Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ Textbook Questions and Answers.
TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. ఎల్లమ్మ విద్యాభ్యాసం గురించి తెల్పండి.
జవాబు.
ఎల్లమ్మ చిన్నతనంలో ఎక్క అయ్యగారు చదువు చెప్పేవారు. కాని ఆమె దగ్గర చదువుకోడానికి పలకలుగాని ఆయనకివ్వడానికి పైసలుగాని లేవు. పగిలిన కుండ పెంకులు పెద్దవి ఏరుకొచ్చుకొని వాటిమీద బొగ్గుతో రాసుకొనేవాళ్ళు. అయ్యవారి దగ్గరున్న పెద్దబాలశిక్ష ఒక్కటే పుస్తకం. అదే చదివేవాళ్ళు. అలా ఎల్లమ్మ చదువుకోడానికి ఎంతో కష్టపడ్డది.
2. ఎల్లమ్మకు చిందుభాగోతంలో ప్రవేశం ఎలా జరిగింది ?
జవాబు.
ఎల్లమ్మ చిన్నతనంలో రెండు మూడు కథలే ఆడేవాళ్ళట. చిన్నప్పటి నుండే భాగోతం నేర్పుతుండే వాళ్ళు. ఆమెకు నాలుగేళ్ళ వయసులో మొహానికి రంగువేసి వేషం కట్టమన్నారు. బాలకృష్ణుని వేషంతో ఆమె రంగ ప్రవేశం చేసింది. తెర వెనుక పాడుతుంటే తెర ముందు ఎగిరిందట. అలా అలవాటై ఎనిమిదేళ్ళప్పుడు బాలకృష్ణుడు, రంభవేషాలు వేసింది. తరువాత రకరకాల ఆడ, మగ పాత్రలు వేసింది.
3. చిందు భాగోతం గురించి రాయండి.
జవాబు.
చిందు భాగోతం అన్నా యక్షగానమన్నా రెండూ ఒకటే. ఏమీ తేడా లేదు. చిందోళ్ళ ఆట అంటే అగ్ర కులస్థులు రారని చిందు యక్షగానం అని పిలిచేవారు. ఉదయం పదిగంటలకు ఆట మొదలు పెడితే సాయంత్రం దీపాలు పెట్టేదాకా ఆడేవాళ్ళు. యక్షగానం పుస్తకాల్లో చూసి కావలసినవి తీసుకొని నేర్చుకుంటారు. చిరుతల భాగోతులు, దాసరులు, చిందు భాగోతులు తీసుకొనే కథలు ఒకటే అయిన వాటి దరువులను బట్టి వేరుగా ఉంటాయి.
4. చిందు భాగోతంలో ఏఏ కథలు ఆడేవారు ? ఎల్లమ్మ పోషించిన పాత్రలేవి ?
జవాబు.
చిందు భాగోతంలో సారంగధర, చెంచులక్ష్మి, సతీసావిత్రి, ప్రహ్లాద, మైరావణ, మాంధాత చరిత్ర, రామాంజనేయ, సతీ అనసూయ, సతీ తులసి, బబృవాహన, బాలనాగమ్మ, హరిశ్చంద్ర, అల్లీరాణి, గంగా కళ్యాణం, రామదాసు చరిత్ర, సుగ్రీవ విజయం మొదలైన ఇరవైఐదు కథలు ఆడేవాళ్ళు. ఆ కథలన్నింటిలోనూ ఎల్లమ్మ ప్రధాన పాత్రలు పోషించేది. ఆడపాత్రలే కాదు. మగపాత్రలు గూడా ధరించేది.
5. చిందు భాగవతులు జీవనం ఎలా గడిపేవారు ?
జవాబు.
పాత రోజుల్లో భాగోత మాడితే ఏమంత ఆదాయం వచ్చేది కాదు. చాలా కష్టపడి బతుకీడ్చేవాళ్ళు. దసరాకు పెట్టెపూజ చేస్తారు. దీపావళి వెళ్ళాక ఊరూరూ తిరగటం మొదలు పెడతారు. సంక్రాంతి, శివరాత్రి దాక భాగోతాలు ఆడుతూనే ఉంటారు. మళ్ళీ వానాకాలం అప్పుడు ఇంటికొస్తారు. కొంతకాలం తెచ్చుకున్నదేదో తింటారు. లేకుంటే అప్పుతెచ్చుకుంటారు. కొంతమంది కూలికి పోతారు.
6. చిందు భాగోతానికి గుర్తింపు ఎలా వచ్చింది ?
జవాబు.
ప్రజలు చిందు భాగోతాన్ని ఆదరించి పోషించారు. కాని ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టించుకోలేదు. ఒకసారి నటరాజ రామకృష్ణ ఎల్లమ్మను పిలిచి చిందు పాడమన్నాడు. ఆయనకోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడారు. ఆయన తన శాలువా తీసి ఎల్లమ్మకు కప్పాడు. చిందును గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు. ఎల్లమ్మ బృందాన్ని పరిచయం చేశాడు. అలా చిందు భాగోతానికి గుర్తింపు లభించింది.
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. ఎల్లమ్మ చిన్నతనంలో చిందు భాగోతాల ప్రదర్శనల ఏర్పాట్లు ఎలా జరిగేవి ?
జవాబు.
భాగోతంలో ముందుగా అంబకీర్తన పాడి ఆట మొదలు పెడతారు. ముందు రంభ వేషం, వెనుక నుంచి గోపాల కృష్ణుని వేషం వస్తాయి.
“రంభా ఊర్వశులమమ్మా, మాయమ్మ” అని పాడుకుంటూ పిల్లలందర్నీ పరదా ముందు ఆడిస్తారు. అదే అంబ కీర్తన. అంటే ప్రార్థన అన్నమాట. ఇక ఆట మొదలౌతుంది. తెరవెనుక వేషాలు తయారయ్యేదాకా పిల్లలు చిన్నికృష్ణుడి పాట చిందేస్తూ ఉంటారు. పిల్లలకు ఆటనేర్పినట్టూ ఉంటుంది. ప్రజలను కూర్చోబెట్టిట్టూ ఉంటుంది. వేషాల తయారీ పూర్తవుతుంది. ఎక్కడ ఏ కొత్తపాట విన్నా పాడేస్తూ ఉండేది ఎల్లమ్మ. అసలు భాగోతం మొదలు పెట్టగానే ముందు గణపతి ప్రార్థన, తర్వాత సరస్వతీ ప్రార్థన చేసి ఆట మొదలు పెడతారు. ఇలా చుట్టు పక్కల ఊళ్ళల్లో గూడ ప్రదర్శనలిచ్చేవారు.
2. ఎల్లమ్మబృందం వారి చిందు భాగోతం ప్రత్యేకతలు తెల్పండి.
జవాబు.
ఎల్లమ్మ చిన్నప్పుడు మద్దెల తాళాలు గజ్జెలు మాత్రమే వాయిద్యాలుగా ఉండేవి. పూపూ అని ఊదే బుర్ర ఒకటుండేది. దాన్ని పుంగి అంటారు. ఈ పుంగిని ఆట మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఊదాలి. దీని కోసం ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. తెరముందు ఎవరివేషం ఐపోతే వారు వెనక్కొచ్చి ఊదుతుండేవారు. అందరికీ చేతనౌను. ఎండిన సొరకాయను తయారుచేసుకొని ఊదుకొనేవారు.
తరువాత తబల, హార్మోనియం, తాళం, గజ్జెలు ఉపయోగించేవారు. అవీ బృందంలో వాళ్ళే వాయిస్తారు. ప్రతివారికి వాయించటం వచ్చు. మరొక ప్రత్యేకత ఏమంటే వాళ్ళ భాగోతానికి తెరవెనుక పల్లవి ఉంటుంది. ‘తైతకథోం తకథోం’ అని ఆ పల్లవి పాడేవాళ్ళు అన్న తరువాతే తెరముందు పాత్ర చిందు మొదలు పెడుతుంది. బుడ్డర్ ఖాన్ వేషం హాస్యపాత్ర. అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. భాగోతానికి అదే నిండుదనం ఇస్తుంది. ఎప్పుడైనా ఏ పాత్రైనా రాకపోతే బృందంలో వాళ్ళే సర్దుకుంటారు. ఇవి ఎల్లమ్మ బృందం చిందు విశేషాలు
పరిచిత గద్యభాగాలు
1. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
మాఊర్ల అందరికి సిన్నప్పటి నుండి భాగోతం నేర్పుతుండె. పెద్దోళ్లు నాకు నాలుగేండ్లు ఉండంగ నా ముఖంకు రంగు ఏసిండ్రు. బాలకృష్ణుని ఏషం గట్టిచ్చినరు. మావోల్లు పర్ద ఎనుక పాట పాడితే నేను పర్దముంగట ఎగిరిన. ఇగ అప్పటి నుండి మాతల్లి దండ్రులు యేషం ఏయించి నాచేయి పట్టుకపోయి తోలేసి ఎగురుమని అంటుండె. అట్ల నాకు భాగోతం ఆడుడు అలవాటు చేసినరు. నేను ఎనిమిదేండ్లప్పుడు బాలకృష్ణుని యేషం, తర్వాత రంభ యేషం కడుతుంటిని.
ప్రశ్నలు :
1. ఎల్లమ్మ ఎంత వయసులో మొదటిసారి భాగోతం ఆడింది ?
జవాబు.
నాలుగేళ్ళ వయసులో
2. ఆ ఊళ్ళో భాగోతం ఎప్పటి నుండి నేర్పేవారు ?
జవాబు.
చిన్న పిల్లలప్పటి నుండి
3. తల్లిదండ్రులు ఎల్లమ్మను ఏం చెయ్యమన్నారు ?
జవాబు.
చెయ్యి పట్టుకుని ప్రదర్శనలకు తీసుకెళ్ళి చిందు వెయమన్నారు.
4. ఎల్లమ్మ ఏఏ వేషాలు వేసింది ?
జవాబు.
బాలకృష్ణుడు, రంభ
5. ‘పర్ద’ అంటే ఏమిటి ?
జవాబు.
తెర
2. కింది పేరాను చదివి వాక్యాలలోని ఖాళీలు పూర్తిచేయండి.
మాకు అందరి కళారూపాలు నచ్చుతయి. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది. ఆమె కథలు మంచిగ చెపుతది… నాకు మనసౌతది. అది శారదకాల్లది.
ప్రజలు మమ్ముల ఎప్పటినుంచో బతికించుకుంటున్నరు గనీ, సర్కారుమాత్రం మమ్ములను నటరాజ రామకృష్ణవల్ల పట్టించుకున్నది. ఒకసారాయన చిందు పాడమని అన్నడు. ఆయనకోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడినం. తన షాలువాతీసి నాకు కప్పిండు. సింధును సర్కారుకు గుర్తుజేసిండు ఆయన. మాకు సర్కారును సూపిచ్చిండు. ఈ సుట్టుపక్కల ఇసుంటి కళాకారులు లేరు. ‘చిందుల ఎల్లవ్వది సాగుతది ఇట్ల’ అంటారు. ఇతర కళాకారులు….దాసుడు (దాచిపెట్టడం) ఏంటికి ఉన్నది చెప్పాల….! ఇగ ఇట్లనే చెప్పుకుంట పోతం…. బతుకంతా…
1. హైదరాబాదుల కథల …………… ఉంటది.
2. సర్కారు మాత్రం మమ్ములను ………………. వల్ల పట్టించుకున్నది
3. ఆయన కోసమని …………… భాగోతం ఆడిన.
4. ఈ సుట్టుపక్కల ఇసుంటి …………… లేరు.
5. ఒకసారాయన …………… పాడమని అన్నడు.
జవాబు.
1. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది.
2. సర్కారు మాత్రం మమ్ములను నటరాజ రామకృష్ణ వల్ల పట్టించుకున్నది
3. ఆయన కోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడిన.
4. ఈ సుట్టుపక్కల ఇసుంటి కళాకారులు లేరు.
5. ఒకసారాయన చిందు పాడమని అన్నడు.