Telangana SCERT 10th Class Telugu Grammar Telangana కథలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar కథలు
ప్రశ్న 1.
జంతువులను పాత్రలుగా ఉపయోగించి ఒక కథ వ్రాయండి.
జవాబు:
ఒక వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, గుర్రం ఉన్నాయి. గుర్రాన్ని రోజూ బండికి కట్టేవారు. గుర్రమంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. చాలా ప్రేమగా చూసేవారు. ఒకసారి గాడిద తన పరిస్థితి గురించి గుర్రం దగ్గర బాధపడింది. నీకు గౌరవం దక్కేలా చేస్తానని గుర్రం మాట ఇచ్చింది.
మరునాడు బరువుగా ఉన్న సరుకులతో బండి కట్టారు. గుర్రం చాలా నీరసంగా ఉన్నట్లు నటించింది. జాలిగా చూసింది. గాడిద వైపు చూసింది. సరే గాడిదను ఉపయోగిద్దామను కొన్నారు. అప్పటినుండి బరువు పనులకు గాడిదను ఉపయోగిస్తూ, దానిని ప్రేమగా చూడసాగారు. గుర్రానికి గాడిద కృతజ్ఞతలు చెప్పింది.
ప్రశ్న 2.
స్నేహం గొప్పదనాన్ని తెలిపే కథలను వ్రాయండి.
జవాబు:
1. మిత్రలాభం :
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు. అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వల మీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.
చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలకు ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు సలహా చెప్పాడు. ఒక ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.
పావురాలు అప్పుడు ముసలిపావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలిసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుజ్జీ, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.
2. స్నేహితుని సాయం:
ఒక చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువుకు దగ్గరలో ఉండే ఒక నక్కతో అది స్నేహం చేసింది. ఒక రోజు వారవురూ మాట్లాడుకుంటుండగా అక్కడకు ఒక చిరుతపులి వచ్చింది. అది గమనించిన నక్క తాబేలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ నివాసాల వైపు పరుగెత్తాయి. నక్క మాత్రం వేగంగా పరుగెత్తి వెళ్ళి తన బొర్రెలోకి దూరిపోయింది. తాబేలు మెల్లగా నడుస్తుంది. కాబట్టి తానుండే చెరువుకు చేరుకోలేక పోయింది. చిరుతపులి తాబేలు దగ్గరకు వచ్చింది. తాబేలు చిరుతపులి బారి నుండి తప్పించుకోలేక పోయింది.
చిరుతపులి తాబేలును నోట కరచుకొని, దానిని తినడానికి ఒక చెట్టు కిందకు తీసుకువెళ్ళింది. అది ఎంత ప్రయత్నించినా తాబేలు పైనున్న పెంకును కొరకలేకపోయింది. నక్క తన బొర్రె నుండి ఇదంతా గమనిస్తూనే ఉంది. తన స్నేహితుడిని కాపాడాలని ఆలోచించింది. వెంటనే బొర్రె నుంచి చూస్తూ నక్క అమాయకంగా చిరుతపులితో – “తాబేలును నీటిలోకి విసరండి. అది కొద్దిసేపు నీటిలో నానుతుంది. దానిమీద ఉన్న పెంకు మెత్తనవు తుంది” అని చెప్పింది.
చిరుతపులి – వెంటనే పరీక్షిస్తాను’ అని తాబేలును నీటిలోనికి విసిరివేసింది. వెంటనే తాబేలు చిరునవ్వుతో చెరువు నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోయంది.
ప్రశ్న 3.
“దురాశ దుఃఖానికి కారణం” ఎలానో వివరించండి.
జవాబు:
“ఆశకు అంతే లేదు” అన్నది ఆర్యోక్తి. “ఆశాపాశము తాకడున్ నిడుపు” అంటాడు వామనావతారం ఎత్తిన శ్రీహరి. “దురాశ దఃఖము చేటు” అన్న సామెత మనం నిత్యం వింటూనే ఉంటాం. ఈ సూక్తులన్నింటి లోనూ పేరాశ పనికిరాదనే హితోక్తి మనకు స్పష్టమౌతుంది. అయితే అసలు ఆశ అనేది వుండకూడదని మాత్రం దీని అర్థం కాదు.
హద్దులు దాటని ఆశ, పరిథులు దాటని కోరిక మనిషిని ప్రయత్నశీలుణ్ణి చేసి, తాను ఆశించిన ఫలితాలను అందుకోవడానికి ప్రోత్సాహమిస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తుపైన ఉన్న చిన్ని ఆశ మానవుణ్ణి ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. అయితే ఈ ఆశ అత్యాశగా మారి హద్దుల్ని అతిక్రమిస్తే, అది మనిషిపాలిట శాపంగా మారి అతడిని నరకప్రాయం చేస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలకు కూడా ముప్పు తీసుకువస్తుంది.
మనలో కూడా చాలామంది ఇంకా ఇంకా సంపాదించాలని అత్యాశతో కుటుంబ సౌఖ్యాన్ని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు పాల్పడి మానవ మనుగడను నరకంగా మారుస్తున్న వాళ్ళూ వున్నారు. నిజానికి వీరంతా ఆ సంపాదనను అనుభవిస్తున్నారా అంటే లేదు అనేది జగమెరిగిన సత్యం.
ఇందులో చాలామంది తమ దురాశల పరుగుపందెంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నా రన్నది పచ్చినిజం. అందుకే అత్యాశకు పోకుండా వున్నదానితో తృప్తిగా జీవించటం మనం నేర్చుకోవాలి. ప్రాప్తమైనా లేశమైనా పదివేలు అనుకొని జీవితాన్ని ఆనందంగా గడపాలి. అప్పుడు ప్రతి ఇల్లూ ఆనందాల హరివిల్లుగా మారుతుంది. ఆత్మీయతల పొదరిల్లుగా నవ్వులు కురిపిస్తుంది.
ప్రశ్న 4.
నగరం విస్తరణ – సౌకర్యాలు – వలసలు – కాలుష్యం – ప్రజల జీవనం – సమస్యలు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నగరం మాట్లాడుతున్నట్లు ‘నగరం’ ఆత్మకథ’ ను రాయండి. (March 2019)
జవాబు:
నేను నగరాన్ని. ఒకప్పుడు నేను అంటే అందరికీ గౌరవం. ఇప్పుడు రణగొణ ధ్వనులతో నిండిపోయాను. నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే ధ్వనులు, ఢంకా నాదంలా, జలపాతం హోరులా వినిపిస్తాయి. ఇవి నగరంలో నివసిస్తున్న జీవుల బతుకు పోరాటంలో నుంచి వచ్చిన ఉరుములు.
నామీద అందరికీ మక్కువ ఎక్కువ. పల్లెల్ని వదలి నా దగ్గరకు వలస వస్తారు. తలదాచుకోడానికి చోటులేక, ఇనప్పెట్టె లాంటి ఇరుకు ఇళ్ళల్లో మురికివాడలలో నివాసం ఉంటారు. ఎంతోమందికి నేను ఆశ్రయం ఇస్తాను.
నా దగ్గర ఎంతోమంది విద్యావంతులు నివసిస్తారు. నా దగ్గర పిల్లలు బస్సుల్లో, రిక్షాల్లో కాన్వెంటుకు వెడుతూ పువ్వుల్లా పేవ్మెంట్లపై సందడి చేస్తూ ఉంటారు.
నా దగ్గర పెద్ద భవంతులు, ప్రక్కనే పేదల పూర్ళిళ్ళు కూడా ఉంటాయి. ఐశ్వర్యం, దరిద్ర్యాలు, సమాంతర రేఖల్లా కనిపిస్తాయి.
నా దగ్గర వెరైటీ సమస్యలు ఉంటాయి. నా దగ్గర జీవులకు ఎవరికీ తీరిక ఉండదు. వారి కోరికలు తీరవు. ప్రజలు అసహజంగా నవ్వుతారు. వారివి పాదరసపు నడకలు. అనుక్షణం ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎవరికి ఎవరూ కారు. అందరూ ఏకాకులు. అర్థం కాని రసాయన శాల. చిక్కువీడని పద్మవ్యూహం. నేను ఎవరికీ అంతుపట్టను. ఇది నా ఆత్మకథ.
ప్రశ్న 5.
‘కష్టపడితే విజయాన్ని సాధించవచ్చు’ అనే నీతిని తెలియజెప్పే ఒక కథను రాయండి.
జవాబు:
రామాపురం గ్రామంలో రామయ్య అనే రెండు ఎకరాల రైతు ఉండేవాడు. రామయ్య భార్య పేరు సీతమ్మ, ఈమె పేరుకు దగ్గ ఉత్తమురాలు. వీరికి ‘రమేష్’ అనే పిల్లవాడు ఉండేవాడు. రమేష్ గ్రామంలోనే హైస్కూలులో 9వ తరగతి చదువుతున్నాడు. ఇంతలో రామయ్యకు గుండెజబ్బు వచ్చి, అకస్మాత్తుగా చనిపోయాడు.
పూలరథంలా సాగే వారి కుటుంబానికి కష్టాలు వచ్చాయి. అయితే సీతమ్మ కంగారు పడలేదు. ధైర్యం తెచ్చుకొంది. రమేష్ చదువుకు ఆటంకాలు లేకుండా తాను పొలంలో కష్టపడేది. కొత్త వ్యవసాయ పద్ధతులు తెలుసుకొని, స్వయంగా రమేష్ తోడుగా మంచి పంటలు పండించింది. తల్లి సాయంతో నాలుగు గేదెలను కొని, పాడి పరిశ్రమ మొదలు పెట్టాంది.
రమేష్, తల్లికి తోడుగా ఉంటూనే యమ్.ఏ పూర్తిచేశాడు. ఎంతో శ్రద్ధగా చదివి, చిన్న పిల్లలకు పాఠాలు చెప్పి, కొంచెం డబ్బూ, మరింత జ్ఞానం గడించాడు. పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్షలు వ్రాసి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరుగా ఎన్నికయ్యాడు. వారి కష్టాలన్నీ తీరాయి.
సీతమ్మ, రమేష్కు పెండ్లి చేసింది. వారి జీవితం ఇప్పుడు పూలరథంలా సాగిపోతోంది. దీనిని బట్టి కష్టపడితే విజయాన్ని సాధింపవచ్చు అని తెలుస్తుంది.
ప్రశ్న 6.
‘శతక మధురిమ’ పద్యాలు ఆధారంగా ఏదైనా నీతికథ రాయండి.
జవాబు:
‘ప్రజలు రాజులను ఆశ్రయించడం వ్యర్థము’ అనే నీతిని తెల్పే కాళహస్తీశ్వర శతక పద్యాన్ని, ఒక కవిపండితుడు బాగా అర్థం చేసుకొని, తన జీవితాన్ని చక్కగా మలచుకున్నాడు. ఈ నీతి కథ చదవండి.
నీతి కథ
ఒక ఊరిలో రామయ్య అనే మంచి కవిపండితుడు ఉండేవాడు. ఆయన ఎన్నో పరీక్షలు పాసైనా, ఆయనకు ఉద్యోగం దొరకలేదు. రామయ్యగారు చక్కగా పద్యాలు రాస్తాడు. పెళ్ళిళ్ళలో ఆశీర్వచన పద్యాలు చదువుతాడు. మంత్రులపై స్వాగత పత్రాలు, సన్మాన పత్రాలు బాగా రాస్తాడు.
రామయ్య గార్కి ఎవరో చెప్పారు. గ్రామంలోని ఎమ్మెల్యే కోటిరెడ్డిగార్ని ఆశ్రయించమని రామయ్యగారు ఎమ్మెల్యే గార్ని ఆశ్రయించాడు. ఆనాటి నుండి రామయ్యగార్కి, ఎమ్మెల్యేగార్ని పొగడడమే పని. ఆయనపై పద్యాలు రాసి, స్తోత్రం చెయ్యడమే పని అయ్యింది. అందువల్ల రామయ్యగారి కడుపు మాత్రం నిండలేదు.
ఇంతలో ఎవరో రామయ్యగార్కి ఒక సలహా ఇచ్చారు. చదువుకున్న పండితుడివి హాయిగా గుళ్ళో భారత, భాగవత పురాణాలు చెప్పండని. రామయ్య ఎమ్మెల్యేగారితో విసిగిపోయి, గుడిలో దేవుడిని ఆశ్రయించాడు. రామయణ భారత, భాగవతాలు గుడిలో చక్కగా పురాణం ప్రారంభించాడు. దైవం దయవల్ల భక్తుల దక్షిణలతో, రామయ్యగార్కి జీవితం హాయిగా సాగిపోసాగింది. “చేరంబోవుదు రేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !” అన్న ధూర్జటి శతక పద్యం, అప్పుడు రామయ్యగార్కి గుర్తు వచ్చింది.
నీతి : అధికారులను నమ్ముకోడం కన్నా, దేవుడిని నమ్ముకోడం మంచిది.
ప్రశ్న 7.
కోపం మంచిది కాదనే నీతిని తెలిపే కథను రాయండి.
జవాబు:
పేరూరులో నాగన్న, రంగన్న అనే అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి తన ఆస్తిని కుమారులకు సమంగా పంచాడు. అయినా రంగన్న చీటికీ మాటికీ తమ్ముడితో పేచీ పడేవాడు. పెద్దవాడైన నాగన్న తమ్ముడు రంగన్నను కత్తితో నరకి చంపడానికి సిద్ధం అయ్యాడు.
దానితో నాగన్నను పోలీసులు జైలుకు పంపారు. రంగన్న శాంత స్వభావుడు. తాను కష్టపడి పొలంలో పనిచేసి తన పిల్లలను బాగా చదివించాడు. వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. నాగన్న జైలుకు వెళ్ళడం వల్ల నాగన్న పిల్లలు కూలీ పనులు చేసి జీవించేవారు.
నాగన్న జైలు నుండి తిరిగి వచ్చాడు. తమ్ముడు పిల్లలు బాగుపడ్డారని గ్రహించాడు. తన కోపమే తనకు శత్రువు అయ్యిందని గ్రహించాడు. ఆనాటి నుండి తమ్ముడితో ప్రేమగా మసలు కొనేవాడు.
నీతి : కోపము శత్రువు వంటిది. ఓర్పు, ధనము వంటిది అని గ్రహించాలి.