అభినందన TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్నలు
ప్రశ్న 1.
పై బొమ్మలో ఏం జరుగుతున్నది ?
జవాబు.
పై బొమ్మలో సైనిక దినోత్సవం సందర్భంగా పిల్లల ఊరేగింపు జరుగుతోంది.
ప్రశ్న 2.
పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు ?
జవాబు.
జై జవాన్, సైనికులకు వందనం, వీరులకు వందనం అంటూ పిల్లలు నినాదాలు ఇస్తున్నారు.
ప్రశ్న 3.
జై జవాన్! అని ఎందుకంటున్నారు ?
జవాబు.
జవాన్ అంటే సైనికుడు. సైనికులు ప్రతి నిమిషం దేశాన్ని శత్రువుల నుండి రక్షిస్తూ ఉంటారు అందుకే సైనికులకు జయం కలగాలి అనే అర్థం వచ్చేలా జై జవాన్ అని అంటున్నారు.
ప్రశ్న 4.
జవాను దేశానికి సేవ చేస్తాడు కదా! ఇతనివలె దేశం కోసం పాటుపడేవాళ్ళు ఎవరు ?
జవాబు.
జవానుల వలె పోలీసులు కూడా దేశ సేవ చేస్తారు. ఇలాగే రైతులు వ్యవసాయంచేసి ప్రజలకు అన్నసేవ చేస్తున్నారు. ఇంకా వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు దేశానికి సేవ చేస్తున్నారు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.4)
ప్రశ్న 1.
రైతులను “శ్రమ దాచని హాలికులని” ఎందుకన్నారు ?
జవాబు.
రైతులు శ్రమదాచని హాలికులు. ఎందుకంటే ఏడాది పొడవునా కష్టపడి పొలంలో పనిచేస్తారు. తమ నెత్తురును చెమటలాగా ధారపోస్తూ కాయకష్టం చేసి బంగారు పంటలు పండిస్తాడు.
ప్రశ్న 2.
“భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులు” అనే వాక్యం ద్వారా మీకేమర్థమయింది ?
జవాబు.
రైతులు, సైనికులు రాత్రింబవళ్ళు కష్టపడుతూ ప్రజాసేవ చేస్తున్నారు. రైతులు పంటలు పండించి ప్రజల ఆకలి తీర్చి దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తూ శత్రు సైనికుల నుండి దేశాన్ని రక్షిస్తున్నారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. అలా రైతులూ, సైనికులూ భరతమాత పురోగతికి మూల స్తంభాలైన వారు.
ప్రశ్న 3.
“రుధిరం స్వేదమ్ము కాగ పసిడిని పండించునట్టి” అంటే మీకేం అర్థమయింది ?
జవాబు.
రుధిరం అంటే రక్తం; స్వేదము అంటే చెమట; పసిడి అంటే బంగారం. రైతు పగలు రాత్రీ తేడా లేకుండా తన శ్రమను దాచుకోకుండా కష్టపడతాడు. తన రక్తాన్ని చెమటగా మార్చి పొలందున్ని బంగారం లాంటి పంటలు పండిస్తాడు. ప్రజల ఆకలి తీరుస్తాడు అని అర్ధమయింది.
ప్రశ్న 4.
కంటికి కనురెప్ప, చేనుకు కంచె. ఇట్లా దేనికి ఎవరు రక్ష ? ఇటువంటివే మరికొన్ని చెప్పండి.
జవాబు.
బిడ్డకు తల్లి, తలకు టోపీ, కోటకు గోడ, చెరువుకు కట్ట, నదులకు తీరం, ఎండా వానలకు గొడుగు, కాలికి చెప్పు రక్షణగా ఉంటాయి. భూమికి ఓజోన్ పొర రక్షణ.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.5)
ప్రశ్న 1.
“జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
జవానులు అంటే సైనికులు. వాళ్ళెప్పుడూ సరిహద్దులో కాపలా కాస్తూ ఉంటారు. శత్రు సైనికులు దండెత్తి వస్తే వెంటనే తరిమి కొడతారు. ఒక కవచం మనిషికి దెబ్బ తగలకుండా ఎలా రక్షిస్తుందో ఒక సైనికుడు మాతృభూమికి శత్రువుల దెబ్బ తగలకుండా అలాగే రక్షిస్తాడు కనుక కవి అలా వర్ణించాడు.
ప్రశ్న 2.
“నీతికర్మ శీలురు” అని ఎవరిని అంటారు ?
జవాబు.
ఎప్పుడూ నీతిని తప్పకుండా న్యాయమార్గంలో నడిచేవారు, తమ పనులను సకాలంలో బాధ్యతతో నిర్వర్తించేవారు మంచి ప్రవర్తన గలవారౌతారు. వారినే నీతికర్మ శీలురు అంటారు.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. గేయాన్ని పాడుతూ అభినయించండి.
జవాబు.
విద్యార్థుల పని.
2. ప్రగతి మార్గదర్శకులని ఎవరినంటారు ? ఇట్లాంటివారి పేర్లు కొన్ని చెప్పండి. సమాజానికి వీరి అవసరం ఏమిటి?
జవాబు.
ప్రగతి మార్గదర్శకులంటే ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించేవారు. మంచి విషయాలు నేర్పి మంచి మార్గంలో నడిపి అభివృద్ధిలోకి తెచ్చేవారు. మహాత్మగాంధీ, బాలగంగాధరతిలక్ వంటి దేశ నాయకులు ప్రజలలో దేశభక్తి రేకెత్తించి స్వరాజ్య ఉద్యమం వైపు నడిపించారు. రాజారామమోహన్రాయ్, కందుకూరి వీరేశలింగం వంటివారు సాంఘిక దురాచారాలను రూపుమాపి ప్రజలను అభివృద్ధిమార్గంలో నడిపించారు. అలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వీరి అవసరం ఎప్పుడూ ఉంటుంది.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
1. పాఠాన్ని చదవండి. రైతుల, సైనికుల గొప్పదనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలను గుర్తించి రాయండి.
జవాబు.
రైతులు : శ్రమదాచనివారు. పసిడిని పండించువారు. ప్రగతి మార్గదర్శకులు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పుతారు.
సైనికులు: తలవంచనివారు. భరతమాత పురోగతికి ప్రాతిపదికలు. ఘనవీరులు. నిర్మలురు. నీతికర్మ శీలురు. ఘనజనులు.
2. కింది గేయాన్ని చదవండి. ఖాళీలను పూరించండి.
జవాబు.
పల్లెలు మనపాలిటి కల్పతరువులూ – నవభారత గృహసీమకు మణిదీపాలూ
మానవతకు మందిరాలు మమతలకవి పుట్టినిళ్ళు – మన సంపద నిలయాలు భరతమాత నయనాలు
ప్రగతికి సోపానాలూ సుగతికి తార్కాణాలు – మనిషి మనిషిగా బ్రతికే మనుగడ మణిదీపాలు
అ) భరతమాతకు నయనాలు ___________
జవాబు.
పల్లెలు
ఆ) పల్లెలు నవభారత గృహసీమకు ___________
జవాబు.
మణిదీపాలు
ఇ) “ప్రగతికి సోపానాలు”లో సోపానాలు అంటే ___________
జవాబు.
మెట్లు
ఈ) నివాసం అనే అర్థం వచ్చే పదాలు ___________
జవాబు.
మందిరాలు, నిలయాలు, ఇళ్ళు
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. “దేశపురోగతి” అంటే ఏమిటి ? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి.
జవాబు. దేశపురోగతి అంటే దేశం అభివృద్ధి చెందటం, పంచవర్ష ప్రణాళిక రచించిన పండిట్నెహ్రూ, ఆయన ఆశయ సాధనకు కృషిచేసి ప్రాజెక్టులు నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కె.ఎల్.రావు వంటి ఇంజనీర్లు, వ్యవసాయంలో విప్లవం తెచ్చిన స్వామినాథన్, పాల ఉత్పత్తిలో విప్లవం తెచ్చిన కురియన్ మొదలైన వారంతా దేశ పురోగతికి తోడ్పడినవారే.
ఆ. దేశానికి నీతి కర్మశీలుర ఆవశ్యకత ఏమిటి ?
జవాబు.
నీతిశీలురు అంటే న్యాయమార్గంలో నడిచేవారు. మోసపు మార్గంలో నడవనివారు. న్యాయంగా ప్రవర్తిస్తే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటివారు కూడా సంతృప్తిగా ఉంటారు. అవినీతి వల్ల ఎవ్వరికీ సుఖశాంతులుండవు. అందువల్ల ప్రతివారు నీతిమంతులై ఉండాలి. కర్మశీలురు అంటే తమ విధులను సక్రమంగా నెరవేర్చేవారు. ఎవరి పనులు వారు సకాలంలో చక్కగా నిర్వర్తిస్తే అన్నీ చక్కగా నెరవేరుతాయి. అలా ఎవరి పనులను వారు పద్ధతి ప్రకారం నెరవేరిస్తే దేశంతప్పకుండా ప్రగతి సాధిస్తుంది.
ఇ. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలు ఆర్పటం అంటే ఏమిటి ?
జవాబు.
అవిశ్రాంత సేద్యం అంటే కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా పొలంలో పనిచేసి పంటలు పండించటం. రైతు ఏ మాత్రం విరామం లేకుండా పంటలు పండిస్తూ ఉంటే కూడా సమయం చాలటం లేదు. ప్రజల అవసరానికి తగినంత పంట పండించి ఎవరూ ఆకలితో బాధపడకుండా చూస్తాడు రైతు. ఇదే ఆకలి మంటలు ఆర్పటం అంటే.
ఈ. ఈ గేయ రచయిత గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు.
(సూచన: ముందు పేజీల్లో ఇచ్చిన కవి పరిచయం రాయాలి.)
2. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి.
1. ‘అభినందన’ గేయ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
రైతులు, సైనికులు దేశానికి ఎలా సేవ చేస్తున్నారో తెలుపండి ?
(లేదా)
జన్మభూమికి ఎవరెవరు ఎట్లా సేవ చేస్తున్నారో వివరించండి.
జవాబు.
రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్ళకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. అభినందనలు. నేలతల్లి సంతోషపడేటట్లుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్పవలె, చేనుచుట్టూ కంచెవలె, ఈ జన్మభూమికి కవచంవలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు.
దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసుగలవారై నిమిషం కూడా తమ విధిని మరువకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి, శత్రుసైన్యాలను చంపి, దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్ప వీరులగు జవానులకు అభినందనలు.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. “వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే” అని రైతులు, సైనికుల గురించి గేయం పాడుకున్నారు కదా! అట్లాగే తల్లి, తండ్రి, గురువు, మంచిమిత్రులు, గొప్పవాళ్ళు… ఇట్లా ఎవరి గురించైనా వందనాలు వందనాలు… అని అభినందనలు తెలుపుతూ ఒక చిన్న గేయాన్ని రాయండి.
జవాబు.
వందనం అభివందనం హరి చందనాలతో వందనం
మంచి చెడులు నేర్పించే మా దైవములు – తల్లిదండ్రులకు గురువులకు మా వందనం ॥వందనం॥
పలుకునేర్పి నడకనేర్పి – అడుగుఅడుగున తోడునిలిచి
నన్ను కాచిన ప్రేమమూర్తి – కన్నతల్లికి వందనం ॥వందనం॥
తప్పటడుగుల నాటి నుంచి – తప్పు అడుగులు వేయకుండా
ముందకడుగేయించినట్టి – కన్నతండ్రికి వందనం ॥వందనం॥
అక్షరాలను దిద్దబెట్టి – జ్ఞాన దీపము చేతికిచ్చి
మనిషిగా నను తీర్చిదిద్దిన – గురువుకు నా వందనం ॥వందనం॥
V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి.
అ) స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. ___________
జవాబు.
నెత్తురు
ఆ) పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. ___________
జవాబు.
బంగారం
ఇ) వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. ___________
జవాబు.
రైతులు
ఈ) కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారుచేస్తారు. ___________
జవాబు.
చెమట
2. కింది వాక్యాలు చదువండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటి కింద గీత గీయండి.
అ) భారతదేశానికి రైతు వెన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమకు
దేశం ఋణపడి ఉన్నది.
జవాబు.
రైతు, కర్షకుడు, హాలికుడు.
ఆ) భారతీయులు స్వాతంత్య్రం సాధించి విజయ బావుటా ఎగుర వేశారు. నాటినుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు.
జవాబు.
బావుటా, పతాకం, జెండా.
ఇ) పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధరంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం
చేసేవారు.
జవాబు.
ఖడ్గం, అసి, కత్తి.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ‘వర్ణమాల’ లేదా ‘అక్షరమాల’ అని అంటారు.
ఉదా : ‘అ’ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు. అంటే అక్షరం.
- అ, ఆ, ఇ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు.
- క, ఖ, గ, ఘ వంటి వర్ణాలను హల్లులు అంటారు.
- అక్షరమాలలో ఎట్లా ఉన్నా ‘హల్లు’ అనేది పొల్లుగా పలికే ధ్వని. ‘మ్’, ‘అ’ అనే ధ్వనులు కలిసి ‘మ’ అయింది. మొదటిది హల్లు, రెండోది అచ్చు.
- కొన్ని అక్షరాల్లో రెండేసిగాని, మూడేసిగాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి మూడు రకాలు.
- ద్విత్వాక్షరం
- సంయుక్తాక్షరం
- సంశ్లేషాక్షరం
1. ద్విత్వాక్షరం : ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని “ద్విత్వాక్షరం” అంటారు.
ఉదా : ‘క్క’ = క్ +్క (క్) + అ = క్క – ఇక్కడ కకారం రెండుసార్లు వచ్చింది.
2. సంయుక్తాక్షరం : ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ‘సంయుక్తాక్షరం‘ అంటారు.
ఉదా : ‘న్య’ = న్ + య్ + అ – ఇక్కడ నకార, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.
3. సంశ్లేషాక్షరం : ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని “సంశ్లేషాక్షరం” అంటారు.
ఉదా : క్ష్మి = క్ + ష్ + మ్ + ఇ – ఇక్కడ కకార, షకార, మకారాలనే హల్లులు మూడు కలిశాయి.
1. కింది అక్షరాల్లో రెండేసి వర్ణాలున్నాయి. వాటిని గుర్తించండి.
ఉదా : గా = గ్ + ఆ = (రెండు ధ్వనులు)
అ) య = య్ + అ = (రెండు ధ్వనులు)
ఆ) కా = క + ఆ (రెండు ధ్వనులు)
ఇ) వొ = వ్ + ఒ (రెండు ధ్వనులు)
2. కింది పదాల్లోని సంయుక్త, ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి.
ఉదా : పద్మ = ద్ + మ్ + అ (మూడు ధ్వనులు)
అ) ఎత్తండి = త్ + త్ + అ = త్త (మూడు ధ్వనులు)
ఆ) దుర్గతి = ర్ + గ్ + అ = ర్గ (మూడు ధ్వనులు)
ఇ) సాధ్వి = ధ్ + వ్ + ఇ = ధ్వి (మూడు ధ్వనులు)
వర్గాక్షరాలు: ‘క’ నుండి ‘మ’ వరకు ఉన్న అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించారు. అవి :
- క-వర్గం : క – ఖ – గ – ఘ – ఙ్ఞ
- చ-వర్గం : చ – ఛ – జ – ఝ – ఞ
- టవర్గం : ట – ఠ – డ – ఢ – ణ
- త-వర్గం : త – థ – ద – ధ – న
- ప-వర్గం : ప – ఫ – బ – భ – మ
3. కింది వాక్యాల్లో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని గీతగీసి గుర్తించండి.
1. “బలరాం మంచి ఫలాల కోసం పల్లెలో తోటకు పోయాడు. తోటలో పామును చూసి భయపడ్డాడు”
జవాబు.
“బలరాం మంచి ఫలాల కోసం పల్లెలో తోటకు పోయాడు. తోటలో పామును చూసి భయపడ్డాడు”.
ప-వర్గం : ప, ఫ, బ, భ, మ
ప్రాజెక్టు పని
మీ సమీపంలోని రైతులు/విశ్రాంత సైనికులను కలవండి. వారు చేస్తున్న సేవలను గురించి తెలుసుకొని నివేదిక రాయండి.
1. ప్రాజెక్టు శీర్షిక : విశ్రాంత సైనికులను కలిసి, వారు దేశానికి చేస్తున్న సేవలను గురించి తెలుసుకొని నివేదిక రాయడం.
2. సమాచార సేకరణ : సమాచారం సేకరించిన తేది: x x x x x సమాచార వనరు: గ్రామంలోని పరిసరాలు.
3. సేకరించిన విధానం : నేను ఈ మధ్య మా గ్రామంలో నివసించే ఒక విశ్రాంత సైనికుని కలిసి సమాచారం సేకరించాను.
4. నివేదక : ఈ మధ్య నేనొక విశ్రాంత సైనికుణ్ణి కలిశాను. ఆయన పేరు నరసింహరాజు. ఆయన సైన్యంలో మేజర్ ఇరవై ఏళ్ళు పనిచేసి స్వచ్ఛందంగా విశ్రాంతత తీసుకున్నాడు. కారణం ఏమిటని అడిగాను. ఇంతకాలం సైనికుడిగా దేశానికి సేవ చేశాను. కొంతకాలం పౌరుడిగా నా ఊరికి, చుట్టుపక్కల గ్రామాలలోను ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. అందుకే రిటైరయ్యాను అని చెప్పాడు. ఆయన తనతోబాటు మరికొంతమంది యువకులను కూడగట్టుకొని ముందుగా పిల్లలు పనిలోకి కాదు బడిలోకి పోవాలి అనే విషయంపై అందరికీ అవగాహన కలిగిస్తూ పిల్లలను బడికి పోయేలా ప్రోత్సహిస్తున్నాడు.
అమాయకులైన ప్రజలకు కాలుష్యం గురించి తెలియజెప్పి పరిసరాల పరిశుభ్రత గురించి బోధించి చైతన్యవంతులను చేస్తున్నాడు. రాత్రిపూట బడికి వెళ్ళి చదువుకోమని పెద్దలను ప్రోత్సహిస్తున్నాడు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇలా విశ్రాంతుడై యుండి అవిశ్రాంతంగా సమాజ అభివృద్ధికి పాటుపడుతూ ఆ రకంగా దేశసేవ చేస్తున్నాడు. అటువంటి వారి జన్మ ధన్యం.
5. ముగింపు : సైనికులు దేశానికి ఏవిధంగా సేవ చేస్తున్నారో తెలుసుకున్నాను.
TS 6th Class Telugu 1st Lesson Important Questions అభినందన
ప్రశ్న 1.
మన రైతులు ఎటువంటి వారు ?
(లేదా)
రైతులు ఏవిధంగా కష్టపడుతున్నారు ? ప్రజలకు వారేమి చేస్తున్నారు?
జవాబు.
మన రైతులు శ్రమ దాచుకోకుండా కాయకష్టం చేస్తారు. పగలూ రాత్రీ అనకుండా పొలంలో పని చేస్తారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటతో నేలను తడిపి బంగారు పంటను పండిస్తారు. సమాజ అభివృద్ధికి బాటలు వేస్తారు. తమ సేద్యంతో ప్రజలందరికి ఆకలి తీరుస్తారు.
ప్రశ్న 2.
రైతు ఆత్మకథ రాయండి.
జవాబు.
నేను రైతును. ఎండ-వాన, రాత్రి పగలూ తేడా లేకుండా ప్రతి నిత్యం కష్టపడి వ్యవసాయం చేస్తాను. దుక్కిదున్ని, నీరుపెట్టి, విత్తనాలు చల్లి ఆ మొలకలను పశువులు, పక్షులనుండి రక్షిస్తాను. పొలంలో కావలసిన ఎరువులు వేస్తూ, కలుపు మొక్కలను ఏరివేస్తూ ఉంటాను. చీడ పీడలనుండి కాపాడుతాను. నా నెత్తురును చెమటగా మార్చి, బంగారం లాంటి పంటలను పండిస్తాను.
దేశంలో ఆకలితో ఉన్నవారి ఆకలి మంటలను చల్లార్చడం కోసం నా ఆకలిని సైతం మరచిపోతాను. నాకు విరామం లేదు. విశ్రాంతి లేదు, విరమణ కూడా లేదు. రైతే రాజు అన్నవారు సహితం మా గొప్పదనాన్ని, వ్యవసాయం యొక్క అవసరాన్ని గుర్తించడం లేదు. ఎద్దు ఏడ్చిన ఎవుసం (వ్యవసాయం) రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవని గుర్తించండి. వ్యవసాయాన్ని పోత్సహించండి.
I. అ) క్రింది పద్యము చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటె గాదు
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు
త్యాగ భావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగు బాల.
ప్రశ్నలు: –
1. ‘తరువులు’ అంటే ఏమిటి ?
జవాబు.
తరువులు అంటే చెట్లు
2. చెట్లు మనకు ఏమేమి ఇస్తాయి ?
జవాబు.
చెట్లు మనకు పూలు, పండ్లు ఇస్తాయి.
3. తనువును చీల్చి ఇచ్చేవి ఏవి ?
జవాబు.
చెట్లు తనువును చీల్చి ఇస్తాయి.
4. త్యాగం అంటే ఏమిటి ?
జవాబు.
స్వార్థము లేకుండా సర్వస్వము సమర్పించుట
5. ఈ పద్యానికి శీర్షిక పెట్టండి.
జవాబు.
త్యాగ భావం
II. పదజాలం:
కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలను రాయండి.
1. కార్మికులు స్వేదం చిందించి, పనిచేస్తారు.
a) రక్తం
b) చెమట
c) కన్నీరు
d) శ్రమ
జవాబు.
b) చెమట
2. వానచినుకులకు పుడమి పులకరించింది.
a) శరీరం
b) మేఘం
c) భూమి
d) ఆమె
జవాబు.
c) భూమి
3. బిడ్డను చూసి తల్లి పులకించింది.
a) దుఃఖించింది
b) పాటపాడింది
c) గగుర్పాటు చెందింది
d) బాధపడింది
జవాబు.
c) గగుర్పాటు చెందింది
4. పసిబిడ్డల మనసులు నిర్మలమైనవి.
a) స్వచ్ఛం
b) సుందరం
c) చిన్నవి
d) పెద్దవి
జవాబు.
a) స్వచ్ఛం
5. మనమందరం దేశ ప్రగతికి పాటుపడాలి.
a) పేరు
b) సుఖం
c) మంచి
d) అభివృద్ధి
జవాబు.
d) అభివృద్ధి
III. కింది వాక్యాల్లో ఒకే అర్థంగల పదాలను గుర్తించి రాయండి.
1. పుడమిని దున్నిన రైతు ఆ భూమిలో విత్తనాలు చల్లితే ఆ ధరణి బంగారం లాంటి పంటనిస్తుంది.
a) భూమి, విత్తనాలు, బంగారం
b)పుడమి, విత్తనాలు, దున్నడం
c) రైతు, పుడమి, పంట
d) పుడమి, భూమి, ధరణి
జవాబు.
d) పుడమి, భూమి, ధరణి
2. మనం చేయవలసిన పని చక్కగా చేస్తే మన విధి నిర్వహణ బాగున్నదని మన కర్తవ్య నిర్వహణను అందరూ మెచ్చుకుంటారు.
d) పుడమి, భూమి, ధరణి
b) మెప్పు, కర్తవ్యం, పని
c) చేయవలసిన, నిర్వహణ, మెప్పు
d) మనం, విధి, అందరం
జవాబు.
d) పుడమి, భూమి, ధరణి
IV. వ్యాకరణం:
1. ‘అభినందన చందనాలివే’ – గీతగీసిన అక్షరంలోని వర్ణాలు
a) అ + భి
b) భ్ + ఇ
c) బ + హ + ఇ
d) భి + ఇ
జవాబు.
b) భ్ + ఇ
2. ‘నిర్మలమైన మనస్సుతో జన్మభూమిని ప్రేమించాలి’ – ఈ వాక్యంలోని సంయుక్తాక్షరాలు
a) ర్మ, మై, న్మ, స్సు
b) స్సు
c) ర్మ, న్మ, ప్రే
d) మై, స్సు, ప్రే
జవాబు.
c) ర్మ, న్మ, ప్రే
15. ‘తల్లి’ – గీతగీసిన అక్షరంలోని ధ్వనులు
a)త + ల్ + లి
b) ల్ + ల + ఇ
c) ల్ + ల్ + అ
d) ల్ + ల్ + ఇ
జవాబు.
d) ల్ + ల్ + ఇ
3. ‘తలపులలోని కథలు చెప్పే విధం గొప్పది’ ఈ వాక్యంలోని త వర్గాక్షరాలు
a) థ, ధ, ది
b) త. థ. ధ, ది
c) క, చె, త, ప్పే, ప్ప
d) తలపు, కథ, చెప్పే, విధం
జవాబు.
b) త. థ. ధ, ది
4. కింది వానిలో చ వర్గాక్షరాలేవి ?
a) క చ ట త ప
b) గ జ డ ద బ
c) చ-ఛ-జ-ఝ-ఞ
d) చ – ఛ -ఝ
జవాబు.
c) చ-ఛ-జ-ఝ-ఞ
1. పల్లవి:
వందనాలు వందనాలు అభినందన చందనాలివే
అభినందన చందనాలివే
శ్రమదాచని హాలికులకు
తలవంచని సైనికులకు
భరతమాత పురోగతికి
ప్రాతిపదికలగు ఘనులకు ॥వంద ॥
పుడమి తల్లి పులకింపగ
రుధిరం స్వేదమ్ము కాగ
పసిడిని పండించునట్టి
ప్రగతి మార్గదర్శకులకు ॥వంద ॥
అర్థాలు :
వందనాలు వందనాలు = ఎన్నెన్నో నమస్కారాలు
అభినందన = మెచ్చుకోలు, ప్రోత్సాహం
చందనాలు = మంచి గంధాలు
ఇవి + ఏ = ఇవిగో
శ్రమదాచని = కష్టం దాచుకోని
హాలికులకు = రైతులకు
తలవంచని = శత్రువులముందు ఓడిపోని
సైనికులకు = జవానులకు
భరతమాత = భారతమాత యొక్క
పురోగతికి = అభివృద్ధికి
ప్రాతిపదికలగు = పునాదులవంటివారైన
ఘనులకు = గొప్పవారికి
పుడమితల్లి = తల్లి
పులకింపగ = పులకరించేటట్లు
రుధిరం = రక్తం
స్వేదము కాగ = చెమటగా చేసి
పసిడిని = బంగారాన్ని
పండించునట్టి = పంటల రూపంలో పండించే
ప్రగతి = అభివృద్ధి
మార్గదర్శకులకు = మార్గాన్ని చూపించేవారికి
వందనాలు = నమస్కారాలు
భావం : రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్ళకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. నేలతల్లి సంతోషపడేట్టు నెత్తురు చెమటగా మార్చి బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు.
2. పల్లవి:
కంటికి కనురెప్పలాగ
చేనుచుట్టు కంచెలాగ
జన్మభూమి కవచమైన
ఘనవీరులు జవానులకు ॥వంద॥
ప్రలోభాల మాయలోన
పడిపోవని నిర్మలురకు
నిమిషమేని విధిమరువని
నీతి కర్మశీలురకు
అవిశ్రాంత సేద్యంతో ॥వంద॥
ఆకలి మంటలను ఆర్పి
దేశభక్తి ఖడ్గంగా, శత్రుమూకలను దున్మి
దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు ॥వంద॥
అర్థాలు :
కంటికి = కన్నులకు
కనురెప్పలాగ = కప్పిఉంచే రెప్పల్లాగా
చేనుచుట్టు = పొలంచుట్టూ
కంచెలాగ = రక్షణకోసం వేసే కంచెవలె
జన్మభూమి = మాతృభూమికి
కవచమైన = రక్షణకవచం వంటి
ఘనవీరులు = గొప్ప వీరులైన
జవానులకు = సైనికులకు
ప్రలోభాల = ఆశలు అనే
మాయలోన = భ్రమలో
పడిపోవని = లోనుకాకుండా ఉండే
నిర్మల = స్వచ్ఛమైన మనసుకలవారికి
నిమిషము + ఏని = ఒక్క క్షణం కూడా
విధి మరువని = తమ కర్తవ్యం మరిచిపోని
నీతి = న్యాయము
కర్మ = కర్తవ్యము
శీలురకు = స్వభావముగా గలవారికి
అవిశ్రాంత = విరామం లేకుండా
సేద్యంతో = వ్యవసాయంతో
ఆకలి మంటలను = ప్రజల ఆకలిని
ఆర్ప = తీర్చి
దేశభక్తి = దేశంమీద భక్తిని
ఖడ్గంగా = కత్తిగా చేసుకొని
శత్రుమూకలను = శత్రు సమూహాన్ని
దున్మి = నాశనంచేసి
దేశ కీర్తి = దేశము యొక్క గొప్పతనం అనే
బావుటాను = జెండాను
ఎగరేసిన = ఎగురవేసిన
ఘనజనులకు = గొప్పవారికి
వందనాలు = నమస్కారాలు
భావం: కంటికి రెప్పవలె, చేనుచుట్టూ కంచెవలె, జన్మభూమికి కవచంవలె ఉంటూ కాపాడుతున్న గొప్పవీరులైన జవానులకు వందనాలు. దురాశ అనే మాయకు లోనుకాకుండా మంచి మనసుకలవారై నిమిషం కూడా తమ విధిని మర్చిపోకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలు పండిస్తూ, ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్పవీరులగు జవానులకు అభినందనలు.
పాఠం ఉద్దేశం
ఈ దేశం బాగోగులు కోరుతూ, అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అనగా పాడగలిగేది అని అర్థం. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన “స్వరభారతి” అనే గేయసంకలనం నుండి తీసుకోబడింది.
కవి పరిచయం
ప్రశ్న.
అభినందన పాఠం రచించిన కవిని గురించి రాయండి.
జవాబు.
శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. కనకమ్మ, నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలాకాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింప బడ్డాయి. టీవీ, రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి. అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి ‘స్రవంతి పత్రిక’లో ప్రచురింపబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసిన చేయి.
ప్రవేశిక
దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడువాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణా ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్శాస్త్రి “జై జవాన్ జై కిసాన్” అన్నాడు. అదే భావనను ప్రతిఫలింపజేస్తూ రచయిత సరళమైన మాటలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి.
నేనివి చేయగలనా?
- గేయాన్ని అభినయంతో పాడగలను. ప్రగతి మార్గదర్శకులను గురించి చెప్పగలను. – అవును/ కాదు
- అపరిచిత గేయాన్ని చదివి అర్థం చేసుకొని, ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించగలను. – అవును/ కాదు
- గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
- పాఠం ఆధారంగా కొత్త గేయాన్ని రాయగలను. – అవును/ కాదు