శతకసుధ TS 6th Class Telugu 5th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్నలు
ప్రశ్న 1.
ఈ బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.
ఈ బొమ్మలో గురువు, నలుగురు శిష్యులు ఉన్నారు.
ప్రశ్న 2.
గురువుగారు ఏం చెప్తున్నారు ?
జవాబు. గురువుగారు పద్యాలు చెప్తున్నారు.
ప్రశ్న 3.
మీకు తెలిసిన ఒక పద్యం చెప్పండి.
జవాబు.
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 46)
ప్రశ్న 1.
ఇతరులు తనను పొగిడితే పొంగి పోకుండా ఉండాలని కవి అన్నాడు కదా! అట్లా ఎందుకన్నాడో చెప్పండి.
జవాబు.
ఎవరైనా పొగిడితే పొంగి పోకూడదు. పొగడ్త గర్వం పెంచుతుంది. గర్వం వలన మనిషి నష్టపోతాడు. అందుకే ఇతరులు
పొగిడితే పొంగిపోకూడదు.
ప్రశ్న 2.
నూర్గురు కొడుకులున్న ధృతరాష్ట్రునికి మేలు జరుగలేదు. అదెట్లాగో చెప్పండి.
జవాబు.
పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని, ముసలితనంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటాడని నమ్మకం. కాని ధృతరాష్ట్రుని నూరుమంది కొడుకులు ధృతరాష్ట్రుని కళ్ళముందే యుద్ధంలో చనిపోయారు. చెడు మార్గంలో వెళ్ళి బతికి ఉన్నంత కాలం ధృతరాష్ట్రునికి క్షోభ మిగిల్చారు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 47)
ప్రశ్న 1.
చేసిన మేలును చెప్పుకోవద్దని కవి ఎందుకు అని ఉండవచ్చు ?
జవాబు.
చేసిన మేలును చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటే వారిని ఎవరూ మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకుంటున్నారని చులకనగా చూస్తారు. అందుకే చేసిన మేలు చెప్పుకోవద్దని కవి అంటున్నాడు.
ప్రశ్న 2.
వాదములాడవద్దని కవి అన్నాడు కదా! వాదము లాడడంవల్ల కలిగే పరిణామాలు ఎట్లా ఉంటాయి?
జవాబు.
వాదనలు అంటే తగాదా, పోట్లాట, కలహము. వాదము వల్ల నలుగురిలో చులకన అవుతాము. వాదము వల్ల ఒకరంటే మరొకరికి కోపం, అసహ్యం పెరుగుతాయి. కక్షలు పెరుగుతాయి. దీనివల్ల శత్రుత్వము, అసూయ పెరుగుతాయి. వాదము వల్ల అన్నీ నష్టాలే.
ప్రశ్న 3.
కడుపునిండ విషమున్నవాడు కాలనాగుకన్న ప్రమాదకరమని కవి అన్నాడు కదా! అది ఎట్లో చెప్పండి.
జవాబు.
కాలనాగుకు కోరల్లోనే విషముంటుంది. ఒకసారి కాటువేశాక, మళ్ళీ విషం తయారవడానికి చాలా రోజులు పడుతుంది. కడుపునిండ విషమున్నవాడు ఎల్లప్పుడు ఆపదలు తెచ్చిపెడుతూనే ఉంటాడు. అందువల్ల కాలనాగుకన్నా కడుపునిండ విషమున్నవాడు ప్రమాదకారి.
ప్రశ్న 4.
‘మానవుడే మాధవుడని భావించి ప్రజలసేవ చేయాలి’ అట్లా చేసి గొప్పపేరు తెచ్చుకున్న కొందరి గురించి చెప్పండి.
జవాబు.
మహాత్మాగాంధి మానవుడే మాధవుడని, ఆపదలో ఉన్నవారికి సేవచేస్తే భగవంతుడు సంతోషిస్తాడని నమ్మినవాడు. అలాగే మానవులకు సేవ చేసేవాడు. అలాగే మదర్ థెరిసా అనాథలకు, దీనులకు, వృద్ధులకు ఎంతో సేవచేసింది. వారికోసం అనేక ఆశ్రమాలు స్థాపించింది. బాబా ఆమ్టే కూడా నిస్వార్థంగా పేదలకు సేవ చేస్తున్నారు.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. శతకపద్యాలు చదివారుకదా! వీటి గొప్పతనం గురించి చెప్పండి.
జవాబు.
శతక పద్యాలలో చక్కని నీతులు బోధించబడ్డాయి. పరస్త్రీలను అక్కచెల్లెళ్ళలా భావించాలి. అందరికీ మేలు చెయ్యాలి. ఇతరుల సొమ్ముకు ఆశపడరాదు. పొగడ్తలైనా తిట్లైనా దేనికీ ఆవేశపడకూడదు. జీవితం మీద మోహం పనికిరాదు. కొడుకుల కోసం ఏడవటం కాదు. మంచిపనులు చేయాలి. అప్పుడే మోక్షం వస్తుంది అని ఒక పద్యం చెబుతుంది. ఎవరికైనా మేలు చేస్తే గొప్పలు చెప్పుకోకూడదు. ఎవరితో తగువులాడకూడదు. మంచివారిని సేవించాలి. తోడి మానవులకు సహాయపడాలి. మానవత్వం అన్నిటికంటె గొప్పగుణం. పైకి మంచిగా మాట్లాడుతూ వెనుకనుంచి కీడు చేసేవాడు పాముకంటె ప్రమాదకరమైనవాడు అని ఒక నీతి పద్యం చెబుతుంది.
తప్పుచేసినప్పుడు ఒప్పుకున్నవాడు గొప్పవాడు. తప్పును కప్పిపుచ్చేవాడు పాపాత్ముడు. నీటిబొట్టు కాలే పెనం మీద ఆవిరైనట్లే నీచుని స్నేహంతో మనం నశించిపోతాము. తామరాకుమీద నీటిబొట్టు మెరిసినట్లు మధ్యములతో స్నేహం కొంతవరకు మేలుచేస్తుంది. ముత్యపుచిప్పలో పడ్డ నీటి బొట్టు మంచి ముత్యంగా మారినట్లు గొప్పవారితో స్నేహం చేస్తే మనమూ గొప్పవారమౌతాము అని స్నేహం గొప్పదనంను ఒక పద్యం చెబుతుంది.
పైన చెప్పినవన్నీ మనకెప్పుడూ ఉపయోగపడే విషయాలే. అలా చెప్పటమే శతక పద్యాల గొప్పతనం.
2. ఒకరు పద్యం చదవండి. మరొకరు భావం చెప్పండి.
జవాబు.
ఇది విద్యార్థుల పని.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
1. కింది భావాలకు సరిపోయిన పద్యపాదాలను పాఠం నుండి వెతికి రాయండి.
అ. మనిషే భగవంతుడు అని తెలుసుకొని సేవ చేయాలి.
జవాబు.
“మానవుడె మాధవుండను
జ్ఞానంబున ప్రజలసేవ సలుపుము”
ఆ. తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు.
జవాబు.
“తప్పును, కప్పిపుచ్చువారు కలుష మతులు”
ఇ. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే.
జవాబు.
“గొప్పలు చెప్పిన నదియును తప్పే”
ఈ. మంచివారికి సేవ చేయాలి.
జవాబు.
“సాధుల గనుగొన్న సేవ సల్పుము
2. కింది పద్యాన్ని చదువండి.
పుత్తడి గలవాని పుండు బాధైనను
వసుధలోన చాల వార్తకెక్కు
పేదవాని యింట పెండైన యెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!
పై పద్యం ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి.
అ. పుత్తడిగలవాడంటే ఇనుము గలవాడు.
జవాబు.
(తప్పు)
ఆ. వార్తకెక్కు అంటే వార్తల్లోకి రావడం.
జవాబు.
(ఒప్పు)
ఇ. పేదవాడి ఇంట్లో పెండ్లి జరిగినా ఎవరికీ తెలియదు.
జవాబు.
(ఒప్పు)
ఈ. శ్రీమంతులు ఏదిచేసినా అది వార్త అవుతుంది.
జవాబు.
(ఒప్పు)
3. కింది వాక్యాలు చదువండి. మీరు చేసే పనులకు సంబంధించి సరైన జవాబును (✓) తో గుర్తించండి.
అ. నేను తప్పుచేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోను.
జవాబు.
అవును
ఆ. ఇతరులకు మేలుచేసి, ఆ గొప్పలు చెప్పుకోను.
జవాబు.
అవును
ఇ. నాకు అందరు మంచివాళ్ళుగానే కనిపిస్తారు.
జవాబు.
అవును
ఈ. నేను ఎవరితోనూ వాదాలు పెట్టుకోను.
జవాబు.
అవును
ఉ. నేను మంచివాళ్ళతో స్నేహం చేస్తాను.
జవాబు.
అవును
ఊ. ఇతరుల మధ్య గొడవలు పెట్టను. ఋ.ఇతరులకు ఏదైనా అవసరముంటే ఇస్తాను.
జవాబు.
అవును
ౠ.ఇతరులు నాపై కోపించినా నేను వారిపై కోపించను.
జవాబు.
అవును
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. మనం ఇతరులకు మేలు చెయ్యాలి. ఎందుకు ?
జవాబు.
మనం ఇతరులకు మేలుచేసినందువల్ల ఆ మేలు పొందినవారు ఎంతో సంతోషిస్తారు. ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటారు. మనకు కూడా ఎంతో గొప్ప పని చేశామన్న ఆనందం కలుగుతుంది. సంతృప్తి కలుగుతుంది. మనమీద మనకు విశ్వాసం పెరుగుతుంది. పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నామన్న తృప్తి మిగులుతుంది. అందుకే ఇతరులకు మేలు చెయ్యాలి. మానవజన్మకు అర్థమే ఇతరులకు మేలు చేయడం.
ఆ. మంచివారితో స్నేహం చేస్తే మనకూ మంచి గుణాలు అలవడుతాయి. ఎట్లాగో వివరించండి.
జవాబు.
నీటిబొట్టు కాలుతున్న పెనం మీదపడితే ఆవిరై పోతుంది. నీచులతో స్నేహం చేసేవారు కూడా తమ ఉనికి మంచి గుణాలను కోల్పోయి నీచుల్లాగే తయారౌతారు. నీటిబొట్టు తామరాకు మీద నిలిచినంతసేపూ ముత్యంలాగే మెరుస్తుంది. మధ్యములతో స్నేహం చేస్తే అలాగే కొంతవరకు మేలు జరుగుతుంది. కాని అదే నీటిబొట్టు ముత్యపుచిప్పలో పడితే మణిగా మారుతుంది. మంచివారితో స్నేహం ఇలాంటిదే. మనలో ఉన్న లోపాలు కూడా తొలగిపోయి గొప్పవారమౌతాము. గొప్ప గుణాలు అలవడతాయి.
ఇ. “గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే” అని తెలుసుకున్నారు కదా. దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు.
గొప్ప పనులు చెయ్యాలి. గొప్పవాళ్ళం కావాలి. ఆ గొప్పతనాన్ని ఇతరులు గుర్తించి మెచ్చుకోవాలి. అంతేగాని మనగొప్ప మనమే చెప్పుకుంటే వెటకారం చేస్తారు. చులకనగా చూస్తారు. అందుకే గొప్పలు చెప్పుకోకూడదు. అరిచే కుక్క కరవదు. కరిచే కుక్క మొరగదు అని మనకొక సామెత ఉంది. గొప్పలు చెప్పుకొనేవాళ్ళు చేసేది తక్కువ. కాని చేసే వారు ఎప్పుడూ ప్రచారం కోసం చూడరు. గొప్పలు చెప్పుకోరు.
ఈ. అనవసర వాదాలకు ఎందుకు పోవద్దు ?
జవాబు.
అనవసర వాదాలకు పోకూడదు. అందరూ స్నేహంగా ఒకతాటిమీద నడుస్తుంటే వాదులాడుతూ ఉంటే మాట మాట పెరిగిపోయి ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఓర్పు నశించిపోతుంది. ప్రశాంతత కోల్పోతాము. మనసు బాధపడుతుంది. సమయం వృథా అవుతుంది. మనసు కక్షతో నిండిపోయి, మంచి ఆలోచనలు రాకుండా చేస్తుంది. పనులు చెడిపోతాయి. అందుకే అనవసర వాదాలకు పోవద్దు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ. శతక కవుల వల్ల సమాజానికి ఎట్లాంటి మేలు చేకూరుతుంది ?
(లేదా)
ఆ. శతక పద్యాల వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి.
(లేదా)
శతక పద్యాల వల్ల మనుషుల్లో మంచితనం అలవడుతుంది. సమర్థించండి.
జవాబు.
1. శతక కవులు : శతక కవులు శతకాలు రాస్తారు. వాటిలో ముఖ్యంగా నీతి శతకాలు, భక్తి శతకాలు ఎక్కువగా ఉంటాయి. ఆ శతకాలలో ఆయా కవుల కాలానికి చెందిన ఆహార విహారాలు, ఆచారాలు, నియమాలు, సాంఘిక విషయాలు ఎన్నో ఉంటాయి.
2. పెరిగే భక్తి, సంస్కారాలు: కాబట్టి శతకాలు నేర్చుకోవడం వల్ల దైవభక్తి పెరుగుతుంది. చక్కని సంస్కారం, ఉత్తమమైన ఆచారం కలిగి ఉంటారు.
3. నీతి శతకాలు : నీతి శతకాలు చదవడం వల్ల ప్రవర్తనను సరిచేసుకోగలుగుతారు. వాటిని ఆచరిస్తూ అందరిలో మంచిపేరు తెచ్చుకోగలుగుతారు. జీవితంలో ప్రగతి సాధించగలుగుతారు.
4. సమాజాన్ని ప్రశ్నించడం: సమాజంలోని మూఢాచారాలను, గుడ్డి నమ్మకాలను ప్రశ్నించి వాటిని దూరం చేయడానికి శతక కవులు ప్రయత్నిస్తారు. తాము చైతన్యం పొంది సమాజాన్ని చైతన్యవంతం చేస్తారు.
ఇలా శతకాలవల్ల, శతక కవులవల్ల సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. శతక పద్యాల ఆధారంగా మనం చేయకూడనివి, చేయవలసినవి పట్టిక తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు.
మనం చేయకూడనివి :
- ఇతరుల సంపదలను కోరుకో గూడదు.
- కొడుకుల కోసం వెంపర్లాడ కూడదు.
- జరిగిన మేలుకు కృతజ్ఞతతో ఉండాలి.
- తనను గురించి తాను గొప్పలు చెప్పుకోకూడదు.
- నీచులతో స్నేహం చెయ్యకూడదు.
- వాదాలు పెట్టుకోకూడదు.
- భేదాలు ఎంచకూడదు.
- చేసిన తప్పును దాచకూడదు.
మనం చేయవలసినవి :
- పరాయి స్త్రీలను సోదరీభావంతో చూడాలి.
- ఉత్తములతో స్నేహం చేయాలి.
- సాధువులెదురైతే సేవించాలి.
- మానవుడే మాధవుడని తెలిసికొని ప్రజాసేవ చేయాలి.
- చేసిన తప్పును ఒప్పు కోవాలి.
V. పదజాల వినియోగం
1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
ఉదా: మోదం : మానవునికి మోదమే బలాన్ని కలిగిస్తుంది.
అ) హితం = మంచి
జవాబు.
మనం అందరి హితం కోరాలి.
ఆ) హర్షించుట = మెచ్చుకొనుట
జవాబు.
మంచి పనులను హర్షించుట మంచి అలవాటు.
ఇ) మోదం = సంతోషం
జవాబు.
పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మోదం కలిగించాలి.
ఈ) పరధనం = ఇతరుల సొమ్ము
జవాబు.
రధనం కోరుకోవడం దురాశ.
ఉ) దుర్గతి = చెడుగతి
జవాబు.
దుర్మార్గాలు చేసేవారు దుర్గతి పాలౌతారు.
ఊ) మేలు = మంచి
జవాబు.
మనకు మేలు చేసినవారికి కీడు చేయరాదు.
ఋ) ప్రజలసేవ = ప్రజలకు సహకారం
జవాబు.
నాయకులు ప్రజలసేవ చేస్తామని వాగ్దానాలు చేస్తారు.
2. జట్టుపని : పద్యాల్లోని పదాల్లో ఏయే పదాలు పుస్తకం చివరి అకారాది పట్టికలో ఉన్నాయో చూసి వాటి కింద గీత గీయండి. అర్థాలు రాయండి.
జవాబు.
ఎగడక = పొంగిపోకుండా
నళినీదళం = తామరాకు
పరముడు = ఉన్నతుడు
మనీషి = బుద్ధిమంతుడు
మాన్య = గొప్పదైన
మాధవుడు = విష్ణువు
మోదము = సంతోషం
శుక్తి = ముత్యపుచిప్ప
సాధువు = మంచివాడు
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది పేరాలో విభక్తి ప్రత్యయాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.
బతుకమ్మను పూజించడమంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలువడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మపాటలు అనుబంధాలకు నిలయాలు. చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక, వర్తమాన సంఘటన లుంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ! బతుకమ్మ! సంపదను ఇవ్వమ్మ! అంటూ పూజలు చేస్తారు. ఆ పూజల వల్ల ఫలితాన్ని పొందుతారు.
పదం – విభక్తి ప్రత్యయం – విభక్తి పేరు
ఉదా : బతుకును = ను – ద్వితీయా విభక్తి
అ. ప్రకృతిని = ని – ద్వితీయా విభక్తి
ఆ. పండుగలో = లో – షష్ఠీ విభక్తి
ఇ. పాటలు = లు – ప్రథమా విభక్తి
ఈ. చేతులతో = తో – తృతీయా
ఉ. పాటలందు = అందు – సప్తమీ విభక్తి
ఊ. విభక్తి పూజలవల్ల = వల్ల – పంచమీ విభక్తి
2. కింది ఖాళీలను సరియైన విభక్తి ప్రత్యయాలతో పూరించి అవి ఏ విభక్తులో రాయండి.
ఉదా : చెరువు నందు నీరు నిండుగా ఉన్నది. (సప్తమీ విభక్తి)
అ. చదువునకు మూలం శ్రద్ధయే.
(షష్ఠీ విభక్తి)
ఆ. చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు.
జవాబు.
(ద్వితీయా విభక్తి)
ఇ. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు.
జవాబు.
(పంచమీ విభక్తి)
ఈ. ఘటమునందు నీరు నిండుగా ఉన్నది.
జవాబు.
(షష్ఠీ విభక్తి)
ఉ. దేశభక్తులు దేశం కొరకు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు.
జవాబు.
(చతుర్థీ విభక్తి)
ఊ. హింసతో వల్ల దేనినీ సాధించలేం.
జవాబు.
(పంచమీ విభక్తి)
ఋ. అతడు కుంచెతో చిత్రాలు గీశాడు.
జవాబు.
(తృతీయా విభక్తి)
ౠ. వాదాలు పెట్టుకోవడం వలన మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది.
జవాబు.
(పంచమీ విభక్తి)
ఎ. బాలికలు బహుమానాలు తీసుకోవడానికి వేదికపైకి ఎక్కారు.
జవాబు.
(ప్రథమా విభక్తి)
ఏ. రైతు నాగలితో పొలం దున్నుతాడు.
జవాబు.
(తృతీయా విభక్తి)
ఐ. చెరువులో బట్టలు ఉతుకొద్దు.
జవాబు.
(షష్ఠీ విభక్తి)
ఒ. పెద్దల మాటలను గౌరవించాలి.
జవాబు.
(ద్వితీయా విభక్తి)
ఓ. పసివాడు పాల కొరకు ఏడుస్తున్నాడు.
జవాబు.
(చతుర్థీ విభక్తి)
ఔ. బాలబాలికలు స్వయంకృషితో పైకి రావాలి.
జవాబు.
(తృతీయా విభక్తి)
క. సుస్మిత కంటే మానస తెలివైనది.
జవాబు.
(పంచమీ విభక్తి)
అవ్యయం
కింది తరగతులలో భాషాభాగాలలోని నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణాల గురించి తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ‘అవ్యయం’ అంటే ఏమిటో తెలుసుకుందాం.
కింది వాక్యాలను చదవండి.
నిదానమే ప్రధానం అట్లని సోమరితనం పనికిరాదు.
మనిషికి వినయం అలంకారం. అయితే అతివినయం పనికిరాదు.
ఆహా! ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో!
ఈ వాక్యాల్లో ఉన్న “అట్లని, అయితే, ఆహా!” మొదలైన పదాలను చూశారు కదా! అవి పుంలింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే వీటికి విభక్తులు లేవు. ఏకవచన, బహువచనమనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను ‘అవ్యయాలు’ అంటారు.
లింగ, వచన, విభక్తులు లేని పదాలు అవ్యయాలు
1. కింది వాక్యాల్లో ఉన్న అవ్యయ పదాల కింద గీతగీయండి.
అ. ‘ఆహా! ఆ బంగారు లేడి ఎంత బాగున్నది.’ అని సీత రాముడితో అన్నది.
ఆ. ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికిరాదు.
ఇ. ‘శభాష్’ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు.
ఈ. విజ్ఞానం మరియు వినోదం అందరికి అవసరం.
ఉ. అమ్మో! ఆ కుక్క కరుస్తుంది.
ఊ. ధనం సంపాదించాలి. అయితే అందులో కొంత దానం కూడా చేయాలి.
ప్రాజెక్టు పని
మీకు బాగా నచ్చిన శతకాల్లోని ఏవైనా 5 పద్యాలను సేకరించి, భావాలు రాయండి. నివేదిక రాసి చదివి వినిపించండి.
1. ప్రాజెక్టు శీర్షిక : బాగా నచ్చిన శతకాల్లోని 5 పద్యాలు సేకరించి, భావాలు రాయడం.
2. సమాచార సేకరణ :
అ) సమాచారం సేకరించిన తేది : x x x x x
ఆ) సమాచార వనరు : గ్రంథాలయం
ఇ) చదివిన శతకాలు : వేమన శతకం, సుమతీ శతకం, కుమార శతకం, తెలుగుబాల శతకం.
3. సేకరించిన విధానం : నేను మా పాఠశాల గ్రంథాలయంలో వేమన, సుమతి, కుమార, తెలుగుబాల శతకాలు తీసుకుని చదివాను. అందులో నాకు నచ్చిన ‘5’ పద్యాలు సేకరించాను.
4. నివేదిక
1. నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు
బైట కుక్కచేత భంగపడును
స్థాన బలిమికాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం : మొసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏనుగును కూడా బంధించగలదు. బైటికి వస్తే మాత్రం కుక్కకు కూడా భయపడుతుంది. ఎవరికైనా స్వస్థానంలో ఉన్నప్పుడు బలం పెరుగుతుంది. అంతేగాని అది తన గొప్ప తనమేమీ కాదు.
2. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం : పాడగాపాడగా రాగం బాగా వస్తుంది. తింటూ తింటూ ఉంటే వేపాకు కూడా తియ్యగా ఉంటుంది. అలాగే అభ్యాసం చేస్తే పనులు తేలికగా చెయ్యగలుగుతారు.
3. సదోష్ఠి సిరియునొసగును
సదోష్ఠియె కీర్తిపించు సంతుష్టియునా
సదోష్ఠియె యొనగూర్చును
సదోష్ఠియె పాపములను చరచు కుమారా!
భావం: మంచి వారితో స్నేహం సంపదనిస్తుంది. కీర్తి పెంచుతుంది. సంతృప్తి కలిగిస్తుంది. పాపాలను పోగొడుతుంది.
4. సిరితా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరితా పోయిన పోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
భావం : కొబ్బరికాయలోకి నీళ్ళెలా చేరుతాయో ఎవరికీ తెలియదు. అలాగే సంపద తనంత తానే వస్తుంది. ఏనుగు తిన్న వెలగ పండులో గుజ్జు మాయమైనట్లే సంపద కూడా తెలియకుండా హరించిపోతుంది.
5. దేశసేవ కంటె దేవతార్చన లేదు స్వార్థపరత కంటె చావు లేదు
సానుభూతి కంటె స్వర్గంబు లేదయా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
భావం: దేశానికి సేవ చేస్తే దేవుని పూజించినట్లే. స్వార్థపరుడు మృతునితో సమానం. ఇతరుల పట్ల సానుభూతి చూపినప్పుడు స్వర్గంలో ఉన్నంత ఆనందం కలుగుతుంది.
5. ముగింపు : శతక పద్యాలు మనకు ఎన్నో నీతులు బోధిస్తాయి. న్యాయం, ధర్మం, కరుణ, సత్యం వంటివి పాటించమని మనిషికి తెలుపుతాయి. శతకాలు మానవ జీవనానికి మార్గదర్శకాలు అని తెలుసుకున్నాను.
TS 6th Class Telugu 5th Lesson Important Questions శతకసుధ
ప్రశ్న 1.
కొడుకుల గురించి కవి ఏమన్నాడు? దూర్జటి ఉద్దేశం తెలపండి.
జవాబు.
పుత్రుడు అంటే పున్నామనరకం నుంచి రక్షించేవాడు. అందుకే ప్రతివారూ కొడుకులు కావాలని కోరుకుంటారు. కాని అది తెలివిలేనితనం. దుర్యోధనుడు మొదలైన నూరుమంది కొడుకులు పుట్టినా కౌరవరాజు ధృతరాష్ట్రునికి సుఖం లేదు. శుకమహర్షికి కొడుకులు లేరు. ఆయన గొప్పజ్ఞాని. ఆయన ఏమీ దుర్గతుల పాలు కాలేదు. అందుకే కొడుకుల కోసం బాధపడకూడదు అని కవి అన్నాడు.
ప్రశ్న 2.
ఉత్తము డెవరని సుమతీ శతక కారుడు వివరించాడు ?
జవాబు.
పరాయి స్త్రీలను తనకు అక్కగానో, చెల్లెలిగానో, తల్లిగానో భావించి వారిపట్ల గౌరవంగా ప్రవర్తించేవాడు, ఇతరుల సంపదలకోసం ఆశపడకుండా తనకున్న దానితో సంతృప్తిపడేవాడు, తనను ఇతరులు మెచ్చుకున్నప్పుడు గర్వంతో పొంగిపోకుండా ఉండేవాడు, ఇతరులు తనపై కోపగించుకొని తగువుకు వచ్చినా తాను మాత్రం శాంతంగా ఉండి సమస్యను పరిష్కరించేవాడు ఉత్తముడు అనిపించుకుంటాడు.
ప్రశ్న 3.
మీ శతక పద్యాలలో ఏదైనా ఒకదానికి సరిపోయే కథ/సంఘటన రాయండి.
(లేదా)
మీ శతక పద్యాలలో ఏదైనా ఒక దానికి సరిపోయే కథ రాయండి.
జవాబు.
మానవసేవే మాధవ సేవ:
ఒక ఊరిలో గొప్ప ధనవంతుడుండేవాడు. అతడు గొప్ప దైవభక్తి కలవాడు. పరోపకారశీలుడు. అతనికొక నియమం ఉంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు ఎంతమంది వచ్చినా వారందరికీ తాను స్వయంగా వడ్డిస్తూ అన్నదానం చేసేవాడు. ఒకనాడు దేవుడు అతని నిష్ఠను పరీక్షించాలని వచ్చాడు. అతని ఆనందానికి అంతులేదు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నేను అన్నదానం పూర్తికాగానే వచ్చి నీ సేవ చేసుకుంటాను స్వామీ అని అతిథుల వద్దకు వచ్చాడు.
అన్నదానమైపోయాక లోపల దేవుని ముందు చేతులు కట్టుకు నుంచున్నాడు. నీకు నాకంటే ఆ ప్రజలే ఎక్కువైనారా? అంత లెక్క చేయకుండా ఉన్నావు ? అని కోపగించాడు. దానికతడు “స్వామీ! నాకు వారందరిలోనూ నువ్వే కనిపిస్తున్నావు. అందుకే వారికి సేవచేస్తే నువ్వు సంతోషిస్తావని అలా చేశాను” అన్నాడు. భగవంతుడెంతో సంతోషించి ఇలాగే మానవసేవ చేస్తూ మాధవసేవగా భావిస్తూ కలకాలం సుఖశాంతులతో సమృద్ధిగా జీవించు అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు.
పర్యాయపదాలు
- నారి = వనిత, మహిళ, మగువ, తరుణి
- ధనము = డబ్బు, సంపద, సొమ్ము
- పరముడు = శ్రేష్ఠుడు, ఉన్నతుడు, ఉత్తముడు
- కొడుకులు = పుత్రులు, కుమారులు, తనయులు,
- మేలు = మంచి, హితము
- ప్రభ = కాంతి, వెలుగు
- మోదం = సంతోషం, ఆనందం
- సాధులు = సత్పురుషులు, మంచివారు
- సేవ = ఉపచారము, పరిచర్య
- నాగు = పాము, సర్పము
నానార్థాలు
- ఆశ = కోరిక, దిక్కు
- సాధువు = సజ్జనుడు, సవ్వడి
- గతి = దిక్కు మార్గము
- కలుషము = పాపము, మలినము
ప్రకృతులు – వికృతులు
ప్రకృతి – వికృతి
- విషము – విసము
- వంశము – వంగడము
- మౌక్తికం – ముత్యము, ముత్తెము
- ఆశ – ఆస
I. కింది పద్యాలను చదివి భావం రాయండి.
1. నొసట వెక్కిరించి నోట నవ్వును జూపి
కడుపునిండ విషము గలుగువాడు
కాలనాగు కన్న కడు ప్రమాదంబయా
బాలనారసింహ! భరత సింహ!
జవాబు.
బాలనారసింహా! భరతసింహా! నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్నవారు కాలనాగు (నల్లత్రాచు) కంటే ప్రమాదకరమైన వారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.
2. చెప్పకుచేసిన మేలు నొ
కప్పుడయినఁ గాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పేయని చిత్తమందు దలపు కుమారీ!
జవాబు.
ఓ కుమారీ! నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటికి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవ్వరూ మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో.
3. ఈ క్రింది పద్య పాదాలను సరిచేసి రాయండి.
1. కప్పి పుచ్చువారు కలుషమతులు
భరతవంశ తిలక! భవ్యచరిత!
ఒప్పుకొనెడివారు గొప్ప మనీషులు
తప్పు చేసికూడ తమదగు తప్పును.
జవాబు.
తప్పు చేసి కూడ తమదుగు తప్పును
కప్పిపుచ్చువారు కలుషమతులు
ఒప్పుకొనెడివారు గొప్పమనీషులు
భరతవంశ తిలక! భవ్యచరిత!
4. ఈ క్రింది పద్యాన్ని పూరించండి.
1. పరనారీ సోదరుడై ………….. సుమతీ!
జవాబు.
పరనారీ సోదరుడై
పరధనమున కాసపడక పరులకు హితుడై
పరులు దనుఁ బొగడ నెగడకం
బరులలిగిన నలుగనతడు పరముఁడు సుమతీ!
5. కింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి.
1. వాదంబులాడకెప్పుడు
మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్
భేదంబు సేయకెన్నడు
సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయా!
జవాబు.
అ) ఎవరి సేవ చేయాలి ?
ఆ) నిన్ను నీవు తెలుసుకొని ఎలా ఉండాలి ?
ఇ) ‘మోదము’ అనగా అర్థమేమి ?
ఈ) పై పద్యంలోని మకుటం ఏది ?
ఉ) ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు ?
పదజాలం :
II. కిందిపదాలతో సొంత వాక్యాలు రాయండి.
1. సోదరులు :
జవాబు.
నా సోదరులు చాలా మంచివారు
2. పరులు :
జవాబు.
పరులను హింసించకూడదు.
3. పరముడు :
జవాబు.
పరముడు అందరికీ మేలు చేస్తాడు.
4. భేదము :
జవాబు.
కులం మతం అనే భేదం ఉండకూడదు.
III. సమానమైన అర్థాన్నిచ్చే పదాలు
1. ‘మోదం’ అనే పదానికి సమానమైన అర్థాన్నిచ్చే పదాలు
a) సంతోషం, దుఃఖం
b) ఆనందం, విచారం
c) ఆనందం, సంతోషం
d) అందరు, ఆనందం
జవాబు.
c) ఆనందం, సంతోషం
2. ‘వెలుగు, ప్రభ’ అనే పదాలకు సమానమైన అర్థాన్నిచ్చే పదం
a) కాంతి
b) తెలుగు
c) కిరణం
d) ఇంద్రధనుస్సు
జవాబు.
a) కాంతి
3. తనయుని కోసం బడికి వెళ్ళాడు తండ్రి. అతని మరొక కుమారుడు, అన్న కొడుకు అక్కడే చదువుతున్నారు ఇందులోని పర్యాయపదాలు
a) తనయుడు, తండ్రి, కొడుకు
b) తనయుడు, కుమారుడు, అన్న
c) తండ్రి, అన్న
d) తనయుడు, కుమారుడు, కొడుకు
జవాబు.
d) తనయుడు, కుమారుడు, కొడుకు
4. సేవ, పరిచర్య అనే పదాలకు సమానార్థాన్నిచ్చే పదం
a) ఉపచారం
b) బాధ
c) స్నేహం
d) బంధం
జవాబు.
a) ఉపచారం
5. ‘నీవే నా ఆశ. నా ఆశ తీర్చు ప్రభూ ?’ ‘ఆశ’ అనే పదానికి వేర్వేరు అర్థాలు
a) దైవం, కోరిక
b) దిక్కు కోరిక
c) కోరిక, ప్రార్థన
d) ధనం, దైవం
జవాబు.
b) దిక్కు కోరిక
6. దేవా ! నాకు నీవే గతి. నాకు మంచి గతి చూపించు. గీతగీచిన పదానికి గల వేర్వేరు అర్థాలు
a) దిక్కు, దారి
b) ఆశ, భవిష్యత్తు
c) దైవం, ఆధారం
d) ఆనందం, ఆధారం
జవాబు.
a) దిక్కు, దారి
IV. వ్యాకరణం
1. డబ్బా ………… మిఠాయిలున్నాయి. ఖాళీలోని విభక్తి ప్రత్యయం
a) వద్ద
b) కింద
c) కు
d) లో
జవాబు.
d) లో
2. నాన్నగారు పనికి వెళ్ళే టైం అయింది. గీతగీచిన అక్షరం ఏ విభక్తి ప్రత్యయం ?
a) సప్తమి
b) షష్టి
c) ద్వితీయా
d) తృతీయా
జవాబు.
b) షష్టి
3. నా ………….. మీకు ఇబ్బంది కలిగితే క్షమించండి. ఖాళీలో పూరించదగిన విభక్తి ప్రత్యయం
a) యొక్క
b) కొరకు
c) వలన
d) పట్టి
జవాబు.
c) వలన
4. అతడు నా తో కలిసి వస్తాడు. గీతగీచిన పదంతో పాటు ఉండే ఇతర ప్రత్యయాలు
a) కూడా
b) వలన, కంటె
c) తోడ, చేత
d) కొరకు, కై
జవాబు.
c) తోడ, చేత
5. ‘ఆహా ! నాన్న తెచ్చిన బొమ్మ ఎంత బాగుందో’ – ఈ వాక్యంలోని అవ్యయం
a) నాన్న
b) తెచ్చిన
c) బొమ్మ
d) ఆహా!
జవాబు.
d) ఆహా!
6. లింగం, వచనం, విభక్తి ఉండని భాషాభాగం
a) నామవాచకం
b) అవ్యయం
c) క్రియ
d) విశేషణం
జవాబు.
b) అవ్యయం
7. ఒకరి తర్వాత ఇంకొకరు వెళ్ళండి. ఈ వాక్యంలోని అవ్యయం
a) ఒకరు
b) తర్వాత
c) వెళ్ళండి
d) ఇంకొకరు
జవాబు.
b) తర్వాత
8. తర్వాత, ఇట్లు, మరల, ఓహెూ, సరే, చూస్తా – వీటిలో అవ్యయం కానిది
a) తర్వాత
b) మరల
c) ఇట్లు
d) చూస్తా
జవాబు.
d) చూస్తా
9. నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణం తెలిపేది
a) అవ్యయం
b) విశేషణం
c) క్రియ
d) విభక్తి
జవాబు.
b) విశేషణం
10. కింది వానిలో అవ్యయం
a) అయ్యో
b) మనిషి
c) వచ్చి
d) కూర్చున్నాడు
జవాబు.
a) అయ్యో
పద్యాలు – ప్రతి పదార్ధాలు – తాత్పర్యాలు:
1వ పద్యం : (
కం. పరనారీ సోదరుడై
పరధనమున కాసపడక పరులకు హితుడై
పరులు దనుఁ బొగడ నెగడకఁ
బరులలిగిన నలుగనతడు పరముఁడు సుమతీ!
ప్రతి పదార్థం
సుమతీ = ఓ మంచి బుద్ధి కలవాడా!
పరనారీ = పరాయి స్త్రీలకు
సోదరుడు + ఐ = సోదరుడుగా ఉంటూ
పరధనమునకు = ఇతరుల సొమ్ముకు
ఆసపడక = ఆశించకుండా
పరులకు = ఇతరులకు
హితుడు + ఐ = మేలుచేసేవాడై
పరులు = ఇతరులు
తనున్ = తనను
పొగడ = మెచ్చుకుంటే
నెగడక = పొంగిపోకుండా
పరులు = ఇతరులు
అలిగినన్ = కోపగించినపుడు
అలుగని + అతడు = తాను కోపగించకుండా ఉండేవాడు
పరముడు = ఉత్తముడు
తాత్పర్యం :
మంచి బుద్ధి కలవాడా ! స్త్రీలకందరికీ సోదరునిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడవద్దు. ఇతరుల మేలు కోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి. ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు.
2వ పద్యం :
ఉ. కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్
వడిసెం బుత్రులులేని యాశుకునకుం బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా !
ప్రతి పదార్థం
శ్రీకాళహస్తి + ఈశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన శంకరా!
అవివేకుల్ = తెలివిలేనివారు
కొడుకుల్ = కొడుకులు
పుట్టరు + అటంచు= పుట్టలేదని
జీవన భ్రాంతులు + ఐ= బ్రతుకుమీద వ్యామోహం కలవారై
ఎడ్తురు = ఏడుస్తారు
కౌరవ + ఇంద్రునకు = కౌరవ రాజైన ధృతరాష్ట్రునికి
అనేకుల్ = లెక్కలేనంత మంది
కొడుకుల్ = కొడుకులు
పుట్టరు + ఎ = పుట్టలేదా ?
వారిచేన్ = వారివలన
ఏగతుల్ = ఏ ఉత్తమ లోకాలను
పడసెన్ = పొందగలిగాడు
పుత్రులు లేని = కుమారులు లేని
ఆ శుకునకున్ = ఆ శుక మహర్షికి
దుర్గతుల్ = చెడ్డగతులు
పాటిల్లెను + ఏ = కలిగాయా ?
అపుత్రకునకున్ = కుమారులు లేనివారికి
మోక్షపదంబు = మరుజన్మ లేకుండా మోక్షము పొందుట
చెడును + ఏ = తప్పి పోతుందా ? అలాజరుగదు)
తాత్పర్యం :
శ్రీకాళహస్తీశ్వరా! ‘నాకు కొడుకులు పుట్టలేదే’ అని తెలివిలేనివారు బాధపడుతుంటారు. ధృతరాష్ట్రునకు వందమంది కొడుకులున్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏ మేలూ జరుగలేదు. అదే శుకమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంతమాత్రాన ముక్తి లభించకపోవడం జరుగదు.
3వ పద్యం :
కం. చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయినఁగాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పేయని చిత్తమందు దలపు కుమారీ !
ప్రతి పదార్థం
కుమారీ = ఓ అమ్మాయీ!
ఒక + అప్పుడు = ఎప్పుడైనా ఒకసారి
అయినన్ + కాని = అయినా కూడా
చేసిన మేలు = నీవెవరికైనా మంచి చేస్తే
చెప్పకు = ఎవరితోనూ చెప్పొద్దు
దాని = అలా చెప్పినట్లైతే
హర్షింపరుగా = మెచ్చుకోరుగదా!
గొప్పలు చెప్పినన్ = నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకున్నా
అదియును = అలా చెప్పటం కూడ
తప్పు + ఏ + అని = పొరబాటే అని
చిత్తము + అందు = మనసులో
తలపు (ము) = ఆలోచన చేసుకో
తాత్పర్యం :
ఓ కుమారీ ! నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటికి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవ్వరూ మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో.
4వ పద్యం :
ఉ. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా
నీరమె శుక్తిలోఁ బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
పౌరుష వృత్తు లిట్లధము మధ్యము నుత్తము గొల్చువారికిన్
ప్రతి పదార్థం
నీర = నీరు
తప్త = బాగా కాలిన
లోహమున = ఇనుముపైన
నిల్చి = నిలబడి
అనామకము + ఐ = ఏమాత్రం కనబడకుండా
నశించున్
ఆ నీరము + ఎ = అదే నీరు
నళినీదళ = తామరాకు మీద
సంస్థితము + ఐ = నిలబడి
ముత్యము + అట్లు = ముత్యములాగా
తనర్చు = ప్రకాశిస్తుంది
ఆ నీరము + ఎ = ఆ నీటి బొట్టే
శుక్తిలోన్ + పడి = ముత్యపు చిప్పలో పడి
సమంచిత ప్రభన్ =చక్కని కాంతులుగల
మణిత్వమున్ + కాంచు= విలువైన మణిగా (మంచి ముత్యంగా) మారుతుంది
అధమున్ = నీచుని
మధ్యమున్ = మధ్యరకం వాడిని
ఉత్తమున్ = గొప్పవాడిని
కొల్చువారికిన్ = సేవించే వారికి
పౌరుష వృత్తులు = మనుషుల యొక్క ప్రవర్తనలు
ఇట్లు = ఇలాగే ఉంటాయి
తాత్పర్యం :
కాలిన ఇనుము మీద నీళ్ళు పడితే ఆవిరై పోతాయి. ఆ నీళ్లే తామరాకు మీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్లే ముత్యపు చిప్పలో పడితే మణులుగా (ముత్యాలుగా) మారుతాయి. మనిషి అధములతో చేరితే అధముడౌతాడు. మధ్యములతో చేరితే మధ్యముడౌతాడు. ఉత్తములతో చేరితే ఉత్తముడౌతాడు.
5వ పద్యం :
కం. వాదంబు లాడకెప్పుడు
మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్
భేదంబు సేయకెన్నడు
సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయా !
ప్రతిపదార్థం
తనయా = ఓ కుమారా!
ఎప్పుడు = ఎప్పుడూ కూడా
వాదంబులు +ఆడకు = అనవసరమైన వాదనలు చేయకు
నిన్ను నీవు = నిన్ను నువ్వు
మురిసి = పరిశీలించుకొని
ఇకన్ = ఇకపై
మోదంబున = ఆనందంగా
కనుము = చూసుకో
ఎన్నడు = ఎప్పుడూ కూడా
భేదంబు + సేయకు = భేద భావం చూపించొద్దు
సాధులన్ = మంచివారిని
కనుగొన్న = చూసినపుడు
సేవ సల్పుము = సేవ చేయుము
భావం : ఓ తనయా! ఎప్పుడూ అనవసరమైన వాదాలు చెయ్యకు. నిన్ను నీవు పరిశీలించుకొని సంతోషంగా ఉండు. ఎవరిపట్లా భేదభావం చూపకు. మంచివారికి సేవ చెయ్యి.
6వ పద్యం :
కం. మానవుడే మాధవుండను
జ్ఞానంబున ప్రజలసేవ సలుపు మదియె నీ
మానవతలోని మాన్య
స్థానంబనె గాంధీతాత సద్గుణజాతా!
ప్రతిపదార్థం
సద్గుణ జాతా = మంచి గుణములు కలవాడా!
గాంధి = గాంధీ తాత
మానవుడు + ఎ = మనిషియే
మాధవుండు+అను = భగవంతుడు అనే
జ్ఞానంబున = తెలివి
ప్రజల సేవ = ప్రజలకు సేవ
సలుపుము = చేయుము
అది + ఎ = అదే
నీ = నీ యొక్క
మానవతలోని = మానవత్వానికి
మాన్యస్థానము = గౌరవాన్ని కలిగించే విషయము
అనే = అన్నాడు.
భావం: ‘మంచిగుణాలు కలవాడా! మనిషే భగవంతుడు అనే ఆలోచనతో ప్రజలకు సేవ చెయ్యి. అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నతస్థానం’ అని గాంధీతాత చెప్పాడు. గమనించు.
7వ పద్యం :
కం. నొసట వెక్కిరించి నోట నవ్వును జూపి
కడుపునిండ విషము గలుగువాడు
కాలనాగుకన్న కడు ప్రమాదంబయా
బాలనారసింహ! భరతసింహ !
ప్రతిపదార్థం
భరత సింహ = భారతదేశంలో పుట్టిన సింహమా!
బాల నారసింహ = బాల నరసింహా!
నొసట = కనుబొమలతో
వెక్కిరించి = వెటకారం చేస్తూ
నోట = నోటితో
నవ్వును + చూపి = సంతోషాన్ని చూపించి
కడుపునిండ = పొట్టనిండా
విషము+కలుగువాడు = విషాన్ని ఉంచుకున్నవాడు
కాలనాగు కన్న = నల్లనాగు పాముకంటె
కడు = మిక్కిలి
ప్రమాదంబు+అయా = అపాయకరమైన వాడయ్యా!
భావం : బాలనారసింహా! భరతసింహా! నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్నవారు కాలనాగు (నల్లత్రాచు) కంటే ప్రమాదకరమైన వారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.
8వ పద్యం :
కం. తప్పుచేసికూడ తమదగు తప్పును
కప్పిపుచ్చువారు కలుషమతులు
ఒప్పుకొనెడివారు గొప్పమనీషులు
భరతవంశతిలక! భవ్యచరిత !
ప్రతిపదార్థం
భరత వంశ తిలక = భరత వంశంలో శ్రేష్ఠుడా!
భవ్య చరిత! = పవిత్రమైన నడవడి కలవాడా!
తప్పు చేసి కూడ = పొరపాటు చేసి కూడా
తమది + అగు = తాము చేసిన
తప్పును = పొరబాటును
కప్పిపుచ్చువారు = దాచిపెట్టేవారు
కలుషమతులు = దుర్మార్గులు
ఒప్పుకొనెడి వారు = తమ తప్పును ఒప్పుకొనే వారు
గొప్ప మనీషులు = గొప్ప బుద్ధిమంతులు
భావం : భరత వంశానికి తిలకం వంటివాడా! మంచి నడవడిక గలవాడా! తప్పుచేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు. తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు.
పాఠం ఉద్దేశం
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమపౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం “శతక ప్రక్రియ”కు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో వందకు పైగా పద్యాలు ఉంటాయి. శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీతాత, భరతసింహ, భవ్యచరిత శతకాల పద్యాలున్నాయి.
కవి పరిచయాలు
1. సుమతి శతకం – బద్దెన
జవాబు.
లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం) ఈయన సుమతీ శతకంతోపాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు.
2. శ్రీకాళహస్తీశ్వర శతకం – ధూర్జటి
జవాబు.
మహాకవి ధూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతోపాటు ‘శ్రీకాళహస్తి మహాత్మ్యము’ అనే ప్రబంధాన్ని రాశాడు. “అతులిత మాధురీమహిమ” కలిగినవాడని శ్రీకృష్ణ దేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు.
3. కుమారి శతకం – పక్కి వేంకట నరసింహకవి
జవాబు.
పక్కి వేంకట నరసింహకవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను | వేంకట నరసింహకవి సులభరీతిలో చెప్పాడు.
4. సుభాషిత రత్నావళి – ఏనుగు లక్ష్మణకవి
జవాబు.
సంస్కృతంలో భర్తృహరి రాసిన “సుభాషిత త్రిశతి”ని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణకవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామనివాసి. సుభాషిత రత్నావళితోపాటు రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యము మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన, రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి.
5. ప్రభుతనయ శతకం – కౌకుంట్ల నారాయణరావు
జవాబు.
కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయా ! అనే మకుటంతో ఈయన రాసిన ‘ప్రభుతనయ శతకం’ చాలా ప్రసిద్ధి చెందింది.
6. గాంధీతాత శతకం – శిరశినహల్ కృష్ణమాచార్యులు
జవాబు.
శిరశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా ‘మోర్తాడ్’లో జన్మించాడు. కోరుట్లలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రప్రబంధం అనే రచనలతోపాటు ‘రత్నమాల’ అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదు పొందాడు.
7. భరతసింహ శతకం – సూరోజు బాలనరసింహాచారి
జవాబు.
సూరోజు బాలనరసింహాచారి నల్లగొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితాకేతనం, బాలనృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. ‘సహజకవి’గా ప్రసిద్ధుడు.
8. భవ్యచరిత శతకం – డాక్టర్ టి.వి. నారాయణ
జవాబు.
డా|| టి.వి. నారాయణ హైద్రాబాద్ జిల్లాకు చెందినవాడు. 26-07-1925లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా అనేక సేవలందించాడు. జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం (కవితాసంపుటి) అమరవాక్సుధాస్రవంతి (ఉపనిషత్తులపై వ్యాససంపుటి) మొదలైనవి ఈయన రచనలు.
ప్రవేశిక:
జీవితంలో అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. అట్లా తెలుసుకున్న విషయాల్లో మంచివాటిని భవిష్యత్తు తరాలవారికి అందించాలని కొంతమంది మహాత్ములు కోరుకుంటారు. ఎంతో పెద్ద విషయాన్ని, కూడా కుదించి సులభంగా చెప్పగలిగే అవకాశం శతక పద్యాల్లో ఉంటుంది. శతకపద్యాల రూపంలో కవులు మనకు అందించిన మంచి విషయాలను ఈ పాఠంలో చదివి తెలుసుకుందాం.
నేనివి చేయగలనా?
- నాకు ఇష్టమైన కాలం గురించి చెప్పగలను. – అవును/ కాదు
- అపరిచితమైన కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయగలను. – అవును/ కాదు
- పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
- నాకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయగలను. – అవును/ కాదు