TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 4th Lesson మౌర్య సామ్రాజ్యం – అవతరణ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 4th Lesson మౌర్య సామ్రాజ్యం – అవతరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలెగ్జాండర్ దండయాత్ర’ కారణాలు, క్రమం, ఫలితాలను వివరించండి.
జవాబు.
క్రీ.పూ. 4వ శతాబ్దిలో ప్రపంచాధిపత్యం కోసం పర్షియన్ల, గ్రీకుల మధ్య పోరాటం మొదలైంది. అలెగ్జాండర్ గ్రీకు రాజ్యాలలోని మాసిడోనియా పాలకుడు. తమ గ్రీకు సంస్కృతిని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని, ప్రపంచ పర్షియన్ల విజేత కావాలని తన దండయాత్రను ప్రారంభించాడు. ఇదే సమయంలో పర్షియన్ల సామ్రాజ్యం క్షీణదశ ప్రారంభమైంది. ఈ సదవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు అలెగ్జాండర్. ఇతడు ఈ ఈజిప్టు, సిరియా ప్రాంతాలను జయించిన తరువాత పర్షియా రాజ్యంపై దండెత్తి పర్షియన్ చక్రవర్తియైన మూడవ డేరియస్ను అరబ్ యుద్ధంలో ఓడించి, వాటిని తన రాజ్యాంలో కలుపుకొన్నాడు. ఆ తరువాత క్రీ.పూ. 327వ సంవత్సరంలో అప్పటి వరకు పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటున్న భారతదేశ వాయువ్య ప్రాంతాల ఆక్రమణకు అలెగ్జాండర్ తన సైన్యంతో బయలుదేరాడు.

దండయాత్ర క్రమం:భారతదేశ వాయువ్య ప్రాంతంలో నెలకొన్న అప్పటి పరిస్థితులు అలెగ్జాండర్ దండయాత్రకు అనుకూలంగా మారాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న చిన్న చిన్న రాజ్యాలు తమ మధ్య పోట్లాటలతో సరిహద్దు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రాంతంలో అప్పట్లో కొన్ని రాచరిక రాజ్యాలు మరికొన్ని ఆటవిక రిపబ్లిక్స్ నెలకొని ఉన్నాయి. వాటిలో తక్షశిల రాజు, అంబి – దాని సరిహద్దుల్లో ఉన్న రాజ్యాధిపతి పురుషోత్తముడు మధ్య పరస్పర శత్రుత్వం నెలకొని ఉంది. అందువల్ల అంబిరాజు తన రాయబారిని విలువైన వస్తువులతో ‘బోకారాలో ఉన్న అలెగ్జాండర్ దగ్గరకు పంపిస్తూ, అతన్ని భారతదేశంపై దండయాత్ర చేయాలని ఆహ్వానించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

అలెగ్జాండర్ గాంధార రాష్ట్రం గుండా సింధూ నదిని, పంజాబును దాటుతూ బియాస్ నది వరకు చేరుకున్నాడు. తక్షశిల రాజు అంబి అలెగ్జాండర్కు లొంగిపోయాడు. అబిసార రాజ్య రాజు కూడా అతనికి సహకరించాడు. కాని పురుషోత్తముడు, పౌరవ రాజ్యాధిపతి తన స్వతంత్ర్యాన్ని రక్షించుకోవడానికి అలెగ్జాండర్తో యుద్ధానికి తలపడ్డాడు. ఈ యుద్ధం.క్రీ.పూ. 326లో జీలం నది ఒడ్డున ఇరువురి మధ్య జరిగింది. దీనిలో పురుషోత్తముడు ఓడినప్పటికి, అతని ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు ముగ్ధుడైన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చివేశాడు. ఆ తరువాత అతని సైన్యం సహకరించకపోవుటచే వెనుకకు మరిలాడు. కాని ఈ ప్రాంతంలోని ఆటవిక రాజ్యాలతో యుద్ధం చేసే సమయంలో గాయపడి, తద్వారా మార్గ మధ్యలోనే బాబిలోనియాలో మరణించాడు.

దండయాత్ర ఫలితాలు:ఈ దండయాత్ర ఫలితంగా భారతదేశ, ఐరోపా రాజ్యాల మధ్య సంబంధాలు పెంపొందసాగాయి. అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రాంత ప్రజలలో గ్రీకు వ్యతిరేక భావం నెలకొంది. ఈ ప్రాంత విభజనలో గ్రీకు గవర్నర్ల మధ్య తగాదాలు మొదలైనాయి. ఈ పరిస్థితులలో క్రీ.పూ. 321లో చంద్రగుప్తుడు అనే మౌర్య వంశ రాజు పంజాబు, సింధూ రాష్ట్రాలను ఆక్రమించి గ్రీకు పాలనను అంతమొందించాడు. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశ వాయువ్య ప్రాంతాలలో ఉన్న చిన్న, చిన్న రాజ్యాలు కలపబడి, రాజకీయ ఐక్యత సాధనలో మౌర్య చంద్రగుప్తునికి మార్గం సుగమనం చేసింది.

గ్రీకు దండయాత్ర వల్ల భారతదేశానికి, గ్రీసు దేశానికి మధ్య రాకపోక సౌకర్యాలు పెంపొందించాయి. గ్రీకు పాలనలో ఏర్పడిన బాక్టీరియా, ఇతర రాష్ట్రాలు గ్రీకు సంస్కృతిని వ్యాప్తి జేయుటకు ఉపకరించాయి. ఈ దండయాత్ర. వల్ల ఈ రెండు రాజ్యాల మధ్య నాలుగు రవాణా మార్గాలు వృద్ధి చెంది, వర్తక వాణిజ్యానికి తోడ్పడింది. గ్రీకు పద్ధతిలో నాణేల ముద్రణ, గ్రీకుల ఖగోళ శాస్త్రం, గ్రీకుల శిల్పకళ పద్ధతులు భారతదేశంలోకి వచ్చి చేరాయి. ప్రత్యేకంగా గ్రీకుల రచనలు ఆ కాలం నాటి భారతదేశ చరిత్ర రచనకు ఉపకరిస్తుంది. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశ చరిత్ర కాలమాన పట్టికను స్థిరీకరించడానికి ఉపకరిస్తుంది. గ్రీకులు కూడా భారతదేశీయుల నుంచి వారి విజ్ఞానశాస్త్రం, కళలు, తత్త్వశాస్త్రం, గణితం, వైద్యశాస్త్రాల గొప్పదనాన్ని తెలుసుకున్నారు.

ప్రశ్న 2.
అశోకుని గొప్పతనాన్ని వివరించండి.
జవాబు.
భారతదేశంలోని చక్రవర్తులలోనే కాక మొత్తం ప్రపంచంలోని చక్రవర్తులలో కూడా ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు.
తొలి జీవితం:అశోకుడు బిందుసారుని కుమారుడు. తండ్రి మరణానంతరం క్రీ.పూ. 273లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. తనకున్న 99 మంది సోదరులతో సింహాసనం కోసం కలహం రాగా వారిని వధించి రాజయ్యాడని బౌద్ధ సాహిత్యం పేర్కొన్నప్పటికి, ఒక శిలాశాసనంలో తన సోదరులు, బంధువుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను పేర్కొనడంతో ఆ కథను నిజంకాదని విశ్వసించవచ్చు.

అశోకుని చరిత్రకు ఆధారాలు:దేశం నలుమూలలా వేయించిన శిలాశాసనాలు, బౌద్ధమత గ్రంథాలైన ‘మహావంశ’, ‘దివ్యావదాన’ అనే గ్రంథాలలో విస్తారంగా సమాచారం లభిస్తోంది. అశోకుడు తనను తాను ‘దేవానాంప్రియ’, ‘ప్రియదర్శి’ అని చాటుకున్నాడు.

కళింగ యుద్ధం:అశోకుడు క్రీ.పూ. 261లో, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో కళింగపై దండెత్తాడు. ఆ యుద్ధంలో లక్ష మందికి పైగా చనిపోయినట్లు, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడ్డట్లు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. కానీ ఈ యుద్ధం అశోకుని యుద్ధ విముఖతను పెంచింది. ఇకముందు యుద్ధాలు చేయనని, ధర్మప్రచారం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని నిశ్చయించుకొన్నాడు.

బౌద్ధమత వ్యాప్తి:ఉపగుప్తుడనే బౌద్ధాచార్యుని వద్ద బౌద్ధమత దీక్షను తీసుకున్నాడు. తరువాత దేశ, విదేశాలలో బౌద్ధధర్మ ప్రచారం కోసం సంఘాలు ఏర్పాటు చేశాడు. బౌద్ధ ధర్మసూత్రాలు శాసనాల రూపంలో ప్రచారం చేశాడు. జంతుబలులు, వేట, మాంసాహార వంటకాలు నిషేధించాడు. పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. తన జీవితాన్ని బౌద్ధధర్మ ప్రచారం కోసం అంకితం చేశాడు.

అశోకుని ధర్మం:అశోకుని ఆలోచనలు, ఆశయాలు ఆయన ప్రవచించిన ధర్మంలో కనిపిస్తాయి. ఈ ధర్మ సూత్రాలలో ప్రధానమైనవి:జీవహింస చేయరాదు. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి. సర్వప్రాణుల పట్ల కరుణ, జాలి చూపాలి. బానిసలు, సేవకుల పట్ల దయగా ఉండాలి. ఇట్టి చర్యలతో నైతిక విలువలు పెంచుకోవాలి.

పాలనా విధానం:పరిపాలనలో వికేంద్రీకరణ ప్రవేశపెట్టాడు. న్యాయ విచారణలో ఆలస్యాన్ని తొలగించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో జయించి యుద్ధరంగాన్ని వదిలివేసిన ఏకైక చక్రవర్తిగా అశోకుడు మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

ప్రశ్న 3.
మౌర్యుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, సంస్కృతిక పరిస్థితుల గురించి రాయండి.
జవాబు.
మౌర్యుల కాలము నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొనుటకు మెగస్తనీసు ఇండికా, కౌటిల్యుని అర్థశాస్త్రము, గ్రీకు బౌద్ధ రచనలు, అశోకుని శాసనములు ము॥నవి ముఖ్య ఆధారములు.

సాంఘిక పరిస్థితులు :
1. వర్ణవ్యవస్థ:మౌర్య యుగమునాటి సమాజమున వర్ణవ్యవస్థ బాగుగ పాతుకొనియున్నది. మెగస్తనీసు చెప్పిన ఏడు కులములను బట్టి బ్రాహ్మణులు, వ్యవసాయదారులు, పశుపాలకులు, సైనికులు మొ||గు వారి వృత్తులే కులములుగా .. రూపొందినట్లు తెలియుచున్నది. కాని అర్ధశాస్త్రము నాడు నాలుగు ప్రధాన వర్ణముల కలవని, వర్ణవ్యవస్థ తొలిరోజులలో క్లిష్టతరముగా నున్నదని చెప్పవచ్చును. అగ్రవర్ణములవారు ఆశ్రమధర్మమును పాటించెడివారు. ఉదా|| క్షత్రియుడైన చంద్రగుప్త మౌర్యుడు – రాజత్యాగము చేయుట, వానప్రస్థాశ్రమమునకు నిదర్శనము. సంఘములో బ్రాహ్మణులకు అధిక గౌరవము కలదు. వారు ప్రభుత్వమునకు ఎట్టి పన్ను చెల్లించనవసరము లేదు. అశోకుని బౌద్ధమతాదరణ వలన బ్రాహ్మణుల స్థితిగతులు తారుమారై, వారు పుష్యమిత్ర శుంగుని నాయకత్వములో తిరుగుబాటు చేయుటకు సంసిద్ధులైనారని కొందరి చరిత్రకారుల అభిప్రాయము.

2. బానిసత్వము:భారతదేశమున బానిసలే లేరని మెగస్తనీసు వ్రాసినను, బానిసత్వమున్నట్లు రూఢిగా తెలియుచున్నది. బానిసలు దయతో చూడబడెడివారు.

3. స్త్రీలు:స్త్రీకి సంఘమున తగు స్వాతంత్ర్యము కలదు. కొందరు స్త్రీలు వేదాంతము నభ్యసించిరి. పరదా పద్ధతిలేదు. వితంతు వివాహములు నిషేధింపబడలేదు. విడాకులిచ్చు ఆచారము కలదు. సతీసహగమనమున్నట్లు గ్రీకు రచనల వలన తెలియుచున్నది. బహుభార్యత్వము, కన్యాశుల్కము, కన్యావిక్రయమునాడున్నట్లు మెగస్తనీసు రచనల వలన తెలియుచున్నది. స్త్రీలలో అనేక మూఢవిశ్వాసమున్నట్లు అశోకుని శాసనములు పేర్కొని, వానిని ఖండించెను. వీటన్నింటికంటే ఈ యుగమునకు ముఖ్య విశేషము ప్రభుత్వము గణికావృత్తిని (వేశ్యవృత్తి) గుర్తించుట. ఈ శాఖకు గణితాధ్యక్షుడను ఉద్యోగికూడా గలడు. మౌర్య చక్రవర్తులు అందమైన వేశ్యలను పోషించి, వారినే గూఢచారిణులుగా నియమించెడివారు.

4. నైతిక ప్రవర్తనము:భారతీయులు నీతి, నిజాయితీకి పేరు మోసినవారని మెగస్తనీసు కొనియాడెను. డబ్బులిచ్చి పుచ్చుకొనుటలో ఎట్టి పత్రములు ఉపయోగించెడివారు కాదు. ఆడినమాటను తప్పరు. యజ్ఞయాగాది క్రతువులందు తప్ప తాగరు. వీరు పొదుపుగా, నిరాడంబరముగా ఉన్నప్పటికి ఉల్లాసవంతమైన జీవితమును గడిపెడివారు. చదరంగము, పాచికలాటలాడుట వారి వినోదములు. సమాజ ఉత్సవములందు ముష్టియుద్ధములు, కత్తి యుద్ధములు, రథ పందెములు జరుగుచుండెడివి.

ఆర్థిక పరిస్థితులు :
1. వ్యవసాయము:అనేక రకముల పట్టణములు వెలసినను, గ్రామమే ఆర్థికవ్యవస్థకు కీలకము. ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయము. వ్యవసాయాభివృద్ధికి మౌర్యులు కడు శ్రద్ధ వహించిరి. ఉదా॥ మౌర్య చంద్రగుప్తుని కాలమున కథియవాడ్లోని గిర్నార్ వద్ద సుదర్శన తటాకము త్రవ్వబడినది. రైతులు కష్టజీవులు, పొదుపరులు, తెలివిగలవారు, నీతివర్తనులు, రైతుల సంక్షేమమును పెంపొందించుటకు మౌర్యులు ప్రత్యేక ఉద్యోగులను . నియమించెడివారు. ఉదా॥ కోశాధ్యక్షులు, అటవి శాఖాధ్యక్షులు మున్నగు ఉద్యోగులను నియమించెడివారు.

2. పరిశ్రమలు:వ్యవసాయముగాక గనుల త్రవ్వకము, నేత, వ్యవసాయ సాధనముల ఉత్పత్తి, నౌకానిర్మాణము, మత్తుపానీయములు, యుద్ధ పరికరములు తయారీ మున్నగు పరిశ్రమలు కూడా ఆర్థికాభివృద్ధి దోహదము చేసెను. ఇట్లు తయారైన వస్తువులను తనిఖీచేయుటకే పాటలీపుత్ర నగరపాలనలో ఒక సంఘము ఏర్పాటు చేయబడెను.

3. వాణిజ్యము:మౌర్యయుగమున దేశీయ, విదేశీయ వాణిజ్యము ముమ్మరముగా సాగెను. రహదారులు, నదులు, కాలువలు, నాటి రవాణామార్గములు. దేశములోని ప్రముఖ పట్టణముల నుంచి పాటలీపుత్రమునకు రహదారులు కలవు. ఉత్తర దక్షిణ హిందూదేశముల మధ్య వాణిజ్యములు బాగుగా సాగెను. ఉత్తరదేశము నుండి ఉన్ని బట్టలు, కంబళ్ళు, గుఱ్ఱములు, దక్షిణ దేశవాసులు దిగుమతి చేసికొని; వాటికి బదులు వజ్రములు, ముత్యములు, నూలుబట్టలు ఉత్తరదేశీయులకు ఎగుమతి చేసెడివారని అర్థశాస్త్రము వలన తెలియుచున్నది. భారతదేశమునకు ఈజిప్టు, సిరియా బాక్ట్రియా మున్నగు విదేశములతో రాజ్యసంబంధములు కలవు. విదేశముల నుండి మత్తు పానీయము, అత్తిపండ్లను దిగుమతి చేసుకొనెడివారు. విదేశీ వాణిజ్యము జరుపు కొనుటకు ప్రభుత్వము అనుమతి పత్రములను మంజూరు చేసెడిది. వర్తకులు శ్రేణులుగా ఏర్పడి వాణిజ్యము సాగించెడివారు. ఈ శ్రేణులే బ్యాంకులుగా వ్యవహరించి, నిధులను సమకూర్చి దానిపై 15% వడ్డీ ఇచ్చెడివి. ఈ యుగమున అసంఖ్యాకమైన బంగారు, వెండి, రాగి చిల్లు నాణెములు వాడుకలో నున్నవి.

సాంస్కృతిక పరిస్థితులు :
మౌర్యుల కాలంలో విజ్ఞాన సాంస్కృతికాభివృద్ధి జరగడానికి రాజకీయ సమైక్యత, ఆర్థిక సమృద్ధి, విదేశీ దాడుల భయం లేకపోవడం మొ॥ కారణాలు దోహదంచేశాయి.
సాహిత్యం:విద్యాసారస్వతాలు చక్కని ఆదరణను పొందాయి. రాజకీయ, ఆర్థిక విషయాలలో ప్రామాణిక గ్రంథముగా భావించబడే ‘అర్థశాస్త్రం’ ఈ కాలంలో చంద్ర గుప్తుని ప్రధాన సలహాదారుడైన కౌటిల్యుని చేత వ్రాయబడింది. పలు విజ్ఞాన శాఖలు అధ్యయనం చేయబడి గొప్పగా అభివృద్ధి చెందినట్లు, ఆ గ్రంథ విజ్ఞాన సర్వస్వ పరిధి సూచిస్తుంది. నాడు ప్రసిద్ధ విద్యాకేంద్రంగా విలసిల్లిన తక్షశిలలో విశ్వవిద్యాలయ ముండేది. అందున్న అధ్యయన విషయాలలో ఇతిహాసాలు, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, తత్త్వశాస్త్రం మున్నగునవి విశేషాదరణ పొందినవి. బౌద్ధమతతత్త్వశాస్త్రం కూడా విశేష జనాదరణ, విస్తరణ పొందింది. అశోకుని పాలనా కాలంలో జరిగిన మూడవ బౌద్ధ సంగీత పాటలీపుత్రంలో మొగాలిపుత్తతిస్స అధ్యక్షతన జరిగింది. ఇందు అతడు ఆనాటి నాస్తిక సిద్ధాంతాలను ఖండిస్తూ ‘కథావత్తు’ అనే ప్రామాణిక గ్రంథమును సంకలనం చేశాడు. ‘అభిదమ్మ పీఠిక’ కూడా ఈ సభయందే ఆవిష్కరింపబడి, ఆనాటి న్యాయ గ్రంథాలకు జోడింపబడింది. జైన వాజ్ఞ్మయం కూడా పరిష్కరింపబడి, విస్తరించింది. భద్రబాహు ‘కల్పసూత్రమ’నే గ్రంథాన్ని రాసింది ఈ కాలంలోనే. ప్రాకృతం రాజభాషగా మారింది. అశోకుని శిలాశాసనాలను బట్టి, అందలి లిపి పరిణామమును బట్టి బ్రహ్మ లిపి రచనా కౌశలాని ఉన్నతస్థాయికి చెందిన అభివృద్ధి సాధించినట్లు తెలియుచున్నది.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 4.
మౌర్యుల పరిపాలన ముఖ్య లక్షణాలను గురించి రాయండి.
జవాబు.
మౌర్య సామ్రాజ్య పరిపాలనకు సంబంధించిన విషయాలకు కౌటిల్యుని అర్థశాస్త్రమే ప్రాతిపదిక. భారతదేశంలో తొలిసారిగా సశాస్త్రీయ పద్ధతిలో పరిపాలనా విధానం ఏర్పాటు చేసింది మౌర్యులే. అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాలు వీరి పాలనకు ప్రధానాధారాలు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు మంచి పరిపాలనా దక్షుడు. పాలనా విషయాలలో కౌటిల్యుని సహాయం పొందాడు. ఇతని వారసులు కూడా దీన్ని ఏ మార్పు లేకుండా
అనుసరించారు.

కేంద్ర ప్రభుత్వ పాలన :

రాజు:రాజ్యంలో రాజు అత్యున్నత అధికారి. అతడికి అపరిమిత అధికారాలు కలవు. అతడే ఉన్నత కార్యనిర్వహణాధికారి, సర్వసైన్యాధికారి, న్యాయాధికారి. రాజ్య వ్యవహారాలలో మంత్రి పరిషత్ సలహాలు తీసుకునేవాడు. ప్రజాసంక్షేమం కోసం పగలు, రాత్రి కృషి చేసేవారు. “ప్రజల సుఖమే తన సుఖంగా, వారి కష్టాలే తన కష్టాలుగా చక్రవర్తి భావించాలి”. అని కౌటిల్యుడు చెప్పడాన్ని బట్టి చక్రవర్తి నియంతగా ఉండకపోవచ్చని భావించవచ్చు. అశోకుడి శిలాశాసనంలో ‘ప్రజలందరు నా బిడ్డలు’ అనేది ఈ విషయాన్నే చాటుతోంది.

మంత్రి పరిషత్:మంత్రి పరిషత్ రాజు శకటంలో ఒక చక్రంలాంటిది. వీరిని రాజే నియమిస్తాడు. పరిషత్లో ప్రధాన మంత్రి, ఇతర శాఖామంత్రులు, పురోహితుడు, సేనాపతి, యువరాజు ముఖ్యులు. ప్రజాసంక్షేమం దృష్ట్యా మంత్రి పరిషత్ సలహాలు చక్రవర్తి పాటించేవాడు.

రాష్ట్ర ప్రభుత్వ పాలన:చంద్రగుప్తుని రాజ్యం విశాలమైనందున పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. అవి 1) ప్రాచ్య 2) ఉత్తరాపథం 3) అవంతీ పథం, 4) దక్షిణాపథం ఈ రాష్ట్రాల పాలనకు గవర్నర్లుగా యువరాజులు కాని రాజబంధువులు గాని ఉండేవారు.

స్థానిక పాలన:స్థానిక పాలన మున్సిపల్ తరహా పాలన (నగర పాలన), గ్రామ పాలన అని రెండు రకాలుగా ఉండేది.

మున్సిపల్ పాలన:మౌర్యుల పాలనలో నగర పాలన ప్రాధాన్యం కలిగిన అంశం. నగర పాలనాధికారిని నాగరికుడు లేదా నగరాధ్యక్షుడు అంటారు. ఇండికా, అర్థశాస్త్రాలు నగర పాలనను విస్తారంగా తెలిపాయి. నగర పాలనను 30 మంది సభ్యులు కల సభ నిర్వహిస్తుంది. వీరు ఐదుగురు సభ్యుల కూటమిగా 6 శాఖలుగా ఏర్పడి 1) పరిశ్రమలు 2) విదేశీ వ్యవహారాలు 3) జనాభా వివరాలు 4) తూనికలు, కొలమానాలు 5) వస్తు విక్రయం 6) పన్నుల వసూలు అనే శాఖలుగా విధులు నిర్వహించేవారు.

గ్రామీణ పాలన:మౌర్యుల పాలన చిన్న విభాగం గ్రామం. గ్రామ అధికారిని గ్రామణి అనేవారు. పది గ్రామాలకు పెద్దగోపుడు ఉండేవాడు.

న్యాయపాలన:చక్రవర్తి ఉన్నత న్యాయాధికారి అయితే ఆస్తి తగాదాలు తదితర సివిల్ కేసుల పరిష్కారానికి ‘ధర్మస్తేయ’ అనే న్యాయస్థానం ఉండేది. అపరాధ విచారణ కోసం ‘కంటన శోధన’ అనే క్రిమినల్ న్యాయస్థానం ఉండేది. కఠినమైన శిక్షాస్మృతి అమలుతో నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అశోకుడు తన పాలనా కాలంలో ఈ కాఠిన్యాన్ని కొంత తగ్గించాడు.

గూఢచారి వ్యవస్థ:మౌర్యుల పాలనలో అత్యంత ప్రాధాన్యం కలిగిన విభాగం గూఢచారి వ్యవస్థ. ఇది నేటి ఆధునిక కాలానికి ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్దబడింది. వీరు రాజ్యంలోని సమాచారం, అధికారుల ప్రవర్తనలను పరిశీలించి రహస్య నివేదికలు పంపేవారు. ‘సంతక్’, ‘సంచారం’ అనే రెండు రకాల గూఢచారులు మారువేషాలలో సంచరిస్తూ రాజుకు కన్ను, చెవులా ఉంటూ సమర్థవంతంగా పనిచేసేవారు.

సైనిక వ్యవస్థ:మౌర్య సామ్రాజ్యం విశాలమైన సైన్యం కలిగి ఉండేది. మౌర్య సైన్యంలో ఆరు లక్షల కాల్బలం, 30 వేల అశ్విక దళం, 9 వేల గజబలం, 8 వేల రథాలు ఉండేవి. సైన్యానికి అనుబంధంగా నౌకాబలం కూడా ఉండేది. సైనిక పర్యవేక్షణ 30 మంది సభ్యులు గల సైనికశాఖకు అప్పగించారు. సర్వసైన్యాధ్యక్షుడు చక్రవర్తి. క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడంతో సైనికులు హాయిగా బ్రతికేవారు.

కఠిన శిక్షలు, ఉద్యోగుల పీడనలు వంటి కొన్ని లోపాలున్నప్పటికీ, సమర్థవంతమైన నగర పాలన, స్థానిక పాలన వీరి సుగుణాలు. మౌర్యుల పాలన ఉత్తమం, ఆదర్శం. మౌర్యుల పాలన మొగలుల పాలన కంటే ఆదర్శవంతమైనదని వి.ఎ.స్మిత్ పండితుడు వ్యాఖ్యానించడం నూటికి నూరుపాళ్ళు వాస్తవమే.

ప్రశ్న 5.
కనిష్కునిపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
కనిష్కుడు:చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ‘వీమ కడఫాసిన్’ తరువాత రాజ్యానికి వచ్చినవాడని, క్రీ.శ. 78 నుంచి 102 వరకు పాలిస్తూ, నూతన శకం ప్రారంభికుడు కనిష్కుడని తెలుస్తుంది. ఇతడు కుషాను రాజులందరిలో గొప్పవాడని, గొప్ప యోధుడని తెలుస్తుంది. ఇతడు ఫామీర్ ప్రాంతంపై దండయాత్ర చేసి ‘కాసగర్’ ‘కోట’ లను ఆక్రమించి, కుషానుల గొప్పతనాన్ని చాటినాడు. ఇతడు చైనా సామ్రాజ్య చక్రవర్తితో గుర్తింపు పొందాడు. ఇతడి సామ్రాజ్యం బోకార నుంచి సింధూ వరకు, పర్షియా నుంచి బీహారు వరకు విస్తరించింది. భారతదేశాన్ని తన దక్షిణ సరిహద్దుగా చేసుకొని కనిష్కుడు కాశ్మీరు తన సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు. ఇతడు కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. కల్హనుని ప్రకారం ఇతడు మగధ వరకు దండయాత్ర చేసి అక్కడి నుంచి అశ్వఘోషుడు అనే బౌద్ధమత పండితుని తీసికొచ్చుకొన్నాడని చెప్పబడుతుంది. ఇతడు పాలించిన భూభాగం ఎక్కువ భాగం భారతదేశం అవతల ఉంది, అయినప్పటికి ఇతనిని భారతదేశ రాజుగా పరిగణిస్తున్నారు. ఇతని రాజధాని గాంధారలో ఉన్న పురుషపురం లేదా పెషావర్గా ఉండేది.

బౌద్ధమత సేవలు:కనిష్కుడు గొప్ప సామ్రాజ్య నిర్మాతయే గాక, సామాజిక సేవకుడు, అతడు బౌద్ధమతానికి చేసిన సేవ అశోకుడు ఆ మతానికి చేసిన సేవలను గుర్తింపచేస్తుంది. ఇతని ఆధ్వర్యంలో నాల్గవ బౌద్ధ సంగీతి లేదా సమావేశం, కాశ్మీర్లో ఉన్న కుందలవన విహారంలో జరిగింది. బౌద్ధమత సంఘంలో ఉన్న భేదాలను లేదా విభేదాలను తొలగించడానికి కనిష్కుడు తన ఆస్థానంలో ఉన్న గొప్ప బౌద్ధమత తాత్వికుడైన పార్శ్వనాథుని సలహాతో వీరిని సమావేశ పరిచాడు.

చైనా యాత్రికుడు హువానువాంగ్ ప్రకారం దాదాపు అయిదువందల మంది బౌద్ధ సన్యాసులు ఈ సమావేశానికి హాజరైనారు. ఇది వసుమిత్ర అధ్యక్షతన, అశ్వఘోషుని ఉపాధ్యక్షతన జరిగింది. ఇక్కడ మహాయాన బౌద్ధమతాన్ని తమ మతంగా ప్రకటించుకుంటూ ఇక్కడ హాజరైన ప్రతినిధులు తమ చర్చల ద్వారా ఆయా శాఖలలో ఉన్న ధర్మ సూత్రాలను క్రోడీకరించి, వాటిని రాగి పలకలపై చెక్కించి, ప్రత్యేకంగా నిర్మించిన స్థూపంలో భద్రపరిచారు. ఈ కామెంట్రీలను సంస్కృత భాషల్లో రాశారు. కనిష్కుడు బౌద్ధమతాన్ని పోషించినప్పటికి ఇతర మతాలను కూడా ఆదరించాడు.

సాహిత్యం:కనిష్కుని ఆస్థానంలో పార్శ్వనాథుడు, వసుమిత్రుడు అనే గొప్ప బౌద్ధమత తాత్వికులుండేవారు. వీరి ఆధ్వర్యంలో నాల్గవ బౌద్ధ సంగీతి సమావేశపరచడమే గాక, తద్వారా బౌద్ధమత ‘మహావిభాష’ అనే సంపూర్ణ జ్ఞాన గ్రంథాన్ని ఈ సమావేశంలో తయారుచేశారు. దీన్నే ‘త్రిపీటకాలకు వ్యాఖ్యలంటారు. ఇతని ఆస్థానంలో ‘బుద్ధచరిత’ గ్రంథ రచయిత అశ్వఘోషుడు, మహాయాన మత ప్రచారకుడు తాత్వికుడైన ఆచార్య నాగార్జునుడుండేవారు. సెక్యులర్ సైన్స్ గ్రంథకర్తలైన చరకుడు ‘చరక సంహితము’, మాతంగుని రాజనీతి తత్త్వం ముఖ్యమైనవి. చరకుని చరక సంహితంలో వివిధ రకాల వ్యాధులు వాటి కారణాలు గుర్తించడం, రక్త ప్రసరణ పరీక్షలు, మానవ శరీర నిర్మాణం, మెదడు పనితీరును మొదలైన వాటి గురించి వివరిస్తుంది. ఇంతటి విలువ గల విషయాల గురించి తెలిపే చరకశాస్త్రం పర్షియన్ మొదలైన ఎన్నో భాషల్లో తర్జుమా చేయబడింది.

వాస్తుకళలు:వాస్తు కట్టడాలు, కళలు, శిల్పాలు నిర్మాణాలు అశోకుని వలె కనిష్కుడు కూడా పోషించి వాటి వృద్ధికి తోడ్పడ్డాడు. కనిష్కుడు నిర్మించిన పదమూడు అంతస్తుల అతి ఎత్తైన కనిష్కపురంలోని ‘టవర్’, బౌద్ధ సన్యాసులకు నిర్మించిన విహారాలు, స్థూపాలు (గుడులు), పురుషపురంలోని గాంధార కళాకృతితో నిర్మించిన బుద్ధుని శిల్పాలు, గాంధార, మధుర ప్రాంతంలో నిర్మించిన బుద్దుని విగ్రహ శిల్పాలు మొదలైనవి అతని వాస్తు కళాపోషణకు నిదర్శనాలు. ఇతని పురుషపురంలో 400 అడుగుల ఎత్తైన గోపురం, దానిపై బుద్ధ విగ్రహ నిర్మాణాలు ముఖ్యమైనవి.

ఇతని కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెంది ఉన్నత స్థితికి చేరింది. మధుర గాంధార కళకు ప్రసిద్ధి చెందింది. కనిష్కుడు విదేశీయుడైన, భారతదేశ రాజుగా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు 41 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఇతని తరువాత హావిశ్కుడు వసిస్కిడు అను బలహీన వారసుల పాలనతో కనిష్క సామ్రాజ్యం పతనం ప్రారంభమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 6.
సంగమ కాలం గురించి రాయండి.
జవాబు.
సంగమము అంటే కవుల లేదా పండితుల సమావేశం. ఇక్కడి నుంచే ప్రాచీన తమిళ గ్రంథాలు క్రోడీకరించి వెలుగులోకి వచ్చాయి. తమిళుల చరిత్ర ఈ సంగమ యుగం నుండే ప్రారంభమైనదని చెప్పబడుతుంది. ఈ సంగమ యుగం లేదా ఆ ప్రాంత కవుల సమ్మేళనం, అందులోంచి ఉద్భవించిన రచనలు క్రీ.శ. రెండు, మూడు శతాబ్దాల మధ్య కాలంలో జరిగింది. ఈ కాలంలో ఉద్భవించిన రచనల ద్వారా మనకు చేర, చోళ పాండ్యరాజుల గురించి తెలుస్తుంది. కాని పల్లవుల గురించి ఈ సాహిత్యంలో అంటే సంగమ సాహిత్యంలో పేర్కొనబడలేదు. క్రీ.శ. 7వ శతాబ్దిలోనే తమిళనాడు ప్రాంతంలో పల్లవులు ఆధిపత్యంలోకి వచ్చారు. అందువల్ల శైవ, వైష్ణవ మత ప్రచారం కూడా క్రీ.శ. 7వ, 8వ శతాబ్దిలోనే నాయనార్లు, ఆళ్వారులు అనే భక్తి సెయింట్స్లో జైన, బౌద్ధమతాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది.

సంగమ సాహిత్యమే కాకుండా దానికంటే ముందు వచన రూపంలో వచ్చిన గ్రంథాల్లో కూడా తమిళుల ఆధిపత్యం కనిపిస్తుంది. సంగమ సాహిత్య పద్యాలు ప్రజల వాడుక పద్యాలకు దగ్గరగా ఉండేవి. ఇవి అన్ని కూడా తమ రాజులను పొగడుతూ రాసినట్లు గోచరిస్తాయి. సంగమ కాలం నాటి ప్రముఖ రచయితలు.

రాజకీయ చరిత్ర:చోళరాజ్యం ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లి వరకు, కావేరి డెల్టా దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. చోళరాజ్య రాజధాని ‘ఉరయూర్’ చేర రాజ్యం ఉత్తరాన కొచ్చిన్ నుంచి దక్షిణాన తిరువళ్ళూరు వరకు విస్తరించింది. దీని రాజధాని ‘పంజి’. పాండ్యరాజ్యం పుడుక్కోట నుంచి కన్యాకుమారి వరకు విస్తరించింది. మధురై పాండ్య రాజుల రాజధాని.

చేర రాజ్యం: చేర రాజుల్లో మొదటి వాడు ఉదయంజెరల్ (క్రీ.శ. 130). అతడు గొప్ప యుద్ధవీరుడు. భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని కుమారుడు నెడుంజరల్ అడన్ మలభారు తీరంలోని శత్రువుల పైన నౌకా యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించి అనేకమంది యవన వ్యాపారులను బంధించాడు. ‘ఆధిరాజ’ అనే బిరుదుతో పాటు హిమాలయాలను సరిహద్దుగా కలిగినవాడు అనే అర్థం వచ్చే ‘ఇమయవరంబన్’ అనే బిరుదాన్ని స్వీకరించాడు.

చోళ సామ్రాజ్యం:చోళ సామ్రాజ్యం స్థాపన కరికాల చోళునితో క్రీ.శ. 190లో ప్రారంభమైంది. కరికాల అంటే శత్రువుల ఏనుగులకు కాలయముడు లాంటివాడు అని అర్థం. రెండవ దాని ప్రకారం కాలిన కాలుగలవాడు లేదా నల్లని కాలువాడు అంటే అతని చిన్నతనంలో మంటల్లో కాలుకాలినవాడని మరొక అర్థం. శత్రువుల చేతుల్లో నిర్బంధింపబడి, తప్పించుకొని చేర రాజులతో యుద్ధం చేసి తన తాతల సామ్రాజ్యాన్ని తిరిగి సాధించుకొన్నాడు. ‘పరనార్’ అనే సమకాలీన కవి ప్రకారం కరికాళుడు గొప్ప యుద్ధవీరుడు, అతడు చేర, పాండ్యుల రెండు సైన్యాలను ఓడించి, గొప్ప విజయాన్ని సాధించాడు. ఇతడు 12,000 మందిని యుద్ధ ఖైదీలుగా చేసి కావేరినదిపై ఆనకట్టను కట్టడానికి ఉపయోగించి, వ్యవసాయానికి నీటిపారుదల వసతులు కల్పించాడు. ఇతడు కావేరి పట్టణం (పూహర్) అనే నూతన రాజధాని నిర్మించాడు. వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించాడు. ఇతని ‘పెన్నార్’ నీటిపారుదల కాలువ నిర్మాణం వల్ల తంజావూరు పట్టణం, దాని దక్షిణ ప్రాంతమంతా నీటి లభ్యత చేకూరింది. ఇతడు వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు.

పాండ్యులు:పాండ్య రాజులలో అతి గొప్పవాడు నెడుంజలియన్. ఇతడు చిన్నతనంలోనే రాజ్యానికి రావడంతో చోళ, చేర రాజులు ఇతని రాజ్యంపై దండెత్తగా, తెలైయలంగనమ్ అనే యుద్ధంలో వారిపై విజయం సాధించాడు. ఇతని గొప్పతనాన్ని మనగుడి మరుదన్, నక్కిరార్ అనే కవులు కొనియాడారు.

మతం:ఆ కాలం నాటి ప్రజలు వైదిక మతాన్ని ఆదరించారు. వివిధ రకాల దేవతలను పూజించారు. వాటిలో ప్రకృతి ఆరాధన, శివ, విష్ణు, ఇతర దేవతలను పూజించేవారు. యజ్ఞ యాగాలను చేసేవారు. సన్యాసులకు సంఘంలో మంచి స్థానముండేది. ప్రజలు భక్తి భావంతో పాటు, పునర్జన్మ, కర్మసిద్ధాంతాలను, జ్యోతిష్యశాస్త్రం మొదలైనవి నమ్మేవారు. ఈ కాలంలో బౌద్ధమతం, జైనమతం కూడా వైదిక మతంతో పాటు సమాన గౌరవాన్ని పొందేది. తిరువల్లూవర్ అనే వాడు జైనకవి, అతడు ‘తిరుక్కురల్’ గ్రంథ రచయిత. సంగం సాహిత్యానికి ఆణిముత్యం లాంటి ‘సిలాప్పడికరం’ ‘మణిమేకలై’ అనేవి బౌద్ధుల గ్రంథాలు.

సాహిత్యాభివృద్ధి:సంగమ యుగంలో ఆర్యుల, ద్రావిడుల సంస్కృతి మిళితమైన సంగమ సాహిత్యాభివృద్ధి జరిగి,. బంగారు యుగంగా పేరొందింది. ‘తిరువల్లువార్’ అనేవాడు ‘తిరుక్కురల్’ అనే కావ్యాన్ని రాశాడు. ఇది ఆ కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని, వారి నైతిక విలువల గురించి వివరించే అతి ముఖ్యమైన గ్రంథం. ఆ రోజుల్లో అగస్త్యుని శిష్యుడు తోలకప్పియార్ అనేవాడు అతి ముఖ్యమైన ‘తొలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మగధ రాజ్య విజృంభణకు గల కారణాలు పరిశీలించండి.
జవాబు.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో షోడశ మహా జనపదాలనబడే 16 రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో మగధ రాజ్యం ఒకటి. మగధ రాజ్యం క్రమంగా శక్తివంతంగా మారి విజృంభించింది.
మగధ సామ్రాజ్య ఆవిర్భావానికి కారణాలు:క్రీ.పూ. 6వ శతాబ్దంలో గంగా, యమున మైదాన ప్రాంతంలో 16, జనపదాలు వెలిశాయి. ఈ మహాజనపదాల మధ్య ఆధిపత్యం కోసం నిరంతరం సంఘర్షణలు జరుగుతుండేవి. సార్వభౌమాధికారాన్ని పొందాలనే తలంపుతో ప్రతి జనపదం కూడా. సమర్థవంతమైన సైనిక వ్యవస్థను పోషించింది. ఈ రాజకీయ, సైనిక ప్రయోజనాల వెనుక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం వాయువ్య దిశ నుంచి వచ్చే విదేశీ దాడుల ప్రమాదానికి దూరంగా ఉంది. గంగానది, దాని ఉపనదులతో ఈ ప్రాంతం ఐశ్వర్యవంతమైంది. రాజకీయాధిక్యత కోసం కాశీ, కోసల, మగధ, వజ్జి రాజ్యాలు పోటీపడ్డాయి. వాటిలో మగధ విజృంభించి ఇతర రాజ్యాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ చరిత్రలో ప్రప్రథమ రాజ్యంగా వెలిసింది.

మగధ రాజ్య విజృంభణకు అనేక పరిస్థితులు దోహదపడ్డాయి..

  1. మగధలో ప్రకృతిసిద్ధమైన అనేక వనరులున్నాయి. ‘గంగానది, దాని ఉపనదులైన శోణ్, గండక్, గోగ్రా నదులు మగధకు సహజ రక్షణను, రాకపోకల సౌకర్యాలను సమకూర్చాయి.
  2. ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజగనులు అందుబాటులో ఉన్నందువల్ల మగధ ఆయుధ నిర్మాణంలో ముందంజ
    వేసింది.
  3. మధ్యగంగా మైదాన ప్రాంత మధ్యభాగంలో ఉన్నందువల్ల ఆ రాజ్యం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందింది.
  4. ఈ ప్రాంతంలో ఏనుగులు అధిక సంఖ్యలో ఉండేవి. మగధ పెద్ద ఎత్తున ఏనుగులను సమీకరించి యుద్ధ వ్యూహంలో ముందున్నది.
  5. మగధకు రాజధాని నగరాలైన గిరివ్రజం, పాటలీపుత్రం రాజ్యానికి ప్రకృతిసిద్ధమైన రక్షణను కల్పించాయి.
  6. ఈ ప్రాంతం తరచుగా విదేశీ దండయాత్రలకు గురయ్యే వాయువ్య ప్రాంతానికి దూరంగా ఉన్నందువల్ల దండయాత్రల బెడద లేదు.
  7. పైగా కొత్తగా ఆర్య సంస్కృతి ప్రభావం కిందికి వచ్చిన మగధ ప్రజల్లో ఇతరుల కంటే సామ్రాజ్య విస్తరణ కాంక్ష అధికంగా ఉండేది. ఈ విధమైన కారణాలు ఉన్నందువల్లనే మగధ ఒక సామ్రాజ్యంగా రూపొందింది.
  8. మగధను పాలించిన రాజవంశాలు మగధ రాజ్య విజృంభణకు దోహదపడ్డాయి.

ప్రశ్న 2.
మౌర్య చంద్రగుప్తుడు.
జవాబు.
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు చాణిక్యుని నేతృత్వంలో సకల విద్యాపారంగతుడై ఉత్తమ సైనికుడిగా రూపుదిద్దుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు రెండు ఘనకార్యాలు సాధించాడు. మొదటిది వాయువ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీనం చేసుకోవటం కాగా, నందరాజులను ఓడించి మగధను ఆక్రమించటం రెండవది. అలెగ్జాండర్ భారతదేశమును వదిలివెళ్ళిన పిమ్మట చాణక్య, చంద్రగుప్త మౌర్యుడు మొదటగా పంజాబ్ ప్రాంతంలో ధైర్యసాహసాలకు పేరుబడ్డ జాతులవారిని చేరదీసి ఒక శక్తివంతమైన సైన్యమును సమకూర్చుకున్నారు. ఈ సైన్యం సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ప్రథమంగా గ్రీకులను పారద్రోలి పంజాబును విదేశీపాలన నుండి విముక్తి చేశాడు. ఆ తరువాత నందరాజు నిరంకుశత్వాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని అధిష్టించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. జైన, బౌద్ధ ఐతిహ్యాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు రెండుసార్లు మగధపై దండయాత్ర జరిపాడని, రెండవ దండయాత్రలో విజయం సాధించి సామ్రాజ్య స్థాపనగావించాడని తెలుస్తున్నది. క్రీ.పూ. 305లో భారతదేశముపై దండెత్తి వచ్చిన గ్రీకు సేనాని సెల్యూకస్ నికటార్ను ఓడించి అతని వద్ద నుండి కాబూల్, కాందహార్, హీరట్, బెలూచిస్థాన్లను వశపరచుకొన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు 6 లక్షల సైన్యంతో భారతదేశమంతటిని జయించాడని ప్లూటార్క్ అనే గ్రీకు చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ దండయాత్రల వలన చంద్రగుప్త మౌర్యుని మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన పర్షియా నుండి తూర్పున బీహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి జిల్లా వరకు విస్తరించింది. భారతదేశంలోని అధిక భాగాలను ఒకే సామ్రాజ్య పరిధిలోనికి తీసుకొనివచ్చిన ఘనత చంద్రగుప్తు మౌర్యునికే దక్కుతుంది. అందువలన భారతదేశ చరిత్రలో చంద్రగుప్తమౌర్యుని జాతీయ పాలకుడుగా భావిస్తారు.

ప్రశ్న 3.
అశోక ధమ్మము.
జవాబు.
అశోకుని కాలంలో వివిధ మతశాఖలు సామాజిక ఉద్రిక్తతను సృష్టించాయి. నగరాల్లో వ్యాపారవర్గాలు బలపడటం వల్ల నూతన సామాజిక స్థితి ఏర్పడింది. సామ్రాజ్య సువిశాలత్వం కూడా కొన్ని సమస్యలను సృష్టించింది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని, దేశ సమైక్యతను సాధించటానికి ఒక క్రొత్త విధానం కావలసి వచ్చింది. అందువలననే అశోకుడు తన ధర్మాన్ని ప్రతిపాదించాడు.

అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అతనిలో కనిపిస్తాయి. బౌద్ధధర్మం, అశోకుని ధర్మం ఒకటి కాదు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో అశోకుడు తన ధర్మాన్ని శిలాశాసనాల్లో పొందుపరిచాడు. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దం పడుతుంది. అశోకుని ధర్మం ముఖ్యంగా మానవుల ప్రవర్తన, నీతికి సంబంధించిన నియమావళికి వర్తిస్తుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి :

  1. జీవహింస చేయరాదు.
  2. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి.
  3. సర్వప్రాణుల పట్ల కరుణ, జాలి చూపాలి.
  4. బానిసలు, సేవకుల పట్ల దయతో మెలగాలి.
  5. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధన సహాయాన్ని చేయాలి.
  6. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారా తన మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి.

ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు. అశోకుడు కర్మకాండను, మూఢాచారాలను ఖండించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 4.
మౌర్య సామ్రాజ్య పతనానికి గల కారణాలను రాయండి.
జవాబు.
మౌర్య,సామ్రాజ్య పతనం నుంచి గుప్త సామ్రాజ్యం స్థాపన వరకు అంటే క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 350 వరకు దాదాపు శతాబ్దాల కాలం ఏ రాజవంశంలోనూ కూడా ఉత్తర భారతదేశాన్నంతటినీ ఏకం చేసిన సామ్రాజ్యం మరొకటి లేదు.

మౌర్యుల పాలన తరువాత భారతదేశం రాజకీయంగా ముక్కలు ముక్కలుగా విభజింపబడి గంగానదికి దక్షిణంగా రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి మగధ, కాశి, కౌశంబి, మధురలు. దీనికి తూర్పున విదేహా (ఉత్తర బీహార్ నుంచి కోసల (అవద్) వరకు, పశ్చిమాన పాంచాల, మధ్య భారతంలో భరహాత్, విధీష, ఉజ్జయిని రాజ్యాలు వెలిశాయి.
మౌర్యరాజ్యం కూలిపోయి పుష్యమిత్ర శుంగునితో శుంగరాజ్యం ఏర్పడే సమయంలో దక్షిణాపథంలో ఆంధ్రరాజ్యం లేదా శాతవాహనులు ఆవిర్భవించారు. ఇంకా దక్షిణంగా చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆవిర్భవించాయి. ఇదే . సమయంలో భారతదేశ వాయువ్య ప్రాంతం విదేశీయుల దండయాత్రలకు బలి అయింది. అలా భారతదేశంపై దండయాత్ర చేసిన వారిలో వరుసగా ఇండో – బాక్టీయనులు, శకులు, పార్థియనులు, కుషానులు వచ్చి వారి రాజ్యాలు స్థాపించారు.

ప్రశ్న 5.
మౌర్యుల కట్టడాలు.
జవాబు.
మౌర్యుల కళలు :
1) స్తంభాలు, శిల్ప నిర్మాణాలు: మౌర్యుల కళకు చాలా అందమైన నిర్మాణాత్మక నిదర్శనాలుగా అశోకుడు నిర్మించిన స్తంభాలు ఉన్నాయి. అశోకుని శాసనాలతో కూడిన స్తంభాలు, స్థూపాలు నగరాల్లో, కూడళ్లలో ప్రతిష్టించాడు. స్తంభాలను రెండు రకాలైన రాతితో నిర్మించారు. అవి :

  • మధుర ప్రాంతానికి చెందిన ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుక రాయితో కొన్ని నిర్మించబడ్డాయి.
  • బాగా పొడిచేసిన ఇసుకరాయి, బనారస్ సమీపంలోని చూనార్ వద్ద లభ్యం అవుతుంది. ఎక్కడైతే స్తంభాలు నిర్మిస్తారో అక్కడికి మధుర, చూనార్ నుంచి రాతిని రవాణాచేసి, అక్కడ శిల్పకారులు, తక్షశిల నుంచి వచ్చిన వారు తమ నైపుణ్యంతో చెక్కారు.

2) స్తూపాలు:స్తూపం అనేది ఇటుక లేదా రాయితో నిర్మించిన అర్థగోళాకార నిర్మాణం. క్రింద గుండ్రని ఆధారపీఠం ఉంటుంది. చుట్టూ గొడుగు ఆకారం సార్వభౌమాధికారానికి గుర్తుగా ఉంటుంది. అశోకుడు భారతదేశంలోను, ఆఫ్ఘనిస్థాన్లలో ఎనభై నాలుగువేల స్థూపాలు నిర్మించాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో హుయన్ త్సాంగ్ తన భారత పర్యటనలో వీటిని చాలావరకు చూశాడు. వీటిలో మంచి ఉదాహరణగా చెప్పదగింది భోపాల్ సమీపంలోని సాంచి స్తూపం.

3) గుహలు:మౌర్యుల కట్టడాల్లో ముఖ్యమైనవి గుహలు. గట్టిరాళ్ళు, చీలిన రాళ్ళతో చెక్కబడినవి. గుహల లోపలి గోడలు బాగా నునుపుగా, అద్దంలాగా ఉంటాయి. ఈ అద్భుత కట్టడాలు సన్యాసుల నివాసగృహాలు, అసెంబ్లీ గదుల వలె ఉపయోగపడ్డాయి.

ప్రశ్న 6.
గాంధార శిల్పకళ.
జవాబు.
A. గాంధార శిల్పం
1) కాలం, ప్రదేశం, పోషకులు:క్రీ.పూ. 1వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో ఉన్న అద్భుత శిల్పాలను గాంధార శిల్పాలు అంటారు. భారతీయ గ్రీకు శిల్పకళా సమ్మిళిత నిర్మాణంగా చెబుతారు. బాక్ట్రియా గ్రీకు రాజులు, వాయువ్య భారతం నుంచి ఆవిర్భవించాయి. శకులు, కుషాణులు
వీటి పోషకులు.

2) గాంధార శిల్ప లక్షణాలు:గ్రీకు, రోమన్ సంప్రదాయాల్లో బుద్ధుని విగ్రహాలు నిర్మించబడ్డాయి. మానవ శరీరాన్ని చాలా సహజంగా శిల్పులు చెక్కారు. కండరాలు, మీసాలు, ఉంగరాల జుత్తు మొదలైనవి చక్కగా ఉంటాయి.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అజాత శత్రువు.
జవాబు.
ఇతడు బింబిసారుని కుమారుడు. రాజ్య కాంక్షతో తన తండ్రిని చంపి సింహాసనాన్ని అధిష్టించాడని బౌద్ధ గ్రంథాల వల్ల తెలుస్తుంది. ఇతని 32 సంవత్సరాల పరిపాలనా కాలంలో తన తండ్రి రాజ్య పాలనా విధానాలను కొనసాగించడంతో పాటు, తన శక్తి సామర్థ్యాలతో మగధ రాజ్య ప్రతిష్టను పెంపొందించాడు. ఇతడు కోసల, కాశీ రాజ్యాలను జయించి మగధ సామ్రాజ్యంలో కలిపాడు. ఇతడు వజ్జి సమాఖ్య గణతంత్ర రాజ్యంపై 16 సంవత్సరాలు పోరాటం చేసి తన రాజ్యంలో కలుపుకొన్నాడు. ఈ పోరాట కాలంలోనే పాటలీ గ్రామంలో జలదుర్గ అనే కోటను నిర్మించాడు.

ప్రశ్న 2.
శిశునాగుడు.
జవాబు.
పర్యంక వంశ రాజుల పాలనతో విసిగిపోయిన ప్రజలు శిశునాగుని రాజుగా చేసుకున్నారు. ఈ రాజవంశీయులు మగధ రాజ్యాన్ని దాదాపు 50 సంవత్సరాలు పాలించారు. శిశునాగుడు ఈ వంశస్థాపకుడు. ఇతడు రాజధాన్ని పాటలీపుత్రం నుంచి రాజగృహకు మార్చాడు. ఇతడు అవంతి, వత్స రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు.శిశునాగుని తరువాత అతని కుమారుడు కాలాశోకుడు సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 3.
ఇండికా
జవాబు.
చంద్రగుప్తు మౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాజైన సెల్యూకస్ రాయబారి మెగస్తనీస్ భారతదేశంలో ఉన్నంతకాలం తాను చూచిన, విన్న విషయాలను ఇండికా అను పేరుతో గ్రంథస్తం చేశాడు. అయితే ఇండికాలోని కొన్ని భాగాలు మాత్రమే నేడు లభ్యమౌతున్నాయి. ఈ గ్రంథం వల్ల నాటి పాలనా విధానం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. భారతదేశంలో బానిస వ్యవస్థ లేదని, భారతీయులలో 7 కులాలవారున్నారని మెగస్తనీస్ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి మెగస్తనీస్ సవివరంగా వివరించాడు. అతడు విదేశీయుడు. ఇతనికి భారతీయ సంస్కృతీ పరిజ్ఞానం పూజ్యం కాబట్టి ఇతని రచనను స్వవిమర్శతో స్వీకరించవలసి ఉంటుంది.

ప్రశ్న 4.
కౌటిల్యుడు.
జవాబు.
అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. ఇతడే చాణక్యుడు. కుటిల నీతితో కౌటిల్యుడయ్యాడంటారు. ఇతడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. మౌర్యుల చరిత్ర తెలుసుకొనుటలో అర్థశాస్త్రము ప్రధానమైనది. అర్థశాస్త్రమనగా ఆర్థికశాస్త్రం కాదు. ఇది రాజనీతి శాస్త్రము. ఇందు చక్రవర్తి విధులు, సైనిక విధానము, దండనీతి మొదలగు అంశములు పేర్కొనబడెను. అయితే రాజనీతితో పాటు ఆర్థిక విషయములు కూడా పేర్కొన్నాడు. నాటికి, నేటికీ పరిపాలకుడికి ఉండవలసిన లక్షణాలు, పరిపాలనలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నింటినో పేర్కొన్నాడు కౌటిల్యుడు.

ప్రశ్న 5.
కళింగ యుద్ధం.
జవాబు.
క్రీ.పూ. 261లో అశోకుడు పెద్ద సైన్యంతో కళింగ దేశంపై దండెత్తాడు, దాని అధికారాన్ని అణచి వేయాలనుకున్నాడు. దాంతో ఈ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. ప్రాణనష్టం తీవ్రమైన రీతిలో జరిగింది. చివరకు అశోకుడు కళింగను ఆక్రమించాడు. ఈ యుద్ధం గురించి ఒరిస్సాలోని అతని 13వ రాతి శాసనంలో వివరంగా వివరించి ఉంది. ఈ సంఘటనతో చలించిపోయిన అశోకుడు బౌద్ధమతం స్వీకరించి, బౌద్ధ ధర్మం ప్రచారం మొదలుపెట్టాడు.

ప్రశ్న 6.
మూడవ బౌద్ధ
సంగీతి.
జవాబు.
అశోకుని ఆధ్వర్యంలో పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సంగీతి (సమావేశం) జరిగింది. దీనిలో ఏర్పడిన చీలికలు నివారించుటకై జరిపించాడు. దీనికి మొగళిపుత్త తిస్స అధ్యక్షత వహించాడు. ఈ సమావేశం నుంచి అనుకున్న ఫలితాలు రాకపోయినప్పటికి అశోకుడు బౌద్ధధర్మాన్ని దేశ, విదేశాలలో పలు విధాలుగా ప్రచారం చేయించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 7.
బృహద్రదుడు.
జవాబు.
చివరి మౌర్య రాజు బృహద్రధుడు. ఇతని అసమర్థ పాలన వలన చివరి బృహద్రధుని అతని సైన్యాధిపతియైన పుష్యమిత్ర శుంగుడు ఓడించి పాటలీపుత్ర సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 8.
సాంచీ స్థూపం.
జవాబు.
అశోకుడు 84,000 స్థూపాలు నిర్మించాడు. వాటిలో సాంచీ, సారనాథ్, భరహాత్ స్థూపాలు ప్రఖ్యాతి గాంచినవి. వీటిలో సాంచి స్థూపం ప్రముఖమైనది. ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్కు సమీపంలో ఉంది. ఈ మహాస్థూపం పరిధి (చుట్టుకొలత) 36.00 మీటర్లు, ఎత్తు 23.25 మీటర్లు. దీనికి చుట్టూ దీర్ఘ చతురస్రాకారపు 3.30 మీటర్ల ఎత్తు ఉన్న రాయితో దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించిన గోడ ఉంది.

ప్రశ్న 9.
పుష్యమిత్ర శుంగుడు
జవాబు.
పుష్యమిత్ర శుంగుడు చివరి మౌర్యరాజు బృహద్రధుని సేనాని. ప్రజలలో అతనిపై వ్యతిరేకత, రాజు బలహీనతను ఆసరా చేసుకొని అతనిని చంపి రాజయ్యాడు. ఇతని సామ్రాజ్యం పాటలీపుత్రం నుంచి దక్షిణాన నర్మదానది వరకు విస్తరించింది. ఇతను హిందూమతాన్ని ఆదరించాడు. ఇతను రెండుసార్లు అశ్వమేధయాగం చేసినట్లు తెలుస్తున్నది.

ప్రశ్న 10.
నాలుగవ బౌద్ధ సంగీతి.
జవాబు.
నాల్గవ బౌద్ధ సంగీతి లేదా సమావేశం, కాశ్మీర్లో ఉన్న కుందలవన విహారంలో జరిగింది. బౌద్ధమత సంఘంలో ఉన్న భేదాలను లేదా విభేదాలను తొలగించడానికి కనిష్కుడు తన ఆస్థానంలో ఉన్న గొప్ప బౌద్ధమత తాత్వికుడైన పార్శ్వనాథుని సలహాతో వీరిని సమావేశ పరిచాడు. చైనా యాత్రికుడు హువానువాంగ్ ప్రకారం దాదాపు అయిదువందల మంది బౌద్ధ సన్యాసులు ఈ సమావేశానికి హాజరైనారు. ఇది వసుమిత్ర అధ్యక్షతన, అశ్వఘోషుని అధ్యక్షతన జరిగింది.

Leave a Comment