Telangana SCERT 6th Class Telugu Guide Telangana 9th Lesson చీమలబారు Textbook Questions and Answers.
చీమలబారు TS 6th Class Telugu 9th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్న 1.
బొమ్మలో ఏమి జరుగుతున్నది ?
జవాబు.
ప్రయాణికులు ఒకరొకరుగా బస్సు ఎక్కుతున్నారు.
ప్రశ్న 2.
ప్రయాణికులు బస్సును ఎట్లా ఎక్కుతున్నారు?
జవాబు.
ప్రయాణికులు ఒక వరుసలో నిలబడి క్రమశిక్షణతో బస్సును ఎక్కుతున్నారు.
ప్రశ్న 3.
మన చుట్టూ నివసిస్తున్న ఏయే ప్రాణులు ఇట్లాంటి క్రమశిక్షణను కలిగి ఉంటాయి ?
జవాబు.
మన చుట్టూ నివసిస్తున్న చీమలు, తేనెటీగలు, పక్షులు ఇట్లాంటి క్రమశిక్షణను కలిగి ఉంటాయి.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
చీమలు అనవసరంగా తిరగవు అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు.
చీమలు అనవసరంగా తిరగవు అనటంలో కవి మంచి ఉద్దేశాన్ని వివరించదలచుకున్నాడు. చీమలు పనీపాట లేకుండా, కాలం వృథా చేస్తూ తిరగవు. అవి ఆహారాన్ని కూడబెట్టుకోవటానికి నిరంతరం శ్రమిస్తుంటాయి. వాటిలో సంఘ జీవనం ఎక్కువ. వాటిని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి. చీమలు నిస్వార్థ జీవులు.
ప్రశ్న 2.
మనిషి కలసిమెలసి ఉండకపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు.
మనుషులు కలసిమెలసి ఉండకపోవటానికి కారణం స్వార్థం. చీమలు… నాయకుడు లేకపోయినా క్రమశిక్షణతో మసలుకుంటాయి. మనుషులు… నాయకుడున్నా ఆ క్రమశిక్షణను పాటించరు.
ప్రశ్న 3.
ఎవరో ఒక నేత లేకుండ ఇంత కట్టుదిట్టంగా మనుషులం నడవలేమని కవి ఎందుకన్నాడో ఆలోచించి చెప్పండి.
జవాబు.
మనుషులు కట్టుదిట్టంగా నడచుకోవాలంటే వాళ్ళను క్రమశిక్షణతో నడిపే నాయకుని అవసరం ఉంది. చీమలకు అది అవసరం లేదు. ప్రతి చీమ ఆ సమూహానికి క్రమశిక్షణగల నాయకునిగా వ్యవహరిస్తుంటుంది.
ప్రశ్న 4.
చీమలో విషయంలో ‘కడు’ దుర్గమమైన బ్రతుకుబాట మీది’ అని కవి ఎందుకన్నాడో చెప్పండి.
జవాబు.
చీమలు పొలాలన్నీ తిరిగి తిరిగి ధాన్యపు గింజలను సంపాదిస్తాయి. వాటి కోసం అవి ఎంతో కష్టపడతాయి. అటువంటి గుణాన్ని మానవులు నేర్చుకోవాలని కవి ఇలా అన్నాడు.
ప్రశ్న 5.
పొదుపు పాటిస్తే దారిద్ర్యం ఉండదని కవి అన్నాడు కదా! మనం ఏయే విషయాల్లో పొదుపు పాటించాలి ?
జవాబు.
నీటి విషయంలో, విద్యుత్తు విషయంలో, ధనం విషయంలో, కాలం విషయంలో పొదుపు పాటించాలి.
ప్రశ్న 6.
మనిషి బతకడానికి ఏయే విద్యలు నేర్చుకుంటున్నాడో ఆలోచించి చెప్పండి.
జవాబు.
మనిషి బతకటానికి ఎన్నో విద్యలు నేరుస్తాడు. కోటి విద్యలు కూటికొరకే కదా! వ్యవసాయం, చదువు, వృత్తివిద్యలు, శాస్త్ర సాంకేతిక విద్యలు, నైతిక విలువలతో కూడిన విద్యలెన్నింటినో నేర్చుకుంటాడు.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
పాఠం చదివారు కదా! ఈ కవితను కవి ఎందుకు రాసి ఉండవచ్చు?
జవాబు.
పొట్లపల్లి రామారావు ఈ పాఠాన్ని మన కోసమే వ్రాశాడు. మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరంగా శ్రమించటం, కాలం విలువ తెలుసుకోవడం వంటి గుణాలకు నేర్చుకోవాలని తెలియజేయటానికి రాశాడు. చిన్న ప్రాణులైనా చీమలు ఎంత కష్టపడతాయో, ఎంత క్రమశిక్షణతో మెలగుతాయో తెలియజేయటానికి ఈ పాఠాన్ని రాశాడు.
ప్రశ్న 2.
చీమల క్రమశిక్షణను తెలుసుకున్నారు కదా! క్రమశిక్షణను పాటించే విషయంలో మనిషి తీరు ఎట్లా ఉంటున్నదో చెప్పండి
జవాబు.
క్రమశిక్షణను పాటించే విషయంలో మనిషి తీరు బాగాలేదు. ఒక పద్ధతి, కట్టుబాటు లేకుండా ఇష్టమొచ్చినట్లు జీవిస్తున్నాడు. సోమరితనంతో కష్టపడటం మానేస్తున్నాడు. కనీసం చిన్న జీవులైన చీమలను చూసైనా క్రమశిక్షణను నేర్వలేకపోతున్నాడు. క్రమశిక్షణ విషయంతో మనిషి ప్రక్కదారులు త్రొక్కుతున్నాడు.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
1. పాఠం చదివి చీమల గొప్పదనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలను వెతికి రాయండి.
జవాబు.
బారుగట్టి, ఓరిమితో
ఇంగితజ్ఞులు, ఇంత ఘనులు
కట్టు దిట్టముగ, మీ పోకడ చిత్రము
ప్రాలుమాలి, ధాన్యము సమకూర్తురు
వివేకము, పొదవు
విద్దెటు నేర్చితిరి
యేటా నేర్చితిరో
2. కింది కవితను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎగిరే పక్షుల్లో ఐక్యత ఉందోయ్
సాగే చీమల్లో ఐక్యత ఉందోయ్
కోకిల గానంలో మాధుర్యం ఉందోయ్
నెమలి నాట్యంలో ఆనందం ఉందోయ్
ప్రకృతిలో ఎక్కడ చూసిన
అందం, ఆనందం ఉందోయ్
(అ) పై కవిత ప్రకారం చీమల గొప్పతనం ఏమిటి ?
జవాబు.
ఐక్యత (ఐకమత్యం)
(ఆ) పక్షుల గొప్పదనం ఏమిటి ?
జవాబు.
ఐకమత్యంగా మసలుకోవటం.
(ఇ) కోకిల గానం ఎట్లా ఉంటుంది ?
జవాబు.
కోకిల గానం మాధుర్యంగా ఉంటుంది.
(ఈ) ప్రకృతిని ఎందుకు కాపాడాలి ?
జవాబు.
ప్రకృతిని అందం కోసం కాపాడాలి, జీవరాశుల మనుగడ కోసం కాపాడాలి.
(ఉ) ఈ కవితకు శీర్షికను పెట్టండి.
జవాబు.
‘ప్రకృతి – అందం’.
3. గేయం ఆధారంగా కింది వాక్యాల్లో ఒప్పును (✓) తో, తప్పును (X) తో గుర్తించండి.
అ. చీమలు చాలా సోమరులు. (X)
ఆ. చీమలకు క్రమశిక్షణ ఎక్కువ. (✓)
ఇ. పొదుపు చేయడం చీమల నుంచి నేర్చుకోవాలి. (✓)
ఈ. చీమలకు ముందుచూపు ఉండదు. (X)
ఉ. చీమల నేత చీమలన్నింటిని నడిపిస్తాడు. (X)
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) చీమలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలేవి ?
జవాబు.
చీమలనుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం క్రమశిక్షణ. చీమలకు దారిచూపే నాయకుడు ఉండడు. అయినా అవి ఒకేదారిలో సాగిపోతాయి. చీమలకు సోమరితనం ఉండదు. అవి పొలాలన్నీ తిరిగి తిరిగి ధాన్యాన్ని సంపాదిస్తాయి. కష్టపడి పనిచేయటం వాటికి ఇష్టం. చీమలనుండి మనం నేర్చుకోవలసిన రెండవ అంశం సోమరితనాన్ని మాని కష్టపడి పనిచేయటం. ఇక మూడవ అంశం ఐకమత్యం. నాల్గవ అంశం పొదుపు. క్రమశిక్షణ, పొదుపు, భద్రత, కష్టపడే తత్వం మనుషులకుంటే దారిద్య్ర్యం అనేది ఉండదు.
(ఆ) “కోటివిద్యలు కూటికొరకే కదా!” ఈ వాక్యాన్ని విశ్లేషించి రాయండి.
జవాబు.
కోటివిద్యలు కూటికొరకే! ఎవరు ఏ విద్యను అభ్యసించినా అది ఆహారాన్ని సంపాదించుకోవటానికే. జీవులకు ఆహారమే కదా ముఖ్యం. దానికోసమే ఏ జీవి అయినా పగలు, రాత్రి పనిచేస్తుంటాయి. చీమలను చూడండి. అవి వేసవి కాలంలో ధాన్యం వచ్చే కాలంలో ఆహారాన్ని సంపాదించుకొని పొదుపు చేసుకొని వర్షాకాలంలో హాయిగా తింటుంటాయి. అలాగే మనుషులు కూడా రకరకాల విద్యలను ఆహారాన్ని సంపాదించుకోవడానికే నేర్చుకుంటున్నారు. కాబట్టి ఏ విద్య నేర్చినా అది కూటికొరకే అన్న విషయాన్ని మరువరాదు.
(ఇ) ఏ పనీ లేకుండా వృథాగా తిరగడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి ?
జవాబు.
ఏ పనీ లేకుండా వృథాగా తిరగటంవల్ల పలు అనర్థాలున్నాయి. క్రమశిక్షణ కొరవడుతుంది. సోమరితనం అబ్బుతుంది. నాయకత్వ లక్షణాలు సన్నగిల్లుతాయి (పోతాయి). బాధ్యత ఉండదు. నలుగురూ చులకనగా చూస్తారు. పొదుపుకు స్థానం ఉండదు. సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. కూర్చుని తింటే కొండలైనా కరగిపోతాయి. ‘బుర్ర దెయ్యాలకు నివాసం’ అని సామెత. ఖాళీగా ఉండే మనిషికి చెడిపోయే ఆలోచనలు ఎక్కువ. దాని మూలంగా సంఘానికి చేటు.
(ఈ) పొట్లపల్లి రామారావు గురించి, ఆయన రచనా విధానం గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు.
పొట్లపల్లి రామారావు రచించిన చీమల బారు పాఠం ఆయన రాసిన ‘ఆత్మనివేదనం’ కవితా సంపుటి నుండి గ్రహించింది. ఆత్మ నివేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలను, మహత్కాంక్ష, జీవితం అనే కవితా ఖండికలను, పగ నాటకాన్ని, జైలు కథల సంపుటిని రచించాడు. చీమల బారు గేయం ద్వారా, రామారావుగారు వాడుక భాషలో, సరళమైన శబ్దాలతో, సుందరమైన శైలితో రాస్తారని అర్థం అయింది. పెద్దగా చదువుకోని వారికి కూడా అర్థమయ్యే రీతిలో, నీతి బోధకంగా ఆయన రచనలు ఉంటాయని తెలుస్తుంది.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
(అ) చీమలబారు కవితా సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
చీమలబారు గేయ కవితా ప్రక్రియకు చెందింది. రచయిత పొట్లపల్లి రామారావు. రామారావుగారు మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించే గుణాలను నేర్చుకోమని చెప్పటానికి ఈ గేయ కవితను రాశారు. చీమలు చక్కగా క్రమశిక్షణతో వరుసలు కట్టిపోతున్నాయి. వాటికి నాయకుడనువాడు లేడు. వాటికి ఎలా వెళ్ళాలో తెలుసు. వాటి తెలివితేటలు అబ్బురపరుస్తాయి. పంట పొలాలు లేకపోయినా ఆహారాన్ని సమృద్ధిగా సంపాదిస్తాయి.
బతుకు విలువ చీమలకు తెలిసినంతగా మానవులకు కూడా తెలీదు. పొదుపు వాటికి పుట్టుకతో వచ్చిన విద్య. అవి ఏం చదువుకున్నాయి. వాటి పొదుపు… మనుషులు నేర్చుకుంటే దారిద్ర్యం అనేది ఈ లోకంలో ఉండదు. కోటివిద్యలు కూటికోసమే కదా! మానవులు ఏవేవో నేర్చుకోవటానికి ఎక్కడికెక్కడికో పోతుంటారు. కాని కళ్ళముందు తిరిగే నిరంతర కష్టజీవులైన చీమలనుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని తెలుసుకోరు. మనుషులంతా చీమలవలే క్రమశిక్షణతో, సోమరితనాన్ని వదలి బతుకు బాటలో నడవాలని ఈ గేయ కవిత సారాంశం.
(ఆ) చీమలు మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి ?
జవాబు.
చీమలు మానవాళికి మంచి సందేశాన్నిస్తున్నాయి. క్రమశిక్షణగా మెలగమని చెప్తున్నాయి. మేము ఏ విధంగా నాయకుడు లేకపోయినా నియమనిబంధనలతో మసలుకొంటున్నామో అలాగే మసలుకోమని వివరిస్తున్నాయి. ఎల్లవేళలా చీమలు శ్రమ చేస్తుంటాయి. అక్కడే వాటి ఆరోగ్య రహస్యం ఉంది. శ్రమ చేయకుండా సోమరిపోతుల్లా కూర్చోవద్దని, చక్కగా శ్రమైక జీవనం సాగించమని సందేశాలిస్తున్నాయి. చీమల నుండి నేర్చుకోతగినది ఇంకొకటి ఉంది. అదే ముందు జాగ్రత్త. వానా కాలంలో తిండికోసం వేసవి కాలంలోనే తిండి దాచుకుంటాయి చీమలు. మనుషులు కూడా అలా ముందు జాగ్రత్తతో ఉండాలని సందేశమిస్తున్నాయి.
జాగ్రత్తగా మసలుకోవటం నేర్చుకుంటే ప్రమాదాల నుండి బయటపడతారు. పొదుపును ఒక ఉద్యమంగా చేపట్టాలని, పొదుపును నేర్చుకుంటే దారిద్ర్యాన్ని దూరం చేయవచ్చని చీమలు సందేశమిస్తున్నాయి. క్రమశిక్షణ, పట్టుదల, ఐకమత్యం, నిరంతర శ్రమ, బద్ధకాన్ని వదలిపెట్టడం, పొదుపు, భద్రతలను పాటించడం వంటి వాటితో పురోగతిని సాధించమని చీమలు మనకు మంచి సందేశమిస్తున్నాయి.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. చీమల బారు కవితలో చీమల ప్రత్యేకతలు తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీరు గమనించిన పక్షుల్లోని ప్రత్యేకతలను కవిత/గేయ రూపంలో రాయండి.
జవాబు.
చిలకలం మేము చిలకలం
చిగురాకు వంటి మొలకలం
చక్కగా హాయిగా ఎగురుతాం
ఆకాశంలో విహరిస్తాం ॥చిలకలం||
తోటలు అంటే మా కిష్టం
తోటలకోసం కోటలు దాటుతాం
పేటలు కోటలు మాకెంతో దూరంకాదు
చిటికెలోన మేం పయనిస్తాం || చిలకలం||
పండ్లంటే మాకెంతో ఇష్టం
కష్టపడటం మాకింకా ఇష్టం
మేడలు మిద్దెలు చెట్లతొర్రలు
మాకు మేలైన ఆవాసాలు ||చిలకలం||
కిచకిచ గుసగుస శబ్దం చేస్తాం
రుసరుస రుసలంటే మాకయిష్టం
కష్టమైనా నష్టాన్నైనా
హాయిగా మేం భరిస్తాం ||చిలకలం||
ఎర్రని పచ్చని రంగులంటే మాకిష్టం
పండ్ల రంగులు ప్రకృతి రంగులు
పవిత్రతకు ప్రతీకలు
అందుకే ఆ రంగుల్లో మేం కలిసి పోతాం ||చిలకలం||
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
(అ) ఈ సీమ సీతాఫలాలకు ప్రసిద్ధి.
జవాబు.
సీమ = ప్రాంతము
(ఆ) కృష్ణుని అల్లరి చేష్టలకు విసిగి గోపికలు కయ్యానికి దిగారు.
జవాబు.
కయ్యానికి = గొడవకు
(ఇ) ప్రార్థన సమయంలో విద్యార్థులు బారుకట్టి నిలబడ్డారు.
జవాబు.
బారుకట్టి = వరుసలు కట్టి
(ఈ) నల్లరేగడి మాన్యాలలో పంటలు బాగా పండుతాయి.
జవాబు.
మాన్యాలు = భూములు
(ఉ) ఓరిమి ఉంటే దేనినైనా సాధించగలం.
జవాబు. ఓరిమి = ఓర్పు
2. కింది పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
(అ) ఘనులు = గొప్పవారు
సొంతవాక్యం : తెలంగాణ ఉద్యమంలో కోదండరాం వంటి ఘనులెందరో పాల్గొన్నారు.
(ఆ) పోకడ = నడత
సొంతవాక్యం : ప్రాణం పోకడ వివరం చెప్పలేము.
(ఇ) ఎగుమతి.
సొంతవాక్యం : ఖమ్మం మామిడి పండ్ల ఎగుమతికి ప్రసిద్ధి వహించింది.
(ఈ) వివేకం.
సొంతవాక్యం : వివేకంతో ప్రవర్తించటం బుద్ధిమంతుని లక్షణం.
(ఉ) కొల్లలు.
సొంతవాక్యం : అదిలాబాద్ జిల్లాలో అడవులు కోకొల్లలుగా ఉన్నాయి.
(ఊ) ఇంగితజ్ఞులు.
సొంతవాక్యం : ఇతరుల భావాలను అర్థం చేసుకోగలిగిన వారిని ఇంగితజ్ఞులు అంటారు.
3. కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలను పట్టికలో వెతికి రాయండి.
చితుకు, మన్నం, చిత్తరువు, విధం, విద్దె, బరువు,
(అ) విద్య – విద్దె
(ఆ) చిత్రం – చిత్తరువు
(ఇ) మాన్యం – మన్నం
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది వాక్యాలను చదవండి.
సమాసం
(అ) మాకు దేశభక్తి ఉన్నది.
(ఆ) సురేశ్ వేసుకున్నది తెల్లచొక్క
(ఇ) లక్ష్మీపతి దయ నాపై ఉన్నది.
(ఈ) ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు.
(ఉ) పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది.
(ఊ) మాధవునికి పది ఎకరాల పొలం ఉన్నది.
పై వాక్యాల్లో గీతగీసిన పదాల అర్థాలను గమనించండి.
దేశభక్తి – దేశమునందు భక్తి
తెల్లచొక్క – తెల్లనైన చొక్క
లక్ష్మీపతి – లక్ష్మీయొక్క పతి
గురుదక్షిణ – గురువుకొరకు దక్షిణ
కూరగాయలు – కూర మరియు కాయ
పది ఎకరాలు – పది సంఖ్యగల ఎకరాలు
పై పదాల్లో వేరువేరు అర్ధాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా! ఈ విధంగా అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్తదనంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని ‘పూర్వపదం’ అని, రెండవ పదాన్ని ‘ఉత్తరపదం’ అనీ అంటారు. సమాసంలో ఉండే పదాల, అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు (పేర్లు) ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి తెలుసుకుందాం.
ద్వంద్వ సమాసం
కింది వాక్యాన్ని పరిశీలించండి.
“గురుశిష్యుల బంధం చాలా గొప్పది”.
ఈ వాక్యంలో గురుశిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు, శిష్యుడు అని. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటారు. ఇందులో గురువు, శిష్యుడు ఇద్దరూ ముఖ్యులే. ఇట్లా రెండు కాని అంతకంటే ఎక్కువగాని సమప్రాధాన్యం గల పదాలు కలిసి ఒకేమాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు.
1. కింది పేరాను చదివి అందులోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.
ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు. ఇతరుల కష్టసుఖాలు తెలిసినవారు. ఎవరు వచ్చి అడిగినా, వారి కలిమిలేములను గురించి ఆలోచించకుండా తమకున్నంతలో దానం చేసేవారు. ఇట్లా జీవిస్తూ అందరి ప్రేమాభిమానాలు చూరగొన్నారు.
జవాబు.
ద్వంద్వ సమాస పదాలు : అన్నయు తమ్ముడును, కష్టమును సుఖమును, కలిమియు లేమియు, ప్రేమయు అభిమానమును.
ప్రాజెక్టు పని:
మీ పరిసరాలలోని జంతువులను, పక్షులను, కీటకాలను, గమనించి వాటి ప్రత్యేకతలను పట్టిక రూపంలో రాయండి.
1. ప్రాజెక్టు శీర్షిక : పరిసరాలలోని జంతువులను, పక్షులను కీటకాలను గమనించి వాటి ప్రత్యేకతలను పట్టికరూపంలో రాయడం.
2. సమాచార సేకరణ : (అ) సమాచారం సేకరించిన తేది : Xxx
(ఆ) సమాచార వనరు : పరిసరాలు
3. సేకరించిన విధానం : మా పరిసరాలలోని పక్షులు, జంతువులను పరిశీలించి సమాచారం సేకరించాను.
4. నివేదిక
ఉదా :
ప్రాణి | చేసే పని / ప్రత్యేకత |
ఆవు | పూల నుంచి తేనెను సేకరిస్తుంది |
వానపాము | పాలిస్తుంది/మానవులకు ఎన్నోరకాలుగా ఉపయోగపడుతుంది. |
కోకిల | భూమిని సారవంతంగా చేస్తుంది. |
నెమలి | చక్కగా పాడుతుంది |
హంస | నాట్యం చేస్తుంది. |
పట్టుపురుగులు | పాలు నీళ్ళను విడదీస్తుంది |
గాడిదలు | పట్టుదారాన్నిస్తాయి. |
గొర్రెలు | బరువును మోస్తాయి |
చేపలు | మాంసాన్ని, పాలని ఇస్తాయి |
తాబేళ్ళు | నీటిలో ఈదుతాయి! |
5. ముగింపు : ప్రకృతిలోని ప్రతి ప్రాణికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని తెలుసుకున్నాను. అన్ని జీవులలో ఉత్తమం అనుకునే మానవుడు, ప్రకృతిలోని చిన్న చిన్న జీవుల నుండి కూడా నేర్చుకోవలసింది. చాలా ఉందని అర్థం చేసుకున్నాను. భూతదయ కలిగి ఉండాలని తెలుసుకున్నాను.
TS 6th Class Telugu 9th Lesson Important Questions చీమలబారు
పర్యాయపదాలు
- సమూహము = సంఘము, గుంపు
- కోటి = సమూహము, బృందము
- కళ్ళు = నయనములు, నేత్రములు
- పెండ్లి = పరిణయము, వివాహము
- బాట = దారి, మార్గము
- దాస్యము = ఊడిగము, సేవ, బానిసత్వము
నానార్థాలు
- అంతరిక్షము = ఆకాశము, అభ్రము
- ఆకు = పత్రము, చెవికమ్మె
- ఆశ = కోరిక, దిక్కు
- ఈశ్వరుడు = శివుడు, ప్రభువు
- ఉల్లసిల్లు = ప్రకాశించు, సంతోషించు
- ఊరు = పెరుగు (ట) ద్రవించు, గ్రామం
ప్రకృతులు – వికృతులు
- అటవి – అడవి
- చిత్రము – చిత్తరువు
- విద్య – విద్దె
- కార్యము – కర్జము
- కులము – కొలము
- గుణము – గొనము
- త్యాగము – చాగము
- రాత్రి – రేతిరి రాతిరి
- సంతోషము – సంతసము
- స్వామి – సామి
- మనుష్యుడు – మనిసి
పదాలు – విడదీసిన రూపాలు:
- మీరెక్కడికి = మీరు + ఎక్కడికి
- మీరేగెదరు = మీరు + ఏగెదరు
- సమూహమెక్కడికి = సమూహము + ఎక్కడికి
- వారుండిరి = వారు + ఉండిరి
- రామయ్య = రామ + అయ్య
- చింతాకు = చింత + ఆకు
- కళ్ళముకొక = కళ్ళముకు + ఒక
- గింజయైన = గింజ + ఐన
- దుర్గమమైన = దుర్గమము + ఐన
- మనిషికున్న = మనిషికి + ఉన్న
- కోటివిద్యలైన = కోటివిద్యలు + ఐన
- ఏమేమొ = ఏమి + ఏమొ
సంధులు
1. తెలివితేటలు = తెలివియును తేటలును – ద్వంద్వ సమాసము
2. తల్లిదండ్రులు = తల్లియును తండ్రియును – ద్వంద్వ సమాసము
I. అరాలు
1. మా ఊరిలో ఏరు ఉంది.
(A) పెద్ద వాగు
(B) చెరువు
(C) సముద్రము
(D) నీటిగుంట
జవాబు.
(A) పెద్ద వాగు
2. చీమలకు ఓరిమి ఎక్కువ.
(A) వేగము
(B) బద్దకము
(C) ఆకలి
(D) ఓపిక
జవాబు.
(D) ఓపిక
3. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ అవసరం.
(A) గొడవకు
(B) సర్దుబాటకు
(C) ప్రశాంతతకు
(D) శాంతానికి
జవాబు.
(A) గొడవకు
4. చీమలు గ్రాసం కోసం నిరంతరం కృషి చేస్తాయి.
(A) గింజలు
(B) నీరు
(C) ఆహారము
(D) చెత్త
జవాబు.
(C) ఆహారము
c
5. మిన్ను విరిగి మీద పడినా విజ్ఞులు చలించరు.
(A) భూమి
(B) నేల
(C) మన్ను
(D) ఆకాశము
జవాబు.
(D) ఆకాశము
II. పర్యాయపదాలు
6. ‘అంధకారము’నకు పర్యాయపదాలు రాయండి.
(A) చీకటి, తమస్సు
(B) వెలుతురు, రాత్రి
(C) నీడ, వెలుతురు
(D) నేల, చీకటి
జవాబు.
(A) చీకటి, తమస్సు
7. నింగికి గల పర్యాయపదాలు.
(A) నీరు, నిప్పు
(B) గాలి, నీరు
(C) భూమి, ఆకాశము
(D) మిన్ను, ఆకాశము
జవాబు.
(D) మిన్ను, ఆకాశము
8. ‘నైపుణ్యము’ నకు పర్యాయపదాలు.
(A) కోపము, దుఃఖము
(B) సహనము, ఓర్పు
(C) నేర్పు, పనితనం
(D) ఓర్పు, సహనం
జవాబు.
(C) నేర్పు, పనితనం
9. ‘పెండ్లి’ పర్యాయపదాలను రాయండి.
(A) వివాహము, పరిణయము
(B) కొట్టటం, తిట్టటం
(C) పెండిలి, పేరంటం
(D) పండుగ, జాతర
జవాబు.
(A) వివాహము, పరిణయము
10. ‘మార్గము’ కు పర్యాయపదాలు రాయండి.
(A) బజారు, దారి
(B) త్రోవ, దారి
(C) రోడ్డు, బాట
(D) బాట, బజారు
జవాబు.
(B) త్రోవ, దారి
III. నానార్థాలు
11. దిక్కుకు నానార్థాలు.
(A) ఆశ, కోరిక
(B) అత్యాస, దిశ
(C) నిరాశ, ఆశ
(D) నిస్పృహ, ఆశ
జవాబు.
(A) ఆశ, కోరిక
12. ‘ధర’కు నానార్థాలు.
(A) ధర, ఖర్చు
(B) ధార, జల
(C) దరిద్రం, దారి
(D) భూమి, వెల
జవాబు.
(D) భూమి, వెల
13. స్వభావము, అల్లెత్రాడు అని నానార్థాలు ఇచ్చే పదం.
(A) బాణము
(B) ధనస్సు
(C) గుణము
(D) విల్లు
జవాబు.
(C) గుణము
IV. ప్రకృతి – వికృతులు
14. ‘సాయము’నకు ప్రకృతి పదం.
(A) సాయ్యము
(B) సంబంధం
(C) సామరస్యం
(D) సహాయం
జవాబు.
15. కార్యమునకు వికృతి పదం.
(A) అర్థము
(B) కర్ణము
(C) పని
(D) కార్యాంతరము
జవాబు.
(D) కార్యాంతరము
16. చిత్రము నకు వికృతి పదం.
(A) చిత్తరువు
(B) బొమ్మ
(C) స్నేహము
(D) భావన
జవాబు.
(A) చిత్తరువు
V. వ్యాకరణం:
17. ఏమి + అంటివి – కలిపి రాస్తే
(A) ఏమి అంటివి
(B) ఏమంటివి
(C) ఏమని అంటివి
(D) ఏమనకుంటివి
జవాబు.
(B) ఏమంటివి
18. మనిషికి + ఉన్న – కలిపి రాస్తే
(A) మనిషికున్న
(B) మనిషికన్న
(C) మనిషన్న
(D) మనిషికెన్న
జవాబు.
(A) మనిషికున్న
19. మీరెక్కడికి – విడదీస్తే
(A) మీరు + ఎక్కడికి
(B) మీరా + ఎక్కడికి
(C) మీరు + అక్కడికి
(D) మీరు + ఇక్కడికి
జవాబు.
(A) మీరు + ఎక్కడికి
20. సమూహమేది – విడదీస్తే ఏర్పడే రూపం
(A) సమూహము + మేది
(B) సమూహము + ఆది
(C) సమూహము + ఏది
(D) సమూహమా + ఇది
జవాబు.
(C) సమూహము + ఏది
21. ‘పనిపాటలు’ సమాసానికి విగ్రహ వాక్యం
(A) పనియొక్క పాటలు
(B) పనుల్లో పాటలు
(C) పని వలన పాటలు
(D) పని మరియు పాట
జవాబు.
(D) పని మరియు పాట
22. కోటి సంఖ్య గల విద్యలు – సమాసంగా మారిస్తే
(A) కోటి సంఖ్యల విద్యలు
(B) కోట్ల కొలది విద్యలు
(C) కోటి విద్యలు
(D) కోటి యొక్క విద్యలు
జవాబు.
(C) కోటి విద్యలు
23. ‘చీమల యొక్క బారు’ విగ్రహవాక్యం సమాసం చేస్తే
(A) చీమబారు
(B) చీమలబారు
(C) చీమల సమూహం బారు
(D) చీమల సాంబారు
జవాబు.
(B) చీమలబారు
VI. క్రింది పద్యమును చదివి బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టదా ? గిట్టదా?
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు :
24. ఎవరి మీద దయగలిగి వుండాలి ?
(A) అక్కా చెల్లెళ్లు
(B) తల్లిదండ్రులు
(C) గురువులు
(D) అన్నదమ్ములు
జవాబు.
(B) తల్లిదండ్రులు
25. చెదలు ఎక్కడ పుట్టి గిట్టుతుంది ?
(A) గుట్ట
(B) తట్ట
(C) పుట్ట
(D) చెట్టు
జవాబు.
(C) పుట్ట
26. కవి దయలేని పుత్రుని దేనితో పోల్చాడు ?
(A) గిత్తలు
(B) జంతువులు
(C) పశువులు
(D) చెదలు
జవాబు.
(D) చెదలు
27. ఈ పద్యాన్ని రాసిన కవి పేరు ఏమిటి ?
(A) ధూర్జటి
(B) వేమన
(C) బద్దెన
(D) రామదాసు
జవాబు.
(B) వేమన
28. ఈ పద్యానికి మకుటం ఏమిటి ?
(A) వేమన
(B) సుమతి
(C) భాస్కరా
(D) విశ్వదాభిరామ వినురవేమ
జవాబు.
(D) విశ్వదాభిరామ వినురవేమ
VII. క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గురువు లేక విద్య గురుతుగా దొరకదు
నృపతి లేక భూమి నియతిగాదు
గురువు విద్య లేక గొప్ప పండితుడౌనే
విశ్వదాభిరామ వినురవేమ!
29. విద్య బాగా రావాలంటే ఎవరు ఉండాలి ?
జవాబు.
విద్య బాగా రావాలంటే గురువు ఉండాలి.
30. ఎవరు లేకుంటే ప్రజలకు క్రమశిక్షణ ఉండదు ?
జవాబు.
రాజు లేకుంటే ప్రజలకు క్రమశిక్షణ ఉండదు.
31. ‘నృపతి’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
నృపతి అంటే రాజు అని అర్థం
32. ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు ?
జవాబు.
ఈ పద్యాన్ని రాసిన కవి వేమన
33. గొప్ప పండితుడు కావాలంటే ఏమి చేయాలి ?
జవాబు.
గొప్ప పండితుడు కావాలంటే గురువు వద్ద విద్య అభ్యసించాలి.
VIII. క్రింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
పొదుపు మానవ జీవితానికి అత్యవసరం. పొదుపులేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు. పొదుపు చేయకుండా అడ్డుపడే వాటిల్లో అతిముఖ్యమైనవి కోరికలు. కోరికలు మానవుని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి. పొదుపు అనేక విషయాలలో పాటించవచ్చు. ధనం, జలం, భాషణం. మొదలగు వానిలో పొదుపు పాటించడం ద్వారా దేశాభివృద్ధిని సాధించగలం. పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయక తప్పదు. అప్పు చేయటం వలన మనం వ్యక్తిత్వాన్నే కోల్పోతాం.
1. పొదుపు లేని మానవుడు ఎటువంటివాడు ?
2. మానవ జీవితానికి అత్యవసరం ఏది ?
3. అప్పు చేయటం వల్ల మనం ఏం కోల్పోతాం ?
4. పొదుపు పాటించాల్సిన ముఖ్య విషయాలేవి ?
5. పొదుపు చేయకుండా అడ్డు పడేవి ఏవి ?
ఓ చిన్న చీమలారా
ఏ సీమకు మీరేగెద
రీతీరున బారుగట్టి ?
ఎక్కడికి, ఎక్కడికి ?
ఈ సమూహమెక్కడికి ?
కయ్యానిక, వియ్యానిక
అయ్యారే! మీరేగుట ?
అర్థాలు :
సీమ = గ్రామము/ప్రాంతము
ఏగెదరు = వెళ్ళెదరు
ఈ తీరున = ఈ విధంగా
బారుగట్టి = వరుసలుగట్టి
సమూహము = గుంపు
కయ్యానిక = తగాదాకా
వియ్యానిక = సంబంధం కలుపు కోవటానికా (పెండ్లికి)
అయ్యా రే! = ఎంత ఆశ్చర్యము
భావం : ఓహో! చిన్న చీమల్లారా! ఇంత చక్కగా వరుసకట్టి మీరు ఎక్కడికి పోతున్నారు ? కొట్లాటకి పోతున్నారా ? లేక పెండ్లికి పోతున్నారా ?
ఒకరి వెనుక ఒకరు మిగుల
ఓరిమితో పోయెదరు
ఎవరోయి మిము నడిపెడి
ఇంగితజ్ఞు లింతఘనులు
అర్థాలు :
మిగుల = మిక్కిలి
ఓరిమి = సహనముతో
ఇంగితజ్ఞులు = తెలివిగలవారు
ఘనులు = గొప్పవారు
భావం: ఒకరి వెంట ఒకరు వరుసగా చాలా ఓపికతో పోతున్నారు. ఇంత వరుసగా మిమ్మల్ని నడిపే తెలివిగల గొప్పవారు ఎవరో ?
యెవరో ఒక నేతలేక
ఇంత కట్టు దిట్టముగా
మనుషులమే నడువలేము
మరి మీ పోకడ చిత్రము
అర్థాలు :
నేత = నాయకుడు
పోకడ = పద్ధతి
చిత్రము = ఆశ్చర్యము
భావం : ఎవరో ఒక నాయకుడు లేకపోతే మనుషులమైన మేమే ఇంత సమర్థంగా నడువలేము. అట్లాంటిది మీరు ఇంత చక్కగ, క్రమశిక్షణతో నడుచుకుంటూ పోయే విధానం చాలా చిత్రంగా ఉన్నది. (కవి ఇందులో చీమల నడతను అద్భుతంగా వర్ణించాడు)
పనిపాటలు లేక మీరు
ప్రాలుమాలి తిరగరహో !
యెక్కడికి ఈ ధాన్యము ?
యెవరిళ్ళకు ఈ యెగుమతి ?
అర్థాలు:
ప్రాలుమాలి = అనవసరంగా
భావం : పనీ పాటలు లేకుండా సోమరితనంతో మీరెప్పుడూ తిరుగరు. ఈ ధాన్యమంతా ఎక్కడికి తీసుకొని పోతున్నారు ? ఎవరిండ్లకు ఎగుమతి చేస్తున్నారు ?
మడిమాన్యము లేదు మీకు
మరి ధాన్యము సమకూర్తురు
కళ్ళముకొక గింజయైన
కావే కొల్లలు కొల్లలు.
అర్థాలు :
మడిమాన్యాలు = పంట చేలు
సమకూర్తురు = సంపాదిస్తారు
కళ్ళము = ధాన్యపు రాశి
కొల్లలు = ఎక్కువ
భావం : పంటలు పండించే భూములా మీకు లేవు. ఐనా మీరు ధాన్యం సమకూరుస్తారు. కళ్ళానికి ఒక గింజ ఏరుకున్నా అవే మీకు అనేక గింజలవుతాయి.
ఏయే పొలములు తిరిగి
ఈ ధాన్యము గూర్చితిరి
యెవడు చూపి కడుదుర్గమ
మైన బ్రతుకు బాట మీకు ?
అర్థాలు :
పొలములు = చేలు
కూర్చితిరి = ప్రోగు చేశారు
కడు = మిక్కిలి
దుర్గమము = కష్టమైన
బతుకు బాట = జీవన మార్గము
భావం : పొలాలన్నీ తిరిగి తిరిగి మీరు ఈ ధాన్యపు గింజలు సంపాదిస్తారు. ఇట్లాంటి కష్టమైన బతుకుబాట మీకు ఎవరు నేర్పారు. (చీమలు ధాన్యాన్ని పొదుపు చేసి భద్రపరుస్తాయి. ఇటువంటి గుణాన్ని మానవులూ నేర్చుకోవాలని కవి భావన)
ఈ వివేక మీ పొదవు
యెటనేర్చితిరో కాని
ఈ శిక్షణ మనిషికున్న
ఇక లేములు యెక్కడివి ?
అర్థాలు:
వివేకము = తెలివితేటలు
పొదువు = పొదుపు
ఎట = ఎక్కడ
నేర్చితిరో = నేర్చుకున్నారో
శిక్షణ = నేర్పరితనం
లేములు = కష్టాలు
భావం : ఈ తెలివితేటలు, ఈ పొదుపు మీకు ఎవరు నేర్పారోగాని ఇట్లాంటి క్రమశిక్షణ మనిషికి గనుక ఉంటే దారిద్య్రం అసలే ఉండదుకదా!
యెవరివద్ద చదవకనె
ఈ విద్దెటు నేర్చితిరి
కోటివిద్యలైన తుదకు
కూటికె కద మాకైనను.
అర్థాలు :
విద్దె = విద్య
తుదకు = చివరికి
కూటికి = తిండికి
భావం : ఎక్కడా చదవకుండానే ఈ విద్య మీరెట్లా నేర్చారు? మేమెన్ని చదువులు చదివినా ఆ చదువులన్నీ ఈ కూటి కోసమే కదా!
యేమేమొ నేర్వదలచి
యెటకెటకో పోయెదము
కండ్లముందు యెపుడు తిరుగు
ఘనుల కానలేము గదా!
అర్థాలు :
ఎటకెటకో = ఎక్కడికెక్కడికో
యేమేమొ నేర్వదలచి = ఎన్నో విషయాలు నేర్చుకోవాలని
యెపుడు = ఎప్పుడు
ఘనులు = గొప్పవారిని
కానలేము = చూడలేము
భావం : ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో పోతాము. కాని కండ్లముందు తిరిగే మీవంటి గొప్పవారిని చూసి నేర్చుకోం కదా! (అంటే మనం చీమలని తేలిగ్గా తీసుకుంటాం. కాని చీమలనుంచి మనం నేర్చుకునేది చాలా ఉందని కవి భావన.)
పాఠం ఉద్దేశం:
మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠ్యభాగం ‘గేయ కవిత’ అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన ‘ఆత్మవేదన’ కవితాసంపుటి లోనిది.
కవి పరిచయం:
కవి : పొట్లపల్లి రామారావు
కాలం : 1917-2001
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు.
రచనలు : ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం (ఖండికలు), పగ మున్నగు రచనలు చేశాడు.
విశేషాలు : ఈయన రచన వాడుక భాషలో, సరళమైన శబ్దాలతో, సుందరమైన శైలితో సాగింది.
ప్రవేశిక:
సృష్టిలోని ప్రాణులు విలక్షణమైన నైపుణ్యాలను కలిగి ఉంటాయి. కొన్ని వేగంగా పరుగెత్తుతాయి. కొన్ని ఆకాశంలో ఎగురుతాయి. కొన్ని పాడుతాయి. కొన్ని నాట్యం చేస్తాయి. కొన్ని నివాసాలు ఏర్పరచుకోవడంలో, ఆహారం సేకరించుకోవడంలో ప్రత్యేకతలను కనబరుస్తాయి. ఏ ప్రాణి కూడ సోమరితనంతో ఉండదు. నిశితంగా పరిశీలిస్తే మనిషి వాటినుండి నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో కనిపిస్తాయి. చిన్న ప్రాణులైనా చీమలు ఎంత కష్టపడుతాయో, ఎంత క్రమశిక్షణతో మెలగుతాయో తెలుసుకోవడానికి ఈ పాఠం చదవండి.
నేనివి చేయగలనా ?
- చీమలబారు కవిత రాయడంలో కవి ఉద్దేశం చెప్పగలను. అవును / కాదు
- వచనకవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయగలను. అవును/ కాదు
- కవితా సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. అవును/ కాదు
- పాఠం ఆధారం చేసుకొని గేయాన్ని రాయగలను. అవును/ కాదు