Telangana SCERT 6th Class Telugu Guide Telangana 10th Lesson బాలనాగమ్మ Textbook Questions and Answers.
బాలనాగమ్మ TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు ? ఏం జరుగుతున్నది ?
జవాబు.
బొమ్మలో ఒక బాలుడు, సీసాలో నుంచి బయటికి వచ్చిన ఒక భూతం ఉన్నారు. చేతులు కట్టుకొని వినయంగా ఉన్న భూతం బాలుడి ఆజ్ఞకోసం చూస్తున్నది. ఆ బాలుడు తనకు చేయవలసిన పనులను గురించి ఆ భూతానికి చెబుతున్నాడు.
ప్రశ్న 2.
బొమ్మ ద్వారా కథను ఊహించండి.
జవాబు.
ఒక పిల్లవాడు తన మిత్రులతో తన ఇంటి దగ్గర ఉన్న ఆటస్థలంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆటలో` ఆ పిల్లవాడు కొట్టిన బంతి దూరంగా చెట్ల మధ్యలో పడ్డది. బంతి తేవడానికి వెళ్ళిన ఆ పిల్లవానికి అక్కడ ఏవో పారేసిన సంచులు, డబ్బాలు, సీసాలు కనబడ్డాయి. వాటిలో ఒక సీసా అతనికి ప్రత్యేకంగా కనిపించింది. అందులో ఏమున్నదో తెలుసుకుందామని ఆ సీసా బిరడా గట్టిగా ఊడబీకాడు.
అంతే! ఒక్కసారిగా అందులో నుండి సుడిగాలి వేగంతో ఒక పెద్ద ఆకారం బయటికి వచ్చి గాలిలో నిలబడింది. ‘దండాలు మహారాజా’ అన్నది. హఠాత్తుగా జరిగిన ఆ ఘటనకు కంగారు పడిన పిల్లవాడు ‘ఎవరు నువ్వు’ ? అన్నాడు. ‘నేను తమ సేవకుణ్ణి మహారాజా! మీకు ఏమి సేవలు చేయాలో ఆజ్ఞ ఇవ్వండి’ అని అంది ఆ ఆకారం.
ప్రశ్న 3.
ఇటువంటి కథలు మీకు తెలుసా ? వీటిని ఏమంటారు ?
జవాబు.
ఇటువంటి కథలు నాకు తెలుసు. ఇట్లా మానవులకు సాధ్యంకాని శక్తులు, మంత్రాలు, తంత్రాలు, సాహసాలను తెలిపే కథలను జానపద కథలు అంటారు.
ప్రశ్న 4.
మన తెలంగాణా ప్రాంతంలోని జానపదకథలు మీకేమైనా తెలుసా ? ఏమిటవి ?
జవాబు.
తెలంగాణా ప్రాంతంలో సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకట రెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండల్రాయుని కథ వంటి జానపద కథలు తెలుసు. అందులో రాణి శంకరమ్మ కథ ఇది. రాణి శంకరమ్మ మెదక్ జిల్లాలో గౌడిచర్ల గ్రామంలో సంగారెడ్డి, రాజమ్మ దంపతులకు పుట్టింది.
చిన్నప్పటి నుంచి కర్రసాము, కత్తి సాము, గుఱ్ఱపు స్వారీ వంటి విద్యలు నేర్చుకుంది. నాగలి పట్టడం, బండి తోలడం వంటి వ్యవసాయ పనులు నేర్చుకొంది. ఒకరోజు ఒక చిరుత పులి మీదికి వచ్చినా భయపడక, కట్టెతో పులిని కొడుతూ, కాళ్ళతో తొక్కి చంపివేసింది. అంతటి ధైర్యవంతురాలు ఆమె.
ఇతరులకు సాయం చేసే ఆమె మంచిగుణం నచ్చి, అందోలు రాజు నారసింహారెడ్డి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ప్రజల్ని కనబిడ్డల్లా చూడాలని, మొదట రాజ్యం పనులు, తర్వాతే ఇంటి సుఖాలు అని రాజుకు రాజధర్మాలు గురించి చెప్పింది. నారసింహారెడ్డి మరణం తర్వాత శంకరమ్మ నైజాం రాజు ఆజ్ఞమేరకు మరాఠీల మీదకు కాళికలా యుద్ధానికి వెళ్ళి, వారిని ఓడించింది.
1764 లో అందోలు రాజ్యానికి శంకరమ్మ రాణి అయింది. చక్కగా రాజ్యపాలన చేసింది. తన తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లి పేర రాజంపేట అనే పట్టణాలు నిర్మించింది. చివరికి 1774 సం॥లో రాచపుండుతో బాధపడుతూ చనిపోయింది. ప్రజలను కన్నబిడ్డల్లా, పాలించిన శంకరమ్మ ఆదర్శ రాణి.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
‘కంటికి రెప్పలా కాపాడుకోవడం’ అంటే ఏమనుకుంటున్నారు?
జవాబు.
కంట్లో దుమ్మూ ధూళీ మొదలైనవి పడి హాని కలిగించకుండా రెప్పలు కంటిని ప్రతిక్షణం కాపాడుతూ ఉంటాయి.ఏదైనా దెబ్బ తగిలేటప్పుడైనా రెప్పలు కంటిని కాపాడేటందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. అందువల్ల ‘కంటికి రెప్పలా కాపాడుకోవడం’ అంటే ఎదుటి వారిని తమ ప్రాణం కంటే మిన్నగా కాపాడుకోవటం అని అనుకుంటున్నాను.
ప్రశ్న 2.
‘మాట నిలబెట్టుకోవడం’ అనే మాటను ఎట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
ఇక్కడ మాట అంటే ఆడిన మాట. ‘నిలబెట్టుకోవడం అంటే తప్పకపోవడం. ఏదైనా చేస్తానని లేక ఇస్తానని ఒకసారి చెబితే ఆ పని చేసి తీరడం, ఆ వస్తువు ఇచ్చి తీరడం. అది ఎంత కష్టమైనదైనా, ఎంత నష్టమైనదైనా ఆడిన మాట తప్పక పోవడాన్నే “మాట నిలబెట్టుకోవడం” అంటారు అని అర్థం చేసుకున్నాను.
ప్రశ్న 3.
తల్లిదండ్రులు లేని పిల్లలు’ ఎట్లా ఆగమై పోతారు ?
జవాబు.
తల్లిదండ్రులులేని పిల్లలను పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. ఒకవేళ జాలి చూపి ఎవరైనా పట్టించుకున్నా అది ఎంత కాలం ఉంటుందో చెప్పలేం. తల్లిదండ్రులు లేని పిల్లలు సరైన క్రమశిక్షణ లేక, సరిగా మంచీ చెడు చెప్పేవాళ్ళు లేక, మానసికంగా ఎంతో బాధ అనుభవిస్తారు.
ప్రశ్న 4.
కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు ?
జవాబు.
కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా చూసుకుంటారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావిస్తారు. వాటిని తొలగించడానికి రాత్రనకా పగలనకా కృషి చేస్తారు. వారి కష్టాలు తొలగే వరకూ కంటిమీద కునుకు లేకుండా శ్రమిస్తారు.
ప్రశ్న 5.
ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి?
జవాబు.
ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే ఆ పనులు చక్కగా నెరవేరవు. పైగా వారి అసమర్థత కారణంగా కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
ప్రశ్న 6.
పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి ?
జవాబు.
పెద్దలకు జీవితకాలంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. వారి పెద్దలు చెప్పగా విని గానీ, స్వయంగా చూసి గానీ వారు ఎంతో విజ్ఞానం, అనుభవం గడించి ఉంటారు. ముందుచూపుతో పెద్దలు చెప్పే మాటలు వినాలి. లేకపోతే ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురవుతాయి. వాటిని తీర్చుకోవడానికి ఎంతో విలువైన జీవిత సమయం వృథా అవుతుంది.
ప్రశ్న 7.
మాయల ఫకీరు బాలనాగమ్మను ఎత్తుకుపోయిన సంఘటన వల్ల మీకు ఇతర కథలలోని ఇట్లాంటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయా ? చెప్పండి.
జవాబు.
అవును. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయిన రామాయణంలోని సంఘటన గుర్తుకు వస్తున్నది. అందులో కూడా రావణాసురుడు భిక్షకుడి వేషంతో వచ్చి సీతాదేవితో లక్ష్మణుడు గీసిన గీతను దాటించి తన మాయతో ఆమెను ఎత్తుకుపోతాడు.
ప్రశ్న 8.
‘కర్కోటకుడు’ అంటే ఎట్లా ఉంటాడని అనుకుంటున్నావు?
జవాబు.
కర్కోటకుడు అంటే చూడడానికి భయంకరంగా ఉంటాడని అనుకుంటున్నాను.
ప్రశ్న 9.
దుర్మార్గుల వల్ల ఎట్లాంటి నష్టాలుంటాయని భావిస్తున్నావు ?
జవాబు.
దుర్మార్గులు తాము కోరుకున్నది సాధించడానికి ఎదుటివారిని ఎన్నో ఇబ్బందులు పెడతారు. చివరికి ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. దుర్మార్గుల వల్ల ప్రజలు ధనాన్ని, మానాన్ని, చివరకు ప్రాణాలను కూడా కోల్పోతారు. దుర్మార్గుల పనుల వల్ల ప్రజలు భయపడిపోతారు. వాళ్ళు ఎప్పుడు ఎవరికి హాని తలపెడతారోనని నిద్ర ఆహారం లేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు.
ప్రశ్న 10.
గండభేరుండ పక్షులు బాలవద్దిరాజుకు సహాయం చేశాయి కదా! అట్లాగే మనం కూడా ఇతరులకు ఎందుకు సహాయం చేయాలి ?
జవాబు.
ఆపదలో ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి మనకు తోచిన, మనం చేయగలిగిన సహాయం చేయాలి. ఇతరులకు మనం సాయంచేస్తే ఇతరులు కూడా మనకు అవసరమైనప్పుడు సాయం చేస్తారు. మనిషి సంఘజీవి. అంటే ఒక సమూహంలో బతికేవాడు. ఏ మనిషైనా ఇతరుల సాయం పొందకుండా జీవించలేడు. అందువల్ల మనం ఇతరులకు సాయం చేయాలి.
ఇవి చేయండి
1. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
‘బాలనాగమ్మ’ కథను విన్నారు కదా! ఈ కథలో మీకు ఆసక్తి కలిగించిన సంఘటన ఏదో చెప్పండి.
జవాబు.
ఈ కథలో బాలవద్దిరాజు వజ్రాల చిలుకను సాధించి తెచ్చి మాయల ఫకీరు ప్రాణాలు తీసే సంఘటన నాకు ఎంతో ఆసక్తి కలిగించింది. అందులో సప్తసముద్రాలు దాటడానికి బాలవద్దిరాజుకు గండభేరుండ పక్షి సాయం చేయడం ఎంతో బాగుంది. ఫకీరు ప్రాణం చిలుకలో ఉండడం ఆశ్చర్యం కలిగించింది. బాలవద్దిరాజు తన తల్లిదండ్రులనూ, తన సైన్యాన్ని బతికించుకొని చిలుక కంఠంలో ఉన్న దుర్మార్గుడైన ఫకీరు ప్రాణాలను తీసివేయడం సంతోషం కలిగించింది.
ప్రశ్న 2.
మీకు తెలిసిన జానపద కథను చెప్పండి.
జవాబు.
తెలంగాణా ప్రాంతంలో సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకట రెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండల్రాయుని కథ వంటి జానపద కథలు తెలుసు. అందులో రాణి శంకరమ్మ కథ ఇది. రాణి శంకరమ్మ మెదక్ జిల్లాలో గౌడిచర్ల గ్రామంలో సంగారెడ్డి, రాజమ్మ దంపతులకు పుట్టింది. చిన్నప్పటి నుంచి కర్రసాము, కత్తి సాము, గుఱ్ఱపు స్వారీ వంటి విద్యలు నేర్చుకుంది. నాగలి పట్టడం, బండి తోలడం వంటి వ్యవసాయ పనులు నేర్చుకొంది. ఒకరోజు ఒక చిరుత పులి మీదికి వచ్చినా భయపడక, కట్టెతో పులిని కొడుతూ, కాళ్ళతో తొక్కి చంపివేసింది. అంతటి ధైర్యవంతురాలు ఆమె. ఇతరులకు సాయం చేసే ఆమె మంచిగుణం నచ్చి, అందోలురాజు నారసింహారెడ్డి ఆమెను పెండ్లి చేసుకున్నాడు.
ప్రజల్ని కనబిడ్డల్లా చూడాలని, మొదటరాజ్యం పనులు, తర్వాతే ఇంటి సుఖాలు అని రాజునకు రాజధర్మాలు గురించి చెప్పింది. నారసింహారెడ్డి మరణం తర్వాత శంకరమ్మ నైజాం రాజు ఆజ్ఞమేరకు మరాఠీల మీదకు యుద్ధానికి వెళ్ళి, కాళికై వారిని ఓడించింది. 1764 లో అందోలు రాజ్యానికి శంకరమ్మ రాణి అయింది. చక్కగా రాజ్యపాలన చేసింది. తన తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లిపేర రాజంపేట అనే పట్టణాలు నిర్మించింది. చివరికి 1774 సం॥లతో రాచపుండుతో బాధపడుతూ చనిపోయింది. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన శంకరమ్మ ఆదర్శ రాణి.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
1. కింది జాతీయాలను పాఠంలో ఏ సందర్భంలో ఉపయోగించారో రాయండి.
(అ) అల్లారు ముద్దుగా : లక్ష్మీదేవమ్మ తన ఏడుగురు కుమార్తెలను అపురూపంగా పెంచే సందర్భంలో.
(ఆ) కడుపుల పెట్టుకొని కాపాడుట : లక్ష్మీదేవమ్మ తన బిడ్డలను భర్తకు అప్పజెప్పే సందర్భంలో.
(ఇ) చిలుకపలుకులు : పిల్లల్ని కాపాడతానని నవాంభోజరాజుకు మాణిక్యాల దేవి మాయ మాటలు చెప్పిన సందర్భంలో.
(ఈ) కాలం చేయుట : నవాంభోజరాజు చనిపోయిన సందర్భంలో.
(ఉ) ఆరునూరైనా : తన తల్లిదండ్రులను ఫకీరు ఖైదునుంచి విడిపిస్తానని బాలవద్దిరాజు చెప్పిన సందర్భంలో
2. పాఠం ఆధారంగా ఎవరు ఎటువంటివారో కింది పట్టికలో రాయండి.
పాత్రలు | పాత్రల స్వభావం తెలిపే పదాలు |
(అ) నవాంభోజరాజు | భార్య చేతిలో కీలుబొమ్మ. అటు పిల్లల్ని, ఇటు రాజ్యాన్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు. |
(ఆ) బాలనాగమ్మ | భయస్తురాలు, భక్తురాలు, అమాయకురాలు |
(ఇ) మాయల ఫకీరు | దుర్మార్గుడు, పరస్త్రీని కోరిన దుష్టుడు, మాయగాడు |
(ఈ) బాలవద్దిరాజు | విద్యావంతుడు, వీరుడు, కార్యసాధకుడు |
(ఉ) గండభేరుండ పక్షి | కృతజ్ఞతాభావం, స్నేహగుణం, పరోపకార గుణం కలిగినది. |
(ఊ) లక్ష్మీదేవమ్మ | భక్తురాలు, అన్నమాట తప్పదు, పతివ్రత, బిడ్డలంటే ప్రాణం |
(ఋ) మాణిక్యాలదేవి | స్వార్థపరురాలు, సవతి పిల్లలను చంపాలనుకొన్న రాక్షసి |
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) నవాంభోజరాజు మారుమనువుకు ఒప్పుకోలేదు కదా! ఐనా బంధువులు, మంత్రులు మొదలైన వారు ఏమని నచ్చజెప్పి ఒప్పించి ఉంటారు ?
జవాబు.
నవాంభోజరాజు భార్య అయిన లక్ష్మీదేవమ్మ ఒకే కాన్పులో ఏడుమంది ఆడపిల్లలను కన్నది. ఇచ్చిన మాట ప్రకారం బిడ్డలు పుట్టిన తొమ్మిది నెలలకే నాగేంద్రుణ్ణి చేరుకున్నది. వెడుతూ వెడుతూ రాజు అయిన భర్తను బిడ్డల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోమనీ, మళ్ళీ పెళ్ళి చేసుకోవద్దనీ చెప్పింది. కానీ బంధువులు, మంత్రులు మొదలైనవారు నచ్చజెప్పి రాజును ఒప్పించి మళ్ళీ పెళ్ళి చేశారు. బిడ్డలు తొమ్మిది నెలల పసివాళ్ళనీ, వారి ఆలనాపాలనా చూసుకోవడానికి ఒక తల్లిలాంటి స్త్రీ కావాలని చెప్పి ఉంటారు. అంతేకాక వయసులో ఉన్న రాజుకు తోడుకావాలని, రాజ్యానికి వారసుడు కావాలనీ వారు ఇట్లా రకరకాలుగా నచ్చజెప్పి ఉంటారు.
(ఆ) అడవిలో దిక్కులేని పక్షుల తీరుగ తిరుగుతున్న లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు ఇంటికి తీసుకొని పోయాడు కదా! అతడు ఆ పిల్లలను ఇంటికి తీసుకొని పోకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించి రాయండి.
జవాబు.
ఆ పిల్లలను మేనమామ తీసుకొనిపోకపోతే ఆ పిల్లలు అడవిలోనే పెరిగి ఉండేవారు. అక్కడి పక్షులు, లేళ్ళు, కుందేళ్ళు మొదలైన సాధుజంతువులు వారిని పెంచి పోషించేవి. చిలుకలు వాటికి పలుకులు నేర్పేవి. కోయిలలు పాటలు నేర్పేవి. హంసలు నడకలు నేర్పేవి. ఏనుగులు తమ తొండాలతో వారిని ఉయ్యాలలు ఊపేవి. వారు జలపాతాలలో జలక్రీడలు ఆడుకొనేవారు. ఆకులు అలములూ, పండ్లూ దుంపలూ తిని బతికేవారు. చెట్ల నీడల్లో, గుబురు పొదల్లో తలదాచుకొనేవారు. పక్షుల, మృగాల భాష నేర్చుకొనేవారు. మనుషుల భాష మాత్రం వచ్చేది కాదు.
(ఇ) బాల వద్దిరాజుకు కట్టెసాము, కత్తిసాము, విలువిద్య మొదలైన విద్యలు వస్తాయి కదా! మీకు చదువుతోపాటు ఏయే విద్యలు వస్తాయి ? అందులో మీకు బాగా ఇష్టమైన విద్య ఏది ?
జవాబు.
చదువుతో పాటుగా నాకు సంస్కృతం, సంగీతం అనే విద్యలు వచ్చు. సంస్కృతంలో శబ్దాలు, ధాతువులు, అమరకోశం నేర్చుకున్నాను. సంస్కృతం రాయడం, మాట్లాడటం నేర్చుకుంటున్నాను. ఈ రెండింటిలో నాకు సంగీతం అంటే చాలా యిష్టం. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో త్యాగరాజస్వామి, రామదాసు కీర్తనలు నేర్చుకున్నాను. లలిత సంగీతంలో అన్నమయ్య కీర్తనలు పాడతాను గూడా. నాకు మా వూరి జాతరలో పాడే జానపద గీతాలంటే చాలా ఇష్టం. అవకాశం వచ్చినప్పుడు నేను కూడా వేదిక మీద మైకు పట్టుకుని చిందులేస్తూ పాడతాను కూడా. అప్పుడు మా స్నేహితులుకూడా నాతో కలిసి అడుగులేస్తారు.
(ఈ) లక్ష్మీదేవమ్మ పడిన కష్టాలను గురించి రాయండి.
జవాబు.
లక్ష్మీదేవమ్మ నవాంభోజరాజుకు భార్య. ఆమెకు ముని ఇచ్చిన వరం వల్ల ఏడుగురు ఆడపిల్లలు జన్మించారు. నాగేంద్రునికి ఇచ్చిన మాట వల్ల ఆ పిల్లల తల్లి వారికి తొమ్మిది నెలలురాగానే వెళ్ళిపోయింది. భార్యకు ఇచ్చిన మాట వల్ల రాజు అయిన భర్త మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా రాజ్యపరిపాలన కూడా మరచిపోయి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కానీ మంత్రులు, బంధువులు నచ్చజెప్పి రాజుకు మాణిక్యాల దేవితో మళ్ళీ పెళ్ళి చేశారు. రాచకార్యం మీద రాజు ఢిల్లీ వెళ్ళగా సవతి తల్లి పిల్లలకు అన్నం, నీళ్ళు ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టింది. అంతేగాక విషం పెట్టి చీకటింట్లో పడేసింది. అపుడు వారిని వారి తల్లి ఆత్మ కాపాడింది.
అపుడు సవతి తల్లి వారిని అడవిలో పాడుపడ్డ గుడిలో పడేసి తాళమేసి వచ్చింది. ఈసారి గూడా లక్ష్మీదేవమ్మ ఆత్మ వారిని కాపాడింది. ఆ ఆత్మ ద్వారా జరిగింది తెలుసుకున్న రాజు ఢిల్లీ నుంచి వెంటనే వచ్చి బిడ్డలను కాపాడుకున్నాడు. పట్టువదలని సవతి తల్లి రాజుకు మరుగు మందు పెట్టింది. ఆ మందువల్ల రాజు తన బిడ్డలను చంపడానికి తానే వారిని అడవికి తీసుకొని వెళ్ళాడు. కన్నబిడ్డలను చంపడానికి చేతులురాక వారిని అక్కడే నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికొచ్చాడు. అపుడు ఆ పిల్లలను వారి మేనమామ అయిన వద్దిరాజు వచ్చి రక్షించాడు.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) బాలనాగమ్మ కథను సొంతమాటల్లో రాయండి.
జవాబు.
పరిచయం : తెలంగాణాలో ప్రసిద్ధమైన జానపద కథలలో బాలనాగమ్మ కథ ఒకటి. చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ, కార్యవద్దిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహస కథ ఇది. బాలనాగమ్మ : బాలనాగమ్మ నవాంభోజరాజు, లక్ష్మీదేవమ్మలకు పుట్టిన 7గురు సంతానంలో చివరిది. కార్యవద్దిరాజు భార్య. బాలనాగమ్మ గర్భవతిగా ఉండగా కార్యవద్దిరాజు లేని సమయం చూసి మాయల ఫకీరు బాలనాగమ్మను పట్టితేవాలని పానుగంటిలోని ఆమె మేడలోకి వెళ్ళాడు. అప్పటికి బాలనాగమ్మ పిల్లవాణ్ణి కన్నది. మాయల ఫకీరు బాలనాగమ్మను కుక్కగా మార్చి తన వెంట తీసుకొని పోయాడు.
ఆ బాలుడి పేరు బాలవద్దిరాజు. బాలనాగమ్మను రక్షించడానికి వెళ్ళిన వద్దిరాజులను ఫకీరు రాళ్ళలా మార్చేశాడు. బాలవద్దిరాజు : బాలనాగమ్మ కొడుకు పానుగంటిలో పెరిగి పెద్దవాడయ్యాడు. చాలా ధైర్యవంతుడు. ఫకీరున్న కోటలోకి పోయి తల్లిని కలిశాడు. ఫకీరు పీడ విరగడ : ఫకీరు ప్రాణం ఏడు సముద్రాల అవతల మామిడిచెట్టు తొర్రలో వున్న వజ్రాల చిలుకలో ఉ న్నదని తెలుసుకున్నాడు. ఆఖరుకు ఆ వజ్రాల చిలుకను పట్టుకొని ఫకీరు కోటకు చేరాడు. వజ్రాల చిలుక మెడ విరిచేసి, మాయల ఫకీరు పీడ వదిలించాడు. తన తల్లిదండ్రులను, సైన్యాన్ని రక్షించుకున్నాడు. ముగింపు ఈ విధంగా బాలవద్దిరాజు ధైర్యసాహసాలతో తన తల్లిదండ్రులను రక్షించుకోవడమే కాక దుర్మార్గుడైన మాయల ఫకీరును అంతమొందించాడు.
IV. సృజనాత్మకత/ప్రశంస:
1. “సాయంత్రం గండభేరుండ పక్షి రాంగనే………………………… ‘అనే పేరా నుంచి చివరి వరకు పాఠం చదవండి. దీని ఆధారంగా గండభేరుండ పక్ష్మి, బాలవద్దిరాజు, మాయల ఫకీరుల మధ్య జరిగిన సంభాషణలను ఊహించి, రాయండి.
జవాబు.
గండభేరుండ పక్షి : : బాలకా! నువ్వు ఎవరివి ? ఇక్కడికి ఎందుకు వచ్చావు ? ఎక్కడికి పోవాలి ? ఏమి కావాలో చెప్పు.
బాలవద్దిరాజు : నేనొక రాజకుమారుణ్ణి, నా తల్లిదండ్రులను కాపాడుకోవడానికి వచ్చాను, నాకు సప్త సముద్రాల అవతల పంజరంలో ఉన్న వజ్రాల చిలుక కావాలి.
గండభేరుండ పక్షి : నా బిడ్డల్ని కాపాడావు. నాకు ఎంతో మేలు చేశావు. కనుక నీకు నేను సాయం చేస్తా. నిన్ను నా రెక్కల మీద కూర్చోబెట్టుకొని సప్తసముద్రాలు దాటించి మళ్ళీ తీసుకు వస్తా. సరేనా?
బాలవద్దిరాజు : ఆహా! ఎంత అదృష్టవంతుణ్ణి. ఈ సమయంలో నీ సాయం నాకు ఎంతో అవసరం. (బాలవద్దిరాజు చిలుకను పట్టుకోగానే మాయల ఫకీరుకు చలి జ్వరం మొదలైంది).
మాయల ఫకీరు : ఏమిటి ! నాకింత చలి జ్వరంగా ఉన్నది. ఎందుకో నాకేమిటో అయిపోతున్నది.
బాలవద్దిరాజు : ఇదిగో ఫకీరూ! చూడు. నీ ప్రాణం చిలుక కంఠంలో. ఆ చిలుక కంఠం నా చేతిలో.
మాయల ఫకీరు : ఆఁఁ (కోపంతో) ఎంత ధైర్యం రా నీకు ? ఇప్పుడే నిన్ను బూడిద చేసేస్తాను చూడు. (అంటూ కుడిచెయ్యి పైకెత్తుతాడు) వెంటనే బాలవద్దిరాజు చిలుక కుడి రెక్క విరిచేస్తాడు.
మాయల ఫకీరు : అబ్బా … నన్నేమీ చెయ్యకు. నువ్వు ఏమి చెబితే అది చేస్తా.
బాలవద్దిరాజు : అట్లాగా! అయితే నా తల్లిని విడుదల చెయ్యి. నా తండ్రుల్ని, సైన్యాన్ని తిరిగి బతికించు. (ఫకీరు అట్లాగే చేస్తాడు.)
బాలవద్దిరాజు : ‘నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి నష్టం (అంటూ ఆ వజ్రాల చిలుక చానా మెడ విరిచేస్తాడు)
మాయల ఫకీరు : అయ్యో, అమ్మో, అబ్బా …………….. అనుకుంటూ అరుస్తూ గిలగిలా కొట్టుకుంటూ చనిపోతాడు.)
ముగింపు : ఈ విధంగా బాలవద్దిరాజు తన తల్లిదండ్రులనూ, సైన్యాన్ని కాపాడుకోవడమే కాకుండా దుర్మార్గుడైన మాయల ఫకీరును అంతంచేసి, రాజ్యాన్ని, ప్రజల్ని రక్షించాడు.
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాల్లోని గీతగీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలను ఖాళీలలో రాయండి.
(అ) కొడుకు పుట్టినందుకు సంతోషపడ్డారు. కాని అతడు ప్రయోజకుడు కానందుకు (బాధపడ్డారు)
(ఆ) సుఖము కోరుకంటే దేన్నీ సాధించలేము. కాని …………… దేన్నైనా సాధించవచ్చు. (కష్టముతో)
(ఇ) మంచివాళ్ళు మేలు చేయాలని చూస్తే, చెడ్డవాళ్ళు …………………. చేయాలని చూస్తారు.
(ఈ) సీత జాడ తెలియక విషాదంలో ఉన్న రాముడికి ఆమె జాడ చెప్పి హనుమంతుడు ………………. కలిగించాడు. (ఆనందం)
(ఉ) దుర్మార్గుల వల్ల సమాజానికి చెడు జరుగుతుంది. ఐతే మంచివాళ్ళవల్ల సమాజానికి ……………. జరుగుతుంది. (మంచి)
2. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను రాయండి.
ఉదా: (అ) కొంతమంది చిన్నతనం నుండే యోగాసనాలు సాధన చేస్తారు
జవాబు.
అభ్యాసం
(ఆ) మా బడి మా ఇంటికి తూర్పు దిక్కున ఉంది.
జవాబు.
దిశ
(ఆ) మా తాత పులిహోర ఆరగించాడు.
జవాబు.
తిన్నాడు.
(ఇ) అప్పు కట్టలేదని రాజయ్య భూమిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేశారు.
జవాబు.
స్వాధీనం
(ఈ) ప్రజల సేవకై తపించిన రాజులు చరిత్రకెక్కారు
జవాబు.
ప్రభువులు
(ఉ) నా శిరస్సు వంచి నీకు నమస్కారం చేస్తున్నాను.
జవాబు.
తల
3. కింది జాతీయాలతో సొంత వాక్యాలు రాయండి.
(అ) అల్లారుముద్దుగా – చిన్న పిల్లలను అల్లారుముద్దుగా పెంచుతారు.
(ఆ) చిలుకపలుకులు – పసిపిల్లల తప్పటడుగులు, చిలుక పలుకులు ముచ్చటగా ఉంటాయి.
(ఇ) ఆరునూరైనా – ఆరునూరైనా అబద్దమాడకూడదు.
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
(అ) తల్లిదండ్రులు : తల్లియునూ తండ్రియునూ
(ఆ) తోడునీడలు : తోడు మరియు నీడ
(ఇ) భీమార్జునులు : భీముడు మరియు అర్జునుడు
(ఈ) కాయగూరలు : కాయయును, కూరయును
(ఉ) ఆటపాటలు : ఆట మరియు పాట
కలిపి రాయడం కింది వాటిని పరిశీలించండి.
1. వారు + ఉండిరి = వారుండిరి
2. ఎవరికి + ఎంత = ఎవరికెంత
3. ఇంక + ఒకరు = ఇంకొకరు
పై ఉదాహరణల్లో రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం గమనించారు కదా! ఇట్లా రాయడాన్ని కలిపిరాయడం అంటారు. దీనికే ‘సంధి’ అని పేరు.
2. కింది పదాలను కలిపి రాయండి.
ఉదా : సెలవు + ఇచ్చి = సెలవిచ్చి
(అ) మీరు + ఎవరు = మీరెవరు
(ఆ) పది + ఇంతలు = పదింతలు
(ఇ) ఏది + ఐనా = ఏదైనా
(ఈ) పట్టిన + అంత = పట్టినంత
ప్రాజెక్టు పని:
గ్రంథాలయం నుంచి గాని, వార్తాపత్రికల నుంచి గాని ఏదైనా జానపద కథను సేకరించి, రాసి తరగతిలో చెప్పండి.
1. ప్రాజెక్టు శీర్షిక : గ్రంథాలయం నుండి గాని, వార్తా పత్రికల నుంచి గాని ఏదైనా జానపద కథను సేకరించడం.
2. సమాచార సేకరణ : (అ) సమాచారం సేకరించిన తేది : XXX (ఆ) సమాచార వనరు : గ్రంథాలయం
3. సేకరించిన విధానం : నేను మా గ్రామ గ్రంథాలయానికి వెళ్ళి వార్తా పత్రికలను చదివి, ఒకనాటి వార్తా పత్రికలో వచ్చిన సర్వాయి పాపన్న కథను సేకరించాను.
4. నివేదిక :
సర్వాయి పాపడు
క్రీ.శ. 1650 ప్రాంతంలో అణిచివేతకు గురి అవుతున్న గౌడ్ కులంలో పుట్టిన పాపన్న బాల్యంలో పశువులను కాస్తూ, జీవించాడు. ఒక్క కొడుకు కావడంతో తల్లి సర్వమ్మ పాపన్నను గారాబంగా పెంచింది. స్వతంత్ర ఆలోచనలు కలిగిన పాపన్న కల్లు గీస్తూ, పశువులను కాసేవాడు. తన స్నేహితులను సమీకరించి చిన్న సైన్యాన్ని తయారు చేశాడు. సంప్రదాయ ఆయుధాలను సమకూర్చుకున్నాడు. తన అనుచరులతో కలిసి బల్లెం, బాణం, కర్ర వంటి ఆయుధాలను ఉపయోగించే పద్ధతులను సాధన చేశాడు. క్రమంగా తాను పెరిగిన తాటికొండ చుట్టుప్రక్కల గ్రామాలలో వున్న ధనవంతులను, జమీందారులను రహస్య పద్ధతుల ద్వారా కొల్లగొడుతూ ధనాన్ని సేకరించడం మొదలుపెట్టాడు.
పాపన్న సాహసాలకు ఆకర్షితులై ప్రజలు సైన్యంలో చేరడం ప్రారంభించారు. దొరల పీడనవల్ల బాధలు పడుతున్న అణగారిన కులాలకు చెందిన ప్రజలకు పాపన్న రక్షణ యిచ్చాడు. పాపన్న సైన్యం రోజురోజుకు పెరగసాగింది. మొదట సర్వాయిపేటలో బలిష్ఠమైన కోటను నిర్మించాడు. పాపన్న స్వతంత్రంగా ప్రకటించుకొని కేంద్రంగా పాలించాడు. క్రమక్రమంగా తన రాజ్యాన్ని విస్తరించుకొంటూ హుస్నాబాద్, కరీంనగర్ ప్రాంతాలను జయించి అధీనంలోకి తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో గోల్కొండను జయించడానికి ముందే వ్యూహరచన చేసి తాటికొండలో మరొక కోటను నిర్మించాడు.
ప్రజల మన్ననలు అందుకొంటూ తగినంత సైన్యాన్ని వృద్ధి చేసుకొని ప్రజల సహకారంతో నల్లగొండ పరగణా భోనగిరి సర్కారులోని ‘షాపురం’ వద్ద గుట్టమీద పెద్ద మట్టి కోటను నిర్మించాడు. ఈ కోటను తన కేంద్రంగా చేసుకొని నల్లగొండ పరగణాలో వున్న జమీందారులను దోచుకుంటూ పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. పాపన్నను నిలువరించే వారు లేకపోవడంతో జమీందారులు, భూస్వాములంతా కలిసి ఢిల్లీ పాదుషాకు విన్నవించుకున్నారు. ఔరంగజేబు ఈ పరిస్థితిని గమనించి పాపన్నను శిక్షించేందుకు కొలనుపాక సర్దారగు రుస్తుందిల్ ఖాన్ను ఆదేశించాడు.
రుస్తుందిల్ ఖాన్ స్వయంగా పెద్ద సైన్యంతో వచ్చి షాపురం వద్ద పాపన్నతో తలపడ్డాడు. పాపన్న సైన్యం వీరోచితమైన పోరాటం సాగించింది. మూడు నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం రుస్తుందిలాఖాన్ పాపన్న చేతిలో ఓడిపోయాడు. పాపన్న విజయాలు స్థానిక దొరలు, భూస్వాములకు మింగుడు పడలేదు. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకొని క్రీ.శ. 1708 ఏప్రిల్1 తేదీన పాపన్న వరంగల్ కోటను ముట్టడించాడు. అక్కడ మొగల్ ఆధీనంలో వున్న వేలమంది బందీలను విడుదల చేశాడు. అనంతరం తన సైన్యాన్ని పటిష్ఠ పరచుకొని క్రీ.శ. 1709 ఆరంభంలో పాపన్న గోల్కొండపైకి దండెత్తాడు. భీకర పోరాటం తర్వాత అంతిమంగా గోల్కొండ పాపన్న వశమైంది.
మొగలు నాయకత్వం అపజయంతో రగిలిపోయింది. తన ధైర్య సాహసాలు, వరుస విజయాలతో యెంతో ధీమాగా వున్న పాపన్న మొగలుల కుట్రలను, మోసపూరిత చర్యలను గమనించలేకపోయాడు. ప్రజలకు రక్షణ, పరిపాలనా సంస్కరణలలో మునిగిన పాపన్న యీ ద్రోహాన్ని పసిగట్టలేకపోయాడు. దీనితో మొగలు సైన్యం మూకుమ్మడిగా స్థానిక దొరలు, భూస్వాముల అండతో గోల్కొండ మీదికి దాడిచేసింది. యీ దాడిలో పాపన్న సైన్యం చాలా వరకు నష్టపోయింది. చివరి దాకా పోరాడిన పాపన్న శత్రువు చేతిలో మరణించడం తన స్వభావానికి విరుద్ధమని తలచి బాకుతో పొడుచుకొని ఈ లోకాన్ని విడిచివెళ్ళాడు.
5. ముగింపు : ఈ జానపద కథ వల్ల సర్వాయి పాపన్న గురించి తెలుసుకున్నాను. పాపన్న ధైర్య సాహసాలను గురించి తెలుసుకున్నాను.
TS 6th Class Telugu 10th Lesson Important Questions బాలనాగమ్మ
ప్రశ్న 1.
బాలవద్దిరాజు చేసిన సాహసాలను వివరించండి.
జవాబు.
పరిచయం : పానగల్లును పరిపాలించే వద్దిరాజు కుమారుడు కార్యవద్దిరాజు. బాలనాగమ్మ, కార్యవద్దిరాజుల కుమారుడే బాలవద్దిరాజు. ఈ బాలుడు ఏడు రోజుల పసికందుగా ఉన్నప్పుడు మాయల ఫకీరు బాల నాగమ్మను ఎత్తుకుపోయాడు. తన తల్లిదండ్రుల గురించి తెలిసిన పన్నెండేళ్ళ బాలవద్దిరాజు వారిని కాపాడతానని బయలుదేరాడు. పులిని చంపడం : తల్లిని వెతుకుతూ వెళుతున్న బాలవద్దిరాజు దారిలో పులిరాజు పట్టణం చేరాడు. అక్కడ ఒక పులి మంచినీళ్ళ బావి దగ్గర అందరినీ మింగుతోంది. ఇది తెలిసి బాలవద్దిరాజు పులిని వెతుక్కుంటూ గుహదగ్గరకే వెళ్ళి దాన్ని చంపాడు.
రాజకుమారిని రక్షించడం: గుడిమీద మొలచిన సంజీవని మొక్క ఆకుల రసం పిండి, చిలుకవాదిపట్నం రాజు కూతురు రాచపుండును నయం చేసి బతికించాడు.
శక్తిని ఓడించడం : నాగిళ్ళపూడి మొదట్లో ఉన్న నయవాది పట్టణం చేరుకోగానే అక్కడ ఫకీరు ఏర్పాటుచేసిన శక్తి బాలవద్దిరాజును అడ్డుకున్నది. దాన్ని చంపబోగా అది భయపడి ఆ బాలుడిని ఫకీరు ఎక్కడ ఉన్నాడో రహస్యం చెప్పి, ఒక మాయల బెత్తం కూడా ఇచ్చింది. అట్టా అతడు ఫకీరుకోటలోకి పోయి తల్లిని కలిశాడు. తల్లిద్వారా ఫకీరు ప్రాణ రహస్యం తెలుసుకొన్నాడు.
సప్త సముద్రాలు దాటడం: గండభేరుండ పక్షిసాయంతో సప్త సముద్రాలు దాటి ఆ బాలుడు పంజరంలో ఉన్న చిలుకను పట్టి తెచ్చాడు.
మాయల ఫకీరు సంహారం : చిలుకను ఫకీరు దగ్గరకు తీసుకు వచ్చాడు. ఫకీరు భయంతో బాలనాగమ్మను విడుదల చేశాడు. ఫకీరు వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం అని వజ్రాల చిలుక మెడ విరిచేశాడు బాలరాజు. మాయల ఫకీరు ప్రాణం విడిచాడు.
ప్రశ్న 2.
బాలవద్దిరాజు సప్తసముద్రాలు దాటి మాయల ఫకీరు ప్రాణాలున్న చిలుకను పట్టుకున్నాడు కదా! ఆ చిలుకను దొరికిన చోటనే చంపకుండా ఫకీరు దగ్గరకు ఎందుకు తీసుకొని పోయి ఉంటాడో రాయండి.
జవాబు.
ఆ చిలుకను దొరికిన చోటనే చంపితే మాయల ఫకీరుకు తాను ఎందుకు చనిపోతున్నాడో తెలిసేది కాదు. అంతటి దుర్మార్గుణ్ణి దుర్మార్గంగానే చంపాలని బాలవద్దిరాజు ఆ పని చేసి ఉంటాడు. అంతేకాక మాయల ఫకీరు తన మాయలతో తన తల్లిని బందీగా చేశాడు. తన తాత తండ్రులను రాళ్ళుగా, సైనికులను బూడిదగా మార్చాడు. తన తల్లి విడుదల కావాలన్నా, తన తండ్రి, సైనికులు తిరిగి మనుషులుగా మారాలన్నా అది ఫకీరు వల్లనే సాధ్యపడుతుంది. ఆ చిలుకను దొరికిన చోటనే చంపేస్తే తన తల్లిదండ్రులు గానీ, సైనికులుగానీ విడుదల అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల బాలవద్దిరాజు ఆ చిలుకను దొరికిన చోటనే చంపకుండా ఫకీరు దగ్గరకు తీసుకొని పోయి ఉంటాడు.
అర్థాలు
- నూరు = వంద
- ఎకాఎకిన = అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే
- కంఠం = మెడ
- నాగేంద్రుడు = నాగుపాము
పర్యాయ పదాలు
- దిక్కు = దిశ వైపు
- తల = శిరస్సు, మూర్ఖం
- తల్లి = అమ్మ, అంబ, జనని, మాత
- తండ్రి = నాన్న, జనకుడు, అయ్య
- రాజు = ప్రభువు, నరపాలుడు, పాలకుడు
- భర్త = పతి, మగడు, నాథుడు
- భార్య = సతి, పెండ్లాము, కళత్రం
- పెండ్లి = వివాహం, కళ్యాణం, పాణిగ్రహణం
- పట్టణం = పురం, నగరం
- అడవి = వనం, కాన, అరణ్యం
- గుడి = కోవెల, దేవాలయం
- సముద్రం = వనధి, వార్ధి, అంబుధి
- పాము = సర్పం, ఉరగం, ఫణి
- పక్షి = విహంగం, ఖగం, అండజం
నానార్థాలు
- దిక్కు = దిశ, శరణం, వైపు
- రాజు = చంద్రుడు, భూపాలుడు
- పన్ను = కప్పం, దంతం
ప్రకృతులు – వికృతులు
- ప్రకృతి – వికృతి
- అటవి – అడవి
- అంబ – అమ్మ
- కథ – కత
- నిద్ర – నిదుర
- రాత్రి – రేతిరి
- రాజు – రేడు
- విద్య – విద్దె
- శక్తి – సత్తి, సత్తువ
- సముద్రం – సంద్రం
- సంతోషం – సంతసం
సంధులు
- రాజ్యమున్నది = రాజ్యము + ఉన్నది
- పడగలెత్తిండు = పడగలు + ఎత్తిండు
- చేతులెత్తి = చేతులు + ఎత్తి
- కావస్తుండగనే = కావస్తు + + ఉండగనే
- తాకీదొచ్చింది = తాకీదు + ఒచ్చింది
- ఇట్లుండగ = ఇట్లు + ఉండగ
- తాళమేసి = తాళము + ఏసి
- చెప్పినట్లు = చెప్పిన + అట్లు
- పెట్టకుంటే = పెట్టాక + ఉంటే
- అయిపోతుందని = అయిపోతది + అని
- చేతికిస్తనని = చేతికి + ఇస్తనని
- ఉన్నదని = ఉన్నది + అని
- బేరానికొచ్చిండు = బేరానికి + ఒచ్చిండు
కలపడం
- నేను + ఆపని = నేనాపని
- వాళ్ళు + అందరు = వాళ్ళందరు
- వాడు + అయ్యిండు = వాడయ్యిండు
- ఇట్లు + ఉండంగా = ఇట్లుండగా
- ముక్కలు + అయింది = ముక్కలయింది
- అయిపోతది + అని = అయిపోతదని
- చేతికి + ఇస్తనని = చేతికిస్తనని
- రహస్యము + అంత = రహస్యమంత
- పొమ్ము + అని = పొమ్మని
- ఉన్నది + అని = ఉన్నదని
- మొదలు + అయ్యింది = మొదలయ్యింది
- బతికించుము + అన్నడు = బతికించుమన్నడు
- విడిచిపెట్టుము + అన్నడు = విడిచి పెట్టుమన్నడు.
1. క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు తగిన సమాధానాలు రాయండి.
కష్ట పెట్టబోకు కన్నతల్లి మనసు
నష్ట పెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలిత సుగుణజాల తెలుగుబాల
ప్రశ్నలు:
1. వేనికి నష్టం కలిగించకూడదు ?
జవాబు.
నాన్న పనులకు
2. కష్టపెట్టకూడనిది ఏమిటి ?
జవాబు.
కన్న తల్లి మనసు
3. ఎవరు దైవ సమానులు ?
జవాబు.
తల్లిదండ్రులు
4. ఈ పద్యం రాసిన కవి పేరేమిటి ?
జవాబు.
కరుణశ్రీ
5. ఈ పద్యానికి మకుటం ఏమిటి ?
జవాబు.
లలిత సుగుణజాల తెలుగుబాల
II. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అక్షరంబు వలయు కుక్షిజీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షురసము
అక్షరంబు తన్ను రక్షిచు గావున
నక్షరంబు లోక రక్షితంబు.
ప్రశ్నలు:
1. మానవులకు అవసరమైనది ఏది ?
జవాబు.
అక్షరం కొని
2. అక్షరం జిహ్వకు ఎటువంటిది ?
జవాబు.
చెరుకు రసం వంటిది.
3. అక్షరం దేనిని రక్షిస్తుంది ?
జవాబు.
చదువుకున్న వారిని (తన్ను) రక్షిస్తుంది.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
‘అక్షరం’ అవసరం.
5. ‘జిహ్వ’ అను పదానికి అర్థం రాయండి.
జవాబు.
జిహ్వ అనగా ‘నాలుక’ అని అర్థం.
III. ఈ క్రింది గద్యాన్ని చదివి, ఏవేని ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
“సాహితి సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతినికేతన్” పేరున విద్యాలయాన్ని స్థాపించి ‘గురుదేవుడు’గా కీర్తింపబడ్డారు.
ప్రశ్నలు:
1. సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తిని అందుకున్న వారు ఎవరు ?
2. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసింది ఎవరు ?
3. రవీంద్రుడు స్థాపించిన విద్యాలయం ఏది ?
4. రవీంద్రుని బిరుదు ఏమి ?
5. ఠాగూర్ రచించిన ఏవేని రెండు ప్రసిద్ధ రచనలు ఏవి ?
IV. పర్యాయపదాలు
గీత గీసిన పదాల ‘పర్యాయపదాలు గుర్తించండి.
11. ఏ దిక్కూ లేని వారికి భగవంతుడే రక్ష.
(A) చోటు, స్థలం
(B) ఇల్లు, గృహం
(C) దిశ, వైపు
(D) నీరు, జలం
జవాబు.
(C) దిశ, వైపు
12. తల్లి, తండ్రి, గురువు – వీరి ముగ్గురి ఋణమూ ఎప్పటికీ తీర్చుకోలేము.
(A) జనకుడు, పిత
(B) వృద్ధుడు,ముదుసలి
(C) తాత, నాయన
(D) ఉపాధ్యాయుడు, గురువు
జవాబు.
(A) జనకుడు, పిత
13. మన భారతీయుల వివాహం అనే సంప్రదాయం ప్రపంచ ప్రజలకు ఆదర్శప్రాయం.
(A) ఇల్లు, గృహం
(B) కులం, గుణం
(C) మతం, గౌరవం
(D) పెండ్లి, కళ్యాణం
జవాబు.
(D) పెండ్లి, కళ్యాణం
14. దేహాన్ని దేవాలయం గానూ, అందులో ఉండే జీవుణ్ణి దేవుడిగానూ విజ్ఞులు పోలుస్తారు.
(A) విద్యాలయం, బడి
(B) గుడి, కోవెల
(C) ఒడి, మడి
(D) మడి, ఆయకట్టు
జవాబు.
(B) గుడి, కోవెల
V. ప్రకృతి – వికృతులు
గీత గీసిన వాటికి ప్రకృతి/వికృతులను గుర్తించండి.
15. అమ్మను మించిన దైవం లేదు.
(A) కొమ్మ
(B) గుమ్మ
(C) బొమ్మ
(D) అంబ
జవాబు.
(D) అంబ
16. పగటికి రాజు సూర్యుడైతే రాత్రికి రాజు చంద్రుడు.
(A) నక్తం
(B) రాతిరి
(C) చీకటి
(D) అంధకారం
జవాబు.
(B) రాతిరి
17. విద్య లేని వాడు వింత పశువు.
(A) చదువు
(B) సంధ్య
(C) విద్దె
(D) కూలి
జవాబు.
(C) విద్దె
18. ఎంత కొండలమీద ప్రవహించినా నదులు అన్నీ చివరికి సముద్రంలో కలిసేవే.
(A) సంద్రం
(B) వారధి
(C) వారిధి
(D) కడలి
జవాబు.
(A) సంద్రం
VI. వ్యాకరణాంశాలు
19. తెలంగాణలో బాలనాగమ్మ కథ బాగా పేరు పొందిన కథ – ఇందులో ద్విత్వాక్షరం ఏది ?
(A) థ
(B) మ్మ
(C) రా
(D) పొం
జవాబు.
(B) మ్మ
20. కింది వాటిలో పరుషాక్షరం ఏది ?
(A) ప
(B) య
(C) మ
(D) గ
జవాబు.
(A) ప
21. బాలవద్దిరాజు తన తల్లిదండ్రులను రక్షించడం కొఱకు ఎన్నో సాహసాలు చేశాడు. గీత గీసినది ఏ విభక్తి ?
(A) ప్రథమ
(B) ద్వితీయా
(C) తృతీయా
(D) చతుర్థి
జవాబు.
(D) చతుర్థి
22. ఓ, ఓరి, ఓయి, ఓసి అనే ప్రత్యయాలకు ఏమని పేరు ?
(A) ప్రథమా
(B) ద్వితీయా
(C) సంబోధన ప్రథమా
(D) షష్ఠీ
జవాబు.
(C) సంబోధన ప్రథమా
VII. సంధులు
విడదీయడం – కింద గీత గీసిన పదాలను విడదీయండి.
23. పరోపకారులైన మానవులకు చేతులెత్తి మొక్కవచ్చు.
(A) చేయి + ఎత్తి
(B) చేతి + ఎత్తి
(C) చేతులు + ఎత్తి
(D) చేతులను + ఎత్తి
జవాబు.
(C) చేతులు + ఎత్తి
24. ప్రతిదీ ఎదుటి వాళ్ళు చెప్పినట్లు చేయడం వ్యక్తిత్వం అనిపించుకోదు.
(A) చెప్పిన + అట్లు
(B) చెప్పు + అట్లు
(C) చెబుతాను + ఇట్లు
(D) చెప్పిన + ట్లు
జవాబు.
(A) చెప్పిన + అట్లు
25. సంపద ఉన్నదని మిడిసిపడటం గొప్ప వారి లక్షణం కాదు.
(A) ఉన్నది + ని
(B) ఉన్నది + అని
(C) ఉన్న + అని
(D) ఉంది + అని
జవాబు.
(B) ఉన్నది + అని
కలపడం – కింది పదాలను కలపండి.
26. వాళ్ళు + అందరు
(A) వాళ్ళందర
(B) వాళ్ళందరు
(C) వాళ్ళే అందరు
(D) వాళ్ళందరితోనూ
జవాబు.
(B) వాళ్ళందరు
27. ఉన్నది + అని
(A) ఉందని
(B) ఉన్నదంటూ
(C) ఉంటే ఉంది
(D) ఉన్నదని
జవాబు.
(D) ఉన్నదని
28. మీద + ఎక్కి
(A) మీదెక్కి
(B) మీద మీద
(C) పైపైన
(D) మీద కాక
జవాబు.
(A) మీదెక్కి
పాఠం ఉద్దేశం:
జానపద కథలను విని లేదా చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారు. తెలంగాణాలో అనేకమైన ప్రసిద్ధిచెందిన జానపద కథలున్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపదకథ ‘బాలనాగమ్మ కథ’. ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శింపబడి ప్రజల మనస్సుల్లో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠం ఉ ద్దేశం.
ప్రవేశిక:
కథలలో జానపద కథలు ప్రత్యేకమైనవి. మానవాతీత శక్తులు, తంత్రాలు, సాహస కథనాలు ఈ కథలను నడిపిస్తాయి. అందుకే పిల్లలు ఆ కథలంటే చెవికోసుకుంటారు. చిన్నవాడైన బాలవద్ది రాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ, కార్యవద్దిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహసమే ఈ కథ. ఆ జానపదకథను ఇప్పుడు మనం
తెలుసుకుందాం.
నేనివి చేయగలనా ?
- నాకు తెలిసిన ఒక జానపదకథను సొంతమాటల్లో చెప్పగలను. అవును / కాదు
- పాఠం ఆధారంగా పాత్రల స్వభావాన్ని గురించి పట్టికలో రాయగలను. అవును / కాదు
- బాలనాగమ్మ కథను సొంత మాటల్లో రాయగలను. అవును / కాదు
- పాఠం ఆధారంగా సంభాషణలు రాయగలను. అవును / కాదు