Telangana SCERT 10th Class Telugu Grammar Telangana కరపత్రాలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar కరపత్రాలు
ప్రశ్న 1.
మాతృభాష గొప్పదనాన్ని తెలియజేస్తూ కరపత్రం రాయండి. (June 2018)
జవాబు:
భాషాభిమానం
తెలుగు వెలుగు – నిండు నూరేళ్ళు
తల్లి నుండి బిడ్డ నేర్చుకొనెడి భాషే మాతృభాష. మానసిక భావపరంపరను వ్యక్తులు పరస్పరం తెలియజేసుకోవడానికి ఉపయోగించే సాధన భాష. మనందరి మాతృభాష తెలుగు. తెలుగు చాలా మధురమయిన భాష, తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అంటారు. తెలుగులో అనేక జాతీయాలు, నుడికారాలు, సామెతలు, పదబంధాలు ఉన్నాయి.
తెలుగు భాష అభివృద్ధికై ఎందరో కవులు, రచయితలు కృషి చేశారు. విదేశీయులు సైతం మెచ్చుకునే భాష మన తెలుగు భాష, ఎందరో చక్రవర్తులు, రాజులు, జమిందార్లు అభిమానించి, ఆదరించిన భాష మన తెలుగు భాష.
కానీ ఎవరి ప్రాంతపు మాండలికమంటే వారికి మక్కువ. ఎవరి ప్రాంతపు యాస అంటే వారికి ప్రీతి. అందరి మాతృభాష ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి భాషలో యాస మారుతుంది. ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ భాష తెలుగు భాష అటువంటిది. మాతృభాష అభివృద్ధికి అందరం కృషి చేద్దాం.
దేశభాషలందు తెలుగు లెస్స.
తేది : XXXX
ఇట్లు,
మాతృభాషాభివృద్ధి సంఘం,
వరంగల్.
OR
మాతృభాష గొప్పదనాన్ని తెలిపే కరపత్రము :
ప్రియమైన మాతృభాషా ప్రేమికులారా !
ఇద్దరు ఇంగ్లీషు వ్యక్తులు కలిస్తే ఇంగ్లీషులోనే మాట్లాడతారు. ఇద్దరు హిందీ మాతృభాషగా కలవారు అమెరికాలో కలిసినా సరే వారి సంభాషణ హిందీలోనే జరుగుతుంది. అలాగే తమిళులు తమిళంలోనే మాట్లాడడానికే మొగ్గు చూపిస్తారు. మరి మన తెలుగువారి దౌర్భాగ్యం ఏమిటో గాని ఇద్దరు తెలుగువాళ్ళు కలిస్తే తెలుగే రాదన్నట్టు ఇంగ్లీషులోనో, మరేదో భాషలోనో మాట్లాడడానికి ఇష్టపడతారు.
మాతృభాషలో సాగే విద్యాభ్యాసం మెట్ల మీద నుండి ఇంటి పైకి చేరినట్లుంటుంది. అదే పరాయి భాషలో సాగడం మెట్లు లేకుండా ఇంటి పై భాగానికి చేరడంలా ఉంటుందని, మాతృభాషలో విద్యాభ్యాసం కళ్ళ వంటిదని, పరాయి భాషలో అయితే కళ్ళజోడు వంటిదని ఎందరో పెద్దలు చెప్పారన్న సంగతి మరువద్దు.
మాతృభాష తల్లి పాలవంటిది. ఇతర భాషలు నేర్చుకోండి. కానీ మాతృభాషను మరువవద్దు. “తల్లికి తిండిపెట్టనివాడు పిన్నికి గాజులు వేయిస్తానన్నట్లు” ఉండవద్దు. ఎంత ఎత్తు ఎదిగినా మన మూలాలను మరువవద్దు. మాతృభాషను మృతభాషగా చేయకండి. భాష జీవిస్తేనే మనం జీవిస్తున్నట్లు అన్న మాట మరువకండి.
ప్రశ్న 2.
“అవయవదానం” గురించి తెల్పుతూ కరపత్రం రాయండి. (March 2018)
జవాబు:
అవయవదానం చేయండి
సోదర సోదరీమణులారా !
‘పరోపకారార్థమిదం శరీరమ్’ – అని ఆర్యోక్తి కాబట్టి ఇతరులకు ఉపకారం చేయుట కొరకే భగవంతుడు శరీరమిచ్చాడని గ్రహించాలి.
ఎంతోమంది మానవులు అనేక రకాలైన ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకుంటుంటారు. అలా పోగొట్టుకుంటే శరీరంలో ఏ అవయవం లేకపోయినా జీవించడం కష్టం.
కళ్ళు, మూత్రపిండాలు, కాలేయం వంటి వాటిని దానమిచ్చి, మనచుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవ జన్మకు సార్థకత.
నేడు వైద్యరంగంలో మనిషి యొక్క ఒక అవయవం పాడయితే దాన్ని తొలగించి, ఇతరులు దానం చేసిన అవయవాలను అక్కడ అతికించి వారికి ప్రాణదానం చేస్తున్నారు. ఇప్పుడు నేత్రదానం, కిడ్నీల దానం, కాలేయము వగైరా అవయవాలు దానం చేస్తున్నారు.
ప్రమాదాలలో “బ్రెయిన్డెడ్” అయిన వారి అవయవాలను సేకరించి, వాటిని అవసరం ఉన్నవారికి అతుకు తున్నారు. మనిషికి ఒక మూత్రపిండం ఉంటే చాలు. కాబట్టి ప్రతివ్యక్తీ ఒక మూత్రపిండాన్ని దానం చేసి, అది అవసరమైన వారి ప్రాణాలు కాపాడాలి. మనం నేత్రదానం చేస్తే ఆ మనిషి మరణించినా అతని కళ్ళు శాశ్వతంగా నిలుస్తాయి. అలాగే కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు కూడా మరణానంతరం దానం చేయాలి.
ఈ విధంగా మానవులందరు తమ తమ అవయవాల్ని దానం చేస్తే కొంతమంది జీవితాల్లో వెలుగుల్ని నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలవారికి స్ఫూర్తి ప్రదాతమవుతారు.
తేది : X X X X
ఇట్లు,
రాష్ట్ర యువజనసమితి,
సిరిసిల్ల.
ప్రశ్న 3.
‘సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలడం’ అనే అంశంపై కరపత్రం తయారు చేయండి. (March 2016)
జవాబు:
‘మూఢనమ్మకాలను తరిమికొడదాం’
మన సమాజములో ఎంతో కాలంగా ఎన్నో దురాచారములు, మూఢనమ్మకాలు పాతుకు పోయాయి. వాటిని మనం గుడ్డిగా నమ్మి పాటిస్తూ వస్తున్నాము. రాజారామమోహనారయ్ు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగము పంతులుగారు వంటి సంఘ సంస్కర్తలు, సతీ సహగమనము, భర్తపోయిన స్త్రీలకు అలంకారాలు తొలగించడం, వంటి దురాచారాల నిర్మూలనకు కృషిచేసి, విజయం సాధించారు. మన ఆంధ్ర దేశంలో కందుకూరి వీరేశలింగము పంతులుగారు విధవలకు తిరిగి వివాహాలు జరిపించారు. ఎన్నో మూఢాచారాలను వారు నిర్మూలించారు.
దెయ్యాలు లేవని, భూత వైద్యం అంతాదగా అని వారు నిరూపించారు. సంఘంలో దెయ్యాలు, చేతబడులు, శకునాలు, వంటి వాటిని నమ్ము తున్నారు. చేతబడులు చేశారని కొంత మందిని
చంపేస్తున్నారు. శకునం మంచిది కాదని, ఆ రోజు తిథి మంచిది కాదని, పనులు ఆపేస్తున్నారు. ఇవన్నీ మూఢాచారాలు.
దెయ్యాలు లేవు. భగవంతుడు సృష్టించిన రోజులు, తిథులు అన్నీ మంచివే. ఎవరు శకునం వచ్చినా, ఫర్వాలేదు. పిల్లి శకునం, వెధవ ముండ శకునం వంటి వాటిని పాటించనక్కరలేదు. అలాగే అంటరానితనాన్ని పాటించకూడదు.
దేవుడి దృష్టిలో అంతా సమానమే. మూఢ నమ్మకాలను తరిమికొట్టండి. మంచిని పాటించండి. పక్కవారిలో దైవాన్ని చూడండి. మతాలు అన్నీ మంచిని చెప్పేవే, నమ్మండి.
తేది : XXXX
ఇట్లు,
వరంగల్ జిల్లా,
విద్యార్థి సంఘం.
OR
మూఢనమ్మకాలకు స్వస్తి పలుకుదాం
సోదర సోదరీమణులారా !
మానవ సమాజంలో అనేక దురాచారాలు, మూఢనమ్మకాలు అనాదిగా నెలకొనియున్నాయి. తర్వాతి తరాలవారు వాటిని గుడ్డిగా నమ్మారు. ఆ మూర్ఖత్వం నుండి ఆ మూఢత్వం నుండి ఇంకను జాగృతం కాని మానవసమాజం నేటికి కూడా మనకు కనిపిస్తుంది.
బాల్యవివాహాలు జరపడం, సతీసహగమనాలు, అంటరానితనం, కూకటివేళ్ళతో పేరుకునిపోయి ఉన్నాయి. ఇంకా దయ్యాలనీ, భూతాలనీ, చేతబడులనీ నేటికి మానవాళి విశ్వసిస్తూనే ఉన్నది. కొన్ని ప్రాంతాలలో అయితే క్షుద్రశక్తుల్ని వశం చేసుకొనుటకు నరబలులు ఇస్తూనే ఉన్నారు. ఇటువంటి మూఢాచారాన్ని నశింపచేయాలి.
ఈ ఆధునికయుగంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామమోహనరాయలు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తలు సతీసహగమనాన్ని మాన్పించారు. బాల్యవివాహాల్ని నిర్మూలించారు. వితంతు వివాహాల్ని పునరుద్ధరింపచేశారు.
శకునం మంచిది కాదని, ఆ రోజు తిథి మంచిది కాదని, పనులు చేయడం ఆపేస్తున్నారు. ఇటువంటి మూఢనమ్మకాల నుండి ప్రజల్ని జాగృతం చెయ్యాలి.
భగవంతుని సృష్టిలో అందరూ సమానమే. మూఢనమ్మకాల్ని తరిమికొట్టండి. సాటిమనిషిని మనిషిగా గుర్తించి, మానవత్వాన్ని పరిమళింపచెయ్యాలి. ఏ మతమైనా మానవత్వం ఒక్కటే. అని ఎలుగెత్తి చాటాలి.
తేది : x x x x x.
ఇట్లు,
నవయువత జాగృతి పరిషత్,
షాద్నగర్.
ప్రశ్న 4.
నీటిని ప్రతి చుక్క పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
నీటి పొదుపు
మిత్రులారా! నీరు మనకు భగవంతుడిచ్చిన గొప్పవరము. ఆహారం లేకుండా అయినా ఉండగలమేమో కాని, నీరు లేకుండా త్రాగకుండా ఒక్కరోజు గడపలేము. పంచభూతాలలో నీరు ముఖ్యమైనది.
ఒకప్పుడు నీరు ప్రపంచంలో సమృద్ధిగా దొరొకేది. మంచి వర్షాలు కురిసి ఆ నీరు చెరువుల ద్వారా, కాలువల ద్వారా, నదుల ద్వారా, బావుల ద్వారా, ప్రజలకు లభించేది. ప్రపంచంలో జనాభా పెరిగింది. మానవుడికి నీటి పట్ల అశ్రద్ధ పెరిగింది. వాతావరణ కాలుష్యం వల్ల వర్షాలు తగ్గాయి. మానవుడి అవివేకంవల్ల చెరువులు, నదులు ఎండిపోతున్నాయి.
బోరుల వల్ల నేలలోని నీరు సైతం ఎండి పోతుంది. బోర్లు ఎండిపోయి త్రాగడానికి నీటిచుక్క లేక ప్రజలు వలసలు పోతున్నారు. దీనికి పరిష్కారం నీటిని పొదుపుగా వాడుకోవాలి. పొలాల్లో, ఇళ్ళల్లో ఇంకుడు గుంతలు తవ్వాలి.
కురిసిన ప్రతి వర్షపు నీటి బిందువు నేలలో ఇంకాలి. చెరువులు కలుషితం కాకుండా ప్రజలు చూసుకోవాలి. నీటిని మిక్కిలి పొదుపుగా వాడుకోవాలి. ప్రతి గ్రామములో చెరువులు, బావులు శుభ్రంగా ఉండాలి. చెరువులో నీరు పుష్కలంగా ఉంటే, గ్రామాలలోని బావులలో నీరు నిండుగా ఉంటుంది.
నదులు, ఏరులలో నీరు సముద్రంలోకి పోకుండా అడ్డుకట్టలు వేసి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి. బోరులు ఇష్టానుసారం వేయకూడదు. మొక్కలను విరివిగా పెంచి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి.
ప్రతి వ్యక్తి ఈ జలయజ్ఞంలో పాల్గొనాలి. పాల్గొందాము. సరేనా ? నీటిని పొదుపు చేసి మనల్ని మనము రక్షించుకుందాం.
తేది : 10.10.2016.
ఇట్లు,
తెలంగాణ జల సంరక్షణ సమితి.
ప్రశ్న 5.
స్వచ్ఛ భారత్లో ప్రతి వ్యక్తి పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రము తయారు చెయ్యండి.
జవాబు:
‘ఆరోగ్యమే మహాభాగ్యము’ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మన ఇల్లు, మనవీధి, మన గ్రామము, శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటే, దేశమంతా స్వచ్ఛంగా ఉంటుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలకు వైద్యం ఖర్చులు తగ్గుతాయి.
ఒకనాడు గ్రామాలలో ఇల్లు, వాకిలి శుభ్రంగా తుడుచుకొని నీళ్ళు చల్లుకొని ముగ్గులు పెట్టుకొనేవారు. గ్రామాలలో అడుగుపెడితే ఆ పరిశుభ్ర వాతావరణానికి ముచ్చట వేసేది. శుభ్రమైన ఆ ఇళ్ళల్లో మహాలక్ష్మి సిరిసంపదలతో కొలువు తీరేది.
ఈనాడు గ్రామాలు, నగరాలు చెత్తకు, మురికి కాలువలకు నిలయమైపోయాయి. పందులు, పశువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలలు, పాఠశాలలు, కళాశాలలు సైతం చెత్త కుప్పలతో కలుషిత వాతావరణంతో దుర్గంధమును వెదజల్లుతున్నాయి. అపరిశుభ్రమైన వైద్యశాలల్లో మందులు సేవించినా రోగాలు తగ్గవు.
కాబట్టి ప్రతి పౌరుడు తన ఇల్లు, తన గ్రామము, తన వాడ, తన నగరము పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు వాడరాదు. ఎవరికి వారు తమ ఇల్లు, వీధి శుభ్రం చేసుకొని ఆ చెత్తను పంచాయితీ మునిసిపల్ వారి బళ్ళకు అందించాలి. చెత్తను పోగుచేసి ప్రభుత్వము దానిని చేలకు ఎరువులుగా తయారు చేయాలి. చెత్త నుండి విద్యుచ్ఛక్తి తయారు చేయాలి.
‘స్వచ్ఛభారత్’ అని మన ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రతివ్యక్తి అందుకొని, దేశాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచే బాధ్యతను తీసుకోవాలి. ఇది ఒక మహా యజ్ఞం. ఈ యజ్ఞంలో ప్రతి భారతీయుడు పాల్గొనాలి. పాల్గొందాం.
‘జై స్వచ్ఛ భారత్’
తేది. 10.08.2018.
ఇట్లు,
స్వచ్ఛ భారత్ యువజన సంఘం,
నల్గొండ జిల్లా శాఖ.
ప్రశ్న 6.
‘వందేమాతరానికి వందేళ్ళు’ పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:
మన భారతదేశంలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన మహా ఉద్యమం వందేమాతరానికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా 2005వ సంవత్సరంలో ఉత్సవాలు నిర్వహించాం. వందేమాతరం గీతం బంకించంద్ర చటర్జీ రచించిన ‘ఆనంద మఠం’ అనే నవలలోనిది. ఆ నవలలో సన్యాసుల తిరుగుబాటు సందర్భంలో ఈ గీతం ఉంది.
బ్రిటిష్వాళ్ళు దేశ ఐక్యతను చెడగొట్టే ప్రయత్నంలో భాగంగా బెంగాల్ రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకున్నారు. దీనికి వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం ప్రారంభమైంది. 1905లో బిపిన్ చంద్రపాల్ వంటి దేశభక్తులు దేశమంతటా సంచరించి, ప్రజలకు నాడు జరుగుతున్న విషయాలను విశదీకరించారు. దేశమంతటా ‘లాల్, బాల్, పాల్’త్రయాల ప్రసంగాల ఫలితంగా వందేమాతరం ఉద్యమం వ్యాపించింది.
దేశప్రజలలో ఐకమత్యకు ఎంతో ఉపకరించింది ఈ వందేమాతరం ఉద్యమం. మొదట బీజప్రాయం కాగా అది మొలకెత్తి మహావృక్షమై దేశమంతటా అలుముకున్నది. అదే మహాస్వాతంత్ర్యోద్యమమై మనకు 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం రావడానికి కారణభూతమైంది.
ఆనాటి జాతీయ స్ఫూర్తి, స్వాతంత్ర్య దీప్తిని దేశమంతటా వ్యాపింపచేసిన వందేమాతరం ఉద్యమాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఈ ఉత్సవం ఎంతో తోడ్పడుతుంది. చీలిపోతే కూలిపోతామనీ, కలిస్తేనే నిలుస్తామనీ ఈ ఉద్యమం మనకు చెబుతున్నది. ఈ స్ఫూర్తికి మనం తిరిగి ఈనాడు పొందడానికి వందేమాతరం ఉద్యమ శతసంవత్సరాల పండుగ తోడ్పడుతున్నది.
ఇట్లు,
X X X X X
ప్రశ్న 7.
మీ పాఠశాలలో ఉండే సౌకర్యాలు, బోధన, ఇతర ప్రత్యేకతలు తెల్పుతూ, పాఠశాలలో పిల్లలను చేర్పించమని కోరుతూ, కరపత్రం తయారు చేయండి.
జవాబు:
సురక్షితం ! మా బడిలో చేర్పించండి! సలక్షణం!
మా పాఠశాలలో 2017 – 2018 సంవత్స రానికి అన్ని తరగతులకు అడ్మిషన్లు తెరవబడినాయి. నగరంలోనే మా పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చూడండి ! మా ప్రత్యేకతలు.
బోధన : అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన అధ్యాపకులచే బోధన, కేరళ ఉపాధ్యాయులచే ఇంగ్లీషు బోధన, వారాంత పరీక్షలు, సి.సి.ఇ. పద్ధతిలో బోధన.
సౌకర్యాలు : విశాలమైన తరగతిగదులు, విశాలమైన క్రీడా ప్రాంగణం, పచ్చని చెట్లతో కూడిన ప్రశాంత వాతావరణం.
ప్రత్యేకతలు : ఎలాంటి డొనేషన్లు లేవు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఉచితం. ప్రభుత్వ నిర్ణీత ఫీజులు, సంగీతం, క్రీడలు, వృత్తివిద్యలయందు ప్రత్యేక శిక్షణ. దూర ప్రాంతాల వారికి బస్సు సదుపాయం కలదు.
ఇట్లు,
యాజమాన్యం,
శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల,
నల్గొండ.
ప్రశ్న 8.
గ్రంథాలయాల ఆవశ్యకత, ప్రయోజనాలు, సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
చదవండి – విజ్ఞానం పొందండి
సమాజంలో గ్రంథాలయాల పాత్ర సమున్నతంగా ఉంది. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. పరిశోధనలకు నిలయాలు. విద్యార్థుల బుద్ధి వికాసానికి సోపానాలు. తరతరాల భారతీయ సంస్కృతికి, సాహితీరసాస్వాదనానికి దేవాలయాలు.
మనం గ్రంథాలయాలకు వెళ్ళాలి. విజ్ఞాన గ్రంథాలను చదవాలి. గ్రంథాలయాల్లో విస్తృత పఠనం, మౌనపఠనం అలవడుతుంది. మనం ఈ గ్రంథాలయాలను రక్షించాలి. పతనం చెందుతున్న మన గ్రంథాలయాలను ఆదుకోవాలి. మనవంతు కృషిచేయాలి.
ఇట్లు,
గ్రంథాలయ సంరక్షణ కమిటీ,
కావలి.
ప్రశ్న 9.
‘చెట్టు – నీరు’ పథకం గురించి, ప్రజలందరూ దానిలో పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:
‘చెట్టు – నీరు పథకం’
ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత. మనకు పూర్వకాలంలో మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గి పోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.
ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయి పోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్ర మవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్టు – నీరు పథకం మొదలు పెట్టింది. దీనిలో ప్రజలంతా పాల్గొనాలి. తమ ఊరిలో చెరువు వారు బాగు చేసుకోవాలి. ప్రజలందరికీ నీరు పుష్కలంగా లభించేలా చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.
వృక్ష పరిరక్షణ సమితి,
హైదరాబాద్.
ప్రశ్న 10.
బహుళ ప్రయోజనాలను చేకూర్చే నదుల ప్రాముఖ్యం వివరిస్తూ, ఆ నదులు కాలుష్యం బారిన పడకుండా చూడటానికి ప్రజలను చైతన్యపరుస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
నదులను కాపాడుకుందాం !
ప్రజలారా !
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో నదులతో భారతదేశం పవిత్రమవుతోంది. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, తుంగభద్ర మొదలైన నదులున్నాయి. నదులకూ మానవ జీవితానికి అవినాభావ సంబంధం ఉన్నది. నదుల మీద కడుతున్న ఆనకట్టలతో, నీటిని నిల్వచేసి వ్యవసాయానికి నీరు అందించుకోగలుగు తున్నాం.
నదుల్లో చేపల వంటి విలువైన జలసంపదను పెంచుకో గలుగుతున్నాం. విద్యుత్ను ఉత్పత్తి చేసుకో గలుగుతున్నాం.
కానీ మన స్వార్థంతో నేడు మనకు ప్రాణాధార మైన నదులను కలుషితం చేస్తున్నాం. పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నాం. ఇకపై పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి
కలపకుండా చూడాలి.
నదుల్లో మల, మూత్రాదులను వదిలి కలుషితం చేస్తున్నాం. మల, మూత్రాదులను నదుల్లో కలప కుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
పశువులను, బట్టలను నదులలో కడగడం, ఉతకడం వంటి నదులను కలుషితం చేసే పనులను ఆపాలి.
ఇకనైనా చైతన్యవంతులమవుదాం. నదుల కాలుష్యాన్ని అరికడదాం.
రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడు కుందాం.
ఇట్లు,
రోటరీక్లబ్,
భద్రాచలం.
ప్రశ్న 11.
అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమల్ని నివారించడానికి తెలియజేస్తూ కరపత్రం తయారుచేయండి. (March 2017)
జవాబు:
దోమల నిర్మూలన
సోదర సోదరీమణులారా !
ఈరోజు మనగ్రామంలో దోమల బాధ ఎక్కువగా ఉంది. ఈ దోమల వల్ల మానవాళికి అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి. కలరా, మలేరియా, టైఫాయిడ్ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలెన్నో పుట్టుకువస్తున్నాయి. అంతేకాకుండా బోదకాలు వ్యాధిని కూడా వ్యాప్తిని చేసే దోమలు అనేక విధాలుగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలందరు జాగ్రత్తలు పాటించినట్లైతే రోగాలపాలు కాకుండా ఉంటారు.
‘ఆరోగ్యమే మహాభాగ్య’మన్నారు పెద్దలు. కనుక ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. త్రాగునీటిని కాచి చల్లార పెట్టి త్రాగవలెను. మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఫినాయిల్ను ఉపయోగించాలి. దోమలు నివసించే ప్రదేశాల్లో డి.డి.టి మందుల్ని వారానికి రెండుసార్లు ఉపయోగించాలి. చెత్తకుండీల్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి అందులో చెత్తనుంచాలి. దానిని వారానికి రెండుసార్లు తగలబెట్టాలి.
రోడ్ల వెంట చెట్లను విరివిగా నాటాలి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా తగు చర్యలు తీసుకోవలెను. పారిశుద్ధ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. పరిసరాల పరిశుభ్రతతోనే మనందరి అభివృద్ధి ఉందని గ్రహించాలి. దీనికై అందరు ఉద్యమించాలి.
ఇట్లు,
ప్రాథమిక ఆరోగ్యకేంద్రం,
సిద్ధిపేట.
ప్రశ్న 12.
‘పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు’ అంటూ పర్యావరణ పరిరక్షణకు చెట్ల ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రూపొందించండి. (March 2017)
జవాబు:
చెట్లు లేనిదే బ్రతుకు లేదు
సోదర సోదరీమణులారా !
“వృక్షో రక్షతి రక్షితః” – అని ఆర్యోక్తి. అనగా చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని అర్థం. భూగోళంలో మూడువంతులు నీరు, ఒక వంతు నేల మాత్రం కల్గి ఉంది. ఆ నేలలో సగభాగం అరణ్యాలు, కొండలు ఉన్నాయి. భూమి వేడెక్కకుండా ఉండాలంటే అరణ్యాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. అంతేకాక వర్షపాతాన్ని కూడా అధికంగా పెంచుతాయి.
మానవాళి తమ తమ శరీరంలో దిగువభాగం నుండి వదిలెడి దుర్గంధ వాయువుల్ని చెట్లు పీల్చుకుంటాయి.’ తర్వాత మానవాళి జీవించడానికి అవసరమైన ప్రాణవాయువునిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయి. సూర్యుని వద్ద నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమి చుట్టూ ఉన్న భూకక్ష్యను తాకి, మార్పు చెంది, ఆ తర్వాత చెట్లను తాకుతాయి. ఆ తర్వాత భూమి పైకి వస్తాయి. ఈ చెట్లు భూమి వెడెక్కకుండా రక్షిస్తాయి.
భూమిని రక్షించడంలో ముఖ్యపాత్ర వహిస్తున్న చెట్లను స్వార్థంతో అకారణంగా నరికివేస్తున్నాడు. ధనదాహంతో అడవుల్ని నశింపచేసి ఇళ్ళ నిర్మాణమంటూ ద్రోహం చేస్తున్నాడు. మానవాళిని రక్షించే చెట్లను నరకుట మానాలి. ప్రభుత్వాలు శాసనాలు చేసి చెట్లను రక్షించాలి. ప్రతి మానవుడు చెట్లను నాటి వాటి ఆవశ్యకతను గుర్తించాలి. “పచ్చని చెట్లు ప్రగతికి మెట్లను” అనే నినాదంతో రాబోయే భావితరాలవారికి ఇబ్బంది కలుగకుండా చెట్లను నాటి, వాటి పెరుగుదలకు దోహదపడాలి. అప్పుడే లోకకల్యాణం సిద్ధిస్తుంది. అనారోగ్యాల బారి నుండి మానవుడు రక్షింపబడతాడు.
ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ సమితి,
భద్రాచలం.
ప్రశ్న 13.
నేటి కాలంలో “ఎంతోమంది వృద్ధుల్ని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని తెలియజేస్తూ” ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
‘తాతా · మామ్మ ముద్దు’ వృద్ధాశ్రమం వద్దు
సోదర సోదరీమణులారా !
అనాధి నుంచి మన భారతదేశం కుటుంబవ్యవస్థకు పెట్టింది పేరు. ఎన్నెన్నో కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఖ్యాతిని పొందాయి. అమ్మమ్మ, తాతయ్య, అమ్మానాన్నలు, పిల్లలు ఇలా కలసి ఉండే అందమైన కుటుంబాలు మనవి. వీరంతా ఒకరికొకరు కలసిమెలసి పరస్పర సహాయ సహకారాలు చేసుకుంటూ జీవించేవారు. అన్ని విషయాల్లో ఐకమత్యంగా ఉండేవారు.
కాని నేడు మనదేశంలో ప్రతివ్యక్తికి స్వార్థం పెరిగిపోయింది. మనమనేభావన పోయింది. నాదన్న భావన పెరిగిపోయింది. నేను, నా భార్య, నా పిల్లలు అనే స్వార్థంతో పెద్దల్ని దూరంగా ఉంచుతున్నారు. వృద్ధుల విషయంలో శ్రద్ధపోయి విసుక్కుంటున్నారు. అసహించుకుంటున్నారు. నిరాదరణ పెరిగిపోయింది. పైగా ఇంట్లో ఉంచుకోకుండా వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు.
ఈనాడు అనేకమంది వృద్ధులు నిరాదరణకు గురై, అనాథలుగా జీవిస్తున్నారు.
కనుక ఈనాటి బాలబాలికలే రేపటి భావిభారత పౌరులు కదా ! అందువల్ల దయను చూపిస్తూ వృద్ధుల్ని గౌరవించండి. ఆదరణతో ఆదుకొనండి. వారి అనుభవాల్ని తెలుసుకుని, నేటి విద్యార్థులంతా పాఠాలుగా స్వీకరించండి. ఉమ్మడి కుటుంబాలే ఈనాటి సమాజానికి వెన్నుముక వంటిదవుతుంది. మంచి ప్రపంచం ఏర్పడి, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్గుతుంది. ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.
తేది : xxxxx,
ఇట్లు,
వృద్ధజన సేవాసమితి,
హైదరాబాద్.
ప్రశ్న 14.
“నదుల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రూపొందించండి.
జవాబు:
నదుల్ని కాపాడుకుందాం !
మిత్రులారా !
మనదేశం వ్యవసాయిక దేశం. వ్యవసాయానికి ముఖ్యంగా కావలసింది నీరు. మనదేశంలో ఆసేతు హిమాలయ పర్యంతమూ అనేక నదులు కలవు. అందులో మన ఆంధ్రరాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర మున్నగు జీవ నదులున్నాయి. ఈ నదులకు మానవాళికి అవినాభావ సంబంధం కలదు.
ఈ నదులపై అనేక ఆనకట్టలు కట్టి, నీరును నిల్వచేసి, ఎగువ ప్రాంతాలకు ప్రవహింపచేసి వ్యవసాయానికి నీరందిస్తున్నారు. అంతేకాక జలసంపదను అభివృద్ధిని సాధిస్తున్నారు. మరియు నీటి నుండి విద్యుత్తును సృష్టించి వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి ఉత్పత్తి చేస్తున్నారు.
కాని, మానవుడు స్వార్థంతో నేడు మనకు ప్రాణాధారమైన నదుల్ని కలుషితం చేస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాల్ని వదలి నీటిని కలుషితం చేస్తున్నారు. నగర, పట్టణాలందలి మురికినీటిని నదులలోకి వదలి కలుషితం చేస్తున్నారు. ఆ నీరే తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నదులు కాలుష్యకోరల్లో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రజలంతా చైతన్యవంతులవ్వాలి. రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
తేది : x x x x x.
ఇట్లు,
జాతీయ విద్యార్థి సంఘం,
సికింద్రాబాద్.
ప్రశ్న 15.
“తెలుగు వారందరూ ఒక్కటే” అంటూ సోదరభావం కలిగేలా ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
తెలుగువారందరూ ఒక్కటే
సోదర సోదరీ మణులారా !
“తెలుగుజాతి మనది – నిండుగ వెలుగుజాతి మనది” – అని డా. సి. నారాయణరెడ్డి అన్నారు. ప్రాంతీయ భేదాలు మనల్ని మన మనసుల్ని కలుషితం చేస్తాయి. ప్రాంతాలు వేరైనా మనభాష తెలుగుభాషే. ఆంధ్రాయైనా, తెలంగాణయైనా, మనమంతా తెలుగువారం. ఆత్మీయతకు, అనురాగానికి పుట్టినిల్లు మన తెలుగునేల.
ప్రాంతాలు విడిపోయినా, సంస్కృతీ సంప్రదాయాల్లో, భాషా వ్యవహారాల్లో మనమంతా ఒక్కటే. ‘కలసి ఉంటే కలదు సుఖం’ అని పెద్దలు చెప్పుచున్నారు కదా ! మనమంతా మన మాతృభాషను గౌరవిద్దాం. ఆంధ్రభోజునిగా కీర్తిపొందిన శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాపథాన్ని ఒకే గొడుగు క్రిందకు తీసుకొచ్చి మన ఆంధ్రదేశాన్ని పాలిస్తూ “దేశభాషలందు తెలుగు లెస్స” – అని పల్కాడు. మన తెలుగుదేశ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడింది.
మనలో మనకు ఈర్ష్యా ద్వేషాలు; వైషమ్యాలు మున్నగునవి పతనానికి దారితీస్తాయే కాని అభివృద్ధిని సాధించలేవు. ఒక తల్లిబిడ్డల్లా విడిపోయినా కలసిమెలసి అందరం అభివృద్ధి పథంలో పయనిద్దాం. ప్రాంతీయవాదం జాతి సమైక్యతకు గొడ్డలిపెట్టు. మనమంతా ఒకే తల్లిబిడ్డల్లా, అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉందాం. మన తెలుగువారంతా ఒక్కటే అన్న నినాదాన్ని ప్రపంచమంతా చాటి చెప్పుదాం.
జై తెలుగుతల్లి
తేది : x x x x x.
ఇట్లు,
తెలుగు సాహితీ సమితి,
శంషాబాద్.
ప్రశ్న 16.
“స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల్ని ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ” ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
స్త్రీలను గౌరవిద్దాం
సోదర సోదరీ మణులారా !
స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబంలో పోషించే పాత్ర కదా ! ఆమె నిస్వార్థంగా సేవచేస్తూ మమతానుబంధాల్ని పంచుతూ జీవిస్తుంది.
అందుకే “యత్ర నార్యస్తు పూజ్యంతే, తత్సరమంతే దేవతాః” – అని ఆర్యోక్తి. అనగా ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు ఆనందిస్తారని స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఆర్యులు గొప్పగా చెప్పారు.
ప్రాచీనకాలం నుంచి విజ్ఞానరంగంలో స్త్రీలు, పురుషునితో పోటీపడుతూనే ఉన్నారు. నేడు స్త్రీలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. చదువుల్లో పురుషునికంటే ముందంజ వేస్తున్నారు. సమాజంలో క్రియాశీలమైన స్త్రీలపై అత్యాచారాలు జరగడం సిగ్గుచేటు, స్త్రీని గౌరవించడం అనే మంచి సంప్రదాయం ఉన్న మనదేశానికి అవమానకరం.
క్షణికమైన ఆవేశంతో స్త్రీలపై అత్యాచారాలు చేయడం వల్ల మన జాతి నిర్మాతలైన సోదరీమణుల ఆత్మగౌరవం దెబ్బ తింటుంది. విలువైన ప్రాణాలు పోతున్నాయి. జాతికి పరువుపోతుంది. కనుక స్త్రీలను గౌరవిద్దాం ! వారి ఆత్మగౌరవానికి ఆటంకం కలిగించకుండా పురుషునితో సమానంగా ఆదరిద్దాం ! మహాకవి చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు “ముదితల్ నేర్వగలేని విద్య కలదే ముద్దార నేర్పించినన్” అని స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఏనాడో విశ్లేషించి చెప్పాడు. స్త్రీల కున్న స్వేచ్ఛను రక్షించుదాం ! వారి హక్కుల్ని కాపాడుదాం !
తేది : X X X X,
ఇట్లు,
తెలంగాణ మహిళాసంఘం,
సికింద్రాబాద్.
ప్రశ్న 17.
“బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిస్తూ” ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
బాలకార్మికుల్ని రక్షిద్దాం
మిత్రులారా !
“కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లను, నిరక్షరాస్యత వల్లను, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్నవయస్సు లోనే కార్మికులుగా చేరుతున్నారు.” – అని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (IOL) తన సర్వేలో వెల్లడించింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా మన భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఓ.యల్ (IOL) తన సర్వేలో తెలియజేసింది. మనదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.
భారతదేశంలో 9.9 కోట్లమంది బాలలు పాఠశాలలకు వెళ్ళడంలేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పనిచేస్తున్నారని “గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ లేబర్” అనే అంతర్జాతీయసంస్థ పేర్కొంది. బాలకార్మికుల కొరకు ప్రత్యేక పాఠశాలల్ని ఏర్పాటు చెయ్యాలి. వారు చదువకొనే అవకాశాన్ని కల్పించాలి.
మన రాష్ట్రంలో 16 లక్షలమంది బాలకార్మికులున్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామనే ప్రభుత్వం పలు సందర్భాల్లో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి.
కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.
ప్రశ్న 18.
“వరకట్న సమస్యను నిర్మూలిస్తూ” ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
వరకట్నం నిర్మూలిద్దాం
సోదర సోదరీ మణులారా !
వివాహం అయిన తదుపరి పెళ్ళికూతుర్ని అత్తవారింటికి పంపుతూ కూతురు మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు అనేక కానుకలనిచ్చి పంపుతారు. రానురాను ఈ సంప్రదాయం భయంకరంగా రూపొందించుకుంది. అది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది.
ఈ కట్నం అనే లాంఛనం తప్పనిసరిగా వరుడికిచ్చే పరిస్థితి నేడు నెలకొంది. ఆడపిల్లకు వివాహం చేయాలంటే కట్నకానుకలను ఇచ్చే స్తోమత లేక అనేకమంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. వరకట్నం తీసుకోవడంగానీ, ఇవ్వడంగానీ నేరం అని చట్టం చెబుతున్నా పట్టించుకునేవాళ్ళు లేరు. ఈ చట్టాన్ని ఎవరు పాటించడం లేదు. చట్టాన్ని కాపాడవలసిన అధికారులే కట్నం తీసుకుంటున్నారు. వరకట్నం ఇస్తున్నారు. కంచే చేను మేస్తుంటే చేసేదేముంది ?
వరకట్న సమస్య నశించాలంటే ముందు పెద్దల్లో మార్పురావాలి. శాఖాంతర, కులాంతర ప్రేమ వివాహాల్ని ప్రోత్సహించాలి. యువతీ యువకులు కూడా ఆదర్శాలతో ఈ వరకట్న మనే దురాచారాన్ని రూపుమాపాలి. అబ్బాయికిచ్చినా, అమ్మాయికిచ్చినా రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. నేడు ప్రచార, ప్రసార సాధనాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక వీటి ద్వారా ప్రచారం జరగాలి. వరకట్న సమస్యను రూపుమాపాలి.
ప్రశ్న 19.
“నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపెడుతూ” ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
నిరుద్యోగ సమస్య పారదోలుదాం !
మిత్రులారా !
ప్రస్తుత పరిస్థితుల్లో చదివిన వారందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబ్రాగటం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. కులవృత్తులు చేయువారు కూడా ఉద్యోగాలకు పరుగులిడుతున్నారు. అవి రాని పరిస్థితి వల్ల కులవృత్తులందు తగిన నైపుణ్యాన్ని కోల్పోయారు.
నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వాలు విద్యావిధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. వృత్తి విద్యలకు, కులవృత్తులకు ప్రోత్సాహమియ్యాలి. లఘు పరిశ్రమల్ని, కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. అవసరమైతే బ్యాంకుల ద్వారా వారికి ఋణాల్ని ఇప్పించాలి. ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చాలి.
యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు పరుగు విడక స్వయం ఉపాధికై అన్వేషణ జరపాలి. స్వతంత్రంగా జీవించడానికి సంసిద్ధులు కావాలి. అంతేకాదు ఏ యువకుడైనా తన కాళ్ళపై తాను నిలబడిన తాను పదిమందికి దారి చూపిననాడు నిరుద్యోగ సమస్య నశించిపోతుంది.
ప్రశ్న 20.
“పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గూర్చి ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – మన ఆరోగ్యపు సంరక్షణ
మిత్రులారా !
మానవుడు భూమిపై నివసిస్తున్నాడు కదా ! అతడు తన పరిసర ప్రాంతాల్ని కలుషితం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా మానవుడు చేయగలిగిననాడు పర్యావరణ పరిరక్షణకు సాకారం జరుగుతుంది.
పర్యావరణంలో భాగంగా జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు సాగునీటిని, త్రాగునీటిని కాలుష్యం చేస్తున్నాయి. మురుగు నీటికి, త్రాగునీటికి తేడా లేకుండా పోయింది.
వాయు కాలుష్యం పారిశ్రామిక వ్యవస్థ వల్ల మితిమీరిపోతోంది. విషపూరితమైన గాలి పీల్చడం వల్ల మానవులకు అనేక వ్యాధులు సంక్రమించి మరణావస్థకు దారితీస్తున్నాయి.
యంత్రాల వల్ల, వాహనాల వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోతోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను పెంచాలి. కలుషితమైన నీటిని శుభ్రం చేసి, ప్రత్యేక కాలువల ద్వారా మురుగును సముద్రంలోనికి వెళ్ళేటట్లు చూడాలి పరిశ్రమల వ్యవస్థ వల్ల గాలి కలుషితం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలి.
ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ సమితి,
వరంగల్.
ప్రశ్న 21.
“మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉందని” తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని విడుదల చెయ్యండి.
జవాబు:
నీటి రక్షకుడు – లోకరక్షకుడు
మిత్రులారా !
సకల చరాచర జీవరాసులకి నీరే ప్రాణాధారం. నీరులేనిదే ఏ జీవి జీవించలేదు. ప్రతిరోజూ దైనందిన జీవితంలో నీటి ప్రాముఖ్యత ఎంతో ఉంది. మానవులు, పశువులు, పక్షులు ఒకటేమిటి అనేక జీవరాశులు నీరులేనిదే జీవించలేవు. ఇంత ఆవశ్యకత ఉన్న నీటి లభ్యత క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఆనాటికానాటికి భూగర్భజలాలు అంతరించిపోతున్నాయి.
మానవాళికి ఆహారం కావాలంటే పంటలు పండాలంటే సాగునీరు అవసరం. కనుక భూగర్భజలాలు పెరిగితే పుష్కలంగా నీరు లభిస్తుంది.
భూమిపైన జనాభా నానాటికీ పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న నీరు భవిష్యత్తుకుపయోగపడదు. కనుక ప్రజలు నీటి ఆవశ్యకతను గ్రహించి విరివిగా చెట్లను పెంచాలి. కాలుష్య పొరల నుండి భూమిని కాపాడాలి. గాలి కాలుష్యం కాకుండా చూడాలి.
పరిశ్రమలు వదిలే వ్యర్థ పదార్థాల్ని శుద్ధిచేసి ప్రత్యేక కాలువల ద్వారా సముద్రంలోకి వదలాలి. చెట్లను నరకకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అడవుల్ని సంరక్షించాలి. అపుడే వర్షపాతం పెరిగి తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. అంచేత సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా భవిష్యత్తులో కొన్ని శతాబ్దాల వరకు లభిస్తుందనుటలో సందేహం లేదు.
ఇట్లు,
జల సంరక్షణ సమితి,
మెదక్.
ప్రశ్న 22.
నైతిక విలువలు – మనిషిని మహనీయునిగా మారుస్తాయి అంటూ ఒక కరపత్రాన్ని రూపొందించండి.
జవాబు:
ప్రియమైన మిత్రుడా !
ఎదుటివారిలో తప్పులు వెదకడం కన్నా వారి నుండి మంచిని స్వీకరించు. ఈ గుణం నీకు వారిలోని మంచిని తెలుసుకోవడానికి, నీలోని మంచితనం లోకానికి తెలియజేయడానికి తోడ్పడుతుంది. నీతిని పాటించే విలువలు నైతిక విలువలు. ఇవి సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి తోడ్పడతాయి. ఈ విలువలు పాటించిన మహర్షులు, ప్రజా నాయకులు, దేశభక్తులు, దాతలు తరతరాలకు మార్గదర్శకులౌతారు. నైతిక విలువలతో సత్యం, ధర్మం, న్యాయం, మానవీయతలు ప్రకాశిస్తుంటాయి.
ఒక అగ్గిపుల్ల తాను మండిపోతూ ఇంకొకదానిని మండిస్తుంది. అట్లాగే నైతిక విలువలు లేని వ్యక్తి తాను నాశనమౌతూ, సమాజానికీ చెడునే చేస్తాడు. ఇది ఎలా అంటారా ? దుర్యోధనుడు ఎప్పుడూ పాండవులకు హాని చేద్దామా అని వారి లోపాలు వెతుకులాటలోనే జీవితాన్ని గడిపాడు. ఇక ధర్మరాజు అన్నివేళలా ధర్మం తప్పని ధర్మమూర్తిగా, తోటివారి పట్ల ప్రేమ మూర్తిగా కనిపిస్తాడు. ఎదుటివారి అవగుణాలు గణింపక, సుగుణాలను స్వీకరించి, తనను తాను తీర్చిదిద్దుకోవడానికే ప్రయత్నించాడు.
మన చరిత్రను పరిశీలిస్తే గురుకులాలలో దేవాలయాలలో నైతికవిలువలు ప్రబోధించే, పెంపొందించే కార్యక్రమాలు విరివిగా జరిగాయి. సాహిత్యం, కళలు ద్వారా సమాజంలో మార్పును తేవడానికి ఎందరో మహనీయులు తమ జీవితాలను ధారపోశారు.
ఇట్లు,
తెలంగాణ వైతాళిక సంఘం.
ప్రశ్న 23.
ఆడపిల్లల పట్ల, స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో తెలిపే కరపత్రం తయారు చేయండి.
జవాబు:
ప్రియమైన సోదరులారా !
భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్నిచ్చింది. ప్రతి స్త్రీలోనూ తల్లిని చూడమని చెబుతుంది మన సంస్కృతి. మన ప్రాచీన సాహిత్యం లోతులు చూస్తే ‘మాతృదేవోభవ’, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని తల్లి వైభవాన్ని తెలుపుతాయి.
త్రిమూర్తులను తన పాతివ్రత్యంతో చంటిబిడ్డలుగా చేసి, వారికి జోలపాడిన మహనీయురాలు అనసూయ, యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి, తన భర్త ప్రాణాన్ని రక్షించుకొన్న పవిత్రురాలు సావిత్రి; భగభగమండే అగ్నిగుండంలో కూడా పూలరాశిలో తిరిగినట్లు తిరిగి బయటకు వచ్చిన పతివ్రత సీత; భర్త కోసం సూర్యభగవానుని ఉదయించకుండా నిలిపిన పుణ్యస్త్రీ సుమతి. ఇలా ఎందరో భారతీయ స్త్రీలు తమ పాతివ్రత్యంతో ఈ నేలను పునీతం చేసారు. అటువంటి మాతృమూర్తుల పట్ల మనం ప్రవర్తించాల్సినది ఇట్లాగేనా ?
“యత్రనార్యస్తు పూజ్యంతే, రమయంతే తత్ర దేవతాః” అని మనుస్మృతిలో చెప్పబడింది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దీనర్థం. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే రామాయణంలో పరస్త్రీ వ్యామోహంతో రావణుడు తన వంశానికే చేటు తెచ్చుకొన్నాడు. భారతంలో దుర్యోధనుడు తల్లితో సమానమైన ద్రౌపదిని వివస్త్రను చేయడానికి పూనుకొని, చరిత్రహీనుడయ్యాడు. మనం పసితనంలో తడబడిన అడుగులు వేసాము. మనలో కొందరు పెరిగి పెద్దయి కూడా తప్పటడుగులు ఇంకా వేస్తూనే ఉన్నారు.
పుట్టిన బిడ్డకు తల్లి సాయం కావాలి. పెరిగిన తర్వాత అక్క, చెల్లి తనతో ఆడటానికి, ఆడిపించడానికి కావాలి. తర్వాత తన వంశం వృద్ధి చెందడానికి భార్య కావాలి. తన బిడ్డలకు తల్లి కావాలి. ఇలా ప్రతి మగవాడి జీవితంలో స్త్రీ లేకపోతే, ఆ మగవాడి జీవితం వెలుతురు లేని చీకటే అవుతుంది. “స్త్రీ సృష్టికి జీవగఱ్ఱ”. అటు స్త్రీల పట్ల, పసి బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించుట సరికాదు.
ఇట్లు,
తెలంగాణ స్త్రీ జాగృతి సంఘం.
ప్రశ్న 24.
“పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు” అన్న అంశంపై కరపత్రం తయారు చేయండి.
జవాబు:
ఓ అన్నలారా ! అక్కలారా !
ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే రెండు అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. ఒకటి వ్యవసాయం, రెండు పరిశ్రమలు. వ్యవసాయంపై ఆధారపడినపుడు పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే “పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలు” అన్నారు పెద్దలు.
ప్రకృతి అందచందాలకు భూతలస్వర్గం పల్లె. పచ్చని పొలాలతో, చక్కని పొదరిళ్ళ బారులతో, ప్రతి ఇంటిముందు పాడి పశువులతో పల్లెలు అలరారుతుంటాయి. మమతానురాగాలతో కూడిన పిలుపులతో, చక్కని అనుబంధాలతో సౌహార్థానికి ఐకమత్యానికి నిలయాలు పల్లెటూర్లు.
స్వచ్ఛమైన గాలి, నీరు, వెలుతురు దొరికే భూలోక స్వర్గం పల్లెటూరు. పల్లెప్రజలు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక చెమటోడ్చి కష్టపడతారు. కష్టపడుతున్నామన్న బాధను మరచి చిరునవ్వులు చిందిస్తారు. పల్లె గీతాలతో నేల తల్లికి హారతులు పడతారు.
“జనాః పద్యంతే అత్ర జనపదః”, నియమేన వర్తంతే జనా అస్మిన్ ఇతి నీ పృత్” – అని అమరకోశంలో చెప్పబడింది. విద్య లేదేమో కాని వినయంలో ఎవరికీ తీసిపోరు జానపదులు. ఆర్థిక ఇబ్బందులు వస్తూ పోతుంటాయి. కానీ ముఖాలపై చిఱునవ్వు చెరగదు. కష్టం తెలిసినవారు, సుఖాలకై పరుగిడని వారు. సోమరితనం దరిచేరనివారు, ఇంకెవరు పల్లెటూరి వారే.
దేశానికి వెన్నెముక, అన్నదాత అయిన రైతు వ్యవసాయాన్ని ఒక తపస్సుగా భావిస్తాడు. పేదసాదలకు ఉన్నంతలో దానం చేసి తృప్తిగా జీవిస్తాడు. కులవృత్తులు, చేతివృత్తులు, చేనేత వృత్తులు వారును, ఒగ్గు కథలవారు, హరిదాసులు, తోలుబొమ్మలు ఆడించేవారు, పగటివేషగాళ్ళు, గంగిరెద్దులవాళ్ళు ఇలా ఎన్నో జానపదకళలకు ఆలవాలమై పల్లెటూళ్ళు శోభిస్తున్నాయి.
చక్కని పాడిపంటలతో అలరారే పల్లెటూళ్ళలోని ముంగిళ్ళు అందమైన ముగ్గులతో స్వాగతమంటూ ఆహ్వానిస్తాయి. కనువిందైన కట్టుబొట్టుతో పల్లెపడుచులు చిఱునవ్వులు చిందిస్తారు. ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నిలయాలు ఇక్కడి దేవాలయాలు, స్వచ్ఛమైన కోనేరులు, చూడచక్కని పుష్పజాతులతో, పక్షి జాతులతో అలరారుతుంటాయి. ఇలాంటి పల్లెలను కాపాడాల్సిన బాధ్యత మనందరిది. చేయి చేయి కలుపుదాం పల్లెటూళ్ళను కాపాడదాం. “పల్లెటూళ్ళు బాగుంటేనే ప్రపంచమంతా బాగుంటుంది” అన్న కరుణశ్రీ మాటలు స్ఫూర్తిదాయకాలు.
ఇట్లు,
జనపద సంక్షేమ సంఘం.
ప్రశ్న 25.
నగరం, పల్లె దేని గొప్పదనం దానిదే అని తెలిపే కరపత్రం తయారు చేయండి.
జవాబు:
ఓ అమ్మలారా ! అయ్యలారా !
“నగరాల్లో వసతులెక్కువ, పల్లెలలో తక్కువ. నగరాల్లో ఖుషీ, జల్సాలు ఎక్కువ. పల్లెల్లో తక్కువ. అక్కడ ఉన్న ఆనందం ఇక్కడ ఉండదు” ఇలాంటి మాటలతో పల్లె, పట్టణం ఏది గొప్పదో తేల్చుకోలేకపోతున్నారా ? ఇదిగో ఇది చదవండి. మీకే అర్థమౌతుంది. మన ఆలోచనలే సరిగాలేక అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి. రెండూ గొప్పవే. వీటిలో కొన్ని సుఖాలు, కొన్ని ఇబ్బందులు అనేవి సహజం. ఇంక విషయంలోకి వెళితే –
“నగ సదృశాః ప్రసాదాదయో అత్ర సంతీ ఇతి నగరీ” అని అమరకోశంలో చెప్పబడింది. అంటే పర్వత సమానాలైన రాజగృహాలు మొదలగునవి దీని యందు కలవు అని అర్థం. ఎత్తైన భవన సముదాయాలు కలవని భావం. అంతేగాక “క్రీడార్థం నగాః పర్వతావా అత్ర సంతీ ఇతి నగరీ” అని కూడా అమరకోశం చెబుతోంది. విహారార్థమై వృక్షాలు, పర్వతాలు గాని దీనియందు కలవని అర్థం. ప్రస్తుతార్థంలో విహారకేంద్రాలు, ఎత్తైన ప్రదేశాలు కలవని గ్రహించాలి.
అన్ని విద్యలకు ఆటపట్లు నగరాలు. నవ్య సంప్రదాయాలకు, నూత్న ధోరణులకు, విలాసవంతమైన జీవనం, అనేక నాగరికతలతో కొత్త పాతల మేలు కలయికలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదిస్తాయి నగరాలు. ఇక్కడ ఒకరునొకరితో ధన శక్తిని, శ్రమ శక్తిని బదలాయింపు చేసుకొంటారు. ‘గుడ్డలు లేని వారికి గుడ్డలిచ్చి అవమానించడం ఎందుకు ? పని ఇవ్వండి. పని ద్వారా తన గుడ్డలకు కావాల్సిన డబ్బును తానే సంపాదించుకుంటాడు” అని గాంధీజీ అన్నట్లు నగరం అందరికీ ఎవరు చేయదగ్గ పనిని వారికి చూపిస్తుంది”.
ఇక పల్లె విషయానికొస్తే “జనాః పద్యంతే అత్రజనపదః”, “నియమేన వర్తంతే జనా అస్మిన్ ఇతి నీ పృత్” అని అమరుకం చెబుతోంది. నియమానుసారంగా ఎక్కడ జనులు నివసిస్తారో అవే జనపదాలని అర్థం. ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటున్నది. తల్లి ఒడి ఒక జీవశక్తి. అలాంటి జీవశక్తి పల్లెసీమల్లో తొణికిసలాడుతుంది. పల్లెలు ప్రాచీన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఇంకా పాటిస్తూనే ఉన్నాయి. విశ్రాంతి అనే తియ్యదనం, శ్రమ అనే చేదు నుండి లభిస్తుందనే సంగతి మరువనపుడు నగరమైనా, పల్లె అయినా ఒకటే.
ఇట్లు,
తెలంగాణ జనజాగృతి సంఘం.
ప్రశ్న 26.
మాతృభాష గొప్పదనాన్ని తెలిపే కరపత్రం తయారు చేయండి.
జవాబు:
తెలుగుభాష గొప్పదనం :
“దేశభాషలందు తెలుగులెస్స” అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. మన తెలుగుభాష, అజంత భాష. ఇది సంగీతానికి అనువైన భాష. అందుకే త్యాగరాజు వంటి తమిళులు సైతం తెలుగులోనే పాటలు రాశారు. “తెలుగు తేట, కన్నడ కస్తూరి, అరవమధ్వానం” అన్నారు. మన తెలుగు, తూర్పు ప్రాంతాన ఉన్న ఇటలీ భాష వంటిదని పాశ్చాత్యులు ప్రశంసించారు. (ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్)
ఎంతో తపస్సు చేసుకుంటే తప్ప ఆంధ్రత్వమూ, ఆంధ్రభాష లభింపవని అప్పయ్య దీక్షితుల వంటి తమిళపండితులు మెచ్చుకున్నారు. జన్మజన్మల తపస్సు యొక్క ఫలితము, తెలుగువారిగా జన్మించడం అని రాయప్రోలువారు అన్నారు.
మన తెలుగు కమ్మని భాష, తెలుగు పద్యము తెలుగువారి ఆస్తి. తెలుగులోని యతి ప్రాసలు పద్యానికి వాద్య సహకారం అందించి, గానకచేరి చేస్తాయి. తెలుగు కవులలో కవిత్రయం, శ్రీనాధ పోతనలు, అష్టదిగ్గజ కవులు గొప్పవారు. మన తెలుగు మందార మకరంద సదృశమైన భాష. తేనెవంటిది తెలుగుభాష. తెలుగుభాష అష్టావధానాలకు అనుకూలమైనది.
వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న తెలుగుభాషను ప్రాచీన భాషగా గుర్తింపు పొందడమే ఆలస్యం. ఇంకా తెలుగుభాషకు గల ప్రత్యేకత – మనం ఏ అక్షరాలు పలుకుతామో అవే వ్రాస్తాం. ఏవి వ్రాస్తామో అవే పలుకుతాం. ఈ ప్రత్యేకత భారతదేశంలోని భాషలలో ఒక్క సంస్కృతం, తెలుగు భాషలకే ఉంది. కూతకు, రాతకు తెలుగులో తేడా లేదు. మిగిలిన భాషలలో కొంత తేడా ఉంది. తెలుగులో అనేక జాతీయాలు, సామెతలు, పదబంధాలు ఉన్నాయి.
ఇట్లు,
తెలుగుభాషాభివృద్ధి సంఘం.
ప్రశ్న 27.
‘తెలంగాణ తల్లి’ వైభవాన్ని వివరిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలారా !
“నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అన్న దాశరథి కృష్ణమాచార్యుల పలుకులు అక్షరసత్యం. కాకతీయుల కదనరంగం తెలంగాణ. ఆ వీరుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తరువాతి తరాలవారు నిజాం పాలనను తరిమికొట్టారు. కళలకు మూలస్తంభం తెలంగాణ. పోతన, దాశరథి, సి.నా.రె వంటి వారు గొప్ప కవిత్వాన్ని ఈ నేలలో పండించారు.
రామప్పగుడి, కాకతీయశిల్పం, చార్మినార్ వంటి అపురూప కట్టడాలతో ఈ నేల విరాజిల్లుతోంది. భద్రాద్రి, యాదాద్రి, మెదక్ చర్చి, ఎన్నో ప్రాచీన దర్గాలతో సర్వమత సమానత్వాన్ని చాటుతోంది. అన్ని సంస్కృతులకూ సంగమమైన భాగ్యనగరం భారతదేశంలోనే గొప్ప నగరాలలో తలమానికంగా ఉంది. గాయకులు, నాట్యకళావంతులకు ఈ గడ్డ పెట్టింది పేరు. రామదాసాది భక్తాగ్రగణ్యులు, వాగ్గేయకారులుగా వెలుగొందారు. గోలకొండ కోట మన ఘనచరిత్రకు తార్కాణం.
ఈ నేల స్వాతంత్ర్యానికై ఎందరో వీరులు చూపిన త్యాగనిరతి వారి బలిదానం చరిత్రను తట్టిలేపింది. యావత్ భారతాన్నీ కదిలించింది. ఎందరో కవులు ఈ నేలతల్లి ఋణం తీర్చుకోవడానికి అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ మార్గంలో తమ కవిత్వాన్ని నడిపారు. ఆ కవుల కలాలు వరద గోదావరిలా, ఆవేశంతో, వీరరసోద్రేకంతో, తెలంగాణ మాతృ సంకీర్తనతో, రసవంతంగా సాగాయి. గోదావరి, కృష్ణమ్మ వంటి గంగా ప్రవాహాలు ఈ నేల తల్లి ఒడిలో ప్రవహిస్తూ, సస్యశ్యామలం చేస్తున్నాయి. ఈ తెలంగాణ ముద్దుబిడ్డలు ప్రేమమూర్తులు. సహనశీలురు.
విప్లవ వీరులకు, యోధులకు, కళలకు, ఘన సంస్కృతికి, అపురూప నిర్మాణాలకు, పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు నిలయమైన తెలంగాణ ఘనతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది. మన చరిత్రను కీర్తించండి. ప్రగతి కాముకులై మన భాగ్య నగరాన్ని విశ్వనగరంగా, మన రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కండి. మీకు విజయోస్తు.
ఇట్లు,
తెలంగాణ అభ్యుదయ సంఘం.
ప్రశ్న 28.
‘సమాజ సేవ చేయడం మనందరి కర్తవ్యం’ అని కరపత్రం రాయండి.
జవాబు:
కొందరు ఏ పని చేసినా దీంట్లో నాకేం లాభం ? అని ఆలోచిస్తారు. ‘నాదంతా దాచుకోవాల’ను కొనేవారు కొందరైతే, “దొరికినంత దోచుకోవాలనుకొనేవారు” మరికొందరు. కాని నిస్వార్థంగా, నిజాయితీగా తన సంపదను, జ్ఞాన సంపదను సమాజాభివృద్ధికి సమర్పణ చేసే త్యాగధనులు కొందరే.
ఎవరెట్లాపోతే నాకేంటి నేను బాగుంటే చాలనుకొనేవాడు అధముడు. ముందు నేను బాగుండాలి, తర్వాత సమాజం బాగుండాలనుకొనేవాడు మధ్యముడు. నేనెట్లా ఉన్నా ఫర్వాలేదు, ముందు సమాజం బాగుండాలి అనుకొనేవాడు ఉత్తముడు. ఉత్తమ భావాలతో ప్రజలను, దేశాన్ని ముందుకు నడిపించేవాడే ఉత్తమోత్తముడు. “దైవం మానుషరూపేణా” అన్నారు. దైవం ఎక్కడోలేడు. అనాథలను, అభాగ్యులను, బాల, వృద్ధ, వ్యాధిగ్రస్తులను ఎవరైతే ఆపన్నహస్తంతో ఆదుకుంటారో అదిగో ! వారే దైవస్వరూపులు.
సమాజం అంటే ఒక్కరు కాదు, అందరు. అందుకే అరిస్టాటిల్ ‘మనిషి సంఘజీవి’ అన్నారు. నేను బాగుండాలి అనుకొనేదానికన్నా మనం బాగుండాలి అనుకోవడంలో మనిషిలోని మానవత్వం ప్రకాశిస్తుంది. ఈ మానవీయ విలువలను పాటించటం వలన జాతీయ సమైక్యత వర్ధిల్లుతుంది.
ఇట్లు,
తెలంగాణ జనజాగృతి సంఘం.
ప్రశ్న 29.
సంపాదకీయాల ప్రాధాన్యతను తెలిపే కరపత్రం రాయండి.
జవాబు:
ఒక్క సిరా చుక్క – లక్ష మెదళ్ళలో కదలిక
సమాజంలోని అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేవి పత్రికలు. ఆ వార్తలను పరిశీలించి ముద్రణకు అనుమతించే అధికారం కలిగినవారు సంపాదకుడు. “ఎడిటర్” అనే ఆంగ్ల పదానికి “సంపాదకుడు” అనే తెలుగు పదం అందించినది ఆనాటి “స్వరాజ్య” పత్రిక సంపాదకుడు శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు. పత్రికలో సంపాదకుడు రాసే ప్రత్యేక వ్యాసాలను సంపాదకీయ వ్యాసాలు అంటారు.
సంపాదకీయ వ్యాసాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి. సమాజానికి వెలుగుదివ్వెలు వంటివి. సమాజంలోని లోపాలను ఎత్తి చూపుతాయి. దేశాన్ని అన్ని రంగాలలోనూ ఉన్నత స్థానంలో నిలుపటానికి సంపాదకీయాలు తోడ్పడతాయి.
సామాన్య వార్తలా కాకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేవిగా ఉండే ఈ సంపాదకీయాలు, కొద్ది ప్రాంతానికో, కొంతమంది వ్యక్తులకో పరిమితం కాకుండా సామాజిక సమస్యలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి.
దేశ రక్షణ, ఆర్థికరంగం పటిష్టత, అసమానతల నిర్మూలన, ప్రజా సంక్షేమం, ప్రజా జీవితం తీరుతెన్నులు, దేశ ప్రగతిని దెబ్బతీసే పోకడలు వంటివి ఎన్నెన్నో ప్రధానమైన అంశాలు సంపాదకీయాలుగా వెలువడుతుంటాయి. సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితుల్ని ఎత్తి చూపే అక్షరాయుధాలు సంపాదకీయాలు, వీటి రచనలో సంపాదకుని బహుముఖీన ప్రజ్ఞ కనిపిస్తుంది. అందుకే సంపాదకుణ్ణి పత్రికారంగంలో ‘లీడర్’గా పిలిచే ఆనవాయితి ఉండేది.
ఎన్నెన్నో దురాచారాలను రూపుమాపటానికి యుగకర్త కందుకూరి వారి ‘వివేకవర్ధిని’ మున్నగు పత్రికల సంపాదకీయాలు అగ్రస్థానం అలంకరిస్తాయి. అలాగే చిలకమర్తివారి ‘దేశమాత, మనోరమ’ పత్రికలలోని సంపాదకీయాలు, ప్రజల భాషను కాపాడడానికి గిడుగువారి ‘తెలుగు’ పత్రిక సంపాదకీయాలు వ్యవహారిక భాషకు వెలుగులు పంచాయి.
భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయోద్యమాన్ని దేశం నలుమూలలకు మోసుకెళ్ళిన ఘనత పత్రికలదే. సంపాదకీయాల పరిధి విస్తృతమైనది. సాధారణ వార్తలను మాత్రమే చదివి, ఆలోచనాత్మకమైన సంపాదకీయాలను కొందరు నిర్లక్ష్యం చేయడం విచారకరం. ఇప్పటికైనా సంపాదకీయాల ప్రాధాన్యత గుర్తించి, దేశ ప్రగతికి తోడ్పడే వీటిలోని విశేషాలను గ్రహించగలరు.
ప్రశ్న 30.
“కోపం మనిషి విచక్షణను నశింపచేస్తుంది” అను విషయాన్ని కరపత్రంగా రాయండి.
జవాబు:
జ్ఞానవంతులారా !
మంచైనా, చెడైనా మనం పెంచి పోషిస్తేనే అది పెరుగుతుంది. మంచిని పెంచడం వల్ల మనిషి ఋషి అవుతాడు. చెడును పోషిస్తే సమాజం చేత తిరస్కారాన్ని పొందుతాడు. ఇది తెలిసినవాడే వివేకవంతుడు. ‘కోపం, క్రోధం, ఆవేశం, ఆగ్రహం’. ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయపదాలని తెలిసినా, వాటివల్ల వచ్చే అనర్థాన్ని మాత్రం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. కోపం అగ్నితో పోల్చబడింది. అందుకే ‘కోపాగ్ని’ అన్నారు.
బద్దెన చెప్పిన ‘తన కోపమే తన శత్రువు’ అన్న మాట మరిచారా ? కోపం మనిషిని పశువుగా మార్చి విచక్షణా జ్ఞానాన్ని నశింపజేస్తుంది. కోపాన్ని జయించిన వారికి లోకం దాసోహం అంటుంది. ఇది చరిత్ర ప్రసిద్ధం. నిప్పు కల్గిన కట్టె అగ్నిచే దహించబడినట్లు, కోపం కల్గినవాడు నాశనం పొందుతాడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు, అరిషడ్వర్గాలకు బానిసౌతాడు. తద్వారా మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, ఇంటా బయటా హీనంగా చూడబడతాడు.
పురాణాలలో మహనీయులుగా చెప్పబడిన దుర్వాసుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు వంటివారు సైతం కోపిష్ఠులుగా కనబడతారు. హద్దుమీరిన కోపం వ్యాసుణ్ణి కాశీపట్టణ హద్దులను దాటించింది కదా !
చిన్న చిన్న కారణాలు పెద్ద పెద్ద దేశాలను సైతం ఆవేశానికి గురిచేసి, యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ప్రజల జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. గ్రామాల్లో సైతం కోపావేశాలకు గురై వీధి గొడవులతో చంపుకొనేవరకు దారితీస్తున్నాయి.
కోపం అదుపులో ఉంచుకోవడం చిన్ననాటి నుండి అలవర్చుకొని, విద్యాబుద్ధులు నేర్చి కన్నవారికి, ఉన్న ఊరికి కీర్తి ఇనుమడింపజేయాల్సిన బాధ్యత మనందరిది.
ఇట్లు,
తెలంగాణ జనజాగృతి సంఘం.
ప్రశ్న 31.
“రామాయణం మన జీవన పారాయణం” అంశంపై కరపత్రం రాయండి.
జవాబు:
సోదర సోదరీ మణులారా !
మానవ జీవితాన్ని సంస్కరింపగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికి చెరగని కథ. రామాయణాన్ని చదవడమంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణగ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్నందిస్తుంది.
ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కకపోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు.
శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామతత్త్వం. అవకాశం ఉన్నా భర్త వెంట నడవడం సీతతత్త్వం. కష్టాల్లో తోడు నిల్వడం లక్ష్మణతత్త్వం. నమ్మినవారి కోసం తెగించడం ఆంజనేయతత్త్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుతరాలవారికి స్ఫూర్తి కోసం రాయబడిన అద్భుత ఇతిహాసం రామాయణం.
మనిషికి కష్టాలు రావడం సహజం. ఆ సమయంలో కూడా సంయమనం పాటించడం ఎలా అన్నది రాముని పాత్ర చెబుతుంది. నేటి సమాజంలో యువతకు ఓర్పు, నేర్పు తగ్గిపోతున్నాయి. బాధలు ఎదురవ్వగానే భయానికి లోనవ్వడం, చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులకు గురిచెయ్యడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా ప్రాణాలే తీసుకోవడం వంటి మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నారు. రామాయణ, భారతాలు చదవడం ద్వారా మనసు స్థిరంగా ఉండడమే కాక మనం నలుగురికి ఉపయోగపడగలం. లేకపోతే మానసిక నిపుణుల చుట్టూ తిరుగుతూనే ఉండవలసివస్తుంది.
ఇట్లు,
భారతీయ ఇతిహాస పరిరక్షణ మండలి.
ప్రశ్న 32.
‘స్వచ్ఛభారత్ ‘ను ఉద్యమంగా దేశంలో అందరూ పాటించాలని ప్రబోధిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
స్వచ్ఛభారత్ ఉద్యమం
మిత్రులారా ! గత సంవత్సరం మన ప్రధాని మోడీగారు మనదేశాన్ని పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని మన ప్రజలందరికీ పిలుపు ఇచ్చిన విషయము మనకందరికీ విదితమే. ఈ రోజున ముఖ్యంగా నగరాలు, నగర పరిసరాల్లో ప్రవహించే నదులు, మురికివాడలుగా, మురికి కూపాలుగా, మారిపోతున్నాయి.
మనం మన ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన వీధినీ, మన వాడనూ, మన నగరాన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్యాక్టరీలు వదలే రసాయనిక జలాలతో, గంగానది వంటి పవిత్రజలాలు సహితం, కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మనకు త్రాగునీటినీ, సాగునీటినీ అందించే నదీజలాలనూ, కాలువలనూ పరిశుభ్రంగా ఉంచుదాము. నగరాలలో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను పెంచి, తద్వారా పరిశుభ్రమైన గాలిని పీలుద్దాం. ఆరోగ్యవంతులుగా పెరుగుదాం! వైద్య ఖర్చులు తగ్గిద్దాం. అకాల మరణాలను తగ్గిద్దాం.
మన పాఠశాలలన్నిటిలో, మన గ్రామాలన్నిటిలో మరుగుదొడ్లు నిర్మిద్దాం. మనం ఈ యజ్ఞంలో పాల్గొందాం. మన వారందరినీ దీనిలో పాల్గొనమని ప్రభోదిద్దాం. స్వచ్ఛభారతమే, మన ధ్యేయం. మన తల్లిని మనము శుభ్రంగా ఉంచి, మంచి పిల్లలం అనిపించుకుందాం. స్వచ్ఛభారత్ మన దేశాన్ని తీర్చిదిద్దడమే, మనందరి కర్తవ్యం. ఇదే మనం మన తల్లికిచ్చే కానుక. కదలి రండి. ఉద్యమించండి.
తేది : x x x x.
మోడీ యువజన సంఘం,
నల్గొండ.