రాణి శంకరమ్మ TS 7th Class Telugu 12th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.
ప్రశ్నలు
ప్రశ్న 1.
బొమ్మలో కనిపిస్తున్నదెవరు?
జవాబు.
బొమ్మలో ఒక వీర వనిత, సైనికులు యుద్ధం చేస్తూ కనబడుతున్నారు.
ప్రశ్న 2.
ఆమె ఏం చేస్తున్నది? ఎవరితో పోరాడుతున్నది? ఎందుకు పోరాడి ఉండవచ్చు?
జవాబు.
ఆమె తన కోటపై దాడికి వచ్చిన శత్రువులతో యుద్ధం చేస్తూ ఉండవచ్చు. తన కోటను ఆక్రమించాలనుకొన్న వారికి తన వీరత్వం, పోరాటం రుచి చూపి ఉండవచ్చు.
ప్రశ్న 3.
యుద్ధంలో శౌర్యాన్ని చూపిన స్త్రీలను ఏమంటారు?
జవాబు.
యుద్ధంలో శౌర్యాన్ని చూపే స్త్రీలను వీరవనిత, వీరనారీమణులు అంటారు.
ప్రశ్న 4.
మీకు తెలిసిన వీరనారీమణుల పేర్లు చెప్పండి.
జవాబు.
రాణి రుద్రమదేవి, రాణిశంకరమ్మ, ఝాన్సీలక్ష్మీబాయి, నేటికాలంలో చాకలి ఐలమ్మ మొదలైనవారు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.120)
ప్రశ్న 1.
“త్యాగాలకు, వీరత్వానికి మారుపేరు తెలంగాణ” దీన్ని మీరెట్లా సమర్థిస్తారు?
జవాబు.
తెలంగాణా వీరత్వానికి, త్యాగాలకు మారుపేరు. నిజాం ప్రభుత్వానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పోరాటగడ్డ మన తెలంగాణ. దేశస్వాతంత్య్ర ఉద్యమంలో రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు మొ॥వారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రసాధనలో ప్రాణత్యాగం చేసినవారు ఎంతో మంది. అందుకే తెలంగాణా త్యాగానికి, వీరత్వానికి పేరు.
ప్రశ్న 2.
ఏఏ గుణాలు కల్గి ఉంటే “సుగుణాల పట్టి” అంటారు?
జవాబు.
మంచి గుణాలు కలిగి ఉండడాన్ని సుగుణాలరాశి అంటాం. చిన్న పిల్లలను గారాబంగా పట్టి అంటారు. సుగుణాల పట్టి అంటే అనేక మంచి గుణాలతో నిండి ఉండడం. వినయం, విధేయత, సంస్కారం, చదువు, అణుకువ, నిజాయితీ, అందం మొదలైన గుణాలతో ఉన్న పిల్లలను సుగుణాల పట్టి అంటారు.
ప్రశ్న 3.
శంకరమ్మ పులితో కలబడి చంపింది కదా! మీరు కూడా ధైర్యం చూపిన సంఘటనలు చెప్పండి.
జవాబు.
నా స్నేహితుడు, నేను ఆడుకుంటున్నాము. ఇంతలో నా స్నేహితునికి కరెంటు వైరు తగిలి, షాకుకు గురయ్యాడు. వెంటనే నాకు ఒక ఆలోచన కలిగింది. చెక్కతో అతనిని కరెంటు వైరునుండి వేరుచేశాను. అతన్ని ప్రమాదం నుండి రక్షించాను. నాకు తృప్తి, ఆనందం కలిగాయి.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.122)
ప్రశ్న 1.
శంకరమ్మ యుద్ధరంగంలో ధైర్యం చూపింది. మరి స్త్రీలు ఏయే సందర్భాలలో ధైర్యం చూపాలో చర్చించండి.
జవాబు.
ఈ రోజుల్లో స్త్రీలు అన్ని రంగాల్లో ప్రవేశించారు. తన రక్షణకై తాను అన్ని సందర్భాలలో ధైర్యంగా ఉండాలి. బ్యాంకు కార్యాలయం, మార్కెట్ వంటి ప్రదేశాలలో దుర్మార్గుల బారి నుండి ఆపద వచ్చినపుడు ధైర్యంతో ఎదుర్కోవాలి. గృహహింస ఎదురైనప్పుడు, ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు, ఎవరైనా దౌర్జన్యానికి దిగినప్పుడు, తమ స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు స్త్రీలు ధైర్యం చూపాలి.
ప్రశ్న 2.
శంకరమ్మ చేసిన మంచి పనికి ఉంగరం ఇస్తే తీసుకోలేదు కదా! దీనిని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు.
నారసింహారెడ్డి శంకరమ్మ చేసిన మంచిపనికి ఆమెకు ఉంగరం ఇస్తే తీసుకోలేదు. నేను కూడా దీనినిబట్టి మనం ఇతరుల నుండి ప్రతిఫలం ఆశించకుండా ఉపకారం చేయాలని గ్రహించాను. మనము మంచి చేస్తే మనకూ మంచి జరుగుతుందని తలుస్తాను.
ప్రశ్న 3.
కండ్లలో సముద్రం నింపుకోవడం’ అన్న జాతీయాన్ని ఏయే సందర్భాల్లో వాడుతారు?
జవాబు.
విపరీతమైన బాధ లేక దుఃఖం కలిగినపుడు కండ్లలో సముద్రం నింపుకోవడం అన్న జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఎక్కువ దుఃఖం కలిగినపుడు ఏడుపు వస్తుంది. కన్నీరు ధారగా కారుతునే ఉంటుందని అని చెప్పే సందర్భంలో పై జాతీయాన్ని వాడతారు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.123)
ప్రశ్న 1.
“చీకట్లో చిరుదీపం” అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
చీకటిలో చిరుదీపం అంటే చిమ్మచీకటిలో కాంతిరేఖవలే ఏదో ఒక ఆధారం దొరకడం అని అర్థం. బాగా కష్టాల్లో లేక ఆపదలలో చిక్కినపుడు ఎవరో ఒకరు ఆసరాగా దొరికితే ఎంతో ఊరట చెందుతాము అనేది ఆంతర్యం.
ప్రశ్న 2.
ఈ ప్రజలను కన్న బిడ్డలుగా పాలించడం అంటే మీకేమర్దమైంది?
జవాబు.
ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చాలా గారాబంగా, ప్రేమగా పెంచుకుంటారు. వారికి ఎలాంటి కష్టం, బాధ, విచారం కలుగనివ్వరు. అలాగే రాజు ప్రజలను తన కన్నబిడ్డలుగా చూసుకున్నాడని, ప్రజలు సుఖంగా జీవించారని అర్థమైంది.
ప్రశ్న 3.
రాణి శంకరమ్మ కథ ద్వారా మీకేమర్దమైంది?
జవాబు.
రాణి శంకరమ్మ ధైర్యం గల ఆడది. పరోపకారం కలది. ప్రజలను కన్నబిడ్డలవలే పాలించింది. భర్తకు రాజధర్మం నేర్పింది. కత్తిపట్టి యుద్ధరంగంలోకి దిగి శత్రువులను చీల్చి చెండాడింది. రాణి శంకరమ్మ వలే జీవితంలో కష్టాలెదురైతే పోరాడాలి, గెలవాలి కాని పారిపోరాదని అర్థమైంది.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. రాణి శంకరమ్మ కథలో మీకు నచ్చిన / ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏది? దాని గురించి మాట్లాడండి.
జవాబు.
రాణి శంకరమ్మ కథలో శంకరమ్మ గౌడిచర్ల ప్రాంతంలో చిరుతపులితో తలపడింది. గాండ్రిస్తూ పులి పంజా విసిరినా భయపడలేదు. కట్టెతో పులిని కొడ్తూ ధైర్యంగా ఎదుర్కొంది. కాళ్ళతో తొక్కింది. దానిని చంపివేసింది. ఇదీ ఆశ్చర్యం కలిగించిన సంఘటన. వీరవనిత పరాక్రమం. వేసవిలో గుర్రంమీద తిరుగుతూ ఉన్నప్పుడు ఎదురుపడ్డ నారసింహారెడ్డికి అంబలినీరు, సంకటి ఇచ్చి ఆకలి తీర్చింది.
అతడిచ్చిన ఉంగరాన్ని కూడా తీసుకోలేదు. ఇది నాకు నచ్చింది. ఇది ఆమె నిజాయితీకి నిదర్శనం. రాణి అయినా ప్రజలను కన్నబిడ్డల్లా సాకింది. శత్రువులు తనపై మత్తుమందు చల్లినా అడవిలో కోయవాడి ద్వారా నైజాం రాజు వద్దకు వెళ్ళి కుట్ర ఛేదించి మరలా అందోలుకు రాణి అయింది. రాణిశంకరమ్మ తన వీరత్వంతో, ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదురొడ్డి పోరాటం చేయడం నాకు నచ్చిన అంశం.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. పాఠం చదవండి. రాణి శంకరమ్మ పరాక్రమాన్ని తెలిపే పదాలను గుర్తించండి.
ఉదా : బండరాళ్ళను పిండిగా జేయడం.
జవాబు.
కర్రతిప్పడం, నాగల్ని పట్టడం, బండి తోలడం, కుత్తుకలు తెగగోయడం, రక్తం పారించడం.
2. కింది గద్యాన్ని చదవండి. కింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును ఎన్నుకొని కుండలీకరణంలో రాయండి.
స్త్రీని మాతృదేవతగా భావించి, పూజించి, ఆరాధించేవారు భారతీయులు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అన్నది ఆర్యోక్తి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒక తరం నుండి మరోతరానికి వారసత్వంగా అందిస్తూ ఉంటారు మహిళలు. సభ్యత, సంస్కారాల రూపంలో జాతి జీవన శక్తిని మరింత వేళ్ళూనుకునేటట్లు చేసింది భారతీయ మహిళే. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, అటు సమాజ ఉన్నతికై పరిశ్రమిస్తూ తమవంతు పాత్రను పరిపూర్ణం చేసుకుంటూ, అవసరమైనప్పుడు సంస్కృతి రక్షణకై పూనుకుంటారు. అవసరమైతే మహిళలు మాతృభూమి రక్షణకోసం ప్రాణత్యాగాలు చేస్తుంటారు.
1) స్త్రీలను – భారతీయులు ఎట్లా పూజిస్తారు?
క) మాతృదేవతగా
గ) పితృదేవతగా
చ) అతిథి దేవతగా
జవాబు.
క) మాతృదేవతగా
2) మహిళలు ఒక తరం నుండి మరో తరానికి దేనిని అందిస్తూ ఉంటారు?
క) భారతీయ ఆర్థిక వ్యవస్థను
గ) భారతీయ సంస్కృతిని
చ) భారతీయ వ్యవహారాలను
జవాబు.
గ) భారతీయ సంస్కృతిని
3) జాతి జీవనశక్తి దేనివలన వేళ్ళూనుకొని ఉంటుంది?
క) సభ్యత, సంస్కారాలు
గ) కుళ్ళు కుతంత్రాలు
చ) ఎత్తుకు పై ఎత్తులు
జవాబు.
క) సభ్యత, సంస్కారాలు
4) వేటి ఉన్నతికై స్త్రీలు పరిశ్రమిస్తారు?
క) సిరిసంపదలు
గ) కుటుంబం-సమాజం
చ) తమకోసం తాము
జవాబు.
గ) కుటుంబం-సమాజం
5) దేని కోసం ప్రాణత్యాగం చేయవచ్చు?
క) సంపదలకై
గ) ఆచారాలకై
చ) మాతృభూమి రక్షణకై
జవాబు.
చ) మాతృభూమి రక్షణకై
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) శంకరమ్మ ధైర్యంగా పులితో పోరాడిన సంఘటనను వర్ణించండి.
జవాబు.
శంకరమ్మ ఒకసారి గౌడిచర్ల ప్రాంతంలో ఒక చిరుతపులితో కలబడింది. చిరుత పెద్దగా అరుస్తూ తన పంజా విసురుతున్నా భయపడలేదు. కట్టెతో పులిని కొడుతూ ధైర్యంగా ఎదుర్కొన్నది. కాళ్ళతో తొక్కింది. దానిని చంపివేసింది. తాను అలసిపోయినా పోరాటం వీడలేదు. అదే వీరవనిత సాహసం. తెలంగాణా పౌరుషం.
ఆ) మీరు తప్పిపోతే ధైర్యంగా ఏ విధంగా ఇంటికి చేరుకుంటారో రాయండి.
జవాబు.
నేను దారిలో తప్పిపోతే, నా తల్లిదండ్రుల పేర్లు, ఊరిపేరు, జిల్లా పేరు గుర్తుకు తెచ్చుకుంటాను. నా కుటుంబసభ్యుల చరవాణి (సెల్) నెంబర్లు నాకు ఎప్పుడూ గుర్తులో ఉంటాయి. ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి నా విషయాన్ని వారికి తెలిపి సహాయాన్ని కోరుతాను. పోలీసు స్టేషన్లోని ప్రాంతంలో అయితే ఆ గ్రామంలో ఊరిపెద్ద ఎవరో అడిగి తెలుసుకొని వారి వద్దకు వెళతాను. వారి సాయం తీసుకొని నా యింటికి సమాచారం ఇస్తాను. ఆయా వ్యక్తుల ద్వారా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను.
ఇ) రాణి శంకరమ్మ మంచి పాలనాదక్షురాలు అనడానికి ఉదాహరణలు రాయండి.
జవాబు.
రాణి శంకరమ్మ రాజ్యపాలన బాగా చేసింది. ప్రజలను కన్నబిడ్డలవలే చూచుకొన్నది. శత్రువుల పట్ల కఠినంగా ఉండేది. తనకు సాయం చేసిన వారిని మరచిపోయేదికాదు. నారసింహారెడ్డితో పెండ్లి అయిన తర్వాత సిద్ధిఖీ సోదరులు కుట్రలు, కుతంత్రాలు పన్నారు. ప్రజలను పీడించి పన్నులు లాగారు. భర్తకు ఉలుకూ పలుకూ లేకపోతే, తనను పట్టించుకోని రాజ్యం మరచిపోవడం సరికాదని చెప్పింది. ప్రజల హితం చూడమని రాజ్యం పనులు సరిగా చేయాలని తనభర్తకు రాజధర్మం చెప్పిన ధైర్యవంతురాలు. తాను రాణి అయిన తర్వాత ప్రజలకు పన్నుల భారం తగ్గించింది. దీనిని బట్టి రాణిశంకరమ్మ మంచి పాలనాదక్షురాలు అని చెప్పవచ్చును.
ఈ) రాణి శంకరమ్మ గొప్పతనం గురించి నేటికీ పాటల రూపంలో పాడుకోవటానికి కారణాలు ఏమిటో రాయండి.
జవాబు.
రాణి శంకరమ్మ గురించి నేటికీ పాటలరూపంలో పాడుకోవడానికి కారణాలు :
అ) రాణి శంకరమ్మ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంది.
ఆ) శంకరమ్మ ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా ఇతరులకు సాయం చేసింది.
ఇ) శంకరమ్మ వీరవనిత. పిరికితనం తెలియదు.
ఈ) తల్లిదండ్రులంటే గౌరవం.
ఉ) శంకరమ్మ నలుగురికీ ఉపయోగపడేలా గుళ్ళు, పట్టణాలు కట్టించింది.
ఊ) శంకరమ్మ తాను జన్మించిన గడ్డ కీర్తిని అజరామరం చేసింది.
ఇలా ఎవరైతే ప్రజలకోసం జీవిస్తారో వారిని ప్రజలు ప్రేమిస్తారు. వారు మరణించినా పాటల రూపంలో, కథల రూపంలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
రాణి శంకరమ్మ పరాక్రమాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
1. జననం : మెదక్ జిల్లాలోని గౌడిచర్లలో సంగారెడ్డి, రాజమ్మ దంపతుల బిడ్డ శంకరమ్మ. చిన్నప్పటి నుండి ఈమె ఎంతో ధైర్యవంతురాలు.
2. పులిని ఎదిరించిన శంకరమ్మ : గౌడిచర్ల ప్రాంతంలో చిరుతపులి పంజా విసరినా కట్టెతో పోరాడి ఎదిరించి కాళ్ళతో తొక్కి చంపింది.
3. మరాఠీలను మట్టి కరిపించిన శంకరమ్మ : నైజాం రాజు కోరిక మేరకు మరాఠీలపై యుద్ధానికి వెళ్ళింది. కాళికారూపం ఎత్తి, ఎక్కడచూసినా తానే అయి, ఎత్తుకు పై ఎత్తుతో శత్రువుల పీకలు తెగగోసింది. వేలకు వేలు సైనికుల రక్తాన్ని పారించింది. పీష్వాల తోకలు కత్తిరించింది. విజయగర్వంతో నైజాం వద్దకు వెళ్ళింది. నైజాం నవాబు శంకరమ్మకు ‘రాయబాగిన్’ అనే బిరుదు ఇచ్చాడు. అందోలు రాజ్యానికి రాణిగా ప్రకటించాడు.
IV. సృజనాత్మకత / ప్రశంస
రాణి శంకరమ్మ చరిత్రను ఏకపాత్రాభినయం చేయడానికి వీలుగా తగిన అంశాలతో రచన చేయండి. ప్రదర్శించండి.
రగిలించే పౌరుషాగ్ని తెలంగాణా
వీరులకు పుట్టినిల్లు తెలంగాణా
ఇలాంటి తెలంగాణ గడ్డలోని ఒక చిన్న పల్లె గౌడిచర్లలో పుట్టిన నేను నేడు అందోలు రాజ్యానికి రాణినయ్యాను. తెలంగాణ ఆడబిడ్డల పౌరుషానికి నన్ను చెప్పుకుంటారంటారు. నిజమే. చిరుతపులి గాండ్రిస్తూ పంజా విసిరినా నేను భయపడలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నా. చిరుతపులిని కట్టెతోకొట్టి, కాళ్ళతో తొక్కి చంపినా. అదీ తెలంగాణా పౌరుషం. నా మంచి గుణాలు, నా అందము చూసి అందోలు రాజు నరసింహారెడ్డి నన్ను పెళ్ళి చేసుకున్నాడు. నేను తప్ప లోకమే లేదన్నట్లు ప్రజల మంచిచెడ్డలు పట్టించుకోవడం మానేశాడు.
నాకోసం కాదు, ప్రజలకోసం జీవించాలని రాజధర్మాలు చెప్పా. రాజ్యపాలన చేయించా. దురదృష్టం. విషప్రయోగంచేసి నా భర్తను చంపారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను మరాఠా రాజుల మీదకు యుద్ధానికి వెళ్లమన్నాడు నైజాం రాజు. నేను భయపడతానా! అది నా రక్తంలోనే లేదు. కాళికలా మరాఠా పీష్వాల తోకలు కత్తిరించా.
రక్తం పారించా. విజయగర్వంతో నైజాం నవాబు దగ్గరకు వెళ్ళా. రాయబగిన్ బిరుదునిచ్చి మెచ్చుకున్నాడు. అందోలు రాజ్యానికి రాణిని చేశాడు. నేనేకాదు, ప్రతితెలంగాణా బిడ్డా పులిలాంటిదే. అన్యాయాన్ని ఎదిరించేదే. నాలా మీరు కూడా ఇతరులకు సాయం చేయండి. పిరికితనం వదలండి. మన తెలంగాణా కోసం మీ వంతు సాయం చేయండి.
జై తెలంగాణా!
V. పదజాల వినియోగం
1. గీతగీసిన పదాలకు అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
అ) నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి ప్రసిద్ధి.
జవాబు.
ప్రసిద్ధి – పేరు పొందుట, ఖ్యాతి
హైదరాబాద్ మత సహనానికి పేరు పొందిన నగరం.
ఆ) బాగా చదువుకొని స్వప్నం నెరవేర్చుకోవాలి.
జవాబు.
స్వప్నం = కల
నా అద్భుతమైన కలలు సాధించడానికి నేనెంతో శ్రమపడతాను.
ఇ) మహాభారత సమరంలో ధర్మం గెలిచింది.
జవాబు.
సమరం = యుద్ధం
యుద్ధాల వలన ధననష్టం, జననష్టం కలుగుతుంది.
ఈ) అపాయకర సంఘటనలు ఎదురైనపుడు శౌర్యం చూపాలి.
జవాబు.
శౌర్యం = పరాక్రమం
భారత సైనికులు కార్గిల్ యుద్ధంలో పరాక్రమాన్ని చూపారు.
ఉ) సూర్యుని దీప్తి లేకపోతే లోకమంతా చీకటిమయం.
జవాబు.
దీప్తి = కాంతి
విజ్ఞానము అనే కాంతి అన్నిచోట్ల వెలగాలి.
2. కింది పదాలను వివరించండి.
అ) సాహితీ జ్యోతులు
జవాబు.
సాహితి అనే కాంతులు అని అర్థం. సాహిత్యం అంటే భాషలోని రచనలు.
ఆ) శౌర్యచంద్రికలు
జవాబు.
పరాక్రమము అనే వెన్నెలలు.
ఇ) అపరంజి బొమ్మ
జవాబు.
చాలా అందమైన బొమ్మ. అందమైన వ్యక్తులను అపరంజి బొమ్మలతో పోలుస్తారు. అపరంజి అంటే బంగారం.
ఈ) అజరామరం
జవాబు.
ముసలితనం, మరణం లేనిది.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పదాలను విడదీయండి. సంధిని గుర్తించి సంధిపేరు రాయండి.
అ) రంగనాథాలయం = ____________
జవాబు.
రంగనాథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
ఆ) అమృతాన్నం = ____________
జవాబు.
అమృత + అన్నం – సవర్ణదీర్ఘ సంధి
ఇ) అజరామరం = ____________
జవాబు.
అజర + అమరం – సవర్ణదీర్ఘ సంధి
ఈ) కవీంద్రుడు = ____________
జవాబు.
కవి + ఇంద్రుడు – సవర్ణదీర్ఘ సంధి
2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
అ) చదువుసంధ్యలు : ____________
జవాబు.
చదువును మరియు సంధ్య – ద్వంద్వ సమాసం
ఆ) పామూముంగిసలు : ____________
జవాబు.
పాముయు మరియు ముంగీస – ద్వంద్వ సమాసం
ఇ) ఎండావానలు : ____________
జవాబు.
ఎండ మరియు వాన – ద్వంద్వ సమాసం
ఈ) కొండాకోనలు : ____________
జవాబు.
కొండ మరియు కోన – ద్వంద్వ సమాసం
ఉ) మంత్రతంత్రాలు : ____________
జవాబు.
మంత్రం మరియు తంత్రం – ద్వంద్వ సమాసం
ఊ) తల్లిదండ్రులు : ____________
జవాబు.
తల్లియును, తండ్రియును – ద్వంద్వ సమాసం
ఋ) రామకృష్ణులు : ____________
జవాబు.
రాముడు మరియు కృష్ణుడు – ద్వంద్వ సమాసం
ౠ) కూరగాయలు : ____________
జవాబు.
కూర మరియు కాయ – ద్వంద్వ సమాసం
ద్విగు సమాసం:
ఈ పదాలను పరిశీలించండి.
- నవరసాలు
- చతుర్వేదములు
- షట్చక్రవర్తులు
- దశ దిశలు
- పంచపాండవులు
- ఎనిమిది బొమ్మలు
ఈ పదాలలో మొదటి (పూర్వ)పదం సంఖ్యా వాచకంగా ఉండి, రెండవపదం (పర) నామవాచకంగా ఉంది. వీటికి విగ్రహవాక్యాలు ఇట్లా ఉంటాయి.
- నవరసాలు – తొమ్మిది సంఖ్యగల రసాలు
- చతుర్వేదములు – నాలుగు సంఖ్య గల వేదములు
- షట్చక్రవర్తులు – ఆరు సంఖ్యగల చక్రవర్తులు
- పంచపాండవులు – ఐదు సంఖ్యగల పాండవులు
- దశదిశలు – పది సంఖ్యగల దిక్కులు
- ఎనిమిది బొమ్మలు – ఎనిమిది సంఖ్యగల బొమ్మలు
మొదటి (పూర్వ) పదం సంఖ్య అయితే తర్వాత (ఫర) పదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయివుంటుంది.
పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ‘ద్విగు సమాసం’.
3. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
ఉదా : శతాబ్దం వందసంఖ్యగల – అబ్దం – ద్విగు సమాసం
అ) ముక్కుచెవులు : ____________
జవాబు.
ముక్కు మరియు చెవులు – ద్వంద్వ సమాసం
ఆ) ఏడేండ్ల : ____________
జవాబు.
ఏడు సంఖ్యగల ఏండ్లు – ద్విగు సమాసం
ఇ) ఆరువేల ఆశ్వికదళం: ____________
జవాబు.
ఆరువేల సంఖ్యగల ఆశ్వికదళం – ద్విగు సమాసం
ఈ) శౌర్యధైర్యాలు : ____________
జవాబు.
శౌర్యము మరియు ధైర్యము – ద్వంద్వ సమాసం
ప్రాజెక్టు పని
మీ ప్రాంతంలో బతుకమ్మ పాటలుగా పాడుకునే వీరగాథలను సేకరించండి. రాయండి. ప్రదర్శించండి.
వస్తాడె ఒక సర్వాయె పాపడు ఉయ్యాలో
తల్లి కొలువుకు వడిగా వెళ్ళేను ఉయ్యాలో
తల్లికి దండముగా నిలిచేను ఉయ్యాలో
కొట్టుదును గోల్కొండ పట్నము ఉయ్యాలో
ఢిల్లీకి మోజూరు నౌదును ఉయ్యాలో
మూడు గడియల బందరు కొట్టుదును ఉయ్యాలో
మూలకోట కందనూరు సూచి ఉయ్యాలో
బంగారు కడియాలు పెట్టుదును ఉయ్యాలో
మనకంతా బంట్రోతు తనమేలు ఉయ్యాలో
అడుగో పాపడు వస్తాన్నంటే ఉయ్యాలో
మన కులకాయి మానవద్దురా సర్వాయిపాప ఉయ్యాలో
కుందేళ్లు కూర్చుండపడెను ఉయ్యాలో
లేడిపిల్లలు లేవ లేవు ఉయ్యాలో
పసిబిడ్డలు పాలుతాగరు ఉయ్యాలో
నక్కలు సింహాలు తొక్కబడును ఉయ్యాలో
పావురం కోటకట్టెను ఉయ్యాలో
మొగలు రాజులకు ఉయ్యాలో
పక్కలో బల్లెమై ఉయ్యాలో
కునుకులేకుండ చెసె ఉయ్యాలో
రుస్తుందిల్ ఖాన్ ఉయ్యాలో
పాపన్న నెదిరించె ఉయ్యాలో
రుస్తుందిల్ ఖాన్ను ఉయ్యాలో
నుగ్గునుగ్గుచేసె ఉయ్యాలో
ఓరుగల్లు కోటను ఉయ్యాలో
పాపన్న ముట్టడించె ఉయ్యాలో
బందీలు విడిపించె ఉయ్యాలో
గోల్కొండ కోట చేరె ఉయ్యాలో
మొగలు సైన్యాన్ని ఉయ్యాలో
మూడుచెర్ల నీళ్ళు తాగించె…ఉయ్యాలో
విశేషాంశాలు
మెతుకు సీమ : నేటి మెదక్ జిల్లా. ఒకప్పుడు ఇక్కడ (వరి అధికంగా పండించేవారు) మెతుకులు అధికంగా దొరికేవి కాబట్టి మెతుకుసీమ అన్నారు. మంజీరకదేశం, గుల్షనాబాద్ అని కూడ గతంలో పిలిచేవారు.
రాయబాగిన్ : రాయబాగిన్ అంటే రాజసహోదరి అని అర్థం. నిజాం పాలకుడు రాణీశంకరమ్మకు ఇచ్చిన బిరుదు ఇది.
అన్నపూర్ణ : కాశీలోని విశ్వనాథుని ఇల్లాలిపేరు అన్నపూర్ణ. అందరికీ ఆహారం(అన్నం) పెట్టేదే అన్నపూర్ణ.
అందోలు : గతంలో ఒక సంస్థానం. ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్నది.
నైజాం రాజులు : తెలంగాణను గతంలో పరిపాలించిన నిజాం వంశీయులైన మహ్మదీయ రాజులు పీష్వాలు : ఒకప్పుడు మహారాష్ట్రను పరిపాలించిన రాజులు
TS 7th Class Telugu 12th Lesson Important Questions రాణి శంకరమ్మ
ప్రశ్న 1.
పాఠం ఆధారంగా స్త్రీలను గూర్చి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు.
స్త్రీలు అబలలుకాదు సబలలే! వారు కూడా తగిన అవకాశాలు లభిస్తే వీరవనితలుగా రాణిస్తారు. చదువులలో, ఆటలలో, రాజకీయాలలో, పాలనలో ఇలా ఏ రంగంలోనైనా రాణిస్తారు. అన్ని అవకాశాలు లభించాలే కాని స్త్రీలు ముందుంటారు అనే అభిప్రాయం ఏర్పడింది.
అర్ధాలు
- వాణి = వాక్కు
- బాణి = పద్ధతి
- దీప్తి = వెలుగు / కాంతి
- స్వప్నం = కల
- నారీమణి = వనితలలో మేటి
- వనిత = స్త్రీ
- సరళము = తేలిక
- ఆరితేరు = నైపుణ్యం సంపాదించు
- కాడికి = దగ్గరకు
- దప్పు = దాహం
- దిగ్గున = వెంటనే
- కుతంత్రం = చెడు ఆలోచన
- పెనిమిటి = భర్త
- హితము = మేలు
- చెంత = దిగులు / బాధ
- సమరం = యుద్ధము
- కుత్తుక = పీక
- శూరత్వ = పరాక్రమం
పర్యాయపదాలు
- వాణి = వాక్కు, పలుకు, ఉక్తి
- పులి = శార్దూలం, వ్యాఘ్రం
- లక్ష్మి= లచ్చి, సంపద, శ్రీ
- అతి = మిక్కిలి, ఎక్కువ, చాలా
- తండ్రి = పిత, జనకుడు
- నీర = పానీయము, జలము
- దండము = నమస్కారము, వందనము
- దిగ్గున = వెంటనే, తటాలున
- హితము = మేలు, మంచి
- చెంత = దగ్గర, సమీపము
- సముద్రము = సాగరము, కడలి, సంద్రము
- పోరు = యుద్ధము, జగడము, తగాదా, కదనము
- కొండ = అద్రి, గిరి, పర్వతము
- భర్త = పతి, పెనిమిటి, నాథుడు, మగడు, మొగుడు
- అడవి = అరణ్యము, వనము
- పల్లె =గ్రామం, ఊరు, జనపదం
నానార్థాలు
- దేవత = వేలుపు, దేవభావము, జ్ఞానేంద్రియము
- దుఃఖము = బాధ, మనోవ్యధ, నొప్పించునది
- చీకటి = అంధకారము, దుఃఖము, చీకటిగల రాత్రి
- కాళి = పార్వతి, పాలపురుగు, బొగ్గు, రాత్రి
- కేసరి = సింహము, గుర్రము, ఆంజనేయుని తండ్రి, శ్రేష్ఠుడు
- గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, రాజు, బృహస్పతి
- రాజు = ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు
- రూపు = ఆకారము, అందము, రీతి
- లోకము = భూలోకము, జనము, సమూహము
- సమయము = కాలము, సిద్ధాంతము, ఒప్పుదల
ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
- భాష – బాస
- విద్య – విద్దె
- హృదయము – ఎద
- లక్ష్మి – లచ్చి
- విద్య – విద్దె
- రోషము – రోసము
- సంతోషము – సంతసము
- రాజు – రాయలు
- బాధ – బాద
- భక్తి – బత్తి
- బంధము – బందము
- రూపము – రూపు
- గర్వము – గరువము
సంధులు
- లయాత్మకత – లయ + ఆత్మకత – సవర్ణదీర్ఘ సంధి
- చరితార్థం – చరిత + అర్ధం – సవర్ణదీర్ఘ సంధి
- అమృతాన్నం – అమృత + అన్న- సవర్ణదీర్ఘ సంధి
- అజరామరం – అజర +అమరం – సవర్ణదీర్ఘ సంధి
- గరుడాద్రి – గరుడ + అద్రి – సవర్ణదీర్ఘ సంధి
- రంగనాథాలయం – రంగనాథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
- పోరాడుతున్నది – పోరాడుతు + ఉన్న – ఉత్వ సంధి
- నాకొద్దు – నాకు + ఒద్దు – ఉత్వ సంధి
- పరుగెత్తె – పరుగు + ఎత్తు – ఉత్వ సంధి
- భయమింత – భయము + ఇంత – ఉత్వ సంధి
- ఇంతైన – ఇంత + ఐన – అత్వ సంధి
సమాసములు
- శక్తి సామర్థ్యాలు – శక్తి మరియు సామర్థ్యం – ద్వంద్వ సమాసం
- సంస్కృతీ సంప్రదాయాలు- సంస్కృతి మరియు సంప్రదాయం – ద్వంద్వ సమాసం
- దారితెన్నులు – దారి మరియు తెన్ను – ద్వంద్వ సమాసం
- కొండాకోనలు – కొండ మరియు కోన – ద్వంద్వ సమాసం
- ధైర్యసాహసాలు – ధైర్యం మరియు సాహసం – ద్వంద్వ సమాసం
- పాడిపంటలు – పాడి మరియు పంట – ద్వంద్వ సమాసం
- ఆట పాటలు – ఆట మరియు పాట – ద్వంద్వ సమాసం
- చదువు సందెలు – చదువు మరియు సందె – ద్వంద్వ సమాసం
- అమ్మలక్కలు – అమ్మలు మరియు అక్కలు – ద్వంద్వ సమాసం
I. కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించి వేరుగా వ్రాయండి.
అ) శంకరమ్మపై పులి పంజా విసిరింది. ఆ శార్దూలాన్ని ఎదిరించింది. శంకరమ్మ కట్టెతో కొట్టి కాళ్ళతో తొక్కి ఆ వ్యాఘ్రాన్ని చంపింది.
జవాబు.
అ) పులి, శార్దూలం, వ్యాఘ్రం
ఆ) ఇతరుల హితము కోరువారికి మేలు జరుగును.
జవాబు.
ఆ) హితము, మేలు
ఇ) పోరు నష్టము పొందు లాభము. జగడమాడితే ప్రశాంతత ఉండదు.
జవాబు.
ఇ) పోరు, జగడము
ఈ) గౌడిచర్ల అనే పల్లెలో శంకరమ్మ పుట్టింది. ఆ జనపదంలో ఎదిగింది. నేడు ఆ గ్రామానికి ఎంతో పేరు తెచ్చింది.
జవాబు.
ఈ) పల్లె, జనపదం, గ్రామం
II. కింది వాక్యములలోని నానార్ధపదాలను గుర్తించి రాయండి.
అ) గురువులను గౌరవించాలి. రాజు తన ప్రజలను కన్నబిడ్డలవలే పాలించాలి.
జవాబు.
అ) గురువు – రాజు
ఆ) ఈ లోకంలో అనేక జంతురాశులున్నాయి. ఆయా రాశుల సమూహమే ఈ ప్రపంచం.
జవాబు.
ఆ) లోకం – సమూహము
ఇ) దేవతలకు రాజు ఇంద్రుడు. ఆకాశంలో చంద్రుడు వెన్నెలను కురిపిస్తాడు.
జవాబు.
ఇ) రాజు – ఇంద్రుడు, చంద్రుడు
III. కింది వాక్యాల్లోని ప్రకృతి వికృతులను గుర్తించండి.
అ) విద్యలేని వాడు వింత పశువు. విద్దె ఉన్నవాణ్ణి అందరూ గౌరవిస్తారు.
జవాబు.
విద్య (ప్ర) – విద్దె (వి)
ఆ) లక్ష్మి అంటే సంపద. చదువే నిజమైన లచ్చి. లేనివారిని ఎవరూ గౌరవించరు.
జవాబు.
లక్ష్మి (ప్ర) – లచ్చి (వి)
ఇ) భక్తి లేని శివ పూజలు అనవసరం. బత్తితో చేసే పని ఆనందాన్నిస్తుంది.
జవాబు.
భక్తి (ప్ర) – బత్తి (వి)
ఈ) సంతోషమే సగం బలం. సంతసం లేనివాడు సుఖంగా ఉండడు.
జవాబు.
సంతోషము (ప్ర) – సంతసము (వి)
ఉ) రాజు చేతికత్తి రక్తం వర్షిస్తుంది. రాయలు తన ప్రజలను సుఖంగా పాలించాలి.
జవాబు.
రాజు (ప్ర) – రాయలు (వి)
IV. కింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.
అ) సువర్ణాక్షరములు
జవాబు.
సువర్ణ+అక్షరములు – సవర్ణదీర్ఘసంధి
ఆ) కాళ్ళరగ
జవాబు.
కాళ్ళు + అరగ – ఉత్వసంధి
ఇ) రాజంతట
జవాబు.
రాజు + అంతట – ఉత్వసంధి
ఈ) వాననక
జవాబు.
వాన + అనక – అత్వసంధి
ఉ) ఏడేండ్లు
జవాబు.
ఏడు + ఏండ్లు- ఉత్వసంధి
V. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు గుర్తించండి.
అ) వాలి సుగ్రీవులు
జవాబు.
వాలి మరియు సుగ్రీవుడు – ద్వంద్వ సమాసం
ఆ) పంచపాండవులు
జవాబు.
ఐదు సంఖ్యగల పాండవులు – ద్విగు సమాసం
ఇ) టక్కుటెక్కులు
జవాబు.
టక్కు మరియు టెక్కు – ద్వంద్వసమాసం
ఈ) దశ దిశలు
జవాబు.
పది సంఖ్యగల దిశలు – ద్విగు సమాసం
ఉ) తల్లీ పిల్లలు
జవాబు.
తల్లి మరియు పిల్ల – ద్వంద్వ సమాసం
VI. కింది గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
“శ్రీరామునిశోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకొని రావడంలో తాను తగిన సాయం చేస్తానన్నాడు. పరివారంతో సహా రావణుని చంపడానికి తన ఆలోచనలను అన్నిటిని ఉపయోగిస్తానన్నాడు. దుఃఖం మంచిదికాదు కావున ఎపుడూ విలపించవద్దన్నాడు. ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖము ఉండదు. తేజస్సు పోతుంది. చివరకు ప్రాణాలు కూడా పోవచ్చు. కనుక ఈ విచారస్థితి నుండి బయటపడమని ధైర్యం నూరి పోశాడు. ప్రశ్నలు :
అ) శ్రీరాముని శోకం పోగొట్టడానికి ప్రయత్నించింది ఎవరు?
జవాబు.
సుగ్రీవుడు
ఆ) శ్రీరాముడు ఎవరికోసం దుఃఖిస్తున్నాడు ?
జవాబు.
సీతకోసం
ఇ) ‘సహాయం’ అనే పదానికి పై గద్యంలో ఉపయోగించిన వికృతి పదం ఏది?
జవాబు.
సాయం
ఈ) దుఃఖము వలన ఏమేమి జరగవచ్చు ?
జవాబు.
దుఃఖం వలన తేజస్సు పోతుంది. ప్రాణాలు కూడా పోవచ్చు.
ఉ) శోకానికి పై గద్యంలో వాడిన పర్యాయ పదాలేవి?
జవాబు.
దుఃఖము, విచారము
VII. కింది వచనం చదివి అయిదు ప్రశ్నలు తయారు చేయండి.
సమాజంలో మతం అంతర్భాగం. మన సమాజంలో ఎన్నో మతాలున్నాయి. ఏ మతమైనా అందరికి ప్రయోజనాన్ని చేకూర్చే సిద్ధాంతాలనే కలిగి ఉంటుంది. ఇతరుల మతం కంటే తమ మతం గొప్పదని చెప్పుకొనేవారు అవివేకులు. వారు తమ స్వార్థానికే ఇతర మతాలను దూషించుటకు ప్రయత్నిస్తారు. సర్వమతాలను సమానంగా భావించి మంచిని స్వీకరించు వారే ఉత్తములు.
ప్రశ్నలు :
అ) సమాజంలో అంతర్భాగమైనదేది?
ఆ) ప్రతి మతంలోని ప్రధాన సిద్ధాంతమేమి?
ఇ) ఎవరు అవివేకులు?
ఈ) ఉత్తములు ఎవరు?
ఉ) స్వార్థపరులు ఏం చేస్తారు?
పాఠం నేపథ్యం
తెలంగాణలో వీరనారీమణులకు కొదువలేదు. అటువంటి నారీమణులలో అందోలు సంస్థానాన్ని పాలించి, శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ ధైర్యసాహసాలు కలిగిన వీరవనిత. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచర్లలో 1702లో పుట్టింది. రాజమ్మ, సంగారెడ్డి దంపతులకు జన్మించిన శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నది. ప్రజల్ని కన్నబిడ్డలుగా పరిపాలించిన రాణిశంకరమ్మ శత్రువుల పాలిట అపరకాళికవలె ధైర్యసాహసాలు ప్రదర్శించింది. చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకున్నది. మెదకు ప్రాంతాన్ని చరితార్థం చేసిన రాణి శంకరమ్మ గూర్చి ఈ పాఠం తెలియజేస్తుంది.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం గేయకథ ప్రక్రియకు చెందినది. కథతో కూడి, గేయరూపంలో ఉంటుంది. లయాత్మకత, ప్రాసలతోకూడి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సరళమైన భాషలో అలవోకగా సాగుతుంది.
సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన “మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర్యరెడ్డి త్రయం” (వీరుల గాథలు) పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠ్యాంశమిది.
ప్రవేశిక
అవకాశం లభిస్తే మహిళలు ఏపనినైనా సాధించగలరు. తమ శక్తిసామర్థ్యాలను పదునుపెట్టుకొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగువేస్తారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి కోవకు చెందిన మహిళ శంకరమ్మ. ఆమె యుద్ధరంగంలో చూపిన ప్రతిభను, ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలుగా పాడుకుంటారు. ఇంత కీర్తిపొందిన రాణిశంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాట రూపంలో తెలుసుకుందాం.
నేనివి చేయగలనా?