Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 2nd Lesson సముద్ర ప్రయాణం Textbook Questions and Answers.
సముద్ర ప్రయాణం TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana
చదువండి – ఆలోచించి చెప్పండి
పడవలో ఇంకా ఇద్దరు భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారువారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనం చేసితిని.
ప్రశ్న1.
పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు ?
జవాబు.
పడవలోని వాళ్ళు బొంబాయి నుండి ఇంగ్లండుకు ప్రయాణమైపోతున్నారు.
ప్రశ్న2.
వాళ్ళు బ్రిటన్ క్కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు ?
జవాబు.
వాళ్ళు చదువుకోవడానికి బ్రిటన్కు వెళ్ళి ఉండవచ్చు.
ప్రశ్న3.
పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పటానికి గల కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అనుకున్నచోటుకు క్షేమంగా చేరినందుకు దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పి ఉండవచ్చు. ఎంతో దూరంలో ఉన్న బ్రిటన్కు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చేరినందుకు కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 13)
ప్రశ్న 1.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం ఎప్పుడైనా చూశారా ? దేని కొరకు అట్లా వెళ్తాయి ?
జవాబు.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళటం చాలాసార్లు చూశాము. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రయాణం చేస్తున్నపుడు వారికి రక్షణగా బందోబస్తు కొరకు కాన్వాయ్లు వెళ్తుంటాయి.
ప్రశ్న 2.
సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు ?
జవాబు.
ఒక సంకేతాన్ని గాని, హెచ్చరికను గాని సూచించటానికి సైరన్ లేదా అలారం మోగిస్తారు.
ప్రశ్న 3.
దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి ?
జవాబు.
దూర ప్రయాణాలకు సిద్ధమయ్యేటప్పుడు మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కావలసినంత డబ్బు, దుస్తులు, వస్తు సామగ్రిని, మందులను సిద్ధంగా ఉంచుకోవాలి.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 14)
ప్రశ్న 1.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.
జవాబు.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ఎఫ్.ఎమ్. రేడియోలు, లాప్టాప్లు, సెల్ఫోన్లు వాడుతున్నారు. వీటితోపాటుగా హౌసీ, చదరంగం వంటి ఆటలు ఆడుతున్నారు. కొంతమంది అంత్యాక్షరి పోటీలు కూడా పెట్టుకుంటారు.
ప్రశ్న 2.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో సౌమ్యంగా, మర్యాదగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. వారితో కలిసిపోయి ఉండటానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే వారి భావాలు మనకు, మన భావాలు వారికి తెలుస్తాయి. నలుగురిలో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.
ప్రశ్న 3.
కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి ? అప్పుడు మీరేం చేస్తారు?
జవాబు.
కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడి భాష అర్థంకాకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు వారు మాట్లాడేటప్పుడు వారి హావభావాలను బట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. లేదా ‘దుబాసీ’ని ఏర్పాటు చేసుకుంటాం.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 15)
ప్రశ్న 1.
విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి ?
జవాబు.
సూర్యుడు తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాడు. కాబట్టి పశ్చిమ దేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని పెంచుకోవాలి. తూర్పుదేశాలకు వెళ్ళేటప్పుడు సమయాన్ని తగ్గించుకోవాలి. గ్రీన్విచ్ మీన్ అని దీనిని వ్యవహరిస్తారు.
ప్రశ్న 2.
విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి.
జవాబు.
విదేశాలలో మనకు తెల్సినవారు బంధువులు ఉంటే ఒక రకమైన ఊరట కలుగుతుంది. ఆ ప్రాంతంలోని చారిత్రాత్మక, విశిష్ట ప్రదేశాలను తెలుసుకునే అవకాశం, చూసే అవకాశం ఉంటుంది. భాష అంతగా రాకపోయినా బాధపడవలసిన అవసరం ఉండదు.
ప్రశ్న 3.
“ఈశ్వరా నీవే దిక్కు” అని రచయిత అనుకోటానికి కారణమేమిటి ? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.
జవాబు.
భారతదేశం నుండి ఇంగ్లండుకు చేరిన వారివద్ద తగినంత డబ్బు లేకపోతే అట్లాంటి వారిని డీ పోర్టు చేసి వాపసు పంపుతారని, బ్రిటీషు పోలీసులు చాలా స్ట్రిక్ట్ అని రచయితకు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్ చెప్పారు. అపుడు రచయిత తనను ఇంగ్లండులో దిగనివ్వకుండా వెనక్కు పంపుతారని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాడు. నేను ఒకసారి నా మిత్రునితో కలసి బెంగుళూరు వెళ్ళాను. అపుడు మా టికెట్ను ఎక్కడో పోగొట్టుకున్నాం. టి.సి. టికెట్ చూపించకపోతే జైలుకు పంపిస్తాడేమోనని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాం.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 16)
ప్రశ్న 1.
రచయితకు సురేశ్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది ?
జవాబు.
బ్రిటన్ పోలీసులు రచయితను చూసి చదువు కొరకు వచ్చారని అనుకున్నారు. అదే విషయం రచయితను అడిగారు. రచయిత అవునని చెప్పేటప్పటికి ఇంకా ఏమీ అడగకుండానే ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు. అందువల్ల రచయితకు సురేశ్బాబు సహాయం అవసరం లేకపోయింది.
ప్రశ్న 2.
ఏఏ సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.
జవాబు.
కష్టంలో నుండి బయటపడ్డప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. కుటుంబ సభ్యులలో, స్నేహితులలో ఎవరైనా అనారోగ్య స్థితి నుండి బయటపడవేసినందుకు దేవునికి కృతజ్ఞతను చెప్పుకుంటాం.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య పట్టుదల, ఆత్మవిశ్వాసం గలవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. ఈ రెండూ లేకపోతే దేనినీ సాధించలేము. ఉదాహరణకు మన పాఠంలోని సముద్ర ప్రయాణం వ్రాసిన ముద్దు రామకృష్ణయ్యనే తీసుకుందాం ! ఆయన ప్రయాణ కాలం రెండవ ప్రపంచ యుద్ధకాలం. అపుడు ప్రయాణం చేయాలంటే మనసును రాయి చేసుకోవాల్సిందే ! ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన కృష్ణయ్య దృఢ సంకల్పంతో, పట్టుదలతో తన మనసులోని కోరికను, లక్ష్యాన్ని సాధించటానికి సుదూర ప్రాంతమైన గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. పైసలు లేవు, తెలిసినవారు లేరు. అయినా మంచి సంకల్ప బలం ఆయనను ఇంగ్లండుకు నడిపించింది. ఆయనలోని కృతనిశ్చయం, దృఢ సంకల్పం ఆయన విజయానికి దారితీశాయి. గ్రేట్ బ్రిటన్ వెళ్ళి అక్కడి లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం.ఇడి. పట్టా పొందారు కదా ! కాబట్టి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
1. కింది వాక్యాలు. పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.
జవాబు.
వాక్యం | పేరా సంఖ్య | శీర్షిక |
1. పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది. | 13వ పేజీలో 4వ పేరా | పడవ ప్రయాణంలో సౌకర్యాలు |
2. నేను ధోవతి శేర్వానీతో ఉంటిని | 1 పేజీ 1వ పేరా | వేషధారణ |
3. ఏవేళ ప్రాణం పోతుందో | 12వ పేజీ 1వ పేరా | రెండవ ప్రపంచ యుద్ధం |
4. మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది. | 16వ పేజీ చివరి పేరా | గ్రేట్ బ్రిటన్ |
2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వేస్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదావరినది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది.
ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచమిరోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది.
అ) బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు ?
జవాబు.
బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన దేవత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి.
ఆ) సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది ?
జవాబు.
సరస్వతీదేవి ఆలయం గోదావరి నదీ తీరాన ఉన్నది.
ఇ) సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు ఎవరు ?
జవాబు.
సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు వేదవ్యాస మహర్షి.
ఈ) నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ?
జవాబు.
నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుగుతాయి.
ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి.
జవాబు.
ఆధ్యాత్మికతకు మారుపేరు – బాసర.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు.
దూర ప్రయాణాలకు పోయేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు చేతినిండా ఉంచుకోవాలి. ఆయా ప్రాంతాన్ని బట్టి దుస్తులను సమకూర్చుకోవాలి. అక్కడ ఎవరైనా తెలిసిన వారుంటే వారి చిరునామా, ఫోన్ నంబర్లను తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఆ ప్రాంతంలో మాట్లాడే భాషను కొంతన్నా మాట్లాడగలగాలి. ముందే ఆ భాషను నేర్చుకొని ఉండాలి. లేదా ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందిన ఏదో ఒక భాషను నేర్చుకొని ఉండాలి. దానితోబాటుగా మన భాషలోను, ఆ ప్రాంతం భాషలోను చక్కగా మాట్లాడగలిగే వారిని ముందుగా కలుసుకోవటం చేయాలి.
ఆ) రచయిత ఉన్నతవిద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా ! దీని ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు.
కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలమన్న విషయాన్ని రచయిత ఇంగ్లాండుకు వెళ్ళిన సంఘటన ఋజువు చేస్తోంది. జ్ఞానాన్ని సంపాదించటానికి ఎల్లలుండవు. దేన్నైనా సాధించాలనే దృఢ సంకల్పం ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొని విజయం సాధించేందుకు తోడ్పడుతుంది. మంచి సంకల్పం ఉంటే విజయాలు వాటంతట అవే వెతుక్కుని వస్తాయట. కనుక మనం దేనిలో విజయం సాధించాలనుకున్నామో దానిని సాధించటానికి పట్టుదలతో కృషిచేయాలని గ్రహించాము.
ఇ) “ఉన్నత లక్ష్యం, పట్టుదలతో, దేనినైనా సాధించవచ్చు” వివరించండి. (లేదా) సముద్ర ప్రయాణం పాఠం ఆధారంగా పట్టుదలతో దేనినైనా సాధించవచ్చును అని వివరించండి.
జవాబు.
ఉన్నత లక్ష్యంతో, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చన్నది యథార్థం. స్వామి వివేకానంద భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. దానికోసం ఆయన ప్రపంచదేశాలన్నీ చుట్టి వచ్చాడు. చేతిలో డబ్బుల్లేకపోయినా, ఎన్నో రోజులు పస్తులున్నా ఆయన ముందు తన దేశభక్తిని ప్రపంచానికి చాటాలనే లక్ష్యం ఉండటం చేత ఆ సమస్యలు ఆయనను ఏమి చేయలేక పోయాయి. చికాగోలో ఉపన్యాసానికి ముందు ఆయన ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోతే ఆయనను ఎక్కడో చూసిన ఒక స్త్రీ రక్షించి ఆహారాన్నిచ్చి ఆయనను చికాగో నగరానికి పంపించింది. కాబట్టి ఉన్నత లక్ష్యం, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం అన్నది నిజం.
ఈ) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెల్సుకోవడానికి మీరేంచేస్తారు ?
జవాబు.
క్రొత్త ప్రదేశాన్ని దర్శించినపుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రదేశంలో పరిచయమున్నవారితో స్నేహం చేసి తెలుసుకుంటాం. ఆ ప్రాంతానికి సంబంధించిన అట్లాసు, గైడ్లపై ఆధారపడతాం. తెలిసిన బంధువులు, స్నేహితులు, మన వూరివారు ఆ ప్రాంతంలో ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకుంటాం. అక్కడున్న పర్యాటక ఏజెన్సీలలో సంప్రదిస్తాం. అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకుని వాటిని చూడటానికి ప్రయత్నిస్తాం: నేటి సాంకేతిక పరిణామాలను అనుసరించి ‘నెట్’ ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాం. ‘వికిపీడియా’ ప్రపంచాన్నంతటిని మన చేతుల్లోకి తెచ్చింది కదా ! దానిని ఉపయోగించి మరింత సమాచారాన్ని తెలుసుకుంటాం. (అదనపు ప్రశ్న)
ఉ) గ్రేట్ బ్రిటన్ని చేరిన రచయిత మనఃస్థితిని వివరించండి.
జవాబు.
రచయిత ఎన్నో అడ్డంకులను అధిగమించి చదువుకోసం చివరికి గ్రేట్ బ్రిటన్ చేరుకున్నారు. పడవలో నుండి బయటకు అడుగుపెట్టగానే ఆయనకు పట్టరాని సంతోషం కలిగింది. గ్రేట్ బ్రిటన్ని చూస్తూ అలా నిలబడిపోయారు. సాధ్యం కాదనుకున్న దానిని దేవుడు సాధ్యం చేశాడు. “ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామంలో పుట్టిన నేనెక్కడ, బ్రిటన్ ఎక్కడ ! పైసా లేకుండా రావటం ఎంత ఆశ్చర్యం. ఆ ఈశ్వరుడే నన్ను రక్షించి ఇక్కడకు తీసుకువచ్చాడు.” అని రచయిత అనుకున్నాడు. బ్రిటన్ సుందర దృశ్యాలను చూసే అదృష్టాన్ని ఉన్నత చదువులు చదివే అదృష్టాన్ని తనకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలను తెలుపుకున్నాడు.
ఊ) సురేష్ బాబుకు, రచయితకు మధ్య జరిగిన సంభాషణను వివరించండి.
జవాబు.
(అదనపు ప్రశ్న) రచయిత గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. ఆయనతో పాటు కరీంనగర్కు చెందిన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారి అబ్బాయి సురేష్ బాబు ప్రయాణించాడు. ఆయన స్కాలర్షిప్తో పాటు దండిగా డబ్బులు తెచ్చుకుంటున్నాడు. రచయిత తనని తాను పరిచయం చేసుకొని క్లుప్తంగా తన దీన పరిస్థితిని, చదువుకోవాలన్న ఆసక్తిని వినిపించాడు. తన దగ్గర డబ్బు లేదన్న రహస్యాన్ని ఎవరికి చెప్పవద్దని వాగ్దానం తీసుకున్నాడు.
సురేష్ రచయిత “బాబు ! నీకు డబ్బు ప్రశ్న లేదు. నీ దగ్గరున్న 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉంది. అందులో వంద పౌండ్లు నావి అని చెప్పు” అని వేడుకున్నాడు. “నీ డబ్బు అడగను నన్ను పడవ దిగేటట్లు చూడు” అని కోరాడు. సురేష్ బాబు సరేనని ఒప్పుకున్నాడు. అయితే రచయితకు సురేష్ బాబు సహాయం లేకుండానే చివరికి ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు బ్రిటన్ పోలీసులు. అయినా తనకు ఒక ధీమాను, ఓదార్పును ఇచ్చిన సురేష్ బాబుకు రచయిత కృతజ్ఞతలను చెప్పుకున్నాడు.
ఋ) రచయిత ఎడెన్లో దిగినప్పటి అనుభవాలను రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
గ్రేట్ బ్రిటన్లో మొదటి మజిలీ ఆడెన్ (ఎడెన్). ఎడెన్ పట్టణంలోకి వెళ్ళటానికి రచయిత తోటి ప్రయాణీకులకు అనుమతి లభించింది. రచయిత తోటి ప్రయాణికుడి బంధువులు ఆడెన్లో ఉన్నారు. అందులో ఒకరు కారును తీసుకువచ్చి ఆడెన్ ప్రాంతంలోని చారిత్రాత్మక ప్రాంతాలన్నీ చూపించాడు. వారింటిలోనే శాకాహార భోజనాన్ని వీరికి అందించాడు. కొంత విశ్రాంతి అనంతరం రచయితను ఆయనతో ఉన్న గుజరాతీ పిల్లలను మరల ఓడరేవులో దించేశాడు. ఆడెన్లో ఉండే వారందరూ దాదాపు అరబ్బీ ముస్లింలే. హైదరాబాద్ లోని ముస్లింల మొహల్లా ఉన్నట్లు ఆడెన్ ఉంటుంది. అది ఒక గొప్ప అనుభవంగా రచయిత భావించాడు.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) “అనుకున్నది సాధించటంలో కలిగే తృప్తి అనంతమైనది.” ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి. (లేదా) “అనుకున్నది సాధించడంలో ముద్దు రామకృష్ణయ్య ఎంతో సంతృప్తి పొందాడు.” (లేదా) అనుకున్నది సాధించినపుడు పొందే తృప్తి ఎట్లాంటిది?
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య జనన విశేషాలు :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లాలోని మంథని గ్రామంలో అక్టోబరు 18, 1907 లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఈయన ఒక బడి పంతులు. ఉన్నత విద్య కోసం రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకున్నాడు. తగినంత ధనం లేకపోయినా అనుకున్నది సాధించాడు.
గ్రేట్ బ్రిటను ప్రయాణం :
అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు. ప్రయాణం మొదలయింది. బ్రిటన్లో ఎవరిని కలవాలో తెలీదు. ఎలాంటి ప్రతిఘటనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకున్నాడు రచయిత. తనకున్న రెండు జతల బట్టలను పైజమా కుర్తాలను సర్దుకుని పాస్పోర్టు 22 పౌండ్ల ధనాన్ని తీసుకుని పడవ ఎక్కాడు. ఆయన కండ్ల ముందు ఒకటే లక్ష్యం. ఆ లక్ష్య సాధనే ఆయన సిద్ధాంతం. తాను అనుకున్న ఉన్నత విద్యను సాధించాలని ప్రయాణం ప్రారంభించాడు.
సహాయకులు :
ఆయనకు పడవలో తొలి పరిచయస్తుడు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్టు. ఆయన బ్రిటన్ గురించి అక్కడి అలవాట్లను గురించి వివరించాడు. తరువాత కరీంనగర్ నుండి బయలుదేరిన సురేష్ బాబు పరిచయం ఏర్పడి పడవ దిగేవరకు రచయితకు భరోసా ఇచ్చాడు.
బ్రిటన్లో కాలుపెట్టిన రచయిత అనుభూతి :
స్టడీస్ కొరకు వచ్చాడని తెలుసుకున్న పోలీసులు తేలికగానే పర్మిషన్ ఇవ్వటంతో బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ న్ను చూస్తూ అలా నిలబడిపోయాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాననుకున్నాడు. సంకల్పం, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించగలం అన్న నమ్మకాన్ని అందరికి కలిగించాడు ముద్దు రామకృష్ణయ్య. అనిర్వచనీయమైన సంతృప్తి పొందుతాడు.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.
అ) చదువును కష్టంగా భావించవద్దు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, ఇష్టంగా చదువుకుని, అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జనగాం,
ది. XX. XX. XXXX
ప్రియమైన మిత్రుడు యాదగిరికి,
నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. నీ చదువు ఎలా సాగుతోంది. కష్టపడి పనిచేయాలి ఇష్టంగా చదవాలి అంటారు పెద్దలు. మొక్కుబడిగా చదివే చదువు బుర్రలోకి ఎక్కదు. జ్ఞాపకం ఉండదు. అందువల్ల ఎన్నిగంటలు చదివినా, చదవడం అవగానే మరచిపోతాము. అదే ఇష్టపడి చదివితే, మనసులోకి ఎక్కుతుంది. ఎన్నాళ్ళైనా మరచిపోవడం జరగదు. అందుకే చదువును ఎప్పుడూ కష్టంగా భావించకూడదు. ఉన్నత లక్ష్యాలను సాధించటానికి చదువు మూలం. చదువు మనకు సంస్కారాన్నిస్తుంది. జ్ఞానాన్నిస్తుంది. కాబట్టి చక్కగా చదువుకుని లక్ష్యాన్ని సాధించి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి. లక్ష్యం ఉన్నతంగా ఉంటే, దానిని సాధించడానికి క్రమశిక్షణతో కృషిచేస్తాము. లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడతాము. ఇలా కష్టపడి సాధించిన లక్ష్యం ఎంతో ఆనందాన్నిస్తుంది.
ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక. తప్పక రాస్తావు కదూ !
ఇట్ల
నీ ప్రియమైన మిత్రుడు,
జమలయ్య.
ఖమ్మం.
చిరునామా :
కె. యాదగిరి
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఆ) మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
(లేదా)
ప్రయాణం చేసే సమయంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఉంటే వ్రాయండి.
జవాబు.
మేము మా కుటుంబంతో కలసి వేసవి సెలవులలో ఎక్కడికన్నా వెళ్లామనుకున్నాం. మా తాతగారు ఒరేయ్ మీకు ప్రకృతి అంటే ఏమిటో చూపిస్తాను వస్తారా ? అన్నారు. అందరం సరేనన్నాం. ఒక గంటలోనే అందరం ప్రయాణానికి సిద్ధం అయ్యాం. పెద్ద టాటా సుమో కారు మా యింటి ముందుకు వచ్చి ఆగింది. ఎక్కడికో ఏమిటో చెప్పనేలేదు. అందరం దాన్లో ఎక్కి కూర్చున్నాం. నేను తాతగారు ముందు, మిగిలిన వారందరూ వెనుక కూర్చున్నాం. అప్పుడన్నారు తాతగారు మనం భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్తున్నాం అని. ఇది కూడా ఒక ప్రయాణమేనా అని అందరం ఉసూరుమన్నాం. వాహనం ముందుకు సాగింది. భద్రాచలం అడవుల గుండా ప్రారంభమైన మా ప్రయాణం ఖమ్మం, చింతూరుల మీదుగా సాగింది.
అది చిన్న ఘాట్ రోడ్. కొండలు, గుట్టలు, లోయలు దారంతటా దర్శనమిస్తున్నాయి. నిజమైన ప్రకృతి సంపద వృక్షసంపద. ఆకాశాన్నంటే ఎత్తైన వృక్షాలు, ఋషుల జడలు లాగా అల్లుకున్న తీగలు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాగా ఉంది ఆ అడవి. పెద్ద పెద్ద సెలయేళ్ళు జలజలా ప్రవహిస్తుంటే ఒళ్ళు జలదరించింది.
పక్షుల కిలకిలా రావాలు, కీచురాళ్ళు పెట్టే ధ్వని మధ్యమధ్యలో అడవిలో తిరుగాడే కోతులు, చిరు జంతువుల అరుపులు, తోడేళ్ళ, నక్కల ఊళలు నిజంగా ప్రకృతి అంటే ఇదేగా అన్నట్లున్నది. ఆ ఘాట్రోడ్డులో జనసంచారమే కాదు వాహన సంచారం కూడా చాలా అరుదు. కొండమలుపుల్లో మాలో కలిగిన ఆందోళన అంత ఇంత కాదు. ఇబ్బందిగా ఉంటుందని అనుకున్నాం. భయపడ్డాం. కానీ, అక్కడ వాతావరణం చూస్తే పళ్ళు, పూలతో అలరిస్తున్న చెట్లు నిజంగా అది ఒక స్వర్గలోకం అనిపించింది. తాతగారు చెప్పిన ప్రకృతి అర్థం ఇదా అని, ఇంతటి సుందర ప్రాంతాన్ని చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం.
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి.
అ) పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండె.
అ) శక్తి
ఆ) సామర్థ్యం
ఇ) డబ్బు
ఈ) వస్తువు
జవాబు.
ఇ) డబ్బు
ఆ) నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను.
అ) మాటతీసుకొను
ఆ) మాటయిచ్చు
ఇ) మాట మార్చు
ఈ) డబ్బు యిచ్చు
జవాబు.
ఆ) మాటయిచ్చు
2. కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా : అందెవేసిన చేయి
సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.
ఆ) పట్టరాని సంతోషం
జవాబు.
నా కథకు మొదటి బహుమతి రావటం పట్టరాని సంతోషాన్నిచ్చింది.
ఆ) దేవునిపై భారంవేయు :
జవాబు.
కష్టకాలంలో దేవునిపై భారం వేయటం. కష్టం తీరగానే మరచిపోవడం మానవ నైజం.
ఇ) గుండె జల్లుమను
జవాబు.
రోడ్డు ప్రమాదాన్ని చూసి నా గుండె జల్లుమన్నది.
ఈ) చెమటలు పట్టు
జవాబు.
పామును చూడగానే నాకు చెమటలు పట్టాయి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి.
అ) ఆదిశేషునికి వేయితలలు : ______________________
జవాబు.
వేయి సంఖ్య గల తలలు – ద్విగు సమాసం
ఆ) కృష్ణార్జునులు సిద్ధమైనారు : ______________________
జవాబు.
కృష్ణుడును, అర్జునుడును – ద్వంద్వ సమాసం
ఇ) రవి, రాము అన్నదమ్ములు : ______________________
జవాబు.
అన్నయును, తమ్ముడును – ద్వంద్వ సమాసం
ఈ) వారానికి ఏడురోజులు : ______________________
జవాబు.
ఏడు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం
ఉ) నూరేండ్లు జీవించు : ______________________
జవాబు.
నూరు సంఖ్య గల ఏండ్లు – ద్విగు సమాసం
2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) విద్యాభ్యాసం = ________ + ________ = _____________
జవాబు.
విద్య మొదలు + అభ్యాసం = సవర్ణదీర్ఘ సంధి
ఆ) మొదలయింది = ________ + ________ = _____________
జవాబు.
మొదలు + అయింది = ఉత్వసంధి
ఇ) విద్యార్థులు = ________ + ________ = _____________
జవాబు.
విద్య + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి ఇత్వసంధి
ఈ) ఏదైనా = ________ + ________ = _____________
జవాబు.
ఏది + ఐన = ఇత్వసంధి
ఉ) వారందరు = ________ + ________ = _____________
జవాబు.
వారు + అందరు = ఉత్వసంధి
అత్వ సంధి
కింది పదాలను పరిశీలించండి.
అ) రామయ్య = రామ + అయ్య
ఆ) మేనత్త/మేనయత్త = + అత్త
ఇ) సెలయేరు = సెల + ఏరు
ఈ) ఒకానొక = ఒక + ఒక
సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని “పూర్వపదం” అని, రెండవ పదాన్ని “పరపదం” అని అంటారు.
పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది ?
పరపదం మొదట ఉన్న అచ్చు ఏది ?
పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడింది ?
పై ఉదాహరణలు చూసినప్పుడు మొదటి పదం చివరన ‘అ’ అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట అ, ఏ, ఒ మొదలైన అచ్చులు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ‘అ’ లోపించి రెండో పదం మొదటి అచ్చు. వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి.
రామయ్య → లాంటి పదాల్లో సంధి ఎప్పుడూ అవుతుంది. (నిత్యం)
మేనత్త, మేనయత్త లాంటి పదాల్లో సంధి జరగవచ్చు, జరుగకపోవచ్చు. (వైకల్పికం)
సెలయేరు → లాంటి పదాలు ‘సెలేరు’ లాగా మారకుండా ‘సెలయేరు’ లాగానే ఉంటాయి. (నిషేధం)
ఒకానొక → లాంటి పదాలు ‘ఒకొక్కలాగా మారకుండా మరోరూపంలోకి అంటే ‘ఒకానొక’లాగా మారుతాయి. (అన్యకార్యం)
(మొదటి పదం చివరి అచ్చు పూర్వస్వరం. రెండోపదం మొదటి అచ్చు పరస్వరం.)
‘అ’ కు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ ఔ) పరమైతే ఏర్పడే సంధి ‘అత్త్వసంధి’.
సూత్రం : (అత్తు అంటే హ్రస్వమైన ‘అ’) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.
3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.
ఉదా : తగిన + అంత = తగినంత.
అ) చాలిన + అంత = ________
జవాబు.
చాలినంత
ఆ) సీత + అమ్మ = ________
జవాబు.
సీతమ్మ
ఇ) అక్కడ + ఇక్కడ = ________
జవాబు.
అక్కడిక్కడ
ఈ) అందక + ఉండెను = ________
జవాబు.
అందకుండెను
ఉ) చెప్పుట + ఎట్లు = ________
జవాబు.
చెప్పుటెట్లు
ఊ) రాక + ఏమి = ________
జవాబు.
రాకేమి
బహుళం :
సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని “బహుళం” అంటారు.
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని
వివిధ పత్రికలలో వచ్చే యాత్రారచనలను చదివి, వాటిలో ఒక దానికి నివేదిక రాయండి.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు
2) సమాచారాన్ని సేకరించిన విధానం
ఆ) నివేదిక :
విషయ వివరణ :
దర్శనీయ యాత్రాస్థలం – వేములవాడ : పత్రికలు చదివి తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి సుమారు 32 కి.మీ. దూరంలో నెలకొని ఉన్న వేములవాడ ప్రసిద్ధ యాత్రాస్థలం. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు, భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం కలవు. సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు వేములవాడకు వచ్చి శ్రీ రాజరాజేశ్వరస్వామిని, అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి ఒకపూట ఇక్కడ నిద్రచేసి వెళ్తే తమ దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
భక్తులు బసచేయుటకు ప్రభుత్వ వసతి గృహాలతో పాటు, ప్రైవేటు లాడ్జ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు, రాజాదిత్య కట్టించినట్లు చరిత్రకారులు చెబుతారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. దీనిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇతర ఏ దేవాలయంలో లేని విధంగా భక్తులు కోడెలను కట్టివేసి మొక్కు చెల్లించుకొనే సాంప్రదాయం ఈ గుళ్ళో కలదు.
1830 ప్రాంతంలో కాశీయాత్రలో భాగంగా, నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామి, తన “కాశీయాత్ర” అనే పుస్తకంలో ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రస్తావించారు. శివరాత్రి రోజున 3 లక్షల మంది భక్తులు రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. వంద మంది అర్చకులు మహాలింగార్చన చేస్తారు. రాత్రిపూట శివరాత్రి రోజున విద్యుద్దీపాల కాంతిలో ఈ దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతుంటే అది కళ్ళారా చూసి తరించాల్సిందే తప్ప నోటితో పొగడడం ఎవరి శక్యమూ కాదు.
కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకు వేంచేశాడని పురాణ కథనం. మూల విరాట్టు రాజరాజేశ్వరస్వామి ఎడమవైపున శ్రీ రాజరాజేశ్వరిదేవి, కుడివైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ది వినాయక విగ్రహాలున్నాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్లనాటి మసీదు ఉంది. ఇలా ఈ ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. అతి పురాతనమైన భీమేశ్వర ఆలయంలో భక్తులు శనిగ్రహ దోష నివారణకు శని పూజలు జరుపుకుంటారు. ఈ దేవాలయంలో కోడెను కట్టివేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఇ) ముగింపు :
ఇంత ఘన చరిత్ర కలిగిన దేవాలయానికి ఒక్కసారి వెళ్ళి కనులారా ఆ దేవదేవుని దర్శించుకోవాలని కోరిక కలిగింది. మన గత వైభవానికి ప్రతీకలు, సంస్కృతీ సాంప్రదాయాలకు వారధులైన దర్శనీయ స్థలాల గూర్చి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే భావన నాలో కలిగింది.
TS 8th Class Telugu 2nd Lesson Important Questions సముద్ర ప్రయాణం
ప్రశ్న1.
రచయిత గ్రేట్ బ్రిటన్ కు వెళ్ళిన పడవ ప్రయాణంలోని సౌకర్యాలను వివరించండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య ప్రయాణించిన పడవలోని సౌకర్యాలు ఏమిటి ?
జవాబు.
రచయిత ముద్దు రామకృష్ణయ్య ప్రయాణం చేసిన పడవలో సౌకర్యాలకు కొదవలేదు. పడవ క్యాబిన్లో ఒక్కొక్కదానిలో 6 బెర్తులు ఉన్నాయి. ప్రతి పడవలోను ‘Life Boats’ ఉన్నట్లు ఈ పడవలో కూడా ఉన్నాయి. పడవ అటు చిన్నది కాదు, ఇటు పెద్దది కాదు. కొత్తగా పడవ ఎక్కినవారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. తలనొప్పి, వాంతులు అవుతాయి. డబ్బు తీసుకోకుండా పడవలోని డాక్టర్లు మందులు ఇస్తారు. రోగులు లేవలేని స్థితిలో డాక్టర్ క్యాబిన్లోకి వచ్చి మందులిస్తారు. పడవలో పోస్టాఫీసు కూడా ఉంది.
ప్రయాణీకులకు జాబు వస్తే క్యాబిను తెచ్చి అందిస్తారు. అలాగే టెలిగ్రాఫ్ ఆఫీసు కూడా ఉంది. పడవలోని దుకాణాలలో మనకు కావలసిన వస్తువులను తెచ్చుకోవచ్చు. పడవ పైన రేడియో డెట్లు, లౌడ్ స్పీకర్లు అమర్చబడి ఉంటాయి. వార్తలు ఎప్పటికప్పుడు తెలుపబడతాయి. పీరియాడికల్స్ లాంజ్లో ఉంటాయి. గొప్పవారి హోదాకు తగ్గట్లుగా లాంజ్లుంటాయి. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లుంటాయి.
వారి పూర్తి బాధ్యత పడవవారే చూసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంటుంది. ఆటలు కూడా ఆడుకునే వీలుంటుంది. స్విమ్మింగ్పల్ కూడా ఉంటుంది. సకల సౌకర్యాలతో పాటు అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలం అవటం చేత పడవల దిశానిర్దేశం చేస్తూ ఆకాశంలో విమానాలు అనుసరిస్తూ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత ప్రథమలక్ష్యంగా అవి సాగుతుండేవి.
ప్రశ్న2.
బ్రిటన్ పోలీసుల నిబద్ధతను వివరించండి.
జవాబు.
బ్రిటన్ పోలీసులు చాలా నిబద్ధత కలిగినవారు. వారు ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలించేవారు. ఏ మాత్రం తేడా ఉన్నా ఊరుకునేవారు కాదు. ఈ విషయం పట్ల పూర్తి అవగాహన రచయితకు ఆంగ్లో ఇండియన్ మిత్రుడు ఫాల్సెట్టు కలిగించాడు. బ్రిటన్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. తగినంత డబ్బు లేకుండా విదేశీయులను బ్రిటన్లో దిగనిచ్చేవారు కాదు. అలాంటివారిని డీపోర్ట్ చేసి వెనక్కి పంపించేవారు. రచయిత కూడా ఈ విషయం విని చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆయన వద్ద కూడా తగినంత డబ్బు లేదు.
రచయితకు తనని కూడా డీపోర్టు చేసి ఇండియాకు పంపిస్తారన్న భయం పట్టుకుంది. అందుకే ఆయన “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుక్షణం భగవంతునికి మొక్కుకున్నాడు. స్కాట్లాండ్ యొక్క గ్లాస్కో రేవు పట్టణంలో పడవ ఆగింది. అక్కడికి పడవ చేరకముందే పోలీసులు పడవలోకి వచ్చారు. ప్యాసింజర్ల పాస్పోర్టులను చెక్చేశారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. కారణం వారి దగ్గర సరైన పేపర్లు లేకపోవటం.
చివరకు రచయిత వంతు వచ్చింది. ఆయన పాస్పోర్టును చూసి మీరు “స్టడీస్ కొరకు వచ్చారా” అని అడిగి పర్మిటెడ్ అని స్టాంపు వేశారు. రచయిత బ్రతుకు జీవుడా అనుకున్నారు. ప్రతి విషయంలోనూ బ్రిటీషు పోలీసువారు మంచి నిబద్ధతతో వ్యవహరిస్తారనడానికి ఇవన్నీ కొన్ని నిదర్శనాలు.
ప్రశ్న3.
ముద్దు రామకృష్ణ వివరించిన సముద్ర ప్రయాణాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళడానికి ముద్దు రామకృష్ణయ్య పడిన ఇబ్బందులేవి?
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళిన రచయిత ప్రయాణ అనుభవాలేవి? ఎలా ప్రయాణం సాగించాడు?
జవాబు.
18 -10 -1907 లో ముద్దు రాజన్న, అమ్మాయి దంపతులకు కరీంనగర్ జిల్లా మంథని గ్రామంలో ముద్దు రామకృష్ణ జన్మించాడు. ఉన్నత విద్య కోసం గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకొన్నాడు. తగినంత ధనం లేకున్నా రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో ఎవర్ని కలవాలో, ఎక్కడ దిగాలో, ఏం చేయాలో తెలియకుండానే రెండు జతల బట్టలు, పైజమా కుర్తా సర్దుకొని, 22 పౌండ్ల ధనంతో పడవ ఎక్కాడు.
పడవ ప్రయాణంలో ఆంగ్లో ఇండియన్ “ఫాల్సెట్” అక్కడి అలవాట్లు, పరిస్థితులు వివరించాడు. ధనంలేక డీపోర్టు చేస్తారని భయపడి కరీంనగర్ వాడైన సురేష్బాబు ఇతనికి భరోసా ఇచ్చాడు. స్టడీస్ కోసం వచ్చాడని గమనించిన పోలీసులు ఇతని పాస్పోర్టు చూసి “పర్మిటెడ్” అని అనగానే పట్టరాని సంతోషం కల్గింది. గ్రేట్ బ్రిటన్ చూస్తూ నిలబడ్డాడు. అనుకున్న లక్ష్యాన్ని కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించాలని అనుకున్నాడు రామకృష్ణయ్య.
ప్రశ్న 4.
విద్యయొక్క అవసరాన్ని తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు.
చదవనివాడు అజ్ఞాని అని, చదువుకుంటే వివేకము కలుగుతుందని, మనిషిగా పుట్టినవాడు జ్ఞానాన్ని సంపాదించాలని పోతన భాగవతంలో వివరించాడు. “విద్య లేనివాడు వింత పశువన్న” నానుడి లోకంలో ఉండనే ఉంది. చదువులు నేర్చిన వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. విద్య సుఖ సంతోషాలనిస్తుంది. ఏ దేశమైతే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం చదువులలో వెనుకబడి ఉంది.
గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఎంతోమంది నిరక్షరాస్యులుగా ఉండిపోతున్నారు. బాలకార్మిక వ్యవస్థ చదువులలో వెనుకబడటానికి ఒక కారణం. బంగారు తెలంగాణ కావాలంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం చదువులపై శ్రద్ధపెట్టాలి. రాష్ట్రంలోని వారినందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.
వయోజనులలో కూడా చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి అందరూ చదువుకునేటట్లు చేయాలి. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టాలి. విద్యాభ్యాసం తరువాత ఉద్యోగం వచ్చి జీవనానికి ఆసరాగా నిలుస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి.
ప్రశ్న 5.
మీరే ముద్దు రామకృష్ణయ్య అయితే, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
జవాబు.
నేనే ముద్దు రామకృష్ణయ్యను అయితే విద్య యొక్క ఉపయోగాలను గురించి విద్యార్థులకు వివరిస్తాను. ‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అన్న విషయాన్ని వివరించి వారికి చక్కని మార్గాన్ని చూపిస్తాను. నైతిక విలువలతో కూడిన విద్యను నేర్వమని బోధిస్తాను. కృత నిశ్చయం, దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్తాను.
విద్యార్థులందరు లక్ష్యసాధన దిశగా పయనించి ఉన్నత విద్యలను నేర్చి దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని వివరిస్తాను. నీతి నిజాయితీకి నిలువుటద్దంగా తెలంగాణ పౌరులు నిలవాలని ప్రబోధిస్తాను. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు, ఆ పల్లెలలోని ప్రజలు చదువుబాట పట్టి విద్యాధికులు కావటానికి వారిలో చైతన్యాన్ని తీసుకువస్తాను. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ విద్యాధికులు కావాలని కోరుకుంటాను.
పర్యాయపదాలు:
- యుద్ధము = సమరము, రణము
- సముద్రము = జలధి, కడలి
- ఈశ్వరుడు = శివుడు, త్రినేత్రుడు
- దిక్కు = దిశ, మార్గము
- ఇల్లు = గృహము, నివాసము
- తీరము = దరి, ఒడ్డు
- భూమి = పుడమి, ధరణి
- నెల = మాసము, 30 రోజులు
నానార్థాలు:
- దిక్కు = దిశ, శరణము
- వనము = అడవి, సమూహము
- శక్తి = బలము, పార్వతి
- సుధ = పాలు, అమృతము
- తలపు = ఆలోచన, అభిప్రాయం
- చీకటి = అంధకారము, దుఃఖము
వ్యుత్పత్త్యర్థాలు:
- ఈశ్వరుడు పయోధి పుత్రుడు = శుభములను కలిగించువాడు. (శివుడు)
- పయోధి = వయస్సుకు నెలవైనది (సముద్రం)
- పుత్రుడు = పున్నామ నరకాన్ని తప్పించువాడు (కుమారుడు)
ప్రకృతి – వికృతులు:
- ప్రకృతి – వికృతి
- ప్రాణము – పానము
- భాష – బాస
- భోజనము – బోనము
- సంతోషము – సంతసము
- ఆశ్చర్యము – అచ్చెరువు
- కులము – కొలము
- దీపము – దివ్వె
- ధర్మము – దమ్మము
- రాత్రి – రాతిరి
- వైద్యుడు – వెజ్జు
సంధులు:
- చారిత్రకమైన = చారిత్రకము + ఐన = ఉత్వసంధి
- అడుగుతారని = అడుగుతారు + అని = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది. - చేర్చినందుకు = చేర్చిన + అందుకు = అత్వసంధి
- చింతాకు = చింత + ఆకు = అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
సమాసములు:
- తల్లిదండ్రులు – తల్లియును తండ్రియును – ద్వంద్వ సమాసము
- రాత్రి – రాత్రియును పగలును – ద్వంద్వ సమాసము
- నా ఉచ్చారణ – నా యొక్క ఉచ్చారణ – షష్ఠీ తత్పురుష సమాసము
- గ్రంథాలయము – గ్రంథములకు ఆలయము – షష్ఠీ తత్పురుష సమాసము
- భారతదేశము – భారతము అను పేరు గల దేశము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
- మర్రిచెట్టు – మర్రి అను పేరు గల చెట్టు – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
- సుందర దృశ్యాలు – సుందరమైన దృశ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
- రమ్య స్థలము – రమ్యమైన స్థలము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
- ప్రియభాషణం – ప్రియమైన భాషణం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పాఠం ఉద్దేశం
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకి వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్న పని. అయినప్పటికీ ఉన్నత విద్యకోసం, కరీంనగర్ జిల్లా మంథని గ్రామ వాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్ కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం. కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో, దృఢసంకల్పంతో పూర్తిచేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ప్రశ్న.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన “నా ప్రథమ విదేశీ యాత్ర” పుస్తకంలోనిది.
కవి పరిచయం
ప్రశ్న.
ముద్దు రామకృష్ణయ్య గారిని గురించి రాయండి.
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం. ఇడి. పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలను 18-10-1907 అధ్యయనం చేశాడు. మనదేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికీ ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ‘ఈచ్ వన్ టీచ్ వన్’ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త.
ప్రవేశిక
ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి ? ఎట్లా చెయ్యాలి ? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది ! అనంతాకాశంలాగా పరుచుకున్న దరిలేని సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది ? ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం.
కఠిన పదాలకు అర్ధాలు
- దినము = రోజు
- పాశ్చాత్యులు = విదేశీయులు
- క్లోజు = దగ్గరగా
- ఉచ్చారణ = పలుకుబడి
- తలంపు = ఆలోచన
- భారము = బరువు
- తుద = చివర
- కృతజ్ఞత = చేసిన మేలు మరువకుండుట
- వందనము = నమస్కారము
- శరము = బాణము
- శరణు = ప్రార్ధన
- క్లుప్తంగా = తక్కువగ
- వాగ్దానము = మాట ఇవ్వడం
- స్కాలర్షిప్ = ఉపకార వేతనము
- బందోబస్తు = జాగ్రత్త చేయు
- కాన్వాయి = రక్షకదళ సమూహం
- క్యాబిన్ = చిన్నగది
- డెక్ = ఓడలో నేలవంటి అడుగు భాగం
- ఇన్స్పెక్ట్ = తనిఖీ
- రిసెప్షన్ రూం = వేచియుండు గది
- ఖుల్లా = తెరచియుండు
- కనెక్టు = కలుపబడు
- లాంజ్ = ఆవిరిపడవ (ఓడ)
- సైక్లోస్టైల్ = నకలు ముద్రణ
- పీరియాడికల్స్ = నియమిత కాలంలో సంభవించెడిది, కాల నిర్ణయంతో వచ్చే పత్రిక
- ఫర్నీచర్ = వస్తు సామగ్రి
- ఫ్లోరు = నేల
- మఖ్మల్ = వెల్వెటు
- తివాసీ = కార్పెట్ = నేల మీద పరిచే మందపాటి దుప్పట్టా
- కంఫర్టబుల్ = సౌకర్యవంతం
- నర్సరీ = శిశు విహారశాల, బిడ్డలకై ప్రత్యేకింపబడిన గది
- కిండర్ గార్టెన్ = వస్తువులను చూపించి బోధించే పద్ధతి
- లైబ్రరీ = గ్రంథాలయం
- ఔట్ డోర్ గేమ్స్ = బయట ఆటస్థలంలో ఆడే ఆటలు
- టూర్నమెంట్ = అంతర్గత పోటీలు
- స్విమ్మింగ్ = ఈత
- ఓపెన్ ఏర్ = బయటి గాలి
- మందలించు = కోప్పడు
- డిఫోర్టు = వెనుకకు తిరిగి పంపుట
- మొహల్లా = భవంతి
- డిస్ట్రాయర్లు = నాశనం చేసే పనిముట్లు
- డేంజరు = అపాయం
- వైల్డ్ = భయంకరం
- కస్టం = తనిఖీ
- పౌండు = సుమారుగా 1 and 1/2 kg, బ్రిటన్ కరెన్సీ
- పాస్పోర్టు = విదేశాలకు వెళ్ళుటకు అనుమతినిచ్చే అనుమతి పత్రం
- పర్మిటెడ్ = అనుమతించిరి
నేనివి చేయగలనా ?