These TS 10th Class Telugu Important Questions 6th Lesson భాగ్యోదయం will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 6th Lesson Important Questions భాగ్యోదయం
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు నిర్మల (3 మార్కులు)
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
చదువు మానవుని జీవన వికాసానికి బాటలు వేస్తుందని ఎలా చెప్పగలవు ? (June ’16)
జవాబు:
మానవులకు చదువు అత్యంత ముఖ్యమైన సాధనం. ఇది మానవున్ని జీవన వికాసానికి బాటవేస్తుంది. మానవున్ని ఆలోచనాపరుణ్ణి చేస్తుంది. విచక్షణాజ్ఞానాన్ని కల్పిస్తుంది. మంచి కీర్తిని పెంచుతుంది. నైతిక విలువల్ని కల్గిస్తుంది. ఆర్థిక భద్రతను అందిస్తుంది.
చదువు మంచి చెడులను తెలుపుతుంది. మానవునిలో మాధవుని దర్శించగలిగే సామర్థ్యాన్ని కల్గిస్తుంది. మూఢనమ్మకాలను పారద్రోలుతుంది.
ప్రశ్న 2.
భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాలలో ఎలాంటి మార్పు తీసుకు రాగలిగాడు ?
జవాబు:
మనుష్యులంతా పుట్టుకతో సమానమని ఎవరూ ఎక్కువ ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశాడు. అణగారిన వర్గాల దుర్భర స్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనత అని గుర్తించి, చైతన్య పరిచాడు. అందరూ చదువుకునేలా ప్రోత్సహించాడు. తమ జాతి జనుల్లో భాగ్యరెడ్డి వర్మ ఐక్యతను తీసుకువచ్చాడు. వారిలో ఉన్న ‘తాగుడు’ దురలవాటును మాన్పించాడు. దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకున్నాడు. మూఢనమ్మకాల అజ్ఞానాన్ని తొలగించాడు.
ప్రశ్న 3.
భాగ్యరెడ్డి వర్మ నాయకత్వ పటిమ ఎలాంటిది ?
జవాబు:
భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న అంటరానితనం, మూఢనమ్మకాలు లాంటి సమస్యలను గుర్తించాడు. వాటికి కారణం ఆ వర్గాల అజ్ఞానం, ఉదాసీనత అని తెలుసుకున్నాడు. అందరినీ చదువు కునేలా ప్రోత్సహించాడు. వారిని చైతన్య పరచాడు, తమజాతి జనులను ఏకతాటిపై నడిపాడు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేశాడు. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగేలా చేశాడు. ఆది హిందూవులకు ప్రత్యేక పాఠశాలల ఏర్పాటుకు కృషి చేశాడు. సమస్య మూలాలలోకి వెళ్ళి పరిష్కారానికి కృషి చేశాడు. దీనిని బట్టి భాగ్యరెడ్డి వర్మ నాయకత్వ పటిమ ఎలాంటిదో అర్థమవుచున్నది.
ప్రశ్న 4.
మూఢనమ్మకాలను తొలగించడానికి భాగ్యరెడ్డి వర్మ ఏమి చేశారు ?
జవాబు:
సహేతుకమైన కారణం లేకుండా కొన్ని నమ్మకాలు సమాజంలో కొనసాగుతూ ఉంటాయి. వీటిని మూఢ నమ్మకాలు అంటారు. ఆనాటి సమాజంలో కొందరు ఎక్కువ, కొందరు తక్కువ అనే భావన, అస్పృశ్యత, దేవదాసీ వ్యవస్థ, పసిపిల్లలను దేవునికి వదలివేయడం, జంతు బలులు, లాంటి మూఢనమ్మకాలు జీర్ణించుకు పోయాయి. వీటన్నింటికి కారణం అవిద్య, అజ్ఞానం అని భాగ్యరెడ్డి వర్మ గుర్తించారు. అందరూ చదువు కునేలా ప్రోత్సహించారు. ప్రజలను చైతన్యపరచి మూఢనమ్మకాలను లేకుండా చేయడానికి కృషిచేశాడు.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)
అ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
సంస్కర్తగా భాగ్యరెడ్డివర్మ కృషిని పేర్కొనండి. (Mar. ’16)
జవాబు:
- ఈయన కృషి వల్ల ఆదిహిందువులకు, ప్రభుత్వం ఎన్నో పాఠశాలలు స్థాపించింది.
- దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డు కున్నాడు.
- ప్రజలచే తాగుడు మాన్పించాడు.
- అనేక సభలలో పాల్గొని 3,348 ఉపన్యాసాలు ఇచ్చాడు.
- పసివాళ్ళయిన ఆడ, మగపిల్లలను దేవుడికి వదలి పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
- మనుషులంతా సమానమని, ఎవరూ ఎక్కువ, తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకొనేటట్లు చేశాడు.
- అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేశాడు.
- అంటరాని వర్గాల ఉన్నతి కోసం, సంస్కరణ మొదలుపెట్టాడు.
- అణగారిన కులాల నాయకుల సహకారం, నైతిక మద్దతు కూడగట్టాడు.
- ఈయన శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు, చదువుపై చూపుపెట్టాయి. అందువల్ల కొన్ని సాంఘిక దురా చారాలు మటుమాయమయ్యాయి.
- అంటరాని వర్గాలు అనుభవిస్తున్న అవస్థల నుంచి వారిని గట్టెక్కించడానికి, భాగ్యరెడ్డివర్మ అంకిత భావంతో కృషి చేశాడు.
- అనేక బహిరంగ సభలు జరిపి, సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటి పై నడిపించాడు.
ప్రశ్న 2.
సమాజంలోని మూఢ నమ్మకాలను మీరు ఎలా అరికడతారో వివరించండి.
(లేదా)
మీ చుట్టూ ఉన్న సమాజంలో మూఢ నమ్మకాలు ఏమేమి ఉన్నాయి ? వాటిని నీవు ఎలా తొలగిస్తావు? వివరించు.
జవాబు:
చుట్టుప్రక్కల వారిని చైతన్యపరుస్తాం. మూఢనమ్మకాల వలన కలిగే అనర్థాలను సోదాహరణంగా వివరిస్తాం. నమ్మకం మంచిదే. కాని మూఢనమ్మకం పనికిరాదని చెబుతాం. వాళ్ళకు పూర్తి నమ్మకం కలగడానికి అనుభవపూర్వకంగా నిరూపిస్తాం. ఉదాహరణకు పిల్లి శకునం వస్తే పని జరగదని మూఢనమ్మకం. పిల్లిని శకునం రప్పించుకొని వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తాం. అది తప్పని నిరూపిస్తాం.
అలాగే దిగదుడుపులు వలన రోగాలు తగ్గవని చెబుతాం. దిగదుడిచినవి తొక్కినా ఏమీ కాదని నిరూపిస్తాం. దిగదుడిచిన నిమ్మకాయలు కోసుకొని హాయిగా రసం తాగుతాం. చిల్లంగి, చేతబడి వంటివి కూడా తప్పని నిరూపిస్తాం. జనవిజ్ఞాన వేదిక వారిని మా గ్రామానికి ఆహ్వానిస్తాం. ప్రదర్శనలు ఇప్పిస్తాం. ఉపన్యాసాలు చెప్పిస్తాం. ప్రజలలో చైతన్యం కలిగిస్తాం. మా గ్రామం నుండి మూఢనమ్మకాలను తరిమేస్తాం. సశాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు చేస్తాం. ‘మూఢనమ్మకాలు లేని గ్రామం’ అని మా గ్రామపు సరిహద్దులలో బోర్డు పెడతాం.
ప్రశ్న 3.
భాగ్యరెడ్డి వర్మ దురాచారాలను ఎలా అరికట్టాడు ?
జవాబు:
దురాచారాల వలన చాలా జీవితాలు నాశనం అవుతాయి. కొన్ని కుటుంబాలు తీవ్రమైన ఆవేదనకు, అవమానాలకు గురి అవుతాయి.
దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాల వలన అనేక మంది స్త్రీల జీవితాలు దుర్భరంగా మారతాయి. రోగగ్రస్తమవుతాయి. వారితో ఉన్న పురుషుల జీవితాలు కూడా రోగగ్రస్తం అవుతాయి. వారి కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతాయి.
తాగుడు వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. జ్ఞాపకశక్తిని కూడా కోల్పోతారు. నేరాలకు పాల్పడతారు. సమాజంలో గౌరవం పోతుంది. అనవసరమైన తగాదాలు పెరిగిపోతాయి.
ఈ దురాచారాలు వారి మనసులలో నాటుకు పోయాయి. ఈ అజ్ఞానాన్ని తొలగించడం అంత సులువు కాదు. దీని గురించి భాగ్యరెడ్డివర్మ అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు.
ప్రజలందరిని ఏకతాటిపై నిల్పాడు. దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొన్నాడు. తాగుడు వలన కుటుంబాలు ఎలా నాశనమైపోతాయో వివరించాడు. నిరంతరం వారిని ఈ దురాచారాల నుండి బయట పడవేసే కృషి చేశాడు. కొన్ని కుటుంబాలను ఆ దురాచారాల నుండి దూరం చేయగలిగాడు.
PAPER – II : PART – A
1. అపరిచిత గద్యాలు (5 మార్కులు)
ప్రశ్న 1.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రుణ్ణి చూడ్డానికి జనం తండోపతండాలుగా రావడం మొదలైంది. అందువల్ల యాత్రికులకు సౌకర్యాలు కలుగ చెయ్యవలసిన బాధ్యత తహసీలుదారుగా తన మీద ఉంది. అలాగే భక్తజన శిఖామణిగా ఆలయాన్ని బాగు చెయ్యాల్సిన అవసరం కూడా ఏర్పడింది. దీనికోసం ఒకనాడు గోపన్న ఆ ఊళ్ళో రైతులను పిలిపించి ఆ విషయం వాళ్ళకు చెప్పాడు. ఒక మంచి పనిచేద్దాం. మీరు నాతో సహకరించండి అంటూ గోపన్న ప్రబోధించాడు. ఈ మాటలు విన్న ఊరి జనం అలాగే అని అంగీకరించారు. ఎవరి శక్తి కొద్దీ వారు సహాయం చెయ్యడానికి సిద్ధమయ్యారు. ఆలయ నిర్మాణం మొదలయ్యింది.
ప్రశ్నలు – జవాబులు
1. యాత్రికులకు సౌకర్యాలు ఎందుకు కలుగజేయాలి ?
జవాబు:
భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రుణ్ణి చూడ్డానికి జనం తండోపతండాలుగా రావడం మొదలయ్యింది. అందువల్ల యాత్రికులకు సౌకర్యాలు కలుగజేయవలసి వచ్చింది.
2. గోపన్న ఎవరి భక్తుడు ?
జవాబు:
గోపన్న శ్రీరామచంద్రుడి భక్తుడు.
3. గోపన్న రైతులను ఎందుకు పిలిపించాడు ?
జవాబు:
భద్రాచలం రామునికి ఆలయ నిర్మాణంలో తనకు సాయం చెయ్యమని అడగడానికి గోపన్న రైతులను పిలిచాడు.
4. ఆలయ నిర్మాణం ఎక్కడ మొదలయ్యింది ?
జవాబు:
ఆలయ నిర్మాణం భద్రాచలంలో మొదలయ్యింది.
5. ఎవరి ఆలయం నిర్మిస్తున్నారు ?
జవాబు:
శ్రీరామ చంద్రునికి ఆలయం నిర్మిస్తున్నారు.
ప్రశ్న 2.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆంబోతుల్లా ఉన్న నలుగురు వ్యక్తులు ఎగబడి నరికేస్తుండగా చెట్టు తాలూకు యజమానిలా ఉన్న ఓ పెద్ద మనిషి నడుముకు చేతులేసుకొని నిలబడి వాళ్ళకి సూచనలిస్తున్నాడు. మాలాంటి అమాయక ప్రాణులు ఆ చెట్టుపైన జీవిస్తున్నాయని, వాటి గూళ్ళు, గుడ్లు, పిల్లలు చిన్నాభిన్నమవుతాయనీ, కనీస కనికరం కూడా తట్టనట్టుగా ఎగబడిపోతున్నారు. నాశనం చేయడానికే తప్ప నిర్మించడానికి జన్మించలేదన్నట్లు వారి ప్రతాపాన్నంతా ఆ చెట్టు మీద చూపిస్తున్నారు.
ప్రశ్నలు – జవాబులు
1. పై విషయాన్ని బట్టి అక్కడేం జరుగుతోంది ?
జవాబు:
పై విషయాన్ని బట్టి నలుగురు మనుష్యులు ఒక చెట్టును నరికివేస్తున్నారు.
2. అక్కడ సూచనలిస్తున్నదెవరు ?
జవాబు:
అక్కడ ఆ చెట్టు యజమాని, చెట్టును నరికే వారికి సూచనలు ఇస్తున్నాడు.
3. వారిలో ఎలాంటి ఆలోచన లేకుండా పోయింది ?
జవాబు:
అమాయక ప్రాణులైన పక్షులు చెట్టుపైన జీవిస్తున్నా యనీ, వాటి గూళ్లు, గుడ్లు, పిల్లలు చిన్నాభిన్నమవు తాయనే ఆలోచన లేకుండాపోయింది.
4. ‘ఒక్కసారిగా’ అనే అర్థాన్నిచ్చే పదాన్ని గుర్తించండి.
జవాబు:
ఒక్కసారిగా అనే అర్థాన్నిచ్చేది “ఎగబడి”.
5. ‘మాలాంటి అమాయక ప్రాణులు’ అని ఎవరు అనుకొని ఉండవచ్చు ?
జవాబు:
చెట్టు మీద నున్న పక్షులు.
ప్రశ్న 3.
కింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గిరిజన గ్రామాల్లో సురక్షిత నీరు లేక పోవడంతో పాటు మురుగునీటి సమస్య కూడా తలెత్తుతోంది. దీంతో గిరిజనులు అనునిత్యం వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, తలనొప్పి, డయేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే మందులతో జబ్బులు నయం కాకపోగా ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని దీంతో ఆర్థికంగా చితికి పోతున్నామని పలువురు గిరిజనులు వాపోతున్నారు.
ప్రశ్నలు – జవాబులు
1. గిరిజనులు వ్యాధులబారిన పడడానికి కారణమేమిటి ?
జవాబు:
సురక్షిత నీరు లేకపోవడంవల్ల గిరిజనులు వ్యాధుల బారిన పడుతున్నారు.
2. గిరిజనులను పట్టి పీడించే జబ్బులేవి ?
జవాబు:
జ్వరం, జలుబు, తలనొప్పి, మలేరియా వంటి వ్యాధులు గిరిజనులను పట్టి పీడిస్తున్నాయి.
3. ప్రైవేటు వైద్యులను ఆశ్రయించడం ద్వారా గిరిజనులే మౌతున్నారు ?
జవాబు:
ప్రైవేటు వైద్యులను ఆశ్రయించడం ద్వారా ఆర్థికంగా చితికిపోతున్నారు.
4. పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ గద్యం ఏవిషయాన్ని తెలియజేస్తున్నది ?
5. గిరిజన గ్రామాల్లోని ప్రధాన సమస్యలేవి ?
జవాబు:
గిరిజన గ్రామాల్లో సురక్షిత నీరు లేకపోవడం, మురుగునీటి సమస్య మొదలగునవి ప్రధాన సమస్యలు.
ప్రశ్న 4.
క్రింది గద్యాన్ని చదవండి. కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
రంగడు ఉలిక్కిపడి లేచి, జరిగిన యావత్తు సంగతినీ, ఆ వచ్చిన వ్యక్తితో చెప్పి, ఉదయమే సేటీతో తప్పక మాట్లాడుతాను. ఈ రాత్రికి క్షమించమని బ్రతి
మాలాడు.
గుమాస్తా సానుభూతిని ప్రకటిస్తూ “రంగా ! సేటు విషయం నీకు తెలియంది కాదు. వాడంత కంకుష్టకుడు కాబట్టే అంతటి వాడయ్యాడు. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళకపోతే నేటి నీ అవస్తే, రేపు నీకూ పడుతుంది” అన్నాడు.
తన కోసం, తోటివారిని కష్టాల్లో ఇరికించే మనస్తత్వం కాదు రంగడిది. అందుకే ఆ గుమాస్తా సహాయంతో విరిగిన బండిని తీసుకొని సేల్జీ ఇల్లు చేరుకున్నాడు.
రిక్షా ఇరగొట్టినందుకు యాభై రూపాయలు చెల్లించి, విడిపించుకుంటా” నన్నాడు రంగడు. సేట్టీ ‘సరే’ నంటూ గుడిసె గిర్వీ వ్రాయించుకొని అణాబిళ్ళ అంటించి, రంగడి సంతకం చేయించుకొని రిక్షాను బాగుచేయించి, యెప్పటిలాగే రోజు కిరాయికిచ్చాడు.
ప్రశ్నలు – జవాబులు
1. రంగడు ఎలా లేచాడు ?
జవాబు:
రంగడు ఉలిక్కిపడి లేచాడు ?
2. సేట్టీ ఎలాంటివాడు ?
జవాబు:
సేట్టీ కంకుష్టకుడు.
3. రంగని మనస్తత్వం ఎట్టిది ?
జవాబు:
తన కోసం తోటివారిని కష్టాల్లో ఇరికించే మనస్తత్వం కాదు.
4. రంగడు దేనిని తాకట్టు పెట్టాడు ?
జవాబు:
రంగడు గుడిసెను తాకట్టు పెట్టాడు.
5. రిక్షా విరగగొట్టినందుకు ఎంత చెల్లించాడు ?
జవాబు:
రిక్షా విరగగొట్టినందుకు యాభై రూపాయలు చెల్లించాడు ?
ప్రశ్న 5.
ఈ క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
కొమర్రాజు లక్ష్మణరావు విద్యాభ్యాస కాలంలో పలుభాషలు నేర్చెను. అందువలన ఆయనకు విశాలమైన దృక్పథం ఏర్పడి అనే పరిశోధనలకు, చర్చలకు ఉపయోగపడింది. ఇంగ్లీషు పండితుల ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించి సాంస్కృతిక పునరుజ్జీవనానికి నారు పోశారు. శాసనాలు సేకరించి, పరిశోధన చేసి, సాక్ష్యాధారాలతో చరిత్ర రచన చేశారు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగు ప్రజలందరకు అందుబాటులోకి తేవడానికి ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ రచనకు పూనుకున్నారు. ఏ విషయమైనా మొక్కుబడిగా కాకుండా దాని లోతులు చూచి అందివ్వడానికి ఆయన కృషి చేశారు.
ప్రశ్నలు – జవాబులు
1. లక్ష్మణరావుకు పలుభాషలు నేర్చుకోవడం ఎలా ఉపయోగపడింది ?
జవాబు:
లక్ష్మణరావుకు పలుభాషలు నేర్చుకోవడం అనేక పరిశోధనలకు, చర్చలకు ఉపయోగపడింది.
2. లక్ష్మణరావు చరిత్ర రచన ఎలా చేశారు ?
జవాబు:
లక్ష్మణరావు శాసనాలు సేకరించి, పరిశోధన చేసి, సాక్షాధారలతో చరిత్ర రచన చేశాడు.
3. తెలుగు ప్రజల కోసము ఏ రచనకు ఆయన పూనుకొన్నాడు?
జవాబు:
తెలుగు ప్రజల కోసం ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ రచనకు ఆయన పూనుకున్నాడు.
4. ఎవరి ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు ?
జవాబు:
ఇంగ్లీషు పండితుల ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు.
5. శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర, భాషానిలయం ద్వారా దేనికి నారు పోశారు ?
జవాబు:
సాంస్కృతిక పునరుజ్జీవనానికి నారు పోశారు.
ప్రశ్న 6.
క్రింది అంశాన్ని చదివి ఖాళీలను పూరించండి.
ఉప్పు ఉత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి, ‘దేవరంపాడు’ శిబిరానికి ప్రాతినిధ్యం వహించేది. ఈ శిబిరం బాగా పని చేసిందని ప్రశంసలు పొందింది. వివిధ గ్రామాల నుండి వందలమంది సత్యాగ్రహులు ఈ శిబిరానికి వచ్చేవారు. వారిని పోలీసులు అరెస్టు చేసేవారు. ‘స్త్రీలు భయపడక ధైర్యంగా వారినెదుర్కొన్నారు. మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టముట్టారు. అయినా లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోని స్త్రీలు జంక లేదు. సత్యాగ్రహం మానలేదు.శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరు లోను, దుర్గాబాయమ్మ చెన్నపురిలోను, రుక్మిణమ్మ వేదారణ్యంలోనూ మరికొందరు స్త్రీలు భిన్న ప్రాంతాల లోనూ చూపిన సాహసో ఉత్సాహములు, ఆంధ్రుల ప్రతిష్ఠను విస్తరింపజేశాయి, అని ఆంధ్రపత్రిక 1932లో వీరిని ప్రశంసించింది.”
ఖాళీలు – జవాబులు
1. గుంటూరు ఉప్పు సత్యాగ్రహానికి ………………… నాయకురాలు.
జవాబు:
ఉన్నవ లక్ష్మీబాయమ్మ
2. ………………… శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
జవాబు:
మూడుసార్లు
3. సత్యాగ్రహ శిబిరానికి ………………….. నుండి వచ్చేవారు.
జవాబు:
భిన్న గ్రామాల నుండి
4. లక్ష్మీబాయమ్మ ఉప్పు సత్యాగ్రహంలో …………………… శిబిరానికి ప్రాతినిధ్యం వహించేది.
జవాబు:
దేవరంపాడు
5. ఆంధ్రపత్రిక …………………… లో వీరిని ప్రశంసించింది.
జవాబు:
1932
2. సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)
ప్రశ్న 1.
భాగ్యరెడ్డివర్మ లాగా మీ గ్రామంలో సేవ చేసిన వ్యక్తి గురించి నీ మిత్రునికి లేఖ రాయి.
జవాబు:
ఏన్కూరు,
X X X X .
ప్రియమైన గాయిత్రికి,
నీ స్నేహితురాలు రజని వ్రాయు లేఖ, మా గ్రామంలో సర్పంచ్ గారు చాలా సేవ చేస్తున్నారు. గ్రామం మొత్తానికి మంచినీటి సదుపాయం కల్పించారు. మురుగునీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపరిచారు. ప్రతి నెల గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. పాఠశాల భవనాలను కూడా బాగు చేయించారు.
ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు.
ఇట్లు,
నీ మిత్రురాలు,
X X X X .
చిరునామా :
గాయత్రి,
D/o. రాజారావుగారు,
2 వ లైను, గాంధీ బజార్,
ఖమ్మం.
ప్రశ్న 2.
మీ పాఠశాలలో జరిగిన స్వయం పాలనా దినోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
మిత్రునకు లేఖ
ఆదిలాబాద్,
X X X X X.
మిత్రుడు శశికుమార్కు,
శుభాభినందనలు, స్వయంపాలన దినోత్సవ శుభాకాంక్షలు.. మొన్న 23.1.2018న పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం మహావైభవంగా జరిగింది. మేము మా పాఠశాలను ముందురోజే చక్కగా అలంకరించాము. 26వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మా ఎమ్.పి. గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మా ఎమ్.ఎల్.ఏ. గారి అధ్యక్షతన సభ జరిగింది.
స్వయం పాలన దినోత్సవం యొక్క ప్రాధాన్యాన్ని గూర్చి మాకు ఎమ్.పి. గారు, ఎమ్.ఎల్.ఏ గారు, మా ప్రధానోపాధ్యాయులు వివరించి చెప్పారు. మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాశయుడికి మేము జోహార్లు సమర్పించాము. ఈ సందర్భంగా మాకు ఆటలపోటీలు జరిగాయి. నేను ఆడిన క్రికెట్ టీము మొదటి బహుమతిని గెల్చుకుంది. మాకు మిఠాయిలు పంచారు. మీ పాఠశాలలో జరిగిన ఉత్సవాన్ని గూర్చి రాయి. ఉంటా. మీ తల్లిదండ్రులకు నా వందనాలు.
ఇట్లు,
మీ మిత్రుడు
X X X X .
చిరునామా :
శశికుమార్,
S/o వెంకటేశ్వరరావు గారు,
సుబ్బయ్య గారి వీధి,
నెహ్రూనగర్, బాసర.
ప్రశ్న 3.
ఈనాటి దురాచారాల గురించి సంభాషణ రాయండి.
జవాబు:
శ్రీవల్లి : వరకట్నం గురించి నీ అభిప్రాయం ఏంటి ?
శ్రీధర్ : వరకట్నం ఒక దురాచారం. చట్ట ప్రకారం నేరం.
శ్రీవల్లి : చట్టప్రకారం అన్ని దురాచారాలు నేరమే.
శ్రీధర్ : నిజమే చాలా మంది కట్నం ఇచ్చామని చెప్పరు. తీసుకొన్న వారూ చెప్పరు. ఇంకెలా చట్టం పనిచేస్తుంది.
శ్రీవల్లి : చట్టాల కంటే ప్రజలలో చైతన్యం ముఖ్యం.
శ్రీధర్ : నిజమే. తాగుడు, దేవదాసీ మొదలైన దురా చారాలు కూడా నేరాలే కదా !
శ్రీవల్లి : వాటి విషయంలో కూడా ప్రజలలో చైతన్యం కలిగించాలి.
శ్రీధర్ : అయితే, మన స్నేహితులం అందరం ఒక సంఘంగా ఏర్పడదాం. దురాచారాలకు వ్యతి రేకంగా ప్రజలను చైతన్యపరుద్దాం.
శ్రీవల్లి : ఇంకేం ? మన సంఘం పేరు ‘దురాచార నిర్మూలనా సంఘం’. ఈ రోజు నుంచే మొద లెడదాం.
శ్రీధర్ : రేపటి నుంచి మొదలెడదాం……
శ్రీవల్లి : అలాగే. రేపు కలుద్దాం. మనవాళ్ళందరితో, బై బై …………….
ప్రశ్న 4.
విద్యాభివృద్ధిని కోరుతూ నినాదాలు రాయండి.
జవాబు:
చదువే ప్రగతికి సోపానం
అక్షరాస్యతే పురోగతి – నిరక్షరాస్యతే తిరోగతి
అందరూ చదవాలి – అందరూ ఎదగాలి
కెందుకు తొందర – పదరా బడికి ముందర
చదవడం బాలల హక్కు – చదివించడం పెద్దల బాధ్యత
చదువుతో భవిత బంగారం – లేదంటే అంధకారం
పాఠశాలలు – ఆధునిక దేవాలయాలు
బడిగంటలే – ప్రగతికి జేగంటలు
ప్రశ్న 5.
సమాజ సేవ చేయమని ప్రోత్సహిస్తూ కవిత రాయండి.
జవాబు:
సమాజం
నీకు భద్రత కల్పించేది సమాజం
నీకు భవిష్యత్తు ఇప్పించేది సమాజం
నీకు విద్యను నేర్పేది సమాజం
నీకు ఉద్యోగం ఇచ్చేది సమాజం
నీకు అన్నీ ఇచ్చేది సమాజం
మరి సమాజానికి నువ్వు ఇచ్చేదేమిటి ?
సేవ – సేవ – సేవ – సమాజ సేవ.
సమాజ సేవే నీ ధ్యేయం.
ప్రశ్న 6.
నిరక్షరాస్యతను నిర్మూలించవలసిన ఆవశ్యకతను తెలియపరుస్తూ, అక్షరాస్యత ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం రూపొందించండి.
జవాబు:
అక్షరాస్యతే అభివృద్ధి
దేశం అభివృద్ధి చెందాలంటే, అక్షరాస్యతా శాతం పెరగాలన్న గాంధీజీ మాటలను వేదవాక్కుగా భావిద్దాం.
నిరక్షరాస్యతను నిర్మూలించడం మన కర్తవ్యం. ప్రజలను విజ్ఞానవంతులను చేద్దాం. మన దేశ సౌభాగ్యం పెంచుదాం.
వేలిముద్రలు జాతికి అవమానం, అభివృద్ధి నిరోధకం, మోసం చేసేవారికి వరం. అమాయకత్వానికి ఆలవాలం. అందుకే రండి నిరక్షరాస్యతను నిర్మూలిద్దాం. అక్షరజ్ఞానం పెంచుదాం. దేశాభి వృద్ధిలో మన మందరం పాలు పంచుకొందాం.
ఇట్లు
నిరక్షరాస్యతా నిర్మూలన సంఘం,
గుంటూరు
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – I : PART- B
1. సొంతవాక్యాలు
- ఏకతాటిపై : భారతీయులందరు దేశాభివృద్ధికి ఏకతాటిపై కృషి చేయాలి.
- అంకితం కావడం : దేశ ప్రజలందరూ త్రికరణశుద్ధిగా దేశసేవకు అంకితం కావాలి.
2. పర్యాయపదాలు
మాట = ఉక్తి, పలుకు, ఇరు, వక్తవ్యం
ఉన్నతి = వికాసం, అభివృద్ధి, ప్రగతి
చిత్తము = మనస్సు, హృదయం
పోరాటం = యుద్ధం, రణం, సంగ్రామం, సమరం
కులము = వంశము, కొలము, వంగడం, జాతి
3. నానార్థాలు
కులము = వంశము, జాతి, శరీరం, ఇల్లు
జీవనము = బ్రతుకు, నీళ్ళు, గాలి, ప్రాణం
వ్యక్తి = దృశ్యము, ఉనికి, స్పష్టత
వ్యసనము = ఆపద, ఆసక్తి, పాపము, చింత
జాతి = సంతానము, పుట్టుక, వర్ణము, కులము, జాజికాయ
నీతి = న్యాయము, ఉపాయం, మంచి నడత, రీతి
4. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
అర్పణ – అప్పగింత
పక్షము – పక్క
ఆర్య – అయ్య
క్షేమము – సేమము
ఆత్మ – ఆతుమ
క్రూరము – కూళ
కులము – కొలము
జీవితము – జీతమ
క్రీడ – గొందిలి
దృష్టి – దిష్టి
ధర్మము – దమ్మము
నిజము – నిక్కము
PAPER – II : PART – B
1. సంధులు
తెలుగు సంధులు
1. అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా :
చిన్నప్పుడు = చిన్న + అప్పుడు
దగ్గరయ్యేలా = దగ్గర + అయ్యేలా
2. ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి యగును.
ఉదా :
మనుషులంతా = మనుషులు + అంతా
గట్టెక్కించడానికి = గట్టు + ఎక్కించడానికి
ప్రతినిధులంతా = ప్రతినిధులు + అంతా
జాగరూకమయ్యింది= జాగరూకము + అయ్యింది
3. యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఉదా :
అత్యంత = అతి + అంత
4. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
ఉదా :
కార్యాచరణ = కార్య + ఆచరణ
ప్రజాభిప్రాయం = ప్రజ + అభిప్రాయం
5. లు, ల,న,ల సంధి
సూత్రం : లు, ల, న, లు పరమగునపుడు ఒకానొకచో ముగాగమమునకు లోపమును, దాని పూర్వ స్వరమునకు దీర్ఘమును విభాషనగు.
ఉదా :
కుటుంబాలు = కుటుంబము + లు
ఉపన్యాసాలు = ఉపన్యాసము + లు
వర్గాలు = వర్గము + లు
దురాచారాలు = దురాచారము + లు
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు
అంకితభావం – అంకితమైన భావం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
అచిరకాలం – అచిరమైన కాలం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
మూఢనమ్మకం – మూఢదైన నమ్మకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
దుర్భర పరిస్థితులు – దుర్భరమైన పరిస్థితులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
హిందూ సమాజం – హిందూ అను పేరు గల సమాజం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
జీవితగమనం – జీవితం యొక్క గమనం – షష్ఠీ తత్పురుష సమాసము
కులవ్యవస్థ – కులం యొక్క వ్యవస్థ – షష్ఠీ తత్పురుష సమాసము
ఆటల ప్రదర్శన – ఆటల యొక్క ప్రదర్శన – షష్ఠీ తత్పురుష సమాసము
చీలికలు, వేలికలు – చీలికలునూ, పేలికలునూ – షష్ఠీ తత్పురుష సమాసము
చిత్తశుద్ధి – చిత్తము యొక్క శుద్ది – షష్ఠీ తత్పురుష సమాసము
దేవదాసి – దేవతల యొక్క దాసి – షష్ఠీ తత్పురుష సమాసము
ప్రజాభిప్రాయం – ప్రజల యొక్క అభిప్రాయం – షష్ఠీ తత్పురుష సమాసము
గర్వకారణం – గర్వమునకు కారణం – షష్ఠీ తత్పురుష సమాసము
కులపెద్ద – కులమునకు పెద్ద – షష్ఠీ తత్పురుష సమాసము
ఆదిహిందూ మహాసభ – ఆదిహిందువుల యొక్క మహాసభ – ద్వంద్వ సమాసము
యువతీయువకులు – యువతులును, యువకులును – ద్వంద్వ సమాసము
తెలివితేటలు – తెలివియునూ, తేటలునూ – ద్వంద్వ సమాసము
మార్గదర్శి – మార్గమును దర్శించువాడు – ద్వితీయా తత్పురుష సమాసం
భాగ్యోదయం – భాగ్యము యొక్క ఉదయం – ద్వితీయా తత్పురుష సమాసం
అజ్ఞానం – జ్ఞానం కానిది – నఞ తత్పురుష సమాసం
అచిర – చిరం కానిది – నఞ తత్పురుష సమాసం
3. ప్రత్యక్ష – పరోక్ష కథనాలు
1. ప్రత్యక్ష కథనం : “నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. స్వార్థానికి నేను ఏ పాపం చేయలేదు” అన్నాడు.
పరోక్ష కథనం : తాను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదనీ – స్వార్థానికి తాను ఏ పాపం చేయలేదనీ అన్నాడు.
2. ప్రత్యక్ష కథనం : “నాతో ఇన్ని బేరాలు లేవు” అని దుకాణాదారుడు అన్నాడు.
పరోక్ష కథనం : తనతో అన్ని బేరాలు లేవని దుకాణాదారుడు అన్నాడు.
3. ప్రత్యక్ష కథనం : నేను నీతో “నేను రాను” అని చెప్పాను.
పరోక్ష కథనం : నేను నీతో రానని చెప్పాను.
4. ప్రత్యక్ష కథనం : “నీవు ఎక్కదలచిన ట్రైన్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అని చెప్పాడు ఆరుద్ర.
పరోక్ష కథనం : అతను ఎక్కదలచిన ట్రైన్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అని ఆరుద్ర చెప్పాడు.
5. ప్రత్యక్ష కథనం : “అందరూ విద్యనేర్వండి” అని ప్రభుత్వం అంటున్నది.
పరోక్ష కథనం : అందరూ విద్యనేర్వండి అని ప్రభుత్వం అంటుంది.
6. ప్రత్యక్ష కథనం : “నేను ఆవకాయలేనిదే ముద్ద ఎత్తను” అని చెప్పాడు.
పరోక్ష కథనం : అతను ఆవకాయలేనిదే ముద్దెత్తనని చెప్పాడు.
4. కర్తరి – కర్మణి వాక్యాలు
ప్రశ్న 1.
పర్షియన్ ట్యూటర్ ఆయన కొంతకాలం పని చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పర్షియన్ ట్యూటర్గా ఆయనచే కొంతకాలం పనిచేయ బడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 2.
ఆయన కన్నుమూసిన విషయం పత్రికలో వ్రాశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఆయనచే కన్నుమూయబడిన విషయం పత్రికలో వ్రాయబడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 3.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
విశ్వామిత్రునిచే రామలక్ష్మణులు ఆహ్వానించబడ్డారు. (కర్మణి వాక్యం)
ప్రశ్న 4.
జనకుడు శివధనుస్సు తెప్పించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
జనకునిచే శివధనుస్సు తెప్పించబడింది. (కర్మణి వాక్యం)