క్షేమం – నరికితే క్షామం”.
III. భాషాంశాలు
పదజాలం
1. క్రింది పదాలకు అర్థాలు రాయండి.
అ) నగారా
ఆ) సందడి
ఇ) ఘోష
ఈ) పఠనీయ గ్రంథం
జవాబు:
అ) నగారా : పెద్ద ఢంకా
ఆ) సందడి : జన సమూహధ్వని
ఇ) ఘోష : ఉరుము, ఆవులమంద, కంచు
ఈ) పఠనీయ గ్రంథం : చదువదగిన గ్రంథము
2. క్రింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
అ) నరుడు
ఆ) అరణ్యం
ఇ) రైతు
ఈ) పువ్వు
ఉ) మరణం
ఊ) వాంఛ
ఎ) వృక్షం
ఉదా ॥ పల్లె – గ్రామం, జనపదం
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామస్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు. జనపదాలను బాగుజేసుడే దేశ సౌభాగ్యమనుకున్నాడు.
అ) నరుడు – మానవుడు, మనిషి
నరుడు జ్ఞానవంతుడని, లోకంలో మానవుడు సాధించ లేనిది ఏదీలేదన్నారు. మనిషి తన శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలి.
ఆ) అరణ్యం – విపినం, అడవి
అరణ్యంలో ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుండటం వల్ల సింహాలు విపినంలో నివసిస్తాయి. అడవి జంతువులకు రక్షణ కావాలి.
ఇ) రైతు – కర్షకుడు, కృషీవలుడు
రైతు లేనిదే రాజ్యం లేదు. కర్షకుడు పండిస్తే పంటలు పండుతాయి అందువల్ల మనమంతా కృషీవలునికి ఋణపడియున్నాము.
ఈ) పువ్వు – కుసుమం, పుష్పం
ఉద్యానవనంలో గులాబీపువ్వు, మందార కుసుమం, మల్లెపుష్పం ఉన్నాయి.
ఉ) మరణం – మృత్యువు, చావు
పుట్టినవానికి మరణం తప్పదని తెలిసినా మానవుడు మృత్యువుకు భయపడతాడు. చావును ధైర్యంగా ఎదుర్కొనాలి.
ఊ) వాంఛ – కోరిక, ఇచ్ఛ
రవి తీరని వాంఛలను పొందలేక, వేరొక కోరిక కోరాడు. తన ఇచ్ఛ నెరవేరలేదని దిగులు చెందాడు.
ఎ) వృక్షం – చెట్టు, తరువు
ఇంటి ముందు వృక్షం ఉంటే ఆ చెట్టు గాలికి పరవశిస్తాము. తరువులపై జీవనం నిలిచియుంది.
వ్యాకరణాంశాలు
ప్రశ్న 1.
క్రింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి.
అ)నగారా మోగిందా
నయాగరా దుమికిందా
జవాబు:
ఇది అంత్యానుప్రాసాలంకారానికి చెందినది. ఇందులో ‘దా’ అనే హల్లు రెండు పదాల్లోను అంత్యంలో ప్రయోగించబడింది. అందువల్ల ఇది అంత్యానుప్రాసాలంకారం.
లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.
ఆ)కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
జవాబు:
ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఈ ఉదాహరణలోని పాదాల్లో చివరగా ‘కాళ్ళు’ అనే హల్లుల జంట అంత్యప్రాసగా వాడబడింది. అందువల్ల ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.
ప్రశ్న 2.
క్రింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి.
అ) అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁదను మగుడ నుడుగఁడని నడ
యుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
జవాబు:
ఇది వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణము : ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తము చెందినది. కావున దీనిని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.
ఆ) రంగదరాతిభంగ; ఖగరాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ, దయాంతరంగ; స
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ; నిశాచరాబ్జ మా
తంగ; శుభాంగ ! భద్రగరి దాశరథీ! కరుణా పయోనిధీ !
జవాబు:
ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఇక్కడ అంత్యప్రాసగా ‘గ’ అనే ఒకే హల్లు, రంగ అనే హల్లుల జంట వాడబడినాయి. అందువల్ల ఇక్కడ అంత్యాను ప్రాసాలంకారం ఉంది.
లక్షణం : ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యానుప్రాసం’ అని అంటారు.
రూపకాలంకారము
క్రింది వాక్యాలను పరిశీలించండి.
- ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు.
- బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
- వానజాణ చినుకుపూలను చల్లింది.
- నవ్వులనావలో తుళ్ళుతూ పయనిస్తున్నాం..
పై వాక్యాలను గమనించారు కదా ! ఏం అర్థమయ్యింది. మొదటి వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది. ఇందులో జ్ఞానం ఉపమేయం.
జ్యోతి ఉపమానం. ఈ రెండింటికి భేదం లేనట్లు (అభేదం)గా చెప్పబడింది. ఇట్లా అభేదం చెప్పడాన్నే ‘రూపకాలంకారం’ అంటారు.
ఉదా :నగరారణ్య హోరు నరుడి జీవనఘోష.
సమన్వయం:ఇందులో నగరం ఉపమేయం. అరణ్యం ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికి, ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
(ii) (iii) (iv) లలో ఒక వాక్యానికి సమన్వయం రాయండి.
జవాబు:
ii) బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
సమన్వయం : ఈ వాక్యంలో బతుకు, ఆట వేరువేరు కాదు. బతుకు ఉపమేయం, ఆట ఉపమానం. ఈ రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
iii) వానజాణ చినుకుపూలను చల్లింది.
సమన్వయం : వాన ఉపమేయం – జాణ ఉపమానం
చినుకు ఉపమేయం – పూలను
ఉపమానం.వాన, జాణ వేరైనప్పటికి అభేదం (భేదం లేనట్లు) చెపితే అది రూపకాలంకారం.
iv) ‘నవ్వులవానలో తుళ్ళుతూ పయనిస్తున్నాం’.
సమన్వయం : నవ్వులు అనేది ఉపమేయం వాన అనేది ఉపమానం భేదం లేనట్లు చెప్పటం.
పై ఉదాహరణలలో ఉపమేయమునకు, ఉపమాన మునకు భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కావున `ఇది రూపకాలంకారం.
ఇలాంటివి పాఠంలో వెతికి రాయండి. సమన్వయం చేయండి.
1. చదువుల పుప్పొడి
2. నగరం మహావృక్షం
1 వ వాక్యం : చదువుల పుప్పొడి
సమన్వయం : ఇందులో ‘చదువులు’ అనేది ఉపమేయం. ‘పుప్పొడి’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన చదువులకు, ఉపమానమైన పుప్పొడికి, భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
2 వ వాక్యం : నగరం మహావృక్షం.
సమన్వయం: ఇందులో ‘నగరం’ అనేది ఉపమేయం. ‘మహావృక్షం’ అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికీ, ఉపమానమైన మహావృక్షానికీ భేదం ఉన్నా, లేనట్లే చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
ప్రాజెక్టు పని
పల్లెలు / పట్నాలలోని జీవన విధానానికి గల తేడాలు పట్టికగా రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
మీకు తెలుసా ?
పట్టణ వీధుల్లో విద్యుత్తు వాడకం తక్కువగా ఉండటానికి నియాన్ దీపాలను వాడుతారు. అయితే ఈ నియాన్ దీపాల వెలుగు ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నదని ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్’ అనే సంస్థ ప్రకటించింది. ముంబయి నగరంలో నియాన్ దీపాల వాడకాన్ని నిషేధించాలని ముంబయి నగరపాలక సంస్థ మీద కోర్టులో కేసు వేసింది. ముంబయి కోర్టు ఒక కమిటీని ఏర్పరచింది.
కమిటీ నివేదిక ప్రకారం నియాన్ దీపాల వెలుగు చాలా ఎక్కువగా ఉంటే మూర్ఛరోగం వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ళు, మెదడుకు హాని కలిగిస్తుంది. అధికరక్తపీడనం, నరాలక్షీణత, అల్సరు వంటి రోగాలకు కారణమవుతుంది. అందువలన రాత్రి పదకొండు గంటలనుండి నియాన్ దీపాలను వాడరాదని హైకోర్టు తీర్పునిచ్చింది.
విశేషాంశాలు :
1.పద్మవ్యూహం : మహాభారతంలో ఈ మాట ఉంది. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా శత్రువును బంధించే యుద్ధ వ్యూహం ఇది. భారతంలో అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని వీర మరణాన్ని పొందాడు. ఎవరైనా తమ శత్రువులు పన్నిన, సంక్లిష్టమైన ఉచ్చులో పడినట్టయితే “అతడు పద్మ వ్యూహంలో చిక్కుకున్నాడు” అంటారు.
సూక్తి : సహజమైన పర్యావరణ పరిసరాలవల్ల జీవనానందం పునరుత్తేజం పొందుతుంది.
జీవించాలనే తపన నిరంతరం పునరావృత్తమవుతుంది.
అర్థ తాత్పర్యాలు
I
నగారా మోగిందా
నయాగరా దుమికిందా
నాలుగురోడ్ల కూడలిలో ఏమది ?
అదే, నగరారణ్యహోరు నరుడి జీవనఘోష
తల్లి ఒడివంటి
పల్లెసీమల్నొదిలి
తరలివచ్చిన పేదరైతులూ
ఇనప్పెట్టెల్లాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులూ
నగరంలో ప్రతిమనిషి
పఠనీయ గ్రంథమే
మరి నీ బతుకు
పేజీలు తిరగేసేదెవరో!
ఉదయమే
బస్సుల్లో రిక్షాల్లో
పేవ్మెంట్లపై విరబూసిన
కాన్వెంటు పువ్వుల సందడి
రాలే చదువుల పుప్పొడి!
అర్ధాలు
మినీ కవిత = గొప్ప ప్రాధాన్యం కల విషయాన్ని కొద్దిమాటలలో చెప్పడం (Mini Poetry)
నగారా, మోగిందా = పెద్ద ఢంకా, చేసిందా శబ్దం
నయాగరా దుమికిందా = ‘నయాగరా’ అనేది అమెరికాలోని పెద్ద జలపాతం. అది కిందికి దుమికిందా ? (దుమికినపుడు పెద్ద ధ్వని వస్తుంది.)
నాలుగురోడ్ల కూడలిలో = నాలుగు రోడ్లూ కలిసే చోటులో (Four Roads Junction)
ఏమది (ఏమి + అది) = ఏమిటి అది ?
అదే = ఆ ధ్వని
నగరారణ్యహోరు
(నగర +అరణ్య, హోరు) = పట్టణం అనే అరణ్యంలో వినిపించే ధ్వని, గాలి వీచేటప్పుడు వచ్చే ధ్వనిని “హోరు” అంటారు.
నరుడి, జీవనఘోష = మానవుడి బ్రతుకు పోరాటం లోంచి వచ్చిన ఉరుము వంటి శబ్దం.
తల్లి ఒడివంటి = అమ్మ ఒడిలాంటి
పల్లెసీమల్నొదిలి
(పల్లె సీమలన్+వొదిలి) = గ్రామ సీమలను వదలి (గ్రామసీమలను విడిచిపెట్టి)
తరలివచ్చిన పేదరైతులు = బయలుదేరి వచ్చిన బీద రైతులూ
ఇనప్పెట్టెల్లాంటి = ఇనుముతో చేసిన పెట్టెలవలె ఇరుకుగా ఉన్న
ఈ పట్టణాల్లో = ఈ నగరాలలోని ఇళ్ళలో
ఊపిరాడని
(ఊపిరి+అడని) = శ్వాస పీల్చుకోవడానికి కూడా గాలి దొరకని
మీ బతుకులూ = మీ జీవితాలు
నగరంలో ప్రతిమనిషి = పట్టణంలో నివసించే ప్రతి మనిషి కూడా
పఠనీయ గ్రంథమే = చదువదగిన పుస్తకం వంటి వాడే, (చదువదగిన పుస్తకం లాంటి వాడే పుస్తకం చదివితే, ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే నగరజీవి యొక్క చరిత్రను పరిశీలిస్తే, ఎన్నో జీవన సత్యాలు వెల్లడి అవుతాయని భావం. )
మరి నీ బతుకు = మరి నీ జీవితం అనే పుస్తకం యొక్క
పేజీలు తిరగేసేదెవరో = పుటలు ఎవరు తెరచి చదువుతారో ! (ఎవ్వరూ నగరజీవి చరిత్రను పట్టించుకోరని భావం. నగర జీవుల చరిత్రలలో ఆసక్తికరమైన, దుఃఖభరితమైన సంగతులు ఎన్నో ఉంటాయి. కాని ఎవ్వరూ అతడి వివరాలు జీవన విధానాలు పట్టించుకోరని కవి చెప్పారు)
ఉదయమే = ప్రొద్దున్నే
బస్సుల్లో, రిక్షాల్లో = స్కూలు వారు తీసుకెళ్ళే బస్సులలోనూ, సిటీబస్సుల్లోనూ, ఆటోరిక్షాల వారు తీసుకువెళ్ళే రిక్షాల్లోనూ.
పేవ్మెంట్లపై (Pavements) = రోడ్లు ప్రక్కన రాళ్ళు పరచి చదును చేసిన నడకదారుల పైన
విరబూసిన
(విరియబూసిన) = సమృద్ధిగా పూసిన
కాన్వెంటు పువ్వుల
సందడి = (convent) కాన్వెంటు బడులలో చదువుకొనే పువ్వుల వంటి పిల్లల గోల
రాలే చదువుల పుప్పొడి = ఆ పిల్లల మాటలు, ఆ పిల్లలనే పువ్వుల నుండి రాలిపడే పుప్పొడి లాంటివి.
తాత్పర్యము
అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా, ఉధృతమైన వేగంతో దూకే నయాగరా జలపాతం హోరులా అనిపిస్తుంది. నిజానికది అరణ్యంలాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉఱుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు.
అమ్మఒడిలాంటి పుట్టిన ఊరిని వదిలి ఉపాధికోసం నగరం తరలివచ్చిన వారికి ఇంత పెద్ద పట్నంలో తలదాచు కోవడానికి కాసింత స్థలం కూడా దొరకదు. పేదరైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు.
నగరంలో ప్రతిమనిషీ చదువవలసిన ఒక పుస్తకం లాంటివాడు. అయితే ఎవరూ అతని బతుకు పుస్తకములోని పేజీలను చదివేవారు ఉండరు. నగరంలోని మనిషివెనక అనేక ఆసక్తికరమైన ఆనంద, విషాదగాథలుంటాయి. ఒక్క రైనా అతని బాగోగులు పట్టించుకునేవారే ఉండరనే చేదునిజాన్ని చెపుతున్నాడు కవి.
నగరంలో ఉదయాన్నే సిటీబస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లోంచి చదువుల పుప్పొడి రాలుతుంది.
II
సిటీ అంటే అన్నీ
బ్యూటీ బిల్డింగ్లు కావు
అటు భవంతులూ ఇటు పూరిళ్ళూ
దారిద్ర్యం, సౌభాగ్యం సమాంతర రేఖలు!
ఇది వెరైటీ సమస్యల మనుష్యుల
సమ్మేళన కోలాహలం!
ఎంతచేసినా ఎవరికీ
తీరిక దక్కదు కోరిక చిక్కదు
మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు
కొందరికి రెండు కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు!
నగరంలో అన్నిపక్కలా
సారించాలి మన చూపులు
మహానగరాల రోడ్లకి
‘మరణం నాలుగువైపులు!
నగరం మహావృక్షంమీద
ఎవరికి వారే ఏకాకి!
నగరం అర్ధంకాని రసాయనశాల!
నగరం చిక్కు వీడని పద్మవ్యూహం!!
అర్ధాలు
సిటీ (City) = నగరం, పట్టణం
అంటే = అన్నట్లయితే
అన్నీ = అక్కడ ఉన్నవన్నీ
(Beauty Buildings) కావు = కావు
ఇటు పూరిళ్ళూ = మరింకోపక్క, గడ్డితో నేసిన ఇళ్ళు
దారిద్య్రం = బీదతనం
సౌభాగ్యం = ధనవైభవం (అదృష్టం)
సమాంతర రేఖలు = సమానమైన మధ్యదూరం గల రేఖలు (సమాంతర రేఖలు ఎంత దూరం పొడిగించినా కలిసికోవు)
ఇది = ఈ పట్టణం
వెరైటీ సమస్యలు
(Variety) = నానావిధాలయిన చిక్కులు గల
మనుష్యుల = మానవుల
సమ్మేళన కోలాహలం = కలయికల పెద్ద రొద (చప్పుడు)
ఎంతచేసినా = ఎంత కష్టపడి పనిచేసినా (ప్రొద్దుస్తమానం పనిచేసినా)
ఎవరికీ = నగరవాసులు ఎవరికీ
తీరిక = విశ్రాంతి
దక్కదు = లభించదు (అక్కడ మనిషికి విశ్రాంతి తీసుకోడానికి సమయం దొరకదు)
కోరిక = కోరిన కోరిక
చిక్కదు = దొరకదు (సంపాదించిన ధనం తో వారి కోరికలు తీరవు)
మెర్క్యురీ నవ్వులు (Mercury) = పాదరసం నవ్వులు (కృత్రిమపు నవ్వులు) (తెచ్చి పెట్టుకొన్న అసహజపు నవ్వులు)
పాదరసం నడకలు = పాదరసం దొర్లిపోయేలా, వేగంగా పరుగువంటి నడకలు
కొందరికి రెండు కాళ్ళు= నగరంలో ప్రయాణాలు చేసే వాళ్ళలో కొందరికి రెండు కాళ్ళు, అంటే వారు కాలి నడకన ప్రయాణాలు సాగిస్తారు. వారికి, వారి రెండు కాళ్ళే ప్రయాణ సాధనాలు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు = రిక్షాల్లో తిరిగేవాళ్ళకు మూడు కాళ్ళు, అంటే మూడుచక్రాల రిక్షాలూ, ఆటో రిక్షాలూ వారి ప్రయాణ సాధనాలు.
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు = డబ్బు ఉన్నవారికి నాల్గు కాళ్ళు అనగా నాల్గుచక్రాలు గల కార్లలో వారు తిరుగుతారు. అంటే వారి ప్రయాణసాధనాలు కార్లు.
నగరంలో = పట్టణంలో
అన్నిపక్కలా = అన్నివైపులకూ
సారించాలి = ప్రసరింపచేయాలి.(అన్నివైపులకూ చూస్తూ ప్రయాణం సాగించాలి)
మన చూపులు = మన చూపులను
మహానగరాల రోడ్లకి = పెద్ద పట్టణాలలోని రోడ్లకు
మరణం నాలుగువైపులు = నాలుగు వైపుల నుండి చావు రావడానికి సావకాశం ఉంటుంది. (ఏ వైపు నుండైనా, ఎవరైనా వచ్చి తమ వాహనంతో పొర పాటున గుద్దుతారు. అందువల్ల రోడ్డుపై నడిచేటప్పుడు నాలుగు వైపులకూ చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏ వైపు నుంచైనా మరణం సంభవిస్తుంది,)
నగరం మహావృక్షంమీద = పట్టణం అనే ఒక పెద్ద చెట్టు మీద
ఎవరికి వారే ఏకాకి = ఎవరికి వారే ఒంటరిగా ఉంటారు.
నగరం = పట్టణం
అర్థంకాని = అది ఏమిటో తెలియని
రసాయనశాల = ప్రయోగశాల (Laboratory)
నగరం చిక్కువీడని
పద్మవ్యూహం = పట్టణం చిక్కులో తగిలిన నగరవాసులు, దాని నుండి తప్పించు కొని బయటకు రాలేని పద్మవ్యూహం వంటిది
తాత్పర్యము
నగరం నిండా అన్నివైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలూ ఉంటాయి. ఇక్కడ ఐశ్వర్యం దారిద్ర్యం పక్కపక్కనే సమాంతర రేఖలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో, విభిన్న మనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది.
ఎంత నిరంత రాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో, స్థిరత్వంలేని హడావుడి నడకలతో వెళ్ళేవారు, ఆటోరిక్షాల్లో తిరిగేవాళ్ళు, కార్లలో ప్రయాణించే ధనవంతులూ ఉంటారు.
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నగరంలో అన్నివైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నగరంలో నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.
వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి.
ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు, ఆమ్లాలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం అంతకంటే అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. నగరంలో బతుకుదామని వచ్చినవారు, ఉపాధి దొరకక పోయినా ఏదో ఒకరోజు దొరుకుతుందని ఆశగా వేచి చూస్తుంటారు. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి.
మరోవైపు నిరుద్యోగం, జీవనవ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు. కాలుష్యం కలవరపెట్టినా, ట్రాఫిక్ జామ్ జీవితం ఇరుక్కు పోయినా నగరం విడిచి ప్రశాంతంగా మన పల్లెలకు వెళ్ళనివ్వని, చిక్కువిడదీయలేని పద్మవ్యూహం లాంటిది నగరం.
పాఠం నేపథ్యం / ఉద్దేశం
ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకుతెరువుకోసం నగరాలకు వలసలు పెరిగాయి. నగరంలోని అనుకూలాంశాలన్నింటిని వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు. దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమస్యలు పెరిగిపోయాయి.
ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శర వేగంగా తన రూపం మార్చుకుంటున్నది. సామాన్యుడికి అంద నంత దూరంగా కదిలిపోతున్నది. మధ్యతరగతికి అంతుచిక్కని ప్రాంతంగా మారిపోయింది. మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు. తనకుతానే పరాయీకరణకు గురవు తున్నాడు.
ఈ నేపథ్యంలో నగరజీవితంలోని యథార్థదృశ్యాల్ని మన కళ్ళముందు నిలుపుతూ, నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ, వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం “మినీ కవిత” అనే ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకల తో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత.
‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ అనే గ్రంథంలోని ‘సిటీలైఫ్’ అనే మినీ కవితలలో కొన్నిటిని ‘నగరగీతం’ గా కూర్చడమైనది.
కవి పరిచయం
కవి పేరు : అలిశెట్టి ప్రభాకర్
జననం : 12-01-1954 వ సం॥
మరణం : 12-01-1993 వ సం॥
జన్మస్థలం : పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లా
తల్లిదండ్రులు : వీరి తండ్రి “అలిశెట్టి చినరాజం”, తల్లి “లక్ష్మి”.
వ్యాసంగం : మొదట ఆర్టిస్ట్గా ఎదిగాడు. ప్రారంభం లో పత్రికలకు పండగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు. తరువాత జగిత్యాలలో ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన మొదటి కవిత. జగిత్యాలలో ‘స్టూడియో పూర్ణిమ’ (1976), కరీంనగర్లో స్టూడియో శిల్పి’ (1979) హైదరాబాద్లో ‘స్టూడియో చిత్రలేఖ’ (1983) ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు.
మొదటి కవిత : ‘పరిష్కారం’ అన్న వీరి కవిత, మొదటగా ఆంధ్రసచిత్ర వార్త పత్రిక లో అచ్చయ్యింది.
రచనలు :
- ఎర్ర పావురాలు (1978) మొదటి కవితా సంకలనం,
- మంటల జెండాలు, చురకలు (1979),
- రక్తరేఖ (1985),
- ఎన్నికల ఎండమావి (1989),
- సంక్షోభ గీతం (1990),
- సిటీలైఫ్ (1992)
అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్గా ‘సిటీలైఫ్” పేరుతో హైదరాబాదు నగరంపై వ్రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు.
శైలి : కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని పాఠకుల్లో ప్రగతిని, ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్.
ప్రవేశిక
దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది.
కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి. సహృదయుడు ప్రతి కదలిక నుంచీ ప్రేరణ పొందుతాడు. అతనికి భాష ఆయుధమైతే, భావం కవితారూపం సంతరించుకుంటుంది.
నగరంలోని మూలలను, మూలాలనూ ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో- ‘అలిశెట్టి’ మినీ కవిత(లు) మన కళ్ళకు గడుతుంది. మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి ……………
విద్యార్థులకు సూచనలు
- పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠం లోని విషయాన్ని ఊహించండి.
- పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి..
- వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి
ప్రక్రియ -వచన కవిత
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘వచన కవిత’ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఇది పద్య, గేయాల్లో ఉండే ఛందస్సు. మాత్రాగణాలతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషలో రాసే కవితను వచనకవితగా పేర్కొనవచ్చు. చిన్న చిన్న పద్యాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత.
పాఠ్యభాగ సారాంశము
అనేకరకాల వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిన్న వ్యాపారుల అరుపులతో నాలుగురోడ్ల కూడలి దద్దరిల్లిపోతుంది. నిజానికి ఆ శబ్దం నయాగరా జలపాతం హోరులా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దంలా ఉంది. అమ్మఒడిలాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధికోసం కొందరు పట్టణాలకు వలసవెళ్తున్నారు. పేద రైతులు నగరంలో ఇనుప పెట్టెలవంటి ఇళ్ళల్లోను, మురికివాడల్లోను నివసిస్తుంటారు. నగరంలో ప్రతి మనిషి చదువవలసిన ఒక పుస్తకంలాంటివాడు. నగరంలోని మనిషి వెనుక ఆసక్తిదాయకమైన ఆనంద, విషాదగాథలు ఉంటాయి. పిల్లలు చదువులతో సందడిచేస్తుంటారు.
నగరంలో అందమైన ఎత్తైన భవనాలు ఒకపక్క ఉన్నా, మరొకపక్క మురికివాడలు కూడా ఉంటాయి. నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. కొందరు కాలినడకతో, మరికొందరు ఆటోరిక్షాల్లో, ధనవంతులు కార్లలో ప్రయాణంచేస్తూ ఉంటారు. నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
నగరంలో ప్రమాదాలు అన్ని వైపులా పొంచిఉన్నాయి. నగర ప్రజలు పరస్పరం పలకరించుకోకుండా ఏకాకిగా బతుకు తారు. నగరం అర్థంకాని రసాయనశాలలా ఉంటుంది. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవన వ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధికాదు.