Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం అయోధ్యాకాండ Questions and Answers.
TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అయోధ్యాకాండ
అయోధ్యా కాండం
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజ లందరికీ ప్రేమ. రాముడు రాజుకావాలని దశరథుని కోరిక. యువరాజు అభిషేకం చేయాలనే తన కోరిక వెల్లడించగానే ప్రజలందరూ సంతోషించారు. పట్టాభిషేక ప్రయత్నాలు ప్రారంభ మయ్యాయి. నగర ప్రజలు ఉత్సవం చేస్తున్నారు. కైకేయి దాసి మంథర మాత్రం మండిపడింది. కైకకు విషపు మాటలు నూరి పోసింది. రాముడి సంతానానికే రాజ్యం వస్తుంది. భరతుడికి ఏమీ రాదన్నది. దుర్బోధ గావించింది. కైక కోపగృహానికి పోయింది. దశ రథుడు ఓదార్చ డానికి ప్రయత్నించాడు. గతంలో తనకు ఇస్తానన్న రెండు వరాలను ఇప్పుడు ఇవ్వమని కైక కోరింది. ఒకటి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రెండోది శ్రీరాముడు పదునాలుగేండ్లు అరణ్యవాసం గావించాలి. దశరథుడు దుఃఖించాడు. రాముడు లేనిదే తాను జీవించలేనన్నాడు. కైక మనసు కరగ లేదు. రాముడిని పిలిపించింది. తన వరాల సంగతిని రాముడికి కైక చెప్పింది.
దశరథుడు దుఃఖంతో మాట్లాడలేకపోయాడు. రాముడు సంతోషంగా కైకేయి రెండు కోరికలను ఆచరించడానికి అంగీకరించాడు. దశరథుడు స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు.
కౌసల్యా లక్ష్మణులు నచ్చజెప్పినా రాముడు వినలేదు. తల్లి ఆశీస్సులు తీసుకున్నాడు. సీత కూడా రాముని వెంట బయలుదేరింది. లక్ష్మణుడు కూడా అన్నకు సేవ చేయడానికి వెంట బయలుదేరాడు. ముగ్గురూ అరణ్యవాసానికి బయలుదేరారు. ప్రజలు వారిని అనుసరించారు. తమసానదీ తీరంలో విడిది చేశారు. పౌరులు నిద్రపోతూ వున్నప్పుడు సీతారామలక్ష్మణులు వెళ్ళిపోయారు. పంపా తీరం చేరారు.
శృంగిబేరపురం రాజు గుహుడు ఆతిథ్యం ఇచ్చాడు. రామలక్ష్మణులు జటాధారులయ్యారు. గుహుని పడవ ఎక్కి అవతల తీరం చేరి వనాలలో ప్రవేశించి, భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళారు. భరద్వాజుని సూచనను అనుసరించి చిత్రకూటానికి వెళ్ళారు. లక్ష్మణుడు కుటీరాన్ని నిర్మించాడు. సీతారామ లక్ష్మణులు ఆ కుటీరంలో ఉన్నారు. సుమంత్రుని ద్వారా దశరథుడు ఈ సంగతులన్నీ తెలుసుకొని గుండెపగిలి మరణించాడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు చేశాడు. భరతుడు తల్లిని దూషించాడు.
అతడు సింహాసనం అధిరోహించ డానికి తిరస్కరించాడు. అయోధ్య ప్రజలతో కలిసి భరతుడు శ్రీరాముడిని తీసుకు రావడానికి వెళ్ళాడు. లక్ష్మణుడు దూరం నుండి చూచి భరతుడు దండెత్తి వస్తున్నాడేమో అనుకున్నాడు. రాముడు భరతుని శీలాన్ని ప్రశంసించాడు. భరతునికి రాముడు రాజ ధర్మాలను వివరించాడు. తండ్రి మరణవార్త విని రాముడు దుఃఖించాడు. తిరిగి అయోధ్యకు పోవడానికి అంగీకరించలేదు. భరతుడు శ్రీరాముని పాదుకలను స్వీకరించి, వాటికి పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో అత్రిమునిని దర్శించాడు. అక్కడ నుండి అరణ్యంలోకి వారు ప్రవేశించారు.
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘శ్రీరామ పాదుకలు రామరాజ్యాన్ని పాలించాయి’ దీన్ని సమర్థించండి.
జవాబు:
భరతుడు అయోధ్యావాసులతో కలిసి బయలుదేరి శృంగి బేరపురం చేరాడు. గుహుడు భరతుని అను మానించాడు. కాని విషయం తెలిసి భరతునికి స్వాగతం పలికాడు. భరతుడు గుహుని సహకారంతో భరద్వాజుని ఆశ్రమం చేరాడు. భరద్వాజుని సత్కారాలు పొంది చిత్రకూటం వైపుకు వెళ్ళాడు. రాముడు అడవిలో మృగాల అలజడి విని, కారణం తెలుసుకొమ్మని లక్ష్మణునికి చెప్పాడు.
లక్ష్మణుడు చెట్టు ఎక్కి చూశాడు. సైన్యంతో వస్తున్న భరతుడు కనిపించాడు. వెంటనే చెట్టుదిగి శ్రీరాముని దగ్గరకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో సైన్యాన్ని తీసుకొస్తున్నాడు. మనం ధనుర్బాణాలను సిద్ధం చేద్దామని అన్నాడు. శ్రీరాముడు లక్ష్మణా ! నీవు ఆలోచిస్తున్నది తప్పు. భరతుడు అలాంటివాడు కాదు అని అన్నాడు.
భరతుడు పర్ణశాలకు వచ్చాడు. భరత శత్రుఘ్నులు శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయారు. రాముడు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. రాజనీతి ధర్మాలను భరతునికి బోధించాడు. రాముడు తండ్రి మరణ వార్తవిని ఎంతగానో విలపించాడు. భరతుడు రాముణ్ణి అయోధ్యకు రమ్మన్నాడు. రాజువు కమ్మన్నాడు. రాముడు అంగీకరించలేదు. తండ్రి మాట జవదాటనని అన్నాడు.
రాముడు భరతుని అభ్యర్థన మేరకు తన పాదుకలను ఇచ్చాడు. భరతుడు అన్నా ! నీ బదులు నీ పాదుకలే రాజ్యాన్ని పాలిస్తాయి. నువ్వు వచ్చేవరకు నేను జడలు ధరించి నందిగ్రామంలో ఉంటాను అని చెప్పి భరతుడు నందిగ్రామం చేరాడు. పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
ప్రశ్న 2.
సీతారామలక్ష్మణుల వనవాసయాత్ర ఎట్లా ఆరంభమైంది ? వివరించండి.
జవాబు:
తండ్రిమాట నిలబెట్టడంకోసం, రాముడు అడవికి బయలుదేరాడు. సీతారామ లక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథం ఎక్కారు. ప్రజలు రాముణ్ణి విడిచి పెట్టలేక రథానికి రెండు వైపులా, వెనుక భాగంలో వేలాడారు. మంగళ వాయిద్యాలతో కళకళలాడాల్సిన అయోధ్యానగరం ఆర్తనాదాలతో నిండిపోయింది. దశరథుడు కౌసల్య మందిరానికి వచ్చాడు. సుమిత్ర ఏడుస్తున్న కౌసల్యను ఓదార్చింది.
ప్రజలు రాముని రథాన్ని అను సరిస్తున్నారు. రాముడు అయోధ్యకు వెళ్ళి పొమ్మని ప్రజలకు ఎంతగానో నచ్చ చెప్పాడు. ప్రజలు వినలేదు. రాముని వెంటే వస్తామని అన్నారు. రథం తమసానది ఒడ్డుకు చేరింది. రాముడు ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రథంపై బయలుదేరాడు. తెల్లవారింది. రాముడు కనబడకపోయేసరికి, ప్రజలు తమను తామే నిందించుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళారు.
రాముని రథం కోసల పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్య వైపు తిరిగి నమస్కరించాడు. రథం ముందుకు సాగుతూ గంగానది ఒడ్డుకు చేరింది. అక్కడ శృంగిబేరపురం ఉంది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. రాముని భక్తుడు. రాముడు వచ్చాడని తెలిసి ఎదురుగా వెళ్ళాడు. సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి గుహుని ఆతిథ్యాన్ని తీసు కున్నారు. రాముడు గంగను దాటడానికి గుహుడు ఏర్పాట్లు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి, తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరిచాడు. సీతారామలక్ష్మణులు పడవెక్కారు. సుమంత్రుడు, గుహుడు వెనుదిరిగారు. ఇలా సీతారామలక్ష్మణుల వనవాస యాత్ర ప్రారంభమైంది.
ప్రశ్న 3.
శ్రీరాముడు వనవాసానికి ఎలా వెళ్ళాడు ?
(లేదా)
సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల పరిస్థితులు విశ్లేషించండి.
(లేదా)
అధికార పీఠం ఎక్కాల్సిన రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి ?
జవాబు:
దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు. అందరూ సంతోషించారు. అయోధ్య నగరంలో పండుగ వాతావరణం చోటు చేసుకున్నది. దశరథుడు రామునికి పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు ఉపవాస దీక్ష చేపట్టారు.
రాముని పట్టాభిషేకం వార్త మంథరకు తెలిసింది. మంథర కైకకు చెప్పి, ఆమె మనస్సును మార్చింది. దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన వరాలను ఉపయోగించు కోమని మంథర కైకకు దుర్బోధ చేసింది. కైక కోపగృహానికి చేరింది. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది.
అవి :
- భరతుడికి పట్టాభిషేకం,
- రాముడి వనవాసం.
దశరథుడు రాముణ్ని అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కైక మనస్సు మారలేదు. కైక భర్త అనుమతితో రామునికి కబురు చేసింది. రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక, తాను కోరిన వరాలను గూర్చి రాముడికి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానన్నాడు రాముడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు.
రాముడు తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు. రాముని వెంట సీతాలక్ష్మణులు వనవాసానికి వస్తానన్నారు. సీతారామలక్ష్మణులు తండ్రి వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు.
సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథం ఎక్కారు. ఈ విధంగా రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు.
ప్రశ్న 4.
దశరథుని మరణవార్త విని, భరతుడెలా స్పందించాడ
జవాబు:
రాముడు అడవికి వెళ్ళాడని దశరథుడు దుఃఖంతో మరణించాడు. దూతలు వెళ్ళి మేనమామ ఇంట్లో ఉన్న భరతుడిని అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు, తండ్రికి అంత్యక్రియలు చేశాడు.
భరతుడు కైకను తప్పు పట్టాడు. మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలనీ, తాను రాముణ్ణి తీసుకు వస్తాననీ, భరతుడు అడవికి బయలుదేరాడు.
భరత శత్రుఘ్నులు అడవిలో రాముడిని కలిసి, ఆయన పాదాలపై పడ్డారు. తండ్రి మరణ వార్త తెలిసి రాముడు కన్నీరు పెట్టాడు. రాముడిని అయోధ్యకు తిరిగి వచ్చి రాజువు కమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటయే తనకు శిరోధార్యం అన్నాడు.
చివరకు భరతుడు కోరగా, రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చాడు. రాముని పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, భరతుడు నారచీరలు ధరించి, తాను అయోధ్యా నగరం బయట ఉంటానన్నాడు. భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
ప్రశ్న 5.
చెప్పుడు మాటలు చేటుకు కారణమని రామాయణం ఆధారంగా ఎలా సమర్థిస్తావు?
జవాబు:
రాముడికి పట్టాభిషేకం చేస్తారని కైక అరణపుదాసి అయిన మంథరకు తెలిసింది. ఆమె, ఆ విషయం కైకతో చెప్పింది. కైకకు రాముడంటే చాలా ఇష్టం. అందుకే ఆ వార్త తెచ్చిన మంథరకు, ఆనందంతో కైక మంచి బహుమతిని ఇచ్చింది. కైక ప్రవర్తనకు మంథర ఆశ్చర్యపోయింది. ఏడ్వవలసిన సమయం లో ఎందుకు సంతోషిస్తున్నావని మంథర కైకను అడిగింది. తనకు రామభరతులు ఇద్దరూ సమానమే అని కైక చెప్పింది.
అప్పుడు మంథర కైకకు దుష్టబోధ చేసింది. “రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. కైక దాసి అవుతుంది. రాముడికి భరతుడు దాస్యం చేయవలసి వస్తుంది. తరువాత రాముడి సంతానానికే రాజ్యాధికారం వస్తుంది.
భరతుడి సంతానానికి రాజ్యం రాదు. కాబట్టి భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలు అయ్యేటట్లు చూడు” అని మంథర కైకకు చెప్పుడు మాటలు చెప్పింది. ఆ చెప్పుడు మాటలు విని, కైక మనస్సు మార్చుకుంది. రాముడిని అడవులకు పంపింది.
అందుకే చెప్పుడు మాటలు, చేటుకు కారణం అని చెప్పాలి.
ప్రశ్న 6.
రామాయణం ఆధారంగా కైకేయి పాత్ర స్వభావాన్ని వివరించండి. (June 2016)
జవాబు:
‘కైక’, దశరథ మహారాజు గారి మూడవ పట్టపురాణి. ఈమె కుమారుడు భరతుడు. సహజంగా కైకకు, శ్రీరాముడు అంటే అమితమైన ప్రేమ. అందుకే రామునికి పట్టాభిషేకం చేస్తారని మంథర చెప్పగానే కైక సంతోషించి, ఆ వార్త చెప్పినందుకు మంథరకు బహుమానాన్ని ఇచ్చింది. కైక, మంథరతో, తనకు రాముడూ, భరతుడూ సమానం అని, రామ పట్టాభిషేకం కంటె తనకు ఆనందం, మరొకటి లేదనీ చెప్పింది.
చెప్పుడు మాటల ప్రభావంతో కైక మనస్సు మారిపోయింది. రాముడు రాజయితే కౌసల్య రాజమాత అవుతుందనీ, కైక అప్పుడు కౌసల్యకు దాసిగా అవుతుందనీ మంథర, కైకకు దుర్బోధ చేసింది. దానితో తగిన ఉపాయం చెప్పమని, కైక మంథరను అడిగింది.
కైక, మంథర చెప్పిన ఉపాయంతో, కోపగృహంలోకి ప్రవేశించింది. దశరథుడు, కైక, కోరికను తీరుస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపి, భరతుడికి పట్టాభిషేకం చేయుమని కైక దశరథుని అడిగింది.
కైక మూర్ఖత్వము : రాముడిని విడిచి తాను జీవించలేననీ, కైక పాదాలు పట్టుకుంటాననీ, రాముడిని అడవికి పంపవద్దనీ దశరథుడు కైకను ఎంతగానో బ్రతిమాలాడు. కాని కఠిన శిల వంటి కైక మనస్సు మారలేదు.
కైక రాముడిని కబురు పెట్టి రప్పించి, జరిగిన విషయం చెప్పింది. కైక స్వయంగా సీతారామలక్ష్మణులకు నారచీరలు ఇచ్చి వారిని అడవికి పంపింది.
దశరథుడు కైకను మందలించాడు. బ్రతిమాలాడు. అయినా కైక తన మొండిపట్టును విడిచిపెట్టలేదు. సీతారాములను అన్యాయంగా, అక్రమంగా, పుత్రప్రేమతో, మంథర దుర్బోధను విని కైక 14 సంవత్సరాలు వనవాసానికి పంపింది. కైక మూర్ఖపు పట్టుదల కలది. చెప్పుడు మాటలు వినే స్వభావం కలది. పుత్రప్రేమ కలది.
ప్రశ్న 7.
సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
శ్రీరాముడు అంటే ప్రజలకు ఇష్టం. ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. రాజాజ్ఞతో మంత్రులూ, అధికారులూ రాముని యువరాజ పట్టాభిషేకానికి, ఏర్పాట్లు చేస్తున్నారు. దశరథుడు రాముని పిలిచి, పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు పట్టాభిషేకానికి ఉపవాస దీక్ష చేపట్టారు.
రాముడి పట్టాభిషేకం వార్త, కైక దాసి మంథరకు తెలిసింది. ఆ వార్తను మంథర కైకకు చెప్పింది. కైక సంతోషించింది. కాని మంథర దుర్బోధతో, కైక మనస్సు మారింది. భరతుడికి పట్టాభిషేకం జరగడానికి, దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన రెండు వరాలనూ ఉపయోగించుకోమని, మంథర కైకకు సలహా చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు కైకను బ్రతిమాలాడు. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం 2) రాముడి వనవాసం. దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు.
కైక రామునికి కబురంపింది. రాముడు వచ్చి తండ్రిగారి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక రాముడికి తాను కోరిన వరాలను గురించి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానని రాముడు చెప్పాడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి బయలుదేరతానన్నాడు. దశరథుడు దుఃఖించాడు. రాముడు తండ్రికీ, కైకకూ నమస్కరించాడు. రాముడు తల్లి కౌసల్యను దర్శించాడు. రాముని వనవాసం గూర్చి విని కౌసల్య దుఃఖించింది. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లి, లక్ష్మణుడు కూడా చెప్పారు. కాని రాముడు. తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.
కౌసల్య రాముని వెంట వనవాసానికి వస్తానంది. అది ధర్మం కాదు, తండ్రిగారి సేవ చేయాలని రాముడు తల్లికి నచ్చ చెప్పాడు. సీత కూడా వనవాసానికి వస్తానంది. లక్ష్మణుడు కూడా రాముని వెంట వస్తానన్నాడు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు. సుమిత్ర లక్ష్మణుడితో సీతారాములను.తల్లిదండ్రులవలె సేవింపుమని ఉపదేశించింది.
సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. పౌరులు వెంట బయలుదేరారు. ఈ విధంగా రాముడు భార్యాసోదరులతో అడవికి వెళ్ళాడు.
ప్రశ్న 8.
సీతారామలక్ష్మణులు అయోధ్యను వీడి, చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి. (వనవాసానికి వెళ్ళిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడిని విడిచిపెట్టలేక, కొందరు పౌరులు రథానికి ప్రక్కలనూ, వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది.
రాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళిపొండని రాముడు వారికి ఎంతగానో నచ్చ చెప్పాడు. రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మనీ లేక తమను అడవికి వెంటరానిమ్మనీ ప్రజలు రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసానది దగ్గరకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తమను తామే నిందించుకొని వారు అయోధ్యకు తిరిగి వెళ్ళారు.
రాముని రథం కోసల దేశం పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్యవైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగాతీరానికి చేరారు. ఆ తీరంలో ‘శృంగిబేరపురం’ ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు రాముని వద్దకు వచ్చాడు. రాముడు గుహుడికి ఎదురేగివెళ్ళి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు.
గుహుడు గంగను దాటడానికి రామునికోసం నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకూ, తమ్మునికీ జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆ వెనుక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. మహర్షి సీతారామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరాడు.
జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమ వాసానికి తగిన ప్రదేశాన్ని సూచించండని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. పది కోసుల దూరంలో ఉన్న ‘చిత్రకూటం’ పవిత్రమైనదనీ, అది మహర్షుల నివాస స్థానం అనీ, భరద్వాజుడు వారికి చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి ‘చిత్రకూటం’ చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం, అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు.
ప్రశ్న 9.
“భరతుని పాదుకా పట్టాభిషేకం” గురించి రాయండి.
జవాబు:
దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటిలో ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞమేరకు, దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్ళి ఎనిమిదవరోజున భరత శత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.
భరతుడు కైకను తప్పు పట్టాడు. శత్రుఘ్నుడు మంథరను చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుపట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి అయోధ్యకు తిరిగి తీసుకువస్తానని, భరతుడు అయోధ్యాపురవాసులతో కలసి అడవికి బయలుదేరాడు.
భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక, తికమక పడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలుదేరాడు.
భరతుడు సేనలతో వస్తూ ఉండడం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రామునికి చెప్పాడు. భరతుడు అటువంటివాడుకాడని రాముడు లక్ష్మణునకు చెప్పాడు.
భరత శత్రుఘ్నులు వెళ్ళి, రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు. రాముడు భరతునికి రాజనీతులు బోధించాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటే తనకు శిరోధార్యం అన్నాడు.
చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం పూర్తి కాగానే, రామదర్శనం కాకపోతే తాను అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు రామునితో చెప్పాడు.
భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
ప్రశ్న 10.
శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?
జవాబు:
ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. రామునికి దశరథుడు పట్టాభిషేకం గురించి చెప్పాడు. సీతారాములు ఉపవాస దీక్ష చేపట్టారు. రాముని పట్టాభిషేక వార్త కైక దాసి మంథరకు తెలిసింది. మంథర కైకకు దుర్బోధచేసి, ఆమె మనస్సును మార్చింది. కైకకు దశరథుడు వెనుక రెండు వరాలు ఇచ్చాడు. వాటిని అప్పుడు ఉపయోగించుకోమని కైకకు మంథర చెప్పింది.
కైక, కోపగృహానికి చేరింది. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతునికి పట్టాభిషేకం 2) రాముని వనవాసం. దశరథుడు రాముని అడవులకు పంపవద్దని, కైకను బ్రతిమాలాడు. కాని ఆమె మనస్సు మారలేదు. కైక దశరథుని అనుమతితో రాముని కబురుపెట్టింది.
రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని, కైకను అడిగాడు. కైక తాను కోరిన వరాలను గూర్చి చెప్పింది. రాముడు తండ్రి మాటను పాటిస్తానన్నాడు. రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు.
రాముడు తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడూ చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.
రాముని వెంట సీతాలక్ష్మణులు కూడా వనవాసానికి వస్తానన్నారు. సీతా రామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైక వారికి నారచీరలు ఇచ్చింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతా రామలక్ష్మణులు రథాన్ని ఎక్కారు. ఈ విధంగా సీతా రామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళారు.
ప్రశ్న 11.
దశరథునికి “శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ” వివరించండి.
జవాబు:
దశరథునికి కొడుకులమీద ప్రేమ ఎక్కువ. నలుగురు కొడుకులను నాలుగు చేతులలాగా భావించాడు. భరత, శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల వారంటే బెంగ. శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. అందుకు కారణం శ్రీరాముడు సద్గుణరాశి. రూపంలో గుణంలో శ్రేష్ఠుడు, మహావీరుడు. మృదువుగా మాట్లాడుతాడు. కోపం, గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించడు. శరణుకోరేవారిని కాపాడేవాడు. దీనులను ఆదుకునేవాడు. కాలాన్ని వృథా చేయక సజ్జనులతో వివిధ విషయాలు చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి కలవాడు. సోమరితనం, ఏమరుపాటు, అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. కళలలో ఆరితేరినవాడు.
ప్రశ్న 12.
కైకేయి వరాల ప్రభావం ఏమిటి ?
జవాబు:
రామపట్టాభిషేకం వార్త విన్న మంథర కైకకు గతం గుర్తు చేసింది. ఒక సందర్భంలో కైకకు దశరథుడు ఇస్తానన్న వరాలను ఉపయోగించుకోమన్నది. కైక దశరథుడికి గతం గుర్తుచేసి వరాలను తీర్చమని దశరథుని కోరింది. ఆ వరాలే 1) భరతుడి పట్టాభిషేకం, 2) రాముడి వనవాసం. దశరథునికి కాదనే పరిస్థితి వచ్చింది.
విషయం తెలిసిన రాముడు తండ్రి మాటను గౌరవిస్తానని, తండ్రి తనకు గురువు, పాలకుడు, హితుడు అని కైకేయి కోరిక మేరకు వనవాసానికి బయలుదేరాడు. విషయం తెలిసిన రాముని తల్లి కౌసల్య రామునితో వనవాసానికి వస్తానంది. కాని భర్తను వదిలి రావడం ధర్మం కాదని రాముడు తల్లికి వివరించాడు. సీతా, లక్ష్మణులు వెంటరాగా రాముడు . తల్లిదండ్రుల దీవెనలు తీసుకుని వనవాసానికి బయలుదేరాడు.
ప్రశ్న 13.
శ్రీరామునికి గల పితృ భక్తిని గురించి వివరించండి.
(లేదా)
శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు:
శ్రీరామ పట్టాభిషేకానికి అయోధ్య అలంకరించుకొంది. నగరమంతా ఆనందంగా ఉంది. అది చూసి మంథర చాలా ‘బాధ పడింది. ఆమె కైకకు అరణపుదాసి. కైక వద్దకు పరుగెత్తింది. పట్టాభిషేకం గురించి చెప్పింది. కైక ఆనందించింది. తన దుర్బోధతో కైక మనసు మార్చింది. రాముడిని అడవికి పంపమంది. భరతునికి పట్టాభిషేకం చేయించమన్నది.
అప్పుడే దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం గురించి కైకకు చెప్పడానికి వచ్చాడు. కైక తన మనసులోని మాట బయట పెట్టింది. దశరథుడు చాలా బాధపడ్డాడు. ఎంత బెదిరించినా, తిట్టినా, బ్రతిమాలినా కైక మనసు మారలేదు. శ్రీరామునికి కబురంపింది. విషయం చెప్పింది. పితృవాక్య పరిపాలన తన కర్తవ్యమన్నాడు రాముడు. అడవికి వెడతాను అన్నాడు.
కేవలం తన తండ్రి కైకకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాముడు అడవికి వెళ్ళాడు. యాగానికి విశ్వామిత్రునితో వెళ్ళినపుడు కూడా గురువుగారు చెప్పినట్లు చేయమని దశరథుడు శ్రీరామునకు చెప్పాడు. తాటకని వధించేటపుడు విశ్వామిత్రుని మాటను శిరోధార్యంగా పాటించాడు. అందుకే శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడని చెప్పవచ్చు.
ప్రశ్న 14.
కైకకు వరాలిచ్చినపుడు దశరథుని వేదనను విశ్లేషించండి.
జవాబు:
మంథర దుర్బోధతో కైక మనసు మారింది. శ్రీరాముని అడవులకు పంపమన్నది. భరతునకు పట్టాభిషేకం చేయమంది.
శ్రీరాముడంటే దశరథ మహారాజుకు ప్రాణం. రాముని యాగసంరక్షణకు విశ్వామిత్రునితో పంపడానికే దశరథుడు ఇష్టపడలేదు. కాని, తప్పక పంపాడు. అటువంటి శ్రీరాముని అడవులకు పంపాలనే మాటను దశరథుడు భరించలేకపోయాడు. స్పృహ తప్పి పడిపోయాడు. కైకను ప్రాధేయపడ్డాడు. అసత్య దోషానికి కూడా భయపడలేదు. రాముని ఎలాగైనా ఆపాలనుకొన్నాడు. సాధ్యపడలేదు. తండ్రికి అపఖ్యాతి రావడానికి రాముడు అంగీకరించలేదు. రాముడు అడవులకు వెళ్ళిపోయాడు. దశరథుడు రామునికై కలవరించాడు. తపించాడు. దుఃఖించాడు. చివరకు మరణించాడు.
ప్రశ్న 15.
సీతారామలక్ష్మణులు అడవికి ఏ వరుసలో నడిచారు ? ఎందుకు ? విశ్లేషించండి.
జవాబు:
ముందు లక్ష్మణుడు, తర్వాత సీత, ఆ తర్వాత శ్రీరాముడు నడిచి అడవిలోకి వెళ్ళారు.
కష్టాలు ఎదురైనపుడు భార్య మొదట నడవాలి. వెనుక భర్త నడవాలి అని ధర్మశాస్త్రం చెబుతోంది. అప్పుడు కష్టాలు నివారించబడతాయి. కనుక సీతారామలక్ష్మణులు ఆ వరుసలో వెళ్ళారు. ఇది ఒక కారణం.
అడవిలో ప్రమాదాలు ఎదురౌతాయి. రాక్షసులు, క్రూరమృగాలు ఉంటాయి. అవి ఎదురుగా వస్తే లక్ష్మణుడు ఎదురొడ్డి పోరాడతాడు. వెనుక నుండి ప్రమాదాలు వస్తే శ్రీరాముడు ఎదుర్కొంటాడు. అందుకే సీతను మధ్యలో ఉంచి నడిచారు. ఇది మరొక కారణం.
ప్రశ్న 16.
భరతుడు అడవికి ఎందుకు వచ్చాడు ? అతని రాకను ఎవరెవరు ఎలా భావించారు ? ఎందుకు ? విశ్లేషించండి.
జవాబు:
దశరథ మహారాజు మరణించాడు. భరతుడు అంత్యక్రియలు చేశాడు. తన తల్లి కైకను, మంథరను తప్పుబట్టాడు. శ్రీరాముడే అయోధ్యకు రాజు కావాలన్నాడు. తాను వనవాసం చేస్తానన్నాడు. చతురంగ బలాలను సిద్ధపరిచారు. రాముని ఒప్పించి, రాజ్యం అప్పగించి, తను ఆయనకు బదులు వనవాసం చేస్తానని చెప్పడానికి భరతుడు శ్రీరాముని కొరకు అడవికి వెళ్ళాడు.
భరతుని, సైన్యాన్ని చూసిన గుహుడు యుద్ధసన్నద్ధుడయ్యాడు. కాని, భరతుని ఆంతర్యం తెలిసి ఆదరించాడు. గుహుని సహకారంతో చిత్రకూట పర్వతం వైపు వెళ్ళారు.
లక్ష్మణుడు వారి రాకను గమనించాడు. రాజ్యకాంక్షతో యుద్ధానికి వస్తున్నాడనుకొన్నాడు. అదే రామునకు చెప్పాడు. రాముడు అంగీకరించలేదు. భరతునికి రాజ్యకాంక్ష లేదన్నాడు.
ఈ విధంగా భరతుని రాకను శ్రీరాముడు మాత్రమే అర్థం చేసుకొన్నాడు. గుహుడు, లక్ష్మణుడు కూడా భరతుని అపార్థం చేసుకొన్నారు. అతని తల్లి కూడా భరతుని అంతరంగం తెలుసుకోలేకపోయింది.
పరిచిత గద్యాలు
ప్రశ్న 1.
కింది పేరా చదవండి. దిగువ నున్న మాటలకు ఒక వాక్యంలో వివరణను ఇవ్వండి.
అక్కడి నుండి సీతా మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసలు కోవాలో సీతకు తెలిపాడు. కాని సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. “మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం” అని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముని సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తన కిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు.
ప్రశ్న 1.
మసలుకోవడం
జవాబు:
అంటే ఉండడం అని అర్థము. అనగా నడచుకోవడం అని భావము.
ప్రశ్న 2.
సుఖప్రదం, శుభప్రదం
జవాబు:
సుఖాన్ని ఇచ్చేది, శుభమును కల్గించేది అని భావము.
ప్రశ్న 3.
త్రిలోకాధిపత్యం
జవాబు:
మూడు లోకములకూ ప్రభువు కావడం. అనగా ముల్లోకాలనూ పరిపాలించడం అని భావము.
ప్రశ్న 4.
ప్రాధేయపడ్డాడు
జవాబు:
అంటే వేడుకొన్నాడు. అనగా బ్రతిమాలాడు అని భావము.
ప్రశ్న 5.
వనవాసం
జవాబు:
అంటే అడవిలో నివసించడం అని భావము.
ప్రశ్న 2.
కింది పేరాను చదివి, కింద ఇచ్చిన పదాల భావాన్ని ఒక వాక్యంలో వివరించండి.
“శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనందశోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంథర కళ్ళలో నిప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటికి వచ్చినపుడు వెంట వచ్చిన అరణపు దాసి మంథర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి, వార్త చెప్పినందుకు మంథరకు విలువైన బహుమానాన్ని అందించింది. నిశ్చేష్టురాలైంది మంథర. దుఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని “నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేముంటుందన్నది కైకేయి.
ప్రశ్న 1.
తనను తాను అలంకరించుకుంది.
జవాబు:
తన్ను తానే అలంకరించుకున్నట్లు, ఎక్కువ శోభాయమానంగా కనిపించిందని భావము.
ప్రశ్న 2.
తాండవిస్తున్నది.
జవాబు:
అంటే గంతులు వేస్తోందని అర్థము. ఆనందంతో చిందులు తొక్కుతోందని భావము.
ప్రశ్న 3.
కళ్ళలో నిప్పులు పోసుకున్నది.
జవాబు:
అంటే ఇతరుల గొప్పస్థితిని చూసి ఓర్వలేక పోయింది అని భావము.
ప్రశ్న 4.
అరణపు దాసి
జవాబు:
పుట్టింటి వారు తమ పిల్లతోపాటు అత్తింటికి పంపిన దాసీ స్త్రీ.
ప్రశ్న 5.
పరుగుపరుగున
జవాబు:
అంటే పరుగుపెడుతున్నంత వేగంగా అని భావం.
ప్రశ్న 3.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయివద్దకు వచ్చాడు. కటికనేలపై ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కాని అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏం చేయాలో పాలుపోలేదు. విషయమడిగాడు. అదే అదనుగా భావించింది కైకేయి. ‘నాకొక కోరిక ఉంది. దాన్ని మీరే తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వా’లన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటుచేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరలు, జింకచర్మం ధరించి, జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపసవృత్తిలో పదునాల్గు సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే, నేను చూస్తుండగానే బయలుదేరాలి’ అని కోరింది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
బూడిదలో పోసిన పన్నీరు అంటే ఏమిటి ?
జవాబు:
వృథా
ప్రశ్న 2.
కైకేయి కోరికలెన్ని ?
జవాబు:
కైకేయి కోరికలు రెండు.
ప్రశ్న 3.
కైకేయి మొదటి కోరిక ఏమిటి ?
జవాబు:
భరతుని పట్టాభిషేకం
ప్రశ్న 4.
తపస్సు చేసుకొనేవారెలా ఉంటారు ?
జవాబు:
నార చీరలు, జింక చర్మం ధరించి జటాధారులై ఉంటారు.
ప్రశ్న 5.
అలక అంటే ఏమిటి ?
జవాబు:
కోపం