Telangana SCERT 10th Class Telugu Grammar Telangana Samasalu సమసాలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar Samasalu సమసాలు
సమర్థంబులగు పదంబులు ఏకపదంబగుట సమాసంబు. అనగా వేర్వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమునిచ్చు ఏకపదముగా ఏర్పడుట సమాసము అనబడును.
రాజు అనగా ప్రభువు. భటుడు అనగా సేవకుడు. రెండును వేర్వేరు పదములు. అవి రెండు కలిసి “రాజ భటుడు” అని ఒకే అర్థం ఇచ్చే ఒక పదమైనపుడు అది సమాసము అనబడును.
సమాసంలో లోపించిన విభక్తి ప్రత్యయాలను చేర్చి చెప్పేది విగ్రహవాక్యము. రాజు యొక్క భటుడు. సమాసము లోని మొదటి పదమును పూర్వపదము అంటారు.
సమాసంలోని రెండవ పదాన్ని ఉత్తరపదము అంటారు.
అర్థభేదముననుసరించి సమాసములు ప్రధానంగా నాలుగు విధాలు. నామభేదమును బట్టి ఆరు రకాలు.
అవి :
- తత్పురుషము,
- కర్మధారయము,
- ద్విగువు,
- ద్వంద్వము,
- బహువ్రీహి,
- అవ్యయీ భావము.
1. తత్పురుష సమాసము :
ఉత్తర పదార్థ ప్రధానము తత్పురుషము. అనగా సమాసంలోని రెండవ పదము యొక్క అర్థము ప్రధానంగా గలది.
రాజభటుడు వెళ్ళెను – వెళ్ళినది భటుడు.
పూర్వ పదమునకు విగ్రహవాక్యంలో చేరే విభక్తిని బట్టి సమాసం పేరుండును.
i) ప్రథమా తత్పురుష
– అర్ధరాత్రి – రాత్రి యొక్క అర్థభాగము
– మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యభాగము
ii) ద్వితీయా తత్పురుష
– నెలతాల్పు – నెలను తాల్చినవాడు
– ఇందుధరుడు – చంద్రుని ధరించినవాడు
iii) తృతీయా తత్పురుష
– ప్రభాభాసితము – ప్రభచేత భాసితము
– ధనాధికులు – ధనము చేత అధికులు
iv) చతుర్థీ తత్పురుష
– దూడ గడ్డి – దూడ కొఱకు గడ్డి
– దేవరమేలు – దేవర కొఱకు మేలు
– కళ్యాణ ఘంటలు – కళ్యాణం కొరకు ఘంటలు
– సంక్షేమ పథకాలు – సంక్షేమం కొరకు పథకాలు
– దేవాగ్రహారములు – దేవతల కొరకు అగ్రహారములు
– భిక్షా గృహములు – భిక్ష కొరకు గృహములు
v) పంచమీ తత్పురుష
– దొంగ భయము – దొంగ వలన భయము
vi) షష్ఠీ తత్పురుష
– రాజ భవనము – రాజు యొక్క భవనము
– పురుష శ్రేష్ఠుడు – పురుషులలో శ్రేష్ఠుడు
– దేవనది – దేవతల యొక్క నది
– కాకతీయుల కంచుగంట – కాకతీయుల యొక్క కంచుగంట
– పుష్ప గుచ్ఛము – పుష్పముల యొక్క
– గజ్జెల సప్పుడు – గజ్జెల యొక్క సప్పుడు
– బ్రతుకు త్రోవ – బ్రతుకు యొక్క త్రోవ
– యయాతి చరిత్ర – యయాతి యొక్క చరిత్ర
– భుజ తాండవం – భుజముల యొక్క తాండవడం
vii) సప్తమీ తత్పురుష
– యుద్ధ నిపుణుడు – యుద్ధము నందు నిపుణుడు
– మాటనేర్పరి – మాట యందు నేర్పరి
viii) నఞ తత్పురుష,
– అసత్యము – సత్యము కానిది
– అసాధ్యము – సాధ్యము కానిది
– అన్యాయం – న్యాయం కానిది
– అధర్మం – ధర్మం కానిది
– ఆజ్ఞానం – జ్ఞానం కానిది
– అపూర్వం – పూర్వం కానిది
2. కర్మధారయ సమాసము:
విశేషణమునకు విశేష్యముల (నామవాచకము) తో జరుగు సమాసము కర్మధారయము.
ఉదా : మంచి బాలుడు.
బాలుడు – విశేష్యము, మంచి విశేషణము.
ఇది ఎనిమిది విధములు.
i) విశేషణ పూర్వపద కర్మధారయము :
మొదటి పదము విశేషణముగా ఉండును.
ఉదా :
నల్ల గుఱ్ఱము – నల్లనైన గుఱ్ఱము
సరసపు వచనము – సరసమైన వచనము
కొత్తబాట – కొత్తదైన బాట
అంకితభావం – అంకితమైన భావం
సుందరాకారములు – సుందరములైన ఆకారములు
మహారవములు – గొప్పదైన రవములు
బృహత్కార్యం – బృహత్తు అయిన కార్యం
ii) విశేషణ ఉత్తరపద కర్మధారయము :
సమాసములోని రెండవ పదము విశేషణమై యుండును.
ఉదా :
కపోత వృద్ధము -వృద్ధమైన కపోతము
తమ్ముకుఱ్ఱలు – కుఱ్ఱవైన తమ్ములు
iii) విశేషణ ఉభయపద కర్మధారయము :
సమాసము లోని రెండు పదాలు విశేషణములుగా ఉండును.
ఉదా :
శీతోష్ణము – శీతమును, ఉష్ణమును
మృదుమధురము – మృదువును, మధురమును
iv) ఉపమాన పూర్వపద కర్మధారయము :
మొదటి పదము ఉపమానముగాను, రెండవ పదము ఉపమేయముగాను ఉండును.
ఉదా :
తేనెపలుకులు – తేనెవంటి పలుకులు
చిగురుకేలు – చిగురువంటి కేలు
v) ఉపమాన ఉత్తరపద కర్మధారయము :
ఉపమానము రెండవ పదముగాను, ఉపమేయము మొదటి పదముగాను ఉండును.
ఉదా :
ముఖపద్మము – పద్మము వంటి ముఖము
బాహువల్లి – వల్లివంటి బాహువులు
vi) రూపక సమాసము :
దీనినే అవధారణా పూర్వపద కర్మధారయము అందురు. ఒక వస్తువు నందు వేరొక వస్తువు ధర్మమును ఆరోపించుట.
ఉదా :
సంసారసాగరము – సంసారము అనేది సాగరం
కోపాగ్ని – కోపమనే అగ్ని
ఇసుక గుండెలు – ఇసుక అనెడి గుండెలు
కాంతివార్ధులు – కాంతులు అనెడి వార్ధులు
మత పిశాచి – మతం అనెడి పిశాచి
దేశ జనని – దేశము అనెడి జనని
నగరారణ్యం – నగరం అనెడి అరణ్యం
vii) సంభావనా పూర్వపద కర్మధారయము :
సంజ్ఞ మొదటి పదముగా గలది.
ఉదా :
కృష్ణానది – కృష్ణ అనే పేరుగల నది
జనక మహారాజు – జనకుడు అనే పేరుగల మహారాజు
తెలంగాణ రాష్ట్రం – తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం
గోలకొండ పట్టణం – గోలకొండ అనే పేరు గల పట్టణం
కాశికా పట్టణం – కాశికా అనే పేరు గల పట్టణం
హిందూ మతం – హిందూ అనే పేరు గల మతం
3. ద్విగు సమాసము :
సంఖ్యా వాచక శబ్దము పూర్వ పదము గాను, నామవాచకము ఉత్తరపదముగాను కలది.
ఉదా :
నాల్గులోకములు – నాల్గు సంఖ్యగల లోకములు
పంచపాండవులు – పంచసంఖ్యగల పాండవులు
సప్త సముద్రములు – సప్త సంఖ్యగల సముద్రములు
దశ దిక్కులు – దశ సంఖ్య గల దిక్కులు
మూడుతరాలు – మూడైన తరాలు
నాలుగు కాళ్ళు – నాలుగు సంఖ్య గల కాళ్ళు
రెండేళ్లు – రెండైన ఏళ్లు
పన్నెండు ద్వారములు – పన్నెండు సంఖ్య గల ద్వారములు
4. ద్వంద్వ సమాసము:
ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసములోని రెండు పదాల అర్థము ముఖ్యముగా గలది. పదములు నామ వాచకాలై యుండును.
ఉదా :
సీతారాములు – సీతయును, రాముడును
రామలక్ష్మణులు – రాముడును, లక్ష్మణుడును
అన్నదమ్ములు – అన్నయును, తమ్ముడును
కులమతాలు – కులమును, మతమును
పెంపుసొంపులు – పెంపును, సొంపును
జీవధనములు – జీవమును, ధనమును
యువతీయువకులు – యువతులును, యువకులును
క్రయవిక్రయాలు – క్రయమును, విక్రయమును
భూతప్రేతములు – భూతములు, ప్రేతములు
శక్తియుక్తులు – శక్తియును, యుక్తియును
అందచందములు – అందమును, చందమును
కూరగాయలు – కూరలు, కాయలు
5. బహువ్రీహి సమాసము:
అన్యపదార్థ ప్రధానము. సమాసములోని పదముల అర్థము గాక ఇతర పదము యొక్క అర్థము ప్రధానముగా గలది బహువ్రీహి.
ఉదా :
ముక్కంటి – మూడు కన్నులు గలవాడు – శివుడు
చక్రహస్తుడు – చక్రము హస్తము నందు కలవాడు – విష్ణువు
చిగురుబోడి – చిగురు వంటి మేను కలది – స్త్రీ
చక్రపాణి – చక్రము పాణియందు కలవాడు
ఆజానుబాహుడు – జానువుల వరకు బాహువులు కలవాడు
గరుడవాహనుడు – గరుడుడు వాహనముగా కలవాడు
ముక్కంటి – మూడు కన్నులు కలవాడు
దశకంఠుడు – దశ సంఖ్య గల కంఠములు కలవాడు
చంచలాక్షి – చంచలములైన అక్షులు కలది
మృగనేత్ర – మృగము వంటి నేత్రములు కలది
6. అవ్యయీభావ సమాసము:
పూర్వపదము యొక్క అర్థము ప్రధానముగా గలది. పూర్వపదము అవ్యయముగా నుండును.
ఉదా :
యథాశక్తి – శక్తిననుసరించి (లేక) శక్తిని అతిక్రమించక
ప్రతిదినం – దినముననుసరించి
నిర్జనం – జనంలేనిది