These TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 9th Lesson Important Questions జీవనభాష్యం
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు మార్కులు
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే ఏం చేయాలి ?
జవాబు:
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే చెరగని త్యాగం చేయాలి. మనం చేసిన త్యాగకృత్యం, ఎప్పటికీ మరచి పోలేనిదిగా ఉండాలి. అంతటి త్యాగము చేసిన వారి పేరు, చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏదో బిరుదులు ఇస్తున్నారని, ఆ బిరుదులు మనకు ఉన్నాయి కదా అని అనుకుంటే లాభం లేదనీ, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలవదనీ కవి గుర్తుచేశారు. ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తుల పేరు చిరస్థాయిగా నిలిచి ‘ఉంటుందని కవి తెలిపాడు.
ప్రశ్న 2.
“ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేం గ్రహించారు ?
జవాబు:
ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది ? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు.
సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచిపెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరు పంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే, తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.
ప్రశ్న 3.
జయాపజయాలను నువ్వెలా స్వీకరిస్తావు ? సి.నా.రె. చెప్పారు?
జవాబు:
ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మనం చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక లేని ప్రయాణం గమ్యం తెలీకుండా సాగుతుంది. గమ్యం చేరనీదు. అందుకనే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ప్రణాళికలు సఫలమైనా ఒక్కొక్క సారి ఇతరుల, అధికారుల సహాయ నిరాకరణ వల్ల అపజయం కలగవచ్చు లేదా శక్తికి మించిన లక్ష్యాన్ని ఎంచుకున్న అపజయం ఎదురవవచ్చు. కానీ కుంగి పోను.
సాలీడు ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ గూడు కట్టినట్లు పోరాడతాను విజయం సాధిస్తాను. విజయానికి పొంగిపోను పరాజయానికి కుంగిపోను. విజయమైనా, అపజయమైనా తరువాత ప్రణాళికను సిద్ధపరుస్తూనే ఉంటాను. సి.నా.రె కూడా ‘జీవన భాష్యం’ లో ఇదే చెప్పారు. “పేరవుతుందని” చదువుకున్నాక ఏ విద్యార్థి అయిన తన పేరు తల్లిదండ్రుల పేరు తరాలపాటు నిలిచేలా ప్రయత్నం తప్పక చేస్తాడు.
ప్రశ్న 4.
జీవనభాష్యం పాఠం చదవడం వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
జీవన భాష్యం పాఠం చదవడం వలన జీవించే విధానం తెలుస్తుంది. ధైర్యంగా పనిని ప్రారంభించడం తెలుస్తుంది. ఎవరో ఏదో ‘వంక’ పెడతారేమో అనే సంశయం పటాపంచలవుతుంది. ఎవరో భయపెడితే భయపడే పరిస్థితి ఉండదు. భయపడకుండా ప్రయత్నించి, సాధించినవే ఇపుడు మనం అనుభవించే సౌఖ్యాలని తెలుస్తుంది.
కష్టపడి పనిచేస్తే ఫలితం ఉండదని నిరాశ పడకూడదు. తప్పనిసరిగా ఫలితం ఉంటుందని తెలు స్తుంది. అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం అల వడుతుంది. ఆటంకాలకు భయపడకుండా ముందుకు సాగిపోయే గుణం అలవడుతుంది.
ఈ పాఠం చదవడం వలన దేన్నైనా సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. జంకు ఉండదు. సమాజం మహోన్నతంగా తీర్చదిద్దబడుతుంది. అదే ఈ పాఠం చదవడం వలన ప్రయోజనం.
ప్రశ్న 5.
‘ఎంతటి ఎత్తులకు ఎదిగినా ఉంటుంది పరీక్ష’ అనే కవి అనడంలో గల ఉద్దేశ్యం ఏమిటి ? (June ’17)
జవాబు:
ఎంత సామర్థ్యం మనకు ఉన్నా, అధికారం, సంపదలు ఉన్నా, మనం ఎన్నో విజయాలు సాధించినా, ఇంక మనకు ఏ కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండరాదని కవి సందేశం ఇచ్చాడు. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలను తీసుకువస్తుందో, పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరని కవి సూచించాడు. విధి శక్తి ముందు ఎవరైనా తలవంచ వలసిందే అని కవి తెలియ జెప్పాడు.
కవి తాను చెప్పిన మాటకు దృష్టాంతంగా హిమాలయ పర్వతాన్ని గూర్చి గుర్తు చేశాడు. ఉన్నతమైన హిమాలయపర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి, నదిగా ప్రవహించవలసి వస్తోంది. అలాగే ఎంతటి మనిషి అయినా, విధి పరీక్షిస్తే అతని గర్వం కరిగి నీరు కావలసిందే అని కవి తెలిపాడు.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మార్కులు
ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘చెదరని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే ఏమిటి ? పేరు నిలపడానికి ఏమి మంచిపనులు చేయాలి?
జవాబు:
చెదరని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే, త్యాగం చేసినవారి యొక్క మంచిపనులు చేసిన వారి యొక్క పేర్లు, చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయని అర్థము.
పేరు నిలవడానికి చేయవసిన పనులు :
- దానధర్మాలు విరివిగా చేయాలి.
- దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించాలి.
- పేదవారికి ఉచితంగా పెళ్ళిళ్ళు చేయించాలి.
- కావ్యాలను రచించాలి లేదా అంకితం తీసికోవాలి.
- బావులు, చెరువులు తవ్వించాలి.
- ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలి.
- విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
- చదువుకొనేవారికి ఉపకారవేతనాలు ఇవ్వాలి.
- వైద్యశాలలు కట్టించాలి.
- గ్రామాలకు రోడ్లు వగైరా వేయించాలి.
ప్రశ్న 2.
గజల్ ప్రక్రియను పరిచయం చేయండి. మీరు చదివిన గజల్ దేనిని గూర్చి చెప్పిందో తెలపండి.
జవాబు:
సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ అనేవి గజల్ ప్రక్రియకు జీవగుణాలు. మేము సి. నారాయణరెడ్డి గారు రాసిన ‘జీవనభాష్యం’ అనే గజల్న చదివాము.
గజల్లో పల్లవిని ‘మత్లా’ అని, చివరి చరణాన్ని ‘మక్తా’ అని పిలుస్తారు. కవి నామ ముద్రను ‘తఖల్లుస్’ అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.
మేము చదివిన జీవనభాష్యం గజల్, మనిషి దేనికోసమూ నిరుత్సాహం పడకూడదనీ, ఎంతటి గొప్ప విషయాన్ని అయినా, ఎంతటి ఘనకార్యాన్ని అయినా, ప్రయత్నం చేస్తే సాధింపవచ్చుననీ తెలుపుతుంది. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం శ్రమిస్తూ జీవించే మనిషి, సంఘంలో బాగా గౌరవం పొందు తాడని ఈ గజల్లో చెప్పబడింది.
ప్రశ్న 3.
‘జీవనభాష్యం’ పాఠం ఆధారంగా సి.నా.రె. గారి కవిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
సి.నా.రె. గారు రచించిన ‘జీవన భాష్యం’ చాలా బాగుంది. నీరవుతుంది, దారవుతుంది, ఊరవుతుంది, పేరవుతుంది వంటి పదాలను పాదాల చివర రాసి అంత్యప్రాసను పాటించారు.
‘మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది’ వంటి వాక్యాలలో వాస్తవికతను చిత్రీకరించారు. చల్లటి గాలి తగిలితే ఎవరికైనా మనసుకు హాయిగా ఉంటుంది. అలాగే మబ్బుకు కూడా అన్ని చెప్పాడు. ‘జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది’ వంటి వాక్యాల ద్వారా, ఒక పనిని ప్రారంభించడానికి జంకకూడదని చెప్పారు. జంకకుండా పని మొదలు పెడితే తర్వాతి తరాలకు అదే ఆదర్శమౌతుందని చెప్పారు.
‘ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు’ అనే చరణంలో కష్టపడి పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చని బోధించారు. అందరూ కలసిమెలసి ఉండాలని ఉద్బో ధించారు. ఎంత గొప్ప వారికైనా ఏవో కష్టాలు తప్పవని బోధించారు. కష్టాలను తట్టుకొంటేనే సుఖాలు కలుగు తాయని చెప్పారు.
జీవన భాష్యం పాఠం ద్వారా జీవితాన్ని గడప వలసిన విధానాన్ని వివరించారు. జీవితాన్ని కాచి వడబోసిన అనుభవాన్ని భావితరాలకు పాఠ్యాంశంగా రచించారు.
ప్రశ్న 4.
మనిషి గొప్పస్థానానికి చేరుకోవడానికి ‘జీవన భాష్యం’ పాఠం ద్వారా కవి సి.నా.రె. సూచించిన (Mar. ’17)
జవాబు:
ప్రకృతికి భయపడిన ఆదిమానవుడు తనకు తాను నిలదొక్కుకున్నాడు. చాలా ప్రగతిని సాధించాడు. టెక్నాలజీ పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి. కానీ, జీవన విధానంపై ఇంకా పూర్తి అవగాహనను మానవుడు పెంచుకోలేదు.
ఈరోజు చాలామంది ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతున్నారు. తమలో తాము కుమిలి పోతున్నారు. తమ బాధలను కనీసం స్నేహితులకు, తల్లిదండ్రులకు అయినా చెప్పు కోవాలి. అలా చెప్పు కొంటే బాధతో నిండిన మనసు కరిగి కన్నీటి రూపంలో బయటికి పోతుంది. మనసు తేలికవుతుంది.
ఏవో చిన్న చిన్న సమస్యలు చూసి భయపడ కూడదు. కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. జంతువులకు లేని ఆలోచన మనుషులకు ఉంది. ఆ ఆలోచనను సద్వినియోగం చేసుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి.
ఎంత గొప్పవారికైనా కష్టాలు తప్పవు. వాటిని పరీక్షలనుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అభివృద్ధిని సాధించాలి. ఈ విధంగా జీవన విధానం ఉండాలి.
ప్రశ్న 5.
‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అనే మాటద్వారా సి.నా.రె మనకిచ్చిన సందేశంలో ఉన్న అంతరార్థాన్ని సోదాహరణంగా వివరించండి. (June ’18)
జవాబు:
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. అంటే త్యాగం చేసిన వారి యొక్క మంచిపనులు, చేసిన వారి యొక్క పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి. ప్రస్తుతం మనకు ఏదో బిరుదులు వస్తాయనీ అనుకుంటే లాభం లేదనీ, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలువదనీ సినారె ఈ గజల్ ద్వారా తెలియపరిచారు.
త్యాగం చేసేవారిని, మంచి పనులు చేసేవారి పేర్లు మాత్రమే చరిత్రలో వెలుగుతాయని కవి ప్రబోధించాడు. మనం స్వార్థాన్ని విడిచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. చేసే పనుల్లో చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. తనకు మేలు కలిగే పనులను చేయడంకంటే తోటివారికి ఎక్కువ మేలు కలిగే పనులను చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనాథలైన, అన్నార్హులైన, నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవాలి.
వికలాంగుల సంక్షేమంకోసం నిరంతరం కృషిచేయాలి. వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలి. గ్రామంలో పచ్చని చెట్లను నాటాలి. మూగజీవాల సంరక్షణకు చర్యలను చేపట్టాలి. ప్రమాదాల్లో గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యసహాయం అందే విధంగా కృషి చేయాలి. ఈ విధంగా మనమంతా ప్రజల హితం కోసం నిస్వార్థంగా సేవలను అందించాలి. ఇటువంటి పనుల వల్లనే మన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
PAPER – II : PART – A
1. అవగాహన – ప్రతిస్పందన
అపరిచిత పద్యాలు (5 మార్కులు)
ప్రశ్న 1.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు
ప్రశ్నలు – సమాధానములు
1. తైల మెచ్చట నుండి తీయవచ్చును ?
జవాబు:
తైలమును ఇసుక నుండి తీయవచ్చును.
2. కుందేటి కొమ్ము ఎలా సాధించవచ్చు ?
జవాబు:
ఎక్కడెక్కడో తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు.
3. మూర్ఖుని మనసు రంజింప చేయగలమా ?
జవాబు:
మూర్ఖుని మనసు రంజింపజేయలేము.
4. ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
“మూర్ఖుని మనసు” అను శీర్షిక సరిపోవును.
5. ఇసుము అనగానేమి ?
జవాబు:
ఇసుము అనగా ఇసుక అని అర్థము.
2. క్రింది పద్యము చదివి, క్రింద తప్పొప్పులను గుర్తించండి.
కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రుల శత్రులగుట తథ్యము సుమతీ!
ప్రశ్నలు – సమాధానములు
1. కమలములకు, సూర్యునికి గల సంబంధంలేదు ( )
జవాబు:
తప్పు
2. ‘కమలిన భంగిన్’ అనగా వాడిపోని విధం. ( )
జవాబు:
తప్పు
3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పదం తమతమ నెలవులు దప్పిన ( )
జవాబు:
ఒప్పు
4. నీట బాసినవి కమలములు. ( )
జవాబు:
ఒప్పు
5. ఇది వేమన శతకంలోని పద్యం. ( )
జవాబు:
తప్పు
3. ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
ఎఱుక గల వారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్
ప్రశ్నలు – సమాధానములు
1. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి ?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.
2. ధర్మాన్ని ఎక్కడ నుంచి తెలుసుకోవాలి ?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.
3. దేనిని అనుష్ఠించాలి ?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నీతి బోధ”.
5. గోష్ఠి అనగానేమి ?
జవాబు:
గోష్ఠి అనగా సమావేశమని అర్థము.
4. క్రింది పద్యమును చదివి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
ఎప్పుడు తప్పులు వెదకెడు
అప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
కప్ప వసించిన విధంబు గదరా సుమతీ !
ప్రశ్నలు – సమాధానములు
1. నిరంతరం తప్పులు వెతికే వాని సన్నిధి ఎటువంటిది ?
జవాబు:
పాము నీడలాంటిది.
2. ఎప్పుడూ తప్పులు వెతికే వాడు ఎలాంటివాడు ?
జవాబు:
పాము లాంటివాడు.
3. ఎవరిని సేవించకూడదు ?
జవాబు:
ఎప్పుడూ తప్పులు వెతికేవాడిని.
4. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.
5. “అప్పురుషుడు” అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
ఎప్పుడూ తప్పులు వెతికే వ్యక్తి అని అర్థం.
5. క్రింది పద్యం చదివి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభి రామ వినురవేమ!
ప్రశ్నలు – సమాధానములు
1. అనగా అనగా అభివృద్ధి అయ్యేది ఏది ?
జవాబు:
అనగా అనగా అభివృద్ధి అయ్యేది రాగం
2. ఏది తినగా తినగా తియ్యగా ఉంటుంది ?
జవాబు:
వేము (వేపాకు) తినగా తినగా తియ్యగా ఉంటుంది.
3. పనులు సమకూరాలంటే ఏం చేయాలి ?
జవాబు:
పనులు సమకూరాలంటే సాధన చెయ్యాలి.
4. ఈ శతక పద్యాలు చెప్పిన కవి ఎవరు ?
జవాబు:
ఈ శతకపద్యాలు చెప్పిన కవి వేమన.
5. ఈ పద్యంలో ఒక సంధి పదాన్ని విడదీసి, సంధి పేరు వ్రాయండి.
జవాబు:
విశ్వద + అభిరామ = విశ్వదాభిరామ (సవర్ణదీర్ఘ సంధి).
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)
ప్రశ్న 1.
జీవనభాష్యం పాఠం చదవడం వలన నీవు పొందిన అనుభూతిని వివరిస్తూ మీ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:
సికింద్రాబాద్,
X X X X
ప్రియనేస్తం రహీమ్,
మాకు నిన్న జీవన భాష్యం పాఠం చెప్పారు. పాఠం చిన్నదే కానీ, చాలా బాగుంది. జీవన విధానం ఈ పాఠంలో చాలా బాగా చెప్పారు.
ప్రతి పనికీ ఏదో ఒక వంక పెట్టకూడదన్నారు. ఏవో సమస్యలుంటాయని ఎవరినీ భయపెట్ట కూడదని చెప్పారు.
మా స్నేహితులు నన్ను దేనికో దానికి భయ పెడుతుంటారు. ఈ పాఠం చదివాక భయపెట్టడం, భయపడడం మానేశారు.
ఇది వరకు ఏ పనిచేసినా ప్రయోజనం ఉంటుందా ? ఉండదా ? అని ఆలోచించేవాళ్ళం. ఇక అటువంటి ఆలోచన మానేశాం. కష్టపడి చదివితే మార్కులవే వస్తాయి. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పక ఉంటుందనే నమ్మకం కలిగింది.
మొత్తం మీద ఈ పాఠం చదివాక మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉంటాను మరి. నీకు 10వ తరగతిలో నచ్చిన పాఠం గురించి రాయి.
ఇట్లు,
నీ స్నేహితుడు,
XXXX.
చిరునామా :
ఆర్. రహీమ్, నెం. 6,
10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మల్కాపురం,
రంగారెడ్డి జిల్లా.
ప్రశ్న 2.
మనిషి జీవించవలసిన విధానాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
జీవన విధానం
ప్రకృతికి భయపడిన ఆదిమానవుడు తనకు తాను నిలదొక్కుకున్నాడు. చాలా ప్రగతిని సాధించాడు. సాంకేతిక విజ్ఞానం పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి. కానీ, జీవన విధానంపై ఇంకా పూర్తి అవగాహనను మానవుడు పెంచుకోలేదు.
ఈ రోజు చాలామంది ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడుతున్నారు. తమలో తాము కుమిలి పోతున్నారు. తమ బాధలను కనీసం స్నేహితులకు, తల్లిదండ్రులకు అయినా చెప్పుకోవాలి. అలా చెప్పుకొంటే బాధతో నిండిన మనసు కరిగి కన్నీటి రూపంలో బయటికి పోతుంది. మనసు తేలికవుతుంది.
ఏవో చిన్న చిన్న సమస్యలు చూసి భయపడ కూడదు. కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. జంతువులకు లేని ఆలోచనాశక్తి మనుషులకు ఉంది. ఆ ఆలోచనాశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి.
ఎంత గొప్పవారికైనా కష్టాలు తప్పవు. వాటి ద్వారా గుణపాఠాలు నేర్చుకోవాలి. అభివృద్ధిని సాధించాలి. ఈ విధంగా జీవన విధానం మెరుగుపరచుకోవాలి.
ప్రశ్న 3.
సమస్యలను చూసి భయపడేవారికి ధైర్యాన్ని కలిగించే సూక్తులను రాయండి.
జవాబు:
పరిష్కారం లేని సమస్య లేదు.. భయపడకునేస్తం. ఉంటుంది ఆదుకొనే హస్తం. సమస్యల వల్ల కష్టాలు రావు. కష్టాలే ఉంటాయనుకొంటే సమస్యలు పెరుగుతాయి.
ప్రతి సమస్యనూ కాలం పరిష్కరిస్తుంది. సమస్యలు ఏర్పడినపుడే బుర్ర చురుకుగా పని చేస్తుంది.
సమస్యలు లేని జీవితం పందిరి లేని పాదువంటిది. సమస్యలు మనుషులకు కాక మానులకొస్తాయా ? సాధన చేస్తే సాధ్యం కానిది లేదు.
ప్రయత్నిస్తే పరమాత్మైనా కనిపిస్తాడు. ధైర్యమే విజయం.
ప్రశ్న 4.
భయపడే వ్యక్తికి ధైర్యం కల్గించేలా సంభాషణ తయారు చేయండి.
జవాబు:
మురళి : నేను తప్పు చేశాన్రా, నాకు చాలా భయం వేస్తోంది.
సుధీర్ : ఏం చేశావు ? చెప్పు.
మురళి : ఎవ్వరూ ఏమీ చేయలేరురా. ఇదంతా నా కర్మ.
సుధీర్ : అంత తప్పేం చేశావురా !
మురళి : మా నాన్నగారి పరువు తీసేశాను రా ! నాకు బతికే అర్హత లేదు రా !
సుధీర్ : ఛీ ఛీ అవేం మాటలురా, ఏమయిందో చెప్పు.
మురళి : నా పరీక్ష ……….. పోతుందిరా. నేను పరీక్ష సరిగా రాయలేదు. మా నాన్నగారేమో 10 / 10 రావాలన్నారు.
సుధీర్ : పోతే పోతుంది. దానికే భయ పడిపోతావా ? అయినా ఫలితాలు రావాలి కదా !
మురళి : అపుడు తలెత్తుకోలేనురా !
సుధీర్ : ఏడిశావ్. పరీక్ష పాసవ్వడమే జీవితం కాదు. గొప్పవారు చాలా మంది చిన్నతనంలో సరిగ్గా చదవలేదు. గొప్పవాళ్ళు కాలేదా, మనకు తెలుగు వ్యాక రణం రాసిన పరవస్తు చిన్నయ సూరికి కూడా చిన్నతనంలో సరిగ్గా చదువు రాలేదు. భయ పడిపోయేడా !
మురళి : అయితే ……. పరీక్ష పోయినా ఫరవాలేదా ?
సుధీర్ : నేనిప్పుడే మీ నాన్నగారికి చెబుతా, మనం బాగా చదవాలని అంటారు కానీ, పరీక్ష పాసవ్వడమే జీవిత ధ్యేయమని ఎవ్వరూ చెప్పరు.
మురళి : అలాగే ఇక ఈ విషయం ఆలోచించను.
సుధీర్ : వెరీ గుడ్ – బై
ప్రశ్న 5.
జీవన భాష్యం గజల్లోని అంత్య పదాలతో సొంతంగా వచన కవిత రాయండి.
జవాబు:
నీరవుతుంది : సౌమ్యంగా మాట్లాడితే కోపం కరిగి నీరవుతుంది.
దారవుతుంది : ముందు నిలబడి నడిస్తే పది మందికి అది దారవుతుంది.
ఊరవుతుంది : చమటతో నేలను తడిపితే అది ఊరవుతుంది
ఏరవుతుంది. : మనిషిని మనిషితో కలిపితే అది ఏరవుతుంది
పేరవుతుంది : వాన ఆగక కురిస్తే చేనే ఏరవుతుంది.
పేరవుతుంది : లోకం నన్ను పొగిడినప్పుడే అది నా పేరవుతుంది.
ప్రశ్న 6.
ఆచార్య సి.నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుంచి ఏం తెలుసుకోవాలని అను కుంటున్నారో ప్రశ్నలు రాయండి.
జవాబు:
- మీ రచనల్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం ?
- విశ్వంభరలో దేని గురించి వివరించారు ?
- మీకు బాగా ఇష్టమైన సాహిత్య ప్రక్రియ ఏది ?
- మేమూ గజల్స్ రాయాలంటే ఏం చేయాలి ?
- తెలుగు భాషపైన పట్టు రావాలంటే మేం ఏమేం పుస్తకాలు చదవాలి ?
- ఆధునిక ఆంధ్ర కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాల పేరిట మీరు ఇతరుల సాహిత్యాన్ని ఎందుకు పరిశోధనా అంశంగా తీసుకున్నారు ?
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు
1. గుండెలు పగులు : అగ్ని బాధితులు గుండెలు పగిలేలా ఏడ్చి, సొమ్మసిల్లి పడ్డారు.
2. ఎత్తుల కెదుగు : ఎంత ఎత్తులకెదికినా, బుద్ధిమంతుడు తన మూలాన్ని మరిచిపోడు.
2. పర్యాయపదాలు
మబ్బు – మేఘము, చీకటి, అజ్ఞానము
మనసు – మానసము, హృదయము, ఇష్టము,తలపు, అభిలాష
కన్ను – నేత్రము, చూపు, జాడ, బండిచక్రము
నేస్తం – మైత్రి, చెలిమి, స్నేహం
ఫలము – నాలుగు కర్షములయెత్తు, మాంసము, విఘడియ
మనుష్యుడు – మనుజుడు, మానసి
3. నానార్థాలు
మనస్సు = హృదయము, తలపు, కోరిక, అభిప్రాయము
మబ్బు = మేఘము, అజ్ఞానము, చీకటి
అడుగు = పాదము, పాతాళము, అధమము, పద్యపాదం
దిబ్బ = ఉన్నతభూమి, కుప్ప, మట్టిదిబ్బ, కొండ, ద్వీపము
ఫలము = పండు, ప్రతిఫలం, ప్రయోజనం, ధనము
మృగము = జింక, పశువు, యాచన, వేట, కస్తూరి
శిరస్సు = తల, కొండ కొన, ముఖ్యము, సేనాగ్రము
వంక = వంకర, దిక్కు, నదీ వక్రము, వాగు, వంపు
డొంక = పొద, పల్లపు ప్రదేశం, పశువుల ధారి
4. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
మనుష్యుడు – మనిషి
హిమము – ఇగము
నీరము – నీర
శిరస్సు – సిరస్సు
త్యాగము – చాగము
ద్వీపము – దిబ్బ
ప్రతిజ్ఞ – బిరుదు
మృగము మెకము
5. వ్యుత్పత్త్యర్థాలు
హిమగిరి = హిమము గల కొండ (మంచుకొండ)
మనుష్యుడు = మనువు వలన పుట్టినవాడు (నరుడు)
PAPER – II : PART – B
1. సంధులు
1. ఉకారసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా : నీరవుతుంది = నీరు + అవుతుంది
కన్నీరవుతుంది = కన్నీరు + అవుతుంది
దారవుతుంది = దారి + అవుతుంది
ఫలమేమి = ఫలము + ఏమి
పైరవుతుంది = పైరు + అవుతుంది
ఊరవుతుంది = ఊరు + అవుతుంది
2. ఇకార సంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది.
ఉదా : ఫలమేముందనకు = ఫలమేమి + ఉందనకు
3. అకార సంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది.
ఉదా : ఫలమేముందనకు = ఫలమేమి + ఉందనకు
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు
వంకలు, డొంకలు – వంకలునూ, డొంకలునూ – ద్వంద్వ సమాసం
మనిషి మృగము – మనిషియూనూ, మృగమూను – ద్వంద్వ సమాసం
జంకని అడుగులు – జంకనివైన అడుగులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చెరగని త్యాగం – చెరగనిదైన త్యాగం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఎడారి దిబ్బలు – ఎడారి యొక్క దిబ్బలు – షష్ఠీ తత్పురుష సమాసం
హిమగిరి శిరస్సు – హిమగిరి యొక్క శిరస్సు – షష్ఠీ తత్పురుష సమాసం
ఇసుకగుండెలు – ఇసుక అనెడి గుండెలు – రూపక సమాసం
3. ప్రత్యక్ష-పరోక్ష కథనం
1. ప్రత్యక్ష కథనం : “నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. స్వార్థానికి నేను ఏ పాపం చేయలేదు” అన్నాడు.
పరోక్ష కథనం : తాను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదనీ – స్వార్థానికి తాను ఏ పాపం చేయలేదనీ అన్నాడు.
2. ప్రత్యక్ష కథనం : “నాతో ఇన్ని బేరాలు లేవు” అని పరోక్ష కథనం
దుకాణాదారుడు అన్నాడు. :: తనతో అన్ని బేరాలు లేవని దుకాణాదారుడు అన్నాడు.
3. ప్రత్యక్ష కథనం : నేను నీతో “నేను రాను” అని చెప్పాను.
పరోక్ష కథనం : నేను నీతో రానని చెప్పాను.
4. ప్రత్యక్ష కథనం : “నీవు ఎక్కదలచిన ట్రైన్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అని చెప్పాడు ఆరుద్ర.
పరోక్ష కథనం : అతను ఎక్కదలచిన ట్రైన్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అని ఆరుద్ర చెప్పాడు.
5. ప్రత్యక్ష కథనం : “అందరూ విద్య నేర్వండి” అని ప్రభుత్వం అంటున్నది.
పరోక్ష కథనం : అందరూ విద్య నేర్వండి అని ప్రభుత్వం అంటున్నది.
6. ప్రత్యక్ష కథనం : “నేను ఆవకాయలేనిదే ముద్ద ఎత్తను” అని చెప్పాడు.
పరోక్ష కథనం : అతను ఆవకాయ లేనిదే ముద్ద ఎత్తనని చెప్పాడు.
4. సంక్లిష్టవాక్యాలు
ప్రశ్న 1.
లక్ష్మీబాయి గుంటూరు వచ్చింది. లక్ష్మీబాయి శారదా నికేతనంలో చేరింది. (సామాన్య వాక్యం)
జవాబు:
లక్ష్మీబాయి గుంటూరు వచ్చి, శారదానికేతనంలో చేరింది. (సంక్లిష్ట వాక్యం)
ప్రశ్న 2.
అంబేద్కర్ మిళింద మహా విద్యాలయానికి స్థలం సంపాదించారు. అంబేద్కర్ భవన నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించారు. (సామాన్య వాక్యం)
జవాబు:
అంబేద్కర్ మిళింద మహా విద్యాలయానికి స్థలం సంపాదించి, భవన నిర్మాణాన్ని స్వయంగా పర్య వేక్షించారు. (సంక్లిష్ట వాక్యం)
ప్రశ్న 3.
రవి అన్నం తిన్నాడు. రవి బడికి వెళ్ళాడు. రవి చదువు కొన్నాడు. రవి తిరిగి వచ్చాడు. సామాన్య వాక్యం)
జవాబు:
రవి అన్నం తిని, బడికి వెళ్ళి, చదువుకొని, తిరిగి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)
ప్రశ్న 4.
పశుబలంతో నాయకత్వాన్ని సాధించవచ్చు. పశు బలంతో నాయకత్వాన్ని నిలబెట్టుకోలేం. (సామాన్య వాక్యం)
జవాబు:
పశుబలంతో నాయకత్వం సాధించి నిలబెట్టుకోలేం. (సంక్లిష్ట వాక్యం)
ప్రశ్న 5.
రాముడు అడవికి వెళ్ళెను. తండ్రి మాట నెరవేర్చెను. (సామాన్య వాక్యం)
జవాబు:
రాముడు అడవికి వెళ్ళి తండ్రి మాట నెరవేర్చెను. (సంక్లిష్ట వాక్యం)
ప్రశ్న 6.
అతడు వేకువనే నిద్ర లేచెను. కాలకృత్యములు తీర్చుకొనెను. (సామాన్య వాక్యం)
జవాబు:
అతడు వేకువనే కాలకృత్యములు తీర్చు కొనెను. (సంక్లిష్ట వాక్యం)
5. ఆధునిక వాక్యాలు
1. నా జీవితములో అది ఒక సువర్ణావకాశము.
ఆధునిక భాష : నా జీవితంలో అదొక సువర్ణావకాశం.
2. కొందరు ఉపన్యాసముల మూలమున నా పని చేయుదురు.
ఆధునిక భాష : కొంతమంది (కొందరు) ఉపన్యాసాల మూలంగా ఆ పనిచేస్తారు.
3. మంటలు వేగముగా వ్యాపించుచున్నవి.
ఆధునిక భాష : మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
4. తత్పురుష సమాసమునకే వ్యధికరణమని పేరు కలదు.
ఆధునిక భాష : తత్పురుష సమాసానికే వ్యధికరణం అని పేరు. (లేదా) తత్పురుష సమాసాన్నే వ్యధికరణం అని అంటారు.
6. కర్తరి, కర్మణి వాక్యాలు
1. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
విశ్వామిత్రునిచే రామలక్ష్మణులు ఆహ్వానించబడ్డారు. (కర్మణి వాక్యం)
2. జనకుడు శివధనుస్సు తెప్పించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
జనకునిచే శివధనుస్సు తెప్పించబడింది. (కర్మణి వాక్యం)
3. సుతీక్షమహర్షి తపశ్శక్తిని శ్రీరామునకు ధారాదత్తం చేసాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
సుతీక్ష తపశ్శక్తి శ్రీరామునకు ధారాదత్తం చేయబడింది. (కర్మణి వాక్యం)