These TS 10th Class Telugu Important Questions 1st Lesson దానశీలము will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 1st Lesson Important Questions దానశీలము
PAPER – 1 : PART- A
I. వ్యక్తీకరణ-సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘దానశీలము’ పాఠ్యాంశ కవిని గూర్చి రాయండి. (Mar. ’17)
జవాబు:
‘దానశీలము’ అనే పాఠము పోతన రచించిన ఆంధ్రమహా భాగవతము అష్టమ స్కంధములోనిది. పోతన తల్లి లక్క మాంబ. తండ్రి కేసన. పోతన కాలము 15వ శతాబ్దం. పోతన భాగవతమునే కాక, వీరభద్ర విజయము, భోగినీ దండకము, నారాయణ శతకమును కూడా రచించాడు. పోతనకు ‘సహజ పండితుడు’ అనే బిరుదు ఉంది. పోతన భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. శబ్దాలంకారాల సొగసుతో, భక్తిరస ప్రధానంగా పోతన రచన సాగింది.
ప్రశ్న 2.
బలిచక్రవర్తి తన నిశ్చయాన్ని గురువుగార్కి ఎలా తెలిపాడు ?
జవాబు:
బలిచక్రవర్తి గురువుగారితో, తనకు నరకం దాపురించినా, బంధనం ప్రాప్తించినా, భూమండలం అదృశ్యం అయినా, తనకు దుర్మరణం వచ్చినా, తన వంశం అంతా నశించినా, ఏమైనా కానీ తాను ఆడినమాట తప్పననీ, వచ్చినవాడు శివుడు, బ్రహ్మ, విష్ణువు అనే వారిలో ఎవరైనా సరే, తన నాలుక వెనుదిరుగదనీ చెప్పి, తన దృఢమైన మనో
నిశ్చయాన్ని గురువుగార్కి వెల్లడించాడు.
ప్రశ్న 3.
పలికి బొంకకుండా, సత్యంతో బ్రతకాలని బలి చక్రవర్తి శుక్రునకు ఎలా నచ్చచెప్పాడు ?
జవాబు:
గురువర్యా ! “అర్థం, కామం, కీర్తి, జీవనాధారం అనే వాటిలో ఏది అడిగినా ఇస్తానని వామనుడికి మాట ఇచ్చాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి అతడిని తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పటం, మహాపాపం. అదీగాక భూదేవి ఎటువంటి చెడ్డపని చేసిన వాడినైనా భరిస్తాను కాని, ఆడినమాట తప్పినవాడిని మోయలేను అని చెప్పింది. యుద్ధంలో వెనుదిరుగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ అన్నవి, అభిమాన వంతులకు మేలైన మార్గాలు” అనిచెప్పి, తాను అన్నమాట ప్రకారం దానం ఇస్తానని బలి గురువుకు నచ్చచెప్పాడు.
ప్రశ్న 4.
‘బలిచక్రవర్తి ఆడినమాట తప్పనివాడు’, సమర్థిస్తూ వ్రాయండి. (June ’16)
జవాబు:
బలిచక్రవర్తి మహాదాత. అంతకు మించిన మానధనుడు. ఆడినమాట తప్పని సత్యసంధుడు. తన గురువైన శుక్రాచార్యుడు వామనునికి మూడు అడుగుల భూమిని దానం ఇవ్వవద్దని, వచ్చినవాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువని చెప్పాడు.
అయినా బలిచక్రవర్తి ఆడినమాటకు కట్టుబడి ఉన్నాడు. రాజ్యం పోయినా, సంపద పోయినా, చివరకు మరణించినా ఆడిన మాటను తప్పనని ప్రతిజ్ఞ చేశాడు. మూడు అడుగుల భూమిని దానం చేశాడు. పాతాళా నికి వెళ్ళాడు. బలిచక్రవర్తిలోని త్యాగగుణం జగతికి ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రశ్న 5.
బలిచక్రవర్తి స్వభావం గూర్చి వ్రాయండి.
జవాబు:
విరోచనుని కుమారుడు ప్రహ్లాదుని మనుమడు బలి చక్రవర్తి. అసుర చక్రవర్తులలో గొప్ప చక్రవర్తి, పరా క్రమవంతుడు. గొప్పదాత, అడిగిన వారికి లేదు అన కుండా ఇచ్చే స్వభావం కలవాడు. ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలను సైతం లెక్కపెట్టని వాడు. దేవతలను ఆపదల పాలు చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి బలిచక్రవర్తిని శిక్షించడానికి వామనావతారంలో వచ్చి బలిని దానం అడిగినపుడు తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా దానం చేసిన వ్యక్తి. ఈ విధంగా బలిచక్రవర్తి గొప్పదాత అని తెలుస్తుంది.
ప్రశ్న 6.
విష్ణుమూర్తి దక్షిణ పాదం ఎలా ఉంది ?
జవాబు:
విష్ణుమూర్తి యొక్క దక్షిణపాదం దేవతలను కష్టాలనుండి కాపాడేది. కలకాలమూ మేలు కలిగించేది. అన్ని ఉపనిషత్తులకూ అలంకార ప్రాయమైనది. భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేదిగా ఉంది.
ప్రశ్న 7.
పూర్వపు రాజుల గురించి బలి చక్రవర్తి అభిప్రాయం ఏమిటి
జవాబు:
పూర్వం ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది రాజులు కలరు. వారు రాజరికంతో అహంకారంతో విర్రవీగారు. పెత్తనం చేశారు. వారు సంపాదించిన దానిలో కొంచెం కూడా తీసుకుపోలేదు. కావున దానధర్మాలు చేసిన శిబి ప్రముఖులు ఎంతో పేరుపొందారని బలిచక్రవర్తి అభిప్రాయం.
ప్రశ్న 8.
కీర్తి గొప్పదా ? ధనం గొప్పదా ? విశ్లేషించండి.
జవాబు:
మానవ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయేది కీర్తి మాత్రమే. ధనం సంపాదిస్తే అది ఎప్పటికైనా ఖర్చయి పోతుంది. తెలివితేటలు సంపాదిస్తే అవి ఆ వ్యక్తితోనే అంతమైపోతాయి. పదవి వస్తే అది కూడా కొంత కాలమే ఉంటుంది. కీర్తిని సంపాదిస్తే అది శాశ్వతంగా ఉంటుంది. సత్కీర్తి తరతరాలుగా నిలిచిపోతుంది.
అందువల్లనే ఎంతోమంది సంపదల కంటే కీర్తికే ప్రాధాన్యం ఇచ్చారు. సత్కీర్తిని పొందటానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బలిచక్రవర్తి కూడా అంత ప్రాధాన్యం ఇచ్చాడు. బలిచక్రవర్తి ధనానికి, ఆస్తికి, చివరకు తన ప్రాణానికి కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆడిన మాటకు కట్టుబడి వామనునికి దానం ఇచ్చాడు. శాశ్వతమైన కీర్తి పొందాడు.
ప్రశ్న 9.
‘దానశీలము’ అనే పాఠ్యభాగం ఆధారంగా పోతన కవిత్వం ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు ?
జవాబు:
తెలుగు సాహిత్యంలో పోతనకు సమున్నతమైన స్థానం ఉంది. అతని కవిత్వం ఆపాత మధురంగా ఉంటుంది. లలిత పదాలతోను, సరళమైన పదబంధనంతోను కూడియుంటుంది. పోతనకు శబ్దాలంకారాలంటే చాలా ఇష్టం. అతని పద్యాల్లో శబ్దాలంకారాల విన్యాసం అడుగడుగునా కనిపిస్తుంది. కఠినమైన సమాసాలు ఉండవు. భక్తిరసం పద్యాల్లో తొణికిసలాడుతుంది. ద్రాక్షారస శైలి పోతనగారికే చెల్లింది.
ప్రశ్న 10.
“ఎట్టి దుష్కర్ముని నే భరించెద గాని సత్యహీనుని మోవజాలను” అనే మాటలు ఎవరు ఎవరితో అన్నారు ? ఆ సందర్భాన్ని రాయండి. (June ’17)
జవాబు:
ఈ మాటలను బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యునితో పలికిన సందర్భంలోనిది.
శుక్రాచార్యుడు వామనునికి దానం చేయవద్దని, దానితో అనర్థం కలుగుతుందని, ఆపదల సమయంలో అసత్యం పలికినా తప్పుకాదని సూచించాడు. ఆ మాటలు విని బలిచక్రవర్తి పూర్వం భూదేవి చెప్పిన మాటలను కూడా బలి గుర్తుచేశాడు. బ్రహ్మాతో భూదేవి ఎలాంటి దుర్మార్గుడినైనా భరిస్తాను గాని, ఆడినమాట తప్పిన వానిని మాత్రం భరించనని చెప్పింది.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
బలిచక్రవర్తి తప్పక వామనునకు దానం చేస్తానని, తన నాలుక అబద్ధం ఆడదని శుక్రాచార్యునకు ఎలా నచ్చచెప్పాడు ? (June ’15)
జవాబు:
బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఇలా చెప్పాడు.
“మహాత్మా ! మీరు నిజం చెప్పారు. ఇదే గృహస్థధర్మం. ఏదడిగినా ఇస్తానని చెప్పి, ఇప్పుడు ధనంపై ఆశతో వామనుని తిప్పి పంపలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. ఆడినమాట తప్పినవాడిని భూదేవి మోయలేనని చెప్పింది. సత్యంతో బ్రతకడం, మానధనులకు మంచి మార్గం.
దాతకు మంచి ప్రతిగ్రహీత దొరకడం అదృష్టం. పూర్వం ఎందరో రాజులున్నారు. వారు ఎవ్వరూ సంపదలను మూటకట్టుకు పోలేదు. శిబి వంటి దాతలను లోకం నేటికీ మఱవలేదు. విష్ణువే స్వయంగా వచ్చి అడిగితే నా వంటివాడు తప్పక దానం ఇవ్వాలి.
కాబట్టి నాకు నరకం వచ్చినా, బంధనం కలిగినా, దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా, వచ్చినవాడు త్రిమూర్తులలో ఎవరైనా, నా నాలుక తిరుగదు. మానధనులు మాట తిరుగరు” అని బలి చక్రవర్తి తన గురువు శుక్రాచార్యుడికి నచ్చ చెప్పాడు.
ప్రశ్న 2.
‘తిరుగన్ నేరదు నాదు జిహ్వ’ అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఎందుకన్నాడు ? ఆ మాటల్లో గల సామంజస్య మెట్టిదో చర్చించండి.
జవాబు:
శుక్రాచార్యుడు, వామనుడు విష్ణుమూర్తి అని మూడు అడుగులతో మూడు లోకాలను కొలుస్తాడనీ, కాబట్టి దానం చెయ్యవద్దనీ బలిచక్రవర్తికి హితమును ఉపదేశించాడు.
ఇచ్చినమాట తప్పడం పాపమని, ఆడినమాట తప్పినవాడిని భూదేవి భరించలేనని చెప్పిందనీ, సత్యంతో బ్రతకడం మానధనులకు మంచిదనీ, బలిచక్రవర్తి శుక్రునకు నచ్చ జెప్పాడు. దాత అన్నవాడికి, మంచి ప్రతిగ్రహీత దొరకడం అదృష్టం అన్నాడు. పూర్వము రాజ్యాలు పాలించిన రాజులు ఎవ్వరూ సంపదలను మూటకట్టుకు వెళ్ళలేదు. శిబిచక్రవర్తి వంటి దాతలను లోకం నేటికీ మరువలేదు అని చెప్పాడు.
కాబట్టి నరకం వచ్చినా, దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా, వచ్చిన వామనుడు త్రిమూర్తులలో ఎవరైనా, నా నాలుక వెనుదిరగదు అని బలి నొక్కి చెప్పాడు.
బలి మానధనుడు. సత్యమే మాట్లాడే రాక్షస రాజు. కాబట్టి వామనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టు కున్నాడు. బలి మాటల్లో న్యాయము ఉంది.
ప్రశ్న 3.
బలిచక్రవర్తి గురువు చెప్పిన మాట వినకుండా, దానం చేయడం సమంజసమా ? చర్చించండి.
జవాబు:
శుక్రుడు రాక్షసులకు గురువు. శుక్రుడు రాక్షసులకు హితాన్ని కోరి, రాక్షసులకు మంచిని బోధించేవాడు. కాని బలిచక్రవర్తి, శుక్రుని హితోపదేశాన్ని కాదని, వామనుడికి దానం చేశాడు.
బలిచక్రవర్తి చేసిన పని సమంజసంగానే ఉంది. ఎందుకంటే, అబద్ధాలాడడం మహాపాపం. మరణం ఎప్పటికైనా జీవికి తప్పదు. వామనుడికి దానంచేయడం వల్లనే, బలిచక్రవర్తి కీర్తి లోకంలో శాశ్వతంగా నిలిచింది. గురువుగారి మాటలో సత్యము ఉంది. కాని గురువు అబద్ధం ఆడమన్నాడు. దానం చేయవద్దన్నాడు. పలికి బొంకడం ధర్మం కాదు. అదీగాక, సాక్షాత్తు విష్ణుమూర్తి చేయి క్రిందు అవడం, బలి చక్రవర్తి చేయి పైన ఉండడం జరిగింది. విష్ణుమూర్తి చేయి లక్ష్మీదేవి శరీరంపై ఉండి, గొప్ప గౌరవం పొందింది. అటువంటి చేయి దానం తీసికొనేటప్పుడు, క్రిందు అయ్యింది. బలి చేయి పైన ఉంది.
శుక్రుడు చెప్పినది రాక్షస నీతి. దాన్ని పాటించక పోడంలో తప్పులేదు. శుక్రుని మాటలు కాదని, దానం చేయడం వల్లనే బలికి సుతలలోక నివాసమూ, సావర్ణి మనువు కాలంలో దేవేంద్ర పదవి లభించాయి.
ప్రశ్న 4.
బలిచక్రవర్తి వామనునికి దానం చేసిన వివరాలను తెలపండి.
జవాబు:
బలిచక్రవర్తి తన గురువుగారికి తన మనోనిశ్చయాన్ని తెలిపి, భార్యకు సైగ చేశాడు. బలి భార్య వింధ్యావళి భర్త సైగను గమనించి, బంగారు కలశంతో బ్రహ్మ చారియైన వామనుని కాళ్ళు కడుగడానికి నీరు తెచ్చింది.
బలిచక్రవర్తి, కాళ్ళు కడుగుతానని వామనుని రమ్మని పిలిచాడు. ముందుగా బలిచక్రవర్తి వామనుడి కుడిపాదాన్ని కడిగాడు. తరువాత వామనుడి ఎడమపాదాన్ని కడిగాడు. పవిత్రమైన వామనుడి పాదజలాన్ని, బలి తన నెత్తిపై చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశ, కాల పూర్వకమైన సంకల్పాన్ని చెప్పాడు.
బలిచక్రవర్తి వామనుడిని పూజించి, “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక” అంటూ మూడు అడుగుల నేలను దానం చేస్తూ, వామనుని చేతిలో దానధార పోశాడు. అప్పుడు దిక్కులూ, పంచభూతాలూ బళి బళి అంటూ బలిచక్రవర్తిని పొగిడాయి.
ప్రశ్న 5.
దాతృత్వగుణం గొప్పతనం గురించి బలిచక్రవర్తి ఆధారం గా వ్రాయండి.
జవాబు:
దానం చేసే గుణాన్ని దాతృత్వం అంటారు. దాతృత్వం కలవారు, అడిగినవారికి లేదనకుండా దానం చేస్తారు. దానం వలన తమకు నష్టం కలిగినా లెక్క చేయరు. తమ ప్రాణాలకే ప్రమాదం కలిగినా బాధపడరు. తమ సర్వస్వం పోయినా చింతించరు.
బలి చక్రవర్తి వామనునకు మూడు అడుగుల నేల దానంగా ఇస్తానన్నాడు. ఆయన గురువైన శుక్రాచార్యుడు దానం ఇవ్వవద్దు అన్నాడు. ఆ వామనుడు శ్రీమహావిష్ణువన్నాడు. దానం చేస్తే ప్రాణానికే ప్రమాద మని హెచ్చరించాడు.
అయినా బలి చక్రవర్తి భయపడలేదు. సంకోచించలేదు. మాట తప్పలేదు. మూడు అడుగులు దానం చేసేశాడు. ఆ దాన గుణానికి దిక్కులు కూడా ఆనందించాయి. అభినందించాయి. బలి చక్రవర్తి వంటి దాతను దిక్కులు ఎప్పుడూ చూడలేదు. అటువంటి సత్యవాక్పరిపాలకుని దిక్కులు గమనించలేదు. అందుకే బలి చక్రవర్తిని భళి భళి అని అభినందించాయి.
ప్రశ్న 6.
‘దానగుణం గల వ్యక్తుల వల్ల ఈ సమాజం మెరుగైన స్థితికి చేరుకుంటుంది.” – సమర్థించండి. (Mar. ’17)
జవాబు:
సమాజానికి నేడు విశిష్ట వ్యక్తుల సేవల అవసరం చాలా ఉంది. అన్ని రంగాలలో అవినీతి పేరుకుపోయింది. స్వార్థం పెచ్చుమీరిపోయింది. స్వార్థంతో ప్రగతి శూన్య మయింది. భేదభావాలు రాజ్యమేలుతున్నాయి. అన్యాయాలు, అక్రమాలు పెచ్చుమీరిపోయాయి.
దేశభక్తి, అనన్యమైన మాతృభూమి సేవచేయగల యువత అవసరం ఉన్నది. నీతి, అవినీతి మధ్య సంఘర్షణ పెరిగిపోయింది. స్వామి వివేకానంద విశాల భారతదేశం కావాలంటే “ఇనుపకండలు, ఉక్కునరాలు కలిగిన యువత కావాలి,” అని ప్రబోధించారు. కార్మికులు, కర్షకులు, దేశభక్తి కలిగిన ప్రజలు నిర్మాణం కావాలి. త్యాగం, దానం మొదలైన లక్షణాలు గల మనుషులు కావాలి. సమాజానికి అర్పణ చేసే మంచి మనుషులు కావాలి. జాతీయాదర్శాలుగా దానం శోభిల్లాలి. రామరాజ్యం నిర్మాణం కావాలంటే దాన గుణం గల (మనుషుల) వ్యక్తుల అవసరం ఎంతో ఉన్నది.
ప్రశ్న 7.
ఈ పాఠాన్నిబట్టి పోతన కవిత్వం ఎట్లా ఉందని భావిస్తు న్నారు?
జవాబు:
ఈ పాఠాన్ని బట్టి పోతన కవిత్వాన్ని చక్కగా విశ్లేషించ వచ్చు.
విశ్లేషణ
- పోతన ప్రతి పద్యంలోనూ నాటకీయతను ప్రదర్శించారు. శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి, వామనుడు మాట్లాడు కుంటున్నట్లు పద్యాలు ఉన్నాయి. అవి కూడా ఎవరి స్వభావానికి తగినట్లు వారు మాట్లాడారు.
- లోకజ్ఞానం కనిపిస్తుంది. మొదటి పద్యంలో ‘ఈ కుబ్జుండు విశ్వంభరుండలఁతింబోడు’ అన్నాడు. సాధారణంగా ‘పొట్టివాళ్ళు చాలా గట్టివాళ్ళు’ అనే లోక సహజమైన భావం కనిపిస్తుంది.
- అదే పద్యంలో ‘దానము గీనము’ అనే దాంట్లో నిందార్థంలో ‘గి, గీ’ లు వాడేవాడు భాషా సంప్రదాయం ప్రయోగించాడు. ఇది వ్యాకరణానికి కూడా ఆమోదమే.
- ‘నిజమానతిచ్చితి …’ అనే సీస పద్యంలో ‘సత్య హీనుని మోయలేను’ అని భూమాత చెప్పిన మాటల ను బట్టి పోతన పాండిత్యం తెలుస్తుంది.
- ‘పలికి బొంకరాదు’ వంటి నీతులు కూడా ఈ పాఠంలో ఉన్నాయి.
- ధనానికి దానం చేయడమే మంచికీర్తిని తెస్తుందని చెప్పాడు. దానివలన దానగుణం పెంపొందింపచేశాడు.
- ‘నిరయంబైన … ’అనే పద్యంలో ఏది ఏమైనా మాట తప్పకూడదని బోధించాడు.
- ‘విప్రాయ…’ అనే పద్యంలో పోతనకున్న వేద వేదాంత పరిజ్ఞానం బయటపడింది.
- ‘కలకల, భళిభళి వంటి పదాలు ప్రయోగించి పద్యాల ను ఆకర్షణీయంగా రచించాడు.
- పై వాటినన్నిటినీ పరిశీలిస్తే పోతన కవిత్వం యొక్క చక్కదనం తెలుస్తుంది. గొప్పదనం తెలుస్తుంది.
PAPER – II : PART – A
1. అపరిచిత పద్యాలు (5 మార్పులు)
ప్రశ్న 1.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కం॥ “ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే
ప్రశ్నలు – సమాధానములు
1. సర్వోపగతుండెవరు ?
జవాబు:
సర్వోపగతుండు ‘చక్రి’. చక్రి అనగా చక్రమును ధరించే శ్రీమహావిష్ణువు.
2. చక్రి ఎక్కడున్నాడు ?
జవాబు:
చక్రి అన్ని చోట్లా ఉంటాడు.
3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తుంది ?
జవాబు:
ఈ పద్యం, దానవాగ్రణిని అంటే రాక్షసరాజు హిరణ్యక శిపుని సంబోధిస్తుంది.
4. ఈ పద్యం ఏ గ్రంథంలోనిది ? (రామాయణం, భారతం, భాగవతం)
జవాబు:
ఈ పద్యం భాగవతం లోనిది.
5. ఎందెందు వెదకి చూచిన అందందే గలవాడు ఎవరు ?
జవాబు:
ఎందెందు వెదకి చూచిన అందందే గలవాడు, “శ్రీమహా విష్ణువు”.
ప్రశ్న 2.
కింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని సరియైన సమాధానాలు రాయండి. (June ’16)
ఆకొన్న కూడె యమృతము
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుడు
తేఁకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !
ప్రశ్నలు – సమాధానములు
1. నిజమైన దానశీలి ఎవరు ?
జవాబు:
తాకొంచక ఇచ్చువాడే దాత.
2. అన్నము ఎప్పుడు రుచిగా ఉంటుంది ?
జవాబు:
ఆకలి కలిగి ఉన్నప్పుడే అన్నం రుచిగా ఉంటుంది.
3. నిజమైన మనిషి అని ఎప్పుడు అంటారు ?
జవాబు:
సోకోర్చువాడే నిజమైన మనిషి అని అంటారు.
4. ఎవరు వంశానికి వన్నె తెస్తారు ?
జవాబు:
తేకువ గలవాడే వంశానికి వన్నె తెస్తాడు.
5. ఈ పద్యానికి మకుటము ఏది ?
జవాబు:
ఈ పద్యానికి మకుటము సుమతీ !
ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి అర్థం చేసుకోండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (Mar. ’16)
భూమి నాదియన్న భూమి ఫక్కున నవ్వు
ధనము నాదియన్న ధనము నవ్వు
కదన భీతుఁజూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ.
ప్రశ్నలు – సమాధానములు
1. భూమి ఫక్కున ఎందుకు నవ్వుతుంది ?
జవాబు:
భూమి నాది అని అన్నందుకు.
2. ధనము నాది అంటే ధనము ఏం చేస్తుంది ?
జవాబు:
ధనము నవ్వుతుంది.
3. కదన భీతుడంటే మీకేమర్థమైంది ?
జవాబు:
యుద్ధమంటే భయపడువాడు.
4. పై పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ.
5. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
వేమన.
ప్రశ్న 4.
క్రింది పద్యం చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
“చదువది ఎంత గల్గిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న, నా
చదువు నిరర్థకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం,
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన, నందు ఇం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగనేర్చు నటయ్య భాస్కరా!”
ప్రశ్నలు – సమాధానములు
1. ఈ పద్యంలో మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలో “భాస్కరా” అనేది మకుటము.
2. ‘రసజ్ఞత’ అంటే ఏమిటి ?
జవాబు:
రసమును గుర్తించే శక్తి అనగా రసమును తెలియుట.
3. చదువును దేనితో సమన్వయించారు ?
జవాబు:
చదువును నలపాకము చేసిన మంచి కూరతో సమన్వయించారు.
4. భాస్కరుని పర్యాయపదాలేవి ?
జవాబు:
భాస్కరుని పర్యాయపదాలు
5. ‘చదువది’ పదాన్ని విడదీసి సంధి గుర్తించండి.
జవాబు:
చదువది = చదువు + అది = ఉత్వసంధి లేక ఉకారసంధి
2. వ్యక్తీకరణ – సృజనాత్మకత (5 మార్కులు)
ప్రశ్న 1.
సత్యవాక్యాన్ని పలకడంలోనూ, దానశీలం కలిగి యుండడం లోనూ గల విశిష్టతను తెలుపుతూ (వ్యాసం) రాయండి.
జవాబు:
సత్యదాన విశిష్టత :
సత్యాన్ని మించిన దైవము లేదు. సత్యవాక్యాన్ని మించిన ధర్మం లేదు. ఆడి తప్పరాదు. తనకున్న దానిలో పరులకు కొంతదానం చేయాలి. ఈ జన్మలో పెట్టుకుంటే, మరుసటి జన్మలో మరింతగా సంపన్నుడిగా జన్మిస్తాడు.
మనం పుట్టినపుడు మన వెంట ఏ ధనాన్నీ తేలేదు. తిరిగి చనిపోయినప్పుడు మన వెంట ఏమీ తీసుకుపోము. బలిచక్రవర్తి గురువుగారికి చెప్పినట్లు, ఎందరో రాజులు తాము చక్రవర్తులమని గర్వించారు. వారు చనిపోయినప్పుడు, వారు సంపాదించిన ధనాన్ని వెంట తీసుకుపోలేదు. నేడు లోకంలో వారి పేరు కూడా లేదు.
శిబిచక్రవర్తి, కర్ణుడు వంటి గొప్పదాతలు చేసిన దానాలను గూర్చి, వారి త్యాగాలను గూర్చి, నేటికీ లోకంలో చెప్పుకుంటున్నారు. వారి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్నే మాట్లాడాడు. చివరకు కష్టాలను అధిగమించాడు.
రంతిదేవుడు, సక్తుప్రస్థుడు వంటి దాతలు, తమ సర్వస్వాన్నీ దానం చేసి పేరు పొందారు. ప్రాణాలు పోతాయని తండ్రి దేవేంద్రుడు హెచ్చరించినా, కర్ణుడు కవచకుండలాలు బ్రాహ్మణుడికి దానం చేశాడు. బలిచక్రవర్తి గురువు కాదన్నా, మూడు అడుగుల భూమిని వామనునికి ధారపోశాడు.
సత్యం, దానం విశిష్టగుణాలు, మనం సత్యమే పలుకుదాం. మనకు ఉన్నంతలో పరులకు దానం చేద్దాం.
ప్రశ్న 2.
రక్తదానం, నేత్రదానం, అవయవదానం చేయడం పట్ల ప్రజలలో చైత్యం కలిగించేలా ‘కరపత్రం తయారు చేయండి.
(లేదా)
దానం చేయమని, దానగుణం పెంచుకోమని కోరుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
దానగుణం
వదాన్యులారా ! మానవత్వం మూర్తీభవించిన కరుణామూర్తులారా ! సోదర సోదరీమణులారా !
దానగుణం పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన పూర్వులు మహాదాతలు. మనమూ ఆ బాటలో నడుద్దాం.
అన్నదానం చేస్తే ఒక్కపూట ఆకలి తీర్చిన పుణ్యం వస్తుంది. ధనదానం చేస్తే కొన్ని అవసరాలను తీర్చినవారం అవుతాం. వస్త్రదానం చేస్తే కొద్దికాలమే ఆ వస్త్రాలు ఉపయోగిస్తాయి.
రక్తదానం చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ప్రాణ దానం చేసిన పుణ్యం వస్తుంది. నేత్రదానం చేస్తే మరణించిన తర్వాత కూడా గ్రహీత ద్వారా లోకాన్ని చూడవచ్చు. అవయవదానం చేసినా శాశ్వతంగా జీవించవచ్చు.
దానం చేద్దాం. తోటి వారికి సాయపడదాం.
ఇట్లు
అవయవదాన కమిటీ,
ఖమ్మం.
ప్రశ్న 3.
దానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
హైదరాబాద్,
XXXXX.
ప్రియమైన శరత్కు,
నీ స్నేహితుడు రాజా రాస్తున్న లేఖ.
మా తరగతిలో మొన్ననే ‘దానశీలము’ పాఠం చెప్పుకొన్నాం. మా గురువుగారు బలిచక్రవర్తి యొక్క దాన గుణాన్ని చాలా చక్కగా వివరించారు. దానం చేయాలని చెప్పారు. శిబి, బలి, కర్ణుడు, రంతిదేవుడు మొదలైన మహాదాతల గురించి వివరించారు.
వారి గురించి తెలుసుకొన్నాక నాకొకటి అనిపించింది. దానం చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని, అన్నదానం, విద్యాదానం, రక్తదానం, అవయవ దానం మొదలైన దానాల వలన ఎంతో ప్రయోజనం ఉందని కూడా తెలుసుకొన్నాం.
అందుచేత మనం కూడా ఏదో ఒకదానం చేయాలి. దానం చేయడం వలన చాలా ఆనందం కలుగుతుంది. తృప్తిగా ఉంటుంది.
ఇట్లు,
రాజా.
చిరునామా :
సి. శరత్,
నెం. 3, 10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కరీంనగర్ జిల్లా.
ప్రశ్న 4.
ఒక దాతకు, గ్రహీతకు జరిగిన సంభాషణ ఊహించి వ్రాయండి.
జవాబు:
దాత : ఏం కావాలి ?
గ్రహీత : నేను ఎనీమిక్ పేషెంటును.
దాత : అంటే ?
గ్రహీత : నేను రక్తహీనతతో బాధపడుతున్నాను. నాకు రక్తం కావాలి.
దాత : అయినా, నా రక్తం గ్రూపు సరిపోవాలి కదా !
గ్రహీత : ఏ గ్రూపయినా ఫరవాలేదన్నారు. మీరు రక్తం ఇస్తే నా గ్రూపు రక్తం నాకెక్కిస్తారు.
దాత : తప్పకుండా ఇస్తాను. ఆసుపత్రికి పదండి.
గ్రహీత : మీరు నా ప్రాణాలు కాపాడుతున్న దైవం.
దాత : అదేం కాదు. మానవులుగా ఒకరినొకరు కాపాడుకోవడం మన ధర్మం. అదే మానవత్వం. అందులోనే తృప్తి ఉంది.
ప్రశ్న 5.
దానం యొక్క గొప్పతనాన్ని వివరించే నినాదాలు వ్రాయండి.
జవాబు:
- దానం చేయండి – ధన్యత పొందండి
- అవయవ దానాన్ని మించిన దానం లేదు – ఆదుకోవడాన్ని పోయే ప్రాణాలు నిలబెట్టండి
- వట్టిమాటలు కట్టిపెట్టు – గట్టిదానం చేసి చూపెట్టు
- అనుభవించడం స్వార్థం – దానం చేయడం త్యాగం
- నేత్రాలను దానం చేయండి నలుగురికి చూపు ప్రసాదించండి.
ప్రశ్న 6.
దాతృత్వాన్ని ప్రోత్సహించే కవిత వ్రాయండి.
జవాబు:
బలి చేశాడు భూదానం
శిబి చేశాడు ప్రాణదానం
కర్ణుడు చేశాడు కవచదానం
రంతిదేవుడు చేశాడు అన్నదానం
ఎందరో చేశారు రక్తదానం
ఇంకెందరో చేస్తున్నారు నేడు అవయవ దానం.
ప్రశ్న 7.
ఒక దాతను అభినందిస్తూ అభినందన పత్రం వ్రాయండి.
జవాబు:
వేంకటేశ్వరుని దయాగుణం ఉన్న వేంకటాచలం సరస్వతీ నిలయమైన బడికి ఇచ్చారు మీ స్థలం. ఎందరో విద్యార్ధులకిది అవుతోంది నిలయం మీ దానగుణాన్ని అభినందిస్తున్నాం అందరం అందుకోండి మా అభినందన మందారాలు.
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు
1. దశదిశలు : మన జాతిపిత మహాత్మాగాంధీ కీర్తి, ప్రపంచంలో దశదిశలా వ్యాపించింది.
2. కాళ్ళు కడుగు : అత్తమామలు అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు.
3. అభ్యాగతుడు : అభ్యాగతుడు స్వయంగా విష్ణుమూర్తి వంటివాడని పెద్దలంటారు.
4. మానధనులు : మానధనులే నిజమైన కోటీశ్వరులు.
5. సత్యహీనుడు : సత్యహీనునిగా బ్రతకడం కంటే మరణము మేలు.
6. సిరి మూట కట్టుకొని పోవడం : ఏ వ్యక్తికీ సిరి మూట కట్టుకొని పోవడం శక్యం కాదు. బ్రతికుండగానే దానధర్మాలు చేసుకోవాలి.
7. ఆకర్ణించు : గురువులు చెప్పే పాఠమును శ్రద్ధగా ఆకర్ణించాలి.
8. వృత్తి : ఏ వృత్తిని చేపట్టినా గౌరవంగా బ్రతకాలి.
9. గర్వోన్నతి : ఎంత గొప్ప పదవినలంకరించినా గర్వోన్నతి పనికిరాదు.
10. యశఃకాములు : యశఃకాములు అందరి గౌరవాన్ని పొందుతారు.
11. ననుబోటి : ననుబోటివాడు ఇది చేయగలడా అని ఆలోచించకూడదు.
12. సముద్ధరణము : మన ముఖ్యమంత్రిగారు తెలంగాణ సముద్ధరణకు కంకణం కట్టుకున్నారు.
13. ప్రక్షాళనము : తెలంగాణలో అవినీతిని ప్రక్షాళన చేయడం మన అందరి లక్ష్యం.
2. పర్యాయపదాలు
కులము = వంశము, కొలము, వంగడం, అభిజనము
విశ్వంభరుడు = విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు, వైకుంఠుడు
దానము = త్యాగము, విహాపితము, ఉత్సర్జనము, వితరణము
అర్ధము = సంపద, ధనం
సత్యము = నిజము, నిక్కము, తథ్యము, యధార్థము
భూస్వామి = అచల, అనన్త, విశ్వంభర, ఊర్వి, ధాత్రి
క్షేత్రము = స్థలము, పొలము
ప్రీతి = ముదము, సంతోషం, హర్షము
హరుడు = శివుడు, శంభుడు, శంకరుడు, సర్వజ్ఞుడు
విష్ణువు = నారాయణుడు, కేశవుడు, దామోదరుడు
వటువు = బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపవీతుడు
చరణము = అడుగు, అంఘి, పదము, పాదము
దిశ = దిక్కు ఆశ, దెస, కడ
రాజ్యము = దేశము, ప్రదేశము, రాష్ట్రము, నేల, విలాయతి
కర్ణము = చెవి, జానుగు, శ్రుతి, శ్రోతము, శ్రవణము
వర్ణి = బ్రహ్మచారి, వటువు, వటుడు, దండ హస్తుడు, వడుగు
ఆచార్యుడు = గురువు, ఉపదేశికుడు, దేశికుడు, విద్యాదాత
లోచనము = కన్ను, నేత్రము, నయనము
యశము = కీర్తి, ప్రఖ్యాతి, విఖ్యాతి, ఖ్యాతి, సుప్రతిష్ట
వృత్తి = ఉపజీవిక, జీవనోనాయము, జీవనా ధారము, కాయకము, జీవిక
భూమి = పుడమి, ధాత్రి, ధరణి, ఇల, నేల
బ్రహ్మ = అంబుజగర్భుడు, కమలజుడు, చతుర్ముఖుడు, దాత, నీరజభవుడు
భార్గవుడు = శుక్రాచార్యుడు, కావ్యుడు, భృగువు, శ్వేతుడు
రాజు = అధిపతి, ఏలిక, చక్రవర్తి, ధరణీపతి, నరేంద్రుడు, నృపతి
జిహ్వ = నాలుక, రసజ్ఞ, రసన
క్రతువు = యాగము, ఇష్టి, మేధము, యజ్ఞము,
దనుజులు = రాక్షసులు, దానవులు, దైత్యులు, రాత్రించరులు, అసురులు
మరాళము = హంస, అంచ, కలకంఠము, రాజహంస, సుగ్రీవము
హేమము = బంగారము, కనకము, పుత్తడి
3. వ్యుత్పత్త్యర్థాలు
త్రివిక్రముడు = మూడడుగులచే ముల్లోకములను కొలిచిన వాడు (విష్ణువు).
నీరజభవుడు = విష్ణువు నాభి కమలము నుండి పుట్టిన వాడు (బ్రహ్మ).
విశ్వంభరుడు = విశ్వమును భరించువాడు (విష్ణువు)
విష్ణువు = విశ్వమంతటా వ్యాపించియుండువాడు (విష్ణువు)
వదాన్యుడు = మిక్కిలిగా ఇచ్చేవాడు (మంచిదాత)
ధాత్రి = సర్వమునూ ధరించేది (భూమి)
భార్గవుడు = భృగు వంశమున పుట్టినవాడు (పరశు రాముడు)
హరి = భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు (విష్ణువు)
హరుడు = భక్తుల పీడలను సర్వమునూ హరించే వాడు (శివుడు)
దానవులు = దనువు అనే స్త్రీ వలన పుట్టినవారు (రాక్షసులు)
బ్రహ్మ = ప్రజలను వర్థిల్ల చేయువాడు (బ్రహ్మ)
కులము = సజాతీయమైన ప్రాణుల గుంపు (వంశము)
వర్ణి = స్తుతులు గలవాడు (బ్రహ్మచారి)
ఆచార్యుడు = సంప్రదాయమును గ్రహింపచేయువాడు (గురువు)
క్షేత్రము = దీనియందు ధాన్యముల చేత నుండ బడును (భూమి)
జిహ్వ = రసముతో ఉన్న వస్తువులను ఇష్ట పడునది (నాలుక)
హేమము = లోహాంతరమును కూడి వృద్ధి పొందునది (బంగారము)
మాణవకుడు = మనువు యొ క్క అల్పుడైన సంతానము (బాలుడు)
4. నానార్థాలు
కులము = వంశము, జాతి, శరీరం, ఇల్లు
గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి
క్షేత్రము = చోటు, పుణ్యస్థానము, భూమి, శరీరం
సిరి = సంపద, లక్ష్మి
హరి = విష్ణువు, ఇంద్రుడు, గుఱ్ఱం, దొంగ, సింహం, కోతి
మహి = భూమి, శక్తి, మహిమ, ఉత్సవము
ధర్మము = పుణ్యము, ఎద్దు, నీతి, విల్లు, యజ్ఞము
అర్థము = శబ్దార్థము, ధనము, కార్యము, యాచన
ధాత్రి = నేల, తల్లి, ఉసిరిక, దాది
చిత్రము = చిత్తరువు, అద్భుతరసం, ఆశ్చర్యము
రాజు = ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు, చంద్రుడు
సత్యము = నిజము, కృతయుగము, ఒట్టు, ఒక లోహము
హేమము = బంగారు, ఉమ్మెత్త, గుఱ్ఱము, మంచు
వర్ణి = బ్రహ్మచారి, వ్రాతగాడు, ఋషి, చిత్తరువు, మూర్ఖుడు
బీజము = విత్తనము, నిజము, కారణము
బ్రహ్మ = నలువ, విష్ణువు, శివుడు, సూర్యుడు, చంద్రుడు, బ్రాహ్మణుడు
కాలము = సమయము, నలుపు, చావు, తాడి
జిహ్వ = నాలుక, వాక్కు, జ్వాల
అవసరమ = సమయము, ఆకాశము, ఆవశ్యకము, నైవేద్యము, విశ్రాంతి
పాదము = అడుగు, పద్యమునందలి చరణము, కాలు, స్థంభము, కిరణము
శిరము = తల, సేనాగ్రము, శిఖరము, ముఖ్యము
భూతము = ప్రాణి, దేవతా భేదము, పంచ భూతములలో ఒకటి, సత్యము, న్యాయము
తోడు = సహాయము, ఒట్టు, స్నేహము
5. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
ధర్మము – దమ్మము
సంజ్ఞ – సన్న
కార్యము – కర్ణము
ఆశ్చర్యము – అచ్చెరువు
కులము – కొలము
విష్ణువు – వెన్నుడు.
విప్రుడు – పాణుడు
హితము – ఇతము
గర్వము – గరువము
శ్రీ – సిరి
భూ – భువి
భద్రము – పదిలము
భాగ్యము – బాగెము
దక్షిణము – దక్కినము
మృత్యువు – మిత్తి
గృహము – గీము
భూతము – బూచి
భూమి – బూమి
వ్రతము – బత్తము
నిజము – నిక్కము
దేవి – దేవేరి
శిరస్ – సిరసు
బ్రహ్మ – బమ్మ, బొమ్మ
యశము – ఆసము
వటుడు – వడుగు
జీవితము – జీతము
చిత్రము – చిత్తరువు
దాస్యము – దాసము
విద్య – విద్దె
కీర్తి – కీరితి
PAPER – II : PART – B
1. సంధులు
ఎ. తెలుగు సంధులు
1. సరళాదేశ సంధి
సూత్రములు:
- దృతప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
- ఆదేశ సరళమునకు ముందున్న దృతములకు బిందు సంశ్లేషలు విభాషనగు.
ఉదా :
రాజ్యముఁదేజమున్ – రాజ్యమున్ +తేజమున్
అలతిబ్రోడు – అలతిన్ + పోడు
బ్రహ్మాండముంగలడే- బ్రహ్మాండమున్ + కలడె
గీనముఁబనుపు – గీనమున్ + పనుపు
అర్థంబుఁగామంబు – అర్థంబున్ +కామంబు
అర్థిఁబొమ్మనుట – అర్థిన్ + పొమ్మనుట
కంటెఁబాపము – కంటెన్ + పాపము
భరించెదఁగాని – భరించెదన్ +కాని .
మోవఁజాలను – మోవన్ + చాలను
అనుచుఁబలుకదె – అనుచున్ + పలుకదె
కంటెంబ్రలికి – కంటెన్ + పలికి
పొడవునఁగురచ – పొడవునన్ + కురచ
ఔదిరుగన్ – ఔన్ + తిరుగన్
వచ్చుఁగాక – వచ్చున్ + కాక
ఐనఁజెడు – ఐనన్ + చెడు
అగుటంగలకల – అగుటన్ + కలకల
2. ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా :
వాడై – వాడు + ఐ
పలుకులాకర్ణింపు – పలుకులు + ఆకర్ణింపు
లేదనక – లేదు + అనక
లోచనుండు – అయి + లోచనుండయి
ఇట్లనియె – ఇట్లు + అనియె
పేరైనన్ – పేరు + ఐనన్
కాములై – కాములు + ఐ
నిరయంబైన – నిర్ణయంబు + ఐన
హరుడైనన్ – హరుడు + ఐనన్
రమ్మా – రమ్ము + ఆ
లేదనక – లేదు + అనక
ప్రీతమ్మని – ప్రీతమ్ము + అని
నాయకుడగుటన్ – నాయకుడు + అగుటన్
పంచకమనఘా – పంచకము + అనఘా
వారేరి – వారు + ఏరి
3. ఉకార వికల్ప సంధి
సూత్రం : ప్రథమేతర విభక్తి శత్రర్థ చువర్ణంబులందున్న ఉ-కారమునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా :
పలుకుచున్న – పలుకుచున్ + ఉన్న
దాతకీవియు – దాతకున్ + ఈవియు
4. గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళముగానగు.
ఉదా :
ప్రక్షాళనంబు సేసి- ప్రక్షాళనంబు + చేసి
పాదంబుగడిగి – పాదంబు + కడిగి
ధారవోసె – ధార + పోసె
కాళ్ళుగడుగ – కాళ్ళు + కడుగ
పరిగణనంబుసేసి – పరిగణనంబు + చేసి
చేసాచి – చే + చాచి
5. అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా :
పొమ్మనుటెట్లు – పొమ్మనుట + ఎట్లు
కుఱుచై – కుఱుచ + ఐ
లేదనకిత్తున్ – లేదనక + ఇత్తున్
ఉత్తమా – ఉత్తమ + ఆ
ఎయ్యది – ఎ + అది
6. యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
అనియిట్లు – అని + ఇట్లు
యశస్వీట్లు – యశస్వి + ఇట్లు
సన్నగి – సన్న + ఎఱిగి
భళిభళియని – భళిభళి + అని
ఆయడుగుల – ఆ + అడుగుల
7. త్రిక సంధి
సూత్రాలు :
- ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములనబడును.
- త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
- ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు.
ఉదా :
ఎయ్యది – ఏ + అది (యడాగమ, త్రికసంధులు)
అయ్యవసరంబున – ఆ + అవసరంబున (,, )
అద్దానవేంద్రుడు – ఆ + దానవేంద్రుడు ( ,, )
ఇక్కాలము – ఈ + కాలము (యడాగమ, త్రికసంధులు)
బి. సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకాదేశమగును.
ఉదా :
బ్రహ్మాండము – బ్రహ్మ + అండము
కులాచార్యుడు – కుల + ఆచార్యుడు
మహాత్మక – మహా + ఆత్మక
మహానుభావ – మహా + అనుభావ
ఇష్టార్థంబులు – ఇష్ట + అర్థంబులు
కులాంతము – కుల + అంతము
వింధ్యావళి – వింధ్య + ఆవళి
నిగమాంతాలంకరణము – నిగమ + అంత + అలంకరణము
కాలాది – కాల + ఆది
నలినాక్షుడు – నలిన + అక్షుడు
ప్రార్థింప – ప్ర + అర్థింప
2. గుణ సంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశమగును.
ఉదా :
వదాన్యోత్తమా – వదాన్య + ఉత్తమా
గర్వోన్నతి – గర్వ + ఉన్నతి
దానవేంద్రుండు దానవ + ఇంద్రుండు
దనుజేశ్వరుడు – దనుజ + ఈశ్వరుండు
అసురోత్తముడు – అసుర + ఉత్తముడు
మాణవకోత్తమ – మాణవక + ఉత్తమ
3. విసర్గ సంధి
సూత్రం 1 : విసర్గకు క, ఖ, ప, ఫలు పరమైతే విసర్గ మారదు.
ఉదా : యశఃకాములు -యశః + కాములు
సూత్రం 2 : ఇస్, ఉస్ల విసర్గకు క, ఖ, ప, ఫలు కలిస్తే ఆ విసర్గ ‘ష’ కారంగా మారుతుంది.
ఉదా : దుష్కర్ముడు
దుష్ + కర్ముడు
దుస్ + కర్ముడు
సూత్రం 3 : అంతః, దుః, చతుః, ఆశాః పునః మొదలైన పదాల విసర్గ రేఫగా (ర్) గా మారుతుంది.
ఉదా : నిర్మూలనంబు – నిః + మూలనంబు
4. యణాదేశ సంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే వాటికి క్రమంగా య, వ, ర లు ఆదేశమగును.
ఉదా :
అభ్యాగతుడు – అభి + ఆగతుడు
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యముసమాసము పేరు
కులాచార్యుడు – కులమునకు ఆచార్యుడు – షష్ఠీ తత్పురుష సమాసము
నాదు జిహ్వ – నా యొక్క జిహ్వ – షష్ఠీ తత్పురుష సమాసము
గృహస్థ ధర్మము – గృహస్థ యొక్క ధర్మము – షష్ఠీ తత్పురుష సమాసము
గర్వోన్నతి – గర్వము యొక్క ఉన్నతి – – షష్ఠీ తత్పురుష సమాసము
కులాంతము – కులము యొక్క అంతం – షష్ఠీ తత్పురుష సమాసము
దానవేంద్రుడు – దానవులలో ఇంద్రుడు – షష్ఠీ తత్పురుష సమాసము
అసురోత్తముడు – అసురులలో ఉత్తముడు – షష్ఠీ తత్పురుష సమాసము
దనుజేశ్వరుడు – దనుజులలో ఈశ్వరుడు – షష్ఠీ తత్పురుష సమాసము
నా పలుకులు – నా యొక్క పలుకులు – షష్ఠీ తత్పురుష సమాసము
వటునికాళ్ళు – వటుని యొక్క కాళ్ళు – షష్ఠీ తత్పురుష సమాసము
భర్త సన్న – భర్త యొక్క సన్న (సంజ్ఞ) – షష్ఠీ తత్పురుష సమాసము
సురలోకము – సురలయొక్క లోకము – షష్ఠీ తత్పురుష సమాసము
నీ వాంఛితంబు – నీ యొక్క వాంఛితంబు – షష్ఠీ తత్పురుష సమాసము
దనుజలోకనాథుడు – దనుజలోకమునకు నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసము
భూతనాయకుడు – భూతములకు నాయకుడు – షష్ఠీ తత్పురుష సమాసము
భూతపంచకము – భూతముల యొక్క పంచకము – షష్ఠీ తత్పురుష సమాసము
మానధనులు – మానము ధనముగా కలవారు – బహువ్రీహి సమాసము.
మహాత్ముడు – గొప్ప ఆత్మ కలవాడు – బహువ్రీహి సమాసము.
దుష్కర్ముడు – దుష్టమైన కర్మలు గలవాడు – బహువ్రీహి సమాసము.
రాజవదన – చంద్రుని వంటి వదనము కలది – బహువ్రీహి సమాసము.
మదమరాళగమన – మదమరాళము వంటి గమనము కలది – బహువ్రీహి సమాసము.
నలినాక్షుడు – నలినముల వంటి అక్షులు కలవాడు – బహువ్రీహి సమాసము.
అనఘుడు – అఘము లేనివాడు – నఞ బహువ్రీహి సమాసము
జీవధనములు – జీవము అనెడి ధనములు – రూపక సమాసము
వామపాదము – ఎడమదైన పాదము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ఇష్టార్థంబులు – ఇష్టమైన అర్థములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
హేమఘటము – బంగారుదైన ఘటము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
కపట వటువు – కపటుడైన వటువు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పావనజలము – పావనమైన జలము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
బహుబంధనములు – అనేకములైన బంధనములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
వదాన్యోత్తముడు – ఉత్తముడైన వదాన్యుడు – విశేషణోత్తరపద కర్మధారయ సమాసము
అసురోత్తముడు – ఉత్తముడైన అసురుడు – విశేషణోత్తరపద కర్మధారయ సమాసము
మాణవకోత్తముడు – ఉత్తముడైన మాణవకుడు – విశేషణోత్తరపద కర్మధారయ సమాసము
దశదిక్కులు – పది సంఖ్య గల దిక్కులు – ద్విగు సమాసము
త్రివిక్రమ – మూడు రకాల (వైపుల) విక్రమం – ద్విగు సమాసము
విశ్వంభరుడు – విశ్వమును భరించువాడు – ద్వితీయా తత్పురుష సమాసము
వేదప్రామాణ్యవిదుడు – వేద ప్రామాణ్యమును తెలిసినవాడు – ద్వితీయా తత్పురుష సమాసము
సత్యహీనుడు – సత్యము చేత హీనుడు – తృతీయా తత్పురుష సమాసము
నిగమాంతాలంకరణం – నిగమాంతములచేత అలంకరణము – తృతీయా తత్పురుష సమాసము
ధరణీసురుడు – ధరణియందు సురుడు – సప్తమీ తత్పురుష సమాసం
3. అలంకారాలు
1. వృత్త్యనుప్రాసాలంకారం
లక్షణం : ఒకటిగాని, రెండుగాని అంతకుమించిన హల్లులు పలుమార్లు ఆవృత్తి అయినట్లేతే అది వృత్త్యను ప్రాసాలంకారం.
ఉదా :
- నీ కరుణా కటాక్షవీక్షణములకు నిరీక్షిస్తున్నాడు.
- అడిగెదనని కడువడిజను.
- చిటపట చినుకులు పట పట పడెను.
2. రూపకాలంకారం
లక్షణం : ఉపమానోపమేయాలను అభేదం చెప్పినట్లేతే అది రూపకాలంకారం.
ఉదా :
- ఈ రాజు సాక్షాత్తు పరమేశ్వరుడే.
- అజ్ఞానాంధకారమును జ్ఞానజ్యోతితో తొలగించాలి.
- సంసార సాగరమును తరించుట మిక్కిలి కష్టం.
4. గణవిభజన
అ) క్రింది పదాలకు గణాలను గుర్తించడం.
- దానము – U l l – భగణము
- కులమున్ – l l U – నగణము
- హితంబు – l U l – జగణము
- భాగ్యము – U l l – భగణము
- నిర్ణయం – l l U – సగణం
- వారేరీ – UUU – మగణం
ఆ) వృత్తాలు – గణాలు
- ఉత్పలమాల : భ, ర, న, భ, భ, ర, వ
- చంపకమాల : న, జ, భ, జ, జ, జ, ୪ గ
- శార్దూలం : మ, స, జ, స, త, త,
- మత్తేభం : స, భ, ర, న, మ, య, వ.
5. వాక్య పరిజ్ఞానం
అ) క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా గుర్తించండి.
ప్రశ్న 1.
రవి అన్నం తిన్నాడు. రవి బడికి వెళ్ళాడు.
జవాబు:
రవి అన్నం తిని బడికి వెళ్ళాడు.
ప్రశ్న 2.
లత పూలుకోసింది. లత దండకట్టింది.
జవాబు:
లత పూలుకోసి దండకట్టింది.
ప్రశ్న 3.
అమ్మ గుడికి వెళ్ళింది. అమ్మ పూజలుచేసింది.
జవాబు:
అమ్మ గుడికి వెళ్ళి పూజలుచేసింది.
ప్రశ్న 4.
రమ పాఠాలు విన్నది. రమ బాగా చదివింది.
జవాబు:
రమ పాఠాలు విని బాగా చదివింది.
ప్రశ్న 5.
వామనుడు వచ్చాడు. వామనుడు దానం కోరాడు.
జవాబు:
వామనుడు వచ్చి దానం కోరాడు.
ప్రశ్న 6.
బలిచక్రవర్తి దానం చేసాడు. బలి కీర్తి పొందాడు.
జవాబు:
బలిచక్రవర్తి దానం చేసి కీర్తి పొందాడు.
ఆ) క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగాను, కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగాను రాయండి.
ప్రశ్న 1.
పోతన భాగవతం రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
పోతనచేత భాగవతం రచింపబడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 2.
బలి దానం చేసాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
బలిచేత దానం చేయబడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 3.
వామనునిచేత వరాలు కోరబడినాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
వామనుడు వరాలు కోరాడు. (కర్తరి వాక్యం)
ప్రశ్న 4.
సజనులు దానం చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
సజనులచేత దానం చేయబడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 5.
బలిచక్రవర్తి చేత కీర్తి సంపాదింపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బలిచక్రవర్తి కీర్తి సంపాదించాడు. (కర్తరి వాక్యం)
ఇ) క్రింది పరోక్ష కథనాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చి రాయండి.
ప్రశ్న 1.
తాను దానం చేస్తానని బలిచక్రవర్తి చెప్పాడు.
జవాబు:
“నేను దానం చేస్తాను” అని బలిచక్రవర్తి చెప్పాడు.
ప్రశ్న 2.
తనకు ఆహారం వద్దని రవి అన్నాడు.
జవాబు:
“నాకు ఆహారం వద్దు” అని రవి అన్నాడు.
ప్రశ్న 3.
తన పెళ్ళికి రమ్మని కృష్ణ పిలిచాడు.
జవాబు:
“నా పెళ్ళికి రండి” అని కృష్ణ పిలిచాడు.
ప్రశ్న 4.
తాను నగరం వెళ్ళానని లత చెప్పింది.
జవాబు:
“నేను నగరం వెళ్ళాను” అని లత చెప్పింది.
ప్రశ్న 5.
‘తనకు దైవమే రక్ష’ అని భక్తుడు చెప్పుకున్నాడు.
జవాబు:
“నాకు దైవమే రక్ష” అని భక్తుడు చెప్పుకున్నాడు.
ఈ) ఈ క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
- ఆహా ! బలిచక్రవర్తి దానగుణం ! (ఆశ్చర్యార్థకం)
- ఆవు పాలు తెల్లగా ఉంటాయి. (తద్ధర్మార్థకం)
- దైవం నిన్ను కరుణించుగాక ! (ఆశీర్వచనార్థకం)
- దొంగతనాలు చేయవద్దు. (నిషేధార్థకం)
- రవి వస్తాడో ! రాడో ! (సందేహార్థకం)
- దానం ఎందుకు చేయాలి ? (ప్రశ్నార్థకం)
- దేవా ! నన్ను అనుగ్రహించు. (ప్రార్థనార్థకం)
- అందరు దానం చేయాలి. (విధ్యర్థకం)