These TS 10th Class Telugu Important Questions 5th Lesson నగరగీతం will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 5th Lesson Important Questions నగరగీతం
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు )
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘నగరగీతం’ రాయడానికి గల నేపథ్యాన్ని వివరించండి.
జవాబు:
ఆధునిక కాలంలో మనుష్యులందరూ నగరంలో జీవించాలని కోరుకుంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఉన్నత విద్య, ఉత్తమ ఉద్యోగావకాశాలు, మంచి వైద్యం, వివిధ వ్యాపారాలు చేసుకొనే అవకాశం, విలాస జీవితం, నగరంలోనే లభిస్తున్నాయి. పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గి పోవడంతో, బతుకుతెరువు కోసం ప్రజలు నగరాలకు వలసపోతున్నారు.నగరంలోని అనుకూల పరిస్థితులను ఉపయోగించుకొని, నగరంలో నివాసం ఉండాలని ప్రజలు తాపత్రయ పడుతున్నారు.
పై కారణాలతో నగరాలు జనాభాతో క్రిక్కిరిసి పోతున్నాయి. నీటి ఎద్దడి, అధిక ధరలు, కాలుష్యాలు, కొత్త అనారోగ్యాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ఆమ్లు, ఉగ్రవాదం, విదేశీ సంస్కృతి వంటివి, నగరపాలనా వ్యవస్థకు సవాళ్ళు విసురు తున్నాయి. దానితో నగరం సామాన్యుడికీ, మధ్య తరగతి వారికీ అందనంత దూరంగా కదిలిపోతోంది.
నగరంలో మనిషి యాంత్రిక స్థితిలోకి మారి పోతున్నాడు. తనకు తాను పరాయీకరణకు గురవు తున్నాడు.
పై నేపథ్యంలో నగరజీవితం యథార్థదృశ్యాన్ని, ఈ కవితలో రచయిత చిత్రించాడు.
ప్రశ్న 2.
నగర జీవితం నేటి పరిస్థితుల్లో ఎలా ఉంది ?
జవాబు:
నగర జీవితం ఈనాడు ఆశలపల్లకిలో విహరించే ఊరించే జీవితం. అందుకోసమే నగరాలు జనారణ్యాలతో కిక్కిరిసి పోతున్నాయి. అందమైన భవనాలు ఎన్ని ఉన్నాయో అంతకంటే అధికంగా మురికి వాడలున్నాయి. అరకొర అవకాశాలతో జీవించటం దుర్భరమైనా జీవితాలు వెళ్ళదీసే పేదల జీవితం ఒక ప్రక్క మరొక ప్రక్క విలాసాల హోరులో డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేసే కోటీశ్వరులు, ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులు, బతుకు తెరువును వెళ్ళిదీసే అల్పాదాయ వర్గాల వారు, సుందరమైన భవనాలు, వ్యాపారసంస్థలు, కాలాన్ని ఎలా వృథా చేయాలో అలావృథా చేసే సోమరిపోతులు, రకరకాల వృత్తి వ్యాపకాలలో స్థిరపడ్డవారు ఇవీ నగరజీవితము యొక్క రెండు పార్శ్వాలు.
ప్రశ్న 3.
నగర గీతం ఆధారంగా అలిశెట్టి ప్రభాకర్ కవితా శైలిని రాయండి.
జవాబు:
అలిశెట్టి ప్రభాకర్ వచన కవి. తన ‘నగర గీతం’ కవితలో శబ్దాలంకారాలను, అర్థాలంకారాలను ప్రయోగించాడు. ‘నగారా మోగిందా
నయాగరా దుమికిందా’ వంటి చోట్ల అంత్యాను ప్రాసను ప్రయోగించాడు.
‘చదువుల పుప్పొడి’ వంటి చోట్ల రూపకాలంకారాలను ప్రయోగించాడు.
‘నగరం మహావృక్షం మీద
ఎవరికి వారే ఏకాకి’ వంటి చోట్ల నగరంలోని సామాజిక జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూనే ఘాటుగా విమర్శించాడు. ‘మెర్క్యురీ నవ్వులు, పాదరసం నడకలు’ అని చెప్పి నగర ప్రజలలోని కృత్రిమత్వం, కంగారును వివరించాడు. ఈ విధంగా అలిశెట్టి శైలి రమ్యంగా సాగింది.
ప్రశ్న 4.
‘తల్లి ఒడి వంటి పల్లె సీమ’ అనడంలో ఏమిటి ?
జవాబు:
తల్లి పాలలో కల్తీ ఉండదు. తల్లి ప్రేమలో కల్మషం ఉండదు. తల్లి ఆదరణలో స్వార్థం ఉండదు. తల్లి అంటే పరిపూర్ణమైన ప్రేమమూర్తి. కడుపు నిండా పెడుతుంది. కంటి నిండా నిద్ర పుచ్చుతుంది. భయపడితే లాలిస్తుంది.
పల్లెటూరు కూడా కల్తీ లేని ఆహారం ఇస్తుంది. కల్మషం లేని గాలి, నీరు ఇస్తుంది. ఆప్యాయతతో పలకరిస్తుంది. అందుకే పల్లెసీమను తల్లి ఒడితో పోల్చాడు.
ప్రశ్న 5.
‘దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు’ అనటంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
దారిద్య్రం అనేది ఈనాడు సమాజంలో ఎక్కువ శాతం ఉంది. ఎంత కష్టించినా రెక్కలు ముక్కలు చేసుకొన్నా సామాన్యుని స్థాయి ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అనే విధంగా ఉంది. సంప్రదాయవాదులు దీన్ని కర్మఫలం అన్నా మనం పరిస్థితులు చూస్తే ఎదుటివారి దోపిడిని పరిశీలిస్తూ ఉంటే ఎంతోబాధనిపిస్తుంది. భాగ్య వంతులు తామేదో దేవతాపురుషులన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. సమాంతర రేఖలు ఏనాడూ కలుసుకోనట్లే దారిద్ర్యం సౌభాగ్యం కలుసుకొనే పరిస్థితి లేదనేది రచయిత అభిప్రాయం.
ప్రశ్న 6.
నగరంలోని మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎందుకు? ‘నగరగీతం’ ఆధారంగా విశ్లేషించండి.
జవాబు:
నగరారణ్య హోరు – నరుడి జీవన ఘోష’ అన్నాడు కవి. అంటే నగరం ఒక అరణ్యం లాంటిది. అరణ్యం లో ప్రాణానికి భద్రత ఉండదు. క్రూర మృగాలు చంపేయవచ్చు. అలాగే నగరంలోనూ ప్రాణాలకు భద్రత లేదు. రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. అయినా నగరంలోని మనుషులెవరూ పట్టించుకోరు.
నగరంలో మనుషులు జీవించడానికి చాలా కష్ట పడతారు. ఇరుకు గదులలో, జీవిస్తారు. నగర వాసుల ప్రవర్తన అర్థం కాదు. పిల్లలు చదువుల గురించి తప్ప వేరేదీ పట్టించుకోరు. కొందరు ధనవంతులు, కొందరు పేదలు ఉంటారు. ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. తెచ్చిపెట్టుకొన్న మర్యాదను ప్రదర్శిస్తారు. పేదవారు నడిచి వెడతారు. మధ్యతరగతి వారు ఆటోలలో వెడతారు. ధనవంతులు కార్లలో
వెడతారు.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)
కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘నగర జీవనంలో మనుషుల వెనుక ఆనందాలు, విషాదాలు ఉంటాయి’ అనే కవి మాటల్లోని సారాంశాన్ని వివరించండి. (T.S Mar. ’15.)
జవాబు:
నగరాలలో, దారిద్ర్యము, సౌభాగ్యము సమాంతర రేఖల్లా ఉంటాయి. నగరాలు వెరైటీ సమస్యల మనుష్యులతో, కోలాహలంగా ఉంటాయి. నగరాల్లో ఎంత పనిచేసినా, ఎవడికీ తీరిక ఉండదు. వారి కోరికలు నెరవేరవు. ఏవో తెచ్చి పెట్టుకొన్న నవ్వులతో, పాదరసం నడకలతో, జనం బిజీబిజీగా ఉంటారు. నగరాలలో పెద్ద హోరుగా ఉంటుంది. నగరాల్లో ప్రజలు ఇనప్పెట్టెల్లాంటి ఇళ్ళల్లో ఊపిరాడకుండా బతుకుతారు. నగరాల్లో ఒకరిని మరొకరు పట్టించు కోరు. నగరాల్లో భవంతులతో పాటు పూరిళ్ళూ ఉంటాయి. నగరాల్లో నాలుగురోడ్ల జంక్షన్లలో చావులు ఉంటాయి.
అయితే నగరాల్లో కవి చెప్పినట్లు విషాదాలే కాక, ఆనందాలూ ఉంటాయి. వినోదానికి నగరాల్లో సినిమాలు, పార్కులు ఉంటాయి. కావలసిన వస్తువులు అన్నీ నగరాల్లో ఒకేచోట దొరుకుతాయి. పిల్లల చదువులకు మంచి కాన్వెంట్లు నగరాల్లో ఉంటాయి. మంచి అందమైన రోడ్లు, ప్రయాణసాధనాలు ఉంటాయి. కార్లు, రైళ్ళు, విమానాలు ఉంటాయి. అందమైన బట్టలు, వస్తువులు ఉంటాయి.
ఈ విధంగా నగరంలో మనుషుల వెనుక ఆనందాలు, విషాదాలు కలిసి ఉంటాయి.
ప్రశ్న 2.
“నగరగీతం” సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
నగర జీవన విధానంపై అలిశెట్టి ప్రభాకర్ అభి ప్రాయాలను మీ సొంతమాటల్లో రాయండి. (T.S June ’17)
(లేదా)
ఈనాటి నగర జీవితాన్ని విశ్లేషించండి.
జవాబు:
నగరం అరణ్యం వంటిది. ఆ అరణ్యం హోరు, ఢంకా మోగినట్లు, నయాగరా జలపాతం దుమికి నట్లు, నాలుగురోడ్ల కూడళ్లలో వినిపిస్తూ ఉంటుంది. ఆ హోరు నగరజీవుల బతుకుల్లోంచి వచ్చిన ఉరుములా ఉంటుంది.
పల్లెలను వదలి నగరానికి వచ్చిన పేదరైతులు ఇనప్పెట్టెల్లాంటి నగరాల్లో ఊపిరి సలుపని బతుకులు బ్రతుకుతూ ఉంటారు. నగరంలో ప్రతిమనిషి, చదువవలసిన పుస్తకం లాంటివాడు, కాని ఎవరూ అతడి చరిత్ర పేజీలు తిప్పి చదవరు.
నగరాల్లో పువ్వుల్లాంటి పిల్లలు బస్సుల మీదా, రిక్షాలమీదా, పేవ్మెంట్లమీదా సందడిచేస్తూ ఉంటారు. నగరాల్లో అందమైన భవనాలతోపాటు పూరిళ్ళూ ఉంటాయి. అక్కడ దరిద్రం, సంపద, సమాంతర రేఖలుగా సాగుతాయి. అనేక సమస్యలు ఉంటాయి. నగరంలో ఎవరికీ తీరిక దొరకదు. ఎవరికీ కోరికలు తీరవు. అసహజపు నవ్వులూ, హడావిడి నడకలూ నగరంలో ఉంటాయి. కొందరు కాలినడకన పోతారు. మరికొందరు రిక్షాలపైన, డబ్బున్నవారు కార్లపైనా నగరంలో తిరుగుతారు.
నగరంలో అన్ని పక్కలకూ చూపులు సారించాలి. నగరాల రోడ్లకు, మరణం నాలుగు వైపులా ఉంటుంది. నగరమనే వృక్షంపై ప్రజలు ఒంటరిగా జీవిస్తారు. నగరం ఒక రసాయనశాల. నగరం పద్మవ్యూహం లాంటిది.
ప్రశ్న 3.
నగరాన్ని రసాయనశాలగా, పద్మవ్యూహంగా వర్ణించడంలోని నిజానిజాల గురించి రాయండి.
జవాబు:
నగరాన్ని రసాయనశాల అనీ, పద్మవ్యూహం అనీ కవి అనడంలో చాలా వరకూ నిజము ఉంది.
1) రసాయనశాల అనడంలోని నిజానిజాలు:
నగరంలో జనాభా పెరిగిపోయింది. ప్లాస్టిక్ సంచుల వాడకం పెరిగింది. వాడిపారవేసిన మందులు, ఇంజక్షన్ల సూదులు వగైరా వ్యర్థాలు నగరంలో పోగుపడి పోతున్నాయి. చెత్త పెరిగిపోతుంది. ఆ చెత్తను నగరం పక్కనున్న నదుల్లో, చెరువుల్లో పారపోస్తున్నారు. ఫ్యాక్టరీలు నగరంలో పెరిగిపోయాయి. వాటి వ్యర్థాలతో నీరు మాత్రమే కాక, నగరంలో నేల కూడా కలుషితం అవుతోంది. వాహనాలు పెరిగిపోవడంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఈ అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని, కవి నగరాన్ని ‘రసాయనశాల’ అని చెప్పాడు. ఇది నిజమే.
2) పద్మవ్యూహం :
‘పద్మవ్యూహం’లోకి వెళ్ళడం కన్న, అందులోంచి తిరిగిరావడం కష్టం. నగరంలోకి వివిధ కారణాలపై వచ్చినవారు తిరిగి పల్లెలకు వెళ్ళలేకపోతున్నారు. నగర సౌకర్యాలకు వారు అలవాటుపడి, తరువాత గ్రామాల్లో జీవించలేక పోతున్నారు. నగరాల్లో ఉద్యోగాల కోసం వచ్చి, అవి దొరికినా, దొరకక పోయినా, నగరాలు వదలి పల్లెలకు తిరిగి వెళ్ళలేకపోతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగం వస్తుందనే ఆశతో, నగరంలో నానాపాట్లు పడుతూ జీవిస్తున్నారు. అందుకే నగరాన్ని, ‘పద్మవ్యూహం’ అన్నాడు. అది నిజమైన మాట అని నా అభిప్రాయం.
ప్రశ్న 4.
నగరజీవనం – పల్లెలోని జీవనం విశ్లేషించండి.
జవాబు:
నగర జీవితం :
నగరంలో ఎప్పుడూ రణగొణధ్వని ఉంటుంది. నగరంలో ధనవంతులు మంచి భవంతుల్లో నివసిస్తారు. కాని పేదవారు ఇనుప పెట్టెల్లాంటి ఇరుకు ఇళ్ళల్లో నివసిస్తూ ఉంటారు. సామాన్యులు అపార్ట్మెంట్లలో ఉంటారు. నగరంలో మనుషులు ఒంటరిగా ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతారు. పక్క వారిని పట్టించుకోరు. నగరంలో పిల్లలు కాన్వెంట్లకు రిక్షాల్లో, సిటీబస్సుల్లో వెళతారు. నగరంలో దారిద్ర్యం, ఐశ్వర్యం సమాంతరంగా సాగుతాయి. నగరంలో వాహనాల కింద పడి ఎక్కువమంది చనిపోతూ ఉంటారు. కొందరు కార్లమీద తిరుగుతారు. మరికొందరు రిక్షాలపై, కొందరు కాలినడకనా తిరుగుతారు.
పల్లె జీవనం :
పల్లెలలో పాడి పంటలు ఉంటాయి. ప్రజలు కలసి మెలసి సుఖంగా జీవిస్తారు. వ్యవసాయం వీరికి ప్రధాన వృత్తి. అందరూ కడుపునిండా తింటారు. పూరిపాకల్లో సంతోషంగా జీవిస్తారు. పల్లెలకు రోడ్డు రవాణా సదుపాయాలు ఉండవు. విద్యావైద్య సదుపాయాలు ఉండవు. కూరగాయలు ఎవరికి వారే పండించుకుంటారు. ప్రజలు అన్న దమ్ముల్లా చేతివృత్తులు చేసుకుంటూ జీవిస్తారు. ప్రజలు ఐకమత్యంగా ఉండి, కష్టసుఖాల్లో పరస్పరము పాలుపంచుకుంటారు.
ప్రశ్న 5.
“నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి.” వివరించండి.
జవాబు:
‘నగరం’ అంటే పట్టణం, ఈ పట్టణం, ఒక పెద్ద చెట్టు వంటిది. చెట్టుమీదకు అనేక రకాల పక్షులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలుతూ ఉంటాయి. ఆ చెట్టుమీద అవి గూళ్ళు కట్టి కాపురం చేస్తూ ఉంటాయి. ఆ చెట్టుపై పక్షులు అన్నీ కలసిమెలసి కలుపుగోలుగా బతుకుతూ ఉంటాయి.
చెట్టుమీదకు పక్షులు లాగే, నగరంలోకి కూడా, ఎందరో వ్యక్తులు ఏదో వంకన వస్తూ ఉంటారు. పొట్ట పోసుకోవడం కోసం వారు నగరాలకు వస్తూ ఉంటారు. వేర్వేరు చోట్ల పనిచేస్తూ ఉంటారు.
కానీ నగర జీవులు ఎవరికి వారు ఒంటరి గానే ఉంటారు. వీరి గురించి ప్రక్కవాళ్ళు ఎవరూ పట్టించుకోరు. చెట్టుపై నున్న పక్షులలోని ఐక్యత కూడా నగరజీవుల్లో ఉండదు.
నగరవాసులు ఒకే భవనంలో జీవిస్తున్నా, ప్రక్కవారితో మాట్లాడరు. ప్రక్కవారి కష్టసుఖాల్లో పాలుపంచుకోరు. ఎవరికి వారే ఒంటరిగా బ్రతుకుతారని కవి నిజాన్ని చెప్పాడు.
ప్రశ్న 6.
అందరూ నగరాల్లో జీవించాలని ఎందుకు అను కుంటారు?
జవాబు:
నగరాల్లో సౌఖ్యాలు ఎక్కువగా ఉంటాయి. తమ పిల్లలను బాగా చదివించి వారిని ఉద్యోగస్థులుగా చేయవచ్చు. జీతభత్యాలూ, కూలీరేట్లు ఎక్కువగా దొరకుతాయి. పిల్లలకు మంచి అలవాట్లు అబ్బుతాయి. బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. విలాస జీవనం జీవించవచ్చు.
నగరంలో ఉపాధి సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని వృత్తులవారికీ పనిచేసుకోడానికి అక్కడ పని దొరుకుతుంది. ముఖ్యంగా భవన కార్మికులకు చేతినిండా పని దొరుకుతుంది. చదువుకున్న వారికి ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుంది. చదువుకున్న పిల్లలు, ఉన్నత విద్య నేర్చుకొని, శిక్షణ పొంది మంచి ఉద్యోగాలు పొందవచ్చు.
పాలు, కూరగాయలు, త్రాగునీరు దొరుకుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించ వచ్చు. హాయిగా జీవించవచ్చు. ఈ పై కారణాలను దృష్టిలో పెట్టుకొని, అందరూ నగరాల్లో జీవించాలని అనుకుంటారు.
నగరంలో పిల్లలకు మంచి విద్యా సదుపాయాలు ఉంటాయి. కాబట్టి వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఆరోగ్యం పెంపొందించు కోడానికి వ్యాయామశాలలు ఉంటాయి. ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు చక్కగా సూపర్ బజార్లలో చౌకగా లభిస్తాయి. పళ్ళు వగైరా చౌకగా దొరకుతాయి. అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకొనే వైద్యశాలలు ఉంటాయి. కాబట్టి నగర జీవనంలో ఎన్నో అనుకూలాంశాలు ఉన్నాయి.
ప్రశ్న 7.
నీ నగర జీవితం ఎలా ఉందో అనుభవాలు రాయండి.
జవాబు:
ఈ రోజున నగరాల్లో జీవించటం అంటే అడుగడుగునా ప్రమాదభరితంగా ఉంటుంది.
- నేను ఉంటున్న అపార్ట్మెంటులో ఉన్నవారి ఆలోచనలు ఎవరిబతుకు వారిదే అన్నట్టుగా ఉంటుంది.
- నేను చదివే పాఠశాల ఆటపాటలకు చోటు లేని బందిఖానా.
- నా స్కూలు బస్సులో ప్రయాణం చేసేటపుడు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం.
- పూలతోటలు అనేవి మానగరంలో కనబడవు. ఎక్కడి చూసినా ఇళ్ళే.
- వాహనాల హోరులు తప్ప, పక్షులకిలకిలా రావాలు మానగరంలో వినిపించవు.
- కాలుష్యం అన్ని విధాల మా ఆరోగ్యాలను దెబ్బతీస్తుంది.
- సెలవు రోజున ఆడుకొందామంటే అవకాశాలు ఉండవు.
- బయటకు వెళదామంటే ఖర్చుతో కూడుకొన్న పని. మధ్య తరగతి పిల్లవాడినయిన నాకు అది అసాధ్యం.
- ఇటువంటి నగరాల్లో మేము జీవిస్తున్నాం. మరి మా భవిష్యత్తు ఎలా ఉందో మరి.
PAPER – II : PART – A
1. అపరిచిత పద్యాలు (5 మార్కులు)
ప్రశ్న 1.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
నడవడియను మున్నీటిం
గడవం బెట్టంగ నోడకరణిం దగితా
నొడగూడు ననిన సత్యము
గడచిన గుణమింకనొండు గలదే యరయన్
ప్రశ్నలు – సమాధానములు
1. దీనియందు ఏది వర్ణించబడినది ?
జవాబు:
దీనియందు సత్యగుణము వర్ణించబడినది.
2. నడవడి ఎటువంటిది ?
జవాబు:
నడవడి సముద్రం వంటిది.
3. ఓడవలె తగినది ఏది ?
జవాబు:
ఓడవలె తగినది సత్యము.
4. ఈ పద్యము నందు ఏ అలంకారమున్నది ?
జవాబు:
ఈ పద్యమునందు ఉపమాలంకారము ఉన్నది.
5. ఒండు గలదే అనగా ?
జవాబు:
మరొకటి కలదా అని అర్థము.
ప్రశ్న 2.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ! వినురవేమ !
ప్రశ్నలు – సమాధానములు
1. అల్పుడెట్లు పల్కును ?
జవాబు:
అల్పుడు ఆడంబరముగా పల్కును.
2. చల్లగా పల్కునది ఎవరు ?
జవాబు:
చల్లగా పల్కునది సజ్జనుండు.
3. కంచువలె మ్రోగనిది ఏది ?
జవాబు:
కంచు వలె మ్రోగనిది కనకము.
4. ఈ పద్యములో చెప్పబడిన ముఖ్యాంశం ఏది ?
జవాబు:
ఈ పద్యమునందు అల్పుని, సజ్జనుని మాటతీరు చెప్పబడినది.
5. ఈ పద్యము ఏ శతకమునందలిది ?
జవాబు:
ఈ పద్యము వేమన శతకం లోనిది.
2. వ్యక్తీకరణ – సృజనాత్మకత సురులు (5 మార్కులు )
ప్రశ్న 1.
నీకు నచ్చిన కవి గురించి మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:
అల్లూరు,
20.1.2018.
ప్రియమైన మిత్రునకు,
నీ మిత్రుడు వ్రాయునది. నేను కులాసాగా ఉన్నాను. వేసవి సెలవుల్లో నేను తెలుగు పద్యాలు కంఠస్థం చేశాను. అందులో ‘ప్రవరుని స్వగతం’ చదువుతుంటే నాకు చాలా ఆనందం కలిగింది. ఆకాశాన్ని అంటే కొండలు, మంచు ప్రవాహాలు, ఆడే నెమళ్ళు అంటూ హిమాలయ పర్వతాన్ని వర్ణించిన పెద్దన పద్యాలు చాలా నచ్చాయి. కళ్ళముందే హిమాలయం కనిపించేట్లు వర్ణించారు. నిష్టాపరుడైన . ప్రవరుని మనోవేదన వర్ణన బాగున్నది. ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే బాధపడతారేమో అన్నంత గొప్పగా పెద్దన వర్ణించారు. అలాంటి పద్యాలు ఇంకా చదవాలనే కోరిక నాకు కలిగింది. అందుకే పెద్దన నాకు నచ్చిన కవి.
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
XXXXX.
చిరునామా :
ఎ. దుర్గాప్రసాద్,
10వ తరగతి – ‘బి’ సెక్షన్,
వివేకానంద సెంటినరీ హైస్కూలు,
కరీంనగర్.
ప్రశ్న 2.
పల్లెటూరి జీవితంలోని ప్రశాంత వాతావరణం గురించి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
హైదరాబాద్,
XXXXX.
ప్రియమైన ముఖేష్కు,
నీ మిత్రుడు వ్రాయు లేఖ,
ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.
నేను, వేసవి సెలవులలో మా మామయ్యగారి ఊరు వెళ్ళాను. అది వరంగల్ జిల్లాలోని ఒక పల్లెటూరు.
ఆ ఊరు చాలా బాగుంది. పక్షుల కిలకిలలతో ఉదయం లేచేవాళ్ళం. అందరం కబుర్లు చెప్పుకొంటూ చెరువులో స్నానం చేశాం. చక్కగా ఈత కొట్టాము. ఇంటికి రాగానే మా అత్తయ్య పాలమీగడలో పంచదార కలిపి పెట్టింది. నేనెప్పుడు అలాంటిది తినలేదు. చాలా బాగుంది.
మధ్యాహ్నం భోజనాలలో కూడా చాలా పదార్థాలు చేశారు. అందరం కబుర్లు చెప్పుకొంటూ భోజనాలు చేశాం. పెద్ద, చిన్నా తేడా లేకుండా కబుర్లు చెప్పేసు కొన్నాం. నవ్వులే నవ్వులు. సాయంత్రం అంతా నవ్వులే నవ్వులు.
నేను, రెండు రోజులుండి వచ్చేద్దామనుకొన్నాను. కాని, రెండు నెలలున్నాను. అయినా రావాలనిపించలేదు. నాకా ఊరంతా స్నేహితులైపోయారు.
వచ్చే సెలవులలో నువ్వు కూడా రా ! చాలా బాగుంది.
మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలు.
ఇట్లు,
XXXX.
చిరునామా :
సి. శరత్,
నెం. 3, 10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నల్గొండ.
ప్రశ్న 3.
నగరం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నగరం
అంటే పట్నం కంటే పెద్దది. నగరంలో సుమారు 60 లక్షల నుండి కోటి వరకు జనాభా ఉంటారు. ప్రతిరోజు అవసరాల నిమిత్తం చాలామంది వచ్చి పోతుంటారు.
నగరంలోని పరిపాలనా వ్యవస్థను “గ్రేటర్ మున్సిపాలిటీ” అంటారు. నగర జనాభాకు విద్యుత్తు, మంచినీరు, విద్య, వైద్యం, జనన, మరణ ధ్రువీకరణలు మొదలైనవి ‘గ్రేటర్ మున్సిపాలిటీ’ ఏర్పాటు చేస్తుంది.
మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులను ‘కౌన్సిలర్స్’ అంటారు. అధ్యక్షుడిని ‘మేయర్’ అంటారు. ప్రభుత్వ పరిపాలనాధికారిని “కమిషనర్” అంటారు.
నగరాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ధన వంతులకు విలాసవంతంగా గడపడానికి అవకాశం ఉంటుంది. విద్య, ఉపాధి, వైద్యం, రవాణా మొదలైన సదుపాయాలు ఉంటాయి.
కాని, కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువ, మోసం కూడా ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద చాలామంది నగరాలలోని సౌకర్యాల వల్ల అక్కడ ఎక్కువ ఉండడానికే మక్కువ చూపుతారు.
ప్రశ్న 4.
పల్లెను వీడవద్దని నినాదాలు రాయండి.
జవాబు:
పల్లె కన్న తల్లి – దానిని వదలద్దు
అన్నం పెట్టే అమ్మను – చల్లగ చూసే పల్లెను విడువకు
అమ్మ ఒడిలో హాయి – పల్లె ఒడిలోనే దొరకునోయి పచ్చని పల్లెలు ప్రగతికి మెట్లు
పల్లె రమ్మంటోంది – ఇక్కడే సుఖమంటోంది
పల్లెను వదలకు – తల్లిని మరువకు.
ప్రశ్న 5.
నగరం గురించి ఇద్దరి వ్యక్తుల సంభాషణ రాయండి.
జవాబు:
శ్రీరాజ్ : ఆహా ! ఈ నగరం అద్భుతంగా ఉంది.
శ్రీచరణ్ : అంత అద్భుతమేముంది ?
శ్రీరాజ్ : ఆ ఆసుపత్రి చూడు. సూపర్ స్పెషాలిటీ హాస్పటల్. ఏ రోగాన్నైనా చిటికెలో తగ్గిస్తారు.
శ్రీ చరణ్ : నిజమే. ఆ షాపింగ్ మాల్ చూడు ఎంత బాగుందో ! అన్ని వస్తువులు ఒకేచోట దొరుకుతాయి.
శ్రీరాజ్ : బస్సులు, ఆటోలు అలా వరుసగా వస్తున్నాయి.
శ్రీచరణ్ : నిజమే. చీకటి పడ్డాక డాబా పైకెక్కి ట్రాఫిక్ చూస్తే కన్నుల పండుగలా ఉంటుంది. రోజూ దీపావళే. చీకటిలో సిటీ కాంతులు అద్భుతం.
శ్రీరాజ్ : ఆకలి వేస్తోంది – హోటల్ చూడు.
శ్రీచరణ్ : అదిగో ! ఎదురుగా మౌర్య గ్రూప్ ఆఫ్ హోటల్స్కు చెందిన స్టార్ హోటల్.
శ్రీ రాజ్ : బిల్లు ఎక్కువైనా ఫుడ్ భలేగా ఉంటుంది.
శ్రీచరణ్ : పద ………… పద ……………. ఇప్పటికే ఆలస్యమైంది.
ప్రశ్న 6.
పల్లెటూళ్ళలో ఉండే ఆనందం, గొప్పదనం గురించి ఇద్దరు నగరవాసులు మాట్లాడుకుంటున్నట్టుగా సంభాషణ రాయండి. (March-2017)
జవాబు:
(రవి, సోము హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వారిద్దరు ఒకసారి పల్లెటూరికి వచ్చారు. అక్కడ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ)
రవి : ఆహా ! ఈ పల్లె వాతావరణం ఎంత బాగుందో !
సోము : ఔను ! నిజంగా మనం ఇంత ప్రశాంత వాతావరణాన్ని మన నగరంలో చూడలేదు.
రవి : మన నగరంలో ఎక్కడా పచ్చని చెట్లు కనిపించవు.
సోము : నిజమే ! పచ్చని పంటపొలాలు కూడా లేవు.
రవి : ఇక్కడ ప్రజల అప్యాయతలు మధురంగా ఉంటాయి.
సోము : ప్రజల మధ్య ఐక్యత పల్లెల్లో బాగా కనిపిస్తుంది.
రవి : పల్లెలో ఒకరి కష్టాల్లో, సుఖాల్లో పరస్పరం పాలుపంచుకుంటారు.
సోము : మన నగరాల్లో అలాంటి వాతావరణం కనిపించదు. ఎవరికివారే సొంతంగా జీవిస్తారు
రవి : ఇప్పటికైనా పట్టణాల్లో చెట్లు బాగా నాటాలి.
సోము : అంతేగాదు ప్రజల మధ్య కూడా ఆనందం వెలివెయాలి.
ప్రశ్న 7.
నగరాభివృద్ధి గురించి జరిగిన సమావేశం యొక్క నివేదికను తయారుచేయండి.
జవాబు:
నివేదిక
నగరాభివృద్ధి కమిటీ సమావేశం ది. 12.5.2018న టౌన్ హాల్లో జరిగింది.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. మేయర్ వెంకటరత్నం గారు సభకు అధ్యక్షత వహించారు. నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్సు అధ్యక్షులు కనకంగారు, మేధావుల ఫోరం అధ్యక్షులు మేధ్యూగారు, వాకర్స్ క్లబ్ కార్యదర్శి సూర్యారావుగారు, కౌన్సిలర్లు సమావేశంలో పాల్గొని తమ తమ అభి ప్రాయాలు చెప్పారు.
ఆసుపత్రిని 2 కోట్ల రూపాయిలతో ఆధునీకరించాలని తీర్మానించారు. మురుగునీటి పారుదలకు 60 లక్షల రూపాయిలు కేటాయించారు. పాఠశాలలు, మంచి నీటి సదుపాయం, పార్కుల అభివృద్ధికి 4 కోట్ల రూపాయిలు ఖర్చు చేయాలని తీర్మానించారు. మొత్తం మీద 8 కోట్ల రూపాయిలు ఖర్చుతో నగరం అభివృద్ధి చేయాలని తీర్మానించారు.
వందేమాతరంతో ఉ॥ 10 గం॥కు ప్రారంభమైన సభ సాయంత్రం 5 గంటలకు జనగణమనతో ముగిసింది.
ప్రశ్న 8.
నగరగీతం కవితకు మరో పార్శ్వంగా నగర జీవనంలోని అనుకూల అంశాలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నగర జీవనంలోని అనుకూల అంశాలు :
1. ఉద్యోగ ఉపాధి అవకాశాలు :
చేతివృత్తులు కను మరుగయ్యాయి. వ్యవసాయం లాభసాటిగా లేదు. ఉపాధిలేక పల్లెలు కునారిల్లుతున్నాయి. ఉపాధి కేంద్రాలుగా నగరాలు భాసిల్లుతున్నాయి. చదువు కున్న యువకులు ఉద్యోగాలకై నగరాలను ఆశ్రయిస్తున్నారు.
2.వ్యాపార కేంద్రాలు :
పెరుగుతున్న జనాభాకు అను గుణంగా సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత నగరాలపై ఉంది. అందుకే నగరాలు ఎంతోమంది చిరువ్యాపారులకు ఉపాధిని కల్పిస్తున్నాయి.
3. విద్యా సౌకర్యాలు :
నేటి పోటీ ప్రపంచంలో తమ పిల్లలను ముందు వరుసలో నిలబెట్టడానికి తల్లిదండ్రులు తపనపడుతున్నారు. అందుకు అనువైన కార్పొరేట్ విద్యాసంస్థలు నగరాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.
4. వైద్య సౌకర్యం :
రకరకాల రోగాలు భయ పెడుతున్న ప్రస్తుత పరిస్థితులలో మెరుగైన వైద్య వి సౌకర్యం తప్పనిసరి. కార్పొరేట్ వైద్యం నగరాలలోనే అందుబాటులో వుంది.
5. ఆధునిక జీవన శైలి :
మారుతున్న కాలంతోపాటు మనిషి అభిరుచులు మారుతున్నాయి. అందుకే విలాసాలకు, వినోదాలకు, ఆధునిక జీవన శైలికి కేంద్రాలైన నగరాల వైపు మనిషి చూస్తున్నాడు.
6. బతకడానికి అనువైన పరిస్థితులు :
పేద, మధ్యతరగతి, ధనిక వర్గ ప్రజలు వారివారి స్థాయిలో బతకడానికి అనువైన పరిస్థితులు పట్టణాల్లో ఉన్నాయి. అందుకే పట్టణాలకు వలసలు పెరిగి పోతున్నాయి.
ప్రశ్న 9.
మీకు నచ్చిన పుస్తకాన్ని గూర్చి సోదరునికి లేఖ వ్రాయండి.
జవాబు:
మెదక్,
10.6.2018.
ప్రియమైన సోదరుడు సాంబశివరావుకు,
నేను బాగానే చదువుతున్నాను. ఈ మధ్య నాన్నగారు బారిష్టరు పార్వతీశం అనే పుస్తకాన్ని ఎగ్జిబిషన్లో కొని తెచ్చారు. నేను దాన్ని చదివాను. పార్వతీశంలోని పల్లెటూరితనమూ, పుట్టినరోజుకు అతని మిత్రులు చేసిన హంగామా భలే బాగున్నాయి. పార్వతీశం ఆవకాయజాడీ, గొడుగు, ట్రంకుపెట్టెలతో విదేశీ ప్రయాణానికి వెళ్ళడం చదివి కడుపుబ్బ నవ్వుకున్నాను. తివాచీ తొక్కకూడదని అనుకొని ప్రక్కగా నడిచి పడటము చదువుతుంటే ఇలాంటివారు ఆ కాలంలో నిజంగా ఉన్నారా అనిపించింది. మొత్తంమీద మొక్కపాటి నరసింహశాస్త్రిగారి ఈ నవల చదివేవారిని ఆకర్షిస్తుందనడం సత్యము. నీవు కూడా సెలవుల్లో గ్రంథాలయానికి వెళ్ళి ఈ పుస్తకం తప్పక చదవగలవు.
ఇట్లు,
నీ అన్నయ్య,
X X X X X
చిరునామా :
ఐ. సాంబశివరావు,
10వ తరగతి,
రామకృష్ణ ఉన్నత పాఠశాల,
నిజామాబాద్.
ప్రశ్న 10.
‘మీకు తెలిసిన ప్రసిద్ధమైన నగర విశేషాలను’ వర్ణిస్తూ కవిత రాయండి.
జవాబు:
నగర జీవితం నగరవాసులకొక వరం !
సకల సదుపాయాల సమాహారం
వినోదాల విన్యాసాల కళాతోరణం.
విశిష్ట వినూత్న భవన నిర్మాణ సమాహారం
విశాల రహదారుల కళాతోరణం
విద్యా వైజ్ఞాన కేంద్రాల నిలయస్థానం
సాహిత్య సమావేశాల మణిహారం
మాన్యనాయకగణా నివాస మందిరం
నివసించాలి ప్రజలందరిక్కడ
సిరిసంపదలతో తులతూగాలిక్కడ
పర్యావరణాన్ని రక్షించి కాపాడాలిక్కడ
అప్పుడే అవుతుంది సుఖమయం నగర జీవనం.
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – I : PART – B
1. పర్యాయపదాలు
ఉదయం = తెల్లవారు, ప్రాతఃకాలము, తెలవారు
పువ్వు = పుష్పం, కుసుమం, సుమం
వృక్షం = చెట్టు, తరువు, భూరుహం
తల్లి = జనని, మాత, అంబ
పల్లె = పాలెము, వాడ, గూడెము
మరణం = చావు, మృత్యువు, నిర్యాణం
మనుష్యుడు = నరుడు, మానవుడు, మర్త్యుడు
రైతు = కర్షకుడు, కృషీవలుడు, వ్యవసాయదారుడు
దారిద్య్రం = దైన్యము, దౌర్గత్యము, పేదరికం
పుప్పొడి = పుష్పపరాగం, సుమనోరజం, కుసుమపరాగం
అరణ్యం = విపినం, కాననం, అడవి
పద్మం = తామర, నళినం, పుండరీకం
2. నానార్థాలు
అర్థం = సంపద, శబ్దార్థం, ప్రయోజనం
ఘోష = ఉరుము, ఆవుల మంద, కంచు
తల్లి = అమ్మ, జగదంబ
నరుడు = మనుష్యుడు, అర్జునుడు, ఒక ఋషి
ఉదయము = పుట్టుక, తూర్పుకొండ, ప్రాతః కాలము, ఉన్నతి
కాలు = మండుట, పాదము, పాతిక
సీమ = ఎల్ల, వరిమడి, దిగంతము, ఒడ్డు, విదేశము
3. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
అరణ్యం – అటవి
పట్టణం – పట్టము
పుష్పం – పూవు
మనిషి – మనిసి
4. వ్యుత్పత్త్యర్థాలు
నగరము = కొండలవలెనుండు పెద్దపెద్ద భవనములు కలది (పట్టణం)
సౌజన్యం = మంచితనముతో కూడినది (ఒక స్వభావం)
మానవుడు = మనువు నుండి పుట్టినవాడు (నరుడు)
PAPER – II : PART-B
1. సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.
ఉదా :
నగరారణ్యం – నగర + అరణ్యం
సమాంతర రేఖలు – సమ + అంతర రేఖలు
చైత్రారంభం – చైత్ర + ఆరంభం
2. ఉత్వ సంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా :
ఏమది – ఏమి + అది
తిరగేసేదెవరో – తిరగేసేది + ఎవరో
ఊపిరాడని – ఊపిరి + ఆడని
పూరిల్లు – పూరి + ఇల్లు
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు
మహావృక్షం – గొప్పదైన వృక్షం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పఠనీయ గ్రంథం – పఠనీయమైన గ్రంథం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహానగరం – గొప్పదైన నగరం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పూరిళ్ళు – పూరివైన ఇళ్ళు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పేదరైతులు – పేదవారైన రైతులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సమాంతర రేఖలు – సమాంతరమైన రేఖలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మనచూపులు – మనయొక్క చూపులు – షష్ఠీ తత్పురుష సమాసం
జీవనఘోష – జీవనము యొక్క ఘోష – షష్ఠీ తత్పురుష సమాసం
పుప్పొడి – పూల యొక్క పొడి – షష్ఠీ తత్పురుష సమాసం
రోడ్ల కూడలి – రోడ్ల యొక్క కూడలి – షష్ఠీ తత్పురుష సమాసం
ప్రతిమనిషి – మనిషి మనిషి – అవ్యయీభావ సమాసము
నాలుగురోడ్లు – నాలుగు సంఖ్యగల రోడ్లు – ద్విగు సమాసము
మూడుకాళ్ళు – మూడు సంఖ్యగల కాళ్ళు – ద్విగు సమాసము
నాలుగుకాళ్ళు – నాలుగు సంఖ్యగల కాళ్ళు – ద్విగు సమాసము
నాలుగువైపుల – నాలుగు సంఖ్యగల వైపులు – ద్విగు సమాసము
నగరారణ్యం – నగరం అనే అరణ్యం – రూపక సమాసం
మెర్క్యురీ నవ్వులు – మెర్క్యురీ వంటి నవ్వులు – ఉపమాన పూర్వపద కర్మధారయం
పాదరసం నడకలు – పాదరసం వంటి నడకలు – ఉపమాన పూర్వపద కర్మధారయం
పూరిల్లు – పూరితో ఇల్లు – తృతీయా తత్పురుషము
ఇనప్పెట్టె – ఇనుముతో పెట్టె – తృతీయా తత్పురుషము
3. అలంకారాలు
ప్రశ్న 1.
‘నగారామోగిందా నయాగరా దుమికిందా’
జవాబు:
అంత్యానుప్రాసాలంకారం.
ప్రశ్న 2.
కమలాక్షు నర్చించు కరములు కరములు.
జవాబు:
లాటానుప్రాసాలంకారం.
ప్రశ్న 3.
ఓరాజా ! నీయశశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి.
జవాబు:
రూపకాలంకారం
4. కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చుట
‘కర్త’ ఆధారంగా రూపొందిన వాక్యాలు కర్తరి వాక్యాలని, ‘కర్మ’ ప్రధానంగా రూపొందించిన వాక్యాలను కర్మణి వాక్యాలని అంటారు.
ఉదా : రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు. (కర్తరి వాక్యం)
రామకృష్ణారావుచే ఆమోదముద్ర వేయబడింది. (కర్మణి వాక్యం)
వివరణ : (ఆమోదముద్రవేయడం – కర్తకు సంబంధించిన క్రియ ఆమోదముద్ర వేయబడటం – కర్మకు సంబంధించిన క్రియ.)
1. దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారయ్యింది. (కర్తరి వాక్యం)
దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారుచేయ బడింది. (కర్మణి వాక్యం)
2. బూర్గులవారు మంచినిర్ణయాలు తీసుకున్నారు. (కర్తరి వాక్యం)
బూర్గుల వారిచే మంచి నిర్ణయాలు తీసుకొన బడ్డాయి. (కర్మణి వాక్యం)
3. వారి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బుర పరచింది. (కర్తరి వాక్యం)
వారి న్యాయవాద పటిమ ఇతరులచే అబ్బుర పరచబడింది. (కర్మణి వాక్యం)
4. రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచ బడ్డాయి. (కర్తరి వాక్యం)
రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందు పరిచాను. (కర్మణి వాక్యం)
5. ప్రత్యక్ష కథనం – పరోక్ష కథనం
ప్రత్యక్ష కథనం :
ఇతరులు చెప్పిన దానిని లేక తాను చెప్పిన దానిని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించి చెప్పడం. దీనిలో ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి.
ఉదా :
‘దీన్ని నరికివేయండి’ అని తేలికగ అంటున్నారు.
పరోక్ష కథనం :
అనుకరించిన దానిలోని విషయాన్ని లేక అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం. దీనిలో ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు.
ప్రత్యక్ష కథనం = పరోక్ష కథనం
నేను – నా – నాకు = తాను – తన – తనకు
మేము – మాకు = తాము – తమకు
నీవు – నీకు – నీది = అతడు / ఆమె – అతడికి / ఆమెకు – అతనిది / ఆమెది
మీ – మీకు = వారి వారికి
ఇది – ఇవి – ఇక్కడ = అది అవి – అక్కడ అని మార్పు చెందుతాయి.
1. ప్రత్యక్ష కథనం : ‘నేను నేటి సినిమాలను చూడలేక పోతున్నాను’ అని అమ్మతో అన్నాను.
పరోక్ష కథనం : తాను నేటి సినిమాలను చూడలేక పోతున్నానని అమ్మతో అన్నాడు.
2. ప్రత్యక్ష కథనం : నీకివ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు.
పరోక్ష కథనం : అతనికివ్వాల్సింది ఏమీలేదని నాతో అన్నాడు.
3. ప్రత్యక్ష కథనం : సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
పరోక్ష కథనం : ‘సుందరకాండ చదువుము’ అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
4. ప్రత్యక్ష కథనం : వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికి వెళ్ళాడు” అని.
పరోక్ష కథనం : వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని.
5. ప్రత్యక్ష కథనం : “ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని అందరనుకుంటున్నారు.
పరోక్ష కథనం : ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.
6. సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చుట
వాక్యాల మార్పిడిలో గుర్తుంచుకోదగిన అంశాలు :
సామాన్య వాక్యం : సమాపక క్రియ కల్గి కర్త, కర్మలు గల వాక్యం సామాన్య వాక్యం.
ఉదా :
రాముడు సీతను పెండ్లాడెను.
సంక్లిష్ట వాక్యం : ఒక సమాపక క్రియ; ఒకటి గాని, అంత కంటే ఎక్కువగాని అసమాపక క్రియలు గల వాక్యం సంక్లిష్ట వాక్యం. సమాపక క్రియగలది ప్రధాన వాక్యంగా, అసమాపక క్రియగలది ఉపవాక్యంగా ఉంటుంది. అసమాపక క్రియ భూతకాలాన్ని సూచిస్తుంది.
ఉదాహరణలు :
I. క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
ప్రశ్న 1.
నేను గుంటూరు వచ్చాను. శారదానికేతనంలో చేరాను.
జవాబు:
నేను గుంటూరు వచ్చి శారదానికేతనంలో చేరాను.
ప్రశ్న 2.
రవి బాగా చదివాడు. రవి పరీక్ష వ్రాశాడు.
జవాబు:
రవి బాగా చదివి పరీక్ష వ్రాసాడు.
ప్రశ్న 3.
గోపాల్ బాగా చదువుతాడు. గోపాల్ తొమ్మిదింటికే నిద్రపోతాడు.
జవాబు:
గోపాల్ బాగా చదివి తొమ్మిదింటికే నిద్రపోతాడ
ప్రశ్న 4.
గీత బాగా నృత్యం నేర్చుకొంది. గీత బాగా నృత్యం చేసింది.
జవాబు:
గీత బాగా నృత్యం నేర్చుకొని, చేసింది.
ప్రశ్న 5.
మంచి రచనలను వ్రాయండి. మంచి మెప్పు పొందండి.
జవాబు:
మంచి రచనలను వ్రాసి మెప్పు పొందండి.
ప్రశ్న 6.
నా మల్లెలు ఎంతోమంది యువతులు ధరించారు. ఆనందించారు.
జవాబు:
నా మల్లెలు ఎంతోమంది యువతులు ధరించి ఆనందించారు.