శిల్పి TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana
బొమ్మలను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్నలు
ప్రశ్న 1.
పై బొమ్మలను చూడండి. అవి వేటితో తయారైనాయి?
జవాబు.
పై చిత్రంలోని స్తంభాలు, అరుగులు, విగ్రహాలు, మండపాలు, తోరణాలు మొదలైనవన్నీ రాతితో తయారయ్యాయి.
ప్రశ్న 2.
ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి ? దాని గురించి మీకు తెలిసింది చెప్పండి.
జవాబు.
ఇవన్నీ శిల్ప కళకు సంబంధించినవి. శిల్పము అనగా బొమ్మ. చక్కటి ఆకారాన్ని విగ్రహంలాగా పూర్తి రూపంలో తయారు చేయటమే శిల్పకళ. శిల్పాలు పూర్వం ఎక్కువగా రాతితో తయారు చేసేవారు. తరువాత చెక్క బొమ్మలు వచ్చాయి. మట్టితో కూడా బొమ్మలు చేస్తారు. కొండపల్లి, నిర్మల్, ఏటికొప్పాక మొదలైన చోట్ల కొయ్య బొమ్మలు తయారు చేస్తారు. పంచలోహాలనుగాని, ఒక్కొక్క లోహాన్ని గాని కరిగించి విగ్రహాలు తయారు చేస్తారు. ఇటీవల మైనపు బొమ్మలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడా బొమ్మలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. ఈ బొమ్మలు
రంగులలో కూడా ఉంటాయి.
ప్రశ్న 3.
శిల్పాలను తయారు చేసేవారిని ఏమంటారు ? వారి గురించి మీకు తెలిసింది చెప్పండి.
జవాబు.
శిల్పాలు తయారు చేసే వారిని శిల్పులు అంటారు. కొండ గుహలలోనూ కొండల మీదా శిల్పాలు చెక్కుతూ ఉండేవారు ఈ శిల్పులు. వాళ్ళ చేతిలో గొప్ప నేర్పు ఉండేది. ఏ శిల్పం చెక్కినా జీవకళ ఉట్టిపడుతూ ఉండేది. అంత కష్టపడినా వారిని ఆదరించే వారు గాని, కళకు తగినంత ప్రతిఫలం ఇచ్చేవారు గాని లేరు. రాయే కదా ఖర్చులేనిది అనుకోవడమే గాని రాతిలో జీవాన్ని నింపిన శిల్పి ప్రతిభను ఎవరూ గుర్తించరు. అందుచేత వారి పరిస్థితి చాలా దీనంగా ఉండేది.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.66)
ప్రశ్న 1.
భక్తిభావం పెంపొందడానికి శిల్పి ఎట్లా దోహదపడతాడు?
జవాబు.
శిల్పి అనగా శిల్పం తయారు చేయువాడు. ఏదేని ఒక రాతిని జీవకళ ఉట్టిపడేటట్లు చెక్కడం శిల్పి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. శిల్పి తన నేర్పుతో చేతి దెబ్బల వల్ల అందమైన ఆకారాన్ని తయారు చేస్తాడు. ఆ ఆకారాలలో చూపరులకు ఆ బొమ్మ రాతిదే అయినా అద్భుతమైన ఆకారాలతో దిద్దడం వలన దేవతా ప్రతిమలుగాగాని, కళాఖండాలుగాగాని మారి భక్తిభావం ఏర్పడుతుంది. ఆ భక్తి భావం కలగాలంటే శిల్పి హస్తకళా ప్రావీణ్యం ఎంతో ఉండవలసి ఉంటుంది.
ప్రశ్న 2.
ఈ రాతికంబమునకు “కుసుమ వల్లరులు” కూర్చడమంటే మీరేమనుకుంటున్నారు?
జవాబు.
కవి కవిత్వంతో ఎలాంటి అలంకారాలనైనా కవిత్వానికి సమకూర్చుతాడు. అలాగే కవియొక్క భావనాశక్తి శిల్పి ఉలికి కూడా ఉంటుంది. శిల్పికి ఎలాంటి ఊహలు, ఆలోచనలు ఉంటాయో అవన్నీ అతని ఉలికి కూడా వస్తాయి. ఉలి రాతిస్తంభానికి కూడా పూచిన తీగలను కూర్చగలడు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.67)
ప్రశ్న 1.
శిల్పి పేదరికంలో ఎందుకు నలిగిపోతున్నాడు?
జవాబు.
శిల్పులు కొండరాళ్ళపై శిల్పాలు చెక్కుతూ జీవకళను ఉట్టిపడేటట్లుగా చెక్కారు. ఎంతకష్టపడి చెక్కినా వారిని ఆదరించేవారులేరు. కళకు తగినంత ప్రతిఫలం ఇచ్చేవారు రాయిలో జీవాన్ని నింపి, తన ప్రతిభనంతా చూపినా ఎవరూ గుర్తించరు. అందుకే పేదరికంలో నలిగిపోతున్నాడు.
ప్రశ్న 2.
శిల్పి సంతోషపడేదెప్పుడు?
జవాబు.
శిల్పి ఎంతో కష్టపడి చెక్కిన శిల్పాలు ప్రజల ఆదరణకు నోచుకున్నప్పుడు సంతోషపడతాడు. తాను అనుకున్న ప్రతిరూపాలు తయారైనపుడు వాటిని ప్రజలంతా మెచ్చుకున్నప్పుడు ఆనందపడతాడు. తన శిల్పకళానైపుణ్యానికి తగిన గౌరవం, పారితోషికం లభించినపుడు తన కళకు లభించిన గుర్తింపుగా ముదమునందుతాడు.
ప్రశ్న 3.
కవికి, శిల్పికి మధ్యగల పోలికలు చెప్పండి.
జవాబు.
కవి | శిల్పి |
1. తన రచనలలో, కవిత్వంలో ఎలాంటి అలంకారాలతోనైనా రచన చేయగలడు. | 1. తన ఉలితో రాతిస్తంభంపై అందమైన పూచిన పూల తీగలను కూడ కూర్చగలడు. |
2. కవి స్త్రీసహజ సౌందర్యమును తన రచనా నైపుణ్యంతో కవిత ద్వారా వెల్లడిస్తాడు. | 2. తన భావనాబలంతో ఎంత బండరాయినైనా అప్సరస విగ్రహంగా చెక్కి శిల్పజగత్తులో శాశ్వతస్థానం సంపాదించుకున్నాడు. |
3. మహారాజుల చరిత్రలు కావ్యాల ద్వారా వెల్లడిస్తాడు. | 3. విగ్రహాల రూపాలలో చెక్కి, కావ్యాలలోని కథలను గుర్తుచేస్తాడు. |
4. అజంతావంటి గుహల నైపుణ్యాలను రచనలలో వెల్లడిస్తాడు. | 4. శిల్పి బండరాళ్ళను కూడా సజీవ విగ్రహాలుగా, సింహాలు, బొమ్మలుగా తీర్చిదిద్దగలడు. |
ప్రశ్న 4.
శిల్పికి శాశ్వతత్వం ఎప్పుడు వస్తుంది?
జవాబు.
శిల్పి తన చేతితో అప్సరస విగ్రహం చెక్కి అందమైన ఆమె కన్నుల ప్రక్కనే తన రూపాన్ని మలచుకొని, ఆనందపడిపోతూ తనను చిరంజీవిగా చేసుకున్నాడు. శిల్పి తన ప్రతిభతో ఎల్లకాలం గుర్తుండిపోయే శిల్పాలు చెక్కినప్పుడు చరిత్రలో శాశ్వతత్వం వస్తుంది.
ప్రశ్న 5.
శిల్పిని “మహాపుణ్యుండవయ్యా” అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
శిల్పి అజంతా, ఎల్లోరా గుహలలో శిల్ప సందపను శాశ్వతంగా గుర్తుండిపోయేటట్లు చెక్కాడు. వట్టి బండరాళ్ళను గూడా సజీవంగా నిలిపాడు. జాలువారే విగ్రహాలు అతని చేతి నుండి తయారయ్యాయి. అవన్నీ తలచుకొని కవి శిల్పిని మహాపుణ్యండవయ్యా! అని అన్నాడు.
ఇవి చేయండి
I విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
కవి శిల్పిని శాశ్వతుడనీ, ఆయన ప్రజ్ఞకు నమస్కారం చేయమని చెప్పాడు కదా! దీనిమీద మీ అభిప్రాయాన్ని చెప్పండి.
జవాబు.
ఒక్కొక్క శిల్పి చెక్కిన శిల్పానికి ఒక్కొక్క శైలి ఉంటుంది. శిల్పం చూడగానే ఏ ప్రాంతం వారు చెక్కారో చెప్పవచ్చు. కవి మనసులోని భావాలను మాటలరూపంలో వ్యక్తం చేయగలడు. శిల్పి మనోభావాలకు రూపాన్నివ్వటం సామాన్యం కాదు. చక్కని శిల్పం చెక్కి అందులోనే తనను చూసుకొని మురిసిపోగలడు. ప్రజల మనసులపై తన శైలి ముద్రించగలడు. అందుకే శిల్పి శాశ్వతుడు. ఆయన ప్రతిభకు నమస్కారం చేయాలి.
ప్రశ్న 2.
శిల్పకళవలె నీకు తెలిసిన ఇతర కళలేవి? ఆయా కళాకారుల గొప్పదనమేమిటి?
జవాబు.
శిల్పకళ వలె నాకు తెలిసిన ఇతర కళలు సంగీతం, కవిత్వం, నాట్యం, చిత్రలేఖనం. సంగీత కళాకారుడు శిశువులను, పశువులను, పాములను గూడ మైమరిపించగలడు. కవి ఎలాంటి భావనలనైనా తన కవిత్వం ద్వారా తెలుపగలడు. నాట్యం అనేక కళల సమూహం. నాట్యకారుడు తన నటన ద్వారా పాటలకు వీలుగా భావము వ్యక్తం చేస్తాడు. చిత్రకారుడు తన కుంచెతో ఎలాంటి అందమైన చిత్రాన్నైనా గీయగలడు.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది పద్యపాదాలు పాఠంలోని ఏఏ పద్యాల్లో ఉన్నాయి. వాటి సందర్భమేమిటి?
అ) బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు
జవాబు.
ఈ పద్యపాదం “సున్నితంబైన ………. పూజ” అనే పద్యములోనిది.
సందర్భం : శిల్పి తన సున్నితమైన చేతితో సుత్తిపట్టి రాళ్ళను చెక్కగా ఎన్నో దేవాలయాలు తయారైనాయి. వాటిలో ఎన్నో దేవతా విగ్రహాలు వెలసినాయి. అలా ఆ రాళ్ళకు పసుపుకుంకాలతో పూజలు దక్కినాయి అని కవి తెలిపిన సందర్భం.
ఆ) తారతమ్యంబు లే దబద్ధంబు గాదు.
జవాబు.
ఈ పద్యపాదము “ప్రతిమలు రచించి ………. అబద్ధంబుగాదు” అను పద్యములోనిది.
సందర్భం : కవిత్వంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేలా కవిలాగే శిల్పి కూడా తన శిల్పంతో చూసేవారు చరిత్రలను చదువుకోగలిగేటట్లు శిల్పాలు తీర్చిదిద్దుతాడు. అందుకే కవికీ శిల్పికీ కొంచెం కూడా భేదం లేదు. ఇందులో అసత్యమేమీ లేదు అని కవి చెప్పిన సందర్భం.
ఇ) తాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
జవాబు.
ఈ పద్యపాదము “జాలనిద్రించు ……….. నిశ్చయముగాను” అను పద్యములోనిది.
సందర్భం : శిల్పి రాళ్ళలోని బొమ్మలను నిద్రలేపి ఉలితో తాకి బయటికి తెచ్చాడు. అలా తయారైన శిల్పాలు తప్పక నీ పేరు నిలబెడతాయి. నీవు శాశ్వతంగా ప్రజల మనసులో ఉండిపోతావు అని కవి తెలిపిన సందర్భం.
ఈ) జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో గల
జవాబు.
ఈ పద్యపాదము “తెలిరాతిన్ …………. నీ ప్రజ్ఞకున్” అను పద్యములోనిది.
సందర్భం : పాలరాతిలో అప్సరస విగ్రహాన్ని మలిచి ఆమె సోగకన్నుల పక్కనే నిన్ను నీవు మలచుకొని ఆనందపడి పోతావు. శిల్పకళా రంగంలో నిన్ను నువ్వు శాశ్వతంగా నిలుపుకున్నావు. నీకు సమానమైన వారెవ్వరూ లేరు. నీ తెలివి తేటలకు నమస్కారము అని కవి పలికిన సందర్భం.
2. కవికి – శిల్పికి మధ్య పోలికలున్న పద్యాలు ఈ పాఠంలో ఉన్నాయి. అవి ఏయే పద్యాలలో ఉన్నాయో గుర్తించి వాటిని రాయండి.
జవాబు.
కవికి – శిల్పికి మధ్య పోలికలు చెప్పిన పద్యాలు :
కవి:
1. కవికలంబున గల యలంకార రచన కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున గాకపోయిన బెను జాతికంబములకు గుసుమవల్లరు లేరీతి గ్రుచ్చినావు ?
శిల్పి:
2. ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత వల్లెవేయింప గలవు చూపరులచేత గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు దారతమ్యంబు లే దబద్ధంబు గాదు.
3. కింది గద్యాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు తయారుచేయండి.
జనపదం అంటే గ్రామం. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించే కళలను జానపదకళలు అంటారు. యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గుకథ, బుర్రకథ వంటివి కొన్ని జానపద కళా రూపాలు. వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనపైన ఉంది. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలితకళలు. భావం మనస్సుకు హత్తుకొనే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీనుల విందుగా ఉండే గానకళ సంగీతం. రాళ్ళను చెక్కి, అనేక భావాలను మనసులో కలిగించే కళ శిల్పకళ. రాగ, తాళ, లయలకు తగిన విధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం.
జవాబు.
ప్రశ్నలు :
1. జానపదులు అనే పేరెట్లా వచ్చింది ?
2. మనం వేటిని కాపాడు కోవాలి ?
3. లలిత కళలేవి ?
4. కవిత్వం అని దేనిని అంటారు ?
5. నృత్యకళకు ఏవి ప్రధానం ?
6. వీనులకు విందు చేసేది ఏది ?
7. శిల్పకళ ఏమిస్తుంది ?
8. కొన్ని జానపద కళారూపాలను పేర్కొనండి.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) శిల్పి రాళ్లలో ఏ ఏ రూపాలను చూసి ఉంటాడు ?
జవాబు.
శిల్పి నల్లరాతిలో మనసు పులకించి పోయేలా భయంకరమైన సింహాల తలలు, భూమి పైనున్న అన్ని పర్వతాలలోనూ ఎన్నో రకాలైన చిత్ర విచిత్రరూపాలను, విగ్రహాలు, దేవాలయాలు, పూలతీగెలు, అప్సరసలు, మహారాజులు, మానవులు మొదలైన వాటి నెన్నిటినో చూసి ఉంటాడు.
ఆ) నల్లని రాళ్ళకు శిల్పిమీద కృతజ్ఞత ఎందుకుండాలి?
జవాబు.
నల్లని రాళ్ళనుండి శిల్పి అనేకమైన చిత్ర విచిత్రమైన శిల్పాలను చెక్కి చూపరులందరి దృష్టి వాటిపై పడేలా చేస్తాడు. భయంకరమైన వాటిని కూడా ఎంతో అందంగా చెక్కుతాడు. రాళ్ళను దేవతా విగ్రహాలుగా చెక్కి గుడిలో వాటికి పూజార్హత కల్పిస్తాడు. ప్రజలంతా పసుపు కుంకాలతో పూజిస్తారు. రాళ్ళను అందమైన శిల్పాలుగా తీర్చిదిద్ది వాటికి గౌరవాన్ని కలిగిస్తున్నాడు గనుక వాటికి శిల్పి మీద కృతజ్ఞత ఉండాలి.
ఇ) కవికీ, చిత్రకారుడికీ ఉండే పోలికలు, భేదాలు ఏమిటి ?
జవాబు.
కవి మనసులోని భావాలను చక్కని పదాలలో కూర్చి అలంకారాలలో చేర్చి మహారాజుల చరిత్రలను ఇంకా అనేక కావ్యాలను చక్కగా తన కలంతో తయారు చేస్తాడు. చదువరులకు ఆనందం కలిగిస్తాడు. శిల్పి కూడా తన మనసులోని భావాలను సున్నితమైన సుత్తి, ఉలితో రాతి మీద చెక్కుతూ పూల తీగెలతో అలంకరిస్తూ చక్కని శిల్పాలలో అనేక చరిత్ర కథలను సృష్టిస్తాడు. చూపరులకు ఆనందం కలిగిస్తాడు. ఇద్దరికీ ఉన్న భేదమల్లా కవి కలంతో కాగితం మీద సృష్టి చేస్తాడు. శిల్పి ఉలి, సుత్తితో రాళ్ళమీద సృష్టి చేస్తాడు.
ఈ) చూసే వాళ్ళకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవని కవి ఎందుకు అన్నాడు?
జవాబు.
కవి అలంకారములతో చిత్ర విచిత్రముగా కావ్యము వ్రాసి అందలి కథలతో చదివే వారిని ఆకట్టుకున్నట్టే. శిల్పి అందమైన శిల్పాలతో చూపరులను ఆకట్టుకుంటాడు. కవి చెప్పే కథకు సంబంధించిన శిల్పాలు గోడలమీద క్రమంలో చెక్కితే చూసేవారు ఆ బొమ్మల వల్ల మహారాజుల కథలను గుర్తు చేసుకుంటారు అని కవి జాషువా అంటున్నారు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
అ) తెలంగాణ రాష్ట్రంలోని శిల్పకళాసంపదను గురించి వ్యాసం రాయండి.
జవాబు.
తెలంగాణా రాష్ట్రంలో శిల్పకళ అద్భుతమైంది. హైదరాబాద్లో పూర్వీకులు నిర్మించిన చార్మినార్, గోల్కొండకోట, బిర్లామందిర్, వరంగల్లోని వెయ్యి స్తంభాలగుడి, రామప్ప దేవాలయము, రామోజీ ఫిల్మ్ సిటి, హుస్సేన్ సాగర్ లోని బుద్ధవిగ్రహం శిల్పకళా సంపదకు నిలయాలు. సుమారు 400 సం॥లకు ముందే నిర్మించిన చార్మినార్ ని నాలుగు గుమ్మటాలు మతసామరస్యానికి చిహ్నాలు. బిర్లామందిర్ పాలరాతి సుందర కట్టడము.
వెయ్యిస్తంభాల గుడి వరంగల్లో నల్లరాతి కట్టడంగా వెలుగొందుచున్నది. రామప్ప దేవాలయములో ఆనాటి శిల్పకళ నేటికీ ఎంతో అందంగా విరాజిల్లుచున్నది. హుస్సేన్నాగర్లో ప్రతిష్ఠించిన బుద్ధుడు మనందరికి శాంతిసందేశాన్నిస్తున్నాడు. రామోజి ఫిల్మ్ సిటి అద్భుతమైన కట్టడము. ప్రజలకు మానసిక విశ్రాంతికి, ఆనందానికి విడిది. సినిమా షూటింగులకు దక్షిణ భారతంలోనే గొప్పకట్టడంగా ఉన్నది. శిల్పి గొప్పదనాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
(లేదా)
ఆ) శిల్పి గొప్పదనాన్ని గురించి కవి జాషువా చక్కగా వర్ణించారు.
జవాబు.
శిల్పి శిల్ప కళాజగత్తుకు మకుటంలేని మహారాజు. అతడు తన సుతిమెత్తని చేతులతో ఉలి, సుత్తి పట్టుకొని కఠినమైన పాషాణాలను అద్భుతమైన శిల్పాలుగా చెక్కుతాడు. మనదేశంలోని పర్వత శ్రేణులన్నిటియందు శిల్పి చెక్కిన శిల్పాలు కనబడతాయి. ఎక్కువ భాగం దేవాలయాలు కొండల మీద ఉన్న కారణమిదే. కాళ్ళకింద తొక్కే బండరాళ్ళను దేవతా విగ్రహాలుగా మలచి ఆ రాళ్ళకు పూజార్హత కల్పించాడు. పూలతీగలు, సింహాలు, మానవ విగ్రహాలు, మహారాజుల చరిత్రలు, అప్సరసల శిల్పాలు మొదలైన అనేక విధాలైన శిల్పాలను చెక్కుతాడు.
రాతిని తాకితే సప్తస్వరాలు పలికించగల నేర్పు శిల్పికున్నది. కొన్ని వందల వేల ఏళ్ళవరకూ శాశ్వతంగా ఉండిపోయే శిల్పాలను సృష్టించి శిల్పి అమరుడైనాడు. మనకున్న 64 కళలలో సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం అనే వాటిని ప్రత్యేకంగా పేర్కొని లలిత కళలు అన్నారు. ఈ కళలు వినికిడి ద్వారాగాని, కంటితో చూడటం ద్వారా గాని, రెండు విధాలుగా గాని మానవుల మనసులను దోచుకొని అలౌకికానందాన్ని ప్రసాదిస్తాయి. ఇందులో శిల్పం మూర్తిమంతమైన కళ. శిల్పి చేతిలో పడి ఎటువంటి కఠిన పాషాణమైనా వెన్నముద్దలా కరిగిపోయి కవి మనసులోని ఆలోచనకు రూపంగా నిలుస్తుంది. రాళ్ళలో రాగాలు పలికించగల అద్భుత శక్తి గలవాడు శిల్పి.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. శిల్పిని గురించి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా ప్రదర్శించండి.
ఉదా: నేను తెలుసా ! నేను రాళ్లను చెక్కే……
జవాబు.
నన్ను పోల్చుకున్నారా ? నేను శిల్పిని. అంటే రాళ్ళను చెక్కి బొమ్మలుగా తయారు చేస్తాను. ఎడంచేత్తో ఉలిని కుడి చేత్తో సుత్తినీ పట్టుకిని రాతిలోని అవసరం లేని భాగాలను చెక్కివేస్తూ నేననుకున్న ఆకారాన్ని తయారుచేస్తాను. ఇలా చెయ్యాలంటే ఎంతో శ్రమపడ వలసి వస్తుంది. ఐనాసరే నేను కోరిన బొమ్మ అందంగా తయారైతే నాకెంతో తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. నేను చెక్కిన బొమ్మలు మీరంతా చూసి మెచ్చుకుంటుంటే నాకెంత గర్వంగా ఉంటుందో ! కాని నేను చెక్కిన బొమ్మలు కొనే వాళ్ళెంతమంది? ఒకరిద్దరు కొన్నా చాలా తక్కువ ధరకు అడుగుతారు. మరి నాకు జీవనమెలా గడుస్తుంది? ఏకళాకారుడికైనా ఆ కళను గుర్తించి ఆదరించి బహుమతి ఇస్తే, వెలకట్టితే ఆ కళాకారుడు బ్రతకగలుగుతాడు. మీరంతా ఈ విషయాన్ని గ్రహించి నాలాంటి వారిని ఆదరించండి. కళలకు గుర్తింపునివ్వండి. ఇదే నా ప్రార్థన.
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాలు మీ పాఠంలోవే. వీటిలో గీత గీసిన పదాల అర్థాన్ని తెలుసుకొని వాక్యాలను తిరిగి రాయండి.
అ) భయద సింహముల తలలు
జవాబు.
భయద = భయాన్ని కలిగించే
వాక్యం : భయాన్ని కలిగించే సింహముల తలలు.
ఆ) వసుధ గన్పట్టు పర్వతములందు
జవాబు.
వసుధ = భూమి
వాక్యం : భూమి కనిపిస్తుంది పర్వతములందు.
ఇ) శాశ్వతుడవోయి నిశ్చయముగాను
జవాబు.
శాశ్వతుడు
స్థిరమైనవాడు, నాశనము లేనివాడు
వాక్యం : మనం చేసే మంచిపనులు స్థిరంగా నిలిచి ఉంటాయి.
ఈ) తెనుగుందేశము నిన్నువంటి పనివానిం జూచి యుప్పొంగుచుండును.
జవాబు.
తెనుగు = తెలుగు
వాక్యం : తెలుగు దేశము కళలకు ప్రసిద్ధి
ఉ) నీ సుత్తెలో మొలుచున్మానవ విగ్రహంబు
జవాబు.
మొలుచు = పుట్టు
వాక్యం : బండరాయి నుండి అందమైన శిల్పాన్ని పుట్టించగలవాడు శిల్పి.
2. కింది వాక్యాలలో ఉన్న ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.
అ. సింగం బావిలో తన మొహాన్ని చూసి అది మరో సింహం ముఖమని అనుకొన్నది.
జవాబు.
సింగం (వి) – సింహం (ప్ర)
ఆ. కరెంటు స్తంభాలు ఉరికంబాలు కాగూడదు.
జవాబు.
స్తంభాలు (ప్ర) – కంబాలు (వి)
ఇ. నిద్ర మనకు అవసరమే కాని మనమే నిద్దుర మొహాలం కాగూడదు.
జవాబు. నిద్ర (ప్ర) – నిద్దుర (వి)
ఈ. పేదలకు సహాయం చేయడం పున్నెం. ఆ పుణ్యమే మనను నిలుపుతుంది.
జవాబు.
పున్నెం (వి) – పుణ్యం (ప్ర)
3. సూచనల ఆధారంగా పాఠ్యాంశంలోని పదాలతో గళ్ళు నింపండి.
ఆధారాలు :
అడ్డం
1. శిల్పాలు చరిత్రను
వేయించగలవు
2. కవి చేతిలోనిది
3. దేవళంలో ‘ళం’ తీసేస్తే
4. మూడోపద్యం రెండో పాదంలో మొదటి పదం చివరి అక్షరం లోపించింది.
5. శిల్పంగా మారేది
6. శిల్పి ప్రజ్ఞకు మనం సమర్పించేది.
నిలువు
1. ఈ పదం భూమికి మరో అర్థం
2. కవిత్వం చెప్పడాన్ని ఇట్లా అంటారు.
3. రాతికి మరో పదం తలకిందులైంది.
4. ‘స్వప్నం’ పర్యాయపదం
5. శిలను శిల్పంగా మలిచేవాడు.
6. బొమ్మలు అని అర్ధమున్న పదంలో మొదటి అక్షరం లోపించింది.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పదాలను పరిశీలించండి. సంధి జరిగిన విధానం గమనించండి.
సవర్ణదీర్ఘ సంధి:
అ) శివాలయం శివ + ఆలయం = అ + ఆ = ఆ
ఆ) మునీంద్రుడు = ముని + ఇంద్రుడు = ఇ + ఇ = ఈ
ఇ) భాసూదయం = భాను + ఉదయం = ఉ + ఉ = ఊ
ఈ) మాతౄణం = మాతృ + ఋణం = ఋ + ఋ = ౠ
పై పదాలను విడదీసినపుడు మొదటి (పూర్వ), రెండవ (పర) పదాల్లో ఒకేరకమైన అచ్చులున్నాయికదా ! అట్లా ఆ రెండు అచ్చులు కలిసినప్పుడు వాటివాటి దీర్ఘాలు వచ్చాయి.
అ/ఆ + అ/ఆ = ఆ
ఇ/ఈ + ఇ/ఈ = ఈ
ఉ/ఊ + ఉ/ఊ = ఊ
ఋ/ౠ + ఋ/ౠ = ౠ
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు (సవర్ణాలు) వచ్చి చేరినపుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీనినే సవర్ణదీర్ఘసంధి అంటాం.
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
‘ఏకాదేశం’ అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం.
ఒకే రకమైన అచ్చులను ‘సవర్ణాలు’ అంటాం.
1. కింది పదాలను విడదీయండి.
ఉదా : హిమాలయం = హిమ + ఆలయం = (అ + ఆ = ఆ)
1. కిరీటాకృతి = కిరీట + ఆకృతి = (అ + ఆ = ఆ)
2. మహానందం = మహా + ఆనందం = (అ + ఆ = ఆ)
3. మహీంద్రుడు = మహి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ)
4. గురూపదేశం = గురు + ఉపదేశం = (ఉ + ఉ = ఊ)
5. కోటీశ్వరులు = కోటి + ఈశ్వరులు = (ఇ + ఈ ఈ)
6. మాతౄణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ౠ)
ప్రాజెక్టు పని:
మీ గ్రామం / ప్రాంతంలోని కళలను గురించి, కళాకారులను గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ గొప్పదనాన్ని గురించి నివేదిక రాయండి.
జవాబు.
తెలంగాణా ప్రాంతంలో కళలకూ, కళాకారులకు లోటులేదు. కాపురాజయ్య, మిద్దెరాములు, ఎలకూచి బాలసరస్వతి మొదలగువారిని అందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
1. మిద్దె రాములు:
మిద్దె రాములు కరీంనగర్ జిల్లా. హనుమాజిపేట గ్రామంలో 1939లో జన్మించాడు. మిద్దె యల్లవ్వ, లస్మగౌడలు రాములు తల్లిదండ్రులు. రాములు కళాంరంగం పట్ల ఆసక్తి గలవాడు. అతడు చదువుకు దూరమైనా కళామతల్లి కళ్ళకద్దుకున్నది. పాటలు పాడుతుండేవాడు. బుర్రకథలు, హరికథల పట్ల ఆకర్షింపబడ్డాడు. అదే ఆయనను ఒగ్గు కథల రారాజును చేసింది. ఒగ్గు కథతో పరిచయం ఏర్పడ్డాక దానినే తన ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలుగా మార్చుకున్నాడు.
రాములు కంఠస్వరం, గానమాధుర్యం ప్రేక్షకులకు క్రొత్త ఊపునిచ్చేది. పొలాల్లో, దుక్కుల్లో, తాళ్ళల్లో – గాళ్లల్లో తను ఇమడలేనని కళారంగంలో స్థిరపడాలనే ఆశతో వేములవాడకు చేరుకున్నాడు. రాములు పాటంటే ఆడపిల్లలకు ప్రాణం. చీరా, జాకెట్టు ధరించి బోనమెత్తుకొని బతుకమ్మలాడి వాళ్ళ ఆటలో ఆటగా, పాటలో పాటగా మమేకమైపోయేవాడు. ఆబాలగోపాలం అతడి పాటకోసం, మాటకోసం, ఆటకోసం, ఎగబడడం అతని కళాసక్తికి నిదర్శనం.
2. కాపు రాజయ్య:
రాజయ్య మెదక్ జిల్లా సిద్ధిపేటలోని పారుపల్లి వీథిలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. రాజయ్య తన జీవితం పట్ల ఒక నిర్ధిష్టమైన లక్ష్యం, తదనుగుణమైన ప్రయత్నం, తనదైన శైలి, నిరాడంబర జీవితం, నిరంతర కృషి మొదలగు జీవిత లక్ష్యాలను ఏర్పరచుకుని గొప్ప చిత్రకారునిగా ఎదిగాడు. హైదరాబాద్లో జరిగిన చిత్రలేఖన పోటీల్లో ప్రథమ బహుమతి పొందాడు. అపుడు ఓ పెద్దమనిషి రాజయ్య వద్దకు వచ్చి హిందీలో మాట్లాడుతూ “మొదటి బహుమతి గెలుచుకున్నది నీవేకదూ! నీవు వేసిన చిత్రం చాలా అద్భుతంగా ఉంది. నీలో గొప్ప కళాకారుడున్నాడు. నీవు నాతో వస్తే గొప్ప కళాకారునిగా అంతర్జాతీయ కీర్తిని అందుకుంటావు. నెలకు పదిహేను వందల వరకు ఆదాయాన్ని పొందుతావన్నాడు.
అక్కడ మన సంప్రదాయ విషయాలుండవని తెలుసుకొని నిరాకరించాడు. అక్కడ ఆధునిక ప్రతీకాత్మక చిత్రాలను తెలుసుకొనే లైబ్రరీలు, అందమైన మోడల్ అమ్మాయిలు ఉంటారని ఆశచూపినా, “అవేవీ నాకు ఆనందాన్నివ్వవు. ఆడదంటే మీరూహించినట్లుండదిక్కడ. ఆడది అమ్మతనానికి, ఆదరణకు, ఆత్మీయతకు, ప్రేమకు ప్రతీకగా ఉంటుందిక్కడ. నా పల్లె నాకు కాన్వాసు. నా ప్రజలే నాకు వస్తువు, వాళ్ళ జీవనమే ప్రేరణ, ఈ ప్రకృతే నాకు గురువు” అని తిరస్కరించాడు. ఇది ఆయన ఆత్మీయతకు నిదర్శనం.
3. విశేషాంశాలు
అజంతా గుహలు : మహారాష్ట్రలో ఔరంగాబాదుకు 55 మైళ్ళ దూరంలో ఉన్న గుహలివి. జాతకకథలు కుడ్యచిత్రాలుగా ఉన్న అజంతా గుహలన్నీ భారతీయ చిత్రకళకు నిదర్శనాలు.
TS 7th Class Telugu 7th Lesson Important Questions శిల్పి
ప్రశ్న 1.
శిలకు, శిల్పానికీ ఉండే భేదం ఏమిటి ?
జవాబు.
శిల అంటే రాయి. శిల్పం అంటే రాతి చుట్టూరా అవసరం లేని భాగాలను చెక్కివేసి అందమైన ఆకారంలో తీర్చిదిద్దబడిన బొమ్మ. బొమ్మను చూసి ఆనందిస్తాం. రాతిని చూసి ఆనందించలేము. శిలతో చెక్కిన దేవుని శిల్పానికి పసుపు కుంకాలతో పూజచేస్తాము. కాని శిలకు చేయము. ఇదే శిలకు, శిల్పానికి గల భేదం.
ప్రశ్న 2.
“కవి” ఈ గేయంలో ఒకచోట శిల్పి దారిద్ర్యాన్ని చూసి, తెలుగుదేశం కంట తడి పెడుతుందని అన్నాడు కదా! దీన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
శిల్పి రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి జీవంలేని రాళ్ళను శిల్పాలుగా మలచి జీవకళ ఉట్టిపడేట్టు చేస్తాడు. కానీ తినడానికి తిండి లేక నిర్జీవంగా పేదరికంలో బతుకుతూ ఉంటాడు శిల్పి. అందువల్ల ఆంధ్రదేశం కంట తడిపెడుతుందని కవి చెప్పారు అని నాకనిపిస్తోంది.
ప్రశ్న 3.
శిల్పాలలో ఉన్న గొప్పతనాన్ని గురించి నువ్వేమనుకొంటున్నావు ?
జవాబు.
శిల్పాలలో ఎంతో గొప్పదనముంది. శిల్పాలలోని ప్రసన్నత, సౌందర్యం శిల్పి మనోభావాలకు అద్దంపడుతుంది. శిల్పాలన్నీ మనకెక్కువగా దేవాలయాల గోడలమీద కనిపిస్తాయి. శిల్పకళలోని గొప్పదనాన్ని బట్టే అతి ప్రాచీనమైన మన దేవాలయాలు దేశ విదేశాలలో ప్రసిద్ధికెక్కాయి. అందమైన శిల్పాలను చూచి ఒళ్ళుమరచిపోయి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాము. ఆ శిల్పాలలోని శక్తి యాత్రికులను పదే పదే తన దగ్గరకు రప్పించుకుంటుంది.
ఈ శిల్పాలలో శాతవాహనులు, విష్ణుకుండినులు మొదలైన రాజుల కాలం, శిల్ప శైలి గోచరిస్తూ అప్పటి అనేక విషయాలను మనముందరికి తీసుకొస్తాయి. ఆది మానవుడు నాగరికత నేర్వకముందు నుంచి రాళ్ళతో ఆడాడు. అందులో భాగంగానే చక్రం పుట్టింది. నిప్పు పుట్టింది. మనిషి కొద్దిగా నాగరికత నేర్చాడు. తనచుట్టూ ఉన్నరాళ్ళను కొట్టి ఆయుధాల ఆకారాన్నిచ్చాడు. మెల్లగా కంటికి కనిపించినదానికి రాళ్ళతో రూపాలనిచ్చాడు. లిపి పుట్టకముందు ఇలా చెక్కిన ఆకారాలద్వారానే భావవ్యక్తీకరణ జరిగేది. ఇలా రాళ్ళు చెక్కి ఇచ్చిన రూపాలే శిల్పాలు.
అందుకే ఇది ప్రతివారిలోనూ నెలకొన్న అతి ప్రాచీనమైన కళారూపం అని చెప్పొచ్చు. తరువాత రానురాను నాగరికత సంస్కృతి సంప్రదాయాలు భాష భావం ఇరుగు పొరుగు ప్రాంతాలతో సత్సంబంధాలు కారణంగా శిల్పకళ కొత్త సొగసులు దిద్దుకున్నది. వివిధ ప్రాంతాల శిల్పకళా సాంప్రదాయాల కలగలుపు మనకు మనదేశ శిల్పాలలో కనిపిస్తుంది.
ప్రశ్న 4.
శిల్పకళ, కవిత్వం, చిత్రకళ, నాట్యకళ, వాద్యసంగీతం, గాత్రసంగీతం వంటి కళలు ఉన్నాయి కదా! వీటిలో నువ్వు దేన్ని నేర్చుకుంటావు ? ఎందుకు ?
జవాబు.
నాకు వాద్యసంగీతమంటే చాలా ఇష్టం. వీణా వాదనం అంటే ఇష్టం. సంగీతంలో చక్కని మాధుర్యం ఉంటుంది. వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ వీణ ప్రత్యేకంగా మన పురాణాల్లో దేవతలందరూ వాయించే వాద్యం. రాజుల కథల్లో కూడా వీణ ఉంటుంది. అది చాలా పురాతనం కనుక నాకు వీణావాదనం అంటే ఇష్టం. అందుకే నేను వీణ నేర్చుకుంటాను. మన శాస్త్రాలలో కళలు అరవైనాలుగు అని చెప్పబడ్డాయి. అందంగా చేసే ఏ పని యైనా కళ అని చెప్పబడుతుంది. వీటిలో మనసుకు హత్తుకుపోయి శ్రమను మరపింపజేస్తూ అలౌకికమైన అనిర్వచనీయమైన ఆనందాన్ని ప్రసాదించే అద్భుతమైన కళలు ఐదింటిని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
అవే లలితకళలు. రాతితోగాని చెక్కతోగాని మరికొన్ని పదార్థాలతోగాని మూర్తిని నెలకొల్పడం శిల్పకళ. మనసులోని భావాలకు చక్కని భాషనిచ్చి గద్యం పద్యం నాటకం కవిత మొదలైన ప్రక్రియలలో అమర్చి పాఠకులను ముగ్ధులను చేయడం కవిత్వం. సప్తస్వరాల కూర్పుతో మనోహర నాదంతో వీనుల విందుగా గొంతెత్తి ఆలపించేది గాత్ర సంగీతం. వాయిద్యాల మీద వినిపించేది వాద్యసంగీతం. మదిలోని భావాలకు రేఖల ద్వారా ఆకారాన్నిచ్చి, రంగులద్ది ఆకర్షణీయంగా చిత్రీకరించేది చిత్రకళ. లయబద్ధంగా అడుగులు కదుపుతూ పాటలోని భావాలను ముఖంలో ప్రదర్శిస్తూ పాత్రోచితమైన ఆహార్యంతో అభినయించేది నాట్యకళ.
I. క్రింది గేయాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) సున్నితంబైన నీచేతి సుత్తెనుండి
బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు
సార్థకము గాని యెన్ని పాషాణములకు
గలిగె నీనాడు పసుపు గుంకాల పూజ!
ప్రశ్నలు :
ప్రశ్న1.
శిల్పి చేతిలో ఏమి ఉన్నది?
జవాబు.
చేతిలో సుత్తి ఉన్నది.
ప్రశ్న2.
ఏమి బయటపడ్డాయి?
జవాబు.
దేవాలయములు బయటపడ్డాయి.
ప్రశ్న3.
సార్థకం కానివి ఏవి?
జవాబు.
పాషాణములు సార్ధకము కానివి.
ప్రశ్న4.
పాషాణములకు ఏమి కలిగింది?
జవాబు.
పాషాణములకు పసుపు కుంకాల పూజ కలిగింది.
ప్రశ్న5.
పాషాణం అంటే అర్థమేమి?
జవాబు.
పాషాణములకు పసుపు కుంకాల పూజ కలిగింది.
ఆ) తాలనిద్రించు ప్రతిమల మేలుకొలిపి
యులిని సోకించి బయటికి బిలిచినావు
వెలికి రానేర్చి నీ పేర నిలుపకున్నె
శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను
ప్రశ్నలు :
ప్రశ్న1.
ప్రతిమలు ఎక్కడ నిద్రపోతున్నాయి?
జవాబు.
రాయిలోపల
శిల్పి
ప్రశ్న2.
ప్రతిమలను మేలు కొలిపిందెవరు?
జవాబు.
తన ఉలిని తాకించి బయటికి పిలిచాడు.
ప్రశ్న3.
ఎలా మేలుకొలిపాడు?
జవాబు.
ప్రశ్న4.
బయటికి వచ్చిన ప్రతిమలేంచేస్తాయి?
జవాబు.
శిల్పికి గొప్ప పేరు తెస్తాయి
ప్రశ్న5.
‘శాశ్వతుడు’ అంటే అర్థమేమి?
జవాబు.
ఎల్లకాలం ఉండేవాడు.
II. ఈ క్రింది పద్యాల పాదాలను సరైన క్రమంలో రాయండి.
అ) వసుధ గన్పట్టు సర్వపర్వతములందు
చేత మిగురొత్త నొక నల్లజాతియందు
జిత్రముల నెన్ని గతుల జూచెదవొ నీవు!
మలచినాడవు, భయద సింహముల తలల
జవాబు.
చేత మిగురొత్త నొక నల్లజాతియందు మలచినాడవు, భయద సింహముల తలల వసుధ గన్పట్టు సర్వపర్వతములందు ముల నెన్ని గతుల జూచెదవొ నీవు!
ఆ) వల్లెవేయింప గలవు చూపరులచేత
దారతమ్యంబు లే దబద్ధంబు గాదు.
ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు
జవాబు.
ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత వల్లెవేయింప గలవు చూపరుల చేత గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు దారతమ్యంబులే దబద్ధంబు గాదు.
III. కింది పద్యపాదాలను సరిచేసి భావం రాయండి.
అ) రచన యలంకార గల కలంబున కవి
శిల్పి ముఖముననే యులి కలదోయి కలదు
బెను గాక పోయిన కంబములకు తాతి
గ్రుచ్చినావు వల్లరు గుసుమ లేరీతి?
జవాబు.
కవికలంబున గల యలంకార రచన కలదు కలదోయి శిల్పి, నీ యులి ముఖమున గాకపోయిన బెను జాతికంబములకు గుసుమవల్లరు లేరీతి గ్రుచ్చినావు ?
భావం : కవి కవిత్వంలో కలంలో ఉండే అలంకార రచనాశక్తి శిల్పి ఉలికి కూడా ఉన్నది. లేకపోతే రాతిస్తంభంలో అందమైన పూచినపూల తీగలను ఎలా కూర్చినావు?
ఆ) నల్లచేత అరాతి మిగురొత్త యందు
భయద తలల సింహముల మలచినాడవు
సర్వ వసుధ పర్వతములందు గన్పట్టు
నెన్నిజిత్రముల జూచెదవొ గతుల నీవు!
జవాబు.
చేత మిగురొత్త నొక నల్లజాతియందు మలచినాడవు, భయద సింహముల తలల వసుధ గన్పట్టు సర్వపర్వతములందు జిత్రముల నెన్ని గతుల జూచెదవొ నీవు!
భావం: ఓ శిల్పీ! నీవు మనసు చిగురించేటట్లు నల్లరాతిలో భయంకర సింహాల తలలు చెక్కావు. భూమి మీద కన్పించే పర్వతాలలో అనేక రూపాలను అనేక విధాలుగా చూస్తావు.
IV. కింది పద్యానికి ఐదు ప్రశ్నలు రాయండి:
అ) ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లె వేయింప గలవు చూపరుల చేత
గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు
దారతమ్యంబు లే దబద్ధంబు గాదు.
ప్రశ్నలు :
1.శిల్పి ఎవరి చరిత్రలు వల్లె వేయిస్తాడు?
2. ఎవరి చేత వల్లె వేయిస్తాడు?
3. కవి ఏం చేస్తాడు?
4. ‘తారతమ్యం’ అంటే అర్థమేమిటి?
5. శిల్పి ఏం చేస్తాడు?
V. సరైన విభక్తి ప్రత్యయాలతో ఖాళీలను పూర్తిచేయండి.
అ) ఆయన గొప్ప పండితు ……… (1). ఆయన …… (2) రాని విద్యలేదు. బహుభాషల ….. (3) కోవిదుడు, ఎన్నో సంస్థ ….. (4) ఆయన …….. (5) సన్మానించాయి.
జవాబు.
ఆయన గొప్ప పండితుడు. (1) ఆయనకు (2) రాని విద్యలేదు. బహుభాషాలలో(3) కోవిదుడు. ఎన్నో సంస్థలు (4) ఆయనను (5) సన్మానించాయి.
ఆ) అరసవిల్లి …… (1), ను, కోణార్క్ … (2) ను సూర్యుని …… (3) దేవాలయా……. ఉన్నాయి. బ్రహ్మ……… (5), దేవాలయా ……. (6) చాలా అరుదు.
జవాబు.
అరసవిల్లిలో(1)ను, కోణార్క్ లో (2) ను సూర్యునికి (3) దేవాలయాలు (4) ఉన్నాయి. బ్రహ్మకు (5) దేవాలయాలు (6) చాలా అరుదు.
VI. కింది పదాలలోని ఔపవిభక్తిక ప్రత్యయాలను గుర్తించండి.
1. రాతిలోన
జవాబు.
రాయి + లోన =తి
2. చేతిలోన
జవాబు.
చేయి + లోన = తీ
3. రాతికంబం
జవాబు.
రాయి + యొక్క = రాతి
4. కంట
జవాబు.
కన్ను + నన్ = ట
5. బయటికి
జవాబు.
బయలు + కి = టి
VII. క్రింది వాక్యాలలోని ద్వంద్వ, ద్విగు సమాస పదాలను గుర్తించి వ్రాయండి.
అ) కలిమి లేములు కావడి కుండలు వంటివి.
జవాబు.
కలిమి లేములు = ద్వంద్వ సమాసం
ఆ) నాలుగు పుస్తకాలు చదివి కాస్త జ్ఞానం పెంచుకో.
జవాబు.
నాలుగు పుస్తకాలు = ద్విగు సమాసం
VIII. క్రింది వాక్యాలకు వ్యతిరేక వాక్యాలు రాయండి.
అ) రాజు బాగా చదవగలగడు.
జవాబు.
రాజు బాగా చదవలేడు.
ఆ) ఇది మంచి కథ
జవాబు.
ఇది చెడు కథ
IX. క్రింది వాక్యాలలో సవర్ణదీర్ఘ, గుణసంధులను గుర్తించి రాయండి.
అ) విద్యాలయం దేవాలయం వంటిది. ………………………..
జవాబు.
విద్యా + ఆలయం = విద్యాలయం
దేవ + ఆలయం = దేవాలయం
ఈ రెండూ సవర్ణదీర్ఘ సంధులు
ఆ) దేశోన్నతికోసం ప్రతివారూ పాటుపడాలి. ………………………..
జవాబు.
దేశ + ఉన్నతి = దేశోన్నతి – గుణసంధి
పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు
1. తే.గీ॥ చేత మిగురొత్త నొక నల్లజాతియందు
మలచినాడవు, భయద సింహముల తలలు
వసుధ గన్పట్టు సర్వపర్వతములందు
జిత్రముల నెన్ని గతుల జూచెదవొ నీవు !
ప్రతిపదార్థం:
చేతము = మనస్సు
ఇగురొత్తన్ (ఇగురు + ఒత్తన్) = చిగురించేటట్లు
ఒక నల్ల జాతియందున్ = ఒక నల్లని అయిపై
భయద = భయంకరమైన
సింహముల = సింహముల యొక్క
తలలన్ = శిరస్సులను
మలచి నాడవు = తొలిచినావు
నీవు = నీవు
వసుధన్ = భూమి మీద
కన్నట్టు = కనబడుతున్న
సర్వపర్వతములందున్ = అన్ని పర్వతాలలోనూ
ఎన్ని గతులన్ = ఎన్ని విధాలుగా
చిత్రములన్ = శిల్పాలను
చూచెదవో = (చూచెదవు + ఒ) = చూస్తూ ఉంటావో !
తాత్పర్యం :
ఓ శిల్పీ! మనసు చిగురించేట్లు ఒక నల్లరాతిలో భయంకరమైన సింహాల తలలు చెక్కినావు. భూమి మీద కనిపించే కొండల్లోని రూపాలను ఎన్ని విధాలుగా దర్శిస్తావో కదా?
2. తే.గీ॥ సున్నితంబైన నీచేతి సుత్తెనుండి
బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు
సార్థకము గాని యెన్ని పాషాణములకు
గలిగె నీనాడు పసుపు గుంకాల పూజ !
ప్రతిపదార్థం:
సున్నితంబు+ఐన = సుకుమారమైన
నీచేతి = నీ చేతిలోనున్న
సుత్తె నుండి = సుత్తెద్వారా
ఎన్ని + ఎన్ని = అసంఖ్యాకమైన
దేవస్థలములు = దేవాలయాలు
బయలుపడెను = కనబడినవి
సార్థకము+కాని = ఉపయోగంలేని
ఎన్ని+ఎన్ని = ఎన్నో (చాలా)
పాషాణములకు = రాళ్ళకు
ఈనాడు = ఇప్పుడు
పసుపు కుంకాలపూజ = పసుపు కుంకుములతో అర్చన
కలిగెన్ = లభించింది
తాత్పర్యం :
మెత్తనైన నీ సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో! ఒకనాడు వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండలకు నీవల్లనే పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం లభించింది. (అంటే ఆ బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడని తాత్పర్యం.)
3. తే.గీ ॥ కవికలంబున గల యలంకార రచన
కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున;
గాకపోయిన బెను జాతికంబములకు
గుసుమవల్లరు లేరీతి గ్రుచ్చినావు ?
ప్రతిపదార్థం:
ఓయి శిల్పీ = ఓ శిల్పీ
కవి కలంబున కల = కవి కలములో ఉన్న
అలంకార రచన = అందమైన రచనా శైలి
నీ ఉలిముఖమున = నీ ఉలి మొనతో
కలదు కలదు = బాగా ఉన్నది (ఉంది)
కాకపోయిన = అలా కాకుంటే
పెను = పెద్ద
కంబములకు = రాతి స్తంభాలకు
కుసుమ వల్లరులు = పూలతీగలు
ఏరీతి = ఏ విధంగా
గ్రుచ్చినావు = కూర్చినావు
తాత్పర్యం :
కవి కలానికి ఉండే అలంకార రచనాశక్తి, నీ ఉలికి కూడా ఉన్నది. లేకపోతే కఠినమైన రాతిస్తంభంలో (పూలు, లేత కొమ్మలను) పూలగుత్తులను ఎట్లా చెక్కగలిగావు?
4. మ॥ మమపుల్ దీర్చి మదంబు చిందిపడ నేనన్ గున్నలన్ జెక్కి వై
చిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చెన్నత్కిరీటాకృతిన్;
తెమగుందేశము నిమృవంటి పనివానిం జూచి యుప్పొంగుచుం
డును; నీ లేమి దలంచి కంట దడిబెట్టువ్: శిల్పవిద్యానిధీ !
ప్రతిపదార్థం:
శిల్ప విద్యానిధీ! = = శిల్పకళకు ఆధారమైనవాడా!
నునుపుల్ తీర్చి = నున్నగా చెక్కి
మదంబు చిందిపడ = మదజలం కారుతున్నదేమో అన్నట్లుగా
ఏన్గున్ = ఏనుగును
గున్నలన్ = ఏనుగు పిల్లలను
చెక్కించిన = చెక్కిన
చాతుర్యమున్ = నీ నేర్పు
నీ శిర + అగ్రమున = నీ తల పైన
సత్ కిరీట + ఆకృతిన్ = కిరీటమను ఆకారముతో
నిల్చెన్ = నిలిచిపోయింది.
తెనుగుందేశము = తెలుగు రాష్ట్రం
నిన్ను వంటి = నీలాంటి
పనివానిన్ + చూచి = నేర్పరిని చూచి
ఉప్పొంగుచుండును = మిక్కిలి సంతోషించు చుండన్
నీ లేమి = నీ పేదరికమును
తలంచి = ఆలోచించి
కంట +తడి + పెట్టున్ = కన్నీరు కారుస్తుంది.
తాత్పర్యం :
శిల్ప విద్యను ఎరిగినవాడా! మదజలం కారుతున్న ఏనుగును, ఆ ఏనుగు పిల్లలను నున్నగా చెక్కిన నేర్పు నీ తలమీద కిరీటమై వెలుగుతున్నది. నీవంటి పనివాళ్ళను చూసి తెలుగునేల ఉప్పొంగుతున్నది. నీ దారిద్ర్యాన్ని చూసి కన్నీరు కారుస్తున్నది.
5. మ॥ తెలిజాతివ్ జెలువార వచ్చరపడంతిం దిద్ది యా సోగ క
మ్నల పజ్జవ్ నిమ నీవు దిద్దుకొని, సంతోషించుచున్నాడవా
భళిరే ! శిల్పిజగంబులోవ జిరజీవత్వంబు సృష్టించుకో
గల నీకెవ్వడు పాటివచ్చును ? నమస్కారంబు నీ ప్రజ్ఞకున్
ప్రతిపదార్థం:
తెలఱాతిన్ = తెల్లని రాళ్ళలో (పాలరాతిలో)
చెలువారన్ = అందముగా
అచ్చరపడతిన్ = అప్సరస వంటి స్త్రీని
దిద్ది = మలచి
ఆ సోగకన్నులపజ్జన్ = అందమైన ఆ కళ్ళపక్కనే
నిను నీవు దిద్దుకొని = నీ రూపాన్ని మలచుకొని
సంతోషించుచున్ + ఉన్నాడవా ? = ఆనందపడిపోతున్నావా
భళిరే ! = బాగు బాగు
శిల్పి జగంబులోన = శిల్ప జగత్తులో
చిర జీవిత్వంబు = శాశ్వతత్వమును
సృష్టించుకోగల = కల్పించుకోగలిగిన
నీకున్+ఎవ్వడు సాటి వచ్చును = నీకెవడు సమానమగును
నీ ప్రజ్ఞకున్ = నీ నేర్పుకు
నమస్కారంబు = వందనము
తాత్పర్యం:
తెల్లరాతిలో అప్సరసను సృష్టించి, ఆమె విశాల నేత్రాలకు పక్కగా నిన్ను నువ్వు మలచుకొని సంతోషపడుతున్నావా? భళా! శిల్పి ప్రపంచంలో శాశ్వ తత్వాన్ని కల్పించుకోగలిగిన నీకెవరు సాటి వస్తారు? నీ ప్రతిభకు నమస్కారాలు.
6. తే.గీ॥ ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లెవేయింప గలవు చూపరులచేత ;
గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు
దారతమ్యంబు లే దబద్దంబు గాదు.
ప్రతిపదార్థం:
ప్రతిమలు = విగ్రహాలు
రచించి = నిర్మించి
చూపరులచేత = చూచేవారి చేత
ఒకమహారాజుచరిత = ఒక రాజుగారి చరిత్ర
వల్లెవేయింపగలవు = చదివేలా చేయగలవు.
కవనమున = కవిత్వంలో
చిత్రములు+ కూర్చు = చిత్ర విచిత్రములను కలిగించు
కవికి = కవికి
నీకున్ = శిల్పికి
తారతమ్యంబు = భేదము
లేదు = లేదు
అబద్ధంబు+ కాదు = ఇది అసత్యము కాదు
తాత్పర్యం:
చూసేవాళ్ళచేత నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో బొమ్మలను చూపే కవికి, నీకు ఏ మాత్రం భేదం లేదు. ఇది అబద్ధం కాదు.
7. తే.గీ॥ ఱల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
యులిని పోకించి బయటికి బిలిచినావు ;
వెలికి రానేర్చి, నీ పేర నిలపకున్నె
శాశ్వతుడ వోయి నీవు నిశ్చయముగాను.
ప్రతిపదార్థం:
ఱాల = రాళ్ళలో
నిద్రించ = నిద్రావస్థలో ఉన్న
ప్రతిమల = విగ్రహాలను
మేలుకొలిపి = జాగృతం చేసి
ఉలి సోకించి = ఉలితో తాకించి
బయటికి పిలిచినావు = బహిర్గతం చేశావు
వెలికి = బయటికి
నేర్చి = వచ్చి
నీపేర = నీ పేరును
నిలపకున్నె= నిలబెట్ట
ఓయి = ఓ శిల్పీ !
నీవు = నీవు
నిశ్చయముగాను = తప్పకుండా
శాశ్వతుడు = ఎప్పుడూ ఉండేవాడివి
తాత్పర్యం :
రాళ్ళలో నిదురపోతున్న బొమ్మలకు నీ ఉలిని తాకించి, మేల్కొలిపి బయటకు పిలిచావు. అవి బయటికి వచ్చి నీ పేరు నిలుపవా? నీవు నిశ్చయంగా చిరంజీవివి.
8. మ॥ తలయెత్తెన్ గద, నీదు చాతురి యజంతాగహ్వరశ్రేణి గే
వల పాషాణములందు; జీవకళ నిల్పంజాలు నీ సుత్తెలో
మొలుచు వ్మానవ విగ్రహంబులు, మహాపుణ్యుండవయ్యా ! హరి
త్తులు, నీ బొమ్మలచెంత ముగ్ధగతినందున్ ; శిల్పికంఠీరవా !
ప్రతిపదార్థం:
నీదుచాతురి (నీ+చాతురి) =నీ నేర్పుతో
అజంతాగహ్వరశ్రేణి = అజంతా గుహల సముదాయం
పాషాణములందు = బండరాళ్ళలో
తల + ఎత్తైన్ + కద = వదిలినది కదా !
జీవకళ నిల్పన్+చాలు = జీవకళ నిలువబడునట్లు చేయగల
నీ సుత్తెలో = నీ సుత్తి నుండి
మానవ విగ్రహంబులు = మనుషుల శరీరములు
మొలుచున్ = పుడతాయి
మహాపుణ్యుండవయ్యా = గొప్ప పుణ్యాత్ముడివి
హరిత్తులు = సింహాలు
నీ బొమ్మలచెంత = నీ బొమ్మల దగ్గర
ముగ్ధగతిన్ = చక్కని విధమును
అందున్ = పొందుతాయి
శిల్పి కంఠీరవా = శిల్పులలో సింహము వంటివాడా! (శ్రేష్ఠమైన వాడా)
తాత్పర్యం :
అజంతా గుహలలో నీ నైపుణ్యం తలెత్తుకుంది కదా! నీ సుత్తె వట్టి బండరాళ్ళలో కూడా జీవకళను నిలుపగలదు. నీ సుత్తెలో నుంచి మానవ విగ్రహాలు పుడుతాయి. ఓ శిల్పి శ్రేష్ఠుడా! నువ్వు పుణ్యమూర్తివి. సింహాలు నీ బొమ్మల దగ్గర చక్కదనాన్ని పొందుతాయి.
పాఠం ఉద్దేశం
అరవైనాలుగు కళలలో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. నిర్జీవమైన బండరాళ్ళకు జీవం పోసేవాడు శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియజేయడమే పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. ఆధునిక వస్తువుతో, సులభశైలిలో, దీర్ఘసమాసాలు లేకుండా సరళంగా రచించబడుతుంది. వస్తువైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉంటుంది. గుఱ్ఱం జాషువా రచించిన ‘ఖండకావ్యం’ మొదటిభాగంలోనిది ఈ పాఠం.
కవి పరిచయం
ప్రశ్న. ‘శిల్పి’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.
జవాబు.
“మాతలకు మాత సకల సంపత్సమేత” అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరుజిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అణువణువున తెలుగుదనం గుబాళింపజేసిన జాషువా – గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్మహల్, నేతాజి, బాపూజీ, క్రీస్తుకథ, నా కథ, స్వప్నకథ, కొత్తలోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశారు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకు కట్టినట్లుంటాయి. కవికోకిల, కవితావిశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగకవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు.
ప్రవేశిక
ప్రపంచ ప్రఖ్యాతిపొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే. భారతదేశం శిల్పకళకు పెట్టింది పేరు. మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుతరూపాన్నిస్తాడు శిల్పి. వేయిస్తంభాలగుడి, రామప్పదేవాలయం, గుప్తులకాలంనాటి ఏకశిలారథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతను, అతడి అజరామర కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం.
నేనివి చేయగలనా?