Telangana SCERT 10th Class Telugu Grammar Telangana సంభాషణలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar సంభాషణలు
ప్రశ్న 1.
పల్లెటూళ్ళలో ఉండే ఆనందం, గొప్పదనం గురించి ఇద్దరు నగరవాసులు మాట్లాడుకుంటున్నట్టుగా సంభాషణ రాయండి. (March 2017)
జవాబు:
(రవి, సోము హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వారిద్దరు ఒకసారి పల్లెటూరికి వచ్చారు. అక్కడ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ)
రవి : ఆహా ! ఈ పల్లె వాతావరణం ఎంత బాగుందో !
సోము : ఔను ! నిజంగా మనం ఇంత ప్రశాంత వాతావరణాన్ని మన నగరంలో చూడలేదు.
రవి : మన నగరంలో ఎక్కడా పచ్చని చెట్లు కనిపించవు.
సోము : నిజమే ! పచ్చని పంటపొలాలు కూడా లేవు.
రవి : ఇక్కడ ప్రజల అప్యాయతలు మధురంగా ఉంటాయి.
సోము : ప్రజల మధ్య ఐక్యత పల్లెల్లో బాగా కనిపిస్తుంది.
రవి : పల్లెలో ఒకరి కష్టాల్లో, సుఖాల్లో పరస్పరం పాలుపంచుకుంటారు.
సోము : మన నగరాల్లో అలాంటి వాతావరణం కనిపించదు. ఎవరికివారే సొంతంగా జీవిస్తారు
రవి : ఇప్పటికైనా పట్టణాల్లో చెట్లు బాగా నాటాలి.
సోము : అంతేగాదు ప్రజల మధ్య కూడా ఆనందం వెల్లివెరియాలి.
OR
శ్రీరామ్ : హలో శ్రీనివాస్. ఈ మధ్య నీ దర్శనం లేదు. షికారుకు రాటల్లేదా ?
శ్రీనివాస్ : నమస్తే శ్రీరామ్. పోయినవారం, మా తాత గారి ఊరు పేరూరు వెళ్ళాను. అది మంచి పల్లెటూరు. అక్కడ ఉన్న నాల్గురోజులూ ఎంతో హాయిగా ఉంది.
శ్రీరామ్ : శ్రీనివాస్ ! నీవు నిజం చెప్పావు. పల్లెటూరులో నివాసం, అక్కడి ప్రజల ఐకమత్యం చూస్తే, నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. మొన్న నెల మా మేనమామ గారి ఊరు ‘అత్తిలి’ వెళ్ళాను. అక్కడ గ్రామంలో ప్రవహించే పంట కాలువలు, కాలువ గట్లపై కొబ్బరి చెట్లు, ఆ చెట్ల నుండి వచ్చే చల్లని గాలి, ప్రతి ఇంట్లో ఉన్న అందమైన పూలమొక్కలు, నాకు కన్నులపండువు చేశాయి.
శ్రీనివాస్ : శ్రీరామ్ నీవు నిజం చెప్పావు. మా తాతగారి ఊరు పేరూరు పక్కనే “వైంతేయ” నది ఉంది. అది, గోదావరీ నదికి ఒక పాయ. ఆ నదిలో పడవపై షికారు, ఆ నదీతీరంలోని చేలపై నుండి వచ్చే చల్లని గాలి, నాకు సంతోషం కల్గించాయి. ఆ పల్లెటూరి ప్రజలు ఐకమత్యంతో ఒకరికి ఒకరు సాయపడతారు. అప్పుడే పితికిన పాలతో కాఫీ, కమ్మని నేయి, పాలు, పెరుగు, ఎంతో రుచిగా ఉన్నాయి. గోబర్ గ్యాస్తో వంట. ఇళ్ళ ముందు ముగ్గులు, పూలతోటలు, మహానందంగా ఉందనుకో.
శ్రీరామ్ : నాకు కూడా నదిలో పడవపై షికారు చేయాలని ఉంది. ఈ పర్యాయము నీతో నేను కూడా “పేరూరు” వస్తా, నీకు అభ్యంతరం లేదు కదా !
శ్రీనివాస్ : లేదు. చాలా సంతోషం. మళ్ళీ నెల ‘పేరూరు’ గ్రామానికి తప్పక మనం వెడదాం. “సరే వస్తా”
ప్రశ్న 2.
మన రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ . లాంటి పురాతన కట్టడాలను రక్షించుకోవల్సిన అవసరం ఉందని ఇద్దరి మిత్రుల మధ్య జరిగే చర్చను సంభాషణ రూపంలో రాయండి. (March 2019)
(లేదా)
గోల్కొండ కోట యొక్క గొప్పదనాన్ని మీ ప్రాంతములో మాట్లాడుకొనే తెలుగు మాటలలో మీకు, మీ మిత్రునికి/మిత్రురాలికి సంభాషణ జరిగిన విధానాన్ని రాయండి.
జవాబు:
నాగరాజు : శ్రావ్యా ! మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చారిత్రక కట్టడాలను గురించి తెలుసా ?
శ్రావ్య : నాకు ఎందుకు తెలియదు. ఒకటి చార్మినార్, రెండు గోల్కొండ.
నాగరాజు : బాగా చెప్పావ్ ! చార్మినార్ గొప్పతనమేమిటి ?
శ్రావ్య : క్రీ.పూ. 1591లో ఇది నిర్మించారు. ఇది మహమ్మద్ కులీకుతుబ్షాచే నిర్మించబడింది. ప్లేగువ్యాధిని నివారించడానికి నిర్మించారు.
నాగరాజు : అవును. బాగా చెప్పావ్ ! నాలుగు మీనార్ లో నిర్మితమైనందువల్ల దీనిని “చార్మీనార్” అని పేరు వచ్చిందని అంటారు.
శ్రావ్య : అవును. అంతేగాక ప్రతీ కోణంలో ‘నాలుగు’ ప్రతిబింబించేలా నిర్మించారట.
నాగరాజు : అది సరే ! ఇది ఎక్కడ ఉంది ?
శ్రావ్య : ఇది హైదరాబాద్ పాతబస్తీలో ఉంది. దీనికి ఈశాన్యంలో లాడ్ బజార్ మరియు పడమరన గ్రానైట్తో చక్కగా నిర్మించబడిన ‘మక్కామస్జిద్’ ఉన్నాయి. 149 మెట్లు ఉన్నాయట కదా ! అవునా !
నాగరాజు : అవును. నిజం. ఇక్కడ గాజులు, చీరలు, ముత్యాలకు మంచిపేరుంది తెలుసా ?
శ్రావ్య : అవును తెలుసు. మా నాన్నగారు చెప్పారు.
నాగరాజు : మరి నీకు గోల్కొండ కోట గురించి తెలుసా ?
శ్రావ్య : హైదరాబాద్కు 11 కి.మీ. దూరంలో ఉంది. దీనిని క్రీ.శ. 1083 నుండి 1323 వరకూ కాకతీయులు పరిపాలించారు. గోల్కొండ అసలు పేరు గొల్లకొండ అని పేరుంది.
నాగరాజు : అవును. తెల్సు. గొల్లకొండ గోల్కొండగా మారిందని చదివాను.
శ్రావ్య : చాలాకాలంగా ఇది కాకతీయుల అధీనంలో ఉందట. తర్వాత యుద్ధ సమయంలో సంధిలో భాగంగా 1371లో గోల్కొండ కోట అజీం హుమాయూన్ వశం అయిందట.
నాగరాజు : అవును. 15వ శతాబ్దంలో కుతుబ్షాహీ వంశం వారి అధీనంలోకి వెళ్ళిందని నేను మా పాఠంలో చదువుకున్నాను.
శ్రావ్య : అవును. బాగా గుర్తు చేసావ్ ! గోలకొండ పట్టణ పథకానికి, కర్త ‘ఆజంఖాన్’ అనే ఇంజనీర్ అని సోషల్ మాస్టార్ చెప్పారు.
నాగరాజు : ఇంకా నగీనాబాగ్, మిద్దెల తోటలు చూడతగిన ప్రదేశాలని చదివాను. నిజమా ?
శ్రావ్య : నిజం. నేను అవి చూసాను.
నాగరాజు : సరే మన పాఠశాల ఎక్స్కర్షన్కు (విజ్ఞానయాత్ర) వెళ్ళి వీటిని చూద్దాం సరేనా !
శ్రావ్య : సరే ఉంటాను.
నాగరాజు : మంచిది.
ప్రశ్న 3.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రావిర్భావానికి దారితీసిన పరిస్థితులను గూర్చి ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణను రాయండి.
జవాబు:
ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణ :
శ్రీరామ్ : గోపాల్ ! నీకు మన నూతన రాష్ట్ర శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజు మన కలలు పండిన బంగారు రోజు.
గోపాల్ : శ్రీరామ్ ! నీకు కూడా, నా నూతన రాష్ట్ర శుభాకాంక్షలు. ఈ మన కోరిక తీరడం వెనుక, ఎందరో మన పెద్దల కృషి, ఎందరో అమాయకుల ప్రాణత్యాగాలు ఉన్నాయి కదూ !
శ్రీరామ్ : అవును గోపాల్ ! మట్టి చెన్నారెడ్డిగారి నాయకత్వంలో 1969లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఈ మన రాష్ట్ర సాధనకు తొలిమెట్టు అని, పెద్దలంటున్నారు.
గోపాల్ : రాష్ట్ర సాధనకు మన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ, చేసిన సమ్మెలూ, పోరాటాలు కూడా, ప్రధాన పాత్ర వహించాయి.
శ్రీరామ్ : ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి పర్యవేక్షణలో, టి.ఆర్.యస్. పార్టీ సాగించిన పోరాటాలు, సమ్మెలు, రైల్రోకోలు, వంటా వార్పులు, మన కోరికలు తీరడానికి ప్రధానంగా దోహదం చేశాయి.
గోపాల్ : తెలంగాణ ప్రజలు అందరూ రోడ్లపైకి వచ్చి, “సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటివి చేపట్టారు. ముఖ్యంగా మన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఈ ఉద్యమంలో అంతులేని మహత్తరమైన పోరాటాన్ని చేశారు.
శ్రీరామ్ : ఎన్నోసార్లు మన టి.ఆర్.యస్. పార్టీ ఎమ్.ఎల్.ఏలు, యమ్.పిలు, తమ పదవులకు రిజైన్ చేశారు. నిజానికి అన్ని పార్టీలూ, ఈ మన చిరకాల వాంఛ నెరవేరడానికి ఉద్యమంలో ముందుకు దూకాయి.
గోపాల్ : ` అటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బి.జె.పి పార్టీలు కూడా, ఈ విషయంలో ఏకమై, మన కోరికను తీర్చాయి.
శ్రీరామ్ : గోపాల్ ! నీవు చెప్పింది నిజం. మన తెలంగాణ బిడ్డలు సైతం, ఎందరో ఈ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాల్ని మనం ఎప్పుడూ మరువకూడదు.
గోపాల్ : నిజం చెప్పావు. ఉంటా.
ప్రశ్న 4.
పల్లె పట్నం గురించి మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తుల సంభాషణలు రాయండి.
జవాబు:
వెంకన్న : బాబూ ! తవరిదే ఊరు ?
నిఖిల్ : హైదరాబాద్, నీది ?
వెంకన్న : నిజామాబాద్ జిల్లాలో పల్లెటూరు.
నిఖిల్ : మీరు పల్లెల్లో ఎలా బతుకుతారు ?
వెంకన్న : కల్తీ లేని ఆహారం తింటూ బతుకుతాం.
నిఖిల్ : మీకు కరెంటు ఉండదు. వేసవికాలం ఉక్కపోత కదా !
వెంకన్న : హాయిగా ఆరుబయట మంచాలు వేసుకొని మా వీధి వాళ్ళందరం కబుర్లు చెప్పుకొంటూ పడుకొంటాం. చల్లగా ఉంటుంది.
నిఖిల్ : హోటల్స్ ఉండవు కదా !
వెంకన్న : కొత్తవారిని ఆదరించి కడుపు నిండా తిండి పెడతాం. వసతి కల్పిస్తాం. ఇంక హోటల్స్ ఎందుకు ?
నిఖిల్ : హాస్పటల్స్ ఉండవు కదా !
వెంకన్న : కష్టపడి పనులు చేసుకొంటాం. సాధారణంగా ఏ జబ్బూ రాదు. వచ్చినా చిన్న డాక్టరుంటాడు. పెద్ద జబ్బయితే పట్నం వస్తాం.
నిఖిల్ : అయితే మా పట్నం కంటే మీ పల్లెటూరే బాగుంటుందా ?
వెంకన్న : ఒకసారి వస్తే మళ్ళీ విడిచిపెట్టవు. ఈ రణగొణ ధ్వనులు, కాలుష్యం ఇవేమీ ఉండవు. హాయిగా ఉంటుంది. నా చిరునామా ఇస్తాను, తప్పకుండా రా ! మా ఇంట్లో ఉందువుగాని.
నిఖిల్ : మీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. తప్పక వస్తా ! నా బస్సొచ్చేసింది. బై.
వెంకన్న : మంచిది బాబూ ! జాగ్రత్తగా ఎక్కు