Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం అరణ్యకాండ Questions and Answers.
TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం అరణ్యకాండ
అరణ్య కాండం
దండకారణ్యంలో మునుల ఆశ్రమాలున్నాయి. అది ప్రాణికోటికి సురక్షిత ప్రాంతం. మహర్షులు సీతారామ లక్ష్మణులను ఆదరించారు. మరునాడు మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామలక్ష్మణులు దండకారణ్యం మధ్యకు చేరుకున్నారు. అక్కడ విరాధుడనే వికృతాకారం గల రాక్షసుడు వీరిని అడ్డగించి రామలక్ష్మణులను భుజాలపై వేసుకుపో సాగాడు. విరాధుని ఎన్ని దెబ్బలు కొట్టినా చావలేదు.
విరాధుడు తన పూర్వకథను చెప్పి, తనను గోతిలో పూడ్చమన్నాడు. విరాధుని సలహాను అనుసరించి సీతారామలక్ష్మణులు శరభంగ మహర్షిని దర్శనం చేసుకున్నారు. శరభంగ మహర్షి తన తపఃఫలాన్ని శ్రీరామునికి ప్రసాదించాడు. మునులు వచ్చి రాక్షసుల పీడ నుండి తమను రక్షించమని రాముని వేడుకున్నారు. సుతీక్ష మహర్షి తన తపశ్శక్తిని శ్రీరామునికి ఇచ్చాడు. దండకారణ్యంలో అనేక మునుల ఆశ్రమాలను వారు దర్శించారు. అగస్త్యు ని సోదరుని ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్యుడు ధనుస్సు, అక్షయతూణీరాలు, ఖడ్గం బహూకరించాడు.
అగస్త్యుని సలహామేరకు పంచవటి ప్రాంతంలో నివసించడానికి వారు బయలుదేరారు. దారిలో జటాయువును చూశారు. పంచవటిలో లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించాడు. శూర్పణఖ రావణాసురుని చెల్లెలు. ఆమె శ్రీరాముని వద్దకు వచ్చి తనను పెండ్లి చేసుకొమన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తిరిగి రాముని వద్దకు పంపాడు. శూర్పణఖ సీతాదేవి తనకు అడ్డుగా ఉన్నదని ఆగ్రహించింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులను కోశాడు.
ఆమె తన సోదరుడైన ఖరుడు అనే వాడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది. ఖర దూషణాదులు రామునిపైకి రాగా వారందర్నీ రాముడు సంహరించాడు. అకంపనుడు అనే గూఢచారి రావణునికి ఈ వార్త చెప్పాడు. రాముని చంపడానికి అతడు ఒక ఉపాయం కూడా చెప్పాడు. “సీతను అపహరిస్తే రాముడు మరణిస్తాడు” అని సలహా ఇచ్చాడు. రావణుడు మారీచుని ఆశ్రమానికి వచ్చాడు. మారీచుడు ‘రాముని కవ్వించడం మంచిదికాదు’ అని సలహాయివ్వగా రావణుడు తిరిగి లంకకు వెళ్ళాడు. శూర్పణఖ రావణుని సభలోకి వెళ్ళి ఆవేశంతో మాట్లాడి “సీతకు తగిన భర్తవు నువ్వే” అని రెచ్చగొట్టింది. రావణుడు మారీచుని వద్దకుపోయి బంగారు లేడిగా మారి తనకు సహకరించమని కోరాడు. లేకపోతే తానే అతడిని చంపుతానన్నాడు.
మారీచుడు బంగారుజింకగా మారి రాముని ఆశ్రమం ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా సీతాదేవి ముచ్చటపడి దాన్ని తీసుకు రావాలని రామలక్ష్మణులను కోరింది. ఆమె యిష్టాన్ని తీర్చడానికి శ్రీరాముడు బయలుదేరాడు. చివరకు బాణంతో దాన్ని కొట్టాడు. మారీచుడు రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ “సీతా, లక్ష్మణా !” అని అరుస్తూ మరణించాడు. సీత ఆ కేక విని భయపడి లక్ష్మణుని వెంటనే అక్కడకు పొమ్మన్నది. లక్ష్మణుడు అంగీకరించలేదు. సీత లక్ష్మణుని కఠినోక్తులతో నిష్ఠూరాలాడింది. లక్ష్మణుడు బాధపడి, ఆశ్రమంలో సీతను విడిచి వెళ్లాడు. రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను భిక్షవేడాడు. తన నిజరూపం చూపి తనను పతిగా స్వీకరించమన్నాడు. సీత అతడిని తృణీకరించింది.
సీతను రావణుడు రథంలో లంకకు తీసుకుపోసాగాడు. ఆమె రోదన జటాయువు విన్నాడు. జటాయువు రావణుని ఎదిరించాడు. రావణుడు జటాయువు రెక్కలను, కాళ్ళను నరికాడు. సీత ఆకాశమార్గం నుండి తన కొంగులో మూటగట్టిన ఆభరణాలను విడిచింది. రావణుడు లంకలో తన వైభవాన్ని సీతకు చూపి ఆమె మనసు మార్చాలని ప్రయత్నించాడు. పన్నెండు నెలలు గడువిచ్చాడు. ఆమెను అశోకవనంలో కాపలానడుమ ఉంచాడు. అక్కడ సీతాదేవి అపహరణ వృత్తాంతం తెలిసి రామలక్ష్మణులు అన్నిచోట్లా వెతికారు. వారికి జటాయువు కనిపించి జరిగిన విషయం తెలిపాడు. జటాయువుకి రాముడే దహన సంస్కారాలు గావించాడు. రామలక్ష్మణులు క్రౌంచారణ్యం చేరారు.
అక్కడ కబంధుడు అనే రాక్షసుడు వారిని తన చేతులతో పట్టుకున్నాడు. రామలక్ష్మణులు అతడి భుజాలను నరికి అతడి కోరికమేరకు దేహాన్ని దహనం గావించారు. దివ్య దేహంతో వెలుపలికి వచ్చిన కబంధుడు సీతాదేవి లభించే ఉపాయాన్ని చెప్పాడు. వాలిసుగ్రీవులను గూర్చి చెప్పాడు. కబంధుడు చెప్పిన మార్గంలో రామలక్ష్మణులు పంపా సరస్సు తీరంలోని ఆశ్రమానికి చేరారు. శబరి ఇచ్చిన పండ్లను రాముడు తిన్నాడు. ఆమె జన్మధన్యం చేసుకొన్నది. రామ లక్ష్మణులు ఋష్యమూక పర్వత ప్రాంతంలోని పంపా సరస్సును చూశారు.
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
శూర్పణఖ ఎవరు ? ఆమె అవమానం పొందడానికి కారణమేమిటో తెల్పండి.
జవాబు:
శూర్పణఖ ఒక రాక్షసి. ఈమె రావణునికి చెల్లెలు. శ్రీరాముని అందానికి మురిసిపోయి తనను పెళ్ళి చేసుకోమన్నది. అందుకు అడ్డంగా ఉన్న సీతను, లక్ష్మణుని చంపితింటానన్నది. రాముడు ఆమెను పరిహాసంగా లక్ష్మణుని వద్దకు పంపించాడు. లక్ష్మణుడు తాను అన్నగారి సేవకుణ్ణని, తనను పెళ్ళాడితే ఆమె కూడా తనతోబాటే అన్నకు దాస్యం చేయాల్సి వస్తుందని చెప్పి రాముణ్ణి పెళ్ళాడమని పంపాడు. సీత ఉండటంవల్లే రాముడు తనను నిరాకరించాడనుకొని సీతను చంపడానికి దాడి చేసింది. ప్రమాదాన్ని గుర్తించిన లక్ష్మణుడు అన్న ఆదేశంపై శూర్పణఖ ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అలా తన రాక్షసత్వం వలన శూర్పణఖ రామలక్ష్మణులను కోరి అవమానం పొందింది.
ప్రశ్న 2.
సీతాపహరణం జరగడానికి దారితీసిన పరిస్థితు లను విశ్లేషించండి.
జవాబు:
రావణుని చెల్లెలు శూర్పణఖ రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని కోరింది. లక్ష్మణుడు కోపించి, శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు.
‘అకంపనుడు’ అనే గూఢచారి రావణునకు ఈ వార్త చేర్చాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని, సీతను అపహరిస్తే ఆమె వియోగంతో రాముడు మరణిస్తాడని సూచించాడు. రావణుడు మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని అడిగాడు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.
దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడి పట్టి తెమ్మని రాముని కోరింది. రాముడు లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, బంగారు లేడి కోసం వెళ్ళాడు. రాముడు మాయలేడిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా ! హా లక్ష్మణా !” అని అరిచింది.
ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కు కున్నాడని, రామునికి సాయంగా లక్ష్మణుడిని వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు మొదట కాదన్నా వెళ్ళక తప్పలేదు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, ఆమెను బలవంతంగా లంకా నగరానికి తీసుకుపోయాడు.
ప్రశ్న 3.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపాసరస్సు తీరాన్ని చేరిన వృత్తాంతం రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుక వస్తుండగా లక్ష్మణుడు కనబడ్డాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీత జాడ కనబడలేదు.
సీతను వెతుకుతూ వెళుతుంటే దారిలో రామ లక్ష్మణులకు రక్తంలో తడిసిన జటాయువు కనిపించాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బతీశాడనీ, జటాయువు వారికి చెప్పి మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.
రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి కబంధుడనే రాక్షసుడు కనబడ్డాడు. ‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికి పారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపంవల్ల తనకు వికృతరూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.
రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్నిసంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు సూచించిన మార్గంలో రామలక్ష్మణులు ప్రయాణించారు.
ఆ దారిలో శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. శ్రీరాముని అనుమతి పొంది శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతిచేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపాసరస్సుకు చేరారు.
ప్రశ్న 4.
పంచవటిలో సీతారామలక్ష్మణుల జీవితం ఎలా సాగి వివరించండి.
జవాబు:
అగస్త్య మహర్షి మాటపై, సీతారామలక్ష్మణులు పంచవటికి చేరారు. లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాలను నిర్మించాడు. సీత రక్షణ బాధ్యతను రాముడు, జటాయువుకు అప్పగించాడు. పంచ వాటిలో వారి జీవితం సుఖంగా సాగుతోంది. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి, రాముడిని తనను చేపట్టమంది. లక్ష్మణుడు అన్న ఆజ్ఞతో శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పింది. ఖరుడు 14 వేల మంది రాక్షసులతో రాముడి చేతిలో యుద్ధంలో మరణించాడు.
అకంపనుడు అనే గూఢచారి ఖరుడి మరణవార్త రావణుడికి అందించి రాముని భార్య సీతను అపహరించమని రావణుడికి సలహా చెప్పాడు. శూర్పణఖ వెళ్ళి రావణుడిని రెచ్చగొట్టింది.
రావణుడు మారీచుడిని మాయలేడిగా సీతారాములు ఉన్న పర్ణశాల వద్దకు పంపాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని రాముడిని కోరింది. రాముడు వెళ్ళి మాయలేడిని చంపాడు. మాయలేడి ‘సీతా ! లక్ష్మణా ! అంటూ అరచి రాముడి చేతిలో మరణించింది.
రాముడు ఆపదలో ఉన్నాడని సీత లక్ష్మణుడిని రాముని వద్దకు పంపింది. అదే సమయంలో సన్యాసి వేషంలో రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలాత్కారంగా తన రథంలో కూర్చోబెట్టి తీసుకువెడుతున్నాడు. సీత, రామా, రామా’ అని కేకలు వేసింది. జటాయువు రావణుడిని ఎదిరించి, అతడి చేతిలో దెబ్బతింది. రావణుడు సీతను తన లంకా నగరానికి తీసుకువెళ్ళాడు.
రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియక వారు దుఃఖించారు.
ప్రశ్న 5.
మాయలేడి వలన సీతారాములకు కష్టాలు వచ్చాయని ఎలా చెప్పగలవు ?
జవాబు:
రావణుడు పంచవటిలో ఉన్న సీతాదేవిని అపహరిం చాలనుకున్నాడు. రావణుడు మారీచుడిని బెదిరించి, బంగారులేడి రూపంలో అతడిని రాముడి ఆశ్రమ ప్రాంతానికి పంపాడు. సీత ఆ లేడిని చూసి ఇష్ట పడింది. లక్ష్మణుడు అది మాయామృగం అని చెప్పాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని పట్టుపట్టింది.
సీత ఇష్టాన్ని కాదనలేక, ఆ మాయలేడిని చంపి అయినా తేవడానికి రాముడు వెళ్ళాడు. రాముడు ఎంత ప్రయత్నించినా లేడి అందకుండా పరుగు దీసింది. దానితో రాముడు లేడిపై బాణాన్ని వేశాడు. ఆ లేడి ‘సీతా ! లక్ష్మణా !’ అని అరుస్తూ చచ్చింది.
మాయలేడి కంఠ ధ్వని రాముడిది అని, సీత కంగారుపడి, రాముడికి సాయంగా లక్ష్మణుడిని పంపింది. లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితులలో సీతను విడిచి, రాముడి దగ్గరకు వెళ్ళాడు.
అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాలకు వచ్చి సీతను బలవంతంగా తీసుకు పోయాడు. కాబట్టి సీతారాముల కష్టానికి మాయ లేడియే కారణం అని చెప్పగలము.
ప్రశ్న 6.
‘కబంధుడు’ అనే రాక్షసుడు శ్రీరామునకు ఉపకారం చేశాడని ఎలా చెప్పగలవు ?
జవాబు:
కబంధుడు క్రౌంచారణ్యంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇతడికి తల, మెడ లేవు. ఇతడి కడుపు భాగంలో ముఖం ఉండేది. రొమ్ము భాగంలో ఒకే కన్ను ఉండేది. ఇతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉండేవి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తినేవాడు.
కబంధుడు రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకొని తినబోయాడు. కబంధుడి చేతులకు చిక్కితే, ఎవరూ తప్పించుకోలేరు. కాని రామలక్ష్మణులు తమ ఖడ్గాలతో కబంధుడి చేతులు నరికారు. అప్పుడు కబంధుడు తనకు శాపం వల్ల రాక్షసరూపం వచ్చిందనీ, తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ రామలక్ష్మణులకు చెప్పాడు.
రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని దహనం చేశారు. ఆ జ్వాలల నుండి కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీత దొరికే ఉపాయాన్ని రామలక్ష్మణులకు చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని వారికి చెప్పాడు. సుగ్రీవుని స్నేహంతో రాముడు సీతను తిరిగి తెచ్చుకున్నాడు. దీనినిబట్టి కబంధుడు రామలక్ష్మణులకు ఉపకారం చేశాడని చెప్పగలం.
ప్రశ్న 7.
అహల్యా కబంధుల శాప విముక్తులను గూర్చి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మిథిలానగర సమీపానికి చేరుకొన్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ గౌతముని ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమం అందంగా ఉంది. కాని, జనసంచారం లేదు. గౌతమ మహర్షి భార్య అహల్య అనీ, ఆమె ఒక తప్పు చేసినందుకు ఆమెను గౌతముడు శపించాడనీ విశ్వామిత్ర మహర్షి చెప్పాడు. అప్పటి నుండి అహల్య వాయువే ఆహారంగా తీసుకొని జీవిస్తూ బూడిదలో పడి ఉంది. అహల్య అదృశ్య రూపంలో ఉంది. రాముని రాకతో ఆమెకు నిజరూపం కల్గుతుందని గౌతముడు చెప్పాడని విశ్వామిత్రుడు శ్రీరామునకు’ చెప్పాడు. విశ్వామిత్రుని ఆజ్ఞతో గౌతముని ఆశ్రమంలో శ్రీరాముడు పాదం మోపాడు. ఆ పవిత్ర పాదం పెట్టగానే అహల్య పూర్వ రూపం పొందింది. అహల్యా గౌతములు శ్రీరాముని సత్కరించారు.
రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు ‘కబంధుడు’.
‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.
రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.
ప్రశ్న 8.
అన్న పట్ల భరతునికి గల భక్తి భావాన్ని గురించి వివరించండి. (March 2017)
జవాబు:
శ్రీరాముడు తండ్రి మాటను శిరసావహించి, వనవాసానికి వెళ్ళాడు. దశరథుడు మరణించాడని చెప్పి, రాముని తమ్ముడు భరతుడిని, అయోధ్యా నగరానికి మంత్రులు తీసుకువచ్చారు.
రాముడు తన తల్లి మాటపై వనవాసానికి వెళ్ళాడని తెలిసి, భరతుడు తన తల్లి కైకను తప్పుపట్టాడు. మంత్రులు భరతుణ్ణి రాజువుకమ్మన్నారు. రామునిపై భక్తి కల భరతుడు అందుకు అంగీకరించలేదు. పెద్దవాడైన రాముడే రాజు కావాలన్నాడు రాముడి బదులు, భరతుడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తానన్నాడు. శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి తీసుకువస్తానని, భరతుడు సైన్యంతో రాముడు ఉన్న అడవులకు వెళ్ళాడు.
అయోధ్యకు వచ్చి రాజువుకమ్మని, భరతుడు శ్రీరాముని ప్రార్థించాడు. అందుకు రాముడు అంగీకరించలేదు. అప్పుడు భరతుడు రామునిపై భక్తితో, రాముని పాదుకలను ఇమ్మని కోరాడు.
భరతుడు అన్న పాదుకుల మీదనే రాజ్యపాలన భారాన్ని ఉంచాడు. భరతుడు రాముని వలె తాను కూడా నారచీరలు కట్టి, జడలు ధరించాడు. వనవాస నియమాలు పాటించి, అయోధ్యా నగరం వెలుపలనే ఉన్నాడు.
14 సంవత్సరాలు పూర్తి కాగానే, రాముని దర్శనం తనకు కాకపోతే భరతుడు అగ్ని ప్రవేశం చేస్తానని రామునితో చెప్పాడు. భరతుడు నందిగ్రామం చేరి, రాముని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. దీనిని బట్టి భరతుడు ఆదర్శ సోదరభావం కలవాడని రాముని పట్ల భక్తిభావం కలవాడని గ్రహించగలము.
ప్రశ్న 9.
సీతారాముల దండకారణ్యవాస వృత్తాంతాన్ని తెలపండి. (సీతారాములు పంచవటిని చేరిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎన్నో మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు.
వీరు దండకవనం మధ్యకు చేరారు. ‘విరాధుడు’ అనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని వాడు తీసుకుపోతున్నాడు. సీత ఏడ్చింది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికివేశారు. విరాధుడు కుప్పకూలాడు. విరాధుణ్ణి గోతిలో పాతిపెడదామని వారు అనుకున్నారు. విరాధుడు తాను తుంబురుడిననీ, శాపంవల్ల తాను రాక్షసుడుగా అయ్యాననీ చెప్పి, వారిని శరభంగమహర్షిని దర్శించమనీ, తనను గోతిలో పూడ్చమనీ రామలక్ష్మణులకు చెప్పాడు.
రామలక్ష్మణులు విరాధుణ్ణి గోతిలో పూడ్చి, శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తున్నాడు. ఆయన తన తపః ఫలాన్ని రాముడికి ధారపోశాడు. సుతీక్ష మహర్షిని దర్శించమని వారికి ఆయన చెప్పాడు. మునులు రాముణ్ణి కలిసి, రాక్షసుల బాధల నుండి తమను రక్షించమని కోరారు. రాముడు సరే అన్నాడు.
సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షిని దర్శించారు. ఆయన రామదర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మహర్షి తన తపస్సును రామునికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ, సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాలు వనవాసం చేశారు. వారు తిరిగి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అగస్త్యుని సోదరునీ, అగస్త్య మహర్షినీ దర్శనం చేసుకోమని రామలక్ష్మణులకు చెప్పాడు.
సీతారామలక్ష్మణులు అగస్త్యభ్రాత (సోదరుడు) ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్య మహర్షి శిష్యులతో రామునికి స్వాగతం పలికాడు. ఆయన రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గమును ఇచ్చాడు. రామునకు జయం కల్గుతుందని ఆశీర్వదించాడు.
రాముడు తాము నివసించడానికి తగిన ప్రదేశాన్ని సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. ఆ మహర్షి గోదావరీ తీరంలో ఉన్న ‘పంచవటి’ లో ఉండమని వారికి సూచించాడు. రామలక్ష్మణులకు మార్గమధ్యంలో ‘జటాయువు’ కనబడింది. దానికి సీత రక్షణ బాధ్యతను వారు అప్పగించారు. పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని వారు అక్కడ నివసించారు.
ప్రశ్న 10.
రావణుడు మారీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండాకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14 వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు.
‘అకంపనుడు’ అనే గూఢచారి దండకలో రాక్షససంహారం జరిగిందని రావణునకు వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి కవ్వించవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ, తన అన్న రావణుడికి, సీతను అపహరించమని చెప్పింది.
రావణుడు తిరిగి మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని మారీచుణ్ణి అడిగాడు. మారీచుడు హితం చెప్పినా, రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.
దానితో మారీచుడు చేసేదిలేక బంగారు లేడిగా మారి, రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది.
ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని, సీత రాముని కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు, సీత మాట కాదన లేక లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా! హా లక్ష్మణా!” అని అరిచింది.
ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడని లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే, అతణ్ణి సీత నిందించింది. చివరకు లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు.
ప్రశ్న 11.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపా సరస్సు తీరానికి చేరిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుకకు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో లక్ష్మణుడు కనబడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటని రాముడు అడిగాడు. లక్ష్మణుడు జరిగిన విషయం చెప్పాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీతజాడ కనబడలేదు. సీత జాడ చెప్పమని. రాముడు ప్రకృతిని ప్రార్థించాడు. శ్రీ శ్రీరాముడు సీతా వియోగాన్ని భరించలేక ఏడ్చాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చాడు.
రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు. అతడిని చూసి గద్ద రూపంలో ఉన్న రాక్షసుడనీ, అతడే సీతను తిని ఉంటాడనీ వారు భ్రాంతి పడ్డారు. జటాయువు జరిగినది చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బ తీశాడనీ, జటాయువు వారికి చెప్పాడు. జటాయువు మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.
రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులనూ, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు ‘కబంధుడు’.
‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు. రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.
రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.
రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. తరువాత శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరారు.
ప్రశ్న 12.
సీతారామలక్ష్మణులు అడవిలోకి ప్రవేశించిన ఎన్ని సంవత్సరాలకు సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ? ఆ సంవత్సరాలలో ఏమైంది ?
జవాబు:
సీతారామలక్ష్మణులు అడవిలోకి ప్రవేశించిన 10 సంవత్సరాలకు సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు.
సీతారామలక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడి మునులు వారికి స్వాగతం పలికారు. కొద్దికాలం అక్కడ ఉండి, ప్రయాణం కొనసాగించారు. వనం మధ్యకు చేరారు.
అక్కడ విరాధుడు తన వికృత రూపంతో సీతారామలక్ష్మణుల మీద విరుచుకుపడ్డాడు. రామలక్ష్మణులను భుజాలపై .వేసుకుని తీసుకుపోతున్నాడు. రామలక్ష్మణులు వాడిని సంహరించలేక గోతిలో పాతాలనుకొన్నారు. అప్పుడు అతనికి పూర్వ రూపం వచ్చింది. శరభంగ మహర్షిని కలుసుకోమని చెప్పాడు. బ్రహ్మలోకం చేరాడు.
మునులు రాక్షస సంహారం చేయమని కోరారు. రాముడు అభయం ఇచ్చాడు. తర్వాత సుతీక్ష మహర్షి తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారపోశాడు. మునుల ఆశ్రమాలలో కొద్దికొద్ది కాలం ఉంటూ 10 సంవత్సరాలు గడిపారు.
ప్రశ్న 13.
సీతాపహరణకు ఎవరు అవకాశం కల్పించారో విశ్లేషించండి.
జవాబు:
సీతాదేవిని ఎలాగైనా అపహరించాలని రావణుడు పన్నాగం పన్నాడు. మారీచుని బంగారులేడిగా మారమని అన్నాడు. సీతారాముల దగ్గర తిరగమన్నాడు.
సీత ఆ బంగారులేడి కావాలంది. లక్ష్మణుడు చెప్పాడు అది రాక్షస మాయ అని. అయినా వినలేదు. అదే కావాలంది. రాముడు వెళ్ళి తెస్తానన్నాడు. లక్ష్మణుని, జటాయువును సీతకు కాపలా పెట్టాడు.
కొంతసేపటికి రాముని గొంతుతో అయ్యో సీతా! లక్ష్మణా! అని వినబడింది. సీత కంగారు పడింది. రాముడు ఆపదలో ఉన్నాడు అని లక్ష్మణుని వెళ్ళమంది. అది రాక్షస మాయ అని లక్ష్మణుడు చెప్పాడు. అనేక విధాల ప్రార్థించాడు. కాని, సీత వినలేదు. లక్ష్మణుని నిందించింది. అతని మనసు గాయపడేలా మాట్లాడింది. విధిలేక లక్ష్మణుడు వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించాడు.
పై దానిని పరిశీలిస్తే సీతాపహరణానికి సీతాదేవి యొక్క ఆలోచనే కారణమైంది.
ప్రశ్న 14.
రామలక్ష్మణులు క్రౌంచారణ్యానికి ఎందుకు చేరారు ? అక్కడేమి జరిగింది ?
జవాబు:
సీతాదేవిని వెతుకుతూ రామలక్ష్మణులు క్రౌంచారణ్యానికి చేరారు. అక్కడ భయంకరమైన కబంధుడనే రాక్షసుని చూశారు. రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకున్నాడు. రామలక్ష్మణులు వాడి చేతులు నరికేశారు. కబంధుడు కుప్పకూలాడు.
రామలక్ష్మణుల గురించి తెలుసుకొన్నాడు. తన గురించి చెప్పాడు. తన శరీరాన్ని దహిస్తే రావణుని గురించి చెపుతానన్నాడు. రామలక్ష్మణులు అలాగే చేశారు. అప్పుడు కబంధుడికి దివ్యశరీరం వచ్చింది. సీతాదేవి దొరికే ఉపాయం చెప్పాడు. వాలి సుగ్రీవుల కథ చెప్పాడు. సుగ్రీవుని స్నేహం చేస్తే మంచి జరుగుతుందని చెప్పాడు. సీతాన్వేషణకు బలమైన ఆధారం చూపించాడు.
పరిచిత గద్యాలు
ప్రశ్న 1.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. (June 2016)
రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని తల, మెడ కనబడడం లేదు. కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు. ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని పేరు కబంధుడు, తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరం కాదు. కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరచాడు. అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు. తన గురించి చెప్పుకున్నాడు. శాపకారణంగా తనకీ వికృతరూపం ప్రాప్తించిందన్నాడు. శ్రీరాముడు కబంధునితో ‘మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు. వాటిని చెప్పవలసిందని’ అడిగాడు. సమాధానంగా కబంధుడు ‘శ్రీరామా ! నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు. నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది. అప్పుడు చెప్పగల’నన్నాడు. కబంధుని శరీరానికి అగ్నిసంస్కారం చేశారు రామలక్ష్మణులు. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు.
ప్రశ్నలు – జవాబులు :
1. రామలక్ష్మణులను పట్టుకున్న రాక్షసుడి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రామలక్ష్మణులను పట్టుకున్న కబంధుడు అనే రాక్షసుడికి తల, మెడ కనబడలేదు. అతడి కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. అతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు.
2. ‘కబంధ హస్తాలు’ అనే జాతీయం ఎలా పుట్టింది ?
జవాబు:
కబంధుడు అనే రాక్షసుడికి, యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. అతడు ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోడం ఎవరితరమూ కాదు. తప్పించుకోడానికి వీలు కాని చేతులు అనే అర్థంలో, ఈ విధంగా కబంధ హస్తాలు అనే జాతీయం పుట్టింది.
3. కబంధుడికి దివ్యజ్ఞానం తిరిగి ఎట్లా వస్తుంది ?
జవాబు:
కబంధుని శరీరాన్ని దహిస్తే అతడి నిజరూపమూ, దివ్యజ్ఞానమూ వస్తాయి.
4. కబంధుడు రామలక్ష్మణులను ఎట్లా పట్టుకున్నాడు ?
జవాబు:
కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను, అమాంతంగా తన రెండు చేతులతోనూ, పట్టుకున్నాడు.
5. రామలక్ష్మణులు కబంధుణ్ణి ఏ సహాయం అడిగారు ?
జవాబు:
రామలక్ష్మణులు, తమకు, రావణుని రూపం గురించి, అతడు ఉండే చోటును గురించి, రావణుని శక్తి సామర్థ్యాలను గురించి చెప్పవలసిందని, కబంధుణ్ణి అడిగారు.
ప్రశ్న 2.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2016)
అప్పుడప్పుడే నిద్రకుపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. చూసే సరికల్లా సీతను అపహరించుకు పోతున్న రావణుడు కంటపడ్డాడు. జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్ళను నరికివేశాడు. నేలపై కూలాడు -జటాయువు, రక్తంతో తడిసి ముద్దయిన అతణ్ణి చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది.
ప్రశ్నలు – జవాబులు :
1. జటాయువు రావణుణ్ణి ఎందుకు ఎదిరించాడు ?
జవాబు:
రావణుడు సీతాదేవిని అపహరించుకుపోతున్నాడు. అందువల్ల జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
2. జటాయువుకి సీతాదేవి ఆర్తనాదాలు ఎప్పుడు వినబడినాయి ?
జవాబు:
జటాయువు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి.
3. సీతాదేవి ఎందుకు ఆక్రందించింది ?
జవాబు:
రావణుడు తనను అపహరించుకుపోతున్నాడు. అందువల్ల సీతాదేవి ఆక్రందించింది.
4. పై పేరాలో పోరు ఎవరెవరి మధ్య జరిగింది ?
జవాబు:
పై పేరాలో రావణుడికి, జటాయువుకు మధ్య పోరు జరిగింది.
5. పై పేరాలోని జాతీయాలు గుర్తించి రాయండి.
జవాబు:
పై పేరాలో
- హోరాహోరిగా
- తడిసి ముద్దయిన అనేవి రెండు జాతీయాలు.
ప్రశ్న 3.
కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2015)
రావణుడు మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాల నచ్చజెప్పజూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుడి మాటలను రావణుడు పెడచెవిన పెట్టాడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు. “నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో చావు తప్పదని” రావణుడు హెచ్చరించాడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు. వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. “ముందు నుయ్యి వెనుక గొయ్యి” లా ఉంది మారీచుని స్థితి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. “నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడం నయం. నా జన్మ తరిస్తుంది” అని తేల్చి చెప్పాడు.
ప్రశ్నలు – జవాబులు :
1. రావణుడు మారీచుణ్ణి ఎలా సహకరించమన్నాడు ?
జవాబు:
మారీచుణ్ణి బంగారు లేడిగా మారి, తనకు సహకరించమని మారీచుడికి రావణుడు చెప్పాడు..
2. రామబాణం రుచి చూడటమంటే ఏమిటి ?
జవాబు:
రామబాణం రుచి చూడటమంటే, రాముని బాణం వల్ల తగిలే తీవ్రమైన బాధను అనుభవించడం అని అర్థం.
3. పై పేరాలోంచి ఒక జాతీయాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
“ముందు నుయ్యి, వెనుక గొయ్యి” అన్నది, పై పేరాలో గల ఒక జాతీయము.
4. రావణుణ్ణి ఆలోచన విరమించుకోమని మారీచుడు ఎందుకు చెప్పాడు ?
జవాబు:
విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో మారీచుడు రామబాణం రుచి ఏమిటో తెలిసికొన్నాడు. అందుకే రాముని జోలికి వెళ్ళడం మంచిది కాదని, రావణునికి మారీచుడు సలహా చెప్పాడు.
5. మారీచుడు శ్రీరాముని చేతిలో చావడానికే సిద్ధపడ్డాడు. ఎందుకు ?
జవాబు:
తాను చెప్పినట్లు చేయకపోతే మారీచుణ్ణి రావణుడు చంపుతానన్నాడు. రావణుని చేతిలో చావడం కన్న, రాముని చేతిలో చస్తే, తన జన్మ తరిస్తుందని, మారీచుడు రాముని చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు.
ప్రశ్న 4.
క్రింది పేరాను చదవండి. కింది మాటలకు ఒక వాక్యంలో వివరణ వ్రాయండి.
క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞే ఆలస్యం – శూర్పణఖ ముక్కు, చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తి దెబ్బకు. లబోదిబో మని మొత్తుకుంటూ సోదరుడైన ఖరుడి దగ్గరకు వెళ్ళింది శూర్పణఖ. ఖరుడు పద్నాలుగుమంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టిగరచారు. ఇది చూసిన శూర్పణఖ ఖరుని వద్దకు వెళ్ళి చెప్పింది. ఖర దూషణులు పద్నాలుగు వేలమంది రాక్షసులతో రాముని మీదకు దండెత్తారు. మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు.
ప్రశ్నలు – జవాబులు :
1. దుష్టులతో పరిహాసం
జవాబు:
చెడు నడవడి కలవారితో ఎగతాళి, అనగా చెడ్డవారితో వేళాకోళం అని భావం.
2. విరూపిని చేయు
జవాబు:
వికృతమైన రూపము కలదానిగా చేయడం, అనగా అందములేని దానిగా చేయడం అని భావం.
3. లబోదిబోమని మొత్తుకుంటూ
జవాబు:
లబోదిబోమని మొత్తుకుంటూ మొర్రో మొర్రో అని నెత్తిపై కొట్టుకుంటూ అని భావము.
4. మట్టిగరచారు
జవాబు:
అనగా నేల కఱచారు. అనగా చనిపోయారు అని భావం.
5. యమపురికి పంపించాడు
జవాబు:
అనగా యముని యొక్క నరకలోకానికి పంపాడు. అంటే చంపాడు అని భావము.
ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన పదాలకు అర్థం ఒక వాక్యంలో వివరించండి.
మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు – లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు. సీతను ఒంటరిగా వదలి ఎందుకు వచ్చావని నిలదీశాడు. జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు. ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు. సీతాదేవి జాడ కనిపించలేదు. వనమంతా వెతికారు. ఆమె జాడ కనిపించలేదు. జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు. ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆవేదన ఆవేశంగా మారింది. లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు.
ప్రశ్నలు – జవాబులు :
1. నిశ్చేష్టుడయ్యాడు.
జవాబు:
అంటే శారీరక వ్యాపారము లేనివాడు – అనగా కదలకుండా ఉండి పోయాడు.
2. నిలదీశాడు
జవాబు:
నిర్బంధము చేశాడని అర్థము. గట్టిగా అడిగాడని భావము
3. పూసగుచ్చినట్లు
జవాబు:
వరుసగా అని అర్థము, ఒకదాని తర్వాత మరొకటిగా అని భావము.
4. జాడకనిపించలేదు.
జవాబు:
వార్త తెలియలేదు అని అర్థము ఆనవాలు దొరకలేదని భావము.
5. ప్రకృతిని ప్రార్థించాడు.
జవాబు:
చెట్టు, పుట్ట, గుట్ట, ఏటు, నది వంటి అన్ని వస్తువులను వేడుకున్నాడని భావం.
ప్రశ్న 6.
ఈ క్రింది పేరాను చదివి, దిగువన ఇచ్చిన పదాలను ఒక్క వాక్యంలో వివరించండి.
“సీతారామలక్ష్మణులు వనం మధ్యకు చేరుకున్నారు. ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడనే రాక్షసుడు అమాంతంగా సీతారామలక్ష్మణుల పైకి విరుచుకుపడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోసాగాడు. సీత గగ్గోలు పెడుతున్నది. రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికి వేశారు. నేలపై కుప్పకూలాడు విరాధుడు ముష్టిఘాతాలతో మోకాళ్ళతో దాడి చేశారు. రామలక్ష్మణులు ఎంతకూ చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు. వెంటనే విరాధుడు తన పూర్వ కథను వివరించాడు. తుంబురుడనే గంధర్వుడైన తాను కుబేరుని శాపంచే రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు. శ్రీరాముని వల్ల శాపవిముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటను జ్ఞాపకం చేసుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు :
1. అమాంతంగా
జవాబు:
అంటే అకస్మాత్తుగా అని అర్థము. ఉన్నట్లు ఉండి వెంటనే అని భావము.
2. విరుచుకుపడ్డాడు
జవాబు:
విరిగిన వస్తువు పడ్డట్లు మీద పడ్డాడు అని భావము
3. గగ్గోలు పెడుతున్నది.
జవాబు:
పెద్దగా ధ్వని చేస్తూ ఏడుస్తోందని భావము.
4. నేలపై కుప్పకూలాడు
జవాబు:
కుప్పలా నేలపై పడ్డాడు అంటే నేలపై పడి కదలలేకపోయాడని భావము.
5. సంసిద్ధులయ్యారు.
జవాబు:
అంటే బాగా సిద్ధపడ్డారు.
ప్రశ్న 7.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. అంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి వచ్చింది. ఈమె రావణాసురుని చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్న దాసుడననీ, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సివస్తుందనీ, అందుకే శ్రీరాముణ్ణి చేరడమే సబబని సమాధానమిచ్చాడు. శ్రీరాముడివైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లనే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికిపోయింది. సీతాదేవిని అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ప్రశ్నలు – జవాబులు :
1. లక్ష్మణుడు శూర్పణఖతో ఏమన్నాడు?
జవాబు:
తాను అన్నకు దాసుడననీ, శూర్పణఖ తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందనీ లక్ష్మణుడు శూర్పణఖతో అన్నాడు.
2. శ్రీరాముడు శూర్పణఖను ఎందుకు నిరాకరించాడు?
జవాబు:
శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. తన భార్య తనతోనే ఉంది కాబట్టి రాముడు శూర్పణఖను నిరాకరించాడు.
3. శూర్పణఖ ఎవరు?
జవాబు:
శూర్పణఖ రావణాసురుని చెల్లెలు. శూర్పణఖ రాక్షసి.
4. సీతారామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారు?
జవాబు:
సీతారామలక్ష్మణులు పంచవటిలో, పర్ణశాలలో ఉన్నారు.
5. ఈ పేరాకు శీర్షికను నిర్ణయించండి. .
జవాబు:
‘శ్రీరాముడు శూర్పణఖను నిరాకరించడం’ అనే శీర్షిక తగియుంటుంది.
ప్రశ్న 8.
క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
క్రూరుడైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞే ఆలస్యం – శూర్పణఖ ముక్కు, చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తిదెబ్బకు. లబోదిబోమని మొత్తుకొంటూ సోదరుడైన ఖరుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ. ఖరుడు. పద్నాలుగుమంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టిగరచారు. ఇది చూసిన శూర్పణఖ ఖరుని వద్దకు వెళ్ళి చెప్పింది. ఖరదూషణులు పద్నాలుగువేల మంది రాక్షసులతో రాముడి మీదకు దండెత్తారు. మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు.
ప్రశ్నలు – జవాబులు :
1. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు ఎందుకు కోశాడు ?
జవాబు:
శ్రీరాముని ఆజ్ఞను అనుసరించి
2. ఖర దూషణులు ఎవరు ?
జవాబు:
రాక్షసులు
3. యమపురికి పంపించడం అంటే ఏమిటి ?
జవాబు:
చంపడం
4. పద్నాలుగువేలు ఏ సమాసం ?
జవాబు:
ద్విగు సమాసం
5. “ఆజ్ఞ” వికృతి పదం రాయండి.
జవాబు:
ఆన