TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 3rd Lesson ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 3rd Lesson ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జైన, బౌద్ధ మతాల ఆవిర్భావానికి దోహదం చేసిన పరిస్థితులను చర్చించండి.
జవాబు.
1) మత పరిస్థితులు: పవిత్రమైన, సామాన్య మతారాధనకు బదులుగా, సంక్లిష్టత మరియు బలులతో కూడుకొన్న వైదీక సంప్రదాయాలను సాధారణ ప్రజానీకం ఆమోదించలేదు. పైగా ఇవి ఖర్చుతో కూడుకొన్నవి. మూఢ విశ్వాసాలు మరియు మంత్రాలు ప్రజలను అయోమయానికి గురిచేశాయి. ఉపనిషత్లు లాంటివి జ్ఞానమార్గాన్ని. బోధించినా, అవి పూర్తి వేదాంత ధోరణిలో ఉండి, అవి అంత సులభంగా అందరికీ అర్థం కాలేదు. సులభంగా, సంగ్రహంగా అర్థమయి అందరికీ మోక్షాన్ని ప్రసాదించే వాటి కోసం ప్రజలు ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధుడు మరియు మహావీరుని బోధనలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాయి.

2) సామాజిక పరిస్థితులు: సమాజం నాలుగు కులాలతో విభాజితమైంది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నిబిడీకృతమై ఉన్నారు. చండాలురు, లేదా అంటరానివారిని గురించి, కొన్ని ప్రస్తావనలున్నాయి. సమాజంలో బ్రాహ్మణులు తమ ఆధిక్యతను నెలకొల్పుకున్నారు. వైదిక మతం, కర్మకాండలకు వారు ప్రముఖ కర్తలుగా పరిగణించుకొన్నారు. యాగాలు, కర్మకాండలను నిర్వహించడంతో పాటు, వీరు పాలకులకు ‘పురోహితులు’ లేదా మత సలహాదార్లుగా కూడా పనిచేశారు. నూతన వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఉద్భవించిన నూతన సామాజిక వర్గాల వల్ల సాంప్రదాయిక సామాజిక విభాగాలు, ఉద్దేశించిన రీతిలో పనిచేయలేదు. మొట్టమొదటగా, పట్టణ ప్రాంతంలో వృద్ధి చెందుతున్న వర్తక వర్గాలు, వారి కోరికలను సాంప్రదాయిక వ్యవస్థలో కోల్పోవల్సి వచ్చింది. పల్లెల్లోనూ, అదే విధంగా పట్టణాల్లోనూ, వైశ్యులు మారుతున్న ఆర్థిక లక్షణాల వల్ల అధికంగా లాభం పొందినప్పటికీ, వీరికి మూడో వర్ణస్థానం కేటాయించడం జరిగింది. పర్యవసానంగా, క్షత్రియులు బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రతిఘటించారు. వైశ్యులు తమ సామాజిక హోదా, ఔన్నత్యం కోసం ఆరాటపడసాగారు. స్త్రీలు: స్త్రీ స్థానానికి సంబంధించినంతవరకు, వైదిక యుగంలో ఉన్నత స్థానాన్ని ఆమె అధిష్టించినట్లు కనిపించదు. వారు సర్వదా తమ పురుషులపై ఆధారపడేవారు. అయితే, వారు కుటుంబంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందారు.

3) ఆర్థిక పరిస్థితులు: వ్యవసాయం: వ్యవసాయం ప్రజల, ముఖ్యవృత్తి. అందువల్ల, నాటి భారతీయులు అధిక సంఖ్యలో గ్రామాల్లో నివసించేవారు. స్థానిక సమాజం, సాగునీటి కాలువలను, తూములను ఏర్పాటు చేసేది. కర్షకులు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పందులు, కుక్కలు, ఇత్యాది జంతువులపై ఆధారపడేవారు. వరి ముఖ్య ఆహార పంట. వివిధ రకాలైన ధాన్యాలు, చెరకు, పండ్లు, కూరగాయలు, పూలను పండించేవారు.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

గ్రామాల్లో భూమిని కలిగి ఉండడమనే విషయం, సంపద గణనలో ముఖ్యమైన పరిమాణంగా మారింది. బౌద్ధ సాహిత్యంలో అధిక భూభాగానికి యాజమాన్యం వహించిన సమూహాలను, ‘గ్రహపతు’ అని పిలిచేవారు. వీరే ప్రధానంగా కర్షక యాజమాన్యులు. ధనిక గహపతుల అభివృద్ధి, అంతకు పూర్వం నెలకొన్న రక్త సంబంధం, సమానత్వమనే తెగ ఆదర్శాలను విచ్ఛిన్నం చేసింది. అందువల్ల, అనేక ఆర్థిక అసమానతలు తలెత్తాయి.

సుమారు క్రీ.పూ. ఆరో శతాబ్ది మధ్య భాగంలో మగధ రాజ్యం, దాని పరిసర ప్రాంతంలోని ప్రజల ఆర్థిక జీవనం, అంతకు పూర్వం కన్నా, విస్తృతంగా ఇనుమును వాడటం వల్ల, మార్పుకు లోనైంది. ఇనుప పరికరాలను వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల, రైతులు అదనపు ఫలసాయాన్ని, మిగులును పొందగలిగారు.

పన్నులు: నాటి ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం భూమిశిస్తు నుంచి లభించేది. ‘భాగ’ లేదా రాజు వాటా అనేది, పండించిన పంటలో 1/6వ వంతు ఉండేది. ‘బలి’ అనే పన్ను ద్వారా కూడా, కొంత ఆదాయాన్ని సమీకరించేవారు. తెగ ప్రజల ప్రాణం, ఆస్తిని కాపాడే బాధ్యతను నెరవేర్చడం కోసం, రాజు లేదా ‘రాజన్’ ఆ తెగ సభ్యుల నుంచి విధిగా వసూలు చేసే పన్నే ‘బలి’.

చేతివృత్తులు: చేతివృత్తులు, కళల్లో పనివారి సామర్థ్యం, ప్రత్యేకత కనిపిస్తాయి. రాగి, ఇనుము, రాయి, మట్టితో పనిముట్లు, పాత్రలు తయారయ్యేవి. వివిధ రకాల బట్టలను, నూలు, నార, ఉన్ని, పట్టు, జనుముతో తయారు చేసేవారు. వెదురుపనివారు, కుమ్మరి, రథకారులు, వడ్రంగి, దంతపు పనివారు, మాలాకారులు ఆదిగా గల చేతి వృత్తులవారున్నారు. వీరి ఉనికి, వస్తూత్పత్తిలో పెరుగుతున్న ప్రత్యేకతను మనకు తెలియజేస్తుంది.

వ్యాపారం: మలివేదకాలంలో లోహనాణేల ఉపయోగం, వర్తకానికి ప్రోత్సాహాన్నిచ్చింది. వ్యవసాయోత్పత్తుల పెరుగుదల వర్తక వాణిజ్యాభివృద్ధికి దారితీసింది. దేశీయ, విదేశీయ వ్యాపారం అభివృద్ధి చెందింది. విదేశాలతో వర్తకం, పట్టు, మస్లిన్, కవచాలు, కంబళ్ళు, అలంకార వస్తువులు, పరిమళ ద్రవ్యాలు, దంతం, బంగారం, వెండి ఆభరణాలు, ఇత్యాది వస్తువుల్లో జరిగేది. వర్తకం నగరీకరణను వేగవంతం చేసింది. అనేక పట్టణాలు, నగరాలు వెలిశాయి. వర్తకులు శివారు పన్నును, ఇతర పన్నులను చెల్లించేవారు.

శ్రేణులు: కళాకారులు, చేతివృత్తుల వారు, తరచుగా శ్రేణులుగా ఏర్పడేవారు. తరువాతి కాలపు బౌద్ధ గ్రంథాలు 18 శ్రేణుల ఉనికిని ప్రస్తావించాయి. ప్రతి పట్టణంలో ఒక శ్రేణి ఒక భాగంలో ఏర్పాటు కావడం వల్ల పరిశ్రమల, వృత్తుల స్థానికీకరణకు దారితీసింది. శ్రేణి అధిపతి (జ్యేష్టక Jeshtaka) దాని అధ్యక్షత వహించేవాడు. కొన్ని సమయాల్లో సెట్టిలు’ (Settis) అధ్యక్షత వహించేవారు. ఈ విధంగా పట్టణాల్లో చేతివృత్తులవారు, సెట్టిలు ముఖ్యమైన సామాజిక వర్గాలుగా ఏర్పడటం కనిపిస్తూంది.

నగరాల అభివృద్ధి: వర్తక వ్యాపారాభివృద్ధి, వృత్తిపనివారు, వర్తక, శ్రామిక ప్రజానీకంతో, కేంద్రీకృత నగరాభివృద్ధిలో ఫలించింది. వైశ్యులు సంపదను సమీకరించుకొని, ఉన్నత సామాజిక హోదాను పొందారు. వారు విదేశీ వ్యాపారంలో చక్కని సౌకర్యాలను, ముఖ్యంగా వైదిక మతం అనుమతించని సముద్ర ప్రయాణానికి భిన్నమైన సామాజిక, మతపరమైన అనుమతిని వారు ఆశించారు.

కొత్తగా పరిణతి చెందిన ప్రజల సామాజిక, ఆర్థిక జీవిత లక్షణాలు, వైదిక కర్మకాండల్లో, జంతుబలుల్లో సరిగా ఇమడలేకపోయాయి. అందువల్ల, ఈ పరిణామాలు, సామాజిక, ఆర్థిక మార్పుల ఆవశ్యకతను కల్పించాయి. నగరాల్లో నూతన ధనికులుగా ఏర్పడ్డ వైశ్యులు, పాలనాధికారాన్ని, నూతన వ్యవసాయిక మిగులు నుంచి లాభాన్ని పొందుతున్న క్షత్రియులు, శూద్రులు ఈ మార్పుల పట్ల అధిక ఆసక్తిని చూపారు. పర్యవసానంగా, క్రీ.పూ. ఆరో శతాబ్దిలో ఉద్భవించిన పలు మత బోధకులు, వైదిక మత సూత్రాలకు వ్యతిరేకంగా ప్రబోధిస్తూ, నూతన సామాజిక, ఆర్థిక, మత “పరిస్థితులను ప్రతిబింబించే మతాల ఆవిర్భావానికి కారణభూతులైనారు.

ప్రశ్న 2.
జైనమత సిద్ధాంతాలు వివరించి, భారతీయ సంస్కృతికి వారి సేవలను వివరించండి.
జవాబు.
జైనమతం, బౌద్ధమతం కంటే ప్రాచీనమైనది. జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. వారు 24 మంది. వారిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ వాడైన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు. మహావీరుడు జైనమత స్థాపకుడు కాదని, ఆ మతాన్ని సంస్కరించి చక్కని రూపాన్ని అందించినవాడని జైనుల విశ్వాసం.

వర్ధమాన మహావీరుడు: వర్ధమాన మహావీరుడు జైనమత 24వ తీర్థంకరుడు. మహావీరుని అసలు పేరు వర్ధమానుడు. అతడు క్రీ.పూ. 540వ సంవత్సరంలో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో సిద్ధార్థుడు, త్రిశలకు జన్మించాడు. ఇతని భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని. వర్ధమానుడు 30 ఏళ్ళు నిండకముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటి నుంచి నిష్క్రమించి, సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాల కఠిన తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. పరిపూర్ణ జ్ఞానము పొందిన పిమ్మట ‘జినుడు’ అని, ధైర్యసాహసములతో తపస్సు సాగించుటచేత “మహావీరుడని”, మహాజ్ఞాని అయినందువల్ల “కేవలుడు” అని సమస్త భవబంధములను తెంచుకొనుటచే ‘నిగ్రంథుడ’ ని పిలువబడ్డాడు. మహావీరుడని “జినుడు” (జయించినవాడు) అను బిరుదు నుంచి ఈ మతానికి జైనమతమనే పేరు వచ్చింది. మానవుల మోక్షసాధన కోసం మహావీరుడు పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖన వ్రతమును బోధించాడు. వీటిని ఆచరించుట ద్వారా మానవులు మోక్షము లేదా కైవల్యావస్థను పొందగలరని బోధించాడు. తన సందేశాన్ని నిర్విరామంగా ప్రచారం చేస్తూ మహావీరుడు తన 72వ ఏట పావా అనే నగరములో హస్తిపాలుడనే రాజు గృహములో క్రీ.పూ. 468లో మరణించాడు.

మహావీరుని బోధనలు:
1) పంచవ్రతాలు: జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నాలుగు సూత్రములను బోధించాడు. అవి: ఎ) జీవహింస చేయరాదు. బి) అసత్యమాడరాదు. సి) దొంగతనము చేయరాదు. డి) ఆస్తిపాస్తులు ఉండరాదు. ఈ నాలుగు సూత్రాలకు లేక వ్రతాలకు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యము అనే ఐదవ సూత్రాన్ని జోడించాడు. ఈ ఐదు సూత్రాలను పంచవ్రతాలు లేక పంచకళ్యాణాలు అంటారు.

2) త్రిరత్నాలు: పంచవ్రతాలతోపాటు త్రిరత్నాలను కూడా మోక్ష సాధన కోసం పాటించాలని మహావీరుడు ప్రబోధించాడు. అవి: ఎ) సమ్యక్ దర్శనం లేక సరియైన విశ్వాసం. బి) సమ్యక్ జ్ఞానం లేక సరియైన జ్ఞానం. సి) సమ్యక్ చరిత్ర లేక సరియైన క్రియ. తీర్థంకరుల బోధనలకై శ్రద్ధను కలిగివుండటమే సమ్యక్ దర్శనము. వాటిలో సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. వీటిని అనుసరించుట ద్వారా దుఃఖలేశం లేని మోక్షం లేదా కైవల్యావస్థను మానవుడు పొందగలుగుతాడు.

3) సల్లేఖనా వ్రతం: పార్శ్వనాథుడు చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని బోధించాడు. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుందని తపస్సు మాత్రమే కర్మ బంధాన్ని తొలగిస్తుందని చెప్పాడు. ప్రాపంచిక బంధాల నుంచి, కర్మ నుంచి విముక్తిని సాధించటమే మోక్షమని ఆయన ప్రవచించాడు. కర్మచేయటం ద్వారా కర్మఫలాన్ని అనుభవించటం కోసం పునర్జన్మను ఎత్తవలసి వస్తుందని, కనుక కర్మను నాశనం చేయటం ద్వారానే మోక్షప్రాప్తిని పొందగలమని ఆయన బోధించాడు. కనుక ఉపవాసములచేత శరీరమును శుష్కింపచేసుకొని ప్రాణత్యాగము . చేయటం ద్వారా కర్మను అణచివేయవచ్చునని ఆయన బోధించాడు. ఈ ప్రక్రియనే “సల్లేఖనా వ్రతము” అంటారు.

4) కైవల్యం: జైనమతం యొక్క అంతిమ లక్ష్యం కైవల్యం లేక మోక్షము. పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖనా వ్రతమును ఆచరించుట ద్వారా మోక్షాన్ని సాధించవచ్చునని ఆయన ప్రవచించాడు. దుఃఖరహితము, అనంత సౌఖ్యప్రదము అయినదే మోక్షము. దీనినే కైవల్యావస్థ అంటారు. కైవల్యావస్థ పొందుట ద్వారా మానవుడు కర్మ, పునర్జన్మ వలయము నుండి శాశ్వత విముక్తిని పొందగలుగుతాడు.

5) ఇతర సూత్రాలు: జైనమతం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దేవుడున్నాడా లేడా అనే విషయానికి ఈ మతంలో ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై ఆధారపడివుంది. వర్థమాన మహావీరుడు వర్ణవ్యవస్థను ఖండించలేదు. నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన వర్ణవ్యవస్థను వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్నిబట్టి మానవుడు అగ్ర లేక అధమ వర్ణాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. జైనమతం జంతు బలులను, బ్రాహ్మణ ఆధిక్యతను, వేదాల ఆధిక్యతను నిరసించినది.

జైనమత వ్యాప్తి: జైనమత ప్రచారం కోసం మహావీరుడు జైన సంఘాన్ని స్థాపించాడు. స్త్రీ, పురుషులిద్దరు ఈ సంఘంలో సభ్యులు కావచ్చు. ఈ సంఘాలలో జైన భిక్షువులే కాక, తమ మత సూత్రాల ప్రకారం జీవితం గడుపుతూ విరాళాలు, కానుకల ద్వారా ఆ సంస్థలను పోషించే ఉపాసకులు కూడా ఉండేవారు. మహావీరుడు సంవత్సరంలో 8 నెలలు పర్యటన చేస్తూ తన బోధనలను ప్రచారం చేసేవాడు. జైనమతానికి రాజాదరణ కూడా లభించింది. మగధ పాలకులైన హర్యంక, నందవంశ రాజులు, చంద్రగుప్త మౌర్యుడు, కడపటి మౌర్యరాజైన సంప్రతి జైనమతాన్ని పోషించారు. భారతదేశంలో జైనమతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో బాగా ప్రచారంలో వుంది.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

ప్రశ్న 3.
బౌద్ధమత సూత్రాలు, భారతీయ సంస్కృతికి వారి సేవలను చర్చించండి.
జవాబు.
క్రీ.పూ. భారతదేశంలో జనించిన అనేక మతాలలో బౌద్ధమతం ఒకటి. దీని స్థాపకుడు గౌతమబుద్ధుడు.

గౌతమబుద్ధుని జీవితం: గౌతమబుద్ధుని అసలు పేరు సిద్దార్థుడు. ఇతడు క్రీ.పూ. 563వ సం॥లో ‘శాక్య’ వంశమునకు చెందిన శుద్ధోధనుడు, మాయాదేవీలకు లుంబినీవనమున జన్మించాడు. చిన్నతనమునే తల్లిని కోల్పోయి సవతి తల్లి ప్రజాపతి గౌతమిచే పెంచబడి ‘గౌతముడు’ అని పిలువబడ్డాడు. ఇతనికి ‘యశోధర’ అను రాకుమార్తెతో
వివాహం జరిగింది. వారి కుమారుడు ‘రాహులుడు’.

మహా పరిత్యాగము: సిద్ధార్థుడు తన 29వ ఏట ఒక ముదుసలిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూచి వైరాగ్యానికి లోనై సకల సంపదలను, భోగభాగ్యాలను, భార్యాబిడ్డలను వదిలి ఇల్లు విడిచి వెళ్ళాడు. ఈ సంఘటనతో అతని మనస్సు వికలమైంది. ప్రపంచమంతా దుఃఖమయమని, జీవితము అశాశ్వతమని గ్రహించి బవబంధములను తెంచుకొని. అడవులకు వెళ్ళి సన్యసించాడు. ఈ సంఘటననే ‘మహా పరిత్యాగము’ లేక ‘మహాభినిష్క్రమణము’ అంటారు.

జ్ఞానోదయమును పొందుట సన్యసించిన పిమ్మట సిద్ధార్థుడు సత్యాన్వేషణకై గయను చేరి అచ్చట ఒక అశ్వత్థ వృక్షము క్రింద 40 రోజులు ధ్యానము చేసి జ్ఞానమును పొందాడు. ఈ సంఘటనకే సంబోధి అని పేరు. అప్పటి – నుండి సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడినాడు. బుద్ధుడు అనగా జ్ఞానము పొందినవాడు అని అర్థము. బుద్ధుని శాక్యముని అని, తథాగతుడు అని పిలుస్తారు. నాటి నుండి అశ్వత్థ వృక్షము బోధి వృక్షముగాను, గయ బుద్ధగయగాను ప్రసిద్ధి చెందాయి.

ధర్మచక్ర పరివర్తనము: బుద్ధుడు గయ నుండి సారనాథ్ చేరి సమీపమున గల జింకల తోటలో తన పూర్వ సహవాసులైన బ్రాహ్మణులకు మొదటిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ సంఘటననే ధర్మచక్ర పరివర్తనము అంటారు. అప్పటి నుండి అనేక సంవత్సరములు బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేశాడు. తన శిష్యులలో ప్రముఖులైన వారిని సంఘంలో ఏర్పరచాడు.
నిర్వాణం: విస్తృతంగా బౌద్ధమతాన్ని ఉత్తరాపథమంతటా ప్రచారం చేసి బుద్ధుడు తన 80వ ఏట మల్ల రాజధానియైన కుశి నగరమున క్రీ.పూ. 483లో నిర్వాణం పొందాడు.

బుద్ధుని బోధనలు: బుద్ధుని బోధనల ప్రకారం మానవ జీవితం కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నది. మానవుడు చేసిన కర్మఫలము వలననే ఈ శరీరము మరల మరల జన్మనెత్తవలసి వస్తున్నది. కర్మ ఆచరణకు కోర్కెలే మూలము. అజ్ఞానము వలన కోర్కెలు జనించుచున్నాయి. కోర్కెల వలన మానవుడు కర్మలు ఆచరిస్తాడు. ఈ కర్మ ఫలితమే పునర్జన్మ. పునర్జన్మలేని సుఖమైన, ప్రశాంతమైన జీవనమే నిర్వాణము అని బుద్ధుడు బోధించాడు. నిర్వాణ సాధనకు మానవుడు ఆర్య సత్యములను గ్రహించి అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని పాటించవలెను.

ఆర్య సత్యములు: గౌతమ బుద్ధుడు తన దివ్య పరిజ్ఞానము వలన నాలుగు ప్రధానమైన సత్యములను గ్రహించాడు. వీటినే ఆర్య సత్యములు అంటారు. అవి:

  1. ప్రపంచమంతా దుఃఖమయము.
  2. దుఃఖమునకు కారణము కోర్కెలు.
  3. దుఃఖమును అంతము చేయుటకు కోర్కెలను నిరోధించవలెను.
  4. కోర్కెలను నిరోధించుటకు అష్టాంగమార్గమును అవలంబించవలెను.

అష్టాంగ మార్గము: నిర్వాణమును పొందుటకు మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గమును అనుసరించిన చాలని బుద్ధుడు బోధించాడు. అవి:

  1. సరియైన విశ్వాసము
  2. సరియైన జ్ఞానము.
  3. సరియైన వాక్కు
  4. సరియైన క్రియ
  5. సరియైన జీవనము
  6. సరియైన ప్రయత్నం
  7. సరియైన ఆలోచన
  8. సరియైన ధ్యానము.

అష్టాంగ మార్గము ద్వారా ప్రతి వ్యక్తి శీలసంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గము అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.
ఈ దశసూత్ర నీతి: ఆర్యసత్యములు, అష్టాంగ మార్గములతోపాటు బుద్ధుడు పది అంశములు గల దశసూత్ర నీతిని ప్రబోధించాడు. ఈ సూత్రాలు:

  1. జీవహింస చేయరాదు.
  2. అసత్యమాడరాదు.
  3. దొంగతనము చేయరాదు.
  4. ఆస్తిపాస్తులు సమకూర్చుకొనరాదు.
  5. బ్రహ్మచర్యను పాటించవలెను.
  6. మత్తు పదార్ధములు సేవించరాదు.
  7. పరుష వాక్యములు వాడరాదు.
  8. ఇతరుల ఆస్తులను కోరరాదు.
  9. అవినీతి పనులు చేయరాదు.
  10. విలాసాలను విడనాడాలి.

నిర్వాణము: ఆర్యసత్యములను గ్రహించి, అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని ఆదరించటం వలన మానవుడు మోక్షమును పొందుటకు అర్హుడవుతాడు. మోక్షమనగా పునర్జన్మలేని జన్మరాహిత్యము. దీనినే బుద్ధుడు నిర్వాణంగా పేర్కొన్నాడు. నిర్వాణ సాధనే ప్రతి వ్యక్తి ధ్యేయం కావలెను అని బుద్ధుడు బోధించాడు.

బౌద్ధమతతత్వం: బుద్ధుడు భగవంతుని ఉనికిని గురించి, ఆత్మను గురించి మౌనం వహించాడు. హిందూ మతమందలి కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలను అంగీకరించాడు. మహావీరుని వలె బుద్ధుడు కూడా యజ్ఞ యాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణుల ఆధికత్యను ఖండించాడు. వేదములను ప్రామాణిక గ్రంథములుగా బుద్ధుడు అంగీకరించాడు.

ముగింపు: ప్రపంచమునకు శాంతి సందేశమునందించుటకు అవతరించిన మహాపురుషులలో సుప్రసిద్ధుడు గౌతమ బుద్ధుడు. కామ,క్రోధములతో, హింసాత్మక చర్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవకోటిని ధర్మం, అహింస, కరుణ, మానవత అనే మహోన్నత ఆశయాలతో తీర్చిదిద్దుటకు అవతరించిన పుణ్య పురుషుడు. అందువల్లనే ఆసియా జ్యోతియని, ప్రపంచ జ్యోతియని శ్లాఘించబడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జైన ఫిలాసఫీ
జవాబు.
జైనులు వేదాల యొక్క అమోఘత్వాన్ని లేదా అధికారాన్ని ఖండించారు. ఎటువంటి కర్మ కాండలకు ప్రాముఖ్యతను ఇవ్వలేదు. వీటికి తోడు, చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని వారు భావించారు. ఆత్మ, శరీరమంతటా వ్యాపించి ఉంటుందనీ, తపస్సు మాత్రమే కర్మబంధాన్ని తొలగిస్తుందని చెప్పారు. తపస్సుతో సంచిత కర్మ నాశనమౌతుంది. జైనమతంలో అహింసా దీక్షను చాలా కఠినంగా పాటించాల్సి వచ్చింది. తెలిసి చేసినా, తెలియక చేసినా హింస క్షమార్హం కాదంటారు. జైనులు సృష్టికర్త భావనను, దేవుడు ఉనికిని తోసిపుచ్చారు. వ్యక్తులు సంచిత కర్మను తొలగించుకొనేందుకు, మోక్షాన్ని పొందేందుకు త్రిరత్నాలను ఆదరించాలి. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర అనేవి త్రిరత్నాలు. తీర్థంకరుల బోధనల్లోని శ్రద్ధే సమ్యక్ దర్శనం. వాటిలోని సత్యాన్ని గ్రహించటమే, సమ్యక్ జ్ఞానం. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర.

జైన మతం కొంతవరకు హిందూ మతానికి సన్నిహితంగా ఉంది. ఈ మతంలో దేవుడున్నాడా లేడా అనే విషయానికి ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై, జైన మతం ఆధారపడింది. అయితే, ఈ మతంలో గమనించదగ్గ విషయం మహావీరుడు వర్ణ వ్యవస్థను ఖండించకపోవటం, నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన దీన్ని వ్యతిరేకించకుండా, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మానవుడు అగ్ర, అధమ వర్గాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
బుద్ధుని బోధనలు.
జవాబు.
బుద్ధుడు స్థాపించిన మతం ఆధ్మాత్మిక సాధనకు సంపూర్ణమైనది. బౌద్ధమతం ప్రకారం ఈ ప్రపంచం కార్యకారణ సంబంధమైనది. అనగా ప్రతి సంఘటన ఏదో ఒక కారణము వలన జరుగుచున్నది. ఇట్టి కార్యకార్య సంబంధమైన ప్రపంచమే సత్యమని భావించినపుడు మానవునికి జీవితముపై కల్గు ‘తృష్ణ’ (కోరిక) పునర్జన్మకు కారణమవుతున్నది. అసలు మానవజన్మే ‘దుఃఖ భరితముగాను మౌలికంగా కోర్కెలే (అజ్ఞానం) దుఃఖానికి కారణమవుతున్నాయి. కాబట్టి దుఃఖమును అంతము చేయవలెనన్న ఈ ప్రపంచం అశాశ్వతమని గ్రహించాలి. ఈ ప్రపంచం అశాశ్వతమని తెలుసుకొనేందుకు బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను ప్రబోధించాడు. అవి:

  1. ప్రపంచం దుఃఖమయం (దుఃఖ)
  2. దుఃఖానికి తృష్ణ (కోరిక) కారణం (సముదాయ)
  3. కోరికను నిరోధిస్తే, దుఃఖం నశిస్తుంది (నిరోధ)
  4. దానికి మార్గం ఉంది. (అష్టాంగ మార్గం)

అజ్ఞానం దుఃఖానికి కారణమని బుద్ధుడు ప్రబోధించాడు. అజ్ఞాన నిర్మూలనకు ఎనిమిది నీతి సూత్రాలను ప్రతిపాదించాడు. వీటికే ‘అష్టాంగమార్గ’ మని పేరు. అవి:

  1. సరైన వాక్కు
  2. సరైన క్రియ
  3. సరైన జీవనం
  4. సరైన శ్రమ
  5. సరైన ఆలోచన
  6. సరైన ధ్యానం
  7. సరైన నిశ్చయం
  8. సరైన దృష్టి

అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తే, అవిద్య (అంటే పునర్జన్మకు కారణం) నశిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి నిర్మాణం సిద్ధిస్తుంది. నిర్యాణం అంటే అనంతం, అమృతం అయిన మానసిక ప్రశాంత స్థితి.

ప్రశ్న 3.
బౌద్ధ సంగీతులు.
జవాబు.
బుద్ధుని బోధనలు సంకలనం చేయుటకు మొత్తం నాలుగు సమావేశాలు (సంగీతి) జరిగాయి.
మొదటి బౌద్ధ సంగీతి రాజగృహ ప్రాంతంలో ‘మహాకశ్యపుడి ‘ అధ్యక్షతన క్రీ.పూ. 483లో జరిగింది. ఇందులో బుద్ధుని బోధనలను గ్రంథస్థం చేసి స్థిరీకరించారు. ఆనంద, ఉపాలి చేత సుత్త, వినయ పీటికలు సంకలనం చేయబడ్డాయి. రెండవ బౌద్ధ సంగీతి వైశాలీ నగరంలో ‘సబకమి’ అధ్యక్షతన క్రీ.పూ. 383న జరిగింది. సంప్రదాయ, సంప్రదాయేతర సన్యాసుల మధ్య విభేదాలను పరిష్కరించడం ప్రధానోద్దేశ్యం. ఈ సంగీతిలో బౌద్ధులు ధీరవాదులు, స్థవిరవాదులుగా విడిపోయారు.

మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్ర నగరంలో మొగ్గలిపుత్రతిస్స అధ్యక్షతన క్రీ.పూ. 250లో జరిగింది. ఈ సంగీతిలో అభిదమ్మ పీటిక సంకలనం చేయబడింది. నాలుగవ బౌద్ధ సంగీతి కాశ్మీర్లో, వసుమిత్రుడి అధ్యక్షతన క్రీ.శ. 100వ సంవత్సరంలో జరిగింది. ఈ సంగీతిలో బౌద్ధులు మహాయాన, హీనయాన వాదులుగా విడిపోయారు.

ప్రశ్న 4.
జైన బౌద్ధ మతాల మధ్య భేదాలు.
జవాబు.
జైనమతం

  1. మోక్షాన్ని చేరుకోవడంలో జైన మతం ఆచరణ సాధ్యం కాని విధంగా కఠినంగా చెప్పింది.
  2. జైన మతం సాధారణ వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చింది.
  3. జైనమతం భారతదేశంలోనే ప్రచారం చేసుకొంది.
  4. జైన మతం, వైదిక మతంలో భౌతిక తాత్విక వాదానికి ప్రాధాన్యత ఇచ్చింది.

బౌద్ధమతం

  1. బౌద్ధమతం ఆచరణ యోగ్యంగా చెప్పింది.
  2. బౌద్ధమతం సంఘానికి, సన్యాసులకు ప్రాధాన్యత. ఇచ్చింది.
  3. బౌద్ధమతం విదేశాలకు వెళ్ళి భారతదేశంలో మాయమైంది.
  4. బౌద్ధమతం అటువంటి చర్యలను నిరసించింది.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

ప్రశ్న 5.
అజీవకులు.
జవాబు.
మక్కలి గోసలి దీని ప్రచారకుడు. ఇతడు నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలు ఎక్కువగా చేరలేదు. ‘ఏదీ మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని ఈ శాఖ వారి నమ్మకం. ఇతడు ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మలలో చేరుతూ ఉంటుంది అని పేర్కొన్నాడు. వీరు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు. గోసలి పుట్టుకతో బానిస తరువాత కాలంలో బోధకుడయ్యాడు. ఇతడు హిందూ మతానికి చెందిన దేన్నీ చివరకు కర్మ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోలేదు. అజితకేశకంబలి, పకుద కాత్యాయన ఈ మతశాఖలోని ఇతర బోధకులు.

ప్రశ్న 6.
చార్వాకులు.
జవాబు.
దేవతల గురువైన బృహస్పతి ఈ మతశాఖ స్థాపకుడుగా చెప్తారు. పాళి, సంస్కృత భాషల్లో ‘లోక’ అంటే ప్రపంచం, -ప్రజలు. లోకాయతులు భౌతిక వాదులు. తీవ్ర నాస్తికులు. వీరు ‘ఆత్మ’ సిద్ధాంతాన్ని ‘ఖండించారు. ప్రపంచంలోని ప్రతిదాని మీద వీరికి నమ్మకం ఉంటుంది. వీరి శాఖలో ప్రధాన ప్రచారకుడు చార్వాకుడు. అందువల్ల ఈ శాఖకు చార్వాక శాఖ అనే పేరు వచ్చింది. లోకాయతులు చెప్పిన వాస్తవిక భౌతికవాదమే చివరకు సామాన్య విజ్ఞానశాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తీర్థంకరులు.
జవాబు.
జైనమత ప్రబోధకులను తీర్థంకరులంటారు. వీరు మొత్తం 24 మంది. మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.

ప్రశ్న 2.
త్రిరత్నాలు.
జవాబు.
‘సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర’ అనేవి త్రిరత్నాలు. తీర్థంకరుల బోధనలోని శ్రద్ధే సమ్యక్ దర్శనం. వాటిలోని సత్యాన్ని గ్రహించడమే సమ్యక్ జ్ఞానం’. వాటిని పాటించటమే సమ్యక్ చరిత్ర.

ప్రశ్న 3.
సల్లేఖన వ్రతం.
జవాబు.
జైన మత ఆచారాలలో సల్లేఖన ఒకటి. కైవల్యాన్ని పొందటానికి స్వచ్ఛందంగా ఘన, ద్రవ పదార్థాలను క్రమేపి తగ్గించుకుంటూ చివరకు ఏమీ తీసుకోకుండా శరీరాన్ని త్యజించడం సల్లేఖన వ్రతం. ఈ విధంగా చేస్తూ శారీరక, మానసిక క్రియల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందవచ్చు అనేది వారి విశ్వాసం. మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖన వ్రతం ఆదరించాడు.

ప్రశ్న 4.
సంబోధి.
జవాబు.
సన్యాసిగా మారిన తరువాత సిద్ధార్థుడు బ్రాహ్మణ గురువైన రుద్రాలి రామపుత్ర వద్ద సకల శాస్త్రాలు, వేదాంతం నేర్చుకొన్నాడు. అయితే ఇవి అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాయి. తరువాత రాజగృహకు చేరుకొని కఠిన తపస్సు ఆచరించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విధంగా ఆరు సంవత్సరాల పాటు సంచార జీవితం గడుపుతూ, చివరకు గయ వద్ద అశ్వత్థ వృక్షఛాయలో 40 రోజులు ధ్యానం చేశాక, అతనికి జ్ఞానోదయమైంది. దీన్నే సంబోధి అంటారు. గౌతముడు బుద్ధుడయ్యాడు.

ప్రశ్న 5.
ఆర్య సత్యాలు.
జవాబు.

  1. ప్రపంచం దుఃఖమయం (దుఃఖ)
  2. దుఃఖానికి తృష్ణ (కోరిక) కారణం (సముదాయ)
  3. కోరికను నిరోధిస్తే, దుఃఖం నశిస్తుంది (నిరోధ)
  4. దానికి మార్గం ఉంది (అష్టాంగ మార్గ).

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

ప్రశ్న 6.
అష్టాంగ మార్గం.
జవాబు.
నిర్వాణము పొందడానికి మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని బుద్ధుడు బోధించాడు.
అవి:

  1. సరైన విశ్వాసము
  2. సరైన జ్ఞానము
  3. సరైన వాక్కు
  4. సరైన క్రియ
  5. సరైన జీవనము
  6. సరైన ప్రయత్నం
  7. సరైన ఆలోచన
  8. సరైన ధ్యానం

అష్టాంగ మార్గం ద్వారా ప్రతి వ్యక్తి శీల సంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.

ప్రశ్న 7.
త్రిపీటకాలు.
జవాబు.
బుద్ధుని కాలం నుంచి రూపుదిద్దుకొన్న అసలు బౌద్ధసాహిత్యము – త్రిపీటకాలు, ఇవి పాళీ భాషలో రచించబడినది. సుత్త పీటకం – దీంట్లో బుద్ధుని బోధనలు ఉంటాయి. (ఆనందుడు రచించాడు)
వినయ పీటకం – దీంట్లో సంఘ నిర్మాణము, నియమ నిబంధనలు ఉంటాయి. (ఉపాలి రచించాడు) అభిదమ్మ పీటకం – దీంట్లో అధి భౌతికత, మనోవిజ్ఞాన శాస్త్రం (మొగలి పుత్త తిస్స).

Leave a Comment