Reviewing AP Inter 2nd Year Telugu Study Material గద్యభాగం 2nd Lesson తెలుగులో అన్యదేశ్యాలు Questions and Answers Summary can help students prepare confidently for exams.
AP Inter 2nd Year Telugu తెలుగులో అన్యదేశ్యాలు Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
అన్యదేశ్యాలు అంటే ఏమిటి ? తెలుగులో చేరిన మహమ్మదీయ భాషల పదాలను తెలపండి.
జవాబు:
ప్రపంచంలో మాట్లాడే అన్ని ప్రధాన భాషల్లోనూ రెండు రకాల పదాలుంటాయి.
- దేశ్యాలు
- అన్యదేశ్యాలు
దేశ్యాలు : ఒక భాషలో సహజంగా ఆవిర్భవించిన పదాలు దేశ్యాలు. ఉదా : కోట, పేట, గోడ (తెలుగు)
అన్యదేశ్యాలు : ఇతర భాషల నుండి రాజకీయ, వాణిజ్య ఇంకా ఇతర కారణాల వలన ఎరువు తెచ్చుకున్న పదాలన్నీ అన్య దేశ్యాలు. వీటికే ‘ప్రాంతియేతర పదాలు` అని కూడా పేరు. ఆంగ్లంలో (LOAN WORDS) అని అంటారు.
ఉదా : టమాట (పోర్చుగీసు)
పిస్తోలు (ఫ్రెంచి)
తెలుగులో చేరిన మహమ్మదీయ భాషా పదాలు :
ఆంధ్రులకు, మహమ్మదీయులకు 13వ శతాబ్దం కంటే ముందే వ్యాపార సంబంధాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఆ తర్వాత 13వ శతాబ్దం నుండి తెలుగు నేలపై, మహమ్మదీయ సుల్తానుల దండయాత్రలు ఆరంభమయ్యాయి. అప్పటి నుంచి రాజకీయ, మత, సాంఘిక, సాంస్కృతిక, వ్యాపార సంబంధాల వల్ల అనేక పారశీక పదాలు, తెలుగులోకి ప్రవేశించాయి.
విజయనగర రాజుల కాలంలో మహమ్మదీయ సైనికులు, హిందువులతో కలవడం వల్ల అనేక పారశీక పదాలు సైనిక వ్యవస్థలో చేరాయి. రాజ్య పరిపాలనలో ఉన్నత స్థాయి పదవులలో ఉన్నవారు పర్షియన్, అరబిక్ భాషలు కూడా నేర్చుకున్నారు.
![]()
1. రాజకీయ సంబంధ పదాలు
సుల్తాన్ – రాజు
పాదుషా – చక్రవర్తి
ఫర్మానా – రాజాజ్ఞ
కితాబు – బిరుదు
హుజూర – గౌరవనీయులు
2. సైనిక సంబంధ పదాలు
సిపాయి – సైనికుడు
బందూకు – తుపాకి
ఫౌజు – సైనిక దళం, బందోబస్తు (రక్షణ, భద్రత)
ఫిరాయించు -‘ ఒక పక్షం లేదా అభిప్రాయంలో మార్పు
3. సాంఘిక పదజాలం (వ్యవహారికం)
బజారు, దుకాణం, దుప్పటి, దవాఖానా, ఖర్చు, జిల్లా, తాలుకా, కౌలు, కలము, గసగసాలు, ధనియాలు, గుమస్తా, గస్తీ, దగాకోర్ (అబద్ధాలు చెప్పేవాడు), వజీరు (మంత్రి) మొదలైన అనేక పదాలు తెలుగులో ప్రవేశించాయి.
ఉర్దూ పదాలు :
అల్లా ఉద్దీన్ ఖిల్జీ సా.శ 1294 – 1311 మధ్య కాలంలో దక్షిణాదిపై దండయాత్ర చేశాడు. అప్పటి నుంచి ఉర్దూ తెలుగులో కలిసింది. ఉర్దూ అంటే సైనిక గుడారం అని అర్థం. సైనిక శిబిరాలలో వివిధ ప్రాంతాల సైనికులు పరస్పరం మాట్లాడుకునేందుకు ఈ భాషని ఉపయోగించారు. హిందీ వ్యాకరణాన్ని ఈ భాష అనుసరిస్తుంది.
తెలుగులో చేరిన ఉర్దూ పదాలు : కాగితం, కండువా, కౌలు (శిస్తు), కచేరి, కుర్తా, కాతా (ఖాతా), తాకీదు, ఫిర్యాదు, ఖరారు (నిర్ణయం)
ప్రశ్న 2.
తెలుగులో చేరిన యూరోపియన్ భాషల పదాలను తెలపండి.
జవాబు:
భారతదేశంలో మొట్ట మొదట ప్రవేశించి, చిట్ట చివరన మనదేశం నుంచి వెళ్ళిన ఐరోపాజాతి పోర్చుగీసువారు. మనకు 1947, ఆగస్ట్ 15 స్వాతంత్ర్యం లభించినా, 1961 వరకు గోవా, డయ్యూ, డామన్ పోర్చుగీసు వారి అధీనంలోనే ఉన్నాయి. పోర్చుగీసువారు తెలుగువారిని ‘జెంతూ’ అని పిలువగా, తెలుగువారు పోర్చుగీసువారిని, ‘బుడత కీచులు’ అని పిలిచేవారు. పోర్చుగీసులకు చెట్లు, మొక్కలు, పండ్లు అంటే ఎంతో ఇష్టం.
తెలుగులో చేరిన పోర్చుగీసు పదాలు :
క్రీస్తు గోదాము అల్మరా సబ్బు టమోట
ఇస్త్రీ గిడ్డంగి బాతు బిస్కత్తు
మేస్త్రీ తువ్వాలు బాల్చి (నీటిని నిలువ చేసే లోహపు పాత్ర)
తెలుగులో చేరిన డచ్ పదాలు : తెలుగువారు డచ్ వారిని ‘వళిందులు’ అని పిలిచేవారు. తెలుగునేల మీద విశాఖ సమీపంలోని భీమునిపట్నం రేవు వీరికి ప్రధాన నౌకా స్థావరం. డచ్ వారిది హాలెండ్ (నెదర్లాండ్) మాతృదేశం. డచ్ పదాలకు ఉదాహరణలు చూద్దాం. కళావర్, బత్తాయి, ఆసు, ఇస్పేటు (పేకాటలో ఉపయోగిస్తారు) పంపరమాస (పంపరపనస ఒక పండు)
ఫ్రెంచి పదాలు : ఫ్రాన్స్ (ఫ్రెంచ్) వారు 1664లో మనదేశంలో వ్యాపారం ప్రారంభించారు. ఆంధ్రదేశంలో మచిలీపట్నంలో వీరు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. తెలుగువారు ఫ్రెంచి వారిని ‘ఫరంగులు’ అని పిలిచేవారు. పాండిచ్చేరి, యానాం ప్రాంతాలు వీరికి ప్రధాన కాలనీలు. బీరువా, మేడమ్, ఫిరంగి, సోల్జారు (సైనికుడు), పిస్తోలు(తుపాకి), కమాను (తోరణం లేదా ఆర్చి) మొదలైన పదాలు తెలుగులో చేరిన ఫ్రెంచ్ పదాలు.
తెలుగులో చేరిన ఆంగ్ల పదాలు :
ఆంగ్లేయులు (బ్రిటిష్) వారు 1608వ సం॥లో వర్తకం కొరకు మనదేశంలో ప్రవేశించారు. వీరు ఈస్టిండియా కంపెనీని స్థాపించి, సుదీర్ఘకాలం దాదాపు 400 సం||రాల పాటు పాలన సాగించారు. అందువలన తెలుగుపై ఆంగ్ల భాష ప్రభావం ఎక్కువ. తెలుగులో అధిక భాగం ఆంగ్ల పదాలు చేరడాన్ని గమనించవచ్చు.
బస్ (బస్సు), కోర్టు (కోర్ట్/న్యాయస్థానం), లాయర్ (న్యాయవాది)
డ్యూటీ (పని), రేడియో (ఆకాశవాణి), కార్ (కారు)
పెన్ (పెన్ను), కాలేజ్ (కాలేజి – కళాశాల) లైటు, గవర్నమెంట్ (ఫైల్)
ఇలా చాలా ఉదాహరణలు చూపవచ్చు.
II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆదాన ప్రదానాలకు ముఖ్య కారణాలను తెలపండి.
జవాబు:
ఒక భాషలో ఏదైనా వస్తువును, భావాన్ని సూచించేందుకు అనుకూలమైన పదం లేకపోతే, దగ్గరి సంబంధం కల పదాన్ని ఇతర భాషల నుండి గ్రహిస్తారు. అందువలన భాషలో కొత్తపదాలు చేరతాయి. ఇలా కొత్త పదాలు చేరడం లేదా కొత్తపదాలను ఇవ్వడం ఆదాన, ప్రదానాలకు ప్రధానకారణం.
ఆదానం : ఒక భాష ఇతర భాషల నుంచి పదాలను స్వీకరించడం. ప్రదానం : ఒక భాష, ఇతర భాషలకు తన పదజాలాన్ని ఇవ్వడం. ఆదాన ప్రదానాలకు రెండు ముఖ్య కారణాలున్నాయి.
1. ఆవశ్యకతా పూరణం : ఒక భాష మాట్లాడే వారికి ఒక కొత్త పదం లేదా భావంతో పరిచయం ఏర్పడితే, దాన్ని సూచించే పదాన్ని గ్రహించడాన్ని ‘ఆవశ్యకతా పూరణం’ అని అంటారని చార్లెస్ హాకెట్ తెలిపారు. ఉదా : తిక్కన భారతంలో ‘త్రాసు’ అనే పదాన్ని వాడారు. త్రాసు అనే పదం తరాజు అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. త్రాసు అంటే తక్కెడ అని మామూలు అర్థం.
2. ప్రతిష్ఠా పూరణం : ఒక భాషలో తగినంత పదజాలం ఉన్నప్పటికీ ఇతర భాషా ప్రయోగం గౌరవప్రదమనే భావంతో ఇతర భాషల పదాలను ఉపయోగించడాన్నే ప్రతిష్ఠా పూరణం లేదా గౌరవార్థ పదాలు అని అంటారు.
ఉదా : ఆడపిల్ల పెద్ద మనిషి అయినదని చెప్పడానికి పుష్పవతి లేదా రజస్వల అయినదని చెప్పడం. (పుష్పవతి, రజస్వల సంస్కృత పదాలు).
![]()
ప్రశ్న 2.
తెలుగులో చేరిన ఒరియా భాషా పదాలను వ్రాయండి.
జవాబు:
తెలుగులో ఒరియా పదాలు చేరడానికి ప్రధాన కారణం, ఉత్తరాంధ్ర ప్రాంతం, ఒరిస్సా రాష్ట్రానికి దగ్గరగా ఉంటుంది. సమీప ప్రాంతాల భాషా ప్రభావం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలలో ఒరియా పదాలు, తెలుగులో ప్రవేశించాయి.
కంబారి – సేవకుడు
బేపి – కుక్క
పన్నె – దువ్వెన
పెయ్యి – దూడ
బుగత – యజమాని
కొసరు – అదనం
భోగట్టా – విషయం
గాబు – కలుపు
గూబ – చెవి దగ్గరి చెంప భాగం
మహంతు – గొప్ప, ధర్మకర్త
ప్రశ్న3.
తెలుగులో చేరిన తమిళ పదాలు తెలపండి.
జవాబు:
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులు – తమిళులు కలిసి ఉండేవారు. తెలుగు నేలతో మద్రాసుకి అనుబంధం ఎక్కువ. ఒకప్పుడు మద్రాసులో తెలుగువారే ఎక్కువ. ఇప్పటికీ మద్రాసు (చెన్నై)లో తెలుగువారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తమిళనాడు సమీపంలోనే ఉంటుంది.
తెలుగులో చేరిన తమిళ పదాలు :
వడ – సాంబారు – కరివేపాకు – ఇడ్లీ
దోసె – తంబి (తమ్ముడు) సాపాటు (భోజనం) – ఉప్మా
అరంగేట్రం (ప్రారంభం) – ఊంజల (ఉయ్యాల)
అడంగలు (భూమి వివరాలు నమోదు చేసే పుస్తకం) మొదలైన పదాలను గమనించవచ్చు.
ప్రశ్న 4.
తెలుగులో చేరిన కన్నడ పదాలు తెలపండి.
జవాబు:
తెలుగు – కన్నడ భాషలు ఒకే కుటుంబానికి చెందిన భాషలు. ఇవన్నీ ద్రావిడ భాషలలో భాగం. తెలుగు – కన్నడ సాహిత్యాలకు మంచి అవినాభావ సంబంధం ఉంది. ‘నిడదవోలు వెంకటరావు’ అనే పరిశోధకులు ఇలా అన్నారు.
తెలుగు – కన్నడ భాషలు ఒకే నదికి రెండు పాయలుగా, ఒకే కొమ్మకు రెండు పూవులుగా, ఒకే తల్లికి పుట్టిన కవలలుగా కన్పిస్తాయని అన్నారు. అలాగే అనంతపురం, కన్నడ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది.
పదాలు :
హెచ్చు – బాడుగ (అద్దె) – సాకు – నంగనాచి
హంగు – పుంటికూర (గోంగూర) – బాలేపండు (అరటిపండు)
అప్ప (నాన్న) – గండపెండేరం – హోరాహోరి – హేమాహేమీలు మొదలైనవి.
ప్రశ్న 5.
తెలుగులో చేరిన మరాఠీ పదాలు తెలపండి.
జవాబు:
మహారాష్ట్రలో మరాఠీ భాష వాడుకభాష. ఇది తెలంగాణ ప్రాంతానికి సరిహద్దు. అందువల్ల అక్కడ కొన్ని ప్రాంతాలలో మరాఠీ భాష ప్రభావం కనిపిస్తుంది.
మరాఠీ పదాలు : దస్తూరి (చేతిరాత), ఆసరా (దన్ను), కిచిడి, వేడుక, గమ్మత్తు, విడిది, పరాకు, పీట, డేరా, లూటీ, కిరాయి మొదలైన పదాలు తెలుగులోకి వచ్చి చేరాయి.
III. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
తెలుగులో చేరిన మొదటి అన్యదేశ్యం ఏది ?
జవాబు:
తెలుగులో చేరిన మొదటి అన్యదేశ్యం త్రాసు. ఇది తిక్కన వాడారు. పర్షియన్ భాషా పదం ‘తరాజు’ నుండి వచ్చింది.
ప్రశ్న 2.
‘బాతు’ అనేది ఏ భాష నుంచి తెలుగు భాషలోకి చేరింది ?
జవాబు:
‘బాతు’ పోర్చుగీసు భాష నుండి తెలుగు భాషలోకి చేరింది.
ప్రశ్న 3.
ఆంధ్రదేశంలో డచావారి ప్రధాన నౌకా స్థావరమేది ?
జవాబు:
విశాఖపట్నం సమీపాన ఉన్న భీమునిపట్నం రేవు డచ్వారి ప్రధాన నౌకా స్థావరం.
ప్రశ్న 4.
తెలుగు భాషా సాహిత్యాలపై అధిక ప్రభావం చూపించిన భాష ఏది ?
జవాబు:
తెలుగు భాషా సాహిత్యాలపై ‘ఆంగ్ల భాష’ అధిక ప్రభావం చూపింది.
![]()
ప్రశ్న 5.
‘సాపాటు’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
సాపాటు అనగా భోజనం అని అర్థం. ఇది తమిళపదం.
ప్రశ్న 6.
‘అడంగలు’ అనే పదం ఏ భాషకు చెందినది ?
జవాబు:
‘అడంగలు’ తమిళభాషకు చెందిన పదం.
ప్రశ్న 7.
దేశ్యాలు అంటే ఏమిటి ?
జవాబు:
ఒక భాషలో సహజంగా ఆవిర్భవించిన పదాలు దేశ్యాలు. ఉదా : కోట, గోడ, పేట మొదలైనవి.
ప్రశ్న 8.
బౌద్ధ, జైన మతాల ద్వారా ఆంధ్రదేశమంతటా విస్తరించిన భాష ఏది ?
జవాబు:
‘ప్రాకృతం’ బౌద్ధ, జైన మతాల ద్వారా ఆంధ్రదేశంలో విస్తరించిన భాష.
తెలుగులో అన్యదేశ్యాలు Summary in Telugu
రచయితల పరిచయం
ఈ పాఠ్యాంశాన్ని ఆచార్య గంటి జోగిసోమయాజులు, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య కె. వీరభద్రరావు, డాక్టర్ వి. స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ వెల్చాల కొండలరావు మొదలైన వారి రచనల నుండి గ్రహించారు.
పాఠ్యభాగ నేపథ్యం
మనుషులు తమ మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఉపయోగపడే ప్రధాన సాధనం భాష. నిత్య జీవితంలో మనం వాడే పదాలన్నీ ఒకే భాషకు చెందినవి కావు. మారుతున్న కాలంతో పాటు చదువు, ఉద్యోగం, వ్యాపారం మరియు ప్రయాణాల వల్ల వివిధ ప్రాంతాల ప్రజలతో మనకు సంబంధాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో ఒక భాషలోని పదాలు మరో భాషలోకి వచ్చి చేరడం సహజం.
రాజకీయ, సామాజిక, మతపరమైన కారణాల వల్ల కూడా పరభాషా పదాలు మన భాషలో కలిసిపోయి వాడుకలోకి వస్తాయి. ఇలా కొత్త పదాలను స్వీకరించడం వల్ల భాష సమృద్ధి చెందడమే కాకుండా, మానవ విజ్ఞానం పెరిగి సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతి సాధించడానికి వీలవుతుంది. మనభాషలోని ‘అన్యదేశ్యాలు’ (ఇతర భాషా పదాలు) వెనుక ఉన్న ఇటువంటి భాషా పరిణామాన్ని పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ నేపథ్యం.
పాఠ్యభాగ ఉద్దేశ్యం
చారిత్రక కారణాల వల్ల తెలుగుభాషపై ఇతర సంస్కృతుల ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా మహమ్మదీయుల పాలన, ఐరోపా వాసుల రాక, వ్యాపార సంబంధాలు మరియు విజయనగర రాజుల వంటి మన తెలుగు చక్రవర్తుల పాలనా కాలంలో ఇతర ప్రాంతాలతో ఏర్పడిన పరిచయాలు తెలుగుభాషలో ఎన్నో మార్పులకు దారి తీశాయి. ఈ ప్రభావం వల్ల ఇతర భాషల నుండి మన తెలుగులోకి వచ్చి చేరిన ‘అన్య దేశ్యాలు’ (పరభాషా పదాలు) గురించి విద్యార్థులకు వివరించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
కఠిన పదాలకు అర్థాలు
58వ పేజి :
మానవులు = మనుషులు
వికాసము = ప్రగతి, పెరుగుదల
పరిణామం = మార్పు
క్రమం = వరుస
సమస్తం = మొత్తం
జీవకోటి = జీవుల సమూహం
ఆవిర్భావం = పుట్టుక
దేశ్యాలు = ఒక భాషలో ఉండే సహజమైన పదాలు
అన్యదేశ్యాలు = ఇతర భాషల నుండి తెచ్చుకున్న పదాలు (LOAN WORDS)
ఆదానం = భాషలో కొత్త పదాలను ఒక భాష నుంచి స్వీకరించడం (Borrowing)
ప్రదానం = ఇతర భాషలకు, ఒక భాష పదాలను ఇవ్వడం (Lending)
ప్రపంచం = లోక౦
త్రాసు = తక్కెడ
రజస్వల = ఆడపిల్ల పెద్ద మనిషి కావడం (పుష్పవతి)
ప్రాచీనదశ = పూర్వకాలం
తత్సమం = ప్రకృతులు
తద్భవాలు = వికృతులు
వ్యావహారికం = వాడుక
60వ పేజి :
దండయాత్ర = చొరబాట్లు
వాణిజ్యం = వ్యాపారం
స్వర్ణయుగం = బంగారు కాలం
ఉన్నత = గొప్ప, పెద్ద
కావ్యాలు = రచనలు
జోహారు = నమస్కారం
ఉర్దూ = సైనిక గుడారం
శిబిరం = సముహం
![]()
61వ పేజి :
అధీనం = లోబడి ఉండుట, వశం
నౌకాస్థావరం = ఓడరేవు
సమీపం = దగ్గరలో
వర్తకం = = వ్యాపారం
స్థావరం = చోటు, ప్రదేశం
అంతం = = కనిపించకుండా పోవడం, ముగిసిపోవడం
62వ పేజి :
సరిహద్దు = ఎల్ల
గణనీయం = లెక్కించదగిన
అవినాభావ = పరస్పర
పాయలు = చీలికలు, ప్రవాహం
కవలలు = అమడలు (Twins)