Telangana SCERT 10th Class Telugu Grammar Telangana అపరిచిత గద్యాలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar అపరిచిత గద్యాలు
ప్రశ్న 1.
క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
అన్ని మార్పులూ మంచికే అని బల్లగుద్ది చెప్పలేం. వెల్లువలా వస్తున్న ఒక సంస్కృతీ ప్రభావానికిలోనైగాని, పాలకుల ప్రభావానికి లోనైగాని సమాజంలో కొన్ని మార్పులు జరుగు తుంటాయి. పరాయి సంస్కృతీ సంప్రదాయా లను గుడ్డిగా అనుసరించడం వల్ల వచ్చే నష్టాలు చాపకింద నీరు లాంటివి. కొంప మునిగిన తర్వాతగానీ వాటి వల్ల వచ్చే నష్టాలు కంటికి కనిపించవు. అందువల్ల చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు కాకుండా కొన్ని విషయాల్లో ముందే మేల్కొనే ప్రయత్నం చేద్దాం !
ప్రశ్నలు – జవాబులు :
1. ఇందులో చాపకింద నీరు అని దేన్ని ఉద్దేశించి చెప్పడమైంది ?
జవాబు:
ఇందులో చాపకింద నీరు అని పరాయి సంస్కృతీ సంప్రదాయాలను ఉద్దేశించి చెప్పబడింది.
2. ఈ పేరాలో నీకు తెలిసిన సామెత ఉంటే తెల్పండి ?
జవాబు:
ఈ పేరాలో నాకు వచ్చిన సామెత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు.
3. సమాజంలో వచ్చే మార్పులకు ప్రధానకారణమేమి ?
జవాబు:
వెల్లువగావస్తున్న ఒక సంస్కృతీ ప్రభావం, పాలకుల ప్రభావం సమాజంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణాలు.
4. ఈ పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి ?
జవాబు:
ఈ పేరా ద్వారా మనం ఏమి గ్రహింపవచ్చు ?
5. ఎటువంటి నష్టాలు చాపకింద నీరులాంటివి ?
జవాబు:
పరాయి సంస్కృతీ సంప్రదాయాలను గుడ్డిగా అనుసరించడం వల్ల వచ్చే నష్టాలు.
ప్రశ్న 2.
క్రింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ప్రశ్నలను తయారుచేయండి.
“శ్రీ రావూరి భరద్వాజగారు స్వయం కృషితో సామాన్యుడి స్థాయి నుండి సమున్నత స్థాయి వరకు ఎదిగిన తపస్వి. ఆయన చదువు అంతంత మాత్రమే. ఆంగ్లం అసలే తెలియని ఆయన తన బలహీనతలన్నీ సవరించుకొని, తనదైన సొంత శైలిలో రచనలు చేపట్టారు. అనేక కథలు, నవలలు రాశారు. “పిడికెడు మెతుకుల కోసం – నేను వ్యవసాయ కూలీగా పనిచేశాను.” వారి గురించి వారే చెప్పిన మాటలివి. ‘ఒకానొక అవమానం, నన్ను చదువు వైపు మళ్ళించింది”. ఇవి కూడా వారి మాటలే ….. అటుంటి వీరిని “జ్ఞానపీఠం” అనే అత్యున్నత పురస్కారం వరించింది.
జవాబు:
ప్రశ్నలు :
- రావూరి భరద్వాజ గారి విశిష్టత ఏమి ?
- రావూరిగారు తన గురించి ఏమని చెప్పుకున్నారు ?
- రావూరిగారు పొందిన విశిష్ట పురస్కారం ఏది ?
- రావూరి భరద్వాజ గారు ఏమి రచించారు ?
- రావూరిగారి పాండిత్యం ఎట్టిది ?
ప్రశ్న 3.
క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలను తయారు చేయుము.
20వ శతాబ్దపు తొలిరోజులలో కుటుంబ నియంత్రణను బూతు మాట క్రింద జమకట్టే వారు. అటువంటి సమయంలో నర్స్లో పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబ నియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమెన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్కు వలసవెళ్ళి 1916లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రిపై దాడి చేశారు. అయినా ఆమె చలించ కుండా 1923లో కుటుంబ నియంత్రణ పరిశోధనాశాలను నెలకొల్పారు.
జవాబు:
ప్రశ్నలు
- కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ పేరేమి ?
- ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు ?
- మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళినది ?
- 1923లో సాంగర్ దేనిని నెలకొల్పినది ?
- ఎప్పుడు కుటుంబ నియంత్రణను బూతుమాట కింద జమకట్టేవారు ?
ప్రశ్న 4.
క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలు తయారుచేయండి.
జనపదం అంటే పల్లెటూరు. జనపదాలలో ఉండేవారు జానపదులు. వారు పాడుకొనే పాటలు లేదా గేయాలను జానపద గేయా లంటారు. వీనినే ఆంగ్లంలో ‘ఫోక్ సాంగ్స్’
అంటారు. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను ‘లోక్ గీత్’ లేదా ‘లోక్ సాహిత్య’ అంటారు. జానపద గేయానికి ఒక ప్రత్యేక కవి ఉండడు. జానపద గేయం సమిష్ఠి సంపద. శిష్ట సాహిత్యంలాగా కాక, జానపద సాహిత్యం పలువురి చేతులలో పెరిగినది. ఇది దాని మొదటి లక్షణం. గేయ రచనా కాలం స్పష్టంగా ఉండకపోవడం మరో లక్షణం, నదీనదాలూ, వాగులూ, వంకలూ మనకు ఉపయోగపడక, సముద్రం పాలయినట్లే జానపద గేయ స్రవంతి చాలా భాగం మనకు అందలేదు. జానపద సాహిత్యాన్ని భద్రపరచవలసిన అవసరం ఉంది.
జవాబు:
ప్రశ్నలు
- జానపదులు అంటే ఎవరు ?
- ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను ఏమంటారు ?
- జానపద సాహిత్యం మొదటి లక్షణం ఏమిటి ?
- ఆంగ్లంలో జానపద గేయాలను ఏమంటారు ?
- ‘జానపద గేయాలు’ అని వేటినంటారు ?
ప్రశ్న 5.
క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలు తయారుచేయండి.
సమాజ శ్రేయస్సు కొరకు మతము ఏర్పడినది. ప్రతి మతము ఉన్నతాశయములు కల్గియున్నది. ఏ మతము చెడును బోధించదు. ఈ మతము గొప్పది, పరమతము నీచమైనదనే ప్రచారము చేయువారు విశాల హృదయములేని వారని, సంకుచిత స్వభావులని భావింప వచ్చును. స్వార్థపరులని తలంపవచ్చును. అట్టివారి మాటలను నమ్ముట మన అజ్ఞానము నకు ప్రతీక యగును.
జవాబు:
ప్రశ్నలు
- మతము ఎందులకు ఏర్పడినది ?
- దేన్ని మతము బోధించదు
- ప్రతి మతము ఏవి కల్గియున్నది ?
- ఎవరు విశాల హృదయం లేనివారు ?
- ఏది అజ్ఞానమునకు ప్రతీక ?
ప్రశ్న 6.
క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలు తయారుచేయండి.
విద్యార్థికి క్రమశిక్షణ చాలా అవసరం. ఒక క్రమపద్ధతి ప్రకారం తన పనులన్నీ తానే చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. ఎప్పటి పని అప్పుడే చేయాలి. పనిని వాయిదా వేయకూడదు. ఆత్మనిగ్రహాన్ని అలవరచుకోవాలి. చీటికీ మాటికీ కోపం తెచ్చుకోకూడదు. తోటి వారిని చూసి ఈర్ష్య పడకూడదు. అసూయ పడకూడదు. చదువులోనూ, సత్ప్రవర్తనలోనూ తోటి వారిని మించాలనే పట్టుదలతో కృషి చేయాలి. అంతేకాని వాళ్ళు నీ కంటే ముందున్నారని అసూయ పడకూడదు. నీకంటే ముందున్న వారిపట్ల అసూయ కూడనట్లే, నీకంటే వెనుక బడినవారి పట్ల చులకన భావం కూడా ఉండ కూడదు. వాళ్ళకు తగిన ప్రోత్సాహమివ్వాలి.
జవాబు:
ప్రశ్నలు
- విద్యార్థికి ఏది అవసరం ?
- విద్యార్థి దేన్ని అలవరచుకోవాలి ?
- ఏ విషయంలో పట్టుదలతో కృషిచేయాలి ?
- ఎవరిపై చులకన భావం ఉండకూడదు ?
- విద్యార్థి ఎవరిపై అసూయ పడకూడదు ?
ప్రశ్న 7.
క్రింది పేరా చదవండి.
ముందుగా వ్యక్తి బాగుపడవలెను. ఆ వెనుక సంఘము బాగుండును. ముందుగా సంఘమును సంస్కరించవలెననుట వెట్టి మాట. మాటలో, చేతలో, తుదకు భావనలో సంస్కారముట్టి పడవలెను. అట్టి వ్యక్తులు పెక్కుమంది ఉన్నచో తనంతట తానే సంఘము ఉద్దరింపబడును. వ్యక్తిని, తుదకు జాతిని తీర్చి దిద్దుకునే ఈ సంస్కారములు, వాని ప్రణాళికను గమనించినచో “చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష” అనురీతిలో ఉండక వ్యక్తి శ్రేయస్సు, సమాజ కళ్యాణము, పరస్పరము ముడిపడియున్నదని విడివిడిగా లేదని తెలివిడి చేయును.
ఉదాహరణకు ప్రతి గృహస్థు విధిగా చేయవలసిన పంచమహా యజ్ఞములను చూడుడు. దేవయజ్ఞమందు దేవతలను, ఋషియజ్ఞము నందు ఋషులను, వారందించిన విజ్ఞానమును, పితృయజ్ఞము యందు పితృదేవతలను కొలుచుచున్నాడు కదా! భూతయజ్ఞము నందు కుక్కలకు, కాకులకు బలివేయుచున్నాడు కదా ! పొరుగువారిని ప్రేమింపమని ఇతర మతములన్నచో, పొరుగు ప్రాణిని కూడా ప్రేమింపమని సనాతన ధర్మము చాటుచున్నది.
పై పేరా ఆధారంగా కింది వాక్యములు సరైనవో కాదో (✓) (✗) గుర్తుల ద్వారా గుర్తించండి :
1. వ్యక్తి బాగుపడినప్పుడే సంఘము బాగుపడుతుంది.
జవాబు:
✓
2. మాటలు, చేతలు, భావనలతో సంస్కారముట్టిపడదు.
జవాబు:
✗
3. ప్రతిగృహస్థు విధిగా పంచ మహాయజ్ఞములను చేయవలెను.
జవాబు:
✓
4. పొరుగువానిని ప్రేమించమని, పొరుగు ప్రాణిని ద్వేషించమని సనాతన ధర్మము చాటుచున్నది.
జవాబు:
✗
5. వ్యక్తి శ్రేయస్సు, సమాజకళ్యాణము పరస్పరము ముడిపడియున్నవి.
జవాబు:
✓
ప్రశ్న 8.
క్రింది గద్యాన్ని చదివి ఖాళీలు పూరించండి.
మన సాహిత్యంలో కావ్య-ప్రబంధ – పద్యగద్య రచనలు చేయని గొప్ప ఉపదేశాన్ని – గొప్ప చైతన్యాన్ని ప్రసాదించిన ప్రక్రియల్లో ప్రప్రథమంగా పేర్కొనదగింది శతకం. నీతిని, వ్యక్తుల తీరును గొప్పగా వర్ణించినట్టివి శతకాలే. అందువలన కవితాభ్యాసదశలో చిన్న చిన్న పద్యాలతో ఆరంభించి శతకం దాకా వచ్చి దానిలో తమ ప్రతిభను నిరూపించుకున్న కవి వర్యులున్నారు. శతకంలో వివిధ రీతులున్నట్లే శతకంలోని ఛందస్సు కూడా వైవిధ్యం కలిగి యున్నది. కందం నుండి మధ్యాక్కరల దాకా వాస్తవమైన ఛందం కవుల ప్రతిభ వలన చక్కగా పొదిగింది. చిన్ననాడు బాలబాలికలకు శతక పద్యాలను, నీతి పద్యాలు, కథలను చెప్పడం ఒకనాటి సంఘంలో ఉన్న నియమం.
ఖాళీలు – జవాబులు :
1. గొప్ప చైతన్యాన్ని ప్రసాదించిన ప్రక్రియల్లో ప్రప్రథమంగా పేర్కొనదగింది …………….
జవాబు:
శతకం
2. చిన్ననాడు బాలబాలికలకు నేర్పవలసినవి …………………….
జవాబు:
శతకపద్యాలు, నీతిపద్యాలు, కథలు.
3. శతకంలోని ఛందస్సు …………………… కలిగియున్నది.
జవాబు:
వైవిధ్యాన్ని
4. కందం నుండి మధ్యాక్కరల దాకా వ్యాప్తమైంది ……………………
జవాబు:
శతకం
5. శతకాలు గొప్పగా వర్ణించినది …………………
జవాబు:
నీతిని, వ్యక్తుల తీరును
ప్రశ్న 9.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
బుద్ధుడి బోధనల్లో చాలావరకూ సామాన్యుల్ని ఉద్దేశించినవే. నిత్యజీవితంలో ముడిపడినవే. ‘మహామంగళస్తుతం’లో ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలో చెప్పాడు. మూర్ఖుల సహవాసం వద్దంటాడు. గౌరవించాల్సిన వ్యక్తులకు గౌరవం ఇవ్వ మంటాడు. నివాసానికి చక్కని పరిసరాలు అవసరమని అంటాడు. ఉపాధిని ఎంచుకుంటున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించమంటాడు. నీకు ఇష్టమైన పనినీ, చికాకు కలిగించని వృత్తినీ స్వీకరించ మంటాడు. జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమనీ చెబుతాడు. గౌరవం, వినమ్రత, సంతృప్తి, కృతజ్ఞత వీటిలో ఏ ఒక్కటీ లేకపోయినా, జీవితానికి అర్థమే లేదంటాడు.
ప్రశ్నలు – జవాబులు :
1. బుద్ధుడి బోధనలు ఎవరిని ఉద్దేశించినవి ?
జవాబు:
బుద్ధుడి బోధనలు చాలావరకు సామాన్యుల్ని ఉద్దేశించినవి.
2. బుద్ధుడు ఎవరి సహవాసం వద్దని అంటున్నాడు ?
జవాబు:
మూర్ఖుల
3. జీవితానికి అవసరమైనవి ఏవని బుద్ధుడు బోధించాడు ?
జవాబు:
గౌరవం, వినమ్రత, సంతృప్తి, అన్నీ
4. పై పేరాకు శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
బుద్ధుడి బోధనలు
5. బుద్ధుడు నివాసానికి ఏవి అవసరమన్నాడు ?
జవాబు:
చక్కని పరిసరాలు
ప్రశ్న 10.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
విభిన్న భాషా మత సంప్రదాయాలతో ఉప ఖండంగా పేరొందినది ఈ భారతమాత. ఆమె పవిత్ర దేహంలో కర్ణాటక రాష్ట్రం ఒక భాగం. ఆ భాగంలో ‘కూర్గు ప్రాంతం కూడ పేరెన్నిక గన్నదే. అందు ‘విరాజ్పేట’ గ్రామం అశ్వని జన్మస్థానమై ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. ఈమె క్రీ.శ. 21-10-1967న పార్వతి అప్ప నాచప్ప దంపతులకు కుమార్తెగా జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా కన్నడ భాషా సంస్కృతులకు దూరంగా కలకత్తా నగరంలో ‘బిర్లా రేయాన్స్’లో పనిచేస్తున్నాడు. శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందుతున్న అశ్వని తన ఎనిమిదవ ఏటనుండే స్కూల్ పోటీల్లో పాల్గొన్నది. వందమీటర్ల పరుగుపందెం, లాంగ్ జంప్ రెండూ ఆమె కిష్టమైనవే. క్రమేపి లాంగ్ జంపు స్వస్తి చెప్పి, పరుగుమీదనే తన దృష్టి కేంద్రీకరించింది. ఇండియన్ లేడీ రన్నర్స్ అందరిలోనూ ఎలాగైనా ఉషను అధిగ మించాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉన్న రోజులవి. ఎందుకంటే ఉష ప్రభ పట్టపగటి సూర్యుడిలా వెలిగిపోతున్నది. కాని ఆ ఆకాంక్షను నిజం చేసుకోగల్గింది మాత్రం అశ్వనియే.
ప్రశ్నలు – జవాబులు :
1. భారతదేశం గొప్పతనం ఎటువంటిది ?
జవాబు:
భారతదేశం విభిన్న భాషా మత సంప్రదాయాలతో ఉపఖండంగా పేరొందింది.
2. కర్ణాటకలోని ‘విరాజ్పేట’ గ్రామం, ఎవరివల్ల గుర్తింపు పొందినది ?
జవాబు:
అశ్వనికి జన్మస్థానమై, అశ్వని వల్ల ఆ గ్రామం గుర్తింపు పొందింది.
3. అశ్వని నాచప్పకు ఇష్టమైన పరుగు పందెం గురించి తెలుసుకున్నాము కదా ! మీకిష్టమైన ఆటల గురించి రాయండి.
జవాబు:
కబడ్డీ, క్రికెట్, లాంగ్ జంప్.
4. పై పేరాకు తగిన శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
‘అశ్వనీ నాచప్ప’
5. అశ్వని ఎన్నో ఏట నుండి స్కూల్పోటీల్లో పాల్గొన్నది?
జవాబు:
ఎనిమిదవ ఏట నుండి.
ప్రశ్న 11.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అడవుల్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టమే అని ‘సైమన్’కు తెలుసు. అందుకే కుర్రాళ్ళను ఏకం చేసి అటవీ సంరక్షణ దళాలను ఏర్పాటుచేశాడు. గతంలో చెట్లను నరికివేసిన ప్రాంతాలలో 35 వేలకు పైగా చెట్లను పెంచడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతను చూసు కుంటున్నారు. ఫలితంగా నేల సారవంత మైంది. కరవుతో కటకటలాడిన గ్రామాలన్నీ సైమన్ పుణ్యమా అని సుభిక్షంగా మారాయి. జార్ఖండ్ వ్యాప్తంగా ఏడాదికి సాధారణంగా ఒక పంట వేస్తే, ఈ 51 గ్రామాల్లో మాత్రం నీరు సమృద్ధిగా ఉండటంతో వరితోసహా ఏటా నాలుగు పంటలు వేస్తున్నారు. ఈ గ్రామాల నుండి 20 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు గుజరాత్, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
ప్రశ్నలు – జవాబులు :
1. అడవులను కాపాడకపోతే ఏమవుతుంది ?
జవాబు:
అడవులను కాపాడకపోతే, మనుగడ కష్టం అవుతుంది.
2. నేలను సారవంతంగా మారటానికి సైమన్ ఏమి చేశాడు?
జవాబు:
చెట్లు నరికివేసిన ప్రాంతంలో 35 వేల చెట్లు పెంచి, వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాడు.
3. ఏఏ రాష్ట్రాలకు కూరగాయలు ఎగుమతి చేస్తున్నారు ?
జవాబు:
గుజరాత్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు
4. పై పేరా చదివిన తరువాత నీవు పొందిన స్ఫూర్తి ఏమిటి?
జవాబు:
చెట్లను పెంచి సంరక్షించాలి అనే స్ఫూర్తి కల్గింది.
5. 51 గ్రామాల నుండి ఎన్నివేల టన్నుల కూరగాయలు ఎగుమతి అవుతున్నాయి ?
జవాబు:
20 వేల మెట్రిక్ టన్నులు
ప్రశ్న 12.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఈ దేశం గతంలో చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. అంతఃకలహాల కారణంగా వేయి సంవత్సరాలు పరాయి పాలనలో మ్రగ్గి బలహీన పడింది. ఇంత శ్రమపడి సంపాదించు కొని ఈనాడు కూడా వాటినలాగే వదిలివేస్తే ఈనగాచి నక్కలపాలు చేసినట్లవుతుంది. అందు వలన ఈ సంస్థానాలన్నింటిని భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో సంస్థానాల శాఖ ఒకటి ఏర్పడింది.
దానికి మంత్రి పటేల్, ఆయన సంస్థానాధీశుల్ని సమావేశపరిచారు. వారికెన్నో విధాల నచ్చచెప్పి వారి భయాల్ని తీర్చారు. వారు కూడ ఆయన ప్రతిపాదనలకు సమ్మతించి తమ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేశారు. కాని జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాల దగ్గర సమస్య లెదురయ్యాయి. కాని పటేల్ తన అచంచల ధైర్య సాహసాలతో, పట్టుదలతో వాటిని కూడా ఇండియన్ యూనియన్లో విలీనం చెయ్యగలిగారు.
ప్రశ్నలు – జవాబులు :
1. ఇండియన్ యూనియన్ చేరడానికి సహకరించని రాజ్యాలు ఏవి ?
జవాబు:
జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ రాజ్యాలు.
2. పటేల్ అభిప్రాయం ప్రకారం చిన్నరాజ్యాలు మంచివా ? యూనియన్గా ఉండడం మంచిదా ?
జవాబు:
పటేల్ అభిప్రాయం ప్రకారం యూనియన్గా ఉండడం మంచిది.
3. ఏ సంస్థానాల విషయంలో సమస్యలెదురయ్యాయి ?
జవాబు:
జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాల విషయంలో.
4. పై పేరాలోని జాతీయాన్ని గుర్తించండి.
జవాబు:
‘ఈనగాచి నక్కలపాలు చేసినట్లు’ అన్నది జాతీయం.
5. సంస్థానాల శాఖామంత్రి ఎవరు ?
జవాబు:
పటేల్
ప్రశ్న 13.
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అది భువనవిజయ సభమండపం, రాయలవారు తన ఆస్థానకవి పండితులతో సమావేశమై కవితాగోష్ఠి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధాన ద్వారం వద్ద పండితా గమనం సూచించే గంట నిర్విరామంగా మోగుతోంది. సామాన్యంగా ఒక్కసారి గంట మోగిస్తే ఒక విద్యలో పండితుడని తెల్పుతుంది. కాని ఇన్నిమార్లు గంట మోగిస్తున్న ఆ పండితు డెవరో చూడాలని కుతూహలం రాయల వారిలోను, సభాసదులలోను కల్గింది.
రాజాజ్ఞానుసారం భటుడా అగంతకుని లోనికి తీసుకువచ్చాడు. అతడు రాయలవారికి, సభాసదులకు నమస్కరించి అన్నాడు. “మహా ప్రభూ” ! నన్ను రామకృష్ణుడంటారు. నేనేర్చిన విద్యల ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి మోగిస్తే మీగంట బద్దలైపోతుంది. పరీక్షార్ధినై వచ్చాను. నా అదృష్టం బాగుండి నెగ్గితే నన్ను మీ ఆస్థానంలో చేర్చుకోండి అని అన్నాడు.
ప్రశ్నలు – జవాబులు :
1. తెనాలి రామకృష్ణుడు ఎందుకు గంటను మోగించాడు ?
జవాబు:
తాను విద్యావంతుడననీ, తన విద్యలను పరీక్షించ మని కోరుతూ గంట మోగించాడు.
2. నిర్విరామంగా మోగించిన గంట వల్ల ఏమి తెలుస్తుంది ?
జవాబు:
పండితుడు వచ్చాడని నిర్విరామంగా మోగించిన గంట వల్ల తెలుస్తుంది.
3. రాయల ఆస్థానంలో ఇంకా ఎంత మంది కవులు ఉన్నారు ?
జవాబు:
రాయలవారే కాక, ఇంకా ఎందరో కవి పండితులు ఉన్నారు.
4. పై పేరాకు శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
భువనవిజయసభ – రామకృష్ణుడు గంట వాయించడం.
5. ఒకసారి గంట మోగిస్తే ఏమని తెలుస్తుంది ?
జవాబు:
ఒక విద్యలో పండితుడని తెలుస్తుంది.
ప్రశ్న 14.
క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
పద్యనాటక రచయితలలో ప్రత్యేకస్థానాన్ని అందుకున్నవారు తిరుపతి వేంకట కవులు. వీరు 1) దివాకర్ల తిరుపతిశాస్త్రి 2) చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. వీరు శతావధానులు. తమ అవధానాలతో వీరు ఆంధ్రదేశం అంతా పర్యటించి సాహిత్య ప్రపంచంలో నూతనో త్తేజాన్ని కలిగించారు. వీరి అవధానాలతో స్పూర్తి పొందిన ఎందరో వ్యక్తులు సాహిత్య రంగంలో అడుగిడి కృషిచేశారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వీరికి ఎందరో లబ్ధ ప్రతిష్టులైన శిష్యులున్నారు. విశ్వనాథ, వేటూరి, కాటూరి, పింగళి వారలు వీరి శిష్యులే. వీరు రచించిన పాండవోద్యోగ విజయ నాటకాలకు లభించిన ప్రసిద్ధి ఇంతింతన రానిది. పశులకాపరి నుండి పండితుల వరకు అందరి నాల్కలపై వీరి పద్యాలు నాట్యం చేశాయి.
ప్రశ్నలు – జవాబులు :
1. వీరు సాహిత్య రంగంలో నూతనోత్తేజాన్ని దేని ద్వారా కల్పించారు ?
జవాబు:
తమ అవధానాలతో.
2. తిరుపతి వేంకట కవులు ఎవరు ?
జవాబు:
దివాకర్ల తిరుపతిశాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
3. వీరి శిష్యుల పేర్లను రాయండి.
జవాబు:
విశ్వనాథ, వేటూరి, కాటూరి, పింగళి
4. అందరి నాల్కలపై నాట్యం చేసే వీరి పద్యాలు ఏ నాటకాలలోనివి ?
జవాబు:
పాండవోద్యోగ విజయాలు.
5. వీరి ప్రసిద్ధ నాటకాలు ఏవి ?
జవాబు:
పాండవోద్యోగ విజయాలు.
ప్రశ్న 15.
క్రింది పేరా చదివి, ఇచ్చిన వాక్యాలు సరైనవో కాదో (✓ ) (✗) గుర్తుల ద్వారా గుర్తించండి.
అందరికీ ఆధారమైన చెట్లు నేడు కను మరుగై పోతున్నాయి. ఊళ్లను, పట్టణాలను భవనాలతో నింపుతున్నారు. చెట్లు పెంచాలన్న ధ్యాస లేకుండా పోతోంది. జనాలు తాము మొక్కలు నాటి పెంచాలన్న ఆలోచనను మరిచి, ఏళ్ల తరబడిగా విస్తరించిన వటవృక్షాలను కూడా నేల కూలుస్తున్నారు. దీనంతటికీ మనిషి అత్యాశే ప్రధాన కారణం. స్వార్థంతో ముందు చూపు లేకుండా ప్రకృతినంతా అంతరింప జేస్తూ, అభివృద్ధి పేరుతో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నాడు. అలాగే రోడ్లను ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి విక్ర యిస్తున్నాడు. కొన్నాళ్లకు వ్యవసాయ భూమి కొరవడి మనిషి ‘అన్నమో రామచంద్రా’ అని అరిచి చావక తప్పని పరిస్థితిని చేజేతులా సృష్టించుకుంటున్నాడు.
ప్రశ్నలు – జవాబులు :
1. అందరికీ ఆధారమైనవి చెట్లు. ( )
జవాబు:
(✓ )
2. చెట్లను పెంచాలన్న ధ్యాస అందరిలో పెరిగి పోయింది. ( )
జవాబు:
(✗)
3. మనిషి అత్యాశ లేకుండా జీవిస్తున్నాడు. ( )
జవాబు:
(✗)
4. వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. ( )
జవాబు:
(✓ )
5. అన్నం దొరకని పరిస్థితి రాబోతుంది. ( )
జవాబు:
(✓ )
ప్రశ్న 16.
కింది పేరాను చదివి, ప్రశ్నలు తయారు చేయండి.
చదువుకోని సామాన్య ప్రజలకు తరతరాలుగా వస్తున్న నోటి మాటల భాష ఒక్కటే వాడుకలో ఉండగా, చదువుకున్న వాళ్ళకు, ఆ భాషతోపాటు గ్రంథాల్లో ఉన్న కావ్య భాష కూడా అవసరమైంది. కావ్యాలు రాసేటప్పుడు తమకు పూర్వులు రాసిన భాషలోనే తాము కూడా రాస్తూ వచ్చారు. పూర్వులు ఉపయోగించిన ఛందస్సులనే తాము ఉపయోగిస్తూ వచ్చారు. కానీ కావ్యాల గురించి నోటితో చెప్పేటప్పుడు వాడుక భాషలోనే వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ వచ్చిన ఆ వివరణ లనూ, వ్యాఖ్యనాలను రాయడం మొదలు పెట్టే సరికి కావ్య భాష ప్రభావం కొంత చొరబడుతూ వచ్చింది. ఇది వ్యావహారిక, గ్రాంథిక భాషలను కలిపినట్ల నిపిస్తుంది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి వీల్లేదు. అయినా వచన రచనా సంప్రదాయానికి వాడుక భాషే ప్రధానంగా ఉండేది.
జవాబు:
ప్రశ్నలు
- చదువుకున్న వాళ్లకు ఏ భాష అవసరమైంది ?
- పూర్వకాలంలో ఉపయోగించినవి ఏమిటి ?
- కావ్యాలను నోటితో ఏ భాషలో చెప్పేవారు ?
- వ్యాఖ్యానాలు చేసేటప్పుడు ఏ భాష ఉండేది ?
- వచన రచనకు ప్రధానమైన భాష ఏది ?
ప్రశ్న 17.
కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి. (March 2015)
మంచిపని ఏ రూపంలోనైనా ఉండవచ్చు. తాను చదువుకున్నవాడైతే పదిమందికి చదువును పంచిపెట్టవచ్చు. తన ధనాన్ని పదిమందికి వినియోగించవచ్చు. ధర్మ కార్యాలకు, సమాజ కల్యాణకార్యక్రమాలకు ఇతోధికంగా సాయపడ వచ్చు. అధికారి తన పరిధిని దాటకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ప్రజల మన్ననలు పొందవచ్చు. తనకు మంచిపేరు వస్తుంది. ప్రజలకు మేలు కలుగుతుంది. ధనికులు పరిశ్రమలను స్థాపించి, పదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించ వచ్చు. అధిక లాభాన్ని ఆపేక్షించకుండా తక్కువ ధరలకే వస్తువుల నమ్మవచ్చు. ఇలా సమాజంలోని వారంతా తమ తమ పరిధుల్లో ప్రజలకు మేలు కల్పించే పనులు చేసినపుడు, దేశంలో సమస్యలే ఉండవు. ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తారు.
జవాబు:
ప్రశ్నలు
- ధనం ఉన్నవాడు ఆ ధనాన్ని ఎలా సద్వినియోగం చేయవచ్చు ?
- ఒక అధికారి ఏ విధంగా మంచిపని చేయవచ్చు ?
- ధనికులు ఏవిధంగా మంచిపని చేయవచ్చు ?
- వర్తకులు ఏవిధంగా మంచిపని చేయవచ్చు ?
- సమాజంలోని వారంతా ప్రజలకు మేలు కల్పించే పనులు చేస్తే ఏమవుతుంది ?
ప్రశ్న 18.
కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి. (June 2015)
గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని గిరిజనులు, వారి ఆధ్వర్యంలో రైతులు, పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య, “చిన్నయ్య, పెద్దయ్య / చిలుకల భీమయ్య” అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో చిన్నయ్య అంటే అర్జునుడు. పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముడ్ని పూజిస్తారు. అని స్పష్టమవుతుంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలవడానికి కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ, ఇక్కడికి వచ్చినపుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడు పెళ్ళిచేసుకొని, ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యాడు.
జవాబు:
ప్రశ్నలు
- గోదావరి నదికి ఇరువైపులా ఉన్న జిల్లాలు ఏవి ?
- గిరిజనులూ, వారి ఆధ్వర్యంలో రైతులూ పూజించే దేవుళ్ళు ఎవరు ?
- స్థానికంగా వినిపించే గేయం ఏది ?
- పెద్దయ్య, చిన్నయ్య అంటే ఎవరు ?
- గిరిజనులకు భీముడు ఎందుకు ఆరాధ్య దైవమయ్యాడు ?
ప్రశ్న 19.
కింది పేరాను చదివి పట్టికను పూరించండి. (March 2016)
తెలుగు సాహిత్యం మొదట పద్యగద్యాల మిశ్రితమై వెలువడినా తరువాత కాలంలో పద్యకావ్యాలు, గద్య కావ్యాలు వేరు వేరుగా వెలుగు చూశాయి. పద్య గద్య మిశ్రిత రచనలు చంపూ కావ్యాలు. 18వ శతాబ్దం వరకూ ఈ రచనా సంప్రదాయం సాహిత్య రంగంలో కొనసాగింది. 19వ శతాబ్దం నుండి ఆంగ్లభాష, సాహిత్యాల అధ్యయన ప్రభావంతో ఆ భాషలోని వివిధ రచనా రీతులు తెలుగువారికి పరిచయం అయినాయి. అలా తెలుగులోకి ప్రవేశించిన రచనా ప్రక్రియ నవల. ఈ ప్రక్రియను తెలుగునాట ప్రచారంలోకి తెచ్చిన వాడు కందుకూరి వీరేశలింగం పంతులుగారు.
పట్టిక పూరణం
1. పద్యగద్యాల మిశ్రిత కావ్యాలు.
జవాబు:
చంపూ కావ్యాలు
2. 19వ శతాబ్దానికి పూర్వం తెలుగు భాషలో లేని ప్రక్రియ
జవాబు:
నవల
3. పలు రచనా రీతులు తెలుగులోకి రావడానికి కారణం
జవాబు:
ఆంగ్లభాషా సాహిత్యాల అధ్యయన ప్రభావం
4. నవలా ప్రక్రియకు తెలుగునాట ఆద్యుడు.
జవాబు:
కందుకూరి వీరేశలింగం పంతులు గారు
5. తెలుగు సాహిత్యం మొదట ఎలా ఉంది ?
జవాబు:
పద్యగద్యాల మిశ్రితమై వెలువడింది.
ప్రశ్న 20.
కింది పేరా చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి. (June 2016)
మానసికంగా ఎదగడానికి, పరోపకార బుద్ధిని బాల్యం నుంచి నేర్చుకోవాలి. మనవద్ద ఉన్నది ఇతరులకు ఇచ్చి మనం అనుభవించాలి అనే స్వార్ధరాహిత్యాన్ని అలవాటు చేసుకోవాలి. అన్నీ మనకే కావాలి – నాకే ఉండాలి అనే భావన ఉండరాదు. దీన్ని ‘లోభగుణం’ అంటారు. చిన్నప్పుడు ఈ గుణం తప్పని ధృతరాష్ట్రుడు, గాంధారి చెప్పకపోవటం వల్లనే దుర్యోధనుడు తరువాత కాలంలో పాండవులకు రాజ్యభాగం ఇవ్వనన్నాడు. ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు అయ్యో పాపం ! అనే సానుభూతి గుణం బాల్యం నుంచే పెద్దల వల్ల పిల్లలు నేర్చుకోవాలి. ఎవరు ఏమైతే నాకేం. ‘నాకు, నా పొట్టకు శ్రీరామరక్ష అనే స్వార్థ ధోరణి ఈ రోజుల్లో పిల్లల్లో అధికమౌతుంది సహకార జీవన భావన దీనివల్ల లోపిస్తుంది.
జవాబు:
ప్రశ్నలు
- మనం బాల్యం నుండి ఏ బుద్ధిని నేర్చుకోవాలి ?
- మానవులు ఎలాంటి అలవాటును అలవరచుకోవాలి ?
- “లోభగుణం” అంటే ఏమిటి ?
- పెద్దల వద్ద పిల్లలు ఏమి నేర్చుకోవాలి ?
- శ్రీరామరక్ష అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడుతారు ?
ప్రశ్న 21.
కింది గద్యాన్ని చదివి ఖాళీలను పూరించండి. (March 2017)
మాటలను ఉచ్చరించునపుడు కొన్నింటిని తేల్చి పలుకుటయు, కొన్నింటిని ఒత్తి పలుకుటయు, కొన్నింటిని మధ్యస్థముగా పలుకుటయు అనుభవ సిద్ధమగు విషయమే. ఈ విధముగా ఆరోహణా వరోహణాది క్రమములో పలుకుటను ‘స్వరము’ అని యందురు. ఉచ్చారణ సమయమున కంఠము నందలి నాదతంత్రులు ప్రకంపించునట్టి వేగమును బట్టి ఈ స్వరము కలుగును. ఉచ్చారణ సమయమున నాదతంత్రులు సాగిన దూరమును బట్టి ఊనిక కలుగును. ఏదేని మాటను ఒత్తి చెప్పవలసి వచ్చినప్పుడు గట్టిగా బలముగా చెప్పుట స్వాభావికం. ఊనిక, స్వరము ఈ రెండింటి కారణముగా ఉచ్చారణమున పెక్కు మార్పులు కలుగవచ్చును. అవి క్రమముగా భాషలో స్థిరపడవచ్చును.
ఖాళీలు
1. స్వరమంటే ……………………
జవాబు:
ఆరోహణ అవరోహణాది క్రమములో పలుకుట.
2. ఉచ్చారణ సమయంలో ప్రకంపించేవి ………………………
జవాబు:
కంఠమునందలి నాదతంత్రులు.
3. స్వరము కలగడానికి కారణం …………………..
జవాబు:
ప్రకంపన వేగము.
4. ఊనిక కలగడానికి కారణం …………………
జవాబు:
నాదతంత్రులు సాగిన దూరం వలన.
5. ఉచ్చారణలో మార్పులు కలగడానికి కారణం ………………….
జవాబు:
నాదతంత్రుల ప్రకంపనలు, నాదతంత్రులు సాగిన దూరము.
ప్రశ్న 22.
కింది గద్యాన్ని చదివి, కింద ఇచ్చిన పట్టికను పూరించండి. (June 2017)
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో 39.54 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వేలాది చెరువులు నిండి అలుగులు పోస్తుండగా, 71 చెరువులకు గండ్లు పడ్డాయి. గోదావరి బేసిన్లోని ఎస్సారెస్పీ, సింగూరు, మంజీర, ఎల్లంపల్లి, కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్లు నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సైన్యం రంగంలోకి దిగింది.
ఖాళీలు
1. ఎక్కువ వర్షపాతం నమోదైన పట్టణం ………………….
జవాబు:
ఆర్మూర్
2. నీటితో నిండిన రెండు ప్రాజెక్టులు ………………….
జవాబు:
ఎస్సారెస్పీ, సింగూరు, మంజీర, ఎల్లంపల్లి, కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్లు
3. సహాయక చర్యలు చేపట్టింది ………………….
జవాబు:
ఎన్డీఆర్ఎఫ్ సైన్యం
4. వర్షం కురవడానికి కారణం ………………….
జవాబు:
అల్పపీడన ప్రభావం
5. ’71’ అను సంఖ్య సూచిస్తున్నది ………………….
జవాబు:
చెరువులగండ్ల సంఖ్య
ప్రశ్న 23.
క్రింది గద్యాన్ని చదివి అందలి ఐదు కీలకమైన పదాలను గుర్తించి రాయండి. (March 2018)
పత్రికలలో దినపత్రికలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, నవతెలంగాణ, సాక్షి వంటి దినపత్రికలు నేడు బహుళ ప్రచారంలో ఉన్నవి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పత్రికలు వారధిలా పనిచేస్తాయి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రకటనలను పత్రికలు ప్రజలకు తెలియజేస్తాయి. వాటిని గురించి ప్రజల స్పందన ఎట్లా ఉన్నదో వివరించే బాధ్యత కూడా పత్రికలపైన ఉన్నది. పత్రికలు సమాజాన్ని మేల్కొలిపే వైతాళికుల లాంటివి. అందుకే విద్యార్థులు పత్రికా పఠనాన్ని ఒక అనివార్య విషయంగా భావించి దాని సాధనకు తప్పనిసరిగా సమయం కేటాయించుకోవాలి.
జవాబు:
కీలక పదాలు :
- దినపత్రికలు
- వారధి
- ప్రజలస్పందన
- వైతాళికులు
- పత్రికా పఠనం
ప్రశ్న 24.
కింది గద్యాన్ని చదువండి. (June 2018)
బొగ్గు పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు, భూగోళాన్ని నిప్పుల కుంపటిగా మార్చేస్తూ జీవరాసుల మనుగడకు ముప్పు తెస్తున్నాయి. ఈ విపత్తును నివారించాలంటే మనిషి ప్రకృతి వనరులను నిర్మాణాత్మకంగా సృజనశీలంగా ఉపయోగించుకోవాలి. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనాలి. మోటారు వాహనాలను నడపడానికి డీజిల్ ఇంజిన్ను సృష్టించిన జర్మన్ శాస్త్రవేత్త సర్ రూడాల్ఫ్ డీజిల్ ఈ సంగతి ముందే చెప్పడమే గాదు, చేసి చూపించారుకూడా. 1893 ఆగస్టు 10న వేరుసెనగ నూనెను ఇంధనంగా వాడి ఒక ఇంజన్ను పనిచేయించారు. భవిష్యత్లో మోటారు వాహనాలు ఇలాంటి జీవ ఇంధనాలతోనే నడుస్తాయని సూచించారు. అందుకే ఏటా ఆగస్టు పదవతేదినాడు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని పాటిస్తున్నారు.
క్రింది వివరణలను సూచించే పదాలను గద్యంలో గుర్తించి క్రింది ఖాళీలలో రాయండి.
వాక్యాలు
1. ఒకదానికి బదులుగా మరొకటి అనే అర్థం ఇచ్చే పదం ( )
జవాబు:
ప్రత్యామ్నాయం
2. పై గద్యంలో వాడిన ‘జాతీయం’ ( )
జవాబు:
నిప్పుల కుంపటి
3. అనేక జీవుల, నిర్జీవుల సమూహ నివాసస్థానం ( )
జవాబు:
భూగోళం
4. ‘రాబోయే కాలంలో’ అని సూచించడానికి వాడిన పదం ( )
జవాబు:
భవిష్యత్
5. పై గద్యంలో సూచించిన విపత్తు ( )
జవాబు:
జీవరాశి మనుగడకు ముప్పు