TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర, భౌగోళిక పరిస్థితులు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశపు భౌగోళిక లక్షణాలను చర్చించండి ?
జవాబు.
చరిత్రకూ భూగోళ విజ్ఞానానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఒక దేశ చరిత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి తెలుసుకోవడం అవసరం. భారతదేశం భౌగోళిక వైవిధ్యం కలిగిన పురాతన భూభాగం. ఎన్నో నాగరికతలు, సామ్రాజ్యాలు ఈ భూభాగంలో ఏర్పడి, అంతరించిపోయినప్పటికీ, ఒక అవిచ్ఛిన్న సంస్కృతి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ‘భరతవర్షం’గా పిలిచేవారు. భరతుని భూమిగా, దేశప్రజలను భరతసంతతిగా అభివర్ణించారు. భారతదేశాన్ని పురాణాల్లో జంబూద్వీపం అనేవారు. ఈ దేశానికి ‘ఇండియా’ అనేది మరొక పేరు. సింధూనది ప్రవహిస్తున్న దేశం కాబట్టి దీన్ని సింధూదేశంగా గ్రీకులు, పారశీకులు వ్యవహరించారు. క్రమంగా ‘సింధు’ పారశీకుల ఉచ్చారణలో ‘హిందు’గా, గ్రీకుల ఉచ్చారణలో ‘ఇండ్’గా మారింది. కాలగమనంలో హిండ్గా, హిందూస్తాన్ గా ఈ దేశం వ్యవహరింపబడింది.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

భారత ఉపఖండానికి భౌగోళిక పరిస్థితులు సహజ రక్షణను కల్పిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతశ్రేణి, తూర్పువైపు బంగాళాఖాతం, దక్షిణం వైపు హిందూమహాసముద్రం, పడమటివైపు అరేబియా సముద్రం సహజమైన ఎల్లలుగా ఉన్నాయి. దేశంలోని పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, తీర ప్రాంతాలు దేశచరిత్ర గతిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి.

హిమాలయ పర్వత శ్రేణి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ (బర్మా) వరకు వ్యాపించి ఉంది. దాదాపు 2400 కి.మీ. పొడవు, 300 కి.మీ ఎత్తులో ఇవి ఉత్తరాన పెట్టని గోడ వలే ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు. ఎవరెస్టు లేదా గౌరీశంకర్ (ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం). కాంచనగంగ, దౌళగిరి, నంగప్రభాత్, నందాదేవి లాంటి పర్వతశ్రేణులు హిమాలయాల్లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వతాలుగా చెప్పబడే ఆరావళి పర్వతాలు దేశంలో వాయవ్య ప్రాంతంలో ఉన్నాయి.

దేశంలోని పీఠభూములను మాళ్వా, ఛోటానాగపూర్, దక్కన్ పీఠభూములుగా వర్గీకరించారు. మాళ్వా పీఠభూమి, దక్కన్ పీఠభూములను వింధ్య, సాత్పూరా పర్వతాలు వేరు చేస్తున్నాయి. దక్కన్ పీఠభూమికి మూడువైపులా సముద్రం ఆవరించి ఉండటం వల్ల ఇది ద్వీపకల్పంగా ఏర్పడింది.

మైదానాల్లో గంగా-సింధూ మైదానాలు ముఖ్యమైనవి. హిమాలయాలనుంచి ప్రవహించే జీవనదులు తీసుకొచ్చిన ఒండ్రుమట్టితో ఈ సారవంతమైన మైదానాలు ఏర్పడ్డాయి. సింధు, గంగ వాటి ఉపనదుల పరీవాహక ప్రాంతాలు ఈ మైదానాల్లో అంతర్భాగాలు. మరోవైపు తూర్పు, పశ్చిమ కనుమల్లో జన్మించే కృష్ణ, గోదావరి లాంటి నదులు, వాటి ఉపనదుల వల్ల దక్షిణ భారతదేశంలో కూడా మైదానాలు ఏర్పడ్డాయి. నదీపరీవాహక ప్రాంతాలతో పాటుగా దేశ వాయువ్య ప్రాంతంలో ఉన్న థార్ ఎడారిని ఒక ప్రత్యేక భౌగోళిక లక్షణంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతం భారత, పాకిస్తాన్ దేశాలకు సహజ సరిహద్దుగా ఉంది.

తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూమహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రాలు భారతదేశానికి చాలా పొడవైన తీర రేఖను ఏర్పరుస్తున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ద్వీపకల్ప పశ్చిమ భాగం వైపు డామన్ నుంచి తిరువనంతపురం వరకు పశ్చిమ కనుమలు(సహ్యాద్రి) వ్యాపించి ఉన్నాయి. ఉత్తర తీరాన్ని కొంకణ తీరమని, దక్షిణాన భాగాన్ని మలబార్ తీరంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ కనుమలు దాదాపు 1600 కిలోమీటర్ల పొడవు మేర వ్యాపించి ఉన్నాయి. వీటి సరాసరి ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు. వీటికి భిన్నంగా తూర్పు కనుమలు అవిచ్ఛిన్నంగా బంగాళాఖాతం వైపు ఉన్నాయి. ఇవి ఒరిస్సాలోని మహేంద్రగిరి (గంజాం జిల్లా) నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ కనుమలు ఎన్నో చిన్న, పెద్ద నదులకు జన్మస్థానాలుగా ఉన్నాయి.

ప్రశ్న 2.
భారతదేశ చరిత్ర, సంస్కృతిపై భౌగోళిక పరిస్థితుల ప్రభావాన్ని వివరించండి.
జవాబు.
భారత ఉపఖండం భౌగోళిక పరిస్థితుల్లో గొప్ప వైవిధ్యం ఉంది. ఇవి భారతదేశ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేశాయి. రాజకీయ సరిహద్దుల్ని, సామాజిక స్థితిగతుల్ని, జాతి విస్తరణను ఈ భౌగోళిక పరిస్థితులే నిర్దేశించాయి. ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన మూడువైపులా సముద్రాలు సువిశాల భారతదేశానికి సహజ సరిహద్దులుగా ఉండటంతో ఇది ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా ఏర్పడింది. ఈ భౌగోళిక పరిధిలో ఉండటం వల్ల తామంతా ఒకటనే భావన, ఇది తమ మాతృదేశమని ప్రజలు భావించారు. భారతీయుల్లో ఐక్యతకు దోహదం చేశాయి. ఇవి భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేక స్వరూపాన్ని ఇవ్వగలిగాయి.

హిమాలయాలు దేశానికి పెట్టని కోటవలె రక్షణ సమకూర్చటమేగాక, ఉత్తర ఆర్కిటిక్ నుంచి వచ్చే అతి శీతల పవనాల తీవ్రత నుంచి దేశానికి రక్షణను కల్పిస్తున్నాయి. హిమాలయాలు లేనట్లయితే, ఉత్తర భారతదేశం ఒక శీతల ఎడారిగా మారి ఉండేది. భారతీయ మత, సారస్వతాల్లో ఈ పర్వతాలు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి. కాబట్టి ఇవి జాతీయ పర్వతశ్రేణిగా భారతీయుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఉత్తరాన పెట్టనిగోడ వలే ఉండి విదేశీ దండయాత్రల నుంచి దేశానికి రక్షణ కల్పిస్తున్నాయి. అయితే ఇవి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయలేదు. కైబర్, బోలాన్ లాంటి కనుమల ద్వారా పశ్చిమ, మధ్య ఆసియా దేశాలతో మనదేశానికి అనేక వేల సంవత్సరాల ద్వారా సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి ద్వారానే విదేశీ ఆక్రమణదార్లు భారతదేశాన్ని జయించాలని చూశారు. అలెగ్జాండర్ దండయాత్ర దీనికొక ఉదాహరణ. విదేశీయులు వచ్చిన ఈ రహదార్ల ద్వారా వర్తక వ్యాపారాలు జరిగాయి. సాంస్కృతిక మార్పిడికి, ప్రభావాలకు కూడా ఇవి కారణమయ్యాయి. దీనివల్ల రహదార్ల ప్రాముఖ్యత హెచ్చి, ప్రముఖ వర్తక కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోని వివిధ సంస్కృతులు ఒకటయ్యాయి. భారతీయ, గ్రీకు శిల్పకళల సమ్మేళనంగా ఏర్పడిన గాంధార శిల్పకళలు దీనికి ఉదాహరణగా పేర్కొవచ్చు. ఇది కళాచరిత్ర జగత్తులో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగింది.

భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన భౌగోళిక అంశాల్లో గంగా సింధూ మైదానాలు ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలో అనేక సంస్కృతులు ఆవిర్భవించాయి. వైదిక, వైదికేతర మతోద్యమాలు, పట్టణీకరణ మూలాలన్నీ కూడా ఈ మైదానాల్లోనే చూడవచ్చు. మౌర్యులు, గుప్తులు లాంటి ఎన్నో సామ్రాజ్యాల విజృంభణకు ఈ ప్రాంతం నిలయమైంది. వ్యవసాయ సంపదకు ఆధారనిలయమైంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి.

ప్రపంచంలోనే అత్యంత పురాతన భూభాగమైన దక్కన్ పీఠభూమి ప్రాక్ చరిత్రకు సంబంధించిన సంస్కృతులకు నిలయం. ఈ ప్రాంతం కూడా ఎన్నో సంస్కృతులకు, సంప్రదాయాలకు, భాషలకు పుట్టినిల్లు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర, బహమనీ లాంటి రాజకీయ శక్తులు ఈ ప్రాంతం నుంచే విజృంభించాయి. ఈ ప్రాంతంలో నిక్షిప్తమైన బంగారు, వజ్రాలు ఇతర అమూల్యమైన సంపదల కోసం అనేక రాజవంశాలు యుద్ధాలు చేశాయి. వింధ్య పర్వతశ్రేణి దక్షిణ, ఉత్తర భారతదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడేందుకు కారణమైంది. అందుకే దక్కన్ పీఠభూమి దక్షిణ, ఉత్తర దేశ సంస్కృతుల కలయిక ప్రదేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ

కనుమలు మహారాష్ట్రులకు సహజ సిద్ధమైన రక్షణ సదుపాయం కలగజేశాయి. పశ్చిమ కనుమల ఉపరితలాలు కోటల నిర్మాణానికి అనుకూలంగా ఉండి మహారాష్ట్రుల విజృంభణకు దోహదం చేశాయి. రాజస్థాన్లోని ఆరావళీ పర్వతాలు రాజపుత్రుల చరిత్రలో ప్రముఖపాత్రను నిర్వహించాయి. ఇవి రాజపుత్రులకు సహజసిద్ధమైన రక్షణ సౌకర్యాలు కలగజేయడమే కాకుండా వారిని వీరులుగా తీర్చిదిద్దాయి.

హిమాలయాల నుంచి ప్రవహించే జీవనదులు వ్యవసాయరంగ సంపద వృద్ధి చెందడానికి, రవాణా సౌకర్యాలు మెరుగుపడడానికి ఉపయోగపడ్డాయి. ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికతా కేంద్రాలు వికసించాయి. అంతర్గతంగా మహానదులన్నీ సంస్కృతీ, వర్తక వ్యాపారాలు పెంపొందడానికి కారణమైతే, మూడువైపులా ఉన్న మహాసముద్రాలు మనదేశానికి మిగిలిన ప్రపంచంతో సంబంధం ఏర్పడటానికి కారణమయ్యాయి.

భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో చాలా తేడాలున్నాయి. భారతదేశ దక్షిణ భాగం ఉష్ణమండలంలోను, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. ఈ ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఉష్ణ వాతావరణం కంటే శీతల, సమశీతోష్ణ వాతావరణంలోనే దేశవాసులు ఎక్కువ సమయం శ్రమించగలుగుతారు. దీని కారణంగానే రాజపుత్రులు, శిక్కులు, మరాఠాలు తమ పరాక్రమాన్ని, ధైర్యసాహసాల్ని చూపగలిగారు.

దేశానికి సుదీర్ఘమైన సముద్రతీరం ఉండటం వల్ల దక్షిణంలో పరిపాలించిన ఆంధ్రులు, కళింగులు, చోళులు మొదలైన వారు ఆగ్నేయాసియా దేశాలతో సముద్రం మీదగా వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. కంబోడియా, థాయ్లాండ్, జావా, సుమిత్రా, బోర్నియో, బర్మా, నేపాల్ దేశాల్లో భారతీయులు స్థిరనివాసాలేర్పరచుకొని వర్తక వ్యాపారాలను పెంపొందించారు. ఈ విధంగా ఏర్పడిన వ్యాపార సంబంధాలు క్రమంగా భారతీయ సంస్కృతి వ్యాప్తికి తోడ్పడ్డాయి. ఈ విధంగానే బౌద్ధమతం ఆగ్నేయాసియాలో వ్యాపించగలిగింది. అట్లాగే హిందూమతం కూడా విస్తరించింది. సుదీర్ఘమైన తీరప్రాంతం భారతదేశానికి ఉంది కనుకనే పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఆంగ్లేయ వ్యాపారులు సముద్రం మీదుగా ఈ దేశానికి వచ్చి క్రమంగా తమ వలసలను ఇక్కడ విస్తరించుకోగలిగారు.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 3.
భారతదేశ చరిత్ర నిర్మాణంలో సాహిత్య ఆధారాల ప్రాముఖ్యత గురించి రాయండి.
జవాబు.
చారిత్రక ఆధారాలలో సాహిత్య ఆధారాలు ముఖ్యమైనవి. ఇవి సమకాలీన సమాజపు పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. సాహిత్య ఆధారాలను స్థూలంగా దేశీయ సాహిత్య ఆధారాలు మరియు విదేశీ సాహిత్య ఆధారాలు అనీ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

A) దేశీయ సాహిత్య ఆధారాలు (Native Literary Sources): దేశీయ సాహిత్య ఆధారాలు అంటే అవి ఇక్కడే రూపుదిద్దుకొన్న ఆధారాలని అర్థం. ఈ ఆధారాలు చరిత్ర రచనకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ప్రాచీన భారతదేశ సాహిత్యం చాలావరకు మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బాటుగా లౌకిక రచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రాచీన భారత దేశ చరిత్ర పునర్నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతున్నాయి.

మతపరమైన సాహిత్యం: ప్రాచీన భారతదేశంలో రచనలన్నీ దాదాపుగా మతపరమైనవి. అయినప్పటికీ వీటిలో చారిత్రక వ్యక్తులు మరియు చారిత్రక సంఘటనల గురించి కూడా రాయబడ్డాయి.

బ్రాహ్మణీక గ్రంథాలు: బ్రాహ్మణీక గ్రంథాలు లేదా వేద సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ముఖ్యమైన ఆధారంగా ఉంది. వీటిని సంస్కృత భాషలో రాశారు. వాటిలో పేర్కొనదగ్గవి వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్లు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. ఈ సాహిత్యం అంతా కూడా నాటి సమాజాన్ని ప్రతిబింబించింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్యమైన ఋగ్వేదం తొలి ఆర్యుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలియచేస్తోంది. మిగిలిన మూడు వేదాలైన యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉపనిషత్లు భారతీయ తాత్విక ధోరణుల గురించి వివరిస్తాయి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు మలివేద ఆర్యుల కాలం నాటి రాజ్య విస్తరణ, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక మత, పరిస్థితులను తెలియచేస్తాయి. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ముఖ్యమైన ఆధారాలుగా పరిగణింపబడుతున్నాయి. వీటిలో మత్స్య, వాయు, భవిష్య, విష్ణు, భాగవత పురాణాలు చారిత్రకంగా ముఖ్యమైనవి. ఈ పురాణాల వల్ల ముఖ్యంగా హర్యంక, శిశునాగ, నంద, మౌర్య, శాతవాహన మొదలగు రాజవంశాల చరిత్ర తెలుసుకోవచ్చు.

బౌద్ధ గ్రంథాలు: ఇవి బౌద్ధుల తాత్విక, మతపరమైన గ్రంథాలు. పాళీ, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో ఈ గ్రంథాలు ఉన్నాయి.

పాళీ గ్రంథాలు: హీనయాన బౌద్ధం పాళీ గ్రంథాలను అనుసరించింది. బుద్ధుడి జ్ఞాన సముపార్జనానంతరం త్రిపిటకాలు ఏర్పడ్డాయి. అవి: 1. సుత్తపీటకం, 2. వినయపీటకం, 3. అభిదమ్మ పీటకం. ఇవి బౌద్ధమత ధర్మం గురించి, ఆచార వ్యవహారాల గురించి, బౌద్ధతత్వాన్ని గురించి చెబుతాయి.

బౌద్ధ సంస్కృత గ్రంథాలు: మహాయాన బౌద్ధం సంస్కృత గ్రంథాలను అనుసరించినట్లు తెలుస్తున్నది. మహాయానంలో బుద్ధుణ్ణి దేవునిగా కొలిచారు. “వైపుల్య సూత్రం” మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం. “లలిత విస్తరం” బుద్ధుని చరిత్రను, బౌద్ధ ప్రపంచాన్ని తెలియజేస్తుంది. “సధర్మ పుండరీక” మహాయానుల మరో పవిత్ర గ్రంథం.

జైనగ్రంథాలు: జైనుల మత గ్రంథాలు అర్థమాగధి, ప్రాకృత భాషల్లో రాశారు. వీటిని పన్నెండు అంగాలు, పన్నెండు ఉపాంగాలు, పరి ప్రకీర్ణాలు, ఆరు చేదసూత్రాలు, నాలుగు మూల సూత్రాలు, నాలుగు వివిధ రకాలైన గ్రంథాలుగా విభజించారు. పన్నెండు అంగాలు జైన భిక్షువులు ఉపాసించవలసిన విధానాలను, జైనమతి తత్వాన్ని, మత జ్ఞానాన్ని, కథలను, జైన గురువులను, స్వర్గ నరకాల వివరణను తెలియజేస్తున్నాయి.

చారిత్రక గ్రంథాలు (Historical Texts): పాళీభాషలో రచించిన ‘దీపవంశ’, ‘మహావంశలు’ శ్రీలంక చరిత్రను వివరిస్తాయి. భారతదేశంలోని బౌద్ధమత వ్యాప్తిని, శ్రీలంకలోని బౌద్ధమత వ్యాప్తిని ఈ గ్రంథాలు వివరిస్తాయి. ఇవి దక్షిణ భారతదేశ చరిత్రను, రాజకీయ పరిస్థితులను కూడా తెలుపుతాయి. దీపవంశం నాలుగు లేదా ఐదో శతాబ్దిలో విరచితమైనట్లు తెలుస్తున్నది. మహావంశ ఐదో శతాబ్ది చివర్లో మహానాముడు రచించాడు. సంస్కృతంలో వెలువడిన మరొక చారిత్రక గ్రంథం కల్హణుడు రచించిన “రాజతరంగిణి” (క్రీ.శ. 1148). ఇది కాశ్మీర్ దేశ రాజుల వంశావళిని వివరిస్తుంది. దీనిలోని కథల్లో చారిత్రక వాస్తవాలు కూడా ఉన్నాయి.

జీవితచరిత్రలు (Biographies): గురువుల, రాజుల జీవిత చరిత్రలను గురించి రాసిన సాహిత్యం మనకు ప్రాచీన కాలంలో చాలా కనిపిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి అశ్వఘోషుడు రచించిన “బుద్ధచరితం”, బాణభట్టు రచించిన “హర్షచరితం”, ప్రాకృతభాషలో ముంజరాజు (వాక్పతి) రచించిన “గౌడవహూ” చాంద్ బర్దాయ్ రచించిన “పృధ్వీరాజ్ సో”. బుద్ధచరితం కనిష్కుని కాలానికి సంబంధించింది. హర్షచరితం హర్షుని చరిత్రను, గౌడవూ కనోజ్ రాజైన యశోవర్మని కాలానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి.

శాస్త్రీయ, సాంకేతిక గ్రంథాలు (Scientific and Technical Books): ఈ గ్రంథాలు ప్రాచీన భారతదేశంలోని శాస్త్ర, సాంకేతిక ప్రగతితో పాటుగా చారిత్రక విషయాలను వివరిస్తాయి. ఆనాటి ప్రపంచంలో భారతదేశం ఖగోళం, గణితం వైద్య రంగాలలో, ఏవిధమైన ప్రగతి సాధించిందనే విషయాన్ని ఇవి తెలియచేస్తాయి. వరాహమిహురుడు రాసిన ‘పంచసిద్ధాంతిక’ భారతీయ ఖగోళ శాస్త్రానికి బైబిల్ లాంటిది. అలాగే ఆర్యభట్టు దశగీతికసూత్ర, సూర్యసిద్ధాంత, రోమక సిద్ధాంత, ఆర్యభట్టీయం అనేవి రచించాడు. చరక సంహిత అనేది వైద్య రంగానికి సంబంధించిన గ్రంథం. సంగం సాహిత్యం: ప్రాచీన భారత చరిత్ర రాయడానికి మరో ముఖ్యమైన ఆధారంగా తమిళంలో విరచితమైన “సంగమ సాహిత్యం”ను చెప్పవచ్చు. సంగం సాహిత్యమనేది తమిళ కవుల సృష్టి. ఈ సాహిత్యం చేర, చోళ, పాండ్య రాజుల వంశావళిని పేర్కొంది. వీటిలో తమిళదేశ సంస్కృతి, సమకాలీన స్థితిగతులు స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి

B) విదేశీ వాఙ్మయాధారాలు (Foreign Literary Sources): అనాది కాలం నుంచి విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించి, తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. ఈ విధంగా గ్రీకులు, చైనీయులు, ముస్లింలు, ఐరోపా వారి రచనలు మన దేశానికి సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వీటి సహాయంలో చరిత్రను పునర్నిర్మించవచ్చు.

గ్రీక్ ఆధారాలు: ప్రాచీన భారత చరిత్ర రాయడానికి గ్రీక్ ఆధారాలు చాలా ముఖ్యమైనవి. స్కైలాక్స్ రాసిన “ది అకౌంట్ ఆఫ్ ది జర్ని ఆఫ్ స్కైలాక్స్” మనకు లభించలేదు. హెరోడోటస్ (క్రీ.పూ. 483-430) భారతదేశాన్ని గురించి తన గ్రంథంలో రాశాడు. డేరియస్ ద్వారా వాయవ్య భారతదేశం గురించి తెలుసుకొన్న సమాచారాన్ని హెరోడోటస్ గ్రంథ రూపంలో రాశాడు, ఇది మన చరిత్రకు ఆధారం అయింది.

మెగస్తనీస్ అనే గ్రీస్ దేశస్థుడు సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి విచ్చేసి, ఆ కాలపు పరిస్థితులను వివరంగా “ఇండికా” అనే గ్రంథంలో రాశాడు. అయితే ఆ గ్రంథం ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఆ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలను స్ట్రాబో, డియోరస్, ఆరియన్ తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. అలాగే టాలమీ రాసిన “భూగోళం” (Ptolemy’s Geography), ఒక అజ్ఞాత రచయిత రాసిన “ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియక్ సి” (The Periplus of the Erythraean Sea)లు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించాయి. చైనా ఆధారాలు: బౌద్ధ పవిత్ర స్థలాలను చూడటానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధబిక్షువులు భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాస్తూ, తాము చూసిన సందర్శించిన ప్రదేశాల గురించి వివరంగా తెలిపారు. వారిలో ప్రముఖుడు ఫాహియాన్. అతను ఐదో శతాబ్దంలో “ఫో-కో-కి” (Fa kosuoki) అనే గ్రంథంలో మధ్య ఆసియా గురించి, వాయవ్య భారతదేశం, గంగాలోయ గురించి, శ్రీలంక, జావాలను గురించి వివరంగా రాశాడు. హ్యూయాన్ త్సాంగ్ అనే మరో చైనా దేశస్థుడైన బౌద్ధభిక్షువు హర్షుని కాలంలో భారతదేశానికి వచ్చి, హర్షుడి ఆస్థానాన్ని దర్శించాడు. అతడు “సి-యూ-కి” అనే గ్రంథంలో విశిష్టమైన విలువలు ఉన్న చారిత్రక విషయాలను స్పష్టంగా వివరించాడు. ఇత్సింగ్ (Itsing) అనే మరో యాత్రికుడు ఇండోనేషియా నుంచి సముద్రయానం చేసి భారతదేశాన్ని చేరాడు. సంస్కృత గ్రంథాలు, బౌద్ధుల ఆచార వ్యవహారాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా తెలిపాడు.

ముస్లిం ఆధారాలు: మహ్మదీయ చరిత్రకు సంబంధించిన ఆధారాలు క్రీ.శ. 7 లేదా 8 శతాబ్దాల నుంచి లభ్యమవు తున్నాయి. అల్బెరూనీ ఇబ్బతూత, బరౌనీ, అమీర్ ఖుస్రూ, ఫెరిష్టా మొదలైనవారి రచనలు మధ్యయుగ భారతదేశ చరిత్రకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 4.
ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి పురావస్తు ఆధారాలు ఏవిధంగా దోహదపడతాయో చర్చించండి ?
జవాబు.
ప్రాచీన కాలపు అవశేషాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాతత్త్వశాస్త్రం అని అంటారు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. తవ్వకాలు, అన్వేషణలో లభించిన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు (వాస్తు), శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలను పురావస్తు ఆధారాలుగా పేర్కొంటారు.
భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, జాతీయ స్మారక భవనాల పరిరక్షణకు, సంరక్షణకు భారత పురావస్తు శాఖ (ASI) బాధ్యత వహిస్తుంది.

భౌతిక అవశేషాలు (Material remains): భౌతిక అవశేషాలలో భాగంగా వివిధ రకాలైన మానవ, జంతు అవశేషాలు, రాతి, ఎముక పరికరాలు, ఇనుము, మృణ్యయ పాత్రలు, భవన శిధిలాలు ఉంటాయి. సింధులోయ, నర్మదాలోయ, కృష్ణ, గోదావరి తీరప్రాంతాల్లో, మధ్య భారతదేశంలోని జొహల్ పూర్, బళ్ళారి, ఛోటానాగపూర్, అస్సాం, పాండిచ్చేరి, పరిసర ప్రాంతాల్లో వీటిని కనుక్కోగలిగారు. ఇవి భారతదేశ ప్రాక్ చరిత్ర పునర్నిర్మాణానికి దోహదం చేశాయి.

కట్టడాలు (Monuments): భారతదేశం ప్రాచీనకాలం నుంచి వాస్తు సంపదకు పెట్టింది పేరు. దీన్ని హిందూ, బౌద్ధ, జైనఇండో-ఇస్లామిక్, ఆధునిక వాస్తుగా పేర్కోవచ్చు. ఈ కట్టడాలు ప్రాచీన, మధ్య, ఆధునిక కాలాలకు సంబంధించినవి. ఉపయోగించిన విధానాన్ని బట్టి వాస్తును మతపరమైన, లౌకికమైన వాస్తుగా కూడా గుర్తించవచ్చు. (Religious and Secular Architecture) ఇందుకు ముఖ్య కారణం వీటిని నిర్మించిన విధానాలే. ఇవి కూడా ఆ కాలపరిస్థితుల ప్రతిబింబాలే. వీటిని క్షుణ్ణంగా పరీక్షిస్తే వాటి లక్షణాలను బట్టి అవి ఏకాలానికి చెందినవో మనకు తెలుస్తుంది.

శిల్పాలు (Sculptures): సింధులోయ నాగరికత కాలం నుంచి నేటి వరకు, మనకు అనేక రకాలైన శిల్పాలు లభ్యమయ్యాయి. వీటిని వివిధ రకాలైన పదార్థాలతో తయారుచేశారు. శిల్పాల తయారీ విధానం, లక్షణాలు, ఆకాల పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.

చిత్రాలు (Paintings): మొదటి నుంచి భారతదేశంలో చిత్రకళ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రాక్ చరిత్రకు సంబంధించిన ప్రాక్ చారిత్రక చిత్రాలు (Pre-Historic Paintings) మనకు లభించాయి. అలాగే, క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి నేటివరకు, అనేక ప్రదేశాల్లో కుడ్య చిత్రాలు, లఘుచిత్రాలు, వస్త్రంపై చిత్రాలు (Canvas paintings) మొదలైనవి లభ్యమయ్యాయి.

మట్టిపాత్రలు: మట్టిపాత్రలు కూడా తవ్వకాల్లో సింధులోయ నాగరికత నుంచి నేటి వరకు లభ్యమౌతున్నాయి. వీటిని అనేక రకాల మట్టితో చేసినట్లు తెలుస్తున్నది. కాల్చని మట్టి పాత్రలతోపాటు కాల్చిన మట్టి పాత్రలు కూడా తవ్వకాల్లో లభించాయి. వీటిపై మెరుగులు (Polish) పెట్టేవారు. కొన్ని రకాలైన మట్టిపాత్రల పై బొమ్మలను కూడా చిత్రించారు. వీటిలో కొన్నింటిమీద విదేశీ ప్రభావం కూడా కనిపిస్తున్నది. దీనికి నాగార్జున కొండ, పాండిచ్చేరిలో దొరికిన మట్టిపాత్రలే నిదర్శనం. భారతదేశంలో లభ్యమైన మట్టి పాత్రలు అనేక రూపాల్లో, పరిమాణాల్లో (చిన్న, పెద్ద) ఉన్నాయి. ఇలాగే రకరకాలైన మట్టి పూసలు అనేక రంగుల్లో, పరిమాణాల్లో లభించాయి. వీటివల్ల ఆ కాలంలో అలంకరణకు ఉన్న ప్రాముఖ్యం అర్థమౌతుంది.

శాసనాలు (Inscriptions): పురావస్తు ఆధారాల్లో అత్యంత విశ్వసనీయమైనవి మరియు ముఖ్యమైనవి శాసనాలు. ఇవి చరిత్రకు సంబంధించిన వాస్తవాలను అందిస్తాయి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. శాసనాలను రాళ్లపైన, స్తంభాలపైన, భవనాల గోడలపైన, దేవాలయ గోడలపైనా గమనించవచ్చు. ఇవే కాకుండా ముద్రికలపైనా, రాగి రేకులపైనా (తామ్ర శాసనాలు) కూడా శాసనాలను లిఖించడం జరుగుతుంది. వివిధ ప్రయోజనాల కోసం శాసనాలు రాయబడుతాయి. శాసనాల్లో తెలిపిన సమాచారం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. కొన్ని శాసనాలు వంశ వృక్షాలను, రాజ ఉత్తర్వులను, రాజులు సాధించిన ఘనతను, వారి దిగ్విజయాలను (ప్రశస్తి), మతపరంగా ఇచ్చిన దాన విశేషాలను తెలియచేస్తాయి. భారతదేశంలో సంస్కృతం, పాళీ, తమిళం, కన్నడం, తెలుగు మొదలైన వివిధ భాషల్లో శాసనాలు లభించాయి. అలాగే పురాతన లిపులైన ఖరోష్టి, బ్రహ్మీల్లో రాయబడిన శాసనాలు కూడా లభించాయి. వీటిలో కనిపించే భాషాశైలి, విషయాలు, మనకు ఆ కాలపు పరిస్థితులను స్పష్టంగా తెలియజేస్తాయి.

భారతదేశంలో మొదటిసారిగా అధికసంఖ్యలో లభ్యమైన శాసనాలు అశోకునివి. అతడు చక్రవర్తి అయినప్పటినుంచి వేయించిన రాతి శాసనాలు నేటి వరకు కూడా పదిలంగా ఉన్నాయి.

తాళపత్ర గ్రంథాలు కూడా చరిత్ర నిర్మాణానికి తోడ్పడతాయి. గుజరాత్లోని జైనతాళపత్ర గ్రంథాల్లో చిత్రాలను కూడా గీశారు. అలాగే మొగలుల కాలానికి చెందిన “అక్బర్ నామా” “బాబర్ నామా”లు గుడ్డపై రాసినవి. ముస్లిమ్ రాజులు కూడా అనేక శాసనాలను వేయించారు. ఈ విధంగా వంశ చరిత్రలను, రాజకీయ, పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత విషయాలను శాసనాలు తెలియజేస్తున్నాయి.

నాణేలు (Coins): చారిత్రక ఆధారాల్లో నాణేలు ముఖ్యమైనవి. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘న్యూమిస్మాటిక్స్’ అని అంటారు. నాణేలను భూమిలోనుంచి తవ్వకాల ద్వారా కానీ భూఉపరితలం పైనుంచి కానీ సేకరిస్తారు. నాణేలను సాధారణంగా బంగారు, వెండి, కంచు, మిశ్రమ లోహాలతో తయారుచేస్తారు. నాణేలపై అనేక రకాలైన బొమ్మలు, దేవతాప్రతిమలు, రాజుల ప్రతిమలు, వారి పేర్లు, తేదీలను కూడా ముద్రించేవారు. అవి దొరికిన ప్రదేశాన్ని ‘ బట్టి, అవి చలామణీలో ఉన్న ప్రాంతంను, పరోక్షంగా ఆ రాజ్య సరిహద్దులను కూడా సూచిస్తాయి. అవి ఏ కాలానికి చెందినవో, ఏ రాజువో అవి దొరికిన ప్రదేశాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. నాణేల ముద్రణలో, వాటిపై ముద్రించిన భాష, లిపి, ప్రతిమల విషయంలో ప్రతి రాజవంశం కూడా తనదైన శైలిని అనుసరించింది. ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలియచేయడంలో కూడా నాణేల ప్రాధాన్యత ఉంది. వ్యాపార, వాణిజ్య విషయాలను తెలియచేస్తూ, అనేక రాజవంశాల చరిత్రను పునర్నిర్మించడానికి నాణేలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇవే కాకుండా ఇతర ఎన్నో చారిత్రక విషయాలను వెలుగులోకి తేవడంలో నాణేలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు 1
మొత్తం మీద నాణేల ద్వారా ఆ కాలంనాటి రాజకీయ, ఆర్థిక సామాజిక మరియు మత పరిస్థితులను తెలుసుకోవచ్చు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
చరిత్ర ప్రాముఖ్యతను గురించి రాయండి.
జవాబు.
చరిత్ర సామాజిక శాస్త్రాలకు తల్లి లాంటిది. చరిత్ర అంటే రాజ్యాలు, రాజవంశాలకు చెందిన సంఘటనలు, తేదీల వర్ణన మాత్రమేకాదు. అంతకన్నా సమాజం, మానవ పరిణామ క్రమాన్ని తీర్చిదిద్దిన అన్నీ అంశాలను సమగ్రంగా వివరించేదే చరిత్ర. దీని అధ్యయనం అంటే లక్షల సంవత్సరాల మానవుల గత చిహ్నాలను తెలుసుకోవడమే. ప్రజలు ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా తమ సంస్కృతులను అభివృద్ధి పరచుకున్నారనే విషయాన్ని చరిత్ర తెలియచేస్తుంది. అనేక కారణాల దృష్ట్యా చరిత్ర అధ్యయనం అనేది ప్రాముఖ్యత కలిగిన అంశంగా చెప్పవచ్చు. ప్రస్తుత మన సాంస్కృతిక మూలాలను చరిత్ర తెలియచేస్తుంది. ఆలోచించడం, అర్థం చేసుకోవడం, పరిశోధనా వైఖరిని అలవరుచుకోవడం లాంటి జీవన నైపుణ్యాలను చరిత్ర మనకు అందిస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 2.
భారతదేశ భౌగోళిక లక్షణాలు.
జవాబు.
ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ‘భరతవర్షం’గా పిలిచేవారు. భరతుని భూమిగా, దేశప్రజలను భరతసంతతిగా అభివర్ణించారు. భారతదేశాన్ని పురాణాల్లో జంబూద్వీపం అనేవారు. ఈ దేశానికి ‘ఇండియా’ అనేది మరొక పేరు.

సింధూనది ప్రవహిస్తున్న దేశం కాబట్టి దీన్ని సింధూదేశంగా గ్రీకులు, పారశీకులు వ్యవహరించారు. క్రమంగా ‘సింధు’ పారశీకుల ఉచ్చారణలో ‘హిందు’గా, గ్రీకుల ఉచ్చారణలో ‘ఇండ్’గా మారింది. కాలగమనంలో హిందా, హిందూస్తాన్ ఈ దేశం వ్యవహరింపబడింది.

భారత ఉపఖండానికి భౌగోళిక పరిస్థితులు సహజ రక్షణను కల్పిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతశ్రేణికి, తూర్పువైపు బంగాళాఖాతం, దక్షిణం వైపు హిందూమహాసముద్రం, పడమటివైపు అరేబియా సముద్రం సహజమైన ఎల్లలుగా ఉన్నాయి. దేశంలోని పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, తీర ప్రాంతాలు దేశచరిత్ర గతిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి.

ప్రశ్న3.
బ్రాహ్మణీక గ్రంథాలు.
జవాబు.
బ్రాహ్మణీక గ్రంథాలు లేదా వేద సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ముఖ్యమైన ఆధారంగా ఉంది. వీటిని సంస్కృత భాషలో రాశారు. వాటిలో పేర్కొనదగ్గవి వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్లు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. ఈ సాహిత్యం అంతా కూడా నాటి సమాజాన్ని ప్రతిబింబించింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్యమైన ‘ఋగ్వేదం తొలి ఆర్యుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలియచేస్తోంది. మిగిలిన మూడు వేదాలైన యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉపనిషత్లు భారతీయ తాత్విక ధోరణుల గురించి వివరిస్తాయి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు మలివేద ఆర్యుల కాలం నాటి రాజ్య విస్తరణ, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక మత, పరిస్థితులను తెలియచేస్తాయి. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ముఖ్యమైన ఆధారాలుగా పరిగణింపబడుతున్నాయి. వీటిలో మత్స్య, వాయు, భవిష్య, విష్ణు, భాగవత పురాణాలు చారిత్రకంగా ముఖ్యమైనవి. ఈ పురాణాల వల్ల ముఖ్యంగా హర్యంక, శిశునాగ, నంద, మౌర్య, శాతవాహన మొదలగు రాజవంశాల చరిత్ర తెలుసుకోవచ్చు.

ప్రశ్న4.
బౌద్ధ సాహిత్యం.
జవాబు.
బౌద్ధగ్రంథాలు: ఇవి బౌద్ధుల తాత్విక, మతపరమైన గ్రంథాలు. పాళీ, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో ఈ గ్రంథాలు ఉన్నాయి.
పాళీ గ్రంథాలు: హీనయాన బౌద్ధం పాళీ గ్రంథాలను అనుసరించింది. బుద్దుడి జ్ఞాన సముపార్జనానంతరం త్రిపిటకాలు ఏర్పడ్డాయి. అవి: 1. సుత్తపీటకం, 2. వినయపీటకం, 3. అభిదమ్మ పీటకం. ఇవి బౌద్ధమత ధర్మం గురించి, ఆచార వ్యవహారాల గురించి, బౌద్ధతత్వాన్ని గురించి చెబుతాయి.

సంస్కృత గ్రంథాలు: మహాయాన బౌద్ధం సంస్కృత గ్రంథాలను అనుసరించినట్లు తెలుస్తున్నది. మహాయానంలో బుద్ధుణ్ణి దేవునిగా కొలిచారు. “వైపుల్య సూత్రం” మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం. “లలిత విస్తరం” బుద్ధుని చరిత్రను, బౌద్ధ ప్రపంచాన్ని తెలియజేస్తుంది. “సద్ధర్మ పుండరీక” మహాయానుల మరో పవిత్ర గ్రంథం.

ప్రశ్న5.
జైన సాహిత్యం.
జవాబు.
జైనుల మత గ్రంథాలు అర్థమాగధీ, ప్రాకృత భాషల్లో రాశారు. వీటిని పన్నెండు అంగాలు, పన్నెండు ఉపాంగాలు, పరి ప్రకీర్ణాలు, ఆరు చేదసూత్రాలు, నాలుగు మూల సూత్రాలు, నాలుగు వివిధ రకాలైన గ్రంథాలుగా విభజించారు. పన్నెండు అంగాలు జైన భిక్షువులు ఉపాసించవలసిన విధానాలను, జైనమతి తత్వాన్ని, మత జ్ఞానాన్ని, కథలను, జైన గురువులను, స్వర్గ నరకాల వివరణను తెలియజేస్తున్నాయి.

ప్రశ్న6.
సంగం సాహిత్యం.
జవాబు.
ప్రాచీన భారత చరిత్ర రాయడానికి మరో ముఖ్యమైన ఆధారంగా తమిళంలో విరచితమైన “సంగమ సాహిత్యం”ను చెప్పవచ్చు. సంగం సాహిత్యమనేది తమిళ కవుల సృష్టి. ఈ సాహిత్యం చేర, చోళ, పాండ్య రాజుల వంశావళిని పేర్కొంది. వీటిలో తమిళదేశ సంస్కృతి, సమకాలీన స్థితిగతులు స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి “కురల్”, “శిలప్పాధికారం”, “ఎట్టుతోగై”, “పట్టుపట్టు”, “పదినెన్ కిల్ కణక్కు మొదలైనవి. ఇవి క్రీ.శ నాలుగో శతాబ్దం వరకు గల విషయాలను అందిస్తున్నాయి.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న7.
గ్రీకు రచనలు.
జవాబు.
ప్రాచీన భారత చరిత్ర రాయడానికి గ్రీక్ ఆధారాలు చాలా ముఖ్యమైనవి. స్కైలాక్స్ రాసిన “ది అకౌంట్ ఆఫ్ ది జర్ని ఆఫ్ స్కైలాక్స్” మనకు లభించలేదు. హెరోడోటస్ (క్రీ.పూ. 483-430) భారతదేశాన్ని గురించి తన గ్రంథంలో. రాశాడు. డేరియస్ ద్వారా వాయవ్య భారతదేశం గురించి తెలుసుకొన్న సమాచారాన్ని హెరోడోటస్ గ్రంథ రూపంలో
రాశాడు, ఇది మన చరిత్రకు ఆధారం అయింది.

మెగస్తనీస్ అనే గ్రీస్ దేశస్థుడు ‘సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి విచ్చేసి, ఆ కాలపు పరిస్థితులను వివరంగా “ఇండికా” అనే గ్రంథంలో రాశాడు. అయితే ఆ గ్రంథం ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఆ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలను స్ట్రాబో, డియోరస్, ఆరియన్ తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. అలాగే టాలమీ రాసిన “భూగోళం” (Ptolemy’s Geography), ఒక అజ్ఞాత రచయిత రాసిన “ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి” (The Periplus of the Erythraean Sea) లు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించాయి. టాలమీ గ్రంథం ద్వారా భారతదేశంలోని నౌకాశ్రయాలు మరియు రేవు పట్టణాల సమాచారం లభ్యమవుతోంది. అయితే గ్రీకులకు ఇక్కడి భాషా, సంప్రదాయాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల వారి రచనల్లో కొన్ని అవాస్తవాలు, వివాదాస్పదాంశాలు చోటుచేసుకొన్నాయి.

ప్రశ్న 8.
చైనా రచనలు.
జవాబు.
బౌద్ధ పవిత్ర స్థలాలను చూడటానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధబిక్షువులు భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాస్తూ, తాము చూసిన సందర్శించిన ప్రదేశాల గురించి వివరంగా తెలిపారు. వారిలో ప్రముఖుడు. ఫాహియాన్. అతను ఐదో శతాబ్దంలో “ఫో-కో-కి” (Fa kosuoki) అనే గ్రంథంలో మధ్య ఆసియా గురించి, వాయవ్య భారతదేశం, గంగాలోయ గురించి, శ్రీలంక, జావాలను గురించి వివరంగా రాశాడు. హ్యూయాన్ త్సాంగ్ అనే మరో చైనా దేశస్థుడైన బౌద్ధభిక్షువు హర్షుని కాలంలో భారతదేశానికి వచ్చి, హర్షుడి ఆస్థానాన్ని దర్శించాడు. అతడు “సి-యూ-కి” అనే గ్రంథంలో విశిష్టమైన విలువలు ఉన్న చారిత్రక విషయాలను స్పష్టంగా వివరించాడు. ఇత్సింగ్ (Itsing) అనే మరో యాత్రికుడు ఇండోనేషియా నుంచి సముద్రయానం చేసి భారతదేశాన్ని చేరాడు. సంస్కృత గ్రంథాలు, బౌద్ధుల ఆచార వ్యవహారాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా తెలిపాడు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చరిత్ర రచనాశాస్త్రం.
జవాబు.
చరిత్ర రచన గురించి తెలిపే శాస్త్రమే చరిత్ర రచనా శాస్త్రం. అంటే ఇది చారిత్రక ఆలోచనల చరిత్ర. చరిత్ర ఏ విధంగా రాయబడింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. చరిత్రకారుడు యదార్థ సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ద్వారా విషయనిష్ఠత సాధించవలెను.

ప్రశ్న 2.
చరిత్ర పరిధి.
జవాబు.
క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభం వరకు గత సంఘటనలను వివరించేందుకే చరిత్ర పరిమితమై ఉండేది. అయితే నేడు కాలం, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని మానవుని కార్యక్రమాలను అధ్యయనం చేయడం వల్ల చరిత్ర పరిధి విస్తృతమైంది. మానవ ఆవిర్భావం నుంచి నేటి దాకా దీని పరిధి విస్తరించి ఉంది. యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్య ఔన్నత్య పతనాలు, చక్రవర్తుల అదృష్ట దురదృష్టాలు, సామాజిక వ్యవస్థ పరిణామం, సామాన్యుల జీవితాలు చరిత్రకు ప్రధాన విషయాలు. చరిత్ర అన్ని విజ్ఞాన శాస్త్రాలు, పాఠ్యాంశాలను కలుపుకొని ఉన్న చరిత్ర పరిధికి హద్దులు నిర్దేశించలేం.

ప్రశ్న 3.
హిమాలయాలు.
జవాబు.
హిమాలయ పర్వత శ్రేణి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ (బర్మా) వరకు వ్యాపించి ఉంది. దాదాపు 2400 కి.మీ. పొడవు, 300 కి.మీ ఎత్తులో ఇవి ఉత్తరాన పెట్టని గోడ వలే ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు. ఎవరెస్టు లేదా గౌరీశంకర్ (ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం). కాంచనగంగ, దౌళగిరి, నంగప్రభాత్, నందాదేవి లాంటి పర్వతశ్రేణులు హిమాలయాల్లోనే ఉన్నాయి.

ప్రశ్న 4.
ఎపిగ్రఫి.
జవాబు.
పురావస్తు ఆధారాల్లో అత్యంత విశ్వసనీయమైనవి మరియు ముఖ్యమైనవి శాసనాలు. ఇవి చరిత్రకు సంబంధించిన వాస్తవాలను అందిస్తాయి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. శాసనాలను రాళ్లపైన, స్తంభాలపైన, భవనాల గోడలపైన, దేవాలయ గోడలపైనా గమనించవచ్చు. ఇవే కాకుండా ముద్రికలపైనా, రాగి రేకులపైనా (తామ్ర శాసనాలు) కూడా శాసనాలను లిఖించడం జరుగుతుంది.

ప్రశ్న 5.
భారత పురావస్తుశాఖ.
జవాబు.
ప్రాచీన కాలపు అవశేషాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాతత్త్వశాస్త్రం అని అంటారు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. తవ్వకాలు, అన్వేషణలో లభించిన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు(వాస్తు), శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలను పురావస్తు ఆధారాలుగా పేర్కొంటారు. భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, జాతీయ స్మారక భవనాల పరిరక్షణకు, సంరక్షణకు భారత పురావస్తు శాఖ (ASI) బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 6.
న్యూమిస్ మాటిక్స్.
జవాబు.
చారిత్రక ఆధారాల్లో నాణేలు ముఖ్యమైనవి. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘న్యూమిస్మాటిక్స్’ అని అంటారు. నాణేలను భూమిలోనుంచి తవ్వకాల ద్వారా కానీ భూఉపరితలం పైనుంచి కానీ సేకరిస్తారు. నాణేలను సాధారణంగా బంగారు, వెండి, కంచు, మిశ్రమ లోహాలతో తయారుచేస్తారు.

TS Inter 1st Year History Study Material Chapter 1 చరిత్ర, భౌగోళిక పరిస్థితులు

ప్రశ్న 7.
జీవితచరిత్రలు.
జవాబు.
గురువుల, రాజుల జీవిత చరిత్రలను గురించి రాసిన సాహిత్యం మనకు ప్రాచీన కాలంలో చాలా కనిపిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి అశ్వఘోషుడు రచించిన “బుద్ధచరితం”, బాణభట్టు రచించిన “హర్షచరితం”, ప్రాకృతభాషలో ముంజరాజు (వాక్పతి) రచించిన “గౌడవ హెూ”, చాంద్బర్దాయ్ రచించిన “పృధ్వీరాజ్ సో”. బుద్ధచరితం కనిష్కుని కాలానికి సంబంధించింది. హర్షచరితం హర్షుని చరిత్రను, గౌడవ హెూ కనోజ్ రాజైన యశోవర్మని కాలానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి.

Leave a Comment