These TS 10th Class Telugu Important Questions 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 2nd Lesson Important Questions ఎవరి భాష వాళ్ళకు వినసొంపు
PAPER – 1 – PART – A
I. వ్యక్తీకరణ-సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘ఆడవాళ్ళ నోట అసలైన భాష’ వినగలం – దీన్ని మీరు సమర్ధిస్తారా ? రెండు కారణాలు వ్రాయండి. (T.S June ’17)
జవాబు:
సదాశివగారు వరంగల్లు తెలుగు గురించి చెపుతూ, వరంగల్లులో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లోనూ అచ్చమైన తెలుగు మాట వినిపిస్తుందని చెప్పారు. అంతేకాదు. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం అని సదాశివగారు చెప్పారు.
ఉర్దూ మాట్లాడే ముస్లిము స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహళ్ళలో ఉండే బేగములు మాట్లాడే భాష శుద్ధమైనదని ఆనాటి విద్వాంసులు భావించేవారు. అందుకే కల్తీలేని ఉర్దూను, ‘బేగమాతీజుబాన్’, ‘మహెల్లాతీ జుబాన్’ అని పిలిచేవారు. ఈ విధంగా ఆడవాళ్ళ నోట అసలైన భాష వినిపిస్తుందని, సదాశివగారు అభిప్రాయపడ్డారు.
ప్రశ్న 2.
ఎవరిభాష వాళ్ళకు వినసొంపు ఎందుకు ? (T.S Mar. ’16)
జవాబు:
భాష అంతా ఒకటే అయినా ఏ ప్రాంతపు వాళ్ళు ఆ ప్రాంతపు మాండలిక భాషను, మాట్లాడతారు.
ఆ మాట్లాడే పదాల్లో ఒక రకమైన యాస ఉంటుంది. ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు, నుడికారాలు, జాతీయాలు, పలుకుబడులు వేర్వేరుగా ఉంటాయి.
తెలుగుభాష అంతా ఒకటే అయినా కోస్తావారు, రాయలసీమవారు, తెలంగాణవారు వేర్వేరు మాండలిక పదాలు ఉపయోగిస్తారు. ఆ ప్రాంతంలో పరిచయంలో ఉన్న పదాలతో కూడిన భాష ఆ ప్రాంతం వారికి వినడానికి ఇంపుగా, సొంపుగా ఉంటుంది. వారికి బాగా అలవాటులో ఉన్న పదాలు, నుడికారపు సొంపు, పలుకుబడి కల భాష కాబట్టి, ఎవరి భాష వారికి వినసొంపుగా ఉంటుంది.
ప్రశ్న 3.
మరాఠీ పురోహితుని తెలుగుభాష ముచ్చటను గూర్చి వివరించండి.
జవాబు:
సదాశివగారి గ్రామంలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు ఒకడు ఉండేవాడు. ఆయన పూజలు చేయిస్తూ, “మొదలు మీ కండ్లకు నీళ్ళు పెట్టుకోండి” అనేవాడు. సదాశివగారు ఆ పూజారిని అలా అనవద్దనీ, శుభం అని పూజ చేస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం అన్న మాట, అశుభంగా ఉంటుందని పూజారికి చెప్పేవారు. పూజారిని అందరికీ తెలిసిన మరాఠీలో చెప్పమనేవారు. తరువాత పూజారి “కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి” అని ‘కు’ ప్రత్యయం చేర్చి చెప్పేవాడు. పూజారి కళ్ళను నీటితో తుడుచుకోండి అన్న అర్థంలో అలా చెప్పేవాడు. కాని వినేవారికి వారిని ‘కన్నీరు కార్చండి’ అని చెప్పినట్లు అర్ధం వచ్చేది. అది తప్పుగా ఉండేది.
ప్రశ్న 4.
“ఆమెను చూస్తూవుంటే, వాగ్ధాటి వింటూ వుంటే ఎవరో యాదికి వచ్చినారు ” ఈ మాటల్లోని అంతరార్థాన్ని వివరించండి.
జవాబు:
భాసరలో వ్యాస వాంజ్ఞయం మీద ప్రసంగించిన కె. కమల గారి ప్రసంగాన్ని విని డా॥ సామల సదాశివ వారి నాన్నగారైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని యాది చేసుకుంటారు. మాట్లాడిన భాష, మాట్లాడే వారి యొక్క ప్రాంతీయ అస్థిత్వాన్ని, వారసత్వాన్ని తెలియజేస్తుందనటానికి ఇదొక ఉదాహరణ. ఏ ప్రాంతపు యాస, పలుకుబడులు ఆ ప్రాంత ప్రత్యేకతను, సంస్కారాన్ని తెలియ జేస్తుంది.
ప్రశ్న 5.
“వరంగల్లు తెలుగును టక్సాలీ తెలుగు అనవచ్చు” దానిలో అంతరార్థాన్ని వివరించండి.
జవాబు:
టక్సాలా అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ. అవి ఎక్కడైనా చెల్లుతాయి. ఇతరులెవరైనా తయారుచేస్తే అవి నకిలీ నాణేలు. అవి చెలామణి కావు. పైగా ప్రభుత్వం జప్తు చేస్తుంది. వరంగల్లు ప్రాంత ప్రజలు మాట్లాడే భాష స్వచ్ఛమైనది, ప్రామాణికమైనది. అందుకే వరంగల్లు తెలుగును టక్సాలీ తెలుగు అనవచ్చు. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లో కూడా అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది.
ప్రశ్న 6.
మహబూబ్నగర్ తెలుగు నుడికారాన్ని వివరిం చండి.
జవాబు:
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మ గారు లాంటి వారి రాతలోనూ, మాటలోనూ మహబూబ్నగర్ జిల్లా ప్రాంతీయ భాషా మాధుర్యం కనిపించేది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడటానికి ముఖ్య కారకులైన గడియారం రామకృష్ణశర్మగారు, రచయిత సామల సదాశివ గారికి గురుతుల్యులు. మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనాన్ని కలిగి ఉండేది.
ప్రశ్న 7.
‘ఎవరి భాష వాళ్ళకు వినసొంపు’ రచయిత డా॥ సామల సదాశివ గురించి రాయండి.
జవాబు:
డాక్టర్ సామల సదాశివ గారు బహుభాషా కోవిదులు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషల్లో పండితుడు. సాహిత్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. అన్ని ప్రాంతాల తెలుగు పలుకుబడులను, నుడికారాలను గౌరవించాలనే సహృదయుడు. స్వీయ అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకున్న శీర్షిక ‘యాది’ వార్త పత్రికలో చాలా కాలం నడిచింది. వీరి ‘సంగీత శిఖరాలు’ హిందుస్తానీ సంగీతాన్ని గురించి తెలుగు లో వెలువడిన మొదటి గ్రంథం.
ప్రశ్న 8.
‘ప్రజల పలుకుబడిలో నుండి వచ్చిన భాష సహజ సుందరమైనది’ సమర్థిస్తూ రాయండి.
(లేదా)
‘మాతృభాష మధురమైన భాష’ దీన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
‘కల్తీ లేని తెలుగు’ అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
ప్రజల పలుకుబడులు, జాతీయాలు, నుడికారాలు ఉపయోగిస్తూ ప్రాంతీయ మాండలికాలతో ఉపయోగించే భాష వినసొంపుగా ఉంటుంది. ఎంత గొప్ప పండితుడైనా తన వ్యావహారిక భాషలో మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఆ భాష వినిపిస్తే పరవశించి పోతాడు. అందుకే “తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని మనవరాలు అనగానే తాతగారు చాలా అబ్బురపడ్డారు. ఆనందించారు. తమ ప్రాంతీయ భాష తన మనవరాలికి అలవడినందుకు ఆయన ఆశ్చర్యానికి, ఆనందానికి అవధి లేదు.
వరంగల్లు తెలుగు టక్సాలీ తెలుగు. అంటే టంకశాలలో తయారైన ఒరిజినల్ నాణెం లాంటిది. కల్తీ లేనిది. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతపు భాష అలా అనిపిస్తుంది. అదే కల్తీ లేని తెలుగని రచయిత అభిప్రాయం.
ప్రశ్న 9.
ప్రాంతీయ భాష యొక్క మాధుర్యం ఎటువంటిది ?
(లేదా)
ప్రాంతీయత కనిపించే భాష అంటే ఏమిటి ? వివరించండి.
(లేదా)
“పసందైన ప్రాంతీయ భాష” దీనిని ఎట్లా అర్థం చేసుకొన్నారో వివరించండి.
(లేదా)
“వారి రాతలోను, మాటలోను ప్రాంతీయత కనిపించేది ” దీని గురించి చర్చించండి.
(లేదా)
“ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది” సమర్థించండి.
జవాబు:
ఒక ప్రాంతపు యాస, మాండలికం కల భాషను ప్రాంతీయ భాష అంటారు. ప్రాంతీయ భాష చాలా మధురంగా ఉంటుంది.
ఏ ప్రాంతం వారికైనా ఆ ప్రాంతంలో ఉపయోగించే పదాలు, జాతీయాలు, నుడికారాలు, పలుకుబడులు అంటే ఇష్టం ఉంటుంది. అవి తమ భాషలో ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ తెలుగు భాషనే మాట్లాడతారు. కాని, రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాకు ‘యాస’ మారిపోతుంది. మాండలికాలు మారిపోతాయి. నుడికారాలు మారిపోతాయి. ఇతర ప్రాంతాలవారికి కొన్ని అర్థం కావు. అయినా ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతపు భాష పసందుగా ఉంటుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది.
పండితులు తమ కావ్యాలలో శిష్టవ్యావహారికం ప్రయోగించినా తమ మాటలలోనూ, ఉత్తర ప్రత్యుత్తరాలలో ప్రాంతీయ భాషనే ఉపయోగిస్తారు. ఎందుకంటే ప్రాంతీయ భాష మాధుర్యం అటు వంటిది.
ప్రశ్న 10.
వ్యావహారిక భాష గురించి సామల సదాశివగారి అభిప్రాయాలను విశ్లేషించండి.
జవాబు:
తన మనుమరాలు “తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అనగానే చాలా ఆనందించారు. తమ ‘ఆదిలాబాద్ జిల్లా’ ‘యాస’లో మాట్లాడింది. ‘ఇగపటు’ అని తమ ప్రాంతీయ పద ప్రయోగం వినబడేసరికి ఎక్కడ లేని ఆనందం కలిగింది.
ఒకప్పుడు సామల సదాశివగారు కూడా గ్రాంధిక భాషలోనే పుస్తకాలు, వ్యాసాలు రచించారు. కాని, వారికి కాలక్రమేణా వ్యావహారిక భాషపై మక్కువ పెరిగింది. అప్పుడిక ఆయనకు గ్రాంధిక భాషలో రచించిన తన పుస్తకాలే తనకు నచ్చలేదు. అందుచేత వ్యావహారిక భాషలోనే పుస్తకాలు రాయాలనేది సామలవారి నిశ్చితాభిప్రాయం.
ప్రశ్న 11.
‘మీర్ తఖీమీర్’ కవిత్వంలోకి సాధారణ ప్రజల భాష ఎట్లా వచ్చింది ? (T.S Mar. ’17)
జవాబు:
ఉర్దూ సాహిత్యంలో పండితుల పారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే మీర్ తఖీమీర్ ప్రాధాన్యం ఇచ్చేవారు. వారి కవిత గంభీర భావ భరితమైనా, భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజసుందరమైనది.
ఆయన ప్రతి శుక్రవారం దిల్లీ జామె మసీదు మెట్ల మీద కూర్చుంటాడు. ఆ మెట్లమీదనే అటూ ఇటూ వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వినేవారు. నమాజు చదవడానికి ఎందరో వస్తారు, పోతుంటారు. మాట్లాడుకుంటారు. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నారు. దాని ప్రభావం అతని భాషపై పడింది.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు )
కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
తెలుగు వ్యావహారిక భాషలోని ప్రాంతీయ భేదాలను గురించి, సదాశివగారి అభిప్రాయం ఏమిటి ?
జవాబు:
సదాశివగారు మొదట్లో వ్యాసాలనూ, పుస్తకాలనూ గ్రాంథికభాషలో రాసేవారు. కాని ఆయన వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవారు. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే, బడులలోనూ చదివేవారు. కాని మొదట్లో తెలుగుపిల్లలు ఇంట్లో ఒక భాష మాట్లాడేవారు. బడులలో వేరే భాష చదివేవారు.
తెలుగులో వ్యావహారిక భాష అమలులోకి వచ్చాక తెలుగు పిల్లలు సైతం, ఇంట్లో మాట్లాడే భాషనే బడుల్లోనూ నేడు చదువుతున్నారు. అయితే మనం మాండలిక భేదాలు మాట అట్లుంచినా, ప్రాంతీయ భేదాలను కూడా సరిచేసుకోలేక పోతున్నామని సదాశివగారు అభిప్రాయపడ్డారు.
సరిచేసుకోవాలంటే తొలగించడం దిద్దుకోవడం కాదనీ, అన్ని ప్రాంతాల పలుకుబళ్ళనూ ఇప్పటి తెలుగు భాషలో కలుపుకోవడం అవసరమనీ సదాశివగారు అభిప్రాయపడ్డారు.
ప్రశ్న 2.
‘పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాల వంటివి’ ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
1) పలుకుబడి :
పలుకుబడి అంటే ఉచ్ఛారణలో ఉండే విలక్షణత. దీన్నే ‘యాస’ అంటారు. యాసలో మాట్లాడితే, ఆ ప్రాంతం వారికి వినసొంపుగా ఉంటుంది. మాండలిక యాసతో కూడిన పలుకుబడి, వినడానికి అందంగా, అలంకారంగా ఉంటుంది.
2) నుడికారం :
నుడికారం అంటే ‘మాట చమత్కారం’. ఈ నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి, ఆచార వ్యవహారాల్లోంచిపుడుతుంది. చెప్పదలచుకున్న భావం మనస్సుకు హత్తకుంటుంది. నుడికారాలు జాతీయాలుగా, సామెతలుగా ఉంటాయి. నుడికారం వల్ల ఒక చమత్కారం, దానివల్ల ఆనందం, కలుగుతాయి. అందుకే అది అలంకారం.
3) జాతీయము :
జాతీయము ఆ జాతి వాడుకలో రూపుదిద్దుకుంటుంది. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా చూస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో మరో అర్థం వస్తుంది. ఈ జాతీయము యొక్క భావం ఆ ప్రాంతం వారికి బాగా అర్థమై ఆనందాన్ని కల్గిస్తుంది. కాబట్టి పలుకుబడి, నుడికారం, జాతీయం అనేవి భాషకు అలంకారాల వంటివని చెప్పగలం.
ప్రశ్న 3.
ఇంట్లో మాట్లాడే భాష, బళ్ళో చదివే భాష వేరు వేరని సామల సదాశివ చెప్పటం వెనుకగల కారణాలను (సహేతుకంగా చర్చించండి.) .
(లేదా)
విద్యార్థుల భాష ఎన్ని రకాలుగా ఉంటుందని సామల సదాశివగారి అభిప్రాయమో తెల్పండి. విశ్లేషించండి.
జవాబు:
సామల సదాశివగారు తొలినాళ్ళలో గ్రాంథిక భాషలోనే పుస్తకాలు, వ్యాసాలు రాసేవారు. అప్పట్లో ఆయన పాఠశాలలో తెలుగు పాఠాలు చెప్పేవారు. ఆ పాఠాలన్నీ గ్రాంథిక భాషలోనే ఉండేవి. పిల్లలకు ఆ పాఠాలు సరిగా అర్థం అయ్యేవి కావు. అప్పట్లో పాఠ్యబోధన వ్యావహారిక భాషలో చేసేవారు కాదు. ప్రశ్నలకు జవాబులను కూడా పిల్లలు గ్రాంథిక భాషలోనే రాయవలసి వచ్చేది. ఈ విధానం సామల సదాశివగారికి నచ్చేది కాదు.
మరాఠీ, ఉర్దూ పాఠశాలల్లో పిల్లలకు వ్యావహారిక భాషలోనే బోధించేవారు. తెలుగు విద్యార్థులకు మాత్రం బడిలో గ్రాంథిక భాషను బోధించేవారు. ఇళ్ళ వద్ద మాత్రం వ్యావహారిక భాష మాట్లాడేవారు. అందుకే సామల సదాశివగారు విద్యార్థుల భాషను రెండు రకాలుగా పేర్కొన్నారు. అవి 1. ఇంట్లో మాట్లాడే భాష, 2. బళ్ళో చదివే భాష.
ఈ విధమైన రెండు భాషల విధానం సామల సదాశివగారికి ఇష్టం లేదు.
ప్రశ్న 4.
” గద్య, పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే” అన్న సామల సదాశివగారి మాటలను విశ్లేషించండి.
(లేదా)
ఇది విన్నప్పుడల్లా నేను రెండు ప్రశ్నలు వేసు కుంటాను. “ఏ తెలుగు, ఎక్కడి తెలుగు” అని. ఈ మాటలను సామల సదాశివగారు అనడం వెనుక కారణాలు ఏమై ఉంటాయో విశ్లేషించండి. (T.S Mar. ’17)
జవాబు:
సామల సదాశివగారు తెలంగాణ అభిమాని. తమ ప్రాంతం దాటి ఏనాడూ ఆంధ్రాకు కూడా రాలేదు. తమ యాస అంటే చాలా ఇష్టం. తమ ప్రాంతపు మాండలికాలంటే ఆయనకు ప్రాణం. తెలంగాణ నుడికారాలంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తెలంగాణ పదబంధాలపై ఆయన అభిమానం వర్ణనాతీతం.
కాని, ప్రతి జిల్లాకు యాస, నుడికారం, పదబంధాలు మారిపోతాయి. అవి ఆయా వ్యావహారిక భాషలలోనే కనబడతాయి. గ్రాంథిక భాషలో రచింపబడిన గ్రంథాలలో ఏ ప్రాంతపు మాండలికాలూ, యాసలు పెద్దగా కనబడవు. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చినవే ఎక్కువగా కనిపిస్తాయి.
అందుచేత గ్రాంథిక భాషలో రచించిన పద్యాలు, గద్యాలతో ఉన్న కావ్యాలలో కనిపించే తెలుగంతా ఒకలాగే ఉంటుంది. వ్యావహారికతకు, ప్రాంతీయతకు స్థానం ఉండదని సామల సదాశివ గారి అభిప్రాయం.
ప్రశ్న 5.
“తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు”, అనే వాక్యాలు మీరు సమర్థిస్తారా ? ఎందుకు ? (T.S June ’17)
జవాబు:
పిల్లలు ఇంట్లో తమ తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో అక్కాచెల్లెండ్రతో, పనివారితో ప్రాంతీయమైన మాండలిక యాసలో మాట్లాడుతారు. వారు పాఠశాలకు వెళ్ళిన తరువాత, వారి పుస్తకాల్లో ఉన్న గ్రాంథిక భాషనూ పత్రికల్లో ఎక్కువమంది వాడే శుద్ధ వ్యావహారిక భాషనూ చదువుతారు. మాట్లాడుతారు.
ఇంట్లో మాట్లాడేది ప్రాంతీయపు యాసతో నిండిన మాండలిక భాష, బడిలో చదివేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే గ్రాంథిక భాష లేక శుద్ధ వ్యావహారిక భాష. కాబట్టి పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్ళో చదివే భాష వేరు అన్నది నిజం.
PAPER – II : PART – A
1. అపరిచిత గద్యాలు (5 మార్కులు)
ప్రశ్న 1.
కింది పేరా చదివి, పట్టికను పూరించండి.
“తెలుగు సాహిత్యం మొదట గద్యపద్యాల మిశ్రితమై వెలువడినా, తరువాత కాలంలో పద్యకావ్యాలు, గద్యకావ్యాలు వేరువేరుగా వెలుగుచూశాయి. పద్యగద్య మిశ్రిత రచనలు చంపూ కావ్యాలు. 18వ శతాబ్దం వరకూ, ఈ రచనా సంప్రదాయం సాహిత్య రంగంలో కొనసాగింది. 19వ శతాబ్దం నుండి ఆంగ్లభాష సాహిత్యాల అధ్యయన ప్రభావంతో ఆ భాషలోని వివిధ రచనా రీతులు తెలుగు వారికి పరిచయం అయినాయి. అలా తెలుగులోకి ప్రవేశించిన రచనా ప్రక్రియ ‘నవల’. ఈ ప్రక్రియను తెలుగునాట ప్రచారంలోకి తెచ్చినవాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు..
ప్రశ్నలు – జవాబులు
1. పద్యగద్యాల మిశ్రిత కావ్యాలు.
జవాబు:
చంపూ కావ్యాలు
2. 19వ శతాబ్దానికి పూర్వం తెలుగుభాషలో లేని ప్రక్రియ.
జవాబు:
నవల
3. పలు రచనా రీతులు తెలుగులోకి రావడానికి కారణం.
జవాబు:
ఆంగ్లభాషా సాహిత్యాల అధ్యయన ప్రభావం.
4. నవలా ప్రక్రియకు తెలుగునాట ఆద్యుడు.
జవాబు:
కందుకూరి వీరేశలింగం పంతులు గారు.
5. తెలుగు సాహిత్యం మొదట ఎలా ఉంది ?
జవాబు:
పద్యగద్యాల మిశ్రితమై వెలువడింది.
ప్రశ్న 2.
క్రింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి. (T.S June ’15)
“గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాదు, కరీంనగరు జిల్లాల్లోని గిరిజనులు, వారి ఆధ్వర్యం లోని రైతులు పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య, “చిన్నయ్య, పెద్దయ్య / చిలుకల భీమయ్య” అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో, చిన్నయ్య అంటే అర్జునుడు. పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముడ్ని పూజిస్తారు అని స్పష్టమౌతుంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలువడానికి కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ, ఇక్కడికి వచ్చినపుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడు పెళ్ళి చేసుకొని, ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యాడు”.
జవాబు:
ప్రశ్నలు
- గోదావరి నదికి ఇరువైపులా ఉన్న జిల్లాలు ఏవి ?
- గిరిజనులు, వారి ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్ళు ఎవరు ?
- స్థానికంగా వినిపించే గేయమేది ?
- పెద్దయ్య, చిన్నయ్య అంటే ఎవరు ?
- గిరిజనులకు భీముడు ఎందుకు ఆరాధ్య దైవమయ్యాడు ?
ప్రశ్న 3.
కింది గద్యభాగాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.
“శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దివాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువనవిజయమనే సభామండపంలో సాహిత్యగోష్ఠి నిర్వహించేవాడు. అనేక కవి పండితులను పోషించే వాడు. ఆయన ఆస్థానంలోని ఎనిమిది మంది ప్రసిద్ధ కవులను అష్టదిగ్గజాలు అని పిలిచారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వారిలో తెనాలి రామకృష్ణుడు వికటకవిగా పేరు పొందాడు. రాయలు రాజు మాత్రమే కాదు, కవి కూడా. దేశభాషలందు తెలుగు లెస్స అని చాటాడు. ఆయన కాలం తెలుగుభాషకు స్వర్ణయుగమై భాసిల్లింది.
జవాబు:
ప్రశ్నలు
- శ్రీకృష్ణదేవరాయలు ఏ కాలము వాడు ?
- శ్రీకృష్ణదేవరాయల సభాభవనం పేరు ఏమి ?
- ‘అష్టదిగ్గజాలు’ అంటే ఎవరు ? వారిలో అగ్రగణ్యుడు ఎవరు ?
- తెలుగుభాషకు ఎవరి కాలం స్వర్ణయుగం ?
- తెనాలి రామకృష్ణుడు ఏ విధంగా పేరు పొందాడు ?
ప్రశ్న 4.
క్రింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
“ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని, తెలుగునేలను వైభవ స్థితిలో నిలిపిన కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అతడు ఉత్తమ పరిపాలకుడు మాత్రమే కాదు, ‘మానవ ధర్మాన్ని, కళా మర్మాన్ని ఎరిగిన సాహితీ మూర్తి. సంస్కృతాంధ్రభాషల్లో అనుపమానమైన పాండిత్యాన్ని సొంతం చేసుకున్న సత్కవీంద్రుడు. సంగీత సాహిత్య నృత్య చిత్రలేఖన శిల్పకళలకు ఇతోధిక ప్రాధాన్యత నిచ్చి, వాటి విస్తృతికి విశేష సహకారమందించిన రసహృదయుడు, సహృదయుడు. ఎంతటి మహోన్నతులకయినా, చంద్రునిలో మచ్చలా ఏవో బలహీనతలుంటాయి. వేట ప్రతాపరుద్రుని బలహీనత. క్రమం తప్పకుండా వేట వినోదాన్ని ఆస్వాదించేవాడు ప్రతాపరుద్రుడు. ఆ వ్యసనం నుండి మహారాజును దూరం చేయాలని ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయినాడు మంత్రి యుగంధరుడు.
జవాబు:
ప్రశ్నలు
- కాకతీయుల రాజధాని ఏది ?
- రెండవ ప్రతాపరుద్రుడు ఏయే భాషల్లో పండితుడు ?
- ప్రతాపరుద్ర చక్రవర్తి యొక్క బలహీనత ఏమిటి ?
- యుగంధరుడు ఎవరు ?
- ప్రతాపరుద్రుడు లలితకళలను ఎలా పోషించాడు ?
ప్రశ్న 5.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
భాష నేర్చుకోడం రెండు రకములు. భాష కోసం భాష, విషయం కోసం భాష. భాషాస్వరూప స్వభావములను సమగ్రంగా అధ్యయనం చెయ్యడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయము లను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటిని అధ్యయనం చెయ్యడం రెండవ రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకములుగా తయారయింది. ప్రాచీన భాష, ఆధునిక భాష. సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం.
ప్రశ్నలు – జవాబులు
1. భాష ఎన్ని రకాలుగా తయారయింది ?
జవాబు:
ప్రాచీన భాష, ఆధునిక భాష అని రెండు రకాలుగా తయారయింది.
2. భాష ఏయే రకాలుగా నేర్చుకొంటాము ?
జవాబు:
భాష కోసం భాష, విషయం కోసం భాష అని భాషను రెండు రకాలుగా నేర్చుకొంటాము.
3. ప్రాచీన భాష ఎందుకు ఉపయోగిస్తుంది ?
జవాబు:
సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని అందించడానికి ప్రాచీన భాష ఉపయోగ పడుతుంది.
4. ఆధునిక భాష ప్రయోజనం ఎటువంటిది ?
జవాబు:
ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం.
5. ప్రాచీన భాష ప్రయోజనం ఎటువంటిది ?
జవాబు:
ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం.
ప్రశ్న 6.
కింది గద్యభాగాన్ని చదవండి. కింద ఇచ్చిన ఐదు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి బ్రాకెట్లలో రాయండి.
“అంతరించిపోతున్న తెలుగుభాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాల వైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.
ప్రశ్నలు – జవాబులు
1. కందుకూరి పూర్తిపేరు వీరేశలింగం పంతులు.
జవాబు:
ఒప్పు
2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం.
జవాబు:
తప్పు
3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించా డాయన.
జవాబు:
తప్పు
4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త.
జవాబు:
ఒప్పు
5. తెలుగుభాషా సంస్కృతులను పునరుజ్జీవింపచేశారు కందుకూరి.
జవాబు:
ఒప్పు
2. వ్యక్తీకరణ – సృజనాత్మకత (5 మార్కులు )
ప్రశ్న 1.
నీ మాతృభాష గొప్పతనాన్ని వివరిస్తూ నీ మిత్రునకు లేదా మిత్రురాలికి లేఖ రాయి.
జవాబు:
లేఖ
రామాపురం,
X X X X X.
ప్రియమైన శ్రీలతకు,
నీ స్నేహితురాలు వ్రాయు లేఖ,
ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.
మేము ఈ రోజు ‘ఎవరి భాష వాళ్ళకు వినసొంపు’ అనే పాఠం చదువుకున్నాం. అది సామల సదాశివగారి రచన. ఆ పాఠం నాకు చాలా బాగా నచ్చింది.
ఎవరి ప్రాంతంలో మాట్లాడే భాషంటే వాళ్ళకు చాలా ఇష్టంగా ఉంటుంది. మనందరి మాతృభాష తెలుగు. తెలుగు చాలా మధురమైన భాష. తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అంటారు. తెలుగులో అనేక జాతీయాలు, సామెతలు, పదబంధాలు ఉన్నాయి. తెలుగులో ఎంతోమంది కవులు, రచయితలు ఉన్నారు. విదేశీయులు కూడా మెచ్చుకొన్న భాష మన తెలుగుభాష. ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, జమీందార్లు అభిమానించి, ఆదరించిన భాష మన తెలుగుభాష.
కాని ఎవరి ప్రాంతపు మాండలికమంటే వారికి ఇష్టం. ఎవరి ప్రాంతపు ‘యాస’ అంటే వారికి ప్రీతి. ఎవరి ప్రాంతపు నుడికారాలు, పదబంధాలు, సామెతలంటే వారికి మక్కువ ఎక్కువ. అందరి మాతృభాష ఒకటే అయినా, ప్రాంతాన్ని బట్టి అభిమానం పెరుగుతుంది. ఇది సహజం కదా ! మరి ఉంటా !
తప్పనిసరిగా జవాబు వ్రాయి. మీ పెద్దలకు నా నమస్కారాలు.
ఇట్లు,
నీ స్నేహితురాలు,
X X X.
చిరునామా :
కె. శ్రీలత,
10వ తరగతి, నెం. 18,
జిల్లా పరిషత్ పాఠశాల,
సుభాష్ నగర్, రంగారెడ్డి జిల్లా.
ప్రశ్న 2.
మాతృభాషపై మీకు ఉన్న మక్కువను తెలియజేస్తూ కవి రాయండి.
జవాబు:
మా అమ్మ మనసు వలె కమ్మనైనది మా భాష
మా ఇంటి పదాల ఘుమఘుమలకు ఆలవాలం మా భాష
మా తాత ముత్తాతల నానుడుల తియ్యందనం మా భాష
మా ఊరి చెరువు నీరంత తియ్యనిది మా ప్రాంత భాష
మా ఊరి రచ్చబండలా పిలిచేది మా భాష
మా ఇంటి సిరి లాగ మెరిసేది మా భాష
మా భాష పలుకులు చిలకల కులుకులు
మా భాష వింటేనే శరీరమంతా పులకలు
ప్రశ్న 3.
మీ ప్రాంతంలో జరిగిన వ్యావహారిక భాషా సదస్సుపై నివేదిక తయారుచేయండి.
జవాబు:
భాషా సదస్సుపై నివేదిక
28.6.16 తేదీన ఉదయం 10 గంటలకు ఠాగూర్ ఆడిటోరియంలో ప్రముఖ కవి రామ్మూర్తిగారి అధ్యక్షతన వ్యావహారిక భాషా సదస్సు ప్రారంభ మైంది. స్థానిక ప్రజాప్రతినిధి చేత జ్యోతి ప్రజ్వలన చేయబడింది. సరస్వతీదేవి చిత్రపటాన్ని, కాళోజీ నారాయణరావు గారి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించారు.
సుమారు 100 మంది హాజరయ్యారు. వేదికపై ప్రముఖ కవులు, పండితులు ఆశీనులయ్యారు. గ్రాంధిక భాష నుండి వ్యావహారిక భాష వైపు సాగిన సాహితీ ప్రయాణాన్ని వక్తలు వివరించారు. వ్యావహారిక భాషలోనే రచనలు చేయాలని సమావేశం తీర్మానించింది.
చిత్రకవి గారి వందన సమర్పణతో మధ్యాహ్నం 1 గంటకు సమావేశం ముగిసింది.
ప్రశ్న 4.
సామల సదాశివగారిని అభినందిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:
ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు అయిన సామల సదాశివగారి సాహిత్య సేవలకు వారిని ఘనంగా సన్మానించి, సమర్పించు.
అభినందన పత్రం
గ్రాంథిక భాషలో ఆరితేరిన సదాశివా !
వ్యావహారిక భాషలో ముచ్చటించే సదాశివా !
నీ కిష్టమైన భాష తెలుగు – నీవు పుట్టింది తెలుగు పల్లె
కఠినమైన గ్రాంథికం దహించడానికేనేమో నీది దహెగామ్ మండలం
ఏడు భాషలలో పాండిత్యం సొంతమైనా
‘ఇగపటు’ అంటే మురిసిపోయే నీ స్వభావం మాకిష్టం.
వేలూరి వారి ఏకలవ్య శిష్యుడినంటూనే
ఏలేశావు సాహితీ ప్రపంచాన్ని
మన తెలంగాణా ‘యాస’ కు ‘బాస’ కు కట్టుబడిన
బిడ్డా ! నీకివే మా వందనాలివే –
ఇట్లు
అభిమానులు.
ప్రశ్న 5.
తెలుగు భాషా మాధుర్యం తెలియజేసే నినాదాలు రాయండి.
జవాబు:
తెలుగుభాష పలుకు నీ భవిత వెలుగు
మన వాడుక భాష – మనకు తోడైన భాష
దేశ భాషలందు – తెలుగు లెస్స
తెలుగు విలువను పెంచరా – తెలివిగా మలచుకో జీవి
అమ్మ వంటిది మన భాష – అమృతం చిందించు భాష
ప్రశ్న 6.
మాతృభాషను కాపాడమని కోరుతూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
తెలుగు – వెలుగు
తెలుగువాడా ! మేలుకో ! నీ మాతృభాషను కాపాడుకో ! రాజాస్థానాలలో, బంగారు పల్లకీలలో ఊరేగిన మన తెలుగు భాష వెలుగు తగ్గుతోంది.
జమీందారీ సంస్థానాలలో అగ్రతాంబూలాలను అందుకొన్న మన తెలుగు భాష అదృశ్యమౌతోంది. ప్రజల నాలుకలపై నర్తించి, అమృతం చిలికిన మన తెలుగు మృత భాషలలో చేరుతోందట.
తెలుగుకు విలువ పెంచుదాం. తెలుగులోనే పలుకుదాం. తెలుగుభాషను రక్షిద్దాం.
ఇట్లు
తెలుగు భాషా పరిరక్షణ కమిటీ,
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – 1 PART – B
1. సొంతవాక్యాలు
- ఏకలవ్య శిష్యుడు : నేను దాశరథి గారికి, ఏకలవ్య శిష్యుడిని.
- సన్నిధానం – (సమీపం) : దేవుని సన్నిధానంలో భక్తులు పరవశిస్తారు.
2. పర్యాయపదాలు
ఆలయం = ఇల్లు, గృహం
త్యాగం = ఈవి, ఈగి
పోరాటం = యుద్ధం, సంగ్రామం, సమరం
ప్రశంస = పోగడ్త, స్త్రోత్రం
సొంపు = సోయగం, అందం
మిత్రుడు = స్నేహితుడు, నేస్తము, చెలికాడు
పుస్తకము = పొత్తము, గ్రంథము, కావ్యము
పండితుడు = విద్యాంసుడు, బుధుడు, కోవిదుడు
ఆజ్ఞ = ఆన, ఆదేశము, ఆనతి, ఉత్తరువు
పుత్రిక = కూతురు, కుమార్తె, కుమారి, తనూజ
సభ = కూటము, పరిషత్తు, సదస్సు
గ్రామం = ఊరు, జనపదం
భాష = భాషితం, బాస, వాక్కు
కావ్యం = కబ్బం, కృతి
3. నానార్థాలు
ఆశ = కోరిక, దిక్కు
కవి = కవిత్వం చెప్పేవారు, పండితులు, శుక్రుడు, జలపక్షి, ఋషి
సాహిత్యము = కలయిక, వాజ్మయం
క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం
సీమ = ఎల్ల, వరిమడి, ఒడ్డు, దేశము
తాత = తండ్రి తండ్రి లేక తల్లి తండ్రి, బ్రహ్మ
పండితుడు = విద్యాంసుడు, బుద్ధిశాలి, వ్యాపారి
వారము = ఏడురోజులు కాలం, సమయము, మద్యపాత్రము, సమూహము
అయ్య = తండ్రి, పూజ్యుడు, ప్రశ్నార్థకము
4. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
ఆజ్ఞ – ఆన
విద్య – విద్దె, విదియ
కార్యం – కర్జం
శక్తి – సత్తి
భాష – బాస
సహజం – సాజం
త్రిలింగము – తెలుగు
పుస్తకము – పొత్తము
ప్రాంతము – పొంత
జీవితము – జీతము
వ్యవహారము – బేరము
భోజనము – బోనము
శిష్యుడు – సువుడు
ఆర్య – అయ్య
5. వ్యుత్పత్త్యర్థాలు
గురువు = అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు (ఉపాధ్యాయుడు).
భాష = భాషింపబడునది
అధ్యక్షుడు = చర్యలను కనిపెట్టి చూచేవాడు (అధ్యక్షుడు).
పండితుడు = శాస్త్రమందు మంచి బుద్ధి గలవాడు (విద్వాంసుడు).
కవి = చాతుర్యము చేత వర్ణించువాడు – విద్వాంసుడు.
మిత్రుడు = స్నేహించువాడు – స్నేహితుడు
గ్రామము = అనుభవింపబడునది – ఊరు
పురోహితుడు = పురము యొక్క క్షేమమును కోరు వాడు – పూజలు చేయించువాడు
సాహిత్యము = కావ్య, నాటక, అలంకారాదుల అర్ధ జ్ఞానము – వాఙ్మయం
PAPER – II . PART-B
1. సంధులు
1. నాలుగేళ్ళు = నాలుగు + ఏళ్ళు – ఉత్వసంధి
2. రెండేళ్లు = రెండు + ఏళ్ళు – ఉత్వసంధి
3. సొంపయినదే = సొంపు + అయినదే – ఉత్వసంధి
4. ఒక్కొక్కప్పుడు = ఒక్కొక్క + అప్పుడు – అకారసంధి
5. అమ్మమ్మ = అమ్మ + అమ్మ – అత్వసంధి
6. ఒక్కొక్క = ఒక్క + ఒక్క – ఆమ్రేడితసంధి
7. అక్కడక్కడ = అక్కడ + అక్కడ – ఆమ్రేడిత సంధి
8. ప్రాంతపువాళ్ళు = ప్రాంతము + వాళ్ళు – పుంప్వాదేశ సంధి
9. ప్రాంతీయపు తీయన = ప్రాంతీయము + తీయన – పుంప్వాదేశ సంధి
10. మనుమరాలు = మనుమ + ఆలు – రుగాగమ సంధి
11. జాతీయాలు = జాతీయము + లు – లులనల సంధి
12. ప్రసంగాలు = ప్రసంగము + లు – లులనల సంధి
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు
నాలుగేళ్ళు – నాలుగు సంఖ్యగల ఏళ్ళు – ద్విగు సమాసం
నాలుగేళ్ళు – నాలుగైన ఏళ్ళు – ద్విగు సమాసం
నాలుగు మాటలు – నాలుగైన మాటలు – ద్విగు సమాసం
సంస్కృతాంధ్ర భాషలు – సంస్కృత భాషయు, ఆంధ్ర భాషయును – ద్వంద్వ సమాసం
కావ్యవ్యాకరణాలు – కావ్యమును, వ్యాకరణమును – ద్వంద్వ సమాసం
చివరిపేజి – చివరిదైన పేజి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
చిన్నముచ్చట – చిన్నదైన ముచ్చట – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
మొదటి వాక్యం – మొదటిదైన వాక్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ఉద్దండ పండితులు – ఉద్దండులైన పండితులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
మహాపండితుడు – గొప్పవాడైన పండితుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ప్రౌఢకావ్యం – ప్రౌఢమైన కావ్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పెద్ద పుస్తకం – పెద్దదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
పెద్ద మనుమరాలు – పెద్దదైన మనుమరాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
నకిలీ నాణేలు – నకిలీవైన నాణేలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
వ్యాసవాఙ్మయం – వ్యాసుని యొక్క వాఙ్మయం – షష్ఠీ తత్పురుష సమాసం
కాళోజీ వర్ధంతి – కాళోజీ యొక్క వర్ధంతి – షష్ఠీ తత్పురుష సమాసం
లావణ్య వాక్యం – లావణ్య యొక్క వాక్యం – షష్ఠీ తత్పురుష సమాసం
కవి సమ్మేళనం – కపుల యొక్క సమ్మేళనం – షష్ఠీ తత్పురుష సమాసం
గురు పుత్రిక – గురువు యొక్క పుత్రిక – షష్ఠీ తత్పురుష సమాసం
ఈశ్వరాలయం – ఈశ్వరుని యొక్క ఆలయం – షష్ఠీ తత్పురుష సమాసం
ఉస్మానియా యూనివర్సిటీ – ఉస్మానియా అను పేరుగల యూనివర్సిటీ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
ఆంధ్రభాష – ‘ఆంధ్రము’ అనే పేరుగల భాష – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
వ్యాకరణ శాస్త్రం – వ్యాకరణము అనే పేరుగల శాస్త్రము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
మధ్యాహ్నం – ఆహ్నం యొక్క మధ్య భాగం – ప్రథమా తత్పురుష సమాసం
బాల్యమిత్రులు – బాల్యమందు మిత్రులు – సప్తమీ తత్పురుష సమాసం
ఆంధ్ర బిల్హణుడు – ఆంధ్రమందు బిల్హణుడు – సప్తమీ తత్పురుష సమాసం
తెలుగు విద్వాంసులు – తెలుగు నందు విద్వాంసులు – సప్తమీ తత్పురుష సమాసం
ఏకలవ్య శిష్యుడు – ఏకలవ్యుని వంటి శిష్యుడు – ఉపమానోత్తర పద కర్మధారయ సమాసము
రెండు ప్రశ్నలు – రెండైన ప్రశ్నలు – ద్విగు సమాసం
సీమోల్లంఘనం – సీమను ఉల్లంఘించడం – ద్వితీయా తత్పురుష సమాసం
బిరుదాంచితులు – బిరుదు అంచితులు – తృతీయా తత్పురుష సమాసం
వార్తాపత్రిక – వార్తలు కొఱకు పత్రిక – చతుర్థీ తత్పురుష సమాసం
3. వాక్య పరిజ్ఞానం
అ) సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు
ప్రశ్న 1.
వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కాఫీ ఇచ్చారు. (సంక్లిష్ట వాక్యంగా మార్చండి.)
జవాబు:
వాళ్ళింటికి వెళితే కాఫీ ఇచ్చారు.
ప్రశ్న 2.
ఆలస్యంగా ఇంటికి వెళ్ళాను. అమ్మతిట్టింది. (సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
ఆలస్యంగా వెళ్ళాను కాబట్టి అమ్మ తిట్టింది.
ప్రశ్న 3.
సీత నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
సీత నిశ్చితార్థం జరిగింది కాబట్టి నాగయ్య సంబర పడ్డాడు
ప్రశ్న 4.
సీతమ్మ పెళ్ళికి ఏర్పాటుచేశారు కాని పెండ్లి పెటాకులయ్యింది. (సామాన్య వాక్యాలుగా రాయండి.)
జవాబు:
సీతమ్మ పెళ్ళికి ఏర్పాటు చేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయ్యింది.
ప్రశ్న 5.
సుజిత అక్క, రజిత చెల్లెలు. (సంయుక్త వాక్యంగా రాయండి.)
జవాబు:
సుజిత అక్క రజిత చెల్లెలు.
ప్రశ్న 6.
నవీన్ కష్టపడ్డాడు కానీ గెలవలేకపోయాడు. (సామాన్య వాక్యాలుగా రాయండి.)
జవాబు:
నవీన్ కష్టపడ్డాడు. నవీన్ గెలువలేకపోయాడు.
ప్రశ్న 7.
జంధ్యాల గొప్ప దర్శకుడు, నటుడు. (సామాన్య వాక్యాలుగా రాయండి.)
జవాబు:
జంధ్యాల గొప్ప దర్శకుడు. జంధ్యాల గొప్ప నటుడు.
ఆ) కర్తరి – కర్మణి వాక్యాలు
ప్రశ్న 1.
బాలురచే సెలవు తీసుకోబడింది. (కర్తరి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
బాలురు సెలవు తీసుకున్నారు.
ప్రశ్న 2.
కాయలు అతని ముందర పోశారు. (కర్మణి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
కాయలు అతనిముందర పోయబడ్డాయి.
ప్రశ్న 3.
సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. (కర్మణి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
సంఘసంస్కర్తలచేత దురాచారాలు నిర్మూలించ బడ్డాయి.
ప్రశ్న 4.
చంద్రునిలోని మచ్చ విష్ణువులాగా కన్పిస్తూ అలరిస్తున్నది. (కర్మణి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
చంద్రునిలోని మచ్చ విష్ణువులాగా కన్పిస్తూ అలరింప బడుతున్నది.
ప్రశ్న 5.
తిరుమల రామచంద్ర గారు కొంత కాలం ఆంధ్రప్రభ వార పత్రికలో చివరిపేజీ రాసేవారు. (కర్మణి వాక్యం లోకి మార్చండి.)
జవాబు:
ఆంధ్రప్రభ వారపత్రికలో చివరిపేజీ తిరుమల రామచంద్ర గారిచేత కొంతకాలం రాయబడింది.
ప్రశ్న 6.
ప్రభుత్వంచే జప్తు చేయబడుతుంది. (కర్తరి వాక్యంలోకి మార్చండి.)
జవాబు:
ప్రభుత్వం జప్తు చేస్తుంది.
ఇ) పత్యక్ష కథనం – పరోక్ష కథనం
ప్రశ్న 1.
“నాది ప్రజా కవిత కదా” అన్నాడట మహాకవి మీర్ తఖీమీర్. (పరోక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
మహాకవి మీర్ తఖీమీర్ తనది ప్రజాకవిత కదా అని అన్నాడు.
ప్రశ్న 2.
“తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని మనుమరాలు అన్నది. (పరోక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
ఆయన పాను, జర్దాడబ్బీ ఇగపట్టుమని తాతతో మనుమరాలు అన్నది.
ప్రశ్న 3.
తన పుస్తకాలు, కాగితాలు ఏమైనాయని, ఎవరు తీసారని అంబేద్కర్ కేకలు వేసేవాడు. (ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
నా పుస్తకాలు, కాగితాలు ఏమైనాయి ? ఎవరుతీశారు అని అంబేద్కర్ కేకలు వేసేవాడు.
ప్రశ్న 4.
తనకు ఎవ్వరూ ఇవ్వనక్కర్లేదని శివుడే ఉన్నాడని దాసు అన్నాడు. (ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
“నాకు ఎవ్వరూ ఇవ్వనక్కర్లేదు శివుడు ఉన్నాడు” అని దాసు అన్నాడు.
ప్రశ్న 5.
“నేనొక్కడినే అదృష్టవంతుడినా” అన్నాడు జంఘాల శాస్త్రి. (పరోక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
తనొక్కడినే అదృష్టవంతుడినా అని జంఘాల శాస్త్రి అన్నాడు.
ప్రశ్న 6.
“నన్ను మీరు దీవించ వలయును” అని రమేశ్ అన్నాడు. (పరోక్ష కథనంలోకి మార్చండి.)
జవాబు:
తనకు వాళ్ళు దీవించాలని రమేశ్ అన్నాడు.
ఈ) ఆధునిక వచనాలు
ఈ క్రింది వాక్యాలను ఆధునిక భాషలోకి మార్చి రాయండి.
ప్రశ్న 1.
పక్షి ప్రపంచములో రెండు దృశ్యములతి మనోహర మైనవి.
జవాబు:
పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు అతి మనోహర మైనవి.
ప్రశ్న 2.
నా హృదయములోని పేదరికమును సమూలముగా తొలగించు.
జవాబు:
నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా పోగొట్టు.
ప్రశ్న 3.
చూడాకర్ణుడా ! యేమది మీదు చూచినేల కఱ్ఱతోఁ కొట్టుచున్నావు ?
జవాబు:
చూడాకర్ణుడా ! ఏమిటిపైకి చూసి నేలమీద కఱ్ఱతో కొట్టుచున్నావు.
ప్రశ్న 4.
ధనమును బాసిన క్షణముననే లాతివాడగును.
జవాబు:
ధనం పోయిన క్షణంలోనే పరాయివాడౌతాడు.
ప్రశ్న 5.
రవీ ! ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడవైనావు.
జవాబు:
రవీ ! ఈరోజు నీవు నా ప్రాణమిత్రుడయ్యావు.
4. అలంకారాలు
ఈ క్రింది వాక్యాలలో ఏ అలంకారం ఉన్నదో గుర్తించండి.
ప్రశ్న 1.
‘అబద్ధముల బల్కకు, వాదములాబోకు, మర్యాదనతి క్రమింపకు’.
జవాబు:
అంత్యానుప్రాస
ప్రశ్న 2.
కోడిరామమూర్తి భీముడి వలె బలవంతుడు.
జవాబు:
ఉపమాలంకారం
ప్రశ్న 3.
ఆ మబ్బులు ఏనుగు పిల్లల్లా అన్నట్లు ఉన్నవి.
జవాబు:
ఉత్ప్రేక్ష
ప్రశ్న 4.
అడుగులు తడబడుతూ బుడిబుడి నడకలతో బుడతడు వస్తున్నాడు.
జవాబు:
వృత్త్యానుప్రాసాలంకారం
ప్రశ్న 5.
అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానజ్యోతి వెలిగించేది గురువులే.
జవాబు:
రూపకాలంకారం